January 25, 2014

కాఫ్కా 'మెటమార్ఫసిస్'కు నా అనువాదం గురించి

కాఫ్కాని అనువదించాలన్న కల కినిగె పత్రిక పుణ్యమాని నెరవేరింది. డెఫినిటివ్ అనువాదాలంటూ ఏవీ ఉండవు. It's my take అని చెప్పటానికి నేను మూలం పునాదిగా కొత్తగా ఏదో పుట్టించాలనీ ప్రయత్నించలేదు. కాఫ్కాలో నేను ఏది ప్రేమిస్తానో దాన్నే అనువదించటానికి ప్రయత్నించాను. ఇది కాఫ్కాకు దగ్గరైన text అని చెప్పటానికి సాహసించను. కానీ కాఫ్కా text వైపు నా ప్రయాణంలో ఈ సందర్భం ఒక అతి దగ్గరి మజిలీ అని చెప్తాను.

కినిగె పత్రికలో వచ్చిన కాఫ్కా పరిచయం ("శిలువ మోసిన రచయిత") + రూపాంతరం నాలుగు ఇన్‌స్టాల్మెంట్ల లింకులన్నీ ఇక్కడ ఉన్నాయి:

http://patrika.kinige.com/?cat=66

మొత్తం అనువాదం పీడిఎఫ్ లింక్ ఇదిగో:

http://patrika.kinige.com/wp-content/uploads/2014/01/Rupantaram-TOTAL.pdf

దీనికి ఒక "అనువాదకుని మాట" లాంటిది కూడా రాశాను. కానీ తర్వాత పబ్లిష్ చేయాలనిపించలేదు. దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను:

=====================================

అనువాదకుని మాట

నేను ఈ రచనను మూల భాష అయిన జర్మన్ నుంచి అనువదించ లేదు. ఇంగ్లీషు నుంచి అనువదించాను. మూడు వేర్వేరు ఇంగ్లీషు అనువాదాలపై ఆధారపడ్డాను. వీటిని కాలానుక్రమంలో చెప్పాలంటే, మొదటిది: 1937లో తొలిసారి విడుదలైందీ, దాదాపు యాభై యేళ్ళ పైనే చెలామణీలో ఉన్నదీ అయిన ఎడ్విన్ మూర్ - విల్లా మూర్ దంపతుల అనువాదం. రెండోది: 1992లో పెంగ్విన్ వాళ్ళు ప్రచురించిన మాల్కమ్ పాస్లె అనువాదం. మూడోది: 2003లో బార్న్స్ అండ్ నోబెల్ వాళ్ళు ప్రచురించిన డొనా ఫ్రీడ్ అనువాదం. ఈ మూడింటిలో నేను ప్రధానంగా మాల్కమ్ పాస్లె అనువాదం పై ఆధారపడ్డాను. కాఫ్కా గురించి నాకు తెలిసిన దాన్ని బట్టి ఇదే “మెటమార్ఫసిస్” అనువాదాల్లో ఉత్తమమైందిగా భావించాను.

కాఫ్కాకు సంబంధించినంతవరకూ స్వేచ్ఛానువాదమూ, అనుసృజనా అర్థం లేని ప్రక్రియలు. కాఫ్కా రచనల ముఖ్య తత్వమేమిటంటే, వాటి పాఠం (text) అత్యంత స్పష్టమైన దృశ్యాల్ని (imagery) అందిస్తుంది, కానీ ఆ దృశ్యాల సంచయం మాత్రం తార్కికమైన అర్థాన్ని మనకు చిక్కనివ్వదు. కళ్ళకు కట్టినట్టుండే దృశ్యాలూ, బుద్ధికి అందీ అందని అర్థమూ – ఇదీ కాఫ్కా శైలి. కాబట్టి పాఠకునిలో కాఫ్కాయెస్క్ ప్రభావాన్ని కలగజేయాలంటే, అనువదించాల్సింది ఆయన భాషని కాదు, భావాన్ని కాదు; ఆయన దృశ్యాల్ని. ఆ దృశ్యాల పదును ఏ మాత్రం జావ కారిపోనీయకుండా (తెలుగైజ్ చేయడం వగైరా పాపాలకు ఒడిగట్టకుండా) అనువదించాలి, అంతేకాదు, వీలైనంత వరకూ వాటి సీక్వెన్స్‌ని కూడా మారనివ్వకూడదు. అంటే ఆయన సింటాక్స్‌ని కూడా దగ్గరగా అనుసరించాలి. దీనికోసం తెలుగు నుడికారానికీ, అందులోని నానిపోయిన వ్యక్తీకరణలకీ దూరం జరగాల్సి వచ్చింది. ఆ మాటకొస్తే కాఫ్కాలోనే జర్మన్ నుడికారం తక్కువ. And for me, an ideal translation always sounds like a ‘translation’; it retains the quintessential quaintness of the original language and its expression.

తెలుగులో ఇప్పటికే మకాం వేసుక్కూచున్న ఇంగ్లీషు పదాల్ని యథాతథంగా వాడాను. అలాగే కాఫ్కా చాలా చోట్ల వాక్యం పూర్తయినా, చెప్పదల్చుకున్న భావం ఇంకా కొనసాగుతోందనుకున్నపుడు, వాక్యం చివర పుస్‌స్టాపులు వాడకుండా కామాలు పెట్టుకుంటూ పోతాడు. వాటిని అలాగే అనుసరించాను. కాఫ్కా రచనల్లో పేరాలు విడదీయడం చాలా తక్కువ; సంభాషణలను విడిగా కాక, పేరాగ్రాఫుల్లోనే కలిపేస్తాడు; దీన్ని తప్పకుండా అనుసరించాను. అలాగే తెలుగులో ఉన్నట్టు ఇంగ్లీషులో “మీరు/ నువ్వు” లంటూ రెండు సంబోధనా వాచకాలు లేవు; ఉన్నదల్లా “నువ్వు” ఒక్కటే. నా విచక్షణ ప్రకారం వాటిని వాడాను.

ఇది మూలనిబద్ధ అనువాదమూ కాదు; స్వేచ్ఛానువాదమూ కాదు. కాఫ్కా ఎందుకు రాసి ఉంటాడని నేననుకున్నానో, అందుకే అనువదించటానికి ప్రయత్నించాను.

~ మెహెర్

=====================================

నాకు నా అనువాదం కన్నా ఎక్కువ నచ్చింది దీనికి రమణజీవి వేసిన కవర్ పేజి. ఇది తెలుగులోనే కాదు, మొత్తం అంతర్జాతీయంగా "మెటమార్ఫసిస్‌"కు ఎన్ని కవర్‌పేజీలు వచ్చాయో, వాటన్నింటికన్నా అందమైన,  అర్థవంతమైన కవర్‌పేజీ అని నాకు అనిపించింది:


రమణజీవి గారి దాకా వెళ్లకముందు నేనూ ఒక కవర్‌పేజీ తయారు చేశాను. ఆయన తయారు చేసిందాని ముందు ఏమాత్రం నిలవదు. పైగా నాకు ఎమ్మెస్ పెయింటు తప్ప ఇంకేదీ పెద్దగా రాదు. అసలే పెద్ద ఊహ లేని బొమ్మ, ఎమ్మెస్ పెయింట్లో ఉన్న రంగుల ఆప్షన్లతో గాడీగా వచ్చింది. ఐనా ఏదో చేశాం కదా, ఎక్కడ కాకపోయినా, ఇక్కడ బ్లాగులో పెట్టేద్దామని:


మరీ pedantic అనుకోకపోతే, ఈ కథ జరిగే ఇంటి బొమ్మ కూడా గీశాను. దీని వెనక "మెటమార్ఫసిస్" మీద నబొకొవ్ ఇచ్చిన కాలేజీ లెక్చరు ప్రేరణ. అక్కడ ఆయన రఫ్‌గా ఏదో స్కెచ్ గీశాడు, నేను దాన్ని అనుసరించాను. ఆయన జర్మనీలో ఇరవైయేళ్లు ఉన్న మనిషి. కాబట్టి ఆ ఆర్కిటెక్చరూ అదీ, దాని మీద ఆయన మాట నమ్మవచ్చు:


కాఫ్కాపై ఇదివరకూ నా బ్లాగులో ఉన్న కొన్ని అనువాదాలు:

కాఫ్కా "ట్రయల్" నవలని కూడా నశీర్ పేరుతో అనువదించాను. అది ఇక్కడ ఈ బుక్‌గా ఉంది. (It still needs some work, someday...)

కాఫ్కాపై ఇదివరకూ రాసిన కొన్ని వ్యాసాలు:

2 comments:

  1. మెహెర్ గారూ,
    కాఫ్కాను తెలుగు పాఠకులకు ఎంతో చేరువ చేస్తున్నాయి మీ ప్రయత్నాలు. అనువాద విషయంలో మీ శ్రద్ధ, తపన అభినందనీయం! మీరన్నట్టే.. మెటమార్ఫసిస్ కి రమణజీవి గీసిన ముఖచిత్రం చాలా బాగుంది.

    ReplyDelete
  2. వేణు గారు, థాంక్యూ.

    ReplyDelete