యమనొతె దారిలో ఒక ట్రాలీ కారు నన్ను గుద్ది, గాల్లోకి విసిరి పడేసింది. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి ఒక్కణ్ణీ బయల్దేరి తజిమాలో వేడినీటిబుగ్గలకు ప్రసిద్ధమైన కినొసాకీ చేరాను. నా వీపుకు తగిలిన దెబ్బ వెన్నెముక లోకి పాకి క్షయగా మారితే ప్రాణానికి ప్రమాదం. కానీ నా డాక్టర్ అలా జరిగే అవకాశమే లేదన్నాడు. రెండు మూడేళ్ళలోపు ఏ లక్షణాలు కనపడకపోతే, తర్వాత ఇక ఆలోచించాల్సిన పని లేదన్నాడు. ఈ లోపు మాత్రం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. అందుకే ఇక్కడకు వచ్చాను. ఓ మూడు వారాలు ఉందామని నా ఆలోచన. భరించగలిగితే ఐదు వారాలు.
నా ఆలోచనల్లో ఇదివరకటి స్పష్టత పోయింది. మతిమరుపు బాగా పెరిగింది. కానీ మనసు మట్టుకు గత కొన్నేళ్ళుగా ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా ఉంది. ఎంతో స్తిమితంగా ఉన్నాను. పంటకోతల కాలమది. వాతావరణం బాగుంది.
అక్కడ ఒక్కడినే ఉండేవాడిని. మాట్లాడటానికి ఎవరూ లేరు. రోజంతా చదువుకుంటూనో రాసుకుంటూనో గడిపేవాడిని, లేదంటే గది బయట కుర్చీలో కూర్చుని కొండలవైపో రోడ్డువైపో పరధ్యాసగా చూస్తుండేవాడిని, లేదా నడక నడిచేవాడిని. ఆ ఊరి నుంచి బైటకు వెళ్ళే రోడ్డు నడవటానికి బాగుంటుంది. ఏటిని ఆనుకుని సాగుతూ, వెళ్ళేకొద్దీ ఎత్తు పెరుగుతుంది. కొండ కింద ఏరు మలుపు తిరిగే చోట చిన్న మడుగులో జెల్ల చేపల గుంపులు కనపడేవి. దృష్టిపెట్టి చూస్తే, పెద్ద పెద్ద పీతలు కాళ్ళ మీద వెంట్రుకలతో, రాళ్ళలా కదలకుండా కనపడేవి. సాయంత్ర భోజనానికి ముందు కాసేపు ఈ రోడ్డు మీద నడిచేవాడిని. చలి సాయంత్రాల్లో, సన్నటి ఏరు పారే ఆ ఒంటరి శరదృతు లోయ పక్కన నడుస్తూంటే, ఆలోచనల్లో దిగులు చేరేది. అవన్నీ ఒంటరి ఆలోచనలు. కానీ వాటిలో ప్రశాంతత ఉండేది. నాకు జరిగిన ఏక్సిడెంట్ గుర్తొచ్చేది. రెండంగుళాలు అటూయిటూ అయ్యుంటే, నేనీ పాటికి అయొమా శ్మశానంలో భూమి అడుగున వెల్లకిలా పడుకొని ఉండేవాడిని. నా ముఖం చల్లగా, నీలంగా, గడ్డకట్టిపోయేది, దాని మీద దెబ్బలు ఎప్పటికీ మానవు. అమ్మ, తాతయ్యల శవాలు నా పక్కనే పడుకొని ఉంటాయి, కానీ మా మధ్య మాటలేమీ ఉండవు... ఇలా సాగేవి నా ఆలోచనలు. వీటితో చాలా ఒంటరిగా అనిపించేది. అలాగని భయమేమీ ఉండేది కాదు. చావు ఎప్పటికైనా తప్పదు. కానీ ఆ 'ఎప్పటికైనా' అన్నది భవిష్యత్తులో ఎక్కడో దూరంగా ఉంటుందని ఇప్పటిదాకా అనుకునేవాడిని. ఇప్పుడు మాత్రం ఏ క్షణమైనా ముంచుకు రావొచ్చని అనిపిస్తోంది. ఈసారికి బతికిపోయాను, చావు నన్ను కలవాలని ప్రయత్నించి విఫలమైంది, అంటే నేను చేయాల్సిందేదో ఇంకా మిగిలే ఉంది--బడిలో లార్డ్ క్లయివ్ గురించి చదివిన ఒక పాఠంలో ఆయన ఇలాంటి ఆలోచనల నుంచే ఉత్తేజం పొందేవాడని చదివాను. నాకు జరిగిన ప్రమాదం నుంచి నేనూ ఇలాంటి ఉత్తేజాన్నే పొందాలని ఆశించేవాడిని. కానీ నా మనసంతా ఒక చిత్రమైన నిశ్చింత. చావు ఎంతో దగ్గరగా అనిపించటం మొదలైంది.
నా గది రెండో అంతస్తులో ఉంది. ఇరుగూ పొరుగూ ఎవ్వరూ లేరు. కాబట్టి నిశ్శబ్దంగా ఉండేది. రాసుకొనీ చదువుకొనీ విసుగొచ్చాక, కాసేపు వరండాలో కూర్చునేవాడిని. కింద ఎంట్రన్స్ హాలు పైకప్పు కనపడేది, అది ఇంటితో కలిసేచోట ఉన్న ఖాళీని చెక్క పలకలతో కప్పారు. ఆ పలకల కింద తేనెపట్టు కట్టింది కాబోలు. వాతావరణం బావున్నప్పుడు, పుష్టిగా పులిచారలతో ఉన్న తేనెటీగలు, పొద్దున్నుంచి సాయంత్రం దాకా తెగ పాటుపడేవి. పలకల మధ్య సందులోంచి బైటికి వచ్చాక, ఆ తేనెటీగలు కాసేపు ఎంట్రన్స్ హాలు పైకప్పు మీద వాలేవి. కాళ్ళతో రెక్కల్నీ మీసాల్నీ సవరించుకునేవి, కాసేపు అటూయిటూ మసిలేవి, ఉన్నట్టుండి పల్చటి రెక్కల్ని చెరోవైపూ బిగుతుగా సాచి, ఝంకారంతో గాల్లోకి లేచేవి. గాల్లోనే వేగం పుంజుకొని, జుమ్మని దూసుకుపోయేవి. తోటలో అప్పుడే పూస్తూన్న యత్సుదే పూల చుట్టూ ముసిరేవి. నాకేమీ తోచనప్పుడు రెయిలింగ్ మీదకు వొంగి ఈ తేనెటీగల రాకపోకల్ని గమనిస్తూండేవాడిని.
ఒక రోజు పొద్దున్నే ఎంట్రన్స్ హాలు కప్పు మీద చచ్చిపడున్న ఒక తేనెటీగని చూశాను. దాని కాళ్ళు పొట్టవైపు మెలితిరిగి ఉన్నాయి, మీసాలు ముఖం మీద వాలిపోయాయి. మిగతా తేనెటీగలు దాన్ని పట్టించుకోవటం లేదు. అవి తేనెపట్టుకు వెళ్తూ వస్తూ దాని పక్క నుంచే ఏం పట్టనట్టు పాకి పోతున్నాయి. రోజువారీ పనిలో హడావిడిగా మసలుతోన్న ఆ తేనెటీగల్లో ప్రాణం ఉట్టిపడుతోంది. వాటి పక్కనే పడున్న ఈ తేనెటీగలో-- పొద్దున్నా మధ్యాహ్నం రాత్రీ ఎప్పుడు చూసినా, ఏమాత్రం కదలిక లేకుండా, బోర్లా ముడుచుకుపోయి పడివున్న ఈ ఒక్క తేనెటీగలో-- మరణమూ అంతే గాఢంగా ఉట్టిపడుతోంది. అది మూడు రోజుల పాటు అక్కడే పడి వుంది. దాన్ని ఎప్పుడు చూసినా గొప్ప శాంతి నన్ను ఆవరించేది. ఒంటరితనం కూడా. సాయంత్రం మిగతా తేనెటీగలన్నీ తేనెపట్టులోకి వెళ్ళిపోయాక, ఆ చల్లటి పెంకు మీద పడివున్న ఆ ఒక్క తేనెటీగ దేహాన్నీ చూస్తే, దిగులుగా ఉండేది. ప్రశాంతంగానూ ఉండేది.
రాత్రి వర్షం గట్టిగా పడింది. పగలయ్యేసరికి ఆగిపోయింది. చెట్ల ఆకులు, నేల, ఇంటికప్పు అన్నీ శుభ్రంగా కడిగేసినట్టు ఉన్నాయి. ఆ చనిపోయిన తేనెటీగ అక్కడ లేదు. మిగతా తేనెటీగలు మాత్రం ఎప్పటిలాగే పని హడావిడిలో ఉన్నాయి. ఆ చనిపోయిన తేనెటీగ తూముల్లోంచి నేల మీదకు కొట్టుకుపోయి ఉంటుంది. బహుశా ఎక్కడో బురద అంటి, కాళ్ళు మెలితిరిగి, మీసాలు ముఖానికి అతుక్కుపోయి, కదలకుండా పడుంటుంది. మళ్ళీ బయటి ప్రపంచంలో వచ్చే మార్పేదో దాన్ని కదిపేదాకా అక్కడే ఉంటుంది. ఒకవేళ చీమలు దాన్ని మోసుకుపోతాయా? ఏదేమైనా కానీ, ఎంత నిశ్చింత!--ఇదివరకూ అంతా పని పని, ఇపుడు కదిలే పనే లేదు. ఆ నిశ్చింత నాకెంతో దగ్గరగా అనిపించింది.
నేను ఇదివరకూ 'హాన్స్ క్రైమ్' అని ఒక కథ రాశాను. అందులో హాన్ అనే చైనీస్ అతను పెళ్ళికి ముందు తన భార్యకు తన స్నేహితుడితో ఉన్న సంబంధం పట్ల అసూయపడి, దానికి అతని మానసిక స్థితి కూడా తోడవటంతో, ఆమెని చంపేస్తాడు. నేను ఈ కథను హాన్ దృక్కోణం నుంచి రాశాను. కానీ ఇప్పుడు 'హత్య కాబడిన హాన్ భార్య' అన్న కథ రాయాలనిపించింది. చివరకు శ్మశానంలో విశ్రాంతిగా పడుకుని ఆమె పొందిన నిశ్చింతని గురించి రాయాలనిపించింది. చివరకు రాయలేదు గానీ ఆ కోరిక కొన్నాళ్ళు వెంటాడింది. నన్ను ఇబ్బంది కూడా పెట్టింది. ఎందుకంటే దానివల్ల కొన్నాళ్ళపాటు నా ఆలోచనా ధోరణి అప్పట్లో నేను రాస్తున్న ఒక పెద్ద నవలలో కథానాయకునికి పూర్తి భిన్నంగా మారిపోయింది.
ఆ తేనెటీగ కొట్టుకుపోయి నా కనుచూపు పరిధి నుంచి తొలగిపోయిన కొన్నాళ్ళ తర్వాతి మాట. ఒక రోజు పొద్దున్న, లాడ్జి నుంచి బయటకు వచ్చి షిగాషియామా పార్కుకు బయల్దేరాను. అక్కడి నుంచి మరుయామా నది జపాన్ సముద్రంలో కలవటాన్ని చూడవచ్చు. దారిలో ఇచినోయు వేడినీటిబుగ్గల స్నాన గృహం ముందు నుంచి చిన్న నీటి పాయ రోడ్డుకు అడ్డంగా నింపాదిగా పారుతూ వెళ్ళి మరుయామా నదిలో కలుస్తోంది. కాస్త ముందుకు వెళితే కొంతమంది గుంపుగా వంతెన మీదా ఒడ్డు వారనా నిలబడి నదిలో దేన్నో చూస్తూ గోల చేస్తున్నారు. ఎవరో ఒక పెద్ద ఎలకని నీటిలో పడేశారు. అది ఒడ్డున పడాలని అగ్గగ్గలాడుతోంది. దాని మెడలో ఒక ఎనిమిదంగుళాల ఇనుపచువ్వ గుచ్చుకుపోయి ఉంది. ఆ చువ్వ ఎలక తల పైనుంచి ఓ మూడంగుళాలు, గొంతు కింద నుంచి ఓ మూడంగుళాలు బైటికి పొడుచుకు వచ్చింది. ఎలక ఒడ్డునున్న రాతిగోడని పట్టుకుని పైకి పాకాలని ప్రయత్నిస్తోంది. ఇద్దరు ముగ్గురు పిల్లలు, ఒక నలభై ఏళ్ళ రిక్షావాడు దాని మీదకు రాళ్ళు విసురుతున్నారు. గురి కుదరటం లేదు. రాళ్ళు గోడకి తగిలి పక్కకు పడిపోతున్నాయి. చూసేవాళ్ళు బిగ్గరగా నవ్వుతున్నారు. ఎలక అతికష్టం మీద రాతిగోడ మధ్య వున్న సందులోకి ముంగాళ్ళు చేర్చి నిలదొక్కుకుంది. ఇంకా ముందుకు పాకుదా మనేసరికి ఆ ఇనుపచువ్వ అడ్డుపడింది. నీళ్ళలోకి పడిపోయింది. మళ్ళీ ప్రయత్నిస్తోంది. దాని ముఖంలోని భావాలు మనిషి కంటికి చిక్కకపోవచ్చు, కానీ దాని కదలికల్లో ఆరాటం అర్థమవుతోంది. ఏదో వొక సురక్షితమైన చోటుకి చేరితే ఎలాగోలా ప్రాణాలు దక్కించుకోవచ్చని దాని ఆశ. ఆ ఇనుప చువ్వని భరిస్తూనే నది మధ్యకు ఈదుతోంది. పిల్లలూ, రిక్షావాడూ ఇంకా రెచ్చిపోయి రాళ్ళు విసిరారు. కొంచెం ముందుకున్న చాకలిబండ దగ్గర రెండు మూడు బాతులు తిండి కోసం వెతుకుతున్నాయి. అవి ఈ ఎగిరి పడుతున్న రాళ్ళకు బెదిరి, మెడలు సాచి, మిడిగుడ్లేసుకుని చూశాయి. రాళ్ళు నీటిలోకి చొచ్చకుపోయాయి. బాతులు గోలగోలగా అరుస్తూ, వింత ముఖకవళికలతో, మెడల్ని అలాగే సాచి, కాళ్ళను తపతపలాడిస్తూ ముందుకు ఈదాయి. నాకు ఆ ఎలక ఆఖరి క్షణాలను చూడాలనిపించలేదు. ఎటూ రాసిపెట్టున్న చావు నుంచి ప్రాణాల్ని దక్కించుకోవటానికి ఆ ఎలక పడ్డ ప్రయాస నా మనసులో ముద్రించుకుపోయింది. ఒంటరిగా వెగటుగా అనిపించింది. అసలు నిజం ఇదీ- అనిపించింది. నేను ఏ నిశ్చింతని ఆశిస్తున్నానో దాన్ని చేరటానికి ముందు ఇంత యాతన పడాలి. చావు తర్వాత దొరికే నిశ్చింత నాకెంత దగ్గరగా అనిపించినా, అక్కడికి చేరేలోగా భరించాల్సిన పెనుగులాట మాత్రం భయంకరంగా అనిపించింది. జంతువులకి ఆత్మహత్య గురించి తెలియదు కాబట్టి చావు వచ్చేదాకా పెనుగులాట తప్పదు. ఆ ఎలక లాంటి పరిస్థితే నాకూ ఎదురయ్యుంటే ఏం చేసేవాడిని? ఆ ఎలకలాగే పెనుగులాడేవాడిని కాదా? ఈ ఆలోచన రాగానే సహజంగానే నాకు జరిగిన ఏక్సిడెంట్ గుర్తుకు వచ్చింది. ఆ సమయంలో నాకు చేతనైనదంతా చేయటానికే ప్రయత్నించాను. ఏ ఆసుపత్రికి తీసుకెళ్ళాలో నేనే చెప్పాను. ఎలా తీసుకెళ్ళాలో కూడా నేనే చెప్పాను. ఒకవేళ తీసుకెళ్ళేసరికి డాక్టరు వుండడేమో, చికిత్సకు సన్నాహం త్వరగా జరగదేమోనన్న భయంతో- ముందే ఫోన్ కూడా చేయించాను. అంత అపస్మారక స్థితిలో కూడా నా మనసు ఎంతో కీలకమైన విషయాల్నే పట్టించుకున్న తీరుకి ఆ తర్వాత నాకే ఆశ్చర్యంగా అనిపించింది. ఆ దెబ్బ ప్రాణాంతకమా కాదా అన్నది తేలటం నాకు పెద్ద సమస్యే. కానీ, చావు పట్ల నాలో ఏ భయమూ లేకపోవటం నాకే చిత్రంగా అనిపించింది. ''దెబ్బ వల్ల ప్రాణానికేమన్నా ప్రమాదమా? డాక్టర్ ఏమన్నాడు?'' నా పక్కనున్న స్నేహితుడిని అడిగాను. ''ప్రాణానికేం ప్రమాదం లేదు,'' అన్నాడు. అది వినగానే మనసు కుదుట పడింది. ఉత్సాహంతో చాలా ఆనందం కలిగింది. ఒకవేళ ప్రాణానికి ప్రమాదమనిగానీ చెప్పి వుంటే ఎలా స్పందించేవాడిని? ఏమో ఊహకందదు. బహుశా చాలా నీరసించిపోయేవాడిని. చావంటే చాలామందిలా బెంబేలెత్తేవాడిని కాదేమోగానీ, నన్ను నేను కాపాడుకోవటానికి మాత్రం అన్ని రకాలుగా ప్రయత్నించేవాడిని. ఆ ఎలుక కంటే పెద్ద తేడాగా ఏమీ ప్రవర్తించేవాడిని కాదని కచ్చితంగా చెప్పగలను. ఒకవేళ అదే ఏక్సిడెంట్ ఇప్పుడు జరిగుంటే ఏమయ్యుండేది అని ఆలోచిస్తే, మనుషులు అంత చప్పున మారిపోరు కాబట్టి, చావు తర్వాత దొరికే నిశ్చింత పట్ల ఇప్పుడు నాకెంత ఆకర్షణ వున్నాసరే అది అంత చప్పున నన్ను పూర్తిగా మార్చేయలేదు కాబట్టి, నేనింకా బతకటానికి అప్పటిలాగే పెనుగులాడేవాడినని తీర్మానించుకున్నాను. అయినా రెండిందాలా జరిగే అవకాశం ఉందనిపించింది. ఎలా జరిగినా ఫర్లేదనిపించింది కూడా. ఎలాగూ జరిగేది జరగక మానదు కాబట్టి.
ఆ ఎలక సంఘటన జరిగిన కొన్నాళ్ళకి, ఒకనాటి సాయంత్రం, నేను ఊరి నుంచి బయటికి వెళ్ళే రోడ్డు మీద ఏరు వెంట నడుస్తున్నాను. సానిన్ రైల్వే లైను వెళ్ళే టన్నెల్ ముందు పట్టాలు దాటగానే, రోడ్డు మరింత ఎత్తుకు వెళ్తూ, మరింత ఇరుగ్గా మారింది. పక్కన ఏరు పారటంలో వేగం పెరిగింది. ఇక్కడనుంచి ఊరి చివర ఇళ్ళు కూడా కనపడటం లేదు. వెనక్కు వెళ్ళిపోవాలీ అనుకుంటూనే, మరో మలుపు వచ్చేసరికి ఆ తర్వాత ఏముందో చూద్దామని నడుస్తూ, అలా మలుపు తర్వాత మలుపు తిరుక్కుంటూ, చాలా దూరం పోయాను. సాయంత్రం వెలుగులో పరిసరాలకు రంగు పోయింది, చల్లటిగాలి చర్మాన్ని ఒక పొరలా తాకుతోంది, ఈ నిశ్చలత్వం ఎందుకో గుబులు కలిగిస్తోంది. రోడ్డు వారన పెద్ద మల్బరీ చెట్టు ఉంది. రోడ్డు మీదకు వేలాడుతోన్న దాని కొమ్మ మీద ఒక ఆకు అదేపనిగా, ఒకే లయలో ఊగుతోంది. గాలి లేదు, ఏటి రొద తప్ప అంతా నిశ్శబ్దం, ఆ ఒక్క ఆకూ మట్టుకు కొట్టుకుంటూనే ఉంది. కొంచెం భయం వేసింది. కుతూహలంగానూ అనిపించింది. చెట్టు కిందకు వెళ్ళి ఆ కొమ్మ వైపు కాసేపు చూశాను. ఉన్నట్టుండి గాలి వీచింది. దాన్తోపాటే ఆ ఆకు ఊగటం ఆగిపోయింది. కారణం అర్థమైంది. ఇలాంటి వాటికి కారణం నాకు ముందు నుంచీ తెలిసిందే.
నెమ్మదిగా వెలుగు తగ్గింది. వెళ్ళేకొద్దీ కొత్త మలుపులు ఎదురవుతూనే ఉన్నాయి. వెనక్కు వెళ్ళిపోవాలీ అనుకుంటూనే ముందుకు నడుస్తున్నాను. యథాలాపంగా కింద ప్రవాహం వైపు చూశాను. ఏటి అవతలి ఒడ్డు దగ్గర, ఒక తతామీ చాపలో సగం సైజుండే బండరాయి ఒకటి నీళ్ళల్లోంచి బైటికి పొడుచుకొచ్చింది. దాని మీద చిన్నగా నల్లగా ఏదో ప్రాణి ఉంది. అది నీటి బల్లి. ఇంకా తడిగానే వుంది, రంగు బావుంది. దాని తల బండ మీంచి నీటి మీదకు వేలాడుతూంది, కదలకుండా కూర్చుంది. దాని వొంటి నుంచి కారిన నీరు ఆ పొడి బండని ఒక అంగుళం మేర తడిపింది. అప్రయత్నంగా కూర్చుని, చూస్తున్నాను. ఈ నీటిబల్లులంటే ఇదివరకూ వున్నంత అసహ్యం ఇప్పుడు లేదు. ఉడుములు కొంచెం ఇష్టమే. ఈ పాకే జీవుల్లో అన్నిటికన్నా గోడల మీద పాకే బల్లులంటే అసహ్యం. తొండలంటే అసహ్యమూ లేదు, ఇష్టమూ లేదు. పదేళ్ళ క్రితం అషినికొ లో నేనుంటున్న హోటలులో తూము దగ్గర అస్తమానూ నీటిబల్లులు కూడటం చూసేవాడ్ని. నేనే గనక నీటిబల్లినై వుంటే అస్సలు భరించలేనని అనిపించేది. నీటిబల్లిగా పునర్జన్మ ఎత్తితే ఏం చేస్తానా అని ఆలోచించేవాడ్ని. ఈ బల్లులు కనపడిన ప్రతిసారీ నా మనసులో ఇలాంటి ఆలోచనలే రావటంతో వాటి మీద అసహ్యం పెరిగింది. ఈమధ్య అలాంటి ఆలోచనలు రావటం మానేశాయి. ఊరకే ఆ నీటిబల్లిని బెదరగొట్టి నీటిలో దిగేట్టు చేయాలనుకున్నాను. అవి తిప్పుకుంటూ ఎబ్బెట్టుగా నడిచే తీరు మనసులో మెదిలింది. చిన్న బంతి సైజులో ఉన్న రాయినొకదాన్ని తీసి, కూర్చున్న చోటు నుంచే దాని వైపు విసిరాను. గురి చూసేమీ విసరలేదు. నా గురి ఎంత అధ్వాన్నమంటే- ప్రయత్నించినా దాన్ని కొట్టలేను, కాబట్టి తగలదనుకున్నాను. ఆ రాయి కఠినమైన చప్పుడుతో బండకి తగిలి ఏట్లో పడింది. ఆ చప్పుడుతోపాటే ఆ నీటిబల్లి ఓ నాలుగంగుళాలు పక్కకి గెంతింది. తోకని బాగా పైకి లేపి వొంచింది. ఏం జరిగిందో అర్థం కాలేదు. మొదట రాయి దానికి తగల్లేదనే అనుకున్నాను. వొంగిన తోక నింపాదిగా విచ్చుకొని దాని బరువుకి అదే కిందకి వాలిపోయింది. నీటిబల్లి బండ వాలుకేసి భుజాలు నిగడదన్ని జారిపోకుండా ఆపుకునేందుకు ప్రయత్నించింది. కానీ ముంగాళ్ళు మెలిపడి, నిస్సత్తువగా ముందుకు పడిపోయింది. దాని తోక బండకి అంటుకున్నట్టు ఉండిపోయింది. ఇక కదలటం లేదు. నీటిబల్లి చనిపోయింది. అరె ఏంటిలా అయ్యింది, అనుకున్నాను. నేను ఇదివరకూ చాలాసార్లు పురుగుల్లాంటి వాటిని పెద్ద ఆలోచనేం లేకుండానే చంపాను, కానీ ఇప్పుడు చంపాలన్న ఉద్దేశమే లేకుండా దీన్ని చంపటం వల్ల మనసంతా ఏదో చేదుతో నిండిపోయింది. దాని చావుకి కారణం నేనే అయినా, నా చేతుల్లో లేనిదేదో జరిగినట్టనిపించింది. ఆ బల్లికి ఇది అనుకోకుండా వచ్చిపడిన చావు. కాసేపు అలాగే కూర్చుండిపోయాను. అక్కడ నేనూ బల్లీ ఇద్దరమే ఉన్నట్టు అనిపించింది. నేను దానిలో ఒకటిగా కలిసిపోయినట్టు, దాని బాధ నాకు తెలిసినట్టు అనిపించింది. దాని మీద జాలేసింది. భూమ్మీది ప్రాణుల ఒంటరితనాన్ని దానితో కలిసి పంచుకున్నాను. అనుకోకుండా నేను బతికాను. అనుకోకుండా ఆ బల్లి చచ్చిపోయింది. ఒంటరితనంగా అనిపించింది. ఇప్పుడు కాళ్ళ కింద మసగ్గా మాత్రమే కనపడుతున్న రోడ్డు మీదకి వచ్చాను, హోటల్ వైపు నడిచాను. దూరంగా ఊరి పొలిమేరలో లైట్లు కనిపిస్తున్నాయి. ఆ చనిపోయిన తేనెటీగ ఏమై వుంటుంది? తర్వాత వొచ్చిన వర్షాలకి అండర్ గ్రౌండు డ్రైనేజీల్లోకి కొట్టుకుపోయి వుంటుంది. ఆ ఎలక ఏమై వుంటుంది? సముద్రంలోకి కొట్టుకుపోయి, నీళ్ళతో ఉబ్బిన దాని శరీరం, ఈపాటికే మిగతా చెత్తతోపాటు ఒడ్డుకు చేరి వుంటుంది. ఇక్కడ మాత్రం, ఇంకా చావని నేను, ఇలా నడుస్తున్నాను. ఇలాంటి ఆలోచనలు వచ్చాయి. నేను కృతజ్ఞుడినై ఉండాలేమో అనిపించింది. కానీ మనసులో ఏ ఆనందమూ లేదు. చావు బతుకులు ఏమంత భిన్న ధృవాలు కావు. ఆ రెండిటికీ మధ్య పెద్ద తేడా లేదు. అప్పటికి చాలా చీకటి పడింది. దూరంగా వున్న లైట్లు మాత్రమే కంటికి ఆనుతున్నాయి. నా చూపుకూ నేలపై అడుగులకూ లంకె తెగి, తడుముకుంటూ నడిచాను. నా మనసొక్కటీ దానంతటది పని చేస్తోంది. ఇంకా ఏవో అలాంటివే ఆలోచనల్లోకి జారిపోయాను.
కినొసాకీలో ఓ మూడు వారాలుండి వచ్చేశాను. ఇది జరిగి మూడేళ్ళవుతోంది. వెన్నెముకకు క్షయ రోగం రాలేదు. అంత మటుకు తప్పించుకున్నాను.
((()))
రచయిత గురించి:
నవోయా షిగా (1883-1971) జపనీస్ కథకుడు. కథలతోపాటు, ఆయన రాసిన ఒకే ఒక్క నవల "ఎ డార్క్ నైట్'స్ పాసింగ్"కు జపాన్ సాహిత్యంలో గొప్ప పేరుంది. షిగా సాహిత్యాన్ని తన వ్యక్తిగత జీవితానికి ఒక శుద్ధియంత్రంగా వాడుకున్నాడు. జీవితాన్ని వివేకంతో బతకనివ్వకుండా మనిషికి జన్మబద్ధమైన అనేక బలహీనతలు అడ్డుపడుతుంటాయి. వాటిని అన్నిటినీ బైటికి కడిగిపారేయటానికి రచన ఆసరాగా ఉపయోగపడుతుందని షిగా ఉద్దేశం. కాబట్టి రచన ఎప్పుడూ ఆత్మకథాత్మకంగా ఉండాలనీ, రచయిత అందులో తన మంచిచెడ్డలన్నీ నిజాయితీగా బైటపెట్టుకోవాలనీ భావించాడు, పాటించాడు. జపానులో షిగాను "కథల దేవుడు" అని పిలుచుకుంటారు (“shosetsu no kamisama”). అయినా కూడా జపనీస్ సాహిత్యాన్ని అనువాదాల్లో చదివే వాళ్ళకి ఆయన గురించి అంతగా తెలియదు. ఆయన తోటి రచయితలైన నత్సుమె సొసేకీ, తనిజాకీ జునిచిరో, అకుతగవ ర్యసునోకే, యుకియో మిషిమాలతో పోలిస్తే- ఆయన మీద ఇంగ్లీషులో పెద్ద తులనాత్మక విమర్శలేమీ రాలేదు. కానీ ఈ రచయితలందరి మీదా మాత్రం షిగా ప్రభావం చాలా ఉంది. షిగా ప్రసిద్ధ నవలను అకుతగవ కన్నీళ్ళతో చదివాడు. చివరి దశలో తనుకూడా ఆత్మకథాత్మక రచనలతో షిగా దారికే వచ్చే ప్రయత్నం చేశాడు. అకుతగవ ఆత్మహత్య వెనుక కూడా కొంత షిగా ప్రభావం ఉందంటారు. సమకాలీన రచయితలూ, పాఠకుల మీద ఇంత ప్రభావం చూపించిన షిగా, పాశ్చాత్య సాహిత్యంపై ఏ ప్రభావాన్నీ చూపకపోవటానికి పాశ్చాత్య సాహిత్య రీతులు ముఖ్య కారణం. పాశ్చాత్య సాహిత్యం కాల్పనికతకు (fiction), అందులో మళ్ళీ అనుకరణకు (mimesis) పట్టం కడుతుంది. పాశ్చాత్య రచయిత తన జీవితాన్నే ఇతివృత్తంగా తీసుకున్నా, అతను దాన్నించి పూర్తిగా విడిపడి ఉండాలి. షిగా కథల్లో రచయిత విడిగా ఏమీ ఉండడు. చాలాసార్లు రచయితే పాత్రగా కనపడతాడు. తన ప్రసిద్ధ నవలలో ప్రధాన పాత్ర 'కెన్సాకు' గురించి చెబుతూ: "ఆ పాత్ర దాదాపుగా నేనే. అతని చర్యలు అవే పరిస్థితుల్లో నేనూ చేసేవో, చేయాలనుకునేవో, నిజంగా చేసినవో," అన్నాడు. ఆయన ఇతివృత్తాలు పెద్ద కాల్పనిక తొడుగుల్ని తొడుక్కోకుండానే వెలికి వచ్చినట్టు ఉంటాయి. నిజానికి పైకి అలా కనపడతాయంతే. సొంత అనుభవంలో కల్పన చొప్పించకుండా ఉండలేదు షిగా. అయితే అది కూడా- నిజానికి ఒక కొనసాగింపులా అనిపించేలాగ రాశాడు. పాశ్చాత్య కాల్పనిక కథా నియమాల గురించి తెలిసినా పట్టించుకోలేదు. షిగాను ఆ నాటి జపనీస్ పాఠకులు ఎంతో ఆదరించి, హత్తుకున్నారు. పాశ్చాత్య విమర్శకులు మాత్రం ఈ రచనా పద్ధతిని ఎలా స్వీకరించాలి, ఎలా వర్గీకరించాలీ అన్నది అర్థంగాక షిగాను వదిలేశారు. అలాగే షిగాకు అంతగా ప్రచారం రాకపోవటానికి మరో కారణం: అనువాద సమస్యలు. షిగాను ఇంగ్లీషులోకి అనువదించిన ఒక అనువాదకుడు ఇలా వాపోతాడు: "నేనెంత ప్రయత్నించినా మూలంలోని భాషకు ఈ అనువాదంలోని ఇంగ్లీషు ఒక పాలిపోయిన ప్రతిబింబంలాగే ఉంది. షిగా శైలి ఎంత అరుదైన అత్తరు వంటిదంటే, దాన్ని ఒక సీసాలోంచి ఇంకో సీసాలో పోయగానే అది ఆవిరైపోయింది." నేరుగా జపనీస్ నుంచి అనువదించిన అనువాదకుడే ఇంత వాపోతున్నాడు. మరి నేను జపనీస్ నుంచి ఇంగ్లీషుకు అనువాదమైతే దాన్నించి తెలుగులోకి అనువదిస్తున్నాను. కాబట్టి ఈ అనువాదంలో చాలానే పోయి వుంటుంది. అయితే ఒకటి; నేను ఇంగ్లీషులో లభ్యమవుతున్న దాదాపు షిగా అన్ని రచనలూ చదివున్నాను. కాబట్టి షిగా-తనం ఏమిటో, ఎలావుంటుందో నాకు కొంత తెలుసు. ఈ అనువాదంలో దాన్నే నాకు ప్రధాన దిక్సూచిగా పెట్టుకున్నాను. అలాగే ఈ 'ఎట్ కినొసాకీ' అన్న కథకు నాకు దొరికిన నాలుగు ఇంగ్లీషు అనువాదాలతోపాటు, ఒక్కోసారి గూగుల్ మెషీన్ ట్రాన్స్లేషన్ పై కూడా ఆధారపడ్డాను.