పదిహేను అధ్యాయాల దాకా ఓపికను ఈడ్చుకుంటూ రాగలిగాను. ఇక భరించలేకపోయాను. మొట్టమొదటి కారణం: మొన్న రాసిన పోస్టులో చెప్పినట్టు రచయిత ప్రపంచాన్ని చూసే తీరుతో నాక్కలిగిన ఇబ్బంది. ఆ ఇబ్బందేంటో చెప్పటానికి ప్రయత్నిస్తాను.
నాకు అల్బెర్ట్ కామూ రచన "స్ట్రేంజర్"లో ఈ రెండు వాక్యాలు బాగా గుర్తుండిపోయాయి, నోటికొచ్చేసాయి కూడా:
"As if that blind rage had washed me clean, rid me of hope, for the first time, in that night alive with signs and stars, I opened myself to the gentle indifference of the world. Finding it so like myself—so like a brother, really—I felt that I had been happy and was happy again."
నాకు ఈ వాక్యాలు (మొదట ఇచ్చిన అమెరికన్ అనువాదంలోనివి) ఎన్నిసార్లు మననం చేసుకున్నా పాతబడవు. విశ్వతత్త్వాన్ని ఎంత సులభంగా వ్యక్తీకరించగలిగాడో కదా అనిపిస్తుంది. ఇందులో కథానాయకుడు మీర్సాల్ట్ తను చేసిన నేరానికి కాక, సమాజం ఏది నేరమనుకుంటుందో దానికి శిక్షకు గురవుతాడు. అంటే, చేసిన హత్యకు కాక, తల్లి అంత్యక్రియల్లో ఏడవనందుకు—లేని బాధ నటించనందుకు—ఉరికంబం ఎక్కుతాడు. ఇక రేపు తనను ఉరి తీయబోతున్నారనగా, జైలు అధికారులు ఆనవాయితీగా అతని సెల్‌కు ఓ క్రైస్తవ ఫాదర్‌ని పంపిస్తారు. అతను మీర్‌సాల్ట్‌ని పశ్చాత్తాప పడమని, దైవ శరణు వేడుకొమ్మని అడుగుతాడు. మీర్సాల్ట్ ఆసక్తి చూపించడు. ఫాదర్ మరీ బలవంతం చేస్తుంటే అతని కాలర్ పట్టుకుని చెడామడా దులిపేస్తాడు. మొండి జైలుగోడల మధ్య ఒంటరితనంలో ప్రపంచం పట్ల ఆనాటి వరకూ కూడగట్టుకుపోయిన ఆక్రోశాన్నంతా వెళ్ళగక్కేస్తాడు. జైలు గార్డులు వచ్చి ఇద్దర్నీ విడదీస్తారు. ఫాదర్ కంటి నిండా నీళ్ళతో వెళిపోతాడు. మీర్సాల్ట్ మళ్ళీ తన జైలు గది నిశ్శబ్దంలో మిగులుతాడు. అప్పుడు పై వాక్యాలు చెప్తాడు (నా అనువాదం):
"ఆ పిచ్చి కోపం నాలోని మలినాలన్నింటినీ కడిగేసి, నా ఆశలు మొత్తం తోడిపారేశాక, నక్షత్రాలూ రాశులతో వెలుగుతున్న ఆ రాత్రిపూట, మొట్టమొదటిసారి, ప్రపంచపు దయాపూరితమైన ఉదాసీనతకి కనులు విప్పాను, అది నాకు నాలాగే కనిపించింది, దానిపట్ల సోదర భావమూ కలిగింది, అప్పుడనిపించింది- నిజానికి నేను ఎప్పుడూ ఆనందంగానే ఉన్నాననీ, ఇప్పుడు కూడా ఆనందంగానే ఉన్నాననీ."
తన కోపం అంతా బయటకు కక్కేయడం వల్ల కలిగిన తేటదనంతో, ఇక ఏ ఆశా మిగలి లేదని అర్థమవగా, నిస్సత్తువగా జైలు గదిలో చప్టా మీద కూలబడతాడు. నక్షత్రపు రాశులతో వెలుగుతున్న ఆ రాత్రిలో మొట్టమొదటిసారి ప్రపంచపు దయాపూరితమైన ఉదాసీనతను చూడగలుగుతాడు, దానికి తనను సమర్పించేసుకుంటాడు. తనలోని ఉదాసీనతే ప్రపంచంలోనూ ప్రతిఫలించగా, మొదటిసారి ప్రపంచంలోని స్నేహశీలతను దర్శిస్తాడు. (నేనిక్కడ "ప్రపంచం" అనే పదాన్ని మనుష్య సమాజంతో, జంతు జనాభాతో, దేశ రాష్ట్ర నైసర్గిక విభజనల్తో వున్న భూమండలాన్ని ఉద్దేశిస్తూ వాడటం లేదు. మొత్తం సృష్టిని ఉద్దేశించి వాడుతున్నాను.)
పై వాక్యాల్లో మనకిప్పుడు కావాల్సిన పదం: "దయాపూరితమైన ఉదాసీనత" (కరుణాత్మక నిర్లిప్తత , Gentle/ benign indifference). నిజంగా సృష్టికి మన పట్ల వుండేది ఉదాసీనతే. దాని వెనక ప్రత్యేకించిన ద్వేషమేమీ ఉండదు, పోల్చుకుంటే దయా కనిపిస్తుందేమో. సృష్టి మనలోని తప్పొప్పుల్ని ఎంచదు, తక్కువ ఎక్కువల్ని తూకం వేయదు, మనల్ని మంచి చెడూగా విడదీయదు, అంచనాలు కట్టదు. అందుకే, "ప్రపంచాన్ని నేను వెలివేస్సాను", లేదా "ప్రపంచం నన్ను వెలివేస్సింది" లాంటి పొజిషన్లలో అర్థం లేదు. అసలది నిన్ను పట్టుక్కూచుంటే కదా, నిన్ను పట్టించుకుంటే కదా.
పైన మీర్సాల్ట్ వాక్యాల్లో ఎవరైనా నిరాశ చూస్తారేమో. నాకైతే అంతులేని ఆశావాదం కనిపిస్తుంది. ఎందుకంటే అంతా కాదు పొమ్మన్న చోట కూడా, సృష్టి పొమ్మనదు. అలా అని అక్కునా చేర్చుకోదు. ముఖ్యంగా, మన మీద తీర్పులివ్వదు. మన చుట్టూ తీర్పులిచ్చి కుళ్ళబొడిచే సమాజానికి ఆవల వుండే నిర్లిప్తమైన ప్రకృతి ఒక భావంగా స్ఫురించినప్పుడు, ఆ స్ఫురణ నుంచి మనలోకి పొంగేది అంతులేని దయే. అంతకన్నా ఓదార్పు ఏముంది, అంతకన్నా ఆశ ఏముంటుంది?
You see, I don't give a damn about Christian "Judgment Day" or Hindu "Karma phalam", or Islamic "Yawm ad-Din". I am not secular either, I am anti-religious. And my God is such a sweet guy to boot. :)
ఇప్పుడు "అనుక్షణికం" గురించి మాట్లాడుతూ ఈ ప్రస్తావన ఎందుకంటే: ప్రకృతి మనపై చూపించే ఇలాంటి దయాపూరితమైన ఉదాసీనతే రచయిత కూడా తన పాత్రల పట్ల చూపించాలని నేననుకుంటాను. కనీసం అలా చూపించగలిగిన రచనల్ని ఎక్కువ ఇష్టపడతాను. ఇక్కడే వడ్డెర చండీదాస్ ధోరణి నాకు దగ్గరగా అనిపించ లేదు. "అనుక్షణికం" నవల మొత్తం ద్వేషంతో కూడిన సణుగుడులా అనిపించింది. నవలలో మంచి చెడులకు మధ్య గుడ్డి విభజనలు, తప్పొప్పుల మధ్య మొండి గీతలూ కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. పాత్రల్ని ఏదో ఒక మితిమీరిన ధోరణి వైపుకి నెట్టేయడం కనిపిస్తుంది. అలా నెట్టివేస్తున్న రచయిత చేయి స్పష్టంగా, ఎబ్బెట్టుగా బయటపడిపోతుంది. ఉదాహరణకి రవి అనే అబ్బాయి తన ప్రేమను నిర్లక్ష్యం చేస్తుండటంపై నళిని అనే అమ్మాయి స్నానం చేస్తూ చెప్పుకునే స్వగతం ఇది:
"— లక్ష్మీపుత్రులెందరో నా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాంటే తనేమో బోడి టెక్కూ పోజూ - యేం చూసుకుని - ఆవాళ సినిమా హాల్లో చేతి మీద చెయ్యి వేస్తే, వేళ్ళని వేళ్ళలోకి తీసుకోకుండా రాయిలాగా -నాలాంటి అందగత్తె సుకుమారి ఐశ్వర్యవంతురాలు అంత అవకాశం యిస్తే - తనే ప్రవరాఖ్యుణ్ణనుకున్నాడు కాబోలు - పోనీ చెయ్యి తీసేసుకోనూ లేదు - మాదచ్ఛేత్తనం కాదూ - ఆ రోజు కారోజున హిమాయత్ సాగర్ పిక్నిక్ కెళ్ళినప్పుడు - పెద్ద చదవు వొచ్చనీ అందం వుందనీ టెక్కా, మాట్లాడవేం? అని నా అంతటిది అంటే, మహా యిదిగా పోజుగా నిశ్శబ్దంగా నవ్వి ‘అవి రెండూ నీకు లేవని యెవరన్నారు?’ అని అదోలాగా అంటాడు. నా అందం చూసి చిత్తైపోయి కవిత్వాలు రాసిన వాళ్ళున్నారు. నా దర్శనం కోసం రోజూ పదిసార్లన్నా లేడీస్ వెయిటింగ్‌రూమ్ చుట్టూ ప్రదక్షిణాలు చేసే వాళ్ళున్నారు -యెప్పుడన్నా నూటికీ, కోటికీ ‘నళినీ’ అనేవాడు. ఆప్యాయంగా అనేవాడు. కానీ స్త్రీని గౌరవించలేనివాడు -కానీ ఆ ముఖంలో యేదో అయస్కాంతంలాంటి ఆకర్షణ, నెలవంకలాగా - నూటికీ కోటికీ యెప్పుడన్నా నవ్వే ఆ సన్నని నవ్వు..."
కథని థర్డ్‌పెర్సన్ కథనంలోంచి పాత్ర స్వగతంలోకి తీసుకెళ్తున్నామూ అన్న తేడా తెలియనివ్వకుండా, ఆ స్వగతాల్ని మిగతా వచనంలోకి మెళకువగా ఇమడ్చాల్సింది పోయి, యిలా "అడ్డగీత (—)తో ప్రారంభవైఁన పేరాలన్నీ పరమానస ప్రవేశం [స్వగతం] తాలూకూ భోగట్టా" గా చదువుకోండీ అనడంలో రచయిత దగ్గరున్న పనిముట్టు అంత సున్నితమైనది కాదని అర్థమవుతుంది. అయితే అదంతా క్రాఫ్ట్ విషయం, కాబట్టి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇక్కడీ స్వగతం ఎవరిది? నళినిదా, రచయితదా? దీన్ని రచయితే బలవంతంగా ఆ పాత్ర నోటిలో కూరాడని కొట్టొచ్చినట్టు తెలిసిపోతుంది. రవి "నిశ్శబ్దపు" చిరునవ్వునీ, అతని ముఖంలో "నెలవంక" పోలికనీ అందంగా చూడగలిగిన అమ్మాయి, తానెంత ఇరుకుగా ఆలోచిస్తున్నానో అన్న స్పృహ ఏమాత్రం లేకుండా "నాలాంటి అందగత్తె సుకుమారి ఐశ్వర్యవంతురాలు" అన్నంత గీరగా స్వగతంలోనైనా మాట్లాడుకుంటుందా? దీనికి కారణం ఏమిటంటే "నిశ్శబ్దపు చిరునవ్వు", "నెలవంక" ఇవన్నీ రవి గురించి రచయిత అనుకుంటున్న విషయాలు. అలాగే, "అందగత్తె సుకుమారి ఐశ్వర్యవంతురాలు" కూడా నళిని గురించి రచయిత అనుకుంటున్నవే. రెండూ కలిపి స్వగతం పేరుతో ఆమె నోటిలో కూరేసాడంతే. రాస్తున్నంత సేపూ మనో నేత్రం ముందు రూపుదిద్దుకునే మూర్తుల్లో (objects) లీనం కాగలగటం కవి కుండాల్సిన ముఖ్య లక్షణం. అప్పుడు ఏ తీర్పులూ ఉండవు. చండీదాస్ అలా లీనంకానితనం చాలా చోట్ల తెలిసిపోతుంది. పోనీ స్వగతాల సంగతి వదిలేద్దాం. పాత్రలు నిద్రలో కనే కలల మీద కూడా తన తీర్పులు అదుపులో పెట్టుకోలేదు రచయిత. ఇక్కడ ఓ మంచి పాత్ర కనే కలకీ, ఓ చెడ్డ పాత్ర కనే కలకీ తేడా చూడండి:
అనంత్ రెడ్డి అనే మంచి పాత్ర (నాకు మాత్రం మడ్డి పాత్రనిపించింది) స్వప్నరాగలీన అనే అమ్మాయి గురించి కనే కల ఇది: "మంచురాతి మీద ఆమె బట్టలేకండా కూచుని వుంటుంది గానీ నగ్నంగా కనబడదు. బట్టల్లేనట్లే అనిపించదు - బట్టలూ కనిపించవు. నగ్నత్వమూ కనిపించదు. యెదురుగా అతను నుంచుని దోసిలితో - తన దోసిటి నిండా పూలు - రంగురంగుల పూలు - తన దోసిట్లోంచి ఆమె మీద రాలుతూ వుంటాయి. రాలినపువ్వు రాలినట్లు ఆమె శరీరంలో కలిసిపోతూ వుంటుంది. యెంత సేపో, యెన్ని పూలో, యెంత కలో - కల చివర్న మెలుకువ రాదు - ఆ కలకి చివర లేదు - కల నిద్రలోనే కలిసిపోతుంది."
రామ్మూర్తి అనే చెడ్డ పాత్ర తార అనే అమ్మాయి గురించి కనే కల ఇది: "యెర్రని ముఖమల్ అమర్చిన కుర్చీలో తెల్లగా తను. తన మీద పై నుంచి రంగు రంగుల పుప్పొడి రాలుతోంది. గాజు డైనింగ్ టేబిల్ మీద నీలం పింగాణీ ప్లేట్లో దోరగా వేసిన స్తనాల జంట. వాటి మీద, పై నుంచి పెప్పరూ సాల్టూ రాలుతోంది. సిల్వర్ నైపూ ఫోర్కూ తీసుకున్నాడు. చేతిలోని నైఫ్‌తో వొక స్తనం కోసినట్లుగా గంటు పెట్టగానే, చివ్వున నెత్తురు కండ నోట్లో పడి, గొంతు సల్ఫ్యూరిక్ యాసిడ్ పడినట్లుగా కాలిపోయింది. గిజగిజా వణికిపోతూ, రెండో చేతిలోని ఫోర్క్ రెండో స్తనంలోకి గుచ్చగానే చివ్వున పాలధారలు కళ్ళలో యెగసి, జిల్లేడు పాలలా కనుచూపు పోయింది. గట్టిగా రెప్పలు మూసుకుని వొణుకుతూ గిలగిలా కొట్టుకుంటున్నట్లుగా అటుయిటూ కదిలిన కాసేపటికి, చూపు కనిపించి, గొంతు మంటపోయి దిగ్గున లేస్తాడు."
అంటే దీన్ని బట్టి, మంచి వాళ్ళ కలలు అంత లాలిత్యంతోనూ, చెడ్డవాళ్ళ కలలు ఇంత బీభత్సంగానూ వుంటాయన్నమాట (అసలు మంచివాళ్ళు చెడ్డవాళ్ళూ అని వేర్వేరుగా వుంటారా అన్న సంగతి పక్కనపెడితే). ఏ ఫ్రాయిడియన్ చెత్త దీనికి ఆధారమో నాకు అర్థం కాలేదు. రచయిత కేవలం తన ఊహాశక్తి ఎంత వంకర పోగలదో పరీక్షించుకుంటున్నట్టనిపించింది. మంచీ చెడూ అంటూ ఇంత మూఢ విభజన వున్న పాత్రలు గల నవల ఇక వాస్తవికతను ఏ స్థాయిలోనైనా ఎలా ప్రతిబింబించగలదు. అంతోసిదానికి verisimilitude కోసం అంత వృథా ప్రయత్నం ఎందుకు?
ఒక రచయిత తన నవలకి ఉద్దేశించిన నిర్మాణం కథాకథనాల కండరపుష్టి వెనుక అస్థిపంజరపు అల్లికలా అంతర్లీనంగా నక్కి వుండాలి. అంతేగానీ నిర్మాణాంశాలన్నీ చదివేవాడికి బయటకే కనపడిపోకూడదు. ఇంకో పోలికతో చెప్పాలంటే- పాట వింటున్నప్పుడు రాగంలో లీనమైపోయేట్టుండాలి కానీ, పాటకట్టేవాడు ఎక్కడ ఏ వాయిద్యం వాడుతున్నాడూ అన్న స్పృహ శ్రోతకి కలగక కూడదు. "అనుక్షణికం" చదువుతున్నంత సేపూ రచయిత వాడుతున్న ప్రతీ నిర్మాణాంశం తేటతెల్లమైపోతూ నన్ను కథలో ఓ పట్టాన లీనం కానీయలేదు. ఓ చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే పాత్రల మేనరిజాలు:
స్వప్న రాగలీన ఎప్పుడూ "సెలయేటి జాలులో ఇసుకలో గులకరాళ్ళు కొట్టుకున్న మెత్తని సవ్వడి"తో నవ్వుతూంటుంది. ఇలా దాదాపు నాలగైదు సార్లు నవ్వింది ఈ పదిహేను అధ్యాయాల్లోనూ. ఒక చోటైతే "ఫక్కున నీటిబుడగ చిట్లినట్టు" కూడా నవ్వేయగలిగింది. రవి ఎప్పుడూ అర చేత్తో గెడ్డం కొస రుద్దుకుంటుంటాడు. శ్రీపతి ఎప్పుడూ చూపుడు వేలి కణుపు కొసతో పెదవి నొక్కుకుంటుంటాడు. ఇవన్నీ పాఠకుని దృష్టికి రాకుండా పోవలసిన విషయాలు. అయినా మేనరిజాల వాడకంలో కాస్త జాగ్రత్త, విచక్షణా వుండాలంటాడు నబొకొవ్. ఓ పాత్రకి నత్తి యిస్తే అతను ప్రతీ సన్నివేశంలో నట్టుతున్నట్టు చూపించినా పర్లేదు; కానీ ఓ పాత్రకి పెంపుడు కుక్క యిస్తే ఇక ప్రతీ సన్నివేశంలోనూ అతను ఆ పెంపుడుకుక్కతోనే ప్రత్యక్షం కానక్కర్లేదు. అది కృతకంగా వుంటుంది.
అలాగే చదవగా చదవగా ఇందులో సెక్స్ కూడా అవసరాన్ని మించి వుందనిపించింది. అది ఒక్కోసారి ప్రిఆక్యుపేషన్లాగా కూడా అనిపిస్తుంది. దానికి గజ్జల్లో కదలిక తెప్పించడమే తప్ప మరో ప్రయోజనం వున్నట్టైతే నాకనిపించలేదు.
ఇక నేను ముందు అనుకున్నట్టు ఇందులో తండ్రి పాత్రలు కార్డ్బోర్డ్ పాత్రలేమీ కాదు. దరిమిలా అన్నీ ఒక్కొక్కటిగా కథలోకి వస్తున్నాయి. అలాగే నవలకు బొత్తిగా ఓ నిర్మాణం లేకుండానూ పోలేదు. కథనం ఓ పాత్ర నుండి మరో పాత్రకు లంకె వేసుకుంటూ నడుస్తుంది. అంటే, మొదట కథనం ఓ పాత్రను అనుసరిస్తుంది; ఈ పాత్ర మరో పాత్రను కలిసినపుడు కథనం మొదటి పాత్రను వదిలేసి ఈ రెండో పాత్రను అనుసరిస్తుంది; ఈ రెండో పాత్ర మరో పాత్రని కలిస్తే అప్పుడు కథనం మళ్ళీ ఈ మూడో పాత్రను తగులుకుంటుంది. ఒక్కోసారి పాత్రకూ పాత్రకూ పరిచయం లేకపోయినా కూడా ఇలా లంకె పడటం జరుగుతుంది. ఉదాహరణకు శ్రీపతి ఓ చోట వేరే పాత్రని ఇంటి దగ్గర కలసి మాట్లాడి బయల్దేరతాడు; బస్టాపులో బస్సెక్కుతాడు:
"చార్మినార్‌కా కోఠీకా - అనుకుంటూ పరికించి చూశాడు బోర్డు. వయా కోఠీ అమీర్‌పేట. ఖాళీగానే వుంది. కూచున్నాడు. శ్రీపతి కూచున్న సీటుకి వెనక సీట్లో వెంకటావధాని కూచుని వున్నాడు. టిక్కెట్‌తో పాటు చిల్లర తీసుకుంటూవుంటే వో బిళ్ళ కిందపడి ముందుకు దొర్లి శ్రీపతి కాళ్ళ దగ్గర ఆగింది. శ్రీపతి వొంగి, తీసి, వెనక్కి తిరిగి యిచ్చాడు. `థాంక్యూ సార్' అన్నాడు వెంకటావధాని. వొకరి కొకరు తెలియదు. బస్సు యెంత వేగంగా వెడుతున్నా యెంతో నిదానంగా వెడుతూన్నట్లనిపిస్తుంది వెంకటావధానికి."
-- ఇక ఇక్కడి నుంచీ కథనం మళ్ళీ శ్రీపతిని వదిలి వెంకటావధానితో నడుస్తుంది. అయితే మధ్యలో రచయితే చొరబడి "వొకరి కొకరు తెలియదు" అని చెప్పడంలోనే తెలుస్తుంది, ఈ కంగాళీ నిర్మాణం పాఠకుణ్ణి అయోమయ పరుస్తుందన్న అనుమానం బహుశా రచయితకూ ఉందని. ఎందుకంటే పాఠకుడు అక్కడి దాకా కథను సరిగ్గా అనుసరించగలిగితే, వాళ్ళిద్దరికీ పరిచయం లేదన్న సంగతి రచయిత చెప్పకపోయినా తెలుస్తుంది.
మామూలుగా ఏ మంచి నవల్లో అయినా ముఖ్య పాత్రలు మనముందుకు రాగానే రచయిత ఆ పాత్ర పూర్వాపరాలన్నీ ఒకేసారి ఏకరువు పెట్టేయడు. సందర్భవశాత్తూ బయటపెడ్తూ ఉంటాడు. కానీ "అనుక్షణికం"లో ఇలా పాత్ర నుండి పాత్రకు లంకె వేసుకుంటూ పోయే ఈ నిర్మాణం వల్ల, లంకె పడినప్పుడల్లా కొత్త పాత్ర పుట్టుపూర్వోత్తరాలన్నీ ఏకరువు పెట్టాల్సి వచ్చింది. అయితే పాత్రలు లెక్కకు మిక్కిలి వుండటం వల్ల ఈ వివరాలేమీ పాఠకుని మెదళ్ళో ఓ పట్టాన నమోదు కావు. ఫలితంగా ఎవరు ఎవరో ఏం జరుగుతుందో అంతా గందరగోళంగా వుంటుంది. అసలు నాకు ఈ లంకె లేసుకుంటూ పోయే నిర్మాణం పెద్ద గొప్పగా కూడా అనిపించలేదు కూడా. కాలేజీలో కంప్యూటర్ క్లాసులో మాచేత ఫ్లోచార్టులు గీయించేవారు. ఒక పనిని మొదలుపెట్టి పూర్తి చేసేవరకూ గల క్రమాన్ని, దశల్నీ, రక రకాల సంభావనీయతల్నీ ఊహిస్తూ, వాటిని వేర్వేరు ఆకారాలుండే బాక్సుల్తో సూచిస్తూ, ఈ ఫ్లోచార్టుల్ని గీస్తారు. (మా కంప్యూటర్ క్లాసు మొత్తానికి నాకు కాస్త అర్థమైంది [నేను అర్థం చేసుకుంది] ఇది ఒక్కటే.) ఈ నవల నిర్మాణానికి సృజనాత్మకత పెద్దగా ఏమీ అవసరం లేదు; ఇలాంటి ఫ్లోచార్టులు గీయడం వస్తే చాలు.
వడ్డెర చండీదాస్ దరిమిలా ఆంగ్లంలో ఏదో తత్త్వశాస్త్ర గ్రంథం రాశారని, ఆయన అంతకుమునుపు రాసిన కాల్పనిక సాహిత్యమంతా ఈ తాత్త్విక గ్రంథానికి పుట్‌నోట్సులాంటిది మాత్రమేననీ ఎక్కడో చదివాను. బహుశా తేడా అక్కడ జరిగుంటుంది. సాహిత్యం దేనికీ పుట్‌నోట్సు కాదు. కథ చెప్పడం రచయిత లక్ష్యం అనుకున్నపుడు, దాని వస్తువు తత్త్వశాస్త్ర సంబంధమైనా, మనస్తత్త్వశాస్త్ర సంబంధమైనా అవే ఆ కథకి పుట్‌నోట్స్‌గా వుండాలి. చాలామంది దగ్గర ఓ తప్పుడు అభిప్రాయం చూస్తాను. రచయితలకు ఫిలాసఫీ, సైకాలజీలు తెలియడం చాలాముఖ్యమని అంటుంటారు; కాన్సెప్టులంటుంటారు, ఐడియాలంటుంటారు. రచయితకు ప్రాథమికంగా కథ చెప్పడం తెలియాలి. అది సరిగ్గా తెలిస్తే అతను చెప్పే కథ texture లోనే మిగతావన్నీ విడదీసి చూపించలేనంతగా ఇమిడిపోతాయి. ఉదాహరణకి, ప్రపంచం గురించి చెప్పటానికి చలం దగ్గర చండీదాస్ కంటే మించిన తత్త్వమే ఉంది. కానీ కథ చెప్పటానికి కూర్చున్నప్పుడు కథే చెప్పాడు. అందులో కథ ఎంత మేరకు అనుమతిస్తే అంత మాత్రమే తత్త్వం/ దృక్పథం వచ్చి ఇమిడింది. సాహిత్యాన్ని దేనికో పుట్‌నోట్సుగా ఉపయోగించుకోవాలని చూడలేదు. వడ్డెర చండీదాస్ గొప్ప తాత్త్వికుడో మరోటో కావచ్చు. అది నేను నిర్ణయించలేను. కానీ అతను మంచి కథకుడు మాత్రం కాదనటానికి "అనుక్షణికం" ఒక ఋజువు.