October 18, 2023

పెర్ఫెక్ట్ పేజీలు

చదివేటప్పుడు 'ఇది పెర్ఫెక్షన్!' అనిపించటం ఎప్పుడో తప్ప జరగదు. ఒక్క పేరా విషయంలోనైనా సరే. అలాంటిది ఇవాళ మధ్యాహ్నం ఇవాన్ తుర్గెనెవ్ 'ఫస్ట్ లవ్' నవలలో (Andrew R. Macandrew అనువాదంలో) ఏకంగా ఒకటిన్నర పేజీల పెర్ఫెక్షన్ చూశాను (ఆ జోరులోనే ఇందాకటి పోస్టు). నవలను నెరేట్ చేసే పదహారేళ్ల కుర్రాడు తను ప్రేమించిన అమ్మాయి దగ్గర వీడ్కోలు తీసుకొని అర్ధరాత్రి ఇంటికొస్తాడు. అతనికి నిద్ర పట్టని ఆ రాత్రిని రచయిత ఒకటిన్నర పేజీల్లో చెప్తాడు. అక్కడ పెర్ఫెక్షన్ ఏంటీ అన్నది అది చదివితేనే తెలుస్తుంది, కానీ పెర్ఫెక్షన్ ఎలా ఉంటుందీ అన్నది మటుకు ఇక్కడ చెప్పగలను: పదం తర్వాత పదం అది తప్ప ఇంకోటి రావటానికి వీల్లేదన్నట్టే వస్తుంది. వాక్యం తర్వాత వాక్యమూ అలాగే వచ్చికూచుంటుంది. ఆ వాక్యాలతో నీ చుట్టూ విప్పారే ప్రపంచం అసలు ప్రపంచం కంటే రియల్‌గా ఉంటుంది. ఆ వాక్యాల్లో ఉన్నది అంతకుముందు ఏ రచయితా రాయనట్టు, అసలు అలాంటి అనుభవం భాషలోకి రావటం ఇదే తొలిసారి అన్నట్టు ఉంటుంది. అలాంటి స్పష్టతతో, inevitablityతో ఒకటిన్నర పేజీల వచనం చదివాక ఇక యథాలాపంగా ముందుకు చదువుకుంటూపోవటం వీలు కాదు. ఆ ధారాపాతం నుంచి తేరుకుని, 'ఇప్పుడు నాకేం జరిగిందీ' అని గిల్లి చూసుకుని, పేజీలు వెనక్కి తిప్పి, మళ్ళీ చదువుకుంటాం. నేనైతే 'ఫస్ట్ లవ్' నవలలోని ఆ ఒకటిన్నర పేజీలనూ మళ్ళీ చదవటమే కాదు, నా దగ్గరున్న ఇంకో రెండు అనువాదాలు కూడా తీసుకుని ఆ పేజీలు ఎక్కడున్నాయో వెతికి చదివాను. ఇలాంటి పేజీలు లైఫ్ లో ఓ పది దొరికితే గొప్పే మరి! ఇలా ఇంకెప్పుడైనా అనిపించిందా అని ఆలోచించగానే– చప్పున బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ 'అపరాజితుడు' నవల (కాత్యాయని అనువాదం) గుర్తొచ్చింది. ఆ నవలలో కొడుకు లేని సమయంలో సర్వజయ ఒంటరిగా చనిపోతుంది. ఆమె చనిపోయిన రాత్రిని ఒకట్రెండు పేజీలలో అనుకుంటాను చెప్తాడు రచయిత. ఆ పేజీలు చదివినప్పుడూ ఇలాగే, 'ఇది పెర్ఫెక్షన్' అనుకున్నానని గుర్తొచ్చింది. ఇంకా ఆలోచిస్తే ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం చదివిన దాస్తోయెవస్కీ 'క్రైమ్ అండ్ పనిష్మెంట్' నవలలో (Constance Garnett అనువాదంలో) మార్మెలాడోవ్ తాగి వాగే పేజీలు గుర్తొచ్చాయి. ప్రూస్ట్ పేజీలు కొన్ని ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఇవిగాక ఇంకా ఉండే ఉంటాయి. కానీ ఎన్నో ఉండవు. వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. టాలెంటెడ్ రచయితలు మహాయితే ఒక పేరా పెర్ఫెక్ట్ వచనాన్ని ఎప్పుడన్నా రాయగలరేమో. కానీ పేజీని దాటి అలా రాయాలంటే మాత్రం టాలెంట్ కి మించి ఏదో కావాలి. ఆ 'ఏదో' ఉన్నవాళ్లు కూడా ఈ విన్యాసాన్ని వాళ్ళ మొత్తం పుస్తకాల్లో రెండుమూడుసార్లు చేయగలరేమో, అని నా ఫీలింగ్.

0 comments:

మీ మాట...