December 1, 2010

ప్రేమాయణం

తమసా తీరాన మన క్రౌంచ మిథునంలో నీ జోడు నేనయి,
బాణం దూసి బంధాన్ని హరించిన కిరాతకమూ నేనే అయి,
ధూళిధూసరిత విగతజీవం చుట్టూ రెక్కలల్లారుస్తున్న నీ శోకానికి
చలించి కన్నీటి శ్లోకాన్ని స్ఖలించిన కారుణ్యమూ నేనే అయితే,
మిగిలిపోయిన ప్రియతమా, ఫలితం అనాథ ప్రేమాయణం.
.

October 5, 2010

ఆకు పోక తమలపాకు...

నిత్యం రద్దీగా వుండే ఆ పుట్‌పాత్ మీద రోజూలాగే ఆ అబ్బాయి పరాగ్గా తన గమ్యం వైపు నడుస్తున్నాడు. రోడ్డు మీద పగటికలలు కనే తన అలవాటు జగద్విదితమని అతను రహస్యంగా నమ్ముతుంటాడు. అందుకే తనకు అడ్డురాకుండా, గుద్దుకోకుండా అప్రమత్తంగా నడిచే బాధ్యతను యితర పాదచారులకే వదిలిపెడ్తూంటాడు. అయితే ఇప్పుడు అతనికభిముఖంగా వస్తున్న అమ్మాయికి ఈ సంగతేమీ తెలియకపోవడమో, లేదా ఆమెదీ అదే తరహా పరధ్యానమో గానీ... తిన్నగా నడుచుకుంటూ వచ్చేస్తోంది. చివరిక్షణంలో ఆమెను గమనించేసరికే సమయం మించిపోయింది. ఉన్నపళాన ఆమెను డీకొన్నాడు. తల బొప్పికట్టినంత నొప్పి పుట్టింది. "సారీ" గొణిగి తల రుద్దుకుంటూ వెళిపోయాడు. ఆమె వైపు నుంచి కూడా ఒక "సారీ" వినిపించింది. నాలుగడుగులు నడిచేసరికి మళ్ళీ పగటికలల్లోకి జారిపోయాడు.

కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి మరలా అలాంటి ప్రమాదానికే గురవబోయి తృటిలో తప్పించుకున్నాడు. ఈసారి అవతలి వ్యక్తిని డీకొనడం ఇక తథ్యం అనగా, స్పృహలోకొచ్చాడు. పాదాలు బ్రేకు వేసినట్టు నేలకి అతుక్కుపోయాయి. శరీరం ఎదుటి అమ్మాయి మీదకి తూలిపడబోయినా, ప్రయత్నం మీద నిలదొక్కుకున్నాడు. తెప్పరిల్లి చూసేసరికి తనకు తెలియని అమ్మాయి సమక్షంలో చాలా దగ్గరగా వున్నట్టు గ్రహించాడు. ప్రక్కకు తొలగి వెళిపోయే అవకాశం ఆమెకే ఇవ్వాలని అలాగే వుండిపోయాడు. ఆమె కూడా అతనే తొలగి దారిస్తాడన్నట్టు అలాగే వుండిపోయింది. ఇద్దరూ ఎదురుబొదురు పాతుకుపోయినట్టుగా రెండుమూడు ఇబ్బందికరమైన క్షణాలు గడిపారు. చివరకు ఆమే తప్పుకుని తన దారిన వెళిపోయింది. అతని భ్రమో నిజమో తెలియదు, ఆమె విసుగ్గా మొహం పెట్టినట్టు తోచింది. కాసేపు తన మీద తనకే చిరాకు వేసింది.

ఎప్పుడూ ఏదో ఒక గమ్యం చేరుకోవాలనే అసహనంతో వుండే నగరజీవులు భౌతికంగా రోడ్ల మీద వుంటారే గానీ, మానసికంగా వుండరు. కాబట్టి అడపాదడపా ఒకరి తోవకు మరొకరు అడ్డుపడటాలూ, గుద్దుకోవడాలు సాధారణమే. కొన్ని రోజులు గడిచిం తర్వాత, ఆ అబ్బాయికి ఈ మాదిరి సంఘటనే మరోమారు పునరావృతమయ్యింది. దాదాపు ఎదుటి వ్యక్తిని గుద్దుకోబోయి చివరిక్షణంలో ఆగాడు. ఆమె కూడా కష్టం మీద నిలదొక్కుకుంది. రెండు మూడు సందిగ్ధ క్షణాలు గడిచాయి. ఆమె కాలి గోళ్ళకు కాషాయంలోకి వెలసిపోయిన గోరింటాకూ, భుజాన హాండ్‌బాగూ, వంటి మీద చింతపిక్కరంగు కలంకారీ అల్లికతో వున్న పసుపురంగు కాటన్ చుడీదారూ, అతని చైతన్యంలోకి చొరబడ్డాయి. ఆమెకు దారివ్వాలని తనే ప్రక్కకు తొలిగాడు. అయితే అదే సమయానికి ఆమె కూడా అతనికి దారివ్వాలని ప్రక్కకు తొలిగింది. మళ్ళీ ఇద్దరూ అభిముఖమయ్యారు. మళ్ళీ ప్రక్కకు తొలిగారు. మళ్ళీ అభిముఖమయ్యారు. పైన గాలిలో ఏదో కనపడని కొక్కేన్నించీ వ్రేలాడుతున్న లోలకపు అంచులా ఆ జంట అలా ఒకట్రెండుసార్లు ఊగిసలాడి ఆగారు. ఇందంతా యాదృచ్ఛికమనుకోకుండా ఆ అమ్మాయి తనకేదైనా కుటిలోద్దేశ్యాన్నిఆపాదిస్తుందేమోనని గాభరాపడ్డాడు. ఆమె ముఖంలోకి చూసాడు. కానీ అక్కడ దృశ్యం భిన్నంగా వుంది. సమ్మోహనంగా కూడా వుంది. ఇంతటి ప్రహసనాన్ని భరించడం ఇక తన వల్ల కానట్టూ ఆ అమ్మాయి ఫక్కున నవ్వేసింది. అబ్బాయి కూడా తేలికపడి నవ్వాడు. ఆమె ఎయిరిండియా మహారాజాను అనుకరిస్తూ, వినమ్రతను అభినయిస్తూ, మీరే వెళ్ళండి అన్నట్టు చేయి చూపించింది. ఆమెను దాటి వెళ్లిపోయింతర్వాత కూడా చాలాసేపు అతని పెదవులపై చిరునవ్వు అలానే వుంది.

నగరజీవుల మధ్య ప్రేమలు చిత్రాతిచిత్రమైన రీతుల్లో పుట్టడం సాధారణాతిసాధారణం. మరుసటి రోజు నుంచి ఇద్దరూ పుట్‌పాత్ మీద తారసపడినపుడు ఒకరినొకరు గుర్తించడం ప్రారంభించారు. చిరునవ్వులు చూస్తూచూస్తుండగానే పొడి పలకరింపుల్లోకి దినదినాభివృద్ధి చెందాయి. రోజూ వచ్చే సమయానికి ఆ అమ్మాయి హాండ్‌బాగ్‌తో వీధి మలుపు తిరగకపోతే అతను తన నడక వేగాన్ని నాటకీయంగా కుదించేవాడు. ఇంకా ఆలస్యమైతే ఆ పుట్‌పాత్ మీది బిచ్చగాళ్ళకూ, సిగరెట్‌ బడ్డీల వాళ్ళకూ అతని రూపేణా లాభసాటి బేరం తగిలేది. ఇలా కొన్ని రోజులు గడిచాకా, ఒకసారి అనుకోకుండా ఇద్దరూ ఓ బేకరీలో తారసపడ్డారు. అక్కడ వాళ్ళ సంభాషణ పేర్ల మార్పిడితో మొదలై, ఫోన్‌నెంబర్ల మార్పిడితో ముగిసింది. మనసుకూ మనసుకూ మధ్య మాటల వారధి మొదలైంది. సాయంత్రాలు పార్కు బెంచీల మీద గడుస్తున్నట్టు తెలియకుండానే గడిచిపోతున్నాయి. ఇటుక మీద ఇటుకేసి ఇల్లు కట్టినట్టు బంధం దృఢతరం కానారంభించింది. వాళ్లకర్థమయ్యే లోపునే వాళ్ళు ఒకరికొకరుగా మారిపోయారు.

ఒక రాత్రి ఆమెను హాస్టల్ దగ్గర దింపి సంతృప్త మనస్కుడై తన గదికి నడిచి వస్తున్నాడు. జీవితంలోని అయోమయాలన్నీ విశదమైన భద్రభావన. ఎందుకో తామిరువురి తొలి కలయికనూ జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. ఆమె నవ్వూ, పసుపురంగు చుడీదారూ, తనను వెళ్ళమన్నట్టు నాటకీయంగా చేయి చూపించడం... అతనికి నవ్వొచ్చింది. వీటితోపాటే హఠాత్తుగా మరో రెండు దృశ్యాలు గుర్తొచ్చాయి. తాను అంతకుముందెపుడో రెండు సందర్భాల్లో ఇలానే ఇద్దరమ్మాయిల్ని డీకొనబోయాడు. అప్పట్నించీ వాళ్ల సంగతి మరలా గుర్తు రావడం ఇదే మొదటిసారి. అతనింకా తమ బంధపు మూలాలపై విశ్వాసాన్ని ప్రోదిచేసుకుంటున్న మానసికావస్థలోనే వున్నాడు. ఆ ఆవశ్యకత అతని ఆలోచనల్ని ఏవేవో నిర్హేతుకమైన మూలలకు మళ్ళిస్తోంది. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరితో తను ఎందుకు ప్రేమలో పడలేదు? ఈ అమ్మాయితోనే ఎందుకు ప్రేమలో పడ్డాడు? ఆ సందర్భాల్లో ఇద్దరమ్మాయిల ప్రతిస్పందనల్ని బట్టి వాళ్ల వ్యక్తిత్వాలు చూచాయగా అంచనావేశాడు. వాళ్లలో మొదటి అమ్మాయి తనలాగా మూగ స్వాప్నికురాలే కావచ్చు. ఒక జంటలో ఇద్దరిదీ ఒకే తరహా వ్యక్తిత్వాలవడం మంచిది కాదంటారు. రెండో అమ్మాయి తనకంటూ ఒక మానసిక ప్రపంచమే లేని డొల్లపదార్థంలా కన్పించింది. అలాంటి వాళ్ళు నడిచే పీడకలల్లా భయపెడ్తారు. కేవలం మూడో అమ్మాయే కాసిని కలలూ, కాసిని నవ్వుల్తో తన జీవితాన్ని పరిపూర్ణవృత్తంగా మార్చగల అమ్మాయి. అందుకే తను ఆమెతో ప్రేమలో పడ్డాడు. దొరికింది కదాని ఈ అమ్మాయిని ప్రేమించటం లేదు. తానీ అమ్మాయిని ఎన్నుకున్నాడు. ఈ అమ్మాయి తనని ఎన్నుకుంది. తామిరువురి వ్యక్తిత్వాలూ ఒకే యంత్రపు పళ్లచక్రాల్లా అచ్చంగా అమిరాయి. ఇంకా చెప్పాలంటే ఈ అమ్మాయిని సృష్టి తనకోసం కేటాయించింది. ఇరువురికీ రాసిపెట్టివుంది. ఇలా ఆలోచించగా, తనని ప్రేమలో పడేయడంలో సృష్టి ఓ క్రమబద్దమైన పద్ధతిని అనుసరించినట్టు తోచి ఎక్కడలేని సంతోషం కలిగింది. చుక్కలు పొదిగివున్న ఆకాశం వైపు తలెత్తి చూస్తూ, కృతజ్ఞతా సూచకంగా గుండెపై పిడికిలి తాకించాడు, ఆ పిడికిల్ని పెదాలకు ఆన్చి ముద్దు పెట్టుకున్నాడు.

పైన దేవలోకంలో అతని ఆలనాపాలనా చూసుకునేందుకు నియమించబడిన దేవతకు ఈ కృతజ్ఞత అందింది. అతణ్ణించి కృతజ్ఞతల్ని అరుదుగా మాత్రమే ఆశించటానికి అలవాటుపడిన ఆ దేవత, చాలా సంతోషించింది. ఆ వేళ ఇరుగుపొరుగు దేవతలందరికీ ఈ సంగతి చెప్పుకుని మురిసింది. వాళ్ళలో ఒకరు స్వయానా ఆ అబ్బాయి ప్రేయసి తాలూకూ దేవత. విషయమంతా విన్న తరువాత ఆ దేవత యిలా అంది: "కానీ అతను మూడుసార్లు కలుసుకున్నదీ ఈ అమ్మాయినే. మొదటి రెండుసార్లూ సరిగా చూడలేదంతే!"
.

July 28, 2010

“కాఫ్కాయెస్క్‌”ని ఆవిష్కరించే ఒక వాక్యం

కాఫ్కా డైరీలు చదవడమంటే రచనా వ్యాసంగపు మౌలిక వాస్తవికతను ఆవాహన చేసుకోవడం, ఎటో కొట్టుకు పోకుండా కాళ్ళు భూమ్మీద ఆనించి నిలబడగలగటం. ఈ వాక్యం “వివరణ కావాలోయ్!” అని బాహటంగా గగ్గోలు పెడుతున్నట్టుంది, మన్నించక తప్పదు. రచయిత సమూహంలోని మనిషే; కానీ ఆ సమూహంలో తారాడే పలు ప్రాపంచిక ప్రకంపనాల్తో పాటూ అందర్లాగే తనూ ఊగిపోక, తన ఉనికి కోల్పోక, స్వతంత్రంగా నిలబడతాడు. కనీసం కాగితం, కలం పుచ్చుకున్నంతవరకూ అయినా “రచయిత”గా తన ఉనికికి నిబద్ధుడై వుంటాడు. ఆ ప్రకంపనాలకు తన అంతరంగపు ప్రతికంపనాల్ని నిర్మమత్వంతో స్వీకరించి, తిరిగి కళాత్మకంగా ప్రకటిస్తాడు. ఇది రచనా వ్యాసంగానికి ఆదర్శ స్థితి. అయితే ఒక్కోసారి, రచయిత వ్యక్తిగత జీవితపు ఒడిదుడుకులో వెంపర్లాటలో, “రచయిత” అనే సామాజిక స్థానం అదనంగా తెచ్చే రొదో అతని కళ్ళకు గంతలు కట్టేయడం వల్ల, ఈ “కాగితం, కలాల” మౌలిక వాస్తవికత అతనికందకుండా పోవచ్చు. అలాంటి అంధకారం నుంచి మళ్ళీ వెలుగు బాట పట్టించగలిగే దిక్సూచీ కాఫ్కా డైరీలు. వీటిలో ఏ పది పేజీలు తీసి చదివినా, మళ్ళీ కాళ్ళు భూమ్మీదకొచ్చి ఆనుతాయి. రచయితకు రాయడం తప్ప మరేదీ లెక్కలోకి రాదని గ్రహిస్తాం.

నిన్న మళ్ళీ చదవటం మొదలుపెట్టాను. పూర్తి చేద్దామని కాదు. డైరీల్ని మొదల్నించి కడదాకా చదవాల్సిన అవసరమేముంటుంది. ఊరికే తోచినంతదాకా చదవడం, పైన సూచించిన లాభాన్ని సంగ్రహించి పక్కనపెట్టేయటం… అంతే! నిన్నటి పఠనంలో ఈ క్రింది వాక్యం ఆకట్టుకుంది:

There were times when I had nothing else inside me except reproaches driven by rage, so that, although physically well, I would hold on to strangers in the street because the reproaches inside me tossed from side to side like water in a basin that was being carried rapidly.
— Sunday 19th July 1910

1910వ సంవత్సరంలో కాఫ్కా రాసుకున్న డైరీ తొలి పేజీల్లో, మామూలు దినచర్యతోపాటూ, ఒక సుదీర్ఘమైన రచనాభ్యాసం కూడా వుంటుంది. చదవటానికి ఇది కూడా మామూలు డైరీ రాతే అనిపించేట్టు మొదలవుతుంది. తన బాల్య విద్యాభ్యాసం తనని ఎలా పాడు చేసిందో విశ్లేషించుకుంటున్నట్టు ఒక పేరా వుంటుంది. తర్వాత అదే పేరా, తడవ తడవకీ మార్పులూ చేర్పులతో పరిమాణం పెంచుకుంటూ పోయి, ఆరుసార్లు రాసి వుంటుంది. అలాగే పోనుపోనూ అది కాఫ్కా నిజ జీవిత వృత్తాంతంగా కాక, ఒక కాల్పనిక పాత్ర రాస్తున్న కాల్పనిక వృత్తాంతంగా మారిపోతుంది. నేను పైన ఇచ్చిన వాక్యం అందులోదే.

తనను తనకు కాకుండా చేయబోయిన విద్యార్థి దశని బాగా నిరసించిన సమయాలు చాలా వుండేవని చెపుతూ నేరేటర్ ఈ మాటలంటాడు. “అప్పట్లో నా లోపల వేరే ఏమీ వుండేది కాదు కోపంతో తన్నుకొచ్చే ఆక్షేపణలు తప్ప…” అంటూ మొదలైన వాక్యంలో ఈ తొలి సగమూ సాధారణమైనదే. కానీ దాని కొనసాగింపు మాత్రం కాఫ్కా నుంచి మాత్రమే ఊహించగలిగేది: “…దాంతో, శారీరకంగా బాగానే వున్నా, నేను వీధిలోని అపరిచితుల్ని ఆసరాకి పట్టుకునేవాణ్ణి, ఎందుకంటే నా లోపలి ఆక్షేపణలు, వేగంగా పట్టికెళ్తూన్న ఒక పాత్రలోని నీళ్ళకు మల్లే, అటూ ఇటూ విసిరికొట్టబడేవి”. బయటకు కక్కలేని ఏవో ఆక్షేపణలతో లోపల్లోపలే సతమతమయ్యే వ్యక్తులు చాలామంది వుంటారు. కానీ వాటి వల్ల శరీరాన్ని నిలదొక్కుకోలేక వీధిలో జనాన్ని ఆసరాకి పట్టుకునే వాళ్ళెవరుంటారు? ఇదే సాహిత్యానికి కాఫ్కా ధైర్యంగా అందించిన ఆవిష్కరణ. ఇక్కడ కాఫ్కా “ఆక్షేపణ” అనే ఒక అమూర్త భావానికి “శరీరాన్ని నిలదొక్కుకోలేకపోవట”మనే భౌతిక పర్యవసానాన్ని ఇస్తున్నాడు. ఈ ధోరణిని కాఫ్కా కళకు ఆయువుపట్టుగా చెప్పుకోవచ్చు.

కాఫ్కా రచనల్లో ప్రసిద్ధ కథ “ద మెటమార్ఫొసిస్“లో ముఖ్యపాత్ర గ్రెగర్ జమ్‌జా ఒక ఉదయాన నిద్ర లేవగానే బొద్దింకగా మారిపోయి వుంటాడు. అతని జీవితంలో పేరుకుపోయిన అభద్రతా భావన అతణ్ణి బొద్దింకగా మారిపోయేలా చేస్తుంది. చివరకు సొంత కుటుంబం చేతుల్లోనే హత్యకు గురవుతాడు. ఇలాంటి గతే కాఫ్కా ప్రసిద్ధ నవల “ద ట్రయిల్“లోని ముఖ్యపాత్ర జోసెఫ్.కె కీ పడుతుంది. అపరాధ భావన వల్ల, తన నేరమేమిటో తెలియకుండానే దాన్ని అంగీకరించి కోర్టుల చుట్టూ తిరుగుతాడు. చివరకు తెలుసుకోకుండానే, శిక్ష రూపేణా గొంతుకోసి హత్య చేయబడతాడు. సదరు పాత్రల్లోని ఈ అభద్రతా భావనలూ, అపరాధ భావనల ఉనికిని కాఫ్కా ఎక్కడా స్పష్టంగా తేల్చి చెప్పడు. వాటి పర్యవసానాల వల్లనే వాటి ఉనికికి ఋజువులు లీలగా మన ఊహకు అందుతాయి. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే: నిజానికి ఈ ఇన్‌సెక్యూరిటీ, గిల్ట్ భావనలకు మూలాలు ఆయా పాత్రల్లో లేవు, వాటి సృష్టికర్తలో — కాఫ్కాలో వున్నాయి. పర్యవసానాల్ని మాత్రం ఆ పాత్రలు అనుభవించాయి. విషయమంతా ఇంత తేలిగ్గా తేలిపోయేదే అయివుంటే, మనం కాఫ్కాని ఒక కళాకారునిగా పెద్ద లెక్క చేయనవసరం లేదు. రూపులేని తన లోపలి భయాలకు, రూపమున్న పర్యవసానాల్ని ఊహించి సృజించిన రచయితగా తీసిపాడేయవచ్చు. ప్రముఖ విమర్శకుడు ఎడ్మండ్‌ విల్సన్‌లాగా కాఫ్కా కళ అంతా “ఒక తొక్కివేయబడ్డ వ్యక్తిత్వం వెళ్లగక్కిన సగం సగం రొప్పుళ్ళు” మాత్రమేనని తీర్మానించేయచ్చు. అందుకే, రచనల్ని “విధానం” కోసం గాక “వస్తువు” కోసం చదివే పాఠకులకు కాఫ్కా ఏమీ ఇవ్వలేడు. మహా అయితే కాస్త అబ్బురపాటు కలిగించగలడు. అది కూడా అనుమానమే; దరిమిలా అదే మూసలో ఎన్నో పోస్ట్ మోడర్న్ తైతక్కలకి అలవాటు పడిన ఈ తరం పాఠకులకు ఆ అబ్బురపాటు కూడా మిగలకపోవచ్చు.

అలాగాక, కాఫ్కాని కాఫ్కాలాగే స్వీకరిస్తూ సంపూర్ణ పఠనానందాన్ని పొందాలనుకుంటే ఒకటే దారి వుంది. ముందు ఆ రచనల్లో వస్తువేమిటీ, ఆ వస్తువుకు ప్రతీకాత్మక అర్థమేమిటీ, అలాంటి వస్తువుకూ దాని రచయితకూ (రచనకు బాహ్యంగా) వుండగల సంబంధమేమై వుండొచ్చూ — అన్న విషయాల్ని వదిలేయాలి. కేవలం ఆ రచనల్లోని కాల్పనికప్రపంచాలు ఏ స్పష్టతతో మన చుట్టూ అల్లుకుంటాయో ఆ తీరుని మాత్రం ఆస్వాదించగలగాలి. అపుడే కళాకారునిగా అతను పూర్తిగా అవగతమవుతాడు. మరలా దీనికి పై వాక్యాన్నే ఉదాహరణగా తీసుకోవచ్చు. అక్కడ నేరేటర్ తన “లోపలి ఆక్షేపణల” తాకిడికి శరీరాన్ని సంబాళించుకోలేకపోవడమన్న వింత పాఠకుల్లో కాసేపు అబ్బురపాటునూ, అపనమ్మకాన్నీ కలిగించవచ్చు. అయితే ఆ వాక్యంలో పట్టించుకోవాల్సింది అది కాదు. దాని అసలు కేంద్రం వేరే వుంది. అక్కడ సంభవిస్తున్న ఈ వింతను ఏదో మామూలు విషయమన్నట్టూ పక్కనపెట్టేసి, దాన్ని వివరించటానికి ప్రయత్నించకుండా, మన ఆశ్చర్యార్థకపు మొహాల గోడును ఏ మాత్రం పట్టించుకోకుండా, రచయిత ఆ సంభవాన్ని మనకు మరింత స్పష్టపరచడం కోసం ఎన్నుకున్న ఖచ్చితమైన ఉపమానం వుందే (“వేగంగా పట్టికెళ్తూన్న ఒక పాత్రలోని నీళ్ళకు మల్లే”), అదీ ఆ వాక్యానికి అసలు కేంద్రం. ఆ స్పష్టత కాఫ్కాలో అసలు విషయం. ఇలా ఇంత అపనమ్మకం రేకెత్తించే సంభవాన్ని చూపించి కూడా, దాని మీంచి దాని పర్యవసానానికి మన దృష్టి మళ్ళించగలిగే స్పష్టతా; రచనలో కడదాకా అంతర్లీనంగా ఏదో తార్కికమైన కార్యకారణ సంబంధాన్ని కొనసాగించగలిగే నైపుణ్యమూ; ఇంత అసంబద్ధమైన కాల్పనిక ప్రపంచాల్లో కూడా ఏదో నిగూఢమైన అంతిమ సత్యాన్ని స్ఫురింపజేస్తూ, దాన్ని ఎప్పటికీ మనకి అందీఅందని దూరంలోనే వుంచగల కొంటెతనమూ — కాఫ్కాలో మనం ఆస్వాదించాల్సిన అసలు విషయాలు. ఇదీ కాఫ్కా కళకు అసలు కేంద్రం.  పై వాక్యం కాఫ్కా ఇరవయ్యేడేళ్ల వయసులో రాసింది. అప్పటికి ఇంకా ఆయన తన గొప్ప రచనలేమీ చేయలేదు. కానీ మున్ముందు మరింతగా మెరుగులు దిద్దుకుని పూర్తి పరిణతి సాధించబోయే అతని కళ అంతఃతత్త్వమేమిటో డైరీలోని ఈ చిన్ని వాక్యం మచ్చుకు సూచిస్తున్నట్టూ నాకనిపించింది. కాఫ్కా కళ మొత్తానికి స్థూలంగా ఈ వాక్యమొక మంచి తార్కాణమనిపించింది.

పూర్తిభాగం పుస్తకం.నెట్‌లో చదవచ్చు. 

March 27, 2010

కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణశాస్త్రి స్వీయచరిత్ర

స్వీయకథనాల విషయంలో నచ్చడానికీ నచ్చకపోవడానికీ పుస్తకపరమైన కారణాలేం చెప్పలేం. ఎందుకంటే మనకు వాటిలో మిగతా పుస్తకాల్లా ఒక కల్పితప్రపంచం గానీ ఒక ఆలోచనాధార గానీ కనిపించదు, ఒక మనిషి కనిపిస్తాడు. నిజాయితీగా రాసినంతవరకూ, ఆ మనిషిని బట్టే అతని కథనం నచ్చడమూ నచ్చకపోవడమూ జరుగుతుంది. “ఫలానా వ్యక్తి స్వీయకథనం నాకు నచ్చలేదూ” అంటున్నానంటే “ఫలానా వ్యక్తి నాకు నచ్చలేదూ” అంటున్నట్టే అర్థం చేసుకోవచ్చు. 

దువ్వూరి వేంకటరమణశాస్త్రి నాకు నచ్చాడు. ఎందుకు నచ్చాడూ అంటే ఆయన పాతకాలం మనిషి కాబట్టి, పాతకాలం మనుషులకు మాత్రమే పరిమితమైందేదో ఆయనలో వుంది కాబట్టి. ఆ కాలం పట్ల నాకు ఏదో వ్యామోహం వుంది. ఆ “ఏదో” ఏంటో చెప్పమంటే, ఇక్కడ దాని సందర్భౌచిత్యాన్ని మించి వివరణ ఇవ్వాల్సి వస్తుంది. అయినా ప్రయత్నిస్తాను. నేను పుట్టి పెరుగుతున్న ప్రస్తుత కాలంలో దాదాపు ప్రతీ మనిషీ, పైకి ఎంత నిబ్బరంగా కనిపించినా, లోలోపల ఏదో ఒక వైకల్యపు స్పృహ వున్నవాడే. ఈ వైకల్యాలేవీ ఇప్పుడు కొత్తగా పుట్టినవి కాకపోవచ్చు, అనాది నుంచీ వున్నవే కావొచ్చు. కానీ సైకోఅనాలసిస్ అనే పనికిమాలిన శాస్త్రం బాగా విస్తరించింది మాత్రం ఇటీవలి కాలంలోనే. ఇప్పుడు ఏ తరహా మనస్తత్వాన్ని చూపించినా సైకాలజిస్టు దానికి ఒక పేరూ, ఒక వర్గీకరణా, ఒక లక్షణ సంగ్రహమూ తగిలిస్తాడు. ప్రస్తుతం ఎవరి వైకల్యాల పేర్లు వాళ్ళకి తెలుసు. బడిలో తోటివాళ్ళతో జట్టుకట్టలేకపోతున్న బుడ్డోడ్ని కదిలించినా తనది ఫలానా “కాంప్లెక్స్‌” అని సులువుగా చెప్పేయగలడు. ఇన్ఫీరియార్టీ కాంప్లెక్సూ, గిల్ట్ కాంప్లెక్సూ, ఒడిపస్ కాంప్లెక్సూ, ఎలక్ట్రా కాంప్లెక్సూ, బస్ కాంప్లెక్సూ, లారీ కాంప్లెక్సూ, వల్లకాడు కాంప్లెక్సూ…! ఇవిగాక సిండ్రోములూ, డిజార్డర్లూ వేరే వున్నాయి! ఇన్‌సెక్యూరిటీలు ఇంకా బండెడున్నాయి! పోనీ ఇన్ని రకాల రుగ్మతల్ని నామకరణం చేసి పుట్టించే ఈ సైకాలజీ అంతిమంగా ఏదైనా ఆదర్శస్థితి వైపు మనుషుల్ని మళ్ళిస్తుందా అంటే అదీ లేదు. అసలలాంటి స్థితే భ్రమ కదా! ఇలా ప్రతీదానికీ పేరు తగిలించి “నేతి నేతి” అనుకుంటూ లెక్కలోంచి తీసేయడమే తప్ప ఆ మాయదారి బ్రహ్మపదార్థం ఎక్కడా తగలి చావదు. చివరికి మిగిలేది శూన్యమే. అది అర్థం చేసుకోలేని వాళ్ళ జేబుల మీద పడి బతకడం మాత్రమే సైకాలజీ చేసేది. అసలు నన్నడిగితే వైకల్యం లేకపోవటం అంటే వైకల్యం వుందన్న ఎరుక లేకపోవడమే అంటాను. అలాంటి పనికిమాలిన ఎరుక లేని కాలం పాతకాలం. తత్ఫలితమైన తేటదనం ఆనాటి మనుషుల్లో కనిపిస్తుంది. దువ్వూరిలో వేంకటరమణశాస్త్రిలో నాకు కనిపించింది. అసలేం చెప్పదలచుకున్నాను ఇక్కడ? ఈ పేరా దువ్వూరి గురించి కన్నా నాగురించే ఎక్కువచెప్తుందని తెలుసు. ఈ వ్యాసం ముఖ్యోద్దేశం పుస్తకం గురించి కన్నా, పుస్తకంతో నా అనుభవం గురించి చెప్పటమే గనుక ఆ సంకోచమేమీ లేదు. దువ్వూరిలో నాకు మొదట నచ్చిన గుణం తేటదనం. అట్టడుగున చేపలగుంపులూ గులకరాళ్ళూ స్పష్టంగా కనపడే సెలయేటిజాలులాంటి తేటదనం. తన మెతక కొలతల్తోనే కరుడుగట్టిన ప్రపంచాన్ని ఆయన అంచనా కట్టే తీరు నాకు నచ్చింది. ఆయనకు గిట్టని, అర్థంకాని, బాధపెట్టే మనస్తత్వాలు తారసపడినా ఆయన్నుంచి వచ్చే మహగట్టి విమర్శ “అదో రకం మనిషి” అన్న ఒక్క ముక్క మాత్రమే. ఉదాహరణ చెప్తాను. దువ్వూరికి ఇరవయ్యేళ్ళు వచ్చేసరికే తండ్రి పోయారు. బతికుండగా ఆయన తన ఒక్కగానొక్క కొడుకుతో ఎన్నడూ ఓ నాలుగు నిముషాలైనా తీరుబడిగా మాట్లాడలేదట! ఆయన గురించి దువ్వూరి మాటలివి:
ఊళ్ళో అందరితోనూ ఎంత కలిసికట్టుతనం ఉండేదో ఇంట్లో అంత ముభావం. ఇంట్లో ఎవ్వరితోనూ మాట్లాడే అలవాటే లేదు. అదో వింతైన స్వభావం. మాకందరికీ పెద్దపులిని చూస్తున్నట్లుండేది. ముఖంలో క్రూరత ఉందేమో అంటే సౌమ్యమయిన ముఖం, ఎత్తైన విగ్రహం. పచ్చగా కోమలంగా ఉండే శరీరం. అతిశుభ్రంగా ఉండే అలవాటు. మంచి ఆరోగ్యం. ఎంతో చురుకుదనం. ఎప్పుడూ ఉల్లాసమే. చింతా చీకూ ఉండేది కాదు. ఆయన నవ్వులో ఒక విలక్షణమైన అందం ఉండేది. ఆ మాట చాలామంది అంటూండేవారు. పై వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ నవ్వు చూడాలని నేను ముచ్చటపడే వాణ్ణి. ఇంట్లో నవ్వు కనబడేదే కాదు. పోనీ మామీద ప్రేమ లేదనుకుందామా అంటే అమితమైన ప్రేమ. ఎందుకుండదు? నేను ఒక్కణ్ణే కుమారుణ్ణి. అయితే అంత ముభావం ఏమిటంటే; చనువిస్తే ఇంట్లో వాళ్ళకీ పిల్లలకీ భయభక్తులుండవని తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం గాని ఇంట్లో ఎవరి మీదా కోపమూ కాదు. అయిష్టమూ కాదు. అదో రకం ప్రకృతి.
సరీగా చెప్పాలంటే; ఆయన జీవితం మొత్తంలో నాలుగు నిముషాలు వరసగా నాతో మాట్లాడిన జ్ఞాపకం లేదు. ఒకటి రెండు నిముషాలు మాత్రం మాట్లాడిన సందర్భాలు కొన్ని జ్ఞాపకం ఉన్నాయి. చాలా కొద్ది. అవయినా ఎప్పుడు? నాకు పదహారేళ్లు దాటిన తరువాత. ఇంకొక్క మాట, నాకు రెండు మూడేళ్ళ వయస్సులో కూడా నన్ను ఒక్కసారయినా ఎత్తుకున్నట్లుగాని ఎప్పుడయినా దగ్గిర పరుండబెట్టుకున్నట్లు గాని చూచిన వారెవ్వరూ లేరు. ఆ అలవాటు  అసలే లేనట్లు మా తల్లిగారి వల్లే విన్నాను. […] 
మరేమీ కాదుగాని, తండ్రికి మరింత సన్నిహితంగా ఉండి ఇంకా కొంత ఆనందం పొందే అవకాశం మనకు లేకపోయిందే అని మాత్రం అప్పుడప్పుడు ఇప్పటికీ అనుకుంటూంటాను. అంతేగాని ఆయనవల్ల ఆ యిరవై యేళ్లూ కలిగింది నిరుత్సాహమే అని మాత్రం అనుకోవడం లేదు.
దువ్వూరి వాక్యాలు మనతో మాట్లాడే తీరులో, అంటే ఆయన వచనపు గొంతులో, ఆయన స్వభావం ఏ మరుగూ లేకుండా బయటపడిపోతుంది. ఒక గుంపులో అందరూ నాకు సానుకూలమైన వ్యక్తులే ఉన్నప్పటి సందర్భంలో నా ప్రవర్తన ఒకలా వుంటుంది; ఆ అందరిలోనూ నాపట్ల అమనమ్మకం గల వ్యక్తి ఒకరున్నప్పటి సందర్భంలో నా ప్రవర్తన మరొకలా వుంటుంది. రెండో సందర్భంలో నన్ను నేను చూసుకోవటం మొదలు పెడతాను, నా వాక్యాలు ఆచితూచాకనే బయటకొస్తాయి. అదే సన్నివేశంలో ఇంకెవరన్నా అయితే ఏం లెక్కచేయక ధీమాతో మాట్లాడవచ్చు, మరికొందరు మేకపోతు గాంభీర్యంతో నెట్టుకురావచ్చు. దువ్వూరి మాత్రం అసలలా తన పట్ల అపనమ్మకం గల వ్యక్తులు వుండటమే ఊహాతీతం అన్నట్టు మాట్లాడతాడు. ఆయన వాక్యాలు మొత్తం ప్రపంచమంతటినీ విశ్వసిస్తూ మాట్లాడే వాక్యాలు. అది ధీమా అనను. ఒక అమాయకమైన విశ్వాసం అంటాను. అది నాకు నచ్చింది. అలాంటి మనుషులు నాకు నచ్చుతారు. ఒక ఉదాహరణ ఇస్తాను. ఇది ఆయన భార్య గురించి చెప్పే సందర్భం. మొత్తం పుస్తకంలో ఆవిడ గురించి రాసిన రెండే సందర్భాల్లో ఇది మొదటి సందర్భం. దీనికి ముందున్న మూడు పేరాల్లోనూ ఆమె చత్వారం వచ్చినా షోకనుకుంటారేమోనని కళ్ళజోడు వేయించుకోవడానికి ఎలా బిడియపడిందో చెప్తాడు. చివరికి ఇలా ముగిస్తాడు:
కొసకి ఎనాళ్ళు చెప్పినా ఆవిడకి మాత్రం నచ్చలేదు. జోడు పెట్టుకోనే లేదు. చత్వారం రానూ వచ్చింది. పోనూ పోయింది. 70 ఏళ్ళు దాటినా ఇప్పటి వయస్సులో సన్నసూదిలో ముతక దారం కూడా అవలీలగా ఎక్కిస్తోంది. కాలాన్ని బట్టి పూర్వకాలపు వేషభాషలు మార్చడమంటే ఆవిడకి నచ్చదు. మారిస్తే అదో షోకని అనుకుంటారేమో అని ఆమెకు సంకోచం – ఆ పూర్వపు వేషభాషలను గూర్చీ, చదువు లేకపోవడాన్ని గూర్చీ ఆవిడ విషయంలో ఇంకా వ్రాయవలసిన చిత్ర విచిత్రమైన సంగతులు నా తల్లో చాలా ఉన్నాయి. అవన్నీ రాశానంటే మీ అందరితోనూ చెప్పేనని ఆవిడ బిడియపడుతుందేమో! అంచేత అట్టే వ్రాయను. ఊరికే మచ్చుకి రెండు మాటలు వ్రాశాను.
నా వాదనకి ఈ పేరా ఎలా ఊతంగా నిలుస్తుందో చెప్పమంటే ఖచ్చితంగా చెప్పలేను. అహ! కాస్త ఆలోచిస్తే చెప్పగలనేమో. కాస్త ఆలోచిస్తే, “అవన్నీ రాశానంటే మీ అందరితోనూ చెప్పేనని ఆవిడ బిడియపడుతుందేమో!” అన్న ఆ వాక్యం నాకు అంతగా ఎందుకు నచ్చిందో సవిశ్లేషణాత్మకంగా వివరించగలనేమో. కానీ వివరించను. ఆ ప్రయత్నం చేసి అందులో నాకు కనిపించిన (బహుశా నాకు మాత్రమే కనిపించే) అందాన్ని జావ కార్చడం ఇష్టం లేదు. ఇందుకే పుస్తక పరిచయాలు నిష్పలం అనిపిస్తాయి. నాకు తెలుసు, దువ్వూరే గనుక నేను పైన రాసిందంతా చదివితే ఇబ్బంది పడతాడు, ఎబ్బెట్టుగా ఫీలవుతాడు, కొండొకచో చికాకు పడతాడు; తనకు సంబంధం లేని వ్యవహారంలో తననిలా ఇరికిస్తున్నందుకు బహుశా స్వీయధోరణిలో నన్ను “అదో రకం మనిషి” అని విసుక్కున్నా విసుక్కుంటాడు. సాక్షాత్తూ ఈ పుస్తక రచయితే ఇచ్చగించని స్పందన ఈ పుస్తకం నాలో కలిగించిందన్నమాట. ఈ ఒక్క పుస్తకమనే కాదు, చాలావరకూ పుస్తకాలు మనలో కలిగించే భావాలు ఇంత ఆత్మీయంగానే వుంటాయి. కానీ పరిచయాలు రాయాల్సి వస్తే మాత్రం ఈ ఆత్మీయమైన అంశాలను లోపలే తొక్కి పట్టి వేరే చప్పిడి అంశాలను పట్టించుకుంటూ రాయాలి. అంతేగానీ ఇవన్నీ బయట పెడితే ఇంటిగుట్టు రచ్చకెక్కించినట్టు ఛండాలంగా వుంటుంది. రాసే వాళ్ళకూ చదివే వాళ్ళకూ లజ్జాకరంగా తయారవుతుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు, దీన్ని ఇంతటితో వదిలేసి చప్పిడి అంశాల దగ్గరకొచ్చేస్తాను.


దువ్వూరి వేంకటరమణశాస్త్రి 1898లో జన్మించాడు (తెలుగు కాలమానం ప్రకారం విలంబి సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి నాడు; నా కాలమానం ప్రకారం నబొకొవ్‌ పుట్టడానికి ఒక సంవత్సరం ముందు). బాల్యంలో విద్యాభ్యాసం సాదాసీదాగానే మొదలైనా, పన్నెండేళ్ళ వయస్సులో తండ్రి తరపు తాతగారి చెంత గడిపిన రెండేళ్ళలోనూ జ్ఞానార్జన పట్ల అనురక్తి మొదలైంది. ఆయన శబ్దమంజరి మొదలుకొని రఘువంశం దాకా మనవడికి అన్నీ దగ్గర కూచోపెట్టుకుని బోధించాడు. దువ్వూరి అటుపిమ్మట చుట్టు పక్కల ఊళ్ళలోని సంస్కృత పాఠశాలల్లో చదువు సాగించి పదిహేడేళ్ళకు విజయనగరం సంస్కృత కాలేజీలో చేరాడు. చదువులో ప్రతిభ చూపించటం తోబాటూ, సానుకూలమైన నడతతో గురువుల మన్నన అందుకుని, దరిమిలా చదివిన కాలేజీలోనే అధ్యాపకునిగా చేరాడు. అది మొదలుకొని, వ్యాకరణశాస్త్రాన్ని బోధిస్తూ కొవ్వూరు, చిట్టిగూడూరు, గుంటూరు, విశాఖపట్టణాల్లో నలభైఅయిదేళ్ళ పాటు అధ్యాపకవృత్తిలో కొనసాగాడు. వీటిలో ఎక్కువకాలం పన్చేసిన స్థానాలు పద్దెనిమిదేళ్ళ పాటు చిట్టిగూడూరు సంస్కృతకాలేజీ, ఇరవైమూడేళ్ళపాటు విశాఖపట్నం ఆంధ్రాయూనివర్శిటీ. పదవీవిరమణ అనంతరం, తాను గత నాలుగు దశాబ్దాలుగా విద్యార్థులకు బోధిస్తూ వస్తున్న చిన్నయసూరి బాలవ్యాకరణానికి “రమణీయం” పేరుతో వ్యాఖ్య రాసాడు. “అగ్ని సాక్షికాలైన అనుబంధాలు కూడా అక్కడక్కడ శిథిలమై ఆషామాషీగా ఉండవచ్చునేమోగాని ఆచార్య సాక్షికాలైన అనుబంధాలకు ఎన్నడూ శైథిల్యం రాదు” అన్న తన మాటల ప్రకారమే అభిమానించే గురువులు, మిత్రులు, శిష్యుల సాంగత్యంలో చరమకాలం గడిపాడు. 1976లో చనిపోయాడు (నబొకొవ్ చనిపోవడానికి ఒక సంవత్సరం ముందు). ఇక రెండేళ్ళలో చనిపోతాడనగా 1974లో ప్రస్తుత స్వీయకథనం పూర్తిచేశాడు. ఈ రచన చివర్లో తన జీవితాన్ని క్లుప్తంగా ఇలా సింహావలోకన చేసుకున్నాడు:
ఈ మాదిరిగా జీవిత సమాచారాన్ని సింహావలోకనం చేసుకోవడంలో నాలో నాకు కొన్ని ప్రశ్నలూ సమాధానాలూ స్ఫురిస్తున్నాయి. 
అసలీ గడ్డ మీది కెందుకొచ్చాం?
పురాకృత కర్మఫలంగా సుఖమో దుఃఖమో అనుభవించడానికొచ్చాం. 
ఎప్పుడొచ్చాం?
రమారమి 80 ఏళ్లు కావస్తోంది. 
ఎక్కడున్నాము?
ఎక్కడెక్కడ అన్నోదక ఋణానుబంధం ఉందో అక్కడక్కడల్లా ఉన్నాము. 
ఏమి చూచాము?
ఈ యాత్రలో ఏవో కొన్ని ప్రదేశాలు చూచాము, తీర్థాలూ క్షేత్రాలూ కొంతవరకు చూచాము. చాలామంది పెద్దల్ని చూచాము. కొంతమంది సన్మార్గుల్ని చూచాము. దుర్మార్గులూ, స్వార్థపరులూ, మాయావులూ, మోసగాళ్లూ, లోభులూ, అసూయాపరులూ, అవినీతిపరులూ మధ్యమధ్య చాలామంది కనబడ్డారు. వింతలు చాలా చూచాము. అన్నిటికన్నా ముఖ్యం మనకు వెనుక ముందు తరముల వారికి లభ్యముకాని అవతారమూర్తి అయిన గాంధీమహాత్ముని సన్నిహితంగా సావధానంగా చూచాము. 
ఏమి చేశాము?
మానవమాత్రులు చేసే మామూలు పనులే తప్ప ప్రత్యేకంగా చెప్పుకోతగినంతటి ఘనకార్యాలేమీ చేయలేదు. ఘోరమయిన క్రూర కార్యాలేమీ చేసినట్లు లేదు. చాలామందితో స్నేహం చేశాము. గురువుల వాత్సల్యం ఎక్కువగా సంపాదించుకున్నాం. ఏవో నాలుగు ముక్కలు చదువుకున్నాం. తృప్తికరమైన శిష్యవర్గాన్ని సంపాదించుకున్నాం. కుటుంబ కర్తవ్యాలు పిల్లల కప్పగించి తటస్థంగా తప్పుకున్నాం. ఇదీ చేసిన పని. 
ఏమి చెప్పాము?
ఏదో కొద్దిగా పదిమంది పిల్లలకి నాలుగక్షరాలు చెప్పేము. 
ఏమి విన్నాము?
పెద్దలూ గ్రంథకర్తలూ చెప్పిన మంచి మాటలు కొన్ని విన్నాం. 
ఏమి తెలిసింది? ఎంత తెలిసింది?
ఏవేవో తెలిశాయిగాని తెలియవలసింది మాత్రం ఏమీ తెలిసినట్లు లేదు. తెలిసిందైనా ఆవగింజలో అరవైయో వంతనీ తెలియనిది కొండంత ఉందనీ తెలిసింది. 
ఐహిక విషయాల మాట అటుంచి ఆముష్మికానికి ఏమయినా ప్రయత్నం జరిగిందా?
ఏమో! జరిగిన జీవిత చర్యలో ఆముష్మికానికి ఉపకరించేది ఏ కొంచెమయినా ఉన్నదా అనే సంగతి దైవం నిర్ణయించాలి. అది మనకు చేతనైన పని కాదు. 
ఇక చరమదశలో ఈ శేషకాలంలో కార్యక్రమం ఏమిటి? కర్తవ్యమేమిటి?
ఏమీ లేదు. ఇక్కడి దృష్టులు అట్టేపెట్టుకోక ఇష్టదేవతను ధ్యానిస్తూ “వాసాంసి జీర్ణాని యధావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి” అన్న గీతోపదేశం అర్థమయింది గనుక చివికి శిథిలమై చిందరవందరగా ఉన్న ఈ ఇల్లు విడిచి కొత్త యింట్లో ప్రవేశించడం ఎప్పుడూ? ఈ చింకి గుడ్డలు పారవేసి కొత్త బట్ట కట్టడం ఎప్పుడు? అని నిరీక్షించడం ఒక్కటే కర్తవ్యంగా కనబడుతోంది.
చాలా స్వీయకథనాల్లో ఆయా రచయితలు తమ జీవితాన్ని ఏదో రకంగా సార్థకమని నిరూపించుకోవడానికి పడే తాపత్రయం స్పష్టాస్పష్టంగా కనిపిస్తూనే వుంటుంది. సాధారణంగా స్వీయకథనాలు రాసేది జీవిత చరమదశలో కాబట్టి ఆ యావ సహజం. అందువల్ల వాటికి వారే కేంద్రబిందువులుగా వుంటారు. అందులో తప్పు పట్టేందుకేమీ లేదు. దువ్వూరి స్వీయకథనంలో మాత్రం కొట్టొచ్చినట్టు కనిపించేదేమిటంటే, ఆయన తన గురించి ఎంత తక్కువ చెప్తున్నాడో కదా! అన్న సంగతి. తన గురించి చెప్పే ఆ తక్కువ సందర్భాల్లో కూడా, జీవితం తనకు అందించిన ఫలానా అదృష్టాన్ని మరొక్కసారి నెమరు వేసుకుని కృతజ్ఞత వ్యక్తపరచుకోవాలన్న ధ్యాసో, జీవితం తనకు నేర్పిన ఫలానా పాఠాన్ని మరొక్కసారి గుర్తు తెచ్చుకుని జాగరూకత బోధించాలన్న ఉద్దేశమో కనిపిస్తాయి తప్ప, మరుగున మిగిలిపోయిన ప్రజ్ఞల్ని ఎట్టకేలకు లోకం వెలుగులోకి తీసుకువస్తున్న హడావిడేమీ కనిపించదు. జీవితంలో తనకు తారసిల్లిన కొందరు వ్యక్తుల స్నేహసాంగత్యాలూ, తాను మసలుకున్న ప్రత్యేక వాతావరణమూ తన అస్తిత్వం కన్నా ముఖ్యమైనవన్న స్పృహ ఆయనకుంది. అందుకే తనని కాసేపు పక్కనపెట్టి ఆయా వ్యక్తుల గురించి, ఆ వాతావరణాన్ని గురించీ పలువురికీ చెప్పాలన్న తపన ఆయనలో కనిపిస్తుంది. ఆ తపనే లేకపోతే, “జీవిత రంగంలో జరిగిన ఘట్టాలు జ్ఞాపకం తెచ్చుకొని సమీక్షించుకోవడానికి వ్రాసుకునే డయిరీ” అంటూ మొదలు పెట్టిన ఈ పుస్తకంలో, తన జీవితం మాట అటుంచి, అసలు తాను జీవించిన కాలంతోనే సంబంధంలేని కాటన్‌దొర ప్రసక్తి అంతగా ఎందుకు చెప్పండి. వజ్రసంకల్పంతో గోదావరిపై ఆనకట్ట నిర్మించి  ఆ జిల్లాల్ని సస్యశ్యామలం చేసిన సర్ ఆర్థర్ కాటన్‌దొర గురించి ఆయన చెప్పిన ఆసక్తిగొలిపే (నాలాంటి గోదావరిజిల్లాల వాడికి మరింత ఆసక్తి గొలిపే) ఒక పిట్టకథ ఇది:
కాటన్‌దొర ఆనకట్టా, కాలవలు వీటి నిర్మాణం యావత్తూ పూర్తయిన తరువాత పొలాల్లో పుష్కలంగా నీరు ప్రవహిస్తూ ఉంటే పైరు పచ్చలతో ముచ్చటగా కన్నులపండువుగా ఉన్న భూములన్నిటినీ ఒక్కమాటు స్వయంగా కంటితో చూచి ఆనందించాలని బోటు వేసుకుని ఆ కాలవలన్నిటి మీద కొన్నాళ్లపాటు నెమ్మదిగా సంచారం చేశాడట. అన్నీ సావకాశంగా చూచి జీవితం సార్థకమయిందని ఎంతో తృప్తిపడ్డాడట. 
ధవళేశ్వరమునుంచి తాళ్ళరేవు దాకా ప్రవహించే మా కాలవను ఆనుకుని కపిళేశ్వరపురం అని ఒక గ్రామం వుంది. ఊరు పెద్దది. అరవై యిళ్ళ అగ్రహారం. ఆ కాలంలో సుమారు డెబ్బయి ఎనభైమంది వేదవేత్తలు అక్కడుండేవారు. అందులో క్రతువులు చేసినవారు కూడా చాలామంది ఉండేవారు. గొప్ప శిష్టులు. వారంతా ఉదయాన్నే ఆ కాలవలోనే స్నానాలు చేస్తూండేవారు. ఎప్పుడు చేసినా సంకల్పం చెప్పుకుని స్నానం చెయ్యడం శిష్టుల సంప్రదాయం. కాలవలు తవ్వించి యింత మహాసౌఖ్యం కలిగించిన ఆ కాటన్‌దొరను అతి కృతజ్ఞతతో నిత్యమూ తలచుకుంటూండేవారట. అతణ్ణి భగీరధునిలాగ భావించి, మనస్సులో పూజిస్తూండేవారట. ఆ వూరు పెద్దది గనక ఒక్క స్నానాల రేవు సరిపడక ఊరి రెండో కొసను మరొక రేవు కూడా తాత్కాలికంగా ఏర్పరుచుచున్నారట. 
ఒకరోజున పెద్దరేవులో అయిదారుగురు బ్రాహ్మలు “కాటన్‌దొర స్నానమహం కరిష్యే కాటన్‌దొరస్నాన మహం కరిష్యే” అని సంకల్పం చెప్పుకుంటూ స్నానం చేస్తున్నారట. కాలవలన్నీ పరిశీలించ బయలుదేరిన దొరగారి బోటు సరీగా ఆ స్నానాల సమయానికి కపిళేశ్వరపురం కాలవరేవులోకి వచ్చిందట. వారి స్నాన సంకల్పంలో ‘కాటన్‌దొర’ అన్నమాట అతనికి వినిపించిందట. తనపేరు వారెందుకు అంటున్నారో అని అది మరేదేనా శబ్దమేమో అనీ అతనికి సందేహం కలిగి, ఆ మాటేమిటో కనుక్కురమ్మని బోటు ఆపి, తన గుమస్తాను పంపించాడట. అతడు వెళ్ళి “కాటన్‌దొర అంటున్నారే అదేమిటండీ?” అని వారిని అడిగితే వారు “అయ్యా! కాటన్‌దొరగారని ఒక గొప్ప ఇంజనీరు. మహామంచివాడు. ఆ మహానుభావుడే యీ కాలవలన్నీ తవ్వించాడు. స్నానపానాదులకు సౌకర్యం లేకుండా తరతరాల నుంచి కష్టపడుతున్నాం. అతని దయవల్ల ఇలాటి సౌఖ్యం మాకు కలిగిందని నిత్యమూ చెప్పుకుంటూంటాం” అన్నారట. ఆ మాటలు గుమాస్తా వల్ల తెలుసుకుని “ఆ అమాయకులది ఎంత కృతజ్ఞతో” అని మెచ్చుకుంటూ, ఆ సంతోషంలో పెట్టెలో డబ్బు తీసి పదేసి రూపాయల చొప్పున రేవులో ఉన్న వారికందరికీ బహుమతులు ఇచ్చేడట. ఈ సంగతి విని స్నానావసరం లేని మరికొందరు బ్రాహ్మలు ఊరుకు రెండో కొసనున్న ఆ యెగువరేవుకు మరోదారిని వెళ్ళి బోటు వచ్చేదాకా కనిపెట్టుకుని ఉండి అది వచ్చేసరికి బాగా వినబడాలని గట్టిగా “కాటన్‌దొర స్నానమహం కరిష్యే” అని పెద్ద గొంతుకలతో సంకల్పం చెపుతూ స్నానాలు మొదలు పెట్టేరట. – వాళ్ళ వాలకం చూచి, బహుమతుల సంగతి ఆ రేవు నుంచి యిళ్లకు వెళ్ళిన బ్రాహ్మల వల్ల విని ఆ బహుమతి కోసం చెపుతున్న మోసపు సంకల్పంగాని వీళ్ళది నిజమయిన సంకల్పం కాదని కనిపెట్టి బోటు తాడులాగుతున్న సరంగులను కేకవేసి “గవర్నమెంటు ఏర్పరిచిన అసలు రేవులో కాకుండా తప్పు రేవులో ఇటుపైని స్నానాలు చేస్తే ఖయిదులో పెడతామని గట్టిగా చెప్పి వాళ్ళందరినీ ఒడ్డుకు తరమండి” అని చెప్పేడట – అయ్యా! కర్రలు పుచ్చుకుని వాళ్ళు ఒకటే తరమడం ఆరంభించారట. వారంతా ఒళ్ళయినా ఒత్తుకోకుండా ఒడ్డెక్కి నీళ్ళోడుతూ పట్టుకువచ్చిన చెంబులు కొందరు చేతపట్టుకునీ, కొందరక్కడే వదిలిపెట్టి పడుతూ లేస్తూ పరుగులెత్తేరట. ఇదంతా ఎందుకు చెప్పేనంటే గోదావరీ ప్రసంగం వచ్చినా కాలవల మాట వచ్చినా కాటన్‌దొరగారు జ్ఞప్తికి రాకతప్పదు. ఆయనలో శతాంశమయినా ఉపాయం ఎరిగిన ఉద్యోగస్థులు ఈనాడు ఉంటే గోదావరి భయం తప్పిపోను గదా అని తీరవాసులు తరచు అనుకుంటూంటారు. అలాటి ఉపాయశాలులు లేకనే చాలా భూములకు నదీ ప్రవేశయోగం ఇప్పటికీ తప్పలేదు.
ఇదొక్కటనే కాదు. పుస్తకంలో ఇలాంటి ఘట్టాలు చాలా వున్నాయి. మొత్తం పుస్తకంలో తన తల్లిదండ్రుల వివరాలకూ తన సంసారజీవితపు ముచ్చట్లకూ ఓ మూణ్ణాలుగు పేజీలు కన్నా ఎక్కువ కేటాయించని ఆయన, తన పద్దెనిమిదేళ్ళ చిట్టిగూడూరు సర్వీసును ఒక్కటంటే ఒక్క పేజీలో తేల్చేసిన ఆయన, ఉదాహరణకి, అప్పట్లో విద్యార్థుల చేత అక్షరాలు ఒరవడి దిద్దించేందుకు గురువులు అనుసరించే ప్రత్యేకమైన పద్ధతి గురించీ, తన తాతగారి మజ్జిగ అలవాటు గురించీ, తానెన్నడూ సంభాషించి కూడా ఎరుగని పోలిశెట్టి వెంకటరత్నం అనే కాపు గురించీ, తనకు స్వల్ప పరిచయం మాత్రమే వున్న కాశీనాధశాస్త్రి అనే పండితుని గురించీ, కనీసం ముఖ పరిచయం కూడా లేని దండిభట్ల విశ్వనాధశాస్త్రి అనే మరో పండితుని గురించీ మాత్రం పేజీలకు పేజీలు రాస్తాడు. ప్రపంచంలో తమకన్నా విలువైన విషయాలున్నాయన్న స్పృహ వున్నవాళ్ళు జీవితం నుంచి ఎగుడుదిగుళ్ళులేని స్థిరమైన ఆనందాన్ని అందుకుంటారు, స్థిమితంగా వుంటారు. అహాన్ని పక్కన పెట్టి వారు అక్కున చేర్చుకునే విలువల్ని మనమూ నమ్మకంతో స్వీకరించవచ్చు. ఈ పుస్తకం ఓ శిథిల ప్రపంచాన్ని నా కళ్ల ముందు తిరిగి నిలబెట్టింది. అది జ్ఞానం ప్రధానమైన ప్రపంచం, మధ్యతరగతి మెటీరియల్ దేబిరింపుల కంపు ఇంకా అంతటా అలుముకోని ప్రపంచం. ఒక వ్యక్తి ఇంత భరోసాతో తన జీవితాన్ని ఈ విలువలకి అంకితం చేసుకున్నాడని తెలిసినపుడు, అదే కాలం అయితేనేం, ఆ భరోసాలో కొంత ఈ కాలపు చదువరికీ బదిలీ అవుతుంది.

ఇందులో కొందరు అరుదైన వ్యక్తుల గురించి, వారి పాండిత్యం గురించీ దువ్వూరి చెప్పిన సంగతులు నాకు నచ్చాయి. మధ్య మధ్యన స్వీయజీవితంలోంచి తీసి చెప్పిన విశేషాలు కూడా నచ్చాయి. అలాంటి ఓ విశేషం ఇక్కడ ఇస్తున్నాను. పద్యాల్లో పదచ్ఛేదం తప్పితే పుట్టే సరదా ఇది. దువ్వూరి కొవ్వూరు సంస్కృతకాలేజీలో చేరినప్పటి సంగతి. ఆ కాలేజీ కమిటీ కార్యదర్శి సూర్యనారాయణరావు అనే ఒకాయన, స్వయంగా పండితులు కావటంతో, కాలేజీలో కొత్తగా చేరే పండితులకు సందేహాలడిగే మిషతో పాండిత్య పరీక్షలు చేస్తుండేవారట:
నేను కొవ్వూరు కాలేజీలో ప్రవేశించిన 10-15 రోజులకు ఓ రోజున సూర్యనారాయణరావుగారు కాలేజీలో నేనుండే గది కొచ్చారు. అప్పటికప్పుడే ఇద్దరికీ బాగా పరిచయం కలిగింది. ఏదో ఆమాటా ఈమాటా చెపుతున్నారు. మామూలు ఇష్టాగోష్ఠే అనుకున్నాను. కాని ఆయన మనస్సులో ఒక ఆలోచన ఉన్నట్లు తరువాత గ్రహించాను. […] నన్ను కొంచెం కదిపి చూడాలని ఆయన మనస్సులో ఉంది. పరీక్ష చేసినట్లు కనబడకుండా పరీక్షించాలని కబుర్లేవో చెప్పి చెప్పి “ఏమండి! ప్రౌఢ వ్యాకరణంలో ఉదాహరణగా ఒక భారత పద్యం ‘అనిన నలుగాలివాన గోవును నశేష శబ్దముల మంత్రమును లోహజాతి గాంచనమును మనుజుల విప్రుండు సమధికత్వభాజనము లండ్రు వేద ప్రపంచ విదులు’ అని యిచ్చేడు కదూ! అందులో ‘గాలివాన గోవు’ అనేవి పద్యంలో అన్వయించడం లేదు. ఏదో తప్పు పడ్డట్టుంది. అది మీరెలా సరిపెడతారో కొంచెం చూడండి” అని అడిగేరు. అడిగేటప్పుడు ఆయన ముఖవైఖరి చూస్తే యిది కుదిరేది కాదనీ, ఎవ్వరూ చెప్పలేని ప్రశ్ననీ నిశ్చయంతో ధీమాతో అడుగుతున్నట్లు గోచరించింది. కాని అదో దైవ సంఘటన. ఆ పద్యం నేను చాలాసార్లు చూచింది, బాగా బోధపడిందీ, చక్కగా అన్వయిస్తున్నదీనూ. ఈయనకి సందేహం ఎక్కడో తెలుసుకుందామని “పద్యంలో కుదరనిది ఎక్కడండీ” అని అడిగేను. ” ‘గాలివాన గోవు దగ్గర సరిపడ్డం లేదు. పద్యంలో ఏవేవి గొప్ప వస్తువులో చెపుతున్నాడు. అని ననలు అంటే యుద్ధంలో పువ్వులు, అంటే పుష్పమాల వీర్యసూచకాలూ, విజయ సూచకాలూ గనుక అవి గొప్పవి. అన్ని శబ్దములలో మంత్రం గొప్పది. లోహాల్లో బంగారం గొప్పది. మనుష్యుల్లో విప్రుడూ గొప్పవాడే. అన్నీ బాగానే ఉన్నాయి. గాలివానలో గోవు గొప్పదంటే సరిపడ్డం లేదు” అన్నారు. ఆ పద్యం ప్రౌఢ వ్యాకరణంలో ఎన్నోసార్లు చూచిందీ అర్థం సరిపడిందీ గాని నాకు కొత్తది కాదు. అరెరే ఈ గాలివాన ఈయనకి ఎంత భ్రాంతి కలిగించిందీ అని చాలా ఆశ్చర్యపడ్డాను. నవ్వు కూడా వచ్చింది. బాగుండదని ఎలాగో ఆపుకున్నాను. “అయ్యా? ఇందులో గాలివాన లేదండి. పదచ్ఛేదం అది కాదు” అన్నాను. “అయితే మీరు మొత్తం భావమంతా చెప్పండి” అన్నారు. “అనిన (అనగా) అది వేరే పదం ‘నలుగాలివానన్’ నాలుగు కాళ్ళ వాటిలో (చతుష్పాజ్జంతువులలో), గోవు గొప్పది అని అర్థం. తక్కిన అన్వయం అంతా మీరు చెప్పిందేను. ‘గాలివాన’ అని కాకుండా నలు+కాలి+వానన్ అని పదచ్ఛేదం చేస్తేనే సూత్రంలో ఉన్న వానన్ అనే దాని ఉదాహరణ కుదురుతుంది. అలాకాకపోతే ఈ పద్యం ఉదాహరణకే పనికిరాదు” అన్నాను. అయ్యా! ఇక చూచుకోండి. ఆయనకి కలిగిన సంతోషానికి మేర లేదు.
ఇలాంటి జీవిత విశేషాలను మరింత హృదయరంజకం చేసేది దువ్వూరి శైలి. నలభైఅయిదేళ్ళు నిర్విరామంగా పాఠాలు చెప్పిన మాస్టారు గనుక ఏదైనా మనసుకు పట్టేట్టు ఎలా చెప్పాలో ఆయనకు బాగా తెలుసనిపిస్తుంది. ఏ విషయం తర్వాత ఏ విషయం చెప్పాలో, అసలు ఏ విషయాన్ని చెప్పేందుకు ఎన్నుకోవాలో, ఒకవేళ ఒక విషయం నుంచి మరో విషయానికి దారి మళ్ళాల్సి వస్తే పెద్దగా అయోమయమేమీ లేకుండానే మరలా వెనక్కి ఎలా తీసుకురావాలో, ఇదంతా ఆయనకు సహజంగా అబ్బిన ప్రతిభగా అనిపిస్తుంది. అందుకే మొత్తం పుస్తకంలో ఎక్కడా అధ్యాయాల విభజన గానీ, భాగాల విభజన గానీ లేకపోయినా ఆ లోటు ఎక్కడా తెలీదు. చెవి దగ్గర కూచుని ఊసులు చెప్తున్నట్టుండే వాక్యాలాయనవి. భేషజాలేవీ లేకపోవటంతో వినబుద్ధవుతుంది. “అది అలా వుంచండి, ప్రకృత ప్రసంగంలోకి వెళదాం”, “ఈ పయిమాటలకేం గాని”, “ఇప్పుడు వారినలా వుంచండి, మళ్ళీ వారిని గూర్చి ఎదర మాట్లాడుకుందాం”, “పూర్వకాలపు పండితుల ప్రసంగం గనుక వినేవారు శ్రద్ధగా వినాలి”, ఇట్లా చనువుగా చేయిపట్టుకు తనతో తీసుకెళ్తారు. “ఈ ఘట్టం ఆత్మీయులకు తెలియాలనే ముచ్చటతో వ్రాశాను. చదువరులు విసుగు చెందుతారోయేమో!” అని అప్పుడపుడూ మొహమాట పడ్తారు కూడా. ఎంతైనా వ్యాకరణశాస్త్ర పండితుడు కాబట్టి వాక్యనిర్మాణం తెలుగు భాషామతల్లి ఉబ్బితబ్బిబ్బయ్యేంత అందంగా వుంటుంది. బహుశా పరిస్థితులతో సులభంగా రాజీ పడిపోయే, ఎక్కడైనా ఒద్దికగా ఇమిడిపోయే తత్త్వం ఆయన్ని కథకునిగా మార్చి వుండదు. లేదంటే మంచి కథలు చెప్పేవాడనిపిస్తుంది.

ఇప్పుడు పూర్తిగా రూపుమాసిపోయిన ఓ ప్రపంచం గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలంటాను. ఎందుకు తెలుసుకోవాలి, అనడిగేట్టయితే చదవక్కర్లేదంటాను; అదెలాగూ జవాబు ఆశించని మూర్ఖపు ప్రశ్న కాబట్టి. పుస్తకం ముద్రణ దిట్టంగా బాగుంది. ముఖచిత్రం బాగుంది. అట్ట, కాగితం నాణ్యత అన్నీ బాగున్నాయి. కొని, చదివి, దాచుకోవాల్సిన పుస్తకం. చుట్టూ మతిలేని గొంతులెక్కువై  అయోమయం అలుముకున్నపుడు, ఓ దిటవైన గొంతు విని స్థిమితం తెచ్చుకునేందుకు మళ్ళీ మళ్ళీ చదువుకోదగ్గ పుస్తకం.

(పుస్తకం.నెట్ లో ప్రచురితం)

March 2, 2010

Holi

An albino,
face smeared pink & blue,
feels normal.

* * *

దారిలో ఇద్దరు పిడుగులు స్ప్రైట్ 250 ml బాటిళ్ళ నిండా రంగు నీళ్ళతో నన్ను అటకాయించినప్పుడు, చొక్కా పాడవుతుందన్న తక్షణ స్పందన నన్ను చురుగ్గా చూసేట్టు చేయకుంటే, వాళ్ళు బెరుగ్గా పక్కకు తొలిగేవాళ్ళు కాదు, రోజు ఆనందపు రంగునూ పులుముకునేది.

February 18, 2010

సెలవ

లోకల్ రైల్లో తలుపు దగ్గర కాళ్ళు క్రిందకి వేలాడేసి కూర్చోవడం. బయట భవనాలు, రేకుల షెడ్లు, వాటిల్లో వివిధ భంగిమల్లో మనుషులూ, కుటుంబ సన్నివేశాలూ, ఆరేసిన బట్టలూ, పట్టాల పక్కనే రొచ్చు గుంటలూ వెనక్కి పారుతున్నాయి. ఫతేనగర్లో ఓ బోసిముడ్డి బుజ్జిగాడు రైలు చూసి చేయి వూపాడు. బదులుగా చేయెత్తేసరికే వాడి దృష్టి నా మీద నుంచి పక్క పెట్టి మీదకు మరలిపోయింది. నేను ఎత్తిన చేయితో బుర్రగోక్కుని క్రిందకు దించేసాను. కాసేపటికి ఉన్నట్టుండి పక్కనో కుర్రాడు సెల్‌ఫోన్‌లోంచి "మసకలీ" పాట పెట్టాడు. పాటంతా అయ్యాకా లేచి చెయ్యూపేస్తూ థాంక్స్ చెప్పాలనిపించింది.

* * *

ఒక ప్రేమజంట. ఆమె మాటిమాటికీ అతని చూపు తన వైపు తిప్పుకోవాలని చూస్తుంది — మాటల్తో, భంగిమల్తో, అర్థం పర్థం లేని స్పర్శలతో.

అడపాదడపా చూపులు ప్రపంచం మీదికి మరల్చినా, అతనికీ తెలుసు, తాను ఆమె సాంగత్యపు వృత్తంలోనే వున్నాననీ, అందులోంచే బయటకు చూస్తున్నాననీను.

ప్రేమ మీ ఇద్దరు మాత్రమే మసలుకోవాల్సిన వృత్తం. ఆ వృత్తాన్ని సృష్టించలేనప్పుడే నీకు తెలియాలి, నువ్వు ప్రేమింపబడటం లేదని.

* * *

నాంపల్లి స్టేషన్‌లో లెక్కకందనన్ని పావురాలు. నువ్వు నుంచొని గంటలు తరబడి చూస్తుండిపోవచ్చు. ఒక పావురం మీదే దృష్టి నిలిపి అదసలు అంత గుంపులో ఏం చేస్తుందో గమనించడం బాగుంటుంది. నిలబడటానికి బహానా కావాలంటే నాలుగు గ్లాసుల చెరుకురసం తాగచ్చు.

February 16, 2010

బేల

ఆమె కాఫీ మిషన్ నుంచి తన సీటు దగ్గరకు తిరిగి వచ్చింది. జడని భుజాల మీంచి ముందుకేసుకుంటూ కూర్చుంది. కీబోర్డు మీద చేతులు ఆన్చింది. మణికట్టు ఎముక దగ్గరే ఆగిపోయిన ఓ గాజుని వెనక్కి లాగి మిగతావాటితో కలిపింది. తన ఉద్యోగ అస్తిత్వాన్ని సమీకరించుకునేందుకు కొన్ని శూన్య క్షణాలు. కానీ పూర్తిగా కూడగట్టుకోకముందే అతను గుర్తొచ్చాడు. అప్రయత్నంగా నిట్టూర్చింది. అప్పటివరకూ తన నెత్తిపైనే వేలాడుతున్న దిగులు కుండేదో పగిలి అర్థంకాని భావ ద్రవ్య భారమేదో మీద ఒలికినట్టనిపించింది. ఎందుకు ఎప్పుడూ ఏదో గుండె గొంతులో అడ్డపడినట్టు? ఎన్నాళ్ళిలా? ఏంటి నా ఇబ్బంది? తన ప్రేమ లేనప్పటి జీవితం ఎలా వుండేదో మర్చిపోయాననుకుంటా. మార్దవమైన పాటేదో సాగి సాగి అర్థాంతరంగా టేప్ తెగి ఆగిపోయినట్టుంది. ఊరకనే ఏడిపించే పాట. మళ్ళీ వినమన్నా వినలేని పాట. అలా అని అది లేదంటే ఆ ఖాళీలో వేరే ఏది వుండాలో అర్థంకాని పాట. ఇప్పుడు నాకు మిగిలిందల్లా మరమ్మత్తు పని. టేప్ని బాగు చేయాలి. పాట వున్న భాగాన్ని మాత్రం కత్తిరించి, దాని ఆద్యంతాల్లో నిశ్శబ్దాన్ని పలికే టేపు ముక్కల్ని ఒకదానికొకటి తెచ్చి అతకాలి. అక్కడ అంతకుముందో పాట ఉన్నట్టే తెలియకూడదు. ఒక్కదాన్నే చేయాలి ఇదంతా! ఆమెకు కళ్ళు చెమ్మగిల్లినట్టయింది. కానీ ఏడ్చేందుకు అనువైన ప్రదేశం కాదాయె. ఫర్లేదు. రానీ, ఎన్ని వస్తాయో బయటకు వచ్చేయనీ. ఎన్నాళ్ళని వెనక్కి తొక్కి పెట్టడం. అంతగా నిబ్బరించుకోలేకపోతే రెస్ట్రూమ్ ఎలానూ వుందిగా. అలా అనుకోగానే, ఎదుటి ఎల్.సి.డి స్క్రీన్ని అలుక్కుపోయేట్టు చేస్తూ, కళ్ళు సజలాలయ్యాయి. కానీ బయటకి వలికేంతగా ఇంకా పేరుకోలేదు. చున్నీకి అప్పుడే పనిచెప్పాలనిపించలేదు.
         నువ్వు లేని తనం ఎంత కటువుగా వుంటుందో తెలిస్తే, ఎంత కర్కశంగా నన్ను అణగదొక్కుతుందో తెలిస్తే, ప్రియతమా, నువ్వు నన్నసలు వదిలివెళ్ళనే వెళ్ళవు తెలుసా! మంచి వాడివి నువ్వు. అలా ఎప్పుడూ చేయవు. కానీ నీకు తెలీదే ఇక్కడ ఇలా అవుతుందని! నీకు తెలియకూడదు కూడా. మంచివాడివి నువ్వు. నీకు ఇదంతా చెప్పి ఎలా బాధ పెట్టడం. వద్దు! ఎంత మోయలేనిదైనా నేనే మోసేస్తాలే. నువ్వు నవ్వు! ఆ నవ్వు నాది కాకపోయినా, నువ్వు మాత్రం నవ్వాలి! మరలా ఆమె మనసులోనే ఏదో రాటుదేలిన కోణం మాత్రం ఈ అన్యాయాన్ని ఒప్పుకోలేకపోయింది. ఏం? నా నవ్వులే అతనికి తెలియాలా? నా ఏడుపులు మాత్రం నేనే ఏడవాలా? ఇదేనా ప్రేమంటే? నవ్వులు కలిసి పంచుకోవటం. ఏడుపులు మాత్రం విడి విడిగా ఏడవటం. అసలు తను ఏడుస్తున్నాడా? లేక నా ఏడుపు నాదేనా? ఈ ఆలోచన రాగానే కంటి చెమ్మకు కన్నీటి చుక్కగా మారేందుకు తగినంత ద్రవ్యం సమకూరినట్టయింది. ఒకటి చనువుగా చెంపపైకి జారింది. గులాబీ మొటిమ దగ్గర సొగసైన వంపు తిరిగి దవడ అంచుకొచ్చి వేలాడింది. దాని స్పర్శతో ఆమెకు హఠాత్తుగా చుట్టుపక్కల ప్రపంచపు స్పృహ తెలిసొచ్చింది. పక్కన ఎవరో కీబోర్టు టకటకలాడిస్తున్నారు. వెనక ఎవరి వీపు మీదో ఎవరో చొరవగా చరిచారు. ఏదో రివాల్వింగ్ చైర్ గచ్చు మీద జారుకుంటూ పక్క క్యూబికల్ వైపుకు వెళ్ళిన శబ్దం. బహుశా పట్టించుకుంటే అర్థమయ్యే మాటలు. చప్పున చున్నీ తీసి ఏదో చెమట తుడుచుకుంటున్నట్టు మొహమంతా ఓసారి గట్టిగా అలికింది. కళ్ళు మిటకరించి రెప్పలు అల్లల్లాడించి స్క్రీన్ని తేరిపార చూసింది. కళ్ళైతే తేటపడ్డాయి గానీ, మనసు తేట పడందే! అందుకే, ఆలోచనా స్రవంతిలో ఉన్నట్టుండి పైకి తేలిన "ఎన్నాళ్ళిలా?" అన్న ఒక్క చిన్న ప్రశ్న సరిపోయింది, అప్పుడే శుభ్రం చేసిన కళ్ళు మరలా కన్నీటి చిత్తడి కావటానికి. ఇక ఆగేట్టు లేదు. కీబోర్డు లోనికి నెట్టి రెస్ట్రూమ్ వైపుకి నడిచింది. ఇవాళ దీని సంగతేదో తేల్చేయాలి! దారిలో ఓ నేస్తం చొరవగా చేయి లాగి "ఏయ్, హౌ ఎబౌటె కాఫీ డాలింగ్?" అని చిలిపిగా అడిగింది. మొహం తిప్పకుండానే "ఇప్పుడే తాగానే..." అని సున్నితంగా విదిలించుకుని వెళిపోయింది.
        రెస్ట్‌రూమ్‌లోకి చేరి తలుపు బిగించేదాకా మనసులోకి ఏ ఆలోచననీ రానివ్వలేదు. లోపల వెచ్చని ఒంటరితనం. పైన ఎగ్జాస్ట్ ఫేన్ ఎక్కువ శబ్దం చేస్తుంది. కాబట్టి వెక్కిళ్ళ రేంజ్కి శోకండాలు పెట్టినా ఫర్లేదు. తన ఆలోచనకి తనే నవ్వుకుంటూ, సింక్ దగ్గరికి వచ్చి అద్దం ముందు నిలబడింది. — రామ రామా! బిందీ ఏమైంది? చున్నీకి అంటుకుందేమోనని అటూ ఇటూ తేరిపార తిప్పింది. లేదు. పోనీలెమ్మని సమాధానపడి, రేగిన జుత్తును రెండు చేతుల్తోనూ చెవుల వెనక్కి దోపుతూ, అద్దంలోకి చూసుకుంది. మొహం కాస్త ఉబ్బి అప్పుడే నిద్రనుంచి లేచినట్టుంది. కనురెప్ప రోమాలు తడికి అట్టకట్టి దళసరిగా కనపడ్డాయి. తను ఇలా బాగుంది. పెదాల్ని కనిపించీ కనిపించనట్టు ముందుకు ముడిచి చూసుకుంది. యూ ఐంట్ నో కేట్ మాస్ లేడీ! నవ్వుకుంది. ఆ నవ్వు చూసేసరికి తను వచ్చిన పని గుర్తొచ్చింది. అద్దంలో ఆమె బొమ్మ అకస్మాత్తుగా అంతర్ముఖమై కళ్ళు నేలకి వాల్చింది. నిలుచున్నపళంగా అలానే ఆలోచనలోకి జారుకుంది. ఏంటిదసలు? ఎన్నాళ్ళీ చిత్రహింస! కనీసం నా బాధ బయటపెట్టుకునే అవకాశం కూడా లేదు. అలాచేస్తే నువ్వు బాధపడతావు. పాంటోమైమ్ ఆర్టిస్టులా మొహానికి నవ్వు పులుముకుని కనపడుతూండాలి ఎప్పుడూ. నువ్వురాక ముందు ఎలావుండేదాన్నో కూడా మర్చిపోయాను. నిద్రపట్టి చావట్లేదు. బెడ్ మీద అటు దొర్లనూ ఇటుదొర్లనూ! ఎప్పుడు ఎలా ఎక్కణ్ణించి సందు చేసుకుంటుందో తెలీదు నీ ఆలోచన. పొద్దున్న కేలండర్లో నీ పేరు కన్పించింది. దార్లో ఓ సూపర్ మార్కెట్కి నీ పేరు వుంది. చాలు, చిన్న సాకు చాలు; ఎంతో నియమంగా నిష్టగా కట్టుదిట్టంగా పాటించిన నిషేదాలన్నీ భళ్ళుమని తొలగిపోతాయి. ఇక ఆ తర్వాత చూడాలి నా పాట్లు. ఆలోచనని నీనుంచి మరల్చగలిగే పుస్తకాల కోసం, నేస్తాలకోసం, పనుల కోసం ఆత్రంగా దేబిరించటం. నేనంటే నాకే భయంకలిగేట్టు చేసి వదిలిపెట్టావుగా చివరకు? అప్పుడు గమనించిందామె: ఆలోచనలు తనకు తెలియకుండానే మాటల్ని తొడిగేసుకుంటున్నాయనీ, తను గుసగుసగా బయటకే మాట్లాడుతుందనీను. ఏం పిచ్చిదాన్నవుతున్నానా నేను! అద్దంలోకి చూసింది. "ఏంటే ఇదీ...!" తన బొమ్మని తనే జాలిగా అడిగింది. ఆ బొమ్మ మొహంలోని దైన్యం చూడగానే గుండె లోతుల్లోంచి గబుక్కున ఏదో పైకి ఎగదన్నుకుని వచ్చినట్టయింది. "ఎన్నాళ్ళిలా ఎన్నాళ్ళిలా!" భృకుటి ముడి పడి, ముక్కుపుటాలు నిగిడి, బుగ్గలు పైకి తేలి వంకరలు పోతూ... త్వరితంగా వికృతమయిపోతున్న తన మొహాన్ని చూడలేక అద్దం మీంచి దృష్టి మరల్చేసింది. కొద్దిగా వెనక్కి నడిచి గోడకి జారగిలబడింది. పెదాల్ని పంటికింద నొక్కిపట్టి చూరు వైపు చూస్తూ కన్నీటిని వదిలింది. చూరు మసకబారింది. కాసేపటికే ఎగశ్వాసతో గుండెలు అదుపు తప్పి అదిరిపడటం మొదలైంది. చేత్తో కణతలు నొక్కుకుంటూ, పళ్ళుగిట్టకరచి సాధ్యమైనంత నిశ్శబ్దంగా ఏడవడానికి ప్రయత్నిస్తోంది. సాధ్యంగాక అలాగే కిందికి జారి నేలమీద గొంతుక్కూర్చుంది. "నేన్నిన్ను మర్చిపోతాను, నేన్నిన్ను మర్చిపోతాను. ఇంతలా ఏడిపిస్తే నువ్వు నాకక్కర్లేదు" ఏడుస్తునే గొణుక్కుంది. కానీ అతను కోరుకునేదీ అదే అన్నది గుర్తురాగానే, ఈ మొత్తం సమస్యలో తనెంత ఒంటరిదో స్ఫురించి, మరో కెరటం ఎగదన్నినట్టయింది. వెక్కిళ్ళు మొదలయ్యాయి. వెక్కుతూనే, ఓ చేత్తో పక్కనున్న కుళాయి సీల తిప్పింది. బకెట్లో పడే నీళ్ళ శబ్దం తన ఏడుపు శబ్దాన్ని మించేట్టు బోలుగా ధార వదిలింది. మోకాళ్ళని కావిలించుకుని, చేతుల మధ్య మొహం దూర్చి, తనలోకి తను వెచ్చగా మునగదీసుకుపోయి, మనసారా ఏడ్చింది. చిత్రంగా, ఇంతసేపూ అతను తనని చూస్తున్నట్టే ఊహించుకుంది. ఇంతవేదనా వృథాగా పోతుందని నమ్మడం ఇష్టంలేక, ఇదంతా ఎలాగో అతనికి తెలుస్తుందని నమ్మింది. ఆ కాసేపూ అతను దేవునిలా సర్వాంతర్యామి అయ్యాడు. స్వయంగా పక్కన కూర్చుని ఆమె జుట్టు నిమరడమొకటే తక్కువ. కంటి ధారా ముక్కు ధారా ఏకమయ్యేంతదాకా ఏడ్చింది. కణతలు నొచ్చడం మొదలైంది. ఏడుపు ఆగి పొడి వెక్కిళ్ళు మాత్రమే మిగిలాయి. బకెట్ పొంగి పొర్లి సల్వార్కి తడి అంటడంతో బరువుగా లేచింది. కుళాయి కట్టింది. ఎగ్జాస్ట్ ఫేన్ రొద తప్ప అంతా నిశ్శబ్దం. లేచి అద్దం దగ్గరకు నడిచింది. తన మొహం చూసుకోవటానికి తనకే సిగ్గేసింది. కుళాయి తిప్పి మొహం రుద్ది రుద్ది కడుక్కుంది. చున్నీతో మొహం అద్దుకుంటూ గుండెల నిండా ఊపిరి పీల్చుకుంది. బరువంతా దిగేలా పెద్దగా నిశ్వసించింది. తలుపు తెరుచుకుని సీటు దగ్గరకు నడిచింది.
        కంప్యూటర్ ముందు ఏదో టైప్ చేస్తున్న నేస్తం భుజం చరిచి అడిగింది. "ఏమే, బిందీ వుంటే ఒకటివ్వు."

February 4, 2010

"వాళ్ళు చప్పట్లు కొట్టినా నాకు సయించదు."

“I swear to God, if I were a piano player or an actor or something and all those dopes thought I was terrific, I’d hate it. I wouldn’t even want them to clap for me. People always clap for the wrong things. If I were a piano player, I’d play it in a goddam closet.”
— Holden Caulfield, The Catcher in the Rye

జె.డి. శాలింజర్ చనిపోయాడని తెలియగానే నాకేమీ అనిపించలేదు. ఏమన్నా అనిపించాలేమో కదూ” “నన్ను కదిలించాలేమో కదూఅనుకుంటూనేనా అంతరంగంలో ఇసుమంతైనా భావోద్వేగపు ఆనవాలు పసిగట్టడానికి మనస్సాక్షి దుర్భిణి వేసి వెతుకుతూండగానేఆయన మరణానికి సంబంధించిన వార్తలన్నీ తిరగేసాను, నివాళిగా వచ్చిన వ్యాసాలన్నీ చదివాను. అది నాకు సంబంధించిన వార్తే అనిపించింది గానీ, నన్ను రవంతయినా కదిలించగలిగే వార్త అని మాత్రం అనిపించలేదు; ఇందుకు నా మనస్సాక్షి నువ్వు రాతి హృదయుడివి!అని ఎంత దెప్పిపొడిచినా సరే!  శాలింజర్ అనే కాదు, తమ పుస్తకాల ద్వారా నాతో సంభాషించిన ఏ రచయిత చనిపోయినా నా స్పందన ఇంతేనేమో. ఆయన ప్రముఖ నవల ద కేచర్ ఇన్ ద రైలో ముఖ్యపాత్ర హోల్డెన్ ఓ చోట అంటాడు: నాకు నచ్చే పుస్తకం ఏమిటంటే, దాన్నొకసారి చదవడం పూర్తి చేయగానే, ఆ రచయిత దగ్గరి నేస్తంగా తోచాలి, ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు అతనికి ఫోన్ చేసి మాట్లాడవచ్చనిపించాలి”. ఈ నిర్వచనం నాకు పూర్తిగా వర్తించదు. నాకలా ఎప్పుడూ ఏ రచయితతోనూ ఫోన్ చేసి మాట్లాడాలనిపించలేదు. ఎందుకంటే, నా వరకూ రచయిత అంటే అతని పుస్తకాలే. ఒక రచయిత పుస్తకం నాతో ఎంత ఆత్మీయంగా మాట్లాడినా సరే, ఆ పుస్తకానికి వెలుపలగా అతనికి ఓ లౌకికమైన ఉనికి ఉంటుందన్న స్ఫురణ ఎందుకో కలగదు; కలిగినా నిలవదు. నచ్చితే ఆ పుస్తకాన్ని మాత్రం ప్రాణంగా ప్రేమిస్తాను. ఇప్పుడిలా శాలింజర్‌ని దేవుడు భూమ్మీంచి తీసుకుపోయినా నాకేం పెద్ద ఫిర్యాదు లేదు; కానీ ఎవరన్నా నా అల్మరాలోంచి శాలింజర్ నాలుగు పుస్తకాల్నీ ఎత్తుకుపోతే మాత్రం పెద్ద దిగులే అనిపిస్తుంది. అవి ఇంకెక్కడా దొరకనివే అయితే, కొంప మునిగినట్టే కుదేలైపోతాను. అందుకే, నా వరకూ శాలింజర్ అంటే నా పుస్తకాల అల్మరాలో ఓ మూల ఒద్దికగా నిలబడ్డ ఆయన నాలుగు పుస్తకాలే; శాలింజర్‌ని గుర్తు చేసుకోవడమంటే ఆ పుస్తకాల్ని గుర్తు చేసుకోవటమే. ఆయన చనిపోయాడని తెలిసిన రోజు ఆఫీసు నుండి గదికి వెళ్ళాకా, అరచేతిలో ఇమిడిపోయే ఆ నాలుగు పుస్తకాల బొత్తినీ అరలోంచి బయటకు లాగి, టేబిల్ మీద పెట్టి యథాలాపంగా తిరగేయడం మొదలుపెట్టాను. మామూలుగా నేను పుస్తకాలు చదివేటపుడు నచ్చిన వాక్యమో, నెమరు వేసుకోదగ్గ పేరానో తారసిల్లితేఅక్కడే గీతలు గీసి పేజీ ఖరాబు చేయకుండాపక్కనో చిన్న టిక్ పెట్టి, వెనక అట్ట లోపలి భాగంలో ఆ పేజీ తాలూకు అంకె వేసుకుంటాను; ఆ అంకె పక్కన విషయాన్ని క్లుప్తంగా రాసుకుంటాను. ఇపుడు కేచర్ ఇన్ ద రైనవల తిరగేస్తుంటే వెనక అట్ట మీద “84 అన్న అంకె, దాని పక్కన “clue” అన్న పొడిమాటా కనిపించాయి. అలా ఎందుకు రాసివుంటానో మాత్రం గుర్తు రాలేదు. ఎనభైనాలుగో పేజీకి వెళ్ళి చూస్తే, అక్కడ, పైన ఇచ్చిన వాక్యాల దగ్గర టిక్ మార్కు కనిపించింది. ఇంతకీ ఆ నాలుగు వాక్యాలు దేనికి క్లూఅని నేననుకున్నట్టూ?


1951లో అచ్చైన జె.డి. శాలింజర్ తొలి పుస్తకమే (కేచర్ ఇన్ ద రై”) అమెరికన్ నవలా సాహిత్యంలో పెనుసంచలనమైంది. ఇందులో ముఖ్యపాత్రయిన హోల్డెన్ పదిహేడేళ్ళ కుర్రవాడు. పసితనానికీ పెద్దరికానికీ మధ్య వారధైన ఆ కౌమారప్రాయంలో, అటు దూరమైపోతున్న పసితనపు స్వచ్ఛతను వీడలేక, ఇటు మీద పడుతోన్న పెద్దరికపు కుత్సితత్వంలో ఇమడలేక తల్లడిల్లుతాడు. చివరికి ముగింపు దగ్గర, తన చిట్టి చెల్లెలి సాంగత్యంలో కాసేపు గడిపిన తర్వాత, తప్పనిసరైన పెద్దరికంతో తాత్కాలికంగానైనా రాజీకొస్తాడు. కౌమారప్రాయంలో అయోమయాన్నీ, ఇమడలేనితనాన్నీ, తిరుగుబాటు ధోరణినీ చాలా సహజంగా చూపించగల్గిన ఈ నవల అప్పటి అమెరికన్ యువతరానికి పవిత్ర మత గ్రంథమైంది; దీని కథానాయకుడు హోల్డెన్ ఒక పురాణపాత్ర స్థాయినందుకున్నాడు; దీని రచయిత శాలింజర్ హఠాత్తుగా ప్రవక్త అయికూర్చున్నాడు. టీనేజర్ మనసును ఆయన అర్థం చేసుకోగలిగినంతగా ఏ రచయితా అర్థం చేసుకోలేదన్నారు పాఠకులు. అమెరికన్ సాహిత్య పరంపరలో మార్క్‌ట్వయిన్ హకల్‌బెరీఫిన్తర్వాత కథనంలో అలాంటి గొంతును అంత సమర్థంగా వాడుకున్న నవల కేచర్ ఇన్ ద రైమాత్రమే అన్నారు విమర్శకులు. అయితే శాలింజర్ ఒక టీనేజర్ ప్రధానపాత్రగా నవల రాయాలనుకున్నాడే గానీ, టీనేజర్స్ కోసం నవల రాయాలనుకోలేదు. ఇప్పుడీ ప్రఖ్యాతినీ, ప్రవక్త హోదానూ ఆయన ఊహించనూ లేదు, ఆశించనూ లేదు. ఈ అనూహ్యమైన తాకిడికి తట్టుకోలేకపోయాడు. నెమ్మదిగా తన్నుతాను ప్రపంచానికి దూరం చేసుకోవటం మొదలుపెట్టాడు. న్యూయార్క్ మహానగరం నుంచి, న్యూహాంప్‌షైర్లో కోర్నిష్అనే మారుమూల పట్టణానికి మకాం మార్చాడు.
1953లో శాలింజర్‌మరో పుస్తకం వచ్చింది. కేచర్ ఇన్ ద రైనవల కన్నా ముందుగానో లేక సమకాలికంగానో రాసిన తొమ్మిది కథల్ని సంపుటిగా కూర్చి నైన్ స్టోరీస్పేరిట విడుదల చేశాడు. ఇందులో ప్రతీ కథా ఒక అద్వితీయమైన ఆణిముత్యమే అనిపిస్తుంది నాకు (ఒక్క టెడ్డీఅన్న చివరి కథ తప్పించి). ఏ రెండు కథలకీ ఏ సామ్యమూ ఎత్తి చూపలేని ఊహాతీతమైన కల్పనాశక్తి, కథల్లో అందీ అందక దోబూచులాడే భావం, కథల నడకలో అలవోకడ, వచనం పోకడలో సాటిలేదనిపించే స్పష్టత, సంభాషణల అల్లికలో శాలింజర్‌కు దాదాపు దైవదత్తమేమో అనిపించే సహజ నైపుణ్యం... ఇవన్నీ కలిసి ఈ మలి పుస్తకాన్ని కూడా అందరికీ ప్రేమపాత్రం చేశాయి. అయితే, “కేచర్...” నవల ప్రభావం ఎంత గాఢమైందంటే, అంతా ఈ కథల్లో కూడా దాని ఛాయల్నే వెతుక్కోవడం మొదలుపెట్టారు. కానీ శాలింజర్‌కౌమారప్రాయాన్ని ఒక ఇతివృత్తంగా అప్పటికే విడిచిపెట్టేశాడు. తనకు సొంత జీవితంలో ఎదురవుతున్న ప్రశ్నల వేపు అప్పుడప్పుడే కొత్త ఇతివృత్తాల్ని ఎక్కుపెడుతున్నాడు.
ప్రపంచం పట్ల తనలో రగిలే ప్రశ్నల్ని సజీవంగా నిలుపుకోగలిగినన్నాళ్ళే ఏ రచయితైనా పాఠకులకు మిగులుతాడు. ఆ ప్రశ్నలకు ఏవో కొన్ని జవాబుల్ని కిట్టించుకుని సమాధానపడిపోయిననాడు, రాయటం ఆపేస్తాడు. ఈ పరిణామం సానుభూతితో అర్థం చేసుకోదగ్గదే. వయసు ఉడిగే కొద్దీ, జీవితాకాశంలో దేహం మలిసంధ్యకు క్రుంగే కొద్దీ, ఇంకా మొండి ప్రశ్నలతో సావాసం అంటే దుర్భరమే అనిపిస్తుంది ఎవరికైనా. ముసలితనం పరీక్ష హాల్లో మృత్యువు ప్రశ్నాపత్రంతో ఎదురవబోయే వేళకు, ఎవరైనా సమాధానాల్తో తయారుగా వుండాలనుకుంటారే గానీ, ఇంకా ప్రశ్నలతో తెల్లమొహం వేయాలనుకోరు కదా. అప్పుడిక సమాధానాలు దొరికినా దొరక్కపోయినా దొరికిన దాంతోనే సమాధానపడిపోతారు కొందరు. మన చలం అలానే రమణమహర్షి దగ్గర సమాధానపడిపోయాడేమో అనిపిస్తుంది. శాలింజర్‌కూడా ఈ దశలో ఆధ్యాత్మికత వైపు మళ్లాడు. హిందూ అద్వైత వాదాన్నీ, ఉపనిషత్తులనూ, రామకృష్ణపరమహంస బోధనల్నీ, జెన్ తాత్త్వికతనూ ఆకళింపు చేసుకోవటం మొదలుపెట్టాడు. అయితే వాటితో సమాధానపడిపోయాడని మాత్రం చెప్పలేం. తన ప్రశ్నలకు సమాధానాలు వాటిలో వెతుక్కునే ప్రయత్నం మొదలుపెట్టాడంతే. తర్వాతి రెండు పుస్తకాల్లోనూ ఈ అన్వేషణే కనిపిస్తుంది. ఈ రెండిట్లోనూ ఒక్కో పుస్తకంలోనూ రెండేసి పెద్ద కథలు (లేదా నవలికలు) ఉంటాయి.
1961లో అచ్చైన ఫ్రానీ అండ్ జోయీలో ఉండటం రెండు కథలున్నా, అవి ఒకదానికొకటి కొనసాగింపుగా ఉండటం వల్ల, ఒకటే పెద్దకథగా లెక్కలోకి తీసుకోవచ్చు. దీని తర్వాత 1963లో అచ్చైన రైయిజ్ హై ద రూఫ్ బీమ్, కార్పెంటర్స్ అండ్ సేమోర్: ఏన్ ఇంట్రడక్షన్లో కూడా రెండు కథలుంటాయి. కానీ ఇవి వేటికది వేర్వేరు. మొత్తంగా చూస్తే, రెండు పుస్తకాల్లోని ఈ నాలుగు కథల్లోను, ఒక్క రైయిజ్ హై ద రూఫ్ బీమ్, కార్పెంటర్స్అన్న కథే స్వయం సమృద్ధమైన కథగా అనిపిస్తుంది. అంటే రచయిత ఏ బయటి ఉద్దేశ్యంతోనూ ముడిపెట్టకుండా రాసిన కథ. మిగతా మూడింటిలోనూ రచయిత తన ఆధ్యాత్మిక అన్వేషణను కథ అనే చట్రంలో ఇమిడ్చేందుకు ప్రయత్నించటం కనిపిస్తుంది. అవి ఒకప్రక్క కథకు కావాల్సిన కళాత్మక పరిపూర్ణతను సాధించేందుకు ప్రయత్నిస్తూనే, మరోప్రక్క రచయిత తనలో ముసురుకుంటున్న ప్రశ్నా ప్రహేళికల్ని ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు వాడుకున్న పనిముట్లుగా కూడా పన్చేస్తాయి. ఈ విషయంలో ఆయన గొప్పగా సఫలీకృతుడయ్యాడనే చెప్తాను నేను. నాకాయన ప్రశ్నలూ నచ్చాయి, వాటి పరిష్కారానికి ఇలా కథల రూపంలో చేసిన ప్రయత్నమూ నచ్చింది. కానీ ఈ రెండు పుస్తకాలూ విడుదలైనపుడు వచ్చిన స్పందన మాత్రం భిన్నంగా వుంది. శాలింజర్‌నుంచి కేచర్ ఇన్ ద రైతరహాలో యువతరానికి మరో ప్రవచనం రాబోతోందని ఎదురుచూసిన అధికశాతం పాఠక జనమూ విమర్శక బృందమూ కలిసి, వీటిని చేట చెరిగి వదిలిపెట్టారు. వీటిలో వాళ్ళాశించిందేదో దొరకలేదు. అంతే, అప్పటినుండి, మొన్న జనవరి ఇరవయ్యేడున చనిపోయే వరకూఅంటే నలభయ్యేడేళ్ళు!ఆయన మరే రచనా పుస్తకంగా తీసుకురాలేదు. (1965లో హాప్‌వర్త్ 16, 1924” అనే రచన చేసినా పుస్తకీకరణకు నిరాకరించాడు.)
తనను తాను మూసేసుకున్నాడు. కోర్నిష్‌లో పెద్దగా ఇరుగూపొరుగూ లేని తన ఇంటిలో ఒంటరిగానే ఎక్కువకాలం గడుపుతూ, ఎవ్వర్నీ కలవకుండా, కెమెరాలకు చిక్కకుండా, ఇంటర్వ్యూలు నిరాకరిస్తూ, తన రచనల్ని సినిమాలుగా తీస్తామన్న వాళ్ళ ప్రతిపాదనల్ని తిరస్కరిస్తూ, ప్రైవసీని ప్రాణప్రదంగా కాపాడుకుంటూ ఈ నలభయ్యేడేళ్ళూ గడిపాడు. ఆయన్ను కలవాలని వచ్చే పాఠకాభిమానులకు చివరికి ఆ ఊరివాళ్ళు కూడా చిరునామా చెప్పేవారు కాదట. ఈ మధ్యే ఒక మాజీ ప్రేయసి, సొంతకూతురూ ఆయన్ను గూర్చి ఏదో అక్కసుతో రాసినట్టనిపించే రెండు పుస్తకాలు విడుదలయ్యాయి. వాటిలో లభ్యమైన కొన్ని వివరాలు తప్ప, వేరే వ్యక్తిగత వివరాలు ఎవ్వరికీ తెలియవు. (తన ప్రైవసీని అంతగా కాపాడుకునే వ్యక్తి జీవిత వివరాల్ని పుస్తకరూపేణా సంతలో అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకోవాలనుకునే వాళ్ళ ధోరణిలో అక్కసు లాంటి నీచపుటుద్దేశాలు తప్ప ఇంకేం చూడగలం?) అయితే ఈ పుస్తకాల్లోని సమాచారం తోబాటూ, ఎప్పుడో ఇచ్చిన ఓ అరుదైన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తే, ఒక ఆశ్చర్యకరమైన, ఆశ కలిగించే విషయం మాత్రం తెలుస్తుంది. శాలింజర్‌ప్రచురణకు ఏమీ ఇవ్వకపోయినా, చనిపోయేవరకూ ఏవో రాస్తూనే ఉన్నాడట! నిజానిజాలు ఇంతదాకా ఎవరూ నిర్థారించకపోయినా, పాఠకలోకం మాత్రం ఆ రచనలకు ఏం రాత రాసిపెట్టి వుందోనని ఉత్సుకంగా ఎదురుచూస్తోంది.
ఇలా స్థూలంగా చూస్తే, “కేచర్ ఇన్ ది రైనవల తర్వాత శాలింజర్‌రచనాజీవితం ఇటువంటి అరుదైన మార్గం ఎందుకుపట్టిందన్న దానికి, ఆ నవల్లోంచి నేను పైన ఇచ్చిన నాలుగు వాక్యాల్లోనే బాహటమైన క్లూ దొరుకుతుంది. అక్కడ హోల్డెన్ ఒక పియానో ప్లేయర్ గురించి మాట్లాడుతున్నాడు. రచయితలు తమ రచనల్లో ఏ కళ గురించి మాట్లాడినా (చిత్రకళ, శిల్పకళ, సంగీతం...), అవి తరచూ తమ రచనావ్యాసంగం గురించే వేరే కళ ముసుగులో చేస్తున్న వ్యాఖ్యానాలయి వుంటాయి. అందుకే, పై వాక్యాల్లో పియానో ప్లేయర్అన్న పదాన్ని రచయితఅన్న పదంతో పక్కకు నెట్టి ఇలా చదువుకోవచ్చు:
ఒట్టేసి చెప్తున్నా, నేనే గనుక రచయితనైతే, ఆ వెర్రికుంకలంతా నేను గొప్పగా రాస్తున్నానంటే, నేనది అసహ్యించుకుంటాను. వాళ్ళు చప్పట్లు కొట్టినా నాకు సయించదు. జనం ఎప్పుడూ తప్పుడు విషయాలకి చప్పట్లు కొడతారు. నేనే గనుక రచయితనైతే, నా రాతల్ని ఓ అల్మరాలో బిడాయించుక్కూర్చుని రాసుకుంటాను.
ఇక్కడ శాలింజర్‌తన కథానాయకుని గొంతుతో వెళ్ళగక్కుతోన్న కోపమంతా తప్పుడు విషయాలకు చప్పట్లు కొట్టేవాళ్ళ మీద; తన పుస్తకాల్ని కేవలం పఠనానందం కోసం గాక, వాటిని ఏవో ధోరణులకు ప్రతిబింబాలుగా చూడ్డమో, లేక ఇంకేవో ధోరణులకు విరుగుడుగా చూడ్డమో, ఇలా ఆయన ఉద్దేశించని సంగతుల్ని వాటిలో వెతుక్కుని మెచ్చుకునే వాళ్ళ మీద; విమర్శకుల మీద, విశ్లేషక పండితుల మీద, పండిత పాఠకుల మీద; ఒక్కముక్కలో హోల్డెన్ మాటల్లో చెప్పాలంటే: Phonies అందరి మీదా! శాలింజర్‌తన చివరి పుస్తకానికి రాసిన అంకితం చూస్తే, ఆయన తన ఆదర్శ పాఠకులుగా ఎవర్ని కోరుకున్నాడో అర్థమవుతుంది:
“If there is an amateur reader still left in the world—or anybody who just reads and runs—I ask him or her, with untellable affection and gratitude, to split the dedication of this book four ways with my wife and children.”
(ఈ ప్రపంచంలో ఇంకా అమెచ్యూర్ పాఠకుడు అనేవాడు ఎవడైనాకనీసం చదివి తన మానాన తాను పోయేవాడు ఎవడైనామిగిలి ఉంటే, నేను చెప్పలేనంత అనురాగంతోనూ కృతజ్ఞతతోనూ వాణ్ణి నా భార్యా పిల్లలతో పాటూ నాలుగోవంతుగా ఈ పుస్తకాన్ని అంకితం తీసుకొమ్మని అడుగుతున్నాను.)
నేను జె.డి. శాలింజర్‌పేరు మొదటిసారి విని చాలా యేళ్ళే అవుతుంది. కానీ కేచర్ ఇన్ ది రైనవలని ఆవరించి వున్న హంగూ ఆర్భాటమూ, అది టీనేజర్లకు  బైబిల్ కమ్ ఖురాన్ కమ్ భగవద్గీత అన్నంత హడావిడీ... కలిసి ఎందుకో ఆయన మన తరహా రచయిత కాదేమో అనిపించేలా చేసాయి. రెండేళ్ళ క్రితమనుకుంటా, నా అభిమాన రచయిత నబొకొవ్ 1978లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ చదివాను. దాంతో శాలింజర్‌పై నాలో ఆసక్తి ఉవ్వెత్తున పెరిగిపోయింది. అనేవాణ్ణి బట్టి మాటకో విలువ ఏర్పడుతుంది. విమర్శిస్తూ రాయటం చాలా సులభమనీ, పొగుడుతూ రాయడమే కష్టమనీ; అయినా ఎప్పుడోకప్పుడు శాలింజర్‌ని ఆకాశానికెత్తుతూ ఏవన్నా రాయాలనుందనీ, ఆ ఇంటర్వ్యూలో అన్నాడాయన. నబొకొవ్ పఠనాభిరుచులూ, వాటిని వ్యక్తం చేయడంలో ఆయన నిక్కచ్చితనమూ, అన్నింటికన్నా ముఖ్యంగా ఆయన రచనలూ తెలిసిన నాలాంటి వాడికి, ఆయన నోటమ్మటా ఒక రచయిత గురించి అందునా ఒక సమకాలీన రచయిత గురించి ఇలాంటి వ్యాఖ్యానం వచ్చిందంటే దానికెంత విలువుందో వెంటనే అర్థమైపోతుంది. ఈ సిఫారసుతోనే నేను కేచర్ ఇన్ ద రైకొన్నాను. నచ్చింది. కానీ నబొకొవ్ నుంచి శాలింజర్‌కు ఆ స్థాయి మెచ్చుకోలు ఇప్పించగల సత్తువేమీ అందులో కనపడలేదు. ముందైతే బోలెడు “goddam”లూ, “and all”లూ, “swear to God”లూ, “I know it’s crazy”లూ మాత్రం కొట్టొచ్చినట్టూ కనపడ్డాయంతే. మాట్లాడేరచనలు నన్ను పెద్దగా ఆకట్టుకోవు. అలాంటి రాతల్లో chatty tone చిరాకు కలిగిస్తుంది. రాయబడినరచనలే నచ్చుతాయి. వాటిలో ఏదో నిశ్శబ్దం నా ఏకాంత పఠనానికి అందంగా అమరుతుంది. ఇందులో కథానాయకుడు, పుస్తకం మొదలుపెట్టిందే తరువాయి, సూటిగా కలివిడిగా మనతో మాట్లాడేస్తుంటాడు. ఈ పదిహేడేళ్ళ పసివాడు అడపాదడపా మనుషుల ప్రవర్తన మీద చేసే ముదిపేరయ్య పరిశీలనలు మాత్రం బాగా నచ్చాయి. అతని కొన్ని మాటలు పైకి తేలికగానే కనిపిస్తూ, తరచి చూస్తే ఎంతో లోతైన అవగాహన (బహుశా అతనికే తెలియని అవగాహన) వెలిబుచ్చుతాయి. అలా నన్ను బాగా ఆకట్టుకుందీ పుస్తకం. తరువాత నైన్ స్టోరీస్చదవటం మొదలుపెట్టాను. ఇక్కడ అర్థమైంది శాలింజర్‌ని నబొకొవ్ ఎందుకలా పొగిడాడో! పైనే చెప్పినట్టు ప్రతీ కథా ఆణిముత్యమే. కథల్ని అలా రాయవచ్చని అంతకుముందు నిజంగా నాకు తెలియదు. (శాలింజర్‌ని చదవాలనుకునే వాళ్ళు ముందు ఈ పుస్తకంతో మొదలుపెడితే బాగుంటుందని నా సలహా.) పైగా హోల్డెన్ లాంటి కబుర్లపోగు కూడా ఇక్కడ అడ్డంగా లేకపోవటంతో, శాలింజర్‌ప్రపంచం నాకు మరింత దగ్గరగా వచ్చి చేరినట్టనిపించింది. ఇక తర్వాత ఫ్రానీ అండ్ జోయీ”, “రైయిజ్ హై...” చదివాకా శాలింజర్‌తో జీవితకాలపు ప్రేమ స్థిరపడిపోయింది.
ఇప్పుడు జె.డి. శాలింజర్‌అనే రచయిత మరణించాడు. ఇన్నాళ్ళూ నాతో సన్నిహితంగా మాట్లాడిన ఓ గొంతు తాలూకూ మనిషి ఇప్పుడు లేడు. కానీ ఆ గొంతు మాత్రం నాతోనే వుంది, వుంటుంది: ఎప్పటికీ పసితనాన్ని వీడలేకపోయిన గొంతు; ప్రపంచంలో దేంతోనో అస్సలు రాజీపడలేకపోయిన గొంతు; ఎవరికోసం రాయాలన్న ప్రశ్న కలిగినపుడల్లా లావంటావిడకోసం రాయమని గుర్తు చేసే గొంతు; భౌతిక ప్రపంచపు లెక్కల ప్రకారం ఇప్పుడు చనిపోయినా, నేను నాతో పాటూ చిరకాలం సజీవంగా మోసుకెళ్ళే గొంతు.... లాంగ్ లివ్ శాలింజర్‌!


పూర్తి భాగం "పుస్తకం.నెట్"లో చదవచ్చు! 

January 20, 2010

ఆలూరి బైరాగి కథా సంపుటి: దివ్య భవనం

ఆలూరి బైరాగి పేరు ఇదివరకూ అడపాదడపా వినడం విన్నాను. కానీ ఎందుకో అకారణంగా ఆ పేరు నా మెదడులో “నగ్నముని” మొదలైన — నన్ను బెంబేలెత్తించే — కొన్ని పెట్టుడు పేర్లతో ముడిపడిపోయింది. దాంతో ఎప్పుడూ ఆ పేరు వెనుక మనిషిపై పెద్దగా ఆసక్తి కలగలేదు. మొన్నొక కవితా సంకలనంలో చదివిన రెండు కవితలూ మాత్రం బాగా నచ్చాయి. తర్వాత ఇదే సైట్‌లో ఎక్కడో ఆయన కథల గురించి ప్రస్తావన కనిపిస్తే “కథలు కూడా రాసాడన్నమాట” అనుకున్నాను. ఇటీవలి పుస్తక ప్రదర్శనలో కొనలేకపోయిన పుస్తకాలు “బుచ్చిబాబు కథలు”, “దువ్వూరి వెంకట రమణశాస్త్రి – స్వీయచరిత్ర” కొనటానికి మొన్న విశాలాంధ్రా వెళ్లి, కొనడం ఐన తర్వాత అలవాటుగా మిగతా అరల్లో పుస్తకాల వరుసలన్నీ కెలుకుతూంటే, ఈయన కథాసంపుటి “దివ్య భవనం” కంటపడింది. నన్ను నలుపు రంగు కవర్లెందుకో ఉత్తపుణ్యానికి ఆకట్టుకుంటాయి. ఈ పుస్తకం విషయంలో కవరు రంగే కాదు, ఇంకా చాలా విశేషాలున్నాయి: వెనక కవరు మీద రచయిత అందమైన ముఖం (అందమైన వాళ్లు జీవితంలో అందవిహీనమైన, వికృతమైన పార్శ్వాల్ని కూడా వెనుకాడకుండా నిస్సంకోచంగా రాయగలరని నాకో మూఢ నమ్మకం), పక్కనే ఇచ్చిన జనన-మరణ తేదీల ప్రకారం చిన్నవయస్సులోనే మరణించాడని తెలియడమూ (కాఫ్కా వల్లనో, తిలక్ వల్లనో మరెవరి వల్లనో తెలీదు గానీ, వృద్ధాప్యాన్ని చూడని రచయితలంటే నాకు ప్రత్యేకమైన ఆకర్షణ), క్రింద ఇచ్చిన జీవిత సంక్షిప్తంలో ఈయన త్రిభాషా ప్రావీణ్యం గురించి ప్రస్తావనా (ఎక్కువ భాషలు తెలిసిన వారికి మాతృభాషను ప్రత్యేకమైన దృష్టితో చూడటం అలవడుతుందనీ, ఫలితంగా వారి వచనం బాగుంటుందనీ నాకింకో మూఢ నమ్మకం), పేజీలు యధాలాపంగా తిరగేస్తుంటే “బీజాక్షరి” అన్న కథలో కళ్ళను కట్టిపడేసిన కొన్ని వాక్యాలూ (వాటిలో ఇదొకటని గుర్తు: “ఆ ఎలుక సుఖదుఃఖాలకు, రాగద్వేషాలకు అతీతమై, ఏదో ఒక ఉత్తుంగ గిరి శిఖరం మీది నుంచి క్రింద వున్న ప్రపంచాన్ని చూచినట్టుగా, అనిర్వచనీయమైన కరుణతో అతన్ని చూస్తున్నది.”), పైపైచ్చు పుస్తకం వెల వందరూపాయలే కావడమూ (ఇదో స్వయం సమృద్ధమైన కారణం కాదూ!). . . ఇత్యాది ఉత్ప్రేరకాలన్నీ ఒక్కుమ్మడిగా పన్చేసి నా చేత ఈ పుస్తకాన్ని కొనిపించాయి. ఇంటికెళ్ళి చదవడం మొదలుపెట్టింది తడవు — సెలవ రోజు కూడా కావటంతో — దాదాపు ఐదుగంటలు ఒకే విడతగా సాగిన పఠనంలో మొత్తం పుస్తకాన్ని పూర్తి చేసేసాను. ఇదివరకూ ఎన్నడూ వినని, కనీసం దాని ఉనికి ఉందన్న సూచన కూడా అందని, కొత్త గొంతేదో నన్ను నిమంత్రించి నియంత్రిస్తుంటే, మంత్రముగ్ధుణ్ణై చదువుతూ వుండిపోయాను. ఇలా చదివించింది ముఖ్యంగా శైలి. కొంతమంది కవులు వచనం రాసినా తమ కవిత్వపు అద్దకం పనీ, చెక్కుళ్ళ పోకడా వదులుకోలేరు. కొందరు మాత్రం — ఏదో ఆ అద్దకం పనికి కావాల్సిన ఏకాగ్రత నుండీ, ఆ చెక్కుడు పనిలోని అలసట నుండీ విముక్తి పొందడానికే అన్నట్టు — వచనం దగ్గరకొచ్చేసరికి గట్టు తెంచుకున్న వరదలా ప్రవహించేస్తారు. అంటే వాళ్ళు నిజంగా రాసేటప్పుడు అలా ప్రవహించినా ప్రవహించకపోయినా, చదివేటప్పుడు ఆ భ్రమను మాత్రం అలవోకగా మన ముందుంచుతారు. బైరాగి శైలిలో ఆ ప్రవాహగుణం వుంది. అందుకే కొన్ని కథలు చివరిదాకా వచ్చేసరికి మనకేమీ ఇవ్వక, ఎటూ కాకుండా ముగిసి, నిరాశ కలిగించినా, అవి మనల్ని అంటిపెట్టుకు కడదాకా చదివించిన వైనం మాత్రం నచ్చుతుంది. బైరాగి శైలిలో నాకు నచ్చిన గుణం మరొకటి వుంది. చాలా మంది రచయితల్లో ప్రతీ వాక్యమూ ఒక విడి యూనిట్‌గా వుంటుంది. ఒక్కో వాక్యం ఒక్కో ఆలోచననో, దృశ్య విశేషాన్నో ఇచ్చి ముగిసి పక్క వాక్యానికి దారిస్తుంది. ఎంత కథలో నిమగ్నమైనా, ఈ విభజన మనకు అంతర్లీనంగా స్ఫురిస్తూనే వుంటుంది. కానీ బైరాగి వాక్యాలు అలాక్కాదు. అవిభాజ్యంగా, ఆనవాలు దొరకని విధంగా ఒక దాంట్లోంచి మరొక దాంట్లోకి ప్రవహిస్తూ పోతాయి. వాక్యాల మధ్యే కాదు; విడి విడి పేరాగ్రాఫుల మధ్య కూడా ఇదే అవిభాజ్యత. చివరికి కథ కూడా ఒక ప్రత్యేకమైన యూనిట్ అనిపించదు. వెనకెక్కణ్ణుంచో వచ్చి ఆగకుండా ముందెక్కడికో పోయే రైలు, కొద్దికాలం పాటూ ప్లాట్‌ఫామ్ మీద నిలబడ్డ మనల్ని తన సంచలనంతో ముంచెత్తినట్టు — మన చుట్టూ దుమ్ము రేపి, జుట్టు చెదరేసి, దుస్తులు అతలాకుతలంగా ఎగరేసి పోయినట్టు — ఈ కథలు ఎక్కడో పుట్టి ఎక్కడికో పోతూ వయా మధ్యలో మనల్ని కదిపి పోతాయంతే. నేనిలా నా రూపకాల యావలో పడి, ఆ పరాకులో అసలు విషయాన్ని బలవంతాన వాటి ముడ్డికి కట్టి ఈడ్చుకొచ్చే పాపానికి పూర్తిగా ఒడిగట్టకముందే, ఇక్కడతో ఈ బృహద్విశ్లేషణలాపి కథల సంగతి కొస్తాను. వీటిలో నాకు బాగా నచ్చిన కథల్ని, అవే క్రమంలో నచ్చాయో అవే క్రమంలో, క్లుప్తంగా పరిచయం చేస్తాను.

జేబు దొంగ: ఇది మొత్తం సంపుటిలో నాకు బాగా నచ్చిన కథ. ఇతివృత్తమంటూ పెద్దగా చెప్పుకోదగ్గదేం లేదు. ఒక నిరుద్యోగ యువకుడు గడవడానికి డబ్బుల్లేక అల్లల్లాడుతూ, పరిచయస్తుడైన ఓ పెద్దాయన్ని అర్థించి, “ఇస్తానూ – ఇవ్వనూ” అన్న ఇదమిత్థమైన భరోసా ఆయన్నుంచేమీ రాకపోయినా, ఇవ్వచ్చేమోనన్న ఆశతో ఆ రాత్రి ఆయన సతీసమేతంగా ఊరెళ్తోంటే సాగనంపటానికి రైల్వే స్టేషన్‌కి వస్తాడు. ఇంతాజేసి ఆయన రైలు కదిలేముందు యువకుని చేతిలో ఓ ముష్టి ఐదురూపాయల కాగితం పెడ్తాడు. యువకుడు నిర్విణ్ణుడై వెనుదిరుగుతాడు. స్తబ్ధావస్థలో తన గది వైపుగా రోడ్డు మీద నడుస్తుంటే, వెనక నుంచి ఓ పద్నాలుగేళ్ళ కుర్రవాడు జేబులోంచి ఆ ఐదురూపాయలూ కొట్టేయబోతాడు. యువకుడు అప్రయత్నంగానే గబుక్కున వెనుదిరిగి వాడి చేయి పట్టుకుంటాడు. వాడి కళ్ళలో భయదైన్యాలు చూసి యువకునిలో హఠాత్తుగా ఏదో మార్పు వస్తుంది. చుట్టూ వున్న తెరలేవో జారిపోయి, ఆ కుర్రవాడికీ తనకూ మధ్య ఏదో అద్వైతం స్ఫురిస్తుంది. “జీవితపు రక్తోజ్వల ముక్తి క్షణ”మేదో అనుభూతికొస్తుంది. కుర్రవాడి చేయి వదిలి వాణ్ణి దయగా దగ్గరికి తీసుకోబోతాడు. వదలడమే తరువాయి, వాడు తుర్రున పారిపోతాడు. యువకుడు తిరిగి తన గది వైపు నడవడం మొదలుపెడతాడు. అంతే కథ! కానీ రచయిత ఆ యువకుని మానసిక చైతన్యాన్ని అందుకున్న తీరూ, కథ మొదట్లో ఎత్తుగడా, ముగింపు దగ్గర దాన్ని వాడుకున్న విధానం అబ్బురపరుస్తాయి. ఆ యువకునికి ఒక జేబుదొంగలో దైవ సాక్షాత్కారం లాంటిది చేయించడమన్నది మామూలు ఆలోచనే అనిపిస్తుంది; కానీ చేయించిన తీరు మాత్రం అద్భుతమనిపిస్తుంది. (చదవబోయే వారి అనుభవాన్ని పాడుచేస్తుందన్న అనుమానం లేకపోతే ఆ చివరి పేరా యథాతథంగా ఇక్కడ ఇచ్చేసే వాణ్ణే!) ముఖ్యంగా ఆ యువకుని చైతన్య స్రవంతిని ఉన్నదున్నట్టు అక్షరాల్లోకి మళ్ళించడంలో రచయిత ప్రదర్శించిన నైశిత్యం చూస్తే, ఈ విషయంలో అతను బుచ్చిబాబుకు బాబనిపించాడు. కొన్నాళ్ళ క్రితం బుచ్చిబాబు “ఎల్లోరాలో ఏకాంతసేవ” చదివాను. ఆయన ఈ కథలో జ్ఞాన సుందరి అనే పాత్ర ఆలోచనా స్రవంతిని నమోదు చేయటానికి ప్ర్రయత్నిస్తాడు. కానీ చాలాచోట్ల నాకెందుకో ఆయన ఆమెలో సాగుతున్న ఆలోచనల్ని నమోదు చేయటం గాక, ఆ ఆలోచనల్ని స్వయంగా తనే ఆమె మనస్సులో కూరుతున్నట్టనిపించింది. ఫలితంగా అవాంఛనీయమైన రచయిత నీడ కథలో ఆద్యంతం ఆమె వెనుక కనిపిస్తూనే వుంది. కానీ ఈ “జేబు దొంగ” కథలో ఎక్కడా ఆ యువకుని ఆలోచనల వెనుక రచయిత ప్రమేయం కనిపించదు. వచనం చిక్కగా వుంటూనే సులువుగా పారుతుంది కూడా. దేవుడెక్కడో లేడనీ, నిత్యం తారసపడే మనుషుల ద్వారానే మనతో దోబూచులాడుతుంటాడనీ సూచించే మొదటి పేరాలు, కవి అన్నవాడు వచనం రాస్తే ఎలా వుండచ్చో రుచి చూపిస్తాయి:

“మెలకువలోను నిద్దురలోనూ, నీ హృదయపు చీకటి గదిలో మేలుకొన్నవాడు; నీ కళ్ళు కునకడం, నీ మెటిమలు విరగడం, నీ మెడ క్రింద లోయలో చిన్న చిట్టి నరం నీడలా చలించడం, ఇవన్నీ గమనించినవాడు అతడే. నీవు నవ్వుతున్న విధంగా నవ్వడం, నీవు ఏడుస్తున్న విధంగా ఏడవడం, ఏమీ తోచనప్పుడు కాళ్ళాడిస్తూ కూచోటం, నీకు నేర్పిన వాడు అతడే. ప్రపంచమంతా చీకటి చెరగు కింద నిద్దురలో, దద్దరిల్లిన క్షణాల్లో నీ ఎడమ చేతిని కుడి చేయి ఎరుగని రోజుల్లో అంతా అయోమయంగా వున్నప్పుడు కూచుని కాపలా కాసినవాడు అతడే. ఆకాశంలో నక్షత్రాలూ, భూమి మీద దీపాలూ, రాత్రి రాల్చిన మంచుబొట్లూ, కునుకెరుగని కన్నీటి చుక్కలూ, లెక్కబెట్టిన గణిత శాస్త్ర పారంగతుడు అతడే. అతడే నీవు సిద్ధంగా లేని సమయాలలో వస్తాడు. నీవు సిద్ధం కాకముందే వెళ్ళిపోతాడు. నీవు స్వాగతపత్రం ఇచ్చిందాకా, కాళ్ళకు నీళ్ళిచ్చి కుశల ప్రశ్నలు వేసిందాకా ఆగడు. అతడు వచ్చిన క్షణం మెరుపు మెరుస్తుంది. ఉరుము వురుముతుంది. తప్ప త్రాగిన తుఫానులో ప్రపంచపు పర్వత శిఖరాగ్రాలపై పాలుగారే పసిపాపలు సెలయేళ్ళ జల జలలా పకపకా నవ్వుతూ పరిగెత్తుతారు. ఒక్క క్షణం అంతా వుంటుంది. ఏదీ లేకపోదు. ఆ మనిషి. అతడే మనిషి. మనుష్య మాత్రుడు కాదు గాని కేవలం మనుష్యుడు. ఈ క్షణం ఆకాశం క్రింద ఈ ప్రదేశంలో రెండడుగుల మేర మానవుడా! మానవుడా! కొంచెం కరుణ కావాలి కదూ?”

బీజాక్షరి: జీవితాన్ని కాస్తో కూస్తో జీవించటమంటూ జరిగాక చుట్టూ ప్రపంచపు జిలుగువెలుగులెన్నో మనలో ప్రతిఫలిస్తాయి. ఎంతెంతో ప్రపంచం మనలో బరువుగా నిండుకుంటూ వస్తుంది. దాన్ని మనకే పరిమితమై మిగిలిపోనీయకూడదనుకుంటే, మనతో పాటే మట్టిలో కలిసిపోనీయకూడదనుకుంటే, భావికి సందేశంగా అందియ్యాలనుకుంటే, కళ కావాలి. రచయితలైతే రాత కావాలి. ఇక్కడ ఒక “అబ్బాయి” ప్రపంచం తనలో నింపిన ఆశనూ, జీవితం పట్ల కృతజ్ఞతనూ కథ ద్వారా బయట పెడదామని కూర్చుంటాడు. రాతబల్ల, కుర్చీ, కాగితమూ, కలమూ, సిరా. . . ఇలా సరంజామా అంతా సిద్ధంగా వుంటుంది. ఒక వాక్యం రాస్తాడు: “ఆ అబ్బాయి నడుస్తూ నడుస్తూ తలెత్తి చూశాడు” అని. అంతే, ఒక్కసారిగా చెప్పాలనుకున్నదంతా మీద దాడి చేస్తే ఏం రాయాలో తెలీక అక్కడే ఇరుక్కుపోతాడు. రాయటం మొదలుపెట్టక ముందు అతను “తన కథ ఆకాశంలోంచి చుక్కల కాంతిలాగా గాలి లోనించి పాటల జాలులాగా నిద్రా తరంగాల మీద స్వప్న నౌక లాగా తేలిపోతూ అవతరిస్తుందనే అనుకున్నాడు. కాని అలా జరగలేదు”:

“నా ఉద్దేశం కథ రాయటం. ఆ కథలో ఎన్నో అద్భుతమైన విషయాలు పెడదామనుకున్నాను. కాని, కలం మొదటి వాక్యంతోనే ఆగిపోయింది. ఈ కథ పూర్తి చేసే శక్తి నాకు లేదని తెలుస్తున్నది. నేనీ కథను గురించి సంవత్సరాల తరబడి కలలుగన్నాను. నేనీ కథను సంపూర్ణ సత్యంగా నమ్మాను. దానిలోని ప్రతి అంశాన్ని వందసార్లు జీవించాను. ఇప్పుడిది నాలోనించి విడిపోనటువంటి ఒక భాగమైపోయింది. రాబోయే తరం వారికి నా కథ, నా మహాకావ్యం చదివే అదృష్టం లేదు కాబోలు. కాని భావాలకు శబ్దాల సహాయం లేకుండానే దేశకాలాలను అధిగమించి స్వయం సిద్ధంగా జీవించే శక్తి గనుక ఉన్నట్టయితే నా కంఠాన్ని భావియుగం వారు తప్పనిసరిగా వింటారు. నా సందేశం వాళ్ళకు అంది తీరుతుంది.”

— ఇలా తాను సంవత్సరాల తరబడి కలలుగన్న ఆశని, సంపూర్ణ సత్యంగా నమ్మిన ఆశని, వందలసార్లు జీవించిన ఆశని దేశకాలాలను అధిగమించి ముందుకెలా పంపాలో తెలీక చాలాసేపు తెల్లకాగితం ముందు గింజుకుంటాడు. చివరికి అటుగా పోతూ పోతూ ఎందుకో అతని గదిలోకి తొంగి చూసిన పక్కింటి పిల్లవాడు అతణ్ణి ఆదుకుంటాడు. అతను వాణ్ణి లోపలికి పిల్చి వళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. వాడి చిట్టి అరచేతిలో కలంతో “ఆశ” అన్న రెండు అక్షరాలు రాస్తాడు. తర్వాత ఆ కలాన్ని గోడకేసి బద్దలుగొట్టేస్తాడు. ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుని వాకిట్లోకి వచ్చి, చేతిని శ్రద్ధగా పరిశీలించుకుంటున్న వాణ్ణి ఉద్దేశించి, ఇదే బీజాక్షర మంత్రమనీ, ఈ మంత్రాన్ని మరిచి పోవద్దనీ, ఈ మంత్రంలో నేను కూడా జ్ఞాపకముంటానని చెప్తాడు. వాణ్ణి కిందకి దించి పంపేస్తాడు.

కథలో ఈ అబ్బాయి, జీవితం పట్ల తనలోని ఆశను ఎలా బయట పెట్టాలో తెలీక కలం విరగ్గొట్టేసినా, ఇతని కథను మనకు కలం విరగ్గొట్టకుండానే చెప్పి ఆ “ఆశ”ను మనకు స్ఫురింపజేస్తాడు బైరాగి. తన గదిలో ఎలుక పట్ల ఆ అబ్బాయి గౌరవం, ఎదుట కిటికీలోంచి రోజూ అతన్ని పలకరించే తెల్లకాకీ, కుర్చీకి నెప్పి కలుగుతుందేమనని అతను ఓ పక్క నుంచి మరో పక్కకు ఒత్తిగిలి కూర్చోవటం. . . ఇవన్నీ ప్రపంచం పట్ల అతనిలో వున్న  ఆశనీ, ప్రేమనీ, దయనీ చెప్పకనే చెబుతాయి. కథ కాసేపు ప్రథమ పురుషలోనూ, కాసేపు ఉత్తమ పురుషలోనూ సాగుతుంది. కాని ఆ మార్పు అయోమయం కలిగించని విధంగా వాడుకోగలిగాడు రచయిత.

దరబాను: శిల్పపరమైన చమక్కులేవీ లేకుండా, మన చూస్తూండగానే కొన్ని అలతి వాక్యాల్లో పాత్రలకు పోత పోసేసి, వేటికి వాటికి పుట్టు పూర్వోత్తరాలు దిట్టంగా కేటాయించేసి, వాటి మనసుల్లో దూరి వాటికో లోపలి ప్రపంచాన్ని నిశితంగా అల్లేసి, చకచకా వాటిని మనకు సన్నిహితం చేసేయడంలోనూ — చురుకైన కథనంతో మనల్ని కథలోని ఒక అంశం నుంచి మరొక అంశానికి అలవోకగా లాక్కుపోతూ, తెప్పరిల్లేలోగానే మనల్ని ఓ సజీవ ప్రపంచానికి నడి మధ్యన నిలబెట్టడంలోనూ — రచయిత సిద్ధహస్తుడనిపిస్తుంది ఈ కథతో. ఇది నచ్చని వాళ్ళెవరూ వుండరేమో. మెడ్రాసు నగరంలో ఒక బాంకు బయట కాపలా వుండే గూర్ఖావాడి కథ. నగరంలో వాడి ఒంటరితనం, పదే పదే వాడి వర్తమానంలోకి పొడుచుకు వచ్చి దిగులు రేపే తన నేపాలీ పల్లెటూరి గతం, ఆ బాంకు ఉద్యోగులకు క్యారియర్లు మోసుకొచ్చే ఒక అమ్మాయిపై వాడు మనసు పడటం, ఆమెను తన ప్రపంచంలోకి ఆహ్వానించబోయి, మనసులోని మాట బయటకు పెగిలీ పెగలక ముందే ఆమెని కోల్పోవడం, మళ్ళీ ఆశల్లేని మునుపటి జీవితానికి తిరిగి మళ్ళటం. . . ఇతివృత్తం ఇలా చెప్పడం కష్టం, చదివి తీరాలి. నేను చదివిన కథలన్నింటిలోనూ నాకు బాగా నచ్చిన ముగింపుల్లో ఈ కథ ముగింపు కూడా ఒకటి. అప్పుడప్పుడూ ఆశావాదం కన్నా వల్గరైన విషయం ఇంకోటి లేదనిపిస్తుంది.

ఒక గంట జీవితం: ఎప్పుడూ ఎప్పటిలాగే మంద్రంగా సాగే మన జీవన సంగీతం ఏవో కొన్ని యాదృచ్ఛిక క్షణాల్లో ఉన్నట్టుండి స్వరారోహం పెంచి ఉచ్ఛస్థాయి నందుకుంటుంది. ఆ క్షణాల్లో మనకు మన అస్తిత్వపు పూర్ణరూపం దివ్యంగా సాక్షాత్కరిస్తుంది. బైరాగికి ఇలాంటి క్షణాల పట్ల మక్కువ ఎక్కువనుకుంటా. “జేబుదొంగ” కథలోని మాటల్తో చెప్పాలంటే, బతుకు ఊబిలోంచి పైకెత్తి మనుషుల్ని దేవతుల్యంగా మార్చే క్షణాలు. ఈ సంపుటిలో “జేబు దొంగ”, “దీప స్తంభం”, ఇప్పుడీ “ఒక గంట జీవితం” కథలు ఇలాంటి క్షణాల్ని ఆలంబనగా చేసుకు అల్లినవే. “జేబుదొంగ”లో కథానాయకుని జీవితంలో ఇలాంటి క్షణాలకు జేబు కొట్టబోయి పట్టుబడిన ఓ కుర్రాడు కారణమైతే, “దీపస్తంభము”లో ఒక బైబిలు పుస్తకం కారణం అవుతుంది; ఇప్పుడీ “ఒక గంట జీవితం” కథలో హోటల్ రేడియోలో అకస్మాత్తుగా ఆనందభైరవి రాగంలో మ్రోగడం మొదలైన వయొలిన్ నాదం కారణమవుతుంది. స్థలం: ఏదో నగరం. ఒక సాయంత్రం కథానాయకుడు హోటలుకెళ్తాడు. సిగరెట్ కాలుస్తూ, కాఫీ తాగుతూ ఆలోచనా మగ్నుడౌతాడు. కథనం అతని ఆలోచనా స్రవంతిని అనుసరిస్తుంది. ప్రస్తుతం ఎందుకో కల్లోల మనస్కుడైన అతనికి పరిసర ప్రపంచమంతా అసంబద్ధంగానూ, ద్వందాల మయం గానూ కనిపిస్తుంది. తనలోని ఒంటరితనం, బయటి జంటలు; ఎదుట కుర్చీల్లో తుళ్ళిపడుతున్న పడుచుదనపు ఉత్సాహం, గాజు అద్దాల వెలుపల బిచ్చమెత్తుతోన్న ముసలితనపు దైన్యం. . . ఈ ద్వందాలన్నీ అతణ్ణి కలవరపరుస్తాయి:

“ఏది నిజం? సిగరెట్టు పొగలోంచి, కాఫీ చిరు చేదు నిషాలోంచి, సుందరీ వక్ష వీక్షణ సౌభాగ్యానందకందళిత హృదయారవిందుడనై అడుగుతున్నాను నేను? ఏది నిజం? సిల్కు చీరలా? చింకి గుడ్డలా? మాడిన కడుపులా? బలిసిన రొమ్ములా? వృద్ధ వేశ్య ప్రలాపాలా? జవ్వనుల పకపకలా? చీకటిలో ఒంటరితనం? వెలుగులో జంటలు? ఏది నిజం? చావు బ్రతుకుల సంజమసక. కల్తీలేని వెన్న కాచిన నిజం ఏది? ఎలా గుర్తు పట్టటం దాన్ని?”

— ఇలా సాగుతాయి అతని ఆలోచనలు. ఇప్పుడే రేడియో లోంచి వయొలిన్ సంగీతం మొదలవుతుంది. అయితే ఇక్కడే కథ పక్కదోవ కూడా పడుతుంది. ఎంతో ఆశ కల్పిస్తూ మొదలైన కథ పొంతనలేని దృక్చిత్రాల పేర్చివేతగా మిగిలిపోతుంది. బహుశా సంగీతం తెలిసి, చదివేటప్పుడు ఆనందభైరవి రాగంలో వయొలిన్ నాదాన్ని చెవుల్లో ఊహించుకోగల పాఠకులకు ఈ భాగం ఏమన్నా నచ్చుతుందేమో — ఏదన్నా ఉత్తేజం కలిగించగలుగుతుందేమో. కానీ ఇందులో నాకే అర్థం కనపడలేదు. “జేబుదొంగ” కథా, “దీపస్తంభము” కథా చదువుతున్నపుడు, ఆయా కథానాయకుల మామూలు జీవితం ఇలా వున్నట్టుండి పై స్థాయినందుకున్న క్షణాల ఉద్వేగం నేనూ కాస్తో కూస్తో అనుభూతి చెందగలిగాను. ఈ కథ మాత్రం నన్నలా కదిలించలేకపోయింది. అయినా ఈ కథ మొదటి అర్థభాగం చూపించిన ప్రామిస్ ఆధారంగా దీన్ని కూడా నాకు నచ్చిన కథల్లోకి జమ చేసేస్తున్నాను.


X ——— X  ——— X

ఇవీ, పదకొండు కథల ఈ సంపుటిలో నాకు బాగా నచ్చిన నాలుగు కథలూ. ఇవిగాక “స్వప్నసీమ”, “దీప స్తంభము” కథలు కూడా నచ్చాయి. “నాగమణి”, “తండ్రులూ – కొడుకులూ” ఓ మోస్తరు కథలనిపించాయి. ఈ కథల్లో చెప్పుకోదగ్గ విషయమేమీ లేకపోయినా, ముగింపులు ఉస్సురుమనిపించి గాలి తీసేసేవే అయినా, కథకి వాతావరణాన్ని అల్లడంలో రచయిత సహజ నైపుణ్యం వల్ల కూర్చోబెట్టి చదివిస్తాయి. ఇక “కన్నతల్లి”, “కిమాని” అన్న కథలు నాకంతగా నచ్చలేదు. బలవంతం పద్దులా ఏదో కథ రాయాలని ఉన్నపళాన కూర్చుని రాసినట్టూ వున్నాయి. సంపుటికి శీర్షికను అరువిచ్చిన కథ “దివ్య భవనం” కూడా నచ్చలేదు. అసలే ప్రతీకల్తో కూడిన కథలంటే నాకు ఏవగింపు. ఒక ప్రత్యక్ష వస్తువును మరో పరోక్ష వస్తువుకు సింబల్‌గా చూపిస్తూ కథ నడపాలనుకున్నప్పుడు, సింబల్‌గా నిలబడ్డ ప్రత్యక్ష వస్తువు తన గుణాలన్నింటినీ పూర్తిగా పాటిస్తూనే, సింబలైజ్ కాబడిన పరోక్ష వస్తువును కూడా స్ఫురింపజేయగలగాలి. అలా చేయలేనప్పుడు అవి — కుటిలత్వానికి నక్క ప్రతీక, రాజసానికి సింహం ప్రతీక, తెలివికి ఎండ్రకాయ ప్రతీక. . . యిలా చిన్నపిల్లల పంచతంత్ర కథల్లాగా తయారవుతాయి. ఈ కథలో దివ్య భవనం దేనికి ప్రతీకో నాకు అర్థం కాలేదు. రచయిత కాసేపు దాన్ని రాగి – ఇనుముతో తయారైందిగా చూపిస్తాడు, మరి కాసేపు గాలీ – శూన్యాల్తో తయారైందిగా చూపిస్తాడు, ఇంకాసేపు గాజులా పారదర్శకమైందంటాడు. ఒక పేరాలో దానికి ఆపాదించిన గుణ సముదాయాన్ని వెనువెంటనే మరుసటి పేరా కాదంటుంది. మొత్తం మీద నాకు లెక్కలోకి తీసుకోదగ్గ కథలా కనపడలేదు.

పుస్తకంలో ముద్రారాక్షసాలు అధికం. చాలాచోట్ల విరామ చిహ్నాల పాటింపు అవకతవకగా వుంది. ప్రతీ కథకూ చివర్లో రచయిత ఆ కథ ఏ సంవత్సరంలో రాసాడో వేస్తే బాగుండేదనిపించింది. అలాగైతే రచయిత రచనల్లో కాలానుగతమైన పరిణతి ఏమన్నా వుంటే గ్రహించే వీలుండేది. లేకపోతే “జేబుదొంగ” కథ రాసిన రచయితే తర్వాత “కిమానీ” లాంటి కథ ఎలా రాసుంటాడు చెప్మా అని నాలాంటి పాఠకుడు మథనపడాల్సి వస్తుంది.

కొంతమంది రచయితలు మనకి చాలా క్రింద వుండి కథ చెప్తున్నట్టూ వుంటుంది. వాళ్ళని లెక్కచేయనే చేయం. మరికొంతమంది చాలా ఎత్తులో వుండి కథ చెప్తూన్నట్టూ వుంటుంది. వారిని తలెత్తి అబ్బురపాటుతో చూస్తాం; అందుకోవాలని ప్రయత్నిస్తాం; అందుకోలేకపోతే, అబ్బురపాటుతోనే సరిపెట్టి, వారి రచనల్ని భవిష్యత్తుకెపుడో అట్టేపెడతాం. ఇంకొంతమంది మన ప్రక్కనే వుండి కథ చెప్తున్నట్టూ వుంటుంది. వారిని పట్టించుకుంటాం. ఇంకా తెలుసుకోవాలని ఉబలాటపడతాం. బైరాగి కథ చెప్తూంటే ఇలాగే అనిపించింది. ఇవి తప్ప ఆయనిక వేరే కథలేవీ రాయలేదు కాబట్టి, నాకు ఆయన కవిత్వంపై ధ్యాస మళ్ళింది. తిలక్ తర్వాత నా పఠనా ప్రపంచంలో కవుల కోటాలో ఏర్పడిన ఖాళీని బహుశా ఈయనే భర్తీ చేస్తాడేమో అనిపిస్తుంది. చూడాలి.

పూర్తి భాగం "పుస్తకం.నెట్"లో చదవచ్చు!