September 2, 2020

త్రిపుర ‘జర్కన్’ కథ గురించి...

 1968 జూన్ నెల భారతి సంచిక వెతికి అందులో, ఆ బ్రౌన్ రంగు పేజీల్లో, ఆ పాత తెలుగు ప్రింటు ఫాంటులో, ఆ పద్య సాహిత్యం మధ్యన, ‘‘అమ్మాయి జానకమ్మా గుండె రాయి చేసుకోవాలి పిల్లలు బెంబేలెత్తిపోతారుస్మీ’’ లాంటి వాక్యాలతో మొదలయ్యే కథల మధ్యన, ఆయుర్వేద మందుల ప్రకటనల మధ్యన... త్రిపుర కథ ‘జర్కన్’ని చూస్తే… త్రిపుర కథలు ఎందుకు టైమ్ లెస్సో మరోసారి అర్థమైనట్టు అనిపించింది. 

కేవలం కథ మధ్యలో జాన్ బాఖ్, రిచర్డ్ వాగ్నర్ రిఫరెన్సులున్నాయనీ… ఓడలూ విమానాశ్రయాలూ రైల్వేస్టేషన్లున్నాయనీ.. రంగూన్‌లోనా గంగఒడ్డునా జరుగుతుందనీ... ఇందుకేనా ఈ కొత్తదనం.. అంటే... కాదనిపిస్తుంది… అది కొత్తదనం అని కూడా కాదసలు.., ఒక టైమ్‍లెస్ పెర్సెప్షన్… 

భారతిలో అచ్చయిన జర్కన్ కథ పిడిఎఫ్ ఇక్కడ ఇస్తున్నాను: https://bit.ly/2QNbGao

అలాగే పొద్దు వెబ్ మేగజైన్ లో పబ్లిష్ చేసిన యూనికోడ్ వెర్షన్ కూడా దొరికింది… లింక్ ఇది: http://poddu.net/2011/08/node842/  

ఈ కథని ఎవరైనా చదివేముందు కొంచెం పనికొస్తుందేమోనని కథ గురించి కొంత నా సోది…: 

ఈ కథ గురించి త్రిపుర ఇలా చెప్పుకున్నాడు: ‘‘జర్కన్ అనే కథ మూడు వేరు వేరు స్థాయిల్లో సమాంతరంగా రాశాను. ఒక మనిషి కథ- అతను ఎక్కడెక్కడ ప్రయాణిస్తాడో దాని గురించి [భాస్కర్, నెరేటర్]. అతని ప్రేమ కథ [కల్యాణి], ఇంకొకని కథ [వీరాస్వామి], ఈ మూడూ కలిసి ఉంటాయి.’’. 

త్రిపుర ఈ కథని తన జీవితంలోంచే చెప్పాడని నా నమ్మకం. కానీ ఎంత జీవితంలోంచే చెప్పినా జ్ఞాపకంలోని ఖాళీలకి కొన్ని ఫిక్షనల్ అతుకులు తప్పవు. అలాగే త్రిపురకి కథలో కన్ఫెషన్ జరగటం ముఖ్యంగానీ, అది తన వ్యక్తిగత జీవితం రిఫరెన్సుగా పాఠకుడికి అర్థం కావాలనుకోడు. కాబట్టి కొన్ని కావాలని అలికేసి అస్పష్టం చేస్తాడు. అందుకనే మరీ అంత దూకుడుగా ఇది త్రిపుర జీవితమే అని తీర్మానించేయలేను, కథ చెప్తున్న మనిషి త్రిపురే అనేయలేను. ఈ మూర్తిని కథ చదువుతూ ఆ text ఆధారంగా నేను ఊహలో నిర్మించుకున్న రచయిత అంటాను.

ఈ కథ మొదలవటం నా ఊహ ప్రకారం… రచయిత రాయటానికి టేబిల్ ముందు కూర్చుని, ఆ Jarkan రాయి తన చేతిలోకి తీసుకుని, దాని మీద muse చేయటంతో మొదలవుతుంది… ఆ విలువైన రాయి... it opens up a vista of memories for him… రచయిత ఆ జర్కన్ రాయిని తన ముందు పెట్టుకొని దానివైపు తలపోతను ఎక్కుపెడతాడు.. ఆ ఒక్క ఆబ్జెక్ట్ ని చేతుల్లోకి తీసుకోవటం వల్ల పొంగివచ్చే జ్ఞాపకాలే.. ఈ కథ. రచయిత ఆ రాయితో అసోసియేట్ అయిన జ్ఞాపకాలను మాత్రమే తల్చుకుంటాడు.. అయినా సరే… రచయిత అంతరంగ ప్రపంచంలో ఒక విలువైన భాగం మీదకు కిటికీ తెరుచుకున్నట్టు అనిపిస్తుంది. 

ఈ కథలో ఒక లేయర్ నెరేటర్ ప్రయాణాలకి సంబంధించింది అని త్రిపుర చెప్పాడు. అందుకు తగ్గట్టే కథలో ఏర్పోర్టు, హార్బరు, రైల్వే స్టేషనూ ఈ మూడు వస్తాయి. కథ ఏర్పోర్టులో మొదలవుతుంది. మూడో పేరాలో.. రంగూన్ ఏర్పోర్టులో వీరాస్వామి అనే పాత్ర రచయితకి వీడ్కోలు చెబుతూ.. ఈ విలువైన ‘జర్కన్’ రాయిని బహుమానంగా ఇస్తాడు. అయితే కథ ఇప్పటికే క్రానాలజీని లెక్కచేయని క్రమంలో మన ముందుకు వస్తోందని అర్థమవుతుంది. వీరాస్వామి కలిసిన అనుభవాన్ని రివర్స్‌లో తల్చుకుంటాడు నేరేటర్. ఈ ఏర్పోర్ట్ సన్నివేశానికంటే ముందే- నేరేటర్ జ్వరంతో రైలు ప్రయాణం చేసి వీరాస్వామిని చేరటం, వీరాస్వామి సపరిచర్యలు, నెరేటర్ కోలుకోవటం, వాళ్ళిద్దరి సంభాషణలు, రూబీతో రాత్రి... ఇవన్నీ జరిగిపోతాయి. నేరేటర్  విమానం ఎక్కేయబోతున్నాడు. 

త్రిపుర ఒక ఇంటర్వ్యూలో తనకు మామూలు మనుషుల మీద పెద్దగా ఆసక్తి లేదని చెబుతాడు: ‘‘సాదా సీదా పాత్రలంటే ఇష్టం ఉండదు నాకు. జీవితంలో కొంచెం ‘విపరీతం’ ఉన్నవాళ్లు నన్ను ఎక్కువగా కదిలిస్తారు. స్మగ్లర్లు, ద్రోహం చేసేవాళ్లు, చేయబడినవాళ్లు, దొంగలు, ఆత్మహత్య చేసుకోవాలనుకునేవాళ్లు- వీళ్లు నాకు బాగా తెలుసు. వీళ్ళందరూ నాలో ఉన్నారు. అందుకే ఇష్టం. వీళ్ళే నా హీరోలు.’’ 

జర్కన్ కథలో వీరాస్వామి పాత్ర కూడా ‘విపరీతం’ ఉన్న పాత్రే. అసలు ఆ పాత్ర రచయితతో స్నేహం చేసుకోవాలనుకోవటం కూడా కొంత విపరీతమైన ప్రాతిపదిక మీదే జరుగుతుంది. రచయిత ‘నేషన్’ పత్రిక ఎడిటోరియల్ పేజీకి ‘క్రెమటోరియా’ (శవాల దహన/ ఖనన క్రతువుల) మీద ఒక లెటర్ రాస్తాడు. ఆ ఉత్తరం చూసి వీరాస్వామి రచయితకి వరుసగా ఉత్తరాలు రాసి స్నేహ ప్రతిపాదన చేస్తాడు. రంగూన్ వచ్చినప్పుడు తనను కలవమంటాడు. ఆ ఉత్తరాల్లో తన అభిప్రాయాలన్నీ ప్రకటిస్తాడు. ఆ అభిప్రాయాలు మచ్చుకు ఇలా ఉంటాయి: ‘‘ఆశయాలూ, ఆశలూ, అభిరుచులూ, హక్కులూ, స్వామ్యం అని అరిచే వెధవల్ని హతమార్చాలి. ఎలా అనుకున్నారు? గోడకి నిలబెట్టి, చేతులెత్తించి, మెషిన్‌గన్‌తో టకటకామని’’; ‘‘ప్రపంచ జనాభాలో ముఖ్యంగా మనదేశపు జనాభాలో నూటికి తొంభయిమంది పురుగుల్లాంటి వాళ్ళు, ఫ్లిట్ కొట్టి చంపినట్లు చంపాలి.’’ 

రంగూన్ లో పెద్ద షిప్పింగ్ ఎంపైర్ నడిపే ఈ వీరాస్వామి అనేవాడు.. గ్లోరీ వెంటపడే నీషే-హీరో టైపు మనిషి (అతని ఇంట్లో రిచర్డ్ వాగ్నర్ ‘లోహెన్ గ్రీన్’ ఒపెరా వినిపించటం కోఇన్సిడెన్సు కాదు. వాగ్నర్ ప్రభావం నీషే మీద ఉంది). వీరాస్వామి ప్రపంచం నుంచి తనను వేరేగా చూసుకుంటాడు. తన డెస్టినీని పెద్ద పెద్ద గమ్యాల్లోకి ఊహించుకుంటాడు. ఆ డెస్టినీ వైపు గుడ్డిగా దూసుకుపోతుంటాడు. అతని మాటలూ చర్యలూ ఈ స్వభావాన్నే ఖాయపరిచినట్టుంటాయి. మామూలుగా నీషే 'సూపర్ మాన్' (Ubermensch) తరహా వ్యక్తులు నిజానికి లోపల్లోపల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సుతో బాధపడేవాళ్ళనిపిస్తారు. దానితో నలిగిపోతూంటారు, దాన్నుంచి బైటపడేందుకు మానసిక ప్రపంచంలో తమను తాము గొప్పగా ఊహించుకుంటూంటారు. వాళ్ళ డెస్టినీలో వాళ్ళకోసం గొప్ప గొప్ప కార్యాలు ఉద్దేశించబడ్డాయని ఫీలవుతారు. ఒకప్రక్క మామూలు మానవ సంబంధాల్ని కూడా నడపలేని వీళ్ళు.. మొత్తం మానవాళిని ముందుండి నడిపించగల తాహతును తమకి ఉందీ అని నమ్ముతారు. మానవాళికి గొప్ప ఉదాహరణలుగా నిలబడగల దక్షత తమకి ఉందని భావిస్తారు. వీరాస్వామి అలాంటివాడే అనిపిస్తాడు. తన లక్ష్య ప్రకటన లాగా ఇలా చెప్పుకుంటాడు: ‘‘అప్పుడప్పుడు అనిపిస్తుంది మన దేశానికి తిరిగి వెళ్ళిపోయి, దేశాన్ని మరమ్మత్తు చేద్దామని. తుడవాలి. ఇనుప చీపుళ్ళు పెట్టి దేశాన్ని తుడవాలి. మిగిలిన చెత్తని కాల్చాలి. ఒకసారి అంతా కాల్చి శుభ్రం చెయ్యాలి’’. అతనింత చెప్పుకుంటున్నా వీరాస్వామిలో బాల్యం పోనితనం గురించి రచయిత రెండుమూడుసార్లు మనకి చెబుతాడు: ‘‘వీరాస్వామి ముఖంలో ‘బాల్యం’ బాగా కనిపిస్తుంది. గొంగళి పురుగుల్ని సునాయాసంగా చేత్తో నలిపి చంపే బాల్యం, గ్లాసులోని పాలు తాగకుండా పిల్లి పిల్లకు పోసే బాల్యం అది. కోపంకొద్దీ గడియారాన్ని నేలకేసి కొట్టడం, ‘అడివి’తనం’’. వీరాస్వామి అతని తాతముత్తాతలు సంపాయించిన ధనంలో పుడతాడు. నిజంగా అట్టడుగు నుంచి పైకి ఎదిగి వచ్చినవాళ్ళల్లో ఉండే లౌక్యపు ఈక్వలెబ్రియం అతనిలో లేదు. వాస్తవాన్ని గోడలవతలే నిషేధించిన అంతరంగం- బాల్యంపోని అతని ముఖంపై పులిమిన మహత్వాకాంక్షలే ఇవన్నీ… అనిపిస్తాయి. 

రచయిత వీరాస్వామిని కలవటం, అతనితో కొన్ని రోజులు గడపటం, చివరికి వీడ్కోలు ఇవ్వటం.. ఇవేమీ ఒక క్రమంలో రావు. క్రానాలజీని బట్టి పోవు. ఇందాక చెప్పానే.. టేబిల్ ముందు కూర్చుని జర్కన్ రాయిని చేతిలో పెట్టుకుని ఇదంతా తల్చుకుంటున్న రచయిత… అతనికి ఏది ఏ ఆర్డర్ లో తడితే.. ఆ ఆర్డర్ లోనే ఈవెంట్స్ మన ముందుకి వస్తాయి. 

ఈ కథలో రచయిత ఒక rootless existence ఉన్న మనిషి. ఒక చోట నిలవలేడు. నేను ఈ కథలకి ఇంట్రోలో రాసినట్టు- ఒక కుదురుకి బద్ధులైపోవటాన్ని వ్యతిరేకించే బీట్నిక్ స్వభావం ఉన్న మనిషి. చుట్టూ వస్తువులు పేర్చుకుని ఒకచోట వేళ్ళూనుకోవటాన్ని వ్యతిరేకించే తత్త్వం. అందుకే ప్రయాణాలు చేస్తూ ఉంటాడు. ప్రదేశాలు మారుస్తూ ఉండాలని వాంఛ.  

ఈ రచయిత వీరాస్వామి అభిప్రాయాలన్నీ వింటాడు. తన గురించి పెద్దగా మాట్లాడుకోడు. రచయిత గురించిన వివరాలన్నీ మనకి వీరాస్వామి అతన్ని చూస్తూ బైటికి వ్యక్తం చేసే మాటల్లోంచే తెలుస్తాయి. ఇద్దరూ ‘రూబీ’ అనే వేశ్య దగ్గరికి వెళ్తారు (అన్నీ విలువైన రాళ్లే ఉన్న ఈ ప్రపంచంలో వేశ్యకి ఒక విలువైన రాయి పేరు తగిలించాలని రచయితకి అనిపించిందేమో). ఆ మరుసటి రోజు ఉదయం వీరాస్వామి రచయిత ముఖంలోకి చూస్తూ ఇలా ఒక గమనింపు వ్యక్తం చేస్తాడు: ‘‘ ‘మీలో ఒక గొప్ప గుణం ఉంది. ఏ అనుభవాన్నీ కాదనరు. కాని వాటిని మీ రక్తంలోకి జొరబడనివ్వరు, అవునా?’ అన్నాడు మళ్ళీ రాత్రి అనుభవం నా కళ్ళల్లో ఇంకా మిగిలి ఉందేమో అని పరీక్షగా చూస్తూ.’’

‘‘అవునో నో కాదో అప్పుడు చెప్పలేకపోయాను. జవాబు ఇదీ అని ఊహించుకుని మాటల్లో చెప్పడానికి ప్రయత్నిస్తే, ఒక్ఖసారిగా గర్వం, ‘అహం’ తెలియకుండా వెకపాటుగా ముట్టడి చేసి… మాటల్లో విపరీతమైన “ట్విస్ట్‌” అసత్యం…  బంగారు పూత…  వెలిగే అసత్యం. ‘నిజం’ యొక్క కఠోరత్వాన్ని కప్పిపుచ్చే అసత్యపు ఆకర్షణ… ఇవీ, నిజం యొక్క అసలు వెలుగుని చూడలేక బెదరడం భయం; మనస్సుతో ‘తెలుసు’కోగలిగినా, ‘తెలుసుకోవడం’ నా శిక్షణలో ఒక భాగమయినా నేను అన్న మాటలలో ఖంగు ఖంగుమని సత్యం ఎప్పుడూ మోగదనీ, ఏది నిప్పులాగ నిజమో, ఏది వేషధారణో చెప్పలేననీ…’’ 

ఈ రూబీ ప్రస్తావన వచ్చినప్పుడే కథలో మూడో లేయర్ తెరుచుకుంటుంది. రచయిత తన ప్రేయసి ‘కల్యాణి’ ప్రస్తావన తెస్తాడు: ‘‘ఈ ‘రూబీ’లు ప్రసాదించే సుఖంలోని విషాదపు లోతులు ఎన్నిసార్లు ఎంత గాఢంగా తెలుసుకున్నా కల్యాణీ, కల్యాణీ.. అంధకారానికుండే దారుణమైన ఆకర్షణ వెలుతురికి లేదనిపిస్తుంది. భయంకరమైన అందం అది. సర్పానికుండే సౌందర్యం, లావణ్యం ఈ ప్రపంచంలో దేనికుంది.’’ (ఈ కల్యాణి ‘‘కళ్ళు సెయింట్ వి, పెదవులు సిన్నర్ వి, మిగతాదంతా సిన్నింగ్ ఫ్లెష్’’ అని అంటాడు ‘చీకటిగదులు’లో శేషు పాత్ర)

జర్కన్ రాయిని ఒక సావనీర్ లాగ వీరాస్వామి దగ్గర నుంచి తీసుకుని అతనికి ‘బై’ చెప్పి రంగూన్ నుంచి వచ్చేసిన రచయితకి మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత వాల్తేరు రైల్వే స్టేషనులో వీరాస్వామి కనపడతాడు. ఇదివరకూ రంగూన్ నగరం వేపుకి బాల్కనీలోంచి చూస్తూ మాట్లాడిన వీరాస్వామి కాదు ఈ వీరాస్వామి. ‘‘సందులు, పాకలు, నేలకి అడుగు దూరం దాకా దిగిన ఇళ్ళ తాటాకు కప్పులు’’, ‘‘వీరాస్వామి పాకలో నేల మీద చాప. మూలని హరికెన్ దీపం. చీకటి’’, ‘‘ఎక్కడనుంచో చీమలు ఒక బారుకట్టి ఎక్కడికో వెళ్తున్నాయి.’’ ఈ వీరాస్వామి ప్రస్తుతం ఏదో బ్రిడ్జ్ కట్టించడానికి కావలసిన కూలీల గ్యాంగ్ లో పనిచేస్తున్నాడు. అయినా సరే, దేశాన్ని మరమ్మత్తు చేయించాలన్న అతని బృహత్ కాంక్షలేవీ మారలేదు: “దేశాన్ని మార్చాలి. ఎక్కడనుంచి మొదలుపెట్టాలో తెలియకుండా ఉంది. ఇక్కడ నేనంటే భయం, అసహ్యం. బోధపడ్డం లేదు. ”

మరో ప్రక్క… ఈ నడిమధ్య గడిచిన కాలంలో… రచయిత స్థితీ మారుతుంది. ఇప్పుడు ఏదో ఉద్యోగం చేస్తున్నాడు. ఎక్కడో ‘‘కుదురుకున్నాడు’’. అయినా యాత్రలు మాత్రం చేస్తున్నాడు. ‘‘మీ యాత్రలు ఇక ఆగవా’’ అని అడుగుతాడు వీరాస్వామి. కానీ రచయితకి ఇప్పుడు ఆ యాత్రల్లో కూడా పదును పోయింది: ‘‘ఏది యాత్ర? ఏది ‘వృత్తి?’ భేదం అదృశ్యమయిపోయింది. ఒక దానిలో ఒకటి కలిసిపోయాయి. రెండింటిలోని పదునూ మొద్దు బారినట్లు అనిపిస్తుంది. కానీ విరామం లేకుండా జరుగుతూనే ఉంది యాత్ర.’’

వీరాస్వామికి రంగూన్ ఏర్పోర్టులో వీడ్కోలు చెప్పి వచ్చిన తర్వాత రచయిత జీవితంలోకి వచ్చిన కల్యాణి (రచయిత చేత అతని ప్రయాణాల్ని ఆపు చేయించి అతన్ని ఒక ఇంట్లో కట్టేయాలని చూసిన కల్యాణి), ఆమెతో ప్రేమానుభవానికి సంబంధించిన లేయర్.. ఇక్కడ చాలా సహజంగా మళ్లీ తెరుచుకుంటుంది. కల్యాణి ఇతడిని కావాలనుకోవటం, ఇతను ఒక ‘‘గృహబద్ధమైన’’ జీవితాన్ని వద్దనుకోవటం… ఆమెకి బహుమానంగా ఇచ్చిన ‘జర్కన్’ రాయిని ఆమె ఇతనికే తిప్పి పంపేయటం…: ‘‘వస్తువులకి గొప్ప శక్తి వుంది, కల్యాణీ. అవి వెళ్ళవు పైకి. పారేశినా, ఇచ్చేసినా.’’

ఈ రాయిని ఇప్పుడు రచయిత మళ్ళీ వీరాస్వామికి తిరిగి ఇచ్చేయాలనుకుంటాడు, ఇప్పుడిలా వాల్తేరు మురికి పేటలో ఒక పాకలో ఉన్న వీరాస్వామికి: ‘‘ఏదో పాత కలలోని సందర్భం అకస్మాత్తుగా ఎదురయినట్లు చూశాడు. తీసుకోలేదు. జ్ఞాపకం మెరిసి మాయమయిపోయింది. ‘అవసరం’ లేదు అతనికి. నా దగ్గరే ఉండిపోయింది.’’ 

వీరాస్వామికి మళ్ళీ వీడ్కోలు చెప్పి వచ్చేస్తాడు రచయిత. ఇక్కడ కల్యాణికి సంబంధించిన లేయర్ కథలో ఒక ముగింపుకు వస్తుంది. కల్యాణి కథ కూడా వీరాస్వామి కథ లాగే, ఒక క్రానాలజీని పాటించదు. జర్కన్ రాయిని రచయితకి తిప్పి పంపేయటంతో తెరుచుకున్న కల్యాణి కథ, ఆమె దాన్ని రచయిత నుంచి బహుమానంగా తీసుకున్న సందర్భంతో ఎండ్ అవుతుంది: ‘‘నువ్వు ఆశ్చర్యపోయావు దీన్ని నీకు ఇచ్చినప్పుడు. ‘స్త్రీత్వం’ నీలో పరిపూర్ణత చూకూర్చుకుందికి ప్రయత్నం చేస్తుంది. గొలుసులు గొలుసులుగా ఆలోచనలు మొదలుపెడతాయి నాలో.’’  రైటింగ్ టేబిల్ ముందు కూర్చుని ‘జర్కన్’ రాయిని చూస్తూ తలపోస్తూ కథ రాస్తున్న రచయిత-- అసలు నిజానికి ఈ narrative vantage point ని కథలో ఎప్పుడూ వదిలిపెట్టని రచయిత-- ఇప్పుడు ఈ ‘‘గొలుసులు గొలుసుల’’ ఆలోచనల్ని మన ముందు పెడతాడు. రావిచెట్ల నీడల్లో గంగ వొడ్డున కల్యాణితో అనుభవం.. ‘‘నువ్వు నీ శరీరం ముసుగుల వెనక ఎక్కడో లేవు, ఇక్కడ... ఇక్కడ, నీ కాన్షస్నెస్ అంతటితోను నన్ను అదుముతూ నన్ను అందులో ‘కలిగి’ ఉంచుతూ, నా సర్వస్వాన్నీ అందులో మిళితం చేస్తూ...’’ ఇలా ఆమెను తన చుట్టూ ఊహించుకుంటాడు.

మళ్ళీ ఏదో పని మీద వెళ్తూ వాల్తేరు స్టేషనులో దిగి, వీరాస్వామిని చూద్దామని మూడేళ్ళ తర్వాత అతని పాకని వెతుక్కుంటూ వెళ్తాడు రచయిత. కానీ అప్పటికే వీరాస్వామి డెస్టినీ ఒక బాధాకరమైన ముగింపు చేరివుంటుంది. తన చిన్నప్పుడు ఒక మూడేళ్ళ పిల్లాడిని మంటల్లోంచి రక్షించినందుకు బర్మా ప్రభుత్వం దగ్గరనుంచి మెడల్ అందుకున్న వీరాస్వామి, ఇక్కడ ఈ వాల్తేరులో పూరిపాకల పేటని కాల్చిన దావానలంలో ఎవర్నో రక్షించబోయి, వొళ్ళంతా కాలి మసి అయిపోతాడు. అతన్ని జీవితాంతం కాల్చిన మహత్వాకాంక్షలన్నీ అతనితోపాటు కాలి మసైపోయాయి. ఈ విషయాన్ని రచయితకి అక్కడి స్థానికుడు చెప్తాడు: ‘‘బతికున్నప్పుడు గీరగాడని ఒగ్గేసినాం, సచ్చి బస్మం అయ్యాక ఆణ్ణి తలుసుకోని రోజునేదు. పట్టుమని ముప్పయి యేళ్ళు నేవు.’’ 

రచయిత ఒకానొక రోజు జర్కన్ ని చేతుల్లోకి తీసుకున్నప్పుడు అతని ముందు తెరుచుకున్న ఈ కథలన్నీ… అతని ప్రయాణాలూ, వీరాస్వామి పరిచయం, కల్యాణితో ప్రేమ… అన్నీ ఇక్కడ ముగింపుకొస్తాయి. ఇక్కడ, ఈ ముగింపు దగ్గర, అతని spiritual quest మన ముందు తెరుచుకుంటుంది. అతనిలో ప్రారంభమైన ఆలోచనల గొలుసులు… రచయితని జీవితపు మాయకి పట్టి ఉంచుతున్న ఆలోచనల గొలుసులు… అతడిని ‘‘తెలుసుకో’’నీయకుండా చేస్తున్న ఆలోచనల గొలుసులు… కంటిమీద ఎడతెగక పరుచుకునే మాయని మాయంచేసి అతన్ని జెన్ నిజంలోకి కుదురుకోనివ్వని గొలుసులు… ఇప్పుడు ఈ కథని…  నేను ఎన్ని సార్లు చదివినా ఎన్నో అర్థాలిచ్చే మాజికల్ అస్పష్టతలోకి పర్యవసింపజేస్తాయి. 

ఇది తెలుగులోనే కాదు, ఏ భాషలోనైనా నేను చదివిన కథల్లో అత్యంత పరిపూర్ణమైన కథ. అలాగని… ఈ పరిపూర్ణత ఒక పథకమో పన్నాగమో మనసులో పెట్టుకుని రాయదలిస్తే వచ్చే పరిపూర్ణత కాదు. ‘‘కథ చెపుదాం మనం ఇప్పుడు’’ అని బుద్ధికి (ఇంటెలెక్ట్‌కి) అధికారమిచ్చి కూర్చుంటే పుట్టే కథ కాదు. అల్లితే వచ్చే కథ కాదు. ఈ మూడు లేయర్ల కథని అత్యంత నైపుణ్యంతో juggle చేస్తూ త్రిపుర కాయితం మీద ఆడిన ఆట వెనక ఒక ‘‘ఉద్దేశం’’ లేదు, ఒక ‘‘వ్యూహం’’ లేదు. ఇది... నేను ఆయన పుస్తకానికి రాసిన ముందుమాటలో చెప్పినట్టు… ‘‘సబ్‌ కాన్షస్‌తో ఒక డీప్‌ కనెక్షన్‌ కుదిరినప్పుడు, కాన్షస్‌ ఉద్దేశాలన్నింటినీ రద్దు చేసుకోగలిగినప్పుడు, బుద్ధికి ఎప్పటికీ వీలుకాని పరిపూర్ణతతో వెల్లువెత్తే వచనం. ఇది త్రిపుర శైలి.’’

1 comment:

  1. "సబ్‌ కాన్షస్‌తో ఒక డీప్‌ కనెక్షన్‌ కుదిరినప్పుడు, కాన్షస్‌ ఉద్దేశాలన్నింటినీ రద్దు చేసుకోగలిగినప్పుడు, బుద్ధికి ఎప్పటికీ వీలుకాని పరిపూర్ణతతో వెల్లువెత్తే వచనం. ఇది త్రిపుర శైలి.’’ That is the ultimate reality as well

    ReplyDelete