July 18, 2014

'జీవించిన గంట' - కేట్ చోపిన్

మిసెస్ లూసీ మల్లార్డ్‌కి గుండెజబ్బు ఉందని ముందే తెలుసు కాబట్టి ఆమె భర్త చనిపోయాడన్న వార్తని ఆమెకి వీలైనంత జాగ్రత్తగా చెప్పాలని ప్రయత్నించారు అందరూ.

దాయబోతూనే విషయాన్ని వెల్లడించే పొడి పొడి మాటల్లో ఆమెకు ఈ వార్తను ఆమె అక్క జోసెఫీన్ చెప్పింది. అప్పుడు ఆమె భర్త ఫ్రెండ్‌ రిచర్డ్ కూడా అక్కడే ఉన్నాడు. అతను పొద్దున్న న్యూస్‌పేపరు ఆఫీసులో ఉన్నప్పుడే ఆ రైలు ప్రమాదం గురించిన వార్త తెలిసింది, ఆ ప్రమాదంలో చనిపోయినవాళ్ల జాబితాలో మొదట ఉన్నది బ్రెంట్లీ మల్లార్డ్‌ పేరే. ఆ వార్తని మరో టెలిగ్రాంతో ఖాయం చేసుకునే దాకా మాత్రమే రిచర్డ్ అక్కడ ఆగాడు. ఆ టెలిగ్రామ్‌ అందీ అంద గానే–– ఈలోగా తనంత జాగ్రత్తా అక్కరా లేని మరెవరైనా ఫ్రెండ్‌ ద్వారా ఈ దుర్వార్త ఆమెకు చేరుతుందేమో అన్న కంగారులో–– ఉరుకులు పరుగుల మీద బయల్దేరాడు.

ఇలాంటి వార్త విన్న చాలామంది ఆడాళ్ళు దాని అర్థం కూడా గ్రహించలేనంతగా కొయ్యబారిపోతారు. ఆమె మటుకు వార్త విన్న మరుక్షణమే భోరుమని ఏడుస్తూ అక్క చేతుల్లో వాలిపోయింది. ఏడ్చీ ఏడ్చీ ఏడుపంతా అణగారి పోయే దాకా ఏడ్చి, ఆ తర్వాత అలాగే లేచి ఒక్కత్తే తన గదిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. తన వెనకాల ఎవ్వరినీ రావద్దంది.

గది లోపల తెరిచిన కిటికీ ముందు సౌకర్యంగా ఒక కుర్చీ వేసి ఉంది. తన శరీరాన్ని కమ్మేసిన అలసట మనసులోకి కూడా పాకిపోతున్నట్టు ఎంతో బరువుగా అనిపించి కుర్చీలో అలాగే కూలబడిపోయింది.

కిటికీ లోంచి చెట్ల చిటారు కొమ్మలు వసంతపు చివుళ్ళతో ఊగుతూ ఆమె కంటపడ్డాయి. మత్తెక్కించే వాన వాసనేదో గాలిలో మసలుతా ఉంది. కింద వీధిలో తోపుడుబండి మీద సరుకులమ్మే మనిషి గట్టిగా అరుస్తున్నాడు. దూరంగా ఎవరో పాడుతున్న పాట వినీ వినపడనట్టు చెవుల్ని తాకుతోంది. చూరు దూలాల్లో గూడుకట్టిన పిచ్చుకలు ఉండుండి కిచకిచమంటున్నాయి.

కిటికీ ఎదురుగా పశ్చిమం వైపు మేఘాలు ఒకదానిలో ఒకటి కలుస్తూ, ఒకదానిపై ఒకటి పేరుకుంటూ ఉన్నాయి. వాటి మధ్య ఖాళీల్లోంచి ఆకాశం అతినీలంగా కనిపిస్తోంది.

ఆమె కుర్చీ మెత్త మీద తల వేలాడేసి కదలకుండా కూర్చుంది, ఆగి ఆగి వెక్కిళ్ళు వస్తున్నాయి, ఏడుపు లోనే నిదరపోయి కలల్లో కూడా వెక్కే పసివాడి వెక్కిళ్ళ లాగ.

ఆమె వయసు తక్కువే, మంచి చాయతో ప్రశాంతంగా కనిపించే ముఖం. ఆ ముఖం మీది గీతలు నిగ్రహాన్నీ, ఒకలాంటి స్థైర్యాన్నీ చూపెడతాయి. కానీ ఇప్పుడు ఆమె కళ్లు అభావంగా ఉన్నాయి, దూరాన మేఘాల మధ్య ఆకాశాన్ని చూస్తున్నాయి. అది ఆలోచించే చూపు కాదు, ఆలోచనలు గడ్డకట్టిన చూపు.

ఆమె వైపు ఏదో వస్తోంది, ఆమె దాని కోసం ఎదురు చూస్తోంది, భయపడుతూనే. ఏమిటది? ఏమిటో తెలీటం లేదు; దానికో పేరు పెడదామంటే అందటం లేదు. కానీ అది ఆకాశం లోంచి మొదలై, గాలిలో ఆవరించి ఉన్న వాసనలూ శబ్దాలూ రంగుల గూండా, తన వైపు రావటం ఆమెకు తెలుస్తోంది.

ఉన్నట్టుండి ఆమె గుండెలు ఎగసి పడటం మొదలైంది. తనను ఆవహించబోతున్నదేమిటో ఆమె మెల్లగా అర్థమవుతోంది, ఆమె ప్రయత్న బలంతో దాన్ని వెనక్కి తరమాలని ప్రయత్నిస్తోంది — ఆమె తెల్లటి సన్నటి చేతులకి అంత శక్తి లేకపోయినా. ఇక ఆమె వల్లగాక, కాస్త పట్టు సడలగానే, చిన్నగా తెరుచుకున్న ఆమె పెదాల మధ్య నుంచి ఒక పదం బయటపడింది. ఆమె ఆ పదాన్ని తన ఊపిరి కంటే సన్నగా పదే పదే గొణిగింది: “స్వేచ్ఛ, స్వేచ్ఛ, స్వేచ్ఛ!” అంతకుముందున్న అభావమైన చూపూ, ఆ తర్వాత ఆక్రమించిన భయమూ మెల్లగా ఆమె కళ్లను వీడి వెళ్లిపోయాయి. ఇప్పుడా కళ్ళు సూటిగా వెలుగుతున్నాయి. ఆమె నాడి వేగంగా కొట్టుకుంది, ప్రవహిస్తున్న రక్తం ఆమె ఒంటి లోని ప్రతీ అంగుళాన్ని వెచ్చబరిచి నిమ్మళించేలా చేస్తూంది.

తనను ఆక్రమిస్తున్నది రాక్షసానందం కాదా అన్న అనుమానం ఆమెకు కలగలేదు. ఒక స్పష్టమైన ఉన్నతమైన చూపు ఆ అనుమానాన్ని కొట్టిపడేసింది. ఆమెకు తెలుసు తను మరలా ఏడుస్తానని–– భర్త మెత్తటి దయగల చేతులు నిర్జీవంగా అతని ఛాతీ మీద వాలి కనపడినప్పుడూ; తనని ఎప్పుడూ ప్రేమగా తప్ప మరోలా చూడని ఆ ముఖం మరణంతో పాలిపోయి కనపడినప్పుడూ… తను మరలా ఏడుస్తుంది. కానీ ఆ శోకమయమైన కాలం తర్వాత దానికి ఆవలగా ఇక పూర్తిగా తనకు మాత్రమే చెందిన సంవత్సరాలెన్నో బారులు తీరి కనపడుతున్నాయి. వాటిని ఆహ్వానిస్తున్నట్టు ఆమె తన చేతుల్ని విశాలంగా చాపింది.

ఆ తర్వాత రాబోయే సంవత్సరాల్లో తను ఇంకెవరి కోసమూ బతకక్కర్లేదు; తన కోసమే బతుకుతుంది. తమకి మాత్రమే పరిమితమైన ఇష్టాయిష్టాల్ని తోటి మనిషి మీద మోపటాన్ని ఒక హక్కు లాగ భావిస్తారు స్త్రీ పురుషులు. అలా మోపటం మృదువుగా చేయనీ, మొండిగా చేయనీ, దాని వెనక ఉద్దేశం ఏదైనా అది అందు లోని దోషం పాలు తగ్గించదని ఆమె ఈ క్లుప్తమైన ప్రకాశవంతమైన క్షణంలో గ్రహించింది. ఇప్పుడిక ఏ మొండి బలమూ తన ఇష్టాయిష్టాల్ని అణచబోదు.

ఏమైనా గానీ– ఆమె అతడిని ప్రేమించింది, కొన్నిసార్లు. ప్రేమించలేదు కూడా, చాలాసార్లు. ఇప్పుడా లెక్కలతో ఏం ఒరుగుతుంది! ఇప్పుడు నేను నాకు మాత్రమే చెందుతానూ అన్న ఈ ఫీలింగ్‌ తో పోలిస్తే, అర్థంకాని చిక్కుప్రశ్న లాంటి ఆ మాయదారి ప్రేమ విలువ ఏపాటిది! నేను నాకు మాత్రమే సొంతం అన్న ఈ ఫీలింగ్‌ తన ఉనికి మొత్తం మీద అత్యంత బలమైన వాంఛ అని ఆమె ఇప్పుడే గ్రహించింది.

“స్వేచ్ఛ! శరీరానికీ మనసుకూ స్వేచ్ఛ!” అని గొణుగుతా ఉంది.

ఇంతలో జోసెఫీన్ తలుపు బయట వంగి నోటిని తాళం కన్నం దగ్గర పెట్టి తనను లోనికి రానివ్వమని బతిమాలుతోంది. “లూసీ తలుపు తీయి! అమ్మ కదూ; తలుపు తీయి– నువ్వి లాగే ఉంటే ఆరోగ్యం పాడు చేసుకుంటావు. లోపల ఏం చేస్తున్నావు లూసీ? దయచేసి తలుపు తీయి.”

“వెళ్లిక్కణ్ణించి. నేనేం ఆరోగ్యం పాడు చేసుకోవటం లేదు.” 

ఇంకా నయం! సాక్షాత్తూ జీవనామృతాన్నే తాగుతుంటే, ఈ తెరిచిన కిటికీ నుంచి!

ఆమె ఊహలు ముందు పరుచుకున్న రోజుల్లోకి కేరింతలు కొడుతూ పరిగెడుతున్నాయి. వసంత కాలం రోజులు, వేసవి కాలం రోజులు, ఇక అన్ని కాలాల రోజులూ ఆమెకే సొంతం. తను ఎక్కువ కాలం బతకాలని చిన్నగా ప్రార్థించింది– నిన్నటి దాకా ఆ ఊహకే వణికిన ఆమె!

అక్క అదేపనిగా బతిమాలగా బతిమాలగా ఆమె తాపీగా లేచి వెళ్ళి తలుపు తీసింది. ఆమె కళ్లు గెలుపు జ్వరంతో వెలుగుతున్నాయి, తనకు తెలీకుండానే గెలుపు దేవత లాగ నడుస్తోంది. నడుస్తూ వచ్చి అక్క నడుము చుట్టూ చేయి వేసింది, ఇద్దరూ కలిసి మెట్లు దిగుతున్నారు. రిచర్డు మెట్ల కింద ఎదురుచూస్తున్నాడు.

ఈలోగా ముందుగుమ్మం తలుపుని ఎవరో బయట నుంచి తెరుస్తున్న చప్పుడు... బ్రెంట్లీ మల్లార్డ్ లోపలికి వచ్చాడు. ప్రయాణం అలసటతో, సూట్‌కేసును హుందాగా ఊపుకుంటూ, చంకలో గొడుగు పెట్టుకుని. అతను రైలు ప్రమాదం జరిగిన చోటుకి చాలా దూరంలో ఇంకెక్కడో ఉన్నాడు, అసలు ప్రమాదం జరిగిందన్న సంగతే అతనికి తెలియదు. ఇంట్లోకి రాగానే తనకి అందిన స్వాగతం చూసి ఆశ్చర్యపోయాడు– జోసెఫీన్ కెవ్వున అరవటం, తన భార్యని కనుమరుగు చేస్తూ రిచర్డు ముందుకు దూకటం. 

డాక్టర్లు వచ్చాకా ఆమె చావుకి కారణం గుండెపోటని తేల్చారు — సంతోషం తట్టుకోలేక వచ్చిన గుండెపోటని.

* * *

(ఇది కేట్ చోపిన్ 1894లో రాసిన “The Story of an Hour” అన్న కథకు అనువాదం. కినిగె పత్రికలో వేరే పేరు మీద ప్రచురితమైంది.)

0 comments:

మీ మాట...