July 29, 2009

Who's directing my dreams? David Lynch?

One of my weirdo dreams last night. God’s wife goes to his room to tell him that dinner is ready. This semi-dark room is filled with musty air, and nearly empty but for a high, circular pedestal placed in the middle. And God—a naked, bent old man with Whitmanesque gray beard— is standing on the pedestal, busily playing with some strings attached to his finger tips. He couldn’t hear it at first. So she shouts this time: ‘Dinner is ready!’ Disturbed, He angrily turns towards her and shouts back, ‘Never ever call me from my pedestal when I am playing with my puppets. Okay!’

She winces, and muttering some blasphemy (for it is God she is muttering it at), goes back through the corridor to the kitchen. And so ends the dream.

Hey you, Freud, what are you hiding from? Come on out and face up the challenge!
:

July 27, 2009

ఇవాళ...

:ఇవాళ ఏదో పని మీద ఫ్రెండ్‌ని ఓ చోట దింపాల్సి వచ్చి ఆఫ్జల్‌‌ఘంజ్ వెళ్ళాను. ఈ మధ్య అటువేపు పెద్దగా వెళ్ళింది లేదు. పనైపోయాక తిరిగి వెళ్ళేందుకు బస్‌స్టాండ్‌ దాకా రావటమైతే వచ్చాను గానీ, వెనకనున్న స్టేట్‌సెంట్రల్ లైబ్రరీ అక్కడ నా కాలు నిలవనీయలేదు. ఆలస్యమైతే పుట్టి మునిగేదేం లేదని మనసుకు సర్ది చెప్పటానికి గరిష్టంగా అరక్షణం పట్టింది. అంతే! చాన్నాళ్ళ ఎడబాటు తర్వాత రైలు దిగిన ప్రేయసిని వెచ్చని కౌగలిలో బంధించేసేందుకు ఫ్లాట్‌ఫామ్‌పై పరిగెత్తే సినిమా హీరోలా (—స్లోమోషన్ సాధ్యం కాకపోవడంతో—) ఉరుకులు పరుగుల్తో మెట్లెక్కేసాను. చివరిసారి ఈ మెట్లెక్కి మూడేళ్ళ పైనే అవుతోంది. అప్పుట్లో ఓ ఆర్నెల్ల పాటూ ఠంచనుగా ప్రతీ ఆదివారం వచ్చేవాణ్ణి. పొద్దున్నే ఓ నీళ్ళబాటిలూ, నోటుపుస్తకం చేత పట్టుకు లోకల్‌ట్రైన్ ఎక్కేయటం; ఏదో ఇంటర్వూకి ఆలస్యమైన అభ్యర్థి పడే హడావిడితో లైబ్రరీకి చేరిపోవడం; ఆకలేసే దాకా చదివి, భోజనం బయట ఇరానీహొటెళ్ళలో కానిచ్చేయడం; తర్వాత చీకట్లు పడేదాకా కూర్చుని చదవడం; అక్షరామృతంతో బరువెక్కి ఆలోచనల్ని తొణికిస్తున్న మెదణ్ణి భద్రంగా మోసుకుంటూ వెనక్కి బయల్దేరడం. ఈ లైబ్రరీ నాకు నచ్చుతుంది. హైదరాబాద్‌కి నిజాం అద్దిన అందాల్లో ఈ నిర్మాణం ఒకటి; పైగా ఇది పుస్తకాలకు నెలవు కావడంతో దీని అందం, నా దృష్టిలో, మరింతగా ఇనుమడించింది. బయట రోళ్ళు కరిగేంతటి ఎండ కాస్తున్నా లోపల చల్లగానే వుంటుంది. పోటీ పరీక్షలకి వెళ్ళే విద్యార్థులు చాలామంది భవనం చుట్టూ వున్న చెట్ల నీడల్లోనో, నిర్మానుష్యమైన వరండాల్లోనో, మెట్ల మీదో కూర్చుని చదువుకుంటుంటారు. నే వెళ్ళేది సాహిత్య విభాగానికి కాబట్టి అక్కడ రద్దీ బాగా తక్కువ. (ఇవాళ ఇద్దరు లైబ్రేరియన్లు మాట్లాడుకుంటుంటే విన్నాను; ఇక్కడ చిన్నపిల్లల సాహిత్యం వుంచిన విభాగానికి గతవారం ఐదుగురంటే ఐదుగురు మాత్రమే వచ్చారట; మళ్ళీ అవటానికేమో ఇది రాష్ట్ర గ్రంథాలయ కేంద్రం!)

ఇక్కడ ఇంగ్లీషు సాహిత్యానికి సంబంధించిన అద్భుతమైన సంపదంతా మనకి అనుమతిలేని ఓ రెండస్తుల చీకటి కొట్టంలో వుంటుంది. అయితే, అడిగితే ఎలాగూ అనుమతి లేదంటారు కనుక, మనం అదను చూసి అక్రమంగా చొరబడిపోవచ్చు. ఈ పుస్తకాలు మన లాంటి వాళ్ళకి సంపదా గింపదా గానీ అక్కడెవడికి పట్టిందీ! కాబట్టి లోపల ఎంతసేపున్నా ఎవడూ వచ్చి చెక్ చేయడు. కానీ లోపల గబ్బిలాలు మాత్రమే అలవాటు పడగలిగే చీకటి వుంటుంది. ఇంకో సానుకూలత ఏంటంటే, మల్టీప్లెక్సుల్లో "స్కేరీ హౌసు"ల్లోలా ఇక్కడ డబ్బు పెట్టి భయం కొనుక్కోవాల్సిన పని లేదు; ఆ చీకటికీ, నీరవ నిశ్శబ్దానికీ ఉచితంగా భయం కలుగుతుంది. అందువల్ల, ఆ పుస్తక సంపద చూసి నోరెళ్ళబెట్టడమే తప్ప స్థిమితంగా చదువుకొనే వీలేమీ అక్కడ వుండదన్నమాట. కానీ అంత మంచి పుస్తకాలు చేతుల్లోకి తీస్కొని పేజీలు తిప్పడమూ ఓ అనుభవమే కదా. అందుకే ఓ రోజు లోపల చేరి మొత్తం రాక్‌లన్నీ తిరగదోడేసాను. ఆ పెళుసు పేజీలూ, ఆ సల్ఫర్ కంపూ, చేతుల మీదకి పాకేసే సిల్వర్‌ఫిష్‌లూ . . . దుమ్మంటే పడనివాడైతే చచ్చూరుకునేవాడు. పైగా అది ముసురు పట్టిన రోజు కావటంతో ప్రతీ పుస్తకం కిటికీ దగ్గర మసక వెలుతుర్లోకి తీసుకెళ్ళి చూడాల్సొచ్చేది. అయితేనేం, అప్పటి వరకూ ఊహల్లోనే తడిమిన కొన్ని పుస్తకాల్ని చేతుల్తో ముట్టుకున్నానన్న తృప్తి దక్కింది. ఆ తర్వాత చాలామార్లు పగటి కలలు కనేవాణ్ణి. వాటి ఇతివృత్తం అయితే దోపిడీ అయ్యేది లేకపోతే దొంగతనమయ్యేది. దోపిడీ అనుకుంటే, "కసీనో రాయల్"లో డానియెల్ క్రైగ్‌లాగా పెద్ద బుల్‌డోజర్‌తో లైబ్రరీ గోడల్ని పగలగొట్టుకుంటూ ఎంట్రీ ఇవ్వడం, నాకు అడ్డొచ్చిన ప్రభుత్వ ఉద్యోగులందర్నీ "టెర్మినేటర్-టూ"లో ఆర్నాల్డ్‌‍లాగా మెషీన్ గన్‌తో కాల్చిపారేయటం, నాకు అడ్డురాలేక భయపడి మూలనక్కి వున్న ఉద్యోగులందర్నీ బయటకీడ్చి వాళ్ల చేత పుస్తకాలన్నీ మోపించి, బయట పార్క్ చేసిన పెద్ద కంటెయినర్ ట్రక్కులో పేర్పించటం... ఇదీ సినేరియో. ఇలా కాక దొంగతనం అనుకుంటే, ఓ చీకటి అర్థరాత్రి బిగుతైన నల్లఫాంటూ నల్ల చొక్కా వేసుకుని, కళ్ళకి జోరో మాస్కు తొడుక్కుని, అందినన్ని పుస్తకాల్ని వీపునున్న "పుష్పక మూట"లో కుక్కేసి, అంతకుముందే గుండ్రంగా కళాత్మకంగా బద్దలుగొట్టిన గోడ కన్నంలోంచి పారిపోవడం... ఇలా అన్నమాట. ఒకవేళ ఈ రెంటిలో ఏదన్నా నేను నిజంగానే చేసున్నా, జీవితాంతం ఇసుమంత పశ్చాత్తాపం లేకుండా—పశ్చాత్తాపం మాటటుంచి, ఆ పుస్తకాలకో సార్థకత కల్పించానన్న సంతృప్తితో—బతికగలిగే వాణ్ణి. కానీ ఏంచేస్తాం! నా అన్ని పగటి కలల్లాగే వీటి పునాదులూ గాల్లో వున్నాయిగా.

ఇక, అందరికీ అనుమతి దొరికే మిగతా విభాగాల్లో వున్న ఆంగ్ల సాహిత్యం మటుకు చాలా వరకూ చచ్చు సరుకై వుంటుంది. కొన్నైతే వ్యక్తిగత గ్రంథాలయాల్లోంచీ చోటు చాలక తన్ని తరిమేస్తే ఇక్కడకొచ్చి చేరినవిలా అనిపిస్తాయి. మహా అయితే రెండు అల్మరాలుంటాయంతే. నేను ఈ విభాగంలోనే ఎక్కువ కూర్చునేవాణ్ణి. ఇక్కడ చాలా చదివాను. ఇప్పటికిప్పుడు గుర్తొచ్చినవి చెప్తాను: పేర్లు గుర్తు లేదు గానీ; ఎక్కువ కాఫ్కా, దాస్తొయెవ్‌‌స్కీ రచనల మీద విశ్లేషణలు చదివాను. అప్పటికి కొన్నాళ్ళ క్రితమే "సన్స్ అండ్ లవర్స్" చదివున్నాను కాబట్టి డి.హెచ్. లారెన్స్ గురించి కూడా చదివాను. పుష్కిన్ కథలు కొన్ని చదివాను. ఆంగ్ల సాహిత్యాన్ని గురించిన విజ్ఞానసర్వస్వాలు కూడా ఎక్కువ తిరగేసేవాణ్ణి. కొంతమంది జీవిత చరిత్రలు చదివాను (అయాన్‌రాండ్ మీద బురదజల్లుతూ ఎవరో ఆవిడ కుత్సితంగా రాసిన జీవిత చరిత్రొకటి గుర్తొస్తోంది). హెమింగ్వే, ఫిట్జ్‌గెరాల్డ్‌ల స్నేహం గురించి ఏదో పుస్తకం చదివాను. అస్తిత్వవాదం గురించి అక్కర్లేని చెత్త చాలా చదివాను. ఎందుకో నాటకాలు ఎక్కువ చదివాను. టెనెస్ విలియమ్స్ నాటకం "ద గ్లాస్ మెనేజరీ", శామ్యూల్ బెకెట్ నాటకం "క్రెప్స్ లాస్ట్ టేప్" (పూర్తిగా అర్థమయిందని చెప్పలేను), హెరాల్డ్ పింటర్ నాటకం "డంబ్ వెయిటర్" బాగా గుర్తున్నాయి. చెకోవ్ నాటకం "ద త్రీ సిస్టర్స్" సగమే చదవగలిగాను.

ఇక్కడ చదవడానికి చాలా ఏకాగ్రత కుదిరేది. రోడ్డు పక్కనే వున్నా, కిటికీలు తెరిచే వున్నా ట్రాఫిక్ హోరు ఏమాత్రం ఇబ్బంది పెట్టేది కాదు. గది నిలువునా ఓ పొడవాటి బల్ల నిజాం డైనింగ్ టేబులంత పెద్దగా వుండేది. దాని చుట్టూ కుర్చీల్లో కూర్చుని చదువరులు కాలం మరిచిపోయి అక్షరాలు భోంచేస్తుండేవారు. కొంతమందైతే కడుపు నిండిన మగతతో పుస్తకాలు బోర్లించి హాయిగా నిద్రపోయేవాళ్ళు కూడా. నేను మాత్రం, మెదడు మొద్దుబారినప్పుడు దిక్కులు చూడ్డానికి కాస్త విరామం తీసుకుంటూ, ఏదోకటి తిరగేస్తూనే వుండేవాణ్ణి. ఎందుకో అప్పట్లో నాకు ప్రతీ పుస్తకమూ చదివింది చదివినట్లు ఏ విశ్లేషణలూ తొక్కాతోలూ లేకుండా మనసుకు పట్టేసేది; నమ్మకంతో చదివేవాణ్ణి. ఆ శక్తి ఈ మధ్యన మెల్లమెల్లగా హరించుకుపోతూందనిపిస్తూంది. దరిమిలా నేను బ్లాగడం మొదలుపెట్టడం కూడా దీనికి కొంత కారణం అనిపిస్తుంది.

ఇవాళ వెళ్ళటం వెళ్ళటం ఈ విభాగంలోకే వెళ్ళాను. చోటు కాస్త మారింది. పాత పొడుగాటి బల్ల తీసేసి ఆ నిడివిలో నాలుగో అయిదో విడి బల్లలు వేసారు. నిజాని కివాళ చదవటానికన్నా పాత స్నేహితుణ్ణి ఓసారి పలకరిద్దామన్నట్టు వచ్చానంతే ఇక్కడికి. అయితే మనసూరుకోదుగా. చేయి పుస్తకాల్ని తడుముతూ పోయింది. వెన్ను మీద పేరు లేని పుస్తకాల్ని బయటకి లాగి తెరిచి పేర్లు చూసుకుంటూ పోయాను. నాకిలా చేయడమంటే చాలా ఇష్టం. ఎప్పుడన్నా పుస్తకాల కొట్టుకెళ్ళినా కూడా, నాక్కావాల్సిన పుస్తకం దొరికేసినా సరే, అక్కడున్న అరలన్నింటినీ ఓసారి గత్తరబిత్తర చేసిగానీ బయటకిరాను. (ఇంతేగాక పుస్తకాల షాపుల్లో నేను చేసే కంత్రీ పని మరొకటుంది. ఆ నెలకి కేటాయించిన నిధుల పరిధి మించిపోయినాక కూడా ఇంకా ఏవైనా పుస్తకాల మీద మనసు లాగిందనుకోండి, మళ్ళీ నెల వచ్చికొనేదాకా అవి ఎవరి కంటా పడకుండా మూల అరల్లోనో వెనక వరుసల్లోనో దాచేస్తాను.) ఎలాగూ వచ్చాం కాబట్టి కాసేపేదైనా చదువుదాం అనిపించడంతో, మరో పక్క ఆలస్యం కూడా అయిపోతుండటంతో, అరల్లో చేతుల అల్లరి ఆపి అప్పటికప్పుడు దొరికిన ఎరిక్ సీగల్ "ఓన్లీ లవ్" నవలని చేతిలోకి తీసుకున్నాను. వెనుక అట్ట మీద క్లుప్తంగా కథ రాసుంది. ఒక అమ్మాయి అబ్బాయీ ప్రేమించుకుంటారు. తర్వాత దూరమైపోతారు. వేరే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కానీ అబ్బాయికి ఆమె అంటే మమకారం (అచ్చ తెలుగులో చెప్పాలంటే "బెమ") పోదు. అతనిప్పుడు ఓ వైద్యునిగా పనిచేస్తుంటాడు. కొన్నేళ్ళు గడచిన తర్వాత పాత ప్రేయసి భర్త అతన్ని కలుస్తాడు. తన భార్యకు ప్రాణాంతకమైన వ్యాధి వుందనీ, నయం చేయమనీ కోరతాడు. ఆమె మళ్ళీ ఇతని జీవితంలోకి వస్తుంది. మామూలుగా వెనక అట్టల మీది ఇలాంటి సంక్షిప్త కథల్లో వుండే సుత్తి ఉత్కంటనే కలిగిస్తూ ఇక్కడితో ఆగిపోయింది. నేను దాన్ని తీసుకుని కుర్చీలో కూలబడ్డాను. చివరి మూడు అధ్యాయాలూ చిన్నవిగా కనిపించడంతో చదివేసాను. నేను చదివిన అధ్యాయాల్లో నాకు అందిన కథేమిటంటే: ఆమె వ్యాధి ముదిరిందనీ, కొన్నాళ్ళే బతుకుతుందనీ నిర్దారణ అయిపోతుంది. ఇద్దరూ కలిసి గతంలో ప్రేమలో వున్నప్పుడు చూసిన ఓ ఒపెరాకి వెళ్తారు. గతంతో కదిలించినంతగా అది ఇప్పుడు ఇద్దర్నీ కదిలించలేకపోతుంది. తర్వాత ఆమె అతన్ని ఇంటికి భోజనానికి పిలుస్తుంది. అక్కడ తనని స్వీకరించమని అడుగుతుంది. అతను తిరస్కరిస్తాడు. ఆమె మోహాతిశయంతో అతని మీద వాలి ముద్దు పెట్టుకుంటూండగా భర్త తలుపు తీసుకు వస్తాడు. గొడవ జరుగుతుంది. ఆ ఆవేశకావేశాల్లో ఆమెకు వ్యాధి తిరగబెడుతుంది. ఇద్దరూ ఆమెని హాస్పిటల్‌కు తీసుకువెళ్తారు. అక్కడామె మరణిస్తుంది. హాస్పిటల్ కారిడార్లో భర్త ప్రేమికునితో తన భార్య ఎప్పుడూ తననే కోరుకుందని సమర్థించుకోజూస్తాడు. ఈ వాదనంతా ఇప్పుడెందుకూ అని అడిగితే, ఆమె జీవితంలోనూ నాదే మరణంలోనూ నాదే అనేదో చెప్తాడు. చివరి అంకంలో ఈ ప్రేమికుడు ఇంటికి వెళ్ళి, తన పాత ప్రేయసి పునః రంగప్రవేశం కారణంగా తనకు దూరమైపోయిన భార్యని మళ్ళీ ఆత్మీయంగా దగ్గరకు తీసుకుంటాడు. కాస్త విషాదపు చేదు కలిసిన తియ్యని సుఖాంతం. నేను చదివిన కాసిని పేజీల్నీ బట్టి నవల చాలా వేగంగా చదివిస్తుందని అర్థమైంది. ఆ కాస్తా చదవటానికి పావుగంట కూడా పట్టలేదు. కాకపోతే కథే, ఏదో హాలీవుడ్ మెలోడ్రామా లాగా అనిపించింది; కథనాన్ని ముందుకు నడిపేది ప్రధానంగా సంభాషణలే (నాకు నచ్చని పద్ధతి). చదివింది చివరి కాస్తే అయినా మొత్తం పుస్తకం చదివేసినట్టనిపించింది. పుస్తకం అరలో పెట్టేయటానికెళ్తూ పేజీలు తిరగేస్తుంటే, ప్రారంభంలో నవలకు ఎఫిగ్రాఫ్‌‌‍గా ఫ్లాబర్ వాక్యం ఒకటి కనిపించింది. నచ్చింది: The better part of life is spent saying: "it's too early", and then "it's too late". అప్పటికే చీకటి పడిపోతుండటంతో, లైబ్రరీకి మళ్ళీ కలుద్దామని వీడ్కోలు చెప్పేసి, బయట పడ్డాను. కథ కంచికి, నేను నా గదికి. ఆ తర్వాత పడుకోబోయే ముందు, వేళ్ళు కాస్త దురద పుడితే, ఇదిగో వాటినిలా కీబోర్డు మీద రాపాడించానన్నమాట.

ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది: ఆ ముసురుపట్టిన రోజు చూసిన పుస్తక సంచయపు దృశ్యం నా మనసులో అలానే వుండిపోయిందని; బహుశా దాంతో పోటీ పడాలనే, చదివినా చదవకపోయినా, నా గది అల్మరాల్ని పుస్తకాల్తో నింపేస్తున్నానేమోనని.
: