రచయిత చనిపోయాక రాసే నివాళి వ్యాసాలు రెండు రకాలు: ఒకటి- అతని రచనల విలువా, సాహిత్యంలో అతని స్థానం ఏమిటన్నది అంచనా వేసేవి. రెండు- ఈ రచనల గొడవంతా పక్కనపెట్టి రచయిత స్వభావాన్ని, అతనితో ఉన్న పరిచయాన్ని తల్చుకునేవి. నాకు ఈ రెండో రకంవి ఎక్కువ నచ్చుతాయి. ఇలాంటి వ్యాసాలతో వచ్చే పుస్తకాలు కూడా చదువుకోవటానికి బావుంటాయి. ఒకరకంగా ఫిక్షన్ తర్వాత ఇది నా ఫేవరెట్ జాన్రా (రచయితల డైరీలు, ఉత్తరాలతోపాటు). మామూలు మనుషులు ఎంత రసవత్తరంగా బతికినాసరే, దాని గురించి అక్షరాల్లో ఋజువు చెప్పగలిగే సాక్షులెవ్వరూ దరిదాపుల్లో ఉండరు గనుక, ఆ జీవితాలు ఎవ్వరికీ తెలియకుండా మట్టిలో కలిసిపోతాయి. రచయితల విషయంలో మటుకు వాళ్ళు ఎంత మామూలుగా బతికినాసరే, దాన్ని నమోదు చేయటానికి వాళ్ళ చుట్టుపక్కల కాస్త వాక్యం పట్టుబడినవాళ్లుంటారు. అదొక ప్రివిలేజి. ఈ నివాళి వ్యాసాల్ని కల్పితమేమీ లేకుండానే జీవితం కథలుగా మారే సందర్భాలుగా చూస్తాను. అలాగని ఈ నివాళి వ్యాసాల్లో కూడా ఫిక్షన్ కలిపి కమ్మగా వడ్డించేవాళ్ళు లేరనటం లేదు. కానీ అవి కూడా చదువుకోవటానికి, నవ్వుకోవటానికి బాగానే ఉంటాయి. ఒకాయన రాసిన రెండు మూడు నివాళి వ్యాసాల్లో ఒకేలాంటి సన్నివేశం తిప్పితిప్పి వస్తూంటుంది- చనిపోయిన రచయితని ఈయన మూడో మనిషెవరూ లేనిచోట కలుస్తాడు, ఆ చనిపోయిన రచయిత ఈయన గురించి తియతియ్యగా పొగుడుతాడు, ‘నా తర్వాత ఇంకెవ్వరూ రారనుకున్నాను నువ్వొచ్చావు’ అంటాడు. ఇంకొకాయన తన అభిప్రాయాలని ఆ చనిపోయిన మనుషులకి ఆపాదించి వాళ్ళ నోట్లోంచి ప్రసంగాలు ఇస్తుంటాడు. ఇంకొకడు బతికున్న మనుషుల మీద పగ తీర్చుకోవటానికి చనిపోయిన మనుషుల నోళ్ళలో తన మాటలు కూరుతుంటాడు. మరొకడెవడో ‘ఎంత గొప్ప రైటర్ అయితేనేం పాపం చివర్లో పచ్చళ్ళు అమ్ముకున్నాడ’ని జాలి పడతాడు. ఒక కమ్యూనిస్టు విమర్శకుడి స్మరణ సంచికలో అందరూ అతని సైద్ధాంతిక నిబద్ధతని తల్చుకుంటూ రాస్తే, కొడుకు మాత్రం ‘మా నాన్న ఇల్లు గాలికి వదిలేసి జెండాలు పట్టుకుని తిరిగినా అమ్మ దగ్గరుండి చదివించబట్టి సాఫ్ట్వేర్ జాబు తెచ్చుకుని అమెరికాలో సెటిల్ అవ్వవగలిగాను‘ అన్న ధోరణిలో రాస్తాడు. ఇవన్నీ కూడా నాకు కథల్లాగే ఉంటాయి. ఆత్మీయంగా రాసేవాళ్ళు ఒకలాంటి కథలు చెప్తే, ఇలాంటివి రాసేవాళ్ళు ఇంకోలాంటి కథలు చెప్తారు. అవి వాళ్ళనే బైటపెట్టేట్టు ఉంటాయి. అందుకే ఈ పుస్తకాలు బావుంటాయి నాకు. ఒక మనిషి మిగిల్చిపోయిన ఖాళీ చుట్టూ వీళ్ళంతా చేరి తమ జ్ఞాపకాల్లోంచి ఏరిన ముక్కలతో మళ్ళీ అతని ఉనికిని పేర్చడానికి ప్రయత్నించడం... అవన్నీ పొసిగీ పొసగకా ఒక అసహజమైన మూర్తి ఏర్పడటం, దాంట్లోనే ఏ మూలో ప్రాణమున్న అసలు మనిషి మినుమినుకులాడటం... ఇది బావుంటుంది. ముఖ్యంగా ఆ మనిషి మనం ఎంతో ఇష్టపడి ఎప్పుడూ కలవని రచయిత అయినప్పుడు. నాకు ఎంతో నచ్చిన కొందరు రచయితల స్వభావాల్ని నేను ఇలా స్మృతి రచనల్లోంచే ఏరుకుని కట్టుకున్నాను.
చెఖోవ్ ఉత్తరాలు చదువుతుండగా– మధ్యలో అతని మీద మాక్సిమ్ గోర్కీ, అలెగ్జాండర్ కుప్రిన్, ఇవాన్ బునిన్ రాసిన ఈ స్మృతి రచనల పుస్తకం మీదకు దృష్టిపోయింది. ఇది ఉందని ఎప్పడో తెలుసు, కానీ పూర్తిగా చదవటం ఇప్పుడే కుదిరింది. రాసినవాళ్ళల్లో గోర్కీ అందరికీ తెలిసినవాడే. కుప్రిన్ తెలుగువాళ్లకి రాళ్లవంకీ కథల పుస్తకంతో, యమకూపం నవలతో తెలుసు. ఇవాన్ బునిన్ బహుశా నోబెల్ బహుమతి పొందిన ఒకానొక రైటరుగా తెలిసుండాలి. వీళ్లు ముగ్గురూ చెఖోవ్ కంటే దాదాపు పదేళ్ళు చిన్నోళ్ళు. నలభై నాలుగేళ్ళ వయస్సులో చనిపోయిన చెఖోవ్ కి చివరి పది పదిహేనేళ్ళల్లో పరిచయమైనవాళ్ళు. వీళ్ళ ముగ్గురి వ్యాసాల్లోనూ దాదాపు ఒకే రకమైన చెఖోవ్ కనపడతాడు. కానీ నుదురు ముడి వేసుకుని గంభీరంగా కనిపించే ఈ చెఖోవే నిజమైన చెఖోవ్ అని నేను అనుకోను. ఎందుకంటే వీళ్ళకు తెలిసిన చెఖోవ్ క్షయ రోగం ముదిరి చావు పొంచి ఉందని తెలిసినవాడు, ఆ ఎరుక తెచ్చే గాంభీర్యమో నైరాశ్యమో ఉట్టిపడేవాడు. అంతకుముందులా చిలిపిగా, సరదాగా, ప్రాంక్‌లూ ప్రాక్టికల్ జోకులేసే చెఖోవ్ వీళ్ళకు పెద్దగా తెలియదు (ఆ చెఖోవ్ తొలి రోజుల్లో రాసిన ఉత్తరాల్లో కనపడతాడు). కాబట్టి ఆ సరదా చెఖోవ్ వీళ్ళు రాసిన ఈ వ్యాసాల్లో అరుదుగా మాత్రమే బైటకొస్తుంటాడు. అలా బైటకొచ్చిన సందర్భాల్ని ముగ్గురూ గుర్తుపట్టి అపురూపంగా తల్చుకుంటారు. ఈ కింద కోట్ చేసిన గోర్కీ మాటల్లో కనపడే చెఖోవే దాదాపు మిగతా ఇద్దరి వ్యాసాల్లోనూ కనపడతాడు—అంతరంగంలో పూర్తి స్వేచ్ఛ పొందిన మనిషి, రచయితలంటే ఇలా ఉండాలన్న అంచనాలకి అందని మనిషి, జీవితానికి సంబంధించిన గంభీరమైన సంభాషణలంటే దూరం జరిగే మనిషి, ఎవరైనా స్వభావాన్ని దాచి ముసుగేసుకుంటే అస్సలు భరించలేని మనిషి…:
“He was always himself, inwardly free, and he never troubled about what some people expected and others—coarser people—demanded of Anton Chekhov. He did not like conversations about deep questions, conversations with which our dear Russians so assiduously comfort themselves…’’
ఈ ‘‘inwardly free’’ అన్న అర్థంలో చెఖోవ్ గురించి ముగ్గురూ మాట్లాడతారు. చెఖోవ్ మతం నుంచి, సమాజంలో చర్విత చర్వణంగా దాపురించే సంప్రదాయాల నుంచి, దేశభక్తి లాంటి అందరూ గుడ్డిగా ఒప్పుకునే చట్రాల నుంచి, సామాజిక సిద్ధాంతాల ఒరవడి నుంచి పూర్తిగా విముక్తి చెందిన మనిషి. నేను ఆయన కథలు చదివి ‘‘ఆయన ఇలాంటివాడయ్యుంటాడు’’ అని చేసుకున్న ఊహలని నిర్ధారించి చెప్పేలాంటి మాటలు ఈ పుస్తకంలో చాలా ఉన్నాయి. అవ్వేగాక, రచన గురించి చెఖోవ్ చెప్పిన మాటల్ని కూడా కొన్ని చోట్ల కోట్ చేశారు. ముఖ్యంగా కుప్రిన్ వ్యాసంలో. అవి కొన్నే అయినా నాకు ఆసక్తిగా అనిపించింది. మామూలుగా ఈ 19వ శతాబ్దం రచయితల ఇంటర్వ్యూలెక్కడా దొరకవు. వీళ్ళెవ్వరూ 20వ శతాబ్దం రచయితల్లాగ ‘పారిస్ రివ్యూ’ ఇంటర్వ్యూల లాంటి ఇంటర్వ్యూల్లో తమ రచనా పద్ధతుల గురించి చెప్పుకోలేదు. అందుకే ఈ రెమీనిసెన్సుల్లో చెఖోవ్ తన రచన గురించి మాట్లాడిన మాటలు నాకు ప్రత్యేకంగా అనిపించాయి.
చెఖోవ్ ఎప్పుడూ నోట్సు రాసి పెట్టుకోవద్దు అన్నాడట కుప్రిన్ తో. అంటే రచయితలు జ్ఞాపకంలో ఉంచుకోవాలని కొన్ని సంఘటనలని రాసి పెట్టుకుంటారు కదా, అలాగ. ఉండాల్సిన పెద్ద విషయాలైతే ఎలాగూ జ్ఞాపకంలో ఉంటాయన్నది ఆయన థియరీ: ‘‘Chekhov had just strongly advised us not to have recourse to notebooks for help but to rely wholly on our memory and imagination. ‘The big things will remain’—he argued—‘and the details you can always invent or find’.”
కథలకి టైటిల్స్ పెట్టడానికి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదని నేను అనుకుంటాను. పది కథల్లో నీకథకి ఒక ఐడీ కార్డులాగ తప్పితే టైటిల్స్ లో నాకే పరమార్థం కనపడదు. అలా అనుకునే నాకే ‘మరీ ఇంత మామూలు టైటిలా’ అనిపించేలాంటి టైటిల్స్ పెట్టాడు చెఖోవ్. ‘My Life’, ‘The Student’, ‘The Letter’, ‘The Bet’, ‘The Kiss’, ‘The Party’, ‘Misery’, ‘Neibhours’... ఇంతకన్నా టైటిల్స్ దొరకలేదా అనిపిస్తుంది అంత మంచి కథలకి. కానీ ఈ విషయం మీద ఆయనకో స్పష్టత ఉందని అర్థమైంది ఈ మాటల్లో: ‘‘Put as plain a title as possible—any that occurs to your mind—and nothing else. And again, why those subtitles: a psychological study, genre, nouvelle? All these are mere pretense. Also use as few brackets, italics and hyphens as possible. They are mannerisms.”
ఇంకోటి చెఖోవ్ ని ఏమాత్రం చదివున్న వాళ్ళకైనా తెలిసిపోయేదే. ఆయన ఎప్పుడూ ఇతివృత్తాలు గొప్పగా, ప్రత్యేకంగా ఉండాలని అనుకోలేదు: ‘‘Why write about a man getting into a submarine and going to the North Pole to reconcile himself with the world, while his beloved at that moment throws herself with a hysterical shriek from the belfry? All this is untrue and does not happen in reality. One must write about simple things: how Peter Semionovitch married Marie Ivanovna. That is all.’’ (‘‘ప్రపంచంతో సంధి కుదుర్చుకోవటానికి సబ్ మెరైన్ ఎక్కి ఉత్తర ధ్రువం పోయే మనిషి గురించీ, ఈలోగా ఇక్కడ గంటస్తంభం మీంచి పెద్ద పొలికేక పెడుతూ దూకి ఆత్మహత్య చేసుకునే అతని ప్రేయసి గురించీ ఎందుకు రాయడం? అదంతా అవాస్తవం, నిజజీవితంలో జరిగేది కాదు. రాస్తే మామూలు విషయాల గురించి రాయి: మేరీ ఇవనోవ్నా ని పీటర్ సెమీయొనోవిచ్ ఎలా పెళ్ళి చేసుకున్నాడు. అది చాలు.’’)
కుప్రిన్ రాసిన వ్యాసంలోనే చెఖోవ్ చెప్పిన ఇదో మంచి మాట ఉంది. నువ్వు వర్ణించే దాని మీద నువ్వే మచ్చటపడిపోకూడదు అంటాడు. దూరంగా నిలబడి వర్ణించమంటాడు. మనసులో వర్ణించేదాని మీద కొంత చికాకుపెట్టుకుని మరీ వర్ణించమంటాడు:
‘‘He also taught that an author should be indifferent to the joys and sorrows of his characters. ‘In a good story’—he said—‘I have read a description of a restaurant by the sea in a large city. You saw at once that the author was all admiration for the music, the electric light, the flowers in the buttonholes; that he himself delighted in contemplating them. One has to stand outside these things, and, although knowing them in minute detail, one must look at them from top to bottom with contempt. And then it will be true’.”
ఈ ముగ్గురు రాసిన వ్యాసాల్లోనూ ఉమ్మడిగా కనపడేది ఇంకొటకటి ఉంది— పని చేయటం అంటే చెఖోవ్ కి ఎంత ఇష్టమన్నది. సోమరిపోతు పాత్రలెన్నో రాసిన ఈ మనిషి పని, పని, పని అని పలవరిస్తుంటాడు. డాక్టరుగా ప్రాక్టీసు చేస్తూ, ఊళ్లల్లో స్కూళ్లు కట్టిస్తూ, నలుగురైదుగురున్న ఉమ్మడి కుటుంబాన్ని పోషిస్తూ, క్షయ రోగంతో చివరి రోజుల్లో చాలా బాధ పడుతూ, నలభై నాలుగేళ్ళ జీవితంలోనే అన్నేసి కథలు రాసిన చెఖోవ్ యువ రచయితలకి ఈ మాటలు చెప్పాడంటే నమ్మాలి. ఎంత రాయగలిగితే అంత రాయమంటాడు. సరిగా రాకపోయినా ఫర్లేదంటాడు. తర్వాత అదే వస్తుంది. ముందు యవ్వనాన్నీ, చేవనీ వేస్టు చేసుకోకూడదు. అది పని చేయాల్సిన వయసు. కుప్రిన్ కి ఇలా చెబుతాడు, ‘‘నువ్వు బాగా రాస్తావు. కానీ నీ దగ్గరున్న పదాలు చాలా తక్కువ. పదాలని సంపాదించాలి, మాటతీరుని పట్టుకోవాలి, అది జరగాలంటే రోజూ రాయాలి.’’: “ ‘Write, write as much as possible’—he would say to young novelists. ‘It does not matter if it does not come off. Later on it will come off. The chief thing is, do not waste your youth and elasticity. It's now the time for working. See, you write superbly, but your vocabulary is small. You must acquire words and turns of speech, and for this you must write every day’.”
ఫలానావాడ్ని ‘‘ప్రతిభలేనివాడు’’ అనటమే చెఖోవ్ కి తెలిసిన పెద్ద తిట్టు అంటాడు బునిన్: ‘‘The word ‘talentless’ was, I think, the most damaging expression he could use. His own failures and successes he took as he alone knew how to take them.’’
గొప్ప రచయితలని చదివి ‘‘వీళ్ళలాగ రాయలేనప్పుడు ఎందుకూ ఇక రాయడం’’ అని నిరుత్సాహపడే కొంతమంది నాకు తెలుసు. నాకు అలాంటి నిరుత్సాహం ఎప్పుడూ అర్థం కాలేదు. చెఖోవ్ అదే చెప్తాడు— పెద్ద కుక్కలుంటాయి, బుజ్జి కుక్కలుంటాయి, పెద్ద కుక్కల్ని చూసి బుజ్జి కుక్కలు డీలా పడకూడదు. ఎవరి చేతనైనట్టు వాళ్ళు మొరగాలి, దేవుడు ఇచ్చిన గొంతుతో…: ‘‘There are big dogs and little dogs, but the little dogs should not be disheartened by the existence of the big dogs. All must bark—and bark with the voice God gave them.’’
చెఖోవ్ అన్నాడని గోర్కీ రాసిందాన్ని మాత్రం అనువదించి పెడతాను. ఇది రచనకు సంబంధించింది కాదు, సమాజం గురించి. ఇక్కడ ‘రష్యన్’ అన్న మాట తీసేసి, ‘ఇండియన్’ అనో ‘తెలుగువాడు’ అనో పెడితే ఇది మన గురించే అనిపిస్తుంది:
‘‘రష్యన్ మనిషి ఓ చిత్రమైన జీవి. వాడొక జల్లెడ లాంటివాడు. వాడిలో ఏదీ మిగలదు. యవ్వనంలో ఆబగా తనకు ఎదురైన ప్రతీదీ ఆకళింపు చేసుకుంటాడు, కానీ ముప్పయ్యేళ్ళ తర్వాత బుర్రలో బూడిద తప్ప ఏమీ మిగలదు…. చక్కగా, మానవీయంగా బతకాలంటే పని చేయాలి, నమ్మకంతో, ప్రేమతో పని చేయాలి. కానీ అది మనవల్ల కాదు. ఆర్కిటెక్టు ఒకటి రెండు మంచి బిల్డింగులు కడతాడు, ఇక్క అక్కడితోసరి, తక్కిన జీవితమంతా కూర్చుని పేకాడతాడు, లేదంటే ఏదో నాటకాల గుంపు వెంటపడుతూ కనపడతాడు. డాక్టరుకి ప్రాక్టీసు పెరిగాక ఇక సైన్సు మీద ఆసక్తి పోతుంది, మెడికల్ జర్నల్ తప్పితే ఇంకేదీ చదవడు, నలభయ్యేళ్ళు వచ్చేసరికి సకల రోగాలకి కఫమే మూలమని నిజంగా నమ్మటం మొదలుపెడతాడు. చేసే పనికి అర్థమేమిటో తెలిసిన సివిల్ సర్వెంటు ఒక్కడిని కూడా నేను కలవలేదు: మామూలుగా వాడు నగరంలోనో, జిల్లాకి ముఖ్య పట్టణంలోనో కూర్చుంటాడు, ఊళ్లకి నివేదికలు రాసి పంపుతుంటాడు. వాడు రాసే ఒక నివేదిక ఊరిలో ఎవరిదో స్వేచ్ఛని పూర్తిగా హరించి వేయవచ్చు–కానీ దాని గురించి మన సివిల్ సర్వెంటు ఎంత తక్కువ ఆలోచిస్తాడంటే, నరకం గురించి నాస్తికుడు ఆలోచించినంత. మంచి డిఫెన్స్ అని పేరు మోసాక ఇక ఆ లాయరు న్యాయం గురించి పట్టించుకోవటం మానేస్తాడు, ప్రాపర్టీ హక్కుల్నీ, జూదశాలల్నీ మాత్రమే డిఫెండ్ చేస్తాడు, ఆయెస్టర్లు తింటాడు, సకల కళలనీ సమాదరిస్తాడు. ఒక నటుడు రెండు మూడు మంచి పాత్రల్ని పోషించాక, ఇక తన డైలాగుల్ని చూసుకోవటం మానేస్తాడు, సిల్కు హాటు పెట్టుకుని తానో జీనియస్సునని నమ్మటం మొదలుపెడతాడు. రష్యా ఒక తృప్తి లేని సోమరిపోతుల నేల: హితవుకి మించి తింటారు, హద్దు మీరి తాగుతారు, పగలే నిద్రపోతారు, నిద్రలో గురకపెడతారు. ఇల్లు చూసుకోవటానికి మనిషి కావాలి కాబట్టి పెళ్ళి చేసుకుంటారు, సమాజంలో గొప్ప కోసం ఇద్దరు ముగ్గుర్ని ఉంచుకుంటారు. వాళ్ళ సైకాలజీ ఒక కుక్క సైకాలజీ: వాళ్లని కొడితే జాలిగా కూస్తూ ఓ మూలకి వెళ్లిపోతారు; ముద్దు చేస్తే వెల్లకిలా పడుకుని గాలిలో కాళ్ళు ఊపుతూ తోకాడిస్తారు.’’
https://www.gutenberg.org/files/37129/37129-h/37129-h.htm
0 comments:
మీ మాట...