December 7, 2007

భ్రమలు వీడే క్రమం

My life, as I see it, won’t get any validation from this world. What shall I do then: transgress this triviality and go on living as I see it; or, distrusting my own instincts, shall I submit myself to this world? (Dairy ’86—87)

* * *


"ఏవైనా సరే ఈ సినిమాలో అయిటం నంబరుండాల్సిందే," మాధవ్ నెత్తిన సుత్తి మోదినట్టు మరోమారు ఉద్ఘాటించాడు నిర్మాత సాంబశివరావు.

మాధవ్ నిస్సహాయంగా నా వైపు చూసాడు. అతని చూపు పట్టుకుని, సాంబశివరావు తనూ నా వైపు తిరిగి నన్నూ వాదంలోకి గుంజాడు, "ఏం రవిగారూ, ఇరవైయేళ్ళ పైబడి ఇండస్ట్రీని చూస్తన్నాం మనం—నిర్మాతగా నేనూ, రైటర్‌గా మీరూ; మీరైనా చెప్పండి ఇతగాడికి—ఏది క్లిక్కైద్దో, ఏది క్లిక్కవ్వదో; నా మాటలు చెవికెక్కట్లేదల్లే ఉంది."

అప్పటి వరకూ విజయవంతంగా తాటస్థ్యాన్ని అవలంబించిన నాకు, ఇక తప్పేది లేదులా ఉంది. అయినా ఎవర్ని సమర్థించాలో ఆట్టే ఎంచి చూడక్కర్లేదు: మాధవ్ నిన్న లేడు; ఇవాళ ఉన్నా, రేపుంటాడా లేదా అన్నది దేవుడికే ఎరుక; కానీ సాంబశివరావ్ రెండు దశాబ్దాలకు పైగా ఇక్కడే పాతుకుపోయి ఉన్నాడు. అంతేకాక, ఆరేడేళ్ళుగా అతని నిర్మాణ సంస్థకి నేను దాదాపు ఆస్థాన రచయిత హోదాను అర్జించుకున్నాను; కాబట్టి చాలా సులభమైన ఛాయిస్. సిగరెట్ నుసి యాష్‌ట్రేకి తాటించి, మాధవ్ వైపు తిరిగి అనునయంగా అందుకున్నాను, "ప్రొడ్యూసర్‌గా ఆయన ఆబ్లిగేషన్స్ ఆయనకుంటాయ్—మనం అర్థం చేసుకోవాలి. అసలాయనంటూ లేకపోతే ఈ ప్రొడక్టే లేదు కదా—"

మధ్యలో మాట తెగొట్టి సాంబశివుడు జొరబడ్డాడు, "కాదా మరి!" నాతో అని; మరలా మాధవ్ మీదికి లంఘించాడు, "నిన్నెంచుకున్న కాణ్ణించీ అందరూ చెవినిల్లుకట్టుకు పోరతన్నారయ్యా: 'ఇన్‌స్టిట్యూట్‌నుండొచ్చినోడు, ఎక్స్‌పీరియన్సు లేదు, డైరక్టర్ని చేసి చేతిలో నాలుక్కోట్లు సినిమా పెట్టుక్కూర్చున్నావ్—బుగ్గైపోతావ్‌రోయ్' అంటా నా డ్రైవర్ కాణ్ణించి ప్రతీవోడూ ఇయ్యే బెదిరింపులు; ఇయన్నీ నీ దాకా రానిచ్చానా. ఏదో వర్తున్నోడివనిపించి పెత్తనమంతా నీకే వదిలేసేను; ఆ నమ్మకానికి నువ్వు గౌరవమియ్యాలా లేదా! నమ్మకం మాటొదిలేయ్ పోని, డబ్బులు పెడతన్నోడ్ని—కొంత నా మాటా ఆలకించాలి కదా. నేనేవడిగాను—స్టోరీ మార్చమన్నానా, కేరెక్టరైజేషను మార్చమన్నానా; ఓ అయిటం నంబరే కదా!—పెట్టేస్తే పోయేదానికి ఏదో విజనూ, గ్లిజరినూ అంటావేందయ్యా!" ఆయాసంతో ఆగి ఓ పెగ్ ఎత్తి నోట్లో బోర్లించుకున్నాడు.

"అది కాదు సర్," గొంతు వెనక ఎంత లావాని అదిమి పెడుతున్నాడో—మాధవ్ మాటలు నొక్కి పట్టినట్టు స్ఫుటంగా వస్తున్నాయ్," స్క్రీన్-ప్లే అంతా సటిల్‌గా ఒక ఫ్లోలో పోతుంది; ఇప్పుడు మధ్యలో ఈ ఐటెమ్-సాంగ్ దూర్చామంటే లౌడ్‌గా, వెకిలిగా ఉంటుంది—ఇమడదు."

ఈ సరికే విస్కీ ప్రభావం మొదలైనట్టుంది—సాంబశివరావు తన చూపుడు వేలును ఇరుసుగా దూర్చి గ్లాస్‌ని టేబిల్‌పై గింగిరాలు తిప్పుతున్నాడు. మాధవ్ మాట్లాడటం ఆపగానే గ్లాసు ఆపి, శబ్దంతో టేబిల్ పై బోర్లించాడు. ముఖ-భంగిమను వెకిలిగా వంకర చేసి, కాసేపు నిశ్శబ్దంగా మాధవ్ వైపు నవ్వి ఇలా మొదలు పెట్టాడు: "స్క్రీన్-ప్లే... హి-హి... స్క్రీన్-ప్లే గురించి నాకు చెప్తున్నావా నువ్వు! ఇరవైయేళ్ళు!—ఏం ఏమీ తెలియకుండానే నెట్టుకొచ్చామనుకుంటున్నావా. స్క్రీన్-ప్లే అంటే నీకు ఇన్‌స్టిట్యూట్‌లో నేర్పినట్టుండదిక్కడ—మాధవా—నేన్నేర్పుతానుండు స్క్రీన్-ప్లే నీకు. ఏంటి 'ఫ్లో-ఫ్లో' అంటావ్ మాటాడితే; అదే 'ఫ్లో'లో హీరో బార్‌కెళ్ళినట్టు పెట్టు; తాగి బార్‌గర్ల్‌తో డాన్సాడినట్టు టిస్టిద్దాం... య్యోవ్, టెక్నిక్ తెలవాలేగానీ ఎలాగైనా కిట్టించచ్చయ్యా."

"నా హీరో తాగడు; తాగినా డాన్స్ చేయడు."

"ఏం రోగవఁటా!" ఉరుముతూ పైకి లేచాడు; కాని, మద్యం ప్రభావంతో, నిలదొక్కుకోలేక టేబిల్ మీదకు తూలబోయాడు. నేను గభాల్న లేచి పొదివి పట్టుకున్నాను; "ఉండవయ్యా రవీ, నాకేం కాదు; ఎన్నిసార్లు పడలేదు, ఎన్నిసార్లు లేవలేదు," అంటూ నా భుజాలు పట్టుకుని ఒద్దికగా కూర్చుండబెట్టాడు; "ఇదిగో మాధవా—చాలా సహించేను; చాలా ఫిర్యాదులొస్తన్నాయ్. నిన్నటికి నిన్న, లాంగ్‌షాట్ నుండి జూమిన్ పోదామని కెమెరామన్ అంటే, క్లోజప్ కట్ చేయమన్నావంట; సర్థి చెప్పబోతే గఁయ్‌మని ఆయన మీదకి లేచావంట. నాకన్నీ తెలస్తానే ఉంటాయ్. ఏం ఆయన కన్నా ఎక్కువ తెల్సా నీకు. క్లోజప్ పెడితే లైటింగ్ సెటప్పంతా మార్చొద్దా; ఇలోగా హీరోయిన్, మహాతల్లి!, మేకప్ వేనెక్కిందంటే గంటగ్గానీ దిగిరాదు—ఎంత టయిం వేస్టు! ఎవడి డబ్బులు ఎవడు తింటన్నట్టయ్యా నాకు తెలవకడుగుతాను! ఏం తమాషాకిందుందా!" ఇలోగా చేతిలో పళ్ళెంతో మా క్యూబికల్‌లోకి వచ్చిన వెయిటర్‌ని వేలెత్తి చూపిస్తూ, "ఇదిగో ఈడ్ని డైరెక్టర్‌గా పెట్టి సినిమా తీసుకోగల్ను నేను; నాకు నువ్వే అవసరం లేదు; నిన్ను చూసెవడూ కొనడు సినిమాని."

మాధవ్ పాలముఖం జేవురురంగు లోకి మారిపోయింది. మరో క్షణంలో బద్దలయ్యేవాడే—నేను టేబిల్ క్రింద నుండి అతని తొడపై అర్థ సూచకంగా నొక్కి, సాంబశివరావ్‌తో, "మీరెళ్ళండి సార్... నేన్నచ్చచెబ్తాను," అన్నాను. మాధవ్ గిరుక్కున తల తిప్పి నా వంక ద్రోహిని చూసినట్టు చూస్తున్నాడు.

సాంబశివరావు తూలుకుంటూ, టేబిల్ వెనక నుండి దారి చేసుకుంటూ, "చెప్పవయ్యా, నువ్వు చెప్పు—ఇలా అయితే మన సినిమా థియేటర్లలో ఆడే మాటేమో గానీ; ఎవడూ కొనక, ప్రివ్యూ థియేటర్లో ఆడుద్ది వంద రోజులూ. ఆ తర్వాత బయ్యర్ల # #లు పట్టుకొని బ్రతిమాలుకోవాల్నేను. అర్థవఁయ్యేట్టు చెప్పు కాస్త డైరెక్టర్‌గారికి," అంటూ; సెర్వ్ చేసి వెళిపోతున్న వెయిటర్‌ని ఆగమని, అతని భుజంపై ఊతంగా నడుస్తూ బయటికి వెళిపోయాడు.

తుఫాను వెలిసిన నిశ్శబ్దం ఆవరించింది కాసేపు మా ఇద్దర్నీ. మాధవ్ నిస్పృహగా టేబిల్ మీద మోచేతుల్తో వాలి, తలను అర చేతుల్లో ఇరికించుకున్నాడు. నేను గ్లాసులోకి విస్కీ వంపి రెండు ఐస్-క్యూబ్స్ వేసుకున్నాను. అర్థరాత్రి దాటుతున్నా ఇంకా బార్‌లో జనసమ్మర్థం తగ్గలేదు: కొన్ని మాటలు, కొన్ని నవ్వులు, కొన్ని వాదనలు—కలగాపులగంగా ఏకమైపోయి, మేం కూర్చున్న క్యూబికల్‌లోకి అస్పష్ట శకలాలుగా రాలి పడుతున్నాయి. అతను బొటన వేళ్ళతో ఇరు కణతలూ నులుముకొంటూ, తల వంచుకునే, స్వగతంలా మాట్లాడటం ప్రారంభించాడు, "అక్కడ జూమిన్ షాట్ వాడితే ఆ డైలాగ్‌ని అనవసరంగా ఎంఫసైజ్ చేసినట్టవుతుంది; ఆ డైలాగ్‌కి అంత సీన్ లేదు; అందుకే క్లోజప్ కట్ చేయమన్నాను," హఠాత్తుగా తలెత్తి నా కళ్ళల్లోకి చూస్తూ, ఆవేశంగా, "ఈ తిక్కనాకొడుక్కి—ప్రొడక్షన్ టైమ్ పెరిగిపోతుందని ఏడవడమే తప్ప—అక్కడ స్క్రీన్ టైమ్ అనవసరంగా సాగలాగితే ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో అర్థం కాదేం," సాంబశివరావ్ నిష్కృమించిన దిశగా చేయి ఎక్కు పెట్టి గాల్లో పొడుస్తూ అరిచాడు.

నేను చేదుగా ఓ గుటకేసి గ్లాస్ టేబిల్ మీద పెడుతూ అన్నాను, "మేటరది కాదు; నీకూ తెలుసు. వాడు ప్రొడ్యూసర్; నువ్వు వాడికి పని చేస్తున్నావ్—"

"తొక్కలో ప్రొడ్యూసర్, నేనేం వాడికి పన్చేయట్లేదు; నా కథకు పన్చేస్తున్నాను," విసురుగా అన్నాడు.

"కానీ నీ కథ తెరదాకా రావాలంటే వాడు డబ్బు పెట్టాలి."

ఆ విషయం అప్పుడే స్ఫురించినట్టు నీరుగారి నిస్త్రాణగా వెనక్కి వాలిపోయాడు, "ఛ! మీకు తెలియద్సార్—ఆ స్క్రీన్-ప్లేకి నేనెంత కష్ట పడ్డానో; సిడ్‌ఫీల్డ్‌కి పాఠం చెప్పే స్క్రిప్టది. నిజానికి నాకు ఐటెమ్-సాంగ్స్‌తో ఏ ప్రాబ్లెమ్ లేదు. కానీ ఈ పర్టిక్యులర్ స్టోరీ ఒక కన్సిస్టెంట్ టోన్‌తో, ఫీల్‌తో వెళ్తుంది. పాత్రల కేరెక్టరైజేషన్‌కి ఒక యూనిటీ ఉంది. ఇపుడు సినిమా మధ్యలో నా హీరో అబ్‌రప్ట్‌గా—వాడి గంభీరత్వం, గ్రేస్, ఎలిగెన్స్... అంతా వదిలేసి బార్‌గర్ల్‌తో తైతక్కలాడతాడా! ఆర్టిస్టిక్ ఇంటెగ్రిటీ అనేది ఒకటుంటుంది సార్!"

"ఆ మాటే ఇందాకనాల్సింది—నువ్వేదో ఇంగ్లీష్‌లో బూతుల్తిడుతున్నావనుకొని పీకుచ్చుకొనేవాడు," సంభాషణని తేలిక చేయ ప్రయత్నించాను.

"హుఁ," జీవం లేని నవ్వొకటి అతని పెదాలపై ఉల్కలా మెరిసి మాయమైంది. నేను రెండో పెగ్‌తో గ్లాసెత్తబోతుంటే అన్నాడు: "నాక్కూడా కొంచెం పోయండి." "నువ్వు తాగవు కదా!" ఆశ్చర్యంగా అడిగాను. "పోయండి సార్... లేకపోతే నిద్ర పట్టదివాళ," బ్రతిమాలుతూ గ్లాసుతో నా ముందు చేయిజాచాడు. గ్లాసు సగం నింపగానే, 'రా' అలాగే ఎత్తి నోట్లో పోసేసుకున్నాడు. ఇంత వరకూ రుచి తెలియదనుకుంటా—మింగలేక, కక్కలేక; ఆ చేదును కాసేపలాగే అంగిలిలో పుక్కిలింత పట్టి, దీర్ఘశ్వాసతో ధైర్యాన్ని కూడదీసుకుని, ఒకే గుటకతో లోపలికి మింగేసాడు. మొహం వికారంగా వంకర్లు త్రిప్పి, గ్లాసు మరలా నా ముందు పెట్టాడు—నింపమన్నట్టు. "టేకిటీజీ! స్టఫ్ తీసుకో ముందు," అదిలించాను. తల అడ్డంగా ఊపుతూ, పోయమన్నట్టు గ్లాసు నా ముందు ఊగించాడు. గత్యంతరం లేక మరలా నింపాను. దాన్ని కూడా ఒకే గుటకలో త్రాగేసి, "ఊ! ఇక చెప్పండి—ఈ ఐటమ్-సాంగ్‌ని ఎక్కడ అతకెయ్యచ్చో," అంటూ కులాసాగా కుర్చీలో వెనక్కి వాలాడు. నేను తలకెక్కిన మద్యపు మత్తు విదిల్చుకుంటూ, మేధోమథనానికి ఉపక్రమించాను: పాట ఎక్కడ వస్తే బాగుంటుందో (కనీసం ఎబ్బెట్టుగా ఉండకుండా ఉంటుందో) వివరించాను. హీరోయే బార్‌కెళ్ళి త్రాగాడనడం కన్నా, స్నేహితుల బలవంతం మీద త్రాగినట్టు; అక్కడ కూడా బార్‌గర్లే అతని మీద పడి, రెచ్చగొట్టి డాన్సాడించినట్టు పెడదామని సూచించాను. ఇలా కాసేపు నా ధోరణిలో నేను ఈ సన్నివేశాన్ని సవివరంగా విస్తరించుకు పోతూ, మధ్యలో ఎందుకో అనుమానం వచ్చి అతన్ని తేరిపార పరకాయించి చూసాను. అతను "ఊఁ" కొడుతున్నాడే కాని వినడం లేదు; అసలతనిక్కడ లేడు—నాకు అందని ఏవో అతీతమైన అందలాల్లోంచి నన్ను చులకనగా అధివీక్షిస్తున్నట్టు పెదాలపై సన్నని అపహాస్యపు చిరునవ్వొకటి కదలాడుతుంది. ఇక సాగేలా లేదనిపించి, "పద వెళ్దాం," అంటూ లేచాను. అతను భారంగా పైకి లేచాడు. బిల్ చెల్లించి బయట పడే పర్యంతం—లాంజ్‌లో, తర్వాత పొడవైన కారిడార్ గూండా—అతను నావెనకే తూలుకుంటూ, నిశ్శబ్దంగా పెంపుడు జంతువులా అనుసరించాడు.

బయట వాతావరణం చలిగా ఉంది. నిర్మానుష్యమైన రోడ్డుని ఓ కుక్క సావకాశంగా దాటుతుంది. పైన "నిర్వాణా బార్ అండ్ రెస్టారెంట్" పేరుతో మలచబడిన నియాన్ దీపపు కాంతులు, ప్రక్కన పార్కింగ్‌లో మరో రెండు కార్లతో జత కట్టి నిల్చున్న నా హోండాసిటీ పై వేర్వేరు వర్ణాల్తో వెలుగులు చిమ్ముతున్నాయి . కార్ తాళం తీయబోతుంటే వెనక నుండి, "రవీ," అని పిలిచాడతను. వెనక్కి తిరిగాను: "వాడికంటే తెలీదనుకోవచ్చు; కానీ నీకు తెలుసుగా క్రాప్ట్ గురించి; నీకు తెలుసుగా అక్కడ ఇలాంటి పాట పెడితే ఎంత ఎగతాళిగా ఉంటుందో—మరి నేను లోపల అంతలా గొంతు చించుకుంటుంటే నాకు సపోర్ట్‌గా కనీసం ఒక్క మాటైనా ఎందుకు మాట్లాడలేకపోయావ్?"

నేను నాటకీయంగా నిట్టూర్చి, "మళ్ళీ మొదటికొచ్చావా; వాడికి చెప్పి లాభం లేదు మాధవ్. వాడు వినే—"

"యూ–ఫకింగ్–హిపోక్రాట్," ప్రతీ పదాన్నీ కసిగా ఒత్తి పలుకుతూ అన్నాడు.

"ఏయ్!!"

"ఏం? పౌరుషమా? నిజంగా అదే నువ్వు—ఎవడి నెత్తికి నీడ పడదామాని నీ కళని గొడుగు చేసి వాడుకునే లుచ్చావి. ఆ తింగరి వెధవ, సాంబశివరావ్, వాడి నుండి అంత కన్నా ఏమీ ఆశించలేం... వాడికంతే తెలుసు, మరి నీకు... యునో వాట్ క్రాప్ట్ ఈజ్—అవునా కాదా; చెప్తే వాడు వింటాడా వినడా అన్నది పక్కనబెట్టి, కనీసం నువ్వు నమ్మింది చెప్పాలా వద్దా? అక్కడ నువ్వు నేనూ మేటర్ కాదు; వాడి క్రింద మనం పన్చేస్తున్నామా అన్నది కూడా మేటర్ కాదు; కళ—దటీజ్ ఆల్ దట్ మేటర్స్. యాజే క్రాప్ట్స్‌మన్, యు హావ్ టు డిఫెండ్ ద క్రాప్ట్; అది తెలియనపుడు నీ పెన్‌కి మూత పెట్టి మూల పడేయ్; వాడకు." : మద్యపు మత్తు వలన అతిశయించిన ఆంగికంతో, చేతులు ఊపుతూ, మధ్య-మధ్యలో తర్జని నా వైపు ఎత్తి పొడుస్తూ, అతను నన్నిలా ముప్పేట ముట్టడిస్తుంటే; చేష్టలుడిగి చూడటం తప్ప నాకు మరేం చేతకాలేదు. అతను నా నుండి ఏదో హింసాత్మకమైన ప్రతిస్పందనను ఆశిస్తూ నా కళ్ళల్లోకి ఉద్వేగంగా చూస్తున్నాడు. నాకు కోపం కలగలేదు; "పద వెళ్దాం," అంటూ అతని భుజంపై చేయి వేసి కారు వైపు లాగబోయాను.

"యె ఛీ!" విదిలించుకున్నాడు; "నీకన్నా వాడే నయం—కనీసం నమ్మిందేదో ధైర్యంగా బయటకి చెప్తున్నాడు. కానీ నువ్వలా కాదే—ఓ నానెంటిటీ లాగా, మబ్బులాగా... ఇలా మన ఇన్‌స్టింక్ట్స్‌ని చంపేసుకు బతికే బతుకూ ఓ బతుకేనా; నువ్వు నిజంగా బతుకుతున్నావనే నమ్ముతున్నావా! నో; శవానివి నువ్వు, నడిచే శవానివి... జోంబీ... జోంబీస్ వాట్ దే కాల్ యూ," అంటూ చేతివేళ్ళని పంజాలు మడిచి ముఖం ప్రక్కల గుండ్రంగా ఆడిస్తూ; ముఖాన్ని వికృతమైన వంకర్లు తిప్పుతూ; ఏదో సి-గ్రేడ్ హాలీవుడ్ హారర్‌లోని జోంబీలాగా, వెకిలిగా, "బూ" అంటూ నన్ను వెక్కిరించడం ప్రారంభించాడు. దీనికి తోడు—అక్కడ, రెప్పపాటులో తళుకు-బెళుకుగా రంగులు మారిపోతూన్న నియాన్ దీపపు వెలుగులు; అతని ముఖంపై ఎరుపుగా, పచ్చగా, పసుపుగా, నీలంగా అలుముకొంటూ అతన్ని మరింత భయానకంగా చూపిస్తున్నాయి.

సహనం సడలిపోతుంటే, "కారెక్కుతావా లేదా," చిరాగ్గా అన్నాను.

"నేనెక్కను. ఐ 'మ్ గొనా వాక్ మై హోమ్ టుడే. నువ్వు ఫో! ... పోయి మళ్ళీ నీ గోరీలో దూరి పడుకో," అంటూ నిరసనగా వెనుదిరిగాడు.

నిట్టూర్చి, కారులో కూర్చున్నాను. అర్థమౌతుంది: ఈ రాత్రి ఇక్కడో ఆత్మహత్య జరగబోతుంది. రేపు షూటింగ్ స్పాట్‌కి నడచి వచ్చేది మాధవ్ కాదు, అతని శవం; ఇరవైయేళ్ళ క్రితపు స్వానుభవం. నాలాగే మరో జోంబీ తయారవుతుంది. అయితే—అది resurrection కానీ, putrefaction కానీ—మాధవ్ రేపు తిరిగి రావడం మాత్రం ఖాయం.

కారు రోడ్డు ఎక్కించి వెనక్కి తిరిగి చూసాను. మాధవ్ దూరంగా, చిన్నగా; వీధి దీపాల వెలుగు-చీకట్లలో, రోడ్ మీంచి పుట్‌పాత్ మీదకి పుట్‌పాత్ మీంచి రోడ్ మీదకు చేతులు పక్షి రెక్కల్లా బారజాచి పరిగెడుతున్నాడు. "బూ" అంటూ ఇంకా లీలగా వినవస్తుంది అతని గొంతు. కారు అద్దాలెత్తి మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేసాను.

* * *

1 comment: