February 6, 2020

పునరాగమనం - కాఫ్కా

(translated from Kafka's 'Homecoming')

నేను తిరిగి వచ్చాను, గేటులోంచి లోపలికి నడిచి చుట్టూ చూస్తున్నాను. ఇది నా తండ్రి పాత పెరడు. మధ్యలో బురద గుంట. పాత, పనికిరాని పనిముట్లు గుట్టలా పేరుకుని, మిద్దె మెట్లకు అడ్డంగా పడివున్నాయి. పిట్టగోడ మీద పిల్లి తచ్చాడుతోంది. ఒక గుడ్డ పీలిక, ఎప్పుడో కర్రకి కట్టి ఆడింది, గాల్లో ఎగురుతోంది. నేను వచ్చేశాను. ఎవరు నాకు ఎదురొస్తారు? వంటగది తలుపుకి అవతల ఎవరు ఎదురుచూస్తున్నారు? చిమ్నీలోంచి పొగ లేస్తోంది, కాఫీ కాస్తున్నారు. ఇది నీ చోటనిపిస్తోందా, నీ ఇంటికి నువ్వొచ్చినట్టే ఉందా? తెలీదు, స్పష్టత లేదు. అవటానికిది నా తండ్రి ఇల్లే, కానీ ప్రతి వస్తువూ ఒక దాని పక్కన ఇంకోటి ముభావంగా నిలబడివుంది, దేని పనుల్లో అది మునిగున్నట్టు–అవేమిటో కొంత మర్చిపోయాను, కొంత ఎప్పుడూ తెలీదు. వాటికి నాతో అవసరమేంటి, వాటికి నేనేమవుతాను–ఆ ముసలిరైతుకి కొడుకునైనంత మాత్రాన? వంటగది తలుపు తట్టే ధైర్యం లేదు, దూరం నుంచే వింటున్నాను, ఎవరైనా చప్పున బైటకు వస్తే పొంచి వింటున్నానని అనుకోకుండా దూరంగా నిలబడ్డాను. ఈ దూరం వల్ల, నాకేమీ వినపడటం లేదు, లీలగా గడియారపు సవ్వడి తప్ప, అది నా బాల్యం లోంచి తరలి వస్తోంది, వస్తున్న భ్రమో మరి. వంటగదిలో ఏం జరుగుతున్నా అదంతా అక్కడ కూర్చున్నవాళ్లకి సంబంధించిన రహస్యం, వాళ్ళు దాన్ని నా నుంచి దాస్తున్నారు. తలుపు ముందు తటపటాయించేకొద్దీ ఇంకా అపరిచితుడినైపోతున్నాను. ఒకవేళ ఎవరైనా తలుపు తెరిచి నన్ను ఏదైనా ప్రశ్న అడిగితే? అప్పుడు నేనైనా తన రహస్యాన్ని తనకే అట్టిపెట్టుకునే మనిషిలాగ ప్రవర్తించనూ?

0 comments:

మీ మాట...