April 30, 2012

"నెంబర్ వన్ పుడింగి" మీద అభిప్రాయం

కథల మీద సమీక్షలుంటాయి. స్వీయకథల మీద సమీక్ష లేముంటాయి. అవి రాసిన వ్యక్తుల మీద ఏర్పడే అభిప్రాయాలుంటాయి తప్ప. ఈ పుస్తకం వెలువడిన కొత్తల్లో వచ్చిన ప్రతిస్పందన చూసాక "చెడ్డ పుస్తక"మేమో అని నిజంగా అనుకున్నాను. దీని జోలికి పోలేదు. కానీ కనకప్రసాద్ ఎప్పటికీ పూర్తికాని ఆ మాయదారి "మూడు లాంతర్లు"లో నామిని పేరు పదే పదే పలవరించడం చూసాను. కనకప్రసాద్ కథల మీద ఇష్టం కొంత ఆయన అభిరుచుల మీదకూ పాకటంతో చూద్దాంలెమ్మని దీన్ని కొన్నాను. ఇదే నేను మొదటిసారి నామిని రచన పూర్తిగా చదవటం (రెండు మూడు కథల్ని మినహాయిస్తే). పూర్తి చేసాకా దీని పట్ల చాలామందిలో వెల్లువెత్తిన అసహనాన్ని తల్చుకుంటే ఒకటే అనిపించింది. మన తెలుగువారిని ఒక బొంగులో మర్యాదస్తుల మనస్తత్త్వం రోగంలా అంటుకుని ఎలా పీడిస్తుందో కదా అని. సాహిత్యం గురించి మాట్లాడుతూ ఆ ఆవరణలోనే మసిలే వాళ్ళకి కూడా కళాకారుల తత్త్వం గురించి ఎంత తక్కువ తెలుసో కదా అని. ఇక్కడ చాలా మంది రచనలకిచ్చే విలువ కన్నా, వాటిని రాసిన రచయితలతో ఏర్పడే ఒక సుహృద్భావ వాతావరణానికి ఎక్కువ విలువిస్తారు. అది వ్యక్తులకి ఏం చేకూర్చినా, సాహిత్యానికి చేటు చేస్తుంది. గుడ్డి విగ్రహారాధన ఒకటి ఏడిచింది మన పాఠకులకు. స్వంత వివేచన పక్కనపెట్టి నలుగురూ ఏ పల్లకీ మోస్తుంటే దాని కింద కెళ్ళి తమ భుజమూ అరువిచ్చేస్తారు.

పుస్తకంలో అభ్యంతరకరమైనవేం నాకు కనిపించలేదు. "కోతి కొమ్మచ్చి"లో ముళ్ళపూడి పేరు చెప్పకుండా కన్నప్ప అంటూ నటుడు కృష్ణంరాజుని పుస్తకమంతా ఆడిపోసుకున్నా, కేవలం పేరు చెప్పని ఆయన మర్యాద కారణంగా కామోసు, అంతా పాపం కదా అనుకుని ముళ్ళపూడి జట్టు చేరిపోయారు. నామిని పేర్లు చెప్పేసరికి అందరూ పిర్రల కింద టపాసులు పేలినట్టు హడలిపోయారు. నాకైతే ఎవర్నీ పనిగట్టుకుని బురదలోకి లాగాలని చూసినట్టు కనపళ్ళేదు. తన మానాన తన కథ చెప్పుకున్నాడు. ఆ కథలో పాత్రధారులైన వాళ్ళ పేర్లకున్న మర్యాదల్ని లెక్కలోకి తీసుకోలేదు. వాటినీ దాచకుండా చెప్పుకున్నాడు. తన కథల్లో ఎలాగైతే వాస్తవ ప్రపంచంలోని వ్యక్తుల్ని ఉన్నవాళ్ళనున్నట్టు కాగితం మీదకి లాక్కొచ్చాడో ఇక్కడా అలాగే చేసాడు.

ఎందుకో "కోతి కొమ్మచ్చి" నాకు మొదటి భాగంతోనే చాలనిపించింది, ఇది మాత్రం రెండో భాగం కూడా ఉంటే బావుణ్ణనిపించింది. లేదా ఈ భాగమే ఇంకా విస్తారంగా రాసి వుంటే బావుణ్ణనిపించింది. చాలాచోట్ల ఎవరో తరుముతుంటే రాసినట్టుంది. దేన్నో నిరూపించి చూపాలన్న తాపత్రయం కనిపించింది. జీవితంలో పడ్డ అవమానాలకి సినిమాటిక్ జస్టిఫికేషన్స్ అన్వయించుకోవడం కనిపించింది. సహజంగానే సాహిత్యాదర్శాల మీద ఆయనిచ్చిన ప్రవచనాలూ నాకు సమ్మతం కాలేదు. కానీ ఆయన చాసోని, పసలపూడి కథల్నీ, కేశవరెడ్డి ఇత్యాదుల రచనల్నీ అచ్చంగా నా కారణాల్తోనే తీసిపారేయటం మాత్రం చిత్రమనిపించింది. పుస్తకమంతా పూర్తయ్యాకా వ్యక్తిగా నామిని గురించి ఒకటే తీర్మానానికొచ్చాను: బయటి ప్రపంచానికి తనను ఎలా చూపించుకునే ప్రయత్నం చేసినా, నామిని తనదైన ఒక స్ట్రిక్ట్ మోరల్ కోడ్‌తో తంటాలు పడే మనిషి అని.

March 23, 2012

మిత్రభేదం పూర్తి కథ pdf

"మిత్రభేదం" కథ ధారావాహికకు అనువైంది కాకపోయినా, యీ బ్లాగరు మాధ్యమ పరిమితి వల్ల భాగాలుగా విడదీసి ప్రచురించాల్సివచ్చింది. ఒకే విడతలో చదవగలిగే కథ కాదు గానీ, చదువుతున్నపుడు యెక్కడ ఆపి మళ్ళీ యెక్కడ అందుకోవాలన్న నిర్ణయం చదువరికే వదిలేయాల్సిన కథ. అందుకే కథని pdf ఫైలుగా చేసి క్రింది లింకులో వుంచుతున్నాను. "రంగు వెలిసిన రాజుగారిమేడ కథ" కూడా దీనితో సంబంధమున్నదే కనుక దాన్ని కూడా ఫైలు చివర్న జత చేసాను (93వ పేజీ నుండి).

మిత్రభేదం pdf 

అందరికీ నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! 

March 21, 2012

మిత్రభేదం (ఆఖరిభాగం)

ముందుమాట | మొదటిభాగం | రెండవభాగం | మూడవభాగం | నాలుగవభాగం | ఐదవభాగం |
ఆరవభాగం | ఏడవభాగం | ఎనిమిదవభాగం | తొమ్మిదవభాగం | పదవభాగం | పూర్తి కథ pdf |  

సోషల్ టీచరు ప్రసంగం ముగియడంతో, అప్పటికి వుపాధ్యాయులందరి ప్రసంగాలూ పూర్తయ్యాయి. కానీ ఆయన కూర్చునేవాడు వూరకనే కూర్చోకుండా, విద్యార్థులు ప్రస్తుతం యెవరెవరు యేమేం చేస్తున్నారో ఒక్కొక్కర్నీ లేచి చెప్పమన్నాడు. అది విన్నాక కొందరు కుంచించుకుపోతే, కొందరు వుత్సాహాన్ని వుగ్గబట్టుకున్నారు. భద్రీ యేదో గొణుక్కున్నాడు. ముందు ఆడవాళ్ళతో ప్రారంభమైంది. వరసగా యిద్దరు-ముగ్గురు అమ్మాయిలు గృహిణులమంటూ ఒకే రకం సమాధానం చెప్పటంతో, సోషల్ టీచరు యిలాకాదని, మీ భర్తలు యేమేం చేస్తున్నారో కూడా చెప్పమన్నాడు. ఎక్కువమంది అమ్మాయిలు తమ భర్తలు వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. తర్వాతి స్థానం వృత్తిపనులు చేసే భర్తలు గల వారిదయింది. మెండు కనకమాలక్ష్మి మాత్రం తన భర్త పాలకేంద్రం నడుపుతాడని క్లుప్తంగా ముగించి, తర్వాత వార్డు మెంబరుగా తాను చేసిన పనులు చెప్పింది. తమ పార్టీ తరపున వూళ్ళో చందాలు వసూలు చేసి బడికి కొత్త పెంకు లేయించామనీ, బాదం చెట్టు చప్టా మీద వున్న సరస్వతీదేవి విగ్రహానికి చిన్న మండపం కట్టించామనీ చెప్పుకొచ్చింది. వచ్చినవాళ్ళలో పెళ్ళికాని వాళ్ళు ముగ్గురున్నారు: ఒకమ్మాయి అంగన్‌వాడీ టీచరుగా పని చేస్తోంది; ఒకమ్మాయి తండ్రి చనిపోతే తాలూకాఫీసులో ఆయన వుద్యోగం చేస్తోంది; ఒక క్రైస్తవుల అమ్మాయి నర్సుగా పని చేస్తోంది.

ఆడవాళ్ళ పరిచయాలు దాదాపు పూర్తయ్యాకా, రేణుకాదేవి వచ్చింది.

వెనుక గుమ్మంలోంచి రావటంతో యెవరూ ఆమె రాకను గమనించలేదు. ఆమె కూడా యెవరి ధ్యాసా మళ్ళించకుండా ఒబ్బిడిగా వచ్చి వనజాక్షి ప్రక్కన కూచుంది. శేషు మాత్రం యేదో అతీంద్రియ జ్ఞానం కబురందించినట్టు చటుక్కున తల తిప్పి చూసాడు. ఆ క్షణాన వర్తమానం చెర్నాకోల దెబ్బతిన్న గుర్రంలా గతి మార్చింది. ఆ వురవడికి సర్వేంద్రియాలు మ్రాన్పడి అయోమయపడ్డాడు. అప్రయత్నంగా బాలా వైపు చూసాడు. అతను శేషు వైపు సన్నగా నవ్వుతున్నాడు. హృదయస్పందన గతుకులో పడి లేచినట్టయింది. దేహంలో సిరల కుహురాల్లో రక్తప్రవాహం వరద గోదారిలా పరవళ్ళుతొక్కింది. వెన్ను చివర్నుంచి ఒక జలదరింపు విద్యుద్ఘాతంలా పాకి మెడ వెనుక భాగాన్ని రోమాంచితం చేసింది. ఆమె నవ్వుతూ యేదో మాట్లాడుతోంది. వనజాక్షి వళ్ళో వున్న బుడ్డాడి బుగ్గ పుణుకుతోంది. అది యిందాక తాను పుణికిన బుగ్గేనా అని గుర్తుతెచ్చుకున్నాడు. ఇదో శుభశకునంలా అనిపించింది. భద్రీతో మాట్లాడే మిష మీద అతని మెడ వెనుక నుంచి రేణూని చూస్తున్నాడు. ఆమె యిటు చూస్తుందని ఆశించాడు. కానీ యిటువున్నదేదో గోడ అన్నట్టు ఆమె చూపు మరలటమే లేదు. జరీలేని కనకాంబరం రంగు కంచిసిల్కు చీర కట్టుకుంది. చీరలో యేమన్నా కాస్త ఆడంబరం వుంటే, దాన్ని ఆమె మిగతా వైఖరి రద్దు చేస్తోంది. ముఖంలో పెద్ద సజాయింపులేని సాదాతనం కనిపిస్తోంది. తలంటి పోసుకున్న జుట్టు జడకట్టులోంచి అలలుగా చెదిరి వుంది. ఇన్నాళ్ళూ శేషు ఆమె యెదిగాక యెలా వుంటుందని వూహించుకున్నాడో ఆ రూపానికీ, యీ రూపానికీ సామ్యం తక్కువే వుంది. కానీ యీమెను ఒక్కసారి చూడటంతోనే వూహల్లోని రూపం చిరునామా లేకుండా చెరిగిపోయింది. అతని ఆశలన్నీ రివ్వుమంటూ యిప్పటి రూపం చుట్టూ వచ్చి ముసురుకున్నాయి.

ఆడవాళ్ళ పరిచయాలయ్యాక మగవాళ్ల పరిచయాలు ప్రారంభమయ్యాయి. శేషు తన వంతు కోసం అసహనంగా యెదురు చూసాడు. మాట్లాడటానికి లేచి నుంచున్నపుడైనా తాను ఆమె కంటపడతాడని ఆశ. వాళ్ళు కూర్చున్న బెంచీలో ముందు భద్రీ వంతు వచ్చింది. అతను తనేం చేస్తున్నాడో చెప్పటం మానేసి, వేదిక నలంకరించిన గురువులకి నవస్కారాలు అంటూ ముందు దణ్ణం పెట్టి, నా మనసులో చాణాల మట్టీ వున్న ఓ సంగతి యీ రోజు యావన్మంది తోటీ చెప్దారనుకుంటున్నా, అని మొదలుపెట్టి, చిన్నపుడు తామందరి మధ్యా వున్న స్నేహపూరితమైన వాతావరణం యిప్పుడు కొన్ని కారణాల వల్ల పలచబడిపోతోందనీ, అవేమిటో అందరి మనస్సాక్షిలకీ తెలుసు కాబట్టి తాను చెప్పననీ, అవన్నీ లేకుండా చిన్నప్పటి లాగే ఒకళతో ఒకళు మంచిగా వుంటే, అంతా కలిసి వూరి బాగు కోసం పన్చేయచ్చనీ, యిలా యేదో మాట్లాడాడు. ఫక్తు పల్లెటూరి యాస మధ్య యెక్కణ్ణించో తెచ్చి అతుకులేసిన మర్యాదపూర్వకమైన పదాలు అతని ప్రసంగాన్ని యెబ్బెట్టుగా ధ్వనించేలా చేశాయి. శేషు యిబ్బందిగా విన్నాడు. అందరూ తప్పనిసరి మర్యాదగా చప్పట్లు కొట్టారు. చివరకు తానేం పని చేస్తున్నాడో చెప్పకుండానే భద్రీ పరిచయం ముగించి కూర్చున్నాడు. తర్వాత శేషు వంతు వచ్చింది. అతను లేచి, గొంతు సాధ్యమైనంత నాజూకుగా మార్చుకుని, మాటలోంచి యాస అరికట్టాలన్న శ్రద్ధలో పడి తెలుగు వాక్యాల్ని ఆంగ్ల వుచ్ఛారణతో పలుకుతూ మాట్లాడాడు. కూర్చున్నాక, కాసేపు ఆమె వైపు చూడకుండా నిగ్రహించుకుని, తర్వాత అలవోకగా చూసినట్టు చూసాడు. ఆమె తల దించుకుని వళ్ళోకి చూస్తోంది.

ఈ పరిచయాల ప్రకరణం పూర్తయ్యాక, అందరూ లేచి బయటకు వచ్చారు. అప్పటికే బాగా ఆలస్యమవటంతో, బయట టెంటు క్రింద వేసిన భోజనాల బల్లల మీద కొందరు విద్యార్థులు చకచకా అరిటాకులు పరుస్తున్నారు. మైదానం వెనుక నుంచి లుంగీలు కట్టుకున్న వంటలవాళ్ళు యిద్దరిద్దరుగా భారీ డేగిసాలని మోసుకు తెస్తున్నారు. వాటిని వసారాలో దించి మూతలు తీయగానే గాల్లోకి కమ్మగా విందు పరిమళం వ్యాపించింది. పొద్దుట్నించీ యీ ముహూర్తం కోసం యిక్కడే తచ్చాడుతున్న వీధి కుక్క, యీ వాసనలకి తనలో జాగృతమవుతున్న జాతి సహజమైన యావని అణచుకుని, మనిషి ఆమోదానికై తనకు అర్థం కాని మర్యాదను పాటిస్తూ, వెన్ను నిటారు చేసుకుని తన వంతు కోసం బుద్దిగా ఓ మూల కూచుంది; తోకని మాత్రం ఆపలేకపోతోంది. విద్యార్థులే పదార్థాల్ని చిన్న పాత్రల్లోకి బదలాయించి వడ్డనకు సిద్ధమయ్యారు. మొదట వుపాధ్యాయుల పంక్తితో భోజనాలు ప్రారంభమయ్యాయి.

శేషు రెండో పంక్తి కోసం ఓ ప్రక్కన నిలబడ్డ స్నేహితుల గుంపులో వున్నాడు. రేణూ వంక ఆదుర్దాగా చూస్తున్నాడు. ఆమె బడి వసారాకి రెండో చివర్న బాలాతో మాట్లాడుతోంది. బాలా భోజనపంక్తి వైపు చేయి చూపించి యేదో అంటున్నాడు. ఆమె బతిమాలుతున్న ముఖం పెట్టి తల అడ్డంగా వూపుతూ యేదో అంది. తర్వాత వెనుదిరిగింది. మైదానం మీదుగా గేటు వైపు నడుస్తోంది. శేషు కంగారుగా, యిటేవస్తున్న బాలాకి యెదురెళ్ళాడు. ఏమైందని అడిగాడు.

వెళిపోతుందటరా, యింట్లో వంటావిడ ఒక్కతే తినలేదంట.

మరిప్పుడెలారా?

వెళ్ళి భోంచేయి ముందు. ఇక రేపు చూద్దాంలే!

నిన్నా, యివాళా తన సహనం పరీక్షించిన నిరీక్షణ మళ్ళీ యిపుడు మరుసటి రోజుకు కూడా కొనసాగితే భరించడం కష్టమనిపించింది. ఇక యేదైతే అదైంది, యివాళే విషయమేంటో తేల్చేసుకోవాలనుకున్నాడు. బాలా వారిస్తున్నా వినకుండా, ఆమెని దార్లో ఆపి మాట్లాడతానని బయల్దేరాడు. బడి గేటు బయటకొచ్చి చూసేసరికే, రేణుకాదేవి అతని పాత యింటి దాకా వెళ్ళిపోయింది. ఇంకొన్ని యిళ్ళు దాటితే రథాన్ని వుంచే కొట్టం వస్తుంది, ఆ తరువాత జనార్దనస్వామి ఆలయం. అక్కడ పెద్దగా యెవరూ మసులుకోరు. పైగా మిట్టమధ్యాహ్నం కాబట్టి మామూలుగానే వూరు భోజనానంతర మగతలో జోగుతూంటుంది. అక్కడ ఆమెని అందిపుచ్చుకోగలిగితే కాసేపు మాట్లాడవచ్చు. నిమ్మళంగా పరుగుపెడుతూనే యివన్నీ ఆలోచించాడు. దహన దాహమేదో అతణ్ణి ముందుకు నెడుతోంది. ఈ యెండలో, ఆ కనకాంబరం రంగు చీరలో, ఆమె నడిచి వెళ్తున్న దీపశిఖలా వుంది.

ఇంతలో అతను అనుకోనిది జరిగింది. పొద్దున్న గేటు మీద వూగుతూ ఆడుకున్న బోసిముడ్డి చంటాడు, ఆమెని యెక్కణ్ణించి చూసాడో, హఠాత్తుగా యింట్లోంచి వీధిలోకి వచ్చి బుడిబుడి అంగల్తో ఆమె వెనుక పరిగెత్తాడు. అలికిడికి ఆమె వెనుదిరగ్గానే, కాళ్ళని చుట్టేసుకున్నాడు. ఆమె వంగి వాడి పిర్రల మీద కొడుతూ యేదో అంటోంది. ఇది చూసి శేషు చటుక్కున పరిగెత్తడం ఆపేసాడు. ఆ చంటాడు ఆ కాస్త పిర్రల వాయింపుతో తన వాటా ప్రేమ తనకి దక్కేసినట్టు ఆమెను వదిలి వెనుదిరిగాడు. టాటా చెపుతూ మళ్ళీ గేటు దగ్గరికి గునగునా నడుస్తున్నాడు. వాడికేసి చెయ్యి వూపుతున్నదల్లా, ఆమె శేషుని చూసింది. ఇక అతనికి తప్పలేదు. పలకరింపుగా నవ్వుతూ చెయ్యి వూపాడు. ముఖం మీద పడుతున్న యెండకి ముకుళించిన ఆమె ముఖంలో నవ్వుజాడ వచ్చిందో లేదో అతనికి తెలియలేదు. పరుగుతెచ్చిన ఆయాసం ఆమెకి కనపడకుండా వూపిరిని నియంత్రించుకుంటూ, దగ్గరకు నడిచాడు. హాయ్ రేణూ! అన్నాడు.

బావున్నావా! నవ్వుతూ అంది. కానీ ఆ నవ్వులో స్నేహం కన్నా మర్యాద కనిపించింది.

అతను తల పంకించాడు. కలిసి నడుద్దామా అన్నట్టు దారి వైపు చేయి చూపించాడు. ఆమె సమ్మతిగా కదిలింది.

సారీ, తాతయ్య చనిపోయినపుడు రాలేకపోయాను, అన్నాడు.

దాందేవుంది, మీ అన్నయ్య వచ్చాడుగా. చెప్పాడు నువ్విక్కడ లేవని. చాలా సాయం చేసాడు. దారి వంక చూస్తూనే మాట్లాడింది.

ఆయన మాకు చేసిందాంతో పోలిస్తే అదేముందిలే. కానీ చాలా బాధేసింది. ఎందుకో ఆ రావిచెట్టులా, ఆ గుడిలా ఆయన కూడా యెల్లకాలం వుండిపోతాడనిపించేది నాకు.

తప్పదుగా, ఆ రావిచెట్టుకైనా, గుడికైనా.

ఆమె చూపిస్తున్న నిర్వికార ధోరణికి అతని అంచనాలన్నీ కకావికలవుతున్నాయి. కానీ అనుకున్న ప్రణాళికని యేది యేమైనా సరే పాటించే సైనికునిలా ముందుకు పోవటానికే నిశ్చయించుకున్నాడు. ఇద్దరూ గుడి ముంగిటకు చేరుకున్నాక ఆగాడు. ఆమె యేమిటన్నట్టు చూసింది. అతను తలెత్తి గుడి సింహద్వారాన్ని చూస్తూ అన్నాడు, యెన్నాళ్లయిందో, ఒకసారి లోపలికెళ్దామా?

దేనికి.

దేనికేంటి రేణూ, పన్నెండేళ్లయింది కలిసి, మాట్లాడుకోవటానికేవీ వుండదా?

కొన్ని సంశయ క్షణాలు గడిచాక, అలా అనేం కాదులే.... పద,” అంటూ నడిచింది.

ఇద్దరూ మెట్ల అరుగెక్కారు. గుడిలో యెవరూ లేరు. గర్భగుడి కటకటాలు మూసి వున్నాయి. ముఖమండపంలో పాత రాతి గచ్చు స్థానే టైల్స్ పరచివున్నాయి. నందీశ్వరుని ప్రక్కన యిదివరకూ లేని పెద్ద హుండీ ఒకటి కనపడుతోంది. ద్వారం దగ్గర పాదరక్షలు విడిచి లోనికి నడిచారు. శేషు మనసులో ప్రణాళిక స్పష్టమవుతూ వస్తోంది. ఆమెను గుడి వెనుక వున్న కోనేటి దగ్గరకు తీసుకువెళ్ళి మాట్లాడితే ప్రభావం బాగుంటుందనిపించింది. అక్కడికి యెందుకని అడిగే అవకాశం ఆమెకు యివ్వకుండా, ఆమె కన్నా ముందు నడుస్తున్నాడు. రాతి గచ్చు మీద కాళ్ళు తిమ్మిరిగా కాల్తున్నాయి. దారిలో దేవగన్నేరు చెట్టుక్రింద కొన్ని పూలు రాలి వుంటే వంగి చేతిలోకి తీసుకున్నాడు. వాటి పసుపుపొట్టల్లోకి ముక్కుపెట్టి వాసన పీలుస్తూ, ఈ పూలు యెక్కడ చూసినా నాకు మనూరే గుర్తొచ్చేది అని ఆగి, సంకోచంగా, నువ్వు కూడా గుర్తొచ్చేదానివి, అంటూ ముగించాడు. వెనక నుంచి యే మాటా వినపడలేదు. ఆమె పట్టీల శబ్ద గతిలో మాత్రం మార్పు లేదు. వెనుదిరిగి ఆమె ముఖంలో స్పందన చూసే ధైర్యం లేకపోయింది. తన చొరవ తిరస్కరింపబడిందన్న అవమానం మనసుపై బరువుగా తిష్టవేయకముందే, ప్రసక్తి మార్చాడు. నిన్నటి వానకి రాలిపోయినట్టున్నాయి అన్నీ, అన్నాడు. ఆమె వూకొట్టింది.

మండపాలన్నీ దాటుకుని కోనేటి దగ్గరకు చేరుకున్నారు. రావిచెట్టు నీడ మెట్ల మీద చల్లగా పడుతోంది. కోనేటి నీలిమలో దూదిపింజె మేఘ మొకటి యీదుతోంది. కోనేటి మధ్యనున్న మండపం చుట్టూ తామరాకులు చెల్లాచెదురై వున్నాయి.

కూర్చుందామా, అంటూ కూర్చున్నాడు.

రేణు కాస్త యెడంగా ఒక శుభ్రమైన మెట్టు చూసుకుని కూర్చుంది.

ఆమె ధోరణి అతనికి యేమీ పాలుపోకుండా చేస్తోంది. తమ మధ్య యీ సన్నివేశాన్ని గురించి యెన్నో కల్పించుకున్నాడు. కానీ ఆ కల్పనలన్నింటికీ దర్శకుడు అతనే; ఈ అసలు సన్నివేశానికి మాత్రం దర్శకుడు దేవుడు. ఇక్కడ తనది నటుని పాత్ర. దర్శకుని నుంచి యే సూచనలూ అందని నటునిలా వుంది ప్రస్తుతం పరిస్థితి.

ఇక్కడకు వస్తుంటావా రేణూ?

ఊ... అపుడపుడూ!

మళ్ళీ కాసేపు మౌనం.

నిన్న వాన చూస్తే యివాళ వాతావరణం యిలా వుంటుందనిపించలేదు. బానే పడుతున్నట్టున్నాయి.

లేదు, నిన్న ఒక్క రోజే.

ఓ గులకరాయి తీసి కోనేట్లో విసిరాడు. ఆ చప్పుడుకి, అప్పటిదాకా అక్కడ వున్నట్టే తెలియని ఓ పావురం, కోనేటి మండపం మీంచి రెక్కలు తపతపలాడిస్తూ  యెగిరిపోయింది.

ఆమె మీద కోపం వస్తోంది. ఎందుకు సాయం చేయదు. పన్నెండేళ్ళ తర్వాత కలసిన వాడు, యేదో మాట్లాడాలంటూ యిలా యేకాంతానికి తీసుకొచ్చిన వాడు, వాతావరణ వివరాల గురించా మాట్లాడాలనుకునేది. అయినా యేం మాట్లాడతాడు. తాను అనుకున్నది నిజంగా మాట్లాడగలడా. అసలు యేమనుకున్నాడు తాను? ఏ అవాస్తవంలో మసలుకున్నాడిన్నాళ్ళూ! ప్రక్కనున్న యీ మనిషి గురించి అసలు తనకేం తెలుసు! ఇపుడామెకు వున్నట్టుండి ప్రేమ ప్రతిపాదన చేయాలా!

తన మొత్తం ప్రయత్నంలోని మౌలికమైన అసంబద్ధత యిలా బయటపడగానే, యీ ప్రయత్నానికి రాసిపెట్టున్న ఫలితం ఖచ్చితంగా వైఫల్యమేనని ఖరారైపోగానే, యెక్కణ్ణించో కొత్త తెగింపూ పుట్టుకువచ్చింది.

నీకొకటి చెప్పాలి రేణూ.

చెప్పు.

అలా అనీ యిలా అనీ చాలా అనుకున్నా గానీ, యేవీ గుర్తు రావటం లేదు. కాబట్టి తిన్నగా చెప్పేస్తున్నాను. నువ్వంటే నాకు యిష్టం రేణూ. అంటే చిన్నప్పటిలాంటి యిష్టం కాదు. ఇన్నేళ్ళలోనీ ఆ యిష్టం ప్రేమగా మారింది, అన్నాడు. పెరిగిన గుండె వేగం యింక మాట్లాడనియ్యలేదు. ఆమె వైపు చూసాడు. ఆమె నుండి యేదో ఒకటి వినకపోతే యిక నిబ్బరం నిలిచేట్టు లేదు. మాట్లాడు రేణూ? అన్నాడు.

ఆమె నవ్వింది. ఏం మాట్లాడాలి?

బావుంది నన్నడుగుతావేంటి.

అలా అని కాదు శేషు. పన్నెండేళ్ళ తర్వాత యీ ఫంక్షన్ పుణ్యమాని కలిసాం. ఒకరి ముఖాలొకరు చూసుకున్నాం. రేపట్నించి యెప్పటిలా యెవరి జీవితాల్లో వాళ్ళం పడిపోతాం. ఇపుడివన్నీ బయట పెట్టుకుని లాభం యేమిటి.

అదేంటి రేణు. ఎలాగూ ఫంక్షన్‌‌కి వచ్చాను కాబట్టి పన్లో పని నీకీ మాట చెప్తున్నా అనుకుంటున్నావా! వచ్చింది నిన్ను కలవాలనే. నీకీ మాట చెప్పాలనే. ఫంక్షనన్నది ఒక సాకు అంతే. ఈ రోజు కోసం యెన్నాళ్ల నుంచి వెయిట్ చేస్తున్నానో నీకు తెలీదు. 

ఇన్నేళ్ళలో యీ ఒక్క సాకే దొరికిందా?

ఈ మాటతో చప్పున యెందుకో ఆమెలో చిన్నప్పటి రేణు కనపడింది. ధీమా కలిగింది. చెప్పానుగా రేణూ, మొదట్లో నాకూ తెలీదు, యిలా అవుతుందని. నా మనసు పూర్తిగా నీకు అంకితమైపోతుందని. మనసులన్నాక మారుతుంటాయిగా!

మరి మనసులు యిక్కడా మారుతుంటాయిగా?

కాదని యెవరన్నారు. అదేగా నేను చెప్పమనేది!

ఇంకా నా మీద యేదో అధికారం వున్నట్టు భలే మాట్లాడుతున్నావు. నిజంగా ఆశ్చర్యంగా వుంది!

మరి నువ్వు యేదీ సూటిగా చెప్పవెందుకు?

సూటిగా లేకపోవడమేవుంది! నేను నా బతుకేదో బతుకుతున్నాను. నువ్వూ చక్కగా వుద్యోగం సంపాయించుకుని నీ బతుకు బతుకుతున్నావు. యిన్నేళ్ళలో నేనెలా మారివుంటానో నీకు తెలియదు. నువ్వెలా మారివుంటావో నాకు తెలియదు. యెవరి జీవితాల్లో వాళ్ళం చక్కా సర్దుకుపోయి వున్నాం. ఇవాళ వున్నట్టుండి వూడిపడి యెందుకిలా చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు.

ఎందుకంటే మనిద్దరికీ రాసిపెట్టివుందని నాకు అర్థమైంది కాబట్టి. నా వరకూ నేను యేవీ మారలేదు. ఎప్పటిలాగానే వున్నాను. నువ్వు మారావేమో మరి నాకు తెలియదు—

మారాను! ఒకప్పుడు నువ్వు జట్టుండకపోతే బెంబేలెత్తిపోయిన అమ్మాయైతే మాత్రం యిపుడు లేదు.

నేనేం ఆమెను ఆశించి రాలేదు.

నువ్వేం ఆశించావన్నది నాకనవసరం. నేను మారానని చెప్తున్నా అంతే.

ఒప్పుకుంటున్నాను రేణూ! ఆ మార్పును అంగీకరించగలను కూడా.

పోనిలే! నువ్వు అంగీకరించకపోతే యెలారా భగవంతుడా అనుకున్నా యిన్నాళ్ళూ!

వెటకారమెందుకులే రేణు!

ఆమె మాట్లాడలేదు.

నువ్వంటే నాకు యిష్టమని చెప్తున్నాను, నేనంటే నీకు యిష్టమా అని అడుగుతున్నాను... చిన్న ప్రశ్న!

చిటికెలో తేలిపోవాలేం!

తొందరేమీ లేదు! ఆలోచించే చెప్పు.

ఆలోచించటానికి యేమీ లేదు.

అయితే చెప్పు.

చెప్పానుగా, యేమీ లేదు.

నేనంటే నీకు యిష్టం లేదా?

లేదు!

అబద్ధం చెప్పకు రేణూ...

ఆమె విసురుగా పైకి లేచి నుంచుంది. నాకొకటి అర్థం కాదు! ఎందుకు యిన్నేళ్ళ తర్వాత కూడా మనం ఓ మూడేళ్ళ పరిచయాన్ని పట్టుకుని తెగ యిదయిపోతున్నాం. మొత్తం జీవితంతో పోలిస్తే మాయదారి మూడేళ్ళు యేం లెక్క. ఎన్నాళ్ళని అక్కడే చిక్కుబడిపోతాం. అక్కడ లేని దేని కోసమో వెతుక్కుంటూ యెన్నాళ్లని అక్కడే వూడిగం చేస్తాం?

ఈ తీవ్రతకి శేషు ఆశ్చర్యపోయాడు. ఆమె మాటల్లో వ్యక్తమైనంత తీవ్రంగా ఆ మూడేళ్ళ ప్రభావం అతనిపై యెపుడూ లేదు. అది స్ఫురించగానే తనకు తాను దోషిలా కనపడ్డాడు. కానీ ఆమె ముఖంపై నిర్వికారపు గోడల్ని బద్దలు కొట్టి, ఆమె లోపలితనాన్ని బయటకు రప్పించగలిగినందుకు సంతోషం కూడా కలిదింది. ఇంకొంచెం కదిలిస్తే చాలనిపించింది. అతనూ లేచి నిల్చున్నాడు. ఆమె దగ్గరకెళ్ళి క్రింద మెట్టు మీద నిలబడ్డాడు. అవున్నిజమే, మొత్తం జీవితంతో పోలిస్తే మూడేళ్ళు చాలా చిన్నవే. కానీ ఆ మూడేళ్ళతో పోలిస్తే మనం గొడవపడ్డ మూణ్ణెల్లు యింకెంత చిన్నవో ఆలోచించు. అపుడు చిన్నవాళ్లం రేణూ! ఇంకా ఆ గొడవే పట్టుకునే వేలాడుతున్నామంటే ఆశ్చర్యంగా వుంది!

ఇప్పుడు మనం పెద్దవాళ్ళమైనంత మాత్రాన చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ చిన్నవైపోవు.

బుద్ది గడ్డితిని ఒక ముద్దు పెట్టుకున్నదానికి నేనేదో హత్య చేసినట్టు మాట్లాడుతున్నావు రేణూ నువ్వు!

అది నాకసలో విషయమే కాదు.

మరి? సరే, తర్వాత సారీ చెప్పి మాట్లాడకపోవడం నా తప్పే. కానీ నా కారణాలు నాకున్నాయి. ఏమో! అప్పట్లో నువ్వు మారిపోయావు. నాతో అదివరకట్లా వుండటం మానేసావు. నీకు నీ ఫ్రెండ్సొచ్చారు. నీకో లోకం వచ్చింది. అందులో నాకెక్కడా చోటు కనపళ్ళేదు. బహుశా ఆ ఇన్‌సెక్యూరిటీ—

ఇక నువ్వు చెప్పదలుచుకుంది అయిపోతే వెళ్తాను శేషు. నాకవతల పన్లున్నాయి,” అందామె హఠాత్తుగా. ఆమె ముఖం చుట్టూ మళ్ళీ గోడలు మొలిచేసాయి.

నేను చెప్తున్న విషయం కన్నా యింటికెళ్ళి తినటం ముఖ్యమన్నమాట నీకు!

ఆమె గిరుక్కున వెనుదిరగబోయింది.

అతను చేయి పట్టుకున్నాడు.

ఆగింది.

మాట్లాడుతుంటే వెళిపోతావేంటి రేణు?

చేయి వదులు శేషు!

వదిలేసాడు.

అతని వైపు తిరిగి చేతులు కట్టుకు నిలబడింది. అతని భుజం మీంచి కోనేటి లోకి చూస్తోంది.

అదే గోడల ముఖం! ఏదోటి చేసి వాటిని బద్దలుగొట్టి లోపలికి చొరబడాలనిపించింది, నాకిప్పుడేవనిపిస్తుందో తెలుసా?

అతని వైపు చూసింది.

ఇవాళ మన బళ్ళో అందర్నీ చూసాను కదా. ఎవడూ చిన్నప్పటిలా లేడు. మన చిన్నప్పుడు స్నేహానికి స్నేహమే కారణమై వుండేది. కాని ఇపుడలా కాదు. కులమో, డబ్బో, యింకోటో యింకోటో! బహుశా మన మధ్యనున్నదీ అందుకు మినహాయింపు కాదేమో. అలాంటి కారణాలేవన్నా వుంటే చెప్పేయి రేణూ. అంతేగానీ నేనేదో తిరిగి సరిదిద్దుకోలేనంత తప్పు చేసానని మాత్రం చెప్పకు.

అపనమ్మకంగా తలూపుతూ జీవం లేని నవ్వొకటి నవ్వింది. నీకు బుర్ర పన్చేయటం లేదు శేషు,” అంటూ మళ్ళా వెనుదిరింది.

అతను చేయి పట్టుకున్నాడు.

ఆమె పట్టు విడిపించుకోబోతూ, అదే చేత్తో చప్పున అతని చెంప మీద కొట్టింది.

చెంప మీద గాజు పగిలి చురుక్కుమంది. పైగా అతను క్రింద మెట్టు మీద వుండటం మూలాన, దెబ్బ విసురు యెంత నొప్పెట్టిందంటే, ఆమెను తిరిగి కొట్టాలన్న అసంకల్పిత ప్రతీకారచర్యని నిగ్రహించుకోవటానికి పిచ్చిదానా! అని తిట్టాడు; యెందుకు నీకంత చేయి దురుసు? అన్నాడు.

అవును, పిచ్చిదాన్నే! ఆమె గొంతు వురిమింది; అవును, నాకే తెలియదు అవతలివాళ్ళ మనసులు యెలా ఆలోచిస్తాయో. ఇందాక యేంటన్నావు? అప్పుడు నాకు వేరే ఫ్రెండ్స్ దొరికారు, వేరే లోకం వచ్చింది, నిన్ను పక్కన పెట్టేసానని కదూ. నా వెనకాల నువ్వున్నావన్న నమ్మకంతోనే అలా మారగలిగానేమో, ఆ ధైర్యంతోంనే బయటికి వెళ్ళగలిగానేమో?! ఆ సంగతి యెపుడూ తట్టలేదా మన గొప్ప బుర్రకి! ఇందాకణ్ణించీ చాలా మాట్లాడుతున్నావు. ఇష్టపడ్డానూ, యెదురు చూసానూ అంటూ. కాని నీకు యిష్టపడటమంటే యేవిటో తెలీదు, యెదురుచూడటమంటే యేవిటో తెలీదు. వాటి గురించి యెవరి దగ్గర మాట్లాడినా చెల్లుతుందేమో, నా దగ్గర మాట్లాడమాక! చూపుడు వేలితో తనని తాను చూపించుకుంటూ యీ మాటలు పూర్తి చేసింది. గిరుక్కున వెనుదిరిగింది. ఆమె జడ వడిసెల తిరిగినట్టు గాల్లో తిరిగి నడుం చుట్టూ చుట్టుకుంది. రావి ఆకుల నీడలు జారిపోగానే ఆమె చీర మీద యెండ పడి భగ్గున వెలిగింది. మండపాల మధ్య నుంచి విసవిసా నడిచి వెళిపోయింది.

ఆమె మండపం వెనుక అదృశ్యమయ్యే దాకా అటే చూస్తుండిపోయాడు. చెంప మీద గాజు గాయాన్ని తడుముకుంటూ మెట్ల మీద కూర్చుండిపోయాడు. మొత్తం సంఘటనని నెమరువేసుకున్నాడు. ఆమె చివరి మాటల్ని పదే పదే పునరావృతం చేసుకున్నాడు. గుండెల్నిండా గాలి తీసుకుని నిట్టూర్చాడు. ఇందాకటి దూదిపింజె మేఘం కోనేటి అవతలి ఒడ్డు దాకా యీదేసింది. ప్రక్కన పడివున్న దేవగన్నేరు పూవొకదాన్ని చేతిలోకి తీసుకున్నాడు. దాని తొడిమ పట్టుకు బొంగరంలాగా తిప్పి నీట్లోకి వదిలాడు. కోనేరు తరంగాలుగా నవ్వింది.

*     *     *
బాలా బడి నుండి గుడి వైపు నడుస్తున్నాడు. నిన్న శేషు కొత్త కథ సూచించినప్పటి నుంచీ అది అతనిలో శాఖోపశాఖలుగా పెరుగుతోంది. ఇంకా ఒక్క వాక్యమూ కాగితం మీద పెట్టకుండానే అతణ్ణి ఆక్రమించుకుంది. లెక్కలేనన్ని దృశ్యాలూ, సన్నివేశాలూ, ఆలోచనలూ కథలో తమ చోటు కోసం అతని మస్తిష్క ద్వారం దగ్గర రద్దీగా తోసుకుంటున్నాయి. ఇదివరకట్లా యీ కథ తన అనుభవాలకే పరిమితం కాదు. అహపు చెరసాలలోంచి విడుదలవుతాడు. చుట్టూ విస్తరిస్తాడు. పర మానస చైతన్యాల్లోకి అక్షరాల ద్వారా ప్రవేశిస్తాడు. శేషూ, రేణూ, భద్రీనే కాదు; మొత్తం శ్రీపాదపట్నం చైతన్యాన్నే తనలో ఆవహింపజేసుకుంటాడు. నిన్న రాత్రి యీ ఆలోచనలతో అతనికి చాలా సేపు నిద్ర పట్టలేదు. కథ యెక్కడ మొదలుపెట్టాలో నిర్ణయించుకున్నాడు. ఎలా నడపాలో ఖాయపరుచుకున్నాడు. ఇక ముగింపు ఒక్కటే మిగిలింది. అది యేమై వుంటుందోనన్న ఆలోచన అతణ్ణి నిలవనీయటం లేదు. అందుకే శేషు వచ్చేదాకా ఆగలేకపోయాడు. ఒకప్రక్క బడిలో వేడుక యింకా జరుగుతుండగానే మధ్యలో బయల్దేరి వచ్చేసాడు.

వీధిలోకి వచ్చేసరికి రేణూ దూరంగా గుడిలోంచి బయటకు వెళ్తూ కనిపించింది. రాజుగారి మేడ వైపు విసురుగా నడిచి వెళ్తోంది. వెనక్కి తిరిగి చూస్తుందనుకున్నాడు. చూడలేదు.

గుడి దగ్గరకు చేరుకునేసరికి శేషు అప్పుడే ద్వారం దగ్గర పాదరక్షలు తొడుక్కుంటున్నాడు. బాలాకి విషయం అర్థం కాలేదు.ఏరా, ఏమైంది? ఆ రక్తవేంటి? అని అడిగాడు.

శేషు చెంప తుడుచుకుంటూ, రేణూ వెళ్ళిన వైపు ఖాళీ వీధిని చూస్తూ, మెట్లు దిగాడు. బాలా భుజం మీద చేయి వేసి వచ్చిన దారినే నడిపించాడు.

ఇక కుతూహలాన్ని అణచుకోవటం బాలాకి సాధ్యం కాలేదు, ఏమైందిరా! ముగింపేమిటి కథకి; పుల్‌స్టాపా, కామానా?

ఏవైందో తర్వాత చెప్తా గానీఒరే నువ్వు గనక మా కథ రాస్తే దాన్ని చివర పుల్‌స్టాపుతోనూ ముగించొద్దు, కామాతోనూ ముగించొద్దు. ఏవీ తేల్చని వాక్యాల్ని మూడు చుక్కలు పెట్టి ఆపేస్తారే, ఏవంటారు దాన్ని?

ఎలిప్సిస్?

ఆ అదే, దాంతో ముగించేయి.

బాలాకి యేం జరిగివుంటుందో అర్థం కాలేదు.

కానీ శేషు ముఖకవళిక చెప్పకనే చెపుతోంది...

—— ♦ ——

March 20, 2012

మిత్రభేదం (పదవభాగం)


పూర్వవిద్యార్థుల పునస్సమ్మేళనోత్సవం అందరికీ మొదలై చాలాసేపయింది గానీ, శేషూకి యింకా మొదలవనట్టే వుంది. రేణూ యింకా రాలేదు. వస్తుందన్న ఆశ క్షణక్షణానికీ సన్నగిల్లుతోంది. చివరికి యిక ఆమె రాదన్న సంగతి ఒప్పేసుకుని, యింటికి వెళ్ళి కలవాలన్న నిశ్చయాన్ని బలపరుచుకుంటూ, వున్నట్టుండి నిస్సారమైన వర్తమానంలోకి మెల్లగా సర్దుకుంటున్నాడు.

వేడుక తరగతి గదిలోనే జరుగుతోంది. బల్లలు పేర్చి చేసిన వేదిక మీద సోషల్ టీచరు మైకు ముందు నిలబడి ప్రసంగిస్తున్నాడు. ఆయన వెనుక, ఆ యిరుకు వేదిక మీద సరిపోయేట్టు అర్థవలయంలో పేర్చిన కుర్చీల్లో, మిగతా టీచర్లు కూర్చున్నారు. వారిలో యెవరూ యిపుడు శ్రీపాదపట్నం బళ్ళో  పనిచేయటం లేదు. కాబట్టి వారికి కూడా యీ వేడుక పాత సహోద్యోగులతో పునస్సమ్మేళనం లాంటిదే. తెలుగు మేడం లెక్కల మేస్టారితో పిల్లల పెళ్ళిళ్ళ గురించి ఆరా తీస్తోంది. సైన్సు, హిందీ టీచర్లిద్దరూ యిటీవలి పేస్కేలు సవరణల జీవో గురించి మాట్లాడుకుంటున్నారు. రిటైరయి చాన్నాళ్లయిన డ్రిల్లుమాస్టరు మాత్రం వేదిక యెదుట చెరువులో గుర్రపుడెక్కలా విస్తరించిన విద్యార్థుల ముఖాల్లో యెవరి ముఖాన్నైనా నిజంగా గుర్తుపట్టగలరేమో చూస్తున్నారు. బాలా కార్యక్రమ సంచాలకుని హోదాలో వేదికకు ఓ మూల ఒద్దికగా నిలబడి వున్నాడు. చేతిలో కార్యక్రమాల జాబితా పట్టుకుని, సోషల్ టీచరు ప్రసంగం పూర్తవటం కోసం చూస్తున్నాడు.

సోషల్ టీచరు పాతికేళ్ల తన వృత్తి జీవితంలో తాను సాధించిన వుద్యోగ విజయాల్ని నెమరు వేసుకుంటున్నాడు. గతంలో వేరే వూళ్ళలో జరిగిన యిలాంటి వేడుకల్లో తనకు యెదురైన అనుభవాల్ని పంచుకుంటున్నాడు. తన పాత విద్యార్థుల్లో యిప్పుడు గొప్పగొప్ప స్థానాల్లో వున్నవారెవరో, వాళ్ళు ఆ చలవంతా తనకే యెలా ఆపాదించారో చెప్తున్నాడు. వాళ్ళలో ఒక డిప్యుటీ కలెక్టరు, ఒక ఎన్టీపిసి వుద్యోగి, ఒక సగ్గుబియ్యం ఫాక్టరీ యజమాని... వీళ్ళ గురించి ప్రముఖంగా చెప్పాడు. ముఖ్యంగా సగ్గుబియ్యం ఫాక్టరీ యజమానైతే ఒకసారి యీయన బస్టాండులో నిలబడివుంటే కారాపి యెక్కించుకున్నాడట. దారంతా యీయన క్రమశిక్షణ తనకు జీవితంలో యెదగటానికి యెలా పనికొచ్చిందో చెప్తూనే వున్నాడట.

శేషూకి చిన్నప్పుడు యీయన పాఠం యెంత భారంగా గడిచేదో, యిపుడీ ప్రసంగమూ అంతే భారంగా గడుస్తోంది. పైగా ప్రక్కన కూర్చున్న సూదావోడు, శేషూకి యే విషయాలపై ఆసక్తి వుంటుందని తాననుకుంటున్నాడో వాటిని ప్రస్తావించి, అతణ్ణి సంభాషణలోకి దించాలని ప్రయత్నిస్తున్నాడు. అతను ప్రయత్నించే కొద్దీ శేషూలో విసుగు పెరుగుతోంది. ఇటు ప్రక్కన కూర్చున్న భద్రీ యీ లోకంలో లేనట్టు ప్రసంగంలో లీనమైపోయాడు. అమ్మాయిల గుంపులో యెవరి వళ్ళోనో చంటిపిల్ల యేడవడం మొదలుపెట్టింది. ద్వారంలోంచి బయట మైదానంలో వేసిన టెంటు కనిపిస్తుంది. దాని క్రింద, చెల్లాచెదురుగా వున్న మడతరేకు కుర్చీల మధ్యన, ఒక కుక్క పడుకుని వెనక కాలితో మెడ గోక్కుంటుంది.

శేషూకి రేణూ వస్తుందన్న ఆశ మిగిలున్నంత వరకూ యీ వేడుక సరదాగానే గడిచింది. అసలు యివాళ వుదయాన్నించీ అతనికి సంబరంగానే వుంది. అతను పొద్దున్న లేచేసరికి బాలా యింట్లో లేడు. పూలదండలవీ పురమాయించటానికి తెల్లారగట్లే వెళిపోయాడట. శేషూని బడి దాకా తీసుకువెళ్లటానికి యెవరో కుర్రవాణ్ణి పంపుతానని చెప్పాడట. సూర్రావుగారన్నారు. శేషూ గుమ్మంలోకి వచ్చి తెల్లవారిన శ్రీపాదపట్నాన్ని యిష్టంగా చూసుకున్నాడు. నిన్న వర్షపు వాతావరణంలోనూ, చీకటిలోనూ వూరు కాస్త అపరిచితంగా కనపడింది. ఇప్పుడు యింద్రజాలికుడు ముసుగు తీసి చూపించినట్టు ఒక్కసారి తన చిన్నప్పటి వూరు ప్రత్యక్షమైంది. వరండాలో వుదయపు కాషాయరంగు యెండపడుతోంది. నిన్న అంత కుంభవృష్టి కురిపించిన ఆకాశం యిపుడు ఒక్క మేఘపు జాడ లేకుండా చేతులు ముంచాలనిపించేంత నీలంగా వుంది. వాన కడిగిన వాతావరణం స్పష్టంగా, నిర్మలంగా వుంది. శేషూకి ఒకసారి బయట తిరిగి రావాలనిపించింది. ఇంట్లోకి వెళ్ళి ఆదరాబాదరాగా కాలకృత్యాలు కానిచ్చేసుకుని, సూర్రావుగారిచ్చిన కాఫీ తాగి, వీధిలోకి వచ్చాడు.

పంట్లాం జేబుల్లో చేతులు దూర్చి నడుస్తున్నాడు. వెనుక నుండి తూర్పు నీరెండ నులివెచ్చని శాలువాలా వీపుకు తగుల్తోంది. పొడుగ్గా సాగిన తన నీడను తనే అనుసరిస్తున్నాడు. ఒక ముంగిట్లో కళ్ళాపి జల్లిన నేల మీద యెవరో పరికిణీ జాకెట్టులో వున్న అమ్మాయి నిద్రకళ్లతో ముగ్గు దిద్దుతోంది. ముగ్గు మీద నీడపడటంతో తలెత్తి అతణ్ణి చూసింది. అతని కళ్ళల్లో ప్రస్తుతం ప్రతీ పరిసరం పట్లా వ్యక్తమవుతున్న మోహాన్ని తనకు అన్వయించుకున్నట్టుంది; ఆమె పసి కళ్ళలోకి అకస్మాత్తుగా స్త్రీత్వపు జాణతనం వచ్చి చేరింది. చప్పున కళ్ళు దించుకుని, అతను చూస్తున్నాడన్న యెరుక తెచ్చిన విలాసంతో ముఖం మీది ముంగురుల్ని చెవి మూలకి తోసుకుంటూ, ముగ్గుదిద్దటంలో నిమగ్నమైంది. శేషు మనసులోకి మంచు సమీరం వీచినట్టయింది. తానీ వూళ్ళో వున్నపుడు ఆమె యింకా అమ్మ చంక కూడా దిగని చంటిపిల్లయి వుంటుంది. అతని పెదాలపైకి ఆహ్లాదకరమైన చిరునవ్వు వచ్చింది. ఆమెను కూడా శ్రీపాదపట్నపు సుందర మూర్తిమత్వంలో భాగంగా కలుపుకుంటూ ముందుకు సాగిపోయాడు.

చెట్ల గుబుర్ల వెనకనుంచి గుర్తు తెలియని పిట్టలు, రోజూలాగే యివాళా తెలవారినా, యిదే సృష్టికి తొలి వుదయమన్నట్టు కూస్తున్నాయి. పాలేర్లు సైకిళ్ళ మీద గడ్డి మోపులతో యెదురవుతున్నారు. పాలకావిడి మోసుకుంటూ గోవిందు యింటింటికీ ‘పాలండీ!’అని అరుస్తూ తిరుగుతున్నాడు. గోడ మీద తడిసిన సినిమా పోస్టర్ని ఒక మేక ఆబగా నముల్తోంది. అతనికి సంబంధించినంతవరకూ కాల ప్రమాణం నశించింది. చిన్నప్పుడు యెన్నోసార్లు యిలాంటి తూర్పు యెండలోనే, యిలాంటి ముగ్గుల మధ్యనుంచే, అమ్మ సంత నుండి యేదో తెమ్మని పురమాయిస్తే యీ వీధమ్మటా వెళ్ళేవాడు. ఆ లాగూ తొడుక్కున్న పిల్లాడు యిప్పుడే తన ప్రక్కనుంచి సైకిలాట ఆడుకుంటూ పరిగెత్తుకు పోయినా శేషు ఆశ్చర్యపడే స్థితిలో లేడు. అంతగా అతనిలో వర్తమాన స్పృహ చెరిగిపోయింది. ఊరుకూడా యేమంత మారలేదు. కొన్ని చోట్ల పూరిళ్ల స్థానే పెంకుటిళ్ళూ, పెంకుటిళ్ల స్థానే మిద్దెయిళ్ళూ వచ్చాయి. కానీ అవేమీ వూరి ఆత్మని కలుషితం చేసేంత మార్పును తేలేదు.

ఇపుడు రాజవీధి అతనికి యేమంత దూరం కాదు. అయినా అటు వెళ్ళబుద్దేయలేదు. నిన్నటి దాకా చాలా అసహనం కలిగించిన నిరీక్షణ, యిపుడు కొద్ది సేపట్లో ముగిసిపోనున్నదని తెలియగానే, స్వభావాన్ని మార్చుకుంది. ఈ కాసేపూ నిరీక్షణలోంచి కూడా మాధుర్యాన్ని పిండుకోవాలనిపించింది. ఇంతలో దగ్గరగా యేదో వాహనం చప్పుడు వినపడటమూ, అతను తేరుకు చూసేలోగానే భుజం మీద యెవరో చరచడమూ జరిగిపోయాయి.

మోపెడ్ మీద వున్న శంకూగాణ్ణి వెంటనే గుర్తుపట్టలేకపోయాడు. మోటార్‌సైకిలు మీద నప్పే నల్లకళ్ళద్దాల్ని మోపెడ్ మీద పెట్టుకున్నాడు. నుదుటి మీదకు పంకు స్టయిల్లో జుట్టు పడుతోంది. మీసం నల్ల సెలొఫిన్ టేపును మూతికొలతకు కత్తిరించి అతికించినట్టుంది. శేషూని స్కూల్లో దింపటానికి బాలా పంపుతానన్నది వాణ్ణే అట. ఇద్దరూ అలా మార్గమధ్యంలో నిలబడే కుశలం మాట్లాడుకున్నారు. ఇంతలో మరో స్నేహితుడు త్రిమూర్తులు అటు వెళ్తూ వీళ్ళిద్దర్నీ చూసి స్కూటర్ హార్న్ మోతతో అట్టహాసంగా తన రాకని ప్రకటించాడు. కాలు కదపనక్కర్లేని జీవితం వంట్లో తెచ్చిన కొవ్వుతో బాగా లావయ్యాడు. శేషూని తన యెరువుల దుకాణానికి రమ్మన్నాడు. శేషూ స్కూలుకి వెళ్ళాల్సిన సంగతి చెప్పబోయాడు గానీ శంకూగాడు, “ఇపుడు వెళ్తే అక్కడ పనులన్నీ మన నెత్తి మీద వేస్సేలా వున్నార్రా బాబూ,” అంటూ త్రిమూర్తులతో వెళ్ళటానికే సిద్ధమయ్యాడు. ముగ్గురూ బళ్ళెక్కి బయల్దేరారు.

రోడ్డుకు కాస్త యెత్తుగా కట్టిన నాలుగు దుకాణాల వరుసలో ఆ దుకాణం ఒకటి. ముందు గదిలో గోడలకి కట్టిన అరల్లో పురుగుమందుల డబ్బాలు, విత్తనాల పాకెట్లూ అమ్మకానికి పెట్టివున్నాయి. త్రిమూర్తులు కౌంటరు వెనక కూలబడ్డాడు. మిగతా యిద్దరూ యెదుట కుర్చీల్లో కూర్చున్నారు. శంకూగాడు కళ్ళజోడు కౌంటరు మీద పడేసి, గాలి తగిలేట్టు కాలరు వెడల్పు చేసుకుంటూ, “ఒరే మేవంటే యెలాగా లెక్కలేదు; పన్నెండేళ్ల తర్వాత వచ్చిన వాళ్లకైనా మర్యాదలేవీ వుండవా,” అన్నాడు. “నీదేవుందిలేరా వూరి మీద పడి యెలాగైనా బతికేస్తావు,” అని, త్రిమూర్తులు పక్క వీధిలో కాకాహోటల్నించి అందరికీ టిఫిను పురమాయించాడు. సంభాషణలో వాళ్ళిద్దరూ యెవరి గురించి వాళ్ళు చెప్పుకున్నదాని కన్నా ఒకడు రెండోవాడి గురించి బయటపెట్టిందే యెక్కువ వుంది. శంకూ గాడి రంకు వ్యవహారాల గురించి త్రిమూర్తులు వెటకరించాడు. త్రిమూర్తులు తాగుబోతు ప్రహసనాల గురించి గురించి శంకూ దెప్పిపొడిచాడు. అంతేకాదు, శేషూని యెరువు బస్తాల సరుకువున్న వెనక గదిలోకి తీసికెళ్ళి, అక్కడ టేబిల్మీద నిన్న రాత్రి తాలూకు మందు గ్లాసుల్ని ఋజువుగా చూపించాడు. త్రిమూర్తులు కులాసాగా కౌంటరు వెనకాలే కూర్చుని, “ఇప్పుడు కాపోతే యెపుడు సుఖపడతాంరా,” అంటూ శంకూ గాణ్ణి తీసిపారేసాడు. “ఈ యెరువుల కంపు మధ్యనెలా తాగుతున్నార్రా బాబూ,” అని శేషూ ఆశ్చర్యపడ్డాడు. “ఆడేవన్నా అమృతం తాగుతున్నాడా ప్లేసు చూసుకు తాగటానికి,” అన్నాడు శంకూ.

వాళ్ళ మాటలు సాగుతోంటే, మధ్యలో భద్రీ అటువైపుగా సైకిలేసుకు వెళ్తూ కనిపించాడు. శేషూ బిగ్గరగా ఆగమని పిలిచి, అతను ఆగాక పైకి రమ్మన్నాడు. భద్రీ మొహమాటంగా, కొట్టుకాడ యేదో బేరం నిలబడివుందని, యింకా తానమదీ కూడా చేయలేదని, స్కూలు కాడ కలుద్దామనీ చెప్పి వెళిపోయాడు. అతను వెళ్ళగానే త్రిమూర్తులు, “ఊళ్ళో ఈడికొక్కడికే కామోసు కొంపలంటుకునే పన్లు, మనవే యేబ్రాసెదవలం,” అన్నాడు శంకూతో. “నువ్వు మళ్ళీ పత్యేకంగా చెప్పాలేంటి, ఆడక్కడ తిరగేసి మరగేసి చెప్పింది అదే,” అన్నాడు శంకూ. శేషూకి అపుడు స్ఫురించింది, భద్రీ కనపడగానే తను మాత్రమే లేచి మాట్లాడాడని, మిగతా యిద్దరూ యేమీ మాట్లాడలేదనీను. చిన్నప్పుడు వీళ్ల మధ్య యేవైనా గొడవలు వుండేవేమో గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నించాడు. ఏవీ గుర్తు రాలేదు. తర్వాత యెందుకో యిక అక్కడ మనస్ఫూర్తిగా గడపలేకపోయాడు. ఏదో నిషిద్ధ ప్రదేశంలో యిష్టానికి విరుద్ధంగా చిక్కుపడిపోయినట్టనిపించింది. పొద్దున్న వీధుల్లో తిరిగినంతసేపూ తన మనసు చషకంలో జాలువారిన అనుభూతి మధువులో యిపుడేదో చేదు చుక్క కలిసినట్టనిపించింది.

ఈలోగా యింకో ఇద్దరు స్నేహితులు దుకాణం దగ్గరికి చేరారు. వాళ్ళలో ఒకడు వూరి మాజీ సర్పంచి గారి అబ్బాయి. పేరు సుబ్బారావు. బళ్ళో చదివేటప్పుడు యితను కాక యింకో ముగ్గురు సుబ్బారావులు వుండటంతో యితణ్ణి ‘వుడుకుమోతు సుబ్బారావని’ పిలిచేవారు. ఏం ఆట ఆడినా యేదో ఒక గొడవ లేవదీసేవాడు. కానీ యెవరూ మద్ధతివ్వకపోవటంతో ఆట మధ్యలో మానేసి వెళిపోయేవాడు. ఇప్పుడు ఖాళీగా వున్నాడు. వరసగా పోటీ పరీక్షలు రాస్తున్నాడు గానీ యింకా ఫలితం దక్కలేదు. పాత స్నేహితులెవరితోనూ పెద్దగా కలవడు. త్రిమూర్తులుతో పేకాటపరిచయం మాత్రం సాగుతోంది. అతని చిన్నప్పటి వుడుకుమోత్తనాన్ని గుర్తు చేసి శేషూ కాసేపు యేడిపించాడు. రెండోవాడి పేరు కుమార్. వీళ్ల నాన్నగారు పదకొండేళ్ళ క్రితం వుద్యోగరీత్యా యీ వూరికి బదిలీ అవడంతో పదోతరగతిలో యిక్కడ బళ్ళో చేరాడు. కాబట్టి శేషూకి యితని గురించి తెలియదు. కానీ నడమంత్రంగా శ్రీపాదపట్నం వచ్చినవాడు యీ వూరిని సొంత వూరన్నట్టు, తన స్నేహితుల గురించి బాగా తెలిసినట్టూ మాట్లాడుతుంటే, అతని పట్ల అకారణంగా అయిష్టత కలిగింది.

గడియారం యెట్టకేలకు యెదురుచూసిన భంగిమ అభినయించింది. శేషూ అందర్నీ తొందర పెట్టి లేవదీసాడు. అంతా కలిసి స్కూటర్ల మీదా, సైకిళ్ల మీదా బయల్దేరారు. దారిలో రాజవీధి గుండా వెళ్తున్నపుడు, రాజుగారి మేడ వైపు చూడకుండా ప్రయత్నపూర్వకంగా తల రెండో వైపు తిప్పుకున్నాడు. రావిచెట్టు అలానే వుంది. లంగరేసిన పడవలు యేటి అలల్తో పాటు సోమరిగా వూగుతున్నాయి. ఆ పరిసరాలన్నీ కొద్ది మార్పులతో యెప్పటిలానే వున్నాయి. కానీ అతని పాత యిల్లు మాత్రం అక్కడ లేదు. ఆ పాక స్థానే ఒక పెంకుటిల్లు వుంది. కొబ్బరాకుల దడి స్థానే ప్రహరీ గోడ వుంది. బోసిముడ్డితో వున్న చంటాడొకడు యింటి గేటు మీద కాళ్లు పెట్టి దాని సీలల ఆధారంగా ముందుకీ వెనక్కీ వూగుతున్నాడు. ఆ యింటి కప్పు మీద నాచు పట్టి నల్లబారిన బంగాళాపెంకు చూస్తే, అసలు యెప్పుడైనా అక్కడ తమ పాక వుండేదా, అనిపించింది.

బడి మైదానంలో పెద్ద టెంటు వేసి వుంది. అప్పటికే వచ్చినవాళ్ళలో మగవాళ్లు ఒక టెంటు కిందా, ఆడవాళ్లు ఒక టెంటు క్రిందా మడతరేకు కుర్చీల్లో కూర్చున్నారు. అమ్మాయిల హాజరు అనుకున్నదానికన్నా యెక్కువగానే వుంది. దాదాపు అందరి దగ్గరా, వళ్ళో కూర్చునో చెంగుకు వేలాడుతూనో, పిల్లలు కనిపిస్తున్నారు.

శేషు అందరితో పాటూ మగవాళ్ళు కూర్చున్న కుర్చీల వైపు వెళ్లాడు. హర్షాతిరేకమైన కేకలూ, పిలుపులతో అతణ్ణి తమ మధ్యకి ఆహ్వానించారు. పోటెత్తిన అలలా మాటలు మొదలయ్యాయి. ఏ సంభాషణా పరిపూర్ణంగా ముగియటం లేదు. అనూహ్యమైన మలుపులు తిరుగుతూ పోతుంది. సంభాషణలో భాగస్వాములు కూడా క్షణక్షణానికీ మారుతున్నారు. మారిన రూపురేఖల గురించి మాటలు దొర్లుతున్నాయి. కొన్ని సార్లు ఆయా స్నేహితుల కన్నా ముందే, వాళ్ళ కొత్త బట్టతలల్నీ, బానపొట్టల్నీ, తాడి యెత్తుల్నీ పలకరించడం జరుగుతోంది. ప్రస్తుతం ఎవరెవరు యేమేం చేస్తున్నారో ఆరాలు జరిగాయి. బడుగు జీవితాల్లో స్థిరపడిన వాళ్ళు కొందరు యే బేషజం లేకుండానే జీవిక గురించి చెప్పేస్తున్నారు; కొందరు మాత్రం గంభీరంగా మెళ్ళో పతకాన్ని యెత్తి చూపించినట్టు చెపుతున్నారు; మరి కొందరు మాదేవుందిరా అంటూ మొదలుపెట్టి, యేదో అలా పోతుంది అంటూ ముగిస్తున్నారు. జీవితంలో బాగుపడిన వాళ్ళు తమ వివరాల్ని అట్టహాసమైన నిరాడంబరతతోనో, నకిలీ మొహమాటంతోనో ప్రకటిస్తున్నారు. కాసేపటికి పాత రోజుల వైపు కబుర్లు మళ్లాయి. ఒకరితో మరొకరికి వున్న జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. కాని కొన్ని జ్ఞాపకాలు మాత్రమే వాటిలో భాగమైన అందరికీ వుమ్మడిగా గుర్తున్నాయి. శేషూకి  చాలా సందర్భాల్లో తన గురించి యెదుటివాళ్ళు చెప్తున్న జ్ఞాపకాలు గుర్తు లేవు సరికదా, ఆ జ్ఞాపకంలో కనిపిస్తున్న వ్యక్తి అసలు తనలానే అనిపించటం లేదు. అతను గుర్తు చేసుకున్న జ్ఞాపకాలు కూడా, అవతలి వాళ్ళ ముఖంలో అయోమయాన్ని బట్టి చూస్తే, చాలా వరకూ అతనికే పరిమితమయ్యాయి.

క్రమేపీ తన రాక కలిగించిన కోలాహలం సద్దుమణిగాకా, శేషూ ఆడవాళ్ల గుంపును శ్రద్ధగా పరిశీలించాడు. ఉద్విగ్నతను వుగ్గబట్టుకుంటూ, గులకరాళ్ళ కుప్పలో పగడపురాయి కోసం వెతికినట్టు ఒక్కొక్క అమ్మాయి ముఖాన్ని పట్టిపట్టి చూస్తూ, రేణూ కాదని తేలగానే మరో ముఖం వైపు చూపు మళ్ళిస్తూ, చివరికి గుండె తరుక్కుపోయే నిరాశతో అందర్నీ లెక్కలోంచి మినహాయించాడు. అక్కణ్ణించి లేచి బాలాని వెతుక్కుంటూ తరగతి గదిలోకి వెళ్లాడు. అక్కడ బాలా, కోటావోడూ కలిసి సౌండ్ సిస్టమ్ వాళ్లతో యేదో మాట్లాడుతున్నారు. కోటావోడితో పలకరింపులయ్యాకా, బాలాని పక్కకి తీసుకొచ్చి రేణూ రాలేదన్న సంగతి గుర్తు చేసాడు. బాలా తలకొట్టుకుని, సముదాయింపుగా యేదో చెప్పి పంపాడు.

బయటకొచ్చి వసారాలో నడుస్తుంటే, ప్రక్క గదిలో కొందరమ్మాయిలు కొంగులు నడుముకు బిగించి ఒక పెద్ద గుండిగలో రస్నా కలుపుతూ కనిపించారు. వాళ్ళ దగ్గర్నించి శంకూ గాడు పళ్ళెంలో రస్నా గ్లాసులు పెట్టుకుని వస్తూ యెదురయ్యాడు. వాడా పళ్ళాన్ని అమ్మాయిల గుంపు దగ్గరకు తీసికెళ్తున్నాడు. “ఏరా వస్తావా, పరిచయం చేస్తాను,” అన్నాడు. శేషూ పదమన్నాడు.

ఇంకా దగ్గరకు వెళ్ళకముందే గుంపులో కొందరమ్మాయిలు అతణ్ణి చూసి తుంటరితనం వ్యక్తమవుతున్న ముఖాల్తో యేదో చెవులు కొరుక్కున్నారు. శంకూ రస్నా పళ్ళెం వాళ్లకిస్తూ, యెవరో చెప్పుకోండంటూ శేషూని ముందుకు తోసాడు. తెలియక పోవటమేవిటంటూ కొందరు పేరు చెప్పారు. అందరూ తలో ప్రశ్నా గుప్పించారు. వీళ్ళ గుంపుకు మధ్య కూర్చున్న అమ్మాయి పేరు సిద్దిరెడ్డి కనకమాలక్ష్మి (పెళ్లయ్యాక మెండు కనకమాలక్ష్మిగా మారింది). చిన్నప్పుడు, పెద్దగా చదివేది కాదు గానీ, రణపెంకి అల్లరి చేస్తుండేది. మగవాళ్లతోనూ పేచీలు పెట్టుకునేది. శేషు కాసేపు అక్కడ కూర్చుని ఆమెని ఆటపట్టించాడు. చెలికత్తెల సాయంతో ఆమె కూడా దీటుగానే స్పందించింది. వాళ్ళలో అన్నావజ్ఝుల పద్మావతి కూడా వుంది. చిన్నప్పుడు భద్రీ యీ అమ్మాయిని తన మూగ తరహాలో ఆరాధించేవాడు. ఆమెకి యివ్వాలని యివ్వలేక చాన్నాళ్ళు ఒక హృదయం గుర్తు గ్రీటింగ్ కార్డు పుస్తకాల మధ్యపెట్టుకుని తిరిగాడు కూడా. అప్పట్లో ఒకసారి యీ అమ్మాయి శేషూని యేదో పుస్తకం అడిగితే, అతను భద్రీ దగ్గర్నించి గ్రీటింగ్ కార్డు నొక్కేసి, ఆ పుస్తకంలో పెట్టి యిచ్చేసాడు. ఆమె యేడ్చి రెండ్రోజులు స్కూలుకు రాలేదు. భద్రీ కూడా కొన్నాళ్ళు శేషుతో గుర్రుగా వున్నాడు. ఇప్పుడా సంగతి గుర్తు చేస్తే ఆమె సిగ్గుపడింది.

శేషు వాళ్ల దగ్గర్నించి లేచి వెళ్తూ, ఆ ప్రక్కనే కూర్చుని పిల్లాడికి రస్నా పట్టిస్తున్న వనజాక్షి దగ్గర ఆగాడు. చిన్నప్పుడు రేణూకున్న కొద్దిమంది స్నేహితురాళ్లలో యీమె ఒకరు. లేని పెద్దరికంతో శేషూని పలకరించింది. తమకు సమవయస్కుడైనా సరే, తమకన్నా పెద్దవాడే అయినా సరే, బ్రహ్మచారయితే చాలు మగవాణ్ణి యింకా యీడురాని విభాగంలోకే లెక్కగట్టే కొందరు పల్లెటూరి వివాహితల తరహా ఆమెది. అతను తన వివరాలు చెప్పాడు. రస్నా బట్టల మీద ఒంపుకుంటున్న బుడ్డాడి బుగ్గ గిల్లుతూ, వాడి పేరు అడిగాడు. వాడు ఆమె మూడో కొడుకు. ఇంకా బళ్ళో చేర్చలేదు. పెద్ద పిల్లలిద్దరూ ఆమెను వదిలి మసలుకోవడం నేర్చుకున్నారు గానీ, వీడు మాత్రం కొంగు వదలడు. ఆమెకు పదో తరగతి అవంగానే మావయ్యతో  పెళ్లయిపోయింది. అత్తారిది పొరుగూరే. వాళ్లాయన నేతపని చేస్తాడు.

కాసేపు యీ కబుర్లయాక,  సాధ్యమైనంత అలవోకగా ధ్వనించేట్టు, “అవునింతకీ, మీ ఫ్రెండేది యెక్కడా కనిపించట్లేదు?” అన్నాడు.

ఆమె వున్నట్టుండి ఆదుర్దాగా చూస్తూ, “ఎవరు, సరితాదేవేనా! సచ్చిపోయింది తెలీదా?” అంది. అతను ఆ సంగతి భద్రీ ద్వారా యిదివరకే తెలుసుకున్నాడు. కానీ యిపుడామె ప్రస్తావన వచ్చాకా, తానడిగింది రేణూ గురించి అని అనలేకపోయాడు. ఆశ్చర్యం ప్రకటించాడు. ఆమె “అయ్యో నీకెవరూ చెప్పలేదా” అంటూ, సరితాదేవి అత్తారింటిని కచ్చగా తిడుతూ, ఆ వృత్తాంతం చెప్పుకొచ్చింది.

ఆ ప్రస్తావన సద్దుమణిగాక, అపుడడిగాడు రేణూ గురించి.

ఆమె నవ్వింది, “అదేంటి శేషూ, నీకే తెలుస్తాదనుకున్నానే! మా కన్నా యెక్కువ నీ కూడానే కదా తిరుగుతా వుండేది. నువ్వెళ్ళేక బడి కూడా మానేసిందిగా!”

“లేదు, నే వెళ్లక ముందే మానేసింది!”

“అవునా, యేమోలే... నేనలా అనుకునేదాన్ని యెందుకో... మీకిద్దరికీ యేదో గొడవైందనీ కట్టా! అడిగితే సెప్పేది కాదు. తొమ్మిదిలో కదా మానేసిందీ?”

“ఊ...”

“అపుడాలింటికెళ్ళేను. నా కూడా సరితే కావాల, వచ్చింది. అడిగేవిలా, ఏవైందే అని. సదువు నచ్చలేదంట. ఎందుకంటే సెప్పదు. ఏదో మట్టుకు అయింది, క్లాసులో కూడా దిగాలుగా కూసునేది. ఏంటో యేవైనా ఆ పిల్లదంతా అదో మాదిరి కదా!”

“ఊ...”

“నీతో మట్టుకు బా సరదాగా వుండేదనుకుంటాలె. అయినా యే మాట కామాటే చెప్పుకోవాలి, మాతో కూడా ఆ చివర్లో మంచి బాగా కలిసిపోయింది పాపం. కాస్త ఫ్రెండ్సయ్యీ లోపడే మానేసిందని బాధగా వుండేది సరితకీ నాకూని. పదోక్లాసు కూడా వుండుంటే బాండేది.  నువ్వు కూడా అపుడే యెళిపోయావు కదా. కానీ ఆ యేడు చూడాలి శేషు! పబ్లిక్ పరీచ్చలనే సరికి జనం తెగ విరగబడి సదివేసేవోళ్ళులే...,” అంటూ పదవతరగతి కవుర్లు కొన్ని చెప్పుకొచ్చింది. శేషూ అన్యమనస్కంగా విన్నాడు.

ఉపాధ్యాయులు ఒక్కొకరుగా రావడం మొదలైంది. చుట్టుప్రక్కల వూళ్ళలో పని చేసేవాళ్ళు సొంత స్కూటర్ల మీదే వచ్చారు. దూరాలనించి వచ్చేవాళ్ళని మాత్రం విద్యార్థులే బస్టాండు నుంచో, రైల్వేస్టేషను నుంచో తమ వాహనాల మీద తీసుకొస్తున్నారు. ఒకరు రిక్షాలో వచ్చారు. వచ్చినవాళ్ళంతా బడలిక తీర్చుకుని, వేదిక మీద సుఖాసీనులయ్యాక, మైకులో బయటనున్న విద్యార్థులందరినీ తరగతి గదిలోకి రావలసిందిగా ప్రకటించారు. శేషూ అందరితో పాటూ లేచి వెళ్తున్నాడు. ఇంతలో డ్రిల్లు మాస్టారిని సైకిలు వెనక యెక్కించుకుని భద్రీ అపుడే బడి ఆవరణలోకి ప్రవేశించాడు. సైకిలు స్టాండు వేసి యిద్దరూ నడిచి వస్తున్నారు. డ్రిల్లు మాస్టారు అతని భుజం మీద చేయి వేసి నవ్వుతుంటే, అతను చేతులు వూపుకుంటూ యేదో చెప్తున్నాడు. ఇందాక త్రిమూర్తులు గాడి దుకాణం దగ్గర అతణ్ణి నిర్లక్ష్యం చేసాడన్న అపరాధ భావన యే మూలో వుండటంతో, శేషూ వాళ్లకు యెదురెళ్ళాడు. భద్రీ అతణ్ణి డ్రిల్లు మాస్టారికి పరిచయం చేయబోయాడు గానీ, ఆయన మధ్యలోనే అడ్డం వచ్చి అతణ్ణి గుర్తుపట్టానన్నారు. ఒకమారు అతను జిల్లాస్థాయి గ్రిగ్ పోటీల్లో ఒక్కడే మూడు కప్పులు తేవడాన్ని గుర్తు చేసుకున్నారు. శేషు, ఆ కప్పులు తెచ్చింది తాను కాదని, తన అన్నయ్యనీ చెప్పాడు. ఆయన యిబ్బందిగా “వయసురా నాయనా!” అంటూ నవ్వారు; అన్నయ్య గురించి వివరాలు అడిగారు. ఈలోగా ఆయన్ని చూసి మిగతా విద్యార్థుల్లోని ఆయన అభిమానులు చుట్టూ చేరారు. ఆయన కొంతమందిని గుర్తు పడుతున్నారు. చాలామందిని గుర్తు పట్టగలిగా ననుకుంటున్నారు. గుర్తుపట్టలేదని చెప్పి యెవర్నీ బాధపెట్టడం ఆయనకి యిష్టం లేదులా వుంది. ఈ స్కూలుతో ఆయన అనుబంధం గట్టిది. ఆయన సర్వీసులో దాదాపు తొలి అర్థభాగమంతా యిక్కడే గడిచింది.

తరువాత అందరూ తరగతి గదికి వున్న రెండు గుమ్మాల్లోంచీ క్రిక్కిరిసి లోపలికి వచ్చారు. అంతా ఒకేసారి లోపలికి రావటమూ, చోటు కోసం బెంచీల చుట్టూ మూగడంతో గది అంతా చిన్నప్పుడు పాసుబెల్లు ముగిసినప్పటి గోలలా వుంది. అప్పటికే ఒక బెంచీ మీద చోటు సంపాయించిన సూదావోడు, శేషూని వచ్చి కూర్చోమంటూ లోపలికి జరిగాడు.

శేషూ భద్రీని రెండో ప్రక్కన కూర్చోపెట్టుకుని, “యేరా, యిందాక అలా ముఖం చాటేశావే, త్రిమూర్తులు గాడి షాపు దగ్గర?” అని అడిగాడు.

బదులుగా భద్రీ, సూదావోడికి వినపడకుండా శేషూ చెవి దగ్గర నోరు పెట్టి, “నీకు తెలీదెహె! యింకా మనోళ్ళు అప్పుడు మాదిరే వుంట్నారనుకున్నావా యేటి? అయితే కులగజ్జి, లేకపోతే డబ్బు గజ్జి! మనకేవో అలాంటివి పడవు,” అన్నాడు.

శేషూకి యిది నమ్మబుద్ధి కాలేదు. భద్రీ చూసే పద్ధతిలో లోపం అనుకున్నాడు. కానీ ఆ నమ్మకానికి చప్పున యెదురొస్తూ ఒక నిజం స్ఫురించింది; యిందాక త్రిమూర్తులు కొట్టులో పోగైన జట్టంతా ఒకే కులానికి చెందినవాళ్లు. వాళ్ళిపుడు యెక్కడున్నారా అని చుట్టూ చూసాడు. అంతా ఒకే చోట ఆఖరి బెంచీలో కుదురుకున్నారు. వాళ్ళు మాత్రమే కాదు, చాలామంది విషయంలో యెవరు యెక్కడ కూర్చున్నారన్న దానిపై వారి వారి సామాజిక, ఆర్థిక స్థానాల ప్రభావం కనిపించింది.

*     *     *

March 19, 2012

మిత్రభేదం (తొమ్మిదవభాగం)

ముందుమాట | మొదటిభాగం | రెండవభాగం | మూడవభాగం | నాలుగవభాగం | ఐదవభాగం
ఆరవభాగం | ఏడవభాగం | ఎనిమిదవభాగం | పదవభాగంఆఖరిభాగం | పూర్తి కథ pdf |   

శేషూ నగరం చేరిన కొన్ని నెలలకే అతని కుటుంబం కూడా పూర్తిగా అక్కడికి మకాం మార్చేసింది. అతను మొదట్లో కొత్త స్కూల్లో కుదురుకోవడానికి చాలా కష్టపడ్డాడు. ఊరి బడిలో తనకి వున్న హోదాని యిక్కడ అవలీలగా సంపాదించగలననుకున్నాడు. కానీ చాలా యెదురుదెబ్బలు తగిలాయి. తరగతి అగ్రశ్రేణిలో భాగం కావడానికి వట్టి చలాకీతనం సరిపోలేదు. మార్కులు కూడా కావలసి వచ్చాయి. అవి వుంటే చాలు చలిమిడిముద్దగాళ్ళు కూడా క్లాసు లీడర్లుగా చెలామణీ అయిపోతారు. వాళ్ళే గనక శ్రీపాదపట్నం బడిలో వుంటే అసలు పట్టించుకునేవాడే కాదు. ఇక్కడ మాత్రం వాళ్ళకు తలొగ్గాల్సి వచ్చేది.  టీచర్లు కూడా మార్కులు వచ్చిన వాళ్ళ పేర్లనే గుర్తుంచుకునేవారు. అవి రాక శేషు చాలా తొందరగా వెనక బెంచీలోకి వెళ్ళిపోయాడు. ఈ అవమానం  చాలదన్నట్టు తోటివాళ్ళ అపహాస్యం ఒకటి. అతని పల్లెటూరి యాస దగ్గర్నించి, చాలా తొందరగా అందరితో చనువు ఆపాదించుకునే అతని మనస్తత్త్వం వరకూ అన్నింటినీ అపహాస్యానికి వాడుకునేవారు. రాత్రుళ్ళు పక్క మీద నిద్రపట్టని కళ్ళతో శ్రీపాదపట్నాన్ని కల కనేవాడు. పగళ్ళు యిదివరకెన్నడూ అనుభవం లేని గుబులుతో స్కూలుకు వెళ్ళేవాడు. ఖాళీ దొరికినపుడు తన బాధల్ని వుత్తరాల్లో యెబ్బెట్టు వాక్యాల్లో పొదిగి  స్నేహితులతో పంచుకునేవాడు. తొలి రోజుల్లో వుత్తరం అందుకున్న ప్రతీ ఒక్కరూ కన్నీరు తెప్పించేంత ఆప్యాయతతో ప్రత్యుత్తరాలు రాసేవారు. కాలక్రమేణా చాలా మంది జారిపోయారు. క్లాసులో నెమ్మదిగా కుదురుకోగలుగుతున్న కొద్దీ శేషూ కూడా రాయటం తగ్గించాడు. ఒక్క బాలాతోనే వుత్తరాల్లో ఆ స్నేహధార, ఒక్కోసారి అడుగంటిన సన్నని పాయలా, ఒక్కోసారి ఒడ్డులు ఒరుసుకునే కూలంకష ప్రవాహంలా, యేది యేమైనా పూర్తిగా యెపుడూ యింకిపోకుండా సాగుతూ వచ్చింది.

పదోతరగతి తక్కుతూ తారుతూ యెలాగో గట్టెక్కించాడు. ఇంటరు నుండి నెమ్మదిగా పుంజుకున్నాడు. అక్కడి మనుగడ నియమాలు తెలిసి వచ్చాయి. తన అనుభవ పరిధుల్ని నగర జీవితపు కొలతలకు తగ్గట్టు కత్తిరించుకోగలిగాడు. కానీ తొలి రోజుల్లోని తడబాట్లు, యెదురుదెబ్బలూ అతని దూకుడును తగ్గించాయి. తర్వాత్తర్వాత వాటి వల్ల తాను చాలా యెదిగినట్టు భావించుకునేవాడు.

మొదట్లో అతనికి రేణూ కన్నా తరచుగా ఆమెని పెట్టుకున్న ముద్దు గుర్తొస్తూండేది. కౌమారంలో అడుగుపెట్టాకా, అమ్మాయిలు మునుపెరుగని ఆనందాలకు నెలవులుగా కనిపించడం మొదలయ్యాకా, అతని శరీరం అలాంటి అనుభవాలకై తపించేది. కానీ ఆ పాడు ఆలోచనల తరచుదనంతో పోలిస్తే, వాటిని చర్యలతో పరిపూర్ణం చేసుకోగల అవకాశాలు సగటున నూటికొక్కటి కూడా దొరికేవి కాదు. ఎట్టకేలకు యింటర్ చదివేటపుడు, వాళ్ళ క్వార్టర్సులో డిగ్రీ చదివే పక్కింటి అమ్మాయితో, తొలిసారి పూర్తిస్థాయి అనుభవం సాధ్యమైంది. మిద్దె మీద నీళ్ళ టాంకుకీ, పిట్టగోడకీ మధ్యనున్న యిరుకుసందులో, వాళ్లిద్దరూ తమ సాహసయాత్రని మొదట తడుములాటలతో మొదలుపెట్టి వయా తడిముద్దుల మీదుగా తొలికలయిక దాకా సాగించారు. కానీ యీ దొంగచాటు మైథునాలు యెన్నాళ్ళో సాగలేదు. ఒకరోజు పక్కింటావిడ  పైన యెండబెట్టిన వడియాలు తీసుకోవటానికి వచ్చి, మొదట వీళ్ళ నీడలు చూసి యేదో అనుకుని కెవ్వుమన్నా, వెంటనే విషయమర్థమై విసవిసా కిందకి వెళ్ళిపోయింది. అమ్మాయి తరపు వాళ్ళు యే క్షణంలో యింటి మీదకు పోట్లాటకు వస్తారో తెలియక ఆ రాత్రంతా  శేషూ యెవరికీ తెలియని స్వంత నరకంలో బిక్కుబిక్కుమంటూ గడిపాడు. కానీ ఆ రాత్రే కాదు, తర్వాతి రోజూ యేం జరగలేదు. ఆ అమ్మాయి కుటుంబం కొన్ని రోజులకే నిశ్శబ్దంగా వేరే యిల్లు చుసుకుని మారిపోయింది. ఆ యింటి చిరునామా తెలుసుకోగలిగాడు గానీ, యెందుకో వెళ్ళి కలవటానికి జంకాడు. పరిస్థితి యింత జటిలమయ్యాకా తాను ఆ అమ్మాయి నుంచి ఆశించింది యిదివరకటి తేలికదనంతో యెలాగూ లభ్యంకాదనిపించింది.

ఈ శరీర యావతో పోలిస్తే, అతనిలో మనసు యావ కాస్త  ఆలస్యంగానే మొదలైంది. అది కూడా కొందరి విషయంలోలా జీవితాన్ని అంచుల్తో సహా లోనికి లాక్కునే కృష్ణబిలపు రాక్షసతీవ్రతతో యెపుడూ లేదు. సినిమాలు చూసి వాటి హీరోల స్థానంలో తనను వూహించుకున్నంత కాలం, ప్రేమానుభవమంటే ఒక వుత్తేజవంతమైన సాహసంలా అనిపించేది. అమ్మాయి తరపువాళ్ళు అతణ్ణి వ్యతిరేకించి హింసాత్మకంగా ప్రతిస్పందించడం, అతను ధైర్యంగా రొమ్ములు యెదురొడ్డి నిలబడటం, యిలాంటివి వూహించుకునేవాడు. అదృష్టవశాత్తూ యిలాంటి సాహసాలకు తావున్న ప్రేమ యేదీ యెదురవకముందే ఆ దశ దాటిపోగలిగాడు. దరిమిలా యింట్లో వదిన దగ్గరుండే కొన్ని చవకబారు నవలలు చదివి వాటి పాత్రల స్థానంలో తనను చూసుకున్నంత కాలం, ప్రేమానుభవం ఒక లెక్కల సమీకరణంలా అనిపించేది. అమ్మాయి అభిప్రాయాలూ అతని అభిప్రాయాలూ సమగ్రంగా కలవటం, యిరువురూ యెవరి వ్యక్తిత్వాల్ని వాళ్ళు కాపాడుకుంటూ పరస్పరం గౌరవించుకుంటూ పురోగమించటం, యిలాంటివి వూహించుకునేవాడు. ఈసారి దురదృష్టవశాత్తూ అతనీ దశ దాటక ముందే యిలాంటి సమీకరణాల ప్రేమ దారి కాచి పట్టేసింది.

పోస్టుగ్రాడ్యుయేషన్ మధ్యలో వుండగా ఒక సహవిద్యార్థిని అతణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పింది. ఇలా అమ్మాయి వైపు నుండి ప్రతిపాదన రావడం అతనికెపుడూ జరగ లేదు. క్లాసులో ఆమెతో మామూలు పరిచయం వుంది. కానీ యీ దృష్టితో యెపుడూ చూడలేదు. చూడటం మొదలుపెట్టాకా, అతనిలో యింకా నిర్మాణదశలో వున్న ఆకాంక్షలన్నింటికీ ఆమెయే అంతిమరూపం అనిపించింది. ఆమె అందంగా వుంటుంది, కానీ అలంకరణను యిష్టపడదు, బోలెడు భావుకంగా ఆలోచిస్తుంది, పుట్టిన రోజునాడు అనాథాశ్రమాలకి వెళ్ళి గడిపి వస్తుంది, తండ్రి అంటే చాలా అభిమానం, చదువు తర్వాత భావి వృత్తిజీవితం పట్ల స్పష్టమైన అవగాహన వుంది. శేషూ ఆమెని నమ్మశక్యం కాని దైవలీలగా భావించి స్వీకరించాడు. ఒకసారి యేం నచ్చి నన్ను యిష్టపడ్డావని అడిగితే, అతని దృఢవ్యక్తిత్వాన్ని వెల్లడించే కొన్ని అంశాలని వుదహరించింది. అవి విన్నాక, భక్తుని అంచనాలు అందుకోగలనా అని ఒత్తిడికి లోనయ్యే భగవంతునిలా ఇబ్బందిపడేవాడు. ఆమె అంచనాలు భంగపడతాయన్న బెరుకుతోనే, కాలేజీ తర్వాత కలిసి తిరిగిన తిరుగుళ్ళలో యెపుడూ చనువు తీసుకోలేకపోయేవాడు. ఒకసారి పార్కులో ఆమె నడుం వంపు కలిగించిన తిమ్మిరి తట్టుకోలేక అల్లరి చేయబోయాడు గానీ, ప్రతీ దానికీ సమయం వుంటుందని సర్ది చెప్పింది. వాళ్ళు కలిసి తిరిగిన రెండేళ్ళలోనూ ఆ సమయం యెపుడూ రాలేదు. తర్వాత కూడా రాలేదు. ఒకరోజు తండ్రి పెళ్ళికి ఒప్పుకోవటం లేదని చెప్పింది. ఇది అతను వూహించలేదు. ఇద్దరం రిజిస్టరు పెళ్లి చేసేసుకుందామనీ, మనవలు పుడితే ఆయనే దగ్గరవుతాడనీ యేదో సర్ది చెప్పబోయాడు. ఆమె తండ్రి మాట కాదనలేనంది. బతిమాలినంత సేపు బతిమాలి, చివరికి విసుగొచ్చి, యింత తెగింపు లేని దానివి నన్నెందుకు యిందులోకి లాగావని కసరుకున్నాడు. నువ్వింత అపరిపక్వంగా ఆలోచిస్తావనుకోలేదంది. ఎన్నో రకాలుగా సర్ది చెప్పాడు. చివరికి ఒకరోజు అన్నయ్యని వాళ్ళ యింటికి మాట్లాడమని కూడా పంపించాడు. ఆమె తండ్రి, మాట్లాడటం అటుంచి, కులం గోత్రం చూసుకోకుండా యిలా పెళ్ళిసంబంధాలంటూ యిళ్ళ మీదకు వచ్చిపడటమేమిటని విరుచుకుపడ్డాడు. ఈ రాయబారం సంగతి ఆమెకి తర్వాత తెలిసి శేషుతో గొడవపడింది. హార్టు పేషంటయిన నాన్నగారిని అలాంటి పరిస్థితిలోకి నెట్టడం ఆమెకు నచ్చలేదు. కొన్ని రోజులు మాట్లాడలేదు. తెలియకుండానే ఆమెతో వర్తమానాన్నీ, భవిష్యత్తుని యెంత గాఢంగా అల్లేసుకున్నాడో అప్పుడు అతనికి అర్థమైంది. ఎపుడూ యేడవననుకున్నవాడు అపుడపుడూ యేడ్చాడు కూడా. అతని పరిస్థితి చూసి జాలిపడి కొన్నాళ్ళు దూరంగా వుందామంది. ఇలా ముందుచూపు లేకుండా భావోద్వేగాల్లో పడికొట్టుకుపోతే యిద్దరి జీవితాలూ నాశనమవుతాయని బుద్ధి చెప్పింది. అన్నట్టే కలవడం మానేసింది. తర్వాతెపుడో పెళ్ళికి పిలిచింది గానీ, శేషూ వెళ్ళలేదు.

ఎక్కడ తప్పు జరిగిందో, తనకే యెందుకిలా జరిగిందో అతనికి అర్థమయ్యేది కాదు. కొన్నాళ్ళు గెడ్డాలు పెంచి, తిండి తినక పిచ్చివాలకంలా తయారయ్యాడు. చివరికి వాళ్లన్నయ్య బలవంతం మీదా, సాయం మీదా, చదువుకోవటానికి వేరే దేశం వెళ్ళాడు. మొదట్లో అక్కడి పరిసరాల్ని తన విషాదానికి అత్యంత అనువైన నేపథ్యంగా స్వీకరించాడు. అక్కడి ఒంటరితనం కూడా బాగా కలిసొచ్చేది. కానీ కొంతకాలానికే యిలా విషాదోపాసనలో గడుస్తున్న క్షణాలు విసుగుతెప్పించాయి. కుక్క ఖాళీ ముడుసును నోరు నొప్పెట్టేదాకా కొరికి, చివరికి అది డొల్ల అన్న నిజాన్ని ఒప్పుకోక తప్పక పారేసి తన దారిన పోయినట్టు, ఆ అనుభవాన్ని అవతలకు పారేయగలిగాడు. క్రమేపీ ఆమెతో బంధాన్ని విడిగా నుంచుని చూడగలిగాడు. ఆమె తరపు నుంచి ఆలోచిస్తూ ఆమె చర్యల్లో మంచిని వెతికే బానిస స్థితి నుండి, ఆమెని మనస్ఫూర్తిగా ద్వేషింగలిగే స్థితికి చేరుకున్నాడు. తర్వాత ఆ ద్వేషం కూడా చప్పబడిపోయి, వ్యర్థమైన కాలాన్ని గురించీ, కోల్పోయిన మనసు కన్యత్వాన్ని గురించీ పశ్చాత్తాపం మాత్రమే మిగిలింది.

శ్రీపాదపట్నాన్ని విడిచిపెట్టిన తర్వాత రేణుకాదేవి జ్ఞాపకం అతని దైనందిన జీవితాన్ని యేమాత్రం కలవర పెట్టకుండా, ఒక ప్రశాంత అంతర్వాహినిలా అట్టడుగునే పారేది. మొదట్లో అయితే నెలల తరబడి అసలు గుర్తుకు వచ్చేదే కాదు. వచ్చినా అది ప్రయత్నపూర్వకం కాదు. ఏదో బాహ్యప్రేరణ భౌతికేంద్రియాల్ని కదిలించడం వల్ల గుర్తుకు వచ్చేది. ఆమె సాన్నిధ్యంతో ముడిపడిన వాసనలేవైనా సోకినా, ఆమెతో వున్నప్పటి సందర్భాల్లాంటివి పునరావృతమైనా, ఆమె సిగ్గరి నవ్వును పోలిన నవ్వెక్కడన్నా కనిపించినా హఠాత్తుగా మస్తిష్క కాసారంలోంచి చేపపిల్లలా ఆమె జ్ఞాపకం వువ్వెత్తున పైకి యెగసి గాల్లో వంకీ కొడుతూ జారి మునిగిపోయేది. కాసేపు చైతన్యమంతా మృదు మంద తరంగితమయ్యేది. కాని తక్షణ వ్యాపకమేదో అతని ధ్యాస మళ్ళించగానే మళ్ళీ అంతా మామూలయిపోయేది. ఇంచుమించు డిగ్రీలోకి వచ్చాకా యీ తరహా మారింది. బహుశా జత కోరుకునే వయసులో సహజంగా కలిగే వంటరితనం వల్ల కావచ్చు. పడమటి యెండలో తురాయిపూలు రాలిన రోడ్డు మీద కాలేజీ నుండి కాళ్ళీడ్చుకుంటూ యింటికి నడుస్తున్నపుడో, సెలవురోజుల మధ్యాహ్నాలు కిటికీ దగ్గర కూర్చుని క్రింద కాలనీపార్కులో పిల్లలాడే ఆటలు చూస్తున్నపుడో — యిలా గుండె కవాటాల గుండా ఒంటరితనం మన్ను తిన్న పాములా దూరి పాకుతున్న సందర్భాల్లో  — ఆమె జ్ఞాపకం తనంత తానుగా గాక, అతని ఆహ్వానం మీద అక్కున చేరేది.

ఒక్కోసారి పిలవని అతిథిలా కలల ముసుగేసుకుని నిద్రలోకి కూడా జొరబడేది. ఆమె వున్న కలలన్నీ అతనికి స్పష్టంగా గుర్తుండేవి. ముఖ్యంగా ఒక కల అతని జ్ఞాపకంలో చాన్నాళ్ళు నిలిచిపోయింది: అతను కాలేజీ నుండి యింటికి వచ్చి తోరణాలు కట్టిన గుమ్మం ద్వారా లోపలికి ప్రవేశిస్తాడు, మధ్యగదిలో టీపాయి మీద స్వీట్లూ పళ్ళూ పేర్చి వుంటాయి, వాటి వెనుక సోఫాలో వాళ్ళ నాన్న ఒక కాలు పైకి మడిచి కూర్చుని చుట్ట నవుల్తూంటాడు, కొడుకును చూడగానే వచ్చి ప్రక్కన కూర్చోమని సైగ చేస్తాడు, అమ్మ కనపడకపోయినా ఆమె సందడి మాత్రం వినిపిస్తుంది, వాతావరణమంతా యేదో జరగబోతోందన్న ఆనందమయ వుద్విగ్నతతో ప్రకంపిస్తూ వుంటుంది, యింతలో ప్రక్క గుమ్మంలోంచి వదిన రేణూని భుజం చుట్టూ చేయి వేసి తీసుకువస్తుంది, ఆమె పరికిణీజాకెట్టులో వుంటుంది, అతణ్ణి చూసి పలకరింపుగా నవ్వుతుంది. అంతే, తర్వాత కల చెదిరిపోయింది. కలలోంచి మేల్కొన్నాక కూడా ఆనందం చాలాసేపు వదల్లేదు. తర్వాత తన రోజువారీ జీవితంలోంచి యీ కలకి కొన్ని అనాసక్తికరమైన ప్రేరణలేవో యేరి అన్వయించుకోగలిగాడు. కానీ కలలో జరిగిన మామూలు సంఘటనకి, నిద్ర లేచింతర్వాత వుబికివచ్చిన ఆనందానికీ పొంతన కుదుర్చుకోలేకపోయాడు. కలలో ఆమె కంటపడగానే, అప్పటిదాకా యేడు ఖండాలూ వెతికినదేదో చివరికి యింట్లోనే దొరికినంత ఆనందం యెందుకు కలిగిందో అతనికి అర్థం కాలేదు.

కలల్లోనే కాదు, అతని జ్ఞాపకాల్లో కూడా ఆమె యెప్పుడూ చిన్నప్పటి పరికిణీ జాకెట్లలోనే కనిపించేది. అతని వయసుతో పాటే ఆమె వయసు కూడా అక్కడ పెరుగుతూండి వుంటుందని తెలిసినా, అలా యెదిగిన యువతిలా ఆమెను వూహించుకోలేకపోయేవాడు. కానీ ప్రేమలో విఫలుడై విదేశంలో ఒంటరిగా గడుపుతున్నపుడు యిదీ మారింది. అసలు యెపుడూ ప్రేమానుభవాన్ని నింపుకోని మనసు సంగతి వేరు. అతని మనసు అప్పటిదాకా ప్రేమతో తొణికిసలాడిందల్లా వున్నట్టుండి ఖాళీ అవడంతో, ఆ ఖాళీ నింపుకోవటానికి ఆత్రంగా అంగలార్చింది. తదనుగుణంగా రేణుకాదేవి జ్ఞాపకమూ స్వభావాన్ని మార్చుకుంది. దేశం కాని దేశంలో ప్రమాదకరమైన చీకటి సందులమ్మటా స్వర్గబహిష్కృతునిలా తిరిగినపుడో, సెలవురోజుల్లో సబ్వే ట్రయిన్లెక్కి దిక్కులేని దేశదిమ్మరిలా చక్కర్లు కొట్టినపుడో, యెపుడన్నది యిదమిత్థంగా చెప్పలేడుగానీ, ఆమె యిదివరకట్లా చిన్నపిల్లలా కనిపించడం మానేసింది. తనను యీ ఆత్మవినాశేచ్ఛ నుండి రక్షించి పొత్తిళ్ళలో కాపాడుకోగలిగే పరిణత ప్రౌఢలా కనిపించసాగింది. అసలు ఆమె నిజంగా రేణుకాదేవేనో, లేక తాను ఆశ్రయం పొందాలనుకునే ఒకానొక భద్రభావానికి ఆమె మూర్తిని తెచ్చి తగిలించాడో అతనికీ తెలియదు. విదేశంలో వున్నపుడే సుబ్బరాజుగారు చనిపోవడం, ఆయన కర్మకాండకు వెళ్లొచ్చిన అన్నయ్య ఆ వివరాలు తెలియజేస్తూ రాసిన వుత్తరంలో రేణూ గురించి కూడా కొంత రాయడం, యివన్నీ కూడా ఆమె వైపు ఆలోచనలు మళ్ళేలా చేసాయి. అపుడపుడూ తమ స్నేహపు చివరి రోజులు గుర్తుకొచ్చేవి. అతని పట్ల అతనికే కోపం వచ్చేది. చిన్నపాటి తగువుతో కలతపడ్డ స్నేహాన్ని, మరమ్మతు చేసే ప్రయత్నం మానేసి, అది వీగిపోయేదాకా దాని మానాన దాన్ని వదిలేసినందుకు ఆ చిన్నతనపు శేషూ మీద చికాకు కలిగేది.

రెండేళ్ళ తర్వాత స్వదేశం తిరిగివచ్చాడు. ఒక మంచి వుద్యోగంలో కుదురుకున్నాడు. ఆమెను యెలా సమీపించాలో మాత్రం అర్థం కాలేదు. పైగా అతను ప్రస్తుతం ఒంటరితనపు ప్రమాదకరమైన కొండచరియ మీద నుంచి ఆమె పట్ల పెంచుకున్న ఆశే పట్టుగొమ్మగా వేలాడుతున్నాడు; తీరా ఆమెని కలిసాక అది అడియాసగా తేలితే తన పరిస్థితి యేమిటన్న భయం కూడా వెనక్కిపట్టి ఆపేది. ఈలోగా కొత్త వుద్యోగంలో కుదురుకునే ప్రయాసలో పడి చూస్తుండగానే యేడాది గడిచిపోయింది. చివరికి, దేవుడి దయలా, ఒకరోజు బాలా నుండి పూర్వవిద్యార్థుల పునస్సమ్మేళనోత్సవాన్ని గురించి కబురు వచ్చింది.

March 18, 2012

మిత్రభేదం (ఎనిమిదవభాగం)

ముందుమాట | మొదటిభాగం | రెండవభాగం | మూడవభాగం | నాలుగవభాగం | ఐదవభాగం
ఆరవభాగం | ఏడవభాగం | తొమ్మిదవభాగం | పదవభాగంఆఖరిభాగం | పూర్తి కథ pdf |    

అనుకున్న ప్రకారమే మరుసటి రోజు బడి మానేసాడు. కాని ఇంట్లోనే వుంటే సుబ్బరాజుగారి పాలేరుకి దొరికిపోతానేమోనని భయమేసింది. ఎందుకన్నా మంచిదని పూసావోడి పడవెక్కి వాడితో పాటూ తిరిగాడు. సాయంత్రమయ్యేసరికి బాలా వచ్చి యేవీ జరగలేదని చెప్పాడు. రేణూ మామూలుగానే వుందట. బాలా కదిపితే మామూలుగానే మాట్లాడిందట కూడా.

శేషూ మర్నాడు వుత్కంఠగా బడికి వెళ్ళాడు. ఎప్పుడూ లేని ఆత్రుతతో రేణూ రాకకై యెదురుచూసాడు. ఆమె పుస్తకాల దొంతరని ఛాతీకేసి హత్తుకుని, తన యిద్దరు స్నేహితురాళ్లతో కలిసి, యెప్పటిలాగే లోనికి ప్రవేశించింది. తరగతి జరుగుతున్నపుడు మధ్యమధ్యలో ఆమె వైపు చూసాడు. తాను చూస్తున్నాడన్న యెరుక ఆమెకు వుందని తెలుసు. ఆమె ముఖంపై నిర్లక్ష్యం తారాడుతుంది. ఆ కవళిక అతనికి చిరపరిచితమే. వాళ్ళిద్దరి మధ్యా యే గొడవ జరిగినా, మళ్ళీ అతను బతిమాలుకునేవరకు, ఆమె ముఖంపై యిదే కవళిక కనిపిస్తుంది. కాని యిదివరకట్లా వెళ్ళి బతిమాలా లనిపించలేదు. ఒక కారణం: మొన్నటి రాత్రి పడ్డ భయమంతా (అలా కంగారుగా వీధుల్లో పరిగెత్తడమూ, బాలా దగ్గర పిరికిగా బైటపడాల్సిరావడమూ అదంతా), యిపుడు వుత్త భయమేనని తేలిపోగానే, ఆమె మీద కోపంగా మారింది. ఆమె వల్లనే అలాంటి పరిస్థితి కలిగిందన్న దుగ్ధ అతనిలో యింకా రగులుతోంది. అది త్వరగా చల్లారిపోయేదే, దీనికి రెండో కారణం ఆజ్యం పోయకుండా వుంటే! ఆ  రెండో కారణం: ఆమె యివాళ క్లాసులో ప్రవర్తిస్తున్న తీరు. గొడవ పడినపుడు యిదివరకూ కూడా అతని పట్ల యిలాగే నిర్లక్ష్యాన్ని కనపరిచినప్పటికీ, అది అతని గుర్తింపు కోసం అర్రులు చాస్తున్నట్టుండేది; అతను వచ్చి బతిమాలుకునే దాకా ఒక తీక్షణమైన తపస్సులా అతని వైపు యెక్కుపెట్టి వుండేది; దాని తీవ్రత ఆమె చుట్టూ ప్రతీ అంశం మీదా ప్రసరించేది. దాంతో అతనితో మాటల్లేనపుడు మొత్తం ప్రపంచంతోనే మాటల్లేనట్టు ముభావంగా వుండేది. మామూలుగానే వేరెవరితోనూ అంత కలివిడిగా వుండేది కాదు గనుక, యీ సమయాల్లో మరింత యేకాకిలా కనిపించేది. జాలి కలిగేది. ఆ ప్రోద్బలంతోనే వెళ్ళి మాటకలిపి జట్టులోకి చేర్చుకునేవాడు. కానీ యిపుడామె అలా జాలిగొలిపే స్థితిలో యేం లేదు. ఇదివరకూ గొడవ పడినపుడు ఒక సరళరేఖలా ఆమె వైపు నుంచి అతణ్ణి చేరే నిర్లక్ష్యం, యిపుడు అతనితో నిమిత్తం లేనట్టు ఒక వలయాకృతిలో ఆమె చుట్టూ పరచుకుని వుంది. ఆ వలయంలోకి అతనికి తప్ప మిగతా అందరికీ ప్రవేశం వుంది. రేణూ ప్రస్తుతం స్నేహితురాళ్ళతో సరదాగానే మసలుకుంటోంది. పాస్‌బెల్లులో బయటకు వెళ్ళి ఆటలాడింది, తరగతి విరామంలో కబుర్లు చెప్పింది. ఈ మార్పు శేషూలో కసి పుట్టించింది. ఇన్నాళ్ళూ అతనికి అధికారపీఠం అప్పగించి, దాని పరిధిలో ఒబ్బిడిగా మసులుకుని, యిపుడు ఆమే ఆ పీఠాన్ని అతని కాళ్ల క్రింద నుండి లాగేసుకోవడాన్ని సహించలేకపోయాడు. ఇదెక్కడి దాకా వెళ్ళగలదో చూడాలనుకున్నాడు.

ఆ మరుసటి రోజే అతనికి కసి వెళ్ళగక్కే అవకాశం ఒకటి దొరికింది. ఆ రోజు లెక్కల మేస్టారు ఒక ప్రక్క పెద్దపరీక్షలు దగ్గరపడుతున్నా యింకా పాఠ్యప్రణాళిక పూర్తవటం లేదన్న పూనకంలో వున్నారు. తరగతి అంతట్నీ పట్టుకు చెరిగేస్తున్నారు. ఆ వరుసలో  రేణూ వంతు వచ్చినపుడు నిలబెట్టి  యేదో ప్రశ్న అడిగారు. రేణూ సమాధానం చెప్పలేకపోయింది. ఆడపిల్ల కాబట్టి బెత్తం పక్కనపెట్టి వెటకారానికి పని చెప్పారు. రేణూ ఆ మధ్య యెపుడో కంపాక్సు బాక్సులో రేగొడియాలు పెట్టుకు దొరికిపోయింది. దాన్ని యీ సందర్భానికి అన్వయించి వెటకరించారు. అప్పటికే తరగతి అంతా ఆయన కోపానికి బిక్కచచ్చిపోయి వుండటంతో యెవరూ నవ్వే సాహసం చేయలేదు. శేషూ మాత్రం పనిగట్టుకు బల్ల మీదకు వంగి ఆమెకు వినపడేట్టు కిసుక్కుమని నవ్వాడు. ఆమె కూర్చున్నాక ఆగ్రహావమానాలతో గడ్డకట్టి వున్న ఆమె ముఖాన్ని ఓరగా చూసి నిర్థారించుకున్నాడు కూడా. తన వైరభావాన్ని ఆమెకు తెలియజేయగలిగినందుకు సంతృప్తి కలిగింది. ఈ సంఘటన ప్రభావం అతను వూహించిన దానికన్నా యెక్కువగానే కనిపించింది. ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆ రోజంతా చాలా అసహనంగా ముళ్ళమీద కూర్చున్నట్టు కనపడింది. మునుపటి అలవోకయైన వుత్సాహం లేదు.  శేషూ మాత్రం మామూలు కన్నా యెక్కువ వుత్సాహాన్ని ప్రదర్శించాడు. ఒక ఖాళీ పీరియడ్లో చాలా అట్టహాసంగా అల్లరి చేసాడు. ఆ పీరియడంతా యెవరి గోల వారిది అన్నట్టు సాగింది. కొంతమంది ఒక గుంపుగా బల్లల మీద గుమికూడి కాగితం ముక్కలతో రాముడూసీతా ఆట ఆడారు. శేషూ ఆడపిల్లల్లోంచి కూడా కొందర్ని ఆటలో కలుపుకున్నాడు. వాళ్ళల్లో రేణూ స్నేహితురాళ్ళు సరితాదేవీ, వనజాక్షి కూడా వున్నారు. ఆమెని మాత్రం కొట్టొచ్చేట్టు తెలిసేలా నిర్లక్ష్యం చేసాడు. ఆమె వెనక బెంచీలోకి వెళ్ళిపోయి నిజంగా చదువుతున్నట్టే భృకుటి ముడివేసి పుస్తకంలో తల దూర్చింది. ఆమెలో యిదివరకట్లాంటి తీవ్రమైన ప్రతిస్పందన రప్పించగలిగినందుకు శేషూకి సంతోషం కలిగింది.

ఆ మరుసటి ఆదివారం రేణూ  ప్రతీ వారంలా శేషూ వాళ్ల యింటికి రాలేదు. బడిలో అలవాటుగా కూర్చునే స్థానం కూడా మార్చేసుకుంది. మామూలుగా వాళ్ళిద్దరూ ఆడ, మగపిల్లల బెంచీల వరసల్లో మధ్యనుండే సందుకి చెరోవైపూ కూర్చునేవారు.  ఆమె యిపుడు సందువైపు కాక గోడ వైపు కూర్చుంటోంది. తరగతిలో ఆమె ప్రవర్తనలోనూ మార్పు వచ్చింది. ఈ మధ్యే తోటివాళ్లతో కలివిడిగా వుండటం మొదలుపెట్టిందల్లా మళ్ళీ మానేసింది. ఎప్పుడూ చూసినా నిశ్శబ్దంగా, ముభావంగా వుంటోంది. ఎపుడు వెళ్తుందో యెపుడు వస్తుందో అజాపజా తెలియటం లేదు. ఇదివరకూ యే యేకాకితనం ఆమె మీద జాలి కలిగించి సంధికి పురికొల్పేదో, యిపుడు ఆమె అదే స్థితిలోకి వచ్చింది. అయినా శేషూ చొరవ చేయలేకపోయాడు. ఇదివరకూ వాళ్ళమధ్య యెలాంటి గొడవలు జరిగినా, వాటి వెనుక కారణాలేవీ అటుపిమ్మట ఆమెతో సంధి ప్రతిపాదనకి అహాన్ని అడ్డు తెచ్చేటంత తీవ్రమైనవి కావు. కానీ ఆమెను ముద్దు పెట్టుకోవడమన్న ప్రస్తుత కారణం అతని యిష్టానిష్టాల్తో నిమిత్తం లేకుండా మనసులోకి అపరాధభావనను జొరబడేలా చేస్తోంది. ఆ అపరాధభావన గాఢతరమయ్యే కొద్దీ అతనిలో అహమూ పెరుగుతోంది. దాన్ని సమర్థించుకోవడానికి ఆమె కొట్టిన చెంపదెబ్బను గుర్తు తెచ్చుకునేవాడు. తాను ముద్దు పెట్టుకోవడం వల్లే ఆమె కొట్టిందని అనుకునేవాడు కాదు, తాను పెట్టిన ముద్దుకీ ఆమె కొట్టిన దెబ్బకీ చెల్లుకి చెల్లనుకునేవాడు; యిక వెళ్ళి బతిమాలాల్సిన పని లేదనుకునేవాడు. ఇదంతా తాను వూహించని దారిలో వెళ్తున్నట్టు అపుడపుడూ అనిపించేది.  కాని ఆమెను గురించిన ఆలోచనలు అతని మనస్సాక్షి నుండి యెంత అహానికి విరుద్ధమైన అవగాహనని ఆశించేవంటే, అసలామె గురించి ఆలోచించడమే తగ్గించేసాడు.

ఈ లోగా బడిలో మండలస్థాయి వాలీబాల్ పోటీలకు సన్నాహం మొదలవడంతో ఆ హడావిడిలో పడిపోయాడు. డ్రిల్ మాస్టారు సాధన నిమిత్తం ఆటగాళ్ళకు చివరి పీరియడ్లలో పాఠాల నుండి మినహాయింపు యిప్పించారు. జట్టంతా మైదానంలో చేరి బడి ముగిసే దాకా ఆడేవారు. శేషూ సాయంత్ర మెపుడవుతుందా అని యెదురు చూసేవాడు. కోర్టులో అడుగు పెట్టి నెట్ కట్టింది తరువాయి, చుట్టూ ముగ్గుతో గీసిన అవుట్‌లైను సరిహద్దుగా అదొక చిన్ని ప్రపంచంలా మారిపోయేది. బంతి గాల్లో వున్నంత సేపూ ఆ ప్రపంచం వుత్తేజంతో కంపించేది. బడి గంట కొట్టి పిల్లలంతా బయటపడ్డాకనే సమయ స్పృహ కలిగేది. బంతి, నెట్టు డ్రిల్ మాస్టారుకి అప్పగించి బయటపడేవారు. శేషు బాలాతో కలిసి యింటికి నడిచేవాడు. ఒక రోజు అనుకోని దృశ్యం యెదురైంది. గేటు దగ్గర బాలాతో పాటూ రేణూ కూడా నిల్చొని వుంది. ఇది అతను వూహించలేదు. వాళ్ల వైపు నడుస్తున్నంత సేపూ యెలా ప్రవర్తించాలో తేల్చుకోలేక గజిబిజిపడ్డాడు. ఆటలో కీలక సన్నివేశాల్ని బాలాతో చర్చిస్తూ హుషారుగా యింటికి వెళ్ళవచ్చనుకున్న అతనికి యిపుడీ పరిస్థితి యెదురవడం యిబ్బందిని కలిగించింది. రేణూ పెదాల వెనక కనిపించీ కనిపించని నవ్వు తారాడుతోంది. మామూలుగా అలాంటి ఔదార్యం తన వైపు నుంచి ఆమెకు అందేది. ఆమె నుంచి స్వీకరించాల్సిన అవసరం యెపుడూ రాలేదు. ఆ అవసరం యిపుడూ లేదనిపించింది. తిన్నగా బాలా దగ్గరకు నడిచి ప్రక్కన రేణూ లేనే లేనట్టు, ఏరా రావట్లేదా?" అనడిగాడు. బాలా అయోమయంగా రేణూ వైపూ అతని వైపూ మార్చి మార్చి చూసాడు.

నువ్వు నాతో వస్తే రా, నే పోతున్నా, అని నడుచుకుంటూ వచ్చేసాడు శేషూ.

బాలా కాసేపటికి పరిగెత్తుకుంటూ వచ్చి పక్కన చేరాడు. యేరా, అలా వచ్చేసావు? రేణూ నీతో మాట్లాడదామనే వచ్చింది, అన్నాడు.

శేషూ మాట్లాడకుండా నడుస్తున్నాడు.

అలా వుండకూడదురా బాబూ ఫ్రెండ్స్ తోటి. కలిసిపోవచ్చు కదరా?

నువ్వు నడువెహె!

అలా వుండకూడదురా బాబూ!

పెద్దొత్తాదువి నువ్చెప్తే గానీ తెలీదురా మాకు! నేనోటిచెప్పనా? కలిసిపోటానికి నాకేం బాధ లేదు. కానీ ఆ పిల్ల అంతా  మనవే అన్నట్టు యెన్నాళ్ళు వుంటదిరా? మనవేవన్నా యెలకాలం వెనకుంటామా? లేనపుడు కూడా సత్తువగా నిలబడాలా వద్దా. అస్తమానం మన యెమ్మట పడి తిరిగితే అది రాదు కదా? అందుకే యిలా వుంటున్నా... అన్నాడు.

నిజానికి యీ మాటలు మాట్లాడక మునుపు శేషూ యిలా యెపుడూ ఆలోచించలేదు. మాట్లాడాకా మాత్రం యిదే నిజమని తనను నమ్మించుకోవడం మొదలుపెట్టాడు. ఆమె మంచి కోసమే ఆమెతో మాట్లాడట్లేదని తన మనస్సాక్షిని కూడా సమర్థవంతంగా సముదాయించగలిగాడు. దాంతో యిదివరకట్లా యే అపరాధ భావనతోనూ కొట్టుమిట్టాడాల్సిన అవసరం లేకపోయింది. రేణూ వునికిని నిశ్చింతగా తన ప్రపంచ పరిధుల అవతలకి నెట్టివేయగలిగాడు. అతనికి యీ క్రమంలో పెద్ద లోటేమీ కూడా కనపడలేదు. వెళ్ళి మాట్లాడితే ఆమె కోసమే మాట్లాడాలనుకునేవాడు. ఒక్కోసారి ఆమె మూగదానిలా తరగతిలో వుండీ లేనట్టు మసలుకుంటుంటే వెళ్ళి పలకరించాలనిపించేది. ఆ ప్రయత్నాన్ని యెప్పటికపుడు వాయిదా వేస్తూనే వుండేవాడు. చూస్తుండగానే యిద్దరి మధ్యా పరిస్థితి యెంత జటిలమైపోయిందంటే, అన్నీ అధిగమించి చేరువైనా ఆమెతో యిదివరకటి తేలికపాటి స్నేహం మరలా సాధ్యమవుతుందనిపించలేదు.

ఈలోగా యేడాది చివరికి వచ్చేయడంతో  ప్రయివేటు క్లాసుల్తో, ఒంటిపూటబళ్ళతో రోజులు చురుకుగా గడిచిపోయాయి.తేరుకునేసరికి పరీక్షలు దగ్గరకొచ్చేసాయి. శేషూ మొదటి రోజే గమనించాడు, రేణూ పరీక్షలకు హాజరవటం లేదని. బాలాని వెళ్ళి విషయం కనుక్కోమన్నాడు. ఇక బడికి రాననీ, చదువు మానేసానని చెప్పిందట. వెళ్ళి కలవాలా వద్దా అని ముందు వెనకలాడి చివరకు మానేసాడు.  పైగా అతను యెపుడు పరీక్షలు పూర్తవుతాయా అన్న ఆత్రుతలో వున్నాడు. ఎందుకంటే అతని అన్నయ్య వేసవి సెలవుల్లో నగరానికి తీసికెళ్తానని ముందే మాట యిచ్చాడు.

శేషూ అన్నయ్యకి యిటీవలే మంచి ప్రభుత్వోద్యోగం వచ్చింది. నగరంలో గవర్నమెంటు క్వార్టర్సులో వుంటున్నాడు. ఇచ్చిన మాట ప్రకారమే శేషూని తీసుకు వెళ్ళి అన్నీ తిప్పి చూపించాడు. అన్నయ్యకి సెలవైన రోజుల్లో యిద్దరూ ఎగ్జిబిషన్లకీ, జూ పార్కుకీ, సినిమాలకీ తిరిగారు. అతను వుద్యోగానికి వెళిపోయిన రోజుల్లో శేషూ బాల్కనీలో కూర్చుని రోడ్డు మీద వచ్చేపోయే కార్లనూ, మోటార్ సైకిళ్ళనూ వాటి వాటి కంపెనీ పేర్ల పరంగా విడదీసి లెక్కపెట్టేవాడు. ఏవి యెన్నొచ్చాయో కాగితం మీద రాసుకునేవాడు. ముఖ్యంగా మోటార్‌సైకిల్ నడిపేవాళ్ళని ఆరాధనగా చూసేవాడు. ముఖంలో హీరోయిజమేమీ కనపడనీయకుండా వాళ్ళు  వాటిని నడపగలగడం ఆశ్చర్యమనిపించేది. ఎండ తగ్గాక క్వార్టర్స్ పైన మిద్దె మీదకు చేరి, తక్కువ యెత్తులో యెగిరివెళ్ళే విమానాల కోసం యెదురుచూసేవాడు. రాత్రుళ్ళు దుకాణాల లైట్లతో, ప్రకటనల హోర్డింగులతో ప్రకాశవంతంగా వెలుగుతున్న నగరాన్ని చూసినపుడు అతనికి వేరే లోకంలో వున్నట్టుండేది.  అంతా బానే వుండేది గానీ, అన్నయ్య వుద్యోగం నుండి యింటికి వచ్చాకా ముందే కొనేసిన పదో తరగతి పుస్తకాల్ని చదివించడం మాత్రం నచ్చేది కాదు. వేసవి సెలవుల్లో చదవటమేమిటనుకునేవాడు. ఆ సమయాల్లో శ్రీపాదపట్నం గుర్తొచ్చేది. కొన్నాళ్ళే కదా అని సరిపుచ్చుకున్నాడు. అయితే వేసవి సెలవులు ముగిసాకా తెలిసింది, అతని బాగోగులకై కొన్ని వూహించని నిర్ణయాలు ముందే జరిగిపోయాయని. శ్రీపాదపట్నంలోనే వుంటే తమ్ముడు పబ్లిక్ పరీక్షలు కొండెక్కించేస్తాడని తీర్మానించి,  పదోతరగతి నగరంలోనే చదివించాలని అతని అన్నయ్య యేకపక్ష నిర్ణయం తీసేసుకున్నాడు. శేషూ గోలపెట్టాడు గానీ యేం చెల్లలేదు. వేసవి సెలవలు ముగియడం, అతణ్ణి ఒక ప్రైవేటు స్కూల్లో చేర్చడం అయిపోయాయి.

స్కూల్లో చేరిన కొన్ని రోజులకు శేషూ, అతని అన్నయ్యా కలిసి శేషూ సామాను పట్టికెళ్ళటానికి శ్రీపాదపట్నం వచ్చారు. ఒక రోజు శేషు అన్నయ్యతో పాటూ రాజు గారి మేడకు వెళ్ళాడు. అన్నయ్య  సుబ్బరాజుగారితో వూళ్ళో యిల్లు అమ్మకానికి పెట్టడం గురించి యేదో మాట్లాడుతున్నాడు. శేషూ మధ్యమధ్యలో కళ్ళెత్తి రేణూ గదివైపు చూస్తున్నాడు. కాసేపటికి మాటల్లో ఆమె ప్రసక్తి వస్తే, సుబ్బరాజుగారు రేణుకాదేవీ! అంటూ పిలిచారు. ఆయన కూర్చున్న వుయ్యాల బల్ల వెనక నుంచి, వంటగదిలోంచి కామోసు, బయటకి వచ్చింది. అన్నయ్య ఆమెకని తెచ్చిన పట్టీలు యిస్తే తీసుకుని, అతణ్ణి కాసిని కుశల ప్రశ్నలడికి, శేషూ వైపు చూడనైనా చూడకుండా మళ్ళీ వచ్చిన దారినే వెళిపోయింది. తరువాత సంభాషణ ఆడపిల్లల చదువు మీదకు మళ్ళింది. అన్నయ్య యేదో సమర్థనగా మాట్లాడబోతే సుబ్బరాజుగారు పెదవి విరిచారు. శేషూని మాత్రం మీ అన్నయ్యలా వృద్ధిలోకి రావాలంటూ భుజం చరిచి చెప్పారు. శేషూ వినయంగా తలూపాడు. అదే అతను రేణూని చివరిసారి చూడటం. సుబ్బరాజుగారు కాఫీ తాగి వెళ్ళమన్నపుడు రేణూయే వచ్చి యిస్తుందనుకున్నాడు గానీ, వంటావిడ యిచ్చివెళ్ళింది. రేణూతో మాట్లాడే అవకాశం గనక దొరికివుంటే ఆ పట్టీల యెంపికలో తాను అన్నయ్యకు సాయపడిన సంగతి చెప్దామనుకున్నాడు. కాని ఆమె మరలా బయట కనిపించలేదు.

అతను కూడా వున్న కొద్ది రోజులూ స్నేహితులకు వీడ్కోళ్ళు పలకడంలో నిమగ్నమైపోయాడు. వాళ్ళంతా ఒక్కొకరు ఒక్కోరకంగా ప్రతిస్పందించారు. కొందరు అనుకోనంత బెంగ పడ్డారు. కొందరు అనుకోనంత తేలిగ్గా తీసుకున్నారు. బాలా పోస్టల్ శాఖ వాళ్ళ డైరీ ఒకటి  బహుమతిగా యిచ్చి అందులో ఆలోచనలు రాసుకొమ్మన్నాడు. ఉత్తరాలు రాయటానికి చిరునామా తీసుకున్నాడు. భద్రీ స్టేషన్ దాకా వస్తానని బయల్దేరాడు. అందరూ కలిసి జట్కా యెక్కారు. అన్నయ్య ముందు కూర్చుని, బండి తోల్తున్న ముసలాడితో పిచ్చాపాటీ వేసుకున్నాడు. ముసలాడు తన కొడుకు అటు చదువూ చదవక, యిటు పనిలోకి రమ్మంటే నామోషీ పడుతున్న విషయాన్ని ఫిర్యాదుగా చెప్తున్నాడు. పిల్లలిద్దరూ బండి వెనుక కాళ్ళు క్రిందకి వేలాడేసి కూర్చుని వాలీబాల్ జట్టులో మార్పులూచేర్పుల గురించి మాట్లాడుకుంటున్నారు. గుర్రపు డెక్కలతో పాటూ పరిగెత్తలేక ఆయాసంగా వెనకపడుతున్న వూరి దారులు ప్రతీ మలుపుకీ ఒక రాగంతో, ప్రతీ గతుకుకీ ఒక గమకంతో వీడ్కోలు పాడుతున్నాయి. స్టేషన్లో  రైలు బయల్దేరబోతుందనగా, భద్రీ హఠాత్తుగా కిటికీలోంచి చేయిపెట్టి శేషూ జేబులో ఒక పదిరూపాయల కాగితం కుక్కాడు; అవసరానికి వాడుకొమ్మన్నాడు.  శేషూ కిటికీలోంచి భద్రీ రూపం కనుమరుగయ్యేదాకా చేయి వూపాడు. తర్వాత రైలు పెట్టె లోపలి సందడిలో నిమగ్నమైపోయాడు.

March 17, 2012

మిత్రభేదం (ఏడవభాగం)

ముందుమాట | మొదటిభాగం | రెండవభాగం | మూడవభాగం | నాలుగవభాగం | ఐదవభాగం
ఆరవభాగం | ఎనిమిదవభాగం | తొమ్మిదవభాగం | పదవభాగంఆఖరిభాగం | పూర్తి కథ pdf |     

‘అది జరగక ముందూ’, ‘అది జరిగిన తర్వాత’ అంటూ జీవితాన్ని రెండు ముక్కలుగా విడగొట్టే సంఘటనల్లో చాలావాటికి ముందస్తు శకునాలేవీ అందవు. శేషూ విషయంలోనూ అంతే. నిజానికి ఆ భీష్మేకాదశి రోజు వేరే రకంగా గుర్తుండిపోతుంద నుకున్నాడు. ఎందుకంటే ఆ రోజు జనార్దనస్వామి రథోత్సవంలో తొలిసారి రథం చిటారు కొమ్ము దాకా యెక్కగలిగాడు. అదేమంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ యెత్తుకి కళ్ళు తిరగుతాయన్నది ఒక కారణం. నలభై అడుగుల రథం మనిషెత్తు వుండే చక్రాల మీద కదులుతుంటే, సాక్షాత్తూ స్వామి ఆలయమే గోపురంతో సహా కదలి వచ్చినట్టనిపిస్తుంది. ఇక రెండో కారణమేమంటే, వూరేగింపు జరిగేటపుడు రథం పైఅంతస్తు అంతా వూళ్ళో కోడెగాళ్ళు ఆక్రమించుకుంటారు, శేషూ లాంటి పిలకాయల్ని చేరనివ్వరు. ఇక్కడ వీళ్ళ రద్దీకి కూడా ఒక కారణం వుంది. కళ్యాణ జనార్దనుడు కొత్తగా రంగులేసిన రథమెక్కి శ్రీపాదపట్నం వీధుల్లో వూరేగుతుంటే, వూరి జనం యెవరి ముంగిట్లో వాళ్ళు నిలబడి అరటిపళ్ళూ, చిల్లర నాణేలూ, పూలదండలూ రథం మీదకి విసురుతారు. విసిరేటపుడు వీటన్నింటినీ శక్తి మేరకు రథం పైఅంతస్తుకే యెక్కుపెడతారు. అందుకే దానికి అంత గిరాకీ. అయితే శేషూ రథం యెక్కాలనుకోవడానికి మాత్రం, యెక్కాలనుకోవడం తప్ప వేరే పరమార్థమేమీ లేదు. దాన్ని యెక్కగలిగితే తనకు పెద్దరికం వచ్చినట్టేనన్న భావన అతని మనసులో యెప్పటి నుంచో నాటుకుపోయింది. కిందటేడాది దాకా అతనికెప్పుడూ అవకాశం చిక్కలేదు. ప్రయత్నం చేసినా రథం కదలకముందే పిలకాయలని చెప్పి దింపేసేవారు. ఇప్పుడు తొమ్మిదో తరగతిలో కొచ్చాక మూతి మీద లేతగా నూగుమీసం మొలవటంతో కొత్త ధీమా మొదలైంది. భద్రీతో కలిసి ముందు నుంచీ కసరత్తులు మొదలుపెట్టాడు. భీష్మేకాదశికి నాలుగు రోజుల ముందే రథసప్తమి నాడు రథాన్ని కొట్టంలోంచి బయటకు తీసి పావురాల రెట్టలు కడిగి రంగులు వేస్తారు. ఈ నాలుగురోజులూ కుర్రాళ్ళిద్దరూ బడి అయిపోగానే తిన్నగా రథం దగ్గరకు వచ్చేసేవారు. అయితే యెవరూ పట్టించుకోనపుడు యిలా చిన్నపిల్లలాటగా రథం యెక్కడం వేరు, వూరేగింపు రోజు ఆ సంరంభంలో రథం యెక్కడం వేరు. దాని కోసం బోలెడు పథకాలు వేసుకున్నారు.

ఎదురుచూసిన రోజు యెట్టకేలకు రానే వచ్చింది. ఊరేగింపు యింకా కొన్ని గంటలుందనగానే యిద్దరూ రథం పైకెక్కి, తిరణాలలో కొనుక్కున్న జీళ్ళూ, ఖర్జూరాలు తింటూ, కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. శేషు ఖర్జూరం తిన్నాకా పిక్కల్ని వూరకనే పోనియ్యలేదు; క్రింద రావిచెట్టు కొమ్మలకి వూగుతున్న వుయ్యాళ్ల దగ్గర గాని, కాస్త యెడంగా యేటివొడ్డున గింగిరాలు తిరుగుతున్న రంగులరాట్నం దగ్గరగాని, తోటివాళ్ళెవరైనా వున్నారేమో చూసి వాళ్ళ మీదకు విసిరాడు. ఎవరికైనా తగిలి తలెత్తి చూస్తే చప్పున వెనక్కి నక్కాడు. నెమ్మదిగా గుడి గోపురం వెనక సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఏటి మీంచి సాయంత్రపు గాలులు జుట్టు చెదరేస్తున్నాయి. ముహూర్తసమయం ఆసన్నమవుతుండగా వూరి జనం  రథం చుట్టూ చీమలదండులా గుమికూడారు. క్రింది అంతస్తులో  స్వామి వుత్సవవిగ్రహాన్ని రథారోహణ చేయించే కార్యక్రమం మొదలైంది. ఆలయ అర్చకుల మంత్రోచ్ఛారణలు వినిపిస్తున్నాయి. సుబ్బరాజు గారు ప్రధానార్చకుల దగ్గర్నించి తీర్థం పుచ్చుకుంటున్నారు. రేణుకాదేవి కూడా పక్కనే వుంది. శేషూ పై నుంచి అరిచాడు గానీ, గోలలో ఆమెకు వినపడలేదు.  ఈలోగా పైకి యెక్కిన కొందరు యువకులు వీళ్ళని దిగిపొమ్మని అదిలించారు. అదృష్టవశాత్తూ వాళ్ళలో భద్రీకి అన్నయ్య వరసవాడు వుండటంతో యిద్దరూ వాణ్ణి బతిమాలుకున్నారు. కొన్ని జీళ్ళు లంచం కూడా యిచ్చారు.

సుబ్బరాజుగారు కొబ్బరికాయ కొట్టడంతో వూరేగింపు మొదలైంది. జనం చెరోవైపూ రెండు వరుసలుగా నిలబడి, పిడికిళ్ళకు పట్టు దొరికీ దొరకని తాళ్ళ సాయంతో, ‘జైజనార్దనా’అని అరుస్తూ రథాన్ని లాగడం మొదలుపెట్టారు. ఒక్కసారి కాళ్ళక్రింద భూమి కదిలినట్టనిపించడంతో శేషూ, భద్రీ రథం దూలాల్ని పట్టుకుని వెర్రికేకలు పెట్టారు. అలంకరణకు వేలాడేసిన పూలదండలన్నీ దారిలో గతుకులకి లయగా వూగుతోంటే రథం రాజసంగా శ్రీపాదపట్నం ప్రధాన వీధులన్నీ తిరుగుతోంది. దాని చుట్టూ జనసందోహాన్ని చూస్తే, అది తిరుగుతున్న వీధులు తప్ప మిగతా వూరంతా నిర్జనమైపోయిందా అనిపిస్తోంది. ప్రతీ వీధిలోనూ కాసేపు ఆగినపుడు ఆ వీధి ముత్తయిదువులంతా యెదురెళ్ళి హారతులిస్తున్నారు. పై అంతస్తులో కుర్రాళ్లిద్దరూ మీదకు యెగిరి వస్తున్న చిల్లరని అందుకునేందుకు మిగతా యువకుల్తో పోటీ పడుతున్నారు. ఊరేగింపు సగంలో వుండగానే మసక చీకట్లు అలుముకున్నాయి. క్రింద జనం కాగడాలు వెలిగించారు. వాటితోపాటూ వీధి కిరువైపులా గెడకర్రలపై వేలాడేసిన విద్యుద్దీపాలంకరణ కూడా వెలగడం మొదలైంది. పైన ఆకాశంలో నక్షత్రాల మినుకుమినుకులూ, క్రింద భూమ్మీద సీరియల్ లైట్ల మిలమిలలూ, నడి మధ్యన శేషూ! చీకట్లో నాణేల్ని పట్టుకోవడం కష్టమవుతోంది. ఒక్కో నాణెమైతే ఠపీమని తల వాచేట్టు తగుల్తోంది కూడా. ఊరేగింపు మొత్తం పూర్తయేసరికి అతని జేబులో ఐదు రూపాయలు పైగా చిల్లర పోగుపడింది. కొన్ని అరటిపళ్ళు కూడా దొరికాయి. ఊరంతా చుట్టి వచ్చి రథం మళ్ళీ గుడి చేరింది. స్వామిని పల్లకీలో యెక్కించి గుడిలోకి తీసుకుపోయారు. శేషూని అలా మోసేవాళ్ళెవరూ లేకపోవడంతో రథం కమ్మీలు పట్టుకుని నేల మీదకు దిగాడు. ఇంకా రథం తాలూకు వూపు వంటిని వదిలిపోనట్టే వుంది. కాళ్ళు యిప్పటికీ కష్టపడనవసరం లేకుండా గాల్లో జారుకుంటూపోవాలని ఆశపడుతున్నాయి. మనసు విజయగర్వంతో కుప్పిగెంతులు వేస్తోంది. ఈ రోజు తొలిసారి రథం యెక్కిన రోజుగా యెప్పటికీ గుర్తుండిపోతుందనుకున్నాడు.

భద్రీ  పోగైన చిల్లర యింటి దగ్గర దాచుకోవటానికి వెళ్లాడు. శేషూ అరటిపండొకటి వలుచుకుంటూ గుళ్ళోకి బయల్దేరాడు. గుడి ఆవరణ అంతా సందడిగా వుంది. పండగ దుస్తుల్లో వూరిజనం రోజూ చూసేవాళ్ళే కొత్తగా కనిపిస్తున్నారు. పెద్దలు ప్రదక్షిణలు చేస్తుంటే, పిల్లలు వాళ్ళ కాళ్ళకు అడ్డం పడుతూ ఒప్పులకుప్పా, దాగుడుమూతలూ ఆడుతున్నారు. ధ్వజస్తంభం చుట్టూ పేర్చిన ప్రమిదల్లోని దీపకళికలు చీరల విసురుగాలులకు కుదురులేకుండా తైతక్కలాడుతున్నాయి. ముఖమండపంలో గంట వుండుండి మోగుతోంది. ధూపదీపనైవేద్యాల్తో గర్భగుడిలో స్వామి వుక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. శేషు కులాసాగా ఒక మూలనున్న ఖాళీ మండపం యెక్కి కూర్చుని, చుట్టూ పరికిస్తూ అరటిపండు తింటున్నాడు. ఇంతలో యీ సందడి మధ్య రేణుకాదేవి కనిపించింది. ముఖమండపం మెట్లు దిగి అతని వైపే నవ్వుతూ నడిచి వస్తోంది. చిలకాకుపచ్చరంగు పట్టుపరికిణీ మీద వంకాయరంగు బుట్టచేతుల జాకెట్టు వేసుకుంది. తల మీద పాపిడిబిళ్ళ మెరుస్తోంది. ఆమె దగ్గరకు వచ్చి నిలబడటంతో కాళ్ళాడించడం ఆపాడు. ఎక్కడికి వెళ్లావని అడిగింది. శేషు వుత్సాహంగా రథం మీద చేసిన విన్యాసాలు చెప్పటం మొదలుపెట్టాడు. అవన్నీ తర్వాత, ముందు మండపం దిగమంది. ఎందుకని అడిగితే, పని ఒకటి పురమాయించింది. ఆలయనిర్మాతల వంశం గనుక సుబ్బరాజుగారి కుటుంబానికి స్వామి సేవలన్నిటిలోనూ ప్రాముఖ్యత వుంటుంది. రాత్రి పవళింపుసేవకి స్వామి శయ్యాలంకరణ బాధ్యత రేణు తలకెత్తుకుంది. దాని కోసమని యిపుడు గుడి వెనుక కోనేట్లో తామరపూలు కావాలట. శేషూ బట్టలు తడిసిపోతాయన్నాడు. ఇంటి కెళ్ళి మార్చుకోవచ్చులెమ్మంది. కోనేటి దగ్గర చీకటిగా వుంటుందన్నాడు. వెంట తోడు వస్తానంది. అసలు తామరపూలు అలంకరణకి వాడకూడదన్నాడు. నీకు తెలీదు వాడవచ్చంది. ఆమె యిక యేం చెప్పినా వినేట్టు లేదని అర్థమై, మండపం నుండి దూకి, ఆమె వెనుక నడిచాడు.

జడగంటలు కట్టుకుని జళ్ళో మల్లెపూలు తురుముకుందామె. చెవులకు బుట్టలు, వాటి వెనక నుండి చెంపసరాలూ కూడా కనపడుతున్నాయి. రేణూ యీ అలంకరణలో కొత్తగా కనిపిస్తోంది. నిజానికి మనిషిలో కూడా యీ మధ్య కొత్త మార్పొచ్చింది. గత యేడాది వాళ్ళింట్లో ఆమె సమర్తాడిన వేడుక జరిగినప్పట్నించీ యీ మార్పు గమనిస్తున్నాడు. అతనితో సాన్నిహిత్యం యెప్పటిలానే వుంది. కానీ యిదివరకూ అతనికి మాత్రమే ప్రవేశార్హత వున్న ఆమె సాన్నిహిత్యపు సౌధంలో, యిప్పుడు వేరే ప్రపంచానికి కూడా తలుపులు తెరుచుకుంటున్నాయి. తోటి ఆడపిల్లల్లో యిద్దరు ముగ్గురు తరచూ ఆమె వెంట కనిపిస్తున్నారు. ఇదివరకట్లా అతని కూడాపడి తిరగడం తగ్గించింది. అతనితో మంకుపట్లు పట్టడం మానేసింది. అతని ధ్యాస దబాయించి లాక్కోవడం లేదు. అయితే ఆమె యిదివరకూ అలా వుండేదీ అన్న సంగతి, అలా వుండటం మానేసాకనే అతనికి తెలిసింది. ఆమెలో చిగురుతొడుగుతున్న యీ స్వయంప్రతిపత్తి అతనికి యే మూలో కొంచెం యిబ్బందిని కలిగించింది. కాని దాన్ని యిదమిత్థమని యెపుడూ తరచి చూసుకోలేదు.

ఇద్దరూ గుడి వెనుక మండపాలన్నీ దాటి పెద్ద రావి చెట్టు దగ్గరకు వచ్చారు. రావి చెట్టుకు అవతల నలువైపులా మెట్లతో కోనేరు వుంది. రావి గుబుర్లు అడ్డం రావటం మూలాన ప్రస్తుతం అక్కడ మసకచీకట్లు ఆవరించి వున్నాయి. వెనుక గుడిలోంచి లీలగా వినిపిస్తున్న గంటానాదం తప్ప అక్కడ అంతా నిశ్శబ్దంగా వుంది. ఇద్దరూ మెట్లు దిగారు. తామరపూలేవీ ఒడ్డుకు చేరువగా లేవు. అన్నీ కోనేటి మధ్య వున్న చిన్ని మండపం చుట్టూ గుమికూడి వున్నాయి. ఆ మండపం అవతలి ఒడ్డుకు దగ్గర కావడంతో యిద్దరూ మెట్ల మీదుగా అటు నడిచారు. గుడి కోలాహలంతో నిమిత్తం లేదన్నట్టు కోనేరు నిశ్చలంగా నిద్రిస్తోంది. దాన్ని తమ రాకకు జాగృతం చేయడానికన్నట్టు, రేణుకాదేవి మామూలుగా నడుస్తున్నదల్లా పరికిణీని మడమల పైకెత్తి ఒక కాలు మెట్టు మీద వేస్తూ, ఒక కాలితో నీటిని కలచివేస్తూ నడవసాగింది. నాచు వుంటుంది జాగ్రత్త అన్నాడు శేషు. అదేం పట్టనట్టు కూనిరాగం తీస్తోంది. పడితే నా పూచీ కాదన్నాడు. అయినా మానలేదు. ఆమె పాట అక్కడి నిశ్చలత్వాన్ని మరింత యెత్తి చూపుతోంది. ప్రకృతి మొత్తం అప్రమత్తంగా వూపిరిబిగబట్టి వింటున్నట్టుంది.

ఇద్దరూ అటుప్రక్కకి చేరారు. శేషూ జేబులో చిల్లర తీసి ఆమెను జాగ్రత్త చేయమన్నాడు. అరటిపండొకటి తీసి తినమని యిచ్చాడు. ముందు బట్టలు తడవకుండా పనవుతుందేమో చూద్దామనిపించి, అక్కడ వున్న ఒక జామచెట్టు దగ్గరకు వెళ్లాడు. చెట్టును చంపేస్తున్నావని రేణూ గోలపెట్టడంతో కొమ్మ విరిచే ప్రయత్నం మానేసాడు. చుట్టూ వెతికి ఒక ఎండు కొబ్బరిమట్ట దొరికితే పట్టుకొచ్చాడు. మోకాలిలోతు వచ్చేదాకా నీట్లో మెట్లు దిగి ఆ కొబ్బరిమట్ట చాపాడు. అయినా పూలు అందేట్టు లేవు. యింకో మెట్టు దిగితే లాగూ తడిచిపోయేట్టుంది. ఒక వుపాయం ఆలోచించాడు. రేణూని వెనక నుంచి చొక్కా అంచు పట్టుకోమన్నాడు. ఆమె మిగిలిన అరటిపండు బుగ్గన కూరేసుకుని, వచ్చి పట్టుకుంది. ఆ దన్ను మీద యింకాస్త ముందుకు వాలాడు. రేణూ కాసేపు పళ్ళుబిగబట్టి బరువు మోసింది గానీ, వల్ల కాలేకపోయింది. పిడికిళ్లలోంచి చొక్కా జారిపోయింది. శేషూ భళ్లుమని నీటిలో పడ్డాడు. కోనేరు తరంగితమైంది. రేణూ  గుప్పిళ్ళతో నోరు మూసుకుని నవ్వాపుకుంది. శేషూ కాసేపు నీళ్ళలో కొట్టుకుని నెమ్మదిగా అడుగుమెట్టు మీద కాళ్లు నిలదొక్కుకున్నాడు. తడిసిన వళ్ళు పుట్టిస్తున్న చలికి చంకల్లో చేతులు దూర్పుకుంటూ మా తల్లే! నిన్ను నమ్మినందుకు చెప్పుచ్చుక్కొట్టుకోవాలి! అన్నాడు నిష్టూరంగా.

రేణూకి యింకా నవ్వాగటం లేదు. తెరలు తెరలుగా నవ్వుతూ, జారిపోయింది శేషూ! నిన్ను కావాలని నీళ్ళపాలు చేస్తానా, అంది, బుజ్జగింతలో కాస్త యెకసక్కెం కలిపి.

అదే యెటకారవంటే, నిన్ను తోత్తే తెలిసొస్తాది అంటూ కొబ్బరిమట్ట ఒడ్డు మీదకు విసిరేసి, వెనుదిరిగి తామరపూల వైపు యీదటం మొదలుపెట్టాడు. ఈత అదురుకి చుట్టూ వున్న పూలన్నీ చెదిరిపోతున్నాయి. తామరాకులు తలకిందులవుతున్నాయి. వాటిలోంచే కొన్నింటిని యేరడానికి  ప్రయత్నిస్తుంటే రేణు వారించింది. మండపం దగ్గరున్న పూలు తాజాగా వున్నాయి అవి తెమ్మంది. సరేండమ్మగారూ, వొడ్డునుండి బానే చెప్తున్నారు కవుర్లు, అని గునుస్తూ, అటు యీదాడు. మండపం యెక్కి, దాని స్తంభం ఒకదాన్ని ఆసరాగా పట్టుకుని, తన యీతకి నీరు చెదరని వైపు వంగి కొన్ని పూలు లాగాడు. అతను పూలు తెంచుతున్నంత సేపూ రేణూ యేవో సూచనలు చేస్తూనే వుంది. ఆమె యేరమన్న వాటినే యేరి, వాటన్నింటినీ జాగ్రత్తగా యెత్తి పట్టుకుని నెమ్మదికా యీదుకుంటూ ఒడ్డుకు వచ్చాడు. నీట్లోంచి బయటపడగానే మళ్ళీ చలి ఆవరించింది అతణ్ణి. అమ్మీడెమ్మా నీట్లో తెలీటం లేదు చలి! అంటూ వణికిపోతూ మెట్లెక్కుతున్నాడు. అతని చంకలో పూలు తీసుకోవడానికి రేణూ దగ్గరకొచ్చింది. పూలు యివ్వకుండా, ఆమె మీద జుట్టు దులిపి నీళ్ళు చిలకరించాడు.  ఓయ్! వేషాలేయకు అంటూ వెనక్కు గెంతింది.

యేం మరి పై నుండి పెద్ద పిల్లజమిందార్లా దర్జా వలకబోస్తన్నావూ?

ఆమె పెదాల వెనక నవ్వు నొక్కిపెట్టి, తెచ్చిపెట్టుకున్న కోపంతో, ఇదిగో తొందరగా వెళ్లాలి, యిస్తావా యివ్వవా,” అంటూ  దగ్గరకొచ్చింది. మళ్ళీ జుట్టు విదిలించాడు. మళ్ళీ వెనక్కి జంకింది. నడుంపై చేతులాన్చి యేవిటీ అల్లరి అన్నట్టు చూసింది. వెంటనే యేదో గుర్తొచ్చినట్టు జామచెట్టు దగ్గరకు వెళ్ళింది. అక్కడ జార్త చేసిన అతని తాలూకు చిల్లర చేతిలోకి తీసుకుంది, పోన్లే, ఆ పూలన్నీ నువ్వే వుంచుకో. యీ చిల్లరేమో నేను కోనేట్లో నిమజ్జనం చేస్తాను. సరేనా? అంటూ మెట్ల దగ్గరకొచ్చి చేతిని నీటి మీదకు చాపింది నాణేలు జారవిడబోతున్నట్టు.

అతను కంగారుగా కాళ్లబేరానికొచ్చాడు. ఓయ్ మాతల్లి! ఆటితో చాలా పనుంది. ఏం చేయకు. దా, వచ్చి తీసుకో నీ మాయదారి పూలు!

అలారా దారికి! అంటూ దగ్గరకు వచ్చింది. చంకలోంచి పూలు తీసి ఆమె కిస్తున్నట్టే చేయిసాచాడు. వాటిని అందుకోబోతోందనగా, రెండో చేత్తో చిల్లర దాచిన ఆమె చేయి పట్టుకుని తన వైపు గుంజాడు. అరిచి పారిపోబోయింది. పూలున్న చేతికి కూడా పనిచెప్పి ఆమె నడుమును వెనక నుంచి ఒడిసిపట్టుకున్నాడు. గుప్పిలి విప్పి చిల్లర లాక్కోవాలని ప్రయత్నిస్తున్నాడు. వదలమని గింజుకున్న కొద్దీ ఆమె వీపును తన కడుపుకేసి మరింతగా అదుముకుంటున్నాడు. ఆమె మెడ వంపులోకి చుబుకాన్ని జొనిపి భుజాన్ని నొక్కిపట్టాడు. చెంప నునుపుదనమూ, చెవిబుట్టల గరుకుదనమూ జమిలిగా స్పర్శ తెలుస్తున్నాయి. ఎపుడు మొదలైందో తెలియదు, కాంక్ష క్షణక్షణ ప్రవర్ధమానమైంది. చిల్లర లాక్కునే ప్రయత్నం వదిలేసి చేత్తో ఆమె పొత్తి కడుపును నిమిరాడు. చెంపల్ని తన వేడి చెంపలతో రుద్దాడు. ఆమె యిందాకట్లా గింజుకోవటం లేదు. చేష్టలుడిగిన ఆమె జడత్వాన్ని సమ్మతిగా అర్థం చేసుకుని, ఆమె శరీరాన్ని సాంతం తన వైపు తిప్పుకుని, అరటిపండు వాసన వేస్తున్న పెదాల్ని తన పెదాల్తో గట్టిగా నలిపాడు. రేణు అపుడే స్పృహలోకి వచ్చినట్టు శక్తి కొద్దీ అతని ఛాతీ మీద చేయి వేసి తోసేసింది. రెండంగలు వెనక్కి తూలినవాడల్లా, మళ్ళీ ముందుకు రాబోతోంటే, చిల్లర వున్న గుప్పిలి విప్పార్చి అతని చెంప మీద బలంగా కొట్టింది. నాణేలు ఘల్లుమంటూ నేల రాలాయి. ఒక నాణెం బొంగరంలా తిరిగి ఆగింది. మరొక నాణెం రెండంగల్లో మెట్లు దిగి బుడుంగుమని నీటిలో మునిగింది. ఆమె ఏ క్షణానైనా ఏడ్చేసేట్టు చూస్తోంది. అతను యింకా శిఖరం నుండి లోయలోకి జారిపోతున్న దిమ్ములోనే వున్నాడు. నొప్పిగా చెంప తడుముకున్నాడు. భయవిహ్వలమైన ఆమె ముఖకవళిక చూసి అలవాటుగా ఒక అడుగు ముందుకు వేసాడు. ఆమె గిరుక్కున వెనుదిరిగి పరిగెత్తింది. మెట్ల మీదుగా, రావి చెట్టు దాటి, యెక్కడా వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది.

అతనికి పరిసర స్పృహ వెంటనే కలగలేదు. చేతిలో నలిగిన తామరతూళ్ళను నేల మీదకు జారవిడిచాడు. మెట్ల మీద చెల్లాచెదురైన నాణేల్ని యేరుకోవటం మొదలుపెట్టాడు. ఇంతలో అకస్మాత్తుగా యేదో గుర్తొచ్చినట్టు, జుట్టు పిడికిట పట్టి నలుపుకుంటూ, అయబాబోయ్! అని గొణుక్కున్నాడు. ఒక్క వుదుటున పులి అలికిడి పసిగట్టిన జింకలా కదిలి గుళ్ళోకి పరిగెత్తాడు. ముఖమండపం దాకా వచ్చాక అతని చూపులు ఆదరాబాదరాగా జనమంతా వెతికాయి. రేణూ యెక్కడా కనపడలేదు. అంటే యింటికి వెళ్లి వుంటుంది, విషయం సుబ్బరాజుగారికి చెప్పటానికి!  గుడి బయటకు పరిగెత్తాడు. ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. ఇంటికి వెళ్ళే సమస్యే లేదు.  అప్పటికే అతని మనసు సుబ్బరాజుగారి పాలేరు యింటికొచ్చి మాట్లాడుతున్న దృశ్యాన్ని వూహిస్తోంది. వెంటనే బాలా గుర్తొచ్చి అతని యింటి వైపు పరిగెత్తాడు.

దారిలో వాతావరణమంతా యిందాకటిలానే సందడిగా వుంది. వీధికి చెరోవైపూ విద్యుద్దీపాలంకరణ యింకా వెలుగుతోంది. రథోత్సవం పూర్తి అవంగానే తిరణాల మళ్ళీ  జోరందుకుంది. జీళ్ళ దుకాణాల్లో రాటకేసి బెల్లంపాకాన్ని సాగలాగుతున్నారు. తడిక భుజానేసుకుని గాజులూ పూసలూ సవరాలూ అమ్మే అమ్మి, గాజులూ పూసలూ సవరాలోయ్ అని అరుస్తూ పచార్లు చేస్తోంది. పిల్లంగోవిలమ్మేవాడు పిల్లంగోవి వూదుకుంటూ తిరుగుతున్నాడు. పిడతకిందిపప్పు బండి దగ్గర పిల్లలు గుంపుగా మూగివున్నారు. కాసేపటికి క్రితం వరకూ యీ పండగ వాతావరణమంతా యెంతో సానుకూలంగా కనిపించింది. ఇపుడు మాత్రం అతని నరకాన్ని నిర్దయగా వెక్కిరిస్తున్న విపరీత నేపథ్యంలా వుంది. కాసేపటి క్రితం వరకూ యీ వీధుల్లోనే రాజాలా రథమెక్కి వూరేగాడు. ఇపుడు బెదురుగొడ్డులా నేలమ్మటా పరిగెడుతున్నాడు. అసలు `కాసేపటి క్రితం' అనేది కాసేపటి క్రితంలానే లేదు, ఏదో కలలా వుంది. ఇలా జరగాలని రాసిపెట్టి వుండబట్టే, దేవుడు ఆ కాసేపూ సుఖపెట్టాడేమో. ఇవాళ దేవుడికేవన్నా అపచారం చేసాడా. ఇందాక రథం పై నుంచుని జనాల మీదకి ఖర్జూరం పిక్కలు యిసరలేదూ. అందుకే యిలాంటి శిక్ష వేసి వుంటాడా. లేకపోతే శుభమా అంటూ పండగరోజు తనకలాంటి బుద్ది యెందుకొచ్చింది. అలా జరగకుండా వుంటే యెంత బాగుండును. అసలు రేణు కనపడకపోయుంటే యెంత బాగుండును. తిన్నగా గుడి నుండి యింటికి వెళిపోయేవాడు. అమ్మ యివాళ పులిహోర, పరవాణ్ణం చేస్తానంది. ఈ పాటికి అవి తింటూ వుండేవాడు. ఇపుడు అన్నాని క్కూడా దిక్కు లేదు. పోనీ యివాళ మాట దేవుడెరుగు. రేపైనా యింటికెళ్లగలడా. వెళితే అమ్మా నాన్నా యేం చేస్తారన్న సంగతి తరువాయి, ముందు సుబ్బరాజుగారికి అప్పజెప్పేయకుండా వుంటే అదే పదివేలు. అసలే కూతురు విషయంలో అల్లుణ్ణి చంపేసాడంటారు. ఆయనకి అప్పజెపితే తనకి డప్పడిపోయినట్టే. అలాంటి పరిస్థితే వస్తే యిల్లు వదిలి పారిపోవడం తప్ప యింకో దారి లేదు. అసలు అందాకా రానివ్వడమెందుకు, యిపుడే వెళిపోతే.  జేబులో డబ్బులున్నాయి. గడియారస్తంభం దాకా పోయి ముసిలోడి జట్కా బండి యెక్కితే అరగంట్లో రైల్వేస్టేషను దగ్గర దిగొచ్చు. ఏ రైలు ముందొస్తే ఆ రైలెక్కి కూచోవటమే. ఎక్కడ దింపితే అక్కడ దిగిపోవడమే. కొత్త ప్రదేశంలో కొత్త జీవితం మొదలుపెడతాడు.

ఈలోగా బాలా యిల్లు రావడంతో, ఆ కొత్త జీవితానికి సంబంధించిన పగటికలల చలనచిత్రానికి రీలు తెగింది. గుమ్మంలోకి వెళ్లబోయిన వాడే గట్టిగా మాటలు వినపడటంతో ఆగాడు. అవి బాలావాళ్ల నాన్న సూర్రావు గారి మాటలు. మాటలు కూడా కాదు, తిట్లు. వరండాలో నక్కి కిటికీ లోంచి తొంగి చూసాడు. అక్కణ్ణించి సూర్రావుగారు కనపడటం లేదు గానీ, బాలా కనపడుతున్నాడు. బాసింపట్టు వేసుక్కూర్చుని పుస్తకంలో తల దూర్చేసి వున్నాడు. చదవనంటే యిపుడే చెప్పేసేయి, రెండు గేదెలు కొనిపెడతాను, అలాగైనా వుద్ధరిద్దువుగాని! అంటున్నారు సూర్రావుగారు. ఆయనకి ఒక్కోసారి వున్నట్టుండి పిల్లల భవిష్యత్తు పట్ల విపరీతాందోళన కలుగుతూంటుంది. తాను వుద్యోగ బాధ్యతల్లో పడి పట్టించుకోకపోవడం వలన తల్లి లేని పిల్లలు పాడయిపోతున్నారా అన్న అనుమానం పుడుతుంది. కూతురు యెలాగూ యెప్పటికైనా గడప దాటి పోయేదే గనుక, కొడుకు చదువు మీద ధ్యాస మళ్ళుతుంది. అప్పటికప్పుడు ఆ కుర్రాడి పురోగతిపై తనిఖీ మొదలుపెడతాడు. ఈ ఆకస్మిక తనిఖీల్లో ఆయన అనుకున్న ఫలితం కనపడకపోతే, ఆ రోజుకారోజే వాణ్ణి ఉద్ధరించేయాలన్నంత ఆవేశపడతాడు. ఆ ఆవేశం నిలిచినన్ని రోజులూ యింట్లో సైనిక క్రమశిక్షణ అమల్లోకి వుంటుంది. అది చల్లారిన తరువాత మళ్ళీ అంతా మామూలే. బాలా యివాళ తిరణాల్లో యెందుకు కనపడలేదో అర్థమైంది శేషూకి. ఇప్పుడు వెళితే బాలాని పంపడం మాట అటుంచితే, ఆయన తనని కూడా కలిపి రేవాడేసేలాగున్నాడు. చప్పుడు చేయకుండా మెల్లగా బయటపడ్డాడు. ఈ భద్రీ గాడైనా యింటి దగ్గర తగలడ్డాడో, వూరి మీద పడి తిరుగుతున్నాడో చూడాలి. వాడూ లేకపోతే దిక్కులేనట్టే.

ఈ లోగా తిరణాల్లో కొనుక్కున్న బుడగ యెగరేసుకుంటూ  బాలా చెల్లెలు సుధ ఆపద్బాంధవిలా యెదురువచ్చింది. శేషూని చూడగానే మెడలో వేలాడుతున్న రంగుకళ్ళజోడు కళ్లకు తగిలించుకుని నవ్వుతోంది. బడాయి చాల్లేవే అంటూ ఆ పిల్లని నిలేసాడు. వాళ్ళన్నయ్యని బయటికి తీసుకు రాగలదేమో అడిగాడు. అమ్మో నాన్న తిడతాడంది. ఏదో వంక పెట్టి బయటకు తీసుకు వస్తే జీళ్ళు కొనిపెడతానన్నాడు. దాని బదులు ఆ డబ్బులిచ్చేస్తే రంగులరాట్నం యెక్కుతానంది. ఏదో ఒకటి చేద్దువుగాని ముందు వెళ్ళమని తొందరపెట్టాడు. ఉత్సాహంగా గెంతుకుంటూ లోపలికి వెళ్లింది. కాసేపట్లోనే బాలాని వెంటబెట్టుకు వచ్చింది. ఏం చెప్పి తీసుకు వచ్చావని అడిగితే, రంగులరాట్నం యెక్కడానికి భయమేస్తుంది, అన్నయ్య తోడు కావాలని చెప్పానంది.

శేషూ తన చెల్లెలికి డబ్బులివ్వడం చూసి బాలాకి వళ్ళుమండింది. అతను యింట్లో మగ్గిపోతుంటే యీ పిల్లేమో తిరణాలంతా బలాదూరు తిరుగుతోంది. ఎందుకే డబ్బులు నీకు, పోయి పన్చూసుకో, అని గసిరాడు. శేషూ నువ్వుండరా బాబూ అంటూ బాలాని సముదాయించి, ముఖం చిన్నబుచ్చుకున్న ఆ పిల్లకి డబ్బులు యిచ్చి పంపాడు. తరువాత అతణ్ణి పక్కనున్న చీకటి సందులోకి లాక్కుపోయి విషయమంతా క్లుప్తంగా చెప్పాడు. ఒకసారి తన యింటికి వెళ్ళి యెవరైనా వచ్చారేమో చూసి రమ్మన్నాడు. అలా వెళ్ళేటపుడు యెలాగూ దారే గనక సుబ్బరాజుగారి మేడ దగ్గర కూడా ఆగి యేవైనా గొడవ అవుతుందేమో చూడమన్నాడు. ఈలోగా బాలా కోసం తాను బడి మైదానంలో యెదురు చూస్తుంటానని చెప్పి అటువైపు పరిగెత్తాడు.

బాలా రెండో వైపు వెళ్లాడు. అతనికి యీ వ్యవహారమంతా రోమాంచితమైన వుత్కంఠని కలగజేసింది. ఇందాకటి దాకా యే తిరణాల్లోకి ప్రవేశం నిషిద్ధమై తాను యింట్లోనే కుతకుతా వుడికిపోయాడో, యిపుడు అదే తిరణాల చుట్టూ వూరిస్తున్నా పట్టించుకోబుద్ధి వేయలేదు. సుబ్బరాజుగారి మేడ దాకా వెళ్ళి కాసేపు బయట తచ్చాడాడు. గొడవ తనది కాదు కాబట్టి, యేది యెటు తిరిగినా తనకు పోయేదేమీ లేదు కాబట్టి, లోపలికి వెళ్ళి రేణూని కలుద్దామా అన్నంత ధైర్యం కూడా కలిగింది. కానీ రేణూ నిజంగా చెప్పేసి వుంటే లోపల పరిస్థితి యెలా వుందో తెలియదు. సుబ్బరాజు గారు యెదురైతే తనకు మాట పెగలదు. కాసేపు చూసి అట్నుంచటు శేషూ వాళ్ల పాకకి వెళ్లాడు. ఏమీ యెరగనట్టు శేషూ గురించి వాళ్ళమ్మని అడిగాడు. ఎక్కడ బలాదూరు తిరుగుతున్నాడో తెలియదని విసుక్కుంది.  బాలాకి మల్లే యెప్పుడూ యింటి పట్టున వుండే బుద్ధి వాడికెందుకు రాదో అని వాపోయింది. అంతటితో అతణ్ణి వెళ్లనివ్వక, కూర్చోపెట్టి పరవాణ్ణమదీ కూడా వడ్డించింది. బయటెక్కడన్నా శేషు కనిపిస్తే  త్వరగా రమ్మనమని చెప్పి వదిలింది.

అక్కణ్ణించి బాలా తిన్నగా బడి చేరుకున్నాడు. బయటనున్న వేపచెట్టు కొమ్మల సాయంతో ప్రహరీగోడ యెక్కి లోపలికి దూకాడు. అతను బడిని పగలే తప్ప రాత్రి యెపుడూ చూడలేదు. నక్షత్రాల మసక వెలుగు తప్ప అంతా చీకటిగా వుంది. ఎక్కణ్ణించో మైకులో లీలగా వినిపిస్తున్న భజనపాట తప్ప అంతా నిశ్శబ్దంగా వుంది. భయమేసి శేషూ అని పిలిచాడు. ఓ మూల నుంచి, ఇంత బేగా వచ్చేసేవారా, నింపాదిగా రేపొద్దున్న రావాల్సింది, నీ యబ్బా! అంటూ తిట్లు వినిపించడంతో అటు పరిగెత్తాడు. శేషూ బాదం చెట్టు చప్టా మీద కాళ్ళను కడుపుకేసి కౌగలించుకుని కూర్చునున్నాడు.

మీ అమ్మేరా బాబు, పరవాణ్ణమదీ తినేదాకా కదలనివ్వలేదు.

ఒరే, నాక్కూతైనా వుంచేవా, మొత్తం మెక్కేహేవా?

కొంచెవే తిన్నానెహె! కానీ మీ అమ్మ భలే చేస్తుందిరా. మా నాన్న చేస్తే వుట్టి పందారన్నం తిన్నట్టుంటుంది. మళ్ళీ అన్నీ బానే యేత్తాడేంటో మరి.

ఒరే! యెదగ్గోలాపి, విషయం చెప్తావా? అని గసురుకుంటూ, సుబ్బరాజుగారి యింటి దగ్గర గత్తర యేవన్నా చూసాడేమో అడిగాడు శేషు.

అతణ్ణి యిలా భయపడుతూన్నపుడు చూడగలగటం బాలాకి ముచ్చటగా వుంది. అతనికి సాయపడగల పరిస్థితిలో తానుండటం గర్వంగా కూడా వుంది.  అంతా ప్రశాంతంగానే వుందని భరోసా యిచ్చాడు. తాను దాదాపు యెలా సుబ్బరాజుగారి యింట్లోకి వెళిపోబోయిందీ, మళ్ళీ యేమన్నా తేడా జరిగితే శేషూకి ప్రమాదమని ఆలోచించి యెలా ఆగిపోయిందీ, యిలా చేసిందీ చేయందీ రసవత్తరంగా చెప్పుకొచ్చాడు. శేషూకి అంతా ప్రశాంతంగా యెలా వుందో అర్థం కాలేదు. కానీ వుందంటే వూపిరి పీల్చుకున్నాడు.

ఇద్దరూ భవిష్యత్తు కార్యాచరణ గురించి కాసేపు మాట్లాడుకున్నారు. బాలాకి ఒక వుపాయం తోచింది. దాని ప్రకారం శేషూ రేపు యేదో వంక పెట్టి బడి మానేయాలి. బాలా వెళ్లి పరిస్థితి గమనిస్తాడు. అంతా బానే వుందనిపిస్తే బడయ్యాక వచ్చి శేషూకి విషయం చెప్తాడు. శేషూకి యీ వుపాయం బానే వుందనిపించింది. ఇలా ఓ నిశ్చయానికొచ్చాకా, అతనిలో కాస్త స్థిమితం వచ్చింది. ఇద్దరూ మళ్ళీ బడి గోడ దూకి యిళ్ళ వైపు నడుస్తున్నపుడు, బాలా కుతూహలంగా ముద్దు వివరాలు చెప్పమని అడిగితే, అతను యిదివరకట్లా ఆ సంఘటనని జ్ఞప్తికి తెచ్చుకోవటానికి భయపడలేదు. ముద్దు గురించేం చెప్పలేదు గానీ, యివాళ రేణూ ముస్తాబైన తీరు వుదహరిస్తూ, పరిస్థితులన్నీ కలిసి తనని ముద్దుపెట్టుకునేలా యెలా బలవంతం చేసాయో చెప్పుకొచ్చాడు. బాలాకి యిదంతా చెప్తూనే, తనకు తాను మళ్ళీ ఆ అనుభవపు దినుసులన్నీ ఒకసారి నెమరువేసుకున్నాడు. ఆమె చెంప నునుపుదనాన్నీ, పెదాల తడినీ, పొత్తికడుపు వేడిమినీ గుర్తు చేసుకున్నాడు. కానీ వాటిని తనకు తెలిసిన రేణూలో భాగంగా చూడలేకపోయాడు. మనసులో ఆ జ్ఞాపకానికి విడి అస్తిత్వమేదో యేర్పడింది. దరిమిలా శరీరం ఆధిపత్యం చెలాయించే కొన్ని తరుణాల్లో ఆ జ్ఞాపకం అక్కరకొచ్చేది.