? ఐనా అసలు ఇప్పుడు విమర్శ లేదూ అంటానికి ఒకప్పుడేమైనా పెద్ద గొప్ప విమర్శ ఉండేడిచిందా? ఓ.. అని నోరేసుకు పడిపోటమే విమర్శ అయితే రాచమల్లు రాంచంద్రారెడ్డి, అక్కిరాజు ఉమాకాన్తం లాంటోళ్ళు విమర్శకులే. ఇంక వల్లంపాటి, చేకూరి లాంటోళ్ళయితే మంచి కథో కవితో వచ్చి ముక్కు మీద గుద్దినా గుర్తుపట్టలేరని నా ఫీలింగ్. మోడ్రన్ తెలుగు లిటరేచర్‌లో విమర్శ ఎప్పుడూ లేదు.
? ప్రపంచంలో ఎక్కడైనా ఒక రైటర్ రాసిందాన్ని ఒక సోషల్ డాక్యుమెంట్ లాగ, సోషల్ రియాలిటీకి ఎవిడెన్స్ లాగ తీసుకుని సోషియాలజిస్టులు వాళ్ళ కామెంటరీలు వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ మటుకు ముందే ఐడియలాజికల్ బాక్‌గ్రౌండ్లతో సోషియాలజిస్టులు చేసిన కామెంటరీలని రైటర్ల ముందుపెట్టి ఫాలో అవమంటారు. గొర్రెల్లాంటి కొంతమంది రైటర్లు వాటిని బాగా ఫాలో అవుతున్నారనో సరిగా ఫాలో అవటం లేదనో తేల్చి చెప్పటమే ఇక్కడ క్రిటిసిజం, అలాంటి సూడో సోషియాలజిస్టులే ఇక్కడ క్రిటిక్స్, వాళ్ళ సెల్ఫ్ రిఫరెన్షియల్ గేమే ఇక్కడ canon. ఇకముందైనా ఇక్కడ వచ్చే ఏ క్రిటిసిజమూ అంతకుమించి ఉండదు. అంతోసిదానికోసం అది లేదే అని ఓ ఫీలైపోనవసరం లేదు. అది చస్తే చచ్చినందుకు సంతోషం కూడా.
? క్రియేటివ్ ఎనర్జీ అనేది బ్యూటిఫుల్ విషయం. రాసినంతమంది రాసినన్ని విధాలుగా రాస్తారు. ఇప్పటిదాకా తెలుగులో ఎంచి చెప్తామని, దారి చూపిస్తామని బయల్దేరిన క్రిటిక్స్ అందరూ పక్కదారి పట్టించినవాళ్ళే. అలాంటోళ్ళు ఉన్నా లేకపోయినా ఏం పెద్ద తేడా పడదు. కతలూ కవితలూ రాసే జనాభా మరీ ఫేస్బుక్ పట్టనంత ఎక్కువైపోయి వాళ్ళంతా ఎలా పడితే అలా రాసేసి పుస్తకాలేసేసుకున్నా సరే… కొంపేం మునగదు మంచి విషయమే. కాలం కంటే పెద్ద క్రిటిక్ ఎవ్వడూ ఎలాగా లేడు.
+ + +
@ క్రిటిక్స్
ఒక నలుగురి గురించి చెప్తాను.
DS Mirsky: డి.ఎస్. మిర్‌స్కీ అంటే ఉత్తి మిర్‌స్కీ కాదు; రాకుమారుడు (ప్రిన్స్) మిర్‌స్కీ. కానీ రాచరికం అంతా పేరుకే. ఎప్పుడు ఊహించుకున్నా కుట్లూడిపోయిన కోటుతో, రెండ్రోజుల గడ్డంతో గుర్తొస్తాడు. రష్యన్ విప్లవం తర్వాత కొన్నాళ్ళు విదేశాల్లో తలదాచుకున్నాడు. కానీ రష్యా మీద బెంగతో వెనక్కి పోకుండా ఉండలేకపోయాడు. కానీ పాపం స్టాలిన్‌కి స్వతంత్రమైన ఆలోచన, సున్నితత్వం, తెలివీ అంటే ఏవగింఫు కాబట్టి మిర్‌స్కీని అట్నించటే సైబీరియా లేబర్ క్యాంపులకి పంపాడు (ఇక్కడ పెట్టిన ఫొటో అరెస్ట్‌కి ముందు తీసిన ఆయన మగ్ షాటే). సైబీరియా మంచు లోనే బరువులు మోస్తూ చచ్చిపోయాడు. అయితే ఆయన చావు బతుకుల విషయం కాదు ఇక్కడ చెప్పదల్చుకున్నది. ఆయన ‘హిస్టరీ ఆఫ్ రష్యన్ లిటరేచర్’ అనో పుస్తకం రాశాడు. అది అవటానికి లిటరరీ హిస్టరీనే గానీ, అందులో క్రిటిసిజం కూడా ఉంటుంది. నేను ప్రింట్ తీసి బైండ్ చేయించి మొత్తం ఒకసారి చదివేను. తర్వాత నాకు చదవాలనిపించిన ఒక్కో రైటర్ మీద ఉన్న అధ్యాయాల్ని మటుకు తీసుకుని చాలాసార్లు చదివేను. అంతకుముందు దాకా నాకు సాహిత్యాన్ని ఒక ఆర్గనైజేషన్‌గా– అంటే పరస్పర ఆదాన ప్రదానాల మీద నడిచే వ్యవస్థ లాగ చూట్టం మీద నమ్మకం ఉండేది కాదు. ఈ పుస్తకం చదివాక అభిప్రాయాలు మారాయి. ఒక లిటరరీ ట్రాడిషన్ తనని తనే తీర్చిదిద్దుకుంటూ, తనని తనే మోడిఫై చేసుకుంటూ ఎలా ముందుకి ప్రవహిస్తుందన్నది అదంతా కళ్ళ ముందు జరుగుతున్నట్టే చెప్తాడు. ఒక పుష్కిన్ గానీ, ఒక దాస్తోయెవ్‌స్కీ గానీ, ఒక చెహోవ్ గానీ వాళ్ళంతట వాళ్ళుగా పుట్టలేదు, ఎవరికి వారుగా రాసుకుంటూ పోలేదు. పరస్పరం అందించుకున్నారు, పరస్పరం స్పందించారు. అలా రష్యన్ సాహిత్యం మొత్తం ఎలా తనని తాను మలుచుకుందో ఒక ఐదొందల పేజీల్లో ఎంతో సాంద్రంగా, కానీ ఎంతో ఇష్టంగా చదివించేలాగ చెప్తాడు. అలాగని ఏ రచయితనీ పొలోమని పొగడటం గానీ, ఆకాశానికెత్తటం గానీ ఉండదు. వాళ్ళకి అంత తాహతు ఉన్నా కూడా. పైగా ఇదంతా చదివినా మిర్‌స్కీ ఫేవరెట్ రైటర్ ఎవరంటే మనం చెప్పలేం. అలాగని లిటరరీ హిస్టరీ కాబట్టి పుట్టిన గిట్టిన తేదీల క్రానాలజీతో, ఎండుగా రుచీపచీలేని పాండిత్యంతో కూడా ఉండదు (ఈ కోవలోవే మన పింగళి లక్ష్మీకాంతం, ఆరుద్ర పుస్తకాలు చదవబోతే నీరసం వచ్చింది). ఏదో చార్లెస్ డార్విన్ ‘అరిజన్ ఆఫ్ స్పీషీస్’ గురించి చెప్తున్నంత మెథాడికల్‌గా చెప్పుకుంటూ పోతాడు. కానీ అందులోనే ఎంతో ఎమోషన్ ఉంటుంది. అదెలాగంటే ఆ రీసెర్చ్‌నీ, అందులోని డిస్కవరీల్నీ ఆత్మలోకి ఆకళింపు చేసుకున్న తీరునీ— అంటే ఈ పేజీల్లో గాక, ఈ పేజీల వెనక ఒక్క మనిషి ఖర్చు పెడుతున్న సృజనాత్మక శక్తినీ ఒకసారి తల్చుకుంటే ఒళ్ళు గగుర్పొడిచే ఎమోషన్ కలుగుతుంది నాకైతే.
Ueada Makoto: ఈయన ఎలా బతికాడో ఎలా చనిపోయాడో వివరాలేవీ పెద్ద ఎప్పుడూ వెతకలేదు. ఈయన రాసిన విమర్శ చూస్తే మటుకు చాలా డియర్ మనిషి అనిపిస్తాడు. ‘మోడ్రన్ జాపనీస్ రైటర్స్ అండ ద నేచర్ ఆఫ్ లిటరేచర్` అన్న పుస్తకం పూర్తిగా చదివాను. ఇందులో మోడ్రన్ జాపనీస్ రచయితల గురించి (అంటే లేట్ నైన్టీత్ సెంచరీలో పుట్టి ఎర్లీ ట్వంటీయత్ సెంచరీ లోకి రాసినవాళ్ల గురించి) వ్యాసాలుంటాయి. నత్సుమే సొసేకీ, నవోయ షిగా, అకుతగవ ర్యసునొకె, యుకియొ మిషిమా లాంటి జాపనీస్ నవలా రచయితల్ని ఎనిమిది మందిని సెలెక్ట్ చేసి రాశాడు. ఇందాక డి.ఎస్. మిర్‌స్కీ పుస్తకం అంత స్కోప్ లేకపోయినా అదే సోల్ ఉంటుంది ఇందులో కూడా. ఆ ఎనిమిది మంది జాపనీస్ నవలా రచయితలూ వెస్ట్రన్ ట్రాడిషన్ నుంచి ఏమేం తీసుకున్నారో, దాన్ని లోకల్ జాపనీస్ ఈస్థటిక్స్‌కి తగ్గట్టు అన్వయించుకుంటూ ఎలా దిగుమతి చేసుకున్నారో చెప్తుంటే ఒక నవల లాగ చదువుకుంటూ పోవచ్చు. ముఖ్యంగా నవొయ షిగా అన్న రచయితని ఇంకా దగ్గరగా నాకు పరిచయం చేసింది. ఆయన మీద ఉన్న ఒక్క అధ్యాయాన్ని ఇప్పటికి మూడు సార్లు చదివాను. ఎన్నోసార్లు అనువదించాలనిపించింది. బహుశా షిగా గురించి షిగా చెప్పుకుంటే కూడా అంత వివరంగా చెప్పుకోలేడేమో అనిపిస్తుంది. అలాగే మరో పుస్తకం ‘లిటరరీ అండ్ ఆర్ట్ థియరీస్ ఇన్ జపాన్’ అన్నది. పుస్తకం పూర్తిగా చదవలేదు గానీ, ఇందులో నోరినాగ అన్న జాపనీస్ క్రిటిక్ మీద రాసిన చాప్టర్ నాకు చాలా ఇష్టం. అది కూడా అనువదించాలని చాలాసార్లు అనిపించింది. దీని ఆధారంగా ఒక పోస్ట్ కూడా ఇదివరకు పెట్టాను. ఒక క్రిటిక్ మీద ఇంకో క్రిటిక్ వ్యాసం రాస్తే అది ఒక కథల్రాసుకునేవాడ్ని నాకెందుకు అంత నచ్చింది? అందులో నోరినాగ వివరించిన 'Mono no aware’ అన్న ఒక కాన్సెప్ట్ గురించి ఉయెద మకొతొ ఎంతో బాగా చెప్తాడు. చెహోవ్ కథల నుంచి చైలాన్ సినిమాల దాకా వాళ్ళ ఆర్ట్‌లో నాకు కామన్‍గా నచ్చుతున్నదేమిటో నాకే అర్థమయ్యేలా ఆ కాన్సెప్ట్ ఎంతో వివరంగా మాటల్లో పెట్టి చెప్పింది.
Joseph Frank: ఈయన్ని క్రిటిక్ అనొచ్చో లేదో నాకు తెలియదు. ఇందాక ఓ లిటరరీ హిస్టారియన్‌ని క్రిటిక్స్ కేటగిరీలో చేర్చినట్టే ఇప్పుడు ఒక బయోగ్రాఫర్నీ చేరుస్తున్నాను మరి. ఈయన దాస్తోయెవస్కీ బయోగ్రాఫర్. దాస్తోయెవస్కీ జీవితం రాయటానికి ఏకంగా ఒక్కోటీ ఐదొందల పేజీలుండే ఐదు వాల్యూములు ఖర్చుపెట్టాడు. నేను ఐదు పుస్తకాలూ చదివేయలేదు. ఆ ఐదు పుస్తకాల్నీ కలిపి ఒక్కటిగా చేసి తెచ్చిన వెయ్యి పేజీల ‘ఎ రైటర్ ఇన్ హిస్ టైమ్’ అన్న పుస్తకం మటుకు చదివాను. ఒక రచయితని అతను బతికిన స్థలకాలాల contextలో ఇంత లోతుగా చూడొచ్చా అనిపించింది. అసలు ఒక రచయిత తన స్థల కాలాల్లో ఇంత విడదీయరానంతగా ఇమిడిపోతాడా అనిపించింది. (ఇది అందరి విషయంలోనూ అప్లయ్ కాకపోవచ్చు, కానీ దాస్తోయెవస్కీ విషయంలో అప్లయ్ అవుతుంది, అది జోసెఫ్ ఫ్రాంక్ గుర్తుపట్టాడు). ఒక్క దాస్తోయెవస్కీ జీవితం అని గాక, ఆయన్ని మలిచిన ప్రతీ ఆ కాలపు వివరం మనకు ఇందులో తెలుస్తుంది. ఒకరకంగా చూస్తే దాస్తోయెవస్కీ అన్న కేరెక్టర్‌ని వెంబడిస్తూ ఆనాటి కాలాన్ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్న నవల లాగా సాగుతుంది. ఇలాంటి బయోగ్రాఫర్‌ని దొరకపుచ్చుకోవటంలో మటుకు దాస్తోయెవస్కీ చాలా లక్కీ, టాల్‌స్టాయి కంటే కూడా.
James Wood: ఇక్కడ చెప్పిన నలుగురిలో ఇంకా బతికున్నది ఈయనొక్కడే. బేసిగ్గా పెద్ద పెద్ద మేగజైన్స్‌కి బుక్ రివ్యూలు రాస్తాడు. కొంత nasty caustic wit, కొంత ‘ప్లేయింగ్ టు ద గాలరీ’ కనిపిస్తాయి. నిజానికి నాకు నచ్చిన రచయితలెవరూ ఈయనకి పెద్ద నచ్చరు (హెమింగ్వే, నబొకొవ్). ఈయనకు నచ్చిన రచయిలెవరూ నాకు పెద్ద నచ్చలేదు. ఉదాహరణకి, సాల్ బెల్లోని ఎప్పుడు ప్రయత్నించినా ఇష్టంగా చదవలేకపోయాను. కానీ ఈయన సాల్ బెల్లో గురించి రాసిన వ్యాసాలు చదువుతుంటే నాకు కలిగే ‘an idea of Saul Bellow’... నా ఊహల్లో నేను కట్టుకున్న సాల్ బెల్లో… ఆ ఊహ మటుకు నాకు ఎంతో ఇష్టం, ఎంతో ముఖ్యం. ఎందుకు ముఖ్యమంటే మనకి ఒక్కోసారి నేరుగా రచయితలే ఉదాహరణగా నిలబడక్కర్లేదు. అలాంటి ఉదాహరణలు సాధ్యమేనన్న పాజిబిలిటీ వేరేవాళ్ళ మాటల్లో చూచాయగా రూపుకట్టినా చాలు, అది ఎంతో ఇన్‌స్పిరేషన్ ఇస్తుంది. మంచి క్రిటిక్స్ చుట్టూ రాస్తున్న రచయితల గురించి రాయటమే కాదు, ఆ రాయటంలో ఇంకా పుట్టని రచయితల్ని కూడా ఊహించి, ఆ ఊహల్ని మన కళ్ళ ముందు నిలపగలరు.
* * *
ఈ పైన చెప్పినోళ్ళు గొప్పోళ్ళనో, వాళ్ళని చదవమనో కాదు ఇదంతా. క్రిటిసిజం అంటే ఏమని నా దృష్టిలో పెట్టుకుని దీనికి ముందు పోస్ట్ రాసానా అని తల్చుకుంటే ఈ నలుగురి పేర్లూ వెంటనే గుర్తొచ్చాయి, వాళ్ళు నాకేం ఇచ్చారో చెప్పాలనుకున్నా అంతే. నిజానికి నేనెప్పుడూ “విమర్శ” అని పని గట్టుకుని చదవలేదు. అందుకే ఈ నలుగురిలో కూడా ఒకరు లిటరరీ హిస్టారియన్, ఒకరు బయోగ్రాఫర్ ఉన్నారు. నా వరకూ నాకు విమర్శ చేయాల్సిన పని (సాహిత్య సారాంశాన్ని విడమర్చి చెప్పటమన్నది) చాలాసార్లు రైటర్లే స్వయంగా చేశారు. అలాగని రైటర్లు పని గట్టుకుని విమర్శ వ్యాసాలు కూడా రాయక్కర్లేదు. వాళ్ళు వాళ్ళ ఇంటర్వ్యూల్లోనో, ఉత్తరాల్లోనో, డైరీల్లోనో, ఆత్మకథల్లోనో ఒకట్రెండు వాక్యాల్లో చేసిన అబ్జర్వేషన్స్ ఎంతో వాల్యుబుల్‌గా ఉంటాయి.
ఉదాహరణకి మూడ్రోజుల క్రితం నేనొక హెమింగ్వే ఉత్తరం నుంచి కొన్ని మాటల్ని షేర్ చేశాను. అక్కడ ఆయన “ఎక్కడా పొరపాట్న కూడా నీ నవల్లోకి పెర్ఫెక్ట్ కేరెక్టర్లని రానివ్వకు,” అని తోటి రైటర్‌కి ఉత్తరం రాస్తూ జేమ్స్ జాయ్స్ ‘యులీసెస్’ నవలని పాడు కాకుండా కాపాడింది లెపోల్డ్ బ్లూమ్ అన్న కేరెక్టరే ననీ, స్టీఫెన్ డెడాలస్ అన్న మెయిన్ కేరెక్టర్ కాదనీ అంటాడు. స్టీఫెన్ డెడాలస్ అనే కేరెక్టర్ ఆల్మోస్ట్ జేమ్స్ జాయ్స్ తన మోడల్ లోనే సృష్టించుకున్న పెర్ఫెక్ట్ కేరెక్టరు. బ్లూమ్ మాత్రం జాయ్స్ ఎక్కడ్నుంచో ఏరేరి తెచ్చి కల్పించిన very human, very flawed కేరెక్టరు. ఇదే అబ్జర్వేషన్ మీద క్రిటిక్ ఒక వ్యాసం రాయొచ్చు. కానీ హెమింగ్వే లాంటోడు ఒక ఉత్తరంలో పాసింగ్ రిమార్క్ లాగా రాసిన వాక్యం ఇచ్చే హిట్ వేరే ఉంటది. నబొకొవ్ క్రిటిసిజం అని పనిగట్టుకుని పెద్దగా ఏం రాయలేదు. కానీ ఆయన ఉద్యోగార్థం ఒక యూనివర్సిటీలో లిటరేచర్ క్లాసులు చెప్పటం కోసం రాసుకున్న నోట్స్ అన్నీ కలిపి ఆయన చనిపోయిన తర్వాత రెండు పుస్తకాలుగా వేశారు. అలాగే గొగోల్ మీద బయోగ్రఫీలాగ రాసిన పుస్తకం కూడా ఒకటుంది. గొప్పగా ఉంటాయవి. తెలుగులో కూడా విమర్శకులు అన్న పేరు తగిలించుకున్నవాళ్ళు రాసినవి గాక ఇలా రచయితలు రాసినవే ఏ కాస్తో పనికొచ్చేవి ఉన్నాయి. శ్రీశ్రీ వ్యాసాలు, కృష్ణశాస్త్రి ‘కవి పరంపర’లో వ్యాసాలు, శేషేంద్ర ‘రక్తరేఖ’లో అబ్జర్వేషన్లు నాకు వెంటనే గుర్తొస్తున్నాయి. కానీ నేను మాట్లాడేది మోడ్రన్ తెలుగు లిటరేచర్ గురించి. వ్యాసుడు, కాళిదాసు, తిక్కన, పెద్దనల గురించో, బెంగాలీ రవీంద్రుడి గురించో కాదు.
పైన నేను చెప్పిన నలుగురి లాంటి వాళ్ళ పుస్తకాలు చదివితే లిటరేచర్ మీద ప్రేమ పుడుతుంది. వాళ్ళు ఒక ఆర్ట్ వర్క్ గురించి మాట్లాడితే నేరుగా లైఫ్ గురించే మాట్లాడుతున్నట్టు ఉంటుంది. జ్ఞాపకం, కలలు, అన్‌కాన్షస్… ఫలానా ఆర్ట్ వర్క్ లో పైకి కనపడని లోతుల్లోకి సాయంగా చేయి పట్టుకుని తీసుకెళ్ళినట్టు ఉంటుంది. అలాంటోళ్ళెవరైనా ఆధునిక తెలుగు సాహిత్యంలో క్రిటిక్ అన్న పేరు మీద చెలామణీ అయ్యారా? థియరీ పుస్తకాల్లోంచి సగం సగం జీర్ణం చేసుకున్న సోషియలాజికల్ డిస్కోర్సులు తెచ్చి ఒర్రుడే తప్ప ఇంకేమైనా ఉండిందా? పునాదీ ఉపరితలం! లేదంటే చిన్నయ్య నన్నయ్య! కాదంటే పోస్ట్‌లూ లిక్విడ్లూ! ఉదాహరణకి What is the nature of Telugu prose? చలం మొదలుకొని రావిశాస్త్రి మీదుగా అది ఎలా మారుతూ ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఆగింది? ఇది ఇప్పటికిప్పుడు రాస్తుంటే తట్టిన ఒక ఉదాహరణ అంతే. ఇలాంటి బేసిక్ విషయాల మీద ఎవరూ ఒక పేరాగ్రాఫ్ ఖర్చు పెట్టినట్టు ఎక్కడా కనపడదు. చిల్లర సోషలాజికల్ డిస్కోర్సు మాత్రం ఎక్కడ పడితే అక్కడ కుప్పలుతెప్పలుగా క్రిటిసిజం అంటే అదొక్కటే అన్నట్టు పొంగి పొర్లుతూ వచ్చింది. పోనీ అదైనా సోషల్ డైనమిక్స్ గురించి సైద్ధాంతిక అవగాహనతో మాట్లాడిందే తప్ప నేరుగా చుట్టూ లైఫ్ గురించి చుట్టుపక్కల మనుషుల గురించి నిశితంగా మాట్లాడుతున్నట్టు ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడది పాపం చచ్చిపోయిందీ అంటున్నారు. చచ్చిపోయినట్టు నాకైతే అనిపించటం లేదు. ఇంకా ఎక్కడ చూసినా అదే కనపడతా ఉంది. ఒకవేళ అది చచ్చినా పెద్ద తేడా పడేదేం లేదూ అన్నది నా ఫీలింగ్. As I said before, creating something is in itself a beautiful thing. ఆ వాతావరణం ఒకటి ఉంటే చాలు. ఒకరి నుంచి ఒకరు ఇన్‌స్పయిర్ అవుతారు. అందులోంచి నేర్చుకుంటారు. కొత్తవి పుడతాయి.