మనిషిగా మనం జ్ఞాపకాల కుప్పలం అంతే. ‘‘నేను ఇదీ’’ అని చెప్పుకోవటానికి ఎవరి దగ్గరా జ్ఞాపకం తప్ప వేరే ఋజువేం ఉండదు. ఒకడు తను మాత్రమే అథెంటిక్‌గా చెప్పుకోగల జ్ఞాపకానుభవాన్ని కథగా చెప్పుకున్నాడనుకుందాం ("అథెంటిక్" అన్నది ఇక్కడ చిన్న మాట కాదు, నువ్వు చదువుతున్నది ఒకడు బతికాడు). తెలుగులో దాన్ని నొస్టాల్జిక్ సాహిత్యం కేటగిరీలోకి చేరుస్తారు. అందులో ఏమాత్రం బాల్యం కనిపించినా ఇక నొస్టాల్జియా తప్ప ఇందులో ఏముంది అనేస్తారు. పత్రికలూ న్యూస్‌ఛానెళ్లూ సోషల్ మీడియా బ్రౌజింగులూ ఎన్జీవో పనుల ద్వారా తెలిసిన విషయాల్ని, అప్పటికి వాళ్లకున్న అవగాహనతోనో ఆనాటికి పాషనబుల్ అయిన ఐడియాలజీ ఆసరాతోనో అర్థం చేసుకుని, తెలిసీ తెలియని ప్రపంచాల్ని గిలికి పారేస్తే, అవి ఇక్కడ ముఖ్యమైన కథలు అవుతున్నాయి. ఏది అథెంటిక్, ఏది ఫాల్తూ అన్నది చప్పున పసిగట్టే (మామూలు) పాఠకులు అంతరించి మ్యూచువల్ అప్రిసియేషన్ క్లబ్బులు మాత్రమే మిగిలిన చోట మంచి కథలు రద్దీలో తప్పిపోవటం చాలా సులువు. నాకు తెలిసిన చాలా కథలు అలా తప్పిపోయాయి. చివరకి తెలుగులో మంచి కథలకి ఉండాల్సిన లక్షణాల్లో అలా ఎవరికంటా పడకుండా తప్పిపోవటం కూడా ఒకటేమో అనిపించటం... grim view, I know. ఎనీవేస్... ఇక్కడ చెప్పదల్చుకుంది: ఈ పెంచలదాస్ కథ గురించి. క్రాఫ్ట్ అంటే కాయితం మీద తెలివైన వాక్యాలు రాయటమనీ కొత్తగా కనపడటమనీ అనుకుంటారు చాలామంది. రాయాలనిపించిన థీమ్ ని imperceptible gradations తో, లోపలి కట్టుబడి ఏం తెలీకుండా చెప్పగలగటంలో ఉంది అసలైన క్రాఫ్ట్. అది ఈ కథలో ఉంది. ఉందని తెలీనివ్వని అల్లిక అలవోకగా కుదిరింది.
నామినితో నేను చేసిన ఇంటర్వ్యూలో మాండలికం గురించి ఒక ప్రశ్న అడిగితే ఆయన ఇచ్చిన జవాబు ఇది: ‘‘అసలు ‘మాండలికం’ అంటే రైతులకు తెలీదు. నాకైనా కతల్రాసినాకే ఆ పేరు తెలిసింది. అదెవరో తెలుగు పండితుడు సృష్టించిన పదం. పల్లెటూరోళ్ల మాట, నిజానికి చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా చిన్నచిన్న తేడాల్తో అవే మాటలు. వాడు విరుడ్డం మనిసి అంటారు. విడ్డూరం నోట్లో పడి విరుడ్డం అయ్యింది. ...నోట్లో నాని నాణ్యంగా వచ్చిన పదాల్ని మాండలికం అనేస్తున్నారు.’’ అన్నాడు. ప్రతి మనిషికీ తన ఆవరణ ఉంటుంది, తను సౌకర్యంగా మసలుకునే స్పేస్ ఉంటుంది. అది వాడి "మండలం" అనుకోండి. అందులోంచి వచ్చే మాటే మాండలికం. మాండలికం లేని మనిషంటూ ఎవడూ ఉండడు, యాసలేని మాట ఎవడి నోటి నుంచీ రాదు. రాయటానికి తెలుగులో గ్రాంథికం అన్న పేరుతో ఒకప్పుడు కృతకమైన భాష ఒకటి చెలామణీలో ఉండేది. దాన్ని కాదని వచ్చిన వ్యవహారికంలో కూడా ఆ కృతకత్వం పూర్తిగా పోలేదు. అయితే అది మెల్లగా పత్రికల ద్వారానూ పాఠ్యపుస్తకాల ద్వారానూ ఒక ఒరవడిలోకి సర్దుకుంది. అదే సాహిత్యంలోనూ స్థిరపడింది. దాన్నే ప్రామాణిక భాష అంటున్నారు. ఒక కథకుడు తన ఆవరణలో వినపడే భాషతో, ముఖ్యంగా పల్లెటూరి నేపథ్యం నుంచి ఏదైనా రాస్తే దాన్ని మాండలికం అనేస్తున్నారు. కానీ నిజానికి ఆ మాండలికమే ప్రకృతి, "ప్రామాణిక" భాష అని అందరూ రాసేదే వికృతి. ఈ "ప్రామాణిక" భాష అనేది పత్రికల్లోనూ, పాఠ్య పుస్తకాల్లోనూ, రొడ్డకొట్టుడు కథల్లోనూ తప్ప జీవితంలో ఎక్కడా కనపడదు, వినపడదు. ఈ ప్రామాణిక భాషలో రాసేవాళ్లు కథల్లో ఒక భాష మాట్లాడతారు, వాళ్లని కలిస్తే వేరే భాష మాట్లాడతారు. అందుకే దాన్ని ‘‘నేర్చిన’’ భాష అంటాడు నామిని. మీరు పెంచలదాస్ ని కలిస్తే మీకు ఈ కథలో కనపడే భాషే అతని దగ్గరా వినిపిస్తుంది. ఇది మాండలికం కాదు. ఆయన మసిలిన ఆవరణ నుంచి ఆయన అంతరంగంలోకి ఇంకిన భాష.
నేను నామిని కథలు కొన్నింటికి ప్రూఫ్ చూశాను. ఆయన భాష విషయంలో చాలా పట్టింపుగా ఉంటాడు. "మీద" బదులు "మింద" అనే ఉండాలి. "అసహ్యా"న్ని "అసింకం" అనే రాస్తాడు. ఈ పెంచలదాస్ కథకి కూడా ఫాంట్ కన్వర్షన్ చేసినప్పుడు తప్పులొస్తే ప్రూఫ్ చూశాను. ఒకచోట "లేకుండా" అని పడితే "లేకండా" అని సరిదిద్దాడు. భాషా వ్యాకరణం ఎలా ఉన్నా, ఆయన అంతరంగ వ్యాకరణం "లేకుండా" అన్న మాటని ఒప్పుకోదు. "ఇలా ఎవడి లెక్క వాడి కుంటే భాష భ్రష్టుపట్టిపోదూ" అంటాడు పండితుడు. "నీ భాషా మాన సంరక్షణని నువ్వు పాఠ్య పుస్తకాలకీ, పరిశోధనా వ్యాసాలకీ, పత్రికా సంపాదకీయాలకీ అప్లయి చేయి, కవిత్వం దగ్గరా కథల దగ్గరా ఇట్టాంటి రచ్చ పెట్టకు" అంటాడు కథకుడు. "అయినా మరీ ఇంత గాఢమైన మాండలికం రాస్తే ఎట్లా? కొంచెం సామాన్య పాఠకులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా" అంటాడు మిడిల్ క్లాసు పాఠకుడు. ఒకడు తన జీవితానుభవాన్ని దాన్ని ఆవరించుకున్న భాషలో కూర్చి నీ ముందుకు తెస్తుంటే, చదవటానికి నువ్వు ఇబ్బంది పడుతున్నావంటే, అది కథ రాసినవాడు పట్టించుకోవాల్సినంత ముఖ్యమైన ఇబ్బంది కాదు. చదివేవాడే ప్రయత్నం మీద సరిచేసుకోవాల్సిన ఇబ్బంది. ఈ కథలో నాకు అర్థం కాని పదాలు లేవని కాదు. టైటిలే నాకు అర్థం కాలేదన్నాను. ‘‘ఏటి వెంబడి పిల్లంగ్రోవి ఏడుస్తూ పోయింది’’ అని అర్థం చెప్పారు పెంచలదాస్. ఒక కథకి అంత అందమైన పేరు విని చాన్నాళ్లయింది.