కాఫ్కా డైరీలు చదవడమంటే రచనా వ్యాసంగపు మౌలిక వాస్తవికతను ఆవాహన చేసుకోవడం, ఎటో కొట్టుకు పోకుండా కాళ్ళు భూమ్మీద ఆనించి నిలబడగలగటం. ఈ వాక్యం “వివరణ కావాలోయ్!” అని బాహటంగా గగ్గోలు పెడుతున్నట్టుంది, మన్నించక తప్పదు. రచయిత సమూహంలోని మనిషే; కానీ ఆ సమూహంలో తారాడే పలు ప్రాపంచిక ప్రకంపనాల్తో పాటూ అందర్లాగే తనూ ఊగిపోక, తన ఉనికి కోల్పోక, స్వతంత్రంగా నిలబడతాడు. కనీసం కాగితం, కలం పుచ్చుకున్నంతవరకూ అయినా “రచయిత”గా తన ఉనికికి నిబద్ధుడై వుంటాడు. ఆ ప్రకంపనాలకు తన అంతరంగపు ప్రతికంపనాల్ని నిర్మమత్వంతో స్వీకరించి, తిరిగి కళాత్మకంగా ప్రకటిస్తాడు. ఇది రచనా వ్యాసంగానికి ఆదర్శ స్థితి. అయితే ఒక్కోసారి, రచయిత వ్యక్తిగత జీవితపు ఒడిదుడుకులో వెంపర్లాటలో, “రచయిత” అనే సామాజిక స్థానం అదనంగా తెచ్చే రొదో అతని కళ్ళకు గంతలు కట్టేయడం వల్ల, ఈ “కాగితం, కలాల” మౌలిక వాస్తవికత అతనికందకుండా పోవచ్చు. అలాంటి అంధకారం నుంచి మళ్ళీ వెలుగు బాట పట్టించగలిగే దిక్సూచీ కాఫ్కా డైరీలు. వీటిలో ఏ పది పేజీలు తీసి చదివినా, మళ్ళీ కాళ్ళు భూమ్మీదకొచ్చి ఆనుతాయి. రచయితకు రాయడం తప్ప మరేదీ లెక్కలోకి రాదని గ్రహిస్తాం.
నిన్న మళ్ళీ చదవటం మొదలుపెట్టాను. పూర్తి చేద్దామని కాదు. డైరీల్ని మొదల్నించి కడదాకా చదవాల్సిన అవసరమేముంటుంది. ఊరికే తోచినంతదాకా చదవడం, పైన సూచించిన లాభాన్ని సంగ్రహించి పక్కనపెట్టేయటం… అంతే! నిన్నటి పఠనంలో ఈ క్రింది వాక్యం ఆకట్టుకుంది:
There were times when I had nothing else inside me except reproaches driven by rage, so that, although physically well, I would hold on to strangers in the street because the reproaches inside me tossed from side to side like water in a basin that was being carried rapidly.
1910వ సంవత్సరంలో కాఫ్కా రాసుకున్న డైరీ తొలి పేజీల్లో, మామూలు దినచర్యతోపాటూ, ఒక సుదీర్ఘమైన రచనాభ్యాసం కూడా వుంటుంది. చదవటానికి ఇది కూడా మామూలు డైరీ రాతే అనిపించేట్టు మొదలవుతుంది. తన బాల్య విద్యాభ్యాసం తనని ఎలా పాడు చేసిందో విశ్లేషించుకుంటున్నట్టు ఒక పేరా వుంటుంది. తర్వాత అదే పేరా, తడవ తడవకీ మార్పులూ చేర్పులతో పరిమాణం పెంచుకుంటూ పోయి, ఆరుసార్లు రాసి వుంటుంది. అలాగే పోనుపోనూ అది కాఫ్కా నిజ జీవిత వృత్తాంతంగా కాక, ఒక కాల్పనిక పాత్ర రాస్తున్న కాల్పనిక వృత్తాంతంగా మారిపోతుంది. నేను పైన ఇచ్చిన వాక్యం అందులోదే.
తనను తనకు కాకుండా చేయబోయిన విద్యార్థి దశని బాగా నిరసించిన సమయాలు చాలా వుండేవని చెపుతూ నేరేటర్ ఈ మాటలంటాడు. “అప్పట్లో నా లోపల వేరే ఏమీ వుండేది కాదు కోపంతో తన్నుకొచ్చే ఆక్షేపణలు తప్ప…” అంటూ మొదలైన వాక్యంలో ఈ తొలి సగమూ సాధారణమైనదే. కానీ దాని కొనసాగింపు మాత్రం కాఫ్కా నుంచి మాత్రమే ఊహించగలిగేది: “…దాంతో, శారీరకంగా బాగానే వున్నా, నేను వీధిలోని అపరిచితుల్ని ఆసరాకి పట్టుకునేవాణ్ణి, ఎందుకంటే నా లోపలి ఆక్షేపణలు, వేగంగా పట్టికెళ్తూన్న ఒక పాత్రలోని నీళ్ళకు మల్లే, అటూ ఇటూ విసిరికొట్టబడేవి”. బయటకు కక్కలేని ఏవో ఆక్షేపణలతో లోపల్లోపలే సతమతమయ్యే వ్యక్తులు చాలామంది వుంటారు. కానీ వాటి వల్ల శరీరాన్ని నిలదొక్కుకోలేక వీధిలో జనాన్ని ఆసరాకి పట్టుకునే వాళ్ళెవరుంటారు? ఇదే సాహిత్యానికి కాఫ్కా ధైర్యంగా అందించిన ఆవిష్కరణ. ఇక్కడ కాఫ్కా “ఆక్షేపణ” అనే ఒక అమూర్త భావానికి “శరీరాన్ని నిలదొక్కుకోలేకపోవట”మనే భౌతిక పర్యవసానాన్ని ఇస్తున్నాడు. ఈ ధోరణిని కాఫ్కా కళకు ఆయువుపట్టుగా చెప్పుకోవచ్చు.
కాఫ్కా రచనల్లో ప్రసిద్ధ కథ “ద మెటమార్ఫొసిస్“లో ముఖ్యపాత్ర గ్రెగర్ జమ్జా ఒక ఉదయాన నిద్ర లేవగానే బొద్దింకగా మారిపోయి వుంటాడు. అతని జీవితంలో పేరుకుపోయిన అభద్రతా భావన అతణ్ణి బొద్దింకగా మారిపోయేలా చేస్తుంది. చివరకు సొంత కుటుంబం చేతుల్లోనే హత్యకు గురవుతాడు. ఇలాంటి గతే కాఫ్కా ప్రసిద్ధ నవల “ద ట్రయిల్“లోని ముఖ్యపాత్ర జోసెఫ్.కె కీ పడుతుంది. అపరాధ భావన వల్ల, తన నేరమేమిటో తెలియకుండానే దాన్ని అంగీకరించి కోర్టుల చుట్టూ తిరుగుతాడు. చివరకు తెలుసుకోకుండానే, శిక్ష రూపేణా గొంతుకోసి హత్య చేయబడతాడు. సదరు పాత్రల్లోని ఈ అభద్రతా భావనలూ, అపరాధ భావనల ఉనికిని కాఫ్కా ఎక్కడా స్పష్టంగా తేల్చి చెప్పడు. వాటి పర్యవసానాల వల్లనే వాటి ఉనికికి ఋజువులు లీలగా మన ఊహకు అందుతాయి. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే: నిజానికి ఈ ఇన్సెక్యూరిటీ, గిల్ట్ భావనలకు మూలాలు ఆయా పాత్రల్లో లేవు, వాటి సృష్టికర్తలో — కాఫ్కాలో వున్నాయి. పర్యవసానాల్ని మాత్రం ఆ పాత్రలు అనుభవించాయి. విషయమంతా ఇంత తేలిగ్గా తేలిపోయేదే అయివుంటే, మనం కాఫ్కాని ఒక కళాకారునిగా పెద్ద లెక్క చేయనవసరం లేదు. రూపులేని తన లోపలి భయాలకు, రూపమున్న పర్యవసానాల్ని ఊహించి సృజించిన రచయితగా తీసిపాడేయవచ్చు. ప్రముఖ విమర్శకుడు ఎడ్మండ్ విల్సన్లాగా కాఫ్కా కళ అంతా “ఒక తొక్కివేయబడ్డ వ్యక్తిత్వం వెళ్లగక్కిన సగం సగం రొప్పుళ్ళు” మాత్రమేనని తీర్మానించేయచ్చు. అందుకే, రచనల్ని “విధానం” కోసం గాక “వస్తువు” కోసం చదివే పాఠకులకు కాఫ్కా ఏమీ ఇవ్వలేడు. మహా అయితే కాస్త అబ్బురపాటు కలిగించగలడు. అది కూడా అనుమానమే; దరిమిలా అదే మూసలో ఎన్నో పోస్ట్ మోడర్న్ తైతక్కలకి అలవాటు పడిన ఈ తరం పాఠకులకు ఆ అబ్బురపాటు కూడా మిగలకపోవచ్చు.
అలాగాక, కాఫ్కాని కాఫ్కాలాగే స్వీకరిస్తూ సంపూర్ణ పఠనానందాన్ని పొందాలనుకుంటే ఒకటే దారి వుంది. ముందు ఆ రచనల్లో వస్తువేమిటీ, ఆ వస్తువుకు ప్రతీకాత్మక అర్థమేమిటీ, అలాంటి వస్తువుకూ దాని రచయితకూ (రచనకు బాహ్యంగా) వుండగల సంబంధమేమై వుండొచ్చూ — అన్న విషయాల్ని వదిలేయాలి. కేవలం ఆ రచనల్లోని కాల్పనికప్రపంచాలు ఏ స్పష్టతతో మన చుట్టూ అల్లుకుంటాయో ఆ తీరుని మాత్రం ఆస్వాదించగలగాలి. అపుడే కళాకారునిగా అతను పూర్తిగా అవగతమవుతాడు. మరలా దీనికి పై వాక్యాన్నే ఉదాహరణగా తీసుకోవచ్చు. అక్కడ నేరేటర్ తన “లోపలి ఆక్షేపణల” తాకిడికి శరీరాన్ని సంబాళించుకోలేకపోవడమన్న వింత పాఠకుల్లో కాసేపు అబ్బురపాటునూ, అపనమ్మకాన్నీ కలిగించవచ్చు. అయితే ఆ వాక్యంలో పట్టించుకోవాల్సింది అది కాదు. దాని అసలు కేంద్రం వేరే వుంది. అక్కడ సంభవిస్తున్న ఈ వింతను ఏదో మామూలు విషయమన్నట్టూ పక్కనపెట్టేసి, దాన్ని వివరించటానికి ప్రయత్నించకుండా, మన ఆశ్చర్యార్థకపు మొహాల గోడును ఏ మాత్రం పట్టించుకోకుండా, రచయిత ఆ సంభవాన్ని మనకు మరింత స్పష్టపరచడం కోసం ఎన్నుకున్న ఖచ్చితమైన ఉపమానం వుందే (“వేగంగా పట్టికెళ్తూన్న ఒక పాత్రలోని నీళ్ళకు మల్లే”), అదీ ఆ వాక్యానికి అసలు కేంద్రం. ఆ స్పష్టత కాఫ్కాలో అసలు విషయం. ఇలా ఇంత అపనమ్మకం రేకెత్తించే సంభవాన్ని చూపించి కూడా, దాని మీంచి దాని పర్యవసానానికి మన దృష్టి మళ్ళించగలిగే స్పష్టతా; రచనలో కడదాకా అంతర్లీనంగా ఏదో తార్కికమైన కార్యకారణ సంబంధాన్ని కొనసాగించగలిగే నైపుణ్యమూ; ఇంత అసంబద్ధమైన కాల్పనిక ప్రపంచాల్లో కూడా ఏదో నిగూఢమైన అంతిమ సత్యాన్ని స్ఫురింపజేస్తూ, దాన్ని ఎప్పటికీ మనకి అందీఅందని దూరంలోనే వుంచగల కొంటెతనమూ — కాఫ్కాలో మనం ఆస్వాదించాల్సిన అసలు విషయాలు. ఇదీ కాఫ్కా కళకు అసలు కేంద్రం. పై వాక్యం కాఫ్కా ఇరవయ్యేడేళ్ల వయసులో రాసింది. అప్పటికి ఇంకా ఆయన తన గొప్ప రచనలేమీ చేయలేదు. కానీ మున్ముందు మరింతగా మెరుగులు దిద్దుకుని పూర్తి పరిణతి సాధించబోయే అతని కళ అంతఃతత్త్వమేమిటో డైరీలోని ఈ చిన్ని వాక్యం మచ్చుకు సూచిస్తున్నట్టూ నాకనిపించింది. కాఫ్కా కళ మొత్తానికి స్థూలంగా ఈ వాక్యమొక మంచి తార్కాణమనిపించింది.
పూర్తిభాగం పుస్తకం.నెట్లో చదవచ్చు.

— Sunday 19th July 1910