టారంటీనో తను తీయబోతున్న తర్వాతి సినిమా 'ద మూవీ క్రిటిక్' గురించి మాట్లాడింది ఇందాక చదివాను. తన సినిమాలో కల్పిత పాత్ర అయిన ఆ మూవీ క్రిటిక్ నిజంగా బతికుంటే ఎలాంటివాడో, వాడు ఎప్పుడు పుట్టుంటాడో, రివ్యూలు ఎలాంటి శైలిలో రాస్తాడో, ఎలాంటి సినిమాలని ఇష్టపడుతూ రాస్తాడో, వాడు రివ్యూలు రాసే పత్రిక పేరేమిటో... ఇలా ఏదో చెప్పుకుంటూ పోతున్నాడు. తన ముందు సినిమా 'Once Upon a Time in Hollywood' లో కూడా కల్పిత పాత్రయిన ఏక్టర్ రిక్ డాల్టన్ విషయంలో కూడా ఇలాగే వాడేదో నిజంగా బతికిన నటుడన్నట్టు వాడెలాంటి సినిమాల్లో నటించుంటాడో, ఆ ఫేక్ సినిమా క్లిప్పింగులూ, ఫేక్ పోస్టర్లతో సహా చూపిస్తాడు. ఈమధ్య తన పాడ్‌కాస్టులో కూడా రిక్ డాల్టన్ ఏ నిజమైన సినిమాలకి ఆడిషన్ ఇచ్చాడో, వాడిది ఏ డైటో, ఏ బ్రాండ్ సిగరెట్టో అన్న లెవెల్లో డిస్కస్ చేశాడని విన్నాను. ఒక కల్పిత పాత్రని రియల్ లైఫ్ లో సిచ్యుయేట్ చేయటానికి చుట్టూ కొన్ని plausible facts పేర్చటం ఏదో గొప్ప ఆర్టన్నట్టు, అవి ఊహించటమే ఆ పాత్రని నిజం చేసేస్తుందన్నట్టు... ఈ హడావిడి అంతా నాకు కొంచెం ఓవర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి మెటా ఆటలన్నీ లిటరేచర్ లో ఇంతకంటే బాబులా ఆడినవాడిని ఆల్రెడీ చూసున్నాను కాబట్టి.
అర్జెంటినా రచయిత బోర్హెస్ ఒక నవల రాయాలనుకున్నాడు. కానీ ఆయనకి కథలు తప్ప నవల రాసేంత ఓపిక లేదు. కాబట్టి ఒక కల్పిత రివ్యూయర్‌ని సృష్టించి వాడి చేత తను రాయాలనుకుని రాయలేకపోయిన నవల మీద తనే రివ్యూ రాసి ఆ రివ్యూనే కథలా ప్రెజెంట్ చేస్తాడు. అలాగే ఆయన 'గార్డెన్ ఆఫ్ ఫోర్కింగ్ పాత్స్' అన్న కథ రెండో ప్రపంచ యుద్ధంలో ఒక గూఢచారి ఇచ్చిన స్టేట్మెంటులో మొదటి రెండు పేజీలూ మిస్సయిన ఒక భాగం లాగ ప్రెజెంట్ చేస్తాడు. 'పీరే మెనార్డ్: ఆథర్ ఆఫ్ డాన్ కిహోటే' అన్న కథని ఒక కల్పిత రచయిత మీద క్రిటికల్ ఎస్సే లాగ రాస్తాడు. 'సర్క్యులర్ రూయిన్స్' అనే ఇంకో కథ ఒకడు అడవిలో పాడుబడ్డ దేవాలయానికి రావటంతో మొదలవుతుంది. వాడి ఉద్దేశం ఒక మనిషిని సృష్టించటం. ఆ పాడుబడిన గుడిలో నిద్రపోతాడు. ఆ నిద్రలో కనే కలల్లో ఒక మనిషిని రక్తమాంసాల్తో సహా, అవయవాల్తో సహా ఊహిస్తాడు. చివరికి ఆ మనిషిని వాస్తవ ప్రపంచంలోకి తెచ్చి వదులుతాడు. బైటి ప్రపంచంలోకి సాగనంపుతాడు. ఆ మనిషి వెళ్లిపోయాక, కథ చివర్లో వీడికి అర్థమయ్యేదేంటంటే- తను కూడా ఎవడి కలలోనో భాగమని. బోర్హెస్ ఇంకా ఇలాంటివి బొచ్చెడు రాశాడు. ఆయనే కాదు. జేమ్స్ జాయ్స్ కూడా ఒక కల్పిత రచయిత మీద వాడు ఉన్నాడన్నట్టు వాడి బిబిలియోగ్రఫీతో సహా కోట్ చేస్తూ ఎక్కడో ఉపన్యాసమిస్తే నిజంగానే అక్కడున్నవాళ్లందరూ సాహిత్య ప్రపంచానికి అంతవరకూ తెలియని కొత్త మహాద్భుతమైన రచయిత ఎవడో పుట్టుకొచ్చాడన్నట్టు నమ్మేశారట. నబొకొవ్ 'లొలీటా' నవల నిజంగా ఫలానా జైల్లో అరెస్టయి ఉన్నవాడు రాసుకున్న ఆత్మకథ లాగ, ఆ కథని వాడి లాయరే బైటి ప్రపంచానికి తెస్తున్నట్టు ఆ లాయరు రాసిన ముందుమాటతో సహా మొదలవుతుంది. నబొకొవ్ 'పేల్ ఫైర్' నవలేమో ఒక కల్పిత కవి రాసిన లాంగ్ పొయెంకి ఇంకో కల్పిత ప్రొఫెసర్ రాసిన క్రిటికల్ నోట్స్ లాగ ఉంటుంది. ఇలాంటి మెటా ఆటలన్నీ సాహిత్యంలో వందేళ్ల క్రితం నాటివి. అక్కడ పాతబడిపోయిన తర్వాత ఇప్పుడు ఈ "మెటా" అన్నది సినిమాల్లో పెద్ద విషయమయ్యింది.
కానీ ఎందుకో ఈ మెటా గేమ్స్ అన్నీ సినిమాల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం తేలిపోయినట్టనిపిస్తున్నాయి. ఒక పాత్రని రియల్‌గా అనిపించేట్టు చేసే ప్రయత్నంలో బైటి ప్రపంచంలో ఉన్న facts అన్నీ తెచ్చి ఆ పాత్ర చుట్టూ పేర్చటం పెద్ద విషయమేం కాదు. కానీ ఆ కేరెక్టరుని emotinally plausible human being గా మార్చటంలో ఉంటుంది అసలు పనితనం. నువ్వు ఒక పాత్రని సృష్టించి వాడు రాజమండ్రిలో ఫలానా హాస్పిటల్లో పుట్టాడని, వాడు ఫలానా కంపెనీ డైపర్స్ వాడేవాడని, వాడి ఉగ్గుగిన్నె ఈ షాపులో కొన్నారని రాసినంత మాత్రాన వాడు వాస్తవం అయిపోడు. వాడి అంతరంగం plausible గా ఉండాలి. వాడి స్వభావం consistent గా ఉండాలి. అవి నప్పేట్టు నమ్మేట్టు లేనప్పుడు నువ్వు రియల్ వరల్డ్ నుంచి ఎన్ని ఫాక్ట్స్ తెచ్చి వాడికి అప్లయి చేసినా వాడు నిజం అయిపోడు. ఆ ప్రయాస అంతా ఒక జిమ్మిక్ లాగ మిగులుతుందంతే.