October 15, 2023

శీత రాత్రులు


ఆ వీధిలో మంచు సుళ్ళు తిరుగుతోంది.

అది చూస్తూ ఇద్దరు.

‘‘గాలి గొలుసులు తెంచుకుని ఊరి మీద పడింది,’’ అన్నాడు ఇవాన్.

‘‘గాలేవన్నా జంతువా గొలుసులేసి కట్టేయడానికి?’’ అన్నాడు సిరిన్.

సరదాకి పేరడీ చేస్తున్నారు చెహోవ్ కథలో మాటల్ని.

ఇద్దరి వయస్సూ ఇరవైల చివర్లో ఉంటుంది. ఒత్తుగా చలికోట్లేసుకొని పేవ్మెంటు మీద నిలబడి ఉన్నారు. జేబుల్లో చేతులు దోపుకొని వీధికి అటువైపు ఉన్న బిల్డింగును చూస్తున్నారు. ముఖ్యంగా ఆ బిల్డింగు పైఅంతస్తులో వెలుగుతున్న కిటికీని. వీధిలో పరిస్థితి ఇలా ఎంతోసేపు నిలబడి ఎదురుచూసేలా లేదు. విసురుగా రాలుతున్న మంచు తరకలు కనురెప్పలపై పొరకడుతున్నాయి, చర్మంలోకి కరుగుతున్నాయి. టోపీల మీద, భుజాల మీద మంచు పేరుకుపోతోంది.

‘‘ఎప్పుడూ ఇంట్లోకి నేరుగా పోయేవాళ్ళం కదా… ఇవాళేంటి బైటే నిలబెట్టాడు?’’ అన్నాడు ఇవాన్.

‘‘మొగుడూపెళ్లాలు ఏదో గొడవ పడుతున్నట్టున్నారు,’’ సిరిన్ జవాబు.

‘‘మాయదారి పెళ్ళిళ్ళు,’’ నవ్వాడు ఇవాన్.

ఎవరో వీధి మలుపు తిరిగారు– భుజం మీద నిచ్చెనతో, ఇంకో చేతిలో కిరసనాయిలు డబ్బాతో, ఒక గడ్డం ముసలాడు. మంచులో బూట్లను ఎత్తివేస్తూ దీపస్తంభం వైపు నడుస్తున్నాడు.

‘‘దేవుడు ఇలాంటి చలిరాత్రుళ్ళలో మనుషుల మీద నిఘా పెట్టడానికి ఇలా దీపాలు వెలిగించే మనిషిలా వస్తాడని నా అనుమానం,’’ అన్నాడు ఇవాన్.

సిరిన్ ఇవాన్ ముఖంలోకి చూశాడు. ‘‘నీకు దేవుడంటే పడదు కదా?’’

“కవిత్వానికీ పనికి రాడంటావా?”

ముసలాడు దీపస్తంభానికి నిచ్చెన ఆనించి, మెల్లగా కష్టంగా పైకి ఎక్కాడు. దీపం బుడ్డికి ఉన్న గాజు తలుపు తెరిచాడు. నిచ్చెన మెట్ల మీద బొజ్జతో ఆనుకుని, జేబులోంచి అగ్గిపెట్టె తీసి, గాలికి కొడి ఆరిపోకుండా చేతుల మధ్య కాస్తూ, వొత్తి వెలిగించాడు.

దీపం మొదట ముసలాడి ముఖాన్ని వెలిగించింది. అది జీవితం నేలకేసి కాలరాసిన ముఖం. బహుశా ఇంట్లో ఆయాసంతో దగ్గే భార్య, ఆకలికి ఏడ్చే పిల్లలు, వీధుల్లో విటుల కోసం నిలబడే పెద్దకూతురు…. ఇవాన్ కి ఇప్పుడా ముఖంలో దేవుడు పోయి మనిషే మిగిలాడు.

ముసలాడు కిందకి దిగి నిచ్చెన భుజం మీద పెట్టుకున్నాడు. కొత్తగా తోడొచ్చిన తన నీడని వెంటేసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ వీళ్ళిద్దరే మిగిలారు, గాలి హోరు వింటూ. దీపం వెలుగులో మంచు తరకల విసురు ఇంకా బాగా తెలుస్తోంది.

‘‘ఏమన్నా రాస్తున్నావా?’’ అన్నాడు సిరిన్.

ఇవాన్‌ కి తన గదిలో చెత్తబుట్టలో నలిగిన కాయితం ఉండలు గుర్తొచ్చాయి. ‘‘ఏమీ రాయటం లేదు. నువ్వు?’’

సిరిన్ ఆ ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్నట్టు మొదలుపెట్టాడు. ‘‘ఒక కథ ఊహించాను. రాయగలనో లేదో తెలీదు. ఊహలో అయితే అంతా సిద్ధంగా ఉంది.’’

‘‘చెప్పూ…’’

‘‘రచయితల కథే. ఒక పేరున్న నవలా రచయిత, నడివయసు మనిషి, స్నేహశీలి. అతని ఇంటికి కవులూ రచయితలూ వచ్చిపోతుంటారు. ఇంట్లో మనుషుల్లాగ మెసిలి వెళ్తుంటారు. ముఖ్యంగా, ఒక కుర్రకవి ఈమధ్య ఎక్కువసార్లు వస్తుంటాడు. వంటగదిలోకి వెళ్ళిపోయి వడ్డించుకునేంత చనువు సంపాదిస్తాడు. వీడంటే ఆ రచయితకి అభిమానం. కానీ వీడు, ఈ కుర్రకవి మాత్రం, సినికల్…. మనుషులంటే చులకన. వాళ్ళని కఠినమైన లెక్కల్లో కొలుస్తాడు. నిజానికి వీడికి ఆ రచయితంటే కూడా పెద్ద గౌరవం ఏం ఉండదు. అతని కంటే గొప్పోడినని నమ్ముతుంటాడు. ఇప్పుడు, వీడి కన్ను ఆ రచయిత భార్య మీద పడుతుంది. ఆమెకి ఈ రచయితల, కవుల గోలేమిటో ఏం తెలీదు. వండిపెట్టడం అంటే ఇష్టమంతే. వీలు లేనప్పుడు వండాల్సొస్తే విసుగు కూడా. ఈ కుర్రకవి తెలివిగా ఏకాంతాలు కల్పించుకుని ఆమెకి దగ్గరవుదామని చూస్తాడు. ఆమె వీడి మాటలకి లొంగుతుంది. దగ్గరకు రానిస్తుంది. మొత్తం మీద ఒక రోజు, ఆమె భర్త హాల్లో తాగి తాగి పడిపోయాకా, ఆ ఇంట్లోనే, వాళ్ళ పడకగదిలోనే, ఆమెతో కలుస్తాడు. అలా మొదలైన వాళ్ళ వ్యవహారం కళ్లుగప్పి సాగుతూ ఉంటుంది. ఇదంతా నేపథ్యం అనుకో. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. కుర్రకవే నెరేట్ చేస్తూంటాడు. వాడు ఆ సాయంత్రం రచయిత ఇంటికి అతని భార్యతో ఇంకో రాత్రిని ఊహించుకుని వెళ్తాడు. ఎప్పటిలాగే రచయితతో మందు తాగటానికి కూర్చుంటాడు. మధ్యమధ్యలో నీళ్ళకనో, టాయిలెట్ కనో లోపలికి వెళ్లి, పిల్లాడిని నిద్రపుచ్చుతున్న ఆమెని కదిపి వస్తుంటాడు. మళ్ళీ రచయిత దగ్గరకు వచ్చి కూర్చుని సాహిత్య చర్చ చేస్తుంటాడు. వాళ్ళు ఆ చర్చలో ఉండగా, కాసేపటికి, లోపలి నుంచి ఆమె కేకలు వినపడతాయి. కంగారుగా లోపలికి వెళ్తారు. ఆమె పిల్లాడిని మోసుకుంటూ గుమ్మంలో ఎదురవుతుంది. వాడి నోట్లోంచి నురగలు. వెంటనే ముగ్గురూ ఆసుపత్రికి పరిగెడతారు. దారంతా ఆమె గగ్గోలుగా ఏడుస్తుంది. ఏదో తినకూడనిది తిన్నాడు కానీ ప్రమాదమేం లేదంటాడు డాక్టరు. పిల్లాడిని రాత్రికి ఆసుపత్రిలో ఉంచాలి. భార్యాభర్తలు కాస్త కుదుటపడతారు. కుర్రకవి సిగరెట్ తాగటానికి బైటికి వస్తాడు. కోరిక తీరక విసుగ్గా ఉంటుంది వాడికి. ఇక్కడికి ఎందుకొచ్చాడో, తనకేం సంబంధమో అర్థం కాదు. అలా సిగరెట్ తాగుతూ బైట పచార్లు చేస్తుండగా, ఒక దృశ్యం కనిపిస్తుంది. లోపల ఆసుపత్రి వరండాలో, గోడ వారన ఉన్న బెంచీ మీద, ఆ భార్యాభర్తలిద్దరూ కూర్చుని ఉంటారు. ఆమె అతని భుజం మీద తలవాల్చింది. అతను ఆమె తల నిమురుతున్నాడు. ఈ దృశ్యం చూసి కుర్రకవి కాసేపు కదలకుండా నిలబడిపోతాడు. నిశ్శబ్దంగా వెనక్కి నడుస్తాడు. ఒక్కడూ తన గదికి వెళ్ళిపోతాడు.’’ – సిరిన్ చెప్పటం ఆపి ఇవాన్ వైపు చూస్తున్నాడు.

‘‘అంతేనా?’’

‘‘అంతే.’’

ఇవాన్ గట్టిగా నవ్వాడు. ఆ నవ్వులోని వెక్కిరింత సిరిన్ కి తెలుస్తుందీ అనిపించేదాకా నవ్వాడు. అతని ముఖం జేవురించిపోయింది. ‘‘ఇంత ఎడ్డి కథ రాయగలవని ఎప్పుడూ అనుకోలేదు. చచ్చుపుచ్చు నవలల్లో అరిగిపోయిన ఆసుపత్రి క్లయిమాక్స్ తో సహా ఏ క్లీషేనీ వదల్లేదు. ఏం చెప్పాలనుకుంటున్నావ్ అసలు? ఎట్లాగో నీ అంతటి గొప్పోడికీ ఆరోగ్యవంతుడికీ పెళ్ళయిందని, ఇప్పుడు వివాహ వ్యవస్థకి స్తోత్ర వచనాలు రాసే పనిలో పడ్డావా, ఎంతటి రొచ్చులోనయినా ముంచి తీసి దాని ఔన్నత్యాన్ని నిరూపించాలని పూనుకున్నావా? ఒకవేళ ఆ భర్తే పనికిమాలినోడైతే? రేపు వాడి భార్యా ఆ కవీ లేచిపోయి పెళ్ళి చేసుకుని పిల్లాపాపలతో సుఖంగా పవిత్రంగా బతికి ముసలివాళ్లయిపోతే? అప్పుడేమవుతుంది నీ థియరీ? పాపాలూ పుణ్యాలూ, వాటికి తగ్గ ఫలితాలూ అని మరీ ఎడ్డి మాటలైతే మాట్లాడవనే అనుకుంటున్నాను. మనుషుల గురించి మాట్లాడు బాబూ, ఇంస్టిట్యూషన్ల గురించి కాదు.’’

‘‘నేను మనుషుల గురించే మాట్లాడుతున్నాను. ఈ కుర్రకవి లాంటోడికి… నువ్వు చెప్తున్నట్టు ఆమెతో కథ సుఖాంతం కాదు. నా ఉద్దేశం పెళ్ళి గురించి గొప్పగా రాయాలని కాదు. వాడే ఎంత జాలిపడాల్సిన కేరెక్టరో చూపించాలని. అలాంటి వాడికి ఏదీ నిలబెట్టుకోవడం రాదు. అసలు కూల్చటం తప్ప, కట్టుకోవటం చాతకాదు. బహుశా రాస్తే నీకు బాగా అర్థమయ్యేదేమో.’’

‘‘నీ అసంప్షన్లకి తగ్గట్టూ పాత్రలని కల్పించేసి వాళ్ళు నిజం మనుషులని నమ్మించలేవు. అలాంటి మనిషి గురించి నీకు ఏం తెలుసు? వాడి లోకం, దాని ఒంటరితనం, అందులోని దెయ్యాలూ… అవేం నీకు తెలియకుండా వాడి గొంతుతో కథ ఎలా చెప్తావు? నువ్వేం రాసినా వాడి మీద నీకు ఉన్న అభిప్రాయం బైటపడుతుందే తప్ప, వాడు నీ కథలోకి రాడు.’’

సిరిన్ జవాబు ఇచ్చే ప్రయత్నం చేయలేదు. నవ్వుతూ, ఒహో అలాగా అన్నట్టు తలాడించాడు. ఏదో గెలిచినట్టే ఉన్న ఆ నవ్వు చూస్తే– అసలు అతనికి ఈ కథ రాసే ఉద్దేశమే లేనట్టూ, తనకి చెప్పటానికే ఇదంతా అప్పటికప్పుడు కల్పించినట్టూ అనిపించింది ఇవాన్ కి.

వీధిలో అలికిడైంది.

గుర్రపు డెక్కల కింద మంచు నలుగుతున్న పొడిపొడి శబ్దం.

ప్రాణం వచ్చిన నీడల్లా వున్న రెండు గుర్రాలు స్లెడ్జి బండిని లాగుతూ వీధి మలుపు తిరిగాయి. ఆ బండి ఎదురుగా ఉన్న బిల్డింగు దగ్గర ఆగింది. ఇందాకటి నుంచీ వీళ్ళు చూస్తున్న పైఅంతస్తు కిటికీ తెరుచుకుంది. ఒక తల బైటికి తొంగి చూసి మళ్ళీ తలుపేసుకుంది.

కాసేపటికి కింద తలుపు తెరుచుకుంది. ఒకామె భుజానికి సంచితో, చేతిలో పెట్టెతో బైటికి నడిచి వచ్చింది. స్లెడ్జి బండివాడు ఆమె చేతుల్లోంచి బరువు అందుకొని సర్దుతున్నాడు. ఆమె వెనకే చలిదుస్తుల్లో ఊలుబంతిలా ఉన్న పిల్లాడు గెంతుతూ వచ్చాడు. వాడు గుర్రం కళ్ళేలని పట్టుకొని లాగుతున్నాడు. వీళ్ళ వెనకే ద్వారంలోంచి మరొక మనిషి వచ్చాడు. అతను గొర్రె తోలుతో చేసిన పొడవాటి కోటు వేసుకుని ఉన్నాడు. బైటికి రాగానే ఏం చేయాలో తెలియనట్టు కాసేపు నిలబడ్డాడు. తర్వాత కళ్ళేలు లాగుతున్న పిల్లాడిని ఎత్తుకున్నాడు. వాడి చెంపల మీద ముద్దులు పెట్టుకున్నాడు. వాడిని బండిలో కూర్చున్న ఆమెకి అందించాడు. బండివాడు వీడ్కోలు మాటలకి సావకాశం ఇవ్వడానికి అన్నట్టు బండి నిలిపి వెనక్కి చూశాడు. కానీ అవేం జరగలేదు. ఆమె కదలమన్నట్టు సైగ చేసింది. స్లెడ్జి బండి చుట్టుతిరిగి వెళ్ళిపోయింది. అతను ఒక్కడూ మిగిలాడు. ద్వారం వైపు కదలబోయి ఏదో గుర్తొచ్చినట్టు ఆగాడు. వీధంతా కలయజూశాడు. వీళ్ళిద్దరూ కనపడ్డారు. రమ్మని చేయి ఆడించి బిల్డింగులోకి వెళ్లాడు.

ఇవాన్, సిరిన్ ఇద్దరూ వీధి దాటి అటువైపు నడిచారు. అతని వెనకే మెట్లెక్కారు. ఓ మాట లేకుండా, ఓ పలకరింపు లేకుండా, వెనక్కి కూడా తిరిగి చూడకుండా, అతను బరువుగా మెట్లెక్కి తలుపు తీసి లోపలికి వెళ్లాడు.

ఇంటి లోపలి వెచ్చదనానికి ఇద్దరికీ ప్రాణం లేచొచ్చింది. ఓ మూల పొగలు కక్కుతున్న సమోవార్ ఎంతో అందమైన దృశ్యంలాగ కనపడింది. అది పెద్ద హాలే, కానీ ఫర్నిచర్ నిండుగా ఉండి, పుస్తకాలు గుట్టలుగా పేరుకుని ఇరుకుగా ఉంది. ఆ ఇరుకు కూడా వెచ్చగా బావుంది. టీపాయి ముందున్న రెండు వింగ్ చెయిర్లలో ఇద్దరూ కూర్చున్నారు.

‘‘మీరిద్దరూ తాగండి. నేను ఆల్రెడీ కొంచెం పుచ్చుకున్నాను. టీ తాగుతాను,’’ అంటూ ఒక చేత్తో వోడ్కా సీసాను, ఇంకో చేత్తో రెండు గ్లాసులను తెచ్చి టీపాయి మీద ఉంచాడు సోమొవ్.

తర్వాత సమోవార్ ను చేతుల్లో మోస్తూ, ఆ బరువుకు తంటాలు పడుతూ నడిచి, గదికి అటువైపు ఉన్న డైనింగ్ టేబుల్ మీద పెద్ద చప్పుడుతో దాన్ని ఉంచాడు. అక్కడే కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. ఆ టేబిల్ పైన వేలాడే గ్యాస్ లైటు వెలుగులో అతని తల మీద పల్చబడిన వెంట్రుకలు మెరుస్తున్నాయి. కుళాయి తిప్పి వెచ్చని ద్రవాన్ని కప్పులోకి పోసుకున్నాడు. కప్పులోంచి పైకి తేలే ఆవిర్లలో అరిచేతులు కాచుకుంటున్నాడు. ఈ కాసేపట్లోనే ఇంటికి అతిథులు వచ్చారన్న సంగతి మర్చిపోయినట్టు, ఇటువైపు అసలు చూడకుండా, టీ జుర్రుకుంటున్నాడు.

‘‘ఏమైంది మీకు? మామూలుగా లేరు?’’ అన్నాడు సిరిన్.

సోమొవ్ తేరుకుని ఇటు చూశాడు. అతని వెనక అల్మరాలో బహుమతి పతకాలేవో వరుసగా పేర్చి ఉన్నాయి. అతని ముఖం వాటిలో ఒకటి అన్నట్టు ఉంది. గట్టిగా నిట్టూర్చి కుర్చీలో వెనక్కి వాలాడు. ‘‘చాలా సేపు వెయిట్ చేయించినట్టున్నాను మిమ్మల్ని,’’ అన్నాడు.

‘‘అది సర్లెండి. మీరేంటో తేడాగా ఉన్నారు ఇవ్వాళ. సిస్టర్ ఎక్కడికో వెళ్తున్నట్టుంది?’’ అన్నాడు సిరిన్, బిరడా తీసి వోడ్కా పోసుకుంటూ. ఇవాన్ ఈ ప్రశ్నలకు ఏం జవాబు వస్తుందా అన్నట్టు సోమొవ్ ముఖంలోకి తదేకంగా చూస్తున్నాడు.

‘‘మనలాంటి వాళ్లకి ఈ పెళ్ళిళ్ళూ సంసారాలూ నప్పవయ్యా! కానీ యవ్వనంలో మనకన్ని తెలివితేటలు ఉండవు కదా. మనమూ అదే వయసులో ఉన్న అందర్లాంటి వాళ్ళమే కదా. లోపల రసాయనాలు ఊరుతుంటాయి. మనల్ని ఆడిస్తూంటాయి. ఆ జోరుకి ఎందులో ఒకందులో ఏముందిలెమ్మని దిగిపోతాం, ఇరుక్కుపోతాం. ముఖ్యంగా అవతలివాళ్ళతో అభిరుచులు కలవకపోయినా నెట్టుకువద్దామని చూస్తాం చూడు. అది ఎంతో కాలం సాగదు. ఆమెని నాకు తగినట్టు మలుచుకుందామని, నాతో పాటు నా ఇంటెలెక్చువల్ జర్నీలో భాగం చేద్దామని, మానవ ప్రయత్నం అంతా చేశాను, ఈ ఇరవై ఏళ్ళలో. కానీ వాళ్ళ స్థాయికి మనల్ని దిగలాగాలని చూస్తారు చూడు! ఏం చేయగలం అప్పుడు?’’

మాట్లాడుతూ నములుతున్న బిస్కెట్ పొడి సోమొవ్ మీసానికి అంటుకుంది. మనిషి ఒకే రోజులో ఎంతో వయసుమళ్ళినట్టు కనిపిస్తున్నాడు.

‘‘గొడవలు ఉంటాయి కదా. వెళ్తారు వస్తారు, వెళ్తారు వస్తారు. సీనియర్లు మీకు తెలీందేముంది,’’ అన్నాడు సిరిన్.

‘‘ఇది అలాంటిది కాదు. అలిగి ఊరెళ్ళిపోవటాలు… అలాంటివి ఎప్పుడూ లేవు. నేననుకోవటం ఇది ఇక్కడితో ఆఖరు. కట్ కట్ కటీఫ్! ఇవాన్, నీకు చెపుతున్నాను గుర్తుంచుకో, పెళ్ళి మాత్రం చేసుకోకు. వొంటి కోసమనో వంట కోసమనో లొంగిపోతావేమో. అస్సలొద్దు. సరేనా?’’

సిరిన్ ఓరగా కళ్ళు మాత్రం తిప్పి ఇవాన్ వైపు చూశాడు.

ఇవాన్ రాని నవ్వు పెదాల మీద పులుముకున్నాడు. సిరిన్ వైపు చూడకుండా ఉంటానికి ప్రయత్నించాడు. ‘‘ఇంతకీ ఏ ఊరు?’’ అన్నాడు.

‘‘ఏంటి?’’ అన్నాడు సోమొవ్ అర్థం కాక.

‘‘అహ… ఏ ఊరు వెళ్లారు అని అడుగుతున్నా.’’

ఊరి పేరు చెప్పి మళ్ళీ తన ధోరణిలో మాట్లాడుతూనే ఉన్నాడు సోమొవ్: ‘‘ప్రాకృతిక వచన శిల్పి అని మళ్ళీ గొప్ప పేరు నాకు. యూనివర్సిటీలోనేమో ఫిజిక్స్ ఈక్వేషన్లు చెప్తాను. కానీ ఆడదాని ప్రకృతి, అనుబంధాల ఈక్వేషన్లూ… అసలేం తెలియవు నాకు. నమ్మటం తెలుసు. మనుషుల్ని నమ్మటం… ప్చ్…!’’

ఇవాన్ పైకి లేచి నిలబడ్డాడు. ‘‘ఏమనుకోకండి. ఇప్పుడే గుర్తొచ్చింది. నేను ఒక చోటుకి వెళ్ళాలి,’’ అన్నాడు.

జవాబుగా సోమొవ్ ఏమంటున్నాడన్నది పట్టించుకోకుండా, సిరిన్ చూపుల్ని ఖాతరు చేయకుండా, క్షణాల్లో వాళ్లని వదిలించుకొని, పెద్ద పెద్ద అంగలేసుకుంటూ మెట్లు దిగి, మళ్ళీ మంచు పేరుకున్న వీధిలోకి వచ్చాడు. ఇందాక స్లెడ్జి బండి వెళ్ళిన జాడలు కూడా కప్పడిపోతున్నాయి. మంచు మీద ఎంత వేగంగా పరిగెత్తగలడో అంత వేగంగా పరిగెత్తాడు. వీధులు దాటాడు, వంతెన దాటాడు. ఆ మలుపులో గుర్రాలు లాగే ట్రామ్ ఒకటి కదులుతూ కనపడితే, అందులోకి దూకాడు.

మనసు వేగం ఒకలా ఉంటే, ట్రామ్ వేగం మరోలా ఉంది. ఇవాన్ తప్పించి ఇద్దరే ప్రయాణికులు ఉన్నారు. ఇద్దరూ నిద్రకు జోగుతున్నారు. డ్రైవరు, కండక్టరు ముందుభాగంలో నిలబడి మాట్లాడుకుంటున్నారు. కూర్చోబుద్ధివేయక ఇవాన్ మెట్ల దగ్గరే నిలబడ్డాడు. కొన్నాళ్ళ క్రితం ఇదే ట్రాములో ఆమెతో కలిసి వెళ్ళటం గుర్తొచ్చింది. ఆమె ఇంట్లో ఏదో సాకు చెప్పి బైటికి వచ్చింది. ఇద్దరూ ఇదే మెట్ల మీద నిలబడ్డారు. ఆమె పైమెట్టు మీద ఉందికదాని ఆ మెట్టు ఎక్కాడు. ఎక్కగానే ఆమె కింది మెట్టు మీదకి దిగి నవ్వింది. అవి తొలి రోజులు. చనువు ఇంకా రాలేదు. తాకాలని తపించేవాడు. దుస్తుల వెనక ఆమె పచ్చటి శరీరం వైనం దొరక్క ఊరించేది. ఆ రోజు ఇద్దరూ స్కేటింగ్ రింక్ కు వెళ్ళారు. వీళ్ళు చేరేసరికి ఆ ఆవరణ అంతా కేరింతలు కేరింతలుగా ఉంది. చుట్టూ బర్చ్ చెట్లు మంచు బరువుకి వొంగిన కొమ్మలతో పండగ బట్టలు వేసుకున్నట్టు ఉన్నాయి. మంచునేల మీద మనుషులు జారుతూ, అదుపుతప్పుతూ, నిలదొక్కుంటూ సంతోషంగా ఉన్నారు. ఇద్దరూ స్కేటింగ్ బూట్లు తొడుక్కొని ఆ సందడిలో ప్రవేశించారు. గిర్రుమని తిరగటాల్లో, గుద్దుకోవటాల్లో, తూలితే పట్టుకోవటాల్లో ఆమె భుజాలు, నడుము, పక్క రొమ్ములూ అన్నింటి మెత్తదనమూ ఆ రోజు తెలిసింది. వొంట్లో రక్తానికి బదులు పొగలు కక్కే వేడి మదం పారుతున్నట్టు కాలిపోయాడు.

ట్రామ్ మెట్ల మీద చలి భరించలేనట్టే ఉంది. లోపలికిపోయి కూర్చున్నాడు. ట్రామ్ బోర్డు మీద చిరిగిన టిక్కెట్లను, ఆ ఇనుము మీద అల్లికనూ చూస్తున్నాడు. ఇప్పుడు ఆమె కోసం ఎందుకు వెళ్తున్నాడో తెలీదు. వెళ్ళాలని మాత్రం తెలుసు. ‘‘అసలు ఏం జరిగుంటుంది? తెగదెంపుల దాకా ఎలా వెళ్ళింది? ముందుముందు ఏం చేద్దామని? మొన్న నా సంపాదన గురించి అడిగింది; అంటే వెనక్కి వస్తుందా, నాతో జీవితాన్ని ఊహించుకుంటుందా?… రెండు గదుల ఇంట్లో ఆమెతో, పిల్లాడితో సంసారం… నేను సిద్ధమేనా ఆ బాధ్యతకి. మరి నా ఆశయాలు, ఇంటెలెక్చువల్ ఏస్పిరేషన్లు? నాకు ఒక్కోసారి వాటిలోనే అర్థం కనపడదే, ఇక ఈ సిసిఫస్ బండని ఎలా భుజాన్నెత్తుకోగలను. ఉనికే బరువైనవాడ్ని ఇంకో జీవానికి ఎలా పూచీపడగలను. చిరుగుల ఓవర్ కోటు తొడుక్కొని గుమాస్తా ఉద్యోగం… జీవితం అంటే ‘ఇంతే, ఇదే’ అని అనుక్షణం తెలిసిపోవటం… భరించగలనా? కానీ మరి ఆమెతో ఉంటే ఆనందంగా గడిచే క్షణాలో…? కథల్లో కవిత్వంలో కనపడే దాంపత్య జీవితం… పియానో సంగీతాన్ని, కాంతులీనే నగరాన్ని, వంతెన కింద నదిని, పొప్లార్ చెట్ల మధ్య ఏకాంతాన్ని కలిసి పంచుకోవటం… గదిలోంచి గదిలోకి నడుస్తుంటే తగిలే భుజాలు, రాత్రుళ్ళు ఒత్తిగిలితే శ్వాసించే ఓ నిండైన సమక్షం, అద్దంలోంచి ఓరగా నిన్నే నిమిరే చూపులు, ఇద్దరూ కలిపి రాసుకునే రోజులు…. కానీ, కానీ… ఆ ఒకానొక్క మనిషీ ఆమేనా? ఎలా తెలుస్తుంది? ఏదన్నా తేడాకొట్టి ఇరుక్కుపోతే? ఏం తెలుసు ఆమె గురించి నాకు, ఏం మాటలుంటాయ్ ఆమెతో నాకు, అసలేముంది మా మధ్య– గుట్టుగా, అరుదుగా తీర్చుకోవాల్సి రావటం వల్ల విలువ పెంచుకున్న కోరిక తప్ప. ఆమె నేలబారు లోకం, కొసకొచ్చేసిన యవ్వనం, గరుకుబారిన మనసూ… ఏం చేసుకోవాలి నేను….’’. ఇవాన్ ఆలోచన ఆ మూల నుంచి ఈ మూలకి లోలకంలా ఊగుతోంది. తెరుచుకున్న మరుక్షణమే మూసుకుపోబోయే తలుపు ముందు నిలబడి, లోపలికి వెళ్ళాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోవాల్సిన పరిమిత క్షణంలో ఇరుక్కుపోయినట్టు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.

రైల్వేస్టేషను దాదాపు నిర్మానుష్యం. దీపాల కింద ఒకరిద్దరున్నారు, దుస్తులు గాలికి చెదురుతూ. ఇవాన్ ప్లాట్ఫాం మీదకు పరుగెడుతూ రైలు కిటికీల్లో వెతుకుతున్నాడు. ఇక చివరాఖరి బోగీ ఉందనగా, తలతిప్పితే, మసగ్గా వెలుగుతోన్న ఒక కిటికీలోంచి, ఆమె కనపడింది. ఆమెను చూడకముందే ఆమె తనను చూసిందని అర్థమైంది. కానీ పిలవాలన్న సన్నాహమేమీ ఆ ముఖంలో లేదు. అతను చూసుండకపోతే దాటివెళ్ళిపోనిచ్చేదేమో కూడా! కిటికీ దగ్గరకు వెళ్ళి అద్దం మీద మంచు తుడిచాడు. రైలుపెట్టె లోపల వెచ్చగా, తీరుబడిగా ఉన్న లోకం లోంచి ఆమె అతన్ని చూస్తోంది. కిందకి రమ్మని సైగ చేశాడు. వొడిలో నిదురపోతున్న పిల్లాడిని పక్కన సర్దింది. ఎదుటకూర్చున్న ప్రయాణీకులకి అప్పజెప్పి లేచింది.

అతను కోటులో చేతులుంచుకుని, అదిరే గుండెని పెద్ద ఊపిర్లతో స్థిమితం చేసుకునేందుకు ప్రయత్నించాడు. గాలి జోరుకి ఎక్కడో ఇనుపరేకు ఆగి ఆగి కొట్టుకుంటోంది. ఒక రైలు కార్మికుడు చేతిలో లాంతరుతో రైలు వారన పరిగెడుతున్నాడు. ఉన్నట్టుండి మర్లిన గాలికి పెట్టెమీద పేరుకున్న మంచు తుంపరగా రాలింది. ఆమె తలుపు దగ్గర నిలబడింది. నీలిరంగు గ్లోవ్ వెనక మెత్తదనాన్ని అందుకున్నాడు. ఎదురుబొదురు ముఖాలతో నిలబడ్డారు.

‘‘ఏంటి ఇంత హఠాత్తుగా… ఎక్కడికి వెళ్తున్నావ్?’’

‘‘మా ఊరికి’’

‘‘నాకెందుకు చెప్పలేదు?’’

‘‘మనిషికిచ్చి ఉత్తరం పంపించాను. నువ్వు ఇక్కడికి రాకపోతే ఈపాటికి నీకు అందే ఉండేది.’’

బహుశా ఇప్పుడు తన గది తలుపు కింద పడివుండే ఆ ఉత్తరం అతని మనసులో మెదిలింది. అది తెరిస్తే ఎప్పటిలాగే ఒక పట్టాన అర్థం కాని దస్తూరి, ఒత్తులూ కామాలూ ఫుల్‍స్టాపులూ లేకుండా, కుడివైపు పల్లంలోకి పారే వాక్యాలు… అవి అక్కడ ఏం చెపుతున్నాయో తెలియకుండా– తను ఇక్కడ ఏం మాట్లాడాలి….

‘‘ఏం రాశావు?’’

‘‘వెళ్ళాక చదువుకో.’’

‘‘… … …’’

‘‘… … …’’

‘‘అసలేమైంది… దేని గురించి గొడవ?’’

‘‘నువ్వే అని తెలీదు గానీ, నాకు ఎవరితోనో నడుస్తుందని అతనికి అర్థమైంది. ఎప్పుడు అడగాలనుకున్నాడో, అసలు అడగాలనుకున్నాడో లేదో మరి… ఈలోగానే అతనికి తెలిసిందని నాకూ అర్థమైంది. ఇక అడగక తప్పని పరిస్థితి నేనే కల్పించాను.’’

అతని మీదుగా వెనక్కి చూస్తున్న కళ్ళతో మాట్లాడుతోంది. ఆమె చెయ్యి ఇంకా రైలుపెట్టె తలుపు దగ్గరి కడ్డీని పట్టుకునే ఉంది. మెడ చుట్టూ ఉన్న వస్త్రం గాలి వాలుకి తగ్గట్టు కాసేపు వెనక్కి రెపరెపలాడుతోంది, కాసేపు చెంపలకేసి రాసుకుంటోంది.

‘‘అయితే వెళ్ళిపోవాలన్న నిర్ణయం నీదే అన్నమాట.’’

అవునన్నట్టు తల ఊపింది.

‘‘మరి… నేను?’’

అతని కళ్ళల్లోకి చూసింది…. ‘‘ఏంటి మరి నువ్వు?’’

‘‘మనం…!’’

నవ్వింది.

‘‘ఏంటి?’’ అన్నాడు.

‘‘మనం ఏంటో నీకు తెలుసు కదా,’’ అంది.

దెబ్బతగిలినట్టు ఆగాడు. మనసులోంచి ప్రేమభావం నిండిన మాటలు చెమ్మగా ఊరాయి. కానీ అప్పటిదాకా కవ్వింపులు, కొంటెతనాలుగా నడిచిన బంధంలోకి అలాంటి మాటలు రాలేమంటున్నాయి. ‘‘ఏం రాశావో చెప్పచ్చు కదా ఉత్తరంలో…?’’ అన్న మాట మాత్రం మెత్తగా, బుజ్జగింపుగా అనగలిగాడు.

‘‘పోయి చదువుకో తెలుస్తుంది.’’

ఆమె చేయి పట్టి గుంజి గట్టిగా అడగాలని ఉంది. చాటుమాటు సమయాల చనువంతా ఎక్కడ తప్పిపోయిందో అర్థం కావటం లేదు.

ఈలోగా ఆమే మాట్లాడింది. ‘‘ఏ బంధానికైనా మనం ఏ విలువ ఇస్తామో అదే కదా ఉండేది,’’ అంది.

‘‘ఆ వాక్యానికసలు ఏమైనా అర్థం ఉందా?’’ విసురుగా అన్నాడు. అనుకోకుండానే గొంతులోకి వెక్కిరింత తోసుకొచ్చింది.

కళ్ళు అతని వైపు తిప్పింది. ‘‘నాకు మీలా వాక్యాలు అల్లటం రాదు మరి.’’

ఆ ‘‘మీలా’’ అన్న మాట లోలోపలికి వచ్చి పొడిచింది.

‘‘అతనూ నేనూ ఒకటేనా?’’

ఆమె దానికి జవాబు ఇవ్వలేదు కానీ, ఆలోచించి, నింపాదిగా మాట్లాడింది. ‘‘నా జీవితంలో ఈ ఇరవై ఏళ్ళల్లో నేను సంపాదించుకున్నది ఏమైనా ఉంటే, అదిగో, ఆ లోపలున్న జీవం ఒకటే. ఇంకేదీ వెంట తీసుకెళ్ళేది కాదు.’’

ఇక్కడే వదిలేసే అన్నింటిలో తను కూడా ఒకడన్నమాట. అలా కాదని వాదించేందుకు, ఒప్పించేందుకు తమ బంధంలోంచి రుజువులేమైనా తెచ్చి చూపించగలడా… కాసేపటి క్రితం కూడా మనసులో అన్ని అనుమానాలున్నవాడు కదా! ఇప్పుడు ఆమెకూ ఈ బంధం మీద ఏ భ్రమలూ లేవన్న నిజం తెలిశాక కదూ– ఆమెలో అంతకుముందు చూడని లోతేదో తెరుచుకున్నట్టయి, ఆమె కావాలనిపించేది? కానీ ఆమె దక్కినా ఒరిగేది ఏముంది… మనిషంత పుండుని ఓ చామంతి రేకు ఏం నయం చేయగలదు….

వెనక నుంచి రైలు కూత వినపడింది.

ఆమె అటు చూసి మళ్ళీ అతని కళ్ళల్లోకి చూసింది. మొదటిసారి వాటిలో ఏదో అక్కర.

‘‘నీకు జీవితం నుంచి చాలా కావాలి. నన్నేం చేసుకుంటావ్ చెప్పు?’’ అంది.

జవాబేం అక్కర్లేదన్నట్టు మెట్లు ఎక్కి లోపలికి వెళ్లింది.

రైలు కదిలింది.

కదులుతోన్న ఆ ద్వారం అతని మనసుకి కొక్కెం వేసి వెంట గుంజుతోంది. అయినా నిలదొక్కుకొని అతని శరీరం రైలు పెట్టెలన్నీ వెళ్ళిపోయేదాకా అక్కడే నిలబడింది. ఆఖరు బోగీ మిగిల్చిన ఖాళీలోకి మంచు తరకలు గిర్రున ఎగిరాయి.

వెనక్కి తిరిగి నడిచాడు.

* * *

నిద్ర పాలించే దేశం నుంచి రోజూ వెలివేయబడే శాపగ్రస్త జనాభాలో ఎప్పటిలాగే అతనున్నాడు. మంచం మీద పడుకొని దూలాల వైపు చూస్తున్నాడు. తలవైపు మంచం కోడులో ఏదో పురుగు ఆగి ఆగి చెక్కని గీరుతున్న చప్పుడు… అది నేరుగా మెదడులోనే దేన్నో గీరుతున్నట్టు ఉంది. పక్కన గోడకున్న పగులులోంచి బొద్దింక పిల్ల తలబైటపెట్టి చూసి మీసాలు ఊపి లోపలికి వెళ్ళిపోయింది. నిద్ర రాదు. దృశ్యం నుంచి విముక్తి లేదు. లేచి దీపం ఆర్పి వచ్చి మళ్ళీ మంచం మీద కూర్చున్నాడు. అమలినమైన చీకటి… కానీ ఈ చీకటిలో అతని భయాలు రూపం తెచ్చుకుంటాయి, చీకట్లో కూడా కనిపిస్తాయి. ఇప్పుడు తలుపు మూల ఒక దయ్యం ఉంటుందని అతనికి తెలుసు. అది ముసలిది. అట్టలు కట్టిన జుట్టుతో, వొంకర్లు తిరిగిన గోళ్ళతో, ఎర్ర బారిన కళ్ళతో, వికృతమైన నవ్వు దానిది. ఇప్పుడు కొంటెతనంగా చేతిలోని కర్రతో నేల మీద టక్కుటక్కుమని కొడుతోంది.

‘‘ఏయ్..! ఆపు…!’’ గట్టిగా అరిచాడు.

కాసేపు ఆగింది.

మళ్ళీ మొదలైంది.

భయం  వేసింది.

లేచివెళ్ళి రాతబల్ల మీద ఉన్న గ్యాస్ లైటు వెలిగించాడు. ఇప్పటికి పద్దెనిమిది సార్లు చదివిన ఆమె ఉత్తరం ఆ బల్ల మీద ఇంకా తెరిచే ఉంది. దాన్ని నలిపి, ఉండలాగ చుట్టి, చెత్తబుట్టలో పారేశాడు. మళ్ళీ మంచం మీదకి వచ్చి కూర్చున్నాడు.

మళ్ళీ టక్కు టక్కుమని చప్పుడు.

‘‘ఏయ్ ముసలిదానా… దమ్ముంటే బైటకి రావే…’’ అని అరిచాడు.

చప్పుడు ఆగింది.

తలుపు దగ్గర ఏదో కదిలింది.

ఎప్పుడూ తలుపు మూల ఒక రూపంగా మాత్రమే స్ఫురించి భయపెట్టే ఆ ముసలిది, ఇప్పుడు మాత్రం, కళ్ళ ముందుకి వచ్చింది. అతనికి ఎదురుగా నిలబడింది. దాని నడుం వొంగిపోయి ఉంది. ముఖం మీద జుట్టులోంచి కళ్ళేమీ కనపడటం లేదు. కానీ తనవైపే చూస్తున్నదని ఎలాగో తెలుస్తోంది.

‘‘ఎందుకలా చప్పుడు చేస్తున్నావ్? బతకనివ్వవా?’’

జవాబుగా ఆ జుట్టు వెనక నుంచి ఇకిలింపు వినపడింది.

‘‘వెళ్ళిపో ఇక్కడి నుంచి. లేకపోతే దూలానికి ఉరేసుకుంటాను,’’ అన్నాడు.

ముసలిది మెల్లగా పక్కకి తిరిగింది. ఊతకర్ర తాటించి నడుస్తూ వెళ్ళి, కష్టంగా వొంగి, చెత్తబుట్ట లోంచి కాయితం ఉండ తీసింది. దాన్ని బల్ల మీద పెట్టి గోళ్ళతో సాపు చేసింది. అందులో అక్షరాల మీదకి వొంగి చదివింది. తర్వాత ఇవాన్ వైపు తిరిగి మాట్లాడింది.

‘‘అదృష్టవంతురాలు. లేకపోతే నీ ఏకాకితనాన్ని ఆమె మీద మసిలాగ పులిమేద్దువు. దేనికీ అర్థముండని నీ శూన్యంలోకి లాగి గొలుసులు వేసి కట్టేద్దువు. నీ ఏదీ నమ్మనితనాన్ని శూలంగా చేసి పొడిచేద్దువు. వద్దొద్దు… మంచికే జరిగింది. నీకు మనుషులొద్దు. అమాయకం మనుషులు అస్సలొద్దు. నేనే నీకు సరిజోడు….’’ అని దగ్గులాగా ఆగకుండా నవ్వుతోంది.

ఇవాన్ మెడ మీద వెంట్రుకలు లేచి నిలబడ్డాయి ఆ నవ్వుకి.

చప్పున లేచి, ‘‘ఛీ! నా బతుక్కి ఏదీ ఒరిజినల్ కాదు. నిన్ను కూడా చవకగా ఏ దయ్యాల కథలోంచి తెచ్చుకున్నానో. నువ్వే ఉండు ఈ గదిలో. నేను పోతున్నాను,’’ అంటూ, కోటు తగిలించుకొని, మెట్లన్నీ దూకుతున్నట్టు దాటి, వీధిలోకి వచ్చిపడ్డాడు.

మళ్ళీ అదే మంచు, అదే హోరు.

కానీ ఈ సాంత్వనామయ ఆకాశం కింద… ఏదీ వెంటాడని ఏకాంతం.

వంతెన వైపు నడిచాడు. ముళ్ళు మొలిచిన మంచాల మీంచి, రక్కసి కోరలు గీరుకునే గదుల నుంచి, ఎవరి దయ్యాల బాధ వాళ్ళు పడలేక తనలాగా బైటికొచ్చి తచ్చాడే మనుషులు వంతెన మీద ఒకరిద్దరైనా ఉంటారు. పన్నెత్తి పలకరించకుండా, ఒకరికొకరు కంటపడిందే ఊరటగా, ఒకరినొకరు దాటుకుపోయిందే ఓదార్పుగా, తెల్లారేదాకా పచార్లు చేయవచ్చు. లేదంటే వంతెన కింద నదిలోకి చూస్తూ, అది ప్రవహించే ఊహా ప్రాంతాల వైపు మనసుని పడవలా చేసి వదలచ్చు. అదీకాదంటే నది కడుపులోని చీకట్ల పిలుపు మన్నించి దూకేయనూ వచ్చు.

కానీ ఈ రాత్రి వంతెన మీద ఎవ్వరూ లేరు. దీపస్తంభాల వెలుగులో రాలుతున్న మంచు తరకలు తప్పించి. కొంత దూరం నడిచి, వంతెన గట్టుకి మోచేతులు ఆన్చి, కింద గడ్డకట్టిన అంచుల మధ్య పారుతున్న నదీ పాయకేసి చూస్తూ నిలబడ్డాడు. ఎవ్వరూ లేకపోవటం కూడా ఎందుకో బానే అనిపించింది. భయాల్ని బయట ఆపేందుకు కట్టుకునే గోడల్లోంచే దయ్యాలు పుడుతున్నప్పుడు, ఇక తనలాంటివాళ్ళకు ఈ బయళ్ళే ఊరట. గోడలు లేని అనంతమైన బయలులో, నిద్దరోయే ఊర్లెన్నింటినో ఒరుసుకొంటూ పోయే ఈ నదిపైన ఇలా నిలబడితే– ఒంటరితనం తనది కాదు ప్రపంచానిదే అనిపించింది.

ఆమె గుర్తొచ్చింది. ఆమెని ఇంకోలాంటి పరిస్థితుల్లో కలిసివుంటే, ఆమెతో మొదటి మాటలు ఇంకోలాగ కలిపివుంటే, ఆమె మనసులోకి ఇంకో ద్వారం లోంచి అడుగుపెట్టివుంటే ఎంత బావుండేదీ అనిపించింది. ఊపిర్లు పెనవేసుకొనేంత దగ్గరగా ఉన్నప్పుడూ ఆకళింపుకురాని ఆమె సమక్షం ఇప్పుడు దూరమయ్యే కొద్దీ ఎంత అపురూపమో రుజువు చేసుకుంటోంది. రైలు ఈ పాటికి స్టెప్పీల మీదుగా పరిగెడుతూ ఉంటుంది… రైలుకీ, నదికీ పోలిక తోచింది. బాగా ఊపిరి తీసుకుని నిట్టూర్చాడు. అది ఉపశమనం కాదు. కానీ యాతనలో చిన్న విరామం. అధ్యాయానికి అధ్యాయానికి మధ్య ఇలా అనిపించడం సహజం అనుకున్నాడు.

('సారంగ' వెబ్ మేగజైన్ లో ప్రచురితం)

0 comments:

మీ మాట...