May 16, 2024
రచయితలు - పుట్టిన రోజులు
రైటర్ల బయోగ్రఫీల్నో, వాళ్ళ మీద వికీపీడియా ఎంట్రీల్నో చదివేటప్పుడు వాళ్ళు ఏ వయసులో ఏం చేశారన్నది తెలుసుకోవటమంటే నాకు చాలా ఇంట్రెస్ట్. వాళ్ళు మొదటి కథ ఏ వయసులో రాశారూ, వాళ్ళ వర్జినిటీ ఏ వయసులో పోయిందీ, ఏ వయసులో పిల్లల్ని కన్నారూ… ఇలాంటి వివరాలు. కాఫ్కా 1912లో ఫెలిస్‌ని కలిశాడూ అంటే ఆ ఏడాదికి కాఫ్కా వయసెంత ఉంటుందో నాకు తెలియాలి. కానీ ఇంకోపక్క నేను లెక్కల్లో పరమ వీకు. ఎక్కాలు కూడా తడుంకుంటాను. 1883లో పుట్టిన కాఫ్కాకి 1912లో ఎంత వయసుంటుందో లెక్కగట్టాలంటే, చదవటం కాసేపు ఆపి, 1883 నుంచి 1900కి పదిహేడేళ్ళూ + 1900 నుంచి 1912కి పన్నెండేళ్ళూ, రెండూ కలిపితే అప్పటికి కాఫ్కా వయసు 29 ఏళ్ళూ అని ఇలా లెక్కేసుకోవాలి. అందుకే రౌండ్ ఫిగర్ కాని సంవత్సరాల్లో పుట్టిన రైటర్లతో చిరాకు. దాస్తోయెవస్కీ (1821), ఫ్లాబెర్ట్ (1821), జేమ్స్ జాయ్స్ (1882) నవొయ షిగా (1883), చలం (1894)... ఇలాంటివాళ్లన్నమాట. ఇలా కష్ట పెట్టకుండా పుడతారు కొంతమంది రైటర్లు. ఉదాహరణకి హెమింగ్వే, నబొకొవ్, బోర్హెస్ ముగ్గురూ చక్కగా టైం చూసుకుని ఒకే ఏడాది 1899లో పుట్టారు. వీళ్ళ లైఫ్‌లో ఏ ఈవెంట్ ఏ ఏడాది జరిగినా గానీ అప్పటికి ఒక ఏడాది కలుపుకుంటే అదే వాళ్ళ వయసు. హెమింగ్వే 1926లో మొదటి నవల పబ్లిష్ చేశాడూ అని చదవగానే +1 కలుపుకుని ఇరవై ఏడేళ్ళ వయస్సులో రాశాడన్నమాట అనేసుకోవచ్చు సులువుగా. నబొకొవ్ 1940లో అమెరికా ఓడ ఎక్కాడూ అంటే నలభై ఒక్కేళ్ళకు అని అర్థమైపోతుంది ఈజీగా. ఇలా దేవుడు రైటర్లని పుట్టించేటప్పుడు కాస్త నా లాంటి లెక్కల్రాని రీడర్ల సౌకర్యం గురించి కొంచెం ఆలోచించాలి.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
మీ మాట...