March 14, 2012

మిత్రభేదం (నాలుగవభాగం)

ముందుమాట | మొదటిభాగం | రెండవభాగం | మూడవభాగం | ఐదవభాగం | ఆరవభాగం |
ఏడవభాగం | ఎనిమిదవభాగం | తొమ్మిదవభాగం | పదవభాగంఆఖరిభాగం | పూర్తి కథ pdf |         

చూరు దాటి బయటకు రాగానే గొడుగుని డప్పుగా చేసి చినుకులు లయరహితంగా దరువు వేయటం మొదలెట్టాయి. బయటి వాతావరణం కళ్ళు కానరానంత చీకటీగానూ లేదు, అలాగని అన్నీ ఆనవాలు తెలిసేటంత వెలుగుతోనూ లేదు. కరెంటు లేకపోవడంతో, అక్కడక్కడా దుకాణాల్లోని లాంతర్లూ, కోడిగుడ్డుదీపాల వెలుగు చిత్తడినేలపై పడి అరకొరగా దారి కనపడుతోంది. మిఠాయికొట్టు నరసన్నగారు లాంతరు ముందు నీడలా కూర్చుని రేడియో చెవి కానించి వార్తలు వింటున్నారు.  గోవిందు కావిడి భుజాన వేసుకుని మెండోళ్ళ పాలకేంద్రం చూరు క్రింద నిలబడి చుట్ట కాలుస్తున్నాడు. వీళ్ళంతా తనకు తెలిసినవాళ్ళే. కానీ యిప్పుడు యెవర్నీ పలకరించాలని లేదు. ఇలా తనను యెవరూ ఆనవాలు పట్టేందుకు వీల్లేని వాతావరణంలో శ్రీపాదపట్నంలోకి ప్రవేశించడం బాగుంది, రాజుగారు తన రాజ్యంలో మారువేషంలో సంచరిస్తున్నట్టు. పన్నెండేళ్ళ తర్వాత మరలా యీ వీధుల్లో నడుస్తుంటే, తన జ్ఞాపకాల్లోని వీటి ప్రతిబింబాల్తో పోలిస్తే అసలు వీధులు చాలా చిన్నవని అర్థమైంది. బహుశా యిన్నేళ్ళుగా అలవాటుపడ్డ నగరవీధుల వైశాల్యాన్నే జ్ఞాపకాల్లోని యీ వీధులకీ ఆపాదించుకున్నాడేమో. లేదా చిన్నప్పటి పసి శరీరానికి పెద్దగా కనిపించిన యీ వీధులు, యిప్పటి పెద్ద శరీరానికి చిన్నవైపోయాయేమో.

తేనెటీగలు తిరిగి తిరిగి చివరికి తేనెపట్టు చేరినట్టు అతని ఆలోచనలు మళ్ళీ రేణుకాదేవి మీదకు మళ్ళాయి. ఇప్పుడు, యీ సమాంతర క్షణాల్లో, ఆమె కేవలం కొన్ని వీధులవతలే వుంది.  అతను నగరంలో వున్న యిన్నేళ్ల కాలంలో కూడా ఆమె వునికి యీ వూళ్ళో సమాంతరంగానే సాగుతున్నా, యెందుకో ఆ స్పృహ వుండేది కాదు.  ఇప్పుడు తమ మధ్య వున్నది కేవలం కొన్ని వీధుల అంతరమే అయ్యేటప్పటికి మనసంతా వుద్విగ్నంగా వుంది.  బాలా యింటి దగ్గర ఆగకుండా తిన్నగా రాజవీధికి వెళ్లి ఓ సారి చూసొస్తే యెలా వుంటుందా అని ఆలోచించాడు. వెళ్లి మేడ ముందు రెండుమూడుసార్లు తచ్చాడితే కనిపించకపోదు. కాని అలా చేయడం దుస్సాహసమని అనిపించింది. పొరబాట్న తనామె కంటబడితే... ఆమె హర్షిస్తుందనిపించలేదు. తనకు తెలిసిన రేణుకాదేవి తన నుండి అలాంటి చిన్నతనపు చేష్టలు ఆశించదు.

కాలం గడిచి గతానికి భాష్యం చెప్పుకోగల పరిణతి వచ్చాకా శేషుకు అర్థమయిందేమిటంటే, రేణుకాదేవి చాలా చిన్నతనంలోనే అతనికి పెద్దరికాన్ని ఆపాదించేసింది.  ఆమెను సర్వవేళలా కాచుకునే బాధ్యతనీ, ఆమె వేరే యెవరిదగ్గరా చూపించని పసిచేష్టల్ని అంగీకరించే ఔదార్యాన్నీ, ఆమె యెవరితోనూ పంచుకోని మానస రహస్యాల్ని ఒబ్బిడిగా దాచుకునే విశ్వాసపాత్రతనీ అతనికి ఆపాదించింది. తానీ మోతుబరి పాత్ర పోషిస్తున్నాడని అతనికి తెలియదు. కానీ అతని మనస్తత్వం యిలాంటి పాత్రపోషణకు స్వతహాగా సానుకూలమైందే కాబట్టి అంతా యే ఘర్షణా లేకుండానే సాగిపోయింది. అప్పట్లో అతనికి తెలిసేది కాదు గానీ, రేణు అతని దగ్గర మాత్రమే యెక్కువ అల్లరి చేసేది. ఉపాధ్యాయులంతా ఆమెను చాలా మందకొడి పిల్ల అనుకునేవారు. తోటిపిల్లలు కూడా యెవరితోనూ కలవదన్న ముద్ర వేసి ఆమె మానాన ఆమెను వదిలేసేవారు. ఒక్క శేషుకు మాత్రమే ఆమె యెంత చలాకీగా వుండగలదో, యెంత చతురంగా మాట్లాడగలదో, ఒక్కోసారి యెంత సున్నితంగా వుండగలదో, అవసరమైతే యెంత మొండితనం ప్రదర్శించగలదో తెలిసింది. కానీ అనునిత్యం యేదో సొంత గోలలో తలమునకలై వుండే అతను, ఆమెలో యీ పార్శ్వాలన్నీ కేవలం తనకు మాత్రమే విదితమన్న సంగతి కూడా యెపుడూ గ్రహించలేకపోయాడు. ఆమె తననే ఒక ప్రపంచంగా చేసేసుకుంటుందనీ, తన ఒప్పుదలే ఆమె వ్యక్తిత్వపు చెల్లుబాటుకు ప్రమాణంగా మారిపోతుందనీ తెలుసుకోలేకపోయాడు.

ఎనిమిదోతరగతి చివర్లో  ఒంటిపూటబళ్ళు ప్రారంభమయ్యాకా ఒక రోజు మధ్యాహ్నం శేషు, బాలా యిద్దరూ కలిసి జళ్ళమర్రిలంక వెళ్ళొద్దామని ప్రణాళిక వేసుకున్నారు. శ్రీపాదపట్నం యేటిగట్టుకు దక్షిణంగా  పడవలో ఓ మైలు దూరం వెళితే వుండే పెద్ద లంక అది. లంకంతా చెట్లతో దట్టంగా చిట్టడవిలా వుంటుంది. లంక నడిబొడ్డున ఒక పెద్ద మర్రిచెట్టుంది. దాని బోదె యెంత లావుంటుందో అంతటి లావుపాటి వూడలతో యెడాపెడా విస్తరించి వుంటుంది. కార్తీకమాసంలో వనభోజనాలకు వూరివాళ్ళు యిక్కడికే వెళ్తారు. మిగతా సమయాల్లో యీ లంకనెవరూ పట్టించుకోరు. పూసా గంగరాజు అనే పడవ నడిపే బెస్త కుర్రాడు శేషుకి తెలిసినవాడవడంతో యిద్దరూ మొన్నే ఒకసారి వెళ్ళొచ్చారు. అక్కడ పూసావోడితో కలిసి శేషు మొదటిసారి బీడీ కూడా కాల్చాడు. జేబుల్నిండా సీమచింతకాలేరుకున్నాడు. పూసావోణ్ణి చెట్టెక్కించి ముంజికాయలు కోయిపించుకు తిన్నాడు. తర్వాత వాటి డొప్పల్ని కూడా వదలకుండా యింటికి తీసుకొచ్చి  ముంజికాయ బళ్ళు తయారు చేసుకున్నాడు. ఈసారి బాలాని కూడా తీసికెళ్ళి కాసేపు నచ్చినట్టు గడిపి వద్దామని ఆలోచన.  శేషూ యీ విషయం చెప్పగానే బాలా వెంటనే అంగీకరించాడు. ఈ సాహసానికి తనను యెన్నుకున్నందుకు అతనికి గొప్పగా అనిపించింది.  కానీ బాలా తండ్రి అతణ్ణి అడుగడుక్కీ కనిపెట్టుకుని వుంటాడు. “అత్తెసరు వెధవా చదువుకోరా! లేకపోతే నాలాంటి ముష్టి వుద్యోగమే నీకూ గతవుతుంది!” అని  అస్తమానం పోరుతూ వుంటాడు. బడి సమయాల్లో మినహా, బయట తిరగనివ్వడు. కాబట్టి ఆ రోజు బాలా బడికొచ్చేముందే మధ్యాహ్నం ప్రయివేటు క్లాసుందని చెప్పివచ్చాడు. తరగతులు జరుగుతున్నంత సేపూ అతని మనసు సాయంత్రపు సాహసకృత్యం మీదే లగ్నమై వుంది. బడి గంట కొట్టగానే అంతా బయటకు నడిచారు. రేణు పెట్టె మోసుకుంటూ వచ్చి,  గేటు దగ్గర తనకోసం ఆగిన కుర్రాళ్ళిద్దరితోనూ కలిసింది. ముగ్గూరూ కలిసి నడుస్తున్నారు.

లంకకి వెళ్తున్న సంగతి ఆమెకు చెప్పవద్దని బాలాకి చెప్పడం మర్చిపోయాడు శేషు.

“రేణూ మేవిద్దరం యిప్పుడు పడవెక్కి జళ్ళమర్రిలంకకి వెళ్తున్నామోచ్,” గొప్ప దాచుకోలేక కక్కేసాడు బాలా.

“అవునా!” ప్రశ్నార్థకంగా శేషు వంక చూసింది.

శేషుకి బాలా వాగుడుకాయతనం మీద వళ్ళు మండింది. “నీ యబ్బా వొరే లంకి పడవెక్కి యెళ్ళక, జెట్కా మీద యెళ్తావేంట్రా?” అని విసుక్కున్నాడు. రేణూ యే తీర్మానానికీ రాకముందే ఆమెకి ముందరకాళ్ళ బంధమేసేద్దామన్న వుద్దేశ్యంతో, “అవును రేణూ వెళ్తున్నాం. అక్కడ సీమసింతకాయ చెట్టుంది. నీకు మంచి కాయలేరి తెత్తానే!” అన్నాడు.

అతని గొంతులో బుజ్జగింపు ధోరణిని రేణూ యిట్టే పసిగట్టేసింది. “నేనూ వస్తాగా! యేరుకుంటాలే!” అంది కరాఖండీగా.

బాలాకి తన పొరబాటు అర్థమై వెర్రి నవ్వోటి నవ్వాడు.

శేషు అతణ్ణి ఓరగా చూసాడు. రేణూ నుండి అనుకోని మాట విన్నట్టు, “భలేవున్నావు! మీ తాతకి తెలిస్తే  మాకు డప్పేహెత్తాడు,” అన్నాడు.

“నాకదంతా తెలీదు. నేనూ వస్తాను!” అంది రెండో మాట లేదన్నట్టు.

శేషూకి పరిస్థితి వెనక్కి మళ్ళించలేనిదీ అని అర్థమైపోయింది. సముదాయింపులోకి వచ్చేసాడు, “అది కాదు రేణూ! నీకు తెలవదు. మజ్జానం పూట అక్కడికెళ్తే ప్రమాదం. అర్థం చేసుకోవేటీ? దెయ్యాలు కట్టా తిరుగుతాయంటారు.”

“నిజమారా!” అని కళ్ళింత చేసుకుని అడిగాడు బాలా.

“నువ్వుండెహె! మన్నికాదు,” అంటూ బాలాని విసుకున్నాడు.

“ఏం!మిమ్మల్నేం చెయ్యవా?” అని అడిగింది సాగదీసుకుంటూ.

“మాకు పర్లేదు రేణూ, ఆడాళ్లయితేనే అట్టుకుంటాయి. అందికే కదా అంతిదిగా చెప్పేది. పైగా నువ్వివాళ తలంటుకున్నావు. యింకా ముందే అట్టుకుంటాయి,”  అన్నాడు.

అప్పటికే ముగ్గురూ శేషు వాళ్ల పాక దగ్గరికి వచ్చేసారు. “నాకంతా తెలీదు బాబూ! నన్ను తీసికెళ్తే తీసుకెళ్ళు. లేకపోతే మీ అమ్మతో చెప్పేస్తా!” అంటూ లెక్కతేల్చేసింది రేణు.

అతను లంక వెళ్ళాడని తెలిస్తేనే అమ్మ వీపు చీరేస్తుంది, యింక పూసావోడితో కలిసి వెళ్ళాడని తెలిస్తే  వాతలు కూడా పెట్టేస్తుంది. శేషూకి ఒకటి అర్థమైంది, అయితే వెళ్ళడం మానుకోవాలి, లేకపోతే రేణుని వెంట తీసుకెళ్ళాలి. కానీ యివాళ పూసావోడు తాటి చెట్టెక్కి కల్లు దింపుతానన్నాడు. రేణు వస్తే ఆ తంతు వాయిదా వేయాల్సిందే. ఒకవేళ ధైర్యం చేసినా, చెడిపోయాడని నానా హంగామా చేసి, సంస్కరించే బాధ్యత ఆరిందాలా తన నెత్తి మీద వేసుకుని, వెళ్ళి యింట్లో చెప్పేస్తుంది. “సరే అయితే! నీ పుస్తకాలు కూడా నాకిచ్చేయ్, మా యింట్లో పెట్టేసి వస్తా!” అన్నాడు నీరసంగా.

ముగ్గురి పుస్తకాలూ తీసికెళ్ళి యింట్లో పెట్టివస్తూంటే, వంటగదిలోంచి అమ్మ, “ఒరే యెక్కడికిరా, తినిపోరా నాయనా!” అని పిలిచింది.

“ఇక్కడేమ్మా, సుబ్బరాజుగారి మేడకెళ్ళి వచ్చేత్తా!” అని అరిచి చెప్పాడు. అమ్మేమో తాను  సుబ్బరాజు గారింటికి వెళ్ళాడనుకుంటుంది. సుబ్బరాజుగారేమో రేణూ కుమ్మరిసుబ్బన్న యింటి దగ్గర వుండివుంటుందని సరిపెట్టుకుంటాడు. కానీ కాసేపే సరిపెట్టుకుంటాడు. మరీ ఆలస్యమైతే పాలేర్ని పంపుతాడు. అది ప్రమాదం. ఇదంతా రేణుకు చెప్పినా అర్థం కాదు. నీవల్ల యిపుడు లంకలో  వుండే సమయం తగ్గిపోయిందని అంటే, అసలు నేను లేకుండా అక్కడకు వెళ్దామనుకోవడమేంటని మళ్ళీ అదో గొడవ అవుతుంది.

పడవల రేవుకి తిన్నగా వెళ్తే సుబ్బరాజుగారి మేడ మీంచే వెళ్లాలి. ఆయన కంటపడే అవకాశం వుంది. కాబట్టి చుట్టుతిరిగి వేరే వీధిలోంచి వెళ్ళారు.  శేషు ముఖం చిముడ్చుకుని వేగంగా నడుస్తున్నాడు. ప్రక్కన యిద్దరూ చెప్పుకుంటున్న కవుర్లేం అతనికి యెక్కడం లేదు. వాళ్ళు యితణ్ణీ సంభాషణలోకి లాగాలని చూస్తున్నా, ముక్తసరి జవాబుల్తో ఆ ప్రయత్నాల్ని నిరాకరిస్తున్నాడు. అసలు బాలాకి కూడా చెప్పకుండా ఒక్కడూ వెళ్ళిపోయుంటే బాగుండేదనిపించింది. బాలాని రమ్మన్నది కూడా, తాను కల్లు తాగే సాహసం చేస్తుంటే చూడటానికి ఒక ప్రేక్షకుడు వుంటే బాగుంటుందీ అనిపించి. ఎందుకంటే మొన్న బీడీ కాల్చినపుడు ప్రక్కన అబ్బురపాటు అచ్చుగుద్దిన మొహమేదీ లేని లోటు బాగా తెలిసొచ్చింది. ఇపుడు పథకం మొత్తానికి అభాసుపాలయింది.

రేవు దగ్గర లంగరేసిన పడవల్లో ఒక పడవ పడిచెక్క మీద పడుకుని పూసావోడు ఆకాశాన్ని చూస్తూ బీడీ కాలుస్తున్నాడు. అలికిడి విని లేచి, కుర్రాళ్ళిద్దరి తోపాటు వస్తున్న రేణుని చూసి బుర్ర గోక్కున్నాడు. “ఏంటిరా యీ అమ్మాయిగారొచ్చేరూ?” అన్నాడు.

“యెవరొత్తే నీకెందుకెహె! పోదాం పద!” అంటూ యెగిరి పడవ యెక్కాడు శేషు. పూసావోడు శేషు కన్నా పెద్దవాడే. బళ్ళో జేరితే యీ పాటికి యే పదిలోనో వుండేవాడు. కానీ కాస్త బుర్ర తక్కువ వాడు. పైగా బడిలో చదివే వాళ్ళంటే తెలివైన వాళ్ళని ఓ గౌరవం కూడా వున్నవాడు కావడంతో, శేషు ఆ అలుసు తీసుకుని వుత్తపుణ్యానికి వాడిపై అజమాయిషీ చెలాయించేస్తుంటాడు.

పూసావోడే  బాలాకి చెయ్యందించి పడవపైకి లాగాడు. రేణు యింకా ఒడ్డు దగ్గరే నీట్లో కాలు పెట్టడానికి జంకుతున్నట్టు నుంచుంది. శేషు తప్పదన్నట్టు వంగి, “రా రేణూ, చెయ్యి పట్టుకో!” అని పిలిచాడు.

“బాబోయ్ చేపలు!” అంది ఒడ్డు దగ్గర కదుల్తున్న చేపపిల్లల గుంపుని చూసి.

 “మరందుకే వద్దని చెప్పింది. పడవ దాకా రాడానికి భయం, మళ్ళీ లంకకొచ్చేత్తానంటావు!” అన్నాడు శేషు .

రేణూ పంతంగా, “నాకేం భయం లేదు!” అంటూ పరికిణీ పైకి పట్టుకుని, కళ్ళు మూసుకు రెండంగల్లో పడవదగ్గరకొచ్చేసింది. అతని చేయి పట్టుకుని పైకెక్కింది.

పడవ కదిలింది. ఏరు పారే దిశనే వెళ్తూండటంతో పూసావోడు గెడ వేయలేదు. చుక్కాని దగ్గర కూర్చున్నాడంతే. శేషు అతని తోపాటూ కూర్చుని యేవో కబుర్లు చెప్తున్నాడు. రేణూ, బాలా పడవకు రెండో వైపు వున్నారు. బాలాని చూసి ధైర్యం తెచ్చుకుని, రేణూ కూడా పడవ అంచు మీద వాలి నీట్లో చేయి పెట్టి లాగుతోంది. ఇద్దరూ ఒక వైపే వాలడంతో పడవ కొద్దిగా ఆ వైపుకు ఒరిగింది. పూసావోడు జాగ్రత్తగా కూర్చోమన్నాడు. శేషు కూడా, నీళ్ళలో పడితే బడికి సెలవేనని బెదిరించాడు. బాలా సరిగ్గా సర్దుకు కూర్చున్నాడు. రేణూ మాత్రం యథాప్రకారం ఆడుకుంది.

కాసేపటికి పడవ యిసుకని ఒరుసుకుంటూ లంక ఒడ్డున ఆగింది. పూసావోడు యింకా పడవ కడుతుండగానే, ముగ్గురూ యిసకలోకి దూకి లోపలికి పరిగెత్తారు. శేషు మిగతా యిద్దర్నీ ముందు సీమ చింతకాయ చెట్టు దగ్గరకు తీసుకెళ్లాడు. మామూలుగా అయితే ఆ కాయల్ని రాళ్ళతో కొట్టిపడేయడం రివాజు. ఎందుకంటే, చెట్టెక్కితే యే కాపో కర్రపుచ్చుకు వచ్చి పట్టేసుకుంటాడు; పారిపోయే వీలుండదు. ఇక్కడ లంకలో ఆ భయం లేకపోవడంతో శేషు, బాలా చెట్టెక్కేసారు. ఇద్దరూ కాయలు రాలుస్తుంటే, రేణు క్రింద పరిగెడుతూ అన్నీ ఒక చోటకి యేరింది.  ఈ తంతు ముగిసాకా, అక్కణ్ణించి యింకా లోపలికి వెళ్లారు.  అక్కడ మర్రి చెట్టు వూడలు కొన్నింటిని కలిపి  శేషు వుయ్యాల కట్టాడు. ముగ్గురూ వంతులవారీగా వూగారు. కాసేపు కాలక్షేపం అయాక, రేణుని వుయ్యాల్లో కూర్చోబెట్టి బాలాని వూపమని పురమాయించి, శేషు పూసావోడు యేం చేస్తున్నాడో చూసొస్తానని బయల్దేరాడు. అతను వెళ్ళిన కాసేపటికే వాళ్ళిద్దరికీ  ఆ ఉయ్యాలాటలో అసలేమీ ఆనందం కనిపించడం మానేసింది. ఇద్దరూ శేషుని వెతుక్కుంటూ బయల్దేరారు. పడవ కట్టిన ఒడ్డు దగ్గరే శేషు కనపడ్డాడు. తలెత్తి యెటో చూస్తున్నాడు. వీళ్ళిద్దరూ కూడా అటు చూసేసరికి, అక్కడ పూసావోడు వీపుకు మోకు కట్టుకుని తాటిచెట్టు యెక్కే ప్రయత్నంలో వున్నాడు. శేషు వీళ్ళిద్దర్నీ చూసి, అసహనం కప్పిపుచ్చుకుంటూ, “ఏరా యిట్టా వచ్చారు? నే వత్తాన్నాగా?” అన్నాడు.

“భలే యెక్కేస్తన్నాడ్రా!” బాలా అబ్బురపాటుతో వచ్చి శేషు ప్రక్కన నిలబడ్డాడు. రేణు కూడా ఆసక్తిగా అటే చూస్తుంది.

శేషు నోటి దగ్గర చేతులు గొట్టంలా మూసి, “ఒరే గంగరాజూ! ఎక్కింది చాలు దిగేయ్!” అంటూ గట్టిగా అరిచాడు. పూసావోడు వీళ్ళని చూసి దిగటం మొదలుపెట్టాడు. “పద రేణూ,  పొద్దోయిందంటే మళ్ళీ మీ తాత కంగారుపడతాడు!” అని పడవవైపు కదిలాడు.

రేణూ, “యెందుకు దిగిపోమన్నావ్? నాక్కొన్ని ముంజికాయలు కోయమనవా?” అని అడిగింది.

“ఇపుడు కాదు!” అన్నాడు పడవ యెక్కుతూ.

అందర్నీ యెక్కించుకుని పడవ బయల్దేరింది. ఈసారి ఏటికి ఎదురు కావటంతో పూసావోడు గెడ పట్టుకుని పడవంచున నడుస్తున్నాడు. శేషు పడవ మొదట్లో కాలటూ యిటూ వేసుకు కూర్చున్నాడు. వాళ్ళిద్దరూ యేవో కబుర్లు చెప్పుకుంటున్నారు. పడవ వెనకాల, బాలా జేబుల్లోంచి సీమచింతకాయలు తీసి రేణూకి పంపిణీ చేయడం మొదలుపెట్టాడు. రేణు కొన్ని తీసుకుని శేషు దగ్గరకెళ్ళి యివ్వబోయింది. అతను మొహం కూడా యిటువైపు తిప్పకుండా “నాకొద్దు” అన్నాడు.

“ఎందుకు తీసుకోవు!”

“నాకొద్దంటుంటే? నువ్వేం చెప్తే అది చేయాలా?” అన్నాడు గసురుకున్నట్టు.

పూసావోడు కిసుక్కుమని నవ్వాడు. రేణూ నిశ్శబ్దంగా వెనుదిరిగింది. పడవ మధ్యలో శేషు చెప్పులు కనపడ్డాయి. అవి నిరుడు ఏడోతరగతి పబ్లిక్ పరీక్ష పాసయినపుడు శేషు అన్నయ్య అతనికి కొన్న మొదటి చెప్పుల జత. ఒక చెప్పు తీసి చలాగ్గా యేట్లోకి విసిరేసింది. బుడుంగు మన్న శబ్దంతో పాటూ, బాలా హడలిపోతూ పీల్చిన యెగశ్వాస వినబడి, శేషు వెనుదిరిగి చూసాడు. ఇప్పుడేం చేస్తావన్నట్టు చూస్తూ నించుంది రేణు పడవ మధ్యలో.

“ఓయ్  పిల్లా! పిచ్చెక్కిందా!” అరిచాడు. అతని కోపం చూసి, రెండో చెప్పు కూడా చేతుల్లోకి తీసుకుంది విసిరేయడానికన్నట్టు. “ఇదిగో రేణూ! అది గనక నీట్లో పడిందంటే నీ జట్టుండనంతే, ముందే చెప్తున్నాను!” అంటూ తర్జని చూపించి బెదిరించాడు. అదే అతని రెండో నేరమన్నట్టు ఆ చెప్పు కూడా విసిరేసింది.

పళ్ళు బయటపెట్టి పగలబడి నవ్వుతున్న పూసావోణ్ణి, “ఒరేయ్ పాసెదవా, నవ్వింది చాలు గెడెట్టి లాగరా!” అని అరిచాడు. పూసావోడు ప్రయత్నించాడు గానీ, ఒక చెప్పే అందింది. ఇక తప్పేది లేక రెండో దాని కోసం శేషు యేట్లో దూకాడు. కాసేపు తంటాలుపడి, యెలాగైతేనేం దొరకబుచ్చుకుని, నీళ్ళోడుతున్న వంటితో పడవెక్కాడు. రేణూ ఓ మూలకెళ్ళి బుంగమూతి పెట్టుకు కూచుంది. పడవ దిగాక కూడా యెవరితోనూ మాట్లాడలేదు. అందరికన్నా ముందు విసవిసా నడుస్తూ యింటికి వెళ్ళిపోయింది. రెండుమూడ్రోజులకి మళ్ళీ శేషూనే మాట కలిపి మచ్చిక చేసుకోవాల్సివచ్చింది.
*     *     *
పరిసరాల ఆనవాళ్ళు నల్లగా చెరిపేస్తూ చిక్కబడిన చీకటికీ వానకీ తోడు, ముప్పిరిగొన్న ఆలోచనల్లో నిండా మునిగివున్న శేషు చేరవలసిన యిల్లు దాటిపోయేవాడే. ఒక పెంకుటింటి అరుగు మీద, దూలానికి వేలాడుతున్న లాంతరు వెలుగులో, పరిచిత రూపంలా కనిపించి ఆగాడు. బాలా వాళ్ళ నాన్న చొక్కాలేకుండా లుంగీతో పడక్కుర్చీలో కూర్చున్నాడు.  చూరు మీంచి పారుతున్న చినుకుల ధారనే దీక్షగా చూస్తున్నవాడల్లా, అలికిడికి తెప్పరిల్లి చూసాడాయన. శేషు గొడుగు మూస్తూ, “యేం సూర్రావుగారు, గుర్తుపట్టారా?” అని అడిగాడు.

గుర్తుపట్టలేదని ఆయన మొహం చెప్తూనే వుంది. కళ్ళు చికిలించి కళ్ళజోడు సరిచేసుకుంటూ శేషూ ముఖాన్ని పరీక్షగా చూసాడు. అయోమయపు నవ్వుతో, ఎవరని అడిగాడు.

“నేనూ, కుమ్మరి సుబ్బన్నగారి రెండోవాణ్ణి.”

ఆయన ముఖం వెలిగిపోయింది, “ఓరి, నువ్వా! నా మతిమరుపు తగలేసిరి! బాలా చెప్పాడు నువ్వొస్తావని. వాడు పొద్దున్న చెప్పిందే మర్చిపోయానంటే, యిక నిన్నేమాత్రం గుర్తుపట్టగలనో చెప్పు. అయినా యెన్నాళ్లయిందిరా!  మీ బాబూ కొడుకులు వూర్నించి వెళ్లాకా అసలొచ్చిందేదీ! ఇలా పుష్కరాని కొక్కసారన్నట్టుంటే యిక మనుషులేం గుర్తుంటార్రా. బావున్నారా మీ వాళ్ళంతా?”

“ఊ... బ్రహ్మాండంగా వున్నారు! మీ సంగతేంటి?”

“మాదేవుందిరా... యిదిగో... యిలా నడిచిపోతుందేదో. తిరిగినన్నాళ్ళు తిరిగాం. ఇంక మా శకం అయిపోయింది. అవునొరే! మీ నాన్నకి సిటీలో యేం కాలక్షేపమవుతుందిరా... అపుడపుడూ యిలా వచ్చి పోవచ్చుగా?”

“మా నాన సంగతి తెలిసిందేగా... వూళ్ళో వున్నపుడే ఆ సందు దాటి వొచ్చేవాడు కాదు. అమ్మ పోరతానే వుంటుంది, తిరణాల రోజుల్లో అయినా ఓ సారి యెళ్ళొద్దామని. ఆయన కదిల్తేనా! అయినా మనవలున్నారుగా, అన్నయ్య పిల్లలు, వాళ్ళతో బానే కాలక్షేపం ఆయనకి.”

“మరే...! అదే చెప్తున్నారా మావాడికీను,” అంటూ యేదో చెప్పబోయేంతలో, లోపల చీకట్లలోంచి బాలా గుమ్మంలోకి వచ్చాడు. “వచ్చేవా! వర్షంలో యెక్కడ చిక్కడిపోయావో అనుకున్నా” అన్నాడు.

“నువ్వేంట్రోయ్! రచయితలకేవన్నా యీ లాల్చీ పైజమా యూనిఫామా?” సరదాగా పలకరించాడు శేషు.

బాలా నవ్వాడు. “ముందు నువ్వురా లోపలికి, లేకపోతే వరండాలో నిలబెట్టి ఆతిథ్యమిచ్చేస్తారాయన,” అన్నాడు.

ముసలాయన కూడా పడక్కుర్చీలోంచి లేస్తూ, “అయ్యో లేదురా! పదేళ్ళ పైనే అయిపోతుంది, యేదో కుశలం కనుక్కోవాలనిపించదూ?! సరే పదండిక లోపలికి,” అంటూ దూలానికి తగిలించిన లాంతరు తీసుకున్నారు.   అంతా లోపలికి వెళ్ళారు.

0 comments:

మీ మాట...