చంపగలడు. ఎలాగా అంటే రచయితల పుస్తకాల్ని చెత్తగా పబ్లిష్ చేసి. కేశవరెడ్డి కంటే కె.ఎన్.వై. పతంజలి వెయ్యిరెట్లు బెటర్ రైటరు. కానీ ఇప్పటి జెనరేషన్లో కేశవరెడ్డి పుస్తకాలు చదివేవాళ్లల్లో సగం మంది కూడా పతంజలిని చదవరు. దానికి మేజర్ కారణం పతంజలి పుస్తకాలని మనసు ఫౌండేషన్ ప్రచురించిన పద్ధతే అనుకుంటాను. మనసు ఫౌండేషన్ పతంజలి రచనలన్నీ కలిపేసి సగటు తెలుగు నిఘంటువులంత బరువుతో హార్డ్ బౌండుతో రెండు పుస్తకాలుగా పబ్లిష్ చేసింది. ఆ పుస్తకాలు ఒక్కోటీ కొనాలన్నా ఐదొందల పైనే. ఆ పుస్తకాలు మార్కెట్లో ఉన్నన్నాళ్లూ ఇంకో పబ్లిషరెవ్వరూ వాటిని ఏ రచనలకు ఆ రచనలుగా విడదీసి చిన్నచిన్న పుస్తకాలుగా ప్రచురించరు. పోనీ వాళ్లైనా ఆ పని చేయరు. తెలుగులో ఇదో మాయదారి సంప్రదాయం. ఇదే హాని రావిశాస్త్రికీ జరిగింది. 2005-2007 మధ్యలో అనుకుంటాను రావిశాస్త్రి రచనా సర్వస్వం అని మనసు ఫౌండేషనే ఒక టెలీఫోన్ డైరెక్టరీ లాంటి పుస్తకాన్ని, టెలీఫోన్ డైరెక్టరీ లాంటి క్వాలిటీతోనే ప్రచురించింది. నేను అది కొన్నాను. కానీ దాన్ని చదవాలంటే అయితే రెండు డంబెల్స్ తీసుకుని చేతి కండలైనా పెంచుకోవాలి, లేదంటే వ్యాసపీఠం ఒకటి కొనుక్కొని దాని ముందు బాచీమటమో పద్మాసనమో వేసుకు కూర్చోవాలి. అలాగ రావిశాస్త్రిని ‘రాశి’శాస్త్రి లాగా మార్చి పదేళ్లపాటు ఎవరూ చదవకుండా చేశారు. ఈలోగా ఒక తరం రావిశాస్త్రిని స్కిప్ అయ్యే ఉంటుంది. నేను రావిశాస్త్రి అభిమానినేం కాదు. ఆ సిమిలీల బలహీనతకి చిరాకేస్తుంది కూడా. కానీ 'వెన్నెల', 'మామిడి చెట్టు' లాంటి మంచి కథలు కొన్ని ఏరి ఒక కలెక్షన్ వేస్తే చాలా మంచి పుస్తకమవుతుంది. రచయిత చచ్చిపోయాకా ఇక చదవనక్కర్లేదన్నట్టూ ఇలా అల్మరాల్లో దిట్టంగా కనపడితే చాలన్నట్టూ కుప్పపోసి ప్రచురించటం ఎందుకో. శ్రీశ్రీని ఇలాగే చేశారు, శ్రీపాదని ఇలాగే చేశారు. పీహెచ్డీ పరిశోధకుల కోసం రచనాసర్వస్వాలు వేస్తే వేయొచ్చు. కానీ దాన్తోపాటే ఏ రచనకి ఆ రచనగా విడివిడి పుస్తకాలుగా ఎందుకు వేయరో.
అందేంటీ అంత విలువైన సాహిత్యాన్ని కుర్రాళ్లు చవకగా కొనుక్కొని ఫాంటు జేబుల్లో దోపుకొనేందుకు వీలుగా చవక కాయితం మీద పాకెట్ సైజులోనే ప్రచురించాలా, అంటారా? ఒక్కో రచనకి ఒక్కో స్వభావం ఉంటుంది, ఒక్కో రచయితకి ఒక్కో స్వభావం ఉంటుంది. ‘కేచర్ ఇన్ ద రై’ని వింటర్ కోటు జేబులో దోపుకోగలిగే సైజులోనే ప్రచురించాలని శాలింజర్ కి తెలుసు. అలాగే ‘కేచర్ ఇన్ ద రై’నీ, శాలింజర్ మరో నవల ‘సేమోర్: ఏన్ ఇంట్రడక్షన్’ని కలిపి ఒకే పుస్తకంలో వేస్తే అది రమణ మహర్షి హుడీ వేసుకొని స్కేట్ బోర్డింగ్ చేస్తున్నట్టు ఉంటుంది. చలం ఫక్తు గ్రాంథికంలో క్లాసిక్ శైలిలో రాసిన ‘శశిరేఖ’నీ, కన్షెషనల్ శైలిలో పొయెటిక్ టోన్ లో రాసిన ‘అమీనా’ ని ఒకే పుస్తకంలో వేస్తే బిర్యానీ రైసులో సాంబారు పోసినట్టు ఉంటుంది. చలం ఏలూరు వీధుల్లో మడత నలగని పంచెలు కట్టుకుని క్లబ్బులో పేకాటకి పోయినవాడు కాదు. పతంజలి లైబ్రరీల్లో రిఫరెన్సులు తిరగేసి పరిశోధనా వ్యాసాలు రాసిన విమర్శకుడు కాదు. వేయటానికి ఒక పుస్తకాన్ని ఎంచుకోవటంతోనే పబ్లిషర్ల పని అయిపోదు. వాళ్ల రచనల్ని, వాళ్ల స్వభావాలనీ పుస్తకం భౌతిక రూపంలో కూడా గౌరవించాలి పబ్లిషర్లు.
ఇప్పుడు ఈ పోస్టు పెడదామనిపించటానికి అసలు కారణం చలం పుస్తకాలే. బహుశా ఒక పదేళ్ల క్రితం అనుకుంటాను చలం పుస్తకాల హక్కులన్నీ సౌరీస్ నుంచి వేరే పబ్లిషర్ కి వెళ్లిపోయాయని విన్నాను. ఆ తర్వాత కొన్నాళ్లకే మార్కెట్ లో- ఒక అన్ని పుస్తకాల్లాంటి, అన్ని పుస్తకాల్లో కనపడే ఫాంట్ల లాంటి ఫాంట్ల తోటి, అన్ని పుస్తకాలకుండే కవర్లలాంటి కవర్లతోటి, రెండొందలుపైగా బరువైన పేజీలతోటి, మర్యాదస్తుల వాసన కొట్టే రచయితలందరి పుస్తకాల మధ్య జస్ట్ మరో పుస్తకంగా కలిసిపోతూ, నాకంతకముందు తెలీని చలమొకడు పుస్తకాల షాపుల్లో ప్రత్యక్షం కావటం మొదలుపెట్టాడు. అంతకుముందు నాకు దొరకని పుస్తకాలు ఈ సిరీసులో కొన్ని ఉండటంతో తప్పనిసరై వీటిలో కొన్ని కొన్నాను. అలాగే మ్యూజింగ్స్ నా దగ్గర బాగా చిరిగిపోతూండటంతో దాన్నీ కొత్త వెర్షన్ కొన్నాను. కానీ ఎప్పుడు తెరిచి చదవబుద్ధేయలేదు. పేజీలు ఊడిపోతున్నా ఎందుకో ఆ పాత పుస్తకాలే చదవబుద్ధవుతుంది.
చలం అంటే ఫాంటూ, పేజీల రంగూ, కవర్ పేజీ మీద బొమ్మా వీటికంటే ఎక్కువ అని నాకూ తెలుసు. చలం ఒక బతికే పద్ధతి, జీవితాన్ని చూసే పద్ధతి. ఎలాగో కలాగ మరి ఎవరి ఉద్దేశమో తెలీదుగానీ ఆ పాత పుస్తకాలకి అలాంటి ఒక చలానికి నప్పే శైలి అమిరింది. పింక్ రంగు అట్ట మీద మధ్యలో ఫ్రేములో పైబొత్తాలు లేని చొక్కా వేసుకొని గాలికి ఎగిరే జుట్టు కింద వెర్రి నవ్వు నవ్వుతూ కవరు తిప్పగానే ఆల్మోస్ట్ బూడిదరంగు నాసి పేజీల మీద వ్యక్తమయ్యేవాడే నా వరకూ నాకు అసలు చలం. ఆ పుస్తకాలని బస్టాండులో చదువుతూ చదువుతూ మధ్యలో సిటీబస్సు రాగానే చుట్ట చుట్టి జేబులో దొపుకొని బస్సెక్కేయచ్చు. పైగా ఆ పాత పుస్తకాల్ని వేసినవాళ్లు ఏ రచనకి ఆ రచన విడిగా వేశారు. అమీనాని అమీనాలాగా, అరుణని అరుణలాగా ఉండనిచ్చారు. ఈ కొత్త పబ్లిషర్లలాగా ఎలా పడితే అలాగ అన్నీ కలిపేసి కుమ్మరించేయలేదు. మార్కెట్లో ఈ కొత్త చలాన్ని చూసి నాకైతే కంగారు పట్టుకుంది. ఆ పాత పింక్ అట్టల చలం ఇంక దొరకడేమోనని. దొరికినవాటిని దొరికినట్టు, ఇప్పటికిప్పుడు చదివినా చదవకపోయినా, పోగేసి దాచుకోవాలనిపించింది. పాత పుస్తకాల షాపుల్లో దొరికితేనో, ఎవరైనా ఫ్రెండ్స్ ఇళ్లల్లో కనపడితే వాళ్లని మొహమాటపెట్టో అవి చాలావరకు తెచ్చుకున్నాను. అయితే పేజీలు పెళుసైపోయి, కుట్ల నుంచి దారాలు ఊడిపోయే స్థితిలో ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు జేబులో దోపుకుపోయేంత nonchalance వాటి పట్ల ప్రదర్శిచంలేనంత అబ్బరం అయిపోయాయి. చలం అబ్బరంగా బతకనూ లేదు, రాయనూ లేదు.
ఇప్పుడే నా యూట్యూబు హోమ్ పేజీలో చలం పుస్తకాల కొత్త వెర్షన్ కి సంబంధించి ఎనిమిదేళ్ళ క్రితంనాటి వీడియో ఒకటి కనపడింది. చలాన్ని రామ్ గోపాల్ వర్మ ఆవిష్కరిస్తున్నాడు. (https://youtu.be/RzpQvRAtKQU) టేస్ట్ లెస్ నెస్ అనేది ఒక చోట ఒకలాగ మాత్రమే వ్యక్తమై ఊరుకోదనటానికి నిదర్శనంలాగ ఉంది ఆ వీడియో. అది చూడగానే నాకు ఇదంతా గుర్తుకు వచ్చి, ఇలాగ ఆవేశపడ్డా అన్నమాట.
Can a publisher really kill a writer? Maybe a natural force like Chalam can't be stopped no matter what, but a mere talent like Ra.Vi. Sastry most certainly wouldn't be able to surive these fuck ups.
0 comments:
మీ మాట...