February 3, 2008

వీడ్కోలు

రైలు కూత పెట్టింది. కిటికీ బయట వొంగినిల్చొని, ఆమెతో ఒక అందమైన ఆవరణలో సోలిపోయి ఏదో మాట్లాడుతున్నవాడల్లా... పరిసరాల్లోకి మేల్కొన్నాడు. ప్లాట్‌ఫాం, అనౌన్సుమెంట్లు, జనం రద్దీ. అప్పటిదాకా ప్రయత్నపూర్వకంగా మనసు అంచులవైపుకి నెట్టేసిన ఆలోచన ఇపుడు నల్లని నీడలాగా మళ్ళా మధ్యలోకి తోసుకొచ్చింది: ఆమె వెళ్ళిపోతోంది! నిజానికి ఆమె వెళ్ళిపోవటం, తర్వాత ఒంటరిగా రోజులు ఈడ్చుకురాగలగటం... వీటన్నిటి కంటే ముందు, అసలు రైలు వెళ్ళిపోయిన మరుక్షణం ప్లాట్‌ఫాం మీద ఒక్కడే మిగిలి వుంటాడన్న స్ఫురణే సత్తువ తోడేస్తుంది. అరగంట క్రితం ఆటోలో స్టేషన్‌కు వస్తుంటే, తన ఎడమ భుజంపై బరువుగా వాలిన తల నుంచి చామంతుల పచ్చి వాసన; తన గరుకు చెంపపై గాలికి చెదిరిన వెంట్రుకల చక్కిలిగిలి. పది నిముషాల క్రితం వరకూ ప్లాట్‌ఫాం మీది సిమెంటు బెంచీలో ఇద్దరూ కూర్చుని, చేతులు ముడేసుకుంటే అరచేతుల్లో వెచ్చదనం; పక్క బెంచీలో వాళ్ళమ్మ వొళ్ళో ముభావంగా, అలౌకికంగా బొటనవేలు చప్పరిస్తూన్న రెండేళ్ళ అపరిచితుడి ధ్యాస ఇటు మళ్ళించటానికీ, కాస్త నవ్వించటానికి తామిద్దరూ పోటాపోటీగా పడ్డ పాట్లు.... ఇపుడు కొద్ది క్షణాల్లో ఈ రాక్షస యంత్రం ఆమెనీ, ఆమెతనాన్నీ దూరంగా తీసుకు పోతుంది. మళ్ళీ వచ్చిన దారినే, శూన్యం తోడుగా, ఇంటికి వెళ్ళాలి. ఆమె వేరే ధ్యాసలో ఏదో మాట్లాడుతుంది. అతని కనుగుడ్లపై కన్నీటి పొర ఊరటం మొదలైంది. చేత్తో తుడిచేసుకునే వాడే కాని, ఒకవేళ ఆమె ఇప్పటిదాకా చూడకపోయుంటే అలా తుడుచుకోవటం ద్వారా దొరికిపోతాడేమోనన్న సంకోచం. ఈ దీనావస్థలో తన మీద తనకు కలిగిన జాలి కన్నీటి ఊటని ఇంకాస్త పెంచింది. మట్టం ఏ క్షణమైనా రెప్పలు దాటి చెంపలమీదకి పొంగేలా ఉంది. అదృష్టంకొద్దీ ఆమె పక్కన కూర్చున్న వాళ్ళు ఏదో అడిగితే అటు తిరిగింది. ఈ కాస్త సందులో తనివితీరా కళ్ళు తుడుచుకున్నాడు. రైలు సందిగ్ధంగా కదిలి, ఆగి, మరలా కదిలింది. చుట్టు ప్రక్కల కిటికీల దగ్గిర వున్న జనాల్లో సందడి పెరిగింది. వీడ్కోలు మాటలు (కొన్ని ఆ క్షణంకోసమని ముందే దాచి పెట్టుకున్నవీ, కొన్ని అప్పటికప్పుడు తట్టినవీ) ముక్కలు ముక్కలుగా వినపడుతున్నాయి: "చేరగానే ఫోన్...", "టాబ్లెట్స్ జాగ్రత్తగా...", "అంకుల్న డిగానని...", "ఏసేహీ కభీ, ఈద్ కా చాంద్...". ఆమె ఏదో ఆశింపుగా కళ్ళలోకి చూస్తుంది. తనకి మాత్రం మాట పెగలడం లేదు. కిటికీ ఊచలమీద ఉన్న ఆమె చేతిపై చేయి వేసి, రైలుతో పాటు నడిచాడు. అంత కదలికలోనూ ఇద్దరి చూపులూ మాత్రం అతుక్కుపోయున్నాయి. రైలు స్పీడు పెరిగింది. వేగంగా నడుస్తున్నాడు. జనాలు అడ్డొస్తున్నారు. తను మాత్రం చేతిపై నుండి చేయి తీయకుండా, నడకా పరుగూ కలిపి తోసుకొస్తున్నాడు... "ఆగిపోరా!" జాలిగా అంది. ఊచలమీంచి చేయి తీసేసి నిలిచిపోయాడు. ఆ పెట్టె మిగతా పెట్టెల్లో కలిసి ముందుకు వెళిపోయింది. ఆమె ఊచలకు మొహం అదిమి పెట్టి తొంగి చూస్తోంది. ఎదర పట్టాలు అతనికి ఎడంగా ఒంపు తిరిగి ఉండటం వల్ల ఆ మలుపులో ఆమె కిటికీ మాయమై పోయింది. కానీ ఊచల మధ్య నుంచి బయటపెట్టిన చేయి మాత్రం ఇంకా తననుద్దేశించి ఊగుతోంది. క్షణం క్రితం తన చేతిలో ఉన్న చేయి, ఇపుడు దూరంగా సంబంధం లేకుండా గాల్లో ఊగుతూ.... ఇదేమన్నా మార్చలేని విధా? తల వొంచి తీరాలా? రైలు స్పీడు ఇంకా అందుబాటులోనే ఉంది. ఉన్నపళంగా పెరిగెట్టి అందిన భోగీలోకి ఎక్కేస్తే. మరి టికెట్...? హూ గివ్సె షిట్! తెగింపు ఓ కొలిక్కి రాక ముందే రైలు వెళ్ళిపోయింది. చివరి భోగీ వెనుక తాపడమై ఉన్న ఎర్రని బల్పు అతని పిచ్చి ఆలోచనల్ని వెక్కిరిస్తున్నట్టు వెలిగి ఆరుతుంది. అతను కాసేపలాగే శిల్పంలాగ నిలబడ్డాడు. నిట్టూర్చి, వెనుదిరిగాడు. ప్లాట్‌ఫాం, అనౌన్సుమెంట్లు, జనం రద్దీ.

0 comments:

మీ మాట...