ప్రపంచం మొత్తాన్నీ పొందికగా నడిపించగల ఒకేవొక్క మత గ్రంథాన్నో పౌర స్మృతినో నిర్మించాలంటే అందుకు సరైన ముడి సరుకు చెహోవ్ కథల్లో దొరుకుతుందీ అని నేననుకుంటాను. అలాగ నాది చెహోవ్ మతం, నేను చెహోవ్ దేశ పౌరుడ్ని. చెహోవ్ కథల వెనక (ముఖ్యంగా ఆయన జీవితంలో ఆఖరి పదిహేనేళ్ళలో రాసిన కథల వెనక) వ్యక్తావ్యక్తంగా తోచే నైతిక సారాన్నే నేను జీవితాన్ని నడుపుకోవటానికి ఆదర్శమని భావిస్తాను. కానీ అది ఏమిటో స్పష్టంగా మాటల్లో చెప్పమంటే నాకు కష్టం. అదే దాని అందం కూడా. ఇక్కడ సోషల్, పొలిటికల్ ఇష్యూస్ మీద రకరకాల వాదనలు జరుగుతుంటాయి. మనుషులు ఎటోఒకవైపు బలంగా నిలబడతారు. బల్లగుద్ది తీర్మానిస్తారు. నేను మటుకు ఎటూ గట్టిగా మాట్లాడలేను. పైగా నాలోని ఈ అశక్తతను ఒక అపురూపంగా కాపాడుకోవాల్సిన విషయంగా కూడా చూస్తాను. వ్యక్తి వ్యక్తికీ మారే ప్రపంచపు కంప్లెక్సిటీ, ఎవరో ఒకానొక వ్యక్తికి అన్వయించాక మాత్రమే అర్థంలోకి ఒదిగే ప్రపంచపు సింప్లిసిటీ... ఇవి నాకు చాలా ముఖ్యం. ఈ పట్టింపు చెహోవ్ కథల్లో కనపడుతుంది. అలాగైతే మరి ఈ పేరాను మొదలుపెడుతూ నేను చేసిన హైపాథెసిస్ ని కొట్టిపడేసేది కూడా, అంటే ప్రపంచాన్ని ఏకమొత్తంగా తీసుకొని ఏదైనా మాట్లాడటాన్ని అసాధ్యం చేసేది కూడా, చెహోవ్ కథలేనన్నమాట! ఈ వైరుధ్యంలోనే ఎక్కడో చెహోవ్ రిలవెన్స్ ఉంది. తన ethos ఏంటీ అన్నది చెహోవ్ కూడా ఎక్కడా స్పష్టంగా మాటల్లో పెట్టలేదు. ఒక ఉత్తరంలో బహుశా యథాలాపంగా ఇలా రాస్తాడు:
"My holy of holies is the human body, health, intelligence, talent, inspiration, love, and absolute freedom--freedom from violence and falsehood, no matter how the last two manifest themselves."
కానీ ఇదేనా, ఇంతేనా అంటే ఇంతకుమించి చాలా ఉంది కదా అనిపిస్తుంది. 'లేడీ విత్ ద లిటిల్ డాగ్' అన్న కథలో ఒక వివాహేతర సంబంధాన్ని గురించి చెహోవ్ రాసిన తీరు చూసి టాల్‌స్టాయ్, "ఇది ప్రపంచం పట్ల ఒక స్పష్టమైన దృక్పథం లేని, ఫలితంగా మంచీ చెడుల మధ్య విచక్షణ తెలీని మనిషి రాసిన కథ" అని విమర్శిస్తాడు (వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు తన నవల్లో అన్నా కరెనినాను రైలు కిందకి తోసి దండించిన టాల్‌స్టాయ్). మంచీ చెడుల మధ్య విచక్షణ తెలీనివాడు కాదు చెహోవ్. అలా మంచీ చెడులను విచక్షించగల ప్రమాణం కోసం మతంవైపో సంప్రదాయంవైపో సమాజంవైపో చట్టంవైపో చూడడు; ఆ కథలో ఉన్న "ఎవరో ఒకానొక వ్యక్తి"వైపూ, ఆ ఒకానొక సందర్భం వైపూ చూస్తాడు.
మొన్న రిలీజైన నా వ్యాసాల పుస్తకం బాక్ కవర్ పేజీ మీద నాకు బాగా నచ్చిన, నా రీడింగ్/ రైటింగ్ లైఫ్‌ని మలచిన కొంతమంది రచయితల ఫొటోలని ఉంచాను. కానీ ఆ ఫొటోల్లో చెహోవ్ మాత్రం లేడు. ఎందుకంటే ఆయన మీద రాసిన రాత ఒక్కటి కూడా ఆ పుస్తకంలో లేదు. రాసే సందర్భం ఎందుకో రాలేదంతే. ఆ వరసలో చెహోవ్ లేకపోవటం నావరకూ లోటే కానీ, ఏమీ రాయకుండా ఊరికే ఫొటో పెట్టబుద్ధేయలేదు. మిగతావాళ్ల ఫొటోలను మాత్రం ఇదే వరుసలో ఉంచమని చెప్పాను. దీన్ని నా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అని కూడా అనుకోవచ్చు. వీళ్ళలో ఒకరిద్దరిని కొంతమంది గుర్తుపట్టలేదు. అందుకే అక్కడ ఫొటోలు వుంచిన వరుసలోనే వాళ్ల పేర్లిస్తున్నాను.
Tripura
Kafka
Chalam
Dostoevsky
Nabokov
Borges
Tolstoy
Flaubert
Salinger
(బాక్ కవర్ మీద ఉన్న కొటేషన్ 'పుస్తకాల్ని ఎందుకు పద్ధతిగా సర్దుకోవాలంటే!' అన్న లోపలి వ్యాసం నుంచి తీసుకున్నది. 'పడి మునకలు' అంటే ఏంటని ఒకరిద్దరు అడిగారు. టైటిలుకి అంత లోతైన అర్థమేం లేదు. పుస్తకాల్లో పడి మునకలేయటం అని అంతే.)
0 comments:
మీ మాట...