August 21, 2024

ఇద్దరూ కలవక ముందు


నా మొదటి నవల ‘ఇద్దరూ కలవక ముందు’ పబ్లిష్ అయ్యింది. ఇప్పటిదాకా కథలే రాసినోడ్ని ఇప్పుడో నవల కూడా రాసానన్న ఫీలింగ్ బావుంది. కథల్లో చేయలేనివి కొన్ని నవల కాబట్టి చేయగలిగాను అనిపించింది. నవల రాయటానికి పెద్ద కష్టమైతే పడలేదు. రాయటానికి కూర్చుంటే చాలు రాయాల్సింది ఒళ్ళోకి వచ్చి పడతానే  ఉంది. ఒకప్పటితో పోలిస్తే నాకు రాయటంతో పెరిగిన సౌకర్యమే దీనికి కారణం అనుకుంటాను. అలాగే ‘వెళ్ళిపోవాలి’ అనే సినిమా తీయటం కూడా దీనికి ఇన్‌డైరెక్టుగా ఒక కారణం. కొన్ని నెలల పాటు వీలు చిక్కినప్పుడల్లా నేనే డైరెక్ట్ చేసి, నా కెమెరాతో షూట్ చేసి, నా కంప్యూటర్లో ఎడిట్ చేసి బైట పెట్టిన ఆ సినిమా నాకు లాంగ్‌ టెర్మ్‌లో ఒక ఎఫర్ట్ పెట్టడం ఎలాగో నేర్పింది. అలాగే ధైర్యం చే‍సి పనిలో దూకేశాక సమయానికి వచ్చి ఆదుకునే serendipities మీద నమ్మకాన్ని కలిగించింది. ఈ క్వాలిటీస్ నాకు నవల రాయటంలో ఉపయోగపడ్డాయి. అలాగే సినిమా తీయగలిగినోడ్ని పుస్తకం వేయలేనా అన్న ధీమాతో ఈ పుస్తకాన్ని నేనే డిజైన్ చేసుకుని నేనే ప్రింటర్ కి ఇచ్చి వేసుకున్నాను (ఈ మినిమలిస్ట్ కవర్ డిజైన్ చేసింది చారీ పిఎస్). ఇక మీదట ‘ఒరవడి బుక్స్’ అన్న పేరు మీద నా పుస్తకాలు వస్తాయి. ఈ సందర్భంగా ఇంతకుముందు మూడు పుస్తకాలు వేసి నా పేరుని రీడర్స్ ముందుకి తీసికెళ్ళిన నా ముగ్గురు పబ్లిషర్స్ ‘పల్లవి’ (కాఫ్కా అనువాదం), ‘ఛాయా’ (నా కథలు), ‘బోధి’ (వ్యాసాలు) వాళ్ళకి కూడా థాంక్స్ చెప్పుకోవాలి. ఆ ఎక్స్‌పోజరే ఇప్పుడీ పుస్తకానికి హెల్ప్ ఐతే అవ్వాలి. ఐనా ఎందుకైనా మంచిదని చాలా తక్కువ కాపీలే వేశాను.

ఈ నవల రాసినంత కాలం ఫిక్షన్ రాయటాన్ని ఫుల్ వాల్యూమ్‌లో ఎంజాయ్ చేశాను. ఇలా ఒక పెద్ద నెరేటివ్ ఊహించటంలో, రాయటంలో ఉండే సరదా వేరే అని అర్థమైంది. టైటిల్‌ ఏం చెప్తుందో అదే ఈ నవల్లోని కథ. ఒక అబ్బాయీ అమ్మాయీ కలుసుకోకముందు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో జరిగే కథ. వాళ్ళ ప్రపంచాలు ఎలా ఉంటాయో, ఆ ప్రపంచంలో ఏముంటాయో అవే ఈ పుస్తకంలో ఉంటాయి. అంతకుమించి ఎగస్ట్రాలేం చేయలేదు. కథని ఎంత నేరుగా, ఎంత దగ్గరగా చెప్పొచ్చూ అని తప్ప, ఇంకే పెద్ద పెద్ద సైకలాజికల్, సోషిలాజికల్, ఫిలసాఫికల్ ఫోజులూ కొట్టలేదు. పుస్తకం లోంచి బైటకొచ్చి కూడా నిలబడి మాట్లాడగలిగే కోటబుల్ కోట్స్ జోలికీ, అద్దంలో చూసుకుంటూ సెల్ఫీలు తీసుకునే సొగసరి వాక్యాల జోలికీ అస్సలు పోలేదు. భాషని ఎక్కడా బడాయి పోనివ్వలేదు. నాకైతే నేనిలాంటిది రాయగలగటం చాలా నచ్చింది.  This cute little simple beautiful book is also the happiest thing I ever wrote.

August 19, 2024

కాశీభట్ల లేడు...

కాశీభట్ల చనిపోయాడని తెలిసి- నా ఫోనులో కాల్ లాగ్ ఓపెన్ చేసి చూసుకుంటే ఇప్పటికి ఇరవై రోజుల క్రితం జూలై 31న మేం మాట్లాడుకున్నట్టు ఉంది. ఆంధ్రజ్యోతి వివిధలో ‘నవలా శిల్పం’ అన్న ఫీచరు కోసం ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు నేను చేసిన కాల్ అది. అయితే అంతకుముందు చేసిన కాల్ ఇప్పట్లోది కాదు. బహుశా ఎప్పుడో నాలుగైదేళ్ళ క్రితంది అయ్యుంటుంది. మామధ్య మాట్లాడుకునే ఫ్రీక్వెన్సీ అంతలా తగ్గిపోయింది. ఒకప్పుడు, అంటే 2010 దరిదాపుల్లో ఒక సమయంలోనైతే, దాదాపు రోజూ కాల్స్ ఉండేవి. ఒక్కో కాల్ గంటలు గంటలు సాగేది. ఎక్కువ ఆయన మాట్లాడుతుంటే నేను విన్నదే ఉండేది. ఆయన అలాంటి కాల్స్ అప్పట్లో ఇంకొంతమందికి చేసేవారని తర్వాత తెలిసింది. నా మటుకు నాకు అవి చాలా అపురూపంగా ఉండేవి, కాబట్టి ఆఫీస్ అవర్స్ లో ఎంత పనిలో ఉన్నా గానీ సీటు నుంచి లేచి ఆఫీసు బైటకి వచ్చి, అప్పటికింకా ఫ్లైవోవర్ లేని ఖాళీ జూబ్లీ హిల్స్ రోడ్ నంబరు 51 లో పైకీ కిందకీ నడుచుకుంటూ మాట్లాడుతూ పోయేవాడ్ని. ఆయన ఎప్పుడైనా ‘వేణుగోపాల్ పదాలు’ అని రాసినవి వినిపించేవాడు (తర్వాత ఆ నోట్ బుక్స్ మొత్తం పోగొట్టుకున్నాడట). కానీ కాశీభట్లతో ఇలా పెర్సనల్‌గా పరిచయం అయి ఫోనులో మాట్లాడటం మొదలు పెట్టకముందే నేను కాశీభట్ల రచనల మాయ నుంచి బైటకొచ్చేశాను. కానీ ఒకప్పుడు నన్ను ఎంతో పట్టి ఊపేసిన ఆ రచయిత పట్ల ఫాసినేషన్ అప్పటికింకా జ్ఞాపకంలో అలాగే మిగిలిపోయి, ఒక్కోసారి రెండు మూడు గంటలు కూడా ఆయన మాటలు అలాగే వింటూ ఉండిపోయేవాడ్ని. 

నేను పదో తరగతిలో ఉండగా సీరియలైజైన ఆయన ‘నేనూ చీకటి’ నవలని ఆంధ్రప్రభ పేజీల్లో చంద్ర బొమ్మలతో చదవటం ఆయనతో నా మొదటి ఎన్కౌంటర్. అప్పటి నుంచి ఒక ఏడెనిమిదేళ్ళు చాలా ఇంటెన్స్‌గా ఆయన  రచనల్ని వెతుక్కున్నాను, దొరికితే ఆబగా చదువుకున్నాను. డిగ్రీలో ఉండగా  స్వాతి మంత్లీకి అనుబంధ నవలగా వచ్చిన ‘దిగంతం’ నవలని మూడు రోజుల్లో మూడు సార్లు బాక్ టు బాక్ చదవటం గుర్తుంది. డిగ్రీ అవగానే 2002లో హైదరాబాద్ వచ్చాక నేను వెతుక్కున్న తొలి తెలుగు పుస్తకాలు ఆయనవే. షాపుల్లో దొరికిన పుస్తకాలన్నీ కొన్నాను. ‘నేనూ చీకటి’ పదో తరగతిలో మొదటిసారి చదివినప్పుడు శైలి కొత్తగా ఆకట్టుకుంటున్నా చాలావరకూ అర్థమయ్యేది కాదు. ఈసారి కాస్త అర్థం చేసుకుంటూ ఆ స్టయిల్‌కి ఆశ్చర్యపోతూ మళ్ళీ మళ్ళీ చదివాను. ఆ నవలకి శేషేంద్ర ముందుమాటలో రాసినట్టు… అది నాకో బౌద్ధిక భూకంపమే! ‘తెరవని తలుపులు’, ‘మంచుపూలు’, ‘తపన’, ‘కాశీభట్ల వేణుగోపాల్ కథలు’... ఇవన్నీ 2002 - 2005 మధ్యనే చదివేశాను. వీటిలో కొన్ని పుస్తకాలు రెండేసి సార్లు చదివుంటాను. అప్పట్లో నాకు తెలిసిన తెలుగు సాహిత్య ప్రపంచంలో – పాతోళ్ళు కానీ కొత్తోళ్ళు గానీ – అలాంటి రైటర్ ఇంకెవరూ కనపడ లేదు. కానీ ఆ స్టయిల్ ఎంత ప్రత్యేకమైనదంటే ఆ పుస్తకాలన్నీ తొందర్లోనే నన్నొక సాచురేషన్ పాయింట్‌కి తీసుకొచ్చేశాయి. కొంతమంది రచయితల శైలి హరికేన్ లాంతరులా నిదానంగా రాత్రంతా వెలిగేదైతే, ఇంకొంతమంది రచయితలది తారాజువ్వలా ఒకేసారి ఉవ్వెత్తున లేచి ఆకాశాన్నంతా వెలుగు రవ్వల గొడుగులతో వెలిగించి క్షణాల్లో మాయమైపోయేది. కాశీభట్లది ఈ రెండో రకం శైలి. ఆ మాయ కొంచెంసేసే ఉంటుంది, కానీ అది ఉన్నప్పుడు ఆ వెలుగు తప్ప ఇంకేదీ ఆనదు. పైగా నా విషయంలో అప్పుడే కాఫ్కా, దాస్తోయెవస్కీ లాంటి బైటి ప్రపంచం సాహిత్యం పరిచయం అవటం కూడా కారణం కావొచ్చు (కాఫ్కా అన్న పేరు నాకు మొదటిసారి పరిచయమైందీ కాశీభట్ల పేజీల్లోనే). 2009 - 2010 మధ్యలో రైటర్ అరుణ పప్పు నాకు ఆయన నంబరిచ్చి పరిచయం చేసే సమయానికే, నాకు రీడర్‌గా ఒకప్పుడు ఆయన మీద ఉన్న ఇంటెన్స్ లవ్ తగ్గిపోయింది (రీడర్‌గా నేను ఆయనకు ఎందుకు దూరమయ్యానన్నది ఆయన ‘కాలం కథలు’ పుస్తకానికి 2013లో రాసిన ఒక రివ్యూలో రాశాను). 

ఆ తర్వాత రెండేళ్ళేమో ఆయనతో ఫోనులో మాట్లాడినప్పుడంతా కాశీభట్ల అనే రచయితతో కంటే కాశీభట్ల అన్న మనిషితోనే ఎక్కువ మాట్లాడాను. తాగుడు తనను పూర్తిగా కంట్రోల్‌ లోకి తీసేసుకున్నదని ఆయన అప్పటికే గుర్తు పట్టారు. దాన్తో పెనుగులాడుతున్నారు. పదే పదే ఓడిపోతున్నారు. నాతో కూడా ఎక్కువ తాగినప్పుడే మాట్లాడేవారు. రెండు మూడు గంటలు మాట్లాడి, ఫోన్ కూడా ఆఫ్ చేయడం మర్చిపోయి పక్కన పడేసి మగతలో జారిపోయే వరకూ, నేను ఇటువైపు ఊ కొడుతూనే ఉండేవాడ్ని. ఆయన్ని అప్పుడే మొదటిసారి 2010 అక్టోబరులో కలిశాను (ఈ కింద ఫొటో అప్పటిదే). ఆయన ఏదో పని మీద హైదరాబాద్ వస్తే కలిశాం. శారీరకంగా అప్పుడు చాలా బలంగానే ఉన్నాడు. తాగుడు ఎఫెక్ట్ శరీరం మీద పడకుండా ఉందటానికి తను చేసే రెగ్యులర్ డంబెల్ ఎక్సర్‌సైజుల గురించి కూడా చెప్పాడు. చేతి మీద చొక్కా మడిచి బైసప్ బలం కూడా చూపించాడని గుర్తుంది. ఆ రోజు రోడ్డు దాటడంలో, మెట్లు ఎక్కడంలో ఆయన స్పీడులో నాకు తెలిసిన ఆ ఆరోగ్యం మళ్ళీ ఒక మూడేళ్ళ తర్వాత నేను కలిసినప్పుడు కూడా లేదు. ఆ తర్వాత ఇంకో రెండేళ్ళకనుకుంటా ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. ఫోన్లో ఆయన మాటల్లో ఆయన ఒంటరితనం తెలిసేది. 2011లో ఒకసారి కర్నూలు వెళ్ళి కలిశాను. అప్పుడు ఆయన చాలా బాడ్ షేప్‌లో ఉన్నాడు. ఆయన ఉన్న ఇల్లూ, ఆవరణ మాత్రం నచ్చాయి. వాళ్ళ అక్కలు చేసిపెట్టిన వంటలు కూడా. ఆ తర్వాత నా వ్యక్తిగత జీవితంలో హడావిడి వల్ల ఆయనతో కాంటాక్ట్ తగ్గిపోయింది. మళ్ళీ 2013 చివర్లో నేను ఎడిటర్‌గా పని చేసిన కినిగె వెబ్ మేగజైన్ కోసం ఆయన ఇంటర్వ్యూ చేశాను. అది చాలా పెద్ద ఇంటర్వ్యూ. అది కూడా కర్నూలు వెళ్ళే చేశాను. చేసేప్పుడంతా ఆడియో రికార్డ్ చేసుకున్నాను. అది వింటూ ఆయన మాటల్లాగే ఉండేలా టైప్ చేసి ఎడిట్ చేశాను. ఎప్పుడో రెండేళ్ళ తర్వాత ‘విషాద ఏకాతం’ పుస్తకం కోసం నన్ను ముందు మాట రాయమంటే (2015-16 అనుకుంటాను), “ఆ ఇంటర్వ్యూ ఉందిగా అందులో మీ గురించి మీరు చెప్పుకున్న దానికంటే నేను కొత్తగా ఏం చెప్పగలను” అని అన్నాను. అది ఆ పుస్తకం చివర్లో వేశారు (ఇంకో పోస్టులో ఆ ఇంటర్వ్యూ పెడతాను). ఆ తర్వాత మా మాటలు తగ్గిపోయాయి. “కభీ తన్హాయియోం మే హమారీ యాద్ ఆయేగీ” అన్న ముబారక్ బేగం గొంతు వినపడే ఆయన ఫోన్ రింగ్ టోన్ నాకు వినపడటం తగ్గిపోయింది. బహుశా నిజంగానే మేరీడ్ లైఫ్ హడావిడిలో నాకు ఒంతరితనాలు లేక ఆయన జ్ఞాపకం తగ్గిపోయిందేమో. 2019లో నా చేదుపూలు, కాఫ్కా మెటమార్ఫసిస్ ట్రాన్స్‌లేషన్ పుస్తకాలుగా వస్తే ఆయనకు పంపాను. కథల గురించి మాట్లాడారు. కొన్ని నవలలు కావాల్సినవి కథల్లాగ రాశేసావ్ అన్నారు. కోవిడ్ తర్వాత మేం మాట్లాడుకున్నది దాదాపు లేదు. మొన్న మళ్ళీ ఇంటర్వ్యూ కోసం కాల్ చేసేంత వరకూ. ఈసారి ఆ పాత రింగ్ టోన్ వినపడ లేదు. ఆయన గొంతు తాగటం మానేసి చాన్నాళ్ళయినా తాగినట్టే డెలిబరేట్‌గా ఆగి ఆగి వచ్చింది. దానికి అనారోగ్యం కారణం అని అర్థమైంది. చాలా ఒంటరిగా అనిపించటం గురించీ, ఇదివరకట్లా నిక్కచ్చిగా అభిప్రాయాలు చెప్తే అది చుట్టుపక్కల సాయం చేసేవాళ్ళనీ పలకరించేవాళ్ళనీ దూరం చేస్తుందన్న మొహమాటం గురించీ మాట్లాడారు. ఆ మొహమాటం రాతలోకీ పాకుతుందన్నారు. ప్రశ్నలు పంపిస్తే టైమ్ తీసుకు రాస్తానని పది రోజుల తర్వాత జవాబులు పంపారు. అందులో కొన్నింటికి జవాబులు సరిగా రానట్టు అనిపిస్తే మళ్ళీ ఫోన్ చేసి ఆ ప్రశ్నలడిగి కాల్ రికార్డ్ చేసుకున్నాను.   

ఆమధ్య ఒక వ్యాసంలో, “కాశీభట్లని చదవటం నా రీడింగ్ లైఫ్‌లో పెద్ద ఈవెంట్” అని రాశాను. తెలుగులో ఆ తర్వాత త్రిపుర తప్ప నాకు మళ్ళీ అలాంటి పెద్ద ఈవెంట్సేం తగల్లేదు. డిగ్రీలో ‘దిగంతం’ చదివినప్పుడు నాకు కలిగినంత ఇంటెన్స్ రీడింగ్ ఎక్స్‌పీరియన్స్ మళ్ళీ ఎప్పుడూ కలగలేదు. అంటే వాక్యం చదివి అర్థమైందని ఊరకే ముందుకు పోబుద్ధి కాక మళ్ళీ అదే వాక్యం దగ్గర రెండు మూడు సార్లు చదువుతూ ఆగిపోయేంత ఇంటెన్సిటీ. తెలుగులో వచన సాహిత్యంలో భాషని అలా వాడినవాళ్లు ఎవరూ లేరు. ఆయన శైలి తెలుగు నుంచి ఇంకే భాషకీ అనువాదంలో తీసుకెళ్ళటానికి వీల్లేనిది. ఆయన నవల ‘అసత్యానికి ఆవల’  ఈ ఏడాదే చదివాను. ఆ నవలలో ఆ మొదటి ఐదారు పుస్తకాల్లో ఉన్నంత ఇంటెన్సిటీ ఎక్కడా లేదు. ఇదివరకట్లా ఎక్కడా వాక్యం ఆగి చదువుకోబుద్ధి కాలేదు. కానీ కాల్పనిక ప్రపంచాల్ని వేళ్ళ కింద నుంచి పుట్టించటంలో ప్రతి రచయితా ఎంజాయ్ చేసే “ఫ్లో” ఒకటుంటుంది… కాలం తెలీకుండా లీనమైపోవటం… ఊహల్లోని ప్రపంచాన్ని వాస్తవమని బలంగా నమ్మి అక్షరాల్తో అంతే బలంగా అంతే నమ్మికతో దానికో రూపునివ్వటం… ఈ ప్రాసెస్‌ని ఆయన ఇంకా అంతే మానసిక యవ్వనంతో, అంతే బలంగా ఎంజాయ్ చేస్తున్నాడని అర్థమవుతుంది ఆ నవల చదివినంత సేపూ. 

తుమ్మితే చిరిగిపోయే బోలు ఆశావాదాన్నీ, కడిగితే చెరిగిపోయే పైపై ఉదాత్తతల్నీ జెండాల్లాగ పట్టుకుని ఊరేగేవాళ్ళు కొంతమంది ఆయన రచనల ఇతివృత్తాల  మీద “చీకటి” అని బ్రాండ్ ఏసేసి తీసిపారేయటం నాకు తెలుసు. దానికి తోడు ఆయన కూడా పదే పదే చీకటీ చీకటీ అని పలవరిస్తూ ఆ లేబెల్‌కి బోలెడు సాయం చేశాడు. కానీ వాక్యానికి ఆయనిచ్చే బరువునీ లోతునీ గమనించి మాట్లాడినవాళ్లు తక్కువ. తెలుగు వచన వ్యాకరణానికి అనుకరణకి అసాధ్యంగా ఆయన చేసిన దోహదాన్ని పసిగట్టినవాళ్లు తక్కువ. ఆయన్ని అనుకరించటానికి ఎవరు ట్రై చేసినా రెండో వాక్యానికి ఆ సంగతి అర్థమైపోతుంది. అది అంత ప్రత్యేకమైన శైలి. మూడు చుక్కలు ఎక్కువ పెట్టాడనో, వచనాన్ని పంక్తుల్లా లైను కింద లైను రాసి పుస్తకాల సైజు పెంచాడనో… వీటిని బట్టి పుస్తకాల వాల్యూని కొలిచే ఎడ్డినా కొలతల గాళ్ళు ఆయన్ని చదవాలంటే ముందుగా అసలు ఆళ్ళ మెదడు పని చేసే డైమెన్షన్‍ని మార్చుకోవాలి. ఆ అవసరం లేదంటే ఇంపోర్ట్ ఫ్రెండ్లీ సరుకులు బొచ్చెడున్నాయ్ చుట్టూతా… ఆటితో సంతృప్తి పడిపోచ్చు. నేను మటుకు నా రీడింగ్‍ లైఫ్‌లో కొన్ని మళ్ళీ తిరిగిరాని, మళ్ళీ రిపీట్ కాని క్షణాల్నిచ్చిన రైటరుగా, తెలుగు వాక్యానికి ఉన్న యునీక్ పాసిబిలిటీస్ అర్థమయ్యేట్టు చేసిన రైటరుగా, చుట్టూ పాతుకుపోయిన పెడాంట్రీల్నీంచీ సాహిత్య చాదస్తాల్నించీ స్వేచ్ఛ చూపించిన రైటర్లలో ఒకరిగా ఆయన్ను గుర్తుంచుకుంటాను. 

2013లో నేను చేసిన ఇంటర్వ్యూ లోంచి కాశీభట్ల మాటలు:—

"సగటు మనిషిని నేను. గొప్ప గొప్ప ఘటనలేవీ నా జీవితంలో ఘటించలేదు. మామూలు సాదా సీదా third rate drunkard నేను. నేను చూసిన జీవితాన్ని కొద్దిగా పాలిష్ చేసి, అందంగా చూపియ్యటానికి ప్రయత్నిస్తాను. ఏదో ఉద్గ్రంథం రాసేయ్యాలని ఫ్యూచర్ ప్లాన్స్ ఏమీ లేవు. మీరు గమనిస్తే, నా పుస్తకాలేవీ వందపేజీలు దాటవు. నేను చెప్పదల్చుకున్నది అంతా కండెన్స్‌డ్ గా ఉంటుంది. I hurry towards the end. చివరి వాక్యం కోసం పరిగెడుతుంటాను. అక్కడికి వచ్చాకా ‘ఆహ్’ అన్న రిలీఫ్."

“మొన్నే ఎవరో ఈ రాతల వల్ల డబ్బులొస్తాయా అనేదో అంటే అన్నాను. ‘డబ్బులేముందండీ! నా జేబులో వెయ్యి రూపాయలు మీ జేబులోకొస్తే మీదవుతుంది. కానీ నా పుస్తకం మీ దగ్గరకు వచ్చినా అది కాశీభట్ల వేణుగోపాల్ పుస్తకమే అవుతుంది’ అని గర్వంగా చెప్పాను. నా రచనలు పరమ చెత్త రచనలే అయి ఉండొచ్చు గాక, వాటిని తీసుకెళ్లి మీ జాబితాల్లో అట్టడుగున పెడితే పెట్టొచ్చు గాక… కానీ అవి నావి. నేను గర్వంగానే ఫీలవుతాను.”