An essay cum study guide to Nabokov’s Novel ‘The Gift’
దాదాపు నూటనలభయ్యేళ్ళ
క్రితం రచయిత్రి జార్జిశాండ్ తన మిత్రుడు ఫ్లొబేర్‌కు పంపిన ఒక ఉత్తరంలో, కళాకారుణ్ణి ముఖ్యపాత్రగా ఊహించి ఒక నవల
రాయమంటూ యిలా సలహా యిచ్చింది:
“Try some day to write
a novel in which the artist (the real artist) is the hero, you will see what
great, but delicate and restrained, vigor is in it, how he will see everything
with an attentive eye, curious and tranquil, and how his infatuations with the
things he examines and delves into, will be rare and serious. You will see also
how he fears himself, how he knows that he cannot surrender himself without
exhaustion, and how a profound modesty in regard to the treasures of his soul
prevents him from scattering and wasting them. The artist is such a fine type
to do, that I have never dared really to do him. I do not consider myself worthy
to touch that beautiful and very complicated figure; that is aiming too high
for a mere woman. But if it could certainly tempt you some day, it would be
worthwhile.”
(“ఎపుడైనా నిజమైన కళాకారుణ్ణి
కథానాయకునిగా తీసుకుని నవలొకటి రాయటానికి ప్రయత్నించు. అందులో ఎంత గొప్ప బలం–
సున్నితమైన, సంయమనంతో కూడిన బలం– వుంటుందో; అతను ప్రతీ వివరాన్నీ శ్రద్ధగల కంటితో
కుతూహలంగా, ప్రశాంతంగా ఎలా పరికిస్తాడో; తాను పరిశీలించే, నిమగ్నమయ్యే విషయాల పట్ల అతని
వ్యామోహాలు ఎంత అపురూపంగా, గంభీరంగా వుంటాయో నీకు
అర్థమవుతుంది. అంతేకాదు; తల వొగ్గడమంటూ జరిగితే శూన్యమై
మిగులుతాడన్న సంగతి యెరిగి తనకు తానే ఎలా జడుస్తాడో, తన
ఆత్మలోనున్న సంపదల పట్ల అతనికి వుండే గొప్ప అణకువభావం వాటిని వెదజల్లి వృథా
కానీయకుండా ఎలా ఆపుతుందో నువ్వు చూడగలుగుతావు. ఇంత చక్కని పాత్ర కాబట్టే నేనెన్నడూ
కళాకారుణ్ణి చిత్రించే సాహసం చేయలేదు. ఆ అందమైన, సంక్లిష్టమైన
మూర్తిని తాకేందుకు అర్హురాలిగా నన్ను నేను పరిగణించుకోవటం లేదు; అది ఒక స్త్రీ పరిధికి అందని ఎత్తు. కానీ నీకేనాడైనా ఆసక్తి
కలిగించగలిగితే, అది ప్రయత్నయోగ్యమే అవుతుంది.”)
ఇది చదవగానే, ఫ్లొబేర్‌ఈ ప్రయత్నం ఎప్పుడూ ఎందుకు చేయలేదోనన్న
కుతూహలం కలిగింది. అయితే పేజీ పూర్తిగా తిరగేయకుండానే బహుశా ఎలాంటి సమాధానమిచ్చి
వుంటాడో ఊహకి అందేసింది. తిరగేసి చదివాక అదే నిజమైంది:
“I don’t agree
with you that there is anything worthwhile to be done with the character of the
ideal artist; he would be a monster. Art is not made to paint the exceptions,
and I feel an unconquerable repugnance to putting on paper something from out
of my heart. I even think that a novelist hasn’t the right to express his
opinion on any subject whatsoever. Has the good God ever uttered it, his
opinion? That is why there are not a few things that choke me which I should
like to spit out, but which I swallow. Why say them, in fact! The first comer
is more interesting than Monsieur Gustave Flaubert, because he is more general
and there fore more typical.”
(“ఆదర్శ కళాకారుని పాత్రతో ఏదైనా
యోగ్యమైనది సృష్టించగలమనే నీ అభిప్రాయాన్ని నేను ఒప్పుకోను; వాడో
మృగం అవుతాడు. కళ మినహాయింపుల్ని చిత్రీకరించటానికి కాదు; అంతేగాక,
నాకు నా హృదయంలోంచి ఏదైనా వెలికి తీసి కాగితంపై పెట్టాలంటే భరించలేని
వెగటుపుడుతుంది. ఒక నవలాకారునికి ఏ విషయం మీదా సొంత అభిప్రాయాల్ని వెల్లడించే
హక్కు లేదని కూడా నేను నమ్ముతాను. దేవుడెపుడైనా ప్రకటిస్తాడా సొంత అభిప్రాయాల్ని?
అందుకే, బయటకు వెళ్ళగక్కితీరాలనిపించేంతగా
చాలా విషయాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా, నేను దిగమింగుకుంటాను.
అసలెందుకు వాటిని చెప్పడం! దారిన తారసిల్లే మొదటి ఆసామీ ఎవ్వడైనా శ్రీమాన్
గుస్తావ్ ఫ్లొబేర్‌కన్నా ఆసక్తికరమైనవాడే. ఎందుకంటే వాడు నాకన్నా సాధారణమైన
వ్యక్తి, కనుక ఓ మూసకు ప్రతినిధి”)
కాస్త కదిపితే చాలు, యిలా ఆదర్శవంతమైన కళ గురించి తాను
నమ్మిన సిద్ధాంతాలన్నీ ఏకరువు పెట్టడం ఫ్లొబేర్‌కు అలవాటనుకుంటా. ఇది అతని
ఉత్తరాల్లో చాలా చోట్ల కనిపిస్తుంది. అయితే దీనికి అతణ్ణి మన్నించేయవచ్చు.
ఎందుకంటే ప్రపంచసాహిత్యంలో వచన రచనను “ఫ్లొబేర్‌ముందు”,
“ఫ్లొబేర్‌తరువాత” అని రెండు విభాగాలుగా
వర్గీకరించవచ్చు. రాసినవి మూడు నవలలే అయినా అవి అంతటి మార్పు తీసుకొచ్చాయి;
ఆధునిక నవలా ప్రక్రియకు ఒరవడి దిద్ది మార్గదర్శకాలుగా నిలిచాయి
(ముఖ్యంగా “మేడామ్ బొవరీ”). ఉన్నట్టుండి
కమ్ముకున్న మార్పు ప్రభావం ఎపుడూ బలంగానే వుంటుంది; కనీసం తన
ఆకస్మిక ధోరణి వల్లనైనా సరే. కానీ ఆ మార్పు నిలదొక్కుకోవాలన్నా, దాని ప్రభావం అటుపిమ్మట కొనసాగాలన్నా, ఒక్కోసారి
దానికి ఆద్యుడైన వ్యక్తి తన సిద్ధాంతాల్ని స్థిరంగా నాటుకునే దాకా పదే పదే
బిగ్గరగా చాటాల్సి వుంటుంది. “నవలా ప్రక్రియ యింకా తన హోమర్
రాక కోసం ఎదురు చూస్తుంది” అన్న ఫ్లొబేర్‌కు ఆ హోమర్ తనే
కాబోతున్నానని తెలుసు (హోమర్ కావ్య ప్రక్రియకు ఆద్యుడని ప్రఖ్యాతి), వచన రచనలో తాను తీసుకురాబోతోన్న మార్పు పదికాలాల పాటు నిలిచిపోయేదనీ
తెలుసు. అందుకే సందుచిక్కిన ప్రతీ సందర్భంలోనూ అంత బలంగా తన అభిప్రాయాల్ని
వెల్లడించేవాడు.
కళాకారుణ్ణి కథానాయకునిగా తీసుకుని నవల రాయడానికి ఫ్లొబేర్‌చెప్తున్న
అభ్యంతరాల సారాంశాన్ని యిలా చెప్పుకోవచ్చు: కళాకారుడు మిగతా మానవ సమూహమంతటికీ ఒక
మినహాయింపు (ఒక “మృగం”).
కళ మూసల్ని చిత్రీకరించటానికే గానీ, యిలాంటి
అరుదైన మినహాయింపుల్ని చిత్రీకరించటానికి కాదు. కాబట్టి కళాకారుణ్ణి కథానాయకునిగా
తీసుకుని నవల రాయటం అసాధ్యం. ఫ్లొబేర్‌విషయంలో యివి నమ్మకాలుగా మాత్రమే
మిగిలిపోలేదు; రచనల్లోనూ, జీవితంలోనూ
వీటిని పాటించాడు కూడా. రచనల్లో ఎప్పుడూ సాధారణత్వాన్ని ప్రతిబింబించే మూస
పాత్రల్నే చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. జీవితంలో ఎప్పుడూ ఒక కళాకారుడిగా తనను
మిగతా ప్రపంచం నుండీ మినహాయించుకోవడానికి ప్రయత్నించాడు.
అతని రచనల్లో ప్రధాన పాత్రలేవీ అసాధారణ లక్షణాలూ, ప్రత్యేక విలువలూ వున్న వ్యక్తులు కాదు,
మినహాయింపులు కాదు. వాళ్ళంతా మామూలు జనమే, మూసలే.
చివరికి అతని జీవితానికి బాగా చేరువైన ఇతివృత్తంగా పలువురు భావించే నవల “సెంటిమెంటల్ ఎడ్యుకేషన్”లో కూడా, తనను ప్రతిబింబించే కథానాయక పాత్ర ఫ్రెడరిక్‌కు దాదాపుగా తన స్వభావమంతా–తన పరిసరాలు, స్నేహాలు, ప్రేమానుబంధాలూ
అన్నీ–అరువిచ్చాడు గానీ, తన
కళానైపుణ్యం (తన రచనాశక్తి) మాత్రం యివ్వలేదు. అంటే తనలో ఏది ప్రత్యేకం
అనుకున్నాడో, ఏది తనని మిగతా మామూలుతనం నుంచి
మినహాయిస్తుందనుకున్నాడో, దాన్ని మాత్రం తనకే
అట్టిపెట్టుకున్నాడు.
అలాగే నిజజీవితంలో కూడా ఒక కళాకారునిగా తనని తాను సమూహం
నుంచి వేరు చేసుకోవటానికి ప్రయత్నించాడు. సంసారమన్నది లేకుండా, కొద్దిమంది స్నేహితులు తప్ప ప్రపంచంతో
నిమిత్తం లేకుండా, కేవలం రచనకే–పేజీలకే,
పేరాలకే, వాక్యాలకే, అక్షరాలకే–అంకితమైపోయిన అతణ్ణి సొంతవూరు క్రాయిసెట్‌లో జనం “హెర్మిట్
ఆఫ్ క్రాయిసెట్” (క్రాయిసెట్ సన్యాసి) అని పిలిచేవారట. ఈ
తరహా సన్యాసి జీవితాన్ని అతను మరోచోట యిలా సమర్థించుకున్నాడు (దాదాపు పై
ఉత్తరంలోలానే):
“You can depict
wine, love, women and glory on the condition that you are not a drunkard, a
lover, a husband or a private in the ranks. If you participate in life, you don’t
see it clearly: you suffer from it too much or enjoy it too much. The artist,
in my opinion, is a monstrosity, something outside of nature.”
(“నువ్వో త్రాగుబోతువో, ప్రేమికుడివో, భర్తవో లేదా పటాలంలో సిపాయివో
కానంతవరకూ మాత్రమే మద్యం గురించి, ప్రేమ గురించి, స్త్రీల గురించీ యింకా గెలుపు గురించీ రాయగలవు. జీవితంలో పాలుపంచుకున్నంత
సేపూ నువ్వు దాన్ని స్పష్టంగా చూడలేవు: దాని వల్ల మరీ బాధపడటమో లేక మరీ ఆనందించేయటమో
చేస్తావు. కళాకారుడు, నా ఉద్దేశ్యంలో, ఒక
ప్రకృతి బాహ్యమైన రాక్షసాంశ.”)
సరిగ్గా యిక్కడే ఫ్లొబేర్‌నుంచి వ్లదీమిర్ నబొకొవ్ వేరు
పడతాడు. (సరిగ్గా పన్నెండు పేరాల తర్వాత నేను అసలు విషయానికి వస్తున్నాను.)
వేరుపడటమంటే మళ్ళీ కళాకారులుగా యిద్దరూ భిన్నధృవాలని కాదు నా ఉద్దేశ్యం. నబొకొవ్‌కి
ఫ్లొబేర్‌రచనలంటే చాలా అభిమానం; అలాగే, కాలగతి అటూయిటూ అయి నబొకొవ్ తర్వాతే ఫ్లొబేర్‌పుట్టివున్నా,
అతను కూడా నబొకొవ్‌ని కళాకారునిగా అంతే అభిమానించి వుండేవాడని
నాకనిపిస్తుంది. నేను చెప్పే వేరుపడటం వ్యక్తులుగా వాళ్ళ మనస్తత్వాల గురించి.
నబొకొవ్ స్వీయచరిత్ర “స్పీక్, మెమొరీ”
మొదటి పేజీలో కొన్ని వాక్యాలు ఈ వ్యత్యాసాన్ని కొంత వ్యక్తపరుస్తాయి
(సందర్భౌచిత్యం పూర్తిగా పొసగక పోయినా, జీవితం పట్ల నబొకొవ్
ధోరణిని తెలియజెప్పే ఒక వాక్యం కోసం ఈ పేరా యిస్తున్నాను):
“Nature expects
a full-grown man to accept the two black voids, fore and aft, as stolidly as he
accepts the extraordinary visions in between. Imagination, the supreme delight
of the immortal and immature, should be limited. In order to enjoy life, we
should not enjoy it too much…. I rebel against this state of affairs.”
వీళ్ళిరువురి మధ్యా తేడాను యింకా
క్లుప్తంగా యిలా చెప్పొచ్చు: కళాకారుడు తన కళకు ముడిసరుకైన ప్రపంచంలో పూర్తిగా
మమేకమైపోకూడదనీ దాన్ని బయటనుంచే వీక్షించి సమీక్షించాలనీ ఫ్లొబేర్‌నమ్మకం.
కళాకారుడు ఆ ప్రపంచ సంరంభంలో పాల్గొని స్వయంగా సందడి చేస్తూ కూడా దాని ఆనుపానులు
నమోదుచేయగలడన్నది నబొకొవ్ నమ్మకం. ఈ వ్యత్యాసం వల్లే, ఫ్లొబేర్‌కు తనలోని కళాకారుడు వికృతమైన
మినహాయింపుగా తోస్తే, నబొకొవ్ తనలోని కళాకారుణ్ణి అందమైన
ప్రత్యేకతగా భావించాడు. ఫ్లొబేర్‌కు సంబంధించినంతవరకూ కళాకారుడు కళ కోసం
ప్రపంచాన్ని త్యజించిన పరిత్యాగి అయితే, నబొకొవ్‌కి
సంబంధించినంతవరకూ కళాకారుడు ఈ ప్రపంచంలో తన జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి కళని
సాధనంగా ఉపయోగించుకోవడమెలాగో తెలిసిన సాధకుడు, యోగి. అందువల్లనే
కళాకారుణ్ణి ప్రధానపాత్రగా తీసుకుని ఫ్లొబేర్‌ఏమీ రాయలేకపోయాడు. నబొకొవ్ మాత్రం The
Gift రాసాడు. (ఇప్పుడే ఈ నవల పేరు ముందు తగిలించడానికి, కారుమబ్బుల్ని కోసుకుంటూ దిగంతం మీదకు పదునుగా వంకరటింకరగా దూసుకువచ్చే
మెరుపు వెలుగునూ, చురుకుదనాన్నీ స్ఫురింపజేయగల విశేషణం
ఏమన్నా తెలుగులో వుందాని ఆలోచించాను; ఏం తట్టలేదు. “మిరిమిట్లుగొలిపే
నవల” లాంటివి సరిపోవు సరికదా, ఎబ్బెట్టుగా
వుంటాయనిపించింది.)
ఇంతకూ పై ఉత్తరాల ప్రస్తావన తెచ్చింది యిలా ఫ్లొబేర్‌కూ
నబొకొవ్‌కూ మధ్య పోలికలు బేరీజు వేయడానికి కాదు. అసలు ఫ్లొబేర్‌ఉత్తరం కన్నా
జార్జిశాండ్ ఉత్తరమే ఆ రెంటినీ యిక్కడ ప్రస్తావించడానికి గల అసలు కారణం. ఒక
కళాకారుడు కథానాయకుడైతే ఆ నవల ఎలా వుండొచ్చని ఆమె తన ఉత్తరంలో ఊహించిందో “ద గిప్ట్”
నవల అచ్చంగా అలానే వుంటుంది. ఈ నవలలోని కథానాయకుని పాత్ర గురించి నేను
చెప్పాలనుకున్నదంతా ఆమె చాలా సులభమైన వాక్యాల్లో, చాలా సరిగ్గా చెప్పేసిందనిపించింది. ఆమె వాక్యాల్లోంచి ఆ “అణకువ
భావం” అన్నది మాత్రం పక్కకు తీసేయాలి. తన కల్పనాశక్తి తీక్ష్ణత చవి మరగిన
కళాకారుడెవ్వడూ అణకువగా ఉండలేడేమో. ఉదాహరణకి ఈ నవల కథానాయకుడు ఫియొదొర్ (బెర్లిన్
నగరంలో ఒక ఇరవయ్యారేళ్ళ రచయిత, రష్యన్ ప్రవాసితుడు, నిరుపేద బ్రహ్మచారి), రోజు గడవటానికి తప్పనిసరై
చెప్పాల్సిన ఓ ట్యూషన్‌కు వెళ్తూ, బస్సులో కూర్చుని తన
గురించి తాను యిలా ఆలోచించుకుంటాడు (అసలు “అణకువ” సంగతి పక్కన పెడితే, జార్జిశాండ్ చెప్పినట్టు, “అతను ప్రతీ వివరాన్నీ
శ్రద్ధగల కంటితో కుతూహలంగా, ప్రశాంతంగా ఎలా పరికిస్తాడో;
తాను పరిశీలించే, నిమగ్నమయ్యే విషయాల పట్ల
అతని వ్యామోహాలు ఎంత అపురూపంగా, గంభీరంగా వుంటాయో” ఈ పేరాలో
చూడవచ్చు):
“There he is, a
special, rare and as yet undescribed and unnamed variant of man, and he is
occupied with God knows what, rushing from lesson to lesson, wasting his youth
on a boring and empty task, on the mediocre teaching of foreign languages–when
he has his own language, out of which he can make anything he likes–a midge, a
mammoth, a thousand different clouds. What he should be really teaching was
that mysterious and refined thing which he alone–out of ten thousand, a hundred
thousand, perhaps even a million men–knew how to teach: for example–multi-level
thinking: you look at a person and you see him as clearly as if he were
fashioned of glass and you were the glass blower, while at the same time
without in the least impinging upon that clarity you notice some trifle on the
side–such as the similarity of the telephone receiver’s shadow to a huge,
slightly crushed ant, and (all this simultaneously) the convergence is joined
by a third thought–the memory of a sunny evening at a Russian small railway
station; i.e., images having no rational connection with the conversation you
are carrying on while your mind runs around the outside of your own words and
along the inside of those of your interlocutor. Or: a piercing pity–for the tin
box in a waste patch, for the cigarette card from the series National Costumes
trampled in the mud, for the poor, stray word repeated by the kind-hearted,
weak, loving creature who has just been scolded for nothing–for all the trash
of life which by means of a momentary alchemic distillation–the “royal
experiment”–is turned into something valuable and eternal. Or else: the
constant feeling that out days here only pocket money, farthings clinking in
the dark, and that somewhere is stocked the real wealth, from which life should
know how to get dividends in the shape of dreams, tears of happiness, distant
mountains. All this and much more… he would have been able to teach, and teach
well, to anyone who wanted it, but no one wanted it–and no one could, but it
was a pity, he would have charged a hundred marks an hour, the same as certain
professors of music. And at the same time he found it amusing to refute
himself: all this was nonsense, the shadows of nonsense, presumptuous dreams. I
am simply a poor young Russian selling the surplus from a gentleman’s
upbringing, while scribbling verses in my spare time, that’s the total of my
little immortality. But even this shade of multifaceted thought, this play of
the mind with its own self, had no prospective pupils.”
* * *
నబొకొవ్ రష్యన్ భాషలో రాసిన ఆఖరి నవల “ద గిప్ట్”.
(దరిమిలా ఆయన తన మాతృభాష రష్యన్‌ను విడిచిపెట్టి ఇంగ్లీషులో రాయటం ప్రారంభించాడు.)
దీన్ని ఆయన 1935-37ల
మధ్యకాలంలో రాశాడు. యిందులోని ఐదు అధ్యాయాల్లో నాలుగు అధ్యాయాలను పారిస్‌లో ప్రవాస
రష్యన్లు నడిపే ఓ పత్రిక ధారావాహికంగా ప్రచురించింది. (నాలుగో అధ్యాయం మాత్రం
వివాదాస్పదమన్న కారణంగా తిరస్కరించింది.) ఇలా ధారావాహికంగా వెలువడినప్పుడు గానీ,
పదిహేనేళ్ళ తర్వాత 1952లో పుస్తకరూపేణా
వెలువడినప్పుడు గానీ, ఈ నవల పెద్దగా ఎవరి దృష్టినీ
ఆకర్షించలేదు. దీనికి కారణం, అప్పటికి సామ్యవాదుల నియంతృత్వ
పాలనలో వున్న రష్యాలో దేశం వెలుపల వున్న ప్రవాస రష్యన్లు రాసిన రచనలన్నీ నిషిద్ధం.
ఈ రచయితలందరికీ కేవలం ఓ రెండువేల మంది దాకావున్న ప్రవాస రష్యన్ పాఠకులే దిక్కు.
అందుకే, అప్పట్లో నబొకొవ్ రష్యన్‌లో రాసిన చాలా నవలలన్నింటి
లాగానే, “ద గిప్ట్” కూడా పెద్దగా స్పందన పొందలేకపోయింది.
తర్వాతికాలంలో నబొకొవ్ అమెరికా చేరుకుని “లొలీటా” నవలతో బాగా పేరు గడించడంతో
ఇంగ్లీషు పాఠకప్రపంచానికి ఆయన పాత రష్యన్ నవలలన్నింటి మీదా ఒక్కసారిగా ఆసక్తి
మొదలైంది. దాంతో మైఖేల్ స్కామెల్ అనే అనువాదకునితో సంయుక్తంగా నబొకొవ్ ఈ నవలను
ఇంగ్లీషులోకి అనువదించి ప్రచురించాడు. “లొలీటా”లా సులభగ్రాహ్యమైనదీ, వివాదాస్పదమైన ఇతివృత్తం కలదీ కాకపోవడంతో ఆ స్థాయిలో పేరు
తెచ్చుకోలేకపోయినప్పటికీ, నబొకొవ్‌తో పాటూ విమర్శకులూ దీన్ని
ఆయన రష్యన్ నవలలన్నింటిలోనూ అత్యుత్తమమైనదిగా పరిగణిస్తారు. ఓ ఇంటర్వ్యూలో నబొకొవ్
ఈ నవలను యిలా పరిచయం చేసాడు:
“It is the
longest, I think the best, and most nostalgic of my Russian novels. It portrays
the adventures, literary and romantic, of a young Russian expatriate in Berlin,
in the twenties; but he’s not myself. I am very careful to keep my characters
beyond the limits of my own identity.”
ఇలా పాత్రల్ని తన సొంతవ్యక్తిత్వానికి దూరంగా
వుంచుతాడన్న సంగతి నబొకొవ్ అవసరమైందానికన్నా తరచుగానే ప్రకటిస్తాడు. బహుశా ప్నిన్
(Pnin), అల్బినస్ (Laughter
in the dark) లాంటి అమాయక, మెతక పాత్రల కన్నా,
హంబర్ట్ హంబర్ట్‌లాంటి గుంటనక్కలూ (Lolita), చార్లెస్
కింబోటే లాంటి పిచ్చి మేధావుల (Pale Fire) పాత్రల్ని
ఎక్కువగా సృష్టించడం వల్ల కావచ్చు. “ద గిప్ట్” నవల ఉపోద్ఘాతంలో కూడా ఈ ప్రస్తావన
తెస్తాడు:
“నేను ఈ పుస్తకంలోని యువకునితో
సమకాలీనంగానే 1922 నుంచీ బెర్లిన్‌లో నివసించాను; అయితే యిది గానీ, సాహిత్యమూ లెపిడోప్టెరా (సీతాకోక
చిలుకల అధ్యయనం) లాంటి అతని ఆసక్తుల్ని నేను పంచుకోవటం గానీ, ఏ పాఠకుణ్ణీ ‘అహా!’ అని
సంబరపడి అల్లేవాణ్ణి అల్లికలో వెతుక్కునేట్టు చేయకూడదు. నేను యిప్పుడూ ఎప్పుడూ
ఫియొదొర్‌ని కాను.”
అయితే, నబొకొవ్ జీవితాన్ని రెండు సంపుటాల్లో
సమగ్రంగా పుస్తకీకరించిన జీవితచరిత్రకారుడు బ్రైన్ బోయ్డ్‌తో సహా, చాలామంది అభిప్రాయం దీనికి భిన్నంగా వుంది. నబొకొవ్ సృష్టించిన
పాత్రలన్నింటిలోనూ ఆయన జీవితానికీ, వ్యక్తిత్వానికీ చేరువగా
వచ్చే పాత్ర ఏదైనా వుంటే అది ఒక్క ఫియొదొర్ మాత్రమేనని వారి నమ్మకం. కేవలం
సాహిత్యం, సీతాకోకచిలుకల అధ్యయనాల విషయంలోనే కాదు; ఫియొదొర్‌కీ, అతని సృష్టికర్తకీ యింకా చాలా
విషయాల్లో సామ్యం వుంది. ఇద్దరి బాల్యమూ రష్యాలో విశాలమైన భవంతుల్లో నౌకర్లూ
చాకర్లతో వైభవంగా గడిచిందే. ఇద్దరూ రష్యాలోని బోల్షెవిక్ విప్లవం కారణంగా
కుటుంబాలు విచ్ఛిన్నమై పరాయిదేశం ప్రవాసం వచ్చినవారే. ప్రవాసంలో ఫియొదొర్ బెర్లిన్‌లో
నివసిస్తే, అతని తల్లీ సోదరీ విడిగా పారిస్‌లో వుంటారు;
నబొకొవ్ విషయంలోనూ అంతే: ఆయన బెర్లిన్‌లో వుంటే, తల్లీ తమ్ముళ్ళూ చెల్లెళ్ళూ ప్రేగ్‌లో వుండేవారు. ఇరువురి తండ్రులూ
అర్థాంతరంగానే వారికి దూరమయ్యారు (నవలలో ఫియొదొర్ తండ్రి ఎలా మరణించాడన్నది
చివరివరకూ అనిశ్చితంగానే మిగిలిపోగా, నబొకొవ్ తండ్రి హత్యకు
గురయ్యాడు). ఇద్దరూ బెర్లిన్‌లో వుండగా రోజు గడవటానికి ఇంగ్లీషు నేర్పే
ట్యూటర్లుగా పని చేసారు. ఇద్దరికీ చెస్ పజిల్స్ పట్ల ఆసక్తి వుంది. ఇద్దరి
సాహితీపరమైన అభిరుచులూ దాదాపు ఒక లానే వుంటాయి (ఉదాహరణకి దాస్తొయెవ్‌స్కీపై
ఫియొదొర్ అభిప్రాయం నబొకొవ్ నోటి నుండి ఊడిపడ్డట్టే వుంటుంది: “Bedlam
turned back in to bethlehem – that’s Dostoevski for you”). అలాగే
ఇద్దరూ కూడా కౌమారంలోనే, మొదట కవిత్వంతోనే, తమ రచనా వ్యాసంగాన్ని ఆరంభించారు. ఇవి మాత్రమే కాదు; నవలలో ఫియొదొర్, అతని ప్రేయసి జినాల ప్రేమకూ,
నిజజీవితంలో నబొకొవ్, ఆయన భార్య వెరాల
ప్రణయవృత్తాంతానికీ కూడా చాలా దగ్గరి పోలికలు కనిపిస్తాయి. ఉదాహరణకు: నవలలో జినా
ఎవరన్నది ఫియొదొర్‌కి తెలియక మునుపే ఆమెకు ఫియొదొర్ గురించి తెలుసు. అతని మొదటి
కవితల సంపుటిని కొన్న అతికొద్దిమంది పాఠకుల్లో ఆమె ఒకరు. అంతేకాదు, పత్రికల్లో వచ్చిన అతని కవితలన్నింటినీ కత్తిరించి దాచిపెట్టుకుంటుంది
కూడా. నిజజీవితంలో నబొకొవ్, వెరాల ప్రేమ కథ కూడా ఇంచుమించు
ఇంతే. వెరా ఎవరో నబొకొవ్‌కు తెలియక మునుపే, వెరాకు నబొకొవ్
గురించి తెలుసు. ఆమె కూడా నబొకొవ్ తొలి కవితల్ని కత్తిరించి దాచుకునేది. కొన్ని
కవితల్నయితే కంఠస్థం వచ్చేసేంతగా ఇష్టపడింది కూడా. ఈ పోలికలు చాలవూ! నబొకొవ్ ఈ
పాత్రకు తన రచనా పటిమ మాత్రమే కాక, తన వ్యక్తిత్వాంశనూ జీవిత
నేపథ్యాన్నీ కూడా అరువిచ్చాడని తెలియగానే ఈ పుస్తకం చదివితీరాలనే ఆత్రుత మొదలైంది.
ఎందుకంత ఆత్రుతో యింకాస్త విపులంగా చెప్తాను. నబొకొవ్ తన
నవలల్లో తరచూ ఏదో ఒక దుర్మార్గమైన ముసుగు వేసుకుంటూంటాడు (పిల్లల్ని చెరిచేవాళ్ళూ, పిచ్చితనపు అంచుల్లో వున్నవాళ్ళూ,
హంతకులూ); లేదంటే అమాయకమైన పాత్రల్ని తెచ్చి
క్రూరమైన, ప్రమాదకరమైన, కత్తిమొన అంచున
అస్థిమితంగా తూలే ప్రపంచాల్లోకి నెడుతూంటాడు. ఆ ప్రపంచాలకు అగాథాల ఆకర్షణేదో ఉంటే
ఉండొచ్చుగాక, కాని స్థిమితమైన మనసుతో వాటిల్లో మనల్ని మనం
ఊహించుకోలేం. అసలు మనకే గనక పుస్తకాల్లోని కాల్పనిక ప్రపంచాల్లో దూరిపోయి ఓ భాగంగా
మనగలిగే అవకాశమే వస్తే, నేను మాత్రం ఏం ఆశ పెట్టినా నబొకొవ్
సృష్టించిన అలాంటి ప్రపంచాల్లోకి అడుగుపెట్టాలని కోరుకోను. కానీ “ది గిప్ట్” సంగతి
వేరు. ఈ సందర్భంలో నబొకొవ్ వేసుకున్న ముసుగు ఒక కళాకారునిది. అది కూడా ఆయన
జీవితానికీ, స్వీయవ్యక్తిత్వానికీ చేరుగానున్న పాత్ర.
కాబట్టి ఒక కళాకారునిగా తాను చుట్టూ ప్రపంచాన్ని ఏ మార్దవంతో ఎంత సమ్మోహనభరితంగా
స్వీకరిస్తాడో అదే మార్దవాన్ని, అదే సమ్మోహనత్వాన్నీ ఆ
కాల్పనిక ప్రపంచానికీ ఆపాదిస్తాడని తెలుసు. అందుకే, ఈ
పుస్తకం నాదాకా రాకముందే నాకు నచ్చుతుందని అర్థమైపోయింది. చదివాకా ఇప్పుడు
నచ్చటమంటే మళ్ళీ అలా ఇలాక్కాదు నా సామిరంగా! నేను ఓ అక్షరంగానో, అదీ వీలుకాకపోతే ఓ సెమీకోలన్‌గానో, కామాగానో
మారిపోయి ఈ పుస్తకపు పేజీల్లో చేరి స్థిరపడిపోవాలనేంతగా నచ్చింది. లేదా, నన్ను ఆవరించి వున్న ప్రపంచమంతా మంచుబొమ్మలా కరిగి నీరైపోయి, బదులుగా ఈ పుస్తకంలోని ప్రపంచం వచ్చి నా చుట్టూ పేరుకుపోతే
బాగుండుననిపించేంతగా నచ్చింది. ఒకడికి ప్రాణప్రదమైన విలువలు వాస్తవప్రపంచపు వేస్ట్‌బాస్కెట్‌లో
కనిపిస్తూన్నపుడు, వాటికి పట్టం కట్టేది కల్పనాప్రపంచమైనా
సరే, వాడు అక్కడి పౌరసత్వానికి ఆశ పడటం సహజం. ఈ పుస్తకంపై నా
ఇష్టానికి ఇంకో దృష్టాంతమేమిటో చెప్తాను: మొన్న క్రాస్‌వర్డ్ బుక్‌షాప్‌లో నా
నెలవారీ పుస్తకాల పచారీ చేస్తుంటే ఈ పుస్తకపు ప్రతి ఒకటి కనిపించింది. నా దగ్గర
ఒకటి వున్నా సరే, ఏడొందలు పెట్టి మళ్ళా కొనకుండా
నిభాయించుకోలేకపోయాను. ఇంకో మూణ్ణాలుగు కాపీలున్నా కొనేసేవాణ్ణేమో. అమీర్‌పేట
చౌరస్తాలో కంప్యూటర్ సంస్థల వాళ్ళు కరపత్రాలు పంచుతారే, అలా,
ఎక్కడైనా “కవుల కూడలి” లాంటిదేమన్నా వుంటే అక్కడ నిల్చొని వచ్చేపోయే
ప్రతీ కవి చేతిలోనూ ఈ పుస్తకపు ప్రతినోదాన్ని కుక్కేసేవాణ్ణి. – హ్మ్! నాకు తెలుసు, ఇలాంటి వాక్యాల్తో పనికాదని,
వాక్యాల రాశి పెంచినంత మాత్రాన అది వస్తువులో వాసిని రుజువు
చేయలేదని, పుస్తక పరిచయం అంటే పుస్తకం ఎంత బాగుందో చెప్పడం
కాక ఎలా బాగుందో చెప్పడమనీను. కాబట్టి, కాస్త తగ్గి, ఆ ప్రయత్నంలో పడతాను.
ఇప్పుడే ఇది చదువుతున్న పాఠకుల ముందు చిన్న “స్పాయిలర్
అలెర్ట్” లాంటిది ఉంచడం మంచిదేమో. ఈ వ్యాసం ముఖ్యోద్దేశం “ది గిప్ట్” నవల
మొదటిసారి చదవబోయే పాఠకులకు కాస్త గ్రౌండ్ వర్క్ లాంటిది సిద్ధం చేసి వుంచడం. ఇది
మీలో కుతూహలం కలిగించే బాపతు పుస్తకమే అయితే ఈ పాటికే కలిగించగలిగి వుండాలి.
అలాకాని పక్షంలో ఇక ముందుకెళ్ళి చదివినా లాభం లేదు. ఒకవేళ మీలో ఎవరిలోనన్నా
ఈపాటికే కుతూహలం కలిగి, “ఎటూ
చదవబోయే పుస్తకానికి కథ తెలుసుకోవడం పఠనానుభవాన్ని పాడు చేయదా” అంటారా, అలా అనుకున్నా ఇక్కడితో చదవటం ఆపేయచ్చు. ఆపేసే ముందు మీకో వివరణ అవసరం:
నబొకొవ్ విషయంలో పుస్తకాల కథాకమామీషు ముందే తెలిసినా, వాటిని
ఆనందించడంలో అది ఏమాత్రం అడ్డుకాబోదు. వస్తువుతోగాక విధానంతోనే రచన రుచి మప్పించగల
రచయితల కోవకు చెందుతాడు నబొకొవ్. ఆయన రచనల్లో వస్తు ప్రాధాన్యత చాలా తక్కువ.
ఉదాహరణకు తన “Laughter in the dark” నవలలో మొదటి పేరాలోనే
మొత్తం కథ ఇలా చెప్పేస్తాడు:
Once upon a time
there lived in Berlin, Germany, a man called Albinus. He was rich, respectable,
happy; one day he abandoned his wife for the sake of a youthful mistress; he
loved; was not loved; and his life ended in disaster.
This is the
whole of the story and we might have left it at that had there not been profit
and pleasure in the telling; and although there is plenty of space on a
gravestone to contain, bound in moss, the abridged version of a man’s life,
detail is always welcome.
అవును, నబొకొవ్ విషయంలో వివరాలకు ఎప్పుడూ
స్వాగతమే. “Caress the detail, the divine detail” అంటాడు
ఆయనే ఎక్కడో. పుస్తకాల నుంచి స్వీయవిలువల సమర్థనో, విషయ
సంగ్రహణో, జ్ఞానసముపార్జనో, జీవిత
సోపానాల ఆరోహణకు ప్రేరణో, తమనీ తమ జీవితాల్నీ ప్రతిఫలించే
పాత్రలతో సన్నివేశాలతో అనుకంపనో మాత్రమే ఆశించే పాఠకవర్గానికి నబొకొవ్ పుస్తకాలేవీ
అంత సులభంగా మింగుడుపడకపోవచ్చు. అందుకే–ఇటొచ్చి దీన్ని
చదివిన పాఠకులందరి చేతా వెంటనే కిందున్న ఫ్లిప్‌కార్ట్ లింకు నొక్కించేసి, వెంటనే పుస్తకం కొనిపించేయాలన్న పేరాశతోనే ఇదంతా రాస్తున్నప్పటికీ–సాటి పాఠకునిగా వాళ్ళ జేబు సంక్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని, కొంచెం గీరగా ధ్వనించినా సరే, ఓ నిజాన్ని ఇప్పుడే
చెప్పేస్తున్నాను: “ద గిప్ట్” నవల అందరికీ కాదు; ఇది కవులకు
మాత్రమే. కవులంటే మళ్ళా కవిత్వం రాసి సంపుటాలు అచ్చువేయించుకునే వాళ్ళని కాదు;
కవిత్వాన్ని జీవించటం తెలిసినవాళ్ళకి, రోజువారీ
జీవితంలో కవిత్వాన్ని చదవగలిగిన అందరికీ, చుట్టూ ప్రపంచంలో
కవిత్వాంశకు కళ్ళింకా మూసుకుపోని ప్రతి ఒక్కరికీ.
మేం కవులమూ కాదు పాడూ కాదు, ఇలాంటి ముదలకింపులుంటాయని ముందే
తెలిస్తే మొదట్లోనే చదవడం ఆపేసేవాళ్ళం కదా, ఇందాకా చదువుతూ
వచ్చినందుకు మాకు దక్కిందీ లేదు పాడూ లేదన్నమాట; అని చికాకు
పడేవాళ్ళు కొంతమంది ఉండచ్చు. అలాంటి వాళ్ళకు నష్టపరిహారంగా–సూక్ష్మవివరాల్లోనే
అసలు మజా వుందన్న నబొకొవ్ సూత్రాన్ని అయిష్టంగానే పక్కనపెట్టి–నవల ఇతివృత్తాన్ని వీలైనంత బండగా కుదించి క్రింద ఇస్తున్నాను:
కథా సంక్షిప్తం:
ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే ఈ కథ విధిరాత గురించి; జీవితంలో పైకి కనిపించే గజిబిజి
గందరగోళం వెనుక అంతర్లీనంగా విధి అల్లే పద్ధతైన అల్లిక గురించి (తెలుగులో “విధి”
అనే పదం చాలా అనవసరపు అర్థ భారాన్ని మోస్తోంది. కాబట్టి నేను దాన్ని “fate”
అనే ఇంగ్లీషు పదానికి బదులుగా వాడుతున్నానని చెప్పటం అవసరం).
వర్తమానంలో మనకు జీవితం ఎటుపోతోందో, ఏమవుతోందో ఎప్పుడూ
అంతుపట్టదు. ఎంతకీ చిక్కుతెగని దారపు కండెలాగా చిర్రెత్తిస్తుంది. అదే వర్తమానం
గతంగా మారి మూలపడ్డాకా మాత్రం, వెనుదిరిగి చూసుకుంటే,
నెమ్మది నెమ్మదిగా ఒక అమరిక ప్రస్ఫుటమవుతూ వస్తుంది; ఒక నమూనా పైకి తేలుతుంది. ఇక్కడ కథానాయకుడు ఫియొదొర్ కూడా అలానే తన
జీవితంలో ఓ ముఖ్యమైన మూడేళ్ళ కాలాన్ని వెనుదిరిగి అవలోకించుకుంటాడు. అందులో విధి
గీసిన ఓ పద్ధతైన అల్లికను పసిగడతాడు. ఈ మూడేళ్ళలో అతను ఒక అనామక కవిగా మొదలుకొని
సాహితీలోకం దృష్టిని తనవైపు తిప్పుకున్న రచయితగా ఎలా అభివృద్ధి చెందాడూ, అతని రచన ఓ మోస్తరు నాణ్యత గల కవిత్వం నుంచీ (అతని మాటలే ఇవి) అద్భుతమైన
స్పష్టత గల వచనం వరకూ ఎలా పరిణతి చెందిందీ, అతని జీవితం
ఒంటరితనం నుంచీ భాగస్వామ్యం వైపు ఎలా మేలిమలుపు తిరిగిందీ అన్నది అతని
అక్షరాల్లోనే మనకు తెలుస్తుంది. నవల చివర్లో తన ప్రేయసి జినాతో అంటాడు ఫియొదొర్,
తనకు జీవితంలో విధి అందించిన అన్ని బహుమానాల పట్లా కృతజ్ఞత
తెలుపుకుంటూ ఒక నవల రాయబోతున్నానని. అది వేరే ఏదో కాదు, మన
చేతుల్లో వున్న ఈ “ద గిప్ట్” నవలే. ఫియొదొర్ స్వయంగా తన కథ మనకు చెప్తాడు (కాసేపు
ఉత్తమపురుషలో, కాసేపు ప్రథమపురుషలో). ఫియొదొర్‌కు విధి
ద్వారా అందిన అన్ని బహుమానాల్లోకీ అత్యంత విలువైనది అతని ప్రేయసి జినా. అందుకే
తాను రాస్తున్న నవల నిర్మాణానికి ఆమెనే కేంద్రబిందువుగా చేస్తాడు. మొదటిసారి
చదివినపుడు ఆమె కేవలం నవలలో ఓ పాత్ర మాత్రమే అనిపించినా, శ్రద్ధగా
చదివితే నవల మొత్తం ఆమె చుట్టూనే అల్లుకొని ఉందని అర్థమవుతుంది. చివర్లో ఓ చోట
తాను రాయబోతున్న (మనం ప్రస్తుతం చదువుతున్న) నవల ప్రణాళికని మొత్తం జినాకి
వివరిస్తాడు ఫియొదొర్. అదంతా ఓపిగ్గా విన్న జినా, “సరే కాని,
ముందు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో చెప్ప”మంటుంది. అసలీ నవలే
ఒక “ప్రేమ ప్రకటన” (డిక్లరేషన్ ఆఫ్ లవ్) లాంటిదంటాడు ఫియొదొర్.
పుస్తకం తెరవగానే మనం 1926వ సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తేదీ మధ్యాహ్నం జర్మనీ రాజధాని
బెర్లిన్ నగరంలోకి వచ్చిపడతాం. పడ్డామో లేదో ఒక ఇరవయ్యారేళ్ళ రష్యన్ రచయిత
ఫియొదొర్ మన చేయి పుచ్చుకుని తన కథ చెప్తూ లాక్కుపోతాడు. ఇలా లాక్కుపోతున్నప్పుడు,
అసలు ఒక రష్యన్ రచయిత జర్మనీలో ఏం చేస్తున్నాడూ? అన్న అనుమానం మనకు రాకుండాపోదు. కాబట్టి నిదానంగా నవల నేపథ్యం కూడా
చెప్పుకుని ముందుకు వెళదాం. చరిత్ర చూచాయగా తెలిసిన వారెవరికైనా 1917 రష్యన్ (బోల్షెవిక్) విప్లవం గురించి తెలిసే వుంటుంది. రష్యాని మూడువందల
యేళ్ళ పాటు పాలించిన, జార్లు (tsars) అని
పిలవబడే, చక్రవర్తుల నిరంకుశ పాలన ఈ విప్లవ ఫలితంగా అంతమైంది;
సామ్యవాద పరిపాలన ఆరంభమైంది. అంతమాత్రాన సామ్యవాదుల పాలనలో రష్యా
యేమీ “పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే” అని పాడుకోలేదు.
నియంత పోయి నియంత వచ్చే టాంటాంటాం అన్నట్టు జార్ నికొలస్ పోయి లెనినూ, స్టాలినూ వచ్చారు; జనం ఏ సుత్తైతేనేం నిలువునా
శిలువేయించుకోవడానికని నిట్టూర్చారు. ఈ విప్లవం పేరిట చెలరేగిన దొమ్మీల్లో ఆస్తులు
కొల్లగొట్టబడి, అదృష్టం కొద్దీ ప్రాణాలేవన్నా మిగిలితే వాటిని
చిక్కబుచ్చుకుని ఇంగ్లాండు, ఫ్రాన్సు, జర్మనీ
తదితర దేశాలకు వలస వచ్చేసిన రష్యన్ శరణార్థులు సుమారు ముప్ఫై లక్షలమంది దాకా
వున్నారు. అలాంటి ఓ శరణార్థి కుటుంబానికి చెందిన వాడే మనకు కథ చెప్తున్న రచయిత
ఫియొదొర్. ఇతని బాల్యం రష్యాలో సుసంపన్న వాతావరణంలో ప్రేమానురాగాల మధ్యా, ప్రకృతి సౌందర్యం మధ్యా ఏ లోటూ లేకుండా గడుస్తుంది. తండ్రి ఓ ప్రముఖ
ప్రకృతి పరిశోధకుడు. సీతాకోక చిలుకల అధ్యయనం (లెపిడోప్టెరా)లో అతనికి ప్రత్యేక
నైపుణ్యం వుంటుంది. తన పరిశోధనలకు నమూనాలు సేకరించడానికి తరచూ మధ్య ఆసియా అంతా
సుదీర్ఘమైన యాత్రలు చేస్తూంటాడు. 1916లో, ఫియొదొర్‌కు పదహారేళ్ళుండగా, అలాగే ఒక యాత్రకు
వెళ్ళి ఇక తిరిగి రాడు. ఆయన బతికే వున్నాడో చనిపోయాడో కూడా ఎవరికీ ఆచూకీ అందదు.
మరోపక్క విప్లవం పెట్రేగిపోతూంటుంది. వీళ్ళ ఆస్తులు పరాధీనమైపోతాయి. ఇక రష్యాతో
రుణం తీరిపోయిందని అర్థమైపోతుంది. ఫియొదొర్ తనకు మిగిలిన కుటుంబమైన తల్లీ సోదరిలతో
కలిసి ప్రవాసం వచ్చేస్తాడు. వాళ్ళిద్దరూ పారిస్‌లో మకాం పెడతారు. ఫియొదొర్ ఒక్కడూ
మాత్రం బెర్లిన్‌లో నివసిస్తూంటాడు. రచయితగా పేరు తెచ్చుకోవాలని అతని ఆశ. ఇటీవలే,
తన బాల్యస్మృతుల్ని ఇతివృత్తంగా తీసుకు రాసిన ఓ యాభై కవితల్ని
కూర్చి, “పొయెమ్స్” పేరిట సొంత ఖర్చుతో పుస్తకంగా
అచ్చువేయిస్తాడు కూడా.
1926 ఏప్రిల్ ఒకటిన ఫియొదొర్ ఓ గదిలో
కొత్తగా అద్దెకు దిగడంతో కథ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం సిగరెట్లు కావాల్సొస్తే
కొనడానికి గదిలోంచి కిందకు వస్తాడు. క్రింద ఒక వేను ఆగి వుంటుంది. పక్కనే ఇద్దరు
దంపతులు నిలబడి కూలీల చేత వేనులోంచి సామాను దింపిస్తుంటారు. ఈ దంపతులు కూడా అదే
రోజు ఫియొదొర్ గదికి పై వాటాలో అద్దెకు దిగుతూన్నారు. అతను ఈ తతంగాన్ని
గమనించుకుంటూ, ఇంకా అలవాటు కాని వీధుల్ని కవిగా తనకి మాత్రమే
ప్రత్యేకమైన దృష్టితో పరిచయం చేసుకుంటూ, సిగరెట్ షాపు వైపు
వెళతాడు. అక్కడ తన బ్రాండ్ లేకపోవటంతో ఓ సబ్బు మాత్రం కొనుక్కుని గదికి చేరతాడు.
లోపలికి రాగానే ఇంటి యజమానురాలు ఏదో ఫోన్ వచ్చింది రమ్మంటుంది. ఫోన్ చేసింది
అలెగ్జాండర్ చెర్నిషెవ్‌స్కీ అనే పరిచయస్తుడు. ఫియొదొర్‌కి మొత్తం బెర్లిన్‌లో
కాస్తో కూస్తో సన్నిహితమైన పరిచయమున్నది ఈ చెర్నిషెవ్‌స్కీ కుటుంబంతోనే. ఇప్పుడీ
ముసలాయన ఫోన్‌లో చెప్పిన వార్త అతణ్ణి ఆనందపు సుడిలో ముంచేస్తుంది. ఫియొదొర్ కవితల
పుస్తకాన్ని గొప్పగా ప్రశంసిస్తూ ఒక పత్రికలో సమీక్ష పడిందని, ఎవరు రాసారో ఏం రాసారో అప్పుడే చెప్పననీ, సాయంత్రం
తమ ఇంట్లో ఏర్పాటు చేసిన సాహితీగోష్టికి హాజరై తెలుసుకోవాల్సిందిందేననీ ఊరించి
ఫోన్ పెట్టేస్తాడాయన. తన రచనకు గుర్తింపు దొరికిందన్న సంబరం ఫియొదొర్‌ను
నిలవనీయదు. వెంటనే గదిలోకి వెళ్ళి తన కవితల పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుంటాడు. ఈ
సారి ప్రతీ కవితనూ తన దృష్టికోణంలోంచి కాక, ఇంకా ఎవరో కూడా
తెలియని తన అజ్ఞాత సమీక్షకుని దృష్టికోణాన్ని ఊహించుకుంటూ చదువుతాడు. ఇక్కడ ఆ
పుస్తకంలోని కొన్ని కవితల్ని మనమూ ప్రత్యక్షంగా చదవగలుగుతాం. కాలమనే శిల్పి
బాల్యపు ఉలితో అతని మనోఫలకంపై మరిచిపోవద్దంటూ చెక్కిన కొన్ని సన్నివేశాల్ని,
ఆ చెక్కినప్పటి స్పష్టతతోనే, మనమూ
చూడగలుగుతాం. చిన్నప్పుడు ఆడుకుంటూంటే సోఫా కిందకు దొర్లి కనిపించకుండా పోయిన బంతి,
అక్కా తనూ బొమ్మ పిస్తోళ్ళతో చేసిన యుద్ధాలు, రాత్రుళ్ళు
నిద్ర పట్టక ఇద్దరూ పొడుపు కథల పోటీలు పెట్టుకోవడం, పిప్పి
పన్ను చూపించుకోవడానికి దంతవైద్యుని దగ్గరకు వెళ్ళడం, పబ్లిక్‌పార్కు
దగ్గర బుడగలమ్మేవాడు, మంచులో స్లెడ్జ్ బళ్ళతో పోటీలు,
జ్వరంతో తను ఒళ్ళు తెలియకుండా పడుకోవడం, అమ్మ
ఊరడింపులు, తొలిసారి సైకిలు తొక్కడం, చాన్నాళ్ళ
తర్వాతెప్పుడో ఇల్లు ఖాళీ చేస్తూ సామాను తరలిస్తున్నప్పుడు సోఫా కింద నుంచీ
బయటపడిన బంతి ... ఇలాంటి బాల్యస్మృతులే ఈ కవితల ఇతివృత్తాలు. ఫియొదొర్ సాయంత్రం
దాకా ఈ పుస్తకం చేతపుచ్చుకుని తీపి ఊహల్లో తేలియాడుతూనే వుంటాడు. ఇక చీకటి
పడుతూందనగా ఉరుకులు పరుగుల్తో చెర్నిషెవ్‌స్కీల ఇంటికి చేరుకుంటాడు. తీరా
అడుగుపెట్టాకా నిరాశ వెకిలి నవ్వుతో ఎదురొస్తుంది. అసలు తన పుస్తకంపై సమీక్షేమీ
రాలేదనీ, అది తన మీద సరదాకి వేసిన ఏప్రిల్ ఫూల్ జోకనీ
తెలుస్తుంది. ఆశాభంగాన్ని ఎలాగో దిగమింగుకుంటాడు. అక్కడ అప్పటికే ఫియొదొర్‌తో పాటూ
ఇంకా కొందరు అతిథులుంటారు. విందూ కబుర్లూ జోరుగా సాగుతూంటాయి. స్వతహాగా ఇలాంటి
మేధావి చర్చల పట్ల అనాసక్తి ఎక్కువ వున్న ఫియొదొర్ శారీరకంగా వాళ్ళ మధ్యన
కూర్చుంటాడన్న మాటే గానీ, మనసుని మాత్రం తన
కల్పనాప్రపంచానికి అప్పగించేస్తాడు. ఇలా మర్యాదకు భరించాల్సిన వ్యక్తుల సాహచర్యంలో
కాలక్షేపానికి అతను ఓ కసరత్తు అలవాటు చేసుకుంటాడు. ఆయా క్షణాల్లో అవతలి వ్యక్తుల
అంతరంగపుటాలోచనలు ఏ రీతిన సాగుతున్నాయో అంచనా కట్టే ప్రయత్నం చేస్తూంటాడు.
ప్రస్తుతం ఈ కసరత్తు అలెగ్జాండర్ చెర్నిషెవ్‌స్కీ మీద ప్రయోగిస్తాడు. ఇందులో
భాగంగా, ఆత్మహత్య చేసుకుని మరణించిన చెర్నిషెవ్‌స్కీ కొడుకు “యాషా”
ప్రేతాత్మ రూపంలో తమ మధ్యనే కూర్చున్నట్టు ఊహిస్తాడు. యాషా ఒక యువకవి. వింటానికి
వింతగా తోచే ఓ ముక్కోణపు ప్రేమకథ రెండేళ్ళ క్రితం అతని మరణానికి కారణమవుతుంది.
అప్పటినుండీ అతని తండ్రి అలెగ్జాండర్ చెర్నిషెవ్‌స్కీ అప్పుడప్పుడూ మానసిన సంతులనం
కోల్పోతూంటాడు; కొడుకు ఆత్మ ప్రేతంగా మారి తన చుట్టూనే
తిరుగుతుందని భ్రమిస్తూంటాడు. స్థిమితంగా వున్నప్పుడు మాత్రం కొడుకు స్మారకార్థం
అన్నట్టూ యిలా ఇంట్లో సాహితీగోష్టులు నిర్వహిస్తుంటాడు. మరోప్రక్క తల్లేమో తన
కొడుకు జీవితంపై ఒక కథ రాసిపెట్టమని ఫియొదొర్‌ని మొహమాట పెడుతూంటుంది. అసలు యాషా
పోలికల్తో వున్నందునే ఈ దంపతులు ఫియొదొర్‌ని అంతగా ఆదరిస్తారు. అతను కూడా వీరిని
బాగా అభిమానిస్తాడు. అయితే అతనికి యాషా కవిత్వం పట్ల సదభిప్రాయం వుండదు; యాషా మరణానికి కారణమైన పరిస్థితుల పట్ల కూడా ఏ సానుభూతీ వుండదు. కాబట్టి
మాట దాటవేస్తుంటాడు. ఇక్కడ మనం యాషా ప్రేమనూ, అతని
ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులనూ ఒక పెద్ద కథలా వివరంగా తెలుసుకుంటాం: ఫియొదొర్
చదివిన బెర్లిన్ విశ్వవిద్యాలయంలోనే యాషా కూడా చదువుతాడు. అతను కాస్త అతి
సున్నితత్వం కలిగిన యువకుడు. కాలేజీలో అతనికి గల స్నేహ బృందం ఇద్దరే ఇద్దరు.
రుడాల్ఫ్ అనే యువకుడు, ఓల్యా అనే యువతి. ఎప్పుడూ అట్టహాసంగా,
ఆడంబరంగా ఉండే రుడాల్ఫ్ పట్ల యాషా ఆకర్షితమవుతాడు. “నాకు రుడాల్ఫ్‌ఆత్మతో
అనుబంధం ఏర్పడిపోయింది” అంటూ డైరీలో ప్రేమరాతలు రాసుకుంటాడు కూడా. కానీ రుడాల్ఫ్‌కు
ఈ ప్రకృతి విరుద్ధమైన అనురాగం నచ్చదు. పైగా అతను ఓల్యాతో ప్రేమలో వుంటాడు.
విషయాన్ని మరీ గందరగోళ పరచడానికా అన్నట్టు, ఓల్యా యేమో నేను
యాషాని ప్రేమిస్తున్నానంటుంది. ఈ వింత ప్రేమ త్రికోణం కారణంగా క్రమంగా వీళ్ళ స్నేహ
కుడ్యం బీటలు తీస్తుంది. ఈ పీటముడి ఎలా చిక్కుతీయాలో వాళ్ళకు అర్థం కాదు. ముగ్గురూ
ఈ మనసు ఉద్వేగాల్లో పడి బుద్ధికి చోటివ్వడం ఎప్పుడో మానేస్తారు. మాటల కందని మురికి
మబ్బుల్లో తేల్తూంటారు. ఒకసారి రుడాల్ఫ్ తాగి ఓల్యాని బలాత్కరించబోతే యాషా వచ్చి
అడ్డుకుంటాడు. ఈ సంఘటనతో పరిస్థితి మరీ ఎబ్బెట్టుగా తయారవుతుంది. ముగ్గురిలోనూ బాధ,
లజ్జ, అసహనాలు పెరిగిపోతాయి. చివరకు తామంతా
కట్టగలిసి ఆత్మహత్య చేసుకోవడమే దీనికి విరుగుడన్న నిశ్చయానికి వస్తారు. మరుసటి
రోజు రాత్రి ఓ రివాల్వర్ చేతబుచ్చుకుని నగర పొలిమేరల్లోని అటవీ ప్రాంతానికి
వెళ్తారు. అనుకున్న ప్రకారమే ముందు యాషా తనను తాను కాల్చేసుకుంటాడు. అయితే యాషా
చనిపోగానే సందు చూసుకుని రుడాల్ఫ్‌మనసు మారిపోతుంది. హఠాత్తుగా తాను చావాల్సిన
అవసరమేం కనిపించదు. ఓల్యా చావడానికి సిద్ధ పడినా, రుడాల్ఫ్
తుపాకీ దాచేయడంతో ఏమీ చేయలేకపోతుంది. అర్థరాత్రి అయ్యాక (ఆ రాత్రే, అక్కడే వాళ్ళిద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారని తర్వాత పుకారు), యాషా శవాన్ని అక్కడే వదిలి ఇద్దరూ నగరంలోకి వచ్చేస్తారు. పోలీసులు
ఆత్మహత్యగా కేసు మూసేస్తారు. అందరి జీవితాలూ ముందుకు సాగిపోతాయి, యాషా మాత్రం జ్ఞాపకంగా మిగిలిపోతాడు. మితిమీరిన హృదయోద్వేగాలూ, మిస్‌ప్లేస్డ్ ప్రేమలూ ఎంతటి బాధాకరమైన పర్యవసానాల్తో ముగుస్తాయన్న దానికి
యాషా జీవితం తార్కాణమవుతుంది. యాషా మరణం అతని తండ్రిపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది.
అప్పటినుండీ కొడుకు ప్రేతాత్మ తన చుట్టూనే తిరుగుతూ, తనను
చీకటిలోకంలోకి లాగేయాలని చూస్తుందని భ్రమిస్తూంటాడు. ఇదీ క్లుప్తంగా యాషా
వృత్తాంతం! ఇది ముగిసాకా, మనం మళ్ళీ అలెగ్జాండర్ చెర్నిషెవ్‌స్కీ
ఇంట్లో జరుగుతున్న సాహితీగోష్టి సన్నివేశానికి తిరిగి వచ్చేస్తాం. గోష్టి ముగిసిన
తర్వాత ఫియొదొర్ ఒంటరిగా కాళ్ళీడ్చుకుంటూ తన కొత్త గదికి బయల్దేరతాడు. ఒకప్రక్క
ఇంకా అలవాటుకాని గదిలో ఒక్కడూ గడపవలసిన రాత్రి, మరోప్రక్క
రేపు గడవడానికి సరిపడా జేబులో డబ్బుల్లేకపోవడం, ఇంకోప్రక్క
అరిగిపోయిన బూటు పగుళ్ళలోంచీ దూరి పాదాన్ని వణికిస్తున్న చలి, వీటన్నింటినీ మించి సాయంత్రమంతా తాను ఎంతో ఆశగా ఊహించుకున్న పుస్తక సమీక్ష
ఇప్పుడో అబద్ధంగానే మిగిలిపోవడం... ఇవన్నీ కట్టగలిసి అతణ్ణి
దిగాలుపరుస్తాయి. గోరుచుట్టు మీద రోకటి పోటన్నట్టుగా, తీరా
గది దాకా చేరే సరికి తాళాలు లోపలే మర్చిపోయాడని తెలుస్తుంది. ఒక్కసారిగా నిస్సహాయత
ముప్పిరిగొంటుంది. విద్యుద్దీపాల వెలుగులో ఖాళీ వీధి అతని ఒంటరితనాన్ని మరింత
కొట్టొచ్చేట్టు ఎత్తిచూపుతుంది. కుటుంబానికి దూరంగా వున్నది చాలక, ఇలా దేశం కాని దేశంలో పరాయి పరిసరాల మధ్య, పరాయి జనం
మధ్య, పరాయి భాష మధ్య అనునిత్యం ఏకాకి జీవితం గడపవలసి రావడం
అతనిలో మాతృభూమి రష్యా పట్ల ఆపేక్షను ఉధృతం చేస్తుంది. ఉన్నట్టుండి అతణ్ణి ఏదో
సృజనావేశం పూనుతుంది. అక్కడే పేవ్‌మెంట్ మీద పచార్లు చేస్తూ రష్యా మీద ఓ కవిత
అల్లడం ప్రారంభిస్తాడు. అదృష్టం కొద్దీ అప్పుడే, పొద్దున్న
పైవాటాలో అద్దెకు దిగిన లోరెంజ్ దంపతుల్లో భార్య మార్గరీటా లోరెంజ్ ఏదో పని మీద
వీథి తలుపు తెరుస్తుంది. అతనికి గదిలోకి దారి దొరుకుతుంది. ఆ రాత్రి తెలవార్లూ
మేల్కొని కవిత పూర్తి చేస్తాడు. రోజులు గడుస్తాయి. ఫియొదొర్ కవితల పుస్తకం “పొయెమ్స్”
మాత్రం ఎవరి దృష్టినీ ఆకట్టుకోలేకపోతుంది. దానిపై ప్రశంస మాట అటుంచి దాని ప్రసక్తి
కూడా ఏ పత్రికలోనూ రాదు (ఒక పత్రికలో చిన్న ప్రస్తావన వచ్చినా అందులో ఉదహరించిన
ఒక్క కవితా భయంకరమైన అచ్చుతప్పుతో వుంటుంది). అచ్చు వేయించిన ఐదొందల ప్రతుల్లోనూ
నాలుగొందల పైచిలుకు పుస్తక పంపిణీదారు కొట్టంలోనే మగ్గిపోతూంటాయి. ఫియొదొర్ మాత్రం
ఈ నిరాశను గతంలోకి నెట్టి రాస్తూనే వుంటాడు. ఈ సంవత్సరం శరత్కాలంలో అతను మరో
సాహితీగోష్టికి హాజరవుతాడు. ఇందులో భాగంగా ఓ రచయిత తన తాత్త్విక నాటకం ఒకదాన్ని
అందరికీ చదివి వినిపిస్తాడు. దాని భావమేంటన్నది ఎవరికీ బోధపడదు. అందరూ లోలోపల
విసుక్కుంటారు. నాటక పఠనం అయిన తర్వాత అక్కడి అతిథుల్లో ఒక లాయరు ఫియొదొర్‌కు ఒక
అనువాదపు ఆఫర్ గురించి చెప్తాడు. తన లావాదేవీలకు సంబంధించి కొన్ని పత్రాలను జర్మన్‌లోకి
అనువదించి పెట్టాలనీ, ఇప్పటికే ఈ పనిలో వున్న ఒక అమ్మాయికి
సాయపడాలనీ అడుగుతాడు. ఫియొదొర్ అప్పటికి సరేనంటాడు. ఈ గోష్టికి హాజరైన ఆహూతుల్లో
కొంచెయెవ్ అనే ఒక యువకవి కూడా వుంటాడు. ఫియొదొర్ ఇతని కవిత్వాన్ని బాగా
అభిమానిస్తాడు. ఇతణ్ణి తనకు పోటీదారుగా భావించి కాస్త అసూయపడుతూంటాడు కూడా.
ఇద్దరికీ ఇప్పటివరకూ పరిచయం మాత్రం వుండదు. ఈ గోష్టి ముగిసిన తర్వాత తొలిసారి
ఇద్దరూ కలిసి ఇళ్ళకు నడక మొదలుపెడ్తారు. దారిలో రష్యన్ సాహిత్యం గురించి చాలా
భావోద్వేగాలతో చర్చించుకుంటారు. కానీ సంభాషణ పూర్తయ్యాకా మనకు తెలుస్తుంది: అదంతా
కల్పితమనీ, వాస్తవంలో వారి మధ్య అలాంటి సంభాషణ జరగనేలేదనీ,
కొంచెయెవ్‌తో అలా మాట్లాడాలన్న ఆశ ఎప్పుడూ తీరని ఫియొదొర్ తన ఈ
నవలలో ఇలా కల్పిత సంభాషణ ఇరికించడం ద్వారా ఆ ఆశ తీర్చుకుంటున్నాడనీను. దీంతో మొదటి
అధ్యాయం ముగుస్తుంది.
ఇదే సంవత్సరం డిసెంబరులో క్రిస్‌మస్ పండుగకు ఫియొదొర్
తల్లి, మూడేళ్ళ ఎడబాటు
తర్వాత, అతణ్ణి చూడటానికి పారిస్ నుంచి వస్తుంది. ఇద్దరిలో
ఎవరూ బయటికి ఏమీ చెప్పుకోకపోయినా, ఈ కలయిక ఆమెలో భర్త
జ్ఞాపకాల్నీ, అతనిలో తండ్రి జ్ఞాపకాల్నీ తిరగదోడుతుంది.
చాన్నాళ్ళ తర్వాత తల్లి సామీప్యమూ, ఈ మధ్యే మరోసారి
చదువుతున్న పుష్కిన్ వచనమూ కలిసి ఫియొదొర్‌లో ఒక సృజనాత్మక ప్రేరణను కలిగిస్తాయి.
అతనికి తండ్రి జీవితాన్ని గురించి రాయాలన్న ఆలోచన కలుగుతుంది. తల్లి రెండు
వారాలుండి పారిస్ తిరిగి వెళిపోయాక, ఈ రచనకు కావాల్సిన ముడి
సమాచారాన్నంతా సేకరించటం మొదలుపెడ్తాడు. ఉత్తరంలో ఈ నిర్ణయం చెపితే తల్లి కూడా
ప్రోత్సహిస్తుంది; కానీ తండ్రి అనే మమకారాన్ని విడిచిపెట్టి
రాయమంటుంది. సమాచారాన్ని సేకరించడంలో కొన్ని నెలలు గడిపిన తర్వాత, మరుసటి సంవత్సరం (1927) జూన్‌లో, రాయటం ప్రారంభిస్తాడు. మొదట తండ్రితో తన బాల్యానుభవాలూ, ఆయన బలమైన వ్యక్తిత్వం, సీతాకోకచిలుకల అధ్యయనం పట్ల
ఆయన తనలో కలిగించిన ఆసక్తులను గురించి రాస్తాడు. తర్వాత, తండ్రి
పరిశోధనా యాత్రల్ని అక్షరాల్లో ఆవిష్కరించటం మొదలుపెడతాడు. తూర్పు సైబీరియా
మొదలుకొని, పశ్చిమ చైనా, గోబీ యెడారి,
మంగోలియా, టిబెట్‌ల మీదుగా ఆయన చేసిన
యాత్రల్ని పుష్కిన్‌శైలిని తలపించే స్పటిక స్వచ్ఛమైన వచనంతో వర్ణిస్తాడు. ఫియొదొర్‌కు
సంబంధించినంతవరకూ ఈ రచన సృజనపరంగా మాత్రమే కాదు, మరోలా కూడా
అక్కరకొస్తుంది. ఫియొదొర్ తండ్రి యాభైయెనికిదేళ్ళ తన జీవితంలో ఇరవైయేళ్ళకు పైగా
కాలాన్ని ఇలా పరిశోధనా యాత్రల్లోనే గడుపుతాడు. కాబట్టి ఆయన జీవితచరిత్ర రాయటమంటే
దాదాపు ఆయన చేసిన యాత్రల ట్రావెలాగ్ లాంటిది రాయటమే. జనసమూహాల ఊరుకుపరుగులకూ,
ఇరుకు పరిధులకూ అతీతంగా విశృంఖలమైన ప్రకృతి మధ్య తన తండ్రి ఆసియా
యావత్తూ చేసిన ఈ యాత్రల్ని అక్షరీకరించగలిగాడంటే, ఫియొదొర్
ప్రస్తుతం తనను ఆవరించుకుని వున్న ఇరుకు బెర్లిన్ వాతావరణాన్నుంచీ కనీసం
మానసికంగానే అయినా విముక్తి పొందగలిగాడన్నమాటే. అందుకే, నిజానికి
తండ్రితో కలిసి తాను స్వయానా ఎప్పుడూ ఏ యాత్రలోనూ పాల్గొనకపోయినా, ఇలా జీవితచరిత్ర రాసే మిషతో కనీసం ఊహల్లో ఐనా ఆయనకు తోడుగా మధ్యఆసియా
మొత్తం చుట్టబెట్టే అవకాశాన్ని వినియోగించుకుంటాడు. అయితే ఎంతో ఉత్సాహంతో
మొదలుపెట్టిన ఈ రచన చివరకు ఏ పర్యవసానానికీ చేరని వృథా కసరత్తుగానే మిగిలిపోతుంది.
తన కల్పనాశక్తిని ఎంత అవధుల మేరకు నెట్టినా అది ఆయా ప్రదేశాలతో తన తండ్రికున్న
ప్రత్యక్షానుభవానికి సాటి రాలేకపోతోందనిపిస్తుంది. తండ్రే గనుక బతికి వుంటే,
తన ప్రయత్నంలో ఈ కృత్రిమత్వాన్ని హర్షించేవాడు కాదేమోననిపిస్తుంది.
తండ్రి జీవన్మరణాల పట్ల అనిశ్చితి కూడా మరో అడ్డంకిగా నిలుస్తుంది. సరిగ్గా
అప్పుడే గది ఖాళీ చేయాల్సిన అగత్యం కూడా కలగడంతో, ఇక ఈ రచనా
ప్రయత్నాన్ని పూర్తిగా విరమించుకుంటాడు. ఫియొదొర్‌కి గది వెతికిపెట్టడంలో
అలెగ్జాండర్ చెర్నిషెవ్‌స్కీ భార్య సహాయపడుతుంది. ఆమె ద్వారా ఒక రష్యన్ కుటుంబం తమ
ఇంట్లో ఒక గది అద్దెకిస్తున్నారన్న సంగతి తెలుస్తుంది. మొదట బద్దకించినా, చివరకు ఆమె బలవంతం మీద ఈ గది చూడటానికి వెళ్తాడు. ఆ సమయంలో యజమాని తప్ప
మిగతా కుటుంబం ఎవరూ ఇంట్లో వుండరు. మొదట్లో యజమాని అతి చొరవా, గది అమరికా అతనిలో కాస్త అయిష్టత కలిగిస్తాయి. కానీ ఓ లోపలి గది తలుపు
తెరిచినపుడు క్షణమాత్రం కుర్చీ మీద ఆరేసి కనిపించిన ఓ నీలం గౌను అతణ్ణి ఎందుకో
ఆకర్షిస్తుంది. 1928 ఏప్రిల్‌లో కొత్త గదిలో వచ్చి చేరతాడు
కొత్తగదిలో చేరిన రెణ్ణెల్ల తర్వాత (జూలైలో) ఫియొదొర్ ఓ
రోజు నిద్ర లేవడంతో మూడో అధ్యాయం ప్రారంభమవుతుంది. అతని గదినానుకుని ఉన్న బాత్రూమ్‌లో
ఇంటి యజమాని కూతురు గొంతుపుక్కిలిస్తున్న చప్పుడు అతణ్ణి మేల్కొలుపుతుంది. లేచిందే
తడవు సిగరెట్ వెలిగించి పక్క మీదే సాగిలబడి ఓ కవిత రాయటానికి ఉపక్రమిస్తాడు. ఈ
కవిత ఎవర్ని ఉద్దేశించి రాస్తున్నాడో మనకింకా తెలియదు. దాని వస్తువు ప్రేమ అనీ, అతనిలా ప్రేమ కవిత రాసి దాదాపు
పదేళ్ళపైనే అయిందనీ మాత్రం తెలుస్తుంది. అంటే రెండు - మూడు అధ్యాయాల మధ్య మనకు
తెలియకుండా గడచిన రెణ్ణెల్ల ఖాళీలోనే మన హీరో ఎవరితోనో ప్రేమలో పడిపోయాడన్నమాట.
అంతేకాదు, అతనీ మధ్య రాత్రుళ్ళు ఈ అజ్ఞాత ప్రేయసితో కలసి
బెర్లిన్ నగర వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడని, ఆమె కూడా
అతనిలానే జీవితాన్ని లౌకిక లంపటాల్లో గాక కలల్లోనూ, ప్రేమలోనూ
కొలిచేదనీ ఈ కవిత ద్వారా తెలుస్తుంది (చుట్టూ వచనంలో వచనంలా చక్కగా ఒదిగిపోయిన
కవిత). ఇక్కడ కథనాన్ని కాసేపు ఆపి ఫియొదొర్ తనకు బాల్యంలో కవిత్వం పట్ల అనురక్తి
ఎలా మొదలయిందీ, అప్పటి నుండి యిప్పటి వరకూ తన కవిత్వం ఏ
తీరున పరిణతి చెందిందీ వివరిస్తాడు. మధ్యాహ్నమయ్యాక కవిత రాసే ప్రయత్నం సగంలో ఆపి,
రోజూలాగే ఇంటి యజమాని కుటుంబంతో (భర్త, భార్య,
కూతురు) కలిసి భోజనానికి కూర్చుంటాడు. డైనింగ్ టేబిల్ దగ్గర కూతురు
తండ్రితో పెడసరంగా ప్రవర్తించడం గమనిస్తాం. భోజనానంతరం ఫియొదొర్ తన ట్యూషన్లు
చెప్పుకునే పని మీద బయటకు వెళతాడు. ఈ ట్యూషన్ల మధ్య కాస్త విరామం దొరికితే ఓ
రష్యన్ పుస్తకాల షాపుకి వెళతాడు. అక్కడో చెస్ పత్రికలో రష్యన్ సాహితీ విమర్శకుడూ,
సామ్యవాదీ అయిన నికొలాయ్ చెర్నిషెవ్‌స్కీ పై పడిన ఒక వ్యాసం అతణ్ణి
ఆకర్షిస్తుంది. (ఈ నికొలాయ్ చెర్నిషెవ్‌స్కీకీ, మొదట్లో
ప్రస్తావించిన అలెగ్జాండర్ చెర్నిషెవ్‌స్కీకీ పేరు ఒకటే అవడం తప్పించి వేరే ఏ
సంబంధ బాంధవ్యాలూ లేవు. ఒకరు చారిత్రక వ్యక్తి, మరొకరు
కాల్పనిక పాత్ర.) ఫియొదొర్ ఆ పత్రికను వెంట తెచ్చుకుని గదికి తిరిగి వస్తాడు.
అందులో వున్న చెస్ పజిల్స్ అన్నీ పూర్తి చేసేసరికి చీకటి పడుతుంది. ప్రేయసిని
కలిసే సమయం ఆసన్నమయింది. రోజూ తాము అలవాటుగా కలుసుకునే రైల్వే బ్రిడ్జి దగ్గరకు
వెళ్ళినిలబడతాడు. మళ్ళీ ఇక్కడ వచనం మనం ఆనవాలు పట్టేలోగానే కవితగా మారిపోతుంది.
పొద్దున్న అతను పక్క మీద పడుకుని కుస్తీ పట్టిన కవిత ఇప్పుడు పూర్తవుతుంది.
తిన్నగా ఈ కవితలోంచి నడిచి వచ్చినట్టు మన ముందుకు నడిచి వస్తుంది అతని ప్రేయసి
జినా. నిజానికి ఈ అధ్యాయంలో ఇదివరకూ రెండుసార్లు ప్రస్తావించిన ఇంటి యజమాని కూతురు
ఎవరో కాదు, జినానే. కానీ ఆమెను ఇలా కవిత ద్వారా అందంగా మన
ముందుకు తీసుకురావడం కోసం ఫియొదొర్ ఆమె పేరు ఎక్కడా ప్రస్తావించకుండా జాగ్రత్త
పడతాడు. ఈ అధ్యాయమే కాదు, నవల ప్రారంభం నుంచీ ఆమె అతని
దరిదాపుల్లోనే తచ్చాడుతోందనీ, అంతకుముందు రెండుమూడు
సందర్భాల్లో అతనికి దాదాపు పరిచయమయ్యేంత చేరువగా వచ్చిందనీ, అతనే తెలియక ఆ అవకాశాల్ని జారవిడుచుకున్నాడనీ మనకు తర్వాత అర్థమవుతుంది.
(ఉదాహరణకు: ఫియొదొర్ పాత గదికి పైవాటాలో అద్దెకుండే లోరెంజ్ దంపతులు జినాకు
తెలుసు. మార్గరీటా లోరెంజ్‌ను కలవడానికి ఆమె తరచూ అక్కడకు వచ్చేది. ఫియొదొర్‌కు ఈ
కుటుంబంతో పరిచయం చేసుకునే అవకాశం ఒకమారు కలిగినా–తద్వారా
జినాతో పరిచయమయ్యే వీలున్నా–అతని అనాసక్తి కారణంగా ఆ అవకాశం
తప్పిపోతుంది. అలాగే ఒక సాహితీగోష్టిలో అతనికి ఒక లాయర్ ఆఫర్ చేసిన అనువాదం పని
కూడా అతణ్ణి, జినాని కలిపి వుండేదే. అతను ఈ అనువాదంలో
సాయపడాల్సిన అమ్మాయి జినానే. ఈ అవకాశం కూడా అతని అలసత్వం వల్ల, ఆ లాయరు పట్ల అతనికున్న అయిష్టత వల్లా వృథాగా పోతుంది.) ఇక్కడ కథనాన్ని
ఆపి తమ తొలి పరిచయం ఎలా జరిగిందీ, జినా పూర్వ వృత్తాంతం
ఏమిటీ, కుటుంబ నేపథ్యం ఏమిటీ మనకు వివరిస్తాడు ఫియొదొర్.
ఇదంతా అయిన తర్వాత మళ్ళీ రైల్వేబ్రిడ్జి దగ్గర యథాతథంగా ఫియొదొర్, జినాల సన్నివేశం కొనసాగుతుంది. జినా తన ఆఫీసునీ, ఒళ్ళు
హూనం చేస్తోన్న టైపిస్టు ఉద్యోగాన్నీ, ఇంటి దగ్గర చికాకు
పరిస్థితినీ తలచుకుని విసుక్కుంటుంది. (ఇంట్లో వున్న వ్యక్తి జినా అసలు తండ్రి
కాదు; ఆమె అసలు తండ్రి చనిపోయాక తల్లి ఇతణ్ణి పెళ్ళి
చేసుకుంటుంది; ఈ సవతి తండ్రికీ జినాకూ అస్సలు పడదు.)
ఫియొదొర్ తనవంతుగా పొద్దుట్నించీ ఆమెకో కవిత రాయాలని తాను పడుతున్న ప్రయాస గురించి
చెప్తాడు. ఆమె చికాకు తొలగిపోతుంది. కబుర్లు మొదలవుతాయి. సంభాషణ చివర్లో, ఎప్పుడోకప్పుడు నువ్వు అందర్నీ సంభ్రమంలో ముంచెత్తే రచనేదో చేస్తావని
అంటుంది జినా. తను ప్రస్తుతం నికొలాయ్ చెర్నిషెవ్‌స్కీ జీవితచరిత్ర
రాద్దామనుకుంటున్నానూ అంటాడు ఫియొదొర్. అప్పుడు అలా అనడం సరదాకే అంటాడు. కానీ
కొన్ని రోజుల తర్వాత అదే చెస్ పత్రికలో చెర్నిషెవ్‌స్కీ మీద మరో ఆర్టికల్ చూసాకా
అతనిలో ఆసక్తి మొదలవుతుంది. గ్రంథాలయం నుంచి చెర్నిషెవ్‌స్కీ రచనలన్నీ తెచ్చుకుని
చదువుతాడు. ఇలాంటి నిమ్నస్థాయి తాత్త్వికత, సాహిత్యం పట్ల
చత్వారపు సిద్ధాంతాలూ, చవకరకం శైలీ ఉన్న వ్యక్తి రష్యన్
సాహిత్యాన్ని అంతగా ఎలా ప్రభావితం చేయగలిగాడో అతనికి అర్థం కాదు. అతనిలో ఒక భవిష్య
రచనకు రూపం ఏర్పడుతూ వస్తుంది. ఓ సాహితీగోష్టిలో ఒకరు ఫియొదొర్‌ని “ప్రత్యేకించి
చెర్నిషెవ్‌స్కీ గురించే రాయాలనుకోవడానికి కారణమేమి”టని అడుగుతారు. అతను “యుద్ధ
సన్నాహం” (ఫైరింగ్ ప్రాక్టీస్) అని సమాధానమిస్తాడు. ఒక నెలపాటు కష్టపడి పుస్తకం
పూర్తి చేస్తాడు. అన్నట్టే ఈ రచనలో విధ్వంసం పాలు కాస్త ఎక్కువే వుంటుంది.
నికొలాయ్ చెర్నిషెవ్‌స్కీ నమ్మకాల్ని తాత్త్వికభూమికనూ వినాశకరంగా ముక్కలు చేస్తూ,
అతని వ్యక్తిత్వాన్ని జీవితాన్నీ పరిహాసాస్పదంగా తేలుస్తూ, అతని సాహితీ సిద్ధాంతాల్ని రచనల్నీ ఎండగడుతూ రాస్తాడు. చాలామంది రష్యన్లు
గొప్ప సంస్కర్తగా తలచుకునే వ్యక్తీ, సాక్షాత్తూ లెనిన్‌కు
ఆరాధ్య రచయితా అయిన నికొలాయ్ చెర్నిషెవ్‌స్కీ గురించి ఇలా రాయడం ఎవరికీ నచ్చదు.
ప్రచురణకర్తలు తిరస్కరిస్తారు. చివరకు జినానే తను దాచుకున్న సొంత డబ్బుకి
చేబదుళ్ళు కలిపి ప్రచురణకయ్యే ఖర్చు కూడబెట్టడానికి ప్రయత్నిస్తుంది. అయినా అదీ
సరిపోదు. ఎట్టకేలకు గతంలో ఓ సాహితీ గోష్టిలో పరిచయమైన ఒక రచయిత (అక్కడ తన
తాత్త్విక నాటకం చదివి అందరికీ విసుగెత్తించినతను) ఫియొదొర్‌కు సాయపడతాడు. తనకు
తెలిసిన ప్రచురణకర్తకి అతణ్ణి సిఫారసు చేస్తాడు. ఈ ప్రచురణకర్తకి పుస్తకపు
ఇతివృత్తం పట్ల ఏ మాత్రం అవగాహన లేకపోవటంతో ప్రచురించడానికి సులభంగానే
అంగీకరిస్తాడు. 1929 ఈస్టర్ పండక్కి (అంటే బహుశా మార్చి
నెలలో) ఈ పుస్తకం విడుదలవుతుంది.
ఫియొదొర్ రాసిన ఈ “లైఫ్ ఆఫ్ చెర్నిషెవ్‌స్కీ” పుస్తకమే
నాలుగో అధ్యాయం. నికొలాయ్ చెర్నిషెవ్‌స్కీ (1828
- 1889) రష్యాకి చెందిన సామ్యవాది, భౌతికవాద
(మెటీరియలిస్టు) తత్త్వవేత్త, సాహితీ విమర్శకుడూ, నవలా రచయిత. రష్యన్ సాహితీ పరంపర ఉత్కృష్టస్థాయినందుకున్న కాలానికి
చెందినవాడు; దరిమిలా ప్రారంభమైన ఉద్యమ సాహిత్యానికి ఆద్యుడు;
టాల్‌స్టాయి, దాస్తొయెవ్‌స్కీ, తుర్గెనెవ్ మొదలైన జగత్ప్రసిద్ధ రచయితలకు సమకాలీనుడు; ప్రముఖ పత్రిక “ద కాంటెంపరరీ”కి సంపాదకునిగా ఈ రచయితలందరి గౌరవ విధేయతల్నీ
అందుకున్నవాడు. సామ్యవాద సిద్ధాంతకర్త కారల్‌మార్క్స్ అతణ్ణి “బూర్జువాల ఆర్థిక
విధానాల్లోని దివాలాకోరుతనాన్ని నిపుణమైన రీతిలో బయటపెట్టిన గొప్ప రష్యన్ పండితుడూ,
విమర్శకుడూ” అని పొగిడాడు. సోవియెట్ రష్యా నిర్మాణకర్త లెనిన్
అతణ్ణి “యాభయ్యవ దశకం నుంచి తాను మరణించేవరకూ భౌతికవాదం యొక్క తాత్త్విక స్థాయినే
అవిచ్ఛిన్నంగా అంటిపెట్టుకుని నిలబడగలిగిన ఒకే ఒక్క గొప్ప రచయిత” అంటూ కొనియాడాడు.
చెర్నిషెవ్‌స్కీ ప్రసిద్ధ నవల “వాట్ టు డూ” చాలామంది విప్లవకారులకు
ప్రేరణనిచ్చింది. గుడ్డియెడ్డి రేషనాలిటీ విషయంలో అయాన్‌రాండ్ కథానాయకుడు జాన్‌గాల్ట్‌తో
పోల్చదగిన ఈ నవల హీరో రఖ్మతోవ్‌ను అప్పట్లో చాలామంది విప్లవకారులు అనుకరించేందుకు
ప్రయత్నించేవారు. లెనిన్‌ఐతే దీన్ని తన జీవితాన్నే మార్చేసిన నవలగా
చెప్పుకున్నాడు. ఈ ప్రాశస్త్యమంతా ఒక పార్శ్వం కాగా ఫియొదొర్ మరో పార్శ్వాన్ని మన
ముందుంచుతాడు. అతని అభిప్రాయం ప్రకారం పుష్కిన్, గొగోల్‌లతో
ప్రారంభమైన సాటిలేని రష్యన్ సాహితీ పరంపర దరిమిలా భ్రష్టు పట్టిపోవటానికి గల అనేక
కారణాల్లో చెర్నిషెవ్‌స్కీ కూడా ఒకడు. సాహిత్యానికి స్వతంత్రంగా ఏ విలువా లేదనీ;
అది రాజకీయ, సామాజిక, చారిత్రకావసరాలకు
చాకిరీ చేసే బానిసగా, ఉద్యమాల పదఘట్టనల్ని మోసే వంతెనగా
మాత్రమే అక్కరకు రాగలదనీ అతని విశ్వాసం. సాహిత్యానికి సంబంధించి అతని వ్యాఖ్యానాలు
మచ్చుకు కొన్ని ఇలా వున్నాయి: “రాజకీయ సాహిత్యం మాత్రమే అత్యంత ఉత్కృష్టమైన
సాహిత్యం”, “ఏదో ఒక సైద్ధాంతిక ధోరణికి చెలికత్తెగా పనిచేయడం
తప్ప సాహిత్యానికి స్వతంత్రంగా మనుగడ లేదు”, “చారిత్రకోద్యమాల
ఉధృతి ఫలితంగా మన చుట్టూ సాధ్యమౌతున్న సాఫల్యాల పట్ల సానుభూతితో స్పందించని రచయిత
ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ గొప్ప రచననూ సృజించబోడు. ఎందుకంటే కేవలం సౌందర్యమే లక్ష్యంగా
సృజించిన ఏ కళనీ చరిత్ర పట్టించుకోదు”. ఇలాంటి సిద్ధాంతాల దన్నుతో అప్పట్లో
రష్యాలో ప్రయోజనాత్మక సాహిత్యం, ఉద్యమ సాహిత్యాల పేరిట
రోగిష్టి సాహిత్యం (ఇప్పుడెవరికీ గుర్తులేని సాహిత్యం) కలరాలా వ్యాపించి నిజమైన
కళని చంపేసింది. అభ్యుదయభావాలూ, సామాజిక దృక్పథం, ఉద్యమ స్ఫూర్తి వగైరా “పవిత్రమైన” ఆదర్శాలుంటే చాలు కల్పనాశక్తి వున్నా
లేకపోయినా కలం పట్టి కెలికేయవచ్చుననుకునే బాపతు రచయితలు పెచ్చుమీరిపోయారు. ఈ
కాయదొలుచు పురుగుల ధాటికి ఇంకా కాస్తో కూస్తో సారం వున్న సాహితీఫలాలన్నీ కూడా
క్రమేణా కమిలి రాలిపోసాగాయి. దీనికి తర్వాత్తర్వాత లెనిన్, స్టాలిన్ల
దాష్టీకం కూడా తోడవటంతో పుష్కిన్ నుండి చెఖోవ్ వరకూ అద్వితీయమైన వైభవంతో సాగిన
రష్యన్ సాహితీ పరంపర రానురానూ వట్టిపోయి చివరకు శాశ్వతంగా చచ్చిపోయింది. రష్యన్
సాహిత్యాన్ని ఈ తీరున ప్రభావితం చేసిన చెర్నిషెవ్‌స్కీ జీవితం కూడా ఏమంత మెరుగైన
పంథాలో సాగలేదు. ఒక క్రైస్తవ మత పూజారి కొడుకైన చెర్నిషెవ్‌స్కీ తర్వాత్తర్వాత
ఉపాధ్యాయునిగా, పత్రికా సంపాదకునిగా, సిద్ధాంతకర్తగా
ఒక్కోమెట్టూ ఎదిగాడు. ఇతని అభ్యుదయ భావాలు విస్తరించి అందరి గుర్తింపూ పొందేకొద్దీ
జార్ చక్రవర్తికి ఇతని ప్రభావం పట్ల భయం పట్టుకుంది. రాజ్య వ్యతిరేక కార్యకలాపాలు
సాగిస్తున్నాడంటూ తప్పుడు నేరం మోపి సైబీరియాకు ప్రవాసం పంపించేసారు. తన
అరవయ్యేళ్ళ జీవితంలో చివరి ఇరవయ్యేళ్ళ కాలాన్ని అక్కడే గడిపాడు. ఈ శిక్షాకాలం
పూర్తయేసరికే దాదాపు అందరూ అతణ్ణి మర్చిపోయారు, అతని గత
విఖ్యాతి మరుగునపడిపోయింది. శిక్ష పూర్తయి తిరిగి వచ్చాక, ఎక్కడైతే
అందరి గుర్తింపూ పొంది అందరి మన్ననా అందుకున్నాడో అక్కడే అనామకుడిగా మృతి చెందాడు.
చెర్నిషెవ్‌స్కీ జీవితం ఇలా ముగియడానికి అతని తాత్త్విక విశ్వాసాలే కారణం అని
నిరూపించేందుకు ప్రయత్నిస్తాడు ఫియొదొర్. జీవితచరిత్ర అంతా ఎద్దేవా గానే
సాగినప్పటికీ ఎక్కడా ఋజువులు చూపించకుండా గుడ్డిగా తూలనాడే ప్రయత్నం చేయడు.
చెర్నిషెవ్‌స్కీ కాల్పనిక రచనల్లోంచీ, డైరీల్లోంచీ, అతని తత్త్వశాస్త్ర గ్రంథాల్లోంచీ ఊటంకిస్తూనే రాస్తాడు. చెర్నిషెవ్‌స్కీ
జీవితం ఏ మెటీరియలిస్టు భావాల్ని పునాదిగా చేసుకుని నిలబడిందో, ముందు ఆ మెటీరియలిస్టు తాత్త్వికత మోకాళ్ళు విరగ్గొడతాడు; అది ఎంత డొల్లనైనదో మనకు నిరూపిస్తాడు. ఈ మెటీరియలిజం కారణంగానే
చెర్నిషెవ్‌స్కీ జీవితం నిలువునా కుప్పకూలిందని అన్యాపదేశంగా సూచిస్తాడు. ఇలాంటి
అవకతవక మనిషి ప్రతిపాదించిన తాత్త్విక సిద్ధాంతాల పట్ల ఎవరూ శ్రద్ధ
చూపించనక్కర్లేదనీ, ఇలాంటి పేలవమైన తాత్త్విక భూమిక గల మనిషి
కట్టిన సాహితీపరమైన అంచనాల్ని ఎవరూ పరిగణనలోకి తీసుకోనక్కర్లేదనీ తేల్చి చెప్తుందీ
పుస్తకం. ఫియొదొర్ ఇదివరకూ తన తండ్రి జీవితచరిత్రను పుష్కిన్ ప్రేరణతో రాయటానికి
ప్రయత్నిస్తే, చెర్నిషెవ్‌స్కీ జీవితచరిత్రను గొగోల్
ప్రేరణతో, అతని చురుక్కుమనిపించే వ్యంగ్యాత్మక శైలిని
ఆదర్శంగా తీసుకుని రాస్తాడు.
ఐదో అధ్యాయంలో జరగడమైతే చాలా జరుగుతుంది గానీ, చెప్పుకునేందుకేమీ పెద్దగా ఉండదు.
ఇంతకుముందు నాలుగు అధ్యాయాల్లోనూ అగమ్యగోచరంగా సాగిపోతూన్నట్టనిపించిన దారులన్నీ
క్రమంగా ఇక్కడో కొలిక్కి వస్తాయి. గత మూడేళ్ళ జీవితమూ ఫియొదొర్ ఎదుట తర్వాతి రచనకు
ఒక ఇతివృత్తాన్ని తెచ్చి నిలుపుతుంది. ఈ రచన వైపు అతణ్ణి పురికొల్పిన ప్రేరణలే ఈ
అధ్యాయానికి ఆయువుపట్టు. అతని పుస్తకం “లైఫ్ ఆఫ్ చెర్నిషెవ్‌స్కీ”పై వివిధ
పత్రికల్లో వచ్చిన సమీక్షలతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. అతను అభిమానించే కవి
కొంచెయెవ్ రాసిన ఒక్క సమీక్ష తప్పించి, మిగతా సమీక్షలన్నీ
పుస్తకాన్ని తెగుడుతూనే వుంటాయి. కానీ ఇవన్నీ కలిసి పుస్తకంపై జనంలో ఆసక్తి
పెరిగేలా చేస్తాయి. పుస్తకం బాగా అమ్ముడుపోతుంది. అతని పేరు పదుగురి నోళ్ళలోనూ
పలుకుతుంది. ఇదిలావుండగా, పుస్తకం విడుదలవడానికి కొన్నాళ్ళ
క్రితమే అలెగ్జాండర్ చెర్నిషెవ్‌స్కీ అస్వస్తతతో మంచం పడతాడు. గత మూడేళ్ళలోనూ మరీ
వికటించిన కొడుకు-ప్రేతాత్మ-భ్రమ అతణ్ణి క్రమంగా చావుకు చేరువ చేస్తుంది. ఫియొదొర్
అతణ్ణి చూడటానికి వెళ్తాడు. సిసలైన రచయితకు తన కథలు ఇతరుల కథలేమో అన్నంత
నిర్వికారంగా చెప్పగల ప్రజ్ఞతో పాటూ, ఇతరుల కథల్ని తన కథలే
అన్నంత మమకారంతో అక్కున చేర్చుకోగల సహానుభూతీ ఉండాలి. ఫియొదొర్ ఈ నవలలో చాలమార్లు
ఇతరుల కథల్ని తనవిగా చేసుకుని చెప్పటం మనం చూస్తాం. ఇక్కడ కూడా అలాగే, మరణశయ్యపై చావుకు స్వాగతం పలికేందుకు సమాయత్తమౌతున్న అలెగ్జాండర్
చెర్నిషెవ్‌స్కీ ఆలోచనలు ఏ రీతిన సాగుతూండి ఉంటాయో ఊహించి మన ముందు పరుస్తాడు.
ఫియొదొర్ పరామర్శించిన మర్నాడే చెర్నిషెవ్‌స్కీ ప్రాణం విడుస్తాడు. అంత్యక్రియలకు
హాజరై వస్తూన్న ఫియొదొర్‌ని తోటి రచయిత ఒకడు పలకరిస్తాడు. ఈ రచయిత అతనితో పాటూ
జర్మనీలోని ప్రవాస రష్యన్ రచయితల సంఘంలో సభ్యుడు. వచ్చే నెల జరగబోయే ఎన్నికల్లో
ఫియొదొర్ కూడా పేరిచ్చితీరాలని ఒత్తిడి తెస్తాడు. అతనికి ఇష్టం ఉండదు. అతనికి
సంబంధించినంతవరకూ సాహితీవ్యాసంగమంటే తన గది ఏకాంతంలో ఊహల్నీ అక్షరాల్నీ సమన్వయపరుస్తూ
తాను కలంతో కాగితంపై చేసే కసరత్తు మాత్రమే. దానికి ఇలా ఏ గుంపు ధోరణుల్తోనూ,
ఏ సామూహిక తంతుల్తోనూ సంబంధం లేదు. కాబట్టి మర్యాదగానే ఈ ప్రతిపాదన
తిరస్కరిస్తాడు. అయితే సంఘంలో అతనూ ఓ సభ్యుడు కావటం మూలాన తర్వాతి నెల సమావేశానికి
మొక్కుబడిగా హాజరవుతాడు. సమావేశం మొదలైంది మొదలు, సభ్యుల
మధ్య నిధులేవో దారి మళ్ళాయన్న విషయం మీద గొడవ చెలరేగుతుంది. చివరకు అదో రచయితల
సమావేశంలా కాక, తిట్లూ శాపనార్థాలతో కూరగాయల సంతలా
తయారవుతుంది. ఇంతోసి మహాభాగ్యానికీ జినాతో తన సాయంత్రపు సమావేశాన్ని రద్దు చేసుకు
మరీ వచ్చానే అని విసుక్కుంటూ ఫియొదొర్ బయటకు దారితీస్తాడు. జినాతో తన అనుబంధాన్ని
ఇంకా ఎన్నాళ్ళిలా రహస్యంగా బెర్లిన్ వీధులకు అంకితమివ్వాలో, అసలు
తామిరువురికీ జంటగా ఒక భవిష్యత్తు వుందో లేదో అన్న అనిశ్చితీ అనుమానాలు అతణ్ణి ఈ
మధ్య బాగా మథన పెడుతూంటాయి. అయితే విధి ఈ విషయంలో కూడా అతని ఆశలకు అనుకూలంగానే
ఓటేస్తుంది. జినా సవతితండ్రికి ఉన్నట్టుండి డెన్మార్క్ బదిలీ అవుతుంది. మరో
రెండునెలల తర్వాత అక్కడికి వెళ్ళాలి. ముందు తనూ భార్యా అక్కడికి వెళ్ళి
స్థిరపడేట్టూ, జినాకు అక్కడో ఉద్యోగం చూసి పెట్టాకా ఆమె కూడా
వెనకే వచ్చేసేట్టు ప్రణాళిక సిద్ధం చేస్తాడు. కాని జినా మనసులో వేరే ప్రణాళిక
వుంటుంది. పైకి చెప్పదు గానీ, ఆమె ఫియొదొర్‌తో పాటే బెర్లిన్‌లో
ఉండిపోవాలని నిశ్చయించుకుంటుంది. వస్తే అన్నీ కట్టగట్టుకు వస్తాయన్నట్టు ఈ అనుకోని
మార్పు వల్ల ఫియొదొర్‌కి మరో అదృష్టం కూడా కలిసివస్తుంది. జినా తల్లిదండ్రులు
వెళిపోయాకా ఆ ఇల్లు ఒక నెల వరకూ ఖాళీగానే వుండబోతోంది. అంటే ఒక పూర్తి నెల జినాతో
ఏ హద్దులూ, అరమరికలూ లేని సాన్నిహిత్యం; అటు పిమ్మట శాశ్వతమైన అనుబంధం. దీంతో ఇక అతను రెండునెలలూ ఎప్పుడు
పూర్తవుతాయా అని ఆత్రుతతో ఎదురు చూస్తుంటాడు. ఒకప్రక్క ఇలా జినాతో భవిష్యత్తు
పక్కాగా ఖాయమైపోవడం, మరోప్రక్క “లైఫ్ ఆఫ్ చెర్నిషెవ్‌స్కీ”
పుస్తకం బాగా పేరు తెచ్చుకుని రచయితగా తాను కోరుకున్న గుర్తింపు లభించడంతో
ప్రస్తుతం అతని జీవితం ఒడ్డుకు లంగరేసిన ఓడలా ప్రశాంతమైన నిశ్చలత్వాన్ని
సంతరించుకుంటుంది. అతను ఈ నిలకడను పూర్తిగా ఆస్వాదిస్తాడు. ఈ మధ్య తరచూ బెర్లిన్
పొలిమేరల్లోని గ్రునెవాల్డ్ అనే అటవీప్రాంతానికి షికారు వెళ్తూంటాడు. పొద్దంతా
అక్కడి అనుకూలమైన ఎండలో వళ్ళు మాడబెట్టుకోవడం, మధ్యాహ్నమంతా
అక్కడి సరస్సులో ఈత కొట్టి సాయంత్రానికి కెపుడో ఇంటికి చేరడం అతని దినచర్యగా
మారుతుంది. రెండునెలలు ఇట్టే గడిచిపోతాయి. ఎదురుచూసిన రోజు దగ్గర పడుతుంది.
మర్నాడు జినా తల్లిదండ్రులు ఇల్లు ఖాళీ చేస్తారనగా, జులై 28న, యధావిధిగా స్నానానికి సరస్సు దగ్గరకు వెళతాడు.
రోజూలాగే ఈత కొడుతూ అవతలి ఒడ్డుకు చేరతాడు. అవతలి ఒడ్డునున్న అడవిలో అతణ్ణి
ఎప్పుడూ ప్రత్యేకంగా ఆకర్షించే పెద్ద గుంట లాంటి ప్రదేశం ఒకటుంది. ఇక్కడే దాదాపు
ఐదేళ్ళ క్రితం యాషా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ రోజు దీన్ని
చూడగానే ఎందుకో ఫియొదొర్ ఆలోచనలు యాషా కుటుంబంపైకి మళ్ళుతాయి. కొడుకు తోపాటూ
ఇప్పుడు భర్త కూడా చనిపోవటంతో చెర్నిషెవ్‌స్కీ భార్య నగరం విడిచిపెట్టి వెళిపోతుంది.
కొడుకు కథ రాసిపెట్టమన్న ఆమె వేడికోళ్ళూ, వాళ్ళ ఇంట్లో
జరిగిన సాహితీగోష్టులూ, అలెగ్జాండర్ చెర్నిషెవ్‌స్కీ మానసిక
వ్యాధీ... ఈ జ్ఞాపకాలన్నీ అప్పుడే రంగు వెలిసిపోయి తన మనసు
మూల గదుల్లో ఆచూకీ కోల్పోతున్నట్టూ అనిపిస్తుంది ఫియొదొర్‌కి. హఠాత్తుగా గాభరా
కలుగుతుంది. తన జీవితంతో ఎంతో పెనవేసుకుపోయిన ఈ జ్ఞాపకాల్ని ఇలా కోల్పోకుండా
కాపాడుకోవాలన్న తపన మొదలవుతుంది. కాపాడుకోవాలంటే ఏం చేయాలి? రాయాలి.
“ద గిప్ట్” నవలకు తొలి ప్రేరణ ఇక్కడే కలుగుతుంది. ఇలా కాసేపు అడవిలో కాలక్షేపం
చేసాకా, ఆకాశం మేఘావృతమవడంతో ఇంటికెళిపోవాలని
నిశ్చయించుకుంటాడు. ఈతకు దిగేముందు బట్టలు దాచి పెట్టిన చోటుకి వెళతాడు. ఖాళీ! అవి
ఎవరో దొంగిలిస్తారు. తువ్వాలూ, షర్టూ, ఫాంట్లతోపాటూ
డబ్బులూ, ఇంటి తాళాలూ, పెన్సిలూ,
జేబురుమాల్లాంటి చిల్లర సరంజామా కూడా పోతుంది. చివరకు వట్టి
చెడ్డీతో వర్షంలో తడుస్తూ బయల్దేరతాడు. దారిలో ఈ వాలకాన్ని చూసి పోలీసులు
అటకాయిస్తే వాళ్ళకి సమాధానం కూడా చెప్పుకోవలసి వస్తుంది. ఇంటికి చేరేసరికి ఇల్లంతా
కూలీల్తో హడావిడిగా వుంటుంది. మర్నాటి ప్రయాణానికి అప్పుడే సామాను సర్దడం
ప్రారంభించేసారు జినా తల్లిదండ్రులు. ఫియొదొర్ వాళ్ళతో కలిసి చివరి భోజనం కానిచ్చి,
తన గదిలోకి వెళ్తాడు. తల్లికి ఉత్తరం రాయటం మొదలుపెడతాడు. దాన్నిండా
అతని ఆనందమే వుంటుంది. తనలో ఓ కొత్త రచన మొలకేస్తున్న సంగతి ఆమెతో పంచుకుంటాడు: “నేను
బహుశా ఓ పాత తరహా నవల రాయబోతున్నాను. ఇందులో విధి, ప్రేమ,
మూస పాత్రలూ, సంభాషణలూ, ప్రకృతివర్ణనలూ
ప్రధానంగా ఉంటాయి” అని తెలియచేస్తాడు. ఉత్తరం పూర్తి చేసి, వర్షపు
రాత్రిని వింటూ, నిద్రకుపక్రమిస్తాడు. నిద్రలో ఒక వింత కల
వస్తుంది: ఏదో ముఖ్యమైన కబురు వచ్చిదంటే తన పాత గదికి వెళ్తాడు. అక్కడ అతని తండ్రి
సజీవంగా కళ్ళముందుకొస్తాడు. ఫియొదొర్‌కు ఉద్విగ్నతతో మాట పెగలదు. కొడుకు తనపై
రాసిన రచనకు ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తాడు. ఫియొదొర్ ఆనందంతో వెక్కుతూ పసివాడై
తండ్రి కౌగిలిలో ఒదిగిపోతాడు. మరుక్షణం ఉలికిపాటుతో తన గదిలో మెలకువ వస్తుంది. గత
మూడేళ్ళ జీవితాన్నీ చిత్రిక పట్టినట్టున్న ఈ కల ఫియొదొర్ రాయబోతూన్న నవలకు మరో ప్రేరణ
అవుతుంది. ఇలా కలతనిద్రతో తెలవారుతుంది. ఆరోజే జినా తల్లిదండ్రుల డెన్మార్క్
ప్రయాణం. అట్నుంచటు తిన్నగా స్టేషన్‌కి వస్తానని చెప్పి, జినా
పొద్దున్నే (ఫియొదొర్ లేవకముందే) ఆఫీసుకు వెళిపోతుంది. భార్యాభర్తలిద్దరూ ముస్తాబై
ప్రయాణానికి సిద్ధమయ్యేసరికి మధ్యాహ్నమవుతుంది. ఫియొదొర్ టాక్సీ పిలవడానికి బయటకు
వెళ్తాడు. అతను టాక్సీతో వచ్చేసరికే ఇద్దరూ క్రింద సామానుతో సిద్ధంగా ఉంటారు.
ఇద్దర్నీ టాక్సీ ఎక్కించి పంపేసాక, ఈల వేసుకుంటూ, ఇక ఇప్పుడు జినాకీ తనకీ మాత్రమే సొంతమైన ఇంట్లోకి అడుగుపెట్టేందుకు
ఉత్సాహంగా మెట్లెక్కుతాడు. గుమ్మందాకా చేరేసరికి తాళం వేసున్న తలుపు అతని
ఉత్సాహాన్ని ఎగతాళి చేస్తుంది. అప్పుడు గుర్తొస్తుంది, తన
వంతు తాళం చెవుల్ని నిన్ననే పార్కులో బట్టలతోపాటూ పోగొట్టుకున్నాడని. ఉసూరుమంటూ
నీరసంగా మెట్లు దిగి కిందకు వస్తాడు. జినా ఆఫీసు నుండి రైల్వేస్టేషన్‌కి వెళ్ళి తల్లితండ్రుల్ని
సాగనంపి తిరిగి వచ్చేసరికి ఎటూ మూడుగంటల పైనే పడుతుంది. ఇప్పుడు తమ అనుబంధానికి
లభించిన ఈ కొత్త స్వాతంత్ర్యంతో, ఏమైనా చెల్లిపోయే ఈ
వెసులుబాటుతో, మూడు గంటలు ఆగడమంటే అతనికి
దుర్భరమనిపిస్తుంది. బస్సెక్కి స్టేషన్‌కు బయల్దేరతాడు. మరోప్రక్క స్టేషన్‌లో జినా
రైలు కిటికీ దగ్గర నిలబడి, తల్లి చెప్తోన్న జాగ్రత్తలు
విసుగ్గా వింటూంటుంది. రైలు కదులుతూందనగా గుర్తొచ్చి ఇంటి తాళం చెవులు అడుగుతుంది.
తాళం వేసాకా వాటిని తలుపు సందులోంచి లోపలికే గిరవాటేసాననీ, ప్రస్తుతానికి
ఫియొదొర్ దగ్గరున్న తాళం చెవుల్తో సర్దుకొమ్మనీ చెప్తుంది తల్లి. ఇద్దరూ
చేతులూపుతూండగా రైలు వెళిపోతుంది. జినా బయటకు వస్తుంది. ఫియొదొర్ బయటే ఆమెకోసం
ఎదురు చూస్తూంటాడు. ఆమె పరుగు, అతను బార్లా చేతులు చాచడం,
గాఢమైన కౌగిలింత, ఊపిరాడని ముద్దు. ఇద్దరూ
పరస్పరం పొదువుకుంటూ బస్సెక్కుతారు. తనకు వంటరాదనీ, రాత్రి భోజనం
రెస్టరెంట్లో తప్పదనీ తేల్చేస్తుంది జినా. బస్సులో ఫియొదొర్ ఒకావిణ్ణి ఎక్కడో
చూసినట్టుందనుకుంటాడు. ఆమె మార్గరీటా లోరెంజ్ అని గుర్తు చేస్తుంది జినా. (ఇది
ఫియొదొర్ నవలకు చివరి ప్రేరణ.) ఇద్దరూ రెస్టరెంట్‌లో చతికిల పడ్డాకా, అప్పుడప్పుడే క్రమ క్రమంగా స్పష్టమవుతోన్న తన నవల ఆలోచనను ఆమెకు
వివరిస్తాడు ఫియొదొర్:
తామిద్దర్నీ ఒక్కటి చేసేందుకు విధి పడ్డ ప్రయాసే ఈ నవలకు
ప్రధాన ఇతివృత్తం. విధి తన ప్రయత్నాలు మూడేళ్ళ క్రితమే మొదలుపెట్టింది. కాని మొదటి
ప్రయత్నం కాస్త మొరటుదీ, ఆడంబరమైనదీను.
మార్గరీటా లోరెంజ్ ద్వారా తామిద్దర్నీ కలిసేట్టు చేయడానికి పాపం మొత్తం లోరెంజో
కుటుంబాన్నే ముటాముల్లెతో సహా ఎత్తుకొచ్చి ఫియొదొర్ గదికి పైవాటాలో మకాం
పెట్టించింది. ఈ పథకంలో బొత్తిగా సున్నితత్వం లేకపోయింది. అంతా అనవసరమైన బడాయి!
పాపం విధికి ఆ సామాను-వేను ఖర్చులు కూడా కలిసొచ్చుండవు.
“జాగ్రత్త! ఇలా వంకలు పెడితే నొచ్చుకుని
పగ సాధించగలదు,” నవ్వుతూ అంటుంది జినా.
ఫియొదొర్ తన ధోరణిలో చెప్పుకుంటూ పోతాడు: విధి రెండో
ప్రయత్నం కాస్త సులభమైనదీ, అనుకున్న
ఫలితాన్ని ఇవ్వగలదీను. ఫియొదొర్‌కు డబ్బు బాగా అవసరమైనపుడు ఒక లాయరు అతనికి
అనువాదపు ఆఫర్ ఇచ్చాడు. ఈ అనువాదంలో అతను కలిసి పనిచేయాల్సింది సాక్షాత్తూ
జినాతోనే. ఇలా విధి ఈ సారి సరైన ఉపాయమే పన్నింది. కానీ మధ్యవర్తిని ఎన్నుకోవడంలో
పొరబాటు చేసింది. ఆ లాయరంటే ఫియొదొర్‌కి పడదు; జర్మన్
అనువాదాలంటే అస్సలు పడదు. అలా రెండో ప్రయత్నమూ విఫలమైంది. ఈ భంగపాటు తర్వాత విధి
ఇక విషయాన్ని తేలిగ్గా తీసుకోదల్చుకోలేదు. ఫియొదొర్‌ని తిన్నగా తీసుకొచ్చి జినా
ఉన్న ఇంట్లోనే ప్రవేశపెట్టాలనుకుంది. ఈసారి మధ్యవర్తిగా, ఎవడో
కోన్‌కిస్కాగాణ్ణి కాకుండా, ఫియొదొర్ బాగా అభిమానించే
అలెగ్జాండర్ చెర్నిషెవ్‌స్కీ భార్యను ఎన్నుకుని జాగ్రత్తపడింది. ఆమె దగ్గరుండి
పోరి మరీ అతణ్ణి ఈ గది చూడటానికి పంపించింది. కాని చివరి నిముషంలో చిన్న పొరబాటు
దొర్లిపోయింది. గది చూడటానికి వచ్చినపుడు అతని ముందు స్వయానా జినాను తీసుకొచ్చి
నిలబెట్టాల్సింది పోయి, విధి తన తొందరపాటుతనం వల్ల–లేదా పీనాసితనం వల్లో–ఆమె సవతితండ్రిని తీసుకొచ్చి నిలబెట్టింది.
ఈ అతిచొరవ మనిషి వల్ల మొత్తం పథకమే పల్టీ కొట్టబోయింది. ఫియొదొర్ గది
తీసుకోవడానికి దాదాపు నిరాకరించేయబోయాడు. ఇక అప్పుడు విధికి ఏం చేయాలో పాలుపోక,
తన చివరి అస్త్రంగా జినా నీలం గౌను నొకదాన్ని ప్రయోగించింది. దాన్ని
మెళుకువగా ఫియొదొర్ కళ్ళ బడేలా చేసింది. ఈ అస్త్రం ఎందుకు పనిచేసిందో, ఎలా పనిచేసిందో అతనికి కూడా తెలీదు. కానీ పని చేసింది. అతనా గది
తీసుకోవడానికి అంగీకరించాడు.
“అది నా గౌను కాదు. నా బంధువుది. ఏదో
కుట్టి పెట్టమని నాకిచ్చింది,” అంటూ కొత్త సంగతి
బయటపెడుతుంది జినా.
దీంతో ఫియొదొర్ ఆశ్చర్యం రెండింతలవుతుంది: “ఇదింకా
అద్భుతమైన తెలివి! ఏం చాకచక్యం! సృష్టిలోనూ,
కళలోనూ మనల్ని అత్యంత మంత్రముగ్ధుల్ని చేసేవి ఇలాంటి మోసాలే. చూసావా
విధి అల్లిక తొలుత ఎంత బాధ్యతా రహితమైన ఆడంబరంతో మొదలై తుదకు ఎలాంటి మెరుగైన
కొసమెరుపుతో ముగిసిందో! ఇదో మంచి నవలకు ఇతివృత్తం అవదూ? వస్తువంటే
ఇలా వుండాలి! అయితే దీన్నింకా బాగా నిర్మించాలి, తెరలు
మరుగెయ్యాలి, చుట్టూ సాంద్రమైన జీవన సంరంభాన్ని తెచ్చి
నింపాలి–నా జీవితం, నా రచనా
వ్యాసంగానికి సంబంధించిన ప్రేమలూ, ఆసక్తులూ... అన్నీ చుట్టూ
పేర్చాలి.”
“సరే కానీ, ఇదంతా
చివరకు ఓ స్వీయచరిత్ర [ఆటోబయోగ్రఫీ]లా తయారై ఎన్నో మంచి పరిచయాల్నీ, సాన్నిహిత్యాల్నీ మూకుమ్మడిగా బలి తీసుకుంటుందనిపించట్లేదూ?” అంటూ జినా అనుమానం వ్యక్తం చేస్తుంది.
“ఒకవేళ నేనంతా తారుమారు చేసి, కలియబెట్టేసి,... నా సొంత మసాలాలు కూడా కొన్ని జత
చేసాననుకో, అప్పుడేమవుతుంది? స్వీయచరిత్రలోని
దుమ్మూధూళీ తప్ప ఇక్కడ ఏమీ మిగలదు–కానీ ఎన్నో కమనీయమైన
కాషాయాకాశాలకు ముడి సరుకయ్యేది ఇలాంటి దుమ్మూధూళే. అయితే నేను దీన్ని అప్పుడే
రాయను. దీన్ని సిద్ధం చేయడానికి చాలా కాలం పడుతుంది, బహుశా
సంవత్సరాలు... అంతకన్నా ముందు చేయాల్సిన పనొకటుంది. పదాల మీద
పూర్తి నియంతృత్వం సాధించేందుకు ఒక ఫ్రెంచ్ తాత్త్వికుణ్ణి
అనువదించాలనుకుంటున్నాను. నా “లైఫ్ ఆఫ్ చెర్నిషెవ్‌స్కీ”లో పదాలింకా ఓటు వేయటానికి
ప్రయత్నిస్తున్నాయి; వాటి చేతులు కట్టేయాలి.”
“నువ్వు చెప్తోంటే అద్భుతమనిపిస్తోంది...
నాకు చాలా నచ్చింది. చూస్తూండు, నువ్వు ఇదివరకెన్నడూ
లేనేలేని రచయితవవుతావు. రష్యాకి బుద్ధొచ్చాక, నిన్ను
కోల్పోయానే అని కుమిలిపోయి తీరుతుంది... . సరే కాని, నువ్వు
నన్ను ప్రేమిస్తున్నావో లేదో చెప్పు.”
“నేనిప్పుడు చెప్తోందంతా నిజానికి ఒకరకమైన
ప్రేమ ప్రకటనే,” ఫియొదొర్ సమాధానమిస్తాడు.
“నాకు ఈ ‘ఒకరకమైన’
సరిపోదు. ఒక్కోసారి నీతో నేను దారుణంగా అసంతృప్తి పాలవుతానేమో
అనిపిస్తుంది తెలుసా! కానీ మొత్తంగా చూస్తే అదో పెద్ద విషయం కాదనుకో. నేను దాన్ని
ఎదుర్కోవడానికి సిద్ధమే!” అంటూ కళ్ళు విప్పార్చి నవ్వుతూ జినా కుర్చీ వెనక్కి
వాలుతుంది. భోజనమూ కబుర్లూ కానిచ్చి ఇద్దరూ బయల్దేరతారు. బెర్లిన్ రాత్రి తేటదనంలో,
వీధి వార నిమ్మచెట్లు జార విడుస్తూన్న మత్తు పరిమళాల్ని పీలుస్తూ,
ఒకరి సాంగత్యంలో ఒకరు వెచ్చదనాన్ని రగుల్చుకుంటూ, ఇంటివైపు నడుస్తారు. ఇక్కడ పుష్కిన్ మహాకావ్యం “యెవ్‌జెనీ ఒనెజిన్”లోని
చివరి పద్యాన్ని గుర్తుకు తెచ్చే ఒక కవితతో ఫియొదొర్ తన ఈ పుస్తకానికి వీడ్కోలు
పలుకుతాడు. (పుష్కిన్ ఆ కావ్యాన్ని తన కథానాయకుడు ఒనెజిన్‌ప్రేమలో విఫలుడై మోకాళ్ళ
మీద కూలబడి వుండగా వీడ్కోలు పలుకుతూ ముగిస్తాడు.) కథ ముగిసినా విధి తీవెలు ఇంకా
మ్రోగుతూనే వుంటాయనీ, వాటి సంగీతానికి చెవి అంత తొందరగా
వీడ్కోలు పలకలేదనీ, అలాగే తాను “సమాప్తం” అని పెట్టిన చోట
నిశితమైన చదువరికి ఏ అడ్డంకీ లేదనీ, అతను పేజీల హద్దుల్ని
దాటి సాగిపోయే తన ప్రపంచపు నీడల్ని ఇంకా అనుసరించగలుగుతాడనీ ఈ కవితలో సూచిస్తాడు
ఫియొదొర్:
Good-by, my
book! Like mortal eyes,
imagined ones
must close some day.
Onegin from his
knees will rise
– but his
creator strolls away.
And yet the ear
cannot right now
part with the
music and allow
the tale to
fade; the chords of fate
itself continue
to vibrate;
and no
obstruction for the sage
exists where I
have put The End:
the shadows of
my world extend
beyond the
skyline of the page,
blue as tomorrow’s
morning haze
– nor does this
terminate the phrase.
అతడన్నట్టే మనకీ “సమాప్తం” అడ్డు
కాదు. ఈ జంట సమీప భవిష్యత్తేమిటో మనకు తెలుసు. ఇంటి దాకా చేరాకా లోపలికి
వెళ్ళడానికి తాళాలు లేక, జేబులో/
పర్సులో డబ్బులు కూడా లేక ఇద్దరూ బయటే నిలబడాల్సి వస్తుంది. గతంలో ఒకసారి ఇలాగే
గదితాళం పారేసుకుని వీధిలో తచ్చాడిన ఫియొదొర్ మనకు గుర్తొస్తాడు, అతని ఒంటరితనం గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు అతనికి ఇల్లంటే ఇటుకగోడల
నిర్మాణం కాదు. జినా ఎక్కడుంటే అదే అతని ఇల్లు; జినాతో
ప్రేమానుబంధాలే ఆ ఇంటికి ఇటుకలూ, గోడలూ. ఇదే నిశ్చింతతో ఈ
జంటని వాళ్ళ మానాన వాళ్ళని వదిలి మనం సంతృప్తిగా పుస్తకం మూస్తాం.
వివరణ:
ఇక్కడిదాకా నా అక్షరాల మధ్య ఈదుకుంటూ,
వెంట తమ ఏకాగ్రతను ఈడ్చుకుంటూ రాగలిగిన వాళ్ళకి పైన “కథా సంక్షిప్తం”
అన్న శీర్షిక నేను వెటకారానికి పెట్టానేమో అనిపించొచ్చు. రాయటం మొదలుపెట్టినప్పుడు
ఒక పేరాలోనే అంతా కానిచ్చేద్దామన్న సదుద్దేశంతోనే మొదలు పెట్టాను. తీరా కథలో
దిగాకే లోతెంతో తెలిసొచ్చింది. ఇతివృత్తపు ప్రత్యేకత అవగతం కావాలంటే ఇదంతా ఇలా
సవిస్తారంగా చెప్పడం అవసరమనిపించింది. ఇది ఎందుకు పనికొచ్చినా పనికిరాకపోయినా
ఒకందుకు పనికొస్తుంది. జూల్లోనో, కాంక్రీట్ జంగల్స్‌లోనో
దారి తప్పిపోయినపుడు “మీరు ప్రస్తుతం ఇక్కడ వున్నారు” అంటూ మనం వున్న చోటును బాణం
గుర్తుతో సూచించే సైన్‌బోర్డులు వుంటాయి చూడండి; ఈ సంక్షిప్త
కథ నిస్సంశయంగా అలా ఉపయోగపడుతుంది. ఈ నవలకు అసలలాంటి సైన్‌బోర్డు ఒకటి ఎందుకు
అవసరమో రెండు కారణాలు చెప్తాను:
1) నబొకొవ్ ఈ నవలలో కథ చెప్పడం మాత్రమే
చేయడు. కథానాయకుడు ఫియొదొర్ ఒక రచయిత కాబట్టి, కథ
మొదలయ్యిందగ్గర్నించీ ముగింపుచేరేదాకా అతని రచనాపాటవం ఏ తీరున పరిణతి చెందిందో
కూడా మనకు నిరూపించే ప్రయత్నం చేస్తాడు. తనే సూటిగా ఏ వ్యాఖ్యానాలూ చేయడు. స్వయంగా
ఫియొదొర్ రచనలే మన ఎదుట పెట్టి మనమే పరిశీలించి తేల్చుకునే వీలు కల్పిస్తాడు.
మొదటి అధ్యాయంలో ఫియొదొర్ కవితలు, రెండో అధ్యాయంలో అతను
తండ్రిపై రాసిన జీవితచరిత్ర, నాలుగో అధ్యాయం రూపేణా మన
ముందుకొచ్చే అతని పుస్తకం “లైఫ్ ఆఫ్ చెర్నిషెవ్‌స్కీ” ... ఇలా ఫియొదొర్ రచనల్ని
ప్రత్యక్షంగా చదవడం ద్వారా అతని రచనా పటిమ క్రమేపీ ఏ తీరున అభివృద్ధి చెందిందన్నది
మనమే స్వయంగా ఓ అంచనాకు రావచ్చు. అయితే ఈ రచనల ఉపయోగం ఇంతవరకేనా? కథతో వీటికి ఏ సంబంధమూ లేదా? ఉంది. నబొకొవ్ ఈ
రచనల్ని ఫియొదొర్‌ని కొలిచేందుకు పనికొచ్చే కొలతల్లానే గాక, పరోక్షంగా
కథకు గట్టి నేపథ్య పరిపుష్టి కలిగించేలా కూడా వాడుకుంటాడు. ఉదాహరణకు, ఫియొదొర్ కవితలు అందమైన కొన్ని చెదురుమదురు దృశ్యాల్లో అతని బాల్యాన్ని
మనకు చూపిస్తాయి; అతని తండ్రి జీవితచరిత్ర బాల్యంతో పాటూ,
తండ్రితో అతనికున్న అనుబంధాన్ని కూడా మన ముందుంచుతుంది. కానీ వీటితో
ఒక సమస్య వుంది. ఈ రచనలు ఇలా పరోక్షంగా కథకు దోహదపడినా, వీటి
నిడివి మాత్రం అప్పటిదాకా సాగిన కథనపు నడకను నెమ్మదించేలా చేస్తుంది. పుస్తకంలో
ఇరవై పేజీల దాకా ఆక్రమించే ఫియొదొర్ కవిత్వం, నలభై అయిదు
పేజీలు సాగే అతని తండ్రి జీవితచరిత్ర, తొంభై పేజీల “లైఫ్ ఆఫ్
చెర్నిషెవ్‌స్కీ” పుస్తకం ... ఇవి చదవటం పూర్తి చేసి, మళ్ళా
కథలోకి అడుగుపెట్టేసరికి, అంతకుముందు కథనం ఎక్కడ దాకా వచ్చి
తెగిందో ఆ కొసను పాఠకుడు వెంటనే అందుకోలేకపోవచ్చు. ఇలాంటప్పుడు ఈ “కథా సంక్షిప్తం”
బాగా ఉపయోగపడుతుందని నేననుకుంటున్నాను.
2) నబొకొవ్‌కు ఓ నమ్మకం వుంది. మన
జీవితంలో వర్తమానం (ప్రస్తుతం) అనేది మనకు ఎంత గందరగోళంగా కనిపించినా, అయోమయంగా తోచినా, అందులో అంతర్లీనంగా ఓ పద్ధతైన
అల్లిక వుంటుందని ఆయన నమ్మాడు. అయితే ఈ అల్లిక వర్తమానంలో మనకు స్ఫురించదనీ,
వర్తమానం గతంగా మారిపోయాకా మాత్రమే–ఆ గతాన్ని
మనం వెనుదిరిగి శ్రద్ధగా అవలోకించినపుడు మాత్రమే–ఇది
బయటపడుతుందనీ ఆయన విశ్వసించాడు. దీన్నే ఈ నవలలో చూపించాలనుకున్నాడు. ఇక్కడ
ఫియొదొర్ కూడా నవల చివరి అధ్యాయంలో తన గత మూడేళ్ళ జీవితంలోనూ విధి అల్లిన పద్ధతైన
అల్లిక ఒకటి దాగివుందని కనుగొంటాడు. ఇలా కనుగొనేదాకా–అంటే
చివరి అధ్యాయం దాకా–ఆ అల్లికేంటన్నది ఒక పాత్రగా అతనికీ
ప్రస్ఫుటం కాకూడదు, పాఠకులుగా మనకీ తెలియకూడదు. అప్పుడే నవల
రక్తి కడుతుంది. ఇలా ఈ అల్లిక మరీ కొట్టొచ్చినట్టూ కాకుండా అందీ అందనట్టు చూపించడం
కోసం నవల మొదటి అధ్యాయాల్లో నబొకొవ్ వాస్తవ జీవితంలో ఉండేంత గందరగోళాన్నీ తెచ్చి
నింపుతాడు. ఇక్కడ నవల ఎటుపోతోందో ఓ పట్టాన అంతుపట్టదు. ఎన్నో సన్నివేశాలు... ఏవి
కథను ముందుకు నడిపేవో, ఏవి ఉత్తపుణ్యానికి అక్కడున్నాయో మనకు
అర్థం కాదు; ఎన్నో పాత్రలు... ఏవి చివరిదాకా తోడొస్తాయో,
ఏవి కొన్ని పేరాల్లో తమ ప్రదర్శన ముగించుకుని పరదా వెనక్కి
జారుకుంటాయో మనకి తెలియదు; కథానాయకుని ముందు ఎన్నో దారులు...
ఏ దారి అతన్ని గమ్యం దాకా తీసుకెళుతుందో, ఏది అర్థాంతరంగా
అడ్డుగోడ తగిలి ఆగిపోతుందో మన ఊహకందదు. గోడన ఒక తుపాకీ వుందంటే చివరి అంకంలోగా అది
పేలి తీరాలన్న సూత్రం రంగస్థల నాటకాలకే వరిస్తుంది; జగన్నాటకానికి
కాదు. మన చుట్టూ వున్న వాస్తవ జీవితంతో సాటిరాగల ఇంతటి గందరగోళాన్ని, అనూహ్యతనూ సృష్టించగలిగినప్పుడు మాత్రమే ఈ నవల ఎత్తుగడ పారుతుందని నబొకొవ్‌కు
తెలుసు. కాని పాఠకులకు తొలి పఠనంలో ఇదంతా కాస్త గాభరా పుట్టిస్తుంది. అందుకే పై
సంక్షిప్త కథలో నేను కథను ముందుకు నడిపే సన్నివేశాల్నీ, కడ
దాకా వచ్చే పాత్రల్నీ, కథానాయకుణ్ణి చివరి పర్యవసానానికి
చేర్చే మార్గాన్నీ మాత్రమే ముఖ్యంగా నొక్కి చెప్పాను. మిగిలిన వాటిని
మినహాయించాను. ఇది ఆ రకంగా దిక్సూచిలా ఉపయోగపడవచ్చు.
అయితే దీనివల్ల ఒక ఇబ్బంది వుంది. ఫియొదొర్, జినాల్ని కలపడానికి విధి పడ్డ ప్రయాసే
ప్రముఖంగా ఎత్తి చూపించడం వల్ల పై “కథా సంక్షిప్తా”న్ని చదివిన పాఠకులకు ఈ నవల ఓ
మామూలు ప్రేమకథేనేమో అనిపించవచ్చు. అలా ఓ సాంప్రదాయక ప్రేమకథను ఊహించి, నాయికా నాయకుల మధ్య ప్రేమ సన్నివేశాల్ని, వలపు
ముచ్చట్లని, విరహసంగమాల్నీ ఆశించి వచ్చేవారికి ఇక్కడ పెద్ద
భంగపాటే హారతిపడుతుంది. మామూలుగా చాలా నవలల్లో ప్రేయసీప్రియుల ప్రేమ గాఢతేంటో వారి
మధ్య నడిచే ప్రణయ సన్నివేశాల ద్వారా తెలుస్తుంది, లేదా రచయిత
వారి మనసుల్లో జొరబడి మన కోసం తవ్విపోసిన భావోద్వేగాల బరువు ద్వారా తెలుస్తుంది.
కానీ ఈ నవలలో ఫియొదొర్, జినాల మధ్య సన్నివేశాలు రెండుమూడు
కంటే ఎక్కువుండవు; వాటిని కూడా ప్రణయ సన్నివేశాలనలేం,
వాటిల్లో ఎక్కడా ప్రేమ కబుర్లు వినపడవు. ఫియొదొర్ జినా పట్ల ప్రేమను
ప్రత్యక్షంగా ఎక్కడా వ్యక్తం చేయడు. అసలు జినా నవలలో అడుగుపెట్టేసరికే పుస్తకం సగం
పూర్తయిపోతుంది. (నా దగ్గరున్న 366 పేజీల వింటేజ్ ప్రచురణలో
ఆమె 177వ పేజీలో వస్తుంది.) మరి ఇది ఎలాంటి ప్రేమకథ? ఫియొదొర్ నవల చివర్లో చెప్పినట్టు ఈ నవల జినా పట్ల “ప్రేమ ప్రకటన” ఎలా
అవుతుంది? ఎలా అవుతుందో నవల నిర్మాణాన్ని పరిశీలిస్తే
అర్థమవుతుంది. ఫియొదొర్ తన నవల మొత్తాన్నీ జినాను కేంద్రంగా చేసుకుని అల్లుతాడు.
ఆమె రావటం నవల మధ్యలోనే వచ్చినా, అంతకుముందు నడిచిన కథంతా
ఆమె రాక కోసం ఎదురు చూస్తుంది, అటుతర్వాతి కథంతా ఆమె రాక
ప్రభావంతో ఉరకలెత్తుతుంది. ఐదు అధ్యాయాల ఈ నవలలో ఆమె సరిగ్గా మధ్యనున్న మూడో
అధ్యాయం నడిమి భాగాన ప్రవేశిస్తుంది. ఈ మూడవ అధ్యాయానికి చెరోప్రక్కా వున్న రెండవ
- నాల్గవ అధ్యాయాలూ, ఒకటవ - ఐదవ అధ్యాయాలూ ఫియొదొర్
జీవితంలోనూ, కళలోనూ జినా రాక ముందు పరిస్థితినీ, వచ్చిన తర్వాత పరిస్థితినీ పరస్పరం ఒకదాంట్లో ఒకటి, ఎదురుబొదురు
నిలబెట్టిన అద్దాల్లా, ప్రతిబింబిస్తుంటాయి. ఉదాహరణకి జినా
రాకతో అతని కళలో వచ్చే మార్పే తీసుకుందాం. రెండవ అధ్యాయంలో ఫియొదొర్ తను ప్రాణంలా
అభిమానించే తండ్రి జీవితచరిత్ర రాయాలని ప్రయత్నిస్తాడు; కానీ
విఫలమై మధ్యలోనే మానుకుంటాడు. దీనికి భిన్నంగా నాలుగో అధ్యాయంలో తనకేమాత్రం
తెలియని, పైపెచ్చు తను ద్వేషించే నికొలాయ్ చెర్నిషెవ్‌స్కీ
జీవితచరిత్రను సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతాడు. అలాగే ఒకటవ అధ్యాయం మొదలవటమే
ఫియొదొర్ కవితల పుస్తకాన్ని పొగుడుతూ ఓ సమీక్ష వచ్చిందన్న అబద్ధంతో మొదలవుతుంది.
దీనికి భిన్నంగా ఐదవ అధ్యాయం ఫియొదొర్ రాసిన “లైఫ్ ఆఫ్ చెర్నిషెవ్‌స్కీ”
పుస్తకాన్ని తెగుడుతూ వచ్చిన బోలెడన్ని సమీక్షలతో మొదలవుతుంది. ఒకటవ అధ్యాయం
అతనికి రచయితగా ఇంకా గుర్తింపురాక నలుగురిలో నారాయణాగా వుండటాన్ని చూపిస్తే,
జినా వచ్చింతర్వాత, ఐదో అధ్యాయం అతను అందరి
దృష్టిలోనూ పడటాన్ని చూపిస్తుంది. ఒకటవ అధ్యాయంలో అతను ఒక రాత్రి తాళం లేని
కారణంగా గదిలోకి వెళ్ళలేక అనుభవించిన ఒంటరితనాన్ని చూస్తాం. ఐదవ అధ్యాయంలో ఇంటికి
తాళం లేకపోయినా జినా సాంగత్యపు తోడు అతనికుందన్న నిశ్చింతతో ఊపిరిపీల్చుకుంటాం. ఈ
విధంగా, నవల్లో ఫియొదొర్ జీవితం జినా రాక ముందు రోగిష్టివాడి
ఈసీజీలా ఉసూరుమంటూ నడిస్తే, జినా వచ్చిన తర్వాత భూకంపపు
రిక్టర్ స్కేలులా ఉప్పొంగుతూ సాగిపోతుంది. అలా సాగిపోయిందని మనకి తెలిసేలా తన
నవలను నిర్మిస్తాడు ఫియొదొర్. “నువ్వు కలవక ముందు నా జీవితం”, “నువ్వు కలిసిన తర్వాత నా జీవితం” అంటూ ఇలా తనకు ప్రాణమైన అక్షరాల సాయంతో
ఇంత గొప్పగా చెప్పటం కన్నా అతను ఆమెకి చేయగలిగే “ప్రేమ ప్రకటన” వేరే ఏముంటుంది.
అందుకే, “ద గిప్ట్” ప్రేమ సన్నివేశాలు లేని ప్రేమకథ.
సరే ఇప్పటి వరకూ పుస్తకం గురించి చెప్పుకున్నాం గనుక, ఇప్పుడు కాస్త రచయిత గురించి కూడా
చెప్పుకుందాం. ఈ పుస్తకంతోనే నబొకొవ్‌ని చదవటం మొదలుపెట్టిన పాఠకులకి ఆయన రచనా
విధానం గురించి కొన్ని వివరాలు ఇవ్వడం అవసరమని నేననుకుంటున్నాను. ఆయన తాత్విక
దృక్పథం, ఆయన శైలి, ఆయన తన నవలల్లో
కాలాన్ని వాడుకునే ప్రత్యేకమైన తీరూ... వీటి గురించి నాకు తోచింది చెప్తాను:
నబొకొవ్ – తాత్త్వికత:
ప్రతీ రచయితనీ ఏదో ఒక చట్రంలో ఇరికించందే గుల తీరని
వాళ్ళు నబొకొవ్‌ని స్టైలిస్టుగా ముద్రవేస్తూంటారు. అసలా ముద్రకి అర్థం పర్థం వుందో
లేదో తర్వాతి పేరాల్లో తెలుస్తుంది. దాని సంగతి ప్రస్తుతానికి పక్కన పెడదాం. ఈ
ముద్ర వేసేవాళ్ల అంతరంగపుటుద్దేశం వేరే వుంది. నబొకొవ్ దగ్గర శైలి తప్ప ఏమీ లేదని, ఆయన రచనలు పైకి డాబుసరిగా కన్పించే
డొల్లలనీ వాళ్ళ అభిప్రాయం. కానీ నాకు ఇప్పటిదాకా పరిచయమున్న రచయితలందరిలోనూ ఆయన
దగ్గరున్నంత తాత్త్విక గాఢత నేను వేరే ఎవ్వరి దగ్గరా చూడలేదు. ఇది కూడా కథల మధ్య
ఆయనే స్వయంగా చొరబడో, లేదా పాత్రల నోటిలో కూరడం ద్వారానో
వెలిబుచ్చే తాత్త్వికత కాదు. అసలాయన ఏదీ ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ
కూడా చెప్పడు. తరచి చూస్తే మాత్రం ఆ రచనలన్నీ వ్యక్తిగా ఆయనకున్న బలమైన తాత్త్విక
పునాదుల మీదే భద్రంగా నిలబడి వున్నాయని అర్థమవుతుంది. కాబట్టి ఆయన రచనల్లో
తాత్త్వికత గురించి తెలుసుకోవాలంటే ముందు ఆయన తాత్త్విక దృక్పథమేమిటో
తెలుసుకోవాలి.
జీవితంలో మిమ్మల్ని బాగా ఆశ్చర్యపరచేది ఏమిటీ అని ఒక
ఇంటర్వ్యూలో అడిగితే ఆయనిచ్చిన సమాధానం ఇది:
NABOKOV: ... the
marvel of consciousness–that sudden window swinging open on a sunlit landscape
amidst the night of non-being.
పుట్టుకకు ముందు చీకటి, మరణం తర్వాత చీకటి. ఈ రెంటి మధ్యా మనకు
కాసేపు ఈ ప్రపంచంలో మనడానికి అవకాశం లభిస్తుంది. పురుగూ పుట్రా, గొడ్డూ గోదా, చెట్లకూ పుట్లకూ కూడా ఈ అవకాశం
లభిస్తుంది. మరి వీటి నుంచి మనల్ని వేరు చేసేదేమిటి? ఇదే
కాన్షస్‌నెస్, జీవిస్తున్నామన్న స్పృహ, మానసిక చైతన్యం ... ఇదే ఈ ప్రపంచంలో మనిషి జీవితం గిట్టుబాటయ్యేట్టు
చేసేది. పుట్టుకతో రాజుకున్న ఈ చైతన్యం, మళ్ళా మరణంతో
ఆరిపోయేలోపులో, మనకు లెక్కలేనన్ని అద్భుతాల్ని చూపిస్తుంది.
వనాలూ, వార్షుకాభ్రాలూ, రంగులూ,
సంగీతం, సముద్రాకాశాలు, ప్రేమానుబంధాలూ,
పుస్తకాలూ, సెక్సూ ... ఇలా కొట్టొచ్చినట్టూ
కనిపించేవే కాదు; కరెంటు తీగ మీద వరసాగ్గా వాలిన పిచ్చికల
సందడి, గడ్డి పరక మీద ఆరుద్ర పురుగూ, ఆమె
చెంపల నూగూ ... ఇలా వెతికే కళ్ళకు మాత్రమే కనిపించే అద్భుతాలూ ఎన్నెన్నో! జీవితం
ఇంత అద్భుతమైనపుడు దానికిక అర్థం వుంటే ఏంటి, లేకపోతే ఏంటి?
రోలర్‌కోస్టర్‌రైడ్ మొదలైన చోటే ముగియచ్చుగాక, అయితేనేం, సాగినంతకాలం కేరింతలు కొట్టించదూ? అందుకే అస్తిత్వవాదుల నిరాశా నిస్సత్తువలు నబొకొవ్‌లో కనిపించవు. అలాగే
మిథ్యావాదుల్లా మానవాతీతమైన ఘోష, భౌతిక వాదుల్లా “తాపట్టిన కుందేటికి మూడే కాళ్ళ”నే గుడ్డితనమూ కూడా
కనిపించవు. ఆయన ఈ ప్రపంచంలో తన వంతు కేటాయింపుగా అందిన జీవితాన్ని, దాన్ని ఆస్వాదించేందుకు లభ్యమైన మానసిక చైతన్యాన్ని, అమూల్యమైన బహుమానాలుగా స్వీకరించాడు. వీటిని సద్వినియోగ పరచుకునేందుకు
కళను వాడుకున్నాడు. నబొకొవ్ రచనలన్నింటినీ
మూకుమ్మడిగా ఒక్కముక్కలో “సెలబ్రేషన్ ఆఫ్ కాన్షస్‌నెస్”
అని చెప్పేసుకోవచ్చు. కానీ నబొకొవ్‌కి తెలుసు, మన మానసిక చైతన్యం మనకి ఎంత చూపిస్తుందో, అంతే
చూపించకుండా దాచేస్తుందని; అది చూపించేది కూడా మనలోని
ప్రపంచపు ప్రతిఫలనాల్నే తప్ప అసలు ప్రపంచాన్ని కాదని; అంతేకాదు
...
“...he knew that
the external world resists the desires, however desperate, of the world within.
While he often glories in the power of human consciousness, he also laments the
absurdity of its limits: death, solitude, our exclusion even from our own past.
Thrilled by all that the mind offers but aghast at all that it shuts out,
Nabokov devotes his whole oeuvre to ascertaining our “position in regard to the
universe embraced by consciousness” and to analyzing the bizarre discrepancy
between the richness of our life, as it accumulates moment by moment, and its
becoming inaccessible, so utterly unlike the present around us, as it retreats
into the past or as we advance into death.” ~ from “Vladimir Nabokov:
Russian Years” by Brain Boyd.
(“...ఆయనకు తెలుసు బయటి ప్రపంచం మన లోపలి ప్రపంచపు
వాంఛల్ని, అవెంత తీవ్రమైనవైనా, వ్యతిరేకిస్తుందని. ఆయన తరచూ మానవ చైతన్యానికున్న
శక్తి పట్ల ఆనందిచంటం తోపాటూ, దానికున్న అసంబద్ధ పరిమితుల్ని తల్చుకుని వాపోతాడు కూడా: ఉదాహరణకు మృత్యువు, ఒంటరితనం,
మన గతం నుంచి మనకే బహిష్కరణ వంటివి. మన చైతన్యం మనకు ఎంత అందిస్తోందోనన్న పులకరింత
తోపాటూ అది మన నుంచి ఎంత వెలివేస్తోందోనన్న గగుర్పాటుతో, నబొకొవ్
తన మొత్తం రచనా సంచయాన్ని “చైతన్యంతో ఆవృతమైన ఈ విశ్వంలో మనిషి
స్థానం” ఏమిటన్నది నిర్థారించేందుకు వినియోగిస్తాడు; క్షణ క్షణంగా పోగుపడుతూన్న జీవితపు సుసంపన్నత ఒకవైపూ, ఆ జీవితం గతంలోకి మళ్ళే కొద్దీ, లేదా మనం చావు వైపు వెళ్ళే
కొద్దీ, మన చుట్టూ వున్న వర్తమానంతో అస్సలు పోలికే లేకుండాపోయి,
మనకి అందనంత దూరమైపోవటం మరోవైపు; ఈ రెంటి మధ్యనున్న
అగాథాన్ని విశ్లేషించేందుకు తన రచనలు మొత్తం అంకితం చేస్తాడు.”)
ఈ వర్తమానానికీ గతానికీ మధ్య
అగాథాల్నీ, మానవ చైతన్యపు
పరిమితుల్నీ మనిషి అధిగమించలేకపోవచ్చు. కానీ ఆ మనిషి కళాకారుడైతే మాత్రం కళ ద్వారా
కొంతవరకూ ఆ సౌలభ్యాన్ని అందిపుచ్చుకోగలడు. కళాకారుడు, ముఖ్యంగా
రచయిత, తన చైతన్యంతో మాత్రమే సరిపుచ్చుకోడు; దాని పరిధుల్ని దాటుకుని అవతలి వ్యక్తుల చైతన్యంలోకి కూడా ప్రవేశించే
ప్రయత్నం చేస్తాడు. అహపు బంధనాల్ని ఛేదించి ఎటంటే అటు విశృంఖలంగా విస్తరించాలని
తహతహలాడతాడు. నబొకొవ్ ఈ స్వేచ్ఛని తన రచనల్లో పూర్తిగా వినియోగించుకున్నాడు. రచనా
వ్యాసంగపు తొలి రోజుల్లో కేవలం తన విలువల్ని ప్రతిబింబించే మెదళ్లనీ, ప్రపంచాల్నే చిత్రీకరించినా, రచయితగా పరిణతి
సాధించేకొద్దీ తన విలువలకు పూర్తిగా వ్యతిరేకమైన మెదళ్లలోకీ, ప్రపంచాల్లోకీ కూడా జొరబడే ప్రయత్నం చేసాడు. దీని ఫలితమే హంబర్ట్ హంబర్ట్
(లొలీటా) లాంటి వికృత పాత్రల సృష్టి. ఇలాంటి విలోమ ప్రపంచాల సృజన వెనుకనున్న ఆయన
ఉద్దేశ్యం మంచిదా కాదా అని మాత్రం మనం సందేహించనక్కర్లేదు. నబొకొవ్
ఉద్దేశపూర్వకంగా సృష్టించిన ఇలాంటి ప్రపంచాల్లోకి వెళ్ళినప్పుడు మనం ఉక్కిపోతాం,
వాటి క్రూరత్వానికి జడిసిపోతాం. ఫలితంగా ఏ విలువలైతే ఆ ప్రపంచాల్లో
లోపించాయో వాటిపై పరోక్షంగా మమకారం పెరుగుతుంది. నిజానికి నబొకొవ్ వీటిలో ఆ
విలువల్ని పూర్తిగా లోపించేట్టు కూడా చేయడు. తరచి చూడాలే గానీ, ఈ ఇరుకు ప్రపంచాల పొలిమేరల్లో ఆయన ప్రపంచంలో ప్రేమించే మార్దవమూ, నమ్మిన విలువలూ పొగమంచు కావలనున్న దృశ్యాల్లా వ్యక్తావ్యక్తంగా
కనిపిస్తూనే వుంటాయి. ఆయన నవల “లొలీటా”నే
ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. పద్నాలుగేళ్ళ లొలీటాని ఏ అపరాధభావనా లేకుండా
వాడుకునే హంబర్ట్ హంబర్ట్ ఫిడోఫిలిక్ మెదళ్ళో ప్రయాణిస్తున్నంతసేపూ, దాని తొక్కిడికి చిదుగుల్లా చితికి ఛిద్రమవుతున్న ఆమె బాల్యపు జాలి
చప్పుళ్ళు కూడా మనకు లీలగా వినిపిస్తూనే వుంటాయి. నేను చిన్నప్పుడో హిందీ సినిమా
చూసాను. అందులో హీరో శశికపూర్ అని గుర్తు. అతనో వేటగాడు. అతని మూణ్ణాల్గేళ్ళ
కొడుకు ఓ సారి ఇంట్లో ఆడుకుంటూ, అటుగా వచ్చిన పిల్లికి జడిసి
ఏడవటం మొదలు పెడతాడు. మర్నాడు పిల్లాడి భయం పోగొట్టడానికి శశికపూర్ వాణ్ణి ఓ
సర్కస్ సింహాలబోనులో పడేస్తాడు. తాను తాపీగా పక్కన నుంచుని చూస్తాడు. నబొకొవ్
సాధారణంగా పాఠాలు చెప్పడు; చెప్తే మాత్రం అవి ఇలాంటి
క్రూరత్వంతోనే వుంటాయి. కానీ ప్రస్తుత నవల “ద గిప్ట్”
దీనికి భిన్నం. ఇందులో అలాంటి పాఠాలూ లేవు, ఈ
ప్రపంచపు విలువలు నబొకొవ్ నమ్మిన విలువలకు విలోమమూ కాదు.
నబొకొవ్ – శైలి:
నబొకొవ్ రచనల గురించి పోచికోలు పాఠకుల్నించీ తరచూ వచ్చే ఫిర్యాదు ఒకటుంది.
ఆయన శైలి మితి మీరిన వర్ణనలతో, కఠిన పదాలతో మరీ సంక్లిష్టంగా వుంటుందని అంటూంటారు. ఈ అపోహకి సమాధానం
చెప్పాలంటే, అసలు శైలి అంటే ఏంటో వివరంగా తెలుసుకోవాలి.
అందుగ్గానూ శైలి గురించి ప్రోస్ట్ (Proust) చెప్పిన ఒక మాట
క్రింద ఇస్తున్నాను:
“Style is not at
all an embellishment as certain people think, it is not even a matter of
technique, it is – like colour with painters – a quality of vision, the
revelation of the private universe that each one of us can see and which others
cannot see. The pleasure an artist affords us is to introduce us to one
universe the more.”
(కొందరు భావించేట్టు శైలి అనేది ఒక
అలంకారం ఎంతమాత్రమూ కాదు, ఇది మెళుకువకు సంబంధించిన విషయమూ
కాదు. చిత్రకారులకు వర్ణాలు ఎలాగో, అలాగే ఇది ఒక దృష్టి
తత్త్వం, చూసే విధానం. మనలో ప్రతి ఒక్కరూ ఎవరికి వారు
మాత్రమే చూడగలిగే – వేరెవ్వరూ చూడలేని – ఆంతరంగిక ప్రపంచపు వ్యక్తీకరణ. ఇలా మనకు ఒక ప్రపంచాన్ని అదనంగా పరిచయం
చేయడమే కళాకారుడు మనకు ప్రసాదించే ఆనందం.)
మనలో ప్రతి ఒక్కరం ప్రపంచాన్ని మనకి
మాత్రమే ప్రత్యేకమైన కళ్ళతో చూస్తాం. ఆనందమో విషాదమో, ఆశో నిరాశో, కుతూహలమో
నిర్వేదమో... ఇలా మనం ప్రపంచాన్ని చూసే తీరుకు ఒక ప్రత్యేకమైన లక్షణం వుంటుంది;
కాస్త జన్మసిద్ధమూ, కాస్త పరిసర ప్రభావితమూ ఐన
ప్రత్యేకమైన దృక్కోణం వుంటుంది. పైకి అంతా ఒకేలా కనిపించవచ్చు. మనుషులందర్నీ
రకరకాల మూసలుగానూ, నమూనాలుగానూ కుదించి బండ పద్దు కట్టేయడం
చాలా తేలికనిపించవచ్చు. కానీ ఒక మనిషిని లోతుగా తెలుసునే కొద్దీ, అతని అంతరాంతరాళాల్లోకి ఒక్కో మెట్టూ దిగే కొద్దీ, మిగతా
మానవ సమూహమంతటి నుంచీ అతణ్ణి వేరు చేసే ప్రత్యేక దృక్కోణం ఒకటి పరిచయమవుతుంది. ఆ
మనిషి దైనందిన చర్యలు, నిర్ణయాలు, మాటలూ,
వాదులాటలూ, ఇతర కార్యకలాపాలు వేటిలోనూ ఈ
దృక్కోణం బాహటంగా వ్యక్తం కాకపోవచ్చు. కానీ అతనో కళాకారుడైతే మాత్రం అతని కళలో ఇది
వ్యక్తమై తీరుతుంది. ఎందుకంటే కళకు మూలాలు అంతరాంతరాళాల లోతుల్లోనే వుంటాయి.
సమూహపు అంగీకారం కోసం దేబిరించే పాపులర్ రచనల్ని పక్కనపెడితే, నిజాయితీగా రాసే ఏ రచనైనా ఆ లోతుల్నించే వస్తుంది. తత్ఫలితంగా ఆయా లోతులకి
మాత్రమే ప్రత్యేకమైన పురుగూ పుట్రా, మణులూ మాణిక్యాలూ ఇక్కడ
వ్యక్తమై తీరతాయి. అతని అద్వితీయమైన దృక్కోణం ఆ రచనలో వద్దనుకున్నా ప్రకటితమై తీరుతుంది.
అతను ఎన్నుకొనే మెటఫొర్లూ ఉపమానాలూ; అతని వాక్యాల పొడవూ
పొట్టీ; వర్ణనలు ఎక్కువుండటమూ, తక్కువుండటమూ;
అతని వ్యాకరణమూ, విరామ చిహ్నాలూ; అతని పదాల ఎంపికా... ఇలా ప్రతీ స్వల్పమైన అంశమూ దీని ద్వారా
ప్రభావితమవుతుంది. ఇదే అతని శైలి అవుతుంది.
సోదాహరణంగా వివరించేందుకు ప్రయత్నిసాను. కింద ఇద్దరు
వేర్వేరు రచయితలవి రెండు రచనా సంగ్రహాలిస్తున్నాను. మొదటిది మార్సెల్ ప్రోస్ట్‌ప్రసిద్ధ
రచన “ఇన్ సెర్చ్ ఆఫ్ ఎ లాస్ట్ టైమ్” లోంచి తీసుకున్నది. ఇందులో నేరేటర్ తను
అలవాటుగా నిద్రపోయే పద్ధతిని వివరిస్తున్నాడు. పుస్తకం చదువుతూ చదువుతూ నిద్రలోకి
జారుకోవడం, ఈలోగా కొవ్వొత్తి
కరిగి ఆరిపోవడం, అరగంట తర్వాత చీకట్లో మెలకువరావటం, దూరంగా వినిపిస్తున్న రైలు కూతలు... ఇవన్నీ వర్ణిస్తున్నాడు. రెండోది
శామ్యూల్ బెకెట్ రచన “మాలీ” (Molloy) లోంచి తీసుకున్నది.
ఇందులో నేరేటర్ ఒకటి కాదు, చాలా చెప్తున్నాడు. అతని తల్లి
ఇటీవలే చనిపోవటం, తల్లి చనిపోయిన గదిలోనే తానిప్పుడు మకాం
పెట్టడం, తను కూడా చనిపోయే స్థితిలో వుండటం, అందరికీ వీడ్కోళ్ళు పలకటం, తన పాత ప్రేమలూ... ఇవన్నీ
చెప్తున్నాడు. (ఇవే ఎందుకిస్తున్నాను? రెండు శైలుల్లోనూ తేడా
ప్రస్ఫుటంగా తెలుస్తోంది. రెండు రచనలూ ఉత్తమ పురుషలో సాగుతున్నాయి. రెండూ ప్రెంచి
అనువాదాలు. రెండూ నబొకొవ్‌ఇష్టపడ్డవి. అన్నిటికన్నా ముఖ్యంగా, రెండూ నాకు అందుబాటులో వున్నవి.)
1) For a long
time I used to go to bed early. Sometimes, when I had put out my candle, my
eyes would close so quickly that I had not even time to say “I’m going to
sleep.” And half an hour later the thought that it was time to go to sleep
would awaken me; I would try to put away the book which, I imagined, was still
in my hands, and to blow out the light; I had been thinking all the time, while
I was asleep, of what I had just been reading, but my thoughts had run into a
channel of their own, until I myself seemed actually to have become the subject
of my book: a church, a quartet, the rivalry between Francois-I and Charles-V.
This impression would persist for some moments after I was awake; it did not
disturb my mind, but it lay like scales upon my eyes and prevented them from
registering the fact that the candle was no longer burning. Then it would begin
to seem unintelligible, as the thoughts of a former existence must be to a
reincarnate spirit; the subject of my book would separate itself from me,
leaving me free to choose whether I would form part of it or no; and at the
same time my sight would return and I would be astonished to find myself in a
state of darkness, pleasant and restful enough for the eyes, and even more,
perhaps, for my mind, to which it appeared incomprehensible, without a cause, a
matter dark indeed.
I would ask myself what o’ clock it could be; I
could hear the whistling of trains, which, now nearer and now farther off,
punctuating the distance like the note of a bird in a forest, showed me in
perspective the deserted countryside through which a traveler would be hurrying
towards the nearest station: the path that he followed being fixed for ever in
his memory by the general excitement due to being in a strange place, to doing
unusual things, to the last words of conversation, to farewells exchanged
beneath an unfamiliar lamp which echoed still in his ears amid the silence of
the night; and to the delightful prospect of being once again at home.
2) I am in my
mother’s room. It’s I who live there now. I don’t know how I got there. Perhaps
in an ambulance, certainly a vehicle of some kind. I was helped. I’d never have
got there alone. There’s this man who comes every week. Perhaps I got there
thanks to him. He says not. He gives me money and takes away the pages. So many
pages, so much money. Yes, I work now, a little like I used to, except that I
don’t know how to work any more. That doesn’t matter apparently. What I’d like
now is to speak of the things that are left, say my good-byes, finish dying.
They don’t want that. Yes, there is more than one, apparently. But it’s always
the same one that comes. You’ll do that later, he says. Good. The truth is I
haven’t much will left. When he comes for the fresh pages he brings back the
previous week’s. They are marked with signs I don’t understand. Anyway I don’t
read them. When I’ve done nothing he gives me nothing, he scolds me. Yet I
don’t work for money. For what then? I don’t know. The truth is I don’t know
much. For example my mother’s death. Was she already dead when I came? Or did
she only die later? I mean enough to bury. I don’t know. Perhaps they haven’t
buried her yet. In any case I have her room. I sleep in her bed. I piss and
shit in her pot. I have taken her place. I must resemble her more and more. All
I need now is a son. Perhaps I have one somewhere. But I think not. He would be
old now, nearly as old as myself. It was a little chambermaid. It wasn’t true
love. The true love was in another. We’ll come to that. Her name? I’ve
forgotten it again. It seems to me sometimes that I even knew my son, that I
helped him. Then I tell myself it’s impossible. It’s impossible I could ever
have helped anyone. I’ve forgotten how to spell too, and half the words. That
doesn’t matter apparently. Good.
సాధారణంగా పడక అలవాట్ల లాంటి మామూలు
వస్తువుకు ఓ రెండు మూడు వాక్యాల్లో తేలిపోయే సులభమైన శైలిని ఆశిస్తాం. తల్లి
చనిపోవడం లాంటి గంభీరమైన వస్తువుకు ఉద్వేగంతో వణికే, రూపకాల్తో తొణికే బరువైన శైలిని ఆశిస్తాం. కానీ ఇక్కడ
వ్యవహారం తారుమారుగావుంది. పడక అలవాట్ల వర్ణన సుదీర్ఘమైన వాక్యాలతో, లోతైన మెటఫొర్లతో, సంక్లిష్టమైన శైలిలో వెళ్తుంటే;
తల్లి చనిపోవడం లాంటి విషాదాలున్న వస్తువు ఏ ఉద్వేగమూ లేని ఎండు
వాక్యాలతో తేలికైన శైలిలో సాగిపోతుంది.
రెండు శైలుల్లో వున్న ఈ తేడా ఆ వస్తువుల్ని బట్టి రాలేదు. ఆయా రచయితలు ఆ
వస్తువుల్ని స్వీకరించిన విధానాన్ని బట్టి వచ్చింది. వారి వారి దృక్కోణాల్ని బట్టి
వచ్చింది. వీళ్ళిద్దరి వ్యక్తిత్వాల గురించీ కొంత తెలుసు కాబట్టి వివరించగలను.
ప్రోస్ట్ తీవ్రమైన భావోద్వేగాలున్న మనిషి. సంతోషమైనా విచారమైనా మజ్జలోకంటా
పీల్చుకుని ఊగిపోయేవాడు. దాన్ని అక్షరాల్లోనూ అంతే తీక్ష్ణతతో వ్యక్తీకరించాలని
తపించేవాడు. బేలతనం బాగా వుంది. చిన్నప్పుడు తల్లి అలవాటుగా పెట్టే గుడ్‌నైట్ కిస్
ఎప్పుడన్నా మర్చిపోతే, రాత్రంతా నిద్రపోలేక తీవ్రంగా యాతన
పడేవాడట. దీనికి భిన్నంగా బెకెట్ నిర్వికారంగా కనిపించే మనిషి, పక్కా పెసిమిస్టు. స్వయానా రచయిత అయ్యుండీ, “ప్రతీ
పదం నిశ్శబ్దం మీద అనవసరమైన మరక లాంటిది” అంటూ అక్షరాల పట్ల తన అపనమ్మకాన్ని
వ్యక్తం చేసినవాడు. చాలా నిబ్బరం వున్నవాడు. ఓసారి ఆయన్ని ఓ జులాయి డబ్బుకోసం దారి
కాసి కత్తితో పొడిచాడు. దాదాపు చావు దాకా వెళ్ళి తిరిగొచ్చాడు. తర్వాత కోర్టులో ఆ
పొడిచిన వాణ్ణి “ఎందుకు పొడిచావ”ని అడిగాడట. వాడు “సారీ, అలా
ఎందుకుచేసానో తెలీదు” అని సమాధానమిచ్చాడట. ఈయన కేసు ఉపసంహరించుకున్నాడట. ఈ కాస్త
పరిచయమూ ప్రోస్ట్, బెకెట్‌లు ఇద్దరి మధ్యా మౌలిక భేదం ఏమిటో,
అది వాళ్ళ శైలిని ఎలా ప్రభావితం చేసిందో చెప్పగలుగుతుందనుకుంటాను.
ఇలా ఒక రచయిత వ్యక్తిగా ఏంటీ, అతను ప్రపంచాన్ని ఎలా చూస్తాడూ
అన్నదే అతని శైలి అవుతుంది. నిజాయితీగా రాసే ఏ రచయితా ప్రత్యేక శైలి కోసం కృతకమైన
కసరత్తులు చేయడు. నబొకొవ్ శైలి కూడా అలా కృతకంగా వంటబట్టించుకుంది కాదు.
నబొకొవ్ అద్భుతమైన జ్ఞాపకశక్తి గల వ్యక్తి. ఎప్పుడో
యాభయ్యేళ్ళ క్రితం ఒక్కసారి మాత్రమే చూసిన చాప్లిన్ సినిమాల్ని సీన్ తర్వాత సీన్
కళ్ళకు కట్టినట్టు చెప్పగలిగేవాడట. తన రచనల్లోంచి రాండమ్‌గా ఏ వాక్యాన్ని చదివినా
అది ఏ పుస్తకమో, ఆ వాక్యం ఏ
సందర్భంలో వస్తుందో టక్కున చెప్పగలిగే వాడట. ఈ జ్ఞాపకశక్తి కూడా దృశ్య
ప్రధానమైనది. బ్రైన్ బోయ్డ్ రాసిన జీవితచరిత్ర ప్రకారం ఈ విజువల్ మెమొరీ వల్ల
నబొకొవ్ చాలా మానసిక ఒత్తిడికి కూడా గురయ్యేవాడట. “నా ఆలోచనలపై అనవసరపు భారాన్ని
మోపుతోందని” వాపోయేవాడట. కాబట్టి సహజంగానే ఆయన రచనలు దృశ్య ప్రధానంగా ఉంటాయి.
అయితే ఈ వర్ణనలు (అసలు వీటిని “వర్ణనలు” అనగలిగిన పక్షాన) ఊరకే తట్టగానే
ఎత్తుకుతెచ్చి అక్కడ పేర్చినట్టుండవు. “నా జ్ఞానేంద్రియాలెంత చక్కగా పన్చేస్తున్నాయో
చూడండొహో!” తరహా ప్రదర్శనల్లానూ వుండవు. కథకు వాతావరణాన్నివ్వడంతోనే తమ
పనైపోయిందని ఊరుకోవు. పైన ఆయన రచనల్ని “సెలబ్రేషన్ ఆఫ్ కాన్షస్‌నెస్” అని
చెప్పుకోవచ్చన్నాను. అలానే, ఆయన మానసిక చైతన్యంలో
ప్రతిఫలించిన ప్రపంచపు ప్రతీ చిరువివరమూ ఆయన రచనల్లో ఏదో అద్భుతమైన ఆల్కెమిక్
పరిణామాన్ని పొంది మన ముందుకు రావడం చూస్తాం. ఉదాహరణకి ఈ దృశ్యం మనకే గనుక ఎదురైతే
ఎంతమంది ఇలాగ స్వీకరిస్తాం, అందులోని కవిత్వాన్ని ఎంతమంది
పట్టుకోగలుగుతాం:
“As he crossed
toward the pharmacy at the corner he involuntarily turned his head because of a
burst of light that had ricocheted from his temple, and saw, with that quick
smile with which we greet a rainbow or a rose, a blindingly white parallelogram
of sky being unloaded from the van–a dresser with mirror across which, as
across a cinema screen, passed a flawlessly clear reflection of boughs sliding
and swaying not arboreally, but with a human vacillation, produced by the
nature of those who were carrying this sky, these boughs, this gliding façade.”
ఆ చెట్ల కొమ్మలు వృక్షసహజమైన
కదలికతో కాకుండా; ఆ
ఆకాశాన్నీ, ఆ కొమ్మల్నీ, ఆ మొత్తం
జారిపోతున్న సింహద్వారాన్నీ అద్దంలో మోస్తూన్నవారి మానవసహజమైన కదలికతో ఊగడం....
అసలిలాంటి దృశ్యాన్నే తారసపడినా పట్టించుకోం; అందులో మళ్ళీ ఈ
బుల్లి కవిత్వాంశని ఇలా పొల్లుపోకుండా పట్టుకోగలగడమంటే, అది
నబొకొవ్‌కే చెల్లింది. ఆయన రచనల్లో ఇవన్నీ వర్ణనల విభాగంలోకి రావు. ఇవే ఆ
రచనల్లోని అసలు సరుకు. వీటిని నిరాకరిస్తే, ఆయన రచనల్నే
పూర్తిగా నిరాకరించాలి. అంతే తప్ప “వర్ణనలు ఎక్కువో” అని గునిస్తే, మనం మరుగుజ్జులం కాబట్టి లోకాన్ని మోకాళ్ళ మీద దేకమని
దబాయించినట్టుంటుంది. అహ, ఇంకాస్త దగ్గరగా వుండే పోలిక
చెప్పాలంటే, మనం గుడ్డివాళ్ళం కాబట్టి పక్కవాళ్ళనీ గంతలు
కట్టుకొమ్మన్నట్టూ వుంటుంది. మనలో చాలామందికి కళ్ళైతే వున్నాయి గానీ, పాపం వాటికేదో గుర్రపుగంతలు బిగించివున్నట్టూ చాలా పొదుపుగా వాడతాం,
అనునిత్యం తారసపడే ఎన్నో అమూల్యమైన వివరాల్ని గమనించనే గమనించం. ఆయన
మాత్రం తన కళ్ళను చాలా ఉదారంగా ప్రపంచానికి అప్పగించేసాడు, అది బదులిచ్చిన వి’వరాల్ని’ తన రచనల్లో కవిత్వంగా మార్చేసాడు. ఇందులో
వంక పెట్టేందుకేముంది! పైగా ఇవి అసందర్భ వర్ణనలూ కావు. పైన ఊటంకించింది కూడా
సందర్భశుద్ధి కలదే. ఫియొదొర్‌కి ఈ దృశ్యం చూసిన తర్వాత తన కవితల పుస్తకం
గుర్తొస్తుంది. అయితే చాలామంది పాఠకులు, ఇలాంటి పేరాల్లో
స్వతంత్రంగా నిలబడగలిగే తత్త్వానికి ఆకర్షితులై, వీటిని
విడిగా కోట్ చేసి, నబొకొవ్‌ని ఓ “గొప్ప స్టైలిస్టు”గా
తేల్చేస్తారు. షేక్‌స్పియర్ గురించి చెప్పే సందర్భంలో శామ్యూల్ జాన్సన్ అన్న మాట
వీళ్ళకి వర్తింపచేయచ్చు:
“...he that
tries to recommend him by select quotations, will succeed like a pedant in
Hierocles, who, when offered his house to sale, carried a brick in his pocket
as a specimen.”
(ఇటుకను మచ్చుకు పట్టికెళ్ళి ఇంటిని అమ్మజూపేవాడెంత
సఫలమవుతాడో, ఎంపిక చేసిన కొన్ని వాక్యాల ద్వారా ఆయన్ని
సిఫారసు చేసేవాడూ అంతే సఫలమవుతాడు.)
ఇక ఆయన పదాల ఎంపికలో కఠినత్వం
గురించి పెద్దగా చెప్పుకునేందుకేమీ లేదు. ఇందులో ఆయనది ఫ్లొబేర్ వారసత్వం.
ఫ్లొబేర్ లాగే “le mot juste” (the most
precise word) కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఇందులో ఉద్దేశపూర్వకమైన
ఆడంబరం ఏం లేదు. కాబట్టి సర్దుకుపోవాల్సిందే. ఓ ఇంటర్వ్యూలో “మీ రచనల్లో మీరు
సాధించ ప్రయత్నించే సాహితీ విలువలు ఏమిటి?” అని అడిగితే
ఆయనిచ్చిన సమాధానం ఇది:
“Mustering the
best words, with every available lexical, associative and rhythmic assistance,
to express as closely as possible what one wants to express.”
పైన శామ్యూల్ బెకెట్ పదాల మీద
వ్యక్తం చేసిన అపనమ్మకం చూసాం. నబొకొవ్ మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. ఆయన
పదాల్ని నమ్మాడు. వాస్తవ ప్రపంచంతో పోటీ పడగల కాల్పనిక ప్రపంచాల్ని పదాలతో
సమర్థవంతంగా సృష్టించగలమని విశ్వసించాడు. ఈ ప్రతిసృష్టికి అవసరమైనపుడు ఎంత
మూలమూలల్నించైనా పదాలు వెతికి తెచ్చాడు. దొరక్కపోతే, జేమ్స్ జాయ్స్‌లా, అప్పుడప్పుడూ
సొంత పదాల్ని సృష్టించుకున్నాడు కూడా. ఈ నవలలో ఒక చోట ఫియొదొర్‌గురించి రాసిన
వాక్యాల్ని మనం ఆయన క్కూడా నూరుశాతం అన్వయించుకోవచ్చు:
“Since there
were things he wanted to express just as naturally and unrestrainedly as the
lungs want to expand, hence words suitable for breathing ought to exist. The
oft repeated complaints of poets that, alas, no words are available, that words
are pale corpses, that words are incapable of expressing our thingummy-bob
feelings (and to prove it a torrent of trochaic hexameters is set loose) seemed
to him just as senseless as the staid conviction of the eldest inhabitant of a
mountain hamlet that yonder mountain has never been climbed by anyone and never
will be; one fine, cold morning a long lean Englishman appears–and cheerfully
scrambles up to the top.”
నబొకొవ్ - కాలం:
నబొకొవ్‌యవ్వనంలో ఫ్రెంచి తత్త్వవేత్త హెన్రీ బెర్గ్‌సన్
రచనలు ఆసక్తిగా చదివాడనీ, బెర్గ్‌సన్
ప్రభావం ఆయన మీద కాస్తో కూస్తో వుందనీ బ్రైన్ బోయ్డ్ పుస్తకంలో చదివాను. బెర్గ్‌సన్
పుస్తకాలు నాకు అందుబాటులో లేవు. కాబట్టి విల్‌డ్యురాంట్ “స్టోరీ ఆఫ్ పిలాసఫీ”,
బెట్రండ్‌రస్సెల్ “హిస్టరీ ఆఫ్ వెస్టర్న్ ఫిలాసఫీ”ల్లో అతని
ప్రస్తావన వున్న భాగాల్ని చదివాను. ఇవి చదివాకా, బ్రైన్
బోయ్డ్ ఒకట్రెండు వాక్యాల్లో తేల్చేసినట్టు కాస్తో కూస్తో కాదనీ, నబొకొవ్ మీద బెర్గ్‌సన్ ప్రభావం కాస్త ఎక్కువే వుండొచ్చనీ అనిపించింది.
ముఖ్యంగా నబొకొవ్ తన రచనల్లో కాలాన్ని వాడుకునే తీరులో ఈ ప్రభావం బాగా
కనిపించింది.
ఇరవయ్యో శతాబ్దపు తొలి అర్థభాగంలో బెర్గ్‌సన్ రచనలు
తత్త్వశాస్త్ర ప్రపంచంలో పెద్ద సందడే చేసాయి. అప్పటి మేధావుల ఆలోచనాధారలో
భౌతికవాదపు (materialism) ఏలుబడిని
ఆయన నిరసించాడు. మేధస్సు మీద మితిమీరి ఆధారపడటమూ, తర్కాన్ని
తిరుగులేని జ్ఞానసాధనంగా కొలవటమూ, ప్రపంచాన్ని భౌతిక
దృష్టితో తప్ప చూడలేకపోవటమూ... వీటన్నింటితోనూ విభేదించాడు. డార్విన్ జీవపరిణామ
సిద్ధాంతాన్ని కూడా ప్రశ్నించాడు. “మనుగడ కోసం పోరాటంలో అనుకూల లక్షణాలు గల
జీవాల్ని ప్రకృతి ఎన్నుకుంటుంది, మిగిలినవి నశిస్తాయి” అన్న
డార్విన్ “ప్రకృతి ఎన్నిక” సిద్ధాంతాన్ని తిరస్కరించాడు. తన “క్రియేటివ్ ఎవల్యూషన్”
అనే రచనలో, పరిణామం అనేది డార్విన్ చెప్పినట్టు ఒక యాంత్రిక
పోరాటం కాదనీ, ఇందులో ప్రకృతి మోపే ఒత్తిడికి జీవం స్తబ్ధంగా
తలవొగ్గడం జరగదనీ, జీవులే సృజనాత్మకంగా తమ పరిణామాన్ని తాము
మలచుకుంటాయనీ, వాటిలోని చైతన్యం (కాన్షస్‌నెస్) దీనికి దోహదం
చేస్తుందనీ వివరించాడు. అలాగే పదార్థాన్నీ - జీవాన్నీ (matter - life), స్థలాన్నీ - కాలాన్నీ (space - time), మేధస్సునూ -
అంతఃకరణనూ (intellect - intuition) స్పష్టమైన విభజనవున్న,
పరస్పర వ్యతిరేకమైన ద్వంద్వాలుగా పరిగణించాడు. ఈ ద్వంద్వాల్లో ఒక
వర్గమైన జీవం, కాలం, అంతఃకరణలకు తన
ఓటేసాడు. జీవితపు పూర్తి వైభవాన్ని గ్రహించాలంటే దాన్ని మనకు అలవాటైన స్థల
ప్రమాణంలో చూడటం మానుకుని, కాల ప్రమాణంలో చూడటం
నేర్చుకోవాలని చెప్పాడు. ఈ విషయంలో బెర్గ్‌సన్ అభిప్రాయాల్ని రస్సెల్ తన “హిస్టరీ
ఆఫ్ వెస్టర్న్ ఫిలాసఫీ”లో ఇలా పరిచయం చేస్తాడు:
“It is one of
the noteworthy features of Bergson’s philosophy that, unlike most writers, he
regards time and space as profoundly dissimilar. Space, the characteristic of
matter, arises from a dissection of the flux which is really illusory, useful,
up to a certain point, in practice; but utterly misleading in theory. Time, on
the contrary, is the essential characteristic of life or mind. ‘Wherever
anything lives,’ he says, ‘there is, open somewhere, a register in which time
is being inscribed.’ But the time here spoken of is not mathematical time, the
homogeneous assemblage of mutually external instants. Mathematical time,
according to Bergson, is really a form of space; the time which is of the
essence of life is what he calls duration. … ‘Pure duration,’ we are told, ‘is
the form which our conscious states assume when our ego lets itself live, when
it refrains from separating its present state from its former states’. It forms
the past and the present into one organic whole, where there is mutual
penetration, succession without distinction.”
మహానుభావుల సిద్ధాంతీకరణలన్నీ
వాళ్ళు చెప్పంగానే “అవునంతే కదూ” అనిపిస్తాయట,
వాళ్ళు చెప్పివుండకపోతే మాత్రం ఎప్పటికీ స్ఫురించవట. ఇదీ అలానే
అనిపిస్తుంది. నిజంగానే స్థలాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకుని కొలిస్తే జీవితం ఎంత
నిస్సారంగా వుంటుందో కదూ! ఉదాహరణకు,
జీవితం మరీ పెద్ద వ్యవహారం కాబట్టి, ఒక
సిటీబస్సు ప్రయాణాన్ని పోలిక తీసుకుందాం. బస్సెక్కాం. సీట్లో కూర్చున్నాం. ముందు
సీటో, వెనక సీటో, కిటికీ సీటో, ఏదైతేనేం... స్థలాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకు చూస్తే మన ప్రయాణం చాలా
చప్పగా సాగుతున్నట్టుంటుంది. కూర్చుంటాం, అటు కదులుతాం,
ఇటు కదులుతాం, బుర్ర గోక్కుంటాం, కిటికీలోంచి బయటకు చూస్తాం, అంతే! దీనికి భిన్నంగా
కాల ప్రమాణాన్ని తీసుకుందాం. ఇక్కడ కాలమంటే మళ్ళీ మనం బస్సులో ప్రయాణించే కాల
పరిమితి కాదు (గంట, రెండుగంటలూ). దీన్నే పైన బెర్గ్‌సన్
మేథమెటికల్ టైమ్ అంటున్నాడు. ఇది కూడా ఒక రకమైన స్థల ప్రమాణమే అంటున్నాడు.
నేనిక్కడ కాల ప్రమాణం అంటున్నది మన మస్తిష్కంలో నడిచే కాలం. ఏ వ్యక్తికా వ్యక్తి
స్వయంగా మాత్రమే అనుభవించగల భూతభవిష్యత్వర్తమానాల అవిభాజ్య ప్రవాహం. దీన్నే ఆయన “డ్యూరేషన్”
అంటున్నాడు. బస్సెక్కుతుండగా తలుపు దగ్గర ఒకడు కాలు తొక్కిందేగాక సారీ చెప్పడం
మానేసి “చూసావ్ లేవయ్యా బోడి చూపు” అన్నట్టు పెడసరంగా తల తిప్పుకోవచ్చు. మనం మన
కిటికీ సీట్లో కూర్చున్నాక, వాడికసలు తలుపు దగ్గరే ఎన్ని
రకాలుగా బుద్ధి చెప్పుండాల్సిందో ఊహించుకుంటూ ప్రయాణాన్ని గడపవచ్చు. లేదా, బస్సు కదులుతూందనగా బస్టాపులో కనిపించిన అమ్మాయి పరాకు చిరునవ్వు మన
మనసులో అర్థంపర్థం లేకుండా ముద్ర వేసుకోవచ్చు. ప్రయాణ పర్యంతం ఆ యాదృచ్ఛిక
దృశ్యాన్ని మనకే తెలియకుండా పునఃస్మరించుకుంటూ గడపచ్చు. అంటే మనం ఇలా అంతర్ముఖులమైనప్పుడు,
మన చైతన్యంలో, గతం వచ్చి నిరంతరాయంగా
వర్తమానంలో కలుస్తూనే వుంటుంది. గతం గతంగా మారి మన నుంచి విడిపోవటం లేదు, వెనకనే మిగిలిపోవటం లేదు. జ్ఞాపకంగా మారి మన వర్తమానాన్ని నిరంతరం
ప్రభావితం చేస్తూనే వుంటుంది. ఈ జ్ఞాపకాలకు మూలమైన చర్యలు (కాలు తొక్కటం, బస్టాండు అమ్మాయి దృశ్యం) గడిచిన వ్యవధి ఎంత స్వల్పకాలమైనా కావచ్చు,
కానీ మన చైతన్యంలోకి చేరేసరికి వాటి విస్తీర్ణం అవధుల్లేకుండా
పెరిగిపోతుంది. ఇప్పుడు బస్సు ఎంత ఇరుకైనదైనా కావచ్చు, కానీ
మన ప్రయాణాన్ని ఆ ఇరుకు “స్థలం” ప్రభావితం చేయదు, ఎందుకంటే
మన మస్తిష్కంలో నడిచే విశాలమైన “కాలం” ఆ లోటు పూడుస్తుంది. ఇప్పుడో రచయిత ఈ బస్సు
ప్రయాణాన్నే తన కథకు వస్తువుగా తీసుకున్నాడనుకుందాం. అతను మనల్ని “స్థలం”లో చూసి
వర్ణిస్తే లాభం లేదు. అలాచేస్తే మనం కథ మొదట్నించీ చివరిదాకా జడంగా సీట్లో
కూర్చోవడం వర్ణించాలంతే. ఆ రచయిత మన చైతన్యంలో జొరబడి అక్కడ ప్రవహిస్తున్న “కాలా”న్ని
నమోదు చేయగలగాలి. ఎందుకంటే ఇక్కడ మనం నిజంగా జీవిస్తున్నది ఈ కాల ప్రమాణంలోనే. (నా
చవబారు పోలిక చూసి బెర్గ్‌సన్ ఈ పాటికే సమాధిలోనో, స్వర్గంలోనో
“హతవిధీ” అంటూ తల బాదుకుంటూండవచ్చు గాక, నాకు మాత్రం ఇలానే
అర్థమైంది.) ఓ నిముషం చేస్తున్న పనులూ, ఆలోచనలూ ఆపి ధ్యాన
స్థితిలోకి చేరి మనలోకి మనం చూసుకుంటే, మనకు కనిపించేది
స్థలం కాదనీ, కాలమనీ విల్ డ్యురాంట్ అంటాడు. ఆయన బెర్గ్‌సన్‌ఆలోచనని
ఇలా పరిచయం చేస్తాడు:
We
naturally incline to materialism, Bergson argues, because we tend to think in
terms of space; we are geometricians all. But time is as fundamental as space;
and it is time, no doubt, that holds the essence of life, and perhaps of all
reality. What we have to understand is that time is an accumulation, a growth,
a duration. “Duration is the continuous progress of the past which gnaws into
the future and which swells as it advances”; it means that “the past in its
entirety is prolonged into the present and abides there actual and acting.”
Duration means that the past endures, that nothing is quite lost. “Doubtless we
think with only a small part of our past; but it is with our entire past… that
we desire, will and act.”
బెర్గ్‌సన్ తాత్త్వికతలో ఈ అంశం
నబొకొవ్‌ని బాగా ప్రభావితం చేసిందని నాకనిపించింది. నబొకొవ్ రచనల్లో కాలానికీ, గతానికీ, జ్ఞాపకానికీ
చాలా ప్రాముఖ్యత వుంటుంది. ముఖ్యంగా, గతం అంటే మనం మన
జీవితపుదారిలో ముందుకుపోతూ ఎప్పటికప్పుడు వెనకనే వదిలిపెట్టి పోయే జ్ఞాపకాల మూట
కాదనీ, దాని ప్రభావం మన వర్తమానం మీద నిత్యం వుంటూనే
వుంటుందనీ, అది మనకు తెలియకుండానే మన వర్తమానాన్ని భవిష్యత్తునీ
కూడా ప్రభావితం చేస్తుందనీ బెర్గ్‌సన్‌లానే నబొకొవ్ కూడా నమ్మాడు. ఆయన రచనల్లో గతం
కూడా వర్తమానపు స్పష్టత తోనే వుంటుంది. అది పలుమార్లు చెప్పాపెట్టకుండా
వర్తమానంలోకి చొరబడిపోతూంటుంది కూడా. దీనికి “ద గిప్ట్” నవల నుండే ఒక ఉదాహరణ
తీసుకుంటాను. ఇందులో రెండో అధ్యాయం అప్పుడే వాన వెలిసిన ఓ మధ్యాహ్నం రష్యాలో
మొదలవుతుంది. ఫియొదొర్ పొలాలకు అడ్డంపడి తన ఇంటి వైపు నడుస్తుంటాడు. అతను వెళ్ళే
దారంతా స్పష్టంగా మన కళ్ళ ముందు ఆవిష్కృతమవుతుంది. ఇంటి ఎదుట గార్డెన్‌లో ఒక బెంచీ
మీద అతని తల్లీతండ్రీ కూర్చుని మాట్లాడుకోవడం చూస్తాం. హఠాత్తుగా ఇదంతా మాయమైపోయి
ఒక బెర్లిన్ వీధి ప్రత్యక్షమవుతుంది. మంచు తుంపరని చీల్చుకుంటూ పసుపుగా
వెలుగుతున్న ట్రామ్‌కారు లైట్లు మన ముందుకొస్తాయి. ఇంతకుముందు జరిగిందంతా గతం అనీ,
ఫియొదొర్ బస్టాండ్‌లో ట్రామ్‌కోసం ఎదురుచూస్తూ అదంతా
ఊహించుకుంటున్నాడనీ అప్పుడర్థమవుతుంది. అతను ట్రామ్ ఎక్కి ట్యూషన్‌చెప్పేందుకు
బయల్దేరతాడు. సగందారిలో వుండగా, ఎందుకో ఆరోజు ట్యూషన్‌కి
వెళ్ళాలంటే విసుగు పుడుతుంది. తిరిగి తన గదికి వెళిపోయి అప్పటికే ఏడాదిగా
శ్రమిస్తున్న తండ్రి జీవితచరిత్ర రాసుకోవాలనిపిస్తుంది. ఉన్నట్టుండి బలపడిన ఈ
నిర్ణయంతో వెంటనే ట్రామ్‌దిగేస్తాడు. గదికి బయల్దేరతాడు. దారిలో వీధివార కొన్ని
క్రిస్మస్ చెట్లు అమ్మకానికి పెట్టివుంటాయి. వాటిని యధాలాపంగా చేత్తో తాకుతూ
వెళ్తాడు. హఠాత్తుగా ఇప్పుడు మన ముందు మరో రష్యా దృశ్యం తెరుచుకుంటుంది. ఫియొదొర్‌తో
పాటూ అతని కుటుంబమంతా ఒక ఇంటి వరండా మెట్ల మీద కూర్చుని వుంటారు. వాళ్ల భంగిమలన్నీ
కళ్ళకు కట్టినట్టు వర్ణితమవుతాయి. తర్వాత తెలుస్తుంది ఇది ఒక ఫోటోగ్రాఫ్ వర్ణన
అని. గత సంవత్సరం క్రిస్మస్‌కు ఫియొదొర్ తల్లి అతన్ని చూట్టానికి పారిస్ నుంచి
బెర్లిన్ వచ్చినపుడు ఈ ఫోటో ఇచ్చి దాచుకొమ్మంటుంది. ఇక ఇక్కణ్ణించీ కథనం, గదికి వెళ్తున్న ఫియొదొర్‌ని అనుసరించడం మానేసి, గత
సంవత్సరం అతని తల్లి వచ్చిన సందర్భానికి వెళిపోతుంది. ఆమె రైలు దిగడం, ఆప్యాయంగా అతన్ని కౌగలించుకుని మొహమంతా ముద్దులు కురిపించడం... ఈ
సన్నివేశం కొనసాగుతుంది. ఇలా నబొకొవ్ తన పాత్రల్ని స్థల ప్రమాణం (space)లో అనుసరించడు. ఆ పాత్రల మస్తిష్కంలో సాగే కాల ప్రమాణాన్ని (time) అనుసరిస్తాడు. (అందుకే, పైన ఇచ్చిన “కథా సంక్షిప్తం”
మీకొకవేళ చప్పగా అనిపిస్తే, అది నబొకొవ్ తప్పూ కాదు, నవల తప్పూ కాదు; నా తప్పు. నేను దాన్ని స్థల
ప్రమాణంలో జరిగే కథను మాత్రమే అనుసరించి రాసాను.) నబొకొవ్‌ను తొలిసారి చదివే
పాఠకులకు ఇలా కాలంతో తొక్కుడు బిళ్ళాడటం కేవలం ఒక పోస్ట్‌మోడ్రన్ వేలం వెర్రి
అనిపించవచ్చు. అలా కాదనీ, దాని వెనుక ఆయన నమ్మిన ఓ తాత్త్విక
దృక్పథం కూడా వుందనీ చెప్పటం కోసం ఇదంతా వివరించాను.
ఈ నవల గురించి చెప్పాలనుకున్నదంతా దాదాపు పైన కథా
సంక్షిప్తంలోనూ, దానికిచ్చిన
వివరణలోనూ వచ్చేసింది. ఇంకా మిగిలివుందనిపించింది అధ్యాయల వారీగా క్రింద
చెప్తున్నాను. ముందుగా ఈ అధ్యాయాలకి నబొకొవ్ ఒక్కో వాక్యంలో చేసిన క్లుప్తీకరణ
ఇది:
“The plot of
Chapter One centers in Fyodor’s poems. Chapter Two is a surge toward Pushkin in
Fyodor’s literary progress and contains his attempt to describe his father’s
zoological explorations. Chapter Three shifts to Gogol, but its real hub is the
love poem dedicated to Zina. Fyodor’s book on Chernyshevski, a spiral within a
sonnet, takes care of Chapter Four. The last chapter combines all the preceding
themes and adumbrates the book Fyodor dreams of writing some day: The Gift. “
మొదటి అధ్యాయం:
ఈ అధ్యాయంలో ఫియొదొర్ కవితలు ప్రధానంగా వుంటాయి. వీటిని విడి పంచదార పలుకుల్తో
పోల్చవచ్చు. తీయదనం పూర్తిగా అంగిలినంటక ముందే కరిగిపోయే పలుకుల్లా పల్చనైన రుచి.
అయితే అన్నీ కలిసి ఫియొదొర్ బాల్యచిత్రాన్ని స్పష్టంగా ఆవిష్కరిస్తాయి. ఈ కవితల్లో
కొట్టొచ్చినట్టు కనిపించే మరో గుణమేమిటంటే,
వేటికవే విడిగా ఎంతబాగున్నా, వీటిని
ఆవరించివుండే వచనంతో పోలిస్తే అవి కాస్త రంగుతేలిపోయినట్టే కనిపిస్తాయి. దీన్ని
బట్టీ ఫియొదొర్ రచనా పటిమ ఆ కవితలు రాసేటప్పటికీ, ఇప్పుడు
మనం చదువుతోన్న “ద గిప్ట్” నవల
రాసేటప్పటికీ ఏ స్థాయిలో పరిణతి చెందిందో మనకు అర్థమవుతుంది.
ఈ నవల ముగింపు పుష్కిన్‌కు నివాళిస్తుందని చెప్పాను. ఇది
బాహటంగా తెలిసిపోయేదే. ముందుమాటలో నబొకొవ్‌స్వయంగా ఈ సంగతి చెప్పేస్తాడు. అయితే ఈ
నవల ప్రారంభమవటం కూడా ఆయన అభిమానించిన మరో రచయిత గొగోల్‌కు నివాళి నర్పిస్తూ
ప్రారంభమవుతుందట. ఇది గొగోల్ రచనలతో బాగా పరిచయమున్న వారికి తప్ప స్ఫురించని
నివాళి. నాకు బ్రైన్ బోయ్డ్ పుస్తకం ద్వారా తెలిసింది. గొగోల్ ప్రసిద్ధ రచన “డెడ్‌సోల్స్” ప్రారంభమయ్యే
తీరు నబొకొవ్‌ను చాలా ఆకర్షించేదట (నబొకొవ్ ఆంగ్లానువాదంలో ఈ ప్రారంభం యిలా
సాగుతుంది). ఒక కొత్త వ్యక్తి (చిచీకవ్)
బస్తీలోకి బండి తోలుకుంటూ వస్తాడు. సారాకొట్టు దగ్గర ఉబుసుపోక నిలబడ్డ ఇద్దరు
రైతులు అతని బండి ఎక్కడదాకా పోగలదో అంచనాలు కడతారు. తర్వాత ఒక యువకుడు ఆ బండికి
ఎదురొస్తాడు. అతనా బండిని ఆసక్తిగా గమనిస్తూండగా, గాలి
విసురుకి అతని టోపీ ఎగిరిపోబోతుంది. దాన్ని సర్దుకోవడంలో పడి ముందుకు సాగిపోతాడు.
ఇక్కడ ఈ యువకుడి వర్ణన చాలా విశదంగా, ఒక ముఖ్య పాత్రని
పరిచయం చేస్తున్న హడావిడితో వుంటుంది. కానీ అతను కథలో మళ్ళీ ఎక్కడా రాడు. ఈ రచనకు “మృతజీవులు” పేరిట కొ.కు చేసిన అనువాదంలో అతని వర్ణన
ఇలా సాగుతుంది:
“అదీగాక బండీ హోటలును సమీపించే సమయానికి
ఒక యువకుడు ఆ బండిని సమీపించాడు. అతను చాలా పొట్టిగా, బిగుతుగా
ఉన్న తెల్ల కాన్వాస్ లాగూ, కింద వేళ్ళాడే అంచులు, చాలా ఫాషన్‌గా కత్తిరించిన కోటూ, ఎదురు రొమ్మున
షర్టుకు కంచు పిస్తోలు అలంకరించిన పిన్నూ ధరించి ఉన్నాడు. ఆ యువకుడు వెనక్కు
తిరిగి బండీని తేరిపారజూసి, తన టోపీ గాలికి ఎగిరిపోకుండా
చేత్తో పట్టుకుని తన దారిన తాను వెళ్ళాడు.”
కథలో మళ్ళీ ఎక్కడా ప్రస్తావనే రాని
ఈ యువకుణ్ణి ఇంత ఖచ్చితంగా వర్ణించటం నబొకొవ్‌ను ఆకర్షించింది. ఇది గొగోల్‌లో
మాత్రమే కనిపించే ప్రత్యేకతగా ఆయన భావించాడు. గొగోల్ మీద ఆయన రాసిన పుస్తకం “నికొలాయ్ గొగోల్”లో
దీన్ని ఇలా వివరిస్తాడు:
“Another special touch is exemplified by the
chance passerby–that young man portrayed with a sudden and wholly irrelevant
wealth of detail: he comes there as if he was going to stay in the book (as so
many of Gogol’s homunculi seem intent to do–and do not). With any other writer
of his day the next paragraph would have been bound to begin: ‘Ivan, for that
was the young man’s name.’ ... But no: a gust of wind interrupts his stare and
he passes, never to be mentioned again.”
నబొకొవ్ కూడా “ద గిప్ట్”లో దీన్ని
అనుకరిస్తాడు. నవల మొదట్లో ఫియొదొర్ అద్దెకు దిగిన గదికి పైవాటాలో ఇద్దరు దంపతులు
(లోరెంజోస్) అద్దెకు దిగుతారు. మొదటి పేజీలో వీళ్ళ వర్ణన ఎంత విశదంగా వుంటుందంటే,
వీళ్ళది నవల్లో చాలా ముఖ్యమైన పాత్రేమో అని మనకనిపిస్తుంది. కానీ ఈ
రెండు పాత్రలూ కథలో ఎక్కడా ప్రత్యక్షంగా కలగజేసుకోవు. ఈ అనుకరణే గొగోల్‌కు నబొకొవ్
ఇచ్చిన నివాళి. అయితే, ఈ విషయంలో ఆయన గొగోల్ కన్నా ఒక అడుగు
ముందుకే వేసాడని చెప్పాలి. ఈ దంపతులు కథలో ప్రత్యక్షంగా భాగం కాకపోయినా, ఈ నవల సృష్టికి వాళ్ళే పరోక్ష కారణమవుతారు. ఎందుకంటే, విధి తననూ జినానూ కలపడానికి వేసిన పథకంలో భాగంగానే ఈ దంపతులు తన గది
పైవాటాలో అద్దెకు దిగారని ఫియొదొర్ భావిస్తాడు. ఈ ఆలోచనే అతని నవలకు ప్రధాన ప్రేరణ
అవుతుంది. ఇది బ్రైన్ బోయ్డ్ వివరణ.
రెండో అధ్యాయం:
ఈ అధ్యాయంలో ఫియొదొర్ తండ్రి జీవితచరిత్ర సింహభాగం ఆక్రమిస్తుంది. అందులో
మళ్ళీ ఆయన మధ్య ఆసియాలో చేసిన పరిశోధనాయాత్రలు ప్రధానం. ఈ యాత్రల వర్ణన సాగినన్ని
పేజీలూ మన మనోఫలకంపై ఒక చిత్రమైన ప్రపంచం వచ్చి నిలుస్తుంది. అది నిజమూ అనిపించదు, కల్పనా అనిపించదు. ఫియొదొర్‌ఎంతో
ఆశపడినా తండ్రితో కలిసి ఈ యాత్రల్లో పాల్గొనే అవకాశం ఎప్పుడూ రాలేదనీ, ఆ తీరని కోరికే ఈ రచన ద్వారా తీర్చుకుంటున్నాడనీ ముందు చెప్పాను. ఇక్కడ
తీరని కోరికలు తీర్చుకుంటున్నది ఫియొదొర్ ఒక్కడే కాదు. నబొకొవ్‌కూడా సీతాకోకచిలుకల
నమూనాల్ని సేకరించడానికి ఒక్కసారైనా మధ్యఆసియా అంతా చుట్టిరావాలని ఆశపడ్డాడు. కానీ
బోల్షెవిక్ విప్లవం, దరిమిలా ప్రవాసం, అక్కడి
దారిద్ర్యం, ఆయనకా అవకాశాన్ని దక్కనివ్వలేదు. ఇలాంటి యాత్రలు
చేసిన పరిశోధకుల పుస్తకాలు మాత్రం చాలా ఆసక్తిగా చదివేవాడు. కాబట్టి ఈ అధ్యాయంలో
మనకు కనిపించే మధ్య ఆసియా అంతా ఆయన ఊహల్లో రూపుదేలిందే. మరి ఇందులో గొప్పేముంది?
ఈ నవల్లోనే ఫియొదొర్ ఒక చోట అన్నమాట ఇక్కడ అన్వయించుకోవచ్చు: Genius
is an African who dreams up snow.
ఈ అధ్యాయం నాకో కొత్త సైడ్‌ఎఫెక్టు నిచ్చింది.
సీతాకోకచిలుకల్ని గమనించడం. నబొకొవ్‌లా శాస్త్రీయమైన ఆసక్తి కాదు గానీ, దారంటా ఎప్పుడైనా తారసపడితే ఒక్క క్షణం
పరిచయస్తుల్లాంటి గుర్తింపు. వాటిని ఒక్కసారి పట్టించుకోవటం మొదలుపెట్టామంటే,
అదేంటో, ఎటు చూసినా అవే కనిపిస్తాయి. ముఖ్యంగా
హైదరాబాద్‌లో అయితే ఎక్కడ పడితే అక్కడ అవే!
ఈ అధ్యాయం చివర ఫియొదొర్ పాతగది నుంచి కొత్తగదికి
మారతాడు. ఈ సందర్భంలో ఈ రెండు గదుల మధ్యనున్న దూరం రష్యాలో పుష్కిన్ వీధికీ, గొగోల్ వీధికి మధ్యనున్న దూరమంత వుందని
చెప్తాడు (ఈ పేర్లతో రష్యాలో నిజంగానే రెండు వీధులున్నాయి). ఈ వాక్యం రెండు గదుల
మధ్యా దూరాన్ని మాత్రమే సూచించదు; ఇప్పటిదాకా పుష్కిన్
తరహాలో స్వచ్ఛత, స్పష్టత, పారదర్శకత
లక్షణాలుగా సాగిన ఫియొదొర్ రచనాశైలి, ఇకనుంచీ గొగోల్ తరహా
పదునైన వ్యంగ్యానికి బదిలీ కాబోతోందని కూడా అన్యాపదేశంగా సూచిస్తుంది.
మూడో అధ్యాయం:
ఈ అధ్యాయం రెండో అధ్యాయంలా మందకొడిగా కాకుండా, చురుగ్గా సాగుతుంది. కథనంతోపాటూ మనమూ
ఫియొదొర్ జీవితంలో ఒక రోజుని అనుసరిస్తాం. అతను బారెడు పొద్దెక్కాకా తన కొత్త
గదిలో నిద్రలేవటం, జినాకో కవిత రాయటానికుపక్రమించటం, తర్వాత భోజనం చేసి ట్యూషన్లు చెప్పుకోవటానికి బయల్దేరటం, ట్యూషన్ల మధ్య విరామంలో పుస్తకాల షాపుకెళ్ళి చెస్ మేగజైన్ కొనుక్కోవటం,
చీకటిపడేదాకా అందులోని చెస్ పజిల్స్‌ని పరిష్కరించటం, రాత్రి జినాను కలవడానికి రైల్వే బ్రిడ్జి దగ్గరకు వెళ్లడం, ఇద్దరి మధ్యా కబుర్లూ... ఇలా ఈ రోజు గడుస్తుంది. ఒకపక్క వర్తమానం ఇలా
సాగుతుండగానే, గతం కూడా మధ్య మధ్యలో వచ్చి జొరబడుతూంటుంది. ఈ
గతంలో ఫియొదొర్‌కు కవిత్వంపై ఆసక్తి ఎలా మళ్ళిందీ, అది
పరిణతి చెందిన తీరూ, పదహారేళ్ల వయసులో ఒక పెళ్ళయిన యువతితో
అతని ప్రేమ (ఆమె తర్వాత ఒక ప్రమాదంలో చనిపోతుంది) ... ఇలాంటి పాత జ్ఞాపకాల్తో బాటూ,
జినాతో తొలిసారి మాట్లాడే సన్నివేశం మొదలైన ఇటీవలి జ్ఞాపకాలు కూడా
వుంటాయి. తర్వాత జినాని ఒక పాత్రగా మరింత సమగ్రంగా మనకు పరిచయం చేసేందుకు ఆమె గతం,
ఆమె ఇష్టపడే తండ్రి, ఆమె ద్వేషించే సవతి
తండ్రీ, ఆమె విసుక్కునే ఆఫీసూ... వీటన్నింటి గురించీ కూడా
విస్తారంగా వివరిస్తాడు ఫియొదొర్. తర్వాత కథనం చెర్నిషెవ్‌స్కీ పుస్తకం వైపు
మళ్ళుతుంది. ఆ పుస్తకం రాయటానికి అతను పడిన ప్రయాస చూస్తాం. చాలా అనిశ్చితి తర్వాత
పుస్తకం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ఈ శుభవార్తను జినాతో పంచుకోవటానికి ఫియొదొర్
ఆమె ఆఫీసుకు రావటంతో అధ్యాయం పూర్తవుతుంది.
ఫియొదొర్ స్వంత రచనలు, యాషా లాంటి వేరేవాళ్ళ కథలూ లేకుండా, నవలకు సంబంధించిన కథ మాత్రమే ప్రధానంగా నడిచే ఏకైక అధ్యాయం ఇది.
అధ్యాయానికి సరిగ్గా మధ్యలో జినా కోసం ఫియొదొర్ రాసిన కవిత, బెర్లిన్
వీధి దీపాల క్రింద వాళ్ళిద్దరి సమావేశం ఉంటాయి. ఫియొదొర్ తన జినాని పాఠకుల ముందుకు
అందంగా తీసుకురావటానికి ఎంత కష్టపడతాడో, ప్రేమికులుగా
తామిద్దరికీ చెందినవి తమకే దాచుకోవడానికీ అంతే జాగ్రత్తపడతాడనిపిస్తుంది. వాళ్ళ
మధ్య ఎప్పుడు ఏ కబుర్లు కొనసాగినా అవి మామూలు విషయాలే అయివుంటాయి. ప్రత్యేకంగా
పాఠకుల కోసమే అల్లి ప్రదర్శిస్తున్నట్టూ వుంటాయి. మనల్ని గడప దాకా రానిస్తాడు గానీ,
ఇక లోపలికి అడుగు పెట్టడమే తరువాయి అనిపించగానే, తమ పొదరింటి తలుపు మొహం మీదే మూసేస్తాడు. మొత్తం నవల్లో ఆమె పట్ల తన
అనుభూతిని తిన్నగా వ్యక్తం చేసేది ఒకే ఒక్క పేరాలో, అది కూడా
ప్రథమ పురుషలో (థర్డ్ పెర్సన్):
“What was it
about her that fascinated him most of all? Her perfect understanding, the
absolute pitch of her instinct for everything that he himself loved? In talking
to her one could get along without any bridges, and he would barely have time
to notice some amusing feature of the night before she would point it out. And
not only was Zina cleverly and elegantly made to measure for him by a very
painstaking fate, but both of them, forming a single shadow, were made to the
measure of something not quite comprehensible, but wonderful and benevolent and
continuously surrounding them.”
అలాగే, ఈ అధ్యాయంలో ఒక చోట అతను రష్యాలోని తన పాత ప్రేయసిని తల్చుకుంటాడు.
అప్పుడు వచనం హఠాత్తుగా మధ్యమపురుష (సెకండ్ పెర్సన్) కథనంలోకి మారిపోతుంది;
ఏదో జినాకి సంజాయిషీ చెప్పుకుంటున్నట్టూ ఉన్నట్టుండి “నువ్వు” అన్న
సంబోధన ప్రవేశిస్తుంది:
“In all her ways
there was something I found lovable to the point of tears, something
indefinable at the time, but now appearing to me as a kind of pathetic
insouciance. She was not intelligent, she was poorly educated and banal, that
is, your exact opposite ... no, no, I do not mean at all that I loved her more
than you, or that those assignations were happier than my evening meetings with
you ... but all her shortcomings were concealed in such a tide of fascination,
tenderness and grace, such enchantment flowed from her most fleeting,
irresponsible word, that I was prepared to look at her and listen to her
eternally–but what would happen now if she were resurrected–I don’t know, you
should not ask stupid questions.”
ఈ వాక్యాలు తిన్నగా జినాని
ఉద్దేశించే రాస్తున్నాడని (అంటున్నాడని) స్పష్టంగా తెలిసిపోతుంది. “లేదు, లేదు, నీ కన్నా
ఆమెనెక్కువ ప్రేమించానని చెప్పటం లేదు...” అన్న వాక్యాల్లో ఆ గాభరా ఎందుకు
కనిపిస్తుంది? చివర, “ఆమె
పునర్జీవితమైతే ఏమవుతుందా–నాకు తెలీదు, నువ్వలాంటి పిచ్చి ప్రశ్నలడక్కూడదు”, అంటూ ఎవరో
ఎదుటనున్న మనిషితో చెప్తున్నట్టే ఎందుకు చెప్తున్నాడు? నబొకొవ్
ఈ నవల ముందుమాటలో ఇలా అంటాడు: “నా యువ ప్రేమికుల్నిద్దర్నీ సాగనంపేసాకా, పాఠకుల ఊహాశక్తి వాళ్ళని ఎంత వరకూ అనుసరిస్తుందా అని నాకు కుతూహలంగా వుంది”.
పై పేరాలో వాక్యాల ద్వారా, వాళ్ళని అనుసరించేందుకు మన ఊహకి
కొంత దారి దొరుకుతుంది. ఫియొదొర్ ఈ నవల రాసే సమయానికి జినా అతని చెంతనే వుందని,
అంటే వాళ్ళ ప్రేమ ఓ పర్యవసానానికి చేరిందని, బహుశా
వాళ్ళు ఇప్పటికి భార్యాభర్తలై కూడా వుండవచ్చనీ మన ఊహకి లీలగా స్ఫురిస్తుంది.
(నబొకొవ్ ఈ నవలకు తరువాయి భాగం కూడా రాయాలని కొన్నాళ్ళు ప్రయత్నించాడట. దీనికి
సంబంధించీ లభ్యమైన చిత్తుప్రతిని బట్టి అందులో ఫియొదొర్, జినాలు
భార్యాభర్తలేనట. కాకపోతే “ద గిప్ట్” నవల ముగింపులో వీళ్ళిద్దరికీ ప్రామిస్ చేసిన
ప్రేమమయమైన భవిష్యత్తు అందులో కొనసాగదు. జినా ఏదో ప్రమాదంలో మరణించటం, తర్వాత ఫియొదొర్ ఇక బయటి ప్రపంచానికి పూర్తిగా దూరమైపోయి, లోపలి సృజనాత్మక ప్రపంచానికే అంకితమైపోవడం... ఇలా ఏదో కొనసాగుతుందట. ఇది విన్నాకా, ఎందుకో, నబొకొవ్ ఆ నవల రాయనందుకు బాధేమీ కలగలేదు.)
నాలుగో అధ్యాయం:
ఒక చారిత్రాత్మక వ్యక్తి జీవితచరిత్రను ఒక కాల్పనిక పాత్ర రాయడమనేది బహుశా
ప్రపంచ సాహిత్యంలో ఈ ఒక్క నవల్లోనే కనిపిస్తుందేమో. నికొలాయ్ చెర్నిషెవ్‌స్కీ
జీవితంపై ఫియొదొర్ రాసిన “లైఫ్ ఆఫ్ చెర్నిషెవ్‌స్కీ” పుస్తకమే నాలుగో అధ్యాయం. ఇది
అన్నింటిలోకీ పెద్ద అధ్యాయం. మొత్తం నవలలో దాటుకురావడానికి బాగా ప్రయాస పడాల్సిన
అధ్యాయం కూడా. కారణాలు చాలా కనిపిస్తాయి. రష్యాయేతర పాఠకులుగా మనకు ఈ వస్తువుకున్న
చారిత్రాత్మక నేపథ్యం ఏంటన్నది సరిగా తెలియకపోవడం; ఇబ్బడిముబ్బడిగా ప్రస్తావించబడుతున్న–మనకు పరిచయం లేని–రష్యన్ సాహితీకారులు, చారిత్రాత్మక వ్యక్తులు; ఓ పట్టాన మింగుడు పడని
వాళ్ళ రష్యన్ పేర్లూ... ఇత్యాది. పైపెచ్చు ఈ రచనలో కథనం కూడా చెర్నిషెవ్‌స్కీ
జీవితాన్ని మొదలు నుంచీ తుదకు ఓ క్రమంలో మన ముందుంచదు. “మనిషి జీవితం పైకి
కనిపించేంత గందరగోళం కాదూ, తరచి చూస్తే ఒక అల్లిక దొరికి తీరుతుంద”న్న
తన నమ్మకాన్నే నబొకొవ్ తన పాత్ర ఫియొదొర్‌కి కూడా అరువిచ్చాడని పైన చెప్పాను. ఈ
నవల చివర్లో ఫియొదొర్ తన జీవితంలో ఒక అల్లికను ఎలా కనిపెడతాడో, అలాగే ఇక్కడ చెర్నిషెవ్‌స్కీ జీవితంలోనూ ఓ అల్లిక కనిపెట్టేందుకు
ప్రయత్నిస్తాడు. అతను చెర్నిషెవ్‌స్కీ జీవితాన్ని ఆమూలాగ్రం తరచి చూసి దాన్ని
కొన్ని థీమ్స్‌గా (ఇతివృత్తాలుగా) విడగొడతాడు. చత్వారం ఇతివృత్తం, రచనాభ్యాసాల ఇతివృత్తం, యాత్రల ఇతివృత్తం, కన్నీళ్ళ ఇతివృత్తం... ఇలా వినడానికి వ్యంగ్యంగా వుండే కొన్ని
ఇతివృత్తాల్ని చెర్నిషెవ్‌స్కీ జీవితంలో వెతికి పట్టుకుని, ఇవి
అతని జీవితాన్ని మంచికో చెడుకో ఎలా ప్రభావితం చేసాయో నిరూపించేందుకు
ప్రయత్నిస్తాడు. జీవిత చరిత్రను కాలానుక్రమంగా చెప్పుకుంటూ పోకుండా, చెర్నిషెవ్‌స్కీ జీవితంలో ఒక ఇతివృత్తం ఎన్నిసార్లు, ఎక్కడెక్కడ ప్రత్యక్షమైందో అక్కడక్కడకు కథనాన్ని గెంతిస్తాడు. దీంతో మనం కూడా
కథనం తోపాటూ పరమపదసోపానపటంలో పిక్కల్లా చెర్నిషెవ్‌స్కీ జీవితపటంలో
కప్పగంతులేస్తూంటాం.
ఈ అధ్యాయం సాంతం చదివాకా, నబొకొవ్ మిగతా నవలంతా రాయటానికి ఎంత కష్టపడివుంటాడో,
బహుశా ఈ ఒక్క అధ్యాయమూ రాయటానికి అంత కష్టపడి వుంటాడనిపించింది.
ఎందుకంటే ఫియొదొర్ కేవలం ఓ కాల్పనిక పాత్ర. ఒక రచయితగా నబొకొవ్ అతని జీవితంలో తనకు
తోచిన అల్లికను చొప్పించేయచ్చు. అడిగేవాడు లేడు. కానీ నికొలాయ్ చెర్నిషెవ్‌స్కీ ఒక
చారిత్రాత్మక వ్యక్తి. తార్కాణం చూపించకుండా ఏం రాయటానికి వీల్లేదు. ఉన్న
ఋజువుల్నే వాడుకోవాలి. అలాంటిది, ఇతని జీవితంలో కూడా ఇలా ఓ
తీరైన అల్లికను వెతికి పట్టుకోగలిగాడంటే, ఎంత సమాచారం
సేకరించి వుంటాడో, ఎన్ని ఋజువులు కూడబెట్టి వుంటాడో, ఎంత చదివి వుంటాడో అని ఆశ్చర్యమేసింది.
అసలు ఎందుకింత కష్టపడ్డాడు? ఫియొదొర్ పుస్తకానికి నబొకొవ్ వేరే ఏ
వస్తువునైనా ఎన్నుకుని వుండచ్చుగా? ఎందుకు ప్రత్యేకించి
చెర్నిషెవ్‌స్కీనే ఎన్నుకున్నాడు? తన ముందుమాటలో నబొకొవ్
నవలకు కథానాయిక జినా కాదనీ, రష్యన్ సాహిత్యమనీ అంటాడు. ఆయన
రష్యన్ సాహిత్యాన్ని చాలా అభిమానించాడు. పుష్కిన్‌తో మొదలైన రష్యన్ సాహితీ పరంపర
అనతికాలంలోనే ఏ భాషా సాహిత్యమైనా సరే అసూయపడేంత ఇబ్బడిముబ్బడిగా గొప్ప రచయితల్ని
ఒకరివెంట ఒకర్ని సృష్టించింది. ఒక్క పంతొమ్మిదవ శతాబ్దంలోనే అలెగ్జాండర్ పుష్కిన్,
నికొలాయ్ గొగోల్, లియో టాల్‌స్టాయ్, ఫియొదొర్ దాస్తొయెవ్‌స్కీ, ఇవాన్ తుర్గెనెవ్,
ఆంటన్ చెకోవ్, ఆండ్రె బెలీ, అలెగ్జాండర్ బ్లోక్, మాక్సిమ్ గోర్కీ ... ఇలాంటి
ఉద్దండులంతా వెల్లువెత్తారు. కానీ తర్వాత ఇరవయ్యవ శతాబ్ధానికి వచ్చేసరికి ఒక్కరంటే
ఒక్కరు (నబొకొవ్‌ను మినహాయిస్తే) ఆ స్థాయి రచయిత పుట్టలేదు. దీనికి కారణం రష్యా “సోవియట్‌రష్యా”గా
మారటమని బుర్రలో గుజ్జున్న వాళ్ళెవరైనా గ్రహించగలరు. “ప్రతీ కళాకారునికీ స్వేచ్ఛగా
సృజించే హక్కుంది; కానీ మేం కమ్యూనిస్టులం అతన్ని ఒక
ప్రణాళిక ప్రకారం ముందుకు నడపి తీరాలి” అన్నది స్వయానా లెనిన్ ఉవాచ. “ప్రణాళిక
ప్రకారం ముందుకు నడపటం” అంటే రచయితలంతా “శ్రమైక జీవన సౌందర్యా”న్ని ఎత్తి చూపేలానో,
“కార్మిక ఐక్యత”ను ఉద్భోదించేలానో, “సమ సమాజ
లక్ష్యాల్ని” స్మరించేలానో జాగ్రత్తలు తీసుకోవడం అన్నమాట. ప్రభుత్వం ఇలా సామ్యవాద
సిద్ధాంతాలకి కొమ్ముకాసే రచయితల్ని మాత్రమే అక్కున చేర్చుకునేది. ఎవరన్నా మొండిగా
స్వేచ్ఛ దురద ప్రదర్శిస్తే వాళ్ళకి సైబీరియాలో శాశ్వత విహారానికి ఏర్పాట్లు
చేసేది. ఈ బాధ పడలేని రచయితలు చాలామంది పశ్చిమ యూరోప్‌కు ప్రవాసం వెళ్ళిపోయారు.
దాంతో ఇక సోవియట్-రష్యాలో సాహిత్యం అంటే ప్రయోజనవాద సాహిత్యం (utilitarian
literature) మాత్రమే అయి కూచుంది. అయితే ఈ తరహా సాహిత్యం మొదలైంది
విప్లవం తర్వాత మాత్రమే కాదు. దీని మూలాలు 1860ల్లోనే
వున్నాయి. దీనికి మూలపురుషుడుగా కొనియాడబడే వ్యక్తే నికొలాయ్ చెర్నిషెవ్‌స్కీ.
లెనిన్‌కు ఆరాధ్య రచయిత. నబొకొవ్ జర్మనీలో ప్రవాస జీవితం గడుపుతూండగానే 1928లో చెర్నిషెవ్‌స్కీ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బహుశా తన దేశపు ఘనమైన
సాహితీ పరంపర భ్రష్టుపట్టిపోవడానికి మూలమైన వ్యక్తి ఇంకా ఇలా అలవాటుగా
పూజలందుకోవడం నబొకొవ్‌కు సహజంగానే చిర్రెత్తించి వుంటుంది. రష్యన్ సాహిత్యం మీద
ప్రేమతో, ఈ ఉత్సవవిగ్రహపు బరువు నుంచి దానికి విముక్తి
కలిగించాలని, నబొకొవ్ ఈ “ఫైరింగ్ ప్రాక్టీసు” మొదలు పెట్టి
వుంటాడు. ఈ రకంగా చూస్తే ఈ నవలకు కథానాయిక రష్యన్ సాహిత్యమే అవుతుంది. అయితే
అప్పుడు నవల కథానాయకుడు నబొకొవ్ అవుతాడు.
అయినా నవలకు బయట నబొకొవ్ ఏమనుకుని దీన్ని రాసాడో
మనకెందుకు. నవల లోపల దీని విలువే మాట్లాడుకుందాం. రచయితగా ఫియొదొర్ పరిణతి
తెలుసుకోవాలంటే ఈ అధ్యాయం చదివి తీరాలి. తొలి అధ్యాయంలో కవితల్లో చాలా మార్దవంతో
కన్పించిన అతని కళ, ఇక్కడకొచ్చేసరికి
నిండా మందుపాతరలు పూడ్చిన భూమిలా బెంబేలెత్తిస్తుంది. ఎక్కడ నిలబడితే ఏం పేలుతుందో
తెలీదు. ఏది రచయిత అభిప్రాయమో, ఏది కాదో, దేన్ని సమర్థిస్తున్నాడో, దేన్ని తూలనాడుతున్నాడో
కూడా ఓ పట్టాన అర్థం కాదు. మనం నిల్చున్న భూమి సురక్షితమైనదే అని దిలాసా
పడేలోపులోనే, నిలువు గోతిలో కూరుకుపోతాం. ఈ చెర్నిషెవ్‌స్కీ
పుస్తకం మీద సమీక్ష రాసిన విమర్శకుడొకరు ఇలానే వాపోతాడు:
“But he makes
fun, not only of his hero: he also makes fun of his reader… [A]s soon as the
reader, as he descends the course of a sentence, thinks he has at last sailed
into a quiet backwater, into the realm of ideas which may be contrary to those
of Chernyshevski but are apparently shared by the author–and therefore can
serve as a basis for the reader’s judgment and guidance–the author gives him an
unexpected fillip and knocks the imaginary prop from under him, so that he is
once more unaware as to whose side Mr. [Fyodor] Godunov-Cherdyntsev is on in
his campaign against Chernyshevski–whether he is on the side of the advocates
of art for art’s sake, or of the government, or of some other of
Chernyshevski’s enemies whom the reader does not know.”
ఈ పుస్తకం శిల్పం కూడా వినూత్నంగా వుంటుంది. ఫియొదొర్
మాటల్లో చెప్పాలంటే, ఒక
ఉంగరంలా వర్తులాకారంలో వుంటుంది. ఉంగరాన్ని మధ్యలో రాయి కలిపినట్టు ఈ పుస్తకపు
ఆద్యంతాలను కలుపుతూ ఒక కవిత (sonnet) వుంటుంది. ఈ కవిత రెండు
భాగాలుగా విడగొట్టి వుంటుంది. రెండో సగం పుస్తకం మొదట్లోనూ, మొదటి
సగం పుస్తకం చివర్లోనూ వుంటుంది. కాబట్టి పుస్తకం పూర్తి చేసిన ప్రతీ పాఠకుడూ
ఖచ్చితంగా మళ్ళీ పుస్తకం మొదటికొస్తాడు. అలాగే, సాధారణంగా
జీవితచరిత్రల్లో వ్యక్తుల పుట్టుకని మొదట నమోదు చేస్తారు. కానీ ఇక్కడ పుస్తకం
చివర్న చెర్నిషెవ్‌స్కీ పుడతాడు. (చిత్రంగా నబొకొవ్ రాసిన ఏకైక జీవితచరిత్ర “నికొలాయ్
గొగోల్” కూడా గొగోల్ మరణంతో మొదలై పుట్టుకతో ముగుస్తుంది.) ఇలాంటి శిల్పం వెనుక ఫియొదొర్ ఉద్దేశ్యమేమిటంటే:
“... so that the
result would be not the form of a book, which by its finiteness is opposed to
the circular nature of everything in existence, but a continuously curving, and
thus infinite, sentence.”
ఐదో అధ్యాయం:
మొత్తం పుస్తకంలో చలాగ్గా సాగిపోయే అధ్యాయం ఇది. ఈ సరికే పాత్రలతో
ఓ జీవితాన్ని గడిపేసిన అనుభూతి కలుగుతుంది. ఫియొదొర్ జీవితం ఒక కొలిక్కి వస్తుంది.
ఈ ప్రశాంతతను ప్రతిబింబిస్తూనే ఈ అధ్యాయం కూడా సాగుతుంది.
నబొకొవ్ తన కాల్పనిక ప్రపంచాలను ఎంత పటిష్టంగా నిర్మిస్తాడూ
అన్నదానికి ఇక్కడ నాకు తట్టిన ఒక ఉదాహరణ ఇస్తాను. నవల రెండో అధ్యాయంలో ఫియొదొర్ తన
తండ్రి జీవితచరిత్ర రాస్తాడు. ఇందులో సందర్భానుసారం తండ్రి మరణవార్త తెలిసిన రోజుని
కూడా చిత్రిస్తాడు. అప్పటికింకా ఫియొదొర్ కుటుంబం రష్యాలోనే వుంటుంది. ఒక శీతాకాలం
రాత్రి “మిషా” అనే యువకుడు ఈ వార్తని మోసుకొస్తాడు. ఇతను ఫియొదొర్ తండ్రి స్నేహితునికి
దగ్గరి బంధువు. దరిమిలా ఈ మిషా బెర్లిన్‌లో ఒక పుస్తకాల షాపు పెట్టుకున్నాడనీ, ఇతన్ని ఎప్పుడు చూసినా ఆ భయంకరమైన రాత్రే గుర్తుకువస్తుందనీ
రాస్తాడు ఫియొదొర్. ఇక్కడితో మిషా ప్రసక్తి ముగుస్తుంది. తర్వాత మూడో అధ్యాయంలో ఫియొదొర్
ఇతని పుస్తకాల షాపులోనే, చెర్నిషెవ్‌స్కీ ఆర్టికల్ కోసం,
ఒక మేగజైన్ కొంటాడు. ఈ సందర్భంలో మిషా అక్కడ లేడనీ. డెంటిస్టు దగ్గరకు
వెళ్ళాడని మనకు తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మిషా ప్రస్తావన వచ్చేది ఈ ఐదవ అధ్యాయంలోనే.
అయితే ఈసారి వాస్తవంలో కాదు, కలలో వస్తుంది. ఫియొదొర్ ఒక రాత్రి
తన పాతగదికి వెళ్ళి తండ్రిని కలిసినట్టు కలగంటాడు. వెళ్తూ వెళ్తూ దారిలో పుస్తకాలషాపుని
చూస్తాడు. షాపు గాజు కిటికీలోంచి ఎవరో ఎవరికో పుస్తకం అమ్ముతున్నట్టు నీడ కనిపిస్తుంది.
అమ్ముతున్నది మిషా కామోసనుకుంటూ ఫియొదొర్ ముందుకు సాగిపోతాడు. ఇలా ఈ మిషా అనే పాత్ర
నవల మూడొందలరవై పేజీల్లోనూ కేవలం ఆరంటే ఆరు వాక్యాల్లో వుంటాడు. ఇతని ప్రస్తావన కూడా
మూడుసార్లూ మూడు వేర్వేరు అధ్యాయాల్లో వస్తుంది. మొదటిసారి ప్రత్యక్షంగా వస్తాడు (కానీ
గతంలో), రెండోసారి అస్సలు కన్పించనే కన్పించడు, మూడోసారి ఇతని నీడమాత్రమే (అది కూడా కలలో) కనిపిస్తుంది. ఇతనికి నవలలో సాగే
అసలు కథతో ఏ సంబంధమూ లేదు. ఇబ్బడిముబ్బడిగా వున్న పాత్రల్లో ఒకడంతే. అసలు మొదటిసారి
చదివినపుడు, పుస్తకం మూసాక, ఇతనొకడు నవల్లో
వున్నాడని గుర్తుకు తెచ్చుకుందామన్నా గుర్తురాదు. కానీ వున్నాడు. మన జీవితంలోనూ అంతే.
మన కథకు సంబంధంలేని వ్యక్తులు సవాలక్ష మంది వస్తూపోతూ వుంటారు. మన జీవితకథను బట్టీ
చూస్తే వాళ్ళు కేవలం “సైడు కారెక్టర్ల”లా కనిపిస్తారంతే; అప్పటికప్పుడు
మేకప్పేసుకు మన ముందుకొచ్చి, తమ తమ పాత్రల్ని పోషించి,
పనవగానే తెరవెనక్కి వెళిపోయే నటుల్లా అనిపిస్తారంతే. కానీ వాళ్ళకీ స్వతంత్రంగా
జీవితాలుంటాయి. మన జీవితాలకు సమాంతరంగానే అవీ నడుస్తుంటాయి. ఎక్కడో ఇదే క్షణంలో పొద్దున్న
మనకి టికెట్ కొట్టిన కండక్టరు అలసటగా ఇంకొకరికి టికెట్ కొడుతుంటాడు, మధ్యాహ్నం మనకి కాఫీ ఇచ్చిన ఆఫీస్ బోయ్ ఈలపాట పాడుతూ ఖాళీ రోడ్డు మీద నడుస్తుంటాడు,
సాయంత్రం దార్లో దయగా చిరునవ్వొకటి పారేసిన బుజ్జిది బొటనవేలు నోట్లో
కుక్కుకుని బజ్జునూంటుంది, మనకేమీ కాని మనిషెవరో మనకేమీ కాలేక
నక్షత్రాల్తో ముచ్చట్లు పెడతూంటారు. అయితే మనం మన చైతన్యంలోనే బందీలం కాబట్టి వాళ్ళ
ఉనికి పట్ల నిరంతర అవగాహన వుండదు. మన చైతన్యాకాశంలో వాళ్ళ తాత్కాలిక అస్తిత్వాలు ఉల్కల్లా
మెరిసి చప్పున ఆరిపోతూంటాయి. చివరకు మన ఖాళీ అడ్డాలో మనమే మిగులుతాం. ఆ ఖాళీనే దర్జాగా
ఏలుకుంటాం. కానీ పాపం విశ్వస్రష్ట సంగతి అలాక్కాదే! అసలాంటోడకడుంటే, వాడు ఇక్కడ మనల్నీ తైతక్కలాడిస్తూండాలి, అక్కడ వాళ్ళనీ
తైతక్కలాడిస్తూండాలి. ఉబుసుపోనపుడు ఒకరి తైతక్కల్ని మరొకరి తైతక్కల్తో క్రిస్‌క్రాస్
చేసి వినోదం చూస్తూండాలి. అందరికీ ఒకే ప్రాధాన్యం ఇవ్వాలి. అందరి బాగోగులూ ఏకకాలంలో
పట్టించుకోవాలి. మరి విశ్వస్రష్టలాగే రచయితలు కూడా తమ తాహతుకు తగిన బుల్లిబుల్లి ప్రపంచాల్ని
సృష్టించి ఆడించేవాళ్ళే కదా. వాళ్ళు కూడా తమ పాత్రలన్నింటినీ అంతే శ్రద్ధగా పట్టించుకోవాలి
కదా. ఒకరు ప్రధానపాత్ర, మరొకరు సహాయకపాత్ర అంటూ పక్షపాతం చూపించకూడదు
కదా. కానీ చాలామంది రచయితల ప్రపంచాలు అలా వుండవు. వాటిల్లో ఇలాంటి సహాయకపాత్రలు,
ప్రధానపాత్రల జీవితాల్లోకి వచ్చినట్టే వచ్చి, తమకి
రచయిత పురమాయించిన కార్యం నెరవేర్చగానే నేపథ్యంలోకి మాయమైపోతుంటాయి. వాటికో ప్రత్యేకమైన
బతుకున్నట్టనిపించదు. కానీ నబొకొవ్ రచనల్లో అలాక్కాదు. మిషా లాగా కొన్ని వాక్యాల్లో
మాత్రమే కన్పించే పాత్రలకి కూడా ప్రత్యేకమైన అస్తిత్వాలూ, జీవితాలూ
ఉన్నట్టనిపిస్తాయి. మనం చదువుతున్న అసలుకథతో పాటూ వాళ్ళ కథలూ వెనకెక్కడో లీలగా సాగిపోతూన్నట్టూ
తోస్తుంది. కొన్నిసార్లు వాళ్ళొకళ్ళున్నారన్న స్పృహ ప్రధానపాత్రలకి కూడా లేకపోవచ్చు.
కానీ పాఠకులుగా మనకుంటుంది. ఉదాహరణకి ఫియొదొర్ మూడోఅధ్యాయంలో పుస్తకాల షాపుకి వెళ్ళినపుడు,
“షాపు యజమాని అక్కడ లేడు; అతను డెంటిస్టు దగ్గరకు
వెళ్ళాడు...” అని ఒక్క వాక్యంలో తేల్చేస్తాడే తప్ప, ఆ షాపు యజమాని
మిషానే అని చెప్పడు. కానీ నిశితమైన చదువరులందరికీ అతను మిషానే అని తెలుస్తుంది. అంటే
ఇక్కడ సాక్షాత్తూ కథ చెప్తున్న ఫియొదొర్‌కూడా పట్టించుకోని పాత్రని మనం పట్టించుకుంటున్నామన్నమాట.
ఏదో ఒక ఉదాహరణ కోసమే నేనీ పాత్రని ఎంచుకున్నాను. మనకి పసిగట్టే నైశిత్యమూ, పట్టించుకునే ప్రేమా వుండాలేగానీ “ద గిప్ట్”లో ఇలా చాలా పాత్రలు నవల సాగే పర్యంతమూ
తెరవెనుక జీవితాల్తో సందడి చేస్తూనే వుంటాయి. ఇంత శ్రద్ధతో అల్లటం వల్లనే నబొకొవ్ ప్రపంచాలు
మన చుట్టూవున్న ప్రపంచంతో పోటీపడేంత మార్మికంగానూ, దట్టంగానూ,
అనంతమైన పొరల్తోనూ వున్నట్టనిపిస్తాయి. అందుకే చదువుతున్నంతసేపూ ఆ ప్రపంచాల్లో
చేరి ఉనికి కోల్పోవటం మన ప్రపంచం నుంచి పలాయనంలా అనిపించదు.
* * *
ముక్తాయింపు:
“ఒక పుస్తకం చదవాలని ఉత్సాహంతో ఉవ్విళ్ళూరే మనిషికీ, చదవడానికి ఒక పుస్తకం కావాలని పరితపించే అలసిపోయిన
మనిషికీ చాలా పెద్ద తేడా” వుంటుందంటాడు చెస్టర్‌టన్. నేనీ పుస్తకాన్ని రెండో రకంగానే
మొదలుపెట్టాను. నన్ను యథాతథంగా ప్రేమించే, నేను యథాతథంగా ప్రేమించగలిగే
ఓ పుస్తకం కావాలని బాగా అనిపించినపుడు దీని ఆసరా అడిగాను. ఆసరా ఇచ్చింది. ఎక్కడో నాకు
పరిచయంలేని ఓ చెట్టు పిప్పిగా మారి కాగితమైతే, నేనెప్పుడూ చూడని
ముద్రణాయంత్రమొకటి దాని మీద నల్లగా అక్షరాలు గుద్దితే, నాకు తెలీని
కాలంలో, నాకు తెలీని స్థలంలో తయారైన ఈ పుస్తకం నాదాకా వచ్చి,
నా జీవితానికి (రక్త మాంసాల్తో, జీవ చైతన్యంతో
వున్న ఓ మనిషి జీవితానికి) ఆసరా ఇవ్వడమేమిటి?
ఏమో, విషయాన్నలా చూడబుద్ధేయడం లేదు. ఎప్పుడో డెబ్భై
అయిదేళ్ళ క్రితం ఒక వ్యక్తి తను జీవితంలో ప్రేమించిన విలువలన్నింటినీ ఓ చోట గుదిగుచ్చి
ఈ పుస్తకాన్ని కలగన్నాడు. ఎలాగో ఏంటో అనవసరం, నేనిప్పుడు మళ్లా
అదే కలగన్నాను. రష్యన్ సాహిత్యమేవన్నా నాకు ముద్దపెడుతుందా, సీతాకోకచిలుకల
అధ్యయనంతో నాకు ఒరిగేదేముంది, చెర్నిషెవ్‌స్కీ జీవితంతో నాకసలు
సంబంధమేంటి, ఫియొదొర్ - జినాలు నాకేమవుతారు, వాళ్ళు కలిస్తే నాకేంటీ, కలవకపోతే నాకేంటీ ... ఈ పుస్తకం
ఇలాంటి ప్రశ్నలు వేటికీ జవాబు చెప్పలేదు. ప్రేమ దగ్గరా, కళ దగ్గరా
ఇలా పనికొచ్చే ప్రశ్నలకు జవాబులుండవు. కానీ ఒక్కటి చెప్పగలను: this book
made my world a better place.
ఒక ఇంటర్వూలో నబొకొవ్‌ని “మీ ప్రపంచాల్లో నిష్పలత్వం ఎందుకంత
ఎక్కువగా వుంటుందీ” అని అడిగారు. దానికాయన,
తన అన్ని పాత్రలూ అలా వుండవనీ, ఫియొదొర్‌లా గెలిచే
పాత్రలూ వుంటాయనీ చెప్తూ ఒక మాటన్నాడు:
“In
fact I believe that one day a reappraiser will come and declare that, far from
having been a frivolous firebird, I was a rigid moralist kicking sin, cuffing
stupidity, ridiculing the vulgar and cruel–and assigning sovereign power to
tenderness, talent, and pride.”
దీన్ని ఎవరో ఎప్పుడో వచ్చి నిరూపించనక్కర్లేదు. నాలాంటి
పాఠకుల మస్తిష్కాల్లో చిరకాలం నిలిచే ఇలాంటి పుస్తకాలే ఆయన తరపున వకాల్తా పుచ్చుకుంటాయి.
A life to live and a gift to
give! Thank you Nabokov!
(December
18, 2009)
పూర్తి భాగం "పుస్తకం.నెట్"లో చదవచ్చు.
0 comments:
మీ మాట...