కొండంచు మీంచి కన్నీటి పరవళ్ళు తొక్కాలని
కానీ కొండ చాలా ఎత్తు
ఎక్కటంలో పడి
ఏడుపు సంగతి మర్చిపోనూవచ్చు
ఉన్నచోటే కూచుని ఏడుద్దామంటే
ఉట్టి నిట్టూర్పులే వస్తాయి
*****ఒకసారి ఎవరో నన్ను "మీరెందుకు రాస్తారూ" అని గుచ్చిగుచ్చి అడిగితే- I write to validate my way of existence అని మాత్రం చెప్పగలిగేను. ఎందుకంటే వెనక్కి తిరిగి నాకు నచ్చిన రచయితల్ని చూసుకుంటే వాళ్ళు నాకు చేసిన పెద్ద ఉపకారం అదే: They validated my way of existence. నా లోపలి బయటి జీవితాలూ, నా అంతరంగ ప్రవృత్తీ ఈ ప్రపంచంలో చెల్లుబాటవుతాయని నమ్మేట్టు చేసారు. “అబ్బే నువ్వొక్కడివే కాదు, మేమూ నీలాగే ఉన్నాం, నీలాగే అనుకున్నాం, ప్రపంచాన్ని నీ లెక్కల్లోనే ప్రేమించాం, ద్వేషించాం” అని చెప్పారు. ఒక కాఫ్కా, ఒక ఫ్లాబెర్ట్, ఒక దాస్తోయెవ్‌స్కీ, ఒక నబొకొవ్ లేని లోకంలో నాకు ఇంకొద్ది ఒంటరితనంగా ఉండేది బహుశా. నా అంతరంగాన్ని వాలిడేట్ చేస్తూనే, కొంత మోడిఫై కూడా చేసారని చెప్పుకోవటానికి నాకేం నామోషీ లేదు. అయితే ఇదంతా వాళ్ళు నా కోసం చేయలేదు; వాళ్ళకోసం వాళ్ళు చేసుకున్నారు.
బహుశా ఇలానే ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితపు తోవల్ని వాలిడేట్ చేసే రచయితల్నీ, రచనల్నీ వెతుక్కుంటారేమో. సాహిత్యం (అంటే నవల్లూ కథలూ కవితలూ) చేసే సమాజ సేవ ఏదన్నా ఉంటే అది ఇలా వ్యక్తులు ఒక్కొక్కరికీ విడివిడిగా చేసేదే.
.
**** చలం కన్నా సెల్‌ఫోన్లూ, సోషల్ మీడియా స్త్రీలకు ఆయన కోరుకున్న స్వేచ్ఛను కోటింతలు ఇవ్వగలిగాయనేది నా ఒకానొక పెట్ థియరీ.
.
****
>> “Poets are the unacknowledged legislators of the world” అనగా “కవులు ప్రపంచానికి అనధికారిక శాసనకర్తలు” అంట.
>> అలాని ఎవరన్నారంట?
>> షెల్లీ అనీ...
>> ఆయనెవరంట...
>> ఇంకో కవి...
>> ఆహా, మరి మీ వీధి చివర మంగలి షాపాయనకూ, మీ సెంటర్లో నిలబడిన ఆటోవాలాకూ కూడా తమ తమ వృత్తుల (లేదా నీ భాషలో “కార్యక్షేత్రాల”) పట్ల ఇలాంటి మెగలోమానియాకల్ భ్రమలే ఉన్నాయేమో, ఒక సారైనా చెక్ చేసుకున్నావా?
.
**** సాహిత్యం నీకు బతికున్నప్పుడే తిండి పెడితే అంతకన్నా అదృష్టం లేదు. తిండిపెట్టకపోయినా కనీసం నిన్ను స్టేజీ ఎక్కించి శాలువా కప్పించి అవార్డూ నగదూ ప్రశంసా పత్రమూ ఇప్పించి నీకో గుర్తింపు తెస్తే అది ఇంకొంతలో కొంత నయమే. ఈ రెండూ ఆశించనివాడు గొప్పోడేనేమో, నాకు తెలీదు; కానీ ఈ రెండూ ఆశించకుండా సాహిత్యం ద్వారా “immortality”ని ఆశించేవాడు మాత్రం బుద్ధిలేనోడు. మహమహ షేక్‌స్పియర్‌కి కూడా ఎక్స్‌పెయిరీ డేట్ ఉంటుంది. నువ్వు చనిపోయాకా, నీ అక్షరాలు జనం మనసుల్లో ఇంకొన్ని వందలయేళ్ళు ఉన్నా, ఇంకో రెండు మూడేళ్ళే వున్నా- రెండింట్లోనూ అస్సలు తేడా లేదు, నువ్వు ఆల్రెడీ చచ్చిపొయ్యి ఉంటావ్ కాబట్టి. "I don't want to achieve immortality through my work; I want to achieve it by not dying" అని వుడీ అలెన్ అన్నట్టు, అక్షరాల ద్వారా చిరంజీవిగా నిలబడితే చాలని కోరుకోవటం కన్నా కొంత నగదూ కొన్ని అవార్డులూ ప్రశంసా పత్రాలూ కోరుకోవటమే రిలెటివ్‌గా బుద్ధున్న ఛాయిస్. రాయటమనేది నీకో సెకండ్ నేచరు కానప్పుడు నువ్వు ఖచ్చితంగా శాలువాలకి ఎగబడటమే కామన్ సెన్స్. ఎందుకంటే ఈ సమాజంలో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసేవాళ్ళకే మహాఅయితే రిటైరయ్యాకా తప్ప శాలువాలు కప్పించుకొని, స్టేజీలెక్కి, అడోరింగ్ బుర్రల ముందు నిల్చొని అథారిటీగా మాట్లాడే ఛాన్సు దొరకదు. నువ్వు రచయత అయ్యి ఇతోధికంగా కొంత గిలికితే చాలు ఉత్తపుణ్యానికి ఆ అవకాశం వస్తుంది. వాడుకో... కాస్త వాడు.