శేషుకి మూడేళ్ల డిగ్రీలో పదమూడు సబ్జెక్టులు తన్నేశాయి. ఆ సంగతి అమ్మకి ఆఖరి ఏడాది దాకా తెలీదు. అప్పుడు కూడా వేరే వాళ్ల ద్వారా తెలిసింది. అప్పుడు ఆవిడ ఆఫీసులో ఉంది. ఆ రోజంతా ఫైళ్లు దిద్దుతూ ఆలోచించింది. కొడుకు మీద అంతస్తులంతస్తులుగా కట్టుకున్న ఆశలు నిశ్శబ్దంగా కూలుతున్నాయి. సాయంత్రం తలుపు తీసుకుని లోపలికి వచ్చింది. హేండ్ బాగు టేబిలు మీద పెట్టింది. శేషు మంచం మీద పడుకుని ఏదో లైబ్రరీ పుస్తకం చదువుకుంటున్నాడు. అమ్మ అడగటం గట్టిగానే అడిగింది. వాడు తల దించుకుని కూర్చున్నాడు. వాడి ముఖం ఆవిడ చేత తిట్లు తింటూ తింటూ ఇన్నేళ్లలో చాలా మారింది. ఆ ముఖం మీద ఇప్పుడు మీసాలు కూడా మొలుస్తున్నాయి. అమ్మకి ఇంక తిట్టి ప్రయోజనం లేదనిపించింది. గొంతులో నిరాశ మాత్రమే మిగిలింది.
‘‘మరీ అన్ని సబ్జెక్టులు ఎలా పోయాయిరా?’’
వాడేమీ మాట్లాడలేదు.
‘‘అబద్ధాలతో ఎన్నాళ్లు నెట్టుకొద్దామనుకున్నావు?’’
ఏమీ మాట్లాడలేదు.
‘‘సరే. ఏం చేస్తావో చేయి మరి,’’ అని లోపలికి వెళ్లిపోయింది.
కొన్ని రోజుల దాకా అమ్మ శేషుతో మాట్లాడటమే మానేసింది. శేషుకి మాత్రం రెండేళ్లు గుండెల మీద మోసిన అబద్ధం బరువు దిగిపోయినందుకు సంతోషంగా ఉంది. వాడి మీద ఇప్పుడు ఎవ్వరికీ ఏ భ్రమలూ లేవు. వాడి ముందు ఒక ఖాళీ ఉంది. వాడిని వాడు కట్టుకోవాల్సిన ఖాళీ. అది ఒక ఆటలా ఊరిస్తోంది.
జీవితంలో ఈ చివరాఖరి వేసవి సెలవులకి శేషు కడియంలో ఉన్నాడు. అమ్మ ఏం మాట్లాడకుండా అన్నం వండిపెట్టేసి రోజూ ఆఫీసుకి వెళ్లిపోతోంది. వాడు చెప్పులేసుకుని లైబ్రరీ దాకా వెళ్లి పుస్తకాలు తెచ్చుకుంటున్నాడు. ఆ పుస్తకాలన్నీ వర్షాలకి చెమ్మగిల్లిన లైబ్రరీ గోడల మధ్య చీకిపోయినవి. ఎప్పుడో చనిపోయిన రచయితలు రాసినవి. ఆ పేజీల మధ్య రకరకాల లోకాలు రెపరెపలాడేవి. ‘‘ఏదో ఒకటి ఏరుకో, ఏదో ఒకటి ఎంచుకో’’ అన్నట్టు. కొన్ని పుస్తకాలకి బలంగా ఎదురుతిరిగేవాడు. కొన్ని పుస్తకాలని ఆత్రంగా ఒప్పుకునేవాడు. ‘నా అంతరంగ కథనం’ అన్న పుస్తకంలో బుచ్చిబాబు సున్నితత్వం అస్సలు నచ్చలేదు. ‘ఘుమక్కడ్ శాస్త్ర’ అన్న అనువాద పుస్తకంలో రాహుల్ సాంకృత్యాయన్ బాటసారిలా బతకటమెలాగో చెప్పిందంతా చాలా నచ్చింది. ఆ పుస్తకాలు తన మెదడు కొలతల్ని పెంచుతున్నట్టూ, చుట్టూ పరిసరాలు ఇరుకవుతున్నట్టూ....
అమ్మకి కడియం ట్రాన్స్‌ఫరైంది ఈమధ్యనే. శేషూకి ఆ ఊరి వైనం ఇంకా తెలీదు. ఒక సాయంత్రం ఊరి పొలిమేర చూద్దామని సందుల్లోంచి ఒకే దిక్కుకు సైకిలు తొక్కుకుంటూ పోయాడు. చివర్లో ఇళ్లు ఆఖరైపోయాకా, ఎర్ర మట్టి దిబ్బలు మొదలయ్యాయి. ఆ ఎత్తుకి సీటు మీదనుంచి లేచి నుంచొని తొక్కాల్సి వచ్చింది. కాసేపటికి మనుషుల కాలిబాటలు ఆగిపోయాయి. నాగజెముడు మొక్కలు ఎదురయ్యాయి. చిన్న దిబ్బ అనుకున్నది కొండలాగా పైకి పోతూనే ఉంది. కొండ కొమ్ము దాకా వచ్చాకా సైకిలు స్టాండు వేశాడు. అంచు దాకా నడిచి తొంగి చూశాడు. కింద క్రేన్లు కొండని తొలుస్తున్నాయి. ముందుకి చూస్తే ప్రపంచమంతా కాళ్ల కిందే ఉన్నట్టుంది. దూరంగా రైలు పట్టాలు కనపడుతున్నాయి. చాలాసేపటికి ఒక రైలు వెళ్ళింది. అది చేతివేళ్ల మధ్య పట్టే బొమ్మ రైల్లాగే ఉంది. రైలు వెళ్లిపోయిన తర్వాత పట్టాల అవతల ఒక చెట్టు ఒంటరిగా కనపడింది. తను ఆ చెట్టు మొదట్లో కూర్చున్నట్టు, రైలు తనను దాటుకుపోయినట్టూ ఊహించుకున్నాడు. ఆ రైలు అలా వొంపు తిరిగి కడియం రైల్వే స్టేషను వైపు వెళ్తోంది. ఈ ఎర్రమట్టి దిబ్బలు ఊరికి ఇటు చివర ఉంటే, ఆ స్టేషను అటు చివర ఉంది.
ఆ మరుసటి రోజు ఆ స్టేషన్ను వెతుక్కుంటూ వెళ్లాడు. అది నాపరాళ్లు నున్నగా అరిగిపోయిన పాత స్టేషను. జనం పెద్దగా లేరు. ఫ్లాట్ ఫాం మీద నుంచి చూస్తే పట్టాల అవతల కనిపించినంత మేరా పొలాలు. ఆ పొలాల అంచున నలుసుల్లాగ ఫాక్టరీ గొట్టాలు. వాటిల్లోంచి ఎగజిమ్మి మబ్బుల్లో కలుస్తున్న పొగలు. ప్లాట్ ఫాం వెంట నడుచుకుంటూ వెళ్లాడు. దాన్నానుకొని ఇనుప చువ్వల కంచె ఉంది. దానవతల క్వార్టర్స్ లాగ ఒకే రంగులో ఇళ్లున్నాయి. చివ్వరి చప్టా మీద కూర్చుని పుస్తకం చదవటానికి ట్రై చేశాడు. కానీ పరిసరాలు పుస్తకం మీదికి దృష్టి పోనీయటం లేదు. ఆఖర్న ఉన్న పట్టాల మీద గూడ్సు ట్రైను ఒకటి ఆగి ఉంది. పట్టాలు దాటుకుని దాని వైపు వెళ్లాడు. పెట్టెల వారన కొంత దూరం నడిచాడు. ఆ భారీ యంత్రం పక్కన ఆగి వింటే సీతాకోకలూ బెదరని నిశ్శబ్దం. గూడ్సు ట్రైను తలుపులు లక్కముద్దలతో సీల్ చేసి ఉన్నాయి. ఆ ముద్దల్లోని ఊచలకి ఏవో కార్డులు గుచ్చి ఉన్నాయి. వాటిలో ఒకటి తెంపి చూశాడు. దాని మీద ఏదో నార్త్ ఇండియన్ సిటీ పేరు రాసి ఉంది. అక్కడి చేరాలంటే ఈ గూడ్సు బండి ఎన్ని నగరాలు దాటి వెళ్లాలో ఊహించాడు. ఆ నగరాలు మనసులో మిలమిల మెరిశాయి. అవన్నీ పెద్ద పెద్ద పనులు జరిగే నగరాలు, మనుషులంతా కలిసి మానవ శక్తికి మించిన పనులు చేసే నగరాలు, రైలు పట్టాలు వొంటి నిండా నరాల్లా పాకిన నగరాలు, ఓడరేవుల్లోంచి ఊపిరి పీల్చుకునే నగరాలు, ఇనుప పిడికిళ్లను బిగించి భవన కండరాల్ని ఉప్పొంగించే నగరాలు.... ఆ గూడ్సు ట్రైను ఎక్కి వెళ్లిపోతే ఎలా ఉంటుందా అనుకున్నాడు. ఆ గూడ్సు పెట్టెల తొట్టిలో రాక్షసబొగ్గు సరుకు మీద వెల్లకిలా పడుకుని, అది ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి వెళ్లిపోతే.... కళ్ల ముందు భారత దేశ విస్తారం విప్పారింది.... ఆ పెట్టెలోనే వర్షానికి తడుస్తాడు, ఎండకి ఎండుతాడు, జ్వరమొస్తే బరకం కప్పుకుని పడుకుంటాడు. లేతాకుల మీద నీరెండ మెరిసే పొద్దుల్లో అడవుల మధ్య నుంచి వెళ్తాడు, చలికి కీచురాళ్ళు రెక్కలు రాపాడించుకునే రాత్రుల్లో వెలుగుల గలాటా చేసే నగరాల్ని దాటుతాడు. ఒకానొక నగరంలో ఏదో వైనం నచ్చి దిగుతాడు. తెలియని వీధులమ్మటా తిరుగుతాడు. ఆ సంరంభంలో భాగమవుతాడు. పని అడుగుతాడు. పని చేస్తాడు. పని చేసే మనుషుల సమూహంలో భాగమవుతాడు. జీవితం మొదలుపెడతాడు.
ఎవరో పిలిచినట్టనిపించి వెనక్కి తిరిగి చూశాడు. ప్లాట్ ఫాం మీద ఒక మనిషి నిలబడి ఇటురమ్మన్నట్టు చేయాడిస్తున్నాడు. అతను ఇక్కడ పని చేసే మనిషిలా ఉన్నాడు. శేషుకి తను కార్డు తెంపటం ఎవరైనా చూశారా అని డౌటొచ్చింది. పట్టాలు దాటుకుంటూ వెళ్లాడు. ఆ మనిషి ‘‘సార్ రమ్మంటున్నాడు,’’ అన్నాడు. “ఎందుకూ” అని శేషు అడుగుతున్నా సమాధానమేం చెప్పకుండా నడిచాడు. తను ‘తీసికెళ్లబడుతున్నట్టు’ శేషుకి అర్థమైంది. అయినా బింకంగా వెంట నడిచాడు. దారిలో ఇందాక తను లోపలికి వచ్చిన ద్వారం మీంచే వెళ్ళాడు. అక్కడి నుంచి బైటికి చెక్కేద్దామా అనిపించింది ఓ క్షణం కానీ, పిరికితనాన్ని అలా ఒప్పుకోబుద్ధి కాలేదు. ఆ మనిషి ఒక గది గుమ్మం ముందు ఆగాడు. గదిలోకి చూస్తూ శేషూ వస్తున్నాడన్నట్టు లోపల ఎవ్వరికో తలూపాడు. అతని తీరునుబట్టి లోపల ఉన్నది పైఆఫీసరని అర్థమవుతోంది.
శేషు గుమ్మం దగ్గరకి వచ్చాడు. లోపల పెద్ద మెషీన్ మీద చిన్న చిన్న బల్బులు వెలుగుతున్నాయి. టేబిల్ మీద రెండు మూడు ఫోన్లున్నాయి. దాని వెనక తెల్ల యూనిఫాంలో స్టేషన్ మాస్టరు కూర్చొని ఉన్నాడు. అతను కుర్చీలో వెనక్కి వాలి శేషుని ఇలా రమ్మన్నట్టు బల్ల మీద తట్టాడు. శేషు గదిలోకి నడిచాడు. గుమ్మం దగ్గర ఆగిన మనిషి కూడా తన వెనకే నడుస్తున్నట్టు అనిపించింది శేషూకి.
‘‘ఏం పనిరా నీకిక్కడ?’’ అన్నాడు స్టేషన్ మాస్టరు.
‘‘చూద్దామని వచ్చాను.’’
“గూడ్సు బండి దగ్గరేం చేస్తున్నావ్?”
“ఏం లేదు ఊరికే—”
‘‘—సరుకు దెంగేసి పోదామని వచ్చావా’’ అన్నాడు ఒకేసారి గొంతు పెంచేసి, బల్ల మీద చేత్తో చరుస్తూ.
శేషుకు బెదురూ, కోపం ఒకేసారి వచ్చేశాయి. ‘‘సరిగ్గా మాట్లాడు’’ అన్నాడు.
స్టేషను మాస్టరు కుర్చీలోంచి టప్ మని పైకి లేచాడు.
‘‘లంజా కొడకా, ఇనుము దెంగుకు పోదామని వచ్చి, పైగా ఎదురు మాట్లాడతన్నావా. పట్టుకోరా ఈడ్ని,’’ అన్నాడు వెనకాల మనిషితో.
ఆ మనిషి వీపుకు తగిలేంత దగ్గరగా ఉన్నట్టు అనిపించింది శేషుకి.
కాళ్లు వణకటం మొదలైంది. కానీ నోరు మాత్రం దాని పనిలో అదుంది. ‘‘ఏంట్రా అమ్మల్దాకా ఎళ్తన్నావ్? నాకొడకా మర్యాద్దక్కదు,’’ అన్నాడు తలెగరేస్తూ.
వెనకాల మనిషి, ‘‘ఓయ్.. బాబూ. ఏం మాట్లాడతన్నావు. ఎవరనుకున్నావు. అలాగ పట్టాలకాడదీ తిరక్కూడదు. తెలీదా నీకు?’’ అంటున్నాడు.
‘‘పొమ్మంటే పోతాను. నోటికొచ్చినట్టు మాట్లాడతాడేంటి.’’ శేషుకి పట్టాల దగ్గర తిరక్కూడదని తెలీదు. అసలు ఎక్కడ ఎంత మాట్లాడాలో కూడా తెలీదు. అందుకే తగ్గటం లేదు.
స్టేషను మాస్టరు ఏదో బెదిరించి పంపిద్దామనుకున్నాడు. కానీ శేషు నోటి దూల వల్ల, పైగా తన కింద పని చేసే మనిషి అక్కడే ఉంటం వల్ల కొనసాగించక తప్పలేదు. టేబుల్ దగ్గర నుంచి కదిలి ముందుకు వస్తూ, ‘‘ఈడ్ని తీసుకెళ్లి ఆ గదిలో వేయిరా,’’ అంటున్నాడు.
వెనకాల మనిషి భుజం పట్టుకున్నాడు.
‘‘ఏం పీకుతావో పీక్కోబే. ఈ స్టేషను దాటితే ఆతుముక్కకి పనికి రాడు ఒక్కొక్కడూ. ఎదవ బిల్డప్పులు.’’
‘‘అసలేం మాట్లాడుతున్నావురా నువ్వూ? కుర్రలంజాకొడుకు ఇంత లేడు, ఏంట్రా ఈడికింత బలుపూ?’’ స్టేషను మాస్టరు నిజంగానే డౌటొచ్చినట్టు అడిగాడు.
వెనకాల మనిషికి శేషుకి నిజంగానే ఏం తెలీదని అర్థమైంది. పిల్లలున్న తండ్రిగా ఇప్పుడు కలగజేసుకోవాల్సిన బాధ్యత ఉందనిపించింది. ‘‘ఏ బాబు! పెద్దంతరం చిన్నంతరం లేదా నీకు? ఎయ్… నడు, బైటికి నడు,’’ అంటూ శేషుని ప్లాట్ ఫాం మీదకి గుంజుకుపోయాడు.
శేషు కదలనన్నట్టు గింజుకుంటూనే, లోపల్లోపల ఆ గదిలోంచి బైటపడుతున్నందుకు సంతోషించాడు.
ఆ మనిషి స్టేషను బైట దాకా శేషు వెంట వచ్చాడు. ‘‘ఆళ్లు తల్చుకుంటే ఏం చేస్తారో తెలుసా? ఏంటసలు తెలివి లేదా నీకు? సెంట్రల్ గవర్నమెంటు ఎంప్లాయీసు. ఇంక ఇటు రామాకు,’’ అన్నాడు.
శేషు భుజం విదిలించుకుని మెట్లు దిగాడు.
సైకిలు స్టాండ్ తీసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు.
ఆ మనిషి మెట్ల దగ్గర కాసేపు నిలబడి తలాడిస్తూ నవ్వుకుని లోపలికి వెళ్లిపోయాడు.
మళ్లీ స్టేషనుకి రాలేనంటే శేషుకి బాధగా అనిపించింది. ఇందాక గూడ్సు ట్రైను దగ్గర వచ్చిన ఊహలు గుర్తొచ్చాయి. సైకిలు ఎత్తురోడ్డు మీదకి ఎగశ్వాసగా తొక్కుతున్నాడు. వెంకటేశ్వరస్వామి గుడి దాటాక ఊరు మొదలైంది. ఈ మబ్బు పట్టిన రోజు మెయిన్ రోడ్డు మీద పెద్ద సందడి లేదు. కూరగాయల కొట్ల ముందు కుళ్లిన టమాటాలు పడున్నాయి. బస్టాండులో ఒక తాత మోకాలి మీద కురుపు చుట్టూ ఈగలు ముసురుతుంటే తోలుకుంటున్నాడు. ‘దాంపత్య రహస్యాలు’ పోస్టరుని ఒక మేక కాళ్లు గోడకి నిగడదన్ని తింటోంది. పిండిమిల్లు గొట్రుకి తుమ్ము ఆపుకుంటూ సందులోకి సైకిలు తిప్పాడు శేషు. పాలాయన సైకిలు మెట్టుకి ఆనించి తలపాగా చుట్టుకుంటున్నాడు. ‘ఏసాకాలమని పట్టేను వొడియాలు నాకేం తెలుసమ్మా’ అని సాగదీస్తోంది దడి వెనకాల ఒక ఆడ గొంతు. శేషుకి మనసంతా ఇరుగ్గా చిరాగ్గా ఉంది. అవమానం మనసుని సలుపుతూనే ఉంది. ‘‘అక్కడే దవడ మీద పీకేసుండాల్సింది ఎదవని,’’ అనుకున్నాడు. ‘‘బతుకంతా ఇంతే ఈళ్లకి’’ అనుకున్నాడు. ‘‘ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి ఎక్కడికైనా’’ అనుకున్నాడు.