February 15, 2024

నా తొలి పారితోషికం | ఇసాక్ బాబెల్

కథ అనువాదం : మెహెర్

వేసవి కాలంలో టిఫ్లిస్‌లో ఉండటం, అదీ ఇరవయ్యేళ్ళ వయస్సులో ఉండటం, పైగా ప్రేమించేవాళ్ళు ఎవ్వరూ లేకపోవటం దురదృష్టం. నాది అదే దురదృష్టం. అప్పుడు కాకస్ మిలిటరీ జిల్లాలో ఒక ప్రింటింగ్ ప్రెస్‌లో ప్రూఫ్ రీడర్‌గా పని చేసేవాడ్ని. అటక మీదుండే నా గది కిటికీల కింద కురా నది పారేది. సూర్యుడు పొద్దున్నే కొండల వెనక నుంచి లేస్తూ దాని మురికి సుడుల్ని వెలిగించేవాడు. నాకు ఆ అటక మీద గదిని అద్దెకిచ్చింది కొత్తగా పెళ్ళయిన ఒక జార్జియన్ జంట. మొగుడికి తూర్పు మార్కెట్టులో మాంసం కొట్టుండేది. నా గది గోడల అవతల ఆ మొగుడూ పెళ్ళాలు కామంతో పిచ్చెక్కి ఒక చిన్న గాజు కూజాలో ఇరుక్కున్న రెండు పెద్ద చేపల్లాగ మెలికలుపడి పొర్లేవారు. ఈ సోయి లేని చేపల తోకలు నా గది గోడ కేసి కొట్టుకునేవి. గది మొత్తం కదిలిపోయేది, ఎండకి మాడిన ఆ గదిని కూసాల్తో సహా పెరికేసి అనంతంలోకి విసిరేసేవారు. తీరని కక్ష లాంటి కామంతో వాళ్ళ పళ్ళు బిగపట్టుకుపోయేవి. పొద్దున్నే పెళ్ళాం రొట్టెలు కొంటానికి కిందకు వెళ్ళేది. అప్పుడు ఆమెకున్న నీరసానికి మెట్ల మీంచి పడిపోకుండా రెయిలింగ్ పట్టుకు దిగేది. కింది మెట్టు కోసం గాల్లో తడుముకునే చిన్ని పాదాలతో ఆమె కిందకి దిగుతుంటే, ఆమె మొహం మీద నవ్వు జబ్బు పడి లేచినవాళ్ళ మొహం మీది నవ్వులా ఉండేది. తన చిన్న బాయిల మీద చేయి వేసి దార్లో ఎదురైనవాళ్ళ ముందు మర్యాదగా వొంగేది— అస్సిరియా నుంచొచ్చిన ముసలాడి ముందు, కిరోసిన్ అమ్ముతూ తిరిగేవాడి ముందు, ముడతలతో ఎండిన మొహాల్తో మార్కెట్లో ఊలు ఉండలమ్మే గయ్యాళి ముసలమ్మల ముందు. రాత్రుళ్ళు నా పొరుగింట్లోంచి వాళ్ళ రొప్పుళ్ళూ మూలుగులూ ఆగిన తర్వాత మొదలయ్యే నిశ్శబ్దం ఫిరంగి గుండు పడే ముందు వచ్చే కూత కంటే పదునుగా ఉండేది.

ఇరవై ఏళ్ళ వయస్సులో, ట్రిఫ్లిస్‌లో ఉంటూ, ఇలా రాత్రిపూట పక్క గదుల్లోంచి హోరెత్తే నిశ్శబ్దాలని వినాల్సి రావటం దురదృష్టం. దాన్నించి తప్పించుకుందామని గదిలోంచి బైటకొచ్చి కురా నది ఒడ్డు దాకా పోయేవాడ్ని. అక్కడ ఆవిర్లు కక్కే ట్రిఫ్లిస్ వేసవి ఉక్కపోత ఎదురయ్యేది. అది వొంటి చుట్టూ కమ్మేసి సత్తువంతా లాగేసేది. ఎండిన గొంతుతో ఆ గూని వీధుల్లో తిరిగేవాడ్ని. ఆ ఉక్కపోత నన్ను  మళ్ళీ గది వైపే తరిమేసేది. ప్రేమ కోసం చూట్టం తప్ప అక్కడ చేయటానికేం లేదు. అది దొరికింది కూడా. మంచికో చెడుకో నేను ఎంచుకున్నది ఒక వేశ్యని. ఆమె పేరు వెరా. ప్రతి రాత్రీ గోలోవిన్ వీధిలో ఆమె వెనకాలే తిరిగేవాడ్ని, ఆమెని పలకరించే ధైర్యం చేయలేక. మరి ఆమెకివ్వటానికి నా దగ్గర డబ్బులూ లేవు, మాటలూ లేవు— ఆ అరిగిపోయిన మోత లాంటి ప్రేమ మాటలు. చిన్న వయసు నుంచీ నాకున్న శక్తులన్నీ నవలలు, నాటకాలు, కథలు ఊహించటానికే ఖర్చు పెట్టాను, వేలకొద్దీ ఊహించాను. అవన్నీ బండరాయి మీద కప్పల్లా నా గుండెకి అతుక్కునే ఉండిపోయాయి. నాకున్న గీర వల్ల వాటిని అప్పుడే రాయదల్చుకోలేదు. టాల్‌స్టాయ్ లాగా రాయలేనప్పుడు ఎందుకు రాయటం. కథ రాశానంటే అది కాలాలు దాటి అలా నిలిచిపోవాలి. లోతైన ఆలోచనలు, పట్టి ఊపేసే ఉద్వేగాల మీద ఎంత శ్రమైనా ఎప్పుడు పడొచ్చంటే వాటికి మంచి తొడుగులు తొడిగి బైటకు పంపగలిగినప్పుడు. కానీ అలాంటి తొడుగులు తయారు చేయటం ఎలాగ?

ఒక ఐడియాకి వశం అయిపోయి, దాని పాము లాంటి చూపుకి లొంగిన మనిషి అరిగిపోయిన ప్రేమ మాటలు వల్లించలేడు. అలాంటి మనిషి బాధొస్తే ఏడవటానికి ఆలోచిస్తాడు. సంతోషంతో నవ్వేంత తెలివి ఉండదు. కలల్లో బతికేవాడ్ని కావటం వల్ల నాకు ఆనందమనే వింత కళలో నేర్పు అబ్బలేదు. కాబట్టి నా ముష్టి సంపాదన లోంచి పది రూబుళ్లు తీసి వెరాకి ఇవ్వక తప్పదు.

ఇలా ఒక నిర్ణయానికి వచ్చాకా, నేను సాయంత్రాలు వెళ్లి సింపతీ రెస్టారెంటు గుమ్మం దగ్గర వెయిట్ చేయటం మొదలుపెట్టాను. జార్జియన్ రాజవంశీకులు నీలి రంగు కుర్తాల్లో, మెత్తటి లెదర్ బూట్లలో దర్జాగా నా పక్క నుంచి నడిచిపోతున్నారు. వాళ్ళు వెండి టూత్ పిక్‌లతో పళ్లు కుట్టుకుంటూ ఎర్రటి మేకప్పేసుకున్న అమ్మాయిల్ని— పెద్ద పాదాలూ, సన్నటి పిర్రలూ ఉన్న జార్జియన్ అమ్మాయిల్ని ఓర కంట చూస్తున్నారు. మునిమాపు ఆకాశంలో ఇంకా కొంచెం నీలం ఉంది. వీధి పొడవునా తుమ్మ పూలు సన్నగా వణికే గొంతుతో పాడుతున్నాయి. తెల్ల కోట్లు వేసుకున్న గుమాస్తాల గుంపు వీధమ్మటా నడిచి వెళ్తోంది. కబ్జెక్ కొండల మీంచి వెచ్చటి గాలులు వీస్తున్నాయి.

వెరా చీకటి పడిన తర్వాత వచ్చింది. పొడవుగా, తెల్లటి ముఖంతో, ఆమె ఆ కోతి గుంపు ముందు తేలుతున్నట్టు వచ్చింది, చేపల బోటు ముందుండే వర్జిన్ మేరీ విగ్రహం లాగ. ఆమె సింపతీ రెస్టారెంట్ గుమ్మం దాకా రాగానే నేను ఆమె వెనకాల నడిచాను.

“ఎక్కడికి వెళ్ళేది?”

ఆమె వెడల్పయిన గులాబీ రంగు వీపు నా ముందు కదులుతోంది. ఇప్పుడు వెనక్కి తిరిగింది:

“ఏమన్నావ్?” ముఖం చిట్లించింది, కానీ కళ్ళు నవ్వుతున్నాయి. 

“ఎక్కడికి వెళ్తున్నావ్ అన్నాను.”

నా గొంతులో మాటలు ఎండు పుల్లల్లాగా విరిగాయి. ఆమె నడక వేగం మార్చి నాతో కలిసి నడిచింది. 

“పది రూబుళ్ళు… ఇవ్వగలవా?”

నేను వెంటనే ఒప్పుకోవటం చూసి ఆమెకు డౌటొచ్చింది. 

“అసలు నీ దగ్గర పది రూబుళ్ళు ఉన్నాయా?”

మేం ఒక గుమ్మం లోకి వెళ్ళి నిలబడ్డాం. ఆమెకి నా పర్స్ ఇచ్చాను. ఆమె తన మబ్బు రంగు కళ్ళు చిట్లించి, పెదాలు కదుపుతూ అందులో మొత్తం ఇరవై ఒక్క రూబుళ్ళు లెక్కపెట్టింది. బంగారు కాసుల్నీ వెండి కాసుల్నీ వేటికవి వేరు చేసింది. 

పర్సు నాకు తిరిగి ఇచ్చేస్తూ, “నాకు పది ఇవ్వు. ఇంకో ఐదు ఖర్చు పెట్టుకుందాం. మిగతాది నీకు నెల గడవటానికి సరిపోతుంది. నీకు మళ్ళీ జీతం ఎప్పుడొస్తుంది?”

నాలుగు రోజుల్లో వస్తుందన్నాను. తిరిగి వీధిలోకి వచ్చాం. వెరా నా చేయి పట్టుకుని తన భుజం నాకేసి ఆనించింది. మేం చల్లబడుతున్న వీధిలోకి నడిచాం. పేవ్మెంట్ అంతా కుళ్ళిన కూరగాయలు కార్పెట్‌ లాగ పరిచి ఉన్నాయి.

“బోర్‌జోమ్ వెళ్తే ఎంత బావుంటుందో, అక్కడ ఇంత ఉక్కపోత ఉండదు,” అందామె. 

వెరా జుట్టు ఒక రిబ్బనుతో ముడేసింది. వీధి లైట్ల వెలుగు ఆ రిబ్బను మీద పడి ఒంపు తిరుగుతూంది.

“సరే అయితే బోర్‌జోమ్ చెక్కేద్దాం,” అన్నాను. 

‘చెక్కేద్దాం’... అదీ నేనన్న మాట. ఎందుకన్నానో తెలీదు. 

“నా దగ్గర అంత డబ్బు లేదు,” అంది వెరా ఆవలిస్తూ, నన్ను పూర్తిగా మర్చిపోయి. నన్ను పూర్తిగా మర్చిపోవటానికి కారణం ఆమెకి ఇంక ఈ రోజు గిట్టుబాటైపోవటమే, నా దగ్గర్నించి తేలికగా డబ్బు దొరికేసింది. నేను ఆమెని పోలీసులకి పట్టించేవాడ్ని కాదనీ, రాత్రి ఆమె దగ్గర్నుంచి డబ్బులూ చెవి కమ్మలూ దొబ్బుకుపోయేవాడ్ని కాదనీ ఆమెకి తెలుసు.

మేం సెయింట్ డేవిడ్ మౌంట్ కిందకి వచ్చాం. అక్కడ ఒక బార్‌లో నేను కెబాబ్స్ ఆర్డర్ ఇచ్చాను. అవి టేబిల్‍ దాకా రాకముందే వెరా అక్కడి నుంచి లేచి కొందరు ముసలి పర్షియన్ల దగ్గరకు వెళ్ళి కూర్చుంది. వాళ్ళు వ్యాపారం గురించి మాట్లాడుతున్నారు. నిలబెట్టిన ఊత కర్రల మీద ఆనుకుని, ఆలివ్ రంగు బుర్రలు ఆడిస్తూ, వాళ్లు బారు ఓనరుతో వ్యాపారం పెంచుకోవటానికి ఇదే సరైన టైమ్ అని చెప్తున్నారు. వెరా వాళ్ళ మాటల్లో దూరింది. ఆ ముసలివాళ్ళకి వంత పాడింది. ఖచ్చితంగా వ్యాపారం పెంచాలనీ, దాన్ని మిహైలోవ్‌స్కీ వీధిలోకి మారిస్తే ఇంకా బాగుంటుందనీ చెప్పింది. ఆ ఓనరు అనుమానంగా తలాడిస్తూ నిట్టూరుస్తున్నాడు. నేను కెబాబ్స్ ఒక్కడ్నే తింటున్నాను. వెరా భుజాలు ఆమె సిల్కు డ్రెస్ చంకల్లోంచి మెత్తగా కిందకి ప్రవహించాయి. ఆమె పిడికిళ్ళని బల్లకేసి గుద్దుతూ మాట్లాడుతోంది, వెలిసిన కోట్లు పసుపు గెడ్డాల మధ్య ఆమె చెవి జూకాలు ఊగుతున్నాయి. ఆమె మళ్ళీ మా టేబిల్ దగ్గరకు వచ్చేసరికి కెబాబ్ చల్లారిపోయింది. ఆమె ముఖం ఆవేశంతో ఎరుపెక్కి ఉంది. 

“ఆ గాడిద ఇక్కడ్నించి కదలడు… ఈ తూర్పు దేశం వంటలతో మిహైలో‌వ్‌స్కీ వీధిలో నిజంగా మంచి బిజినెస్ చేయొచ్చు తెలుసా!”

వెరా స్నేహితులు ఒకరి తర్వాత ఒకరు మా టేబిల్ దగ్గర ఆగి వెళ్తున్నారు— సిర్కాసియన్ కుర్తాలు వేసుకున్న జమీందార్లు, నడి వయసు ఆఫీసర్లు, ఉన్ని కోట్లు తొడుక్కున్న షాపు ఓనర్లు, కుండల్లాంటి పొట్టలతో ఎండకి కమిలిన చర్మంతో బుగ్గల మీద ఎండిన పొక్కులున్న ముసలాళ్ళు. మేము హోటల్‌కి వెళ్ళేసరికి అర్ధరాత్రయ్యింది. కానీ అక్కడ కూడా వెరాకి చేయటానికి వంద పనులున్నాయి. అక్కడ ఒక ముసలావిడ అర్మావిర్‌‌ పట్నంలో ఉన్న కొడుకుని చూట్టానికి రెడీ అవుతోంది. వెరా నన్ను వదిలి వెళ్ళి ఆమెకి సర్దుకోవటంలో సాయపడింది— ముసలావిడ సూట్‍కేస్‌‌ని మోకాళ్ళతో నొక్కి మూసింది, తలగడల్ని తాడుతో కలిపి కట్టింది, కేకుల్ని ఒక నూనె పీల్చే పేపర్లో చుట్టింది. వలతో అల్లిన టోపీ పెట్టుకున్న ఆ వెడల్పాటి భుజాల ముసలావిడ ఎర్రటి హేండ్ బేగ్ భుజానికి తగిలించుకుని హోటల్లో ఒక్కో గదికీ వెళ్ళి గుడ్ బై చెప్తోంది. రబ్బరు బూట్లతో కారిడార్లన్నీ కల తిరిగింది, మొహం మీద ముడతలన్నీ విడేలాగ నవ్వుతోంది ఏడుస్తోంది. ఆమెని సాగనంపటానికి ఏకంగా గంట పైనే పట్టింది. నేను అప్పటి దాకా ముక్క వాసన కొట్టే ఒక గదిలో వెయిట్ చేశాను. ఆ గదిలో కొన్ని మూడుకాళ్ళ కుర్చీలు, ఒక మట్టి పొయ్యి, గది మూలల్లో తడి మురికి మరకలు.

ఇంతసేపు టౌను వీధులన్నీ తిరిగి ఇంత యాతన పడ్డాకా ఇప్పుడు నా సెక్స్ కోరికే నాకు శత్రువు లాగ కనిపిస్తోంది, నేను తప్పించుకోలేని శత్రువు లాగ…

బైట నాకు తెలియని లోకం నడుస్తూనే ఉంది, ఉండుండి నవ్వులు వినపడుతున్నాయి. ఒక తెల్లటి ద్రవం నిండిన గాజు కూజాలో ఈగలు చస్తున్నాయి. ఒక్కో ఈగ చావు ఒక్కోలా ఉంది. కొన్ని చాలాసేపు గింజుకుని గింజుకుని చస్తున్నాయి. కొన్ని ఒకసారి చిన్నగా వణికి చచ్చిపోతున్నాయి. కూజా పక్కన పీలికలైన టేబిల్‌ క్లాత్ మీద ఒక పుస్తకం ఉంది: బోయర్ల చరిత్ర మీద గోలోవిన్ రాసిన పుస్తకం. చేతికొచ్చిన పేజీ తెరిచాను. ఒక వరుసలో ఉన్న అక్షరాలు మెల్లగా తారుమారై అలికేసినట్టు అయిపోయాయి. నాకు ఎదురుగా ఉన్న కిటికీలోంచి పెద్ద రాతి కొండలో ఒక భాగం కనిపిస్తూంది, దాన్ని చుట్టి ఒక టర్కిష్ వీధి పైకి వెళ్తూంది.

వెరా గదిలోకి వచ్చింది. “ఇప్పుడే ఫియొదొస్య మావ్రికెయెన్న ను సాగనంపాం. ఆవిడ మాకు అమ్మ లాంటిది. ఒక్కర్తే వెళ్తోంది, తోడు వెళ్ళడానికి ఎవ్వరూ లేరు, ఎవ్వరూ…” అంది.

వెరా మోకాళ్లు విడదీసి మంచం మీద కూర్చుంది. ఆమె కళ్ళు ఇంకా బాధ్యత, స్నేహాల స్వచ్ఛమైన లోకాల్లోకి చూస్తున్నాయి. తర్వాత నా వైపు కళ్ళు తిప్పి డబల్ బ్రెస్టెడ్ జాకెట్‌‌ వేసుకున్న నన్ను చూసింది. చేతులు ముడేసి ఒళ్ళు విరుచుకుంది.

“ఎదురు చూసీ చూసీ అలసిపోయుంటావు కదా… అయిపోయిందిలే, ఇక మొదలుపెడదాం.”

కానీ ఆమె ఏం చేస్తుందో నాకేం అర్థం కాలేదు. ఆమె చేసేవన్నీ ఒక డాక్టర్ ఆపరేషన్‌కి రెడీ అవుతున్నట్టు ఉన్నాయి. ఒక కిరోసిన్ స్టవ్ వెలిగించి దాని మీద గిన్నెడు నీళ్లు పెట్టింది. ఒక శుభ్రమైన తువ్వాలు మంచం హెడ్‌బోర్డ్‌ మీద వేసింది. దానికే ఒక ఎనీమా బేగ్ తగిలించింది. దాన్నుంచి గోడ మీదకి ఒక తెల్లటి ట్యూబ్ వేలాడుతోంది. నీళ్ళు మరిగాకా వాటిని ఆ బేగ్‌లో పోసింది, అందులో ఒక ఎర్రటి పటిక ముక్క వేసింది, తర్వాత తన డ్రెస్ తల మీంచి విప్పింది. కుంగిన భుజాలతో, నలిగిన పొట్టతో, ఒక పెద్ద శరీరం ఉన్న మనిషి నా ముందు నిలబడింది. ఆమె ఎండిన నిపిల్స్ గుడ్డిగా ఓ పక్కకి తిరిగి ఉన్నాయి.

“ఈలోగా నీళ్ళు రెడీ అవుతాయి గానీ… నువ్వు రా పిల్లాడా!” అంది నా ప్రేయసి. 

నేను కదల్లేదు. దిగులుతో మొద్దుబారిపోయాను. నా ఒంటరితనానికి బదులు నేను కోరుకున్నది ఇదా! ఈ దరిద్రం కారే దీనమైన గుహ, ఈ చచ్చిన ఈగలు, ఈ మూడు కాళ్ళ కుర్చీలు…

ఓ నా యవ్వన దేవతలారా! ఈ వికారమైన సన్నివేశానికీ, నా పక్కింటివాళ్ళు గోడ అవతల తియ్యగా మూలుగుతూ చేసుకునే సెక్స్‌కీ ఎంత తేడా… 

వెరా బాయిల చేతులు పెట్టి ఊపింది. 

“ఎందుకలా మొహం వేలాడేసుకుని కూర్చున్నావ్? రా ఇలా!” 

నేను కదల్లేదు. 

లోపలి లంగాని పొట్ట మీదకి లాక్కొని మళ్ళీ మంచం మీద కూర్చుంది.

“డబ్బులు వేస్ట్ అయ్యాయని బాధపడుతున్నావా?”

“ఆ బాధేం లేదు,” వణికే గొంతుతో అన్నాను.

“బాధేం లేదా? కొంపదీసి దొంగవి కాదు కదా?”

“దొంగని కాదు.”

“మరి? దొంగల కోసం పని చేస్తావా?”

“నేనో కుర్రాడ్ని.”

“కనపడుతోంది, నువ్వేం ఆవు వని అనుకోలేదులే,” గొణుక్కుంది. ఆమె కళ్ళు మూతలు పడుతున్నాయి. వెనక్కి పడుకొని, నన్ను తన మీదకి లాక్కొని, చేతులతో నా ఒళ్ళు తడుముతూంది. 

“నేనో కుర్రాడ్ని. ఆర్మేనియన్లతో పెరిగినవాడ్ని. అర్థమవుతోందా?” గట్టిగా అన్నాను.

ఓ నా యవ్వన దేవతలారా! ఇరవయ్యేళ్ళ నా జీవితంలో గత ఐదేళ్ళూ నేను కథలు అల్లటంలోనే గడిపేశాను, వేలకొద్దీ కథలు నా బుర్రని పీల్చి పిప్పి చేశాయి. ఈ కథలన్నీ బండరాయి మీద కప్పల్లా నా గుండెకి అతుక్కునే ఉండిపోయాయి. ఇప్పుడు వీటిలో ఒక కథ, నా ఒంటరితనానికున్న బలం చేత, ఊడి భూమ్మీద పడింది. నా మొదటి రీడర్ ఒక టిఫ్లిస్ వేశ్య అవ్వాలని రాసిపెట్టుందేమో. ఎక్కడ్నించి పుట్టుకొస్తున్నాయో అర్థంకాని నా ఊహలకి నేనే ఆశ్చర్యపోతూ ఒక కథ చెప్పటం మొదలుపెట్టాను— ఆర్మేనియన్‌లతో పెరిగిన ఒక కుర్రాడి కథ. నేనే గనక క్రాఫ్ట్‌ పట్ల అంత శ్రద్ధలేని ఒళ్ళు బద్ధకం మనిషినై ఉంటే ఒక డబ్బున్న ఆఫీసరు ఇంట్లోంచి వెళ్ళగొట్టేసిన కుర్రాడి కథ లాంటి చచ్చుపుచ్చు కథ ఏదో ఒకటి కల్పించి చెప్పేవాడ్ని— ఆ తండ్రి కఠినుడు, ఆ తల్లి త్యాగమయి, ఇలాగ. కానీ నేను ఆ తప్పు చేయలేదు. బాగా అల్లిన కథ నిజ జీవితానికి దగ్గరగా ఉండక్కర్లేదు. జీవితమే బాగా అల్లిన కథలా ఉండాలని తపిస్తుంది. అందుకని, పైగా నా శ్రోతని ఆకట్టుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి, నా కథలో నేను ఖెర్సాన్ జిల్లాలో అల్యోష్కీ అనే టౌన్‌లో పుట్టాను. నా తండ్రి ఒక స్టీమ్ బోటు కంపెనీలో డ్రాఫ్ట్‌లు రాసేవాడు. ఆయన పగలనకా రాత్రనకా డ్రాయింగ్ బోర్డు మీదకి వొంగి పని చేసేవాడు, పిల్లలకి మంచి చదువు చెప్పించాలని, కానీ మాది తల్లి పోలిక, తిండంటే ఇష్టం, సరదాలంటే ఇష్టం. నేను పదేళ్ళ వయస్సుకే తండ్రి జేబులోంచి డబ్బులు దొబ్బటం మొదలుపెట్టాను, కొన్నాళ్ళకే ఇంటి నుంచి బకూ పట్నం పారిపోయి అమ్మ తరఫు చుట్టాల దగ్గర చేరాను. నాకు వాళ్ళ ద్వారా స్టేఫాన్ ఇవనోవిచ్‌ అనే ఆర్మేనియన్ పరిచయం అయ్యాడు. నేను అతనికి దగ్గరయ్యాను, ఇద్దరం నాలుగేళ్ళు కలిసి ఉన్నాం.

“అప్పుడు నీ వయస్సెంత?”

“పదిహేనేళ్ళు.”

ఇప్పుడు ఈ ఆర్మేనియన్ ఎంత చెడ్డవాడో, నన్నెలా చెడగొట్టాడో చెప్తానని వెరా ఎదురుచూస్తోంది. 

“మేం నాలుగేళ్ళు కలిసి ఉన్నాం. నేను ఇప్పటి దాకా స్టేఫాన్ ఇవనోవిచ్ అంత మంచి మనసున్న మనిషిని, నమ్మితే ప్రాణమిచ్చే స్నేహితుడ్ని చూడలేదు— ఎంతో నిజాయితీపరుడు, మర్యాదస్థుడు. ప్రతి స్నేహితుడి మాటా నమ్మేవాడు. ఆ నాలుగేళ్ళల్లో నేను ఎంతో వ్యాపారం నేర్చుకోవాల్సింది. కానీ ఇటు పుల్ల తీసి అటు పెట్టేవాడ్ని కాదు. నా మనసంతా బిలియర్డ్స్ ఆట మీదే ఉండేది. స్టేఫాన్ ఇవనోవిచ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి అతన్ని నాశనం పట్టించారు. అతను ఫ్రెండ్స్ పేర్ల మీద బినామీ బిల్లులు రాస్తే వాళ్ళు వాటిని కేష్ చేసుకున్నారు.”

బినామీ బిల్లులు…! అసలా మాట ఎందుకు తట్టిందో నాకే తెలీదు. కానీ భలే మంచి ఆలోచన. “బినామీ బిల్లులు” అని నా నోటమ్మటా రావటంతోనే ఇక వెరా నేను చెప్పేదంతా నిజమని నమ్మటం మొదలుపెట్టింది. ఒంటి చుట్టూ శాలువా కప్పుకుంది, ఆ శాలువా భుజాల మీద వణుకుతోంది.

“స్టేఫాన్ ఇవనోవిచ్ పూర్తిగా దివాలా తీసేశాడు. అపార్టుమెంట్ ఖాళీ చేయాల్సి వచ్చింది, అతని ఫర్నిచర్ వేలం వేశారు. తర్వాత అతను ఊళ్ళు తిరుగుతూ సేల్స్‌మన్ ఉద్యోగం చేయటం మొదలు పెట్టాడు. ఆ డబ్బు లేనోడి దగ్గర ఇక నేను ఉండలేను, కాబట్టి ఒక డబ్బున్న ముసలి చర్చ్ వార్డెన్‌తో కలిసి ఉంటం మొదలుపెట్టాను.” 

ఈ ‘చర్చి వార్డెన్’ అన్నది నేను వేరే ఎవరో రచయిత నుంచి దొబ్బుకొచ్చిన ఐడియా: ఒక నిజమైన ప్రాణమున్న కేరెక్టర్‌ని కల్పించే శక్తి లేని ఒక సోమరి మెదడులోంచి పుట్టిన ఐడియా అది. 

నేను ‘చర్చ్ వార్డెన్’ అనగానే వెరా కళ్ళల్లో రెప్ప పడింది, ఆమె నా మాయ నుంచి జారిపోయింది. పరిస్థితి మళ్ళీ అదుపులోకి తెచ్చుకోవటానికి నేను ఆ ముసలి చర్చ్ వార్డెన్ ఊపిరితిత్తుల్లోకి ఆస్తమా రోగాన్ని తెచ్చి కూరాను. ఆస్తమా ఎటాక్స్ వల్ల ఆ ముసలాడు రొప్పుతూ గస పెట్టేవాడు. రాత్రుళ్ళు మంచం మీంచి ఉన్నపళంగా లేచి కిరోసిన్ కంపు కొట్టే బకూ గాలి లోంచి ఆబగా ఊపిరి పీల్చుకునేవాడు. అతను కొన్నాళ్ళకే చనిపోయాడు. ఆస్తమా ఊపిరాడనివ్వలేదు. నా చుట్టాలేమో నన్ను రానివ్వరు. అలా ఈ ట్రిఫ్లిస్‌లోకి వచ్చిపడ్డాను, జేబులో ఇరవై రూబుళ్ళతో— ఆ ఇరవై రూబుళ్ళే ఇందాక వెరా గోలోవిన్ వీధిలో ఒక గుమ్మంలో నుంచుని లెక్కపెట్టింది. నేను ఉంటున్న హోటల్లోని ఒక వెయిటర్ డబ్బున్న కస్టమర్లని నా దగ్గరకి పంపిస్తా అన్నాడు, కానీ ఇప్పటి దాకా వాడు పంపింది పొట్టలు కిందకి వేలాడే దుకాణం ఓనర్లనే. వాళ్ళకి వాళ్ళ దేశమన్నా, పాటలన్నా, వైన్ అన్నా ఇష్టం, కానీ వేరే దేశాల నుంచి వచ్చిన మనుషుల్ని, వాళ్ళు మగాళ్ళుకానీ ఆడాళ్ళుకానీ, అణగదొక్కేస్తారు, దొంగ పొరుగింటోడి తోటని అణగదొక్కినట్టు.

తర్వాత ఈ దుకాణం ఓనర్ల గురించి నేను ఎక్కడో విన్న విషయాల్ని చెప్పుకుంటూ పోయాను. నా మీద నాకే జాలితో గుండె తరుక్కుపోయింది. పూర్తిగా నాశనమైపోయాను. బాధతో, ఇన్‍స్పిరేషన్‌తో కదిలిపోయాను. నా ముఖం మీద చల్లటి చెమటలు ఎండలో వెచ్చటి పచ్చికలో పాములు పాకినట్టు పాకుతున్నాయి. మాట్లాడటం ఆపాను, ఏడుపొచ్చింది, తల పక్కకు తిప్పుకున్నాను. అంతటితో నా కథ అయిపోయింది. కిరోసిన్ స్టవ్ ఎప్పుడో ఆరిపోయింది. మరిగిన నీళ్ళు మళ్ళీ చల్లారాయి. రబ్బరు ట్యూబు గోడకి వేలాడుతోంది. వెరా నిశ్శబ్దంగా కిటికీ దగ్గరకు వెళ్ళింది. ఆమె అందమైన వీపు నా ముందు బాధతో కదులుతోంది. కిటికీలోంచి కనపడుతున్న కొండ అంచుల చుట్టూ వెలుగు పేరుకుంటుంది.

“ఏంటీ మనుషులు! దేవుడా, ఇలాంటి ఘోరాలు చేస్తారా మనుషులు!,” వెరా అటే చూస్తూ గొణిగింది. 

చేతులు చాపి కిటికీ తలుపులు బార్లా తెరిచింది. వీధిలో తడిసిన నాపరాళ్ళు బుస కొడుతున్నాయి. దుమ్ము మీద నీరు చల్లిన వాసనొస్తూంది. వెరా తల అడ్డంగా ఆడిస్తోంది.

“అయితే నువ్వూ ఒక లంజ దానివే అన్నమాట… మాలాగ!” అంది. 

నేను తల దించుకున్నాను. 

“అవును. నేనూ లంజనే!”

వెరా నా వైపు తిరిగింది. మడతలు పడిన లంగా పక్కకు వేలాడుతోంది.

“దారుణం!” ఇప్పుడింకా గట్టిగా అంది, “దేవుడా, ఇలాంటి ఘోరాలు చేస్తారా మనుషులు! …సర్లే, ఇంతకీ నువ్వు ఎప్పుడైనా ఆడదానితో పడుకున్నావా?”

నేను నా చల్లటి పెదాల్ని ఆమె చేతికేసి ఒత్తాను.

“లేదు. వాళ్ళు నన్ను దగ్గరికి రానివ్వరు కదా?”

నా తల ఆమె బాయిల మీద ఊగుతూంది. అవి నా మీద పొంగుతున్నాయి. బిగిసిన నిపిల్స్ నా చెంపలు నొక్కుతున్నాయి. అవి తడిగా కళ్ళు తెరిచి, లేగ దూడల్లాగ ఒరుసు కుంటున్నాయి. పైనుంచి వెరా కిందకి నన్ను చూసింది.

“చెల్లెలివిరా! నా చెల్లె ముండవిరా నువ్వు,” అంటూ నా పక్కనే నేల మీదకి జారింది. 

ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటడుగుతాను: మీరెప్పుడైనా ఒక పల్లెటూరి వడ్రంగిమేస్త్రి తన తోటి మేస్త్రీతో కలిసి ఇల్లు కట్టడం చూశారా? వాళ్ళు ఒక దుంగని చిత్రిక పడుతుంటే చెక్కపేళ్ళు ఎంత వేగంగా బలంగా హాయిగా ఎగురుతాయో చూశారా? ఆ రాత్రి నాకు ఆ ముప్ఫయ్యేళ్ళామె తన పనిలో కిటుకులన్నీ నేర్పింది. ఆ రాత్రి మీరెప్పటికీ తెలుసుకోలేని రహస్యాలు తెలుసుకున్నాను, మీరెన్నటికీ అనుభవించలేని ప్రేమని అనుభవించాను, ఒక ఆడది ఇంకో ఆడదానితో చెప్పుకునే మాటలు విన్నాను. తర్వాత అవి మర్చిపోయాను: వాటిని మేం గుర్తుంచుకోకూడదు.

తెల్లారుతుంటే నిదరపోయాం. మళ్ళీ మా శరీరాల వేడికే మాకు మెలకువ వచ్చింది. మంచం మీద రాతి బండలా వాలింది వేడి. లేచాకా ఒకర్ని చూసి ఒకరు నవ్వుకున్నాం. ఆ రోజు నేను ప్రింటింగ్ ప్రెస్‌కి వెళ్ళలేదు. పాత టౌను బజారుకు వెళ్ళి టీ తాగాం. ఒక నెమ్మదస్తుడైన టర్కిష్ పెద్దాయన తువ్వాలు చుట్టిన సమోవార్ లోంచి మాకు టీ పోశాడు. అది ఎర్రటి ఇటుక రంగులో, రక్తం కక్కుతున్నట్టు ఆవిర్లు కక్కుతూంది. మసక బారిన ఎండ మా గ్లాసుల పక్కన మెరుస్తూంది. గాడిదల అరుపులూ కమ్మరోళ్ళ సుత్తిదెబ్బలూ కలిసి వినిపిస్తున్నాయి. టెంట్స్ కింద మాసిన తివాచీల మీద రాగి కూజాలు నిలబెట్టి ఉన్నాయి. ఎద్దు పేగుల్లోకి కుక్కలు ముట్టెలు దూర్చుతున్నాయి. ఎక్కడి నుంచో దుమ్ము తెరలు టిఫ్లిస్ వైపు వీస్తున్నాయి, ఈ గులాబీపూల మేకమాంసాల ఊరి వైపు. సూర్యుడి ఎర్రటి మంటని కమ్మేసే దుమ్ము. ఆ టర్కిష్ పెద్దాయన మాకు ఇంకాస్త టీ పోసి, మేం ఎన్ని రోల్స్ తిన్నామో అబకస్ మీద లెక్కపెడుతున్నాడు. ప్రపంచం మమ్మల్ని సంతోష పెట్టడానికే ఉంది. మొహం నిండా పూసల్లా చెమటపడుతుంటే గ్లాసు బోర్లించాను. టర్కిష్ పెద్దాయనకు డబ్బులిచ్చేశాక, రెండు ఐదు రూబుల్ కాసుల్ని వెరా వైపు తోశాను. ఆమె తొడ బొద్దుగా నా కాలి మీద ఉంది. ఆ డబ్బులు మళ్ళీ నా వైపే తోసేసి, తొడ వెనక్కి లాక్కుంది. 

“ఏం చెల్లెమ్మా గొడవ పడాలనుందా నాతో?”

నాకు గొడవ పడాలని లేదు. మళ్ళీ సాయంత్రం కలుద్దామనుకున్నాం. నేను నా రెండు బంగారు కాసుల్నీ నా పర్సులో పెట్టుకున్నాను — అది నా తొలి పారితోషికం. 

ఆ తర్వాత చాలా ఏళ్ళు గడిచాయి. ఆ తర్వాత చాలామంది నుంచి డబ్బు తీసుకున్నాను— సంపాదకుల నుంచి, మేధావుల నుంచి, పుస్తకాలమ్మే యూదుల నుంచి. ఓడిన గెలుపుల గురించి, గెలుపుగా మారిన ఓటముల గురించి, చావుల బతుకుల గురించి రాసినందుకు వాళ్ళు నాకు నామమాత్రంగా డబ్బు ఇచ్చారు— యవ్వనంలో నా తొలి “పాఠకురాలి” నుంచి నేను తీసుకున్నదానికంటే చాలా తక్కువ డబ్బు. కానీ నాకెప్పుడూ కోపం రాలేదు. కోపం ఎందుకు రాలేదంటే చనిపోయేలోగా ఇంకొకటి దక్కించుకుంటాను — బహుశా అదే ఆఖరిది కావచ్చు — ప్రేమగా ఇచ్చే చేతుల్లోంచి ఇంకో బంగారు కాసు.


(1922 – 1928)