July 19, 2024

శ్రీరమణ గారు

జర్నలిస్ట్ అన్న పేరుమీద నా ఇల్లు గడుస్తుందంటే ఇదంతా మొదలైంది శ్రీరమణ గారి వల్ల. పదిహేనేళ్ల క్రితం ఒక ఏడ్ ఏజెన్సీలో కాపీ రైటర్/ ట్రాన్సులేటర్/ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగం చేసుకుంటూ బ్లాగులో రాతలు రాసుకునేవాడిని. అక్కడ గిలికిన నాలుగు రాతలేవో అప్పట్లో ‘నవ్య’ పత్రిక ఎడిటర్ గా పని చేసే ఆయనకి పంపి ఉద్యోగం కావాలని ఉత్తరం రాశాను. ఆయన వెంటనే పిలిచి ఉద్యోగమిచ్చారు. ఏ అనుభవం లేనివాడికి, డిగ్రీ కూడా ఫెయిలైనవాడికి. ఆ తర్వాత ఒక న్యూస్ ఛానెల్లో మూడేళ్లు ఆయనతో దగ్గరగా కలిసి పని చేశాను. ఆయనకి ఈమెయిల్ నేనే క్రియేట్ చేసి, నేనే మెయింటైన్ చేసేంత దగ్గరగా, టేబిల్ కి ఆయన అటూ నేను ఇటూ కూర్చుని పని చేశాం. బ్లాగులో రాసుకున్న నా తొలి కథలు రెండింటిని ఆయన తను గౌరవ సంపాదకత్వం వహించే పత్రికల్లో మళ్ళీ వేశారు. నా ‘రాజుగారి మేడ కథ’ విషాదాంతం చేయటం ఆయనకి నచ్చలేదు. ఆవైపు మొగ్గు ఎక్కడా ఆయనకి నచ్చేది కాదు. ఆ కథ మొదటి డ్రాఫ్ట్ చూసి ఎలా ముగిస్తే బావుంటుందో సలహాలు కూడా ఇచ్చారు. అప్పట్లోనే ఏదో అకాడమీ కోసం నాకు చలం మోనోగ్రాఫ్ రాసే బాధ్యత అప్పగించారు. దాన్తో చలాన్ని లోలోపలికంటా చదివే అవకాశం వచ్చింది. కానీ మరీ లోతుగా చదివేసరికి చలం నేను నిభాయించలేనంత బరువైన ఇతివృత్తమైపోయాడు. చివరికి ఏం  రాయలేక చేతులెత్తేశాను. ఆ మూడేళ్ళు కలిసి పని చేసింతర్వాత ఒకసారి కినిగెకి ఇంటర్వ్యూ (bit.ly/3O18kNW) చేయటానికి తప్ప మళ్లా పెద్దగా కలిసింది లేదు. ఫోన్లలో అడపాదడపా మాటలుండేవి. బాల వ్యాకరణానికి దువ్వూరి రమణీయ వ్యాఖ్య నాకు ఇచ్చానని ఎప్పుడు మాట్లాడినా గుర్తు చేసేవారు. అది ఇంకా నా దగ్గరే ఉంది. ఆయన రచయితగా నాకు చిన్నప్పుడే తెలుసు. ఆంధ్రప్రభలో ‘శ్రీ ఛానెల్’ అని నా టెన్త్ ఇంటర్ రోజుల్లో వస్తుండేది, బాపు బొమ్మలతో. బాపు రమణల అసోసియేషన్ ని బట్టి ఈ శ్రీరమణ అంటే ముళ్ళపూడి వెంకటరమణే మారుపేరుతో రాస్తున్నాడు అనుకునేవాడిని చాన్నాళ్లు. కొలీగ్ గా ఉన్నప్పుడు ఆయన రాయటం చాలా దగ్గరగా చూశాను. కాలమ్ రాస్తే పేపరు మీద ఒక్క కొట్టివేత లేకుండా మొదటి నుంచి చివరిదాకా చక్కటి దస్తూరితో రాసి దాన్నే ఫైనల్ గా ఇచ్చేసేవాడు. ఇలా ఎన్ని చెప్పినా, ఈ పేరా మొదటి వాక్యంలోని కృతజ్ఞతే ఇక్కడ ముఖ్యంగా వ్యక్తం చేసుకోదలచింది. మనిషిని ఎప్పుడు తలచుకున్నా నవ్వు ముఖంతోనే గుర్తుకు వస్తాడు. ఆయన నిలబడిన చుట్టుపక్కల ఎంత రద్దీ ఉన్నా ఆయన సమక్షం వల్ల అది నెమ్మదించినట్టనిపిస్తుంది. I loved him.

0 comments:

మీ మాట...