ఆ చిన్న పెంకుటింట్లో ఇంక నిద్రపోయే టైము. అమ్మ వాకిట్లో అంట్లు తోముతోంది. నానమ్మ గచ్చు మీద కూర్చుని చుట్ట కాలుస్తుంది. తమ్ముడు ఇలా మంచమెక్కాడో లేదో నిద్రపోయాడు. రాజేశ్వరి కూడా పుస్తకాలు గూట్లో సర్దేసి మంచమెక్కబోతుంటే, అప్పుడు గుర్తొచ్చాయి... గబగబా గుమ్మం దగ్గరకెళ్ళి చూసింది, దొడ్డిగుమ్మం దగ్గరా చూసింది; ఎక్కడా లేవు, కొత్త చెప్పులు.
పొద్దున్న ఎక్కడెక్కడ తిరిగిందీ గుర్తు తెచ్చుకుంది. గ్రంథాలయం! అవును, బడి నుంచి వచ్చేటప్పుడు అక్కడ కాసేపాగి పుస్తకాల్లో బొమ్మలు చూసింది.
“ఏంటే నిలబడ్డావ్, పోయి పడుకో,” అమ్మ గిన్నెలతో వంటగది వైపు వెళ్తోంది.
“అమ్మా, నా కంపాస్ బాక్సు సుజాత కాడ ఉండిపోయిందే.”
“ఇప్పుడేటి, రాత్రి? రేప్పొద్దున్న తెచ్చుకుందూ గాని.”
“దాన్తో పనుందే,” అంటూ గబగబా మెట్లు దిగేసి వాకిట్లోకి నడిచింది.
ఇక దడి దాటేస్తుందనగా, నానమ్మ అరిచింది, “ఏయ్, ఎక్కడికే ఇంత రాత్రేళ?”
రాజేశ్వరి వెనక్కి తిరిగి గుమ్మంలోకి చూసింది, అమ్మ వంటింట్లో ఉన్నట్టుంది, అప్పుడిక నానమ్మని లెక్కచేయక్కర్లేదు, “నీకెందుకూ?” అంది.
“ఆయ్! కారెక్కిపోయున్నావ్ బాగాని! మీ నాన్న పొద్దున్న డూటీ కాణ్ణించి రానీ, చెప్తాన్నీ పని... అర్ధరాత్రి పూట యీదులమ్మటా తిరుగుళ్ళేంటో అన్నీని...” ఇంకా ఏదో అంటూనే వుంది. రాజీ వీధిలో నిలబడి, గౌను అంచుల్ని విసనకర్రలా విప్పార్చి పట్టుకుని, సినిమాల్లో రాధలాగ కొన్ని స్టెప్పులేసింది, నానమ్మ కోసం.
“లంజికానా,” అని అరిచింది నానమ్మ. “ఏమే, మంగా,” అని లోపలికి పిలిచింది. రాజీ అప్పటికే పరిగెత్తింది.
చెప్పులుపోతే? నాన్నకి తెలిస్తే...? తిట్టడు, కానీ బాధపడతాడు. ఎంత పోరుపెట్టి కొనిపించుకుందీ. ఎన్నిసార్లడిగినా కొనకపోతుంటే ఉక్రోషం వచ్చేసింది. పిన్నీసుతో పొడుచుకుని కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటున్నాయని చూపిద్దామా అని కూడా ఆలోచించింది. కానీ మొన్న ఆదివారం నాన్న తనంతట తనే సైకిలెక్కించుకుని సెంటర్లో చెప్పుల షాపుకి తీసుకెళ్లాడు. నల్ల రంగు జత, బెల్టుకలిసే చోట బంగార్రంగు రింగు... అవి చూడగానే ఇంకేం నచ్చలేదు. తర్వాత బళ్ళో ఫ్రెండ్స్ కూడా “ఏ షాపులో కొన్నావే, ఎంతే” అని తెగ అడిగేరు....
“ఉండుంటాయా, దొబ్బేసుంటారా? గ్రంథాలయం నుంచి ఇంత దూరం బోసికాళ్ళతో నడిచొచ్చినా తెలీలేదు చూడు! చెప్పులవసరమా నాలాంటి ఏబ్రాసి దానికి!”
పెద్ద వీధిలోకి వచ్చాక పరుగాపింది. వీధిలైటు దగ్గర కుక్కలున్నాయో లేవో చూసుకుని, మళ్ళీ నడిచింది. చల్లావారి వీధిలోంచి ఈ వీధిలోకి ఏదో లైటింగు పడుతోంది. ఆగి చూసింది. వీధి చివార్న టెంటు కింద నల్లబట్టల్లో స్వాములు. పడిపూజ. నేతి వాసన. ఆగి దణ్ణం పెట్టుకుంది, “స్వామియే శరణం అయ్యప్ప. నా చెప్పులు కాపాడు స్వామీ!” పెద్ద వీధి దాటే దాకా ఎవరూ కనపళ్ళేదు. చివర బడ్డికొట్టు మటుకు తెరిచే ఉంది. ఎడం వైపు తిరిగి, పోస్టాఫీసు దాటి, ఆంధ్రా బేంకు దాటితే, తర్వాత వచ్చే చిన్న మేడ గ్రంథాలయం.
లైట్లు లేక ఈ వీధిలో వెన్నెల బాగా తెలుస్తుంది. చప్పుడు కాకుండా గ్రంథాలయం గేటు తీసి వెళ్ళింది. హమ్మ! కనపడ్డాయి... విడిచిన చోటే, బుజ్జిముండలు.
చెప్పుల్లో కాళ్ళు పెట్టి, వెనక్కి తిరిగే లోపల- ఎవరివో మాటలు వినపడ్డాయి. ఆడాళ్ళ మాటలు, నవ్వులు... గ్రంథాలయం పక్క సందులోంచి. గోడవారన నక్కుతూ ఆ సందు వైపు వెళ్ళింది. తలమాత్రం వొంచి చూసింది. ఒక ఆడామె వీపు వెనక చేతులు ముడుచుకొని ప్రహరీగోడకి ఆనుకుని నిలబడింది. ఒక మగతను ఆ గోడకే చేయానించి, ఆమె వైపు కొద్దిగా వొంగి మాట్లాడుతున్నాడు. అతను బిల్డింగు నీడలో ఉన్నాడు, ఆమె ముఖం మీద మాత్రం వెన్నెల పడుతోంది. అతను రెండో చేత్తో నడుం దగ్గర ముట్టుకోబోతే, ఆమె వీపు వెనక నుంచి (గాజుల చప్పుడుతో) చేతులు తీసి, అతని చేయి తోసేసింది. అతను ముఖం మీదకి వొంగాడు, ఆమె సిగ్గుతో తల తిప్పి... రాజీని చూసింది.
రాజీ వెర్రి కేక పెట్టింది. మగతను ఇటు కదిలాడు. రాజీ ఒకే పరుగు... గేటులోంచి దూసుకెళ్ళి, ఆంధ్రా బేంకూ పోస్టాఫీసూ దాటేసి, పెద్ద వీధి దాకా వచ్చాక, అక్కడ ఆగి వెనక్కి చూసింది. అతను గేటు మూస్తున్నాడు. ఇప్పుడీ దూరం ఇచ్చిన ధైర్యంతో, తన పరుగు మీద నమ్మకంతో, అతని వైపు చెయ్యి కూడా ఊపింది. అతను పట్టించుకోనట్టు వెనక్కి వెళ్ళిపోయాడు. రాజీకి నవ్వూ ఆయాసమూ ఆగటం లేదు. మోకాళ్ళ మీద చేతులానించి ఒగుర్పు దిగమింగుకుంది. బడ్డీకొట్టు దగ్గర ఎవరో రేడియో ట్యూన్ చేస్తున్నారు. స్టేషన్లు దొరక్క కాసేపు వింత చప్పుళ్ళు. ఒక్కసారిగా పాట మొదలైంది- “దోబూచు లాడేటి అందమొకటి ఉందీ” అని సగంలోంచి. రాజీ వీధి మధ్యలో నడుస్తూనే తనకి రాని భరత నాట్యం స్టెప్పులు వేయబోయింది. కానీ అక్కడదాకా మెల్లగా వున్న పాట వెంటనే స్పీడందుకుంది. అందుకు తగ్గట్టు నాట్యం చేయబోయి, వీలుకాక, పిచ్చి గెంతులు గెంతి, నవ్వు పొంగుకొచ్చి, తమాయించుకోలేక, ముందుకుతూలి చప్పట్లు కొడుతూ నవ్వింది.
ఇందాక సందులో చూసిన ఆడామె ముఖం గుర్తొచ్చింది. ఆవిడ టైలరు షాపాయన భార్య. గ్రంథాలయం నుంచి బడి వైపు మలుపు తిరిగితే వాళ్ళ ఇల్లు. ఆవిడెప్పుడూ అమ్మలాగ అంట్లు తోముతూనో, చీరలారేస్తూనో కనపడదు. శుభ్రంగా పౌడరు రాసుకుని, చీర నలగకుండా, ఎప్పుడు చూసినా కాసేపటి క్రితమే స్నానం చేసినట్టు తయారై ఉంటుంది. రాజీకి తను పెద్దదాన్నవ్వబోయే రోజులు గుర్తొచ్చాయి. రంగులతో కళ్ళు చెదిరే కాలమేదో తన కోసం ఎదురుచూస్తూంది. తనదే ఆలస్యం! వొంటి మీదున్నది గౌను కాదు చీరన్నట్టు, లేని పవిటని చేతుల్తో ఆడించుకుంటూ, ఇంటి వైపు పరిగెత్తింది.