November 17, 2014

లోయల్లో ఊయల




భరత్‌నగర్లో లోకల్‌రైలు దిగి ఫ్లాట్‌ఫాం చివరికి వచ్చి పట్టాలు దాటి తుప్పలమధ్య బాటలోంచి నడిస్తే వచ్చే సిమెంటురోడ్డు. వీధిలైటు పసుపుగా పరుచుకున్న చోట నిల్చున్నాను. రమణ బండి మీద వచ్చి నన్ను పికప్ చేసుకోవాలి. తర్వాత మందుబాటిలూ స్టప్ఫూ తీసుకుని, ఆయన బొమ్మలేసుకోవటానికని కొత్తగా అద్దెకుతీసుకున్న స్టూడియో చూట్టానికి వెళ్లాలి.

కాల్ చేస్తే దార్లో ఉన్నా అన్నాడు. వెయిటింగ్ ఇంతసేపని తేలినాకా మెదణ్ణి దేన్తోనో ఆక్యుపై చేసుకోవాలిగా. చుట్టూ చూస్తే… నగరపు ఈ మూల కిక్కిరిసిన నివాసాలు. కాసేపు నా రచయిత చొక్కా తగిలించుకుని అవలోకించాను. అపుడు అలవాటు తెర చప్పున జారి పరిసరాలు మేల్కొంటాయి. కానీ ఒళ్ళు దగ్గరపెట్టుకోపోతే ఏవో దొంగ కంక్లూజన్లు కిట్టించేస్తావు, దగ్గర పెట్టుకుంటే నిజంగానే ఏదో నిజం నీ తలుపు తట్టొచ్చు. అలా చుట్టూ ఆవరించి ఉన్న ఇళ్ళని – రెండుమూడు గదుల ఆస్బెస్టాస్ కప్పుల ఇళ్ళ నుంచీ, మధ్యతరగతి లైఫ్‌సేవింగ్స్ ఫలితమై కింది వాటాల్ని ఫామిలీలకి అద్దెకిచ్చే నిటారు అంతస్తుల ఇళ్ళదాకా అన్నింటినీ – చూస్తోంటే, నా సోమరి మెదడు ఏదో ఆపద్ధర్మంగా అందిన సారాంశాన్ని కక్కేయబోతోందని పసిగట్టి ఆపేసాను. రోడ్డువారన నిలబడి మాట్లాడుకుంటున్న కుర్రాళ్ళ గుంపుకేసి చూపుతిప్పితే, సాహిత్యవర్ణనలకు నప్పేట్టు ఒద్దికైనమూసల్లో ఇమడకుండా అంతా కలగాపులగంగా కనపడి, విసుగొచ్చి, ఇదంతా కట్టిపెట్టేసి, రమణగారి కొత్త పాషన్‌ప్లస్సు ఎప్పుడు వీధి మలుపు ఎపుడు తిరుగుతుందా అని చూడటంలో పడ్డాను. ఆయన కంటోర్స్‌తో సరిపోలని రెండుమూడు ఆకారాలు వచ్చి నన్ను దాటుకుంటూ పోయాకా, నిస్సందేహంగా ఆయనదైన సిల్హౌటు బండి మీద మలుపు తిరిగింది. ముఖం మొత్తాన్ని వెలిగించే (కానీ అయిందానికీ కాందానికీ చవగ్గా వాడేసే) తన సిరినవ్వుతో పలకరించి బండి చుట్టుతిప్పాడు.

వెనక ఎక్కాకా ఇద్దరం సందులూగొందుల్లోంచి పోతున్నాం. మాటలవుతున్నాయి. “నేను తాగాలని ప్లాన్ చేసుకునేం రాలేదు. ఆ ప్రోగ్రాం లేకపోయినా ఓకే” అన్నాను. ఇంటి దగ్గర బయల్దేరేటపుడు విద్య చేసిన హెచ్చరిక కొంత కారణమైతే, ప్రస్తుతం నా జేబులో ఆయనకి తీర్చాల్సిన మూడువేలూ మినహాయిస్తే విద్య శాంక్షను చేసిన నూట పది మాత్రమే ఉన్నాయి (ఒక వంద కాయితం, ఒక పది కాయితం). అందులో రైలుటికెట్టుకి పది తీసేస్తే, ఈ సిట్టింగుకి నా తరపున పెట్టుకోగలిగే ఖర్చు వందరూపాయలు మాత్రమే. అందుకే అలా మొహమాటపడ్డాను.

కానీ ఆయన ఒకటనుకున్నాక వెనక్కి తగ్గే రకం కాదు. వైనుషాపు ముందు ఆగాక లెక్కపెట్టనవసరం లేని వందనోట్లు కొన్ని జేబులోంచి తీసి లెక్కపెడుతుంటే నేను నా వందా తీసి ఆయన చేతిలో పెట్టాను. మొహమాటంగా నవ్వుతూ “నిజానికి అవసరమే కూడా” అన్నాడు. కటకటాల కౌంటర్లోంచి చేయి పెట్టి ఏదో బ్రాండ్ పేరు అడిగి నావంక చూసి ఓకేనా అన్నాడు. నాకు ప్రిఫరెన్సులు లేవు గనుక వినపడకపోయినా సరే అనేశాను. తర్వాత అది జిన్ అని అర్థమైంది. ఎపుడూ తాగలేదు. ఐనా ఆడవాళ్ళ మందు అని దానికున్న పేరు ఇదివరకూ వినుంటం వల్ల, ఎలాగూ తాగింతర్వాత రైలెక్కి ఇంటికి వెళ్ళటం అనే ఫీటు గురించి అప్పటికే కాస్త వర్రీ అవుతున్న మూలాన, ఇదీ మంచిదేలే మరీ అవుటైపోయే పరిస్థితి రాకుండా అనుకున్నాను.

నాకు మందు ఏదన్నది పెద్ద ముఖ్యం కాదు. మరీ అంత మందుకి మరిగిన నాలిక కాదు. పక్కన తింటానికి మంచి స్టప్ఫు లేదంటే మాత్రం పెగ్గు దిగదు. రమణ అలాక్కాదు, వట్టి నీళ్లు కలుపుకుని సిగరెట్టు నంజుకుంటూ తాగేస్తాడు. అందుకే బజ్జీబండి దగ్గర బైకు ఆపాకా స్టప్ఫు విషయంలో ఎక్కడ పీనాసిగా చుట్టబెట్టేస్తాడోనని భయం పట్టుకుంది. పోనీ నేను చేయాడిద్దామా అంటే పదికాయితమే ఉంది. అందుకే తెగించి, ఇంకో అప్పు జమకని పక్కన పెట్టుంచిన రెండువేల లోంచి కొంత వాడేద్దామని, “లేపోతే ఇక్కడ ఏటీఎం ఏవన్నా ఉంటే పోదాం పదండి” అన్నాను. “ఎందుకండీ మీరు జస్ట్ ఏం కావాలో చెప్పండి” అన్నాడు. అప్పటికే కలిపున్న పిండి చూసి పకోడీ వేయమన్నాం. ఇంకా పునుకులూ, వడలు. బండివాళ్ళిద్దరూ తెలంగాణ జంట అని రమణగారికి తెలిసిపోయిందో, మరి ఈ వ్యవహారాల్లో ఆయన అంతేనో తెలీదుగానీ, నాతో మాట్లాడే ఎటూకాని యాస వదిలేసి పూర్తిగా తన యాసలోకి దిగిపోయాడు (“ఉల్లిగడ్డ ఏషినవే?”).

కట్టించుకుని బయల్దేరాం. సందుమలుపు తిరిగేటపుడు కొండగుర్తులు చెప్పాడు, “ఇదిగో ఎస్బీఐ బాంకుకీ ఐన్‌స్టీన్ స్కూలుకి మధ్యనున్న సందండీ” అని. నాకు అసలు బజ్జీబండి దాకా ఎలా వచ్చామో కూడా గుర్తు లేదు, కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయలేదు. వీధిలైట్ల వెలుగుల్లోంచీ, వాటిని పంక్చువేట్ చేసే చీకట్లలోంచీ ఒక బుల్లి కూడలికొచ్చి ఆగాం. రమణగారి ఇంటిఓనరు ఇల్లు మలుపు దగ్గర ఉంది. ఈయనకి అద్దెకిచ్చింది మాత్రం రోడ్డు అవతల ఇరుకుగేటు దాటి వెళ్తే తప్ప కనపడని ఖాళీస్థలంలో వేసిన రేకుల షెడ్డులో రెండోగది. పక్కగదిలో ఎవరో రొట్టెలు తయారు చేస్తారట. గది తలుపు తీయగానే ఆమూల నించి ఈమూలకి పరిచిన (ఫెవికాల్తో నేలకి అంటించిన) కార్పెట్ కనిపించింది. ఈ గదిలో ఇదివరకూ కోళ్ళను ఉంచేవారట. వాటి ఎండిన రెట్టలతో గదంతా నిండిపోతే, ఈయన ఎంత కడుక్కున్నా పోకపోయేసరికి, ఆఫీసుకారిడార్లలో పరిచేలాంటి ఈ తివాచీ తెచ్చి అంటించాడు. మాటల్లో పడి యథాలాపంగా గుమ్మం దగ్గర పడున్న రెండు పెయింటింగ్స్ దాటొచ్చేశాక, ఆయన వాటిని చూపించి “ఎలా ఉన్నాయో చూస్తూండండి. నేను మీకు స్ప్రయిటు తెస్తా” అని వెళ్ళాడు. మూణ్ణాలుగు రోజుల్లో వచ్చే మహిళాదినోత్సవం సందర్భంగా ఏదో గ్రూపుఎగ్జిబిషన్ ఉంటే దానికి తన వంతుగా వేస్తున్నవి. పేరు పత్రికల్లో నానటం కోసం. మనసు నుంచి వచ్చిన సబ్జెక్టు కాదు. ఆయన మిగతా పెయింటింగ్స్‌లో ఉండే మజా లేదు.

ఈ తెలియనిగది సమక్షంలో చతికిలపడ్డాను. తివాచీ మీద వేళ్లకి అందే పీచుని పీకుతూ కాసేపూ, పాతపేపర్లు తిరగేస్తూ కాసేపూ, ఉన్న ఒకే ఒక్క అల్మరాలో (నిజానికి అది వంటగట్టు) ఆయన పేర్చుకున్న కుంచెల్నీ రంగుల్నీ కెలుకుతూ కాసేపు కూర్చున్నాను. ఆయన చెప్పింతర్వాతే నా ముక్కుకి తెలిసిన కోళ్ళవాసన, ఇప్పుడు మేం తెచ్చిన పొట్లాల్లోంచి వ్యాపిస్తోన్న కమ్మని నూనెవాసనతో రిప్లేస్ అవుతోంది. పేపర్లో క్రైంపేజీల కోసం వెతికాను, దొరక్క సినిమా పేజీల్లో రబ్బరు నడుములూ బొడ్డుల వైపు చూస్తూ కాలక్షేపం చేశాను.

ఆయన వచ్చాకా పేపర్లు పరిచి వాటి మీద పొట్లాలు విప్పి బాచీమటాలేస్కుని కూర్చున్నాం. మోడరేట్ ఫీస్టు. ఎపుడూ ఛీర్స్ సంగతి మర్చిపోతాను. ఎలాగుందో చూద్దామని ఓ సగంమూతడు రా జిన్ను ముందే నోట్లో పోసుకున్నా. చల్లటి బిట్టర్‌స్వీటు స్పిరిట్టు నాలికంతా ఇంకుతూ పోయి గొంతుద్వారం దగ్గర మంటగా అణిగింది. తాగటం కన్నా తిండి మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టే నా తత్వం ఆయనకు అలవాటైపోయింది. సగం స్టప్ఫు నావైపే నెట్టేస్తాడు. గ్రౌండ్ వర్కు అంతా సిద్ధం, ఇక ఇక్కణ్ణించీ చుక్కల్లోకీ హేజీ పాలపుంతల్లోకీ ఎగరటమే తరువాయి. “చెప్పండి కబుర్లు” అన్నాడు.

(బహువచనం నుంచి బయటపడలేకపోవటానికి ఆయన తరపు నుంచి బహుశా నా మేధావితనంపై ఆయనకున్న తగని భ్రమలో మరోటో కారణం కాగా, నా తరపు నుంచీ నాకన్నా నాలుగేళ్ళు పెద్దయిన ఆయన వయసూ, ఆయన కళామూర్తిమత్వంపై నాకున్న గౌరవం, నా ప.గో.జీ తనమూ కారణం.)

గాల్లోకి లేచే ముందు నేల మీద తక్కుతా తారట్లాడే గాలిపటంలా కాసేపు సాగింది సంభాషణ. ఆ మహిళాదినోత్సవం పెయింటింగ్స్‌కి నేను తెలుగులో పొయెటిగ్గా రాసిన కాప్షన్ల గురించి మెచ్చుకున్నాడు. ఆ పెయింటింగ్స్‌లో నాకనిపించిన తేడాల్ని (మరీ స్పెసిఫిగ్గా చెప్పేంత అవగాహన లేదు కాబట్టి) మూగవాడి సైగల్లా పైపైన చెప్పటానికి ప్రయత్నం చేశాను. కానీ ఆయన అర్థం చేసుకోగలడు. దట్స్ ద థింగ్. తర్వాత ఆయన ఆర్ట్ ప్రపంచం మీద ఆయన, నా లిటరరీ ప్రపంచం మీద నేనూ గాసిప్ చెప్పుకుని, ఆయన పెయింటింగ్‌కి సంబంధించి అందుకున్న సత్యాల్ని నేను రచనకి, నేను రచన గురించి అందుకున్న సత్యాల్ని ఆయన పెయింటింగుకీ అన్వయించుకుంటూ, నా మీదున్న గురితో ఆయన తన మీద నమ్మకం పెంచుకుంటూ, ఆయన మీదున్న గురితో నేను నా మీద నమ్మకం పెంచుకుంటూ… చాలా మాట్లాడుకున్నాం.

సంభాషణ ఇనెవిటబుల్‌గా మా దరిద్రం వైపూ, డబ్బుసమస్య వైపూ వచ్చింది. ఇది మా రెగ్యులర్ టాపిక్కు. ప్రపంచాన్ని ఎలా జయించాలి, ఎలా సంపాదించాలి అన్నది. నాలో ఇంకా మొలకెత్తుతున్నదే గానీ, రమణగారిలో మాత్రం కరడుగట్టిన రాక్షసకాంక్ష. కానీ ఆ జయించటమూ, సంపాదించటమూ అన్నవి మళ్లా తన లెక్కల్లోనే జరగాలి అనే పట్టింపు చూస్తే ముచ్చటేస్తుంది. జయించటానికి ఆయన వైపున్న సైన్యమల్లా ఈ కొన్ని కుంచెలూ రంగులూ మాత్రమే. కానీ ఎన్నిసార్లు దెబ్బపడినా మొండిగా లేచే మెంటల్‌తనం ఉంది. కాన్వాసు ముందు ఉన్నంతసేపూ ఎలాగూ అక్కడ ఎంత మజా పొందుతున్నాం అన్న దానిమీదే దృష్టి ఉంటుంది. కానీ కాన్వాసు దాటి పక్కకు వచ్చినప్పుడల్లా ఇంటద్దె అనీ, పిల్లలకి అనుకోకుండా వచ్చిపడే జ్వరాలనీ, వాళ్ల స్కూలు ఫీజులనీ ఇలా మనుగడ బాధలు చుట్టుముడుతుంటే, సర్వైవల్ ఆటలో ముందుకెళ్లటానికి మనుషులంతా ఆధారపడే సవాలక్ష నైపుణ్యాల్లో తన ఈ కళ కూడా కేవలం ఒకటి మాత్రమే అన్నట్టు చూడక తప్పదేమో. కానీ ఒకలా చూస్తే ఆర్టిస్టు ప్రివిలేజ్డ్ ప్లేయరు. వాడి ఆటకి నియమాలు వాడే నిర్దేశించుకుంటాడు. పైగా ఈ ఆటని బతకటానికి ఆడేవాళ్ళ మందలో ఒకడు కాదు, ఆనందించటానికి ఆడే అతికొద్దిమందిలో వాడు ఒకడు. కానీ ఆటలో గెలవకముందే కూత ఆగిపోతే అనే డౌటు పట్టి నన్ను చంపుతుంది. అదే అన్నాను.

“నిజమేనండీ, ఎలాగైనా సంపాదించాలి. ఒక్కోసారి భయమేస్తుంది. ఉన్నట్టుండి నాకేదైనా అయి చనిపోతే విద్య పరిస్థితి ఏంటని…” అన్నాను.

ఈ భయానికి కొంత పూర్వరంగం ఉంది. చావుని తల్చుకుని నేనెప్పుడూ పెద్ద భయపడలేదు, కానీ ఇప్పుడు నా చావు తర్వాత విద్య జీవితాన్ని ఊహించుకోవటానికి భయపడుతున్నాను. ఇదంతా నిజానికి విద్యే నాలో (అప్రయత్నంగానే) ఎక్కిస్తుందేమో. ఆరోగ్యం మీద నా అశ్రద్ధ తనకు మరీ విసుగుతెప్పించినపుడల్లా అంటుంది: “నీకేదన్నా అయితే తర్వాత నేనుండనురా. నాకింకేం లైఫ్ ఉంది. చచ్చిపోతానంతే” అని. నిజమే, తనకి నేను తప్ప అబ్సొల్యూట్‌గా ఎవరూ లేరు. ఎంత లేరంటే, నేను లేకపోయిం తర్వాత తను బతకాల్సిరావటాన్ని నేనే ఊహించలేను. నన్ను పాలించే రాణిని, ఎవరి పంచనో దిక్కులేకుండా. కానీ జరిగేది అదే. తన కుటుంబం మొత్తాన్ని శాశ్వతంగా శత్రువుల్ని చేసుకుని ఇటు నా కుటుంబానికీ చేరువ కాలేక… ఎటూ కాని ఈ స్థితిలోకి తెచ్చి… నేన్నిజంగా ఆమెను తీసుకొచ్చి మంచే చేశానా అనిపిస్తుంది. ఏం చేయాలి అంటే జవాబు తెలిసిందే: కనీసంలో కనీసం, సంపాదించాలి. అపుడనిపిస్తుంది, అసలైన పురుషార్థం భార్యాపిల్లల కోసం కూడబెట్టడమేనని. కానీ ఈ రాతలతో ఏం రాలతాయి. నిజంగా ఇంకేదైనా చేసి సంపాదించగలిగితే ఖచ్చితంగా అదే చేయాలి. ఒకప్పుడు నాకు చావుభయమంటే రాయాల్సినవి రాయకుండా చచ్చిపోవటమనే. కానీ ఇప్పుడు నా తదనంతరం అన్నీ అమర్చిపెట్టకుండా చచ్చిపోతానేమోనన్నదే పెద్ద భయమైపోయింది. ఇదంతా తల మీదకి ఒత్తిడిని దించుతుంది. క్రూరమైన దయావిహీనమైన భావాల్నైనా ఆసరా తీసుకోవాలనిపిస్తుంది. మొన్నొకసారి నా ఆరోగ్యం మాటొచ్చి మళ్ళీ తను అదే మాట అనబోతే, “నేనంటూ లేకపోయాక, నువ్వేమైతే నాకేవిటే” అన్నాను. అది నన్నామె అర్థం చేసుకునే ట్రాన్స్‌ఫరెంట్ క్షణాల్లో ఒకటి. “నువ్వెంత స్వార్థపరుడివిరా!” అని అనగలిగింది.

అంతకుముందు ఓ రోజు రాత్రి నన్ను నేను హింసించుకుంటూ కల్పించుకున్న వికృతోహల ప్రభావం కూడా ఆ మాట వెనుక ఉండొచ్చేమో ఆమెకు తెలీదు, నాకూ తెలీదు. ఆ రోజు ఆమె పక్కనే పడుకున్నాను. చిన్నపిల్లలా సగంనోరు తెరిచి ఒత్తిగిలి పడుకుంది. ఎలాగో తన ప్రపంచం మొత్తానికి నన్నే కేంద్రకం చేసేసుకున్న జీవి. ఆ కేంద్రకం కూలిపోతే? నేనిలా ఇక నిద్ర లేవకుండా చచ్చిపోతే? తెల్లవారేకా ఆమె మామూలుగా లేచి, నేను యథావిధిగా రాత్రి పొద్దోయేదాకా ఏదో పుణుక్కుని ఆలస్యంగా పడుకుని ఉంటాననీ, అందుకే ఇంకా లేవలేదనీ అనుకుంటూ, తాను లేచి స్నానాలవీ కానిచ్చేసి, టిఫిన్ చేయటంలో పడి, ఈలోగా నన్నులేపి మొహం కడిగించేస్తే వేడిగా తింటాను కదా అని బెండ్రూంలోకి వచ్చి, ఎంత పిలిచినా పలక్కపోతే కుదిపి, నిరోధంలేని దేహపు కదలికల వల్ల నెమ్మదిగా మొదలైన అనుమానాన్ని తనే మళ్ళీ బయటకి అదిలిస్తూ, కానీ అది పెనుభూతమై పెరుగుతుంటే ఏమీ చేయలేక, అర్థం విప్పార్చుకుంటున్న నిజాన్ని వెనక్కు మళ్ళించలేక, నన్ను అటూయిటూ కదిపి, నాడి పట్టుకుని చూసి, అప్పటికే చల్లబారిన నా ఛాతీకేసి చెవి ఆన్చి, జీవం ఖాళీ చేసి వెళ్ళిపోయింతర్వాత మిగిలిన పదార్థమాత్రపు దేహంలో రక్తసంచలనాలూ లబ్‌డబ్‌లూ ఏమీ లేని గడ్డకట్టిన నిశ్శబ్దాన్ని మాత్రమే వినగలిగి, తనొక శవంతో ఉన్నానని అర్థమై, బహుశా క్షణమాత్రం పాకే లేకి భయానికి లజ్జితురాలై, దాన్ని కప్పిపుచ్చేందుకు ఒక్కసారి కవటాలు వదిలేస్తే వచ్చిపడిన ప్రేమావేశం నా చల్లటి దేహంపై ఫెటిల్లున కన్నీరై పగిలి, బరువుమాత్రమే మిగుల్చుకున్న నా తలని తన వళ్ళోకి తీసుకుని, చెంపలుకారేలా ఏడ్చి, ఆ ఏడుపు అందరికీ వినపడుతుందనీ, వినపడాలనీ, ఎవరో ఒకరు చెంతనుండాలనీ… స్టవ్ మీద మాడిపోతున్న ఉప్మా, అపార్ట్‌మెంటు కారిడార్ల నిండా పాకుతున్న ఏడుపు, కాసేపు ప్రేమతోనూ, కాసేపు తన స్థితి తలుచుకుని, కాసేపు ఈ శవాన్ని ఏం చేయాలనీ…. ఉత్త కట్టెలాంటి శరీరాన్ని డిస్పోస్ చేయటానికి ఎంత ఖర్చవుతుంది, ఏటీఎంలో ఉన్నదెంత, చుట్టూ నా పరిచయస్తులూ, స్నేహితులూ తనకి ఏమీ కాని వారు, ఈలోగా రింగవుతున్న ఫోను లిఫ్ట్ చేస్తే తను వారం క్రితం జాకెట్లు కుట్టడానికిచ్చిన టైలరావిడ కుట్టడం పూర్తయిందనీ వచ్చి తీసుకెళ్లమనీ అంటుంటే, ఈ వినాశనపు సూచనైనా లేని ఓ గతంలోకి పోర్టల్ తెరుచుకున్నట్టయి, వీలైతే ఫోన్లోంచి దూరి అక్కడికి వెళిపోవాలనిపిస్తుంటే, ఆ దారిని ఈ చావుతో కలుషితం చేయబుద్దేయక, రేపు వచ్చి తీసుకుంటానని చెప్పి పెట్టేసి, చాపమీద నిటారుగా పడుకోబెట్టి తెల్లటిగుడ్డతో కప్పివున్న నా వైపు చూస్తూ…. కళ్ళు నిండాయి నాకు, ఆ చిన్నగా నోరు తెరిచి సన్నగా గురకపెడుతున్న బుజ్జితల్లిని చూసుకుంటూ, ఇదంతా చెరిపేసుకుని, ఎప్పటికో పడుకుంటాను. తెల్లారి లేచాకా ఇదంతా ఏమీ చెప్పకుండా సందర్భం కల్పించిమరీ కామెడీగా అంటాను, “నువ్వు మాత్రం సుమంగళిగానే చచ్చిపోవే బాబూ” అని.

ఈ భయమే రమణ గారి ముందు ఆ మాటల్లో బయటపడింది. అవి ఆయనకూ తగిలాయి. తన జీవితంలోకి చూసుకునేలాగా. “అవునండీ” అని వాళ్లావిడ గురించీ, పిల్లల గురించీ తల్చుకున్నారు. “నాకేమన్నా ఐతే విజయ నిజంగా దిక్కులేని పరిస్థితిలో కెళిపోతుంది. పిల్లలు రోడ్డు మీద బతుకుతూ గవర్నమెంటూ స్కూళ్ళలో చదివీ చదవకా అల్లరిచిల్లరగా… అసలు ఊహించుకుంటేనే భయంగా ఉంటుంది.”

“నిజంగా మనం బతికున్నప్పుడు వాళ్ళు గవర్నమెంటు స్కూళ్ళల్లోనే చదువుతున్నా ఫర్లేదనిపిస్తుంది కానీ, మనం లేకుండా మాత్రం వాళ్ళని అలా ఊహించుకోలేం” అన్నాను.

తన ఆలోచన తాలూకు కొనసాగింపునే విన్నట్టు వెంటనే తలూపి ఒప్పుకున్నాడు.

చెల్లెల్ల పెళ్ళికి పెద్ద వడ్డీల్తో తెచ్చిన అప్పుల బరువు ఆయన మీద పడి ప్రతీ నెలా సంపాదన లోంచి పాతికవేలు వడ్డీలే గుంజుకుంటుంటే ఏ నెలకా నెలే టైట్‌రోప్ వాకింగ్ చేస్తున్నారు. నా మాటలు ఆయనలో నిద్రాణంగా ఉన్న భయాన్ని లేపాయి. ఆ భయం నాకన్నా తీవ్రంగా ఉండి ఉంటుంది. ఏడాది క్రితం అనుకుంటా, ఒకరోజు నేను ఎందుకో వాళ్ల ఇంట్లో ఉన్న సందర్భంలోనే ఆయనకి ఉన్నట్టుండి ఛాతీ నెప్పి విపరీతంగా వచ్చింది. ఇంట్లో వాళ్ళు హార్ట్ ట్రబులేమన్నానేమో అని భయపడ్డారు, కన్నీరుపెట్టుకున్నారు. ఎక్కడో పెద్ద ప్రయివేటు హాస్పిటల్లో తెలిసినవాళ్ల ద్వారా కార్టియాక్ చెకప్పుకి వెళ్ళాం ఇద్దరం. ఆ రోజంతా ఏవో టెస్టులతో హాస్పిటల్లోనే గడిచిపోయింది. ఆయన్ని సెక్షన్నుంచి సెక్షన్ కి తిప్పుతూ చెకప్స్ ఏవో చేస్తూనే ఉన్నారు. ఛాతీకి సెన్సర్లు తగిలించి ట్రెడ్మిల్ మీద పరిగెత్తించటం, ఇంకా అలాంటివి. భయమేమన్నా ఉంటే అది ఆయన మొహం మీద కనపడనీయలేదు, నాతో పంచుకోలేదు కూడా. ఉత్కంఠ మాత్రం ఉందనిపించింది. రిజల్ట్స్ కోసం ఆ తెల్లటి కారిడార్లలో ఎదురుచూస్తూ కూర్చున్నప్పుడు ఆయనన్న మాటల్నిబట్టి సిగరెట్టూ మందూ మోతాదు తగ్గించటం గురించి నిజంగా ఆలోచిస్తున్నట్టే కనపడింది. సాయంత్రానికి రిజల్టు వచ్చింది. స్ట్రోక్ అయితే కాదు గానీ, ఆయన గుండె దగ్గర కొలెస్టరాల్ శాతం మాత్రం ఎక్కువుందని తేలింది. మందులూ, ఎక్సర్సయిజూ చెప్పారు. బయటైతే పడ్డాడు, కానీ ఆ సంఘటన చావెంత చేరువో గుర్తు చేసిందనుకుంటా. ఈమధ్యే తాగితాగి చిన్నవయసులో చచ్చిపోయిన దళితకవి గురించి రెండుమూడుసార్లు ప్రస్తావిస్తే అలా అనిపించింది.

వ్యసనంలో సీనియారిటీ పరంగా చూస్తే ఎక్కువ భయపడాల్సింది ఆయనే. కానీ చచ్చిపోయాకా వెనక మిగిలేవాళ్ల పరిస్థితిలో దైన్యత విషయానికొస్తే నా పరిస్థితే అధ్వాన్నమనిపించింది. కానీ ఇదంతా భూమ్మీద మసిలేవాళ్ళకి తప్పని తాపత్రయమే తప్ప ఎవరు చచ్చిపోయినా తోటివాళ్ల బతుకు ఆ చిన్న కుదుపు తర్వాత అలా సాగిపోతూనే ఉంటుందేమో. ఐనా మన దగ్గరివాళ్ళెప్పుడూ మన ఆధ్వర్యంలోనే బాగున్నారని నమ్మాలనుకుంటాం. ఒకవేళ ఇప్పుడలా ఉన్నట్టు లేకపోయినా వాళ్ళని బాగుండే స్థితికి తీసుకెళ్లగలమని నమ్ముతాం.

ఎన్ని పెగ్గులు దాటినా జిన్ను తాగటానికి తియ్యగా బానే ఉంది గానీ, తలకైతే ఎక్కటం లేదు. నిద్రలేమితో ఉన్నవాడ్ని పట్టివూపే మత్తులా ఉందంతే. కానీ రమణగారు తన కుటుంబం గురించి మాట్లాడుతున్నప్పుడు నా కళ్ళల్లో తాగుబోతుకన్నీళ్ళు చిప్పిల్లాయి. మా రెగ్యులర్ సిట్టింగుల్లోలా ఈరోజు పాలపుంతల్లోకి ఎగరలేదు. స్టప్ఫు ఎప్పుడో అయిపోయింది. మందుకూడా కావొచ్చింది. కాసేపు కూర్చుంటే తాగింది సక్రమంగా ఎక్కి ఇంకాస్త బెటర్ మూడ్లోకి వెళ్ళేవాళ్లమేమో. ఒక తీరైన ముగింపుకి చేరినట్టుండేది. కానీ నా ఆఖరు రైలు పదిన్నరకి. బస్సుల్లో వెళ్లొచ్చు గానీ, ఈ స్థితిలో బస్సులవీ మారాలంటే భయం. ఆయన్ని తొందరపెట్టాను.

పేపర్ల అంచులు దాటి తివాచీ పీచులో ఇరుక్కుపోయిన తిండి తునకల్తో సహా అనీ పేపర్లలో చుట్టబెట్టి ఏరి బయటపడేశాం. ఆయన తన 12 X 6 స్టూడియోకి తాళం వేశాడు. ఇద్దరం బండి ఎక్కి బయల్దేరాం. ఇందాకటి సిమెంటు రోడ్డు మీదకు తెచ్చి దింపాడు. నా జేబులో పదికాయితమే మిగిలింది. ఎందుకన్నా మంచిదని చిల్లర అడిగాను, ఆ ఫూలిష్ మనిషిని. ఏ వందైతే నిజంగా అవసరమే అన్నాడో అందులో ఓ యాభైపదులు తీసి మళ్ళీ నాకే ఇచ్చాడు. తుప్పలబాట మధ్య నుంచి తూలి నడుస్తూ మధ్యలో ఆగి, కాళ్ల మీద చిమ్ముతుందేమో అన్న లెక్కకూడా ఉండని ఈ డెలిషస్ స్థితిలో ఉచ్చతన్నించి, పట్టాలెక్కి ఫ్లాట్‌ఫాం మీదకొచ్చాను. లంచ్‌బాక్సులు భుజాల్నేసుకుని ఆఖరి రైలు కోసం ఎదురుచూస్తున్న కొందరు ఓవర్‌టైం జీవులు తప్ప పెద్దగా జనం లేరు. ఏ క్షణాన రైలొచ్చేస్తుందో అన్న కంగారుతో టికెట్‌కౌంటరు వైపు త్వరగా నడుస్తున్నాను. సోబరుగా ఉన్నోడి కంటే కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తూ.

(Published in Kinige Patrika under the a pseudonym)

September 23, 2014

చింతల్లికి, నాన్న


బండి మీద వెళ్ళేటప్పుడు ఇదివరకు కూడా కనపడేవి కొన్ని హోర్డింగులు. జాలికళ్ళతో ఒక పసిపిల్లో పిల్లోడో కెమెరా వైపు చూస్తుంటారు, పక్కన కేప్షన్ ఉంటుంది, బండిజోరు తగ్గించమని సూచిస్తూ “మీ కోసం మీ కుటుంబం ఎదురుచూస్తోంది” అనో ఇంకోటో. అలాంటి ప్రకటనలు చూసినపుడు నేను వాటిల్లో క్రియేటివిటీ గురించి ఆలోచించేవాణ్ణి. “వీళ్లు భలేగా ఎమోషనల్ స్పాటు చూసి కొడుతున్నార”ని అనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు నువ్వొకడివి వచ్చి నన్ను నాన్నని చేసి నిలబెట్టాకా, అలాంటివి తిన్నగా నన్ను అడ్రెస్ చేస్తున్నాయి. బండి నడిపేటపుడు ఇదివరకట్లా ఎదర వున్న దాన్నల్లా దాటేసిపోవాలనే తొందర ఉంటం లేదు. ఇలా చిన్నచిన్న విషయాలు మొదలుకొని నా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నావు నువ్వు. చాపకిందనీరు లాంటిది నీ మోహరింపు.

నువ్వు రాకముందు తండ్రిహోదా పట్ల నాకు కేవలం ఎవల్యూషనరీ ఇంట్రెస్టు మాత్రమే వుండేది. తండ్రి కావటం అంటే ఒక మనిషి జీవపరిణామ దశలన్నింటినీ అతిదగ్గరగా పరికించే అవకాశమని మాత్రమే తోచేది. అప్పుడు కూడా ఆ మనిషి ఒక స్త్రీయే కావాలనుకునేవాణ్ణి. నా బిడ్డలకోసమని నేను ఏరివుంచుకున్న పేర్లన్నీ అమ్మాయిలవే (అందుకే నీ పేరు పెట్టే అవకాశాన్ని పూర్తిగా అమ్మకే వదిలేశాను). అక్కలూ చెల్లెళ్ళూ మరదళ్ళూ మేనకోడళ్ళూ ఎవరూ లేకపోవటం వల్ల నాకు ఆడాళ్ళు ఎందుకు అలా ఉంటారు అనేది ఎప్పుడూ గోడ ఆవలి రహస్యమే. వారి స్నిగ్ధమైన ప్రపంచాలకి (జడరిబ్బన్ల, పూలదండల, డాన్స్‌క్లాసుల, సాయిబాబాగుడుల, హాండ్‌బాగుల, స్కూటీల ప్రపంచానికి) మొట్టమొదటి ఆంతరంగికుడిగా ఉండగలగటం నా దృష్టిలో అద్వితీయమైన పదవి. ఆ లోటు అలాగే ఉంది. కానీ అది అదే, నువ్వు నువ్వే.

ఆ ఎవల్యూషనరీ ఇంట్రెస్టు కూడా ఇప్పుడేం లేదు. సరే నువ్వంటూ ఉన్నావు గనుక, నీ ఎదుగుదల అంటూ నా కళ్ళ ముందు జరుగుతోంది గనుక, ఆ ముచ్చటా తీరుతున్నా, నన్ను నీ వైపు పట్టిలాగే కారణాల్లో అది వెయ్యోవంతు కూడా కాదు. మరి ఏమిటీ అంటే, అవేంటో తెలిస్తే ఇదంతా రాసే సందర్భమే కలిగేది కాదేమో. లేదూ, నిజానికి ఇదంతా బడాయేనేమో, మనిషిని కాబట్టి బుద్ధి కలిగించే అహంభావం వల్ల దీన్నంతట్నీ కేవలం ఒక జంతుసహజాతంగా చూడలేకపోతున్నానేమో. For all i know, ఇప్పటికైతే నీ మీద ఇష్టం నువ్వు ఒక కీ ఇవ్వకుండా ఆడే బొమ్మవి కావటం వల్లనే మాత్రమేనేమో.

నీ మీద నా ఇష్టం పూర్తిగా మానసికమైనదే కాదు; నాకు నువ్వో స్నిగ్ధమైన చర్మంతో కప్పివున్న చిన్ని అవయవాల చలిమిడిముద్దగా కూడా నచ్చుతావు. నీ చర్మం క్వాలిటీని స్నిగ్ధమని సరిపెట్టేయలేము. కాలపు కరుకురాపిడికి అది మున్ముందు నాకు నిగూఢమూ, నానుంచి భిన్నమూ, మరో అన్‌టచబుల్ సమక్షమూ అవుతుందని తెలుసు. ప్రస్తుతానికైతే నిన్నెత్తుకున్నప్పుడు నన్ను నేనే మోస్తున్నట్టు ఉంటుంది. ఎంత పీల్చినా సారం ముక్కుతో పాటూ తీసుకెళ్దామంటే పట్టుబడని నీ వాసన బాగుంటుంది. ఎత్తుకున్నప్పుడు నీ మెడలో ముక్కుదూర్చి పీలుస్తూంటాను. కానీ నువ్వు నా గడ్డం పెట్టే చక్కిలిగిలికి నవ్విస్తున్నాననుకుని నవ్వేస్తూ ఉంటావు. ఈమధ్య నీకు కింద వో రెండు పళ్ళు మొలిచాయి. దాంతో ఇప్పటికే నా పేలవమైన పెన్నుకి వర్ణనాతీతమైన నీ నవ్వు ఇప్పుడింకా అందని దూరమైపోయింది.

ప్రస్తుతానికి నువ్వో pure animal వి. ఇది రాస్తున్నప్పుడు కూడా, నాకు దూరంగా నేల మీద దొర్లాడుతున్న నువ్వు నా వైపు పాక్కొచ్చి ఈ కాగితం చింపటానికి ట్రై చేస్తున్నావు. అది కుదరనివ్వకపోవటంతో, నా జుట్టుని పట్టుకుని కిందకు గుంజే ప్రయత్నంలో పడ్డావు, అదైన తర్వాత ఇప్పుడు నా పక్కకు వచ్చి నిన్నూ నీ మొహాన్ని నా భుజంకేసి రాసుకుంటున్నావు. ఊరికే చెంగనాలు కడుతూ మధ్యమధ్యలో తల్లిని ఒకసారి ఒరుసుకుని మళ్లీ వెళ్ళిపోయే దూడకన్నా ఏమంత భిన్నం కాదు నువ్విప్పుడు. (ఆ తల్లికన్నా నేనూ ఏమంత భిన్నం కాదు. సుమతీసూక్తికి భిన్నంగా నాకు పుత్రోత్సాహం కలిగించటానికి నీ కేవలమైన ఉనికే సరిపోతుంది; చివరకు ఫేస్బుక్లో పెట్టిన నీ ఫొటోకి వచ్చిన లైకులు కూడా సరిపోతున్నాయి.)

అయినా నీ వైనాల్లో ఒక వ్యక్తిత్వాన్ని చదవటానికి విపరీతంగా ప్రయత్నిస్తుంటాం మేం. నాకన్నా ముఖ్యంగా అమ్మ. నీ అన్ని చర్యలూ తనకి ఉద్దేశపూర్వకమైనవిగా కనపడతాయి. ఆ ఉద్దేశాల్ని గెస్ చేయాల్సిన అవసరం కూడా లేదన్నట్టు, విశదంగా తెలిసిపోతున్న విషయాల్లా మీ అమ్మ చదివి చెప్పేస్తూంటుంది. నేను మాత్రం ఇంకా నీ చర్యలకి బయటి ఉద్దీపనల్నే తప్ప, నీ లోపలి ఉద్దేశాల్ని కారణంగా చూడలేకపోతున్నాను. నువ్వు నాలిక బయటపెట్టి ఆడిస్తున్నప్పుడు తనని వెక్కిరిస్తున్నావంటుంది మీ అమ్మ. కొత్తగా వచ్చిన నీ పళ్ళ పదును మీద సరదాగా నాలిక ఆడిస్తున్నావంటాను నేను. ఇలాంటి నీ వేషాల్లో ఏమాత్రం తేడాగా అనిపించినా అది సహజమేనని ఇంటర్నెట్లో వెతికి ఖాయం చేసుకునేదాకా ఇద్దరికీ మనశ్శాంతి ఉండదు.

కానీ నా మనసంతా ఇలా రంగురంగుల బెలూన్లమయం మాత్రమే కాదు. వాటిని గుచ్చి పేల్చే శంకలూ ఉన్నాయి. అప్పుడప్పుడూ ఏమనిపిస్తుందంటే, ఇన్ని కోట్లమంది లోకజ్ఞులూ సజ్జనులూ ఋజువర్తనులూ ఐన మగవాళ్ళున్న లోకంలో, నువ్వు ఇలాంటి ఒక మగవాడి హయాంలోకే వాడినే తండ్రిగా చేస్తూ ఎందుకు ఊడిపడ్డావా అని. అప్పుడు నీ మీద ఒక తటస్థమైన జాలి కలుగుతుంది. ఎందుకంటే, అలా ఎలా కుదిరిందో చెప్పలేనుగానీ, నేను ఒక సామాజిక మానవునిగా ఎదగలేదు. కనీసం పైపై అప్పియరెన్సెస్ వరకూ పద్ధతైన సంసారి వేషాన్ని ఎలాగో నెట్టుకొస్తున్నాను గానీ, నా మనసు ఏ విలువనూ అబ్సొల్యూట్‌ అని నమ్మదు, ప్రతి అవధికీ కన్నాలు తవ్వి అవతలికి దూరుదామని చూస్తుంది. ఇలాగుండటంపై నాకు ఏ ఫిర్యాదులూ లేవు సరికదా గొప్పగా కూడా ఫీలవుతుంటాను. కానీ ఈ స్థితికి వచ్చే క్రమంలో మనసు చేసిన ప్రయాణం సురక్షితమైంది కాదు. అది ఆవలించే లోయల పైన బార్బ్‌డ్‌వైరు మీదుగా దొమ్మరి నడక. ఇప్పటికీ చాలా డెలికేట్ బాలెన్సే. అలాంటి ప్రయాణం నువ్వు చేయటం నాకు ఇష్టం లేదు. ఈ స్థితికి నువ్వు చేరటం ఇష్టం లేదు. అదికూడా కేవలం ఇలాంటి ఒక నేను నీ తండ్రినవ్వటం అన్న కారణంగా జరగటం అస్సలు ఇష్టం లేదు. లోకపు లౌక్యపుటిరుసుకి ఏ రాపిడీ లేకుండా కందెన సులువుతో ఒదిగి సాగిపోవాలి నీ జీవితం. (ఒక్కోసారి నువ్వు పుడుతూనే నాలో ఎక్కడో స్టాప్‌వాచీని క్లిక్ చేశావనిపిస్తుంది. నాకు ఎంతో టైం లేదు. మరీ నిన్ను అయోమయపరిచేంత బొహేమియన్ వాతావరణం ఏం లేకపోయినా, ఉన్న కాస్త అస్తవ్యస్తాన్నీ చక్కదిద్దుకుని నిన్ను లోకరీతికి అనుగుణంగా పెంచగలిగే నాన్నలాగా మారిపోవాలి. క్లాక్ ఈజ్ టికింగ్!)

అలాగని మళ్ళీ నువ్వు అందరుపిల్లల్లాగా పెరగటం కూడా ఊహించుకోలేను. ఆ పసుపురంగు స్కూలు బస్సుల కిటికీల్లోంచి కనిపించే అనేక యూనిఫారాల్లో ఒక యూనిఫాంగా నువ్వు మారటం నాకిష్టం లేదు. నాన్ననో ధృవనక్షత్రంగా చూసే అమ్మ మరీ నాన్న లోకంలోకి ఇమ్మెర్స్ అయిపోయి అవును వీణ్ణి బడికిపంపవద్దంటూ వంతపాడటం మొదలుపెట్టింది గానీ, నాన్నకైనా బుద్ధుండాలిగా. స్కూలుకి పంపక ఏం చేయను. నగరంలో బతక్క ఏం చేయను. ఈమధ్య నిన్ను ఎత్తుకుని బయటకు తీసుకెళ్ళినపుడు మరీ అనిపిస్తుంది. నువ్వు నా భుజం మీద చుబుకం ఆన్చి వచ్చే పోయే కార్లనో, బైకుల్నో చూస్తూంటావు. గట్టిగా హార్న్ వినపడినప్పుడల్లా ఉలికిపడతావు, అహ, పడేవాడివి, ఇప్పుడు అలవాటుపడిపోయి అటు మామూలుగా చూస్తావు. నిన్ను అలా తీసుకెళ్ళి నా బాల్యాన్ని ఆవరించిన దృశ్యాల్లాంటివి చూపించాలని ఉంటుంది. బాటంతా గొద్దెలమయం చేసే మేకలమందల్నో, అష్టాచెమ్మా ముగ్గులు గీసున్న రామాలయం గచ్చునో, మాగన్ను మధ్యాహ్నాలు చల్లగా గలగలల సందడి చేసే రావిచెట్టునో, నత్తలు రథం ముగ్గులేస్తున్న ఆఖరి కోనేటిమెట్టునో, కోసిన పొలంలో గడ్డిమేటు వెనుక కుంగే మెత్తటిబింబాన్నో చూపించాలని ఉంటుంది. నా బాల్యానికి అవన్నీ ఉన్నాయి. నిన్ను మాత్రం ఒక కరుకైన లోకంలోకి తీసుకొచ్చి పడేశాను. ఇది ట్రాఫిక్‌ వల్లనూ, కాంక్రీటు వల్లనూ మాత్రమే కరుకైన లోకం కాదు. శివార్లలో గొంతులుకోసే ముఠాలు తిరిగే లోకం, తల నుంచి గోనెసంచులు వేలాడే పిల్లలు చెత్తకుప్పల్లో ఇనుపచువ్వలు పుచ్చుకుని పాలిథీన్ కాగితాలు ఏరుకునే లోకం, లిప్తమాత్ర యథాలాపపు డ్రైవింగ్ వల్లనే పుచ్చెలు పగిలి చచ్చే అవకాశాలతో కిక్కిరిసిన లోకం, భుక్తిరీత్యా నిత్యం కదుల్తూనే తప్ప నిలకడగా నిలబడిన మనుషులు అరుదుగా కనిపించే ప్రాగ్మాటిక్ లోకం.

మరి ఇలాంటి చోట్ల పిల్లలు పుట్టటం లేదా ఆరోగ్యవంతంగా పెరగడం లేదా అనొచ్చు. ఆమధ్య కొన్నాళ్లపాటు చిత్రమైన రీతుల్లో సమాధానపడేవాణ్ణి. సృష్టిలో ప్రతీదీ ఆ నూటపద్దెనిమిది రసాయనికమూలకాలతో నిర్మితమైనదే కదా. మరి, అవే మూలకాల్లో కొన్నింటితో తయారైన చెట్టుని అందమనీ, ఇంకొన్నింటితో తయారైన కాంక్రీటు భవనాన్ని వికారమనీ ఎందుకు అనుకోవాలీ అనీ ఇలా. కానీ అందమూ వికారమూ కాదు అసలు డిస్టింక్షను. సహజమూ అసహజమూ, ఇంకోలా చెప్తే ప్రకృతిసహజమూ మానవనిర్మితమూను. ప్రకృతి పరివృతమై పెరిగిన బాల్యం ఆలోచనకి కలిగించే విశాలత్వం వేరు. ఎదిగాకా అది చుట్టూ లేకపోయినా, మెదడులో ఒక పచ్చటి విశాలమైన అర అలా ఉండిపోతుంది. అది ఎంత రద్దీలోనైనా నిమ్మళాన్ని ఇస్తుంది. ఎంత ఇరుకులోనైనా వెసులుబాటు ఇస్తుంది. నీకు అది లేదు. నువ్వు కంప్లయిన్ కూడా చేయలేవు. ఎందుకంటే నీకు ఇది తప్ప ఇంకోటేదీ తెలియదు. ఎంపికకి అవకాశం లేదు. అదింకా విషాదం. నిజంగా నువ్వే నా మొట్టమొదటి ప్రయారిటీవైతే వెంటనే ఊరెళిపోయి ఏ కిరాణాషాపో పెట్టుకోవాలి. కానీ ఇందాక చెప్పినట్టు ఎదిగే క్రమంలో ఎక్కడో నేనిలా నగరాటవిలో మాత్రమే శరణులభించే మృగంగా మారిపోయాను.

ఇవి చాలవన్నట్టు ఇంకో పెద్ద గుంజాటన ఉంది. బహుశా వీటన్నింటికీ అదే మూలమై నన్నిలా రాయిస్తుందేమో. నాకు నాన్న అనే శాల్తీ లేకపోవటం వల్ల నిన్ను పెంచటానికి నాకు ఒక మోడల్ లేకుండా పోయింది. అది మంచో చెడో నికరంగా చెప్పలేను గానీ, అది అలా ఉంది. ఒక చెడు ఎగ్జాంపుల్ ఉండుంటే మంచి వైపు వెళ్ళటం సులువయ్యేది, ఒక మంచి ఎగ్జాంపుల్ ఉండుంటే అనుసరించేవాణ్ణి. ఇప్పుడు నా రోడ్డు నేనే వేసుకోవాలి. నువ్వింకా పాకగలిగే చిన్నిప్రపంచంలో మాత్రమే ఉన్నావు కాబట్టి అదింకా పెద్ద కన్సెర్న్ కాదు. కానీ కొన్ని భయాలు. I fucked up so many relationships. I want us to be a success.

August 27, 2014

నాకు నచ్చిన పది పుస్తకాలు (ఫేస్బుక్ పోస్ట్)

I was tagged by Ismail Suhail Penukonda & Indrani Palaparthy to pick 10 books that mean much to me. I love lists & this is about books! In my list I haven't picked the books as they asked, but picked writers and then one of their books. This list is not according to the order of preference (but i can nominate "Kafka Diaries" for the first spot easily). I posted this list as a comment to Ismail garu's post yesterday, and just now realized that i've listed there not 10 but 11 books. Gone through the list again, but couldn't take out anyone, so it will remain.
--
Felt like adding a ‘why’ to the task:


త్రిపుర ‘కథలు’:— పాఠకుణ్ణి ఇంత చేరువగా తీసుకుని కథలు చెప్పిన రచయిత తెలుగులో మరెవరూ నాకు తగల్లేదు. ఎంత చేరువగా అంటే, పాఠకునితో తనకు ఒక intimate shared past ఉన్నట్టు భుజం మీద చెయ్యేసి, కాబట్టి అన్నీ వివరించి చెప్పాల్సిన అవసరం లేదన్నట్టు గుసగుసగా గొణుగుతూ చెప్పే కథలవి. సోకాల్డ్ మహారచయితలెందరో రచనా సర్వస్వాలే రాసి సంపాదించుకోలేని గొంతు త్రిపుర ఈ కొన్ని కథల్లో సాధించుకున్నారు. కథల్లో నాకు బాగా నచ్చినవి ఈ క్రమంలో: ‘చీకటి గదులు’, ‘జర్కన్’, ‘ప్రయాణికులు’, ‘గొలుసు - చాపం - విడుదల భావం’. పెద్దగా నచ్చని, త్రిపుర మార్కు లేవని అనిపించే, కథలు: ‘వలసపక్షుల గానం’ (సగం కథ కాఫ్కా అనువాదం), ‘హోటల్లో’, ’సుబ్బారాయుడి రహస్య జీవితం’. అలాగే, కొన్ని ఇంటర్వ్యూల్లో త్రిపుర చెప్పిందాన్ని బట్టి కాఫ్కాని నేనెందుకు ఇష్టపడతానో అందుకే ఇష్టపడిన మనిషి ఆయనే అనిపిస్తుంది. ఆయన ఆమోదముద్ర చూసింతర్వాతనే Celine, Kerouac లాంటి రచయితలు నాకు పరిచయమయ్యారు. వీలుండీ ఆయన్ని కలవలేకపోవటం ఒక పెద్ద లిటరరీ రిగ్రెట్.


చలం ‘అమీనా’:— చలం కథకునిగా కన్నా కూడా వ్యక్తిగా ఎక్కువ ఇష్టం. ఐతే చలంలోని కథకుడు నాకు బాగా నచ్చిన చోటు మాత్రం ‘అమీనా’నే. పైన “పాఠకుణ్ణి చేరువగా తీసుకుని కథ చెప్పడం” అన్నానుగా – అది చలం ఈ రచనలో చేసినట్టు ఎక్కడా చేయలేదు. ఇక్కడ చలం మొపాసా కాదు, డిహెచ్ లారెన్సు కాదు, ఠాగూరూ కాదు; ఇక్కడ చలం చలమే! 


శ్రీపాద ‘అనుభవాలూ జ్ఞాపకాలూను’:— I like it for its poetry, music & language. నాకాయన అభిప్రాయాలూ అవీ పెద్దగా ఏం పట్టలేదు. ఇందులో కనపడిన జీవితం నచ్చింది. ఆ జీవితాన్ని చెప్పటంలో ఆయన భాష నచ్చింది. కామా తర్వాత కామాకి ఒక్కో పైసంగతి వేస్తూ ఆయన వాక్యాన్ని సంగీతమయంగా సాగించే పద్ధతి బాగుంటుంది.


తెన్నేటి సూరి ‘చంఘిజ్ ఖాన్’:— ఈ పుస్తకం పట్ల నాకున్నది సెంటిమెంటల్ వాల్యూ అని చెప్పాలేమో. ఏదో ఊరు బదిలీ అయినపుడు అమ్మ లైబ్రరీ డిపాజిట్ వదిలేసుకుని దగ్గర ఉంచేసుకున్న పుస్తకం. నాకు ఊహ తెలిసినప్పణ్ణించీ ఇంట్లోనే ఉంది. చాలాసార్లు చదివాను. “సూటూ బోడ్గా బట్ టెంగ్రీ టెమూజిన్ ఖాఖాన్” అని అరుస్తూ, కత్తి ఒర (మొలతాడు) లోంచి తాతయ్య పడక్కుర్చీకర్ర బయటకు లాగి, పొలోమంటూ వెళ్ళి ఏ బియ్యంబస్తా మీదో, కొబ్బరిమాను మీదో పడి కత్తిపోట్లు పొడవటం లాంటి ఎన్నో హీరోయిక్ డీడ్స్ కి కావాల్సిన ఇమేజినేషన్ని మెదడులో నింపిందీ పుస్తకం.


నామిని ‘నా కుశాల నా మనేద’: — The whole of Namini is the sum of his writings. అంతగా సాహిత్యానికి తన్ను తాను ఇచ్చేసుకున్నాడు. ‘నా కుశాల నా మనేద’ is a long musing over death. దాదాపు యాభై పేజీల ఈ రచన ఒక శాక్సాఫోన్ ఆర్టిస్టు ఎక్కడా తడబాటు లేకుండా ఒకే ఎమోషనల్ కంటెంటును ఎక్కడా సాగదీసినట్టు అనిపించకుండా పాడిన పాటలాగా భలే సాగుతుంది.


Kafka Diaries:— ప్రపంచపు ప్రాణమయ సారాంశానికి మన జీవితాన్ని ఎంత దగ్గరగా తీసుకెళ్లచ్చో చెప్పిన పుస్తకం; సాహిత్యాన్ని ఎంత దగ్గరగా తీసుకెళ్లచ్చో కూడా చెప్పిన పుస్తకం. ఈ పుస్తకాన్ని వరుసగా చదవక్కర్లేదు, పూర్తిగా కూడా చదవక్కర్లేదు. మనలో కాఫ్కా అంశ ఏదైనా ఉంటే అదే ఖాళీల్ని పూరించుకుంటుంది, మిగతాది తనకు తానే రాసుకుంటుంది.


Flaubert ‘Sentimental Education’:— "నా తరం మనుషుల మోరల్ హిస్టరీ రాయాలనుకున్నాను" అని చెప్పుకున్నాడు ఫ్లాబె ఈ రచన గురించి. నా వరకూ ఇది నా ఆత్మ తాలూకు రొమాంటిక్ హిస్టరీ అనిపిస్తుంది. “దీవిలో ఒంటరిగా చిక్కుబడిపోతే దగ్గరుండాలనుకునే పుస్తకాల జాబితా” అంటారు కదా, అలా రెండే పుస్తకాలు పట్టుకెళ్ళే వీలుంటే ’కాఫ్కా డైరీల’తో పాటూ ఈ పుస్తకాన్నీ తీసుకువెళ్తాను. ఎందుకంటే, ఫ్లాబె ఈ పుస్తకాన్ని ఎలాగో జీవితమంత సంక్లిష్టంగానూ గానూ నిర్మించగలిగాడు. పుస్తకంలో ఎన్నో మూలల్ని అలా చదివి వదిలేయక పట్టి ఊహించుకుంటే ఇంకెన్నో కథలు ఆవిష్కృతమవుతాయి.


Borges ‘Selected Nonfiction’:— జీవితమనేది కాఫ్కాకి రాయటం కోసం ఒక సాకు ఐతే, బోర్హెస్ కు చదవటం కోసం. If we could make a map of his mental life, then the region covered is not so much about his lived life as his reading life. ఒక పాఠకుని జీవితం కూడా ఈక్వల్ గా సృజనాత్మకమనీ, స్వయం సమృద్ధమనీ చెప్తుంది బోర్హెస్ నాన్ ఫిక్షన్. ఆయన కాల్పనిక రచనలు కూడా పఠనాజీవితం మధ్యలో పఠనం ఆధారంగానే ఆడుకున్న ఆటల్లాంటివి.


Dostoevsky ‘Brothers Karamazov’:— For the sheer feverish absorption it induces in the reader. దేవుడు చచ్చిపోయాడని టెంకిజెల్ల కొట్టినట్టు చెప్పి జీవితపు ఎసెన్సిషయల్ ఏకాకితనానికీ, ఏడ్చే మూలలేనితనానికీ సంసిద్ధపరచిన పుస్తకమిది. ఇవాన్ కరమజవ్ ని మనలో గుర్తించటం, లేదా అతన్ని మనమీదకు ఆవహింపజేసుకోవటమూ ఒక శాపం. అనుభవించాను.


Salinger ‘Franny And Zooey’:— అమాయకత్వం చేయి వదిలి, కాపట్యపు రద్దీ మధ్య దారి తప్పి దిక్కుతోచక, తిరిగి జ్ఞానరాహిత్యపు సాంత్వన కోసం అంగలార్చే శరణార్థి రచనలు సలింజర్ వి. అలాగే ఆయన వచనాన్ని చదవటం అంటే చెక్కిన వజ్రాన్ని వేళ్ల మధ్య ఎత్తిపట్టుకుని లోపలి ప్రతిఫలిత వర్ణకేళిని చూడటం లాంటిది. ఆయనలోని ఈ రెండు అంశాల పక్వదశ ఈ పుస్తకంలో కనిపిస్తుంది.


Nabokov ‘The Gift’:— This book is like a compendium of the values that Nabokov believed in his real life. He presented them like they are. ఏ ఫిక్షనల్ తొడుగులూ లేకుండా. “Nabokov at his vulnerable best”. ఇలా ఇంకెక్కడా అనిపించడు. ఈ పుస్తకం గురించి నేను రాసిన వ్యాసం ఇక్కడ: http://www.scribd.com/…/2327836…/Essay-on-Nabokov-s-the-Gift

July 18, 2014

'జీవించిన గంట' - కేట్ చోపిన్

మిసెస్ లూసీ మల్లార్డ్‌కి గుండెజబ్బు ఉందని ముందే తెలుసు కాబట్టి ఆమె భర్త చనిపోయాడన్న వార్తని ఆమెకి వీలైనంత జాగ్రత్తగా చెప్పాలని ప్రయత్నించారు అందరూ.

దాయబోతూనే విషయాన్ని వెల్లడించే పొడి పొడి మాటల్లో ఆమెకు ఈ వార్తను ఆమె అక్క జోసెఫీన్ చెప్పింది. అప్పుడు ఆమె భర్త ఫ్రెండ్‌ రిచర్డ్ కూడా అక్కడే ఉన్నాడు. అతను పొద్దున్న న్యూస్‌పేపరు ఆఫీసులో ఉన్నప్పుడే ఆ రైలు ప్రమాదం గురించిన వార్త తెలిసింది, ఆ ప్రమాదంలో చనిపోయినవాళ్ల జాబితాలో మొదట ఉన్నది బ్రెంట్లీ మల్లార్డ్‌ పేరే. ఆ వార్తని మరో టెలిగ్రాంతో ఖాయం చేసుకునే దాకా మాత్రమే రిచర్డ్ అక్కడ ఆగాడు. ఆ టెలిగ్రామ్‌ అందీ అంద గానే–– ఈలోగా తనంత జాగ్రత్తా అక్కరా లేని మరెవరైనా ఫ్రెండ్‌ ద్వారా ఈ దుర్వార్త ఆమెకు చేరుతుందేమో అన్న కంగారులో–– ఉరుకులు పరుగుల మీద బయల్దేరాడు.

ఇలాంటి వార్త విన్న చాలామంది ఆడాళ్ళు దాని అర్థం కూడా గ్రహించలేనంతగా కొయ్యబారిపోతారు. ఆమె మటుకు వార్త విన్న మరుక్షణమే భోరుమని ఏడుస్తూ అక్క చేతుల్లో వాలిపోయింది. ఏడ్చీ ఏడ్చీ ఏడుపంతా అణగారి పోయే దాకా ఏడ్చి, ఆ తర్వాత అలాగే లేచి ఒక్కత్తే తన గదిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. తన వెనకాల ఎవ్వరినీ రావద్దంది.

గది లోపల తెరిచిన కిటికీ ముందు సౌకర్యంగా ఒక కుర్చీ వేసి ఉంది. తన శరీరాన్ని కమ్మేసిన అలసట మనసులోకి కూడా పాకిపోతున్నట్టు ఎంతో బరువుగా అనిపించి కుర్చీలో అలాగే కూలబడిపోయింది.

కిటికీ లోంచి చెట్ల చిటారు కొమ్మలు వసంతపు చివుళ్ళతో ఊగుతూ ఆమె కంటపడ్డాయి. మత్తెక్కించే వాన వాసనేదో గాలిలో మసలుతా ఉంది. కింద వీధిలో తోపుడుబండి మీద సరుకులమ్మే మనిషి గట్టిగా అరుస్తున్నాడు. దూరంగా ఎవరో పాడుతున్న పాట వినీ వినపడనట్టు చెవుల్ని తాకుతోంది. చూరు దూలాల్లో గూడుకట్టిన పిచ్చుకలు ఉండుండి కిచకిచమంటున్నాయి.

కిటికీ ఎదురుగా పశ్చిమం వైపు మేఘాలు ఒకదానిలో ఒకటి కలుస్తూ, ఒకదానిపై ఒకటి పేరుకుంటూ ఉన్నాయి. వాటి మధ్య ఖాళీల్లోంచి ఆకాశం అతినీలంగా కనిపిస్తోంది.

ఆమె కుర్చీ మెత్త మీద తల వేలాడేసి కదలకుండా కూర్చుంది, ఆగి ఆగి వెక్కిళ్ళు వస్తున్నాయి, ఏడుపు లోనే నిదరపోయి కలల్లో కూడా వెక్కే పసివాడి వెక్కిళ్ళ లాగ.

ఆమె వయసు తక్కువే, మంచి చాయతో ప్రశాంతంగా కనిపించే ముఖం. ఆ ముఖం మీది గీతలు నిగ్రహాన్నీ, ఒకలాంటి స్థైర్యాన్నీ చూపెడతాయి. కానీ ఇప్పుడు ఆమె కళ్లు అభావంగా ఉన్నాయి, దూరాన మేఘాల మధ్య ఆకాశాన్ని చూస్తున్నాయి. అది ఆలోచించే చూపు కాదు, ఆలోచనలు గడ్డకట్టిన చూపు.

ఆమె వైపు ఏదో వస్తోంది, ఆమె దాని కోసం ఎదురు చూస్తోంది, భయపడుతూనే. ఏమిటది? ఏమిటో తెలీటం లేదు; దానికో పేరు పెడదామంటే అందటం లేదు. కానీ అది ఆకాశం లోంచి మొదలై, గాలిలో ఆవరించి ఉన్న వాసనలూ శబ్దాలూ రంగుల గూండా, తన వైపు రావటం ఆమెకు తెలుస్తోంది.

ఉన్నట్టుండి ఆమె గుండెలు ఎగసి పడటం మొదలైంది. తనను ఆవహించబోతున్నదేమిటో ఆమె మెల్లగా అర్థమవుతోంది, ఆమె ప్రయత్న బలంతో దాన్ని వెనక్కి తరమాలని ప్రయత్నిస్తోంది — ఆమె తెల్లటి సన్నటి చేతులకి అంత శక్తి లేకపోయినా. ఇక ఆమె వల్లగాక, కాస్త పట్టు సడలగానే, చిన్నగా తెరుచుకున్న ఆమె పెదాల మధ్య నుంచి ఒక పదం బయటపడింది. ఆమె ఆ పదాన్ని తన ఊపిరి కంటే సన్నగా పదే పదే గొణిగింది: “స్వేచ్ఛ, స్వేచ్ఛ, స్వేచ్ఛ!” అంతకుముందున్న అభావమైన చూపూ, ఆ తర్వాత ఆక్రమించిన భయమూ మెల్లగా ఆమె కళ్లను వీడి వెళ్లిపోయాయి. ఇప్పుడా కళ్ళు సూటిగా వెలుగుతున్నాయి. ఆమె నాడి వేగంగా కొట్టుకుంది, ప్రవహిస్తున్న రక్తం ఆమె ఒంటి లోని ప్రతీ అంగుళాన్ని వెచ్చబరిచి నిమ్మళించేలా చేస్తూంది.

తనను ఆక్రమిస్తున్నది రాక్షసానందం కాదా అన్న అనుమానం ఆమెకు కలగలేదు. ఒక స్పష్టమైన ఉన్నతమైన చూపు ఆ అనుమానాన్ని కొట్టిపడేసింది. ఆమెకు తెలుసు తను మరలా ఏడుస్తానని–– భర్త మెత్తటి దయగల చేతులు నిర్జీవంగా అతని ఛాతీ మీద వాలి కనపడినప్పుడూ; తనని ఎప్పుడూ ప్రేమగా తప్ప మరోలా చూడని ఆ ముఖం మరణంతో పాలిపోయి కనపడినప్పుడూ… తను మరలా ఏడుస్తుంది. కానీ ఆ శోకమయమైన కాలం తర్వాత దానికి ఆవలగా ఇక పూర్తిగా తనకు మాత్రమే చెందిన సంవత్సరాలెన్నో బారులు తీరి కనపడుతున్నాయి. వాటిని ఆహ్వానిస్తున్నట్టు ఆమె తన చేతుల్ని విశాలంగా చాపింది.

ఆ తర్వాత రాబోయే సంవత్సరాల్లో తను ఇంకెవరి కోసమూ బతకక్కర్లేదు; తన కోసమే బతుకుతుంది. తమకి మాత్రమే పరిమితమైన ఇష్టాయిష్టాల్ని తోటి మనిషి మీద మోపటాన్ని ఒక హక్కు లాగ భావిస్తారు స్త్రీ పురుషులు. అలా మోపటం మృదువుగా చేయనీ, మొండిగా చేయనీ, దాని వెనక ఉద్దేశం ఏదైనా అది అందు లోని దోషం పాలు తగ్గించదని ఆమె ఈ క్లుప్తమైన ప్రకాశవంతమైన క్షణంలో గ్రహించింది. ఇప్పుడిక ఏ మొండి బలమూ తన ఇష్టాయిష్టాల్ని అణచబోదు.

ఏమైనా గానీ– ఆమె అతడిని ప్రేమించింది, కొన్నిసార్లు. ప్రేమించలేదు కూడా, చాలాసార్లు. ఇప్పుడా లెక్కలతో ఏం ఒరుగుతుంది! ఇప్పుడు నేను నాకు మాత్రమే చెందుతానూ అన్న ఈ ఫీలింగ్‌ తో పోలిస్తే, అర్థంకాని చిక్కుప్రశ్న లాంటి ఆ మాయదారి ప్రేమ విలువ ఏపాటిది! నేను నాకు మాత్రమే సొంతం అన్న ఈ ఫీలింగ్‌ తన ఉనికి మొత్తం మీద అత్యంత బలమైన వాంఛ అని ఆమె ఇప్పుడే గ్రహించింది.

“స్వేచ్ఛ! శరీరానికీ మనసుకూ స్వేచ్ఛ!” అని గొణుగుతా ఉంది.

ఇంతలో జోసెఫీన్ తలుపు బయట వంగి నోటిని తాళం కన్నం దగ్గర పెట్టి తనను లోనికి రానివ్వమని బతిమాలుతోంది. “లూసీ తలుపు తీయి! అమ్మ కదూ; తలుపు తీయి– నువ్వి లాగే ఉంటే ఆరోగ్యం పాడు చేసుకుంటావు. లోపల ఏం చేస్తున్నావు లూసీ? దయచేసి తలుపు తీయి.”

“వెళ్లిక్కణ్ణించి. నేనేం ఆరోగ్యం పాడు చేసుకోవటం లేదు.” 

ఇంకా నయం! సాక్షాత్తూ జీవనామృతాన్నే తాగుతుంటే, ఈ తెరిచిన కిటికీ నుంచి!

ఆమె ఊహలు ముందు పరుచుకున్న రోజుల్లోకి కేరింతలు కొడుతూ పరిగెడుతున్నాయి. వసంత కాలం రోజులు, వేసవి కాలం రోజులు, ఇక అన్ని కాలాల రోజులూ ఆమెకే సొంతం. తను ఎక్కువ కాలం బతకాలని చిన్నగా ప్రార్థించింది– నిన్నటి దాకా ఆ ఊహకే వణికిన ఆమె!

అక్క అదేపనిగా బతిమాలగా బతిమాలగా ఆమె తాపీగా లేచి వెళ్ళి తలుపు తీసింది. ఆమె కళ్లు గెలుపు జ్వరంతో వెలుగుతున్నాయి, తనకు తెలీకుండానే గెలుపు దేవత లాగ నడుస్తోంది. నడుస్తూ వచ్చి అక్క నడుము చుట్టూ చేయి వేసింది, ఇద్దరూ కలిసి మెట్లు దిగుతున్నారు. రిచర్డు మెట్ల కింద ఎదురుచూస్తున్నాడు.

ఈలోగా ముందుగుమ్మం తలుపుని ఎవరో బయట నుంచి తెరుస్తున్న చప్పుడు... బ్రెంట్లీ మల్లార్డ్ లోపలికి వచ్చాడు. ప్రయాణం అలసటతో, సూట్‌కేసును హుందాగా ఊపుకుంటూ, చంకలో గొడుగు పెట్టుకుని. అతను రైలు ప్రమాదం జరిగిన చోటుకి చాలా దూరంలో ఇంకెక్కడో ఉన్నాడు, అసలు ప్రమాదం జరిగిందన్న సంగతే అతనికి తెలియదు. ఇంట్లోకి రాగానే తనకి అందిన స్వాగతం చూసి ఆశ్చర్యపోయాడు– జోసెఫీన్ కెవ్వున అరవటం, తన భార్యని కనుమరుగు చేస్తూ రిచర్డు ముందుకు దూకటం. 

డాక్టర్లు వచ్చాకా ఆమె చావుకి కారణం గుండెపోటని తేల్చారు — సంతోషం తట్టుకోలేక వచ్చిన గుండెపోటని.

* * *

(ఇది కేట్ చోపిన్ 1894లో రాసిన “The Story of an Hour” అన్న కథకు అనువాదం. కినిగె పత్రికలో వేరే పేరు మీద ప్రచురితమైంది.)

June 16, 2014

'తెరిచున్న గుమ్మం' - సాకీ

“అత్త వస్తుంది, మీరు కూర్చోండి మిస్టర్ నటెల్. ఈలోగా నాతో కబుర్లు చెప్పితీరాలి,” అందా పదిహేనేళ్ల ఆరిందా.

ఇంటావిడ వచ్చేలోగా ఈ పిల్లతో మర్యాదపూర్వకంగా ఏదో ఒకటి మాట్లాడక తప్పలేదు నటెల్‌కు. కానీ లోపల్లోపల – అసలు ఇలా అపరిచితుల ఇళ్లకు పలకరింపులకు హాజరవటం వల్ల తన నరాలజబ్బుకు కలిగే మంచేమన్నా ఉందా అని సందేహపడ్డాడు. దాని విరుగుడు కోసమే అతను పట్టణం వదిలి ఈ మారుమూల పల్లెకు మకాం మార్చింది.

ఇక్కడకు వచ్చేముందు అతని అక్క ఇక్కడున్న తన పరిచయస్తులందరికీ ఫోన్ చేసి చెప్పింది. “లేదంటే నీ సంగతి నాకు బాగా తెలుసు. ఇల్లు వదిలి బయటకు వెళ్లవు, ఎవ్వరినీ పలకరించవు. ఒక్కడివీ లోపలే మగ్గిపోతావు, ఇంకా దిగులు పెంచుకుంటావు” అన్నది.

“మీకిక్కడ ఎంతమంది తెలుసు?” అడిగింది ఆరిందా.

“ఎవ్వరూ తెలియదు. మా అక్కగారు నాలుగేళ్ల క్రితం దాకా ఇక్కడే ఉండేవారు. ఆవిడ కొంతమంది పేర్లు చెప్పి కలుసుకొమ్మంది. వాళ్లతో ముందే ఫోన్లో మాట్లాడింది,” అన్నాడు నటెల్.

“అయితే మీకు మా అత్త గురించి ఏమీ తెలియదన్నమాట,” సాగదీస్తూ అడిగింది ఆ పిల్ల.

“పేరూ, చిరునామా మాత్రమే తెలుసు,” అన్నాడు. ఈ మిసెస్ సాపల్టన్ వివాహితా, లేక విధవరాలా అన్న మీమాంసలో ఉన్నాడతను. ఇంటి వాతావరణం చూస్తే మాత్రం అక్కడక్కడా మగవాళ్లు మసిలే సూచనలు కనపడుతున్నాయి.

“ఐతే పాపం మూడేళ్ల క్రితం అత్తకు జరిగిన ఘోరం గురించి మీకు తెలీదన్నమాట,” అంది దవడ వేలాడేసి మూతిని సున్నాలా చుట్టి.

“ఏమైంది?” ఘోరం అనే మాటకి అతని నరాలు గుంజాయి. ఈ ప్రశాంతమైన పచ్చని ప్రదేశంలో ఆ మాట అతికినట్లనిపించలేదు.

“ఈ అక్టోబరు సాయంత్రం బయట చల్లగా ఉన్నా ఆ గుమ్మం ఎందుకు తెరిచి ఉంచామో తెలుసా?” అంటూ వారనున్న గదిలో, బయట పచ్చికబయల్లోకి తెరుచుకున్న గుమ్మం వైపు చూపించింది.

“అక్టోబరు వచ్చిందన్నమాటే గానీ వాతావరణం వెచ్చగానే ఉంది. ఇంతకీ ఆ గుమ్మానికీ నువ్వు చెప్తున్న ఘోరానికీ ఏమన్నా సంబంధం ఉందా?” అన్నాడు నటెల్.

“మూడేళ్ల క్రితం ఇదే రోజు, ఆ గుమ్మంలోంచే ఆవిడ భర్త, ఇద్దరు తమ్ముళ్లూ వేటకు వెళ్లారు. తుపాకులు ఊపుకుంటూ తుళ్లుతూ వెళ్లారు. అడవిలో ఏరు దాటుతుండగా ఒక ఊబి వాళ్లని లోపలికి లాగేసింది. ముగ్గురూ ఒకేసారి… పోయారు. శవాలు కూడా చిక్కలేదు.”

ఈ విషయం చెప్తుంటే ఆ పిల్ల గొంతులో ఆరిందాతనం మాయమై గద్గదమైంది. “పాపం అత్త! పిచ్చిదైపోయింది. ఇంకా వాళ్లు తిరిగి వస్తారనే నమ్ముతోంది. వాళ్లతో పాటూ వెళ్ళి చచ్చిపోయిన వేటకుక్కతో సహా ముగ్గురూ ఎలా వెళ్లినవాళ్లు అలాగే అదే గుమ్మం గుండా వెనక్కు వస్తారని ఆమె ఆశ. అందుకే ప్రతీ ఏటా ఈ రోజు దాన్ని అలాగే తెరిచి ఉంచుతుంది. నన్ను కూర్చోపెట్టి వాళ్లెలా వెళ్లారో పూసగుచ్చినట్టు చెప్తూంటుంది. ఆమె భర్త తెల్లని కోటు భుజం మీద వేసుకున్నాడు, తమ్ముళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని నడిచారు, చిన్న తమ్ముడు రోనీ ‘బెర్టీ ఎందుకలా గెంతుతావ్…’ అన్న పాట పాడుతూ వెళ్లాడు, అతను అత్తని ఏడిపించటానికి ఆ పాట పాడతాడు, ఆ పాట అంటే అత్తకు అస్సలు ఇష్టం ఉండదు. మీకు తెలుసా, ఇలాగా నిశ్శబ్దంగా ఉన్న సాయంత్రాలు నాకు గుబులుగా ఉంటుంది, ఆ గుమ్మంలోంచి వాళ్లు నిజంగా నడుచుకుంటూ వచ్చేస్తారేమో అని–”

ఆ ఊహకే వణికిపోతున్నట్టు మాట్లాడటం ఆపేసింది. అప్పుడే వాళ్ల అత్త మిసెస్ సాపల్టన్ లోపలికి వచ్చింది. అతణ్ణి అలా కూచోబెట్టినందుకు క్షమాపణలు చెప్పాక అంది, “వెరా మిమ్మల్నేం విసిగించటం లేదు కదా?”

“లేదు. ఏవో కబుర్లు చెప్తోంది.”

“ఆ గుమ్మం తెరిచి ఉంచితే మీకేం ఇబ్బంది లేదనుకుంటాను. మా ఆయన, ఇద్దరు తమ్ముళ్లూ వేట నుంచి రావాలి. వాళ్లకు ఈ గుమ్మం లోంచి రావటం అలవాటు. ఇవాళ బురదగుంటల్లోకి పోయారు. ఇక వచ్చి మొత్తం తివాచీలన్నీ పాడు చేస్తారు.”

తర్వాత ఆమె ఈ వాతావరణంలో బాతుల వేట ఎంత బాగుంటుందో చెప్పటం మొదలుపెట్టింది. నటెల్ కు గాభరా పెరిగిపోతుంది. వీలైనంత తొందరగా ఈ సంభాషణ భూతాల మీంచి పక్కకు మళ్లితే బాగుండుననిపించింది. ఆమె మాట్లాడేది తనతోనే ఐనా, మధ్య మధ్యలో ఆమె దృష్టి తనను దాటుకుని ఆ గుమ్మం వైపుకు మళ్లుతూండటం అతను గమనించకపోలేదు. సరిగ్గా తాను ఈ రోజే పలకరించటానికి రావటం ఖర్మకాక మరేమిటి.

“నా విషయంలో డాక్టర్లందరూ ఒకే మాటన్నారు. పూర్తి విశ్రాంతి తీసుకోమన్నారు, ఏ రకమైన మానసికాందోళననూ దరి చేరనీయవద్దన్నారు, ఒత్తిడి నుంచి వీలైనంత దూరంగా ఉండమన్నారు,” అని ప్రకటించాడు నటెల్. అస్సలు పరిచయం లేని వాళ్లు కూడా మన అనారోగ్యానికి సంబంధించిన వివరాలు కోసం తపించిపోతుంటారన్న భ్రమలో పడి కొట్టుకునే చాలామందిలో అతనూ ఒకడు. “పథ్యం విషయంలో మాత్రం తలో మాటా అన్నారు,” అంటూ కొనసాగించాడు.

ఆవలింతని అతికష్టం మీద దిగమింగిన గొంతుతో, “అవునా?” అంది మిసెస్ సాపల్టన్. ఉన్నట్టుండి ఆమె ముఖకవళికల్లో అప్రమత్తత వచ్చింది. కానీ అది నటెల్ చెప్తున్న విషయం గురించి కాదు.

“హమ్మయ్యా వచ్చేసారు!” అంది గట్టిగా, “పోనిలే కరెక్టుగా టీ సమయానికి చేరుకున్నారు. చూట్టానికి మొత్తం బురదలో స్నానం చేసినట్టున్నాయే వాలకాలు!”

నటెల్ ఉలిక్కిపడ్డాడు, తర్వాత సానుభూతి పంచుకునే ముఖంతో మేనకోడలు వెరా వైపు చూశాడు. ఆ పిల్ల మిడిగుడ్లేసుకుని బిక్కచచ్చిపోయినట్టు తెరిచిన గుమ్మం వైపు చూస్తోంది. వెన్నుపూస నుంచి జలదరింపు పైకి పాకుతుంటే, అతను కూడా ఆమె చూస్తున్న వైపే తిరిగాడు.

చిక్కబడుతోన్న సంధ్య చీకట్లలోంచి మూడు ఆకారాలు పచ్చిక బయలుపై నడుస్తూ గుమ్మం వైపు వస్తున్నాయి; వాళ్లందరూ తుపాకులు మోస్తున్నారు, వాళ్లలో ఒకరి భుజం మీద తెల్లని కోటు ఉంది. వాళ్ల అడుగుల్లో అడుగులేస్తూ ఒక వేట కుక్క అనుసరిస్తోంది. నిశ్శబ్దంగా వారు ఇంటికి చేరువవుతున్నారు. ఉన్నట్టుండి వాళ్లలో ఒక గొంతు బిగ్గరగా “బెర్టీ ఎందుకలా గెంతుతావ్…” అని పాడటం మొదలుపెట్టింది.

నటెల్ వెర్రి వేగంతో తన ఊతకర్ర, టోపీ చేతుల్లోకి తీసుకున్నాడు. హాలు తలుపు, గులకరాళ్లు పరిచిన బాట, బయటి గేటూ… ఇవి మాత్రమే అతని ఉన్మత్త పలాయనంలో గుర్తున్న కొన్ని మజిలీలు. అతన్ని తప్పించబోయి రోడ్డు మీద ఎదురొచ్చిన సైకిలతను పక్కనున్న తుప్పల్లోకి పోయాడు.

“ఇదిగోనే వచ్చేశాం. బురదగానే ఉంది గానీ, కాస్త ఆరింది. ఇంతకీ ఎవరతను మేం వస్తూంటే అలా పరిగెత్తుకెళ్ళిపోయాడు?”

“చాలా చిత్రమైన మనిషి. పేరు మిస్టర్ నటెల్. తన రోగాల గురించి తప్ప ఇంకేం మాట్లాడడు. ఏంటో మీర్రావటం చూసాడో లేదో కనీసం వీడ్కోలు కూడా చెప్పకుండా ఏదో దెయ్యాన్ని చూసినట్టు పరిగెత్తాడు.”

“దెయ్యాన్ని కాదు, బహుశా కుక్కని చూసి అనుకుంటా,” అంటూ చెప్పడం మొదలుపెట్టింది మేనకోడలు నెమ్మదిగా, “ఆయనకి కుక్కలంటే చాలా భయమని చెప్పాడు నాతో. ఒకసారి ఒక కుక్కల గుంపు ఆయన వెంటపడితే గంగానది ఒడ్డునున్న స్మశానం లోకి పారిపోయాడట. పరిగెడుతుంటే కొత్తగా తవ్విన ఒక సమాధి గోతిలో పడిపోయాడట. ఆ రాత్రంతా ఆయన్ని బయటకు రానివ్వకుండా కుక్కలు ఆ గోతి చుట్టూనే మొరుగుతూ తిరిగాయట. ఎవరైనా జావకారిపోతారు అలాంటి పరిస్థితి వస్తే.”

అప్పటికప్పుడు కథలల్లటం ఆమె ప్రత్యేకత.

* * *


(సాకీ కథ “ఓపెన్ విండో”కు అనువాదం. కినిగె పత్రికలో వేరే పేరు మీద ప్రచురితమైంది.) 

June 10, 2014

Some aphorisms from Nicolás Gómez Dávila

Some thoughts from the Don, particularly about writing:—


The writer who has not tortured his sentences tortures his reader.
తన వాక్యాల్ని హింస పెట్టనివాడు, పాఠకుల్ని హింసపెడతాడు.

A sentence should be hard like a rock and should shake like a branch.
వాక్యం గట్టి రాయిలాగా ఉండాలి, కొమ్మలాగా ఊగాలి.

Nothing is so important that it does not matter how it is written.
ఎలా రాశారూ అన్నది అప్రాముఖ్యం అయ్యేంతటి ముఖ్యమైన విషయం ఏదీ లేదు.

Only he who suggests more than what he expresses can be reread.
తాను వ్యక్తీకరించిన దాని కన్నా ఎక్కువ సూచించే రచయితనే మళ్లీ మళ్లీ చదవగలం.

The writer’s talent lies not in describing a person, a landscape, or a scene, but in making us believe he did.
ఒక మనిషినో, ప్రదేశాన్నో, సన్నివేశాన్నో వర్ణించటంలో లేదు రచయిత ప్రతిభ, వర్ణించినట్టు నమ్మించటంలో ఉంది.

We call the beauty of a language the skill with which some write it.
మనం అందమైన భాష అనేది నిజానికి కొందరు రచయితలు దాన్ని వాడుకోవటంలో చూపించిన ప్రతిభని మాత్రమే.

Avoid repeating a word is the favorite rule of rhetoric of those who do not know how to write.
పదాల పునరుక్తి కూడదన్న రచనా సూత్రం - రాయడమెలాగో ఎలాగో తెలీని వాళ్లకు అత్యంత అభిమాన పాత్రం.

The writer who does not insist on convincing us wastes less of our time, and sometimes even convinces us.
మనల్ని ఒప్పించేందుకు పట్టుబట్టని రచయిత మన సమయాన్ని తక్కువ వ్యర్థం చేస్తాడు, ఒక్కోసారి ఒప్పించేస్తాడు కూడా.

Words arrive one day in the hands of a patient writer like flocks of doves.
ఓర్పు గల రచయిత చేతుల్లోకి పదాలు పావురాల గుంపుల్లాగా వచ్చి వాలతాయి.

To write honestly for the rest, one must write fundamentally for oneself.
తక్కినవారి కోసం నిజాయితీగా రాయదల్చుకున్నవాడు, ముందు తన కోసం తాను రాసుకోవాలి.

Words are born among the people, flourish among writers, and die in the mouth of the middle class.
పదాలు జనం మధ్య పుడతాయి, రచయితల చేతుల్లో వృద్ధి చెందుతాయి, మధ్య తరగతి నోళ్లలో చస్తాయి.

Phrases are pebbles that the writer tosses into the reader’s soul. The diameter of the concentric waves they displace depends on the dimensions of the pond.
రచయిత పాఠకుని మనసులోకి విసిరే గులకరాళ్లు పదాలు. అవి పుట్టించే తరంగాల అడ్డకొలత ఎంతనేది ఆ చెరువు వైశాల్యాన్ని బట్టి ఉంటుంది.

When he believes he says what he wants, the writer only says what he can.
రచయిత తాను చెప్పాలనుకున్నది చెప్తున్నానని ఎంత నమ్మినా నిజానికి తను చెప్పగలిగేది మాత్రమే చెప్తాడు.

To write for posterity is not to worry whether they will read us tomorrow. It is to aspire to a certain quality of writing. Even when no one reads us.
రాబోయేతరం కోసం రాయటమంటే, వాళ్లు రేపు మనల్ని చదువుతారో లేదో అని వ్యాకులపడటం కాదు. రచనను ఒక స్థాయికి తీసుకెళ్లాలని ఆశించటం. ఎవరూ మనల్ని చదవకపోయినా సరే.

A man does not communicate with another man except when the one writes in his solitude and the other reads him in his own.
Conversations are either a diversion, a swindle, or a fencing match.
ఒక మనిషి తన ఏకాంతంలో రాసిందాన్ని మరో మనిషి తన ఏకాంతంలో చదువుకున్నప్పుడు మాత్రమే ఒకరికొకరు అర్థం కావటమనేది సాధ్యం. సంభాషణల వల్ల జరిగేదల్లా పక్కదారిపట్టడమూ, దగాచేయటమూ, లేదా కర్రసామూ మాత్రమే.

Confusion is the normal result of a dialogue.
Except when a single author invents it.
సంభాషణ ఫలితం ఎప్పుడూ అయోమయమే.
దాన్ని కల్పించింది ఒకే రచయిత ఐతే తప్ప.

The traditional commonplace scandalizes modern man.
The most subversive book in our time would be a compendium of old proverbs.
సంప్రదాయకమైన సాధారణత్వం అంటే ఎదురు తిరుగుతాడు ఆధునికుడు. కానీ మన కాలపు ఫక్తు అరాచకమైన పుస్తకం కూడా కేవలం పాత సామెతల సంకలనం మాత్రమే.

To understand a text, one must walk around it slowly, since no one gets in except through invisible posterns.
ఒక రాతని అర్థం చేసుకోవాలంటే దాని చుట్టూ నెమ్మదిగా తచ్చాడాలి, ఎందుకంటే ఎవరైనా లోపలికి వెళ్లగలిగేది అదృశ్య ద్వారాల ద్వారా మాత్రమే కాబట్టి.

Political activity ceases to tempt the intelligent writer, when he finally understands that there is no intelligent text that will succeed in ousting even a small-town mayor.
ఎంత వివేకం గల రచనైనా ఒక చిన్న టౌను మేయర్ని కూడా గద్దె దించలేదన్నది అర్థమయ్యాకా, వివేకవంతుడైన రచయిత ఇక రాజకీయ పరిస్థితి పట్ల స్పందించటం మానేస్తాడు.

“Social” is the adjective that serves as a pretext for all swindles.
“సామాజికం” అనేది అన్ని దోపిడీలకూ సాకుగా పనికొచ్చే విశేషణం.

Journalists and politicians do not know how to distinguish between the development of an idea and the lengthening of a sentence.
భావాన్ని విస్తరించటానికీ, వాక్యాన్ని సాగదీయటానికీ మధ్య తేడా రాజకీయనాయకులకూ జర్నలిస్టులకూ అర్థం కాదు.

http://don-colacho.blogspot.in/
http://don-colacho.blogspot.in/2010/01/art-of-writing.html

May 23, 2014

'చైనా గోడ' - ఫ్రాంజ్ కాఫ్కా

(కాఫ్కా "ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా"కు నా అనువాదం)


చైనా గోడ నిర్మాణం ఉత్తరం హద్దు దాకా పూర్తయిపోయింది. ఆగ్నేయం నుంచి ఒక భాగమూ, నైరుతి నుంచి ఒక భాగమూ వచ్చి ఇక్కడ కలిశాయి. వీటిని ఇరు వైపుల్నుంచీ కట్టుకుంటూ వచ్చిన రెండు భారీ శ్రామిక బృందాలూ (ఆగ్నేయ బృందం, నైరుతి బృందం), ఎవరి భాగంలో వాళ్ళు మళ్ళా ఇలా విడి విడి భాగాలుగా కట్టుకుంటూ వచ్చే పద్ధతినే పాటించారు. ఇదెలా జరిగేదో చెప్తాను: ఇరవయ్యేసి మంది శ్రామికులు ఒక గుంపుగా పని చేసేవారు, వీళ్ళంతా కలిసి, ఉదాహరణకి, ఒక ఐదొందల గజాల గోడ కట్టారనుకుందాం, ఈ లోగా అటు వైపు నుంచి ఇలాంటి గుంపే ఇంకొకటి ఇంతే పొడవు గల గోడ కట్టుకుంటూ వచ్చి, దాన్ని దీనితో కలిపేది. కానీ, ఇలా కలపటం అయ్యాకా, ఈ వెయ్యి గజాల గోడ పూర్తయిన చోట నుంచి మళ్లీ నిర్మాణం మొదలయ్యేది కాదు; దానికి బదులు ఈ రెండు గుంపుల్నీ వేరే దూర ప్రదేశాలకు బదిలీ చేసేవారు, వాళ్ళు మళ్ళీ అక్కడ కూడా ఇదే పద్ధతిలో గోడ కట్టాలి. ఈ పద్ధతి వల్ల సహజంగానే మధ్య మధ్యలో చాలా పెద్ద ఖాళీలు మిగిలిపోయాయి, అవన్నీ తర్వాతెప్పుడో ఒక్కొక్కటిగా పూడ్చుకుంటూ వచ్చారు, కొన్ని ఖాళీలైతే గోడ పూర్తయిపోయిందంటూ అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా ఇంకా పూడుస్తూనే ఉన్నారు. అసలు ఇప్పటికీ కొన్ని ఖాళీలు అలాగే ఉండిపోయాయని కొందరంటారు, కానీ ఈ గోడ నిర్మాణం మొదలైందగ్గర్నించీ పుట్టుకొస్తున్న లెక్కలేనన్ని పుకార్లలో ఇవి కూడా ఒకటి, వీటి నిజానిజాల్ని నిగ్గు తేల్చటం చాలా కష్టం, ఏ ఒక్క మనిషి వల్లో అయ్యే పని కాదు, ఈ నిర్మాణపు భారీతనం అలాంటిది మరి.

గోడని ఇలా విడి విడి భాగాలుగా కట్టే పద్ధతి చాలామందికి విడ్డూరంగా తోచవచ్చు. వరుసగా కట్టుకుంటూపోతే ఏమైంది? అసలు ఈ గోడ ఉద్దేశమే ఉత్తరం వైపున్న తండాల వాళ్ళ నుంచి రక్షణ కోసమని కదా, మరి ముక్కలు ముక్కలుగా ఉండే గోడ రక్షణ ఎలా ఇవ్వగలదు? రక్షణ ఇవ్వడం అటుంచి, అసలు దానికే రక్షణ ఉండదు కదా. నిర్జన బయళ్ళలో ఒంటిగా నిలబడి ఉండే ఇలాంటి గోడ భాగాల్ని ఆ తండాల వాళ్ళు చాలా సులువుగా ఎన్నిసార్లు కట్టినా కూల్చేయగలరు, పైగా ఈ గోడ నిర్మాణం కలగజేసిన ఆందోళనతో ఆ తండాలవాళ్ళు చాలా వేగంగా, మిడతదండుల్లా, తమ విడిదుల్ని ఒకచోట నుంచి ఒకచోటికి మారుస్తూనే వుండేవారు, దాంతో గోడ కట్టిన మాకన్నా కూడా బహుశా వీళ్ళకే దాని ఆనుపానుల పట్ల ఖచ్చితమైన అవగాహన ఉండేదేమో అనిపించేది. అయినప్పటికీ ఈ నిర్మాణానికి ఈ పద్ధతి తప్ప మరోటి అనుసరించే వీల్లేదనిపిస్తుంది. ఎందుకో తెలియాలంటే ముందొకటి అర్థం చేసుకోవాలి: గోడ కట్టింది శతాబ్దాల పాటు నిలిచి రక్షణగా ఉండటానికి; కాబట్టి కట్టుబడిలో నిశితమైన శ్రద్ధా, శతాబ్దాల తరబడి మానవాళి సముపార్జించిన నిర్మాణ కౌశలాన్నంతా వాడటమూ, నిర్మించేవారిలో మొక్కవోని దీక్షా – ఇవన్నీ ఈ పనికి తప్పనిసరి అర్హతలు. శారీరకమైన పనులకు మామూలు శ్రామికులు – డబ్బులిస్తే పనిచేసే మగవాళ్ళూ, ఆడవాళ్ళూ, చిన్నపిల్లలూ – సరిపోతారు; కానీ వీళ్ళలో ఏ నలుగురు శ్రామికుల్ని పర్యవేక్షించాలన్నా నిర్మాణశాస్త్రం లోతుగా తెలిసిన నిపుణుడు ఒకడు కావాలి, అతను పనికి పూర్తిగా అంకితమైపోయి అందులో తన హృదయాన్ని చొప్పించగలవాడై ఉండాలి. పని స్థాయి ఒక్కో మెట్టూ పెరిగే కొద్దీ దాని పట్ల బాధ్యతా పెరగాలి. అలాంటి వ్యక్తులు ఉన్నారు కూడా – గోడ నిర్మాణానికి అవసరమైనంత ఇబ్బడిముబ్బడిగా లేకపోయినా, పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

ఈ పనేం అంత అల్లాటప్పాగా తలపెట్టింది కాదు. మొదటి రాయి ఇంకా పేర్చక మునుపు, యాభై ఏళ్ళ క్రితం నుంచే, మొత్తం చైనాలో ఏ ప్రాంతాల చుట్టూ గోడ కట్టబడుతుందో ఆ ప్రాంతాలన్నింటిలోనూ నిర్మాణ కళని, అందులో మళ్ళా ముఖ్యంగా తాపీ పనిని, ఒక ముఖ్యమైన విజ్ఞాన శాస్త్రంగా ప్రకటించారు, దీనితో అంతో ఇంతో సంబంధమున్న ఇతర శాస్త్రాలే గుర్తింపుకు నోచుకున్నాయి. నాకు ఇప్పటికీ జ్ఞాపకమే, బాగా చిన్నపిల్లలం, నడక నేర్చి కూడా ఎంతో కాలమై ఉండదు, మా గురువుగారి పెరడులో ఉన్నాం, గులకరాళ్ళతో ఒక గోడ కట్టమని ఆదేశించారు; మా తంటాలు మేం పడ్డాకా, గురువుగారు తన అంగ వస్త్రాన్ని నడుం చుట్టూ బిగించి, ఒక్క ఉదుటున ఆ గోడ మీదికి దూసుకెళ్ళారు, అది కూలిపోక ఏం చేస్తుంది, అప్పుడిక మా పేలవమైన కట్టుబడికి ఆయన మమ్మల్ని ఎన్ని తిట్లు తిట్టారంటే, మేం ఏడ్చుకుంటూ తలోదిక్కూ పరిగెత్తి మా అమ్మానాన్నల వళ్లో తలదాచుకున్నాం. చిన్న సంఘటనే, కానీ ఆ కాలపు స్వభావానికి అద్దం పట్టే సంఘటన.

ఇరవయ్యేళ్ళ వయస్సులో నేను తుది పరీక్షల్లో ఉత్తీర్ణుణ్ణయిన సమయంలోనే గోడ నిర్మాణం మొదలవటం నా అదృష్టమనే చెప్పాలి. అదృష్టమని ఎందుకంటున్నానంటే, నాకన్నా ముందు ఉత్తీర్ణులయిన చాలామంది యువకులు, తమకు అందుబాటులో ఉన్న విజ్ఞానమంతా సముపార్జించి కూడా, దాన్ని వాడేందుకు తగిన తావు ఏదీ లేక, తమ మెదడులో అద్భుతమైన నిర్మాణ రచనల్ని మోసుకుంటూ, ఏళ్ళ తరబడి నిష్పలంగా తిరిగేవారు, వేలాదిమంది చివరకు అలాగే నిస్పృహలో కూరుకుపోయారు. కానీ ఒకసారి గోడ పని ప్రారంభమయ్యాకా వీళ్ళలో పర్యవేక్షకులుగా నియమితులైన వారు మాత్రం, తమకు ఇచ్చింది ఎంత దిగువ హోదా ఐనా సరే, తాము అందుకు అచ్చంగా అర్హులమేనని నిరూపించుకున్నారు. ఈ తాపీమేస్త్రీలు గోడ నిర్మాణం గురించి ఆలోచించటం ఎప్పుడూ ఆపలేదు, పునాది రాయి నేలలో పడిన క్షణం నుంచీ గోడలో తామూ ఒక భాగమైపోయినట్టు భావించారు. ఇలాంటి తాపీమేస్త్రీల్లో తమ విధుల్ని అత్యంత క్షుణ్ణంగా నిర్వహించాలన్న కోరికతో పాటూ, గోడ వెంటనే పూర్తయి తమ కళ్ళ ముందు నిలబడితే చూడాలన్న అసహనం కూడా ఉండేది. అదే వాళ్ళని ముందుకు ఉసిగొల్పేది. ఇటు శ్రామికుల్లో ఇలాంటి అసహనం ఉండేది కాదు, ఎందుకంటే వాళ్ళని ముందుకు ఉసిగొల్పేది వాళ్ళ కూలి డబ్బులే. అలాగే అటు పైస్థాయి పర్యవేక్షకులూ, మధ్యస్థాయి పర్యవేక్షకులూ కూడా, గోడ ఏయేచోట్ల ఎంతెంత పూర్తవుతోందో గ్రహించగలిగే హోదాలో ఉన్నవాళ్ళు గనుక, తమ ఉత్సాహాన్నీ విశ్వాసాన్నీ నిలబెట్టుకోగలిగేవారు. కానీ దిగువ స్థాయి పర్యవేక్షకులున్నారే, వీళ్ళు తాము నిర్వర్తిస్తున్న నేలబారు విధులకు మించిన మేధస్సు కలవాళ్ళు, వీళ్ళలో ఉత్సాహం చచ్చిపోకుండా ఉండటానికి వేరే పద్ధతి పాటించాల్సి వచ్చింది. ఎందుకంటే మరి ఇలాంటి వాళ్ళు, తమ ఇళ్ళకు వందలాది మైళ్ళ దూరంలో, నిర్జన కొండ ప్రాంతాల్లో, నెలల తరబడి, ఒక్కోసారి ఏళ్ళ తరబడి, ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ ఎన్నాళ్ళని పని చేయగలరు; ఏ ఆశా లేని ఈ కఠోర ప్రయాస వాళ్ళని నిస్పృహ వైపుకు నెడుతుంది, అంతకన్నా ముఖ్యంగా వాళ్ళ పనితీరుని కుంటుపడేలా చేస్తుంది. అదిగో అందుకే, ఇలా గోడని విడి భాగాలుగా కట్టే పద్ధతి ఎన్నుకోబడింది. ఐదొందల గజాల గోడ పూర్తి కావటానికి ఉజ్జాయింపుగా ఐదేళ్ళు పట్టేది; కానీ అప్పటికే పర్యవేక్షకులు తీవ్రంగా అలసిపోయి, ఇక తమ మీదా, గోడ మీదా, మొత్తం ప్రపంచ మీదే విశ్వాసం లేని స్థితిలో ఉండేవారు. అందుకే, వాళ్ళు రెండు గోడలు కలిపి వేయి గజాల గోడ పూర్తి చేసిన ఆనంద సంబరాల్లో ఇంకా మునిగితేలుతుండగానే, వాళ్ళని వేరే ఎక్కడో సుదూర ప్రాంతానికి బదిలీ చేస్సేవారు. అక్కడికి వెళ్ళే ప్రయాణమార్గంలో వాళ్ళు అక్కడక్కడా పూర్తయిన గోడ భాగాల్ని చూస్తారు, అధిష్టానం విడిది చేసిన శిబిరాల మీదుగా వెళ్తారు, అక్కడ వాళ్ళకి గౌరవ పతకాలు ప్రదానం చేయబడతాయి, దేశం నలుమూలల నుంచీ ఉత్సాహంగా తరలి వస్తున్న కొత్త శ్రామిక బృందాలు వాళ్ళకు ఎదురవుతాయి, గోడకి ఊతంగా నిలబెట్టేందుకు కావాల్సిన కలప కోసం అడవులు కొట్టివేయడాన్ని చూస్తారు, గోడకి ఇటుక రాళ్ళను సరఫరా చేయటానికి కొండలు పిండవటం చూస్తారు, గోడ విజయవంతంగా పూర్తి కావాలని మొక్కుకుంటూ పుణ్యక్షేత్రాల్లో భక్తులు చేస్తున్న ప్రార్థనల్ని వింటారు. ఇదంతా వాళ్ళ అసహనాన్ని చల్లార్చేది. మార్గమధ్యంలో ఇంటి దగ్గర తీసుకున్న కొద్ది కాలపు విరామమూ వాళ్ళని మరింత కార్యోన్ముఖుల్ని చేసేది; తాము గోడ గురించి చెప్తున్నపుడు వినటంలో ఊరివాళ్ళు చూపించే శ్రద్ధాసక్తులూ, అక్కడ నింపాదిగా బతికేసే ప్రతీ మామూలు పౌరుడూ ఏదో ఒక రోజు గోడ పూర్తయి తీరుతుందంటూ వ్యక్తం చేసే ఆశాభావం – ఇవన్నీ వాళ్ళ గుండె తంత్రుల్ని మీటి వారిలో నూతనోత్తేజాన్ని నింపేవి. అప్పుడిక వాళ్ళు, నిరంతరం ఆశతో వెలిగిపోయే పసిపిల్లల్లా, తమ ఇళ్ళకు వీడ్కోలు పలికేవారు; దేశమంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్న గోడ కోసం మళ్ళీ తమ వంతు పని మొదలుపెట్టాలన్న కోరిక వాళ్ళను నిలవనిచ్చేది కాదు. బయల్దేరాల్సిన సమయం కన్నా ముందే బయల్దేరిపోయేవారు; వాళ్ళను సాగనంపటానికి ఊరు ఊరంతా చాలా దూరం వెంట నడిచేది. ఎగురుతున్న జండాలతో, పతాకాలతో రోడ్లన్నీ కిటకిటలాడేవి; వాళ్ళకు తమ దేశం ఎంత గొప్పదో, సుసంపన్నమైనదో, అందమైనదో, ప్రేమాస్పదమైనదో ఇదివరకెన్నడూ లేనంతగా అర్థమయ్యేది. తోటి దేశీయుడు ప్రతీ ఒక్కడూ తమ సోదరుడే, వాళ్ళ రక్షణ కోసమే తామీ గోడ కడుతున్నారు, దీనికి వాళ్ళు జీవితాంతం కృతజ్ఞులై ఉంటారు. ఐక్యతే ఐక్యత! చెట్టాపట్టాలేసుకుని, అంతా ఒక సమూహంగా కలిసి కదులుతారు, వారి రక్త ప్రసరణ ఇక తమ దేహాలకు మాత్రమే పరిమితమై ఉండదు, అంతులేని చైనా విస్తారాల గూండా తీయగా పారుతూ, తిరిగి తిరిగి వస్తూంటుంది.

ఇదంతా దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే, గోడని విడి భాగాలుగా కట్టడంలోని ఆంతర్యం తేలిగ్గానే బోధపడుతుంది. ఇవే గాక మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఈ ఒక్క విషయం మీదే నేను ఇంత సేపు వివరణ ఇవ్వడంలో కూడా పెద్ద వింతేమీ లేదు. పైకి అంత ముఖ్యమైన విషయంగా కనిపించకపోయినా, నిజానికి గోడ నిర్మాణంలో ఇదో కీలకమైన అంశం. ఆనాటి ఆలోచనల్నీ అనుభవాల్నీ ఇప్పుడు అర్థమయ్యేలా చేయాలంటే, ఈ విషయంపై ఎంత మాట్లాడినా సరిపోదు.

మొదటగా చెప్పాల్సిందేమిటంటే, ఆ రోజుల్లో, బేబెల్ బురుజుకు[1] ఏ మాత్రం తీసిపోని నిర్మాణాలు చేపట్టబడేవి, కానీ దైవానుగ్రహం విషయంలో మాత్రం ఆ నిర్మాణానికి పట్టిన గతి వీటికి పట్ట లేదు. ఇదెందుకు చెప్తున్నానంటే, గోడ నిర్మాణం మొదలైన తొలి రోజుల్లో ఒక పండితుడు తాను రాసిన పుస్తకంలో ఈ పోలికను ప్రస్తావించాడు. అందులో ఆయన ఏమంటాడంటే, బేబెల్ బురుజు తన లక్ష్యాన్ని సాధించలేకపోవటానికి కారణం అందరూ అనుకునేది కాదట, ఇంకోలా చెప్పాలంటే, అందరికీ తెలిసిన కారణాల్లో అసలు కారణం లేదుట. ఆయన చూపించిన ఋజువులు పురాణాల పైనా, పుక్కిటి కథలపైనా ఆధారపడినవి కావట; ఆయన స్వయంగా ఆ స్థలానికి వెళ్ళి మరీ పరిశోధించాడట, తద్వారా బేబెల్ బురుజు కూలిపోవటానికి అసలు కారణం దానికి వేసిన పునాదులు బలహీనంగా ఉండటమే అని తేల్చి చెప్పాడు. ఈ విషయంలో మాత్రం ప్రాచీన కాలంతో పోలిస్తే మా కాలం ఎన్నోరెట్లు మెరుగైనదనే చెప్పాలి. మా కాలంలో దాదాపు చదువుకున్న ప్రతీ వాడూ వృత్తి రీత్యా తాపీమేస్త్రీనే, పునాదులు వేయటంలో ఆరితేరినవాడే. అయితే ఆ పండితుడు నిరూపించదల్చుకున్నది ఇది కాదు; బేబెల్ బురుజు కొత్తగా మరోసారి కట్టడానికి వీలుకల్పించేలా మానవాళి చరిత్రలో తొలిసారిగా ఒక పటిష్టమైన పునాది ఏర్పాటుకానుందనీ, అది సాక్షాత్తూ మా చైనా గోడే అనీ అంటాడాయన. ముందు గోడ నిర్మించాకా, దాన్ని పునాదిగా వాడుకుంటూ బురుజు నిర్మించవచ్చట. ఆ రోజుల్లో ఎవరి చేతుల్లో చూసినా ఆయన పుస్తకమే కనపడేది, కానీ నా మట్టుకు నాకు ఈవేళ క్కూడా ఆయన బురుజుని ఎలా కట్టాలనుకున్నాడో అర్థం కాదు. అసలు వలయాకారంలోనే లేని ఈ గోడ, మహ అయితే పావు వలయమో, అర్థవలయమో కాగల ఈ గోడ, ఒక బురుజుకి ఎలా పునాది కాగలదు? బహుశా ఏదో వేదాంతార్థంలో ఆ మాట అని ఉంటాడనుకోవచ్చు. మరి అలాగైతే, కళ్ళ ముందు ఖచ్చితమైన వాస్తవంగా కనిపించే గోడ నిర్మించడం ఎందుకు, దానికి గాను లెక్కలేనంతమంది జనం జీవితాంతం శ్రమించడం ఎందుకు? పైగా ఆ పుస్తకంలో పక్కా నిర్మాణపటాలు కూడా గీసి పెట్టి ఉండేవి (కొంత అస్పష్టమైన ప్రణాళికలే అనుకోండీ), ఈ బృహత్ నూతన కార్యక్రమానికి జనశక్తిని ఎలా చైతన్యవంతం చేయాలన్న దానిపై సవివరమైన ప్రతిపాదనలు కూడా ఉండేవి.

అప్పట్లో జనం బుర్రలు ఎన్నో చిత్రమైన ఆలోచనలతో కిక్కిరిసి ఉండేవి – అందుకు ఈ పండితుడి పుస్తకం ఒక ఉదాహరణ మాత్రమే – ఒక ఉమ్మడి లక్ష్యం కోసం అంతా కలిసికట్టుగా తమ బలాబలాల్ని సమీకరించుకునే ప్రయత్నంలో ఉండటమే దీనికి కారణం కాబోలు. మనిషి స్వభావం చంచలమైనది, సుడిగాలిలా అస్థిరమైనది, అది ఏ హద్దుల్నీ అంగీకరించదు; తనను తానే బంధించుకుంటుంది, మరుక్షణం ఆ బంధనాల్ని తెంపుకోవటానికి పిచ్చిగా గింజుకుంటుంది, ఆ ప్రయత్నంలో అన్నింటినీ విచ్ఛిన్నం చేస్తుంది, గోడల్నీ, బంధనాల్ని, ఆఖరుకు తనని తాను కూడా.

అధిష్టానం గోడని ఇలా విడిభాగాలుగా నిర్మించే పద్ధతిని ఎన్నుకున్నప్పుడు అసలు గోడ నిర్మాణాన్నే ప్రశ్నార్థకం చేసే ఇలాంటి అంశాల్ని కూడా పరిగణనలోకి తీసుకునే ఉంటుంది. అధిష్టానం మాకు – నేను చాలామంది తరపున మాట్లాడుతున్నాను – జారీ చేసిన ఆదేశాల్ని జాగ్రత్తగా పరిశీలించిన మీదట అర్థమైంది ఏమిటంటే, అధిష్టానం అనేదే ఒకటి లేకపోయుంటే మా పుస్తక పరిజ్ఞానమూ, మా మానవ మేధస్సూ అంతా కలిసినా కూడా ఓ పెద్ద ప్రణాళికలో అంతర్భాగమైన మా ఈ చిరుకార్యాలను నెరవేర్చటానికి ఎందుకూ పనికివచ్చేవి కావు. ఆ అధిష్టాన కార్యాలయంలో – అది ఎక్కడ ఉందో, అందులో ఎవరుంటారో నేను అడిగిన వారెవ్వరికీ తెలియదు – ఆ కార్యాలయంలో మానవాళి అన్ని ఆలోచనలూ - లక్ష్యాలూ, కోరికలూ - నెరవేరటాలూ అన్నీ ఎదురెదురు దిశల్లో పరిభ్రమిస్తుంటాయనిపిస్తుంది. అక్కడి అధికారులు నిర్మాణ పటాలు గీస్తున్నప్పుడు కిటికీల్లోంచి ప్రసరించే దైవిక ప్రపంచాల వెలుగులు వారి చేతులపై పడి ప్రకాశిస్తుంటాయనిపిస్తుంది.

మరి ఇంతటి శక్తివంతమైన అధిష్టానం నిజంగా తల్చుకుంటే గోడ నిర్విరామంగా కట్టుకుపోయే పద్ధతిలో ఎదురయ్యే సమస్యల్ని కూడా ఎదుర్కోగలదని ఏ తటస్థ పరిశీలకుడైనా గ్రహించగలడు. దీన్నిబట్టి గోడ విడి భాగాలుగా కట్టుకుపోయే పద్ధతిని అధిష్టానం ఉద్దేశపూర్వకంగా ఎంచుకుందన్న తీర్మానానికి రావాల్సి వస్తుంది. కానీ ఈ విడిభాగాలుగా కట్టే పద్ధతి కేవలం ఆపద్ధర్మం మాత్రమే, కాబట్టి తగినది కాదు. దీన్నిబట్టి అధిష్టానం తగని పద్ధతినే ఎంపిక చేసుకుందన్న తీర్మానానికి రావాల్సి వస్తుంది. చిత్రమైన తీర్మానమే, కాదనను. కానీ ఒక రకంగా చూస్తే దీని పక్షానా కొంత సమర్థన ఉంది. ఇప్పుడైతే దాన్ని చర్చించుకోవటంలో పెద్ద ప్రమాదమేమీ లేదు. ఒకప్పుడు మాత్రం పరిస్థితి వేరేలే ఉండేది. ఆ రోజుల్లో చాలామంది, జ్ఞానులైనవాళ్లు కూడా, ఒక సూత్రాన్ని నమ్మేవారు. అదేమిటంటే: నీ శక్తి మేరా అధిష్టానపు ఆదేశాల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు, కానీ ఒక స్థాయి వరకూ మాత్రమే; దాన్ని దాటి ఆలోచించకు. ఈ సూత్రాన్ని ఒక పోలికతో కూడా ఉదహరించేవారు: దాన్ని దాటి ఆలోచించకు, అదేదో ప్రమాదమని కాదు; ప్రమాదమని చెప్పటానికి ఏ ఋజువూ లేదు. అయినా ఏది ప్రమాదమూ, ఏది కాదూ అన్నది కాదిక్కడ విషయం. వసంతకాలంలో నది ఎలా ఉంటుందో గుర్తు తెచ్చుకో. దాని మట్టమూ వడీ పెరుగుతుంది, చెరివైపూ ఉన్న ఒడ్డుల్ని సారవంతం చేస్తూ పారుతుంది, అయినా సముద్రాన్ని చేరే వరకూ తన దిశని ఖచ్చితంగా నిలుపుకుంటుంది, అర్హమైన అతిథి గనుక అక్కడ దానికి బ్రహ్మాండమైన స్వాగతం అందుతుంది. – ఇదిగో అధిష్టానపు ఆదేశాలపై నీ పరిశోధనల్ని ఈ మాత్రం దాకా అనుమతించుకోవచ్చు. – కానీ ఆ తర్వాత నది మట్టం ఒడ్డుల్ని ముంచెత్తేంతగా పెరుగుతుంది, దాని రూపాన్నీ పరిధుల్నీ కోల్పోతుంది, ప్రవాహ వడి తగ్గుతుంది, తన గమ్యాన్ని మర్చిపోయి ఊళ్లలోనే చిన్న చిన్న చెరువుల్ని ఏర్పరుస్తుంది, పొలాల్ని నాశనం చేస్తుంది, అయినా తన ఈ నూతన విస్తృతిని ఎక్కువకాలం నిలుపుకోలేదు, చివరికి తన ఒడ్డుల మధ్యకు వచ్చి ఒదగక తప్పదు, ఆ తరవాత వేసవి ముదిరాక పేలవంగా ఎండిపోకా తప్పదు. – ఇదిగో అధిష్టానపు ఆదేశాలపై నీ పరిశోధనల్ని మరీ ఇంత దాకా అనుమతించుకోవటం మంచిది కాదు.

గోడ కడుతున్నన్నాళ్లూ ఈ పోలికకు చాలా ప్రాముఖ్యతా ఔచిత్యమూ ఉన్నా, నా ప్రస్తుత వ్యాసం విషయంలో దాని అన్వయం చాలా పరిమితం మాత్రమే. నాది పూర్తిగా చారిత్రక దృష్టిగల పరిశోధన; ఎప్పుడో మాయమైన మబ్బుల్లోంచి ఇక ఇప్పుడు ఏ పిడుగులూ వచ్చిపడవు, కాబట్టి అప్పుటి ప్రజలు ఈ విడిభాగాల పద్ధతి గురించి ఏ వివరణలతో సరిపుచ్చుకున్నారో వాటిని దాటి నేను ముందుకు వెళ్లే వీలుంది. నా ఆలోచనాశక్తి నాపై విధించే హద్దులు ఎన్నో ఉండనే ఉన్నాయి, కానీ ప్రయాణించాల్సిన విస్తారాలు మున్ముందు ఎన్నో ఉన్నాయి.

ఎవరి నుంచి ఈ గోడ మాకు రక్షణ ఇవ్వాలి? ఉత్తరం వైపున్న తండాల నుంచి. ఇప్పుడు నేను వచ్చింది దక్షిణ చైనా నుంచి. అక్కడ ఏ ఉత్తరాదివాళ్లూ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు. వాళ్ల గురించి మేము ప్రాచీనగ్రంథాల్లో మాత్రమే చదువుకుంటాం; స్వభావానుగుణంగా వారు సాగించే అకృత్యాలు చదివి మా ప్రశాంతమైన లోగిళ్లలో నిట్టూర్పులు విడుస్తాం. చిత్రకారులు ఈ పాపాత్ముల్ని చాలా వాస్తవికరీతిలో చిత్రిస్తారు; తెరిచిన నోళ్లూ, పదునైన పళ్లున్న దవడలూ, వాటితో చీల్చిచెండాడబోయే తమ బాధితుల రక్తపు రుచిని ఆశిస్తూ ముందే మూతలుపడ్డ కళ్లూ ఇవన్నీ చూస్తాం. మా పిల్లలు అల్లరి చేస్తే వాళ్లకు ఈ బొమ్మలు చూపిస్తాం, అంతే, వాళ్లు వెంటనే ఏడ్చుకుంటూ మా సందిళ్లలో దూరిపోతారు. కానీ ఇంతకన్నా ఈ ఉత్తరాదివాళ్ల గురించి మాకింకేమీ తెలియదు. వాళ్లని మేం ఎప్పుడూ చూడలేదు, మా ఊళ్లలోనే ఉండిపోతే ఎప్పటికీ చూడబోము కూడా, ఒకవేళ వాళ్లు తమ అడవి గుర్రాలెక్కి శక్తి మేరా స్వారీ చేస్తూ ఇటు వైపు దూసుకువచ్చినా కూడా ఈ అంతుపొంతూ లేని విస్తారాలు దాటి మమ్మల్ని ఎప్పటికీ చేరుకోలేరు, వాళ్ల ప్రయాణం గాల్లోనే ముగిసిపోతుంది.

ఇలాంటప్పుడు మరి మేం ఎందుకు మా ఇళ్లు వదిలిపెట్టి వచ్చాం? వంతెనల కింద పారే ఏరునీ, మా తల్లుల్నీ తండ్రుల్నీ, ఏడ్చే మా భార్యల్నీ, మా సంరక్షణ అవసరమైన బిడ్డల్నీ వదిలిపెట్టి, ఎందుకు సుదూరమైన నగరంలో శిక్షణకు బయల్దేరాం, ఎందుకు మా ఆలోచనల్ని ఇంకా దూరంలో ఉత్తరాదిన ఉన్న గోడ మీదకు ఎక్కుపెట్టాం? ఎందుకు? అధిష్టానానికి ఈ ప్రశ్న. వాళ్లకు మేం తెలుసు. పెద్ద పెద్ద ఆందోళనల్లో నిమగ్నమై ఉన్న మా నాయకులకు మా గురించి తెలుసు, మా చిరు ప్రయత్నాలు తెలుసు, మేము మా చిన్న పాకల్లో గుమిగూడి కూర్చోవటం చూస్తారు, చుట్టూ కుటుంబం కూర్చొని ఉండగా ఇంటి పెద్ద వల్లించే ప్రార్థనల్ని ఆమోదించటమో తిరస్కరించటమో చేస్తారు. అధిష్టానం గురించి ఇలాంటి ఆలోచనల్ని వెల్లడించటానికి నాకు అనుమతి ఉందో లేదో తెలియదు, ఒకవేళ ఉంటే మాత్రం నా అభిప్రాయంలో అధిష్టానం అనేది చాలా కాలం నుంచే ఉందని చెప్పాలి, అదేదో ఇప్పటికిప్పుడు కొలువుదీరి ఎవరి పగటికలనో చర్చించి అంతే హడావుడిగా సభ ముగించి అక్కడ తీసుకున్న నిర్ణయాన్ని – ఆ నిర్ణయం నిన్న తమ పట్ల దయ చూపించిన దేవుళ్ల ముందు ఒక చిన్న దీపం వెలిగించటం మాత్రమే అయినా సరే, దాన్ని – అమలు చేయటానికి అదే రోజు రాత్రి ప్రజల్ని తమ పడకల్లోంచి లేపి బెత్తాలతో చీకట్లోకి తరిమింది కాదు. అధిష్టానం అనాదిగా నుంచీ ఉంటున్నదే అనీ, గోడ కట్టాలన్న నిర్ణయమూ అంతేననీ నేన్నమ్ముతాను. పాపం ఇది తెలియక తామే దానికి కారణమనుకునే ఉత్తరాదివాళ్లు! ఇది తెలియక తానే దీనికి ఆదేశమిచ్చాననుకునే మహరాజు! గోడ కట్టే మాకు తెలుసు అది నిజం కాదని, మేం నోరు మెదపం.

*

గోడ నిర్మాణం జరుగుతున్నప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా నేను జాతుల తులనాత్మక చరిత్రను అధ్యయనం చేయటంలో నిమగ్నమై ఉన్నాను – ఈ పద్ధతి ద్వారా మాత్రమే కొన్ని ప్రశ్నల్ని మూలాల దాకా తరిచిచూడగలం – అలా నేను తెలుసుకున్నదేమంటే మా చైనీయులకు ఉన్న ప్రజా, రాచరికపు వ్యవస్థలు కొన్ని తమ పారదర్శకతలో తిరుగులేనివైతే, మరికొన్ని అస్పష్టతలో తిరుగులేనివి. ఈ స్థితికి, ముఖ్యంగా రెండో స్థితికి కారణమేంటో వెతకాలన్న కోరిక నన్ను ఎప్పట్నించో పట్టిపీడించేది, ఇప్పటికీను. అసలు ఈ గోడ నిర్మాణమే దీంతో ముడిపడి ఉంది.

అసలు మాకున్న అస్పష్టమైన వ్యవస్థల్లో సాక్షాత్తూ మా రాచరికం కూడా ఒకటి. బహుశా పెకింగ్ నగరంలో, రాజప్రాసాదం పరిసరాల్లో ఈ విషయమై కాస్త స్పష్టత ఉండొచ్చేమో, అందులో కూడా వాస్తవం కన్నా భ్రమల పాళ్లే ఎక్కువ. ఉన్నతస్థాయి విద్యాలయాల్లో రాజనీతిశాస్త్రం, చరిత్ర బోధించే ఉపాధ్యాయులు తమకు స్పష్టమైన అవగాహన ఉందనీ, దాన్ని విద్యార్థులకు ధారపోయగలమనీ నమ్మబలుకుతారు. అలాగే కిందిస్థాయి విద్యాలయాల్లోకి ఒక్కో మెట్టూ దిగే కొద్దీ అక్కడి ఉపాధ్యాయులూ విద్యార్థులూ తమ అవగాహన పట్ల చాలా ధీమాగా ఉండటం గమనించవచ్చు, కానీ అక్కడ మిగిలిందల్లా వందలేళ్లుగా ప్రజల మనసుల్లోకి నాటబడిన కొన్ని సూత్రాల చుట్టూ ఆకాశాన్నంటుతూ పేరుకుపోయిన డొల్ల విద్యే, ఆ సూత్రాల్లోని మూలసత్యం ఏమీ చెడలేదు, కానీ దాన్ని గుర్తించలేనంతగా చుట్టూ అయోమయపు పొగమంచు కమ్మేసింది.

కానీ నిజానికి ఈ రాచరికానికి సంబంధించిన ప్రశ్నను ఎవరినైనా అడగాలంటే ముందు అది సామాన్య ప్రజలనే అడగాలి, ఆ వ్యవస్థ అంతిమంగా ఆధారపడేది ప్రజల మీదే కదా. ఐతే ఇక్కడ ఒకటి ఒప్పుకుని తీరాలి, నేను నికరంగా ఏమైనా మాట్లాడగలిగేది నా స్వస్థలం గురించే. అక్కడ, ఏడాది మొత్తాన్నీ అందమైన వైవిధ్యంతో నింపివేసే ప్రకృతిదేవతల క్రతువుల్నీ మినహాయిస్తే, మేం అనునిత్యం ఆలోచించేది ఒక్క రాజు గురించే. కానీ వర్తమానంలో ఉన్న రాజు గురించి కాదు; ఎందుకంటే అతను ఎవరో ఏమిటో మాకు స్పష్టంగా తెలిస్తే కదా. మేం ఈ విషయమై ఏ సమాచారం దొరుకుతుందా అని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నా – ఈ ఒక్క విషయమే మాకు ఆసక్తి కలిగించేది – చిత్రంగా ఏ సమాచారమూ దొరకదు, దేశమంతా విస్తారంగా ప్రయాణించిన యాత్రీకుల నుంచి కానీండి, ఇరుగు పొరుగు ఊళ్ల నుంచి కానీండి, లేదా కేవలం మా దరిదాపుల్లోని కాలవలే గాక పవిత్ర నదులెన్నింటి మీదో ప్రయాణం చేసిన నావికుల నుంచి కానీండి, చాలా విషయాలైతే తెలుస్తాయి, కానీ ఖచ్చితంగా ఏదీ నిర్థారణ కాదు.

 మా దేశం ఎంత విస్తారమైందంటే ఏ పోలికా దానికి న్యాయం చేయలేదు, స్వర్గాలు కూడా దాని వైశాల్యం ముందు చిన్నబోతాయి – అందులో పెకింగ్ నగరం ఒక చిన్న చుక్క లాంటిది మాత్రమే, అందులో రాజప్రాసాదం ఇంకా చిన్న చుక్క. అవటానికైతే రాజపదవి ప్రపంచంలోని అధికార శ్రేణులన్నింటిలోకీ గొప్పదని ఒప్పుకోక తప్పదు. కానీ ప్రస్తుతం ఉన్న రాజు, మాలాంటి ఒక మనిషి, మాలాగే దివాను మీద నడుం వాలుస్తాడు, అది విశాలంగా ఉండొచ్చు లేదా చాలా ఇరుకైనదీ పొట్టిదీ కూడా కావొచ్చు. మాలాగే ఒక్కోసారి అతను బద్దకంగా వళ్లు విరుచుకుంటాడు, బాగా అలిసిపోతే తన సన్ననైన నోటితో గట్టిగా ఆవలిస్తాడు. అంతకన్నా అతని గురించి ఏం తెలుసుకోగలం – ఇక్కడ వేల మైళ్లకు ఇవతల దక్షిణాన దాదాపు టిబెటన్ పర్వతాలకు దగ్గర్లో ఉన్న వాళ్లం. ఒక వేళ ఏ వార్తన్నా వచ్చినా అది అలలుగా మా దాకా చేరే సరికి ఆలస్యమైపోతుంది, ఎందుకూ పనికిరాకుండా పోతుంది. గొప్ప మేధావులూ, కానీ దుర్భుద్దిపరులూ ఐన కులీనులూ సభికులూ ఎల్లవేళలా రాజు చుట్టూ గుమికూడి ఉంటారు – స్నేహితులనీ సేవకులనీ ముసుగులు వేసుకుని శత్రుత్వంతో కుత్సితత్వంతో ఉంటారు – వాళ్లు రాజ్యాధికారానికి ప్రత్యామ్నాయశక్తులుగా పని చేస్తూ తమ విషం పూసిన బాణాలతో రాజుని గద్దె దింపటానికి అనునిత్యం శ్రమిస్తూంటారు. రాజ్యానికి అంతం లేదు, కానీ రాజు మాత్రం గద్దె నుంచి తడబడి కిందపడుతూనే ఉంటాడు, అవును, వంశాలకు వంశాలే నేలరాలి తమ ఆఖరి శ్వాసను మట్టిలోకి విడుస్తాయి. ఈ సంఘర్షణల గురించీ, యాతనల గురించీ ప్రజలకు ఎప్పటికీ తెలియదు; నగరానికి కొత్తగా వచ్చిన వాళ్లలాగా ప్రజలు బాగా కిక్కిరిసిన ఏ వీధి చివరనో ప్రశాంతంగా నిలబడి వెంటతెచ్చుకున్న చద్దిమూటలు విప్పితింటుంటే, అదే వీధికి ఎగువన చాలా దూరంలో నగరం నడిబొడ్డున ఉన్న సంతలో వాళ్ల రాజుని ఉరితీసే కార్యక్రమం సాగుతూంటుంది.

ఈ పరిస్థితిని ఒక పిట్టకథ బాగా వర్ణిస్తుంది: దాని ప్రకారం రాజు నీకోసం ఒక సందేశం పంపాడు, నీలాంటి అల్ప జీవి కోసం, రాచరికపు సూర్యునికి దూరంగా పోయి దాక్కున్న ఒక నిరర్థక నీడ కోసం; రాజు తన మరణశయ్య మీంచి కేవలం నీకోసమే ఒక సందేశం పంపాడు. అందుకోసం తన వార్తాహరుణ్ణి మంచం పక్కన మోకరిల్లమని ఆదేశించాడు; ఆ సందేశానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడంటే, దాన్ని మళ్లా తిరిగి తన చెవిలో చెప్పించుకున్నాడు. తాను విన్నది సరిగ్గానే ఉందని తలాడించాడు. అవును, తన చివరి క్షణాల్లో చుట్టూ గుమికూడిన వీక్షకుల సాక్షిగా – వారి కోసం అడ్డుగా ఉన్న గోడలన్నీ కూల్చివేయబడ్డాయి, ఆ రాజ్యపు సామంతరాజులెందరో ఎత్తుగా విశాలంగా పైకి లేచిన మెట్ల మీద నిలబడి చూస్తున్నారు – వీరందరి ముందు రాజు తన సందేశాన్ని నీకు పంపాడు. వార్తాహరుడు తక్షణమే బయల్దేరాడు; బలిష్టమైన అలుపులేని మనిషతను; అటు కుడి చేత్తోనూ ఇటు ఎడం చేత్తోనూ గుంపు మధ్య నుంచి దారి తొలుచుకుంటూ ముందుకుసాగాడు; ఎవరైనా అడ్డువస్తే చూపుడు వేలితో తన ఛాతీ వైపు చూపిస్తున్నాడు, అక్కడ ఒక సూర్యపతకం మెరుస్తోంది; వేరే ఏ మనిషికీ వీలుకానంతగా అతనికి దారి సుగమం అవుతోంది. కానీ ఆ సమూహానికి అంతం లేదు; ఎంతకీ తెగదు. ఒక్కసారి శివార్లలోని పచ్చికబయళ్ల దాకా చేరగలిగితే చాలు ఎంత వేగంగానైనా పరిగెత్తవచ్చు; త్వరలోనే నీ తలుపు మీద అతని చేతి వేళ్ల సంగీతం వినపడుతుంది. కానీ దానికి బదులు ఆ సమూహం మధ్య అతను నిష్పలంగా తన శక్తినంతా అవజేసుకుంటున్నాడు. ఇంతాజేసి ఇంకా రాజప్రాసాదపు లోలోపలి గృహాల్లోనే పెనుగులాడుతున్నాడు; ఆ సమూహం అంచుకు ఎప్పటికీ చేరుకోలేడు; ఒకవేళ చేరుకున్నా లాభం లేదు; ఆ తర్వాత సభా భవనాలు దాటాలి; సభాభవనాల తర్వాత రెండో రాజప్రాసాదం దాటాలి; ఆ తర్వాత మళ్లా మెట్లుంటాయి, మళ్లా సభాభవనాలు ఎదురవుతాయి; ఆ తర్వాత ఇంకో ప్రాసాదం; అలాగే వేలసంవత్సరాలు గడిచిపోతాయి; ఒకవేళ ఎట్టకేలకు ఎలాగో ఆఖరు సింహద్వారాన్ని పెల్లగించుకుని బయటపడినా – అది జరగటం దాదాపు అసంభవమనుకో – అతనికి ఎదురుగా రాజధాని పరుచుకుని ఉంటుంది, ప్రపంచానికే కేంద్రమైన రాజధాని, బద్దలయ్యేంతగా కిక్కిరిసిపోతూ పాకిపోయిన రాజధాని. ఒక చనిపోయిన వ్యక్తి పంపిన సందేశం తీసుకుని ఎవ్వరూ దాన్ని దాటలేరు. కానీ నువ్వు మాత్రం చీకట్లు పడుతుండగా నీ కిటికీ దగ్గర కూర్చుని ఆ సందేశం గురించి కలలు కంటావు.

మా ప్రజలు రాజు గురించి ఆలోచించటం అచ్చం ఇలాగే ఇంత ఆశారహితంగానూ ఇంత ఆశావహంగానూ ఉంటుంది. వాళ్లకు ఏ రాజు దిగిపోతున్నాడో తెలియదు, అసలు పాలిస్తున్న రాజవంశం పేరు విషయంలో కూడా అనుమానాలుంటాయి. పాఠశాలల్లో రాజవంశాల గురించీ వారసత్వక్రమం గురించీ తేదీలతో సహా చాలా బోధిస్తారు, అయినా ఎంత అనిశ్చితి వ్యాపించి ఉందంటే పెద్ద పెద్ద పండితులు కూడా ఈ విషయం మీద తర్జనభర్జనలు పడుతూనే ఉంటారు. మా ఊళ్లలో ఎప్పుడో చచ్చిపోయిన రాజులు సింహాసనాలధిరోహిస్తారు, కేవలం మా పాటల్లోనే బతికున్నాడనుకున్న ఇంకొకడు ఇటీవలే ఆస్థాన పూజారి ద్వారా ప్రకటన జారీచేస్తాడు. ఎప్పుడో చరిత్రలో కలిసిపోయిన యుద్ధాలు మాకు కొత్తవి, ఆ కబురు చెప్పటానికి పొరుగింటి ఆసామీ ఆత్రంగా పరిగెత్తుకొస్తాడు. వంచకులైన రాజోద్యోగుల మాయలో పడి దారి తప్పిన రాజుల భార్యలు అధికార దాహంతో, తీవ్రమైన లోభంతో, కట్టలుతెంచుకున్న కామంతో, తమ దుష్కృత్యాలు ప్రతీసారి కొత్తగా చేస్తూనే ఉంటారు. వాళ్లు కాలంలో గతించిపోయే కొద్దీ వాళ్ల కార్యాలు సరికొత్త రంగులద్దబడి మా ముందుకొస్తాయి. ఎప్పుడో వేల ఏళ్ల క్రితం ఒక రాణి తన భర్త రక్తం తాగి చంపేసిన సంగతిని కొత్తగా తెలుసుకుని మా పల్లె బిగ్గరగా గగ్గోలు పెడుతుంది.

అలా మా ప్రజలు చనిపోయిన రాజుల్ని బతికున్నట్టు పరిగణిస్తారు, బతికున్న పాలకుల్ని చనిపోయాడనుకుంటారు. ఒకవేళ ఎప్పుడైనా, అంటే మొత్తం మనిషి జీవితకాలంలో ఎప్పుడో ఒక్కసారి, ఒక రాజాధికారి పల్లెటూళ్లమ్మటా పర్యటన చేస్తూ మా పల్లెకి వచ్చి, ప్రభుత్వం తరపున కొన్ని ప్రకటనలు చేసి, మా పన్నుల జాబితాల్ని తనిఖీ చేసి, పాఠశాల విద్యార్థుల్ని పరీక్షించి, ఇక్కడి పరిస్థితుల గురించి మా ఊరి పూజారినడిగి తెలుసుకుని, తర్వాత, ఇక తన పల్లకీ ఎక్కి వెళ్లిపోబోయే ముందు, హాజరైన ప్రజలందరి ఎదుటా నిలబడి ఈ పర్యటనలో తనకు కలిగిన భావాల్ని గంభీరమైన భాషలో మందలింపుగా ఏకరువుపెడుతున్నప్పుడు – అప్పుడు మా అందరి ముఖాల మీదుగా ఒక చిన్న నవ్వు పాకిపోతుంది, జనం ఒకరివైపొకరు ఓరచూపులు చూసుకుంటారు, అధికారి ఎక్కడ గమనిస్తాడోనని పిల్లల వైపు వంగుతారు. వాళ్లనుకుంటారు, ఎందుకు ఈ అధికారి ఒక చనిపోయిన మనిషి గురించి బతికున్నట్టు మాట్లాడుతున్నాడు, అతనంటున్న రాజు ఎప్పుడో చచ్చిపోయాడు, ఆ రాజవంశం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది, ఈ అధికారి ఊరికే మాతో పరాచికాలాడుతున్నాడు, కానీ మనం అదేం గమనించనట్టుగానే నడుచుకుందాం, లేదంటే ఆయన్ని కించపరిచినట్టవుతుంది. కానీ మనం మాత్రం మన ప్రస్తుత పాలకునికే విధేయులమై ఉందాం, అలావుండకపోతే అది నేరం అవుతుంది. అలాగ, ఆ అధికారి పల్లకీ కదిలివెళిపోగానే, ఎప్పుడో మట్టిలో కలిసిపోయిన బూడిదలోంచి ఒక మూర్తి మా పల్లెకు పాలకునిగా పైకి లేస్తాడు.

అలాగే దేశంలో రేగుతున్న తిరుగుబాట్లూ లేదా సమకాలీన యుద్ధాలూ మా ప్రజలకు ఎంతమాత్రం పట్టవు. నేను వయసులో ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తొస్తోంది. మా పొరుగుదే ఐనా చాలా దూరంలో ఉన్న ఒక తాలూకాలో తిరుగుబాటు చెలరేగింది. దానికి కారణం ఏమిటన్నది నాకు అంతగా గుర్తులేదు, అదంత ముఖ్యం కూడా కాదు; అక్కడి ప్రజలు కాస్త ఉద్రిక్త స్వభావులు అవటం మూలాన తరచూ తిరుగుబాట్లు చెలరేగుతూనే ఉంటాయి. సరే విషయానికొస్తే, ఒక రోజు మా తాలూకాలోంచి వెళ్తూన్న ఒక బిచ్చగాడు నా తండ్రి దగ్గరకు వచ్చి తిరుగుబాటుదారులు ప్రచురించిన కరపత్రం ఒకటి ఇచ్చాడు. ఆ రోజు ఏదో వేడుక కావటంతో మా ఇంటి గదులన్నీ అతిథులతో నిండిపోయి ఉన్నాయి, అందరికీ మధ్యలో కూర్చుని పూజారి ఆ పత్రాన్ని పరిశీలించాడు. హఠాత్తుగా అందరూ నవ్వటం మొదలుపెట్టారు, ఆ గందరగోళంలో ఆ పత్రం ఎవరో చింపేశారు, అప్పటికే చాలా బిక్ష దండుకున్న ఆ బిచ్చగాణ్ణి గుద్దులతో తన్నులతో బయటకు నెట్టేశారు, తర్వాత బయట అందమైన వాతావరణాన్ని ఆస్వాదించటానికి అతిథులంతా నిష్క్రమించారు. ఎందుకు? ఆ పొరుగు తాలూకా వాళ్ల యాస కొన్ని అంశాల్లో మా యాసకు చాలా భిన్నంగా ఉంటుంది, ఈ వ్యత్యాసం వాళ్లు రాసే పద్ధతిలో కూడా వ్యక్తమవుతుంది, అది మాకు కాస్త ప్రాచీన భాషలా అనిపిస్తుంది. పూజారి రెండు పేజీలు చదివాడో లేదో మేం ఒక తీర్మానానికి వచ్చేశాం. అదంతా పాత చరిత్ర, ఆ గాయాలు మానిపోయి చాలా కాలమైంది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ కరపత్రంలోని మాటల్లో అప్పటి వర్తమానపు భయానక పరిస్థితులు విబేధించలేని విధంగా వెల్లడైనా, మేం మాత్రం తలలు అడ్డంగా ఆడిస్తూ వెక్కిరింతగా నవ్వుతూ వినటానికి నిరాకరించాం. వర్తమానాన్ని చెరిపేయటానికి అంత సిద్ధంగా ఉంటారు మాప్రజలు.

ఇలాంటి పరిస్థితుల ఆధారంగా ఒకవేళ ఎవరైనా అసలు మాకు ఒక రాజనేవాడే లేడన్న తీర్మానానికొస్తే, అది మరీ వాస్తవదూరమేం కాదనే చెప్పాలి. ఒకటి మాత్రం వక్కాణించి చెప్తాను: మా దక్షిణాది ప్రజల్ని మించి రాజుకు విశ్వాసపాత్రులుగా ఉండేవాళ్లు బహుశా ఇంకెవరూ ఉండరు, కానీ మా విశ్వాసం వల్ల అతనికి ఏ లాభమూ లేదు. నిజమే, మా ఊరి పొలిమేరల్లో ఒక స్తంభంపై పవిత్రమైన డ్రాగను నిలబడి ఉంటుంది, అది మానవాళి మేల్కొన్న కాలం నుంచీ తన అగ్ని ఊపిరులను నివాళిసూచకంగా పెకింగ్ నగరం వైపు నిశ్వసిస్తూనే ఉంది – కానీ సాక్షాత్తూ ఆ పెకింగ్ నగరమే మాకు ఇంకో గ్రహం కన్నా అపరిచితమైంది. అసలు అలాంటి ఊరు ఉండటం సంభవమేనా? అసలు ఇళ్లు ఒకదాని పక్కన ఇంకొకటి ఉండటం, అవన్నీ కలిసి మా కొండ మీంచి చూస్తే ఎంత మేర కనపడుతుందో అంతకుమించి విస్తరించి ఉండటం సంభవమేనా, ఆ ఇళ్ల మధ్య పగలూ రాత్రన్న తేడాలేకుండా మనుషులు కిక్కిరిసి మసలుకోవటం సాధ్యమేనా? ఇలాంటి నగరం ఉందని నమ్మడం కంటే, ఆ పెకింగూ రాజూ ఒక్కరేననీ వాళ్లు యుగాల పర్యంతం సూర్యుని కింద మందకొడిగా తేలుతూ పోయే మబ్బుశకల్లాంటివారనీ చెప్తే నమ్మడం ఇంకా సులువు.

ఇలాంటి నమ్మకాల ఫలితంగా దక్కే జీవితం మొత్తం మీద చూస్తే స్వేచ్ఛకలదీ హద్దుల్లేనిదీను. అలాగని అనైతికం మాత్రం కాదు; నా ఊళ్ళో నేను గమనించినంతటి స్వచ్ఛమైన నీతినియమాలు నాకు నా ప్రయాణాల్లో ఇంకెక్కడా తారసపడలేదు. కానీ అది సమకాలీన చట్టాలకు బద్ధం కాని జీవితం, పాతకాలం నుంచీ సంక్రమించిన బలప్రయోగ దమనకాండ పద్ధతుల ప్రకారం నడుచుకునే జీవితం.

అలాగని మా తాలూకాలో ఉన్న పదివేల పల్లెటూళ్లలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పను, మా దేశంలో ఉన్న ఐదువందల తాలూకాల్లోనూ ఇంతేనని అసలే చెప్పను. కానీ ఈ విషయమైన నేను చదివిన ఎన్నో రచనల ఆధారంగా, నా స్వీయపరిశీలన ఆధారంగా – ముఖ్యంగా గోడ నిర్మాణం భారీ మానవ వనరులతో ముడిపడింది కావటం మూలాన సునిశితమైన పరిశీలకునికి అక్కడ దాదాపు అన్ని తాలూకాల నుండి వచ్చే మనుషుల మనస్తత్వాల్నీ గ్రహించే వీలు ఉంటుంది – వీటన్నింటి ఆధారంగా, నేను చెప్పగలిగేదేమిటంటే, రాజు పట్ల మా ఊళ్లో ఉన్న ధోరణే దాదాపు అన్ని చోట్లా వ్యాపించి ఉంది. అలాగని ఈ ధోరణిని ఒక సుగుణంగా ఎంచి చెప్పటం లేదు; సుగుణం కానే కాదు. నిజమే, ఒకరకంగా దీనికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే, భూమ్మీదే అత్యంత ప్రాచీనమైన రాజ్యంలో పాలన సాగిస్తూ కూడా అది తన పాలితప్రాంతంలోని మూలమూలలకీ చేరుకునేలా తన అధికారాన్ని అభివృద్ధి చేసుకోవటంలో విఫలమైంది, లేదా అభివృద్ధి చేసుకోవటంలో నిర్లక్ష్యం వహించింది. కానీ మరోలా చూస్తే, ఇటుపక్క ప్రజల్లో కూడా కాస్త నమ్మకలోపమూ, ఊహాశక్తి లోపమూ కన్పిస్తాయి, వాటి కారణంగానే వాళ్లు పెకింగ్ నగరంలోని రాజరికాన్ని జడత్వం నుంచి మేల్కొలిపి దాన్ని ఒక సజీవమైన ప్రత్యక్షమైన వాస్తవంగా తమ హృదయాలకు హత్తుకోలేకపోయారు, ఇప్పటికీ ఆ రాజరికం కోరుకునేదల్లా ఒక్కసారి ఆ హృదయస్పర్శను అనుభవించి గతించిపోవటమే.

కాబట్టి ఈ ధోరణి ఖచ్చితంగా సుగుణం కాదు. కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ లోపాలే మా ప్రజల్ని ఒక్కతాటిపై నిలిపే అతిపెద్ద ప్రభావాలు కూడా; మేం నిలబడిన కాళ్ల కింద నేల కూడా ఇవే అని చెప్పే ధైర్యం చేస్తాను. ఇలాంటప్పుడు ఎక్కడ లోపం ఉందో వెతికి నిర్థారించి చెప్పటమంటే, మా ఆత్మనిబ్బరాన్ని కూలదోయటమే కాదు, అంతకన్నా తీవ్రంగా, మా కాళ్ల కింద నేలని కుదిపేయటమే. ఈ కారణంతోనే ప్రస్తుతానికి ఈ ప్రశ్నల విషయమై ఇంకా ముందుకు వెళ్లి పరిశోధన సాగించటం నాకు ఇష్టం లేదు.

*


[1] బేబెల్ బురుజు (టవర్ ఆఫ్ బేబెల్): బైబిల్ కథ ప్రకారం, మహాప్రళయం తర్వాత మిగిలిన కొందరు మనుషులు బొందితో స్వర్గానికి చేరుకోవాలన్న యావతో భూమ్మీంచి ఆకాశంలోకి ఒక బురుజు నిర్మించటం మొదలుపెట్టారు; దేవుడు ఈ ప్రయత్నాలకు కోపించి, వాటిని భంగపరచటానికి వాళ్ళ భాషల్లో అయోమయం సృష్టించాడు, ఒకరినొకరు అర్థం చేసుకునే వీల్లేకుండా చేశాడు, దాంతో వీళ్ళంతా వేర్వేరు భాషలు గల వాళ్ళుగా భూమ్మీద చెల్లాచెదురయ్యారు, వీళ్ళ ప్రయత్నాలకు గండి పడింది, బురుజు నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ‘బేబెల్’ అనే పదానికి గ్రీకు అర్థం ‘దేవుని ద్వారం’; హిబ్రూ అర్థం ‘అయోమయపరచటం’.
===

(కినిగె పత్రికలో ప్రచురితం)

April 26, 2014

'పల్లెటూరి వైద్యుడు' - ఫ్రాంజ్ కాఫ్కా

(ఫ్రాంజ్ కాఫ్కా 1919లో రాసిన “A Country Doctor” కు అనువాదం)



ఓ పెద్ద చిక్కొచ్చి పడింది: నేను వెంటనే బయల్దేరాలి; బాగా అనారోగ్యంతో ఉన్న మనిషొకడు ఇక్కడికి పది మైళ్ళ దూరంలో ఓ పల్లెటూళ్ళో నా కోసం ఎదురుచూస్తున్నాడు; మా ఇద్దర్నీ వేరు చేస్తూ దట్టమైన మంచు తుఫాను; నాకో చిన్న గుర్రబ్బండి ఉంది, తేలికైనదీ, ఎత్తయినదీ, మన పల్లెటూరి బాటలకు అనువైనదీను; నేను ఉన్నికోటు తొడుక్కుని, నా సరంజామా ఉన్న సంచీ భుజాన వేసుకుని, వాకిట్లో సిద్ధంగా నిల్చొని ఉన్నాను; కానీ గుర్రం అందుబాటులో లేదు; అవును, గుర్రం లేదు. నా సొంత గుర్రమొకటి నిన్నే చచ్చిపోయింది, ఈ గడ్డకట్టిన శీతాకాలంలో ప్రయాణాల్ని తట్టుకోలేకపోయింది; ప్రస్తుతం వేరే గుర్రం కోసం నా పనమ్మాయి ఊరంతా వెతుకుతోంది; కానీ ప్రయోజనం ఉండదు, నాకు తెలుసు. ఒక్కణ్ణీ అలాగే నుంచున్నాను, అంతకంతకూ నన్ను కదలకుండా చేస్తున్న మంచులో కూరుకుపోతున్నాను. పనమ్మాయి చాలాసేపటికి తిరిగి వచ్చి, గేటు దగ్గర నుంచొని లాంతరు ఊపింది, ఆమె ఒక్కతే వచ్చింది; ఇలాంటి వాతావరణంలో ఎవరు మాత్రం గుర్రం అరువిస్తారు. నేను ఇంకోసారి వాకిట్లో అసహనంగా పచార్లు చేశాను, ఏం చేయాలో పాలుపోలేదు, ఆ నిరాశలో చిరాకులో, చాలాయేళ్ళుగా పాడుబెట్టిన పందులపాక తలుపునొకదాన్ని ఒక్క తాపు తన్నాను, శిథిలమైన ఆ తలుపు తటాల్న తెరుచుకుంది, సీలల మీద అటూ ఇటూ ఊగింది. లోపల్నించి వెచ్చని గాలీ, గుర్రాల వాసనా సోకింది. లోపల ఒక తాడుకి మసక లాంతరు వేలాడుతోంది. చూరు బాగా కిందకు ఉన్న ఆ పాకలో, ఒక వ్యక్తి గొంతుక్కూచున్నాడు, తన నీలి కళ్ళ ముఖాన్ని బయటపెట్టాడు. చేతుల మీదా, మోకాళ్ళ మీదా పాకుతూ బయటకి వచ్చి, “బండి కట్టమంటారా?” అని అడిగాడు. నాకేమనాలో ఏం తోచలేదు, ఆ పందులపాకలో ఇంకా ఏమేం ఉన్నాయా అని తొంగి చూశాను. పనమ్మాయి నా పక్కకు వచ్చి నుంచుంది. “ఒక్కోసారి మనింట్లో ఏం ఉన్నాయో మనకే తెలియదు,” అందామె, ఇద్దరం నవ్వుకున్నాం. ఈలోగా ఆ గుర్రాలబ్బాయి, “అన్నాయ్, అక్కాయ్ రండిలా!” అని గట్టిగా అరిచాడు, వెంటనే బలిసిన పిక్కలతో ఉన్న రెండు గుర్రాలు, కాళ్ళను పొట్ట కిందకు ముడుచుకుని, తీరైన తమ తలల్ని ఒంటెల మాదిరిగా వంచి, ఒకదాని వెనక ఒకటి దేక్కుంటూ, గుమ్మాన్ని తమ పృష్టాలతో పూర్తిగా నింపేస్తూ, దాని గూండా అతికష్టం మీద బయటకు వచ్చాయి. వచ్చీరాగానే తమ పొడవాటి కాళ్ళ మీద పూర్తి ఎత్తుకు లేచి నిలబడ్డాయి, వాటి శరీరాల్నుంచి దట్టమైన ఆవిర్లు లేస్తున్నాయి. పనమ్మాయితో “కాస్త అతనికి సాయం చేయి,” అన్నాను, ఆమె అంగీకారంగా ముందుకు వెళ్ళి గుర్రపుజీను అతనికి అందివ్వబోయింది. ఆమె అలా దగ్గరకు వచ్చిందో లేదో, ఆ గుర్రాలవాడు ఆమె చుట్టూ చేతులు వేసి లాక్కొని, తన ముఖాన్ని ఆమె ముఖం మీదికి వంచాడు. ఆమె వెర్రికేకలు వేస్తూ మళ్ళీ నా వైపు పరిగెత్తుకు వచ్చింది; అప్పటికే ఆమె చెంపల మీద రెండువరసల పంటిగాట్లు కనపడుతున్నాయి. నేను కోపం పట్టలేక “పశువా! ఏం కొరడా దెబ్బలు తినాలనుందా,” అని అరిచాను, కానీ వెంటనే అతనెవరో ఎక్కణ్ణించి వచ్చాడో తెలియదనీ, అందరూ మొండిచేయి చూపించిన చోట అతనొక్కడే సాయపడేందుకు ముందుకొచ్చాడనీ గుర్తొచ్చి, నిగ్రహించుకున్నాను. నా మనసులో ఆలోచనల్ని చదివిన వాడిలా, అతను నా మాటలకి ఏమాత్రం కించపడకుండా, గుర్రాల్ని బండికి కట్టే పనిలో నిమగ్నమైపోయాడు, కాసేపటికి వెనక్కు తిరిగి నా వైపు చూసి, “ఎక్కండి,” అన్నాడు, చూస్తే నిజంగానే బండి అంతా సిద్ధంగా ఉంది. ఇంత మంచి గుర్రాలజోడు నాకెప్పుడూ దొరకలేదు, నేను ఆనందంగా బండి ఎక్కాను. “పగ్గాలు నేను పట్టుకుంటాను, నీకు దారి తెలియదుగా,” అన్నాను. “సరే మీ ఇష్టం, అసలు నేను మీతో రావటం లేదు కదా, ఇక్కడే రోజీతో ఉండిపోతున్నాను,” అన్నాడు. అది వినగానే రోజీ, “వద్దు!” అంటూ అరిచింది, గత్యంతరంలేని విధిని ముందే గ్రహించిన దానిలా, ఇంటి వైపు పరిగెత్తింది; లోపల్నించి ఆమె గొళ్ళెం వేస్తున్న గరగరలు వినపడ్డాయి, తాళం తిరిగిన చప్పుడు వినపడింది. హాల్లో లైట్లు ఆర్పడమూ, అతనికి దొరక్కుండా దాక్కోవటానికి ఇంటి లోపలిగదుల్లోకి పరిగెత్తడమూ అంతా తెలుస్తోంది. నేను ఆ గుర్రాలవాడితో “నువ్వు నాతో రాక తప్పదు! అవతల ఆలస్యమైతే అయింది గానీ, నా ప్రయాణం కోసం ఆ పిల్లను మాత్రం బలిపెట్టను,” అన్నాను. వాడు “హెయ్య!” అని అరిచి చప్పట్లు కొట్టాడు, వరద లాక్కున్న కలపదుంగలాగా చప్పున కదిలింది గుర్రబ్బండి; ఓపక్క ఆ గుర్రాలవాడి దాడికి నా ఇంటి తలుపు ముక్కలుచెక్కలవటం ఇంకా వినిపిస్తూనే ఉంది, ఈ లోగా నా కళ్ళనూ చెవుల్నూ ఒరుసుకుపోతూ ఏదో హోరు మొదలై నా సర్వేంద్రియాల్నీ ముట్టడించింది. కానీ క్షణం పాటు మాత్రమే. ఆ మరుక్షణం, నా ఇంటిగేటుని ఆనుకునే రోగి ఇల్లు ఉందన్నట్టు, అక్కడ ఉన్నాను; గుర్రాలు నెమ్మదించి ఆగి నిలబడ్డాయి; మంచు కురవటం ఆగిపోయింది; అంతా వెన్నెల పరుచుకుని ఉంది; రోగి తల్లిదండ్రులు ఇంట్లోంచి పరుగుపరుగున బయటకు వచ్చారు, వెనకనే అతని చెల్లి కూడా వచ్చింది; వాళ్ళు నన్ను గుర్రబ్బండి నుండి దింపి దాదాపు మోసుకెళ్తున్నట్టే తీసుకుపోయారు; వాళ్ళు కంగారుగా చెప్తున్న రోగం గురించి చెప్తున్న వివరాలేవీ నాకు అర్థం కాలేదు; రోగి ఉన్న గది ఊపిరాడనంత ఉబ్బరంగా ఉంది; ఓ మూల పాడుపడిన పొయ్యి నుంచి పొగ లేస్తోంది; ముందు, కిటికీలు తెరవాలనిపించింది; కానీ అంతకన్నా ముందు నా రోగిని ఒకసారి చూడాలనిపించింది. అతను సన్నగా ఉన్నాడు, జ్వరంతో లేడు, చల్లగా లేడు, అలాగని వెచ్చగానూ లేడు, నిస్తేజమైన కళ్ళతో చూస్తున్నాడు, వంటి మీద చొక్కా లేదు, నన్ను చూడగానే ఆ అబ్బాయి మంచం పైన లేచి కూర్చుని, నా మెడ చుట్టూ చేతులు వేసి, చెవిలో ఇలా గొణిగాడు: “డాక్టర్, నన్ను చచ్చిపోనీయండి.” నేను వెనక్కి తిరిగి చూశాను; ఎవరికీ అతని మాటలు వినపడలేదు; అతని తల్లిదండ్రులు ముందుకు వంగి నేను చేయబోయే రోగనిర్ధారణ కోసం నిశ్శబ్దంగా ఎదురుచూస్తున్నారు; అతని చెల్లెలు పీట తెచ్చి వేసింది. దాని మీద నా సంచిని పెట్టి, దాన్ని తెరిచి, నా సామాగ్రి అంతా ఓ సారి వెతికాను; ఆ అబ్బాయి తన విన్నపాన్ని మళ్ళీ గుర్తు చేయటానికన్నట్టు మంచం మీంచే నా వైపు సైగలు చేస్తున్నాడు; నేను ఒక చిన్నపట్టకారు బయటకు తీశాను, దాన్ని కొవ్వొత్తి వెలుగులో పరీక్షించాను, మళ్ళీ కిందపెట్టేశాను. దైవాన్ని తిట్టుకుంటూ అనుకున్నాను, “అవును, దేవతలు కూడా పోయి పోయి ఇలాంటి కేసుల విషయంలోనే సాయం చేస్తారు, దీని కోసం గుర్రాన్ని కూడా సరఫరా చేస్తారు, సమయం తక్కువ కాబట్టి రెండో గుర్రాన్ని కూడా జత చేస్తారు, అదిచాలదన్నట్టు గుర్రాలవాణ్ణి కూడా ఏర్పాటు చేస్తారు—” ఇప్పుడే నాకు మళ్ళీ రోజీ గుర్తొచ్చింది; ఏం చేయగలను, ఆ గుర్రాలవాడి చేతుల్లో నలిగిపోకుండా ఆమెను ఎలా బయటపడేయగలను, ఈ అదుపులేని గుర్రాలు లాగే బండి మీద వెళ్ళి పదిమైళ్ళ అవతల ఉన్న ఆమెను ఎలా కాపాడగలను? ఇంతకీ ఆ గుర్రాలు పగ్గాలు తెంచుకున్నట్టున్నాయి; ఎలాగో తెలియదు గానీ, బయట నుంచి ఈ గది కిటికీని తెరిచాయి; ఆ కంతలోంచి తలల్ని లోపలికి దూర్చాయి, ఇదంతా చూసి ఓపక్క రోగి కుటుంబం పొలికేకలు పెడుతున్నా అవి మాత్రం తమకేం పట్టనట్టు రోగి వంక చూస్తున్నాయి. “వెంటనే వెనక్కు వెళ్ళిపోవాలి,” అనుకున్నాను, అక్కడికేదో ఆ గుర్రాలు నన్ను తిరుగు ప్రయాణానికి ఆదేశిస్తున్నట్టు. అలా అనుకున్నానే గానీ మళ్ళా రోగి చెల్లెలు, నేను ఉక్కిపోతున్నాను అనుకొని కాబోలు, నా ఉన్నికోటు తీస్తుంటే మారుమాట్లాడకుండా తీయనిచ్చాను. నా ముందు ఓ గ్లాసు రమ్ము ప్రత్యక్షమైంది, పెద్దాయన భుజం మీద చరిచాడు, అతని సంపదని నాతో పంచుకోవడం వల్ల కలిగిన చనువు. నేను తల విదిలించాను; ఆ పెద్దాయన ఆలోచనల ఇరుకు మేరల్లో చిక్కుకుపోవటం చిరాగ్గా అనిపించింది; ఆ కారణంగానే డ్రింకు వద్దన్నాను. తల్లి బాబ్బాబూ అన్నట్టుగా అబ్బాయి వైపు చూపించింది; నేను తల ఊపి, గుర్రాల్లో ఒకటి బిగ్గరగా సకిలిస్తుండగా, నా తలను ఆ అబ్బాయి రొమ్ము కేసి ఆనించాను, నా తడి గడ్డం తాకగానే వణికాడు. చివరకు నేను అనుకున్నదే అయింది: ఆ అబ్బాయి ఆరోగ్యానికి వచ్చిన లోటేమీ లేదు, రక్తప్రసరణ కాస్త మందకొడిగా ఉందంతే, తల్లి తన గాభరా కొద్దీ ఇచ్చిన కాఫీ దానికి తోడైనట్టుంది, అదొక్కటీ తప్పించి నిక్షేపంగా ఉన్నాడు, ఒక్క తాపు తన్నితే చాలు, మంచం మీద నిటారుగా లేచి కూర్చుంటాడు. కానీ ప్రపంచాన్ని ఉద్ధరించటమే నా పని కాదుగా, కాబట్టి అతణ్ణి అలాగే వదిలేశాను. నేను ఈ తాలూకా మొత్తానికి వైద్యుణ్ణి, ఒక్క మనిషి వల్ల కానంత పని చేస్తాను. జీతం తక్కువే అయినా, ఆ పట్టింపేమీ లేకుండా పేదల మీద ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తాను. కానీ ప్రస్తుతం రోజీ క్షేమంగా ఉందో లేదో చూడాలి, అప్పుడే ఈ అబ్బాయి సంగతి. ఆ తర్వాత ఇక నేను చచ్చిపోయినా ఫర్లేదు. ఈ అంతూపొంతూ లేని శీతాకాలం అంతకుమించి ఏం చేయగలను! నా గుర్రమా చచ్చిపోయింది, ఊరిలో గుర్రం అరువిచ్చేవాడు ఒక్కడు కూడా లేడు. ఇప్పుడున్న జోడీని కూడా నేను పందుల పాక నుంచి తెచ్చుకోవాల్సి వచ్చింది; అక్కడ అదృష్టవశాత్తూ గుర్రాలు ఉండబట్టి సరిపోయింది గానీ, ఒకవేళ అక్కడ పందులు ఉండుంటే వాటితోనే పని కానిచ్చేయాల్సి వచ్చేది. అదీ పరిస్థితి. ఆ కుటుంబానికి నమస్కరించి నాకు సెలవిప్పించమన్నాను. ఇదంతా వాళ్ళకేం తెలుసు, ఒకవేళ తెలిసినా నమ్మరు. మందుచీటీలు రాసినంత సులువు కాదు జనంతో మసలుకోవటమంటే. ప్రస్తుతానికి ఇక్కడ నా వల్ల అయిందంతా చేశాను, మళ్లా అనవసరంగా కబురుపెట్టి రప్పించారు, నాకిది అలవాటైపోయింది, ఈ తాలూకా మొత్తం నన్ను చిత్రహింస పెట్టడానికే నా రాత్రిబెల్లును వాడుకుంటోంది, కానీ ఇప్పుడు నా రోజీని కూడా బలిపెట్టాల్సి వచ్చింది – చాలా ఏళ్ళుగా నా ఇంట్లోనే ఉంటూ కూడా నా గుడ్డికళ్ళకు ఆనని అందమైన రోజీని బలిపెట్టాల్సి రావడమంటే – అది భర్తీ కానంత పెద్ద నష్టం, కానీ అదేమంత పెద్దది కాదని నన్ను నేను నమ్మించుకోవాలి, లేదంటే ఆ కోపాన్ని ఈ కుటుంబం మీద వెళ్ళగక్కేయగలను, ఏం ప్రయోజనం, ఈ కుటుంబమంతా తలకిందులుగా తపస్సు చేసినా నా రోజీ నాకు తిరిగిరాదు. నేను నా సంచీ సర్దేసుకుని, ఉన్నికోటు తెమ్మని సైగ చేసే సరికి, కుటుంబమంతా నా చుట్టూ గుమికూడింది, తండ్రి తన చేతిలో రమ్ము గ్లాసు వాసన చూస్తున్నాడు, తల్లేమో బహుశా నా వల్ల ప్రయోజనమేం లేదన్న నిరాశతో కాబోలు (అసలేం ఆశిస్తారీ జనం?) తన పెదాలు కొరుక్కుంటూ ఏడుస్తోంది, చెల్లెలేమో రక్తంతో తడిసిన జేబురుమాల్ని నా కళ్ల ముందు ఆడిస్తోంది. నిజమే, ఒప్పుకోక తప్పదు, ఆ అబ్బాయి కాస్త అనారోగ్యంగానే ఉన్నాడు. అతని వైపు నడిచాను. అక్కడికి, నేనేదో పాయసం తీసుకువస్తున్నట్టు అతను నా వంక చూసి నవ్వుతున్నాడు, – అప్పుడే ఈ మాయదారి గుర్రాలు మళ్ళీ సకిలించడం మొదలుపెట్టాయి; రోగికి నేను చికిత్స చేస్తూంటే ఇలా సకిలింపులతో సాయపడమని బహుశా వాటికి పైనుంచి ఎవరో ఆదేశాలు పంపారేమో – అదిగో అప్పుడు కనపడింది: ఆ అబ్బాయి పరిస్థితేం బాలేదు. అతని కుడి పక్కన, పిరుదుల పైన, నా అరచేయంత పెద్దగా ఒక తాజా గాయం ఉంది. వేర్వేరు గులాబీ ఛాయల్లో ఉంది, మధ్యలో ముదురు రంగులో ఉండి, అంచుల వైపు వచ్చే కొద్దీ లేతగా మారింది, రజను తాపడం చేసినట్టు మృదువైన గరుకుదనంతో ఉంది, అక్కడక్కడా రక్తం ఊరుతోంది, మొత్తం మీద ఒక గని ముఖద్వారంలా బాహటంగా తెరుచుకుని ఉంది. ఇదంతా దూరం నుంచి చూస్తే కనిపించేది. దగ్గరకి వెళ్లే కొద్దీ దృశ్యం మరింత సంక్లిష్టంగా మారింది. ఆశ్చర్యంతో ఈల వేయకుండా ఉండలేకపోయాను. ఆ గాయంలో పురుగులు మెలికలు తిరుగుతున్నాయి, నా చిటికిన వేలంత పొడవుగా లావుగా ఉన్నాయి, చిన్నటి తెల్లని తలలతోను, బోలెడన్ని పొట్టి కాళ్ళతోను ఉన్నాయి, వాటి గులాబీరంగు శరీరాలకు అక్కడక్కడా రక్తం అంటుకుని ఉంది. క్షమించు తమ్ముడూ, నిన్నిక ఏ సాయమూ కాపాడలేదు. నీ ఘనమైన గాయాన్ని కనిపెట్టాను; నీ పక్కన పూచిన ఈ పువ్వు నిన్నిక మట్టుబెట్టక మానదు. నేను పనిలో పడటం గమనించి ఆ కుటుంబ సభ్యులు సంతోషించారు; చెల్లి తల్లికి చెప్పింది, తల్లి తండ్రికి చెప్పింది, తండ్రి అప్పుడే లోనికి వస్తున్న అతిథులకు చెప్తున్నాడు; వాళ్ళు మునివేళ్ల మీద నడుస్తూ బాలెన్స్ కోసం చేతులు బారజాచి బయట వెన్నెల్లోంచి గుమ్మంలోకి అడుగుపెడుతున్నారు. తన గాయంలో జీవసంచలనాన్ని చూసి ఆ అబ్బాయికి కళ్ళు బైర్లు కమ్మినట్టున్నాయి, “నన్ను రక్షిస్తారు కదూ?” అంటూ ప్రాధేయపూర్వకంతా అడుగుతున్నాడు. ఇదీ ఈ తాలూకాలో జనం తీరు! తమ వైద్యుణ్ణించి అసాధ్యాల్ని ఆశిస్తారు. వీళ్ళ పాటికి వీళ్ళు పాత విశ్వాసాలన్నీ విడిచిపెట్టేశారు; మతపూజారి ఇంట్లోనే ఉండి తన పవిత్రవస్త్రాలు ఒక్కొక్కటిగా చింపుకుంటుంటాడు; కానీ వైద్యుడు మాత్రం వీళ్ళ కోసం శస్త్రచికిత్సలో ఆరితేరిన తన చురుకైన వేళ్ళతో అద్భుతాలు చేసి పెట్టాలి. అయినా ఏమైతే నాకెందుకు: ఇక్కడకు నా అంతట నేను రాలేదు; ఒకవేళ పవిత్ర క్రతువుల కోసం నన్ను దుర్వినియోగం చేయాలనుకుంటే, అది వాళ్ళ ఇష్టం, నేనేం కాదనను; నాకంతకన్నా మిగిలిందేముంది, ముసలి పల్లెటూరి వైద్యుణ్ణి, నా పనమ్మాయిని పోగొట్టుకున్నవాణ్ణి! ఇదిగో వస్తున్నారు, రోగి కుటుంబమూ, పల్లెటూరి పెద్దలూ కలిసి, నా బట్టలు విప్పుతున్నారు; ఒక బడి తాలూకు ప్రార్థనాగీతాల బృందం తమ టీచరుతో సహా వచ్చి ఇంటి ముంగిట నిలబడి తేలికైన బాణీలో ఈ పంక్తులు పాడుతున్నారు:

బట్టలు విప్పండి, వైద్యం చేస్తాడు చూడండి,
చేయకుంటే చంపండి!
వైద్యుడే కదా, వట్టి వైద్యుడే కదా!

నా బట్టలు విప్పేశారు, నేను తల ఓ పక్కకి వాల్చి, గడ్డాన్ని వేళ్ళతో నిమురుకుంటూ, ఆ జనం వైపు నిశ్శబ్దంగా చూశాను. నేను ఏమాత్రం తొణకలేదు, తల్చుకోవాలేగానీ వీళ్లందరికీ సమవుజ్జీని, కానీ లాభం లేకపోయింది, వాళ్ళు నా తలనీ కాళ్ళనీ పట్టుకుని మంచం దగ్గరకు మోసుకుపోయారు. నన్ను గోడ వైపు ఆ అబ్బాయి పక్కన గాయం ఉన్న వైపే పడుకోబెట్టారు. తర్వాత అందరూ గదిలోంచి బయటకు వెళ్ళిపోయారు; తలుపు మూసుకుపోయింది; పాట వినిపించటం మానేసింది; చంద్రుణ్ణి మేఘాలు కమ్మేశాయి; పక్కబట్టల వెచ్చదనం నన్ను ఆవరించింది; తెరిచిన కిటికీలోంచి గుర్రాల తలలు నీడల్లా కదులుతున్నాయి. “నీకు తెలుసా,” అంటూ పక్కనుంచి ఓ గొంతు నా చెవిలో మాట్లాడింది, “నాకు నీ మీద పెద్ద నమ్మకమేం లేదు. నువ్వు ఎక్కణ్ణించో లాక్కురాబడటం వల్ల ఇక్కడకొచ్చి పడ్డావు, నీ కాళ్ల మీద నువ్వు రాలేదు. ఇప్పుడు నాకు సాయం చేయకపోగా, నా మరణశయ్యని మరింత ఇరుకు చేస్తున్నావు. వీలైతే నీ రెండు కళ్ళూ పెరికేయాలని ఉంది.” “అవున్నిజమే,” అన్నాన్నేను, “ఇది సిగ్గుచేటే. కానీ నేనొక వైద్యుణ్ణి. ఏం చేయగలను. నమ్మూ నమ్మకపో, నా పనీ అంత సులువేం కాదు.” “అంటే ఈ ఒక్క క్షమాపణతో ఇక నేను సమాధానపడిపోవాలా? అంతేలే, అంతకన్నా ఏం చేయగలను. నా బతుకంతా ఏది దక్కితే దానితో సమాధానపడటమే. నాతో పాటూ ఈ ప్రపంచంలోకి తెచ్చుకున్నదల్లా ఈ అందమైన గాయం మాత్రమే; ఇదే నాకు సంక్రమించిన ఏకైక ఆస్తి.” “తమ్ముడూ,” అన్నాన్నేను, “నీ పొరబాటేంటో తెలుసా: విషయాన్ని విశాల దృక్పథంతో చూడలేకపోవటం. ఎందరో రోగుల గదుల్లోకి వెళ్లి వచ్చినవాణ్ణి, నేను చెప్తున్నా విను: నీ గాయం మరీ ఏమంత ప్రమాదకరం కాదు. రెండు తేలికపాటి గొడ్డలి వేటులు పడ్డాయి. చాలామంది అడవిలో వళ్లంతా అప్పజెప్పి నిలబడినా ఎప్పుడూ గొడ్డలి శబ్దమే వినరు, ఇక అది వారి వైపుకి రావటమన్న ప్రశ్నయితే అస్సలు లేదు.” “నిజమే చెప్తున్నావా, లేక జ్వరంతో ఉన్నాను కదాని మాయచేస్తున్నావా?” “నిజమే చెప్తున్నాను, ఒక వైద్యుడు అధికారికంగా ఇస్తున్న మాట ఇది.” అతనా మాట విని, మెదలకుండా పడుకున్నాడు. ఇక నేను తప్పించుకోవటానికి దారి వెతుక్కోవాలి. గుర్రాలింకా తమ స్థానాల్లోనే నిల్చుని ఉన్నాయి. నా బట్టలు, ఉన్నికోటు, సంచీ అన్నీ వెంటనే తీసుకున్నాను; బట్టలేసుకోవటానికి సమయం వ్యర్థం చేయటం ఇష్టం లేదు; గుర్రాలు గనక ఇక్కడకు తెచ్చినంత వేగంగానే ఇంటికి తీసుకుపోగలిగినట్లయితే, ఈ మంచం మీంచి దిగిన మరుక్షణం నా మంచం మీద ఉంటాను. ఒక గుర్రం వినయంగా కిటికీ నుంచి వెనక్కు కదిలింది; అన్నీ మూట కట్టేసి బండిలోకి విసిరాను; ఒక్క ఉన్నికోటు మాత్రం గురి తప్పి బండికున్న కొక్కెపు అంచుని పట్టుకు వేలాడుతోంది. ఆ మాత్రం ఆధారం చాలు. గుర్రం మీదకు ఎక్కాను. పగ్గాలు వదులుగా వేలాడుతున్నాయి, గుర్రాల్ని కలిపే లంకె ఊడిపోయింది, వెనకాల బండి అటూ ఇటూ ఊగుతోంది, బండి చివర్న నా ఉన్నికోటు మంచులోకి దేకుతోంది. “హెయ్య!” అన్నాన్నేను, కానీ ఉరుకులూ పరుగులూ ఏంలేవు; ఈసురోదేవుడా అన్నట్టు నెమ్మదిగా, ఆ మంచు విస్తారాల్లో ఈడిగిలపడుతూ కదిలాం; అసలువిషయం తెలియని ఆ బడిపిల్లలు పాడుతున్న ఒక కొత్త పాట మా వెనక చాలాసేపటి దాకా వినిపిస్తూనే ఉంది.

సంతసించుము, అస్వస్థులారా,
వైద్యుడు మీతోనే ఉన్నాడు, మీ పక్కలోనే ఉన్నాడు!

ఈ వేగంతో ఐతే ఎప్పటికీ ఇంటికి చేరలేను; నా పుష్కలమైన ప్రాక్టీసు ఇక ముగిసినట్టే; నా తదనంతరం వచ్చేవాడు దాన్ని లాగేసుకుంటాడు, కానీ వాడు నా స్థానాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేడు; అదెలా ఉన్నా అక్కడ నా ఇంటికి ఆ మోటు గుర్రాలవాడు నాశనం చేస్తున్నాడు; రోజీ వాడికి బలైపోతోంది; ఆ ఆలోచనే దుర్భరంగా ఉంది. అన్ని కాలాల్లోనీ నికృష్టమైన ఈ కాలంలో, మంచులో, నగ్నంగా, ఒక సాధారణమైన బండిలో, దాన్ని లాగుతున్న అసాధారణమైన గుర్రాలతో, ముసలివాణ్ణయిన నేను, ఇలా దారి తప్పిపోతున్నాను. నా ఉన్ని కోటు బండి వెనక వేలాడుతోంది, అది నాకు అందటం లేదు, నాకున్న ఇంతమంది రోగుల్లో ఒక్కడూ నా సాయానికి ముందుకురాడు. మోసపోయాను! మోసపోయాను! తప్పుగా మోగిన రాత్రిబెల్లుకు ఒక్కసారి స్పందిస్తే చాలు, మళ్లీ బాగుపడటం సాధ్యం కాదు – ఎప్పటికీ!

*

(కినిగె పత్రికలో ప్రచురితం)

February 15, 2014

త్రిపుర కల

త్రిపురని ఇంటర్వ్యూ చేస్తున్నట్టు కల. ఆయన లుంగీ మీద పింక్‌ నెక్ షర్టు వేసుకున్నాడు. కలంతా నేను సరిగా ప్రిపేరవలేదే అన్న మైల్డ్ పానిక్‌తో ఉంటాను. But he is so laid back and giving all the crazy answers in the world. నేను అడిగిన ప్రశ్నల్లో నాకు గుర్తున్నది: "Celine మీ అభిమాన రచయిత అని చెప్పారు కదా, మరి అతని antisemitism మీద మీ అభిప్రాయం ఏంటి?" అని.

This is only the second time that i dreamed about a writer. First time, it's Nabokov.

February 14, 2014

తరళ మేఘచ్ఛాయ, తర్వాతి ఎడారి



ఇప్పుడిలా రాత్రి నీరవంలో, అల్ప్రజోలం 1mg కూడా నిద్రపుచ్చలేని బరువు కళ్లతో, వెనక మంచం మీద ఇప్పుడు నా వంతు భాగాన్ని కూడా వెల్లకిలా ఆక్రమించి రాఘవ పెడ్తోన్న గురక నేపథ్యంలో... ఒకసారి మాధవ్‌ని గుర్తు తెచ్చుకుంటే, జీవితంలో ఏదీ నా చేతుల్లో లేకపోవటమనే నిస్సహాయ భావనని మళ్లీ తల మీంచి గుమ్మరించుకున్నట్టు ఉంటుంది. ఇవాళ్టికి ఏడేళ్ల క్రితం మేం విడిపోయాం. నిజానికి, విడిచి వచ్చేశాను. నేనే నెట్టేశాను వాడ్ని, తల్లి తన రొమ్ము నుంచి బిడ్డని దూరం నెట్టినట్టు.

ఎంత విలువైనదైనా చవకగా వస్తే తలకెక్కేస్తుంది. మా మధ్య ఏడాది అనుబంధం అప్పటికే నాలో చాలా సత్తువ లాగేసింది. వాడేంటి అప్పుడే పాతిక దాటిన కుర్రాడు, వాడికి అంతా బాగానే ఉండేదనుకుంటా. అలాగే ప్రవర్తించేవాడు. నలభైయేళ్ల నన్ను కన్నె కలల సఖిలాగా చూసేవాడు. ఆ కొన్నాళ్లూ నన్ను నేనూ అలాగే చూసుకున్నాను. చూసుకునేలా చేశాడు నన్ను. కానీ నిజానికి అప్పటికే వాస్తవం నలిపేయగా వడలి సడలి రాలిన కలల పుష్పం తాలూకు మిగిలిన వృంతాన్ని నేను. ఎప్పుడోకప్పుడు ఆ నిజం కట్టెదుట నిలిచి నిలదీయకపోతుందా.

ఆ రోజు చాలా గుర్తు నాకు. ఈ ఏడేళ్లలోనూ పదే పదే వాడగా వాడగా అరిగిపోయిన స్మృతి అది. క్లాసుల మధ్య విరామంలో తోటి లెక్చరర్లతో ఏదో కబుర్లలో ఉంటే వాడి నుంచి ఫోన్‌. అప్పటికే ఎక్కడ ఉన్నా పక్కకు వచ్చి ఫోన్‌ ఎత్తే దశ దాటి, ఇబ్బందిగా ఉంటే కట్‌ చేసే స్థితికి వచ్చేశాను. అలాగే కట్‌ చేశాను. రెండు సార్లు, మూడుసార్లు... చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తలుచుకుంటే కళ్లమ్మటా నీళ్ళొస్తున్నాయి. కానీ అప్పుడు కట్‌ చేస్తూనే ఉన్నాను. చివరికి మెసేజ్‌ పెట్టాడు. ''బయట ఉన్నాను,'' అని.

ప్రేమలో ఉన్న మనిషిది కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లి వాటం. చుట్టూ జనానికి తెలియదా. బోటనీ ఆవిడా, లెక్కలావిడా గూడుపుఠాణీ మౌనంలో ఓరగా చూస్తున్నారని తెలుస్తోంది. ''వస్తానుండండీ...'' అంటూ—వాళ్ల వైపు చూస్తే నా నుంచి ఏదో కన్ఫెషన్‌ ఆశించే చూపుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో చూడకుండానే—కుర్చీ లోంచి లేచి బయటకు బయల్దేరాను. గది నుంచి బయటకు వచ్చానే గానీ, కుతూహలం కాళ్లకు బంధం వేసింది. కుచ్చిళ్ల మడత సర్దుకుంటున్న నెపంతో కిటికీ పక్కన వంగాను.

"Seems her dildo again...'' లెక్కలావిడ గొంతు.

తర్వాత ఇద్దరి నవ్వులూ.

వాస్తవం కొట్టిన చెంపదెబ్బ! కానీ వాళ్లకేం తెలుసనీ! ఆ ప్రపంచంలో మసులుతున్న నాకు తెలుసు మా బంధపు సౌందర్యం. ''సాము సడలిన పతి పరిష్వంగమునందు.. సుఖము దుఃఖము లేని సుషుప్తి లోన'' ఉన్న నాకు ఎక్కణ్ణించి తేలుతూ వచ్చిందో ఆ వేణుగానం తాకింది. ఇక అన్నీ మరిచి ఆ స్వప్నరాగలీనురాలినై తెలియని లీల వైపు అలా సాగిపోయాను. ఇప్పుడు అది మొహం మొత్తింది.

కాలేజ్‌ బయట పార్కింగ్‌ దగ్గర నా కారు దరిదాపుల్లో అసహనంగా తచ్చాడుతున్నాడు మాధవ్‌. నన్ను దూరం నుంచి చూడగానే ముఖమంతా వెలిగించుకుని అదే మతాబా రవ్వల నవ్వు, కనీసం గత వారంగా కలవకుండా, ఫోన్‌లో దొరక్కుండా ఇబ్బంది పెట్టానన్న కోపం కూడా మర్చిపోయి. ఆ నవ్వులో తన ప్రేమ మీద వాడు పెట్టుకున్న నమ్మకం కనపడి, వాడికా రోజు నేను ఏం చేయబోతున్నానో గుర్తొచ్చి, గుండెల్లో ఒక తాడేదో అనంతమైన ముడులుగా మెలిపడుతున్నట్టుగా అనిపించింది. లెక్కలావిడ కామెంట్‌తో ఇరిటేట్‌ అయి ఉన్నానేమో, వాడి నవ్వుకి బదులివ్వలేదు.

''ఎందుకు అదే పనిగా రింగ్‌ చేస్తావ్‌. కట్‌ చేశానంటే ఏదో కారణంతోనే కట్‌ చేసుంటా అనుకోవా?''

''వారం అయింది కుదురుగా మాట్లాడి. నాతో మాట్లాడటానికి సందు దొరకనంత బిజీనా? ఏంట్రా ఇది?''

నేను మౌనం వహించబోయాను. కానీ మామూలుగా నా మౌనాన్ని వాడేది ఊరకనే వాడిలో దోషభావం రేగ్గొట్టటానికి. ఇప్పుడా అవసరం లేదు. ఇది దోషభావాన్ని కన్వీనియెంట్‌గా మీదేసుకుని వాణ్ణి తూట్లు పొడవబోయే సందర్భం. ''పద కారెక్కు. మాట్లాడాలి.''

ఆ రోజు కారు ప్రయాణం ఒక్కోసారి అలాగే అనంతంగా సాగిపోతే బాగుండేదని అనిపిస్తుంది. ఇప్పుడీ కథలో కూడా. ఆ ప్రయాణాన్ని వెంటనే ముగించి నా జీవితంలో బాల్యం తర్వాత తారసిల్లిన ఏకైక ఆనందపు అధ్యాయానికి నేనే ఇచ్చుకున్న మాసకిస్టిక్‌ ముగింపు జోలికి వెళ్లాలనిపించటం లేదు. కాసేపు నన్నూ, మాధవ్‌నీ అలా కారులోనే వెళ్లనిస్తూ, ఈ రాసే నేను మళ్లీ మొదటికి వస్తాను. మాధవ్‌ని తొలిసారి చూసిన సందర్భానికి.

అప్పటికే రాఘవని భర్తగా చూడకపోవటం మాట అటుంచి శత్రువుగా చూడటం కూడా మానేశాను. నా అరుపులూ, గొడవలూ, హిస్టీరియా, సైకియాట్రిక్‌ కన్సల్టేషన్లూ అన్నీ పోయి, ఒక ప్రశాంతమైన ఏమీలేనితనం. We were just co-existing, and it's still the status. మా మధ్య స్వప్న రూపేణా పేగుబంధం లేకపోయుంటే తెగతెంపులు చేసుకునేదాన్నేమో. అది కూడా ఏమోనే. తెగించి ఏదోటి చేయలేనితనానికి అదో సాకేమో కూడా. ఇలాంటి మృత వాతావరణంలో పెరిగేకంటే, ఆమె నా దగ్గరో తన దగ్గరో పెరిగుంటేనే బాగుండేది. మా ఇద్దరి మధ్యా సయోధ్య ఆశలేమన్నా ఇంకా ఇలా కలిపి  ఉంచాయా. కానీ అతని వ్యక్తిత్వం ఎక్కడో ఒన్స్‌ అండ్‌ ఫరాల్‌ ఇలా ఏర్పడిపోయింది. ఇక మారడు. జీవితం నాశనం చేసినవాడి పక్కలోనే ఇలా నేను ముసల్దాన్నయిపోవాల్సిందే.

ఒక రోజు రాత్రి ఏదో పార్టీకని తీసుకెళ్లాడు. మార్బల్‌ కాంట్రాక్టర్లందరూ కలిసి ఎందుకో పార్టీ ఇచ్చుకుంటున్నారు. అది సకుటుంబ సపరివార సమేతమైన వేడుక కాబట్టి, ఎవరెవరి భార్యలు వారి వారి మొగుళ్ల పక్కన ఉంటారు కాబట్టి, ఒక ట్రోఫీ వైఫ్‌గా నేనూ వెళ్లక తప్పలేదు. బేగంపేట దగ్గర ఏదో ఫంక్షన్‌ పేలెస్‌. బయట ట్రాఫిక్‌ ప్రవాహం ఒకటి వెళ్తోందని తెలియనివ్వకుండా నిలువునా పైకి లేచిన ఫైబర్‌ గోడలు. లోపల కృత్రిమ గడ్డి పరిచిన విశాలమైన ప్రదేశం. మధ్య మధ్యలో దీపస్తంభాలు. ఓ మూలన పెద్ద వేదిక. అప్పటికే ఉపన్యాసాలు ఐపోయాయి. అందరూ బఫే దగ్గరకు వెళ్లి ప్లేట్లలో వడ్డన చేయించుకుని వేదిక ముందు ఉన్న నీల్‌కమల్‌ కుర్చీల్లో కూర్చుని తింటున్నారు. ఆ కుర్చీలన్నీ ఏ గుంపుకి ఆ గుంపుగా వరసలు తప్పి చిందరవందర వలయాలైపోయాయి. నేను మాత్రం ఏ వలయంలోనూ కుదురుకోలేను. అక్కడ ఆడవాళ్లయినా మగవాళ్లయినా మాట్లాడుకునే విషయాలేవీ నాకు ఆసక్తిని కలిగించేవి కావు. ఇంకా మగవాళ్లే నయం. కాసేపటికి అక్కడ ఏ గుంపులోనూ చేరక ఒక్కదాన్నీ ఉన్నది నేనేనని గుర్తొచ్చి అలా పోతున్న ఓ బుడ్డాణ్ణి దగ్గరకు పిలిచి ఏదో కబుర్లు చెప్తున్నాను.

అప్పుడు వచ్చింది వేదిక మీదకి ఆర్కెస్ట్రా. నాకు ఈ ప్రోగ్రాం ఉందని తెలియదు. ఆ వచ్చిన ఐదారుగురిలో ఉన్నాడు మాధవ్‌. నెమ్మదిగా వాద్య పరికరాలు సర్దటం అయ్యాకా పాటల ప్రోగ్రాం మొదలైంది. మొదటి పాట మాధవ్‌దే అని గుర్తు. ఏదో హిందీ పాట. నాకు పాట తెలియదు, కానీ వాడు పాడిన విధానం మాత్రం మంత్రముగ్ధంగా ఉంది. మాధవ్‌ గొంతు ఇప్పుడు సినిమాల్లో వినిపించే చాలా గొంతుల కన్నా భిన్నమైందేమీ కాదు. కానీ వాడు పాడుతున్నాను చూడండొహో అన్నట్టు పాడడు, ప్రాణం పెట్టి లీనమై పాడతాడు. అదే వాడి గొంతులో అందం. పాడుతున్నప్పుడు వేదిక కింద ఏం జరుగుతుందో కూడా చూడటం లేదు. కళ్లు మూసుకుని, పాట సాహిత్యంలోని భావమేంటన్నది పట్టించుకోకుండా, పాట రాగంలోని అనుభూతిని మాత్రం పట్టుకుని, అది ఏ మాత్రం దాచే ప్రయత్నం చేయకుండా తన్మయిస్తూ, అసలు ప్రదర్శిస్తున్నానన్న స్పృహ లేకుండా, ఒక చేత్తో మైకుని బిగించి పట్టుకుని రెండో చేత్తో గాలిని నిమురుతూ పాడుతున్నాడు. ఆ చేతులు... ఆ చేతులకీ, వాటి పొడవాటి వేళ్లకీ ఒక విశిష్టత ఉంది. వాటి మధ్య ఏమొచ్చి చేరినా చిత్రమైన అందాన్నీ ప్రాముఖ్యతనీ సంతరించుకుంటాయి: సిగరెట్టయినా, టీ కప్పయినా, నా రొమ్మయినా.

నిజానికి అలాంటి పార్టీ వాతావరణాలు నాకు పెద్ద నచ్చవు. కానీ మాధవ్‌ని మొదటిసారి చూసిన క్షణాలకు నేపథ్యమైన కారణంగానేమో, అదంతా ఒక వాన్‌గో స్టారీ నైట్స్‌ లాంటి బ్రైట్‌నెస్‌తో జ్ఞాపకంలో ముద్రపడిపోయింది. వాడు పాటలు పాడుతున్నాడు, వాడి పాట అయ్యాకా మధ్యలో ఇంకెవరో అందుకుని ఇంకో పాట పాడుతున్నారు, నా దృష్టి మాత్రం వాడు పాడుతున్నప్పుడూ, పాడకుండా పక్కన కూర్చుని వేరే వాళ్ల పాటలకి కాలి తాళం వేస్తున్నప్పుడూ కూడా వాడి పైనే లగ్నమై ఉంది. మిరుమిట్లు గొలిపే అందగాడని కాదు. చామనఛాయ, పెద్ద ముఖం, భృకుటి దగ్గర దట్టంగా మొదలై ముఖం చివర్ల కెళ్లే కొద్దీ డ్రైబ్రష్‌తో పల్చగా హాచింగ్‌ చేసినట్టు ముగిసిపోయే కనుబొమ్మలు... నుదురూ, కళ్లూ, చెంపలూ అన్నీ ఏదీ మరుగు చేయలేనట్టు, తలుపులన్నీ తెరిచిపెట్టుక్కూచున్నట్టు ఉంటాయి.

ఓ రెండు గంటల తర్వాత పాట కచేరీ ముగిసింది. వాడు కాగితాలు పుస్తకంలో సర్దుకుని వెళిపోతున్నాడు. వేదిక మెట్లు దిగి, వెనక చీకట్లలోకి, నాకు దూరంగా, మళ్లీ ఇక కనపడే వీల్లేకుండా. మళ్లీ ఎప్పుడో అప్పుడప్పుడూ ఒక ఆనందం నాకు వీపు చూపిస్తూ వేసుకున్న తలుపు చప్పుడులాగా మాత్రమే గుర్తొస్తాడు. వయసు గడిచేకొద్దీ, లేదా వయసుతో పాటూ డెస్పరేషన్‌ పెరిగేకొద్దీ, ఇలాంటి చిరు సంకేతాల్ని పట్టించుకోవటం ఎక్కువవుతుందేమో. వయసులోలా అవి పదే పదే తారసపడతాయన్న నమ్మకం ఉండదు కదా. అందుకే, కుర్చీలోంచి లేచాను. అస్తమానం మెదడు తర్కమేనా. మెదణ్ణి మనం నడిపించగలం, తర్కపు చెర్నాకోలతో. మనసు మాత్రం ఏ జాడలకు వశీకృతమై మనల్ని అటు లాక్కుపోతుందో దాని అభీష్టం. అప్పుడప్పుడూ అన్నీ మరిచి అది ఎటు పట్టి ఈడిస్తే అటు డేక్కుంటూనైనా పోవాలి.

రాఘవ సఫారీ సూట్లో, ఒక చేయి వీపు వెనక మడుచుకుని, ఒక చేత్తో పెగ్గు పట్టుకుని, ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నేను తన వైపు రావటం గమనించి వీపు వెనక నుంచి చేయి తీసి వాచీ చూసుకున్నాడు. వాళ్ళ సంభాషణో కొలిక్కి వచ్చి తను నా వైపు వచ్చేదాకా వేచి చూసేంత సమయం, సహనం లేవు. తిన్నగా వాళ్ళ మధ్యకి వెళ్లాను. కారు తాళాలు ఇమ్మన్నాను. ఒక అరగంట ఆగితే తనూ వచ్చేస్తా అన్నాడు. అర్జంటన్నాను. పక్కన ఎవరూ లేకపోతే ఏంటంత అర్జంటని అడిగేవాడే. ఇప్పుడు తప్పక, కనుబొమలు పైకి లేపి, తాళం చేతుల్లో పెట్టాడు.

వేదిక పక్కనుంచి బయట పార్కింగ్‌కి దారి ఉంది. అక్కడ కాస్త చీకటి. ఆ చీకటిలోకి చేరేదాకా నిమ్మళంగా నడిచాను. ఏం చేద్దామని బయటకు వెళ్తున్నా అనేది పూర్తిగా నాకే తెలీదు. వాణ్ణి ఒంటరిగా కలవాలి, వీలైతే కారు ఎక్కించుకోవాలి, వాడి పాట చాలా బాగుందని చెప్పాలి... ఏదో ఒకలా మాట్లాడాలి. ద్వారం దాటేసరికి బయట వాళ్ల గ్రూపు వీడ్కోలు తీసుకుంటోంది. అప్పటిదాకా నాకు అనిపించలేదు, వాళ్లంతా బైక్స్‌ మీద వచ్చి ఉండొచ్చని. ఒక చిన్న ట్రాలీ ఆటోలో వాద్యపరికరాలు ఎక్కించి బైక్స్‌ స్టార్ట్‌ చేసి కోలాహలంగా వెళ్లిపోయారు. దారపు ఉండ నుంచి జారుతున్న దారంలా అలవోకగా భవిష్యత్తులోకి జారుకోబోయిన కాలం పుటుక్కున తెగిపోయినట్టనిపించింది. ఎలాగూ తాళాలు తీసుకున్నాను కాబట్టి ఇంటికి వెళ్ళిపోయాను.

మనసు ఎన్నో ఎటూ పర్యవసించని సంకేతాలు కూడా ఇస్తుంది లెమ్మని ఊరుకున్నాను. కానీ నెల తర్వాత మరలా కనిపించాడు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, విక్టోరియా ఒకాంపోల మధ్య అనుబంధం గురించి ఏదో పుస్తకం వచ్చిందంటే కొనుక్కుందామని వాల్డెన్‌కి వెళ్లాను. పుస్తకం దొరికేసినా ఊరికే అరల మధ్య తిరుగుతున్నాను. పుస్తకాల షాపుల్లో ఎవరూ ముఖముఖాలు చూసుకోరు ఎందుకో. నేనూ చూడలేదు వాణ్ణి. కానీ వాడు నన్ను దాటుకుంటూ వెళ్తున్నప్పుడు ఇంకా కళ్ళతో కూడా చూడకుండానే వాణ్ణి గుర్తుపట్టాను. మరి అది వాడి పరిమళమా, నా కళ్ల కొలుకుల్లోంచి కనపడిన రూపపు మసక అంచులా, లేక కేవలం జననాంతర సౌహృదమా... తెలీదు. వాణ్ణప్పుడు చూడగానే ఏదో కలలో కనిపించిన మనిషిని బయట గుర్తుపట్టినట్టూ, అంత ఆత్మీయత లోపల్నించి పొంగటానికి కారణం ఆ మనిషి ఇంతకుముందు కలలో కనిపించటమే అన్న సంగతి గుర్తురాక అయోమయపడ్డట్టూ... అనిపించింది. వాడు పుస్తకాల రాక్స్‌ మధ్య తిరుగుతున్నాడు. నేను వాణ్ణి కేంద్రంగా పెట్టుకుని పుస్తకమేం అక్కర్లేకపోయినా పచార్లు చేస్తున్నాను. ఎలా పలకరించాలో తెలీలేదు. ఎలా వెళ్లాలి వీడి జీవితంలోకి, వీడి జీవితపు లోపల్లోపలి విషయాలతో నిమిత్తం ఉన్న మనిషిగా ఎలా మారాలి? వాణ్ణి ఇదివరకూ చూశానని చెప్పదల్చుకోలేదు. ఒకణ్ణి నెల క్రితం చూసి గుర్తుపెట్టుకున్న ఆడదాన్ని కాదల్చుకోలేదు. (తర్వాతెపుడో చెప్తే 'దొంగనాయాలా' అన్నాడు.)

చివరకు కొన్ని పుస్తకాలు తీసుకుని కౌంటర్‌ వైపు వెళ్లాడు. డబ్బులు కట్టి బయటకు వెళిపోతున్నాడు. అంత పిచ్చి ధైర్యం ఎలా వచ్చిందో తెలియదు. బహుశా అసలు వాడు రెండోసారి కనపడటమే మా ఇద్దరి మధ్యా ఏదో రాసి పెట్టుందన్నదానికి నిదర్శనంగా భావించిన నా మనసు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కితగ్గదల్చుకోలేదనుకుంటాను. వాడి వెనకే గేటు దాకా వెళ్లాను.

''ఎక్స్‌క్యూస్‌ మీ''

వాడు అప్పటికే మెట్లు దిగుతున్నాడు. కింద మెట్టు మీద వెనక్కి తిరిగాడు. వాడి కళ్లు... ఉన్నట్టుండి పిలిస్తే హడలిపోయిన కళ్లతో తిరుగుతాడు ఎప్పుడూ. ఆ ఎక్స్‌ప్రెషన్‌ చూట్టానికే ఒక్కోసారి ఉన్నట్టుండి ఊరికే పనేం లేకపోయినా పిలిచేదాన్ని. నా సొంత మిర్త్‌లో నేను నవ్వుతుంటే వాడి ఉడుకుమోతు ముద్దు ముఖం!

''నేను ఆ పుస్తకం కోసమే వెతుకుతున్నానండీ...''

వాడు చేతుల్లో ఉన్న మూడో నాలుగో పుస్తకాలు చూపించి, ''ఏది?'' అని అడిగాడు.

ఆ పుస్తకాల్లో రెండో కాపీ ఉండదనుకున్న పుస్తకాన్ని చూపించాను.

ఏమనాలో తెలీక ''అవునా,'' అన్నాడు. ''ఇంకో కాపీ ఉందేమో చూడండి,'' అన్నాడు.

''అడిగానండీ, లేదన్నాడు. మీరేం అనుకోకపోతే, మీ నంబర్‌ ఇస్తారా. మీరు చదివాకా తీసుకుంటాను.''

''ఆన్‌లైన్‌లో దొరకచ్చేమోనండీ,'' అన్నాడు మొహమాటంగా.

''నాకవన్నీ అలవాటు లేవు, ప్లీజ్‌!''

అయోమయంగా చూశాడు.

''మళ్లీ ఇచ్చేస్తాను చదవగానే.''

''అది కాదండీ, మనకేం పరిచయం లేదు కదా, పుస్తకం కోసం మళ్లీ కలుస్తారా అని.''

''పరిచయందేముందండీ, చేసుకుంటే అదే అవుతుంది. ఒకే పుస్తకం కోసం ఇంత కొట్టుకుంటున్నామంటే మన టేస్టులూ కొంచెం కలవచ్చేమో...''

వాడు ఎక్కడ ఉంటాడో అడిగాను. ఇందిరానగర్‌ అన్నపూర్ణ గుట్ట దగ్గర ఉంటాడట. ఇంటి దగ్గర దింపేస్తా రమ్మని కారు ఎక్కించుకున్నాను. కార్లో మాట్లాడుకున్నాం. వాడు ఎమ్మెస్సీ అవగానే తాడేపల్లిగూడెంలో రైలెక్కి సినిమాలకు పాటలు పాడదామని హైదరాబాదు వచ్చాడు. మూడేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అట్టడుగున స్ట్రగుల్‌ అవుతున్నాడు. గెటాన్‌ కావటనికి అడపాదడపా ఆర్కెస్ట్రాలో పాడతాడు, కేటరింగ్‌కి వెళ్తాడు, ఫ్రెండ్స్‌ యూసఫ్‌గుడాలో పెట్టిన ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లో కౌంటర్‌ దగ్గర కూర్చుంటాడు. పాటలు పాడే అవకాశం ఐతే రాలేదు గానీ, రెండు మూడు అడ్రసు లేని సినిమాలకు పాటలు రాశాడు. So, he is an artist!

ఆ రోజు ఇందిరానగర్లో ఒక నాపరాళ్లు పరిచిన కారు దూరని ఇరుకు సందు ముందు వాణ్ణి దింపాను. వాడూ నాలాగే పుస్తకాల్లో మాత్రమే తారసపడే ఎన్నో అరుదైన సన్నివేశాల్నీ సినారియోల్నీ జీవితం నుంచి ఆశించే హోప్‌లెస్‌ రొమాంటిక్కే గనుక, ఎవరో తెలియనావిడ ఇలా కారులో వాణ్ణి ఇంటి దగ్గర డ్రాప్‌ చేయటమనే అనుభవంలోని అరుదైనతనాన్ని పైకి కనపడనివ్వకుండా మామూలుగా ప్రవర్తించటానికే ప్రయత్నించాడు. దిగేటప్పుడు కిటికీ లోంచి వంగి ''థాంక్స్‌'' చెప్పి, వెనుదిరిగి తన నీరెండ లోకంలోకి నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

అలా మొదలైంది. వెళ్లిన రెండో రోజే కాల్‌ చేశాను. వారం ఓపిక పట్టి కలిశాను. చాలా మాట్లాడుకునేవాళ్లం. రాత్రుళ్లు నా గది బాల్కనీలోనూ, అర్ధరాత్రుళ్లు నా రగ్గు కింద సాగే ఫోన్లలో కాలం కరిగిపోయేది. సాయంత్రాలు పార్కుల్లోనూ ఎవరూ పట్టించుకోని దేవాలయాల్లోనూ కలుసుకునేవాళ్లం. రోజులన్నీ సూర్యుడి కాంతుల్లోనూ ఆకులతో ఆడుకునే గాలిలోనూ గడిచిపోయేవి. నాన్న చనిపోయాకా హఠాత్తుగా తెగిపోయిన బాల్యం, మళ్లీ మాధవ్‌ రాకతో, ఈ మధ్య నిడివిలో అసలేమీ జీవితం గడవనట్టుగానే, తిరిగి కొనసాగినట్టనిపించేది. కొన్ని విషయాల్లో అతను అచ్చంగా నాన్నకు ప్రతిబింబం. ఒక మృదుగంభీర వ్యక్తిత్వంగా, ఆడదాని మనసుని అబ్బరంగా కాచుకోగల మగాడిగా మున్ముందు ఎదగబోయే అతనిలోని ఆ అంశల్ని నేను బీజరూపంలోనే గుర్తించాను. అవి నా వయస్సుని మర్చిపోయేలా చేసేవి. నేను నలభై దాటిందాన్నని అప్పుడప్పుడూ గుర్తొచ్చి సిగ్గేసేది. కానీ అది నాకు మాత్రమే గుర్తొచ్చేది. వాడెప్పుడూ అది ఎత్తి చూపించేలా ప్రవర్తించలేదు. వాడు వయసుకి మాత్రమే ఇరవైల్లో ఉండేవాడు, మనసుకి నాకు సరిజోడు.

కలిసిన నెల రోజులకనుకుంటా, ఒక రోజు శ్రీశైలం ప్రయాణం పెట్టుకున్నాం. వంతులుగా డ్రైవ్‌ చేసుకుంటూ, ఆగాలనిపించిన చోట ఆగి ఏదోటి తింటూ, ఒక్కోసారి ఊరికే దారిలో తారసపడ్డ ఏదో ఒక ఊరి వైనం నచ్చి చాలాసేపు అక్కడ అలా కారు ఆపేసి ఆ స్థలంలో మాకూ తట్టీతట్టకుండా తాకిన ప్రణయ స్వభావమేదో పూర్తిగా ఆకళింపు చేసుకోవటానికి ప్రయత్నిస్తూ, నిద్ర గన్నేరు నీడలు మా కారు మీంచి వెనక్కి జరిగిపోతుంటే కబుర్లలో కాలం తెలియకుండా, కాలం తెలియకుండా ఇట్టే జారిపోతుందే అన్న గుబులుతో కారు వేగం నలభై దాటనీయకుండా... సాగిపోయాం. ఘాట్‌ రోడ్డు ఇంకా ఎక్కక ముందు, దూరంగా రంగులేని కొండలు ఆహ్వానిస్తూ కనిపిస్తున్న చోట, సూర్యుడు కుంగి చల్లని నీడలు భూమంతా పాకే వేళ కారు విశ్రాంతికి ఆపాం. సంభాషణ ఏంటో గుర్తు లేదు గానీ, అది వాడు నన్ను ముద్దుపెట్టుకునేదాకా తెచ్చింది. అతి సహజంగా జరిగిపోయిందది. మేమిద్దరం అనే ద్వంద్వం ఇంకా మిగిలి ఉండటానికి మా మధ్య నడుస్తున్న ఆ సెక్సువల్‌ టెన్షనే కారణం అని ఇద్దరికీ అనిపించింది. దాన్ని తొలగించు కోవటానికే అన్నట్టు దాన్ని దాటేశాం.

రాఘవ నాలో మార్పును గమనించాడు. కనీసం ఒక చూరు కింద కలిసి ఉన్న పుణ్యానికైనా మోయాల్సిన మొహమాటపు బంధాన్ని కూడా నేను పట్టించుకోకపోవటం అతని గమనింపుకు వచ్చింది. పైగా, అతనూ నేనూ ఇంకా ఇలా ఒకే ఇంటిలో కలిసి   ఉండటం మాధవ్‌లో ఎలాంటి ఇన్‌సెక్యూరిటీల్ని తెస్తుందో అని భయపడి కాబోలు నేను రాఘవకి మరింత దూరంగా మసలుకునేదాన్ని. ఆ దూరాన్ని అక్కడ లేని మాధవ్‌కి నిరూపించటానికి నా మాటల్లో రాఘవ మీద మరింత ద్వేషం చూపించేదాన్ని. ఆ ద్వేషం ఎప్పుడో ఎలాగో నిజంగా నాలో ఇంకిపోయి నిజంగానే ద్వేషించటం మొదలుపెట్టాను. బాగా చీకిపోయిన బట్ట ఎండలో ఎండితే ఎలా పేలికలుగా ఊడొచ్చేస్తుందో అలాంటి పేలికల బంధం మిగిలింది చివరికి. కానీ నేను లెఖ్ఖచేయటం మానేశాను. ఊడితే ఊడింది అన్నట్టు, కొన్ని సార్లు అతని ముందే మాధవ్‌ ఫోన్‌ ఎత్తేదాన్ని.

జంటగా మా భవిష్యత్తు అసలు ఏమిటన్నది మాధవ్‌ నేనూ ఆలోచించేలోపలే నెలలు గడిచిపోయాయి. అసలు మొదట్లో ఆ అవసరమే కనిపించలేదు. నెలలు గడిచేకొద్దీ అవినాభావం అంతకంతకూ గాఢమైపోవటం వల్లనే మా ఇద్దరికీ జంటగా ఒక భవిష్యత్తు ఉండి తీరాలన్న అవసరం కనిపించిందేమో. వాడి వైపు నుంచి వాడికి ఏమీ అడ్డుల్లేవు. కానీ నేను మొదట్లో డెఫినిటివ్‌గా ఏదీ చెప్పేదాన్ని కాదు. రాఘవ నాకు ఒక లెక్క కాదు. విడాకులు ఇచ్చేయచ్చు. కానీ స్వప్న. దానికో భవిష్యత్తు ఉంటుందా అమ్మ తనకన్నా పదిహేనేళ్ల వయసు తక్కువవాడితో ఉంటుందంటే? అదంతా పక్కన పెట్టినా, ఏమని నేను వీడి మీద ఆధారపడగలను? ఇంకా తన లక్ష్యపు  నిచ్చెన మొదటి  మెట్ల మీదే ఉన్నాడు. మా ఖర్చులన్నీ నేనే పెట్టుకునేదాన్ని. ఈ శంకలన్నీ తలెత్తటం మొదలుపెట్టాకా, వాడితో ఉన్న సమయమంతా వాడి మాయలో బాగానే గడిచేది, కానీ వాడితో లేనప్పుడు మాత్రం తలనొప్పి పుట్టించే ఆలోచనలు చుట్టుముట్టేవి. ఒక్కోసారి అనిపించేది... వాడు మా బంధాన్ని కేవలం ఒక 'ఆంటీ'తో సరదాగా కొన్నాళ్లు గడపడంగా స్వీకరించినా బాగుండేదేమో అని. కానీ వాడు అలా కాదు. వాడు అలా కాదు కాబట్టే దీని గురించి నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను.

కానీ రాన్రానూ వాడిలో ఒక భావి పట్ల ఖచ్చితమైన అవగాహన ఉండాల్సిన అవసరం కనిపించసాగింది. మొదట్లో దాన్ని నేను నిరాకరించలేదు. క్రమేణా అవ్యక్తమైన సమ్మతి కూడా చూపించాను. చివరకు మా ప్రణాళికలు సుదూరంగా మెటీరియల్‌ రూపంలో మినుకు మినుకుమనడం కూడా మొదలైంది. స్వప్న ఇంకొన్నేళ్లలో ఎలాగో ఇల్లు వదిలి బయటి లోకంలో తన జీవితం తాను చూసుకుంటుంది. తర్వాత రాఘవ నేనూ కలిసి  ఉండటం అనేది అర్థరాహిత్యానికి సజీవ నిర్వచనంగా మిగలటమే. రాఘవకి పెద్ద తేడా ఏం ఉండదు. తన పేర్న ఆస్తులున్నాయి. విడిపోయుంటే తర్వాత పెళ్లి కూడా చేసుకునే వాడనుకోను. నా పేర్న పెళ్లప్పుడు ఇచ్చిన ఆస్తులు కొన్ని ఉన్నాయి, ఊళ్లో తమ్ముడు వాటిని చూసుకుంటున్నాదు. అవి సరిపోతాయి నాకూ మాధవ్‌కీ. ఇలా ఆలోచించేదాన్ని. అదంతా ఎలా సాధ్యమని ఆలోచించానో ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది, ఆ ప్రపంచం చాలా దూరం జరిగిపోయాకా. అలా దూరం జరిగిపోయే రోజు త్వరలోనే ఎదురైంది.

ఒకరోజు పొద్దున్నే ఏదో పనిలో ఉండగా రాఘవ బిగ్గరగా పిలిచాడు. వెళ్ళేసరికి అతను స్వప్న గదిలో ఉన్నాడు. స్వప్న కాలేజీకి వెళ్లింది. మామూలుగా మేం ఎవరం తన గదిలోకి వెళ్లం.

''ఏం ఇక్కడ ఉన్నావ్‌?'' అడిగాను. అతను స్వప్న మంచం మీద కూర్చున్నాడు. ఏదో దాచుకున్న ముఖం పెట్టుకుని.

నా ప్రశ్నకి బదులుగా అన్నట్టు లేచి వెళ్లి గోడకున్న అల్మరా తెరిచాడు. అందులో స్వప్న బట్టల కింద ఉన్న ఒక నల్లని గుడ్డ బయటకు లాగాడు. అదేమిటో వెంటనే అర్థం కాలేదు.

''ఏంటది?''

బట్టలషాపు సేల్స్‌మన్‌లా దాన్ని నా ముందు విప్పి పరిచాడు. అదో బురఖా.

''ఐతే?''

''నీకు అర్థం కావటంలేదా? దానికి బురఖా తొడుక్కునే అవసరం ఏమై ఉండొచ్చో?''

''ఛా...! ఫ్రెండుదై ఉంటుంది.''

''ఇది నేను రెండ్రోజుల క్రితమే చూశాను. దాన్ని ఫాలో అయ్యాను.'' అతను చెప్తున్నకొద్దీ నా కాళ్లు చల్లబడ్డాయి. పక్కన కుర్చీలో కూలబడిపోయాను. స్కూలయ్యాకా ఫ్రెండ్‌ ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఆలస్యంగా వస్తోంది. కానీ నిజానికి ఎవడో టీవీ ఛానెల్లో కెమెరా అసిస్టెంటుగా పనిచేస్తాడట, వాడి బండెక్కి దుర్గంచెరువు వైపు వెళ్తోందట. రాఘవ స్వప్నని ఆ రోజు మామూలుగా ఇంటికి రానిచ్చి, తర్వాతి రోజు పొద్దున్నే ముందే కనుక్కున్న ఆ కుర్రాడి ఇంటికి వెళ్లి అక్కడ వాణ్ణి కారెక్కించుకుని మార్బల్‌ ఫాక్టరీకి తీసికెళ్లి కొట్టాడట. బెదిరించి పంపించాడట. ఇప్పుడే అక్కణ్ణించి తిరిగివచ్చాడు. ఈ విషయం చెప్పి నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. 'అసలు నువ్వు పదహారేళ్ళ ఆడపిల్లకి తల్లివేనా... నీ ఫోన్లు, నీ షికార్లు, నీ వెధవ్వేషాలూ...' అంటూ. నాకు కోపం రాలేదు. ఇక్కడ అతను నన్ను బోనులో నిలబెట్టింది భార్యగా ఐతే నేను లెక్కచేసేదాన్ని కాదు, సంజాయిషీ ఇవ్వాల్సిన బరువు కూడా ఫీలవ్వను, కానీ నన్ను నేను ఎప్పుడూ ఒక మంచి అమ్మగానే చూసుకుంటూ వచ్చాను. అతను అంత తిడుతున్నప్పుడు కూడా నాకు అవేమీ వినిపించలేదు. నా స్వప్న... అన్నీ నాకు చెప్పుకుంటూ, నన్ను ఒక అందమైన అమ్మగా ఐడియల్‌గా ఊహించుకునే స్వప్న... నా నుంచి ఎప్పుడు ఎక్కడ ఎలా ఇంత దూరమైపోయిందో కూడా తెలియని స్థితిలో హఠాత్తుగా నన్ను నేను చూసుకోవాల్సి రావటం.... రాఘవ తన అక్కసంతా తీర్చుకున్నాడు. అతని భార్యనన్న స్పృహ ఎప్పుడూ మాధవ్‌తో నా అనుబంధాన్ని దోషభావం వైపు నెట్టలేకపోయింది. కానీ స్వప్న తల్లినన్న స్పృహ ముందు (ముఖ్యంగా తల్లిగా నా అసమర్థత ఇలా బయటపడ్డాకా) ఆ బంధాన్ని నేను ఏ రకంగానూ సమర్థించుకోలేకపోయాను, నన్ను నాకే సమర్థించుకోలేకపోయాను. ఆ నిశ్శబ్దాన్ని ఆసరా తీసుకుని రాఘవ చాలా రెచ్చిపోయాడు. ఏమన్నా పడ్డాను. కానీ, స్వప్న ఇంటికి రాగానే మీదపడి కొట్టాడు. స్వప్న తప్పు దొరికిపోయిందానిలా ఏం నిలబడలేదు. ముందు నా అల్మరాలో చేయిపెట్టడానికి నువ్వెవడివని దెబ్బలాడింది. వాణ్ణి ప్రేమిస్తున్నానంది. రాఘవ మరింత రెచ్చిపోయాడు. ఇంక నేను నిశ్శబ్దంగా ఉండలేదు. అతణ్ణి  నిలువరించటానికి నా  దగ్గరా  ఆయుధాలున్నాయి. ఎక్కడ  ఉంచాలో అక్కడ ఉంచేట్టు మాట్లాడాను. అరుచుకుంటూ బయటికి వెళిపోయాడు. ఆ రాత్రంతా స్వప్నని దగ్గర కూచోబెట్టుకుని మాట్లాడాను. తను ఆ కుర్రాడి గురించి చాలా చెప్పింది. అవి నా వయసు మైలురాయి దగ్గర నిలబడి చూస్తే చాలా సిల్లీ రీజన్స్‌ ప్రేమించటానికి. ఎలా ఏం చేశానన్నది అంతా ఇక్కడ అనవసరం. కానీ వాడు నిజంగా ఏంటో నిరూపించి (నిరూపించాననుకొని) స్వప్నను మళ్లీ నాకు దక్కించుకోవటానికి నెల పట్టింది.

స్వప్న ఒక ఆరేడేళ్లలో తన జీవితం తను చూసుకోగల స్థితికి వచ్చేస్తుందిలే అనుకున్నానే గానీ, ఆ ఆరేడేళ్ల జీవితం తనకి ఎంత ముఖ్యమో గుర్తించలేకపోయాను. కాని ఆ గుర్తించే స్థితి ఎప్పుడైతే వచ్చిందో, మాధవ్‌తో నా అనుబంధం ఎప్పటికైనా చేరగల పర్యవసానాల్ని నిజాయితీగా వాస్తవలోకపు ప్రమాణాలతో తూచగల స్థితి కూడా వచ్చింది. ఎప్పటికైనా స్వప్న దీన్ని ఒప్పుకోగలుగుతుందా; స్వప్న సంగతి వదిలేస్తే, చుట్టూ సమాజం; ఎక్కడికో పోయి అడవిలో ఐతే బతకలేంగా, చివరికి నా కుటుంబం, వాళ్లేమనుకుంటారు, ఇలా వాస్తవం ఒక వెనక్కిపోని కెరటంలా నన్ను కమ్మేసింది. నెమ్మది నెమ్మదిగా మాధవ్‌తో మాట్లాడే వీలు చాలా తగ్గిపోయింది. ఫోన్లు కట్‌ చేయటం మొదలుపెట్టాను. చివరికి ఇదిగో... ఒక రోజు తిన్నగా నా కాలేజీకి వచ్చేస్తే ఇక తప్పలేదు. కారు నడుపుతున్నంతసేపూ నేను రోడ్డుని అతి శ్రద్ధగా చూసాను. నా వైపే చూస్తున్న వాడి కళ్ళల్లోని అపురూపం- అటు చూడకపోయినా తెలుస్తూనే ఉంది.

కాలేజీ పక్కన కాలనీలో ఈట్‌ స్ట్రీట్‌ లాంటిది ఉంది. ఒక చిన్న డెడ్‌ ఎండ్‌ సందు. దాన్ని మొత్తం ఒక రెస్టారెంటు వాళ్లు అద్దెకు తీసుకున్నారు. సందు మొత్తం ఆస్ఫాల్టు పరిచి, పెద్ద రంగుల గొడుగుల కింద నాలుగేసి కుర్చీలతో టేబిళ్లు దూరం దూరంగా ఏర్పాటు చేశారు. రాత్రిళ్లయితే ఆ చోటు చాలా సందడిగా ఉంటుంది. మేం వెళ్లింది మధ్యాహ్నం కాబట్టి చాలా తక్కువమంది ఉన్నారు. కారు పార్క్‌ చేసి ఇద్దరం ఓ గొడుగు కిందకి చేరి కూర్చున్నాం.

''ఏమన్నా తింటావా,'' అడిగాను.

తల నిశ్శబ్దంగా అడ్డంగా ఊపాడు.

నాకు ఊరికే ఎదుట కూర్చుని జడ్జి చేయబడాలని అనిపించలేదు. ''నాకు ఆకలి వేస్తుంది,'' మెనూ తిరగేసి వెయిటర్ని పిలిచి ఏదో ఆర్డరిచ్చాను. అప్పుడు కళ్లల్లోకి చూశాను. ''ఏంటి?''

ఏమీ లేదన్నట్టు కళ్లెగరేసి, ''నువ్వే చెప్పు,'' అన్నాడు.

నేను డిఫెన్సివ్‌ క్షణాల్లో మరీ అఫెన్సివ్‌గా స్పందిస్తాను. ''ఏమీ లేకపోతే ఎందుకు నా పని చెడగొట్టడానికి ఆఫీస్‌దాకా వచ్చావ్‌?''

''ఏమీ లేనిది నా దగ్గర. నీ దగ్గర కాదు. నీలోపల ఏదన్నా నా పట్ల ఉంటే కక్కేయి. దాచుకుని ఇలా చేయకు. బాధగా ఉంటుంది.''

''ఎలా చేస్తున్నా?''

ఫోన్స్‌ ఎందుకు అటెండ్‌ కావటం లేదని అడిగాడు.

నేను చెప్పటం మొదలుపెట్టాను. స్వప్న గురించి, జరిగిన విషయం అంతా చెప్పాను. అతను ఊరికే కూర్చుని విన్నాడు, నా కళ్లల్లోకి చూస్తూ. చివరికి అన్నాడు. విడిపోవాల్సిన అవసరం ఏముందని. స్వప్న జీవితంలో సెటిలయ్యేదాకా ఎదురుచూస్తానని.

అతను దీనికి కూడా సిద్ధపడ్డాకనే, నాకు అర్థమైంది. నా అడ్డం స్వప్న కూడా కాదు, నా అడ్డం సమాజం. ఇది ఎటూ చేరలేని బంధం. ఈ బంధాన్ని నిలుపుకోవాలంటే ఎన్నో ఎదుర్కోవాలి. మగవాడిగా అతనికి ఫర్లేదు. ఆడదానిగా నన్ను నేను ఆ స్థానంలో ఊహించుకోలేకపోతున్నాను. కానీ ఈ వేరే అభ్యంతరాలేవీ అతనికి చెప్పలేదు. అతణ్ణి దూరం చేసుకోవటానికి నా అమ్మతనమే ఒక ఆదర్శవంతమైన కారణం అనిపించింది. మిగతావన్నీ భయాలు. అతణ్ణి నెట్టేయటంలో నేను ఆదర్శవంతంగా మాత్రమే కనపడదల్చుకున్నాను. భయస్థురాలిలా కాదు.

''నేను నీకు ఏదీ ప్రామిస్‌ చేయలేను మాధవ్‌. స్వప్న నాకు ముఖ్యం. ఇది దాని లైఫ్‌లో చాలా ముఖ్యమైన సమయం. నేను దాన్తో ఉండాలి. దాన్ని పెంచాలి. చదివించాలి. మంచి ఉద్యోగంలో స్థిరపడేలా చేయాలి. మంచోడ్ని చూసి పెళ్లి చేయాలి. దానికన్నా మహా ఐతే పదేళ్లు పెద్దవాడివి, నిన్ను పక్కన పెట్టుకుని కన్యాదానం చేయలేను కదా. అది చాలా నీచం. నీకెందుకు అర్థం కావటం లేదో నాకర్థం కావటం లేదు.''

ఈ వాదన తిరుగులేనిది. అని నాకు తెలుసు. కానీ వాడికి నా మనసు నాకన్నా బాగా తెలుసు. నా భయాలూ, నా పిరికితనాలూ అన్నీ తెలుసు. తిరుగులేనిది కనుకనే ఈ వాదన ఎన్నుకున్నానని కూడా, బహుశా, తెలుసు.

కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఇక నేను జవాబు చెప్పలేని ప్రశ్న తీసుకొచ్చాడు. ''మరెందుకు దీన్ని ఇక్కడిదాకా తీసుకొచ్చావ్‌?''

''ఇక్కడిదాకా నిన్నూ నన్నూ ఎవరూ తీసుకురాలేదు. మనం వచ్చాం. కలిసి వచ్చాం. అంతే!''

''అవును, కానీ ఊరికే ఎవరి దారిన వాళ్లం నడుస్తూ రాలేదు కదా. ఈ ప్రయాణంలో కొన్ని ప్రామిసెస్‌ ఒకరికొకరం చేసుకున్నాం. అన్నీ మాటల ద్వారా జరిగేవే కాదు. మన ప్రతి పనిలోనూ ఒక ప్రామిస్‌ కూడా ఉంటుంది.''

''అలా నేనేదో నిన్ను నట్టేట్లో ముంచినట్టు మాట్లాడొద్దు. నన్ను నేను ముంచుకుంటున్నాను. నీకేంరా. నీకు ముందు జీవితం ఉంది. నువ్వు బాగుంటావు. మున్ముందు ఇదంతా మహా అయితే ఓ ముల్లు దిగిన సలుపు, అంతే.''

''దయచేసి అలా సముదాయిస్తున్నట్టు మాట్లాడకు. బిట్టర్నెస్‌ ఈస్‌ బెటర్‌. విడిపోతున్నప్పుడైనా నా వంతు డిగ్నిటీ నాకు మిగుల్చు.''

ఇంకేం అనగలను. వాడికి సముదాయింపైనా అందుతోంది. మరి నాకు అదీ లేదు. ఇంకా అన్నాడు:

''ఎన్ని ఊహించుకున్నాంరా. అప్పుడంతా నాతోనే ఉన్నావు కదా. ఇద్దరం కలిసే కన్నాం కదా కలలు.''

మరో జవాబు లేని ప్రశ్న ఇది. కానీ ఎంతసేపని బోనులో నిలబడను. అసహనం పెట్రేగింది:

''అవన్నీ కలలేరా. నీకు అవి సరిపోతాయి. నీకు ఇంకా బాధ్యత అంటే ఏంటో తెలీదు. ఊరికే రూపం పాడూ లేని ఆశల్ని జేబులో పెట్టుకుని రోడ్ల మీద తిరిగేస్తూ జీవితం గడిపేయొచ్చు అనుకుంటున్నావు. జీవితం అలా ఉండదు నాన్నా. ఇద్దరు కలిసి బతకటం అంటే ఏమిటనుకుంటున్నావు, ఎన్ని లెక్కలోకి వస్తాయనుకుంటున్నావు. ఇప్పుడు ఇక్కణ్ణించి బయటకి వెళ్ళేటప్పుడు బిల్లు కట్టాలన్నా నేనే కట్టాలి. నీకు డబ్బులు బాధ్యతగా దాచుకోవటం అనే కాన్సెప్టే తెలీదు. ఎలా పోషిస్తావు నన్ను. పైగా మనం కలిసిబతుకుతాం అని ఊహలో ఏవో ఊహించుకోగానే సరిపోదు, అది ఒక వాస్తవంగా ఈ కాలంలో ఈ సమాజంలో ఈ మనుషుల మధ్య రియలైజ్‌ కాగలదా లేదా అన్నది కూడా ఆలోచించుకోవాలి. ఎక్కడ బతుకుతాం మనం. ఇప్పుడంటే ఫర్లేదు. ఇంకో ఐదారేళ్లు పోతే నిజంగానే నీకు అమ్మలా కనపడతా నేను. ఇరుగుపొరుగు దృష్టిలో అభాసుపాలు కాకుండా ఉండాలన్నా మన బంధానికి ఏదో ఒక అబద్ధపు ముసుగు వేయాలి. నీక్కూడా ఇప్పుడు కనపడినంత అందంగా నేను ఎప్పటికీ కనపడకపోవచ్చు. నా శరీరం నీకు ఇప్పుడు పనికి వచ్చినట్టుగా ఎప్పటికీ పనికి రాకపోవచ్చు. చివరికి ఒక రోజున ఇంట్లో నేనుండగానే ఎవర్నో నిన్ను తృప్తిపరచగలదాన్ని తెచ్చుకుంటావు. జీవితంలో ఒంటరిగా నడవలేని, నడిచి గెలవలేని నీ అసమర్థతని ఇలాగే ఎన్నాళ్లకీ ఓ స్ట్రగులింగ్‌ ఆర్టిస్టు పోజుతో కప్పిపుచ్చుకుంటావు. నేను మాత్రం నువ్వు బయటకు వెళ్లేటప్పుడల్లా నీ జుట్టు పాపిడి తీసి, నీ జేబుని బరువైన పర్సుతో నింపి పంపిస్తుంటాను. అదేనా నీ ఊహ? బహుశా అందుకేనా నన్ను కావాలనుకుంటున్నావు?'' మా వీడ్కోలు నాక్కూడా బాధాకరమైనదే అని అతను ఒప్పుకోవాలనుకున్నాను. కానీ ఈ బంధాన్ని హతంచేస్తున్న హంతక స్థానంలో నన్ను పెట్టి మాట్లాడుతుంటే, ఎందుకో ఇలా ఉప్పెనలా నాలో ఇన్‌సెక్యూరిటీస్‌ అన్నీ బద్దలై బయటకు వచ్చేశాయి. వాటితో ఎన్నో చీకటి మూలల్లో నేను ఒంటరిగా పోరాడాను. ఇప్పుడిక నాకు వాడూ అక్కర్లేదు, వాడితో పాటూ అవీ అక్కర్లేదు. అన్నీ బయటకు పారేశాను, వాడి మీదకు విసిరేశాను.

వాడు నిశ్శబ్దమైపోయాడు. కాసేపు ఏం మాట్లాడలేదు. చివరికి జేబులోంచి రెండొందలు తీసి బల్ల మీద కొట్టినట్టు పెట్టాడు. ''ఈ ఆఖరుసారైనా బిల్లు నేను పే చేస్తాన్లే.'' కుర్చీ వెనక్కు నెడుతూ లేచి నిలబడి, ''థాంక్యూ, ఇప్పుడంత బాధగా కూడా ఏం ఉండదు,'' అని నడుచుకుంటూ వెళిపోయాడు. ఆ క్షణంలో అది చివరి కలయిక అని వెంటనే గుర్తు రాలేదు. ఒక ఆడదాన్ని టేబిల్‌ ముందు ఒంటరిగా వదిలేశాడన్న చిరాకే ఉండింది. కాసేపు కాన్షస్‌గా ఎవరైనా చూస్తున్నారా అని అటూ ఇటూ చూశాను. బిల్‌ పే చేశాను. బయటకు వచ్చి కారు తలుపు తీస్తూ వాడు వెళ్లిన వైపు చూశాను.

జీవితంలో నేను ఎరిగిన ఏకైక ప్రేమానుభవం నన్ను విడిచి నడిచిపోతోంది, దూరంగా చుక్కలా.

అంతే, అంతా కలిపితే.

ఇంతా రాశాకా ఇందులో కథేముందీ అనిపిస్తోంది. నేను కొట్టిన దెబ్బకి తట్టుకోలేక వాడు తన ఒంటరి గదిలో ఉరేసుకున్నాడని చెప్తే కథకి సరైన ముంగిపు ఉండేదేమో. లేదా కనీసం నేనే ఉరేసుకున్నాననీ, ఈ కథ రాస్తోంది ఓ భూతమనీ చెప్తే అన్నా కథకి మంచి ట్విస్టుగా పనికొచ్చేదేమో. ఓ రకంగా ఈ రెండో మాట నిజమే. ఐయాం డెడ్‌, మోర్‌ ఆర్‌ లెస్‌!

(మరీ అంత పెద్ద ట్విస్టయితే ఏం లేదు కానీ, ఓ చిన్న ట్విస్టు మాత్రం ఉంది. ఎవణ్ణించైతే స్వప్నను రక్షించానని అనుకున్నానో, చివరికి వాణ్ణే స్వప్న రెణ్ణెల్ల క్రితం ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాకా, ఆ విషయం ఫోన్లో చెప్పింది. రాఘవ ''అది నా వరకూ చచ్చిపోయిందానితో సమానం.'' అన్నాడు. నేను మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్లాను. కుర్రాడు గౌరవంగానే మాట్లాడాడు గానీ, వాడి మాటల్లో గెలుపు స్పష్టంగా కనపడింది. స్వప్నని బాల్కనీలోకి తీసుకెళ్ళి ఏం కష్టమొచ్చినా అమ్మని నేనున్నానని మర్చిపోకని చెప్పాను. అది నవ్విందంతే!)

మాధవ్‌ ఇప్పటికీ అడపాదడపా ఏదో టీవీ ప్రోగ్రాంలలో పాడుతూ కనిపిస్తూంటాడు. వాడి గొంతులో ఇప్పటికీ అదే ప్రాణం పెట్టి పాడేతనం. కళ్లు మూసుకుని లీనమైపోయి రాగాన్ని తన నరాల మీదే పలికిస్తున్నట్టు పాడతాడు. ఏదో సీరియల్‌ అయిపోయాకా స్క్రోలింగ్‌ టైటిల్స్‌లో వాడి పేరు సంగీత దర్శకుడిగా కూడా కనపడింది. మొన్నా మధ్య  ఫేస్‌బుక్‌లో వెతికితే కనపడ్డాడు. వాడి రిలేషన్‌షిప్‌ స్టేటస్‌లో ''ఇన్‌ రిలేషన్‌షిప్‌'' అని

ఉంది. ఆత్రంగా ఫోటోలు వెతికాను. ఏదో ట్రిప్పుకి వెళ్లినప్పుడు తీసుకున్నవనుకుంటా. వెనకాల ఏదో పెద్ద రిజర్వాయరు కనిపిస్తుంది ఆకాశపు అంచు దాకా పాకి. వాడు ఎవరో ఒకమ్మాయి భుజం చుట్టూ చేతులేసి నవ్వుతున్నాడు. కెమెరా లెన్స్‌ వైపు చూస్తూ, నా వైపు చూస్తూ.

— * —

(ఇది కినిగె పత్రికలో వై. విశారద పేరు మీద పబ్లిష్ అయింది (2014). ఆడ పేరుతో రాయటానికి పెద్ద కారణాలేం లేవు. పాఠకులు నా పేరు చూసి ఒక మగవాడు ఆడగొంతుతో ఎలా రాసి వుంటాడనే అంచనాతో కథ చదవటం మొదలుపెట్టడం నాకు ఇష్టం లేక.)