December 4, 2019

రాజి

ఆ చిన్న పెంకుటింట్లో ఇంక నిద్రపోయే టైము.  అమ్మ వాకిట్లో అంట్లు తోముతోంది.  నానమ్మ గచ్చు మీద కూర్చుని చుట్ట కాలుస్తుంది.  తమ్ముడు ఇలా మంచమెక్కాడో లేదో నిద్రపోయాడు.  రాజేశ్వరి కూడా పుస్తకాలు గూట్లో సర్దేసి మంచమెక్కబోతుంటే, అప్పుడు గుర్తొచ్చాయి...  గబగబా గుమ్మం దగ్గరకెళ్ళి చూసింది, దొడ్డిగుమ్మం దగ్గరా చూసింది; ఎక్కడా లేవు, కొత్త చెప్పులు. 

పొద్దున్న ఎక్కడెక్కడ తిరిగిందీ గుర్తు తెచ్చుకుంది. గ్రంథాలయం! అవును, బడి నుంచి వచ్చేటప్పుడు అక్కడ కాసేపాగి పుస్తకాల్లో బొమ్మలు చూసింది. 

“ఏంటే నిలబడ్డావ్, పోయి పడుకో,” అమ్మ గిన్నెలతో వంటగది వైపు వెళ్తోంది.

“అమ్మా, నా కంపాస్ బాక్సు సుజాత కాడ ఉండిపోయిందే.”

“ఇప్పుడేటి, రాత్రి? రేప్పొద్దున్న తెచ్చుకుందూ గాని.”

“దాన్తో పనుందే,” అంటూ గబగబా మెట్లు దిగేసి వాకిట్లోకి నడిచింది.

ఇక దడి దాటేస్తుందనగా, నానమ్మ అరిచింది, “ఏయ్, ఎక్కడికే ఇంత రాత్రేళ?”

రాజేశ్వరి వెనక్కి తిరిగి గుమ్మంలోకి చూసింది, అమ్మ వంటింట్లో ఉన్నట్టుంది, అప్పుడిక నానమ్మని లెక్కచేయక్కర్లేదు, “నీకెందుకూ?” అంది.

“ఆయ్!  కారెక్కిపోయున్నావ్ బాగాని!  మీ నాన్న పొద్దున్న డూటీ కాణ్ణించి రానీ, చెప్తాన్నీ పని...  అర్ధరాత్రి పూట యీదులమ్మటా తిరుగుళ్ళేంటో అన్నీని...” ఇంకా ఏదో అంటూనే వుంది.  రాజీ వీధిలో నిలబడి, గౌను అంచుల్ని విసనకర్రలా విప్పార్చి పట్టుకుని, సినిమాల్లో రాధలాగ కొన్ని స్టెప్పులేసింది, నానమ్మ కోసం. 

“లంజికానా,” అని అరిచింది నానమ్మ.  “ఏమే, మంగా,” అని లోపలికి పిలిచింది.  రాజీ అప్పటికే పరిగెత్తింది. 

చెప్పులుపోతే?  నాన్నకి తెలిస్తే...?  తిట్టడు, కానీ బాధపడతాడు.  ఎంత పోరుపెట్టి కొనిపించుకుందీ.  ఎన్నిసార్లడిగినా కొనకపోతుంటే ఉక్రోషం వచ్చేసింది. పిన్నీసుతో పొడుచుకుని కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటున్నాయని చూపిద్దామా అని కూడా ఆలోచించింది.  కానీ మొన్న ఆదివారం నాన్న తనంతట తనే సైకిలెక్కించుకుని సెంటర్లో చెప్పుల షాపుకి తీసుకెళ్లాడు.  నల్ల రంగు జత, బెల్టుకలిసే చోట బంగార్రంగు రింగు...  అవి చూడగానే ఇంకేం నచ్చలేదు.  తర్వాత బళ్ళో ఫ్రెండ్స్ కూడా “ఏ షాపులో కొన్నావే, ఎంతే” అని తెగ అడిగేరు.... 

“ఉండుంటాయా, దొబ్బేసుంటారా?  గ్రంథాలయం నుంచి ఇంత దూరం బోసికాళ్ళతో నడిచొచ్చినా తెలీలేదు చూడు! చెప్పులవసరమా నాలాంటి ఏబ్రాసి దానికి!”

పెద్ద వీధిలోకి వచ్చాక పరుగాపింది.  వీధిలైటు దగ్గర కుక్కలున్నాయో లేవో చూసుకుని, మళ్ళీ నడిచింది.  చల్లావారి వీధిలోంచి ఈ వీధిలోకి ఏదో లైటింగు పడుతోంది.  ఆగి చూసింది.  వీధి చివార్న  టెంటు కింద నల్లబట్టల్లో స్వాములు.  పడిపూజ.  నేతి వాసన.  ఆగి దణ్ణం పెట్టుకుంది, “స్వామియే శరణం అయ్యప్ప.  నా చెప్పులు కాపాడు స్వామీ!”  పెద్ద వీధి దాటే దాకా ఎవరూ కనపళ్ళేదు.  చివర బడ్డికొట్టు మటుకు తెరిచే ఉంది.  ఎడం వైపు తిరిగి, పోస్టాఫీసు దాటి, ఆంధ్రా బేంకు దాటితే, తర్వాత వచ్చే చిన్న మేడ గ్రంథాలయం. 

లైట్లు లేక ఈ వీధిలో వెన్నెల బాగా తెలుస్తుంది.  చప్పుడు కాకుండా గ్రంథాలయం గేటు తీసి వెళ్ళింది.  హమ్మ! కనపడ్డాయి...  విడిచిన చోటే, బుజ్జిముండలు. 

చెప్పుల్లో కాళ్ళు పెట్టి, వెనక్కి తిరిగే లోపల- ఎవరివో మాటలు వినపడ్డాయి.  ఆడాళ్ళ మాటలు, నవ్వులు...  గ్రంథాలయం పక్క సందులోంచి.  గోడవారన నక్కుతూ ఆ సందు వైపు వెళ్ళింది.  తలమాత్రం వొంచి చూసింది.  ఒక ఆడామె వీపు వెనక చేతులు ముడుచుకొని ప్రహరీగోడకి ఆనుకుని నిలబడింది.  ఒక మగతను ఆ గోడకే చేయానించి, ఆమె వైపు కొద్దిగా వొంగి మాట్లాడుతున్నాడు.  అతను బిల్డింగు నీడలో ఉన్నాడు, ఆమె ముఖం మీద మాత్రం వెన్నెల పడుతోంది.  అతను రెండో చేత్తో నడుం దగ్గర ముట్టుకోబోతే, ఆమె వీపు వెనక నుంచి (గాజుల చప్పుడుతో) చేతులు తీసి, అతని చేయి తోసేసింది.  అతను ముఖం మీదకి వొంగాడు, ఆమె సిగ్గుతో తల తిప్పి... రాజీని చూసింది. 

రాజీ వెర్రి కేక పెట్టింది.  మగతను ఇటు కదిలాడు.  రాజీ ఒకే పరుగు...  గేటులోంచి దూసుకెళ్ళి, ఆంధ్రా బేంకూ పోస్టాఫీసూ దాటేసి, పెద్ద వీధి దాకా వచ్చాక, అక్కడ ఆగి వెనక్కి చూసింది.  అతను గేటు మూస్తున్నాడు.  ఇప్పుడీ దూరం ఇచ్చిన ధైర్యంతో, తన పరుగు మీద నమ్మకంతో, అతని వైపు చెయ్యి కూడా ఊపింది.  అతను పట్టించుకోనట్టు వెనక్కి వెళ్ళిపోయాడు.  రాజీకి నవ్వూ ఆయాసమూ ఆగటం లేదు.  మోకాళ్ళ మీద చేతులానించి ఒగుర్పు దిగమింగుకుంది.  బడ్డీకొట్టు దగ్గర ఎవరో రేడియో ట్యూన్ చేస్తున్నారు.  స్టేషన్లు దొరక్క కాసేపు వింత చప్పుళ్ళు.  ఒక్కసారిగా పాట మొదలైంది- “దోబూచు లాడేటి అందమొకటి ఉందీ” అని సగంలోంచి.  రాజీ వీధి మధ్యలో నడుస్తూనే తనకి రాని భరత నాట్యం స్టెప్పులు వేయబోయింది. కానీ అక్కడదాకా మెల్లగా వున్న పాట వెంటనే స్పీడందుకుంది.  అందుకు తగ్గట్టు నాట్యం చేయబోయి, వీలుకాక, పిచ్చి గెంతులు గెంతి, నవ్వు పొంగుకొచ్చి, తమాయించుకోలేక, ముందుకుతూలి చప్పట్లు కొడుతూ నవ్వింది. 

ఇందాక సందులో చూసిన ఆడామె ముఖం గుర్తొచ్చింది.  ఆవిడ టైలరు షాపాయన భార్య.  గ్రంథాలయం నుంచి బడి వైపు మలుపు తిరిగితే వాళ్ళ ఇల్లు.  ఆవిడెప్పుడూ అమ్మలాగ అంట్లు తోముతూనో, చీరలారేస్తూనో కనపడదు.  శుభ్రంగా పౌడరు రాసుకుని, చీర నలగకుండా, ఎప్పుడు చూసినా కాసేపటి క్రితమే స్నానం చేసినట్టు తయారై ఉంటుంది.  రాజీకి తను పెద్దదాన్నవ్వబోయే రోజులు గుర్తొచ్చాయి.  రంగులతో కళ్ళు చెదిరే కాలమేదో తన కోసం ఎదురుచూస్తూంది.  తనదే ఆలస్యం!  వొంటి మీదున్నది గౌను కాదు చీరన్నట్టు, లేని పవిటని చేతుల్తో ఆడించుకుంటూ, ఇంటి వైపు పరిగెత్తింది.

*

November 27, 2019

పేదజనంలో దాస్తొయెవ్‌స్కీ కూడా ఒకడు

దాస్తోయెవ్‌స్కీకి తనో గొప్ప రచయితనన్న విషయంలో అనుమానమెప్పుడూ లేదు. కానీ తను రాసినవేవీ అనుకున్నంత గొప్పగా రాయలేకపోయానని మాత్రం చివరిదాకా బాధపడేవాడు. దానికి కారణం ఆయన జీవిత పరిస్థితులు. ఈ విషయంలో ఆయన టాల్‌స్టాయిని చూసి అసూయపడేవాడు. ఈ మాటే వచ్చినప్పుడు సొలొయెవ్‌ అనే స్నేహితునితో ఇలా అన్నాడు (అప్పటికి టాల్‌స్టాయి ‘అన్నా కరెనినా’, దాస్తోయెవ్‌స్కీ ‘ఱా యూత్‌’ ఒకేసారి వేర్వేరు పత్రికల్లో సీరియలైజ్‌ అవుతున్నాయి):
“నిజమే, నేను అసూయపడతాను. కానీ మీరనుకుంటున్న విషయాల గురించి కాదు. నేను అతని పరిస్థితుల్ని చూసి అసూయపడతాను. ముఖ్యంగా ఇప్పుడు... ఇలా కంగారు కంగారుగా రాయాల్సి రావటం ఎంత బాధో నాకే తెలుసు... దేవుడా! జీవితమంతా నాది ఇదే పరిస్థితి. ఈ మధ్య నా ‘ఇడియట్‌’ నవలను చాన్నాళ్ళ తర్వాత చదివాను; దాన్ని పూర్తిగా మర్చిపోవటం వల్ల అదో కొత్త నవల అన్నట్టే చదివాను... ఎన్నో అధ్యాయాలు అద్భుతంగా, ఎంతో మంచి సన్నివేశాలతో ఉన్నాయి. కాని వాటితోపాటే సగంసగం పూర్తయినవీ, హడావిడిగా రాసేసినవీ కొన్ని కనిపించాయి. ఎప్పుడూ నాది ఇదే పరిస్థితి—ఇప్పుడు కూడా. పత్రికల వాళ్ళు తొందరపెడుతుంటారు... తీసుకున్న అడ్వాన్సుల కోసం రాయక తప్పదు... తర్వాత మళ్ళీ అడ్వాన్సులు అవసరమవుతాయి... ఇక దీనికి అంతు లేదు! టాల్‌స్టాయి అలాక్కాదు, అతనికి డబ్బుకి లోటు లేదు, మర్నాటి కోసం తడుముకోవాల్సిన అవసరం లేదు, కాబట్టి రాసినవాటికి ఎంతైనా మెరుగులు దిద్దుకోవచ్చు”.  
దాస్తోయెవ్‌స్కీ ఇలా బాధపడ్డాడే గానీ, కాలం మాత్రం కీర్తిని ఇద్దరికీ చెరిసమానంగానే పంచింది. అప్పులు ఎగ్గొట్టినందుకు రేపో మాపో జైలుకిపోయి, రాస్తున్నదాన్ని అర్ధాంతరంగా ఆపేయాల్సొస్తుందేమో అన్నంత ఒత్తిడిలోనే రాసినా- ‘క్రైమ్‌ అండ్‌ పనిష్మెంట్‌’ లాంటి ఆయన నవలలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. టాల్‌స్టాయితో సమానంగా దాస్తోయెవ్‌స్కీకి కూడా తరాలుదాటి అభిమానులు వచ్చిచేరుతూనే వున్నారు. ఒకడు పాఠకుడిగా టాల్‌స్టాయిని ఇష్టపడుతున్నాడా, లేక దాస్తోయెవ్‌స్కీనా అన్నదాన్ని బట్టి వాడెలాంటి మనిషో చెప్పొచ్చునని రష్యాలో అనుకునేవారట.

‘క్రైమ్‌ అండ్‌ పనిష్మెంట్‌’ రాస్తున్నప్పుడు, 1865లో, దాస్తోయెవ్‌స్కీ ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది. ఏడాది క్రితమే, ఏడేళ్ళు కలిసి బతికిన భార్య మరీయ అనారోగ్యంతో చనిపోయింది. అదే సంవత్సరం అన్నయ్య మిఖైల్‌ కూడా చనిపోయాడు. అన్నయ్య తీర్చాల్సిన అప్పుల భారం దాస్తోయెవ్‌స్కీ మీద పడింది. మరోపక్క అన్నయ్య కుటుంబాన్నీ, భార్య మరీయ మొదటి వివాహపు సంతానాన్నీ కూడా దాస్తోయెవ్‌స్కీనే సాకాల్సి వచ్చింది. అప్పటిదాకా సంపాదనా మార్గంగా ఉన్న, అన్నయ్య నడిపిన, ‘టైమ్‌’ పత్రికని జార్‌ చక్రవర్తి ప్రభుత్వం నిషేధించింది. దాని స్థానంలో తెచ్చిన ‘ఎపోక్‌’ పత్రిక సరిగా నడవటం లేదు. ఇక దాస్తోయెవ్‌స్కీ రాస్తే వచ్చే సంపాదనే అందరికీ ఆధారం. ఇలాంటి పరిస్థితిలో- ఉన్నపళాన ఆరొందల రూబుళ్ళు అప్పులవాళ్లకి చెల్లించకపోతే జైల్లో పెడతామని పోలీసు నోటీసు వచ్చింది. ఎవర్ని సాయమడగాలా అని వెతుకుతున్న దాస్తోయెవ్‌స్కీకి ఒక దుర్మార్గుడైన పబ్లిషర్‌ స్టెల్లోవ్‌స్కీ దొరికాడు. దాస్తోయెవ్‌స్కీ దీనస్థితిని స్టెల్లోవ్‌స్కీ తన లాభానికి వాడుకోవాలనుకున్నాడు. ఒక ఒప్పందానికి సరేనంటే మూడు వేల రూబుళ్ళు ఇస్తానన్నాడు. దాని ప్రకారం 1) దాస్తోయెవ్‌స్కీ అప్పటిదాకా రాసిన రచనలన్నీ రాయల్టీ ఏమీ ఇవ్వకుండా స్టెల్లోవ్‌స్కీ ఒక ఎడిషన్‌ అచ్చేసుకుంటాడు. (‘పూర్‌ ఫోక్‌’, ‘ఇన్సల్టెడ్‌ అండ్‌ ఇంజూర్డ్‌’, ‘ద డబుల్‌’, ‘హౌస్‌ ఆఫ్‌ ద డెడ్‌’, ‘నోట్స్‌ ఫ్రం అండర్‌గ్రౌండ్‌’... ఇవన్నీ). 2) ఆ మరుసటి సంవత్సరం నవంబరు 1వ తారీకులోగా ఒక కొత్త నవల రాసి ఇవ్వకపోతే, ఆ తర్వాత దాస్తోయెవ్‌స్కీ ఇక ఏం రాసినా తొమ్మిదేళ్ళ పాటు ఒక్క పైసా కూడా ఇవ్వనక్కర్లేకుండా స్టెల్లోవ్‌స్కీ అచ్చేసుకోవచ్చు. ఈ క్రూరమైన ఒప్పందానికి ఒప్పుకోక తప్పలేదు దాస్తోయెవ్‌స్కీకి. సరేనని మూడువేల రూబుళ్ళు తీసుకున్నాడు. పీటర్సుబెర్గులోనే ఉంటే అప్పులాళ్ళ గొడవతోనూ, కుటుంబ భారంతోనూ ఏమీ రాయలేనని అర్థమై, విదేశాలు వెళ్ళిపోవాలనుకున్నాడు. స్టెల్లోవ్‌స్కీ దగ్గర తీసుకున్న మూడువేల రూబుళ్ళలో- అప్పులాళ్ళని తాత్కాలికంగా సముదాయించటానికి కొంతా, చనిపోయిన అన్నయ్య కుటుంబానికి కొంతా, చనిపోయిన భార్య కొడుకుకి కొంతా ఇచ్చి, 75 రూబుళ్ళు మిగిలితే వాటితో జర్మనీ వచ్చాడు.

తీరా జర్మనీ వచ్చాక, తన జూద వ్యసనానికి లొంగిపోయి, ఐదురోజుల్లోనే Roulette అన్న జూదంలో ఉన్నదంతా, చేతి వాచీతో సహా, పోగొట్టుకున్నాడు. అప్పట్లో విదేశాల్లోనే వున్న తోటి రచయిత తుర్గెనెవ్‌ని సిగ్గువిడిచి అప్పు అడిగి తీసుకున్నాడు. పారిస్‌లో వున్న ప్రియురాలు పొలినా సుస్లోవాను కూడా సాయం చేయమని అడిగాడు. ఆమె తన దగ్గరే డబ్బుల్లేని స్థితిలో, స్నేహితుల్ని అడిగి, పారిస్‌ నుంచి స్వయంగా జర్మనీ వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళింది. ఈ సుస్లోవా నే దాస్తోయెవ్‌స్కీ నవలల్లో తరచు కనిపించే “Infernal Women” పాత్రలకి మూలమని అంటారు. అంటే చపలచిత్తంతో భర్తలకి/ప్రియులకి నరకం చూపించే స్త్రీలు. చేరువయినట్టే అయి, అంతలోనే దూరం జరిగి, వేరే మగాళ్ళతో ప్రేమలు కొనసాగిస్తూ, దాస్తోయెవ్‌స్కీకి నరకం చూపించేది సుస్లోవా. ఒకపక్క ఈమెతోనూ, ఇంకోపక్క జూదం వ్యసనంతోనూ యాతన పడుతూనే దాస్తోయెవ్‌స్కీ ‘క్రైమ్‌ అండ్‌ పనిష్మెంట్‌’ నవలని రాయటం ప్రారంభించాడు. సుస్లోవా డబ్బులు ఇచ్చి తిరిగి పారిస్‌ వెళ్ళాక ఆమెకు దాస్తోయెవ్‌స్కీ రాసిన ఉత్తరం చూస్తే- ఈ నవల రాసే సమయానికి ఆయన జర్మన్‌ హోటళ్ళలో ఎలాంటి దుర్భర పరిస్థితుల మధ్య ఉన్నాడో అర్థమవుతుంది:
“ప్రియమైన పోల్య, అసలు నువ్వు పారిస్‌ దాకా ఎలా వెళ్ళగలిగావో నాకు అర్థం కావటం లేదు. ఈ అసహ్యమైన స్థితితో నేను పడుతున్న బాధకి నీ పట్ల బాధ కూడా తోడైంది. హోటల్‌ ఖర్చు, బగ్గీల ఖర్చు, ప్రయాణం ఖర్చు... ఒకవేళ నీ దగ్గర రైలు టికెట్టుకు సరిపడా డబ్బులున్నాయనుకున్నా- ఏం తినకుండా ఆకలితో వెళ్ళుంటావు. ఇదంతా నా తలలో తిరుగుతూ నా మనసుకి విశ్రాంతినివ్వటం లేదు. ఇంకోపక్క ఇక్కడ నా పరిస్థితి నమ్మలేనంత నీచానికి దిగజారింది. నువ్వు వెళ్ళిన మరుసటి రోజే ఈ హోటల్‌ వాళ్ళు నాకు భోజనం, టీ కాఫీలతో సహా ఆపేశారు. నేను అడగటానికి వెళ్తే అక్కడ ఒక లావాటి జర్మన్‌ ఓనరు- నేను భోజనానికి ‘అర్హుణ్ణి’ కాదనీ, టీ మాత్రం పంపగలననీ చెప్పాడు. కాబట్టి నిన్నటి నుంచి ఏమీ తినలేదు, టీ మాత్రం తాగుతున్నాను... అదికూడా వాళ్ళు ఏ సమోవర్‌ లేకుండా చేసే చెత్త టీ. వాళ్ళు నా బట్టలు, బూట్లూ శుభ్రం చేయటం మానేశారు, పిలిచినా పలకరు, ఇక్కడి స్టాఫ్‌ అంతా జర్మన్‌లకు మాత్రమే సాధ్యమయ్యే ద్వేషంతో నన్ను ట్రీట్‌ చేస్తున్నారు. డబ్బులేకపోవటం, చెప్పిన టైముకి డబ్బు ఇవ్వకపోవటం కంటే జర్మన్ల దృష్టిలో మరేదీ పెద్ద నేరం కాదనుకుంటాను. ఇదంతా నవ్వు తెప్పిస్తోంది, మరోపక్క చాలా చిరాకూ తెప్పిస్తోంది.” 
రెండు రోజుల తర్వాత మరో ఉత్తరంలో ఇలా రాశాడు:
“నా పరిస్థితి ఏం బాగుపడలేదు. ...ఇంకా భోజనం లేదు, పొద్దుటా సాయంత్రమూ టీలతో సరిపుచ్చుకుని ఇది మూడో రోజు—చిత్రం: అసలు తినాలన్న యావ కూడా చచ్చిపోయింది. అన్నింటికంటే ఘోరం—వీళ్ళు నన్ను చుట్టుముడుతున్నారు, ఒక్కోసారి సాయంత్రానికి కొవ్వొత్తి కూడా ఇవ్వటం లేదు, ముఖ్యంగా ముందు రోజు కొవ్వొత్తి ఏమన్నా మిగిలి వుంటే, అదెంత చిన్నది మిగిలినా సరే, కొత్త కొవ్వొత్తి ఇవ్వటం లేదు. నేను మాత్రం రోజూ మూడింటికి హోటల్‌ విడిచి వెళ్ళి మళ్ళీ ఆరింటికి తిరిగి వస్తున్నాను, ఎందుకంటావా, వీళ్ళు పెట్టకపోయినా నేను బయట భోజనం తింటున్నానన్న భ్రమ వీళ్ళకి కల్పించటానికి. నాకు క్లెస్తాకోవ్‌ గుర్తొస్తున్నాడు!” (క్లెస్తాకోవ్‌: ‘ఇనస్పెక్టర్‌ జనరల్‌’ నాటకంలో గొగోల్‌ పాత్ర).
ఇలాంటి పరిస్థితుల్లో ఒక పత్రికా సంపాదకుడిని సాయం అడగటానికి సిద్ధపడ్డాడు. ఇదే పత్రికా సంపాదకుడికి వ్యతిరేకంగా అన్నయ్యా తనూ కలిసి నడిపిన ‘టైమ్‌’ పత్రికలో వ్యాసాలు రాసాడు, కొన్ని వ్యాసాల్లో వెక్కిరించాడు కూడా. అయినా ఇప్పుడు ఇంకెవర్ని అడగాలో తెలియక, అతనికే ఇలా ‘క్రైమ్‌ అండ్‌ పనిష్మెంట్‌’ నవల తీసుకొమ్మనీ, అడ్వాన్సుగా మూడొందల రూబుళ్ళు అర్జెంటుగా ఇప్పించమనీ రష్యాకి ఉత్తరం రాశాడు. 1865 సెప్టెంబరులో రాసిన ఈ ఉత్తరంలోనే తొలిసారి ‘క్రైమ్‌ అండ్‌ పనిష్మెంట్‌’ ప్రస్తావన కనిపిస్తుంది. ఆ ఉత్తరంలో తన నవల ఇతివృత్తాన్ని ఇలా చెబుతాడు:
“ఇది ఒక నేరం తాలూకు సైకలాజికల్‌ రిపోర్టు... ఒక కుర్రాడు, అతడ్ని యూనివర్సిటీ నుంచి వెళ్ళగొట్టేశారు... కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు... అలాంటివాడు ఒక విపరీతమైన, ‘అసంపూర్ణమైన’, గాలివాటు భావజాలంతో ప్రభావితుడై... ఒకేఒక్క దెబ్బతో పేదరికం నుంచి బయటపడాలనుకుంటాడు. ఒక ముసలామెని చంపాలనుకుంటాడు... వడ్డీలకి అప్పులిచ్చే ఆ ముసలామె తిక్కది, రోగిష్టిది, ఆశపోతు, ఒక యూదులాగా ఎక్కువ వడ్డీ గుంజుతుంది, మహచెడ్డది, జీవితాలు నాశనం చేసే మనిషి... ‘ఎందుకూ పనికిరాని ఈ మనిషి ఎందుకు బతకాలి?’... ఇలాంటి ప్రశ్నలు ఆ కుర్రాడి మనసులో దూరుతాయి. ఈ ముసలామెని చంపేయాలని నిర్ణయించుకుంటాడు, అలా చేసి దోచుకున్న డబ్బుతో ఊరిలో వున్న తల్లి కష్టం తీర్చొచ్చు, చెల్లెల్ని కాపాడొచ్చు,...  తన చదువు పూర్తి చేసుకోవచ్చు, విదేశాలకు పోవచ్చు, ఇక తర్వాత తన జీవితమంతా ‘సమాజం పట్ల మానవ బాధ్యతను నెరవేరుస్తూ’ నిటారుగా, నిక్కచ్చిగా, నిజాయితీగా బతుకుతాడు, ఆ రకంగా చేసిన నేరానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు; నిజానికసలు ఓ చెవిటి, తిక్క, చెడ్డ, రోగిష్టి ముసలిదాన్ని అలా పైకి పంపటం నేరమే కాదు. కానీ, ఆ పని పూర్తిచేసిన ఒక నెల తర్వాత, అతను అనుకున్నదంతా తలకిందులవుతుంది... దైవిక సత్యం, లౌకిక చట్టం అతడ్ని యాతనపెడతాయి, చివరకు తనంతటతానే వెళ్ళి చట్టం ముందు లొంగిపోతాడు. ఎందుకంటే, జైల్లో అతను నాశనమైపోతే అయిపోనీ, కానీ కనీసం తిరిగి మిగతా జనంలో ఒకడు కాగలుగుతాడు; ఎందుకంటే, ఆ నేరం చేసిన మరుక్షణం నుంచీ మానవ సమూహం నుంచి వేరైపోయి, ఏకాకిగా మిగిలిపోయానన్న భావం అతడ్ని చాలా హింసపెట్టింది. ఆవిధంగా నేరస్థుడే నేర ఫలితాన్ని అనుభవించటానికీ, తద్వారా నేరానికి ప్రాయశ్చిత్తం చేసుకోవటానికీ సిద్ధమవుతాడు.”
ఈ ఉత్తరం చదివి ఆ సంపాదకుడు ఏ కళనున్నాడో- మొత్తానికి దాస్తోయెవ్‌స్కీ అడిగినట్టే మూడొందల రూబుళ్ళ అడ్వాన్సు పంపాడు. దాస్తోయెవ్‌స్కీ ఇక విదేశాల్లో యీ కటిక దరిద్రం భరించలేక అక్టోబరులో తిరిగి రష్యా వచ్చాడు. కానీ మళ్ళీ ఆయన్ని అప్పులాళ్లు చుట్టుముట్టారు. చుట్టూ కుటుంబ బాధలు తిరిగి ప్రత్యక్షమయ్యాయి. పైగా ఆయన మూర్ఛరోగం (epilepsy) మళ్లా తిరగబెట్టింది. అప్పుడే స్నేహితునికి ఉత్తరం రాస్తూ, “నా మూర్ఛరోగం ఎంత ముదిరిపోయిందంటే, ఒక వారం ఆగకుండా పని చేస్తే చాలు, మూర్ఛ వచ్చేస్తోంది. అలా రెండుమూడుసార్లు వస్తే ఇక మరుసటి వారమంతా పని చేయలేను, అయినా పని చేయాలి, అదీ నా పరిస్థితి,” అని చెప్పుకున్నాడు. ఇలాంటి పరిస్థితిలో కూడా, ఇంత ఇరుకు మధ్య నలుగుతూ ఎలాగో రాసుకొచ్చి, ఇక దాదాపు పూర్తయిందన్న రచనని... దాస్తోయెవస్కీ ఉన్నట్టుండి కాల్చేశాడు. దానికి కారణమేమిటో ఒక స్నేహితునికి ఉత్తరంలో ఇలా చెప్పాడు: “నవంబరు చివరకు నవలంతా ఇంచుమించు పూర్తయిపోయి సిద్ధంగా ఉంది; కానీ, దాన్ని పూర్తిగా కాల్చిపడేసాను... అది నాకే నచ్చలేదు. ఒక కొత్త శిల్పం, కొత్త పథకం నన్ను ఉత్తేజ పరచింది. మొత్తం మళ్ళీ మొదలు పెట్టాను.”

అయితే నవల మొదటి డ్రాఫ్టు కాలిపోయినా, దాని తాలూకు చిత్తు డ్రాఫ్టులు, కొన్ని నోటు పుస్తకాలు మనకు మిగిలాయి. వాటి ఆధారంగా తెలిసేదేమిటంటే, దాస్తొయెవ్‌స్కీ ఈ నవలను మొదట ఉత్తమ పురుష కథనంలో (ఫస్ట్‌పెర్సన్‌ నేరేషన్‌లో) రాశాడు. ఈ నేరేటివ్‌ పద్ధతిలో ముఖ్య పాత్ర రెండు అంశలుగా విడిపోతుంది. ఒక అంశ- కథను మనకు చెప్తుంది, కథపై వ్యాఖ్యానిస్తుంది; రెండో అంశ- కథలో పాల్గొంటుంది, సంఘటనల్ని అనుభవిస్తుంది. అంటే కథలో ప్రత్యక్షంగా పాల్గొనే అంశ ఒకటైతే, అదే సమయంలో కథను మనకు చెప్తూ దానిపై వ్యాఖ్యానించే అంశ మరొకటి. ఈ రెండు విషయాలూ మమేకమైపోయి తేడా తెలీకుండా ఒకే సమయంలో జరిగిపోతూంటాయి. ఇలా ఉత్తమ పురుష కథనంలో రాసిన మొదటి డ్రాఫ్ట్‌ను దాస్తొయెవ్‌స్కీ కాల్చేయటానికి కారణం- ఈ కథకు ఆ నేరేషన్‌ నప్పకపోవటమే. ఎందుకంటే, నవలలో కథానాయకుడు రస్కోల్నికోవ్‌ ఆ ముసలామెని చంపిన తర్వాత దాదాపు పిచ్చితనపు అంచులకు చేరిపోతాడు. జ్వరప్రలాప స్థితిలో రోజులు గడుపుతాడు. మరి ఇలాంటి స్థితిలో- కథానాయకుడు ఒకపక్క పిచ్చితనంలోకి జారిపోతూ మరోపక్క స్పష్టంగా కథ ఎలా చెప్పగలడు? మరో మార్గాంతరాన్ని కూడా దాస్తొయెవ్‌స్కీ ఆలోచించాడు. ఫస్ట్‌పెర్సన్‌లోనే మరో పద్ధతి కూడా ఉంది: ‘ఫస్ట్‌పెర్సన్‌ కన్ఫెషనల్‌’ పద్ధతి, తెలుగులో ‘ఉత్తమ పురుష వృత్తాంత పద్ధతి’ అనవచ్చును. ఈ పద్ధతిలో ముఖ్య పాత్ర జరుగుతున్న కథను జరుగుతున్నట్టు మనకు వెంటనే బదిలీ చేయదు. ఎప్పుడో గతంలో జరిగిపోయిన దాన్ని ఇప్పుడు జ్ఞాపకంలోంచి నెమరువేసుకుని చెప్పుకుంటుంది. దాస్తొయెవ్‌స్కీ ఈ పద్ధతి గురించి కూడా ఆలోచించాడు. అంటే రస్కోల్నికోవ్‌ తన గతాన్ని తల్చుకుని, అప్పటి తన అస్తవ్యస్త మానసిక స్థితిని గుర్తు తెచ్చుకుని, కథను చెప్పాలన్నమాట. కానీ ఇందులోనూ ఒక ఇబ్బంది ఉంది. తను చేసిన దారుణ హత్య గురించి, అప్పటి తన బాధాకరమైన మానసిక స్థితి గురించి ఇప్పుడు రస్కోల్నికోవ్‌ అసలు ఎందుకు గుర్తు చేసుకోవాలనుకుంటాడు? ఎందుకు దాన్ని తల్చుకోవాలనుకుంటాడు? ఈ పద్ధతిలో ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదు. కాబట్టే, అసలు ఫస్ట్‌ పెర్సన్‌ నెరెషనే తన నవలకు పనికి రాదని దాస్తొయెవ్‌స్కీ మొదటి డ్రాఫ్టును కాల్చిపారేశాడు. ఒక కొత్త నిర్ణయానికొచ్చాడు: “కథని కథానాయకుడు కాదు, రచయితే చెప్పాలి”. కథను రచయిత చెప్పడమంటే అది ప్రథమ పురుష కథనం (థర్డ్‌పెర్సన్‌ నేరేషన్‌). అంటే కథను ఎవరో మూడో వ్యక్తిలా రచయితే చెప్పడం అన్నమాట. ఇలాంటి కథనం దాస్తొయెవ్‌స్కీ కాలానికి కొత్తదేం కాదు. మరి ఇందులో దాస్తొయెవ్‌స్కీని అంత ఉత్తేజపరచిన కొత్త శిల్పం ఏమిటి? దీని సమాధానం ఆయన నోటు పుస్తకంలో ఉంది: “Narration from the point of view of the author, a sort of invisible but omniscient being, who doesn’t leave his hero for a moment.” అంటే రచయిత ఒక అదృశ్యమైన, కానీ సర్వవ్యాప్తమైన అంశగా మారిపోయి అనుక్షణం తన కథానాయకుణ్ణి మాత్రమే అనుసరిస్తాడన్నమాట. దీన్ని మనం ''సర్వసాక్షి కథనం'' (Omnipresent narration) అంటున్నాం. సర్వసాక్షి కథనంలో పాఠకుడిని అదివరకూ ఎవరూ తీసుకెళ్ళనంత చేరువగా కథలోకి తీసుకెళ్ళిన తొలి రచయిత దాస్తొయెవ్‌స్కీనే అని ‘క్రైమ్‌ అండ్‌ పనిష్మెంట్‌’ వర్డ్స్‌వర్త్‌ ఎడిషన్‌కి ఉపోద్ఘాతం రాసిన కీత్‌ కరబైన్‌ అంటాడు:
“అప్పటిదాకా సంప్రదాయంగా వస్తోన్న రచయిత స్వభావజనితమైన పాయింట్‌ ఆఫ్‌ వ్యూ ఈ నవలలో ఒక రూపంలేని, తటస్థమైన ‘సర్వసాక్షి సమక్షం’గా మారిపోయింది, ఈ సమక్షం మళ్ళీ ఎటూ పోకుండా కేవలం కథానాయకుడికే పలుపుతాడేసి కట్టినట్టు అంటిపెట్టుకుపోయింది, ఈ ఆశ్చర్యపరిచే కొత్త ప్రయోగం నవలా చరిత్రలోనే ఒక కొత్త రూపానికి నాంది పలికింది--నవలా ప్రక్రియ శక్తికీ, విస్తృతికీ, పాఠకుల మీద దాని పట్టుకీ ఇది కీలకంగా మారింది.”
ఈ కొత్త శిల్పం గురించి కీత్‌ బైరన్‌ ఇంకా వివరణ ఇస్తాడు. సర్వసాక్షి కథనానికి దాస్తొయెవ్‌స్కీ దిద్దిన కొత్త మెరుగేంటో ఈ నవల తొలి వాక్యంలోనే కనిపిస్తుంది: “జూలై ప్రారంభంలో, బాగా ఉక్కపోతగా వున్న కాలంలో, సాయంత్రం పూట, ఒక యువకుడు ఎస్‌-ప్లేస్‌లో తన ఇరుకైన అద్దెగదిలోంచి వీధిలోకి వచ్చి, నెమ్మదిగా, ఏదో తటపటాయిస్తున్నట్టు, కె-బ్రిడ్జి వైపు నడవసాగాడు.” ఈ వాక్యంలో కథకుడు మనకు తెలిసిన సర్వసాక్షి కథకుడే. ఈ సర్వసాక్షి కథకుడు ఇక్కడ తన ముఖ్య పాత్రకు ఒక స్థలాన్ని (ఇరుకు గది, ఎస్‌-ప్లేస్‌), ఒక కాలాన్ని (జూలై ప్రారంభం, ఉక్కపోసే సాయంత్రం) ఇస్తున్నాడు. పాత్ర గురించి అంతా అథారిటేటివ్‌గా చెప్తున్నాడు. కాని, “ఏదో తటపటాయిస్తున్నట్టు” అన్న పదాల్లో మాత్రం తన అథారిటీని తగ్గించుకుని, అనిశ్చితిని, సందిగ్ధాన్నీ వ్యక్తం చేస్తున్నాడు. ఈ అనిశ్చితే దాస్తొయెవ్‌స్కీ సర్వసాక్షి కథనానికి అద్దిన కొత్త మెరుగు: “తను సృజించే పాత్రతో రచయితకుండే సంబంధంలో కొంత అనిశ్చితి కూడా ఉంటుందని ఒప్పుకుని, దాన్ని పూర్తిగా వాడుకున్న మొదటి నవలా రచయిత దాస్తోయెవ్‌స్కీ” అంటాడు కీత్‌ బైరన్‌.

అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో, ఎంతో ఒత్తిడి మధ్య రాస్తూ కూడా దాస్తోయెవ్‌స్కీ తన రచనల సౌష్ఠవం విషయంలో ఏమాత్రం రాజీ పడలేదనటానికి ఇది ఒక నిదర్శనం. ఎంత హడావిడిలో రాసినా- ప్రతి రచనా దబాయించి అడిగే డిమాండ్‌లన్నీ తీర్చిన తర్వాతనే, అది రచనగా సాధ్యమైనంత పరిపూర్ణమయ్యాకనే, దాస్తోయెవ్‌స్కీ దాన్ని బైటకు పంపాడు. నిజానికి రాయటంలో ఆ నిలుపులేని హడావిడి కొంత పరిస్థితులు కల్పించిందే అయినా, కొంత ఆయన స్వభావంలో కూడా ఉందనుకోవాలి. ఎప్పుడు ఏం రాసినా ఒక జ్వరతీవ్రతలాంటి స్థితిలో, చుట్టూ మరేదీ కన్పించని పిచ్చి ఏకాగ్రతతో రాసేవాడు.

మొత్తానికి, దాస్తోయెవ్‌స్కీ ఇంకా రాస్తుండగానే, 1866 జనవరిలో, ‘క్రైమ్‌ అండ్‌ పనిష్మెంట్‌’ నవల సీరియలైజేషన్‌ ‘రష్యన్‌ మెసెంజర్‌’ అనే పత్రికలో ప్రారంభమైంది. మొదటి సంచిక నుంచే పాఠకుల్ని కట్టిపడేసింది. ఒక్కసారిగా ఆ పత్రికకి 500 మంది కొత్త చందాదారులు చేరారు. ఆ నవల ప్రచురణ మొదలైన మూడు నెలల తర్వాత, రస్కోల్నికోవ్‌ లాగే యూనివర్సిటీ నుంచి వెళ్లగొట్టబడిన ఒక యువకుడు అప్పటి జార్‌ చక్రవర్తి మీద హత్యాయత్నం చేయటంతో, పాఠకుల్లో ఈ నవల మీద మరింత ఆసక్తి పెరిగింది. కానీ దాస్తోయెవ్‌స్కీ మాత్రం— అప్పులవాళ్ళ గొడవల మధ్య, పోలీసు బెదిరింపుల మధ్య— ఏ క్షణాన్నయినా జైలుపాలయి నవల మధ్యలోనే ఆపేయాల్సొస్తుందేమోనన్న భయంతోనే నవలను రాస్తూ వచ్చాడు. సెప్టెంబర్‌ నెలాఖరుకి నవల పూర్తయిపోయింది. కానీ యమకింకరుడిలాంటి పబ్లిషర్‌ స్టెల్లోవ్‌స్కీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం, దాస్తోయెవ్‌స్కీ తన రచనల మీద హక్కులన్నీ కోల్పోకుండా ఉండాలంటే, నవంబర్‌ 1లోగా, అంటే కేవలం ఒక్క నెలలో, మరో నవల రాసి ఇవ్వాలి. ఈ ఒప్పందం గురించి అప్పుడే విన్న స్నేహితులు నివ్వెరపోయారు. కొంతమంది ఆసరాకొచ్చారు. అందరం కలిసి ఒక్కో అధ్యాయం రాసేద్దాం, నీ పేరు మీద అచ్చుకి పంపేద్దాం అని సలహా ఇచ్చారు. “ఎట్టి పరిస్థితుల్లోనూ వేరేవాళ్ళు రాసింది నా సంతకంతో బైటకు వెళ్ళటానికి వీల్లేదు,” అన్నాడు దాస్తోయెవ్‌స్కీ. ఒక స్నేహితుడు స్టెనోగ్రాఫర్‌ని పెట్టుకొమ్మని సలహా ఇచ్చాడు. దాస్తోయెవ్‌స్కీ ఎప్పుడూ తన రచనల్ని ఇంకొకరికి డిక్టేట్‌ చేయలేదు. కానీ గత్యంతరం లేని పరిస్థితిలో ఇప్పుడు ఒప్పుకున్నాడు. ఈ సలహా ఇచ్చిన స్నేహితుడికి ఒక స్టెనోగ్రఫీ ప్రొఫెసర్‌ తెలుసు. అతను స్త్రీలకి స్టెనోగ్రఫీ క్లాసులు చెప్తుంటాడు. అతను తన క్లాసులో పంతొమ్మిదేళ్ళ అన్నా గ్రిగొర్‌యెవ్నా అనే అమ్మాయిని దాస్తోయెవ్‌స్కీ దగ్గరకు పంపాడు.

రష్యాలో అప్పుడప్పుడే షార్ట్‌హాండ్‌ బోధన మొదలైంది. దాన్ని స్త్రీలు నేర్చుకోవటం మరీ అరుదు. తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబం గడవటానికి అన్నా గ్రిగొర్‌యెవ్నా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలా ఆమె స్టెనోగ్రఫీ కోర్సులో చేరింది. ఆమెకి దాస్తోయెవ్‌స్కీ ఒక రచయితగా ముందే తెలుసు. ఆయన ‘ఇన్సల్టెడ్‌ అండ్‌ ఇంజ్యూర్డ్‌’ నవలని కంటతడితో చదివింది. ఇప్పుడు పత్రికలో సీరియలైజ్‌ అవుతున్న ‘క్రైమ్‌ అండ్‌ పనిష్మెంట్‌’ను కూడా చదువుతోంది. దాస్తోయెవ్‌స్కీ గదిలోకి అడుగుపెట్టగానే “నాకు చప్పున రస్కోల్నికోవ్‌ ఉండే గది గుర్తొచ్చింది” అని తర్వాత రాసుకుంది. దాస్తోయెవ్‌స్కీ ఆమెకు డిక్టేట్‌ చేయదల్చుకున్న నవల ‘ద గేంబ్లర్‌’, జూద వ్యసనం గురించి. మొదట్లో డిక్టేట్‌ చేయటంలో తడబడ్డా, క్రమంగా ఈ అమ్మాయి సమక్షం అలవాటయ్యాకా, సులభంగానే డిక్టేట్‌ చేయటం మొదలుపెట్టాడు. ఆయన చెప్తుంటే ఆమె షార్ట్‌హాండ్‌లో రాసుకోవటం, అలా రాసిందాన్ని ఆ రాత్రికి ఇంటికి తీసుకెళ్ళి విస్తరించి రాసి మళ్ళీ పొద్దున్న వచ్చేటప్పుడు తీసుకురావటం, ఇలాగ ఈ నవలా రచన సాగింది.

దాస్తోయెవ్‌స్కీ భార్య చనిపోయిన ఈ రెండేళ్ళల్లోనే ముగ్గురు అమ్మాయిలకి ప్రపోజ్‌ చేసి కాదనిపించుకున్నాడు. ఇలా తోడు కోసం తపించే ఒంటరి అవస్థలో ఉన్న నలభై ఐదేళ్ళ దాస్తోయెవ్‌స్కీకి—పంతొమ్మిదేళ్ళ వయసులోనే ఎంతో దిటవుగా కనపడే అన్నా మీద ఇష్టం కలగటం మొదలైంది. అన్నాకు కూడా ఈ మనిషి మీద—ఎవ్వరి ఆసరాలేని, లోపలి భావాలన్నీ ముఖంలోనే చూపించేస్తూ ఎంతో ఊగిపోయే, మాటల్లో వేరే ప్రపంచాల్ని కళ్ళ ముందు నిలపగలిగే మనిషి మీద—మొదట్లో కలిగిన జాలి క్రమంగా ఇష్టంగా మారింది. కానీ మరోపక్క వయసులో ఇంత వ్యత్యాసం వున్న, ఇన్ని అప్పులతో అవస్థపడుతోన్న, ఆరోగ్యం ఏమాత్రం సరిగాలేని ఈ మనిషి తనపై అస్పష్టంగా చూపిస్తున్న ఇష్టానికి ఎలా స్పందించాలా అన్న సందిగ్ధంలోనూ ఉంది. దాస్తోయెవ్‌స్కీ ఇంట్లోని వస్తువులు ఆమె చూస్తుండగానే మాయమై తాకట్టుకి వెళ్ళిపోయేవి, ఒకపక్క చనిపోయిన సోదరుడి కుటుంబం ఆయన్ని పీడించటమూ తెలుస్తుండేది. ఇలాంటి వాతావరణంలోకి ఏ అమ్మాయి మాత్రం పెళ్ళి చేసుకుని వెళ్ళాలనుకుంటుంది. మొత్తానికి ఈ దోబూచులాటల మధ్యనే, ఎంతో వేగంగా, అక్టోబర్‌ 31 నాటికల్లా నవలని పూర్తి చేయగలిగారు.

స్టెల్లోవ్‌స్కీ ఈ నవలని అనుకున్న సమయానికి అందుకోకుండా తప్పించుకుంటాడనీ, ఎలాగైనా ఒప్పందం నుంచి లాభం పొందటానికి ప్రయత్నిస్తాడనీ దాస్తోయెవ్‌స్కీకి ముందే అనుమానం వచ్చింది. దాంతో ఆయన తరఫున అన్నా వెళ్ళి లాయర్‌ని సంప్రదించింది. ఆ నవల రాతప్రతిని నోటరీ దగ్గరగానీ, పోలీస్‌ అధికారి దగ్గరకానీ రిజిస్టర్‌ చేయించుకొంటే మంచిదని లాయరు సలహా ఇచ్చాడు. దాస్తోయెవ్‌స్కీ అనుమానపడ్డట్టే ఆఖరి రోజున స్టెల్లోవ్‌స్కీ ఊళ్ళో లేకుండా తప్పించుకున్నాడు. అతని ప్రచురణ ఆఫీసుకి వెళ్తే అక్కడున్న మేనేజర్‌ ఆ రాతప్రతిని తీసుకునే అనుమతి తనకు లేదని బుకాయించాడు. అప్పటికే నోటరీ కట్టేశారు. దాంతో దాస్తోయెవ్‌స్కీ ఉరుకుపరుగుల మీద పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లాడు. జిల్లా పోలీసు అధికారి ఆ రాత్రి పదింటికి కానీ రాడని తెలిసింది. మొత్తానికి ఇక డెడ్‌ లైన్‌ రెండు గంటలే ఉందనగా, దాస్తోయెవ్‌స్కీ తన నవల రాతప్రతిని పోలీసుల దగ్గర రిజిస్టర్‌ చేయించుకుని, రశీదు తీసుకుని, ఆ భయంకరమైన ఒప్పందం నుంచి బయటపడ్డాడు.

నాలుగు నెలల తర్వాత దాస్తోయెవ్‌స్కీ తనకంటే పాతికేళ్ళు చిన్నదైన అన్నాను చర్చిలో పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళి తర్వాత ఆయన చుట్టూ ఒక కంచెలా నిలబడింది అన్నా. జూదం వ్యసనం నుంచి ఆయన్ను అతికష్టం మీద గట్టెక్కించింది. డబ్బుకోసం ఆయనవైపు చేయిచాచేవాళ్ళకి అడ్డంపడి లేదని చెప్పగలిగింది. కూడబెట్టడం మొదలుపెట్టి అప్పుల్లోంచి బయటపడేసింది. పదిహేనేళ్ళ సహచర్యం తరువాత 1881లో ఆయన మరణించేదాకా, వెన్నంటి ఉంది.

(ఈ వ్యాసానికి ఆధారం జోసెఫ్‌ ఫ్రాంక్‌ రాసిన దాస్తోయెవ్‌స్కీ జీవిత చరిత్ర)
- మెహెర్

November 23, 2019

నబొకోవ్‌కి దాస్తోయెవ్‌స్కీ ఎందుకు నచ్చడు...?

 ఈ ఇద్దరు రచయితలూ హేతువునీ, దాని పెత్తనాన్నీ వ్యతిరేకించారు. హేతువు (reason) పునాదిగా రష్యాలో మేధావులు నిలబెట్టజూసిన, నిలబెట్టిన సిద్ధాంతాల్ని, వాటి అమలుని, ఆచరణని వ్యతిరేకించారు. దాస్తోయెవస్కీ హేతువు పరిమితుల్ని ఎత్తిచూపుతూ, మనిషికి చైతన్యమనే (consciousness అనే) శాపం ఉన్నంతవరకు హేతువుని సక్రమంగా మనుషులకు అన్వయించలేమంటాడు. చైతన్యమొక యాతన అంటాడు:

‘‘యాతన లోంచే చైతన్యం పుట్టింది. మనిషికి చైతన్యం అనేది అతి పెద్ద శాపమే గానీ అతను దాన్ని మరే ఇతర ప్రయోజనం కోసమూ వదులుకోడానికి ఇష్టపడడు. రెండు రెళ్ళ నాలుగు అని చెప్పే హేతువు కంటే చైతన్యం చాలా గొప్పది.’’ 

(‘‘Why, suffering is the sole origin of consciousness. Though I did lay it down at the beginning that consciousness is the greatest misfortune for man, yet I know man prizes it and would not give it up for any satisfaction. Consciousness, for instance, is infinitely superior to twice two makes four. – from ‘Notes from the Underground’) 

మానవాళి మీద గుడ్డిగా హేతువును రుద్దే ప్రయత్నాలు చేసినప్పుడు వాటిని మానవ చైతన్యం ఎలా వ్యతిరేకిస్తుందో చెప్పటానికి దాస్తోయెవ్‌స్కీ తన నవలల్లోని- అండర్ గ్రౌండ్ మాన్, రాస్కోల్నికోవ్, స్టావ్రోజిన్, ఇవాన్ కరమజొవ్ లాంటి పాత్రల్ని వాడుకున్నాడు. కానీ ఇలాంటి దాస్తోయెవస్కీ పాత్రలన్నీ ‘‘రోగగ్రస్థులు’’ (‘‘sick people’’) అంటాడు నబొకొవ్. ఆయన దృష్టిలో మనిషి చైతన్యానికి ప్రాతినిధ్యం వహించేది ఇలాంటి రోగగ్రస్థులు కాదు:

‘‘...మనుషుల్లోను, మానవ స్పందనలోనూ లెక్కలేనంత వైవిధ్యం ఉంటుంది నిజమే గానీ, ఒక ప్రలాపించే పిచ్చివాడి స్పందనలని మానవ స్పందనకి ఉదాహరణగా మనం ఒప్పుకోలేము... అసలు ఒక రచయిత సృష్టించిన పాత్రల పరంపర అంతా ఇలా మానసిక రోగుల తోనూ, పిచ్చివాళ్ళ తోనూ నిండి ఉన్నప్పుడు మనం అతని రచనల్లో ‘వాస్తవికత’ గురించీ, ‘మానవానుభవం’ గురించి ఏమైనా మాట్లాడుకోగలమా అని నా ప్రశ్న,’’ అంటాడు దాస్తోయెవ్‌స్కీ మీద రాసిన వ్యాసంలో.  

(‘‘...though man and his reactions are infinitely varied, we can hardly accept as human reactions those of a raving lunatic. ... It is questionable whether one can really discuss the aspects of ''realism'' or of ''human experience'' when considering an author whose gallery of characters consists almost exclusively of neurotics and lunatics.’’ – from ‘Lectures on Russian Literature’). 

నబొకొవ్ దృష్టిలో చైతన్యమొక వరం. ఒక ఇంటర్వ్యూలో సృష్టిలో మిమ్మల్ని ఆశ్చర్యపరిచేది ఏమిటి అని అడిగినప్పుడు ఆయన చెప్పిన జవాబు: ‘‘చైతన్యమనే అద్భుతం– పుట్టక మునుపటి చీకట్లలో ఒక కిటికీ ధబాల్న తెరుచుకుని ఎండ కాసే లోకం కనిపించటం’’ (‘‘the marvel of consciousness–that sudden window swinging open on a sunlit landscape amidst the night of non-being.’’) 

నబొకొవ్ కూడా దాస్తోయెవస్కీ లాగానే హేతువుకి ఉండే లిమిటేషన్లనీ, మానవ చైతన్యానికి ఉన్న విస్తృతినీ నమ్మాడు. కానీ దాస్తోయెవస్కీ తన నవలల్లో హేతువుకి లొంగని మానవ చైతన్యపు లక్షణాలని పిచ్చితనం లాగ చూపించటం నబొకొవ్‌కి నచ్చలేదనుకుంటాను. నబొకొవ్ దృష్టిలో హేతువుని ఏమాత్రం ఖాతరు పెట్టని మానవ చైతన్యపు స్వభావం ఒక అద్భుతం. అది పిచ్చితనం కాదు, అదే దాని అందం. ఆ అందాన్ని గొప్పగా వ్యక్తం చేసేవే నబొకొవ్ నవలల్లోని చాలా పాత్రలు. 

దాస్తోయెవస్కీ కూడా నబొకొవ్‌ లాగే హేతువుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కానీ, ఆ మాట్లాడే క్రమంలో నబొకొవ్‌ ఎంతో గొప్పగా ఎంచే చైతన్యపు లక్షణాల్ని కించపరుస్తున్నాడు. అందుకే, దాస్తోయెవస్కీ మీద తన అయిష్టతని పదే పదే బాహటంగా చెప్పటం ద్వారా, నబొకొవ్- తామిద్దరు చెప్పేదీ ఒకేలా కనిపించినా, నిజానికి చాలా భిన్నమని నిరూపించదల్చుకున్నాడు. దాస్తోయెవస్కీ మీద ఆయన వ్యతిరేకతకి మూలం ఇది. మరికొన్ని ఈస్థటిక్ కారణాలున్నాయి, అవి వేరే విషయం.

(ఇప్పుడే ‘నోట్స్ ఫ్రం ద అండర్ గ్రౌండ్’ చదువుతుంటే ఈ పాయింట్ తట్టింది. మళ్ళీ మర్చిపోతానేమోనని ఇక్కడ రాస్తున్నాను.)

June 18, 2019

డిగ్రీ ఫ్రెండ్స్



నలభైకి దగ్గరపడే కొద్దీ నాకు ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. తెల్లారగట్ల పార్కులో పరిగెడుతున్నాను. మొదట్లో ఓ పదడుగులేయటం కష్టంగా ఉండేది. ఇప్పుడు పావు కిలోమీటరు పైనే ఆగకుండా పరిగెత్తగలను. మొన్నో రోజు పరుగు మధ్యలో ఉండగా పాత విషయం ఒకటి గుర్తొచ్చింది- పదేళ్ళ క్రితం రెడ్డీ, బాషా, నేనూ వేసుకున్న పరుగుపందెం, అదీ సముద్రం దగ్గర… స్నేహ సమయాల్ని అలలపై తీసుకెళ్లి దాచిపెట్టి మళ్ళీ ఎప్పుడు తిరిగొచ్చినా తెచ్చిచ్చే సముద్రం…. ముగ్గురం వైజాగ్ బీచ్లో నడుస్తున్నాం. రెడ్డి అన్నాడు పరిగెడదామా అని. చెప్పులు విడిచి, ఫాంట్లు మోచిప్పలపైకి మడతపెట్టి, వరుసలో నిలుచున్నాం. మూడంకెలు లెక్కపెట్టి పరుగు… ఇసకలో ముద్రలు గుద్దుతూ పాదాలు… మహాయితే పదిసెకన్లు వాళ్ళిద్దరికంటే ముందున్నానేమో. తర్వాత నన్ను దాటేశారు. నాకు దమ్మయిపోయి, ఇసుకలో కూలబడిపోయినా, ఇద్దరూ పరిగెడుతూనే ఉన్నారు. చివరకి బక్కోడు బాషాగాడే రెడ్డిని దాటి ముందుకు వెళ్ళిపోయాడు. పార్కులో పరుగు మధ్యలో ఇది గుర్తు రాగానే అనిపించింది- ఈసారి పందెం పెడితే నేనే గెలుస్తానని. అంటే ఈలోగా నేనేదో యవ్వనాన్ని వెనక్కు తెచ్చేసుకున్నానని కాదు. బాషాకి నాలుగేళ్ళ క్రితం కాలు విరిగింది. మండపేటలో వాళ్ళ చెప్పుల షాపులో పైఅరల్లోంచి చెప్పులు తీయబోతూ పొడవాటి స్టూలు మీంచి కిందపడ్డాడు. ఒక ఏడాది పాటు సరిగా నడవలేకపోయాడు. ఇప్పటికీ పరిగెత్తే సీనైతే ఉందని అనుకోను. రెడ్డిగాడు కూడా వారానికి ఐదు రోజులు మాచవరం నుంచి ఒంగోలు వెళ్ళి చేయాల్సిన ఫైనాన్స్ వ్యాపారంతో శరీరాన్ని ఎంత పట్టించుకుంటున్నాడన్నది అనుమానమే.

పదేళ్ళ క్రితం వైజాగ్ వెళ్ళింది అక్కడ్నించి అరకు వెళ్దామని. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ముగ్గురం మండపేటలో కలుసుకున్నాం. ముందు వైజాగ్లో దిగి అక్కడుంటున్న కృష్ణగాడిని కూడా మాతో కలుపుకు పోదామనుకున్నాం. కృష్ణ మాతోపాటు మండపేట గవర్నమెంటు కాలేజీలోనే డిగ్రీ చదివి తర్వాత వైజాగ్ వెళ్ళిపోయాడు కుటుంబంతోపాటు. వైజాగ్ బస్స్టేషన్లో మమ్మల్ని రిసీవ్ చేసుకుంది మొదలు కృష్ణగాడు తను అదివరకట్లా ముద్దపప్పు కాదని నిరూపించుకోవటానికి ట్రై చేస్తున్నట్టు అనిపించింది. కలిసిన కాసేపట్లోనే ఇన్స్టిట్యూట్లో లైన్లో పెట్టిన అమ్మాయి గురించి చెబుతున్నాడు. కానీ వాడి ఇంటికి వెళ్ళగానే పాత సీనే కనిపించింది. కృష్ణ వాళ్ళమ్మగారు వాడి మీద ఇదివరకట్లాగే అరుస్తున్నారు, మా ముందు కూడా.  కృష్ణగాడు ఒకపక్క అమ్మంటే లెక్క లేదన్నట్టు మాకు కటింగ్ ఇస్తూనే, మరోపక్క ఆ ప్రయత్నంలో ఆవిడకి దొరికిపోకుండా జార్త పడుతున్నాడు. మేం ముగ్గురం పక్కగదిలో కూర్చుని నవ్వుకుంటున్నాం. ఒకసారి మండపేటలో వాళ్ళమ్మ వల్లే కృష్ణ పోలీసు కేసులో ఇరుక్కున్నాడు. పక్కింటివాళ్ళతో ఏదో గొడవైతే ఆవిడ గిన్నె నిండా నూనె మరిగించి వాళ్ళ మీదకి విసిరేసిందట. వాళ్ళు ఎస్సీలు, వీళ్ళు కమ్మోళ్ళు. అట్రాసిటీ కేసయ్యింది. కృష్ణ మరి తప్పకో ఏమో కేసు తన మీద వేసుకున్నాడు. ఆ రోజు మేం కాలేజీలో ఉండగా తెలిసింది వాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడని. సైకిళ్ళమీద పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. కృష్ణగాడు లోపల్నించి మెల్లగా నడుచుకుంటూ వచ్చి మా పక్కన కూర్చున్నాడు. వాడ్ని రాత్రి చాలాసేపు బల్ల మీద బోర్లా పడుకోబెట్టి అరికాళ్ళ మీద కర్రలతో కొట్టారంట. తర్వాత నేల మీద నీళ్ళు పోసి అందులో నడిపించారంట. ఇదంతా కృష్ణగాడు నవ్వుతూనే చెప్పాడు. ఆ నవ్వులో కొంచెం విరక్తి వున్నా అదీ పైపైనే అనిపించింది. ఒకవేళ వాడికి ఇదంతా కొత్త అనుభవంలాగ ఉందేమో. చెప్పటం పక్కింటివాళ్ళు దొంగ కేసుపెట్టారని చెబుతున్నాడు. మాకైతే అనుమానమే. వాళ్ళమ్మగారు బాగా దూకుడు మనిషని అనిపించేది. మేం స్టేషన్ నుంచి తిరిగి కాలేజీకి వెళ్ళేసరికి లాబ్లో బోటనీ క్లాసు జరుగుతుంది. మేం ముగ్గురం వెనక బెంచీలో కూర్చుని పోలీస్ స్టేషన్లో జరిగింది మాట్లాడుకుంటున్నాం. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి అంతసేపు కూర్చోవటం మాకు అదే మొదటిసారి. పైగా నిన్నటిదాకా మాతో కలిసి తిరిగినవాడు, మా ఫ్రెండ్, స్టేషన్లో ఉండటం, పోలీసుల చేత తన్నులు తినటం… ఏదో పెద్దాళ్ళలోకంలోకి తలుపు పూర్తిగా తెరుచుకున్న ఫీలింగ్. క్లాసు మధ్యలో మాట్లాడేట్టయితే బైటికి పొమ్మంది బోటనీ మేడమ్. నేను ఎక్కళ్ళేని ధైర్యంతో పదండ్రా అని లేచాను. ముగ్గురం కాలేజీ వెనక తోటలో జాంచెట్టు కొమ్మలకి ఆనుకుని ఆ పీరియడ్ అయ్యేంత దాకా మాట్లాడుకున్నాం. అమ్మంటేనే భయపడే కృష్ణగాడు పోలీస్ స్టేషన్లో అంత నిబ్బరంగా ఉండటం చూసి మాకు ఆశ్చర్యమేసింది. ఆ తర్వాత నాలుగైదు రోజులకి కృష్ణగాడ్ని వదిలిపెట్టారు. కేసు మాత్రం కొన్నేళ్ళపాటు నడిచింది. ఈ గొడవ తర్వాతే వాళ్ళ కుటుంబం మండపేట వదిలేసి వైజాగ్ వచ్చేసింది.

కృష్ణ మాతోపాటు అరకు రాలేనన్నాడు. కానీ జూపార్కు, కైలాసగిరి తిప్పి చూపిస్తానన్నాడు. వాడు మాతో ఏడేళ్ళ క్రితం చదివినదానికీ ఇప్పటికీ చాలా మారిపోయాడు. ఏడేళ్ళ క్రితం తన స్వభావం ఇప్పుడు వాడికి నచ్చట్లేదనుకుంటాను. ఆ కాలాన్ని గుర్తు చేసే మా మీదా ఇష్టం పోయినట్టుంది. అంటీముట్టనట్టు ఉన్నాడు. వాడి సర్కిల్ వాడికి ఉంది. మాతో తిరుగుతున్నా వాడి ఫోన్లు వాడికి వస్తున్నాయి. ఇంక మేమూ వాడ్ని మా ప్లాన్లోంచి పక్కకి తీసేసాం. మధ్యాహ్నానికి కైలాసగిరి దగ్గర మమ్మల్ని వదిలి పనుందని వెళ్ళిపోయాడు. కొండ మీద రెడ్డిగాడి ధ్యాసంతా జంటల మీదే. వాళ్ళు కాస్త పొదల పక్కకి వెళ్తే చాలు వీడిక్కడ తలకిందులైపోతున్నాడు. బాషాకి మాత్రం ఇదంతా ఇబ్బందిగా ఉంది. రెడ్డిగాడ్ని నవ్వుతూనే విసుక్కుంటున్నాడు. కాస్త కిందకి దిగి కొండవాలులో కూర్చున్నాం. అక్కడ్నించి చూస్తుంటే వైజాగ్ నగరానికి మూడు వైపులా కొండలూ, ఒకవైపు సముద్రం ఉన్నాయేమో అనిపించింది. కింద అలల నురగలు సన్నగా దారాల్లాగా ఒడ్డు వైపు కదులుతున్నాయి. అసలైన జీవితానికి ఇంకా ఇటువైపే ఉన్నామన్న ఉత్సాహం. ముందున్న జీవితమంతా ఏ కాలుష్యాలూ లేకుండా, మేం ఎటు వెళ్తే అటు రమ్మంటూ లెక్కలేనన్ని దారులుగా విడిపోయి పరుచుకుంటుందనే నమ్మకం. కొండ మీంచి ఆటోలో రుషికొండ బీచికి వెళ్ళాం. సముద్రంలోకి పొడుగ్గా పొడుచుకెళ్ళిన రాళ్ళగుట్ట మీద చివరిదాకా వెళ్ళి స్నానం చేశాం. అలలూ, వాటితో కలబడే ఆడాళ్ళూ. తడిబట్టల్లోంచి వైనం తెలుస్తున్న వొళ్ళు. తలతిరిగేదాకా స్నానం చేసాం. ఐసులు చీక్కుంటూ, ఒడ్డు వారన అలా నడుచుకుంటూ పోయాం. పోయేకొద్దీ మనుషుల సందడి పల్చబడింది. వాళ్ళ కేకలు పల్చగా అలల వెనక్కి. చెట్లలోంచి ఏదో పక్షికూత- ఇటు రావొద్దన్నట్టు. బట్టలు వొంటి మీదే ఆరిపోయాయి. కడుపులో ఏమీ లేని, అలాగని ఆకలీకాని తేలికతనం. అప్పుడే రెడ్డి పరుగుపందెం అన్నాడు. ఆ రాత్రి ముందనుకున్నట్టు కృష్ణ ఇంటికి వెళ్ళకుండా లాడ్జిలో రూమ్ తీసుకున్నాం. ఒకే పెద్ద మురికి మంచం మీద సర్దుకుని పడుకున్నాం.

మర్నాడు బొర్రాగుహలు, అరకు. రైల్లో డోర్స్ దగ్గరంతా కుర్రాళ్ళు ఆక్రమించేశారు. టన్నెల్స్ వచ్చినప్పుడల్లా చీకట్లో పొలికేకలు పెడుతున్నారు. మేం కిటికీల్లోంచి తొంగి చూస్తున్నాం. కుడివైపున్న లోయలో ఒక చోట పచ్చటి మైదానంలో అగ్గిపెట్టెలకన్నా చిన్నగా ఇళ్ళు కనిపించాయి. అక్కడో గుడిసన్నా వేసుకుని బతకటం ఎంత బావుంటుందో కదా అనిపించింది. ‘బొర్రాగుహలు‘ స్టేషన్లో దిగి బయటకి వస్తే జీపులు ఉన్నాయి. ఆ బేరం అదీ వాళ్ళిద్దరే మాట్లాడారు. జీపులో వెళ్తుంటే రెడ్డిగాడు నా గురించి బాషాతో అంటున్నాడు: “మనమేమో ఈ రైలు టైమింగ్సూ, ఈ జీపులు మాట్లాడటం లాంటి చిల్లర మల్లర విషయాలన్నీ చూసుకోవాలి, అయ్యగారు మాత్రం ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంటారన్నమాట.

“ఎందుకురా అలా కుళ్ళిపోతున్నావ్? ఎలాగూ మీరు మాట్లాడుతున్నారు కదాని వదిలేసేను,” అన్నాను.

“అదేలేరా… నువ్వు పెద్ద కవివి… అన్నీ అలా డీప్గా ఎంజాయ్ చేస్తావు. మేమేదో అలా పైపైన బతికేస్తుంటాం..” అన్నాడు.

నా మీద వాడి అభిప్రాయానికి కారణముంది. నేను హైదరాబాద్ వెళ్ళిన కొత్తలో పెద్ద పెద్ద ఆలోచనలతో వాడికి ఉత్తరాలు రాసాను. అసలు అంతకుముందే డిగ్రీ చదువుతుండగానే వాడికి ఒక పెద్ద ఉత్తరం రాసాను. ఏదో గొడవై, ఎందుకో గుర్తులేదు, వాడు కొన్ని రోజులు నాతో మాట్లాట్టం మానేశాడు. నన్ను పక్కనపెట్టినట్టు నాకే తెలిసేలా ప్రవర్తించాడు. క్లాసులో మేమున్నదే లింగులింగుమంటూ నలుగురం. అంతకుముందు ఏడాది క్రితమే కొత్తగా పెట్టిన ఆ గ్రూపులో ఎవరూ చేరలేదు. మాకంటే ఆడాళ్ళే ఎక్కువ- పదిమంది పైనే. ఉన్న నలుగురు మగాళ్ళలో కృష్ణగాడెలాగూ మాతో కలిసి సినిమాలకి రావటంకానీ, వాలీబాల్ ఆడటంకానీ, ఇంకా క్లాసు బైటచేసే వేరే ఏ పనికిమాలిన పనిలోనీ తోడొచ్చేవాడు కాదు. ఇంక మిగిలిన ముగ్గురిలో కూడా ఇద్దరు మాట్లాడుకోపోతే ఎలా ఉంటుంది. పైగా నాకు రెడ్డిగాడంటే చాలా అబ్బరంగా ఉండేది. ఎందుకంటే వాడితో అమ్మాయిలు మాట్లాడతారు. ఫైనలియర్ రోజుల్లోనైతే వాళ్ళూరిలో ఒక పదహారేళ్ళ అమ్మాయి వీడి కోసం రాత్రుళ్ళు పెరట్లోకొచ్చి ఎదురుచూసేది. వీడు గోడ దూకి అక్కడికి వెళ్ళేవాడు. ఇద్దరూ బావి మాటున కూర్చునేవారు. ఈ రాత్రి సాహసాలన్నీ వివరంగా వర్ణిస్తూ–ఆ రోజు కిటికీలో లైటు ఎక్కువసేపు వెలిగిందనీ, బావి దగ్గర దోమలు తెగ కుట్టాయనీ ఇలాగ–వాడు నాకు కథలాగా చెప్పేవాడు. నా కళ్ళముందు బొమ్మలు కదిలేవి. ఒకసారి వీళ్ళ రహస్యం బయటపడిపోయి, ఆ అమ్మాయిని గదిలోపెట్టి చితగ్గొడుతున్నప్పుడు- ఆ కొన్ని రోజులూ వీడు పడ్డ యాతనలో కొంత నేనూ పడ్డాను. తర్వాత ఆ అమ్మాయికి పెళ్ళిచేసి పంపేసారు. వీడి ఫ్యామిలీ మాచవరం వచ్చేసింది. వీడు ఏడవగా చూసింది అప్పుడే. ఆ అమ్మాయి భర్తతో కలిసి తీయించుకున్న ఫొటోని ఫొటో స్టూడియో నుంచి సంపాయించి మాకు చూపించాడు. అమాయకత్వం ఆరని చెంపలతో ఆమె, పక్కన ముదురుమీసంతో భర్త. “కుతుకులూరు రెడ్లు అంతేరా,” అన్నాడు. ఈ ఎపిసోడ్తో నాకు వీడంటే ఎంతో ఆకర్షణ పెరిగిపోయింది. వీడి దగ్గర చాలా నేర్చుకోవచ్చనిపించేది. అమ్మాయిల విషయం ఒక్కటే కాదు; ఎవరితోనైనా సరే కలగజేసుకొని మాట్లాడే చొరవ, నేను వెనక్కి జంకే పరిస్థితుల్లో వీడు దూసుకుపోయే తీరు, మాట్లాట్డానికి ఏం లేని చోట కూడా నవ్వించేలా మాట్లాట్టం… ఇవ్వన్నీ వాడితో మసులుకుంటే నాకూ అబ్బుతాయేమో అనిపించేది, స్నేహం చేసి వాడిలోని సారమంతా లాగేసుకోవాలనిపించేది. అందుకే వాడు ఉన్నట్టుండి మాట్లాట్టం మానేసేసరికి- ఒక నాల్రోజులు చూసి, పెద్ద ఉత్తరం రాసిపడేశాను. మాట్లాడమనీ కాదు, మాట్లాడక్కర్లేదనీ కాదు. అదొక ప్రదర్శన, అంతే. మరుసటిరోజు సాయంత్రం నన్ను వాళ్ళింటికి తీసికెళ్ళాడు. పెంకుటింటి బైట గచ్చు మీద కూర్చున్నాం. వాళ్ళమ్మగారు ఇద్దరికీ కాఫీలు తెచ్చిచ్చారు. రెడ్డిగాడిది వాళ్ళమ్మగారి పోలికే. ఆవిడది ఎంతో కళగా, ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ముఖం. నా ఉత్తరాన్ని రెడ్డిగాడు చాలాసార్లు చదువుకున్నాడని తెలిసింది. “నీలాగ నే రాయలేనురా” అన్నాడు. ఆ ఉత్తరంలో బహుశా ఎక్కడో నేను మామూలోడ్ని కాదనీ, నీ వెనకాల ఎటంటే అటు తిరిగే చెంచాగాడ్ని కాదనీ నిరూపించుకోవాలన్న ఉబలాటం ఉందేమో. అది తీరింది, కాస్త ఎక్కువే తీరింది. ఆ తర్వాత వాడు నన్ను సమానంగా చూడటమే కాదు, ఒక్కోసారి ఇలాంటి ఆలోచనలు మనసులో ఉంచుకుని, వాటిని అంతే స్పష్టంగా రాయగలవాడిగా నా మీద ఏ మూలో కుళ్ళుకునేవాడేమో అనిపించేది. అది అప్పుడప్పుడూ వాడి మాటల్లో బయటపడిపోయేది. 

బొర్రా గుహల్ని గబ్బిలాల కంపు మధ్య ఎన్ని మూలలకి పోయి చూడాలో అన్ని మూలలకీపోయి చూసేసాం. తర్వాత మా జీపువాడు ఆ చుట్టుపక్కలే ఏదో జలపాతం ఉందంటే అటు వెళ్ళాం. అందులో దిగి స్నానం చేసి, అక్కడ్నించి తుప్పల మధ్య ఒక బాటలో పైకి నడిస్తే మళ్ళీ రైల్వే ట్రాకు. పట్టాల మీద కొంత దూరం నడిచాం. చెప్పుల కింద కంకర్రాళ్ళు, తుప్పల్లోంచి పురుగుల చప్పుడు. ఒక టన్నెల్ ఎదురయ్యింది. రైలు వచ్చేలోగా టన్నెల్ ఈ చివర నుంచి ఆ చివరకి పరిగెత్తగలమా, ఒకవేళ ఈలోగానే రైలు వచ్చేస్తే టన్నెల్ వారన ఎటునక్కాలీ అని చూసుకున్నాం. ధైర్యం చేసి పరిగెత్తాం-టన్నెల్ చీకటి గుయ్యారంలోకి, దూరంగా అటుచివర్న కనిపిస్తున్న వెలుగు వైపుకి. లోపలంతా చల్లటి తేమ చీకట్లు. మా అరుపులూ పొలికేకలూ మళ్ళీ మాకే వేరేలా వినపడుతున్నాయి. రాని రైలు వచ్చేస్తున్నట్టు వీపు వెనక తరిమే భయం. నరాలు బిగిసే ఆనందం. పరిగెత్తి పరిగెత్తి… అటు చివర్నుంచి దూసుకొచ్చాం, తుపాకి గొట్టంలోంచి గుండ్లలాగ, మళ్ళీ పచ్చటి చెట్ల మధ్యకి.

వీళ్ళిద్దరూ అప్పుడప్పుడూ నన్ను కలవటానికి హైదరాబాద్ వచ్చేవాళ్ళు. రెడ్డిగాడైతే ఒకసారి నేను ఊరెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు నన్ను రైలెక్కిద్దామని వచ్చి, అప్పటికప్పుడు అనుకుని నాతోపాటు రైలెక్కేశాడు. జనరల్ బోగీలోకి తోసుకుంటూ దూరేసాం. కిటికీల పక్కన ఎదురుబొదురుగా సీట్లు దొరికాయి. వాడు ఒక అమ్మాయికి పక్కన చోటులేకపోయినా జరిగి చోటిచ్చాడు. ఆ అమ్మాయి తెల్లగా పొట్టిగా ఉంది. చున్నీ లేదు, మాసిన జుట్టు, వొంట్లో పనులకెళ్ళే మోటుదనం. ఏదోలాగ వేలాడుతూ కునకటమే తప్ప నిద్రలేని ఆ ప్రయాణంలో వాడూ ఆ అమ్మాయీ ఒకళ్ళ మీద ఒకళ్ళు వాలిపోయి నానా పాట్లూ పడ్డారు. పొద్దున్న లేచేసరికి ఇద్దరికీ ఏదో మొగుడూ పెళ్ళాల్లాంటి చనువొచ్చేసింది. వాడా అమ్మాయికి కిటికీలోంచి ఏవో కొనిపెట్టాడు. దిగేటప్పుడు ఆ అమ్మాయి సామాను మోసాడు. నేను తర్వాత వెక్కిరింపుగా నవ్వలేనంత మామూలుగా చేశాడిదంతా. అప్పటికింకా సెల్ఫోన్లవీ ఎక్కువ లేకపోబట్టిగానీ లేదంటే ఇద్దరూ నంబర్లు కూడా మార్చేకుందురు.

వచ్చేటప్పుడు వాడి పర్సులో ఏం డబ్బులున్నాయో అవే ఉన్నాయి. నేను ఆఫీస్ అసిస్టెంటుగా నా నాలుగువేల రూపాయల జీతంలోంచి మహాయితే ఓ ఐదొందలు ఖర్చుపెట్టగలను. మొత్తానికి వాటితోనే సిటీ చూద్దామని బయల్దేరాం. మార్నింగ్ షో సినిమాకి వెళ్దామనీ, మధ్యాహ్నం బిర్యానీ తిందామనీ, సాయంత్రానికి నెక్లెస్ రోడ్డుకి పోదామనీ… ఇలా చాలా ప్లాన్లు వేసుకున్నాం. అమీర్పేటలో నడుస్తుంటే పుట్పాత్ మీద ఒకడు తువ్వాలు వేసి దాని మీద మూడు పెద్ద కారమ్స్ స్ట్రయికర్ల లాంటివి అటూ యిటూ తిప్పుతున్నాడు. ఆ మూడింటిలో ఒక బిళ్ళకి కింద వేరే రంగు చుక్క ఉంది. అది కనపడకుండా మూడూ బోర్లించాడు. కంటికి అందనంత వేగంతో మూడింటినీ తారుమారు చేస్తున్నాడు. వేరే రంగు చుక్కున్న బిళ్ళ ఎక్కడకి మారిందని అనుకున్నామో దాని మీద డబ్బులు కాయాలి. అప్పుడు తిప్పి చూపిస్తాడు. చుట్టూ ఉన్న గుంపులో నిలబడి కాసేపు ఆట చూసాం. కొంతమంది వంద కాయింతాలు పెడుతున్నారు, గెలిచినవి జేబులో వేసుకుంటున్నారు. చూసేకొద్దీ ఆ చుక్కున్న బిళ్ళ ఎక్కడకి మారుతుందో మాకు సులువుగా తెలిసిపోతున్నట్టు అనిపించింది. రెడ్డిగాడు గుంపులోకి దూరి ఒక వంద పెట్టాడు. పోయింది. ఇంకో వందపెట్టాడు. మళ్ళీ పోయింది. పోయిన రెండు వందలూ ఒకే దెబ్బకి వెనక్కి వచ్చేలాగ ఇంకో రెండు వందలు పెట్టాడు. అవీ పోయాయి. అప్పుడింక నేను వెనక్కి లాగటం మొదలుపెట్టాను. వాడు మాత్రం ఉన్నవన్నీ తుడిచిపెట్టుకుపోయేదాకా వెనక్కి తగ్గలేదు. పాపం వాడలా అన్నీ పోగొట్టుకున్నప్పుడు నేను మాత్రం డబ్బులు దాచుకోవటం అన్యాయం కదా అనిపించి, ఆ ఒకేఒక్క కారణంతో, జేబులోంచి వంద కాయింతం తీసాను. మొత్తానికి ఇద్దరం ఓ వెయ్యి దాకా వదుల్చుకుని ఆ గుంపులోంచి బైట పడ్డాం. అప్పటిదాకా నగరం ఎన్నో అవకాశాలతో చేతులు చాపి, మా ముందు ఎంతో హొయలు పోయిందల్లా, మా జేబులు ఖాళీ అని తెలియగానే ముఖం మాడ్చుకుని తలుపేస్సుకుంది. ఆట చుట్టూ మూగినవాళ్ళల్లో కొంతమంది రహస్యంగా ఆడించేవాడి తరఫున పని చేస్తున్నారనీ, వాళ్ళు మమ్మల్ని ఊదరగొట్టి పదే పదే తప్పుడు బిళ్ళ మీద డబ్బు కాసేలా చేసారనీ… ఇలా అప్పటికింక ఎందుకూ పనికిరాని చర్చలన్నీ చేసుకుంటూ, సెకండ్ క్లాసు టికెట్టుతో సినిమా చూసి, దారిలో చెరుకు రసం మటుకు తాగి, ఈసురో దేవుడా అనుకుంటూ గదికి వచ్చి పడ్డాం. ఆ నాల్రోజులూ అన్నీ మూసుకుని గదిలోనే ఉన్నాం. మహాయితే ఒక రాత్రి సత్యసాయి నిగమాగమంలో ఎవరిదో అరువుపెళ్ళికి వెళ్ళి భోజనం చేసొచ్చుంటాం. వాడ్ని వెనక్కి పంపటానిక్కూడా నా రూమ్మేట్లని డబ్బులడగాల్సి వచ్చింది. వాడు కాకినాడ వెళ్ళాక కొన్నాళ్ళు వాళ్ళ మామయ్య దగ్గర చికెన్ షాపులో తోడున్నాడు. తర్వాత ఎల్.ఎల్.బిలో చేరాడు.

బాషాగాడు రెండుమూడు సార్లు చెప్పుల షాపుకి మెటీరియల్ కోసమని వచ్చాడు. అప్పటికి నాకు జీతం బానే ఉంది. ఇద్దరం అటూయిటూ తిరిగాం. రాత్రికి నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో గోడ మీద కూర్చున్నాం. ఎదర ప్లాజాలో పెద్ద జనం లేరు. మా నీడలు మా ముందు పొడవుగా సాగాయి. సాగర్ అవతల టాంక్బండ్ మీద పసుపు ఎరుపు ముత్యాలు దొర్లుకుంటూ పోతున్నట్టు ట్రాఫిక్ లైట్లు. బాషాగాడంటేనే ఒక ఊగిసలాట. ఏదీ ధైర్యంగా అడుగేయడు. మా నలుగురిలో కృష్ణ, రెడ్డి వీళ్ళిద్దరే డిగ్రీ పాసయ్యారు. బాషాకి పదకొండు సబ్జెక్టులుపోతే, నాకు పదమూడు సబ్జెక్టులు పోయాయి. నేను సబ్జెక్టులు కట్టే పని పెట్టుకోకుండా వెంటనే హైదరాబాద్ వచ్చేసాను, ఉద్యోగం వెతుక్కోవటానికి. బాషా మాత్రం ప్రతి ఏడాదీ వెళ్ళి పరీక్షలు రాసొచ్చేవాడు. ఏడాదికి ఒకటో రెండో పాసయ్యేవాడు. చివరికి ఎన్ని పూర్తి చేశాడో, ఎప్పుడు ప్రయత్నించటం మానేశాడో తెలీదు. మంగళవారాలు మండపేటలో ముస్లింల వ్యాపారాలకి సెలవు. ఆ రోజున తోటి ముస్లిం కుర్రోళ్ళతో కలిసి కాలేజ్ గ్రౌండ్లో క్రికెట్ ఆడేవాడు. బాషా వాళ్ళూ నలుగురన్నదమ్ములు. కానీ వాళ్ళింట్లో ఉన్నవి రెండే వ్యాపారాలు. ఒకటి వాళ్ళ నాన్నగారు చేసే కాంట్రాక్టులు, రెండోది చెప్పుల షాపు. పెద్దన్నయ్య రైల్వేలో జాబు కొట్టేడు. రెండో అన్నయ్య వాళ్ళ నాన్నగారి తర్వాత కాంట్రాక్టులు చేస్తున్నాడు. ఇక మిగిలిన చెప్పుల షాపు కోసం మూడో అన్నయ్యకీ, బాషాగాడికీ మధ్యన పైకి చెప్పలేని పోటీ ఏదో నడుస్తుందనిపించేది. కొన్నాళ్ళు పక్కవీధిలో బాషాగాడి కోసమనే ఇంకో చెప్పుల షాపు తెరిచారు, కానీ నడవక మూసేశారు.

“గ్రౌండ్లో మీ వోళ్ళతో క్రికెట్ ఇంకా ఆడుతున్నావారా?”

“లేదురా… ఆ సర్కిలంతా వేరైపోయింది. ఆడుతున్నారు కానీ కుర్నాకొడుకులు… మనం కలవలేం.”

“ఏదోలా ధైర్యం చేసి వచ్చేయెహె. ఇక్కడే ఏదోటి చేసుకోవచ్చు.”

“చూడాల్రా. కానీ ఇది కాంట్రాక్టు పనులకి సీజను. మా అన్నయ్య ఒక్కడూ చెయ్యలేడు.”

“మరి సీజన్ లేనప్పటి సంగతి? అదెలాగూ మీ అన్నయ్యదే కదా, అప్పుడేం చేస్తావ్?”

“చెప్పుల షాపుంది కదా.”

“ఒరే కాంట్రాక్టుల సీజన్ అని అటు వెళ్తావ్, చెప్పుల సీజన్ అని ఇటు వస్తావ్. తీరా చూస్తే అవి రెండూ నీవి కాదు. చూస్కోపోతే… చివరికి ఎటూ కాకుండా పోతావ్”

ఒక్కొకళ్ళ జీవితం ఒక్కో స్పీడులో వెళ్తుందేమో. ఇక్కడ నా జీవితంలో ఎన్నో జరిగిపోతుండేవి. అక్కడ రెడ్డిగాడు మాత్రం ఎప్పుడూ ఆ మాయదారి ఎల్.ఎల్.బి చదువుతూనే ఉండేవాడు. తర్వాత కొన్నాళ్ళు ఎంబీయే అన్నాడు. చివరకు ఫోన్లో వాడు ఇవన్నీ చెబుతుంటే- బెంచీల మీద అందరూ మీసాలు సరిగారాని అబ్బాయిలే ఉన్న క్లాసులో వీడొక్కడూ ముదురు మనిషి కూర్చొని పాఠాలు వింటున్నట్టు ఊహ వచ్చేది. ఎప్పటికో ఈ కాలేజీలు వదల్లేక వదల్లేక వదిలి, ఎవరో లాయరు దగ్గర అసిస్టెంటుగా చేరాడు. ఒకసారి ఏదో పని మీద కాకినాడ వెళ్ళినపుడు వాడిని అక్కడ కోర్టులో కలిసాను. అక్కడ జిల్లా కోర్టులన్నీ ఒకే ప్రాంగణంలో ఉంటాయి. ఎటు చూసినా- భూమిని పట్టుకుని ఆకాశంవైపుకి వేలాడే గబ్బిలాల్లాగ నల్లకోట్లలో మనుషులు. రెడ్డిగాడు కూడా తెల్ల షర్టూ ఫాంటు మీద నల్ల కోటు వేసుకుని బార్ లోంచి మెట్లు దిగి బయటకొచ్చాడు. నాకు ఆ రోజు కోర్టు హాళ్ళన్నీ తిప్పి చూపించాడు. సినిమాల్లో చూసే కోర్టు సీన్సుని ఆ గదుల్లో ఊహించుకున్నాను. కానీ ఆ చెక్కబోనూ, పైన జడ్జిగారు కూర్చునే అరుగూ తప్పించి చూస్తే అవి స్కూళ్ళల్లో స్టాఫ్ రూముల్లాగ చాలా మామూలుగా ఉన్నాయి. ఇక్కడి నుంచే చట్టం అనే వలనోదాన్ని విశాలంగా జనం మీదకి విసిరిపారేసి దొరికినోళ్ళని దొరికినట్టు జైళ్ళలోకి తోసేస్తారన్నమాట, అనిపించింది. ఆ అరిగిపోయి మాసిపోయిన వరండాల్లో నడుస్తున్నప్పుడు అక్కడక్కడా నల్ల కోట్లు వేసుకుని ఆడవాళ్ళూ కనిపిస్తున్నారు. ఒకరిద్దరిని చూపించి “వీళ్ళ మొహాలు గుర్తుపెట్టుకో, తర్వాత చెబుతాను ఒక్కోద్దాని గురించీ” అన్నాడు రెడ్డి. “పక్కా బోకులురా బాబూ ఒక్కోత్తీ” అన్నాడు ఆ సాయంత్రం వాడి గదిలో కూర్చున్నప్పుడు.

ఆడాళ్ళు కుళాయిల దగ్గర నీళ్ళ కోసం కొట్టుకునేలాంటి, మున్సిపాలిటీవాళ్ళు ఓపెన్ డ్రైనేజీల రొచ్చు తీసి రోడ్ల వారనే ఎండబెట్టేసేలాంటి ఒక ఇరుకు వీధిలో ఉంది వాడు అద్దెకుంటున్న గది. పెచ్చులూడిపోయిన మెట్లెక్కాం. దిగేవాళ్ళు ఎదురొస్తే ఎక్కేవాళ్ళు గోడకి అంటుకుపోవాలి. వాడి గదిలో ఎక్కడ్నుంచొస్తుందో తెలీకుండా నామమాత్రంగా వెలుగు. ఎండ తగలని గోడల్లోంచి తేమ వాసన. రెడ్డిగాడికి వాడు పని చేసే పెద్ద లాయరు ఇచ్చే జీతం ఎందుకూ పనికిరాదు. ఏదో ఫైళ్ళు రాసిపెట్టి, వాటిని మోసిపెట్టటం లాంటి చిన్న ఉద్యోగం. గడవటానికి దాంతోపాటు ఇంకేదన్నా చేస్తూ సంపాయించుకోవాల్సిందే.

“ఇంతేరా ఈ ఫీల్డు. సక్సెస్ అయ్యేదాకా నానా చంకలూ నాకాలి. ఒక్కసారి సక్సెస్ అయితే మాత్రం ఎక్కడో ఉంటాం. అంతా మాటల మీదే నడిచిపోద్ది… మాటలు… “

“నీకేరా, నువ్వు బానే మాట్లాడతావు కదా”

“నా మాటల్దేవుంది లేరా! మా సార్ మాట్లాట్టం చూడాలి నువ్వు… ఓర్నాయనో…  మనిషినలా నిలబెట్టి చుట్టూ కోటలు కట్టేస్తాడు. ఛా… మనం టైం వేస్ట్ చేస్సేంరా చాలాని. ఇయ్యన్నీ ఇప్పుడు చేయాల్సినవి కావు. ఓ పక్క ఇంట్లో మా బాబేమో పెళ్ళీపెళ్ళని దొబ్బేత్తన్నాడు.”

“ఎలా ఉన్నార్రా ఆయన?”

“ఉన్నాడులే. మాచవరం దగ్గర ఇటికెల బట్టీ ఒకటి దొరికితే చూసుకుంటున్నాడు. ఈ వయసులో ఒక్కడే ఆ వేడిలోని బూడిదలోని… నన్నడిగితే ప్రతి ఒక్కళ్ళూ కనీసం ఇద్దరు ముగ్గురు కొడుకుల్ని కనాల్రా మాయ్యా. ఒక్కడ్నే కని, ఆ ఒక్కడి మీదే ఆశలన్నీ పెట్టేసుకుని, వాడేమో ఎంతకీ అందిరాక, వయసైపోయినా ఏ రెస్టూ లేకుండా పని చేయాల్సి రావటం, ఇంక మనవలే జీవితానికి మిగిలిందన్నట్టు కొడుకుని పెళ్ళీ పెళ్ళని దొబ్బటం…”

“చేసేసుకోరా పోనీ… మరీ లేటైపోకుండా…”

“ఒరే ఈ గదివాటం చూసే ఆ మాట అంటున్నావా నువ్వు?”

“పోనీ నీతోపాటు సంపాయించే అమ్మాయినే చూసుకో… ఇక్కడెవరూ తగల్లేదా అలాగ…”

“ఛీ… వీళ్ళ జోలికి పోకూడదురా నాయనా. ఈ ఫీల్డులో ఎవర్నైనా అంటుకుంటే మసే,” ఏదో వ్యాధి గురించి మాట్లాడుతున్నట్టు పెట్టాడు ముఖం.

“మరీ చెప్తావ్రా… ఒక్క మంచమ్మాయీ ఉండదా?”

“అమ్మాయిలా…? అమ్మాయిలెవరూ లేరిక్కడ. నా ఫోన్ చూపిస్తే జడుసుకుంటావు.”

ఈ ఊరినిండా అక్రమ సంబంధాలే అన్నట్టూ, ఏ వీధిలో చూసినా రంకేనన్నట్టూ మాట్లాడాడు. వాడి మాటలు విన్నకొద్దీ ప్రపంచంలో వాడికి ఆడాళ్ళుగా మిగిలింది తల్లులూ చెల్లెళ్ళేనేమో అనిపించింది. మేడ మీద లుంగీ బనీన్లో నుంచుని నాకు చెయ్యూపాడు, నా పాత హీరో.

ఓ నాలుగేళ్ళ క్రితం హైదరాబాద్లో కలిశాం. అప్పటికి వాడు ‘లా‘ కూడా వదిలేసి హైదరాబాదులోనే ఏదో ఉద్యోగం వెతుక్కుందామని వచ్చాడు–ముప్ఫయ్యేళ్ళు దాటాక, చాలా ఆలస్యంగా. నేను అప్పుడేవో నా సమస్యల్లో ఉండి వాడ్ని పెద్దగా కలవటం కుదరలేదు. ఒకసారి మాత్రం వీర్రాజు అని ఒక పాత కాలేజీ ఫ్రెండ్ మా ఇద్దరినీ వాళ్ళ ఇంటికి పిలిచాడు. ఈ వీర్రాజుని నేను డిగ్రీ తర్వాత ఎప్పుడూ కలవ లేదు. హైదరాబాద్లోనే ఉంటున్నాడని రెడ్డిగాడు చెప్తేనే తెలిసింది. ఒకసారి ఫోన్లో మాట్లాడుకున్నాం. ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. ఇప్పుడు వాళ్ళావిడా పిల్లలూ ఊరెళితే ఓ సిట్టింగేద్దాం రమ్మంటున్నాడు. కెపీహెచ్బీలో అప్పర్ మిడిల్ క్లాసు వీధిలో ఇల్లు. లిఫ్ట్ లోంచి బైటికి వస్తే–ఫ్రంట్ బాల్కనీలో పాకిన లతలు, గోడకి ఆనించి షూ స్టాండు. తలుపు తాళమేసి ఉంది. వీర్రాజుకి ఫోన్ చేస్తే ఇద్దరూ వైన్ షాప్ దగ్గర ఉన్నారట. “నీకేం తెమ్మంటావు?” అని అడిగాడు. నేను తాగుడు మొదలెట్టిందే చాలా ఆలస్యంగా. కాబట్టి బ్రీజరూ, బీరూ ఇలా ఒక్కో మెట్టూ ఎక్కేంత టైం లేక తిన్నగా హార్డే తాగటం మొదలుపెట్టాను. అందులోనే ఏదన్నా తెమ్మని చెబితే, “ఛీ, ఎండాకాలం హార్డెందుకురా. మేమిద్దరం బీరు తెచ్చుకుంటున్నాం, ట్యూబోర్గు లైటు, పోనీ నీకొక్కడికీ స్ట్రాంగ్ తెస్తాంలే,” అన్నాడు. 

ముగ్గురం హాల్లో కూర్చునేసరికి కరెంటుపోయింది. ఛార్జింగ్ లైటు వెలుగులో అన్నీ సర్దుకున్నాం. మాకు ఏసీలో తాగే యోగం లేదన్నాడు వీర్రాజు. ఫ్రిజ్ లోంచి ద్రాక్షపళ్లు తీసి కడిగి పళ్ళెంలో తెచ్చి పెట్టాడు.

“ఇదేం గొడవరా… కారం కారంగా ఏదన్నా తేవొచ్చుగా?” అన్నాను.

“ఎందుకురా అయ్యన్నీ కడుపు చెడగొట్టుకోవటానికి కాకపోతే. ఇవి తిను, హెల్తీ. కావాలంటే మా అత్తగారు జంతికలూ కాజాలు పంపారు, అవి తీయనా పై నించి? స్వీట్స్ తింటే ఇంకా బా ఎక్కుతుందంట కూడా…”

రెడ్డిగాడు నా మొహం చూసి నవ్వుతున్నాడు. వాడికి ఈ వీర్రాజుగాడు ఇంటర్ నించీ తెలుసు. నాకు మాత్రం డిగ్రీలో కలిసాడు. కామర్స్ గ్రూపు. ఎప్పుడూ పక్కన ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్సుని వెంటేసుకుని, వాళ్ళ ఖర్చులన్నీ వీడు పెట్టుకుంటూ, ఆ ఒక్క అర్హత మీదా వాళ్ళకి లీడరులాగా మసులుకునేవాడు. రెండు మూడుసార్లు మా ముగ్గురినీ కూడా సినిమాలకి తీసుకెళ్ళాడు.

తొక్కలో బీరే కదా అన్నట్టు మొదటి సీసా గడగడా తాగేశాను. కానీ స్ట్రాంగ్ బీరుని తక్కువ అంచనా వేసానని త్వరగానే అర్థమైంది. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు. వీర్రాజుగాడు ఇక్కడ ఏం చేస్తున్నాడో, ఆ ఉద్యోగమెలా వచ్చిందో చెబుతున్నాడు. నా నోటికి ఫిల్టరింగ్ పోయింది: “మీ కమ్మోళ్ళకేంలేరా, ఎప్పుడూ ఒకళ్ళెనకాల ఒకళ్ళుండి బానే పుషింగ్ ఇచ్చుకుంటారు.”

“ఏం మీ కాపోళ్ళిచ్చుకోరా, రెడ్లిచ్చుకోరా… ఎదవ వాగుడూ నువ్వూను.”

“మీకున్నంత పెద్ద నెట్వర్క్ ఉండదులే. ఇంటిపేరు ఆనవాలు కడితే చాలు… మీ జల్లెడ బొక్కల్లోంచి ఎవ్వడూ కిందకి జారడు….”

రెడ్డిగాడు మధ్యలో కలగజేసుకొని నన్ను వెనక్కి లాగటానికి ట్రై చేస్తున్నాడు. “మనోడికా ఫీలింగ్ లేదెహె…” అంటున్నాడు.

నాకు పూర్తిగా తలకెక్కేసింది. ఇంక పెట్రేగిపోయాను. వీర్రాజుగాడ్ని నేరుగా అవమానించటం మొదలుపెట్టాను. ఏమాత్రం సరుకు లేకపోయినా ఇంటిపేరుని బట్టే వాడిక్కడ మంచి ఉద్యోగం సంపాయించి సెటిలయ్యాడన్నాను. కాలేజీలో ఉండగా బాలకృష్ణ సినిమా రిలీజైనప్పుడల్లా వాడు చేసిన హడావిడిని వెక్కిరించాను. పేర్లో లేకపోయినా వాడి ఫేస్బుక్ ప్రొఫైల్లో వచ్చి చేరిన “చౌదరి” అన్న తోకని వెక్కిరించాను. రెడ్డిగాడు ఎన్నిసార్లు మాట మళ్ళించినా ఫలితం లేకపోయింది. ఆ రోజుకి నాది ఒకటే పాటై పోయింది. బాల్కనీలో సిగరెట్లు కాల్చుకోవటానికి లేచినా ఈ టాపిక్ వదల్లేదు. “ఆ కమ్మ బలుపు చూపించుకోవటానికి అలా డబ్బులు ఖర్చుపెట్టేవోడివి కాబట్టి కానీ లేదంటే నీ వాటానికి కాలేజీలో నీకంతమంది ఫ్రెండ్సే ఉండేవాళ్ళు కాదు” అన్నాను. వీర్రాజు సిగరెట్ పారేసి రెడ్డితో “రేయ్… వాడ్నా టాపిక్ వదిలేయమనరా ఇంక” అని చెప్పి లోపలికి వెళ్ళిపోతున్నాడు. అసలు మా మధ్య లేనే లేని చనువుతోటి వాడి భుజం మీద చెయ్యేసి వెనక్కి లాగబోయాను. వాడు చప్పున వెనక్కి తిరిగి ఒక్క తోపు తోసాడు. నేను వెళ్ళి పూలకుండీల మధ్యన పడ్డాను. లేవటానికి ప్రయత్నించి మళ్ళీ మళ్ళీ పడిపోతున్నాను. ఏదో ఎండిన కొమ్మ బుగ్గ మీద విరిగింది. రెడ్డిగాడు వచ్చి చేయిచ్చాడు. నాకెంత ఎక్కేసిందంటే, అప్పుడు కూడా కోపం రాలేదు, ఏదో వాగుతూనే ఉన్నాను, బీరు మీద బీరు తాగుతూనే ఉన్నాను, అవుటైపోయేదాకా.

మరుసటిరోజు ఇంట్లో అద్దం ముందు నిల్చొని, నా బుగ్గ మీద తెల్లటి లోపలి పొర కనిపించేలా లేచిన చర్మాన్ని చూసాకా, అది పిండితే మొలుచుకొచ్చిన రక్తాన్ని చూసాకా అప్పుడు వచ్చింది కోపం. కానీ వీర్రాజుగాడి మీద కోపం కన్నా, రెడ్డిగాడు అక్కడ ఉండి నా వాగుడంతా విన్నాడన్న సిగ్గే ఎక్కువైపోయింది. నేనేదో కాస్త తెలివైనవాడ్నని ఊహించుకునే రెడ్డిగాడి ముందు ఏ మాత్రం లౌక్యం లేని కులగజ్జి వెధవలాగా దొరికిపోవటం అవమానంగా అనిపించింది. అది దెబ్బలాకన్నా అవమానంలానే ఎక్కువ రోజులు నొప్పెట్టింది. ఆ దెబ్బ ఎలా తగిలిందని మా ఆవిడ ఎంత అడిగినా చెప్పలేదు. అది మానేదాకా కొన్నాళ్ళు గడ్డం పెంచాను. గొడవైన తర్వాత రెండ్రోజులకే వీర్రాజుగాడు మా ఇంటికి వచ్చాడు. మొన్న నా చేత అడిగి తెప్పించుకున్న పుస్తకాలు తీసుకొచ్చాడు. వాడు అడిగినవన్నీ సొల్లు పుస్తకాలే, ఇచ్చినా ఇవ్వకపోయినా లెక్కేం లేదు. బహుశా నా ప్రవర్తనకి పశ్చాత్తాపం ఏమన్నా కనపడుతుందేమో చూద్దామని కూడా వచ్చినట్టున్నాడు. నాకు కోపం అణచుకోటానికే సరిపోయింది, ఇంక పశ్చాత్తాపమెక్కడ. మా ఆవిడ టీ పెట్టబోతుంటే అవసరంలేదని చెప్పాను. వాడిని తర్వాతెప్పుడూ కలవ లేదు.

అప్పులనేవి చీడలాంటివి. అప్పులున్నవాడి మనసులోని ఈన్యం భరించలేనిది. మా పిల్లాడు నెలలు నిండకుండానే పుట్టాడు. బొడ్డుపేగు మడతపడి తల్లి తిన్నదేదీ వాడికి పూర్తిగా వెళ్ళలేదు. పైగా పుట్టగానే పచ్చకామెర్లు. హైదరాబాద్లో అన్నేళ్ళ ఉద్యోగాల్లో నేను దాచుకున్నదేదీ లేదు–నాచేతికి కుష్టులాగా దుబారా. దాంతో పిల్లాడు ఆ ఖరీదైన ప్రైవేటు ఆసుపత్రిలో ఉన్న ఆ ఒక్క నెలలోనే ఎడాపెడా అప్పులయిపోయాయి. ఆ తర్వాత కూడా అవి తీరటం కన్నా వాటికి వచ్చి చేరేవే ఎక్కువైపోయాయి. చివరికి చుట్టుపక్కల అప్పుడు టచ్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ అయిపోయి, అడిగినవాళ్ళనే మళ్ళీ అడగలేక, టచ్లో లేనివాళ్ళని కూడా కెలకటం మొదలుపెట్టాను. అలాగే ఏదో ఒక నెల అత్యవసరమైతే బాషాగాడికి ఫోన్ చేసి పది వేలడిగి అకౌంట్లో వేయించుకున్నాను. వాడు ఈ ఐదేళ్ళలోనీ ఎప్పుడూ ఆ డబ్బు ప్రస్తావన తేలేదు. కానీ డబ్బులు ఇచ్చినవాళ్ళెవ్వరూ ఇచ్చింది మర్చిపోరని నా స్వభావం ప్రమాణంగా నాకు తెలుసు. నేను ఫోన్ చేసినప్పుడల్లా–ఫోన్ చేసి వేరే కుశలం అంతా మాట్లాడినప్పుడల్లా–ఇచ్చిన డబ్బులు వాడికి ఏదో మూల గుర్తొస్తూనే ఉంటాయని తెలుసు. కానీ తీర్చవలసిన జాబితాలో వాడి నంబర్ ఇప్పుడప్పుడే లేదు. అందుకని ఫోన్ చేయటమే మానేశాను. చివరికి వాడి పెళ్ళికి పిలిచినా వెళ్ళలేదు. రెడ్డి, కృష్ణ వెళ్ళొచ్చారట.

రెడ్డిగాడి పెళ్ళి అంతకన్నా ముందే అయ్యింది. కానీ వాడు పెళ్ళికి పిలవటం మాట అటుంచి- అసలు పెళ్ళయిందనే చాలా రోజుల దాకా నాకూ బాషాకీ చెప్పలేదు. పెళ్ళయిన తర్వాత వాళ్ళ అత్తారోళ్ళ ఫైనాన్స్ వ్యాపారం చూసుకోవటం మొదలుపెట్టాడు. వాడంటే గొప్ప అన్న ఫీలింగ్ నాలో ఉండేదని వాడికీ తెలుసు. అందుకే ఇలా జీవితంలో సెటిలవ్వటం కోసమే చేసుకున్న పెళ్ళి గురించి నాకు చెప్పాలనుకోలేదేమో. పెళ్ళి ఫొటో కూడా ఎప్పుడూ చూపించలేదు. వాడంతట వాడు ఫోన్ చేయటమూ తక్కువే. నేనే ఎపుడన్నా ఊరికే ఫోన్లో పేర్లు చూసుకునే సమయాల్లో వాడి పేరు కనిపిస్తే చేసేవాడ్ని. ఆ మాటా ఈ మాటా మాట్లాడి “ఐతే కలుద్దాంరా” అని ఫోన్ పెట్టేస్తాం, కానీ కలవం.

పార్కులో పరుగయ్యాకా కాసేపు చెమటలు ఆరేదాకా తోవ వారనున్న బెంచీల మీద కూర్చుంటాను. తోవకి అటువైపున్న పొగడ చెట్ల మీద పడే ఎండనో, స్ప్రింక్లర్స్ చిమ్మే నీళ్ళు పచ్చికలో కట్టే కాలవల్లో దాహం తీర్చుకునే పక్షులనో చూస్తూ కూర్చోవటం, ఆలోచనల్ని ఎటు వెళ్తే అటు వెళ్ళనివ్వటం… చీకటిశూన్యంలో లతలాగ పాకుతుంది ఆలోచన, దానికి గతమూ భవిష్యత్తూ ఒకే రంగులో పూస్తాయి. ఆ రోజు ఇద్దరికీ ఫోన్ చేయాలనిపించింది. ముందు బాషాగాడికి చేసాను. ఇలా ఇప్పుడే మన వైజాగ్-అరకు ట్రిప్పు గుర్తొచ్చిందిరా అని చెప్పి, “ఇప్పుడు నువ్వెలాగూ కుంటెదవ్వి కాబట్టి పరుగుపందెం గెలవలేవు కదా” అన్నాను. “నీ యబ్బా” అని నవ్వుతున్నాడు. ప్రస్తుతం కాంట్రాక్టు పనే చేస్తున్నాడు. ఆ పని వాళ్ళ నాన్నగారి టైమ్లో ఉన్నంత సులువుగా లేదట. నా ఉద్యోగం ఎలా ఉందని అడిగాడు. పిల్లల స్కూలు ఫీజుల గురించి విసుక్కున్నాం. ఏపీలో ఎన్నికల మీద హైదరాబాద్లో టాకెలా ఉందని అడిగాడు. హైదరాబాద్లో ఉంటున్న మర్యాద ఇచ్చి అడిగాడు కదాని తెలీకపోయినా ఏదో చెప్పాను. ఈసారి మళ్ళీ ఎక్కడకన్నా ట్రిప్ వేసుకుందామన్నాడు. తర్వాత రెడ్డిగాడికీ ఫోన్ చేశాను. కాలర్ ట్యూన్లో “నీ కోసమే ఈ అన్వేషణా…” లాంటిదేదో పాత విషాద ప్రేమ గీతం. మళ్ళీ ఎవర్నో పటాయించే పనిలో ఉన్నాడనుకున్నాను. ఫోన్ తీయలేదు. రెండ్రోజుల తర్వాత ఒక రాత్రి వాడే చేశాడు. రైల్లో ఒంగోలు నుంచి మాచవరం వస్తున్నాడు. వాడి ఇద్దరు పిల్లల కుశలం నేనడిగాను, నా పిల్లాడి కుశలం వాడు. మాచవరంలో ఇల్లు కడుతున్నాడట. ఇలా బాషాగాడు మళ్ళీ ఎక్కడకన్నా ట్రిప్ పెట్టుకుందామంటున్నాడురా అన్నాను. “ఏంటి బాషాగాడే?” అని ఆశ్చర్యపోయాడు. సరేనన్నాడు. పనుల్లో తెరిపి చూసుకుని, భార్యాపిల్లల్ని విడిపించుకుని వెళ్ళటం ఎప్పటికి కుదురుతుందో తెలీదు.
*
(రస్తాలో పబ్లిష్ అయ్యింది)

April 20, 2019

ముక్కు


ఇంక నేనే ఆఖరి పేషెంటుని. నర్సు నా పేరు ఇలా పలకబోయిందో లేదో డాక్టర్ గదిలో దూరిపోయాను. అంతసేపూ ఎప్పుడు పిలుస్తారా అని బైట నేను పడిన కంగారుకి విరుద్ధంగా ఉంది లోపలంతా. టేబిల్ మీంచి ఏదో నెమ్మదిగా తీసి దాన్ని ఆ టేబిల్ మీదే ఇంకోచోట అతినెమ్మదిగా పెడుతున్నాడు డాక్టరు. గదిలోని నెమ్మదికి సర్దుకుంటూ కూర్చున్నాను. డాక్టరు చెప్పమన్నట్టు తలాడించాడు.

"నాకు నా ముక్కు అస్తమానూ కనిపిస్తుందండీ" తిన్నగా చెప్పేసాను.

డాక్టరు మళ్ళీ తలాడించాడు. నేను పిచ్చోణ్ణని అంత త్వరగా లోపలే ఖాయం చేస్సుకుని పైకి తలమాత్రం ఆడించగలంత తెలివైనోడా, లేక నేను చెప్పింది అర్థంకాలేదా అన్నది అర్థం కాలేదు. మళ్ళీ చెప్పాను: "ముక్కండీ..." ఈసారి వేలితో చూపించాను కూడా.

"మీ ముక్కు దూలం మీకు కనిపిస్తుంది అంతేగా... అందరికీ కనిపిస్తుందిగా?" కళ్ళజోళ్ళోంచి తన ముక్కుని చూసుకున్నాడు.

"కానీ నాకు అస్తమానూ కనిపిస్తుందండీ. ఏ దృశ్యంలోనీ లీనం అవనీదు. కాసేపట్లోనే కింద అదొకటి ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది. దేన్నైనా చూస్తుంటే, కాసేపటికి- ఎడంకన్ను దృష్టి ముక్కు ఎడమ దూలం మీదకీ, కుడికన్ను దృష్టి కుడి దూలం మీదకీ పోతుంది. మనశ్శాంతి ఉంటం లేదు. నిద్రలేస్తే చాలు కళ్ళ ముందు ఏదీ స్వచ్ఛంగా దానంతటది ఉండదు, మధ్యలో నా ముక్కు దూరుతుంది. ఒక్కోసారి రాత్రి కళ్ళు మూసుకున్నా- ఇంకా నిద్రరానప్పుడు కళ్ళ వెనక చీకటి ఉంటుందే, ఆ నల్లటి చీకటిని కూడా రెండుగా విడదీస్తూ... నా వల్ల కావటం లేదండీ..."

డాక్టరు వైట్ పాడ్ మీద పెన్నుతో తడుతూ ఆలోచించాడు.

"ఎన్నాళ్ళ నించీ ఇలా?"

"ఒక నెలరోజుల్నించీ. మొదట కళ్ళ డాక్టరు దగ్గరికి వెళ్ళాను. కళ్ళ ప్రాబ్లెమ్ కాదు, మిమ్మల్ని కలవమన్నారు"

"ఎప్పుడు-- అంటే ఏం చేస్తుండగా ఇలా మొదలైందో గుర్తుందా?"

"లైబ్రరీలో కూర్చుని ఏదో పుస్తకం చదువుతుంటే మొదలైందండీ. ఉన్నట్టుండి నా ముక్కు పుస్తకానికీ నాకూ మధ్యన కనిపించటం మొదలైంది. ఇంక అది మొదలు... ఎక్కడకు వెళ్ళినా ఈ ముక్కే! రోడ్డు మీద వెళ్తున్నా సరే... అది నాకంటే ముందుండి నన్ను నడిపిస్తున్నట్టు, ఒక్కోసారి ఈడ్చుకు లాక్కెళ్తున్నట్టు... ఒకసారైతే బాగా కోపమొచ్చి అద్దం ముందు నిలబడి దాన్ని గట్టిగా గుద్దాను కూడా. అసలు అంతకుముందు ఎలా చూసేవాణ్ణో, లోకం నాకెలాగ కనిపించేదో కూడా మర్చిపోయానండీ. నా ముక్కు అడ్డం రాకుండా ప్రపంచాన్ని చూసిన రోజులు కూడా ఉన్నాయా అన్నంత దూరంగా అనిపిస్తుంది నెల రోజుల కిందటి గతం తల్చుకుంటే."

"ఇంతకీ ఆ పుస్తకం ఏంటీ?"

"గుర్తు లేదండీ"

"గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నించండి"

ప్రయత్నించాను. గుర్తు రాలేదు.

"మీకు ఏవన్నా నెర్వస్ టిక్స్ లాంటివి ఉన్నాయా?"

"అంటే?"

"అంటే మీ ప్రయత్నం లేకుండా, మీ అదుపులో లేకుండా- శరీరం దానంతటది ప్రవర్తిస్తున్నట్టు అనిపించే... అలవాట్లు?"
"దేని కోసమన్నా వెయిట్ చేస్తున్నప్పుడు ఇలా బొటనవేలిని మిగతా వేళ్ళ మీద ఆడిస్తాను. ఇందాక బయట హాల్లో మీరు పిలిచేవరకు అలాగే చేస్తున్నాను. ఇంకా... ఆ! నా చొక్కా ఎప్పుడూ భుజాలమీద సమానంగా ఉన్నట్టు అనిపించదండీ. ఒకవైపు ఎక్కువ వచ్చేసినట్టు, ఒకవైపు తక్కువ ఉన్నట్టు అనిపించి సర్దుకోటానికన్నట్టు అస్తమానం భుజాలు ఆడిస్తూ ఉంటానండి, ఇలాగ (చూపించాను). ఇంకా చాలా ఉన్నాయి. గోళ్ళు మొదళ్లదాకా కొరికేయటం, ఒక్కోసారి చర్మం కూడా, పెదాల మీద తోలు పళ్ళతో పీక్కోవటం, చంకలో గోక్కుని వాసన చూసుకోవటం..."
డాక్టరు చాలు అర్థమైందన్నట్టు చేయి చూపించాడు. "ఆందోళనగా  ఉంటుందన్నమాట" అని, మరేం ఫర్వాలేదన్నట్టు తల ఊపి వైట్ పాడ్ మీద ఏదో రాసుకున్నాడు. తర్వాత నేను ఎక్కడ పెరిగాను, ఇక్కడకెప్పుడొచ్చాను, ఏం ఉద్యోగం చేస్తాను, పెళ్ళయిందా లేదా ఇవన్నీ అడిగాడు.  "మీలాగ చిన్నప్పుడంతా పల్లెటూళ్ళల్లో పెరిగి తర్వాత ఇలా నగరాల్లోకి వచ్చి స్ట్రెస్‌ఫుల్ ఉద్యోగాలు చేసేవాళ్ళకి ఇలాంటి ఏంగ్జయిటీ డిజార్డర్స్ ఒక్కోసారి వస్తుంటాయి..." అని ఏదో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏంగ్జయిటీ నరాల మీద ఎలా పని చేస్తుందో చాలా వివరంగా చెబుతున్నాడు. ఏదో ఒక మందిచ్చి, పోయి వాడమనటం మానేసి ఈ సొదంతా ఎందుకనిపించింది. మనల్ని నమ్మించాలని ప్రయత్నించే డాక్టర్లని చూస్తే సేల్స్‌మెన్ల లాగ కనిపించి ముందే నమ్మబుద్ధి కాదు. చిన్నప్పుడు ఊళ్ళో పెద్దడాక్టరు దగ్గరికి వెళ్ళేవాళ్ళం. నాన్న పక్కనుండి ఇంకా ఏదో చెప్తూనే ఉండేవాడు, ఆయన అదేం వినపడనట్టే నన్ను దగ్గరకు లాక్కుని నాడి చూసి, పొట్ట నొక్కి, స్టెతస్కోప్ పెట్టి, మందులు రాసిచ్చేసేవాడు. ఆయన్ని చూస్తేనే సగం జ్వరం తగ్గిపోయినట్టుండేది.

డాక్టరు ప్రసంగం చాలించి- ఏం చేయాలో ఏం వాడాలో రాసి, చీటీ నాకు ఇచ్చి, తర్వాత ఏదో గుర్తువచ్చినట్టు, "ఒకసారి నాతో రండి" అని లేచాడు. వెనక ఉన్న తలుపు తీసి లోపలికి తీసుకెళ్ళాడు. లోపల డాక్టరు ఇల్లనుకుంటాను. కన్సల్టేషన్ ఫీజుకే ఇంతింత దొబ్బేవాడి ఇల్లు ఎంత విశాలంగా ఉంటుందో అంత విశాలంగానూ ఉంది. "మీకొకటి చూపిద్దాం అనుకున్నాను" అంటున్నాడు. మళ్ళీ ఇంతదూరం వెనక్కి రావాలా అనిపించేంత పెద్ద పెద్ద గదులు కొన్ని దాటాక గార్డెన్ వచ్చింది. ప్రహరీ గోడనానుకుని ఉన్న మొక్కల తలల మీద సాయంకాలం ఎండ పడుతోంది. లాన్ మధ్యన రెండు చాపలు పక్కపక్కన పరిచినంత సైజులో పల్లం తవ్వి దాన్నిండా కంకర్రాళ్ళ రజను పోసారు. దాన్ని ఎత్తుపల్లాల్లేకుండా చదును చేసి, దాని మీద ఏదో గార్డెన్ టూల్‌తోటి రకరకాల ఆకృతులు గీసారు. ఆ ఆకృతుల మధ్యలో రెండు మూడు పెద్ద రాళ్ళు నిలబెట్టి ఉన్నాయి.

"జపనీస్ రాక్ గార్డెన్" అన్నాడు.

వీటి గురించి నేను ఎక్కడో చదివాను. ఫొటోలు కూడా చూసాను. వీటికీ జెన్ ధ్యానానికీ ఏదో సంబంధం ఉంది. నన్ను మెట్ల మీద కూర్చోమని తనూ కూర్చున్నాడు. "మనసులోంచి ఆలోచనని తీసేసి మీ ముందున్న దృశ్యంలోకి లీనమైపోయి కాసేపు ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి" అన్నాడు. 

ఆ బూడిదరంగు కంకర, వాటి మీద చారలు, మధ్యలో నిలబెట్టిన పెద్ద రాళ్ళు చూస్తుంటే నాకు జపాన్‌లోని ఫేమస్ ర్యోంజి గార్డెన్‌ని అనుకరించే ప్రయత్నం కనిపించింది. అయితే ర్యోంజి గార్డెన్‌ మధ్యలో నిలబెట్టిన రాళ్ళు ఆ గ్రేవెల్ అలల మధ్య సహజంగా ఏర్పడిన ద్వీపాల్లాగా ఉండే అతి మామూలు బండరాళ్ళు. ఇక్కడ నిలబెట్టిన రాళ్ళు నున్నగా అందంగా కనిపిస్తున్నాయి.

డాక్టరు నా భుజం మీద చేయి వేశాడు. నేను మనసులోంచి ఆలోచనల్ని తీసేయటానికి ప్రయత్నించాను. వొంటి మీద ఎండని అనుభవిస్తూ ఆ దృశ్యాన్ని చూస్తూ కూర్చున్నాను. ఏదో ఉద్రేకం లోపల్నించి ఒక్కసారిగా పొంగి నా ముక్కుపట్టి ముందుకి లాగింది. నేను లేచి మెట్లు దిగివెళ్ళి ఆ కంకర అంచున నిలబడి జిప్ విప్పి ఉచ్చపోయటం మొదలుపెట్టాను. ధార ముద్దగా ఎండలో మెరుస్తూ దూకింది. ఒక్క క్షణం పక్కనో చిన్న ఇంద్రధనుస్సు మొలుస్తుందేమోననికూడా అనిపించింది. కంకరలో చిన్న గుంటపడి పొంగింది, తడికి కంకర నల్లగా మారుతోంది. ఎంతసేపట్నించీ ఆపుకున్నదో- చెవులనిండుగా చప్పుడు చేస్తూ అలా వస్తూనే ఉంది. పోయటం ఇంకా అవకుండానే ఉద్రేకం చల్లబడి చేస్తున్న పనికి సిగ్గేసింది. వెనకాల డాక్టరు మొహం ఊహించుకున్నాను. "పవిత్రమైనవన్నీ ధ్వంసం చేయాలని ఉంటుందన్నమాట" అని, మరేం ఫర్వాలేదన్నట్టు తల ఊపుతాడా, ఉన్నచోటే కూర్చుని? జిప్ పెట్టుకుని వెనక్కు తిరిగాను. డాక్టరు నిలబడి ఉన్నాడు. మెట్ల మీంచి దూకబోయి ఆగినట్టు శరీరం కొంచెం ముందుకు వొంగి ఉంది, చేతులు శరీరానికి దూరంగా కడ్డీల్లా బిగుసుకుపోయి ఉన్నాయి. నేను మెట్ల వైపు నడుస్తుంటే, ఎక్కడ అతన్ని ముట్టుకుంటానో అన్నట్టు పక్కకి జరుగుతూ, నా వంక కూడా చూడకుండా తల దించుకొని, "గెటౌట్!" అన్నాడు.

నేను ఆ గదుల్లో దారి గుర్తు తెచ్చుకుంటూ నడుస్తున్నాను. లైబ్రరీలో చదివిన ఆ పుస్తకం ఏంటో ఇప్పుడు గుర్తొచ్చింది. అదో సినిమా పత్రిక. అందులో మధ్యకుట్టులో బ్లోఅప్ అని ఒక హీరోయిన్ ఫొటో పెద్దది వేసారు, ఊళ్ళల్లో మంగలిషాపుల్లో అంటించేలాంటిది. వొంటి మీద నీళ్ళోడుతున్న ఆ అమ్మాయి పొట్టా తొడలూ ఇంకాస్త స్పష్టంగా చూద్దామని పత్రికని నిలువుగా తిప్పాను. ఆ తిప్పటంలో నా ముందు దృశ్యం అంతా తిరుగుతున్నా ఒకటి మాత్రం అలాగే స్థిరంగా ఉందనిపించింది. అది నా ముక్కు.

* * *

మళ్ళీ నా బాధలో నేను పడ్డాను. ఒక్కోసారి మరీ ఎక్కువైపోయేది- ముక్కుని ఊడబెరికేసుకోవాలన్నంత; ఏదైనా గరుకు గోడకేసి రుద్ది అరగదీసేసుకోవాలన్నంత. ఒక్కోసారి అది నన్ను అధీనంలోకి తీసుకుని నడిపిస్తున్నట్టు ఉండేది.

ఏన్యువల్ సేల్స్ మీటింగంటే వేరే ఊరొచ్చాను. ఏ ఏటికాయేడు బాగా ఫెర్మార్ఫ్ చేసిన సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌లని దేశంలోని వేర్వేరు బ్రాంచీల నుంచి ఎంపిక చేసి, వాళ్ళని ఏదైనా సిటీకి తీసుకెళ్ళి, హోటల్లోనో రిసార్ట్‌లోనో మీటింగ్ పెడతారు. బఫే భోజనాలు, తివాచీలు పరిచిన ఏసీ గదులు, స్విమ్మింగ్ పూల్సూ... ఆ ఏడాది పడ్డ కష్టమంతా మరిచిపోటానికి. నాతో పాటు మా బ్రాంచీ నుంచి వచ్చిన ముగ్గురం ఒక గదిలో దిగాం. వేణ్ణీళ్ళు నింపిన టబ్‌లో మిగతా ఇద్దరూ ఎంత తలుపుకొడుతున్నా పొండ్రా అనుకుని చాలా సేపు స్నానం చేసాను. సాయంత్రం ఆ కొత్త ఊళ్ళో హోటల్ చుట్టుప్రక్కల వీధులన్నీ తిరిగాం. రాత్రికి బాల్కనీలో కూర్చుని కింద ట్రాఫిక్ చూస్తూ కబుర్లు చెప్పుకున్నాం. మొత్తానికి మంచి మూడ్‌లోనే ఉన్నాను.

మరుసటి రోజు మీటింగ్ హాల్లో మార్కెటింగ్ ఎక్సపర్ట్స్ ఉపన్యాసాలు ఇచ్చారు. భోజనం తర్వాతి మీటింగులో, వాడెవడో పెర్సనాలిటీ డెవలప్మెంటు ఎక్సపర్ట్ అట, వాడొచ్చి మాట్లాట్టం మొదలుపెట్టేడు. నేను మొదటి వరుసలో కూర్చుని వింటున్నాను. మన రూపం అవతలి మనుషుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చెబుతున్నాడు. రూపం అంటే అందం కాదట. మన మీద మనం నమ్మకం ఉంచుకొని, ఆ నమ్మకం కలిగించే హుందాతనంతో ప్రవర్తించడం అట. అది మన భంగిమల్లోనూ, వేషభాషల్లోనూ, హావభావాల్లోనూ ప్రతిఫలిస్తుందట. బాహ్యరూపాన్ని ఎలా సరిదిద్దుకుంటామన్నదాని పాత్ర కూడా ఇందులో తక్కువేమీ కాదట. మధ్యలో ఉదాహరణలు తీసుకుని మాట్లాడటం మొదలుపెట్టాడు. నేను నిజానికి ఏదో పరధ్యాసలో ఉన్నాను. కానీ మరీ ముందు వరసలో కూర్చున్నాను కాబట్టి- లీనమైపోయి, లొంగిపోయి వింటున్న ఎక్స్‌ప్రెషన్ మాత్రం ముఖానికి తగిలించుకున్నాను. అది చూసేమో, నన్ను చూపించి మాట్లాడటం మొదలుపెట్టాడు. "లెట్స్ టేక్ దిస్ జెంటిల్మన్‌ ఫరెగ్జాంపుల్. ముఖం మీద రెండ్రోజులు గీయని గెడ్డం ఉంది. ఆ కాలర్ జావకారి వేలాడుతోంది. బూట్ల మీద మెరుపు లేదు. కళ్ళల్లో చురుకు లేదు. ముఖ్యంగా మనిషి కూర్చున్న తీరులోనే... ఆ డ్రైవ్ లేదు. డ్రైవ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద వరల్డ్"

అయితే వాడు నా డ్రైవ్‌ని తక్కువ అంచనా వేశాడని చెప్పాలి. వాడి మరుసటి వాక్యానికి వాడి ముందున్నాను. "ఏ వరల్డురా నీది పిచ్చ నాకొడకా! నీ చుట్టూ ఈ కాసింత పిల్లిబిత్తిరి ప్రపంచాన్నే మొత్తం ప్రపంచం అనుకోకు. నీ లెక్కకి అందనిదంతా బైటకి గెంటేసి, నీ లెక్కలో కుదురుకున్నదాన్నే ప్రపంచమనుకుంటే, దానికి నువ్ పెద్ద కింగ్ అనుకుంటే ఎలారా! పద్ధతిగా బతకాలా? ఎవడి పద్ధతిరా, ఎవడు చెప్తాడ్రా నాకు ఏది పద్ధతో? నీ మార్కెటింగ్ బుక్సా? నీ యబ్బా!" ...పోడియం మీంచి మైకు ఊడబెరికి వాడి నెత్తి మీద దాంతో మొడుతుంటే చాలామంది పరిగెత్తుకొని వచ్చి నన్ను పట్టుకుని కిందకి లాగేసారు.

ఆ రోజు రాత్రి ఉద్యోగం ఉందో లేదో తెలీని భయంలో రైల్లో తిరిగి వెళ్తున్నాను. జనరల్ బోగీలో చాలా రద్దీ ఉంది. జనం సీట్ల మధ్యకి కూడా వచ్చి నిలబడిపోయారు. ముక్కులోకి వెచ్చగా మనుషుల వాసన. ఒక నాలుగైదేళ్ళ పిల్లవాడు నా ముందు నిల్చున్న వాళ్ళ నాన్నని ఎత్తుకోమని తెగ గోల పెడుతున్నాడు. వాణ్ణి వెనక నుంచి లాక్కొని నా వొళ్ళో కూర్చోబెట్టుకున్నాను. కొత్తేం లేకుండా కూర్చుని, అసలు నా మొహం కూడా చూడకుండా, కిటికీలోంచి చూస్తున్నాడు. వాడి గురించి అడిగితే కాళ్ళూపుకుంటూ చెప్పాడు. బళ్ళో వాడెవడో రంజిత్ అంట, వాడికీ వీడికీ గొడవయ్యిందట, వాడు కొట్టిన దెబ్బ కూడా మోచేయి తిప్పి చూపించాడు. ఇప్పుడిప్పుడే పొర కడుతోంది. కానీ వాడి మీద వీడికి కోపమేం ఉన్నట్టు లేదు. బొత్తాంలేని చొక్కాలోంచి పొట్ట నిమిరితే ముడుచుకుపోయి నవ్వుతున్నాడు. కిటికీ బయట చీకట్లో దూరంగా ఒక కొండ కనిపిస్తోంది. పైకి లైట్లు పాకి వున్నాయి. పైన ఏదన్నా గుడి ఉందేమో అనుకున్నాను. గుళ్ళోపల మంటపం, నంది, గర్భగుడి గడపా, ఒక్కడే కునుకుతున్న పూజారీ, పళ్ళెంలో అక్షింతలూ మందారాలూ... ఈ కనపడని దృశ్యాలన్నీ మనసులోకి తోచాయి.

* * *

అన్నయ్య పెళ్ళిలో ఇంకో గొడవైంది. మేం ముగ్గురన్నదమ్ములం. నేను రెండోవాడ్ని. అన్నయ్యకి వైజాగ్‌లో పెద్ద ఉద్యోగం. తమ్ముడు యూనివర్శిటీ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. నేను మూడేళ్ళ క్రితం దాకా కూడా నాన్నతో ఊళ్ళోనే ఉండేవాడ్ని. నాన్న రిటైరయ్యి కాస్త అనారోగ్యంగా ఉంటంతో, అమ్మ కూడా లేపోటంతో, ఆయనకి తోడుగా ఉండిపోయాను. అలాగే అక్కడే ఉండిపోయేవాడినేమో, ఈలోగా ఒకమ్మాయి పరిచయం అయింది. నాకోసం ఇల్లొదిలి పారిపోయి వచ్చేసింది. ఏ ఉద్యోగం లేకుండా ఇంటి దగ్గరే ఉండిపోయిన నేను తనని ఎలా కాపాడుకోను. అందుకే ఆమెని అన్నయ్య దగ్గరికి పంపాను- అక్కడేదన్నా హాస్టల్లో చేర్చి కొన్నాళ్ళు చూడమన్నాను. నేనూ నెమ్మదిగా అక్కడికి వెళ్ళి ఉద్యోగం చూసుకుందామనీ, పరిస్థితి సద్దుమణిగాక పెళ్ళి చేసుకుందామనీ ఆలోచన. అన్నయ్య  ఇదెక్కడ గొడవ తెచ్చి నా నెత్తి మీద పెట్టావురా అన్నట్టు మాట్లాడేడు. అదైనా సహించాను. కానీ ఒకసారి ఆమెతో వెకిలి వేషం వేయబోయాడట. ఆమె నాకు చెప్పుకుంది, నేనేం చేయలేక గింజుకోవటం చూసి అసహ్యించుకుంది. అప్పటికే నా చేతకానితనం అర్థమవుతూ విసిగిపోయి ఉందేమో, ఇంట్లోవాళ్ళు చుట్టుముట్టి ఒత్తిడి చేసేసరికి వెనక్కి వెళ్ళిపోయింది. నేను బయటకువెళ్ళి బతకాలన్న ధైర్యం తెచ్చుకున్నది అప్పుడే. అన్నయ్య మీద నాకు పెద్ద ప్రేమ ఎప్పుడూ లేదు. తర్వాత అసహ్యమే మిగిలింది. ఇప్పుడు వాడి పెళ్ళి అంటే ఇక నాన్నని బాధపెట్టలేక వచ్చాను.
నాన్న ఎలాగూ పెద్ద పనేం చేయలేడు. తమ్ముడే పెళ్ళి పనంతా మీదేసుకున్నాడు. డబ్బుకి అన్నయ్య దగ్గర లోటు లేదు. ఎటొచ్చీ ఈ ఫంక్షన్ హాల్ బుక్ చేయటం, ఇంటి దగ్గర పందిళ్ళు వేయించటం, చుట్టాలకి ఏర్పాట్లు, హోటల్ గదులూ, తిరగటానికి బళ్ళూ... ఇలాంటివన్నీ తమ్ముడు దగ్గరుండి చూసుకుంటున్నాడు. నేనొచ్చి సాయం చేస్తానని నాన్నా తమ్ముడూ అనుకున్నారని తెలుసు. ఎందుకు చేయటంలేదో మాత్రం నాకూ అన్నయ్యకే తెలుసు. అసలు పెళ్ళికి రావటమే చుట్టంలాగ ఒకరోజు ముందొచ్చాను. తమ్ముడు నన్ను పనుల్లో కలపటానికి ప్రయత్నించాడు. తప్పించుకుని ఊళ్ళో తిరిగాను.

తెల్లారగట్ల ముహూర్తానికి కాకినాడలో పెళ్ళి. నేను నా ఫ్రెండ్స్‌ ఎవ్వర్నీ పిలవలేదు. చిన్నప్పటి ఫ్రెండ్ శీనుగాడొక్కడు మాత్రం నాన్న పిలిస్తే వచ్చాడు. ఇద్దరం ఆ రెండంతస్తుల ఫంక్షన్ హాల్లో హడావిడి తక్కువుండి, కాస్త  భజంత్రీల మోత మెల్లగా వినిపించే చోటుకోసం వెతుక్కున్నాం. గ్రౌండ్ ఫ్లోరులో వరండా కనిపించింది. దాని పిట్టగోడ మీద కూర్చుని, కాళ్ళు లాన్ లోకి వేలాడేసుకున్నాం.  అక్కడేం లైట్లు లేవు. లాన్ చివర ప్రహరీ గోడలా పెంచిన మొక్కల మీద మాత్రం రంగు బల్బులు వేలాడేసారు. అవి వెలిగి ఆరుతున్నాయి. అర్ధరాత్రి దాటిన రోడ్ల మీద కుక్కలు, ఆలస్యంగా ఇంటికివెళ్తున్న తాగుబోతు. మధ్యలో తమ్ముడు ఒకసారి కిందకి వచ్చాడు. "కనీసం ఫొటోల కోసమన్నా కనపడరా?" అన్నాడు. వస్తాలే వెళ్ళమని పంపేశాను. శీనుగాడికి విషయం ఏదో ఉందని చూచాయగా తెలిసినట్టుందిగానీ, నేను చెప్పలేదు కాబట్టి వాడూ అడగలేదు. మేమిద్దరం చిన్నప్పుడు అంగరలో ఒకే బళ్ళో చదువుకున్నాం. వీడితో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. వీడి దగ్గర చాలా అల్లరి చేసేవాడ్ని ఎందుకో. ఒకసారి వీడి చెప్పు ఒకటి వంతెన మీద నుంచి కాలవలోకి విసిరేసాను. పరిగెత్తుకు కిందకి దిగి ఈతకొట్టి తెచ్చుకున్నాడు. ఇంకోసారి వీడి నిక్కరుని బ్లేడు పెట్టి కోసేసాను. "మతిలేదేటీ" అని మాత్రం అని ఊరుకున్నాడు. ఏం చేసినా వీడికి నా మీద కోపమొచ్చేది కాదు. ఇప్పుడు లోపల పెళ్ళవుతున్నవాడ్ని నేనెప్పుడూ అన్నయ్యలా ఫీలవలేదు. ఈ శీనుగాడి దగ్గరే నాకలా అనిపిస్తూంటుంది. చిన్నప్పటి కబుర్లేవో చెప్పుకుంటూ కూర్చున్నాం. హిందీ మేస్టారుగారి  అమ్మాయి అత్తోరింట్లో సూసైడ్ చేసుకుందని చెప్పాడు. ఆ అమ్మాయి తెల్లగా అందంగా ఉండేది. ఎప్పుడూ తలొంచుకుని పోయేది. ట్యూషన్‌లో ఎవరెంత అల్లరి చేసినా పెద్దరికంగా నవ్వుకునే పిల్ల, మంచి మార్కులు తెచ్చుకునే పిల్ల... ఆత్మహత్య చేసుకుందంటే అయ్యోమనిపించింది. బక్కపల్చటి హిందీ మేస్టారు గుర్తొచ్చారు... ఏ డిఫెన్సులూ లేని వాళ్ళని ఎవరు కాపాడతారు? మా కబుర్ల మధ్యన ఎప్పుడో పైనుంచి మంగళసూత్రం కడుతున్నప్పుడు స్పీడుగా వచ్చే భజంత్రీల చప్పుడు వినిపించింది. రాలుతున్న అక్షింతల మధ్య తలొంచుకున్న వదిన మొహం నా ఊహలో.

రోడ్డు మీద అప్పుడప్పుడే కొద్దిగా సందడి మొదలయ్యింది. చెట్లలోంచి పిట్టలు కూస్తున్నాయి. రోడ్డవతల టిఫిన్ సెంటరు షట్టరు తీసారు. స్ట్రీట్ లైట్లు ఆరిపోయాయి. ఇప్పుడీ చల్లటి నీలం వెలుగులో బాదం చెట్టు పచ్చదనం తెలుస్తోంది. నాకు వొళ్ళంతా బరువుగా ఉంది. శీనుగాడు అలా వెళ్ళి టీ తాగి సిగరెట్ కాలుద్దామన్నాడు. షట్టరు తీసిన హోటల్లోకి వెళ్ళాం. కౌంటర్ దగ్గరెవరూ లేరు. ఓ మోటు మొహం లోపల్నించి  తొంగి చూసి ఇంకా టీ రెడీ కాలేదని చెప్పింది. శీనుగాడు కార్లో అలా వెళ్ళి చూసొద్దాం అన్నాడు. మా వాళ్ళు బుక్ చేసిన మూడు కార్లూ ఫంక్షన్ హాల్ గేటు దగ్గరున్నాయి. గులాబీ మొగ్గలు అంటించిన ఇన్నోవాలో డ్రైవర్ మెలకువగా ఉన్నాడు. కారు రోడ్ల మీద వెళ్తోంది. ఎంతసేపటికీ టీ హోటల్ దొరకటం లేదు. వెనక్కి వెళిపోదామా అని కాసేపూ, ఎందుకులే ఇంత దూరం వచ్చాంకదా అని కాసేపూ. "లోపల కేటరింగోళ్ళని ఓసారి అడిగి చూడాల్సిందండీ" అని ఆలస్యంగా గుర్తు చేసాడు డ్రైవరు. ఈలోగా ఒక చోట టీ బండి కనిపించింది. "ఒక్క ఐదు నిమిషాలండీ" అంది ఆ బండిగలావిడ. సడిలి, నరాలు ఉబ్బిన చేత్తో ఆవిడ పాలగిన్నెలో గరిటే ఎంత బరువుగా తిప్పుతుందంటే, పాపం ఆ టీ తాగే వెళ్ళాలనిపించింది.

మేం తిరిగి ఫంక్షన్ హాల్‌కి వెళ్ళేసరికి అక్కడ మిగతా రెండు కార్లూ లేవు. ఇంటికి వెళ్ళిపోయాయని తెలిసింది. డ్రైవర్ మామీద విసుక్కుంటూ ఇంటివైపు కంగారుగా తోలాడు. మేం వెళ్ళేసరికి ఇంటి దగ్గర అప్పుడే బళ్ళు దిగుతున్నారు. అన్నయ్య భుజం నిండా దండలతో నా వైపు చూసి లోపలికి వెళ్ళిపోయాడు. పిన్ని "అదేంరా కారు తీసుకుపోయారూ, అందరం కుక్కుపోయి రావాల్సొచ్చింది రెండు బళ్ళల్లోనూ. పెళ్ళికూతురు వాళ్ళ చిన్నాన్న వాళ్ళూ అక్కడే ఉండిపోయారింకాను" అంటోంది. నాన్న లోపల్నుంచి గబగబా నడుచుకుంటూ వచ్చాడు. "అరె బొత్తిగా బాధ్యత లేకుండా పోతుందిరా నీకు," అంటున్నాడు. నేను పట్టించుకోనట్టు లోపలికి వెళ్ళిపోయాను. వాకిట్లో కొంతమంది కుర్చీల్లో కూర్చున్నారు. వాళ్ళ మధ్యలో కూర్చుని తమ్ముడు అందరికీ వినపడేలాగ, "అదిగో వచ్చాడు.. అడివి!" అన్నాడు. నన్ను నా ముక్కు ముందుకు లాగటం తెలుస్తోంది. వాడి దగ్గరకు వెళ్ళి ఫాట్ మని చెంపమీద కొట్టాను. "అయ్యొ అయ్యొ!" ఎవరో ఆడాళ్ళు కేక వేసారు. ఎవరో వెనకాల్నించి నా భుజాలు పట్టుకున్నారు. తమ్ముడు నాకెదురు నిల్చున్నాడు. నాన్న చుట్టాల గుంపులోంచి తోసుకొచ్చి తమ్ముడి పక్షాన నిలబడి నా మీదకి చేయి చూపించి తిడుతున్నాడు. గుమ్మంలో ఎవరో వచ్చి నిలబడ్డట్టనిపిస్తే... అన్నయ్య... బాసికాలూ, పెళ్ళిబొట్టుతో వాడినింత దగ్గరగా ఇప్పుడే చూట్టం. ఏంటీ న్యూసెన్సు అన్నట్టు ఉంది ముఖం. నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోబోయే ముందు వాడివైపు చేయి చూపించి అన్నాను, "అసలు నీకు తగలాల్రా దెబ్బలు!" అని.

* * *

ఒక్కోసారి ఎంతో ఉపశమనంగా అనిపించిన క్షణాలూ ఉన్నాయి. నాకు ఒకమ్మాయితో పరిచయమైంది. తనకి పెళ్ళయింది కాబట్టి చాటుగా నా గదిలోనో, ఎప్పుడన్నా పార్కుల్లోనో కలుసుకునేవాళ్ళం. ఎక్కువ ఫోన్‌లో మాట్లాడుకోవటమే. ఈమధ్య ఇద్దరం వేరే ఊళ్ళో కలవాలని ప్లాన్ చేసుకున్నాం. ఆమె వాళ్ళ పుట్టింటికి వెళ్ళినట్టు వెళ్ళి, అక్కడ పిల్లాడ్ని వదిలి, అట్నించటు నన్ను కలవటానికి రావాలి. నేను ఆమె కంటే ఒక రోజు ముందే ఆ ఊరు వచ్చేసాను. అదో టెంపుల్ టౌను. ఎక్కడ చూసినా మగాళ్ళూ ఆడాళ్ళూ గుండ్లూ నామాలతోటి సంచులు వేలాడేసుకొని ఎదురయ్యేవాళ్ళు. ఆ ఒక్క రోజూ నాకు చాలా పొడవుగా గడిచింది. తనొచ్చాకా ఎలాగూ వెళ్తాం కదాని గుడికి వెళ్ళలేదు. పగలంతా లాడ్జిగదిలో నిద్రపోయాను, సాయంత్రం బాల్కనీలో కూర్చుని కింద పోయే బుర్రల్లో బోడిగుండ్లు లెక్కపెట్టాను, రాత్రి నిత్య తిరణాల్లాగ కనిపించే వీధుల్లో అలుపొచ్చేదాకా తిరిగాను. మర్నాడు ఆమె బస్సు దిగాక మాత్రం ఆ ఊరికి కొత్త కళ వచ్చినట్టనిపించింది. గదిలో స్నానాలు కానిచ్చి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. మధ్యాహ్నానికల్లా మంచం మీద ఉన్నాం. వేరే ఊరు కావటం--పైగా ఊళ్ళోవాళ్ళ కంటే వచ్చేపోయే యాత్రికులు, ఇళ్ళ కంటే లాడ్జీలూ సత్రాలే ఎక్కువ ఉన్నట్టనిపించే ఊళ్ళో ఉండటం--దాంతో మాకు పారే కాలవలో ఆగి రాసుకునే రెండు పొదల్లాగ ఎంతో స్వేచ్ఛగా ఉంది. ఆమె లోపలేం వేసుకోకుండా వొంటి చుట్టూ నీలంరంగు సిల్కు చీర మాత్రం చుట్టుకొని వొళ్ళో పడుకుంది. ఆ రోజెందుకో తన పెళ్ళి గురించి, భర్త గురించి మాట్లాడింది. మామూలుగా ఆ ప్రస్తావన ఎపుడూ తీసుకురాదు. బహుశా--పొద్దున్న గుడిదగ్గర క్యూలో చాలాసేపు కలిసి నడిచాం, చేతులు కలిపి గంటకొట్టాం, శఠగోపం పెట్టించుకున్నాం, ఖాళీమంటపంలో ప్రసాదం పంచుకున్నాం--అందుకేమో, ఇదివరకూ ఎప్పుడూలేనంత దగ్గరతనం ఉందామెలో. కిటికీ అద్దం ఇస్తున్న పల్చటి వెలుగులో, చీర అంచుని చూపుడువేలి చుట్టూ ముళ్ళేసుకుంటూ, చెప్పింది.

కాలేజీలో ఎవడో వెంటపడ్డాడని ఈమె చదువు మాన్పించేసారు. చుట్టాలబ్బాయికే ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్ళయ్యాక ఇద్దరూ దగ్గరగా కూర్చుని కబుర్లు చెప్పుకోవటంగాని, సరదాగా కలిసి బైటికి వెళ్ళటంగాని ఎప్పుడూ జరగలేదు. మొదట్లో ఈమెకి అదేం పెద్ద విషయం అనిపించలేదు. బాక్సు పెట్టి పంపటం, బట్టలుతికి ఆరేయటం... పెళ్ళంటే ఇంతేనేమో అనుకుంది. దానికితగ్గట్టు ఎప్పుడైనా కూరలో కాస్త రుచి చెడితే చాలు భర్త కంచం ఇలా గిరాటేస్సేవాడు. అలాంటి తీవ్రత తన మీద వేరే ఏ విషయంలోనూ చూపించకపోవటంతో- ఆమెకు వంట, ఇస్త్రీ, ఇంటి శుభ్రంలాంటివి నిజంగానే సంసారంలో చాలా ముఖ్యమైన విషయాలనిపించాయి. ఈలోపు పిల్లాడు పుట్టాడు. వాడికేదన్నా జ్వరమో మరోటో వచ్చినప్పుడే ఇద్దరూ కలిసి ఆసుపత్రికి వెళ్ళేవాళ్ళు. లేదంటే ఎవరివైనా పెళ్ళిళ్ళకో, తద్దినాలకో. భర్త అదో రకం మనిషని సర్దుకుపోయింది. కానీ చెల్లెలికి పెళ్ళయి ఆ మొగుడూపెళ్లాలిద్దరూ ఎంత సరదాగా ఉంటున్నారో చూసాకా తన జీవితంలో లోటు ఉందని అనిపించటం మొదలైంది. చెల్లెలు మురిసిపోతూ పడగ్గది విషయాలతో సహా చెప్పుకునేది. ఆమె సలహా మీదే, ఒక రాత్రి ఈమె ధైర్యం చేసి భర్త మంచం మీదకి వెళ్ళింది, అలవాటులేనివేవో చేయబోయింది. "ఏం రోజు రోజుకీ ఎక్కువవుతున్నాయి వేషాలు?" అని అటు తిరిగి పడుకున్నాడు. తన సంసారంలో ఏదో ఉండాల్సింది లేదన్నది తెలిసొచ్చాక, మనసుని వేరే విషయాల మీదకి మళ్ళించుకుంది. ఒక్కోకాలంలో ఒక్కో పిచ్చ ఈమెని అంటుకుని కొన్నాళ్ళు ఊగించి వెళ్ళిపోయేది. ఒక కాలంలో విపరీతమైన భక్తి, తెల్లారగట్ల వొణికిపోతూ స్నానాలు, ఏ నియమం పొల్లుపోకుండా ఎంతో పట్టింపుతో పట్టే నోములు, ఆ పగళ్ళలో ఇల్లంతా కర్పూర ధూపం వాసన.... ఒక కాలంలో కుట్లూ అల్లికల మీద విపరీతమైన శ్రద్ధ, మంచంమూలన ఎప్పుడూ ఊలు ఉండలు, కాగితాల మీద డిజైన్లు.... ఒక కాలంలో మొక్కల పెంపకం, ఆ రోజుల్లో మొక్కలమ్మేవాడు ఈమె సందు ఎప్పుడూ తప్పిపోయేవాడు కాదు, పిల్లాడ్నిలాగ స్కూలుకి పంపి మొక్కల దగ్గర కూర్చునేది.... కొన్నాళ్ళు చుట్టుపక్కల వాళ్లని కలేసుకుని డ్వాక్రా రుణాలంటూ తిరిగింది, కొన్నాళ్ళేమో పిరమిడ్ మెడిటేషన్.... అప్పుడప్పుడూ ఈ పిల్లకి పిచ్చేమో అనిపించే పనులు కూడా చేసేది. ఒకసారి సుద్దరాయి బాగా అరగదీసి ఆ పొడిలో ఫెవికాల్ కలిపి ఇల్లంతా ముగ్గులు వేసింది, అలా ఐతే ఊడిరాకుండా ఉంటాయని. నాల్రోజులు శ్రద్ధగా ఈ పని చేసాకా మరుసటి వారానికల్లా అవి ఊడొచ్చేసాయి. సాయంత్రాలు మేడమీద హెడ్‌ఫోన్స్‌లో ఎఫ్ఎమ్ పాటలు వింటూ చీకటిపడేదాక పచార్లు చేసేది. ఎపుడన్నా రేడియో స్టేషన్‌కి ఫోన్ కలిస్తే మళ్ళీ మళ్ళీ అవే పాటల్ని అడిగి వేయించుకునేది. పిల్లాడ్ని దగ్గరికి తీసుకుని "రేయ్ పెద్దాయ్యాక నేనడిగిన చోట్లన్నిటికీ నన్ను తీసుకెళ్తావా" అని అడిగేది. వాడు పెద్దాడయ్యి ఎవరినైనా ప్రేమిస్తే ఎంత పోట్లాడైనా సరే నచ్చినమ్మాయినే తెచ్చి పెళ్లి చెయ్యాలని కలలు కనేది. కాలేజీలో తన వెంటపడ్డ కుర్రాడు గుర్తొచ్చేవాడు. కొన్నాళ్ళకి రెండోబిడ్డ కడుపున పడింది. కానీ పుట్టిన కొన్ని నెలలకే న్యుమోనియా సోకి చనిపోయింది. అప్పుడు భర్త పక్కన లేకపోవటం, ఈమే అర్ధరాత్రి ఆటో కట్టించుకొని ఆసుపత్రుల చుట్టూ పరిగెత్తటం, ఐసియు బైట వరండాలో కూర్చుని లోపల్నించి వచ్చే ప్రతి డాక్టరు ముఖంలోనూ బిడ్డ క్షేమాన్ని వెతుక్కోవటం, లోపల పదునుగా కూసే యంత్రాల మధ్యన ప్రాణం కోసం ఆ బిడ్డ యాతన.... ఇన్నాళ్ళయినా ఆ పాప పుట్టిన రోజుకీ, చనిపోయిన రోజుకీ  ఈమె మామూలుగా ఉండలేదు. ఆ పాప పోవటంతోపాటే భర్త మీద గౌరవం, ఆ బంధానికి కట్టుబడివుండాలనే బాధ్యత పోయాయి. ఎంతసేపూ లోటు లోటు లోటు అనే భావం నరాలనీ, గుండె అంచులనీ పళ్ళతో కొరికేసేది. డాక్టర్ రాసిచ్చిన మందులతో రోజులో ఎక్కువ భాగం నిద్రలో గడిపేసేది. ఈమె పరిస్థితి గమనించి ఒకసారి అత్త అడిగింది. ఆవిడ చిన్నప్పటి నుంచీ అలవాటే  కాబట్టి ఆ చొరవతో "బావ నాతో సరిగా ఉంటం లేద"ని చెప్పుకుంది. "నువ్వే వేరే వ్యాపకం ఏదన్నా పెట్టుకోవాలే" అందావిడ. అమ్మానాన్నలకి చెప్పుకున్నా, తోబుట్టువులకి చెప్పుకున్నా అందరి నుంచీ వచ్చిన ఒకే సమాధానం "వ్యాపకం".

"ఇప్పుడు నువ్వేరా నా వ్యాపకం" అంది నా బుగ్గ గిల్లుతూ.

ఆమె చెప్తున్నంతసేపూ నా మనసులో ఎన్నో దిగులేసే దృశ్యాలు మెదిలాయి. నా వొళ్ళో పరుచుకున్న అందం వెనుక నుంచి ఒక గుంభనమైన లోతేదో  కొత్తగా తెరుచుకున్నట్టు అనిపించింది. ఆమె మీద నా లోపలి లెక్కలన్నీ చెరిగిపోయాయి. పొద్దున్న గుళ్ళో పెట్టుకున్న కుంకుమబొట్టు ఆమె నుదుటి మీద చెమటకి కరిగి జారుతుంటే సర్దాను. మొదట్లో ఈమెని కలిసినప్పుడు, రొమ్ములు పిసుకుతూ పొట్ట మీద ముద్దులు పెడుతున్నప్పుడు, ఆ వేడిలో తను నన్ను ఇంకా కిందకు తోయటానికి ప్రయత్నించేది. తన ఉద్దేశం అర్థమైనా నేను మటుకు లొంగేవాడ్ని కాదు. ఒకరికొకరం బాకా అలవాటయ్యాకా నేరుగానే అడగటం మొదలుపెట్టింది, "ఒకసారి నోటితో చెయ్యొచ్చు కదా" అని. కానీ నాకెందుకో వెగటుగా అనిపించేది. అబ్బా అక్కడ నాలిక పెట్టాలా అన్నట్టు. కానీ నాకు నోటితో చేస్తున్న హక్కుతోటి ఆమె అడిగేది. చివరకు దాన్నించి తప్పించుకోవటానికి నేను చేయించుకోవటం మానేసేను కూడా. ఇవాళ మాత్రం ఆమె మొత్తం నాదిగా, నా వొంట్లో భాగంలాగ అనిపించింది. నా అంతట నేనే ఆమె కాళ్ళ మధ్యలోకి ముఖం దూర్చాను... నాలిక మీద లేత పింక్ మాంసం రుచి... కొండల మధ్యన పచ్చిక మేసే ఆవు... కన్నెత్తి చూస్తే వెనక్కి విరుచుకున్న ఆమె చుబుకం కొండ మీది గోపురం.... ఒకరికొకరు పొడిగింపులా శరీరాలు అతుక్కుపోయి... నేనన్నదంతా ఆమెలోకి చెదిరిపోతున్నట్టు... ఇక ఎవ్వరూ మిగలని శూన్యంలో ప్రాణమొక్కటే తనకితాను ఆనందిస్తున్నట్టు. ఆ రోజు సాయంత్రం, జనం భుజాల్ని గుద్దుకుంటూ పోయే వీధిలో, ఒక బండి దగ్గర నిలబడి ఆమె చెవిలీలు బేరం ఆడుతోంది, మధ్యలో ఒక్కోటి తీసి చెవికానించి "నప్పిందా" అని నన్ను అడుగుతోంది, అదంతా చాన్నాళ్ళు గుర్తుండిపోయే జ్ఞాపకం అవుతుందని- అది అవుతున్నప్పుడే అనిపించింది.

* * *

నాకీమధ్య కడుపులో మంట మొదలయ్యింది. ఉద్యోగంలో హడావిడి వల్ల తినాల్సిన టైమ్‌కి ఆ చుట్టుపక్కల ఏం దొరికితే అవి- దాల్చావల్ అనీ, ఫ్రైడ్ రైసనీ, సమోసాలనీ తినేస్తున్నాను. "అలా వద్దురా, ఏదో ఒకటి వండుకుని బాక్సులో పట్టుకుపో" అని చెప్పింది తను. "ఫోన్ లో చెప్పటానికేం ఎన్నయినా చెప్తావ్" అని విసుక్కున్నాను. కానీ తర్వాత కనీసం రైస్ అయినా బాక్సులో పట్టికెళ్తున్నాను, కూరలు బైట కొనుక్కుంటున్నాను.

మధ్యాహ్నం ఒక పార్కులో కూర్చుని తినేవాడ్ని. ఆ పార్కు సిటీకి మధ్యనే ఉంది కానీ చాలా పెద్ద పార్కు. చుట్టి రావటానికే అరగంట పడుతుంది. మధ్యలోకి వెళ్ళి కూర్చుంటే బయట ట్రాఫిక్ రొద కూడా వినపడదు. నేను అలవాటుగా కూర్చునే చోటు ఒకటుంది. అక్కడ్నించి ఎటు చూసినా పచ్చగా గుబుర్లే తప్పితే- పార్కు బెంచీలుకానీ, కరెంటు తీగలుకానీ, నీళ్ళ గొట్టాలుకానీ, నడిచే బాటకానీ ఏవీ కనిపించవు. ఏదో అడవిలో కాస్త తెరిపి ఉన్న చోట కూర్చున్నట్టు ఉంటుంది. మధ్యాహ్నాలు లవర్స్ తప్ప పెద్దగా ఎవరూ ఉండరు. ఆ రోజు భోజనం తినేసి, బాక్సు బేగ్‌లో పెట్టుకుని, ఊరికే గడ్డి పీక్కుంటూ కూర్చున్నాను. ఎండ చప్పున ఆగిపోయి మబ్బు పట్టేసింది. గాలి విసురుకు ఆకులు మెలిపడి గుబుర్ల మీద లేతరంగు అలలు పారుతున్నాయి. ఆకాశంలో లేతమబ్బుల పైకి ముదుర్రంగు మబ్బులు పాకుతున్నాయి. చినుకులు పడటం మొదలైంది. పెద్ద పెద్ద చినుకులు. ఓ చెట్టు కిందకి వెళ్ళి పైన కొమ్మలు దట్టంగా ఉన్న చోటు చూసుకుని నిల్చున్నాను. నన్నొక్కడ్ని చేస్తూ- చుట్టూ చినుకు తెర వాలిపోయింది. ఒక్కో రకం ఆకుల మీద ఒక్కోరకంగా చినుకుల చప్పుడు. అంతా కలిసి వాన చప్పుడు. ముఖం మీదకి చల్లగా ఆవిరి. కానీ ఎంతోసేపు లేదు. ఏదో మట్టివాసనని రెచ్చగొట్టి పోడానికన్నట్టు కాసేపు కురిసి ఆగిపోయింది. చెట్ల కింద పొడి నేల కూడా పూర్తిగా తడవలేదు. ఇందాకటి గీర ఎండ మళ్ళీ వచ్చేసింది. కాలవలు కట్టబోయిన నీళ్ళు అలాగే ఇంకిపోతున్నాయి. పైనుంచి చెట్టు చినుకుల్ని దులపరించుకుంటోంది. మళ్ళీ పచ్చిక మీదకు వచ్చి కూర్చున్నాను. ఫాంటులోంచి పిర్రలకి తడి. గడ్డి కింద చీమల కదలిక. ఉడుకుతున్న కూర మీంచి మూత తీసినట్టు ఘాటైన వాసన నేలలోంచి పైకి లేస్తోంది. వానకి గాల్లో దుమ్మంతా అణిగిపోయి వాతావరణం చాలా స్పష్టంగా ఉంది. అన్నీ వాటివాటి అసలైన రంగులతో కనిపిస్తున్నాయి. పైనున్న ఆకులు జారవిడిచే చుక్కల్ని కిందున్న ఆకులు అందుకొని, మళ్ళీ కిందకి వదిలేయటం... ఆకు అంచున పెరిగే నీటిచుక్కలో ఒక ప్రపంచం... అది రాలగానే తేలికై ఊగే ఆకు.... అక్కడ నేను ఉన్నట్టు, నాకు కళ్ళు ఉన్నట్టు, ఆ కళ్ళతో నేను చూస్తున్నట్టు అనిపించటం లేదు. దృశ్యం మాత్రం ఉందంతే, చూసేవాడెవడూ లేడు. నా పరోక్షాన్ని నేనే అనుభవిస్తున్నాను. కన్నీళ్ళు తెప్పించేంత ఆనందమేదో లోపల మట్టం పెంచుకుంటూ పొంగుతోంది. అలాగే వెనక్కి వాలిపోయాను. తలకింద చేతులు పెట్టుకుని వెల్లకిలా పడుకుని చూస్తే- ఇందాకటి బూడిద రంగు మబ్బులు పక్కకి జరిగిపోతూ, వాటి అవతల్నించి, ఒక్క మబ్బుపింజా లేకుండా, ఆకాశ నీలం విప్పారుతోంది. ప్రకృతి నా ఇంద్రియాల మీద పని చేస్తున్నట్టు లేదు. ప్రకృతి ఇంద్రియాల్లో నేనొకణ్ణైపోయాను. కదిలే మబ్బు నీడల కింద ఎప్పుడు కళ్ళు వాలిపోయాయో, ఎంతసేపు నిద్రపోయానో తెలీదు- చోటు కోసం వెతుక్కుంటూ ఎవరో జంట అక్కడికి వస్తే మెలకువొచ్చింది. వాళ్ళు నన్ను చూసి వెళ్ళిపోబోతున్నారు. వాళ్ళకే ఆ చోటు వదిలేస్తున్నట్టు లేచి నడిచాను.

* * *

పెళ్ళిలో గొడవైన ఆరేడు నెలల తర్వాత తమ్ముడికి ఫోన్ చేశాను. ఎన్నిసార్లు చేసినా ఎత్తలేదు. చివరికి మర్నాడెప్పుడో ఎత్తాడు: "ఎందుకు అన్ని సార్లు చేస్తున్నావ్?".

"ఎలా ఉన్నావ్ రా?"

"ఏంటి విషయం?"

"ఊరికే మాట్లాడదామని"

"నాకేం నీతో మాట్లాడాలని లేదు."

"సారీ రా..."

"... ... ..."

"ఆ రోజెందుకో కంట్రోల్‌లో లేను."

"... ... ..."

"వేరే విషయాల మీద కోపం అలాగ నీమీదకి వచ్చేసింది"

"ఏంటిరా అంత కోపం వచ్చేసే విషయాలు నీకు? పెద్దన్నయ్యకి పెళ్ళవటమా? ఒరే, శుభమాని పెళ్ళవుతుంటే నీకేంట్రా బాధ? ఎక్కడైనా ఏమో కానీ అన్నదమ్ముల మధ్య ఈ ఈర్ష్యలూ అయ్యీ అసయ్యంగా ఉంటాయిరా."

"ఛా! నాకు వాడిమీద ఈర్ష్యెందుకూ?"

"ఏమో... నువ్వు వాడిలా అవలేకపోయేవు కాబట్టేమో.. నాకేం తెలుసు"

"అవ్వాలనుకోను కూడా. ఏవుందిరా అంత సీను-- వాడిలా ఐపోవాలని ఇదైపోటానికీ?"

"నీకు లేనిదే ఉంది. వాడు కష్టపడాల్సిన టైం‌లో కష్టపడ్డాడు. లైఫ్‌లో బాగా సెటిలయిపోయేడు. నీకది చేత కాలేదు. నాన్న దగ్గరే ముణుక్కుంటా ఉండిపోయావు. ఒరే.. అంటే అన్నానంటావ్... అసలు నీ చదువు పూర్తయింది ఎప్పుడూ, నువ్వు ఉద్యోగానికని బైటికి వెళ్ళిందెప్పుడూ? ఏం పీకావురా ఆరేళ్ళు ఇంట్లో కూర్చునీ?"

"ఒరే... నాన్న హెల్త్--"

"--ఆపరా ఇంక! వినేవోడికి చెప్పు-- నాన్న హెల్తూ, ఈ సొల్లంతాని. నీకు బయటి ప్రపంచంలోకి వెళ్ళి బతకటం అంటే భయం. అడుగేసి ఓ పని పూర్తి చేయటం చేతకాదు. కోపం వస్తే అవతలోళ్ళ మీదకి రైజైపోవటం తప్పితే ఇంకేం రాదు. కానీ నువ్వొక్కడివీ ఓ మూల కూర్చుని నేనే మోనార్క్‌ని అనుకుంటే కాదు. బయటికెళ్ళాలి, మనుషుల్లో కలవాలి, డీల్ చేయాలి, అప్పుడు తెలుస్తాది లైఫంటే ఏంటో."

"నిజంగానే దూల తీరిపోతుందిరా.."

"ఆ... మరి!"

"సర్లే... ఆ రోజు ఏదో తిక్కలో ఉన్నాను. ఎందుకో చెయ్యి లేచిపోయిందంతే అలాగ..."

"ఆ..  లేచిపోద్ది లేచిపోద్ది! తిరిగి నేను కొట్టడం నిమిషం పని..."

"ఏంటి నన్నే!"

"ఆ... ఏం భయమా మాకు? పెళ్లిలో ఎదవ రచ్చెందుకని తగ్గానంతే."

"అబ్బచా...! ఒరే నీ ప్లాష్బాఉక్ కెళ్లి గుర్తు తెచ్చుకో. నేనంటే ఉచ్చపడేది ఎదవా నీకు. నాక్కోపమొస్తే అమ్మ నిన్ను దాచేసేది గుర్తుందా?"

"అంతే.. అలా ఫ్లాష్‌బాకుల్లోనే బతుకు. ఓరే నాయనా... ముందా వెనక్కు చూసుకుంటూ బతకటం మానెయ్యరా, బాగుపడతావ్. ఇంకా మనం కొబ్బరి కొమ్మల్తోటి, కొబ్బరి పుచ్చుల్తోటి దొడ్లో క్రికెట్ ఆడే వయసులో లేము. బయట ప్రపంచంలోకి వచ్చేసేం. ఇప్పుడు కూడా... ఎప్పుడు నోరిప్పినా నీకదే గోల... ఆ చిన్నప్పుడూ, ఆ తాతయ్య ఇంటి దగ్గరా, ఆ అంగర సాలిపేటలోనీ, ఆ లాకుల దగ్గరా, ఆ చింతలూరు తీర్థంలోనా... ఇప్పుడికీ అయ్యే కబుర్లయితే ఎలాగరా? ఎదిగిపోయాం మనమింక..."

"ఏం ఎదగటమోరా.. నచ్చట్లేదు"

"తప్పదు మరి. ఒరే నా మాటిని.. ఏదోలా కష్టపడి.. ఎక్కడో చోట సెటిలవ్వరా. ఆ తర్వాత నీకూ ఎవరో అమ్మాయి దొరుకుద్ది, పిల్లలొస్తారు... తర్వాత అన్నీ అయ్యే సెట్రయిటైపోతాయి. ఆళ్ళే చెప్తారు నీకు ఏం చెయ్యాలో!"

"అన్నీ భలే చెప్తావురా. పిచ్చ క్లారిటీయే నీకూ?"

"చెప్పించుకోటానికి పెద్దోడికి నీకు సిగ్గులేనప్పుడు నాకేం ఎన్నయినా చెప్తాను."

"సరేగానీ... ఏరా.. గట్టిగా తగిలిందా?"

"ఈసారొచ్చినప్పుడు చూపిస్తారా... అందుకే, ఇక్కడ కిక్ బాక్సింగ్ క్లాసులో కూడా జాయినయ్యా... నిన్ను చితగ్గొట్టేద్దామనే!"

"అబ్బో అవి కూడా నేర్పిస్తారేంటి మీ కాలేజిలో"

"యూనివర్శిటీరా... అన్నీ ఉంటాయిక్కడ."

"నీదే బావుందిరా ఎంచక్కానీ"

"ఆ.. ఇప్పుడేడు. అప్పుడేమో నాన్న చదవరా బాబా అంటూ కాళ్ళట్టుకున్నా చదివేవోడివి కాదు"

"పుస్తకం తెరిస్తే చాలు నిద్ర వచ్చేసేదెహె. అయ్యేంటయ్యీ...? ఆ..! ఎంసెట్ బుక్స్ రా నాయనా! డిక్షనరీల్లా ఉండేవి ఒక్కోటీ..."

"ఇంక చాలాపు... నాకు క్లాసు టైమైపోతుంది. నిన్ను క్షమించేసేన్లేగానీ.. పెట్టేయి ఫోను."

"అమ్మనీ!"

వాడు నవ్వుతానే ఫోన్ పెట్టేశాడు. నాకూ సంతోషంగా అనిపించింది. వాడితో మాట్లాడుతుంటే మధ్యలో నోటిదాకా వచ్చింది- వాడికి నా పరిస్థితీ ఇబ్బందీ అంతా చెప్పేసుకుందామని! మళ్ళీ నాకే అనిపించింది- చిన్నోడు, చదువుకునేవోడు, వాడ్ని కంగారు పెట్టడం ఎందుకలెమ్మని. అయినా అంత ఇబ్బందిగా కూడా ఏం లేదిప్పుడు. మెల్లగా అలవాటు పడిపోతున్నాను.

*


బొమ్మ: బి. కిరణ్ కుమారి
'రస్తా' మేగజైన్‌లో ప్రచురితం

February 16, 2019

కాడమల్లి


అరుణ ఇవాళే విమానమెక్కి వెళ్ళిపోతుంది. ఇంక నాకెప్పటికీ కనపడకుండా. నేను చేసిందే అంతా. మేమిద్దరమూ ఒక జంట అన్న నమ్మకంలో ఆమె ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసుకుంటుంటే, ఇక్కడ నేను ఇంకో అమ్మాయికి దగ్గరయ్యాను. తనతో కలిసాను కూడా. నా వంచన పొడ అరుణకి వెంటనే తగిలింది. నేను పెద్ద దాచే ప్రయత్నమూ చేయలేదు. ఇక అసలేమన్నా తనకి ఇక్కడ మిగిలున్నదా అన్నది తేల్చుకోవడానికి, ఉన్నపళంగా ప్రయాణం పెట్టుకొని ఇండియా వచ్చింది.

నిన్న పగలంతా ఏడుస్తూనే ఉంది. నా ముందే, నా గదిలో, బింకమంతా వదిలేసి, ప్రేయసికి ఉండే అధికారాలన్నీ పక్కనపడేసి. కానీ నా మనసు రెండుగా విడిపోయింది. రెండో వైపే మొగ్గు చూపుతోంది. అరుణ కన్నీళ్ళన్నీ నన్నేం తాకకుండానే రాలిపోయాయి. నిన్న రాత్రి, నేను మంచం మీద నిద్రపోతున్నాననుకొని, ఫోన్ వస్తే పక్క గదిలోకి వెళ్ళి మాట్లాడింది. ఆస్ట్రేలియా నుంచి తన దగ్గరి స్నేహితురాలితో.

“ఇక్కడ నాకంటూ ఏం లేదని అర్థమైందే. నేనేం అన్నా తన దాకా చేరటం లేదు. తను ఇంక నా మనిషి కాడు.”

నేను ఫేన్ వైపు చూస్తూ ఆ మాటలు విన్నాను. చిత్రంగా, ఆమె ప్రేమ లోతు నాకు మొదటిసారి తెలిసింది ఆ మాటల్లోనే; నా పరోక్షంలో వ్యక్తం చేసుకున్న ఆ సొంత బాధలోనే. మనసు పీకింది. కానీ లోపలే మొండిగా బలంగా ఏదో గోడ. అరుణ చాలాసేపు మాట్లాడింది. వినపడినవేవో  వినపడ్డాయి. తిరిగి గదిలోకి వచ్చేసరికి నిద్రపోయినట్టుగా కళ్ళు మూసుకున్నాను.

పొద్దున్న లేచేసరికి వేరే మనిషిలాగ ఉంది. రాత్రంతా నిద్రపోనట్టు ముఖం వడిలిపోయి ఉంది, కానీ దుఃఖమంతా బైటకు తోడేసాక మిగిలే తేటదనమూ ఉంది. నేను లేచి రెడీ అయి ఆఫీసుకి వెళ్ళిపోయాను. మధ్యాహ్నం ఒకసారి మాత్రం- రాత్రికి ఏం వండమంటావని మెసేజ్ పెట్టింది. తన చేతి వంట బాగుంటుంది. కానీ నేనిప్పుడు అధికారంగా అది చేయీ ఇది చేయీ అని చెప్పలేననిపించింది. “నీ ఇష్టం” అని మెసేజ్ పెట్టాను. సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళేసరికి తన సామానంతా సర్దేసుకొని, ఫ్రెష్‌గా స్నానంచేసి రెడీ అయి ఉంది. దొడ్డేంపు నా మాసిన బట్టలన్నీ ఉతికి ఆరేసి ఉన్నాయి. ఎందుకు ఉతికావంటే “నాకేం తోచలేదు మరి” అంది. ఇదివరకూ కూడా ఉతికిపెట్టేది కానీ ఇప్పుడు అలా ఉతకటం ఎందుకో నచ్చలేదు. ఇద్దరం నిశ్శబ్దంగా తిన్నాం. అప్పడాలు వడియాలతో సహా అన్నీ ఉన్నాయి. మొదటి ముద్దలు తింటున్నప్పుడు వంట గురించి ఏం చెప్తానో అన్నట్టు ముఖంలోకి చూసింది కానీ నాకేం చెప్పాలనిపించ లేదు.

“కాసేపలా బయటికి వెళ్ళొద్దామా” అంది తిన్నాక.

అరుణ మీద నా మనసులో ఇదివరకటి చనువూ, ప్రేమా ఏంమారలేదు. కానీ వేరే అమ్మాయితో ఉన్నానని తనకి తెలిసాక కూడా, మళ్ళీ తనతో ఇదివరకట్లాగే ఉంటే- ఏం నీతి లేనివాడిగా చులకనైపోతానని నిగ్రహంగా అంటీముట్టనట్టుగా ఉంటున్నాను.

“మరి టైం సరిపోతుందా నీకు?”

“ఎప్పుడో పదింటికి కదా బస్సు”

భాగ్యలతా కాలనీ వీధులు ఖాళీగా అసలిది హైదరాదేనా అన్నట్టు ఉంటాయి. వీధిలైట్లకి పైన ఇంకా కొంచెం వెలుగుంది. అరుణ నన్ను మరీ అంత ఆనుకుని ఎందుకు నడుస్తుందా అని చూస్తే మలుపు దగ్గర వీధి కుక్కలు ఆడుకుంటున్నాయి. వాటిని దాటేంత వరకూ తన దృష్టి అటేపే ఉంది. తన చేతుల్లో చేతులు కలిపి మూసాను. చల్లగా చెమట్లు. నా చేతి వెంట్రుకల్ని నిమురుతూ తన చున్నీ. సామానంతా సరిగ్గా సర్దుకుందా లేదా, ఎయిర్‌పోర్ట్ తీసుకెళ్ళే బస్సు దగ్గర ఎన్నింటికి ఉండాలీ, చెక్ ఇన్ ఎన్నింటికీ, సిడ్నీలో దిగేది ఎన్నింటికీ… అవన్నీ అడిగాను, ఏదోటి మాట్లాడాలని.

అన్నీ చెప్పి అంది, “ఈ రాత్రి ఒంటిగంట దాకా నన్ను భరించు. రేపట్నుంచి నువ్వెవరో నేనెవరో…”

“నోర్ముయ్యవే”

“దట్స్ హౌ ఇటీస్… ఎందుకు కలుస్తాం? నువ్వు దేశం దాటవు. నాకు నువ్వు లేనప్పుడు ఇటొచ్చే పనేం లేదు”

“అవును కానీ… ఒకళ్ళకొకళ్ళు ఏం కాకూడదని లేదుగా.”

“నీకు కొన్ని తెలీదురా. బహుశా ఎప్పటికీ తెలీదేమో, ఒక మనిషితో కమిట్ కావటం అంటే ఏంటో…”

“… … …”

“సర్లే… బావుండు. నమ్మకంగా వుండు. జార్తగా ఉండు. ఇంక నిన్ను వెనకాల ఉండి ఎవరూ తోయరు…”

నా కళ్ళల్లో చిన్నగా నీళ్ళూరాయి. మరీ చేత్తో తుడుచుకోవాల్సిన పరిస్థితి రాకుండా అంతటితో ఆగిపోతే బాగుండుననిపించింది. రోడ్డు పక్కనున్న షాపుల్లోకి పట్టిపట్టి చూస్తున్నాను. నా కోసం ఏడ్చుకోవటానికి మాత్రం ఎప్పుడూ తయారుగా ఉంటాను.

కాలనీ మెయిన్ రోడ్డు దాటి ఇళ్ళుండే వీధుల్లోకి వచ్చాం. అవేం సందడిలేకుండా స్తబ్ధుగా ఉన్నాయి. ఉండుండి టీవీ చప్పుడో, పిల్లల మాటలో వినిపిస్తున్నాయి. గుమ్మాల్లోంచి రోడ్డు మీదకి ట్యూబ్‌లైట్ వెలుగులు, గేట్ల నీడలు. ఒక వీధిలో ఇద్దరమ్మాయిలు షటిల్ ఆడుతున్నారు. ఇళ్ళ ముందున్న పూల మొక్కలు చూస్తూ నడుస్తుంది అరుణ. పారిజాతాలు, కాశీరత్నాలు, మాలతీమాధవాలు… ఈ పేర్లన్నీ తను చెప్తే తెలిసినవే.

“ఓహ్…! కాడమల్లి పూలు” అంది. అప్పటికిక నేను ఇబ్బందిగానే పట్టుకున్న తన చేతిని లాక్కొని చెట్టు కిందకి వెళ్ళింది. “ఈ చెట్టు దాటుతుంటే భలే వాసనొస్తుంది తెలుసా! ఇలా రా.”

రోడ్డు దాటి వెళ్ళాను.

“ఏడ్చేడ్చి నాకు రొంప… నీకే తెలియాలి వాసన.”

చెట్టు కింద నిలబడి పైకి చూసాను. గుబుర్ల లోంచి తెల్లగా పొడవాటి జూకాల్లాగా వేలాడుతున్నాయి పూలు. ఆకుల కన్నా అవే ఎక్కువున్నట్టున్నాయి. కళ్ళు మూసి గట్టిగా పీల్చుకున్నాను. “వీటినే కదా నైట్ క్వీన్ అంటారు?”

“నీ బొంద… అవి వేరు.”

ఏదో బండి ఈ రోడ్డు మీదకి మలుపు తిరిగింది. ఎవరిదో ఇంటి ముందు అలా నిల్చోవటం బాగోదని ముందుకి నడిచాను. అరుణ నేల మీద పూలు కొన్ని ఏరుకుని నా పక్కకు పరిగెత్తుకొచ్చింది.

“చూడు చూడు…” అంది ముక్కు దగ్గర పూలబొత్తి పెడుతూ.

“అబ్బా తుమ్ములొస్తాయే…”

“ఛీ! మొరటోడా…”

ఆకాశం ఇప్పుడు పూర్తిగా చీకట్లో ఉంది. వీధిలైట్లు లేని చోట నక్షత్రాలు బాగా కనిపిస్తున్నాయి. మేం మలుపు తిరిగిన వీధిలో గుమ్మాలేం లేవు, ఇంటి వారలే ఉన్నాయి, కిటికీలూ మూసి ఉన్నాయి. ఇద్దరం సిటీ నుంచి తప్పిపోయి ఎక్కడికో వచ్చేసినట్టు ఉంది. దూరంగా హైవే మీద పెద్దబళ్ళ హారన్లు మాత్రం అప్పుడప్పుడూ లీలగా వినిపిస్తున్నాయి.

“నేనొచ్చేసాక మనిద్దరం ఇక్కడే కాస్త పెద్దిల్లు తీసుకుని ఉంటామనుకున్నాను. నాకు నచ్చిందీ ప్లేసు.”

తన ఆలోచనలో తనూ, తన ఆలోచన ఊహిస్తూ నేనూ నడిచాం.

నిట్టూర్చింది. “ఏవో ప్లాన్స్ వేసేసుకున్నానురా. అన్నీ పాడు చేసేసావు. మళ్ళీ అంతా కొత్తగా కట్టుకోవాలి.”

ఆమె ఇక్కడ ఏడవద్దని మనసులో ప్రార్థించుకున్నాను. దూరంగా కాస్త సందడి ఉన్న వీధి కనిపిస్తోంది. అటు త్వరగా వెళ్ళాలనిపించింది.

“ఎనీవే… ఇవాళ… ఐ ప్రామిస్డ్ మై సెల్ఫ్… ఏడవను”

భుజం మీద కొలిచినట్టుగా చేయి వేసాను.

“ఛీటర్!” విదిలించుకుంది.

“ఓయ్…?”

“గో టూ హెల్… నాకూ ఆఫీసులో పాపం ఆ గుర్విగాడు రెండేళ్ళ నుంచీ తెగ ట్రై చేస్తున్నాడు. వాడికి ఒకె చెప్పేస్తా. నాకూ ఆప్షన్లున్నాయి”

“మంచిది”

“నువ్వు చూసావుగా వాడ్ని. మొన్న టెన్ కె రన్‌ అప్పుడు పంపిన ఫొటోస్‍లో ఉంటాడు నాతో పాటు.”

“ఊ”

“ఎలా ఉన్నాడు?”

“బావున్నాడు. నా కన్నా బానే వున్నాడు.”

“పొయెట్రీ కూడా రాస్తాడంట.”

“అబ్బో”

నాలో ఒక మూల- ఈ టాపిక్‌ని పొడిగించి నిజంగానే ఆమెకి జీవితం నాతోనే అయిపోలేదన్నట్టు ఊరటగా మాట్లాడాలని ఉంది. కానీ ఇంకో మూల- అసలు అరుణ ఈ టాపిక్  తెచ్చిందే నేను ఇలాంటివాటికి ఈర్ష్య కూడా పడనంతగా తన నుంచి దూరమైపోయానని ఖాయం చేసుకోవటానికేమో అనిపించింది. ఇదివరకూ కూడా ఇలాగే “వాడు బావున్నాడు, వీడు లైనేస్తున్నాడు” అని చెప్పి ఉడికించేది. కానీ ఇప్పుడు నేను కలగని ఈర్ష్య కలిగినట్టు నటించలేను. అసలలా ఈర్ష్య కలక్కపోవటమే అరుణ మీద నా ఫీలింగ్‍లో ఏదో మార్పొచ్చిందనటానికి ఒకేవొక్క ఋజువులాగ అనిపించింది. తనకి నా ప్రసక్తిలేని జీవితాన్ని నిజంగానే కోరుకుంటున్నాను.

“నీకెవరో నాకన్నా మంచోడే వస్తాడ్లేవే”

“మీ ఆశీర్వాదం ఉంటే ఇకనేం”

తన నుంచి వెటకారం… కొత్తగా ఉంది.

కొంచెం సందడిగా ఉన్న వీధిలోకి వచ్చాం. రోడ్డుకవతల కుడివైపు ఆంజనేయస్వామి దేవాలయంలో ఏదో భజన జరుగుతోంది. ఇద్దరం అప్రయత్నంగా అటు మళ్ళాం. గోడలన్నీ సింధూరం రంగు వేసి ఉన్నాయి. బయటి గోడకి ఆనుకొని ఒక చప్టా ఉంది. ఇద్దరం దాని మీద కూర్చున్నాం. భజనలో ఉన్నవాళ్ళంతా ముసలివాళ్ళు. డప్పులు, చిడతలు కొడుతూ ఎంతో లీనమై పాడుతున్నారు. ఆ నమ్మకాల వలయం చూట్టానికి బాగుంది. అరుణ లోపలికి వెళ్ళి ప్రసాదం తెచ్చింది. నా గుప్పిట్లోకి కొంత పంచింది. గుడి ఎదుట మా ముందు చిన్న బల్బుల తోరణం ఉంది. ఆ వెలుగులో అరుణ వంక చూస్తే, తను నా వంకే చూస్తోంది. నేను ప్రసాదం వైపు చూసి దాన్ని ఒద్దిగ్గా సర్ది నోట్లో వేసుకున్నాను. తను చేత్తో నా మీసానికంటిన మెతుకేదో దులిపింది.

చిన్నప్పుడు వాళ్ళ ఊళ్ళో జరిగే అమ్మవారి ఉత్సవాల గురించి, అక్కడ పిల్లల సందడి గురించి చెప్పింది. చుట్టాల పిల్లలెప్పుడూ ఈ పిల్లని నాన్న కూచి అనీ, బాగా గీర అనీ కలవనిచ్చేవారు కాదు. ఈ పిల్ల ఫిర్యాదులన్నీ దాచుకొని నాన్న వచ్చాకా చెప్పటానికి గేటు దగ్గర గేటుకి వేలాడుతూ ఎదురుచూసేది. ఆమె ముఖం వంక చూస్తూ, పరధ్యానంగా ఊ కొడుతూ, నేను ఆడవాళ్ళ గురించి ఆలోచించాను. వాళ్ళ ప్రేమ గురించీ, అందులో ఉండే అక్కర గురించీ, బాధ్యత గురించీ…. అరుణ నాలో పసితనాన్ని ఇష్టపడింది. చూడాలనుకున్నప్పుడు నాలో పెద్దరికాన్నీ చూసుకుంది. కానీ ఆ పసితనం నిజానికి బాధ్యతల బరువు తెలియనితనం అనీ, ఆ పెద్దరికం కూడా పైపైన ఒక పెళుసు పెంకులాంటిదేననీ తెలుసుకోలేకపోయింది. తను నాలో ఊహించుకున్న మూర్తి మాత్రం ఒక ఆదర్శంలాగ నాలో ముద్రపడిపోయింది, ఎదగమని చెబుతూ. ఎప్పటికైనా ఆ మూర్తిని ధరించి నిభాయించుకోగలనేమో….

అరుణ నా చేతిని వొళ్ళోకి తీసుకుంది. అరచేతికంటిన ప్రసాదపు తడిని చున్నీతో తుడిచింది. గోటి అంచుతో రేఖల్ని చదవటం మొదలుపెట్టింది.

“నీకు పిల్లలున్నార్రోయ్! ఒక బుడ్డోడో బుడ్డదో…”
* * *

అరుణ జీవితంలోకి వచ్చాకనే నాకు విమానాశ్రయం పరిచయమైంది. ఇక్కడే ఎన్నోసార్లు ఏదో ఒక గోడ మలుపులో తను మాయమవటం చూసాను, ఏదో ఒక గోడ అంచు దాటి మళ్ళీ ప్రత్యక్షం అవటమూ చూసాను. మొదటిసారి కలిసినప్పుడు రెస్టారెంట్లో అరుణ చేతి వేళ్ళతో ఆడుకోవటం, వాటి సున్నితత్వానికి ఆశ్చర్యపోవటం గుర్తుంది. అంత ప్రయాణం చేసొచ్చినా తన ముఖం ఆరోగ్యంతో వెలిగిపోవటం గుర్తుంది. ఇవాళ అరుణ ముఖం బాగా అలిసిపోయినట్టు ఉంది. పెద్ద మాట్లాడుకోవటానికేం మిగలనట్టు కూర్చున్నాం. ఎంతో ఆత్మీయమైన అపరిచితులం. కళ్ళూ వేళ్ళూ మాత్రం అలవాటింకా పోనట్టు తడుముకున్నాయి. ఇంక వెళ్ళకపోతే విమానం తప్పిపోతుందనేంత దాకా బయటే ఆగింది. వెళ్ళేముందు, నా కళ్ళల్లోకి- వాటిలో కనిపించేదేదో బాగా జ్ఞాపకం ఉంచుకోవాలన్నట్టు చూసింది. చెంప నిమిరి, ట్రాలీ నెట్టుకుంటూ గుమ్మం వైపు నడిచింది. నేను అద్దాలకు ఇటువైపు తచ్చాడాను. అరుణ లోపలికి నడవటం, కౌంటర్ దగ్గర నిలబడి మాట్లాడటం అంతా కనిపిస్తోంది. మళ్ళీ అదే గోడ… ఏవో ప్రకటనలు మెరుస్తున్న గోడ… దాన్ని దాటగానే అరుణ నాకు ఇంక కనపడకుండాపోయే గోడ… దాటే ముందు ఆగి చూసింది… ఇద్దరికీ తెలుసు, మనసిచ్చిపుచ్చుకున్న మనుషులుగా ఒకర్నొకరం ఇదే ఆఖరుసారి చూసుకోవటమని. అరుణ వెళ్ళిపోయింది. ఆ గోడ అంచుని చూస్తూ ఉండిపోయాను. కదులుతున్న కాలంలో నిలబడి, వర్తమానం అలా నిరామయంగా గతంగా మారిపోతుంటే, దూరం జరిగిపోతుంటే, కళ్ళు కదిలి…. వెనక్కి వచ్చేటప్పుడు ఎయిర్‌పోర్టు బస్సులో చుట్టూ ఎవరూ లేని చోటు చూసుకుని కూర్చున్నాను.

(రస్తా మేగజైన్ ఫిబ్రవరి 16న ప్రచురితం)

January 16, 2019

పొద్దున్నే హడావిడి

బాబిగాడికి లెట్రిన్‌లో ఎక్కువ సేపు కూర్చోవటమంటే ఇష్టం. అమ్మా నాన్నా ఎన్నిసార్లు తిట్టినా పద్ధతి మారలేదు. ఏవో ఊహల్లోపడి ముడ్డెండిపోయేదాకా అలాగే కూర్చుంటాడు. రెండ్రోజులుగా వర్షం పడి ఆ రోజే కాస్త ఆగింది. లోపల మటుకు వెచ్చగానే ఉంది. అప్పటికే బాబిగాడు బకెట్‍లో చెంబుతో ఎన్ని ఆటలు ఆడొచ్చో అన్నీ ఆడేశాడు. కాసేపు బకెట్ అంచు మీద చేతివేళ్ళని మనిషిలాగ నడిపించాడు. కాసేపు తడివేలితో ఎర్రటి గచ్చు మీద కార్ల బొమ్మలు గీశాడు, వాటి చేత ఏక్సిడెంట్లు చేయించి మంటలు లేపాడు. తర్వాత గోడ పగుల్లోంచి బయటికి పాకిన గాజుపురుగు ఇటువైపొస్తుందేమోనని భయపడ్డాడు. అది మళ్ళీ పగుల్లోకి వెళ్ళిపోయేదాకా దాన్నే చూస్తూ కూర్చున్నాడు, దగ్గరకొస్తే చెంబుతో నీళ్ళు కొట్టేద్దామని.

బయట దొడ్లో అంట్లు బోర్లిస్తున్న చప్పుడుతోపాటు అమ్మ గొంతు గట్టిగా వినిపించింది, “ఒరే వచ్చావా లేదా బయటికి? అంత సేపేవిట్రా లోపల. చీడ అలవాట్లూ నువ్వూని!”

ఇక తప్పదన్నట్టు చెంబు బకెట్‌లో ముంచబోయాడు. అప్పుడే బకెట్ వెనకాల నుంచి చిన్న నత్త వస్తూ కనిపించింది. నత్తని చూడటం అదే మొదటిసారి వాడికి. వెంటనే తమ్ముడ్ని పిలవాలనిపించింది గానీ ఉన్న చోటు గుర్తొచ్చింది. కొద్దిగా ముందుకు వొంగి దాని వైపు చూసాడు. చిన్న జిగురు బొమ్మలాగ వుండి మెల్లగా కదుల్తున్న ఆ జీవిని ఇదివరకు చూసింది పుస్తకంలోనే. అది తల మీద రెండు కొమ్ముల్నీ వొయ్యారంగా అటూయిటూ తిప్పుతుంటే భలే ఉంది. ముట్టుకోవాలనిపించింది గానీ వికారంగా భయంగా కూడా అనిపించింది. చూపుడు వేలు నెమ్మదిగా దానివైపు తోసి పైన పెంకుని ముట్టుకున్నాడు. నత్త చప్పున కొమ్ములు లోపలికి లాక్కుని దగ్గరగా ముడుచుకుంది. బాబిగాడు నవ్వుతూ మోకాళ్ళని కావలించుకున్నాడు. అది మళ్ళీ విచ్చుకున్నాక ఈసారి ఇంకాస్త ధైర్యం చేసి తిన్నగా కొమ్ముల్నే ముట్టుకున్నాడు. వొళ్ళంతా జలదరించింది. చేయి బకెట్లో కడిగేసుకున్నాడు.

బయట ఎవరో కుళాయి విప్పిన శబ్దం వినిపించింది. బాబిగాడు కిందకి వొంగి రేకు తలుపు కింద సందులోంచి బయటికి చూసాడు. నాన్న కుళాయి దగ్గర కాళ్ళు కడుక్కుంటున్నాడు. తర్వాత దొడ్డిగుమ్మం దాకా వెళ్ళి, చెప్పులు విప్పి, మూడు మెట్లెక్కి, గోని మీద కాళ్ళు తుడుచుకుని లోపలికి వెళ్ళాడు. తమ్ముడు లోపలి గదుల్లోంచి అరుస్తూ రావటం వినిపించింది. అమ్మ “ఏం తెచ్చారు?” అని అడుగుతోంది.

“అబ్బా బజారంతా బురద బురద! చేపలు బాలేవే. రేటు కూడా ఎక్కువ చెప్తున్నాడు. చికెన్ తెచ్చాను” అంటున్నాడు నాన్న.

తమ్ముడు “లాలీపాప్ లాలీపాప్ లాలీపాప్!” అని అరుస్తున్నాడు.

“ఉండరా, చొక్కా అయినా విప్పనీ…. అన్నయ్యేడీ” అనడిగాడు నాన్న.

అమ్మ చెప్పింది, “దొడ్డిక్కూచుంటే ఓ పట్టాన రాడుగా ఆయన. ఏం పుణుక్కుంటాడో మరి లోపల అంతసేపు. అన్నీ ఆళ్ళ మేనమామ బుద్ధులే!”

“చిన్నోడా, అన్నయ్యని రమ్మను లాలీపాప్ తింటాడు,” అన్నాడు నాన్న.

దానికి తమ్ముడు లోపల్నించి ఏమన్నాడో సరిగ్గా వినపడలేదు.

ఇలా అందరూ వాడి గురించి మాట్లాడుకుంటుంటే అక్కడ లేకుండా వినటం బావుంది బాబిగాడికి. కానీ నాన్న బజారుకు వెళ్ళొచ్చినంతసేపూ తను ఇక్కడే ఉన్నాడని తెలిస్తే తర్వాత తిడతాడు. ఇదివరకే ఒకసారి తిట్టేడు కూడా. మళ్లా ఇదే విషయం మీద తిట్టించుకోవాలంటే సిగ్గుగా ఉంటుంది. చాటుగా బైటికెళ్ళిపోయి, లెట్రిన్‌లోంచి వచ్చి చాలా సేపయినట్టుగా నాన్న ముందు నటిద్దామని ఐడియా వచ్చింది బాబిగాడికి. పెద్ద చప్పుడు రాకుండా, అసలు నత్త వంక చూడకుండా, కడిగేసుకున్నాడు. కుళాయి గొట్టం వెనక దోపిన నిక్కరు తీసి తొడుక్కున్నాడు. తుప్పుపట్టిన తలుపు కొక్కెం కొంచె కొంచెంగా లాగాడు. వాడి మనసులోకి ఒక ప్లాను వచ్చింది: ఇంటి పక్క సందులోంచి ఇంటి ముందువైపుకి వెళ్ళాలి, అక్కడ వీధి గేటుని అందరికీ వినపడేట్టు గట్టిగా మూసి అప్పటిదాకా పక్కింట్లో ఆడుకుని వస్తున్నట్టుగా కటకటాల్లోంచి లోపలికి రావాలి, నాన్న టీ తీసుకుని పేపరు చదవటానికి కటకటాల్లోకి రాకముందే ఇదంతా జరిగిపోవాలి.

తలుపుతీసి బయటికి రాగానే వొంటి మీదకి చల్లగా గాలి తగిలింది. వొంటి మీద చొక్కా లేదని గుర్తొచ్చింది. చొక్కాలేకుండా పక్కింటికి వెళ్ళాడంటే ఎవరూ నమ్మరు. వెనకగదిలో తలుపుపక్కనున్న పెద్ద చెక్కపెట్టెలో అమ్మ మాసిన బట్టలు వేస్తుంది. వాటిల్లోంచి ఏదన్నా చొక్కా తీసుకోవచ్చు.

అప్పుడప్పుడే ఎండకి తడారుతున్న నాపరాతి నేల మీద నడుస్తూ బాబిగాడు ఇంటి గోడ వైపు వెళ్ళాడు. వంటగదిలోంచి అమ్మ పని చేస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అమ్మ కిటికీ లోంచి చూస్తే కనిపించకుండా ఉంటంకోసం- కిటికీ కిందగా వొంగొని నడిచాడు. ఒక కన్ను మాత్రమే దొడ్డితలుపు అంచుని దాటించి లోపలికి తొంగిచూశాడు. వెనక గదిలోంచి హాలు, కటకటాల గది, వీధి గేటు దాకా ఖాళీగా కనిపిస్తున్నాయి. నాన్నా తమ్ముడూ పడకగదిలో ఉన్నట్టున్నారు. బాబిగాడు మూడు మెట్లెక్కి, నెమ్మదిగా వెనక గదిలోకి వచ్చాడు. మాసిన బట్టల పెట్టె వంటగది గుమ్మం పక్కన పొడవుగా బాబిగాడంత ఎత్తు ఉంది. దాని దగ్గరకు వెళ్ళి మెల్లగా మూత తీయబోయాడు.

“ఏవే, టీ పట్టుకొచ్చావా” అని లోపల్నుంచి నాన్న మాట వినపడగానే చప్పున మూత మూసేసి, బట్టలపెట్టి పక్కన గోడ మూలన దాక్కున్నాడు. దొడ్డి తలుపుని తనవైపు లాక్కున్నాడు. ఇప్పుడు బట్టలపెట్టెకీ, దొడ్డి తలుపుకీ, గోడమూలకీ మధ్యన ఒక బుల్లిగదిలా ఉన్న మరుగులో బాబిగాడు ఎవ్వరికీ కనిపించడు. “ఆ వస్తున్నా” అంది అమ్మ వంటగదిలోంచి.

బాబిగాడికి వొళ్ళంతా వొణికింది. చేతుల్తో నోరు మూసేసుకుని నవ్వుకున్నాడు. ఫ్రెండ్స్‌తో పార్కులో ఆడిన దొంగా పోలీసాట గుర్తొచ్చింది. అందులో పోలీస్ పదంకెలు లెక్కపెట్టి వెతుక్కుంటా వస్తున్నప్పుడు ఇలాగే అనిపిస్తుంది. ఇది అంతకన్నా బావుంది. ఎందుకంటే అక్కడైతే దొరికిపోతే వెళ్ళి పదంకెలు లెక్కపెట్టాలంతే. ఇక్కడ మాత్రం తిడతారు. తలుపు అంచుకీ, బట్టలపెట్టె అంచుకీ మధ్యన సందులోంచి గోడకున్న కేలండరు మీద లక్ష్మీదేవి బొమ్మ కన్పిస్తోంది. ఆవిడక్కూడా కనపడకూడదన్నట్టు ఇంకాస్త వెనక్కి సర్దుకోబోయాడు. వీపు తగిలి వెనకున్న చీపురుకట్ట తలుపు మీద పడింది. కుచ్చు వైపే పడటం వల్ల చిన్నగానే చప్పుడయ్యింది. అమ్మ నడుస్తున్నట్టు కాలిపట్టీలు వినపడ్డాయి. బాబిగాడు కాసేపు ఊపిరి కూడా ఆపేసి విన్నాడు. కానీ పట్టీలు పడగ్గది వైపు వెళ్ళిపోయాయి.

“ఏడే పెద్దోడేడీ?” అన్నాడు నాన్న.

“అవునింకా రాడేంటీ?” అంది అమ్మ.

ఈసారి పట్టీలు ఇటువైపే వస్తున్నాయి. బాబిగాడు గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. పట్టీలు దొడ్లోకి వెళ్ళాయి. “రేయ్ బాబీ?” అని గట్టిగా వినపడింది. బాబిగాడి ఊహలో దొడ్లో అమ్మ తిరగటం కనిపించింది. “ఏంటిది చిత్రం… పిల్లాడేడీ!” ఈసారి అమ్మ గొంతు కాస్త గాభరాగా ఉంది. పట్టీలు అటూయిటూ తెగ తిరుగుతున్నాయి. “రేయ్ బాబీ” అని ఈసారి ఇంకా గట్టిగా వినిపించింది. బాబిగాడు ఒకే ధ్యాసగా వింటున్నాడు. పట్టీలు మూడు మెట్లెక్కి మళ్ళీ లోపలికి వచ్చాయి. తలుపు సందులోంచి అమ్మ చీర దాటి వెళ్ళటం కనిపించింది. కాసేపటికి కటకటాల తలుపు తీయటం వినిపించింది. “పిల్లాడు ఎక్కడా లేడండీ,” అంటోంది అమ్మ గొంతు. “అదేవిటే?”అంటోంది నాన్న గొంతు పడగ్గదిలోంచి.

బాబిగాడికి పొడిగా గుటకలు పడుతున్నాయి. బయటికెళ్ళి వాళ్ళ ముందు నిలబడగలిగే అవకాశం కొద్దికొద్దిగా దూరం జరుగుతున్నట్టు, వాళ్ళందరి నుంచీ వేరయిపోయి ఒక పెద్ద గొయ్యిలో కూరుకుపోతున్నట్టు ఉంది.

అమ్మ గొంతు ఈసారి పడగ్గదిలోంచి వినపడింది. “ఏమో మరి, దొడ్లో లేడు, సందులోనూ లేడు, బయట గచ్చు కింద కూడా చూసాను. లెట్రిన్ లోనే ఉన్నాడనుకున్నాను ఇప్పటిదాకానూ!”

“రేయ్ చిన్నోడా, అన్నయ్యేడిరా?” అంది నాన్న గొంతు.

“తెలియట్లే డాడీ,” అనేసి తమ్ముడు మళ్ళీ పులిలాగా గాండ్రిస్తున్నాడు. వాడికి ఇంకా సరిగ్గా మాటలు రాలేదు.

బాబిగాడికి బయటికి వచ్చేయాలని ఉంది, కానీ ఉన్న చోటునుంచి కదల్లేనట్టుగానూ ఉంది.

“ఏంటి కింద చూస్తున్నారు…?”

“ఒకసారిలాగే కదా మంచం కింద దూరి నిద్రపోయాడు, వెధవ”

“ఇంట్లో లేకపోతే మరి… బైటేమో వేసిన గేటు వేసినట్టే ఉంది ఏమైపోయాడు!”

“ఎంతసేపూ నీ పనులూ నీ గొడవే కాని పిల్లల మీద ధ్యాస ఉండదే బొత్తిగా…”

“నన్నంటున్నారా! నా అంట్ల పనిలో నేనున్నాను. పిల్లాడు వెళ్ళినవాడు అక్కడే ఉంటాడనుకుంటా గానీ–”

“అసలు లోపలికి వెళ్ళటం చూసావా?”

“–ఏమోనండీ తలుపు మూసుకోవటం వినపడింది వంటింట్లోంచి. మీరేమో బయటికి వెళ్లారు. చిన్నోడా చెప్పకుండా వెళ్ళడు. ఇంక వాడే అనుకున్నాను…”

“ఏదీ సరిగ్గా చెప్పవే నువ్వు!”

ఈసారి నాన్న లుంగీ తలుపు సందుని దాటి దొడ్డేంపుకి వెళ్ళటం కనిపించింది.

కాసేపు దొడ్లోంచి అమ్మా నాన్నలిద్దరూ “బాబీ!”, “రేయ్ నాన్నా!” అంటూ అరిచారు. లెట్రిన్, బాత్రూమ్ తలుపులు తెరిచారు మూసారు. తమ్ముడు కూడా వెనకాల వచ్చి “బాబీ బాబీ బాబీ!” అని సరదాగా అరుస్తున్నాడు.

“పిల్లాడు మీ ఇంటికేవన్నా వచ్చాడా వదినా?”

“లేదమ్మా, రాలేదు. మా వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో లేరుగా. వాళ్ళ డాడీ బైటికి తీసికెళ్ళేరు.”

లోపలికి వెళ్ళినప్పుడు నాన్న అడుగులు గట్టిగా పడుతున్నాయి. అమ్మ పట్టీల చప్పుడు కూడా వెంట వెంటనే వినిపిస్తోంది. బాబిగాడికి ఇప్పటిదాకా ఏమూలో ఉన్న సరదా పూర్తిగా అడుగంటిపోయింది.

“ఎక్కడికండీ చెప్పులు?”

“ఉండూ… మరి ఇంట్లో లేపోతే బైట చూసి రావొద్దూ!”

“చెప్పకుండా అలా వెళ్ళడండీ…” అమ్మ గొంతు కంగారుగా ఏడ్చేలాగ ఉంది. మళ్ళీ తనే చెప్పింది: “ఆదివారం ఈ పిల్లలంతా ఆ గుడి దగ్గర పార్కులో ఆడతారు. ఒక్కసారి నాకు బడికెళ్ళటం ఆలస్యమైతే మనవాడూ అక్కడే కనిపించాడు”

“సెలవరోజు కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు కదే… ఏదో వొక సంత!”

నాన్న మెట్లు దిగటం, గేటు తీయటం, స్కూటర్ స్టార్ట్ చేయటం వినిపించాయి. స్కూటర్ చప్పుడు తగ్గుతూ తగ్గుతూ ఇంక వినపడకుండా పోయింది.

అది వెళ్ళిన కాసేపటి తర్వాత, “ఒరే బాబీ… బాబితల్లీ!” అని అమ్మ అరుపు గట్టిగా వినిపించింది. అమ్మ ఒక్కతే ఇంట్లో నిలబడి అంత గట్టిగా అరవటం చిత్రంగా భయంగా అనిపించింది బాబిగాడికి. ఏడుపు మొహం పెట్టేశాడు. మోకాళ్ళు ఊరికే గోకేసుకుంటున్నాడు.

“అమ్మా… అన్న ఏరే, ఏంచేశారే?” అంటున్నాడు తమ్ముడు.

తమ్ముడి ముద్దు మొహం గుర్తొచ్చి ఎంతో బెంగగా అనిపించింది బాబిగాడికి. వాళ్ళెవ్వరినీ తిరిగి కలవలేనంత దూరం వచ్చేసినట్టుంది. ఏడుపు ఉగ్గబట్టుకుంటుంటే చెంపలు నొప్పెడుతున్నాయి.

“వచ్చేస్తాడమ్మా అన్న, ఇక్కడే ఎక్కడికో వెళ్ళుంటాడు… పద వెతుకుదాం మనమూను”

కాసేపటికి ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది. ఎవరూ లేరని తెలుస్తోందిగానీ బయటకి రావాలంటే ధైర్యం చాలటం లేదు. పడగ్గదిలోంచి వస్తున్న ఫాను చప్పుడొక్కటీ వింటూ అలాగే కూర్చున్నాడు. మొత్తానికి కాసేపటికి ధైర్యం కూడేసుకుని తలుపు ఓరగా తెరిచి చూసాడు. వీధిగేటు తెరిచొదిలేసి ఉంది. వెళ్దామా వద్దా అని ఊగిసలాడి నెమ్మదిగా పైకి లేచాడు. తలుపు జరిపి బయటికి వచ్చాడు. టప్ మని చప్పుడైతే హళ్ళిపోయి వెనక్కి చూసాడు. చీపిరి కింద పడి వుంది. గుమ్మాలు దాటి వచ్చి చల్లగా తాకిన గాలికి వాడి వొళ్ళు వొణికింది.

నాన్న ఆఫీసుకెళ్ళాక ఒక్కోసారి పడుకున్న తమ్ముడిని బాబిగాడికి అప్పజెప్పి వాళ్ళమ్మ పక్కింటికి వెళ్ళేది. కానీ ఇంట్లో ఇలా మరీ ఒక్కడూ ఎప్పుడూ లేడు. పైగా ఇప్పుడు తనకి ఎవ్వరితోనీ సంబంధం లేదు. అసలీ ఇంటితోనే సంబంధం లేదు. వెనకగదిలోంచి హాల్లోకి వచ్చాడు. ఇందాకటి దాకా వాడు ఆడుకున్న హాలు ఇప్పుడు కొత్తగా పరిచయం లేనట్టు కనిపించింది. సోఫాలో తుపాకీ బొమ్మ కూడా ఎవరిదో అన్నట్టు ఉంది. వీధిలోకి చూస్తే పెంకుటింటి చూరు మీంచి వేలాడున్న దిష్టి కొబ్బరికాయ మీద రాక్షసుడి బొమ్మ ఇటు చూసి నవ్వుతోంది. బయట మళ్ళీ మబ్బేసి వాతావరణం అంతా మారిపోయింది. అలాగే కటకటాల గది గడప దాకా నడుస్తూ వచ్చాడు. ఇంతలో ప్రహరీగోడ మీంచి అమ్మ తల, అమ్మ ఎత్తుకున్న తమ్ముడి తల, ఇంకెవరిదో తల వస్తూ కనిపించాయి. చప్పున పరిగెత్తి పడగ్గదిలోకి పారిపోయాడు. గది కాస్త చీకటిగా ఉంది. ఎక్కడ దాక్కోవచ్చా అని చుట్టూ చూసాడు. నాన్న టేబిలు మీద టీకప్పు పక్కన లాలీపాప్ కనపడింది. ఒక క్షణం వాడి మనసు అటు ఉవ్విళ్ళూరింది. అప్పుడే బయట గేటు మూస్తున్న చప్పుడైంది. ఇంకేం ఆలోచించకుండా మంచం కిందకి దూరిపోయాడు.

బయట గచ్చు మీంచి మాటలు వినిపిస్తున్నాయి. పక్కింటి ఆంటీ గొంతు వినపడుతోంది. “కానీ రోజులసలే బాగా లేవురా” అంటోంది. అమ్మ ఏదో మాట్లాడబోయి ఏడ్చేయటం మొదలుపెట్టింది.

మంచం కింద నుంచి చూస్తుంటే బాబిగాడికి బయటి నేల మీద తమ్ముడు ఆడుకుని వదిలేసిన ఎలిఫెంట్, టైగర్ బొమ్మలు కనిపిస్తున్నాయి. టైగర్‌ ఎలిఫెంట్ కాలు కొరికేస్తోంది. ఆ బొమ్మలు మసగ్గా అయిపోతూ బాబిగాడి కళ్ళని కన్నీళ్ళు కమ్మేశాయి. బయట అమ్మ ఏడుపు ఎక్కువయ్యే కొద్దీ ఇక్కడ వాడి ఏడుపూ పెరిగిపోయింది. కడుపులోంచి దుఃఖం గిట్టకరచిన పళ్ళ మధ్య నుంచి తన్నుకొచ్చేస్తుంది. నోరు నొక్కేసుకుని, గచ్చు చల్లదనానికి కాళ్ళు కడుపులోకి ముడుచుకొని, ఏడుస్తున్నాడు. రియ్యీ రియ్యీ మని తిరుగుతున్న ఫాను చప్పుడులో వాడి వెక్కిళ్ళు కలిసిపోతున్నాయి. ఏడ్చేకొద్దీ ఆకలి కూడా వేస్తోంది.

ఎక్కడ్నించో స్కూటర్ చప్పుడు దగ్గర దగ్గరగా వచ్చి ఇంటి ముందాగింది. నాన్న మాటలు వినపడ్డాయి. అమ్మ ఇంకా పెద్ద పెట్టున ఏడ్చేస్తోంది. చెప్పులు విడిచి నాన్నతోపాటు ఇంకెవరో కూడా హాల్లోకి వచ్చారు. ఆయన నాన్నతో మాట్లాడటం మొదలుపెట్టాక అది వినటం కోసమన్నట్టుగా అమ్మ ఏడుపు ఆపుకుంది.

“ఆలస్యం చేస్తే అస్సలు లాభం లేదురా. మన చేయి దాటిపోవచ్చు. పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు తిరుగుతున్నారని విన్నాను. నా మాటవిని వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళిపోవటం మంచిది.”

“అంతేనంటావా?”

“అంతేరా… మన ప్రయత్నం మనం చేద్దాం. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు.”

“అవును తమ్ముడూ, అస్సలు ఆలస్యం వద్దు. వెంటనే ప్రయత్నిస్తే దొరికేస్తారు. మొన్నలాగే టీవీలో చూసాను ఒక పిల్లోడినీ…”

“సరే అయితే పదరా. అక్కా, దీన్ని మీ ఇంటికి తీసుకుపో. కాస్త దగ్గరుండు ఏమనుకోకు.”

“ఏవండీ, ఏంటండీ ఇదీ…!”

“నువ్వూరికే ఏడవకు బుజ్జీ… ఎక్కడికీ పోడు వచ్చేస్తాడు. అక్కతో వెళ్ళు, అమ్మవు కదూ!”

ఉన్నట్టుండి పడగ్గదిలోకి రెండు చిన్ని పాదాలు వచ్చాయి. తమ్ముడు తన ఎలిఫెంట్‌నీ, టైగర్‌నీ తీసుకెళ్ళటానికి వచ్చి కిందకి వొంగాడు. వాడి చూపు ఇటు మళ్ళింది. అక్కడ కనపడేదేంటా అన్నట్టు తల ఓ పక్కకి వాల్చి, నోరు తెరిచి చూస్తున్నాడు. వాడి కళ్ళలో చిన్నగా మొదలైన నవ్వుతో ముఖం అంతా విప్పారింది. పైకి లేచి నిలబడ్డాడు. బాబిగాడికి మంచం అంచు కింద నుంచి తన వైపు చూపిస్తున్న తమ్ముడి వేలు కనిపిస్తోంది. తమ్ముడి మాటలూ వినపడ్డాయి.

“అమ్మా… అన్న అన్న అన్న!”

హల్లోంచి కాలి పట్టీలు పరిగెత్తిన చప్పుడు. ఇంకొన్ని జతల పాదాల చప్పుడు కూడా.

(రస్తా మేగజైన్ జనవరి 16 న ప్రచురితం)