ముందు నా చదువు గురించి చెప్తాను. తర్వాత నా రాత గురించి. నన్ను ఇలా అకడమికాతీత చదువుల వైపు నెట్టింది మా అమ్మే. తర్వాత అందుకు బాధపడింది కూడా అమ్మే. అమ్మ అంటే ఆకుల వీర వెంకట సత్య సుబ్బలక్ష్మి. రెవిన్యూలో జూనియర్ అసిస్టెంటుగా మొదలై డిప్యుటీ తాసిల్దారుగా మొన్నటేడాది రిటైరయ్యింది. రిటైరయ్యే దాకా కూడా లైబ్రరీని వదల్లేదు. తన టేస్టు మాత్రం ఇన్నేళ్ళ తర్వాత కూడా ఎక్కడ మొదలయ్యిందో అక్కడి నుంచి ఒక్క ఇంచు కదల్లేదు. అమ్మ పుస్తకం సజెస్ట్ చేసిందంటే దాని జోలికెళ్ళను. అలాగే నా కథలూ మా అమ్మకి నచ్చవు. నేను ఎప్పుడో హైదరాబాదుకి వచ్చిన కొత్తల్లో తనకి రాసిన ఉత్తరాలు తప్పితే మా అమ్మకి నా రాతలేం నచ్చవు. బేసిగ్గా అసలేం చూసుకుని నాకింత గీరో అమ్మకి అర్థం కాదు. ఈమధ్యే వొళ్ళు పొగరు తగ్గించుకొమ్మని తిడుతూ ఉత్తరం కూడా రాసింది. అమ్మకి నేను డాక్టరవ్వాలని ఉండేది. నేను కూడా బలవంతం బ్రాహ్మణార్థంగా కొన్నాళ్లు ఆ హోప్స్ ఎంటర్టయిన్ చేశాను. కొన్నాళ్లంటే ఎమ్సెట్టులో పదమూడు వేలో రాంక్ వచ్చేవరకూ, డిగ్రీలో పదమూడు సబ్జెక్టులు పోయేవరకూ. నా క్లాసు రూము చదువు ఎంత కుంటుపడిందో, నా లైబ్రరీ చదువు అంత జోరుగా నడిచింది. నేను మొదట చదివిన సాహిత్యం లైబ్రరీ పుస్తకమే. నా మూడో తరగతి అయ్యాక అమ్మకి అమలాపురం నుంచి ఆలమూరుకి ట్రాన్స్‌ఫర్ అయింది. నేను ఆలమూరు చిన్నబడిలో నాలుగో తరగతిలో చేరాను. అమ్మ ఆలమూరు వచ్చేటప్పుడు అమలాపురం లైబ్రరీలో డిపాజిట్టు డబ్బులు వదిలేసుకుని దానికి బదులు తెన్నేటి సూరి ‘చంఘిజ్ ఖాన్’ నవల తెచ్చుకుంది. అది అలా చాన్నాళ్లు ఇంట్లో ఉండిపోయింది. దాని కవరు పేజీ బాపూ వేశాడు. ఎరుపు రంగు కుర్తా వేసుకున్న చంఘిజ్ ఖాన్ వెనక పులి తిరుగుతూంటుంది. అమ్మ ఆ నవలలో చంఘిజ్ ఖాన్ ఎంట్రీ సీను గురించి తెగ వర్ణించి చెప్తూ ఉండేది. నేను ఆ ఒక్క సీను కోసం చదవటం మొదలుపెట్టి ఐదో తరగతిలోనే అర్థమైనా కాకపోయినా మొత్తం పుస్తకం చదివేశాను. నా పదో తరగతి లోపుగా ఆ పుస్తకాన్ని ఇంకో రెండు మూడు సార్లు చదివి ఉంటాను. అది నా మొదటి పుస్తకం. Not bad for a start. అయితే తర్వాత చాలా చెత్త చదివాను. అమ్మకి ఆఫీసు పని వల్ల లైబ్రరీకి వెళ్ళే టైముండేది కాదు. కాబట్టి నన్ను పుస్తకాలు తెమ్మని పంపేది. పంపే ముందు ఫలానా వాళ్లవి తెమ్మని, ఫలానా వాళ్ళవి తేవొద్దని కొన్ని పేర్లు చెప్పి పంపేది. అలా నేనూ మెల్లగా లైబ్రరీ మరిగాను. ఎంతగా అంటే అమ్మ నాకు దొరక్కుండా పుస్తకాలు బీరువాలో కూడా దాచుకొనేది కొన్నాళ్లు. అమ్మ ఆఫీసుకి వెళ్లేకా తాళం కనిపెట్టి మరీ చదివాను. పదో తరగతిలోగా అప్పటి పాపులరు రచయితలవి రచనా సర్వస్వాలే చదివేశాను. అంటే అప్పటి టాప్ టెన్ పాపులర్ చెత్త రచయితల్లో ఒక్కో రచయితవీ కనీసం ఐదు పుస్తకాలు చదివాను. ఒకడివైతే మొత్తం ముప్ఫై పుస్తకాలు. క్లాసిక్ రచయితల పుస్తకాలూ మధ్య మధ్యలో తెచ్చేవాడ్ని. చలం, గోపీచంద్, కొ.కు., సాంకృత్యాయన్, నండూరి అనువాదంలో మార్క్ ట్వేన్, అలెక్స్ హేలీ రూట్స్ అనువాదం, ముళ్లపూడి, మధురాంతకం రాజారాం వీళ్లవి కూడా అడపాదడపా చదివేవాడ్ని. కానీ వేంపల్లి నిరంజన్ రెడ్డి ‘అంధయాగం’ ముందు గోపీచంద్ ‘మెరుపుల మరకలు’ ఎందుకూ సరిపోయేది కాదు. ఒక చలం కథ మాత్రం విపరీతంగా నచ్చేసిందని గుర్తుంది. కథ పేరు ‘యవ్వనవనం’. ఆ కథలో పదిహేనేళ్ళ కుర్రాడు ఊళ్ళోకి వచ్చిన నాటకాల గ్రూపులో రాజకుమారుడి వేషం వేసే అమ్మాయితో ప్రేమలో పడతాడు. పదో తరగతిలో ఆ కథ చదివి ఆ కుర్రాడ్ని నేనే అయిపోయాను. ఆమెని కళ్లల్లో కట్టుకొని ప్రేమించాను. మళ్ళీ మళ్ళీ చదివిన కథ అది. ఇంటర్లోకి వచ్చాక ఇంకాస్త విచక్షణ వచ్చింది. గోర్కీ ‘నా బాల్యం’, ‘నా బాల్య సేవ’, ‘నా విశ్వ విద్యాలయాలు’ మా ఇంటి లోతైన కిటికీ గూట్లో కూర్చుని వరస సాయంత్రాలు చదివాను. బహుశా నా రష్యన్ ప్రేమల పరంపరలో మొదటివాడు గోర్కీ. అప్పట్లోనే కాశీభట్లని చదవటం నా రీడింగ్ లైఫ్‌లో పెద్ద ఈవెంట్. ఆంధ్రప్రభలో ‘నేనూ చీకటి’ సీరియలైజేషనుతో మొదటిసారి ఆయన్ని చదివాను. స్వాతి మంత్లీలో అనుబంధంగా వచ్చిన ‘దిగంతం’ నవల వరుసగా రెండు మూడు రోజుల్లో రెండుమూడు సార్లు చదివాను. కాశీభట్ల ఈ పుస్తకాల్లో కాఫ్కా, అయాన్ రాండ్... ఇలా ప్రపంచ దేశాల రచయితల పేర్లను కోట్ చేసేవాడు. వీడెవడి చేతో ఇంత కొత్తగా రాయిస్తున్న వాళ్లని కూడా ఎలాగోలా చదవాలనుకునేవాడ్ని. ఇంటికి వారం వారం వచ్చే ‘ఆంధ్రప్రభ’లో అనుకోకుండా కనిపించిన కాశీభట్ల తప్పితే అప్పటి కంటెంపరరీ రైటర్స్ ఎవరూ తెలీదు. ఆలమూరు లైబ్రరీలో అన్నీ పాత పుస్తకాలే ఉండేవి. దాన్తో అక్కడ అస్తమానూ కనపడే చలం, గోపీచంద్, మల్లాది, మైనంపాటి వీళ్లంతా కంటెంపరరీస్ అనిపించేది. ఇక్కడ కొంచెం వెనక్కి వెళ్లి నా తొలి రాతల గురించి చెప్తాను, సరికొత్త నూతన అపూర్వ పేరాలో…
స్కూలు వేసవి సెలవల్లో మా తాతయ్య మా ముగ్గురన్నదమ్ముల చేత దక్షిణ భారత హిందీ ప్రచార సభ వాళ్ల హిందీ పరీక్షలు కట్టించేవాడు. పదో తరగతి సెలవుల్లో ఒకసారి ఆ హిందీ టెక్స్ట్ పుస్తకాల్లో ఉన్న ఒక నాటకాన్ని తెలుగులోకి అనువదించటం మొదలుపెట్టాను. కథ నాది కాకపోయినా, కేవలం పదాలు మాత్రమే నావైనా సరే– నా పెన్ను కింద నుంచి ఒక కొత్త రచన రూపం తీసుకోవటం గొప్పగా అనిపించింది. ఆ ధైర్యంతో తర్వాత కొన్ని రోజులకే ఒక నోటు పుస్తకం తీసుకుని వరుసగా ఓ పది పేజీల్లో కథ రాసేసాను. అది ఒకడు సైకిలు నేర్చుకోవటంలో పడే తంటాల గురించిన కామెడీ కథ. కథ పూర్తయ్యాక చదువుకున్నప్పుడు బాలేదనిపించింది కానీ, రాస్తున్నప్పుడు వచ్చిన కిక్కే వేరు. నేను రచయితని అవ్వాలనుకోవటం ఆ రోజుల్లోనే ఎప్పుడో మొదలైందనుకుంటాను. ఎందుకంటే– బాగా గుర్తు– పదో తరగతిలో ఓ ఇంగ్లీషు పాఠంలో ఏదో సందర్భంలో ‘‘మ్యుజిషియన్లకీ, రైటర్స్‌కీ మెమొరీ చాలా ముఖ్య’’మన్న ఒక వాక్యం చదివి నేను చాలా వర్రీ అయ్యాను. ‘‘అరె నాకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ కదా మరెలాగా’’ అన్నది నా బాధ. అప్పట్లోనే డైరీలు రాయటం మొదలుపెట్టాను. కొత్త సంవత్సరం సండే సప్లిమెంట్‌లో డైరీల గురించి పడిన ఆర్టికల్ చదివి డైరీలు రాయాలని ఫిక్సయ్యాను. ఇంక ఒకటే రాయటం. ఫలానా రోజున జరిగిన విషయాల్ని మళ్ళీ ఎప్పుడో చదువుకుంటే గుర్తొచ్చేలా రాయటమన్నది డైరీ ఉద్దేశం అయినప్పుడు, ఆ డైరీ ఎంట్రీలు చాలా డీటెయిల్డుగా రాయటం ముఖ్యం కదా అనుకున్నాను. కానీ ఒక అనుభవాన్ని అందులోని ఏ డీటెయిల్ జ్ఞాపకంగా దాచుకుంటుందో పట్టుకోవటం చాలా కష్టమైన విషయం. అప్పటి నాకే కాదు, ఇప్పటి నాకు కూడా. కాలేజీ రోజులు చాలా ముఖ్యమైనవని అప్పట్లో సినిమాలన్నీ ఊదరగొట్టేవి. ఆ రోజులు మళ్ళీ రావు గనక వాటిని డైరీల్లో ఇంకా వివరంగా రాయాలనుకున్నాను. అలా డీటెయిల్స్ నాకు ఒక అబ్సెషన్‌లాగా మారిపోయాయి. నా చొక్కా రంగు నుంచి, ఫలానా విషయం జరిగిన టైమ్ నుంచి, వెళ్ళిన చోటులో వాతావరణం వాసన దాకా అన్నీ ఆ ఎంట్రీల్లో ఇమిడ్చేయాలని ప్రయత్నించేవాడిని. దాన్తో ఏదో ఉదయం బస్సు కోసం ఎదురుచూట్టం కూడా నా డైరీలో పేజీలకి పేజీలు ఆక్రమించేది. మళ్ళీ ఆ రాయటంలో భాష మీద గానీ, పదాల ఎంపిక మీద గానీ, వాక్యం తీరు మీద గానీ శ్రద్ధ ఏం ఉండేవి కాదు. అసలవి ముఖ్యమే కాదు. ఆ ఎంట్రీ చదివితే ఆ రోజు జరిగింది ఉన్నదున్నట్టు గుర్తుకు రావాలంతే. దాన్తో ఆ ఎంట్రీలన్నీ కర్త కర్మ క్రియలతో రాసిన చాకలిపద్దుల్లాగా ఉండేవి. తర్వాత చాలాఏళ్ళకి ఒకసారి చదువుకుంటే అన్ని వివరాల దట్టింపు వల్ల అసలు ఆ పేజీల్లో ఉన్నవి నా అనుభవాలేనా అన్నంత దూరం జరిగిపోయి కనిపించాయి. ఒకేసారి అన్నీ కట్టగట్టి చింపేశాను (ఎప్పుడో త్రిపురని చదువుకున్నాక గానీ జ్ఞాపకం నుంచి రాతకి ఒక అనుభవాన్ని ఎలా బదిలీ చేయాలో అర్థం కాలేదు).
నేను డిగ్రీ మూడేళ్ళలో పదమూడు సబ్జెక్టులు ఫెయిలయ్యానని ఆఖరు సంవత్సరం ఎవరో కాలేజీవాళ్ళే చెప్పేదాకా అమ్మకి తెలీదు. మొదటి సంవత్సరంలోనే చదువుని సీరియస్సుగా తీసుకోవటం మానేశాను. తీసుకోవటం లేదన్న భయం ఏ మూలో ఉండేది, కానీ ఇంకోలా ఉండలేకపోయేవాడ్ని. పరీక్షల రోజుల్లో కూడా సినిమాలకి వెళ్ళాను. అన్ని సబ్జెక్టులు పోయాయని ఒకేసారి తెలిసేసరికి అమ్మకి ఏమనాలో అర్థం కాలేదు. నేను అప్పటికే హైదరాబాద్ వెళ్లి సినిమా దర్శకుడైపోదామన్న ఆలోచనలో ఉన్నాను. మధ్యలో సినిమా ఎందుకు వచ్చిందీ అంటే– రచయిత అయిపోయి పుస్తకాలు రాసేస్తే డబ్బులు రావన్న విషయం అప్పటికే తెలుసు కాబట్టి, కనీసం ఆ రాసేదేదో సినిమాల్లో రాస్తే డబ్బులైనా వస్తాయి కాబట్టి– సినిమా అన్నమాట. కానీ హైదరాబాదు వెళ్ళటానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. అమ్మకి చెప్పకుండా వెళ్దాం అనుకున్నాను కాబట్టి అమ్మని అడగబుద్ధేయలేదు. దాన్తో ఈనాడు ఆదివారం వాడు కథలు రాస్తే పారితోషకం ఇస్తాడని చదివి వరుసగా రెండు కథలు రాసి పోస్టు చేసేసాను. ఆ తర్వాత ఒక నెల రోజుల పాటు ప్రతి వారం లైబ్రరీకి వెళ్ళి కథ కోసం వెతుక్కోవటం, నిరాశగా వెనక్కి రావటం. నెల తర్వాత రెండు కథలూ రిజెక్టెడ్ స్టాంపుతోటి పోస్టులో తిరిగి వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి దాకా నేను ఒక్క కథని కూడా మళ్ళీ ఏ పత్రికకీ పంపలేదు. గత పదిహేనేళ్ళుగా జర్నలిజంలోనే ఉన్నా సరే. నా ‘చేదుపూలు’ కథల్లో ఒక్కటి కూడా ప్రింట్ పత్రికలో పడింది లేదు.
ఈనాడు నుంచి ఈ రిజెక్టెడ్ ఉత్తరం అమ్మ చూసి అడిగాకా అప్పుడు నా హైదరాబాదు ప్లాను చెప్పాను. అప్పుడు తనే కూడావచ్చి దింపి మరీ వెళ్లింది. హైదరాబాదు వచ్చాకా నా లైబ్రరీ చదువులో ఉన్న ఖాళీలు నింపుకునే పన్లో పడ్డాను. అంటే నా ఆలమూరు లైబ్రరీలో దొరకని క్లాసిక్ పుస్తకాలు చదవటం అన్నమాట. అవేమీటో నాకు అప్పటికే అవగాహన ఉంది. సీరియల్స్‌కి అసిస్టెంటు డైరెక్టరుగా చేరాకా కాసిని జీతం డబ్బులు వచ్చీ రాగానే అబిడ్సులో విశాలాంధ్ర పుస్తకాల షాపుకి వెళ్లాను. అన్ని పేరంటాల్లోనీ కనపడే ఆడపడుచుల్లాంటి పుస్తకాలు కొన్నుంటాయి కదా, క్లాసిక్స్ అని చెప్పుకునేవి, అవన్నీ కొనేశాను: అంటే బుచ్చిబాబు ‘చివరకి మిగిలేది’, గోపీచంద్ ‘అసమర్థుడి జీవయాత్ర’, కొ.కు ‘చదువు’, చలం ‘మైదానం’, ‘ప్రేమలేఖలు’, ‘మ్యూజింగ్స్’.... వీటన్నిట్లోకీ ‘మ్యూజింగ్స్’ నాకు బాగా నచ్చింది. ఫిలసాఫికల్ బెంట్ అంటారు కదా… ఆ పుస్తకం చదివాకే అది ఏర్పడింది. అది చదవకపోతే, ఆ తర్వాత చదివిన ఫిలాసఫీ పుస్తకాలేవీ నాకు అర్థమయ్యేవి కాదు. తర్వాత ఎన్ని దేశాల వాళ్ళు ఎంతమందిని చదివినా చలం అంత విస్తృతి ఉన్నవాడూ, చలం అంత కాంట్రడిక్షన్లని ఇముడ్చుకున్నవాడు, చలంలా బతికినవాడూ ఒక్కడంటే ఒక్క రచయిత కూడా తగల్లేదు. చివరకి చలం మెచ్చుకున్న రచయితలు కూడా చలం కంటే దిగదుడుపే అనిపిస్తారు. వీళ్లని అవజేసిం తర్వాత– గాడ్ ఫాదర్ సినిమా చూసిన ఊపులో– గాడ్ ఫాదర్ నవల తెచ్చుకుని చదివాను. పల్లెటూళ్లల్లో పెరిగిన తెలుగుమీడియం వాడ్ని నేను ఇంగ్లీషు పుస్తకం చదవగలనని నాకే తెలీదు. (ఆ పుస్తకం పరమ చెత్త. ఒక చెత్త పుస్తకం నుంచి గొప్ప సినిమా ఎలా తీయాలన్నదానికి చదవొచ్చు). తర్వాత ఇంగ్లీషు చదవగలుగుతున్నానన్న ధైర్యంతో కాఫ్కా మూడు నవలలూ, అయాన్ రాండ్ రెండు నవలలూ తెచ్చేసుకున్నాను. కాఫ్కా డైరీస్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో దొరికితే ఏదో బంగారు కడ్డీలే దొరికినట్టు చొక్కా కింద దాచుకుని వచ్చేశాను (అప్పటికింకా అమెజాన్లూ ఫ్లిప్ కార్టులూ రాలేదు). తర్వాత దాస్తోయెవస్కీ ‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’, ‘బ్రదర్స్ కరమజవ్’ బుక్ ఎగ్జిబిషన్‌లో కొనుక్కున్నాను. ఒక వయసులో భాష చాలా సులువుగా వచ్చేస్తుందనుకుంటాను. 2004 నుంచి 2008 మధ్యలో నేను చదివిన ఇంగ్లీషు పుస్తకాలకి లెక్కే లేదు. ఈ అన్ని పుస్తకాల్లోకీ నామీద బాగా పని చేసింది కాఫ్కా డైరీస్. పుస్తకాల అల్మరాలోంచి ఏ పుస్తకం తీస్తావో వొళ్లు దగ్గరపెట్టుకుని తీయి అని త్రిపుర జాగ్రత్త చెప్పింది కాఫ్కా గురించే. కాఫ్కా డైరీస్ చదివాక కాఫ్కా రోగం నాకు అంటుకుంది. అంటే రచనకి పూర్తిగా మనల్ని మనం ఇచ్చేసుకోవటం. ఈ పుస్తకం ప్రపంచాన్ని ఇంకోలా చూట్టం నేర్పింది. భరించలేనంత దగ్గరగా! నాకు డైరీ ఎలా రాసుకోవాలో కూడా నేర్పింది. పొద్దున్నే నిద్ర లేవగానే అప్పటికే మరపులోకి జారుతున్న రాత్రి కలల్ని పట్టిపట్టి గుర్తుతెచ్చుకునిమరీ రాసుకునేవాడ్ని. డైరీని ఇదివరకట్లా మళ్ళీ ఎప్పుడో చదివే నా భవిష్యత్తు వెర్షనుకి గుర్తుండాలన్నట్టు రాయటం కాక, అప్పటికప్పుడు ఇంప్రెషన్స్ లాగా రాసుకోవటం అలవాటైంది. ఆ ప్రభావంలో నేను రాసుకున్న డైరీ నాకెంత ఇష్టమంటే ఓ మూడేళ్ళు కలిపి రాసుకున్న అదొక్క డైరీనే ఇప్పటికీ దాచుకున్నాను. అలాగే కాఫ్కా తన డైరీల్లో చాలా రైటింగ్ ఎక్సర్సయిజుల్లా రాసుకుంటాడు. ఒక్కోసారి ఏవి డైరీ ఎంట్రీలో, ఏవి రైటింగ్ ఎక్సర్సయిజులో కూడా సగం దాకా చదివాక గానీ అర్థం కావు. నేను కూడా అదే కోవలో ఏం తడితే అది రఫ్ నోటు పుస్తకాల్లో రాసేవాడిని. అంటే ఒక ఊహలో నిన్ను నువ్వు నిలుపుకొని ఇక అది నిన్ను ఎటు తీసుకెళ్తే అటు-- ముందేముందో తెలీకుండా-- వెళ్ళిపోవటం. ఇలా ఆఫీసులో ఖాళీ దొరికినప్పుడూ, లోకల్ రైలు కోసం ఎదురు చూస్తున్నప్పుడూ, రాత్రుళ్లు నిద్రపట్టనప్పుడూ… ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ రాస్తూనే ఉండేవాడిని. అలా ఓ నాలుగైదు రఫ్ నోట్స్ బుక్స్ ఖర్చయ్యాయి ఈ రాతలతో. కాఫ్కా డైరీస్ నన్ను సినిమా పిచ్చి నుంచి కూడా క్యూర్ చేసేసింది (నా సాహిత్యం పిచ్చికి సమాంతరంగా సాగిన సినిమా పిచ్చి గురించి రాస్తే ఇంకో ఇంత పెద్ద రాత అవుతుంది). ప్రపంచ సాహిత్యం ఇలా నా ముందు తెరుచుకున్నాక తెలుగు సాహిత్యం జోలికి దాదాపు వెళ్ళలేదు. కాఫ్కా, దాస్తోయెవస్కీ తోపాటు, నబొకొవ్, చెస్టర్టన్, బోర్హెస్, ఫ్లాబెర్ట్… వీళ్లవే గాక వీళ్ల గురించి రాసినవి కూడా విపరీతంగా చదివేవాడ్ని. వీళ్లతో పాటు తర్వాత చదివిన టాలుస్టాయి, చెఖోవ్, బెకెట్, ప్రూస్ట్, శాలింజర్ లాంటివాళ్లు నా చేతనాకాశంలో మెగాస్టార్లు (టాలుస్టాయిని తోలుస్తాయి అనో, చెఖోవ్ చెహోవ్ అనో, ప్రూస్ట్‌ని ప్రూ అనో అనాలని సజెషన్లు ఇవ్వబాకండి, నాకు వళ్లు మండే విషయాల్లో అలాంటి pedantry కూడా ఒకటి). నేను చదువుకున్నదంతా దాదాపు ఇలా ''వొట్టి'' కథలే అయినా– సైన్సు కానీ, ఫిలాసఫీ కానీ, చరిత్ర కానీ, సోషియాలజీ కానీ చదువుకోని లోటు నాకెప్పుడూ తెలియలేదు. నిజానికి ఆయా శాస్త్రాల్లో గొప్పవనే పుస్తకాలు ఎప్పుడు తెరిచి చదవబోయినా, నాకు ఈ రచయితల కథలు కలిగించిన జీవిత స్పృహ ముందు ఆ పుస్తకాల్లో జ్ఞానం తీసికట్టుగా కనిపించేది. ఈ రచయితలు వాళ్ల కథల ద్వారా శాస్త్రీయ, చారిత్రక, సామాజిక, సైద్ధాంతిక సత్యాలకు మించిన సత్యాలను నాకు ఇచ్చారు. వీళ్లల్లో నబొకొవ్ నాకు రచయిత అంటే ఒక sovereign being అన్నది నేర్పాడు. నబొకొవ్ ఇంకా చాలా నేర్పాడు: పాటించలేనివి, ఆయన్ని ఆదర్శంగా పెట్టుకుంటే అనుసరించటానికి అసాధ్యమైనవి. నా డీటెయిల్స్ పిచ్చి నబొకొవ్ ని చదివాకా మరింత ముదిరిపోయింది. అది నా మొదటి ముద్రిత కథలో కనిపిస్తుంది. ‘‘ముద్రిత’’ కథ అంటే బ్లాగులో నేనే పోస్టు చేసిన కథ. నాకు 2007లో తెలిసింది తెలుగులో బ్లాగులు రాయొచ్చని. ఇంటర్నెట్ సెంటరుకి వెళ్లి నాకూ ఒక బ్లాగు పెట్టేసుకున్నాను ‘నా గొడవ’ అని. మొదలుపెట్టిన మూడో నెలకి ఒక కథ రాశాను. ఎప్పుడో పదో తరగతిలో రాసినంతా, ఈనాడుకి పంపటానికి డిగ్రీ చివర్లో రాసినంతా, తర్వాత నా డైరీల్లో రాసుకున్నంతా సులువు కాలేదు– ఈసారి కథ రాయటం. దీనికి కారణం నబొకోవే. ఆయన్ని చదివిన తర్వాత రాయటం ఒక టార్చరస్ యవ్వారం అయిపోంది. ఆ కథ ఒక భార్యాభర్తల గురించి. నాకు అప్పటికి పెళ్లి కాలేదు. పెళ్లిలో ఉండటం అంటే ఏంటో తెలీదు. తెలీని అనుభవాన్ని నిర్మించటానికి నేను డీటెయిల్స్ మీద ఆధార పడ్డాను. రాయటమన్నది నిర్మించటం లాగా తయారయ్యింది. ప్రతీ రెండో వాక్యం ఒక నిర్మాణమే. కొంతమంది నచ్చిందన్నారు. కానీ ఈ యాతన తర్వాత నాకు రెండో కథ రాయటానికి భయమేసింది. కథని ప్రయత్నపూర్వకంగా నా అనుభవానికి దూరంగా, నా నుంచి స్వతంత్రంగా నిలబెట్టే ఈ ప్రయాస నుంచి విడుదలవటానికీ, మళ్లీ రాయటం గురించి ఏమీ తెలియకముందున్న ఒక అలవోకడని వెనక్కి తెచ్చుకోవటానికీ నాకు చాన్నాళ్లు పట్టింది. ఇదంతా ఒక కొలిక్కి వచ్చింది మాత్రం త్రిపురని చదివాకే. రచనలో డీటెయిల్స్ ముఖ్యమే కానీ– ఎందుకు ముఖ్యమన్నదీ, ఎంతవరకూ ముఖ్యమన్నదీ ఆయన్ని చదివాకా తెలిసింది. అది తెలిసాక, రాయటం మళ్లీ ఒక ఆనందపెట్టే పని అయ్యింది. కథ రాయటమంటే బ్లూ ప్రింట్ ఆధారంగా ఇల్లు కట్టడం లాంటిది కాదనీ, తెలీని దారుల్లో ఇంకా రూపించని దేన్నో వెతుక్కోవటం లాంటిదనీ అర్థమైంది. రాస్తూనే రచనని వెతుక్కోవటం అన్న ఈ పద్ధతిలో నేను రాసిన మొదటి కథ ‘లోయల్లో ఊయల’ (2014). ఆ తర్వాతి కథల్లో పైన చెప్పిన రెండు పద్ధతులూ వేర్వేరు లెవెల్స్‌లో ఉన్నాయి. అంటే ఒక్కో కథని ఒక్కో పద్ధతి డామినేట్ చేసింది. కానీ పూర్తిగా రెండో పద్ధతిలో రాసింది ‘ముక్కు’ (2019). నా కథల్లో నా ఫేవరెట్. పదోతరగతిలో నా మొదటి కథ రాసినప్పుడు ఏ "కిక్" గురించి చెప్పానో అలాంటిది ఈ కథ రాసే ఆద్యంతం అనుభవించాను. నా కథలు చూట్టానికి పెర్సనల్ అనుభవాల్ని బయటకి చెప్పుకోవటమే పనిగా రాసినట్టుంటాయి. కానీ నన్ను ఎక్సైట్ చేసిన వేర్వేరు వ్యక్తీకరణ విధానాల్ని కాయితం మీద పెట్టి టెస్టు చేసుకోవటం కూడా నాకు ముఖ్యం. అలా టెస్టు చేసుకోవటానికి ఒక ఇతివృత్తం అంటూ ఉండాలి గనక, అది సిద్ధంగా దొరికేది నా అనుభవంలోనే గనుక, ఆ కారణం చేతనే అవి పెర్సనల్ కథలయ్యాయి.
2007 నుంచి 2012 దాకా బ్లాగుని చాలా శ్రద్ధగా రాశాను. అది నేను నడిపే నా పత్రిక అన్నట్టు ఫీలయ్యేవాడిని. అస్తమానూ కథలే అంటే రాయటం అంటే కష్టం కాబట్టి, చదివేవాళ్లకి బ్లాగులో తరచూ ఏదన్నా కొత్త విషయం కనిపించాలి కాబట్టి, కేవలం ఆ రీజన్ కోసమే, వ్యాసాలు, అనువాదాలు మొదలుపెట్టాను. వ్యాసాలు రాయటం మొదలుపెట్టగానే నా గురించి నాకొక భయంకరమైన నిజం తెలిసింది. నేను ఒక పుస్తకాన్ని/ రచయితని అయితే ఇష్టపడతాను, లేదంటే తీసిపారేస్తాను. నాకు మిడిల్ గ్రౌండ్ అంటూ లేదు. అందరూ నెత్తికెక్కించుకునే చాలామంది రచయితలు నాకు ఎక్కరు. బ్లాగులో నా మొదటి వ్యాసంలోనే అయాన్ రాండ్ నాకు ఎంత నచ్చదో రాశాను. ఇప్పటికీ తెలుగులో గొప్పవాళ్లనబడే రచయితల్లో చాలామంది రచనలు నాకు నచ్చవు. గోపీచంద్, చాసో, రావిశాస్త్రి, కాళీపట్నం, కేశవరెడ్డి.. వీళ్ల రచనల మీడియోకర్ క్వాలిటీకి, గొప్ప రచయితలుగా వీళ్లకున్న పేరుకీ మధ్య నాకు పొంతన కనపడదు. అండర్రేటెడ్ జీనియస్సులని చెప్పబడే చండీదాస్, సి.రామచంద్రరావు లాంటి వాళ్ల రచనలు పరమ చప్పగా కనిపిస్తాయి. వీళ్లందరికంటే, అరివీర ఇడియోసింక్రాటిక్గా రాసిన, కవికొండల లాంటి వాళ్ల కథలే బాగుంటాయి. మామూలుగా ఇలాంటి అభిప్రాయాలు అందరు పాఠకులకూ ఉంటాయి. కానీ ఆ పాఠకులు రచయితలు కూడా అయినప్పుడు ఇలాంటి అభిప్రాయాలని ప్రకటించటంలో కొంచెం మితం పాటిస్తారు. బహుశా ఎందుకంటే– రచయితలు స్వయంగా ఇలాంటి అభిప్రాయాలు ప్రకటించినప్పుడు– చూసేవాళ్లు దాన్ని ఒక చదువరి అభిప్రాయంగా కన్నా, వృత్తిపరమైన స్పర్థగా చూసే అవకాశం ఉంది కాబట్టి, లేదంటే ‘‘నువ్వు వాళ్లకంటే గొప్పగా రాస్తావా?’’, ‘‘అసలు వాళ్ళని అనేంత స్థాయి నీకుందా?’’ లాంటి ఎత్తిపొడుపులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి. అయితే స్వయంగా ముద్రిస్తున్న నా పత్రిక లాంటి బ్లాగులో మొహమాటం ఏముంది. బ్లాగు రాయటంలో అలవాటైన ఈ నిర్మొహమాటం నాకు తర్వాత కూడా కొనసాగుతూనే వచ్చింది. నేను గొప్పగా రాస్తానో లేదో నాకు తెలీదు (తెలీనక్కర్లేదు, నాకు రాయటం సంతోషాన్నిచ్చినంత వరకూ) కానీ, నేను గొప్ప రచయితల్ని చదివే గొప్ప చదువరిని. ఆంటన్ చెహోవుని చదివిన చూపుతోనే చాగంటి సోమయాజుల్నీ చదువుతాను. ఈ రెండో ఆయన తెలుగోడని డిస్కౌంటు ఇవ్వలేను. త్రిపురని గొప్పోడన్నానంటే మరి తెలుగోడన్న డిస్కౌంటిచ్చి అనటం లేదు. సెలీన్నో, జాక్ కురవాక్నో చదివిన చూపుతోనే ఆ మాట అంటాను. ప్రతిభకి నా మనసులో ఉండే కొలమానం ప్రపంచవ్యాప్తంగా ఏ రచయితకైనా సమానంగా అన్వయించాలి కదా. వీటిని ప్రమాణాలుగా తీసుకోమని ఎవ్వర్నీ అడగటం లేదు. ఇవ్వన్నీ సాహిత్యమనే వ్యవస్థలో రికార్డు అవ్వాలని లేదు. కానీ నా అభిరుచులే నన్ను మలిచేవి. వాటి విషయంలో దాపరికం అనవసరం. అవి ఇంకెవరి అభిరుచులతోనో కలవటం లేదని కుక్కజెట్టీలు ఇంకా అనవసరం. వ్యాసాలు రాయటం ఒకవిధంగా నా అభిరుచిని నాకు స్పష్టం చేసింది. ఆలోచన ప్రధానమైన ఇలాంటి రచనల్లోనూ ఒక ఆనందం ఉంటుంది. ఆలోచన వాక్యం నుంచి వాక్యానికి ఎలా ప్రసారమవుతున్నదీ, ఎక్కడ ఒక ఆలోచన చక్కగా ముగిసి దాని అనివార్య పర్యవసానమైన రెండో ఆలోచన వైపు మరుసటి పేరాతో ఏ తీరున మొదలవుతున్నదీ… ఇలాంటి నిర్వహణను గమనించటం… వ్యాసాలు చదువుతున్నప్పుడూ, రాస్తున్నప్పుడూ ఆనందాన్నిస్తుంది. I have had this pleasure... plenty of it.
అనువాదాలు చేసేటప్పుడు నాకు దొరికే ఆనందం వేరు. అనువాదం వెనుక నా ఉద్దేశం చాలావరకూ– ఈ ఫలానా రచయిత ఎక్స్‌ప్రెషన్ తెలుగులో ఎలా ఉంటుందీ అన్న కుతూహలమో, ఈ ఫలానా రచయిత కోసం తెలుగుని ఎలాంటి కొత్త దారుల్లో నడపవచ్చో అన్న ఉత్సాహమో. అంతేగాక, అనువాదం అంటే మనం అభిమానించిన రచనని అత్యంత దగ్గరగా వెళ్లి చదవటం. అనువాదం కంటే దగ్గరి పఠనం ఇంకేమీ ఉండదు. మొన్నామధ్య యూరీ ఓలేషా కథ ‘ల్యోంపా’ని నేను ఎంతో సంతోషంతో అనువదించాను. ఆ కథని నా అంత దగ్గరగా ఓలేషా కాలంలోనైనా ఎవరైనా చదివుంటారా అన్నది అనుమానమే! బ్లాగులో నా మొదటి అనువాదం ఎడ్గార్ అలెన్ పో ‘టెల్ టేల్ హార్ట్’కి చేశాను. దానికి నేను పూర్తిగా డిక్షనరీ మీద ఆధారపడ్డాను. ఒక్క పదం కూడా వదలకుండా చేద్దామని ప్రయత్నించాను. ఇలా లిటరల్‌గా అనువాదం చేయటంలో అస్సలు ఆనందం లేదు. కథలు రాయటం విషయంలో నా ప్రయాణం కాన్షస్ కనస్ట్రక్షన్ నుంచి స్పాంటేనిటీ వైపు ఎలా మళ్లిందో, అనువాదాల విషయంలో కూడా అలా లిటరల్ అనువాద పద్ధతి నుంచి స్వేచ్ఛానువాద పద్ధతికి మళ్లటానికి కొంచెం సమయం పట్టింది. నా కాఫ్కా అనువాదాలవన్నీ సక్సెస్ అని చెప్పను. నా శక్తి మేరకు చేశాను. అవి సక్సెస్ కావటం కంటే నాకు ముఖ్యమైనది, ఇందాకే చెప్పినట్టు, అనువాదం సాకుతో కాఫ్కాని అత్యంత దగ్గరగా చదవటం. కాఫ్కా పేజీలని నీళ్లల్లో నాన్చి ముద్దచేసి మింగటమొక్కటే తరువాయి!
బ్లాగు రాయటం అంటే ఏదో నేనున్న నా గూటి నుంచి శూన్యంలోకి కొన్ని కూతలు కూయటం అనుకున్నానంతే. మళ్లీ అక్కడ ఒక బ్లాగింగ్ కమ్యూనిటీ ఉందని మెల్లగా తెలిసింది. కొంతమంది బయట కలిసి మీటింగులు కూడా పెట్టుకునేవాళ్లు. అప్పట్లో బ్లాగులు రాసినవాళ్లల్లో ఎక్కువమంది కంప్యూటర్ని ఇళ్లల్లో వాడే వీలున్నవాళ్లు–అంటే ఎక్కువగా ఎన్నారైలు, టెకీలు. నేను ఈ రెండు విభాగాలకీ చెందను. బ్లాగులున్నాయి కాబట్టి నేను రాయటం మొదలుపెట్టలేదు. అప్పటికే పుస్తకాలకి పుస్తకాలే రాతలతో నింపేస్తున్నాను. పత్రికలకంటే ఎక్కువ స్వేచ్ఛనిచ్చే మాధ్యమం కోసం ఎదురుచూస్తున్నాను. ఎన్నారైలు తెలుగు ప్రాంతం నుంచి దూరం వచ్చేసిన వాళ్లు. టెకీలు అంతకుముందులేని క్యుబికల్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తొలి తరంవాళ్లు. బ్లాగుల్లో అటు ఎన్నారైలు, ఇటు టెకీలు ఇద్దరూ వేర్వేరు కారణాల వల్ల ఇంగ్లీషు ప్రభావంలేని అచ్చ తెలుగులోనే రాయాలన్న పట్టుదలతో ఉండేవారు. పరమ కృతకమైన, వెగటైన ‘అంతర్జాలం’, ‘జాలగూడు’ లాంటి పదాలు అప్పట్లోనే పుట్టాయి. ఒక కమ్యూనిటీలో మసులుతున్నప్పుడు తెలీకుండానే మనమీద ఆ ప్రభావం పడుతుంది. నా మొదటి కథలో భాష చూస్తే నాకే ఎంతో ఎబ్బెట్టుగా ఉంటుంది. మెల్లగా ఆ కృతకత్వం నుంచి దూరం వచ్చి, కాస్త సాహిత్య పరంపర అయిన భాష వైపు, ఇంకా సాధ్యమైతే నా నోటి నుంచి వచ్చేలాంటి భాష వైపు రావటానికి సమయం పట్టింది. అలాగే బ్లాగుల్లో కొంతమంది ఎన్నారైలు తెలుగు సంస్కృతి మీద బెంగతో మరీ వెనక్కి ప్రాచీన సాహిత్యం దాకా వెళ్లిపోయేవారు. అప్పట్లో నేనూ కొన్ని కావ్యాలు కొన్నాను. చదివే ప్రయత్నం చేశాను. నా ఈ కుతూహలం చూసి అప్పట్లో నా కొలీగైన శ్రీరమణగారు ‘‘ఒక చోట ఆగితే బాగుంటుంది’’ అని సలహా ఇచ్చారు. అందుకని కాదు కానీ, ఆ పాత సాహిత్యం నా ఉద్దేశాలకి ఎందుకూ పనికి రానిదని అర్థమైంది. ఆ సాహిత్యంలోని ప్రపంచాలూ మనుషులూ నా ఆవరణకి చాలా దూరమని అనిపించింది. రాసేవాడిగా నాకు ''ఇప్పుడు'' నా చుట్టూ ఉన్న జీవితం ముఖ్యం, నన్ను రోడ్డుమీద రాసుకుంటూ పోయే మనుషులు నాకు ముఖ్యం. నేను సృష్టించాల్సింది ఈ ప్రపంచాన్ని, ఈ మనుషుల్ని, అందుకు వాడాల్సింది నా చుట్టూ వినపడే భాషని. నాకు తిక్కనైనా, పోతనైనా పూర్తిగా అనవసరం. ఎక్కడో ఇరవయ్యో శతాబ్దం జపనీస్ రచయిత షిగా వీళ్లందరికంటే ప్రాచీనుడిగా అనిపిస్తాడు. వీళ్లందరికంటే దగ్గరగా నా అనుభవాల గురించి నాతో మాట్లాడతాడు. ఈ సాహిత్య వ్యవస్థ ఎంత ఘనమైనదైనా, నాతో మాట్లాడిందాకానే నాకు దానితో నిమిత్తం. క్రమంగా ఈ నిర్ణయానికి వచ్చాకా, నా పరిధిలో నాకు ముఖ్యమైనవే మిగిలాయి. సమయం ఆదా అయ్యింది.
నా బ్లాగులో పోస్టు చేసిన ‘రంగువెలిసిన రాజుగారి మేడ’ అన్న కథని నరేష్ నున్నా ‘పాలపిట్ట’కి పంపాడు. అలాగే సాక్షి సాహిత్యం పేజీలో కొత్తగా రాస్తున్నవాళ్లంటూ నన్నూ పరిచయం చేశాడు. అలా కంటెంపరరీ తెలుగు సాహిత్యంలో ఉన్నవాళ్లకి నేనొకడ్ని తెలిశాననుకుంటాను. ఆ కథ పడినప్పుడు కేశవరెడ్డి నుంచి లక్ష్మీపార్వతి దాకా నాకు ఫోన్లు చేశారు. కొన్ని రచయితల సమావేశాలకి రమ్మని ఆహ్వానాలందాయి. భుజం తట్టడానికి కొన్ని చేతులు పైకి లేచాయి. నాకు దారి చూపటానికి వాళ్ళ వాళ్ళ దారుల్లోంచి పిలుపులు వినపడ్డాయి. రచన నచ్చిందని రచయిత మీద ఇష్టంతో కలవటం వేరు. కేవలం వాళ్లూ రచయితలన్న కారణాన ఆ గుంపులో భాగంగా కలవటం వేరు. ఆ కథ వల్ల వచ్చిన అలాంటి ఆహ్వానాలన్నీ కాదన్నాను. చాలామంది రాయటం మొదలుపెడుతూనే ‘‘రచయిత’’లన్న సమూహంలో భాగమనే ధోరణిలోకి వెళ్ళిపోతారు. వాళ్ల వ్యక్తిత్వానికి ముఖ్యమైన ఐడెంటిటీ ‘‘రచయిత’’ అన్నదే అవుతుంది. కానీ నాకు అది ఒప్పలేదు. ‘‘రచయిత’’ అన్నదే నా ముఖ్యమైన ఐడెంటిటీ అయితే, రాస్తున్నవాళ్లతో రోజల్లా కలబోసుకోవటమే నా పని అయితే, మరి ఏదన్నా రాయటానికి నన్ను జీవితమెలా సోకుతుంది, నాదాకా రావటానికి జీవితానికి సందెక్కడ దొరుకుతుంది? నేను కొడుకుని, అన్నయ్యని, భర్తని, తండ్రిని, స్నేహితుడిని, మోహితుడిని, మా ఓనరు ఇంట్లో అద్దెకుండేవాడ్ని, మా పాలవాడికి ఖాతావున్నవాడిని, ఒక పరిచయస్థుడికి తీర్చలేనంత అప్పున్నవాడిని, రోడ్డు మీద నా బండి గుద్ది రచ్చపెట్టుకున్నవాడికి అపరిచిత కోపధారి మనిషిని, "ఇన్ని దినాల జీవితం పన్నిన వ్యూహంలో" అనుభవాల మలుపుల్లో చిక్కుకుని దారీతెన్నూ తెలియకుండా గమిస్తున్నవాడిని… ఇవన్నీ నాకు రాసేవాడిగా చాలా ముఖ్యమైన ఐడెంటిటీలు. నేను వీటన్నిటినీ నిలుపుకోవాలి. ‘‘రచయిత’’ అనే తొక్కలో ఐడెంటిటీ కంటే ఇవి వందరెట్లు ముఖ్యం. నాకు వీటితో పరిచయం పోతే– ఇక ‘‘రచయిత’’ అన్న ఐడెంటిటీ ఉన్నా ఒకటే ఊడినా ఒకటే. ఎందుకంటే ఇక ఆ తర్వాత రాసేదంతా డొల్ల అక్షరమే. కాబట్టి ‘‘రచయిత’’ అన్న ఐడెంటిటీ వైపు నన్ను గుంజాల్సింది నా రాత మాత్రమే. దానికి అతీతంగా ప్రతి ఆహ్వానాన్నీ, ప్రతిపాదననీ కాదన్నాను. ఒకసారి ఒక తోటి రచయిత నాకు ఫోన్ చేసి కలుస్తా అన్నాడు. రమ్మన్నాను. అతను చౌరస్తాకి వస్తే వెళ్లి రిసీవ్ చేసుకున్నాను. ఇంటికి వచ్చాక అతను: ‘‘మీరు రిక్లూసివ్ అనీ, ఎవ్వర్నీ కలవరనీ నాతో ఒకరు చెప్పారు. మీరు బానే రిసీవ్ చేసుకున్నారు’’ అన్నాడు. ఈ ‘‘రిక్లూజివ్’’ అన్న విశేషణం సంపాదించటానికి శాలింజర్ అన్న రచయిత ఎవరికీ తెలియని ఒక ఊరికి పోవాల్సి వచ్చింది, ఇంటి చుట్టూ పెద్ద కంచె కట్టుకోవాల్సి వచ్చింది, ఏవో అత్యవసరాలకి తప్ప బైటకి రాకుండా దశాబ్దాలపాటు జర్నలిస్టుల నుంచీ ఫొటోగ్రాఫర్ల నుంచీ దాక్కోవాల్సి వచ్చింది– నాకు మాత్రం సాహిత్య సమావేశాలకి వెళ్లకపోవటం ఒక్కటీ సరిపోయింది. నేను సాహిత్యమనే వ్యవస్థలో భాగం కాదల్చుకోలేదే తప్ప, ఏ స్నేహ ప్రతిపాదననీ ఎప్పుడూ తిరస్కరించలేదు. ఆ స్నేహం ‘‘రచయిత’’ అన్న ఐడెంటిటీని దాటి ఉండాలని కోరుకున్నానంతే. అలాంటి స్నేహాలు కొన్ని ఏరుకున్నాను, కొన్ని కలిసి వచ్చాయి. కొన్ని మాటలు బాల్య స్నేహితుల దగ్గరే వెళ్లబోసుకోగలను, కొన్ని నా రాతలు పునాదిగా కలిసిన స్నేహాల దగ్గర మాత్రమే వెళ్లబోసుకోగలను.
సాహిత్య వ్యవస్థకు అతీతంగా, దాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని కార్యక్షేత్రాలుంటాయి. సమాజాన్ని మార్పు వైపు జరిపేందుకు కావాల్సిన సామూహిక యత్నాలుంటాయి. ఇక్కడ పనిచేసేవాళ్ల వల్ల ముఖ్యమైన పనులు జరుగుతాయి. అవేవీ నా కార్యక్షేత్రం కాదు. ఇక్కడ మొదలవుతోన్న ఈ వాక్యం చివర్న రాబోయే పదానికి నికరమైన అర్థం కూడా ఇచ్చుకోకుండానే– నేను ఇండివిడ్యువలిస్టుని. వ్యక్తి నాకు ముఖ్యం. వ్యక్తిగా ఇక్కడ నేను ఆక్రమించుకున్న, నా చేత నిండిన పరివలయం నాకు ముఖ్యం. ఇది నా అస్తిత్వం. పుట్టి పోయేలోగా నాకు ఇవ్వబడిన కాలం. నా చేతనలోకి ప్రవహిస్తోన్న ఈ స్థల కాలాల అనుభవాన్ని అథెంటిక్గా, నిస్సిగ్గుగా, నిజాయితీగా వెలిబుచ్చుకోవటమన్నది నాకు నేను అప్పజెప్పుకున్న పని. నేను విపరీతంగా ప్రేమించిన, పైన ప్రస్తావించిన నా మెగాస్టార్లు కూడా ఇదే పనిని ఎవరికి వాళ్లు అప్పజెప్పుకున్నారు. జీవితాలు వెచ్చించి రాశారు. చదివిన నాకెంతో ఇచ్చారు: వ్యక్తిగా నా జీవితాన్ని మరింత ఎరుకతో చూసేలా చేశారు, నన్ను తాకే సమాజం పట్ల మరింత సున్నితంగా మనగలిగే మనిషిగా తయారు చేశారు. ఇదే అనుభవాన్ని నా రాతలు ఇంకొరికి ఇవ్వటం ఇవ్వలేకపోవటం అన్నది నా పనిలో నా నేర్పుకి సంబంధించినది. నా ఉద్దేశం మాత్రం అది కాదు. నేను చెప్పిన మెగాస్టార్ల ఉద్దేశమూ అది కాదు. రచన ఒక సహజాతం. అప్పగించబడిన డెస్టినీ. అది పాటించాలి. అంతే! ఇలాంటి నిర్వచనం ఇవ్వటం ద్వారా నేను వందలాది వేరే రకం రచయితల్ని, వేరే రకం రచనల్నీ వెలి వేస్తున్నానని తెలుసు. ఈ పరిమితమైన అర్థంలో మాత్రమే నన్ను నేను రచయితగా చూసుకుంటాను. కానీ మరి ఈ పరిమిత వలయంలో కొన్ని పాలపుంతలే తిరుగాడుతున్నాయి. లెక్కపెడితే జీవితం చాలనన్ని నక్షత్రాలున్నాయి.
ఎవరి కోసం రాస్తున్నారూ అనే ప్రశ్న ఒకటి ఉంది. ‘‘నా కోసం నేను రాసుకుంటున్నాను’’ అన్న జవాబు పట్ల విపరీతమైన నిరసన కనపడుతుంది. ‘‘నీ కోసం నువ్వు రాసుకుంటే రాసి నీ సొరుగులోనే పెట్టుకోవచ్చు కదా’’ అనబుద్ధవుతుంది. కానీ ఇది ఆ జవాబుని సరిగ్గా అర్థం చేసుకోలేక అనే మాట. నబొకొవ్‍ని ఒక ఇంటర్వ్యూలో ‘‘మీ ఆదర్శ పాఠకులు ఎవరు?’’ అని అడిగారు. ఆయన సమాధానం: ‘‘నేను నా పాఠకులెవరూ అని ఊహించుకున్నప్పుడల్లా ఓ గది నిండా నా ముసుగులే తొడుక్కుని కూర్చున్న మనుషులు కనిపిస్తారు’’ అని. దానర్థం ఆయన తన కోసమే రాసుకుంటాడు, కానీ తన కోసమే రాసుకోడు. తన లాంటి మనుషులు ఉన్నారన్న నమ్మకంతో రాస్తాడు. నబొకొవ్‍ని నేను ప్రేమించానంటే నాలో ఎక్కడో నబొకొవ్ ఉన్నట్టే. కాఫ్కాని నేను ప్రేమించానంటే కాఫ్కాలో ఎక్కడో నేను ఉన్నట్టే. త్రిపురని నేను ప్రేమించిన క్షణంలో త్రిపురా నేనూ ఒక్కటే. ఇలాంటి క్షణం కోసమే ఇలాంటి రచయిత రాసేది. ఈ ఒక సర్క్యూట్ పూర్తవటం కోసమే అతని రచన అచ్చయ్యేది, పుస్తకంగా వచ్చేది. నా కథల పుస్తకం 'చేదుపూలు' వేయటం ప్లెజంట్ అనుభవం అని చెప్పను. ఒక చోట ఇరుక్కుని విసిగించి ఇంకో చోట నుంచి ఎలాగో బైటపడింది. పుస్తకంగా చూసుకున్నప్పుడు మాత్రం బావుంది. ‘‘ఇవి ఎన్నో నేనుల్లో కొన్ని నేనులు కాగితం దాకా వచ్చే ధైర్యం చేస్తే పుట్టిన కథలు’’ అని ముందుమాటలో రాశాను. అవును, ‘చేదుపూలు’ కథలన్నీ కూడినా నేను రాను. ‘చేదుపూలు’ కథలన్నీ నాలోంచి తీసేస్తే మాత్రం చాలా కోల్పోయిన శేషాన్ని అవుతాను. అందుకే ఆ పుస్తకానికి ముఖచిత్రంగా ఏం బొమ్మ వేయిద్దాం అని ఆలోచిస్తుంటే ఒక బోర్హెస్ మాట గుర్తొచ్చింది:
“A man sets out to draw the world. As the years go by, he peoples a space with images of provinces, kingdoms, mountains, bays, ships, islands, fishes, rooms, instruments, stars, horses, and individuals. A short time before he dies, he discovers that the patient labyrinth of lines traces the lineaments of his own face.”
(ఒక మనిషి ప్రపంచాన్ని బొమ్మ గీద్దామని పూనుకుంటాడు. ఊళ్ళూ, రాజ్యాలూ, కొండలూ, సముద్రతీరాలు, ఓడలూ, చేపలూ, గదులూ, పనిముట్లూ, నక్షత్రాలూ, గుర్రాలూ, వ్యక్తుల బొమ్మలతో కాన్వాసు మొత్తం క్రిక్కిరిసిపోయేలా చేస్తాడు. అతను చనిపోబోయే కొద్ది క్షణాలకు ముందు తాను ఎంతో ఓర్పుతో గీసిన ఆ గీతల అల్లిక తన ముఖ కవళికలనే అనుకరిస్తున్నదని గుర్తుపడతాడు).
అందుకే ఆ కథలకి నా ముఖం తప్ప మరింకేమీ నప్పదనిపించింది. ‘చేదుపూలు’ పుస్తకం వచ్చి రెండేళ్లవుతోంది. ఆ పుస్తకానికి వెనక మాత్రం ఇప్పుడు చెప్పుకున్న చరిత్రంతా ఉంది. ఈ పనిని చిన్నప్పుడు ఏ అమాయకత్వంలో నాకు నేను అప్పజెప్పుకున్నానో తెలీదు. పని మొదలుపెట్టాకా మాత్రం సగంలో ఆపేసిపోలేను. వాక్యం చివర్న ఒక చుక్క అద్దనిదే వదిలేయాలనిపించదు. ‘చేదుపూలు’ పుస్తకం నాకు చుక్కో, కామానో తెలీదు. ఒక రిలీఫ్ ఖచ్చితంగా. ఏదో పెద్ద కథ ముగిస్తే వచ్చే రిలీఫ్!
👌🌈😊❤️💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕🌹🌹💕💕😍
ReplyDelete