February 15, 2014

త్రిపుర కల

త్రిపురని ఇంటర్వ్యూ చేస్తున్నట్టు కల. ఆయన లుంగీ మీద పింక్‌ నెక్ షర్టు వేసుకున్నాడు. కలంతా నేను సరిగా ప్రిపేరవలేదే అన్న మైల్డ్ పానిక్‌తో ఉంటాను. But he is so laid back and giving all the crazy answers in the world. నేను అడిగిన ప్రశ్నల్లో నాకు గుర్తున్నది: "Celine మీ అభిమాన రచయిత అని చెప్పారు కదా, మరి అతని antisemitism మీద మీ అభిప్రాయం ఏంటి?" అని.

This is only the second time that i dreamed about a writer. First time, it's Nabokov.

February 14, 2014

తరళ మేఘచ్ఛాయ, తర్వాతి ఎడారి



ఇప్పుడిలా రాత్రి నీరవంలో, అల్ప్రజోలం 1mg కూడా నిద్రపుచ్చలేని బరువు కళ్లతో, వెనక మంచం మీద ఇప్పుడు నా వంతు భాగాన్ని కూడా వెల్లకిలా ఆక్రమించి రాఘవ పెడ్తోన్న గురక నేపథ్యంలో... ఒకసారి మాధవ్‌ని గుర్తు తెచ్చుకుంటే, జీవితంలో ఏదీ నా చేతుల్లో లేకపోవటమనే నిస్సహాయ భావనని మళ్లీ తల మీంచి గుమ్మరించుకున్నట్టు ఉంటుంది. ఇవాళ్టికి ఏడేళ్ల క్రితం మేం విడిపోయాం. నిజానికి, విడిచి వచ్చేశాను. నేనే నెట్టేశాను వాడ్ని, తల్లి తన రొమ్ము నుంచి బిడ్డని దూరం నెట్టినట్టు.

ఎంత విలువైనదైనా చవకగా వస్తే తలకెక్కేస్తుంది. మా మధ్య ఏడాది అనుబంధం అప్పటికే నాలో చాలా సత్తువ లాగేసింది. వాడేంటి అప్పుడే పాతిక దాటిన కుర్రాడు, వాడికి అంతా బాగానే ఉండేదనుకుంటా. అలాగే ప్రవర్తించేవాడు. నలభైయేళ్ల నన్ను కన్నె కలల సఖిలాగా చూసేవాడు. ఆ కొన్నాళ్లూ నన్ను నేనూ అలాగే చూసుకున్నాను. చూసుకునేలా చేశాడు నన్ను. కానీ నిజానికి అప్పటికే వాస్తవం నలిపేయగా వడలి సడలి రాలిన కలల పుష్పం తాలూకు మిగిలిన వృంతాన్ని నేను. ఎప్పుడోకప్పుడు ఆ నిజం కట్టెదుట నిలిచి నిలదీయకపోతుందా.

ఆ రోజు చాలా గుర్తు నాకు. ఈ ఏడేళ్లలోనూ పదే పదే వాడగా వాడగా అరిగిపోయిన స్మృతి అది. క్లాసుల మధ్య విరామంలో తోటి లెక్చరర్లతో ఏదో కబుర్లలో ఉంటే వాడి నుంచి ఫోన్‌. అప్పటికే ఎక్కడ ఉన్నా పక్కకు వచ్చి ఫోన్‌ ఎత్తే దశ దాటి, ఇబ్బందిగా ఉంటే కట్‌ చేసే స్థితికి వచ్చేశాను. అలాగే కట్‌ చేశాను. రెండు సార్లు, మూడుసార్లు... చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తలుచుకుంటే కళ్లమ్మటా నీళ్ళొస్తున్నాయి. కానీ అప్పుడు కట్‌ చేస్తూనే ఉన్నాను. చివరికి మెసేజ్‌ పెట్టాడు. ''బయట ఉన్నాను,'' అని.

ప్రేమలో ఉన్న మనిషిది కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లి వాటం. చుట్టూ జనానికి తెలియదా. బోటనీ ఆవిడా, లెక్కలావిడా గూడుపుఠాణీ మౌనంలో ఓరగా చూస్తున్నారని తెలుస్తోంది. ''వస్తానుండండీ...'' అంటూ—వాళ్ల వైపు చూస్తే నా నుంచి ఏదో కన్ఫెషన్‌ ఆశించే చూపుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో చూడకుండానే—కుర్చీ లోంచి లేచి బయటకు బయల్దేరాను. గది నుంచి బయటకు వచ్చానే గానీ, కుతూహలం కాళ్లకు బంధం వేసింది. కుచ్చిళ్ల మడత సర్దుకుంటున్న నెపంతో కిటికీ పక్కన వంగాను.

"Seems her dildo again...'' లెక్కలావిడ గొంతు.

తర్వాత ఇద్దరి నవ్వులూ.

వాస్తవం కొట్టిన చెంపదెబ్బ! కానీ వాళ్లకేం తెలుసనీ! ఆ ప్రపంచంలో మసులుతున్న నాకు తెలుసు మా బంధపు సౌందర్యం. ''సాము సడలిన పతి పరిష్వంగమునందు.. సుఖము దుఃఖము లేని సుషుప్తి లోన'' ఉన్న నాకు ఎక్కణ్ణించి తేలుతూ వచ్చిందో ఆ వేణుగానం తాకింది. ఇక అన్నీ మరిచి ఆ స్వప్నరాగలీనురాలినై తెలియని లీల వైపు అలా సాగిపోయాను. ఇప్పుడు అది మొహం మొత్తింది.

కాలేజ్‌ బయట పార్కింగ్‌ దగ్గర నా కారు దరిదాపుల్లో అసహనంగా తచ్చాడుతున్నాడు మాధవ్‌. నన్ను దూరం నుంచి చూడగానే ముఖమంతా వెలిగించుకుని అదే మతాబా రవ్వల నవ్వు, కనీసం గత వారంగా కలవకుండా, ఫోన్‌లో దొరక్కుండా ఇబ్బంది పెట్టానన్న కోపం కూడా మర్చిపోయి. ఆ నవ్వులో తన ప్రేమ మీద వాడు పెట్టుకున్న నమ్మకం కనపడి, వాడికా రోజు నేను ఏం చేయబోతున్నానో గుర్తొచ్చి, గుండెల్లో ఒక తాడేదో అనంతమైన ముడులుగా మెలిపడుతున్నట్టుగా అనిపించింది. లెక్కలావిడ కామెంట్‌తో ఇరిటేట్‌ అయి ఉన్నానేమో, వాడి నవ్వుకి బదులివ్వలేదు.

''ఎందుకు అదే పనిగా రింగ్‌ చేస్తావ్‌. కట్‌ చేశానంటే ఏదో కారణంతోనే కట్‌ చేసుంటా అనుకోవా?''

''వారం అయింది కుదురుగా మాట్లాడి. నాతో మాట్లాడటానికి సందు దొరకనంత బిజీనా? ఏంట్రా ఇది?''

నేను మౌనం వహించబోయాను. కానీ మామూలుగా నా మౌనాన్ని వాడేది ఊరకనే వాడిలో దోషభావం రేగ్గొట్టటానికి. ఇప్పుడా అవసరం లేదు. ఇది దోషభావాన్ని కన్వీనియెంట్‌గా మీదేసుకుని వాణ్ణి తూట్లు పొడవబోయే సందర్భం. ''పద కారెక్కు. మాట్లాడాలి.''

ఆ రోజు కారు ప్రయాణం ఒక్కోసారి అలాగే అనంతంగా సాగిపోతే బాగుండేదని అనిపిస్తుంది. ఇప్పుడీ కథలో కూడా. ఆ ప్రయాణాన్ని వెంటనే ముగించి నా జీవితంలో బాల్యం తర్వాత తారసిల్లిన ఏకైక ఆనందపు అధ్యాయానికి నేనే ఇచ్చుకున్న మాసకిస్టిక్‌ ముగింపు జోలికి వెళ్లాలనిపించటం లేదు. కాసేపు నన్నూ, మాధవ్‌నీ అలా కారులోనే వెళ్లనిస్తూ, ఈ రాసే నేను మళ్లీ మొదటికి వస్తాను. మాధవ్‌ని తొలిసారి చూసిన సందర్భానికి.

అప్పటికే రాఘవని భర్తగా చూడకపోవటం మాట అటుంచి శత్రువుగా చూడటం కూడా మానేశాను. నా అరుపులూ, గొడవలూ, హిస్టీరియా, సైకియాట్రిక్‌ కన్సల్టేషన్లూ అన్నీ పోయి, ఒక ప్రశాంతమైన ఏమీలేనితనం. We were just co-existing, and it's still the status. మా మధ్య స్వప్న రూపేణా పేగుబంధం లేకపోయుంటే తెగతెంపులు చేసుకునేదాన్నేమో. అది కూడా ఏమోనే. తెగించి ఏదోటి చేయలేనితనానికి అదో సాకేమో కూడా. ఇలాంటి మృత వాతావరణంలో పెరిగేకంటే, ఆమె నా దగ్గరో తన దగ్గరో పెరిగుంటేనే బాగుండేది. మా ఇద్దరి మధ్యా సయోధ్య ఆశలేమన్నా ఇంకా ఇలా కలిపి  ఉంచాయా. కానీ అతని వ్యక్తిత్వం ఎక్కడో ఒన్స్‌ అండ్‌ ఫరాల్‌ ఇలా ఏర్పడిపోయింది. ఇక మారడు. జీవితం నాశనం చేసినవాడి పక్కలోనే ఇలా నేను ముసల్దాన్నయిపోవాల్సిందే.

ఒక రోజు రాత్రి ఏదో పార్టీకని తీసుకెళ్లాడు. మార్బల్‌ కాంట్రాక్టర్లందరూ కలిసి ఎందుకో పార్టీ ఇచ్చుకుంటున్నారు. అది సకుటుంబ సపరివార సమేతమైన వేడుక కాబట్టి, ఎవరెవరి భార్యలు వారి వారి మొగుళ్ల పక్కన ఉంటారు కాబట్టి, ఒక ట్రోఫీ వైఫ్‌గా నేనూ వెళ్లక తప్పలేదు. బేగంపేట దగ్గర ఏదో ఫంక్షన్‌ పేలెస్‌. బయట ట్రాఫిక్‌ ప్రవాహం ఒకటి వెళ్తోందని తెలియనివ్వకుండా నిలువునా పైకి లేచిన ఫైబర్‌ గోడలు. లోపల కృత్రిమ గడ్డి పరిచిన విశాలమైన ప్రదేశం. మధ్య మధ్యలో దీపస్తంభాలు. ఓ మూలన పెద్ద వేదిక. అప్పటికే ఉపన్యాసాలు ఐపోయాయి. అందరూ బఫే దగ్గరకు వెళ్లి ప్లేట్లలో వడ్డన చేయించుకుని వేదిక ముందు ఉన్న నీల్‌కమల్‌ కుర్చీల్లో కూర్చుని తింటున్నారు. ఆ కుర్చీలన్నీ ఏ గుంపుకి ఆ గుంపుగా వరసలు తప్పి చిందరవందర వలయాలైపోయాయి. నేను మాత్రం ఏ వలయంలోనూ కుదురుకోలేను. అక్కడ ఆడవాళ్లయినా మగవాళ్లయినా మాట్లాడుకునే విషయాలేవీ నాకు ఆసక్తిని కలిగించేవి కావు. ఇంకా మగవాళ్లే నయం. కాసేపటికి అక్కడ ఏ గుంపులోనూ చేరక ఒక్కదాన్నీ ఉన్నది నేనేనని గుర్తొచ్చి అలా పోతున్న ఓ బుడ్డాణ్ణి దగ్గరకు పిలిచి ఏదో కబుర్లు చెప్తున్నాను.

అప్పుడు వచ్చింది వేదిక మీదకి ఆర్కెస్ట్రా. నాకు ఈ ప్రోగ్రాం ఉందని తెలియదు. ఆ వచ్చిన ఐదారుగురిలో ఉన్నాడు మాధవ్‌. నెమ్మదిగా వాద్య పరికరాలు సర్దటం అయ్యాకా పాటల ప్రోగ్రాం మొదలైంది. మొదటి పాట మాధవ్‌దే అని గుర్తు. ఏదో హిందీ పాట. నాకు పాట తెలియదు, కానీ వాడు పాడిన విధానం మాత్రం మంత్రముగ్ధంగా ఉంది. మాధవ్‌ గొంతు ఇప్పుడు సినిమాల్లో వినిపించే చాలా గొంతుల కన్నా భిన్నమైందేమీ కాదు. కానీ వాడు పాడుతున్నాను చూడండొహో అన్నట్టు పాడడు, ప్రాణం పెట్టి లీనమై పాడతాడు. అదే వాడి గొంతులో అందం. పాడుతున్నప్పుడు వేదిక కింద ఏం జరుగుతుందో కూడా చూడటం లేదు. కళ్లు మూసుకుని, పాట సాహిత్యంలోని భావమేంటన్నది పట్టించుకోకుండా, పాట రాగంలోని అనుభూతిని మాత్రం పట్టుకుని, అది ఏ మాత్రం దాచే ప్రయత్నం చేయకుండా తన్మయిస్తూ, అసలు ప్రదర్శిస్తున్నానన్న స్పృహ లేకుండా, ఒక చేత్తో మైకుని బిగించి పట్టుకుని రెండో చేత్తో గాలిని నిమురుతూ పాడుతున్నాడు. ఆ చేతులు... ఆ చేతులకీ, వాటి పొడవాటి వేళ్లకీ ఒక విశిష్టత ఉంది. వాటి మధ్య ఏమొచ్చి చేరినా చిత్రమైన అందాన్నీ ప్రాముఖ్యతనీ సంతరించుకుంటాయి: సిగరెట్టయినా, టీ కప్పయినా, నా రొమ్మయినా.

నిజానికి అలాంటి పార్టీ వాతావరణాలు నాకు పెద్ద నచ్చవు. కానీ మాధవ్‌ని మొదటిసారి చూసిన క్షణాలకు నేపథ్యమైన కారణంగానేమో, అదంతా ఒక వాన్‌గో స్టారీ నైట్స్‌ లాంటి బ్రైట్‌నెస్‌తో జ్ఞాపకంలో ముద్రపడిపోయింది. వాడు పాటలు పాడుతున్నాడు, వాడి పాట అయ్యాకా మధ్యలో ఇంకెవరో అందుకుని ఇంకో పాట పాడుతున్నారు, నా దృష్టి మాత్రం వాడు పాడుతున్నప్పుడూ, పాడకుండా పక్కన కూర్చుని వేరే వాళ్ల పాటలకి కాలి తాళం వేస్తున్నప్పుడూ కూడా వాడి పైనే లగ్నమై ఉంది. మిరుమిట్లు గొలిపే అందగాడని కాదు. చామనఛాయ, పెద్ద ముఖం, భృకుటి దగ్గర దట్టంగా మొదలై ముఖం చివర్ల కెళ్లే కొద్దీ డ్రైబ్రష్‌తో పల్చగా హాచింగ్‌ చేసినట్టు ముగిసిపోయే కనుబొమ్మలు... నుదురూ, కళ్లూ, చెంపలూ అన్నీ ఏదీ మరుగు చేయలేనట్టు, తలుపులన్నీ తెరిచిపెట్టుక్కూచున్నట్టు ఉంటాయి.

ఓ రెండు గంటల తర్వాత పాట కచేరీ ముగిసింది. వాడు కాగితాలు పుస్తకంలో సర్దుకుని వెళిపోతున్నాడు. వేదిక మెట్లు దిగి, వెనక చీకట్లలోకి, నాకు దూరంగా, మళ్లీ ఇక కనపడే వీల్లేకుండా. మళ్లీ ఎప్పుడో అప్పుడప్పుడూ ఒక ఆనందం నాకు వీపు చూపిస్తూ వేసుకున్న తలుపు చప్పుడులాగా మాత్రమే గుర్తొస్తాడు. వయసు గడిచేకొద్దీ, లేదా వయసుతో పాటూ డెస్పరేషన్‌ పెరిగేకొద్దీ, ఇలాంటి చిరు సంకేతాల్ని పట్టించుకోవటం ఎక్కువవుతుందేమో. వయసులోలా అవి పదే పదే తారసపడతాయన్న నమ్మకం ఉండదు కదా. అందుకే, కుర్చీలోంచి లేచాను. అస్తమానం మెదడు తర్కమేనా. మెదణ్ణి మనం నడిపించగలం, తర్కపు చెర్నాకోలతో. మనసు మాత్రం ఏ జాడలకు వశీకృతమై మనల్ని అటు లాక్కుపోతుందో దాని అభీష్టం. అప్పుడప్పుడూ అన్నీ మరిచి అది ఎటు పట్టి ఈడిస్తే అటు డేక్కుంటూనైనా పోవాలి.

రాఘవ సఫారీ సూట్లో, ఒక చేయి వీపు వెనక మడుచుకుని, ఒక చేత్తో పెగ్గు పట్టుకుని, ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నేను తన వైపు రావటం గమనించి వీపు వెనక నుంచి చేయి తీసి వాచీ చూసుకున్నాడు. వాళ్ళ సంభాషణో కొలిక్కి వచ్చి తను నా వైపు వచ్చేదాకా వేచి చూసేంత సమయం, సహనం లేవు. తిన్నగా వాళ్ళ మధ్యకి వెళ్లాను. కారు తాళాలు ఇమ్మన్నాను. ఒక అరగంట ఆగితే తనూ వచ్చేస్తా అన్నాడు. అర్జంటన్నాను. పక్కన ఎవరూ లేకపోతే ఏంటంత అర్జంటని అడిగేవాడే. ఇప్పుడు తప్పక, కనుబొమలు పైకి లేపి, తాళం చేతుల్లో పెట్టాడు.

వేదిక పక్కనుంచి బయట పార్కింగ్‌కి దారి ఉంది. అక్కడ కాస్త చీకటి. ఆ చీకటిలోకి చేరేదాకా నిమ్మళంగా నడిచాను. ఏం చేద్దామని బయటకు వెళ్తున్నా అనేది పూర్తిగా నాకే తెలీదు. వాణ్ణి ఒంటరిగా కలవాలి, వీలైతే కారు ఎక్కించుకోవాలి, వాడి పాట చాలా బాగుందని చెప్పాలి... ఏదో ఒకలా మాట్లాడాలి. ద్వారం దాటేసరికి బయట వాళ్ల గ్రూపు వీడ్కోలు తీసుకుంటోంది. అప్పటిదాకా నాకు అనిపించలేదు, వాళ్లంతా బైక్స్‌ మీద వచ్చి ఉండొచ్చని. ఒక చిన్న ట్రాలీ ఆటోలో వాద్యపరికరాలు ఎక్కించి బైక్స్‌ స్టార్ట్‌ చేసి కోలాహలంగా వెళ్లిపోయారు. దారపు ఉండ నుంచి జారుతున్న దారంలా అలవోకగా భవిష్యత్తులోకి జారుకోబోయిన కాలం పుటుక్కున తెగిపోయినట్టనిపించింది. ఎలాగూ తాళాలు తీసుకున్నాను కాబట్టి ఇంటికి వెళ్ళిపోయాను.

మనసు ఎన్నో ఎటూ పర్యవసించని సంకేతాలు కూడా ఇస్తుంది లెమ్మని ఊరుకున్నాను. కానీ నెల తర్వాత మరలా కనిపించాడు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, విక్టోరియా ఒకాంపోల మధ్య అనుబంధం గురించి ఏదో పుస్తకం వచ్చిందంటే కొనుక్కుందామని వాల్డెన్‌కి వెళ్లాను. పుస్తకం దొరికేసినా ఊరికే అరల మధ్య తిరుగుతున్నాను. పుస్తకాల షాపుల్లో ఎవరూ ముఖముఖాలు చూసుకోరు ఎందుకో. నేనూ చూడలేదు వాణ్ణి. కానీ వాడు నన్ను దాటుకుంటూ వెళ్తున్నప్పుడు ఇంకా కళ్ళతో కూడా చూడకుండానే వాణ్ణి గుర్తుపట్టాను. మరి అది వాడి పరిమళమా, నా కళ్ల కొలుకుల్లోంచి కనపడిన రూపపు మసక అంచులా, లేక కేవలం జననాంతర సౌహృదమా... తెలీదు. వాణ్ణప్పుడు చూడగానే ఏదో కలలో కనిపించిన మనిషిని బయట గుర్తుపట్టినట్టూ, అంత ఆత్మీయత లోపల్నించి పొంగటానికి కారణం ఆ మనిషి ఇంతకుముందు కలలో కనిపించటమే అన్న సంగతి గుర్తురాక అయోమయపడ్డట్టూ... అనిపించింది. వాడు పుస్తకాల రాక్స్‌ మధ్య తిరుగుతున్నాడు. నేను వాణ్ణి కేంద్రంగా పెట్టుకుని పుస్తకమేం అక్కర్లేకపోయినా పచార్లు చేస్తున్నాను. ఎలా పలకరించాలో తెలీలేదు. ఎలా వెళ్లాలి వీడి జీవితంలోకి, వీడి జీవితపు లోపల్లోపలి విషయాలతో నిమిత్తం ఉన్న మనిషిగా ఎలా మారాలి? వాణ్ణి ఇదివరకూ చూశానని చెప్పదల్చుకోలేదు. ఒకణ్ణి నెల క్రితం చూసి గుర్తుపెట్టుకున్న ఆడదాన్ని కాదల్చుకోలేదు. (తర్వాతెపుడో చెప్తే 'దొంగనాయాలా' అన్నాడు.)

చివరకు కొన్ని పుస్తకాలు తీసుకుని కౌంటర్‌ వైపు వెళ్లాడు. డబ్బులు కట్టి బయటకు వెళిపోతున్నాడు. అంత పిచ్చి ధైర్యం ఎలా వచ్చిందో తెలియదు. బహుశా అసలు వాడు రెండోసారి కనపడటమే మా ఇద్దరి మధ్యా ఏదో రాసి పెట్టుందన్నదానికి నిదర్శనంగా భావించిన నా మనసు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కితగ్గదల్చుకోలేదనుకుంటాను. వాడి వెనకే గేటు దాకా వెళ్లాను.

''ఎక్స్‌క్యూస్‌ మీ''

వాడు అప్పటికే మెట్లు దిగుతున్నాడు. కింద మెట్టు మీద వెనక్కి తిరిగాడు. వాడి కళ్లు... ఉన్నట్టుండి పిలిస్తే హడలిపోయిన కళ్లతో తిరుగుతాడు ఎప్పుడూ. ఆ ఎక్స్‌ప్రెషన్‌ చూట్టానికే ఒక్కోసారి ఉన్నట్టుండి ఊరికే పనేం లేకపోయినా పిలిచేదాన్ని. నా సొంత మిర్త్‌లో నేను నవ్వుతుంటే వాడి ఉడుకుమోతు ముద్దు ముఖం!

''నేను ఆ పుస్తకం కోసమే వెతుకుతున్నానండీ...''

వాడు చేతుల్లో ఉన్న మూడో నాలుగో పుస్తకాలు చూపించి, ''ఏది?'' అని అడిగాడు.

ఆ పుస్తకాల్లో రెండో కాపీ ఉండదనుకున్న పుస్తకాన్ని చూపించాను.

ఏమనాలో తెలీక ''అవునా,'' అన్నాడు. ''ఇంకో కాపీ ఉందేమో చూడండి,'' అన్నాడు.

''అడిగానండీ, లేదన్నాడు. మీరేం అనుకోకపోతే, మీ నంబర్‌ ఇస్తారా. మీరు చదివాకా తీసుకుంటాను.''

''ఆన్‌లైన్‌లో దొరకచ్చేమోనండీ,'' అన్నాడు మొహమాటంగా.

''నాకవన్నీ అలవాటు లేవు, ప్లీజ్‌!''

అయోమయంగా చూశాడు.

''మళ్లీ ఇచ్చేస్తాను చదవగానే.''

''అది కాదండీ, మనకేం పరిచయం లేదు కదా, పుస్తకం కోసం మళ్లీ కలుస్తారా అని.''

''పరిచయందేముందండీ, చేసుకుంటే అదే అవుతుంది. ఒకే పుస్తకం కోసం ఇంత కొట్టుకుంటున్నామంటే మన టేస్టులూ కొంచెం కలవచ్చేమో...''

వాడు ఎక్కడ ఉంటాడో అడిగాను. ఇందిరానగర్‌ అన్నపూర్ణ గుట్ట దగ్గర ఉంటాడట. ఇంటి దగ్గర దింపేస్తా రమ్మని కారు ఎక్కించుకున్నాను. కార్లో మాట్లాడుకున్నాం. వాడు ఎమ్మెస్సీ అవగానే తాడేపల్లిగూడెంలో రైలెక్కి సినిమాలకు పాటలు పాడదామని హైదరాబాదు వచ్చాడు. మూడేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అట్టడుగున స్ట్రగుల్‌ అవుతున్నాడు. గెటాన్‌ కావటనికి అడపాదడపా ఆర్కెస్ట్రాలో పాడతాడు, కేటరింగ్‌కి వెళ్తాడు, ఫ్రెండ్స్‌ యూసఫ్‌గుడాలో పెట్టిన ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లో కౌంటర్‌ దగ్గర కూర్చుంటాడు. పాటలు పాడే అవకాశం ఐతే రాలేదు గానీ, రెండు మూడు అడ్రసు లేని సినిమాలకు పాటలు రాశాడు. So, he is an artist!

ఆ రోజు ఇందిరానగర్లో ఒక నాపరాళ్లు పరిచిన కారు దూరని ఇరుకు సందు ముందు వాణ్ణి దింపాను. వాడూ నాలాగే పుస్తకాల్లో మాత్రమే తారసపడే ఎన్నో అరుదైన సన్నివేశాల్నీ సినారియోల్నీ జీవితం నుంచి ఆశించే హోప్‌లెస్‌ రొమాంటిక్కే గనుక, ఎవరో తెలియనావిడ ఇలా కారులో వాణ్ణి ఇంటి దగ్గర డ్రాప్‌ చేయటమనే అనుభవంలోని అరుదైనతనాన్ని పైకి కనపడనివ్వకుండా మామూలుగా ప్రవర్తించటానికే ప్రయత్నించాడు. దిగేటప్పుడు కిటికీ లోంచి వంగి ''థాంక్స్‌'' చెప్పి, వెనుదిరిగి తన నీరెండ లోకంలోకి నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

అలా మొదలైంది. వెళ్లిన రెండో రోజే కాల్‌ చేశాను. వారం ఓపిక పట్టి కలిశాను. చాలా మాట్లాడుకునేవాళ్లం. రాత్రుళ్లు నా గది బాల్కనీలోనూ, అర్ధరాత్రుళ్లు నా రగ్గు కింద సాగే ఫోన్లలో కాలం కరిగిపోయేది. సాయంత్రాలు పార్కుల్లోనూ ఎవరూ పట్టించుకోని దేవాలయాల్లోనూ కలుసుకునేవాళ్లం. రోజులన్నీ సూర్యుడి కాంతుల్లోనూ ఆకులతో ఆడుకునే గాలిలోనూ గడిచిపోయేవి. నాన్న చనిపోయాకా హఠాత్తుగా తెగిపోయిన బాల్యం, మళ్లీ మాధవ్‌ రాకతో, ఈ మధ్య నిడివిలో అసలేమీ జీవితం గడవనట్టుగానే, తిరిగి కొనసాగినట్టనిపించేది. కొన్ని విషయాల్లో అతను అచ్చంగా నాన్నకు ప్రతిబింబం. ఒక మృదుగంభీర వ్యక్తిత్వంగా, ఆడదాని మనసుని అబ్బరంగా కాచుకోగల మగాడిగా మున్ముందు ఎదగబోయే అతనిలోని ఆ అంశల్ని నేను బీజరూపంలోనే గుర్తించాను. అవి నా వయస్సుని మర్చిపోయేలా చేసేవి. నేను నలభై దాటిందాన్నని అప్పుడప్పుడూ గుర్తొచ్చి సిగ్గేసేది. కానీ అది నాకు మాత్రమే గుర్తొచ్చేది. వాడెప్పుడూ అది ఎత్తి చూపించేలా ప్రవర్తించలేదు. వాడు వయసుకి మాత్రమే ఇరవైల్లో ఉండేవాడు, మనసుకి నాకు సరిజోడు.

కలిసిన నెల రోజులకనుకుంటా, ఒక రోజు శ్రీశైలం ప్రయాణం పెట్టుకున్నాం. వంతులుగా డ్రైవ్‌ చేసుకుంటూ, ఆగాలనిపించిన చోట ఆగి ఏదోటి తింటూ, ఒక్కోసారి ఊరికే దారిలో తారసపడ్డ ఏదో ఒక ఊరి వైనం నచ్చి చాలాసేపు అక్కడ అలా కారు ఆపేసి ఆ స్థలంలో మాకూ తట్టీతట్టకుండా తాకిన ప్రణయ స్వభావమేదో పూర్తిగా ఆకళింపు చేసుకోవటానికి ప్రయత్నిస్తూ, నిద్ర గన్నేరు నీడలు మా కారు మీంచి వెనక్కి జరిగిపోతుంటే కబుర్లలో కాలం తెలియకుండా, కాలం తెలియకుండా ఇట్టే జారిపోతుందే అన్న గుబులుతో కారు వేగం నలభై దాటనీయకుండా... సాగిపోయాం. ఘాట్‌ రోడ్డు ఇంకా ఎక్కక ముందు, దూరంగా రంగులేని కొండలు ఆహ్వానిస్తూ కనిపిస్తున్న చోట, సూర్యుడు కుంగి చల్లని నీడలు భూమంతా పాకే వేళ కారు విశ్రాంతికి ఆపాం. సంభాషణ ఏంటో గుర్తు లేదు గానీ, అది వాడు నన్ను ముద్దుపెట్టుకునేదాకా తెచ్చింది. అతి సహజంగా జరిగిపోయిందది. మేమిద్దరం అనే ద్వంద్వం ఇంకా మిగిలి ఉండటానికి మా మధ్య నడుస్తున్న ఆ సెక్సువల్‌ టెన్షనే కారణం అని ఇద్దరికీ అనిపించింది. దాన్ని తొలగించు కోవటానికే అన్నట్టు దాన్ని దాటేశాం.

రాఘవ నాలో మార్పును గమనించాడు. కనీసం ఒక చూరు కింద కలిసి ఉన్న పుణ్యానికైనా మోయాల్సిన మొహమాటపు బంధాన్ని కూడా నేను పట్టించుకోకపోవటం అతని గమనింపుకు వచ్చింది. పైగా, అతనూ నేనూ ఇంకా ఇలా ఒకే ఇంటిలో కలిసి   ఉండటం మాధవ్‌లో ఎలాంటి ఇన్‌సెక్యూరిటీల్ని తెస్తుందో అని భయపడి కాబోలు నేను రాఘవకి మరింత దూరంగా మసలుకునేదాన్ని. ఆ దూరాన్ని అక్కడ లేని మాధవ్‌కి నిరూపించటానికి నా మాటల్లో రాఘవ మీద మరింత ద్వేషం చూపించేదాన్ని. ఆ ద్వేషం ఎప్పుడో ఎలాగో నిజంగా నాలో ఇంకిపోయి నిజంగానే ద్వేషించటం మొదలుపెట్టాను. బాగా చీకిపోయిన బట్ట ఎండలో ఎండితే ఎలా పేలికలుగా ఊడొచ్చేస్తుందో అలాంటి పేలికల బంధం మిగిలింది చివరికి. కానీ నేను లెఖ్ఖచేయటం మానేశాను. ఊడితే ఊడింది అన్నట్టు, కొన్ని సార్లు అతని ముందే మాధవ్‌ ఫోన్‌ ఎత్తేదాన్ని.

జంటగా మా భవిష్యత్తు అసలు ఏమిటన్నది మాధవ్‌ నేనూ ఆలోచించేలోపలే నెలలు గడిచిపోయాయి. అసలు మొదట్లో ఆ అవసరమే కనిపించలేదు. నెలలు గడిచేకొద్దీ అవినాభావం అంతకంతకూ గాఢమైపోవటం వల్లనే మా ఇద్దరికీ జంటగా ఒక భవిష్యత్తు ఉండి తీరాలన్న అవసరం కనిపించిందేమో. వాడి వైపు నుంచి వాడికి ఏమీ అడ్డుల్లేవు. కానీ నేను మొదట్లో డెఫినిటివ్‌గా ఏదీ చెప్పేదాన్ని కాదు. రాఘవ నాకు ఒక లెక్క కాదు. విడాకులు ఇచ్చేయచ్చు. కానీ స్వప్న. దానికో భవిష్యత్తు ఉంటుందా అమ్మ తనకన్నా పదిహేనేళ్ల వయసు తక్కువవాడితో ఉంటుందంటే? అదంతా పక్కన పెట్టినా, ఏమని నేను వీడి మీద ఆధారపడగలను? ఇంకా తన లక్ష్యపు  నిచ్చెన మొదటి  మెట్ల మీదే ఉన్నాడు. మా ఖర్చులన్నీ నేనే పెట్టుకునేదాన్ని. ఈ శంకలన్నీ తలెత్తటం మొదలుపెట్టాకా, వాడితో ఉన్న సమయమంతా వాడి మాయలో బాగానే గడిచేది, కానీ వాడితో లేనప్పుడు మాత్రం తలనొప్పి పుట్టించే ఆలోచనలు చుట్టుముట్టేవి. ఒక్కోసారి అనిపించేది... వాడు మా బంధాన్ని కేవలం ఒక 'ఆంటీ'తో సరదాగా కొన్నాళ్లు గడపడంగా స్వీకరించినా బాగుండేదేమో అని. కానీ వాడు అలా కాదు. వాడు అలా కాదు కాబట్టే దీని గురించి నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను.

కానీ రాన్రానూ వాడిలో ఒక భావి పట్ల ఖచ్చితమైన అవగాహన ఉండాల్సిన అవసరం కనిపించసాగింది. మొదట్లో దాన్ని నేను నిరాకరించలేదు. క్రమేణా అవ్యక్తమైన సమ్మతి కూడా చూపించాను. చివరకు మా ప్రణాళికలు సుదూరంగా మెటీరియల్‌ రూపంలో మినుకు మినుకుమనడం కూడా మొదలైంది. స్వప్న ఇంకొన్నేళ్లలో ఎలాగో ఇల్లు వదిలి బయటి లోకంలో తన జీవితం తాను చూసుకుంటుంది. తర్వాత రాఘవ నేనూ కలిసి  ఉండటం అనేది అర్థరాహిత్యానికి సజీవ నిర్వచనంగా మిగలటమే. రాఘవకి పెద్ద తేడా ఏం ఉండదు. తన పేర్న ఆస్తులున్నాయి. విడిపోయుంటే తర్వాత పెళ్లి కూడా చేసుకునే వాడనుకోను. నా పేర్న పెళ్లప్పుడు ఇచ్చిన ఆస్తులు కొన్ని ఉన్నాయి, ఊళ్లో తమ్ముడు వాటిని చూసుకుంటున్నాదు. అవి సరిపోతాయి నాకూ మాధవ్‌కీ. ఇలా ఆలోచించేదాన్ని. అదంతా ఎలా సాధ్యమని ఆలోచించానో ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది, ఆ ప్రపంచం చాలా దూరం జరిగిపోయాకా. అలా దూరం జరిగిపోయే రోజు త్వరలోనే ఎదురైంది.

ఒకరోజు పొద్దున్నే ఏదో పనిలో ఉండగా రాఘవ బిగ్గరగా పిలిచాడు. వెళ్ళేసరికి అతను స్వప్న గదిలో ఉన్నాడు. స్వప్న కాలేజీకి వెళ్లింది. మామూలుగా మేం ఎవరం తన గదిలోకి వెళ్లం.

''ఏం ఇక్కడ ఉన్నావ్‌?'' అడిగాను. అతను స్వప్న మంచం మీద కూర్చున్నాడు. ఏదో దాచుకున్న ముఖం పెట్టుకుని.

నా ప్రశ్నకి బదులుగా అన్నట్టు లేచి వెళ్లి గోడకున్న అల్మరా తెరిచాడు. అందులో స్వప్న బట్టల కింద ఉన్న ఒక నల్లని గుడ్డ బయటకు లాగాడు. అదేమిటో వెంటనే అర్థం కాలేదు.

''ఏంటది?''

బట్టలషాపు సేల్స్‌మన్‌లా దాన్ని నా ముందు విప్పి పరిచాడు. అదో బురఖా.

''ఐతే?''

''నీకు అర్థం కావటంలేదా? దానికి బురఖా తొడుక్కునే అవసరం ఏమై ఉండొచ్చో?''

''ఛా...! ఫ్రెండుదై ఉంటుంది.''

''ఇది నేను రెండ్రోజుల క్రితమే చూశాను. దాన్ని ఫాలో అయ్యాను.'' అతను చెప్తున్నకొద్దీ నా కాళ్లు చల్లబడ్డాయి. పక్కన కుర్చీలో కూలబడిపోయాను. స్కూలయ్యాకా ఫ్రెండ్‌ ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఆలస్యంగా వస్తోంది. కానీ నిజానికి ఎవడో టీవీ ఛానెల్లో కెమెరా అసిస్టెంటుగా పనిచేస్తాడట, వాడి బండెక్కి దుర్గంచెరువు వైపు వెళ్తోందట. రాఘవ స్వప్నని ఆ రోజు మామూలుగా ఇంటికి రానిచ్చి, తర్వాతి రోజు పొద్దున్నే ముందే కనుక్కున్న ఆ కుర్రాడి ఇంటికి వెళ్లి అక్కడ వాణ్ణి కారెక్కించుకుని మార్బల్‌ ఫాక్టరీకి తీసికెళ్లి కొట్టాడట. బెదిరించి పంపించాడట. ఇప్పుడే అక్కణ్ణించి తిరిగివచ్చాడు. ఈ విషయం చెప్పి నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. 'అసలు నువ్వు పదహారేళ్ళ ఆడపిల్లకి తల్లివేనా... నీ ఫోన్లు, నీ షికార్లు, నీ వెధవ్వేషాలూ...' అంటూ. నాకు కోపం రాలేదు. ఇక్కడ అతను నన్ను బోనులో నిలబెట్టింది భార్యగా ఐతే నేను లెక్కచేసేదాన్ని కాదు, సంజాయిషీ ఇవ్వాల్సిన బరువు కూడా ఫీలవ్వను, కానీ నన్ను నేను ఎప్పుడూ ఒక మంచి అమ్మగానే చూసుకుంటూ వచ్చాను. అతను అంత తిడుతున్నప్పుడు కూడా నాకు అవేమీ వినిపించలేదు. నా స్వప్న... అన్నీ నాకు చెప్పుకుంటూ, నన్ను ఒక అందమైన అమ్మగా ఐడియల్‌గా ఊహించుకునే స్వప్న... నా నుంచి ఎప్పుడు ఎక్కడ ఎలా ఇంత దూరమైపోయిందో కూడా తెలియని స్థితిలో హఠాత్తుగా నన్ను నేను చూసుకోవాల్సి రావటం.... రాఘవ తన అక్కసంతా తీర్చుకున్నాడు. అతని భార్యనన్న స్పృహ ఎప్పుడూ మాధవ్‌తో నా అనుబంధాన్ని దోషభావం వైపు నెట్టలేకపోయింది. కానీ స్వప్న తల్లినన్న స్పృహ ముందు (ముఖ్యంగా తల్లిగా నా అసమర్థత ఇలా బయటపడ్డాకా) ఆ బంధాన్ని నేను ఏ రకంగానూ సమర్థించుకోలేకపోయాను, నన్ను నాకే సమర్థించుకోలేకపోయాను. ఆ నిశ్శబ్దాన్ని ఆసరా తీసుకుని రాఘవ చాలా రెచ్చిపోయాడు. ఏమన్నా పడ్డాను. కానీ, స్వప్న ఇంటికి రాగానే మీదపడి కొట్టాడు. స్వప్న తప్పు దొరికిపోయిందానిలా ఏం నిలబడలేదు. ముందు నా అల్మరాలో చేయిపెట్టడానికి నువ్వెవడివని దెబ్బలాడింది. వాణ్ణి ప్రేమిస్తున్నానంది. రాఘవ మరింత రెచ్చిపోయాడు. ఇంక నేను నిశ్శబ్దంగా ఉండలేదు. అతణ్ణి  నిలువరించటానికి నా  దగ్గరా  ఆయుధాలున్నాయి. ఎక్కడ  ఉంచాలో అక్కడ ఉంచేట్టు మాట్లాడాను. అరుచుకుంటూ బయటికి వెళిపోయాడు. ఆ రాత్రంతా స్వప్నని దగ్గర కూచోబెట్టుకుని మాట్లాడాను. తను ఆ కుర్రాడి గురించి చాలా చెప్పింది. అవి నా వయసు మైలురాయి దగ్గర నిలబడి చూస్తే చాలా సిల్లీ రీజన్స్‌ ప్రేమించటానికి. ఎలా ఏం చేశానన్నది అంతా ఇక్కడ అనవసరం. కానీ వాడు నిజంగా ఏంటో నిరూపించి (నిరూపించాననుకొని) స్వప్నను మళ్లీ నాకు దక్కించుకోవటానికి నెల పట్టింది.

స్వప్న ఒక ఆరేడేళ్లలో తన జీవితం తను చూసుకోగల స్థితికి వచ్చేస్తుందిలే అనుకున్నానే గానీ, ఆ ఆరేడేళ్ల జీవితం తనకి ఎంత ముఖ్యమో గుర్తించలేకపోయాను. కాని ఆ గుర్తించే స్థితి ఎప్పుడైతే వచ్చిందో, మాధవ్‌తో నా అనుబంధం ఎప్పటికైనా చేరగల పర్యవసానాల్ని నిజాయితీగా వాస్తవలోకపు ప్రమాణాలతో తూచగల స్థితి కూడా వచ్చింది. ఎప్పటికైనా స్వప్న దీన్ని ఒప్పుకోగలుగుతుందా; స్వప్న సంగతి వదిలేస్తే, చుట్టూ సమాజం; ఎక్కడికో పోయి అడవిలో ఐతే బతకలేంగా, చివరికి నా కుటుంబం, వాళ్లేమనుకుంటారు, ఇలా వాస్తవం ఒక వెనక్కిపోని కెరటంలా నన్ను కమ్మేసింది. నెమ్మది నెమ్మదిగా మాధవ్‌తో మాట్లాడే వీలు చాలా తగ్గిపోయింది. ఫోన్లు కట్‌ చేయటం మొదలుపెట్టాను. చివరికి ఇదిగో... ఒక రోజు తిన్నగా నా కాలేజీకి వచ్చేస్తే ఇక తప్పలేదు. కారు నడుపుతున్నంతసేపూ నేను రోడ్డుని అతి శ్రద్ధగా చూసాను. నా వైపే చూస్తున్న వాడి కళ్ళల్లోని అపురూపం- అటు చూడకపోయినా తెలుస్తూనే ఉంది.

కాలేజీ పక్కన కాలనీలో ఈట్‌ స్ట్రీట్‌ లాంటిది ఉంది. ఒక చిన్న డెడ్‌ ఎండ్‌ సందు. దాన్ని మొత్తం ఒక రెస్టారెంటు వాళ్లు అద్దెకు తీసుకున్నారు. సందు మొత్తం ఆస్ఫాల్టు పరిచి, పెద్ద రంగుల గొడుగుల కింద నాలుగేసి కుర్చీలతో టేబిళ్లు దూరం దూరంగా ఏర్పాటు చేశారు. రాత్రిళ్లయితే ఆ చోటు చాలా సందడిగా ఉంటుంది. మేం వెళ్లింది మధ్యాహ్నం కాబట్టి చాలా తక్కువమంది ఉన్నారు. కారు పార్క్‌ చేసి ఇద్దరం ఓ గొడుగు కిందకి చేరి కూర్చున్నాం.

''ఏమన్నా తింటావా,'' అడిగాను.

తల నిశ్శబ్దంగా అడ్డంగా ఊపాడు.

నాకు ఊరికే ఎదుట కూర్చుని జడ్జి చేయబడాలని అనిపించలేదు. ''నాకు ఆకలి వేస్తుంది,'' మెనూ తిరగేసి వెయిటర్ని పిలిచి ఏదో ఆర్డరిచ్చాను. అప్పుడు కళ్లల్లోకి చూశాను. ''ఏంటి?''

ఏమీ లేదన్నట్టు కళ్లెగరేసి, ''నువ్వే చెప్పు,'' అన్నాడు.

నేను డిఫెన్సివ్‌ క్షణాల్లో మరీ అఫెన్సివ్‌గా స్పందిస్తాను. ''ఏమీ లేకపోతే ఎందుకు నా పని చెడగొట్టడానికి ఆఫీస్‌దాకా వచ్చావ్‌?''

''ఏమీ లేనిది నా దగ్గర. నీ దగ్గర కాదు. నీలోపల ఏదన్నా నా పట్ల ఉంటే కక్కేయి. దాచుకుని ఇలా చేయకు. బాధగా ఉంటుంది.''

''ఎలా చేస్తున్నా?''

ఫోన్స్‌ ఎందుకు అటెండ్‌ కావటం లేదని అడిగాడు.

నేను చెప్పటం మొదలుపెట్టాను. స్వప్న గురించి, జరిగిన విషయం అంతా చెప్పాను. అతను ఊరికే కూర్చుని విన్నాడు, నా కళ్లల్లోకి చూస్తూ. చివరికి అన్నాడు. విడిపోవాల్సిన అవసరం ఏముందని. స్వప్న జీవితంలో సెటిలయ్యేదాకా ఎదురుచూస్తానని.

అతను దీనికి కూడా సిద్ధపడ్డాకనే, నాకు అర్థమైంది. నా అడ్డం స్వప్న కూడా కాదు, నా అడ్డం సమాజం. ఇది ఎటూ చేరలేని బంధం. ఈ బంధాన్ని నిలుపుకోవాలంటే ఎన్నో ఎదుర్కోవాలి. మగవాడిగా అతనికి ఫర్లేదు. ఆడదానిగా నన్ను నేను ఆ స్థానంలో ఊహించుకోలేకపోతున్నాను. కానీ ఈ వేరే అభ్యంతరాలేవీ అతనికి చెప్పలేదు. అతణ్ణి దూరం చేసుకోవటానికి నా అమ్మతనమే ఒక ఆదర్శవంతమైన కారణం అనిపించింది. మిగతావన్నీ భయాలు. అతణ్ణి నెట్టేయటంలో నేను ఆదర్శవంతంగా మాత్రమే కనపడదల్చుకున్నాను. భయస్థురాలిలా కాదు.

''నేను నీకు ఏదీ ప్రామిస్‌ చేయలేను మాధవ్‌. స్వప్న నాకు ముఖ్యం. ఇది దాని లైఫ్‌లో చాలా ముఖ్యమైన సమయం. నేను దాన్తో ఉండాలి. దాన్ని పెంచాలి. చదివించాలి. మంచి ఉద్యోగంలో స్థిరపడేలా చేయాలి. మంచోడ్ని చూసి పెళ్లి చేయాలి. దానికన్నా మహా ఐతే పదేళ్లు పెద్దవాడివి, నిన్ను పక్కన పెట్టుకుని కన్యాదానం చేయలేను కదా. అది చాలా నీచం. నీకెందుకు అర్థం కావటం లేదో నాకర్థం కావటం లేదు.''

ఈ వాదన తిరుగులేనిది. అని నాకు తెలుసు. కానీ వాడికి నా మనసు నాకన్నా బాగా తెలుసు. నా భయాలూ, నా పిరికితనాలూ అన్నీ తెలుసు. తిరుగులేనిది కనుకనే ఈ వాదన ఎన్నుకున్నానని కూడా, బహుశా, తెలుసు.

కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఇక నేను జవాబు చెప్పలేని ప్రశ్న తీసుకొచ్చాడు. ''మరెందుకు దీన్ని ఇక్కడిదాకా తీసుకొచ్చావ్‌?''

''ఇక్కడిదాకా నిన్నూ నన్నూ ఎవరూ తీసుకురాలేదు. మనం వచ్చాం. కలిసి వచ్చాం. అంతే!''

''అవును, కానీ ఊరికే ఎవరి దారిన వాళ్లం నడుస్తూ రాలేదు కదా. ఈ ప్రయాణంలో కొన్ని ప్రామిసెస్‌ ఒకరికొకరం చేసుకున్నాం. అన్నీ మాటల ద్వారా జరిగేవే కాదు. మన ప్రతి పనిలోనూ ఒక ప్రామిస్‌ కూడా ఉంటుంది.''

''అలా నేనేదో నిన్ను నట్టేట్లో ముంచినట్టు మాట్లాడొద్దు. నన్ను నేను ముంచుకుంటున్నాను. నీకేంరా. నీకు ముందు జీవితం ఉంది. నువ్వు బాగుంటావు. మున్ముందు ఇదంతా మహా అయితే ఓ ముల్లు దిగిన సలుపు, అంతే.''

''దయచేసి అలా సముదాయిస్తున్నట్టు మాట్లాడకు. బిట్టర్నెస్‌ ఈస్‌ బెటర్‌. విడిపోతున్నప్పుడైనా నా వంతు డిగ్నిటీ నాకు మిగుల్చు.''

ఇంకేం అనగలను. వాడికి సముదాయింపైనా అందుతోంది. మరి నాకు అదీ లేదు. ఇంకా అన్నాడు:

''ఎన్ని ఊహించుకున్నాంరా. అప్పుడంతా నాతోనే ఉన్నావు కదా. ఇద్దరం కలిసే కన్నాం కదా కలలు.''

మరో జవాబు లేని ప్రశ్న ఇది. కానీ ఎంతసేపని బోనులో నిలబడను. అసహనం పెట్రేగింది:

''అవన్నీ కలలేరా. నీకు అవి సరిపోతాయి. నీకు ఇంకా బాధ్యత అంటే ఏంటో తెలీదు. ఊరికే రూపం పాడూ లేని ఆశల్ని జేబులో పెట్టుకుని రోడ్ల మీద తిరిగేస్తూ జీవితం గడిపేయొచ్చు అనుకుంటున్నావు. జీవితం అలా ఉండదు నాన్నా. ఇద్దరు కలిసి బతకటం అంటే ఏమిటనుకుంటున్నావు, ఎన్ని లెక్కలోకి వస్తాయనుకుంటున్నావు. ఇప్పుడు ఇక్కణ్ణించి బయటకి వెళ్ళేటప్పుడు బిల్లు కట్టాలన్నా నేనే కట్టాలి. నీకు డబ్బులు బాధ్యతగా దాచుకోవటం అనే కాన్సెప్టే తెలీదు. ఎలా పోషిస్తావు నన్ను. పైగా మనం కలిసిబతుకుతాం అని ఊహలో ఏవో ఊహించుకోగానే సరిపోదు, అది ఒక వాస్తవంగా ఈ కాలంలో ఈ సమాజంలో ఈ మనుషుల మధ్య రియలైజ్‌ కాగలదా లేదా అన్నది కూడా ఆలోచించుకోవాలి. ఎక్కడ బతుకుతాం మనం. ఇప్పుడంటే ఫర్లేదు. ఇంకో ఐదారేళ్లు పోతే నిజంగానే నీకు అమ్మలా కనపడతా నేను. ఇరుగుపొరుగు దృష్టిలో అభాసుపాలు కాకుండా ఉండాలన్నా మన బంధానికి ఏదో ఒక అబద్ధపు ముసుగు వేయాలి. నీక్కూడా ఇప్పుడు కనపడినంత అందంగా నేను ఎప్పటికీ కనపడకపోవచ్చు. నా శరీరం నీకు ఇప్పుడు పనికి వచ్చినట్టుగా ఎప్పటికీ పనికి రాకపోవచ్చు. చివరికి ఒక రోజున ఇంట్లో నేనుండగానే ఎవర్నో నిన్ను తృప్తిపరచగలదాన్ని తెచ్చుకుంటావు. జీవితంలో ఒంటరిగా నడవలేని, నడిచి గెలవలేని నీ అసమర్థతని ఇలాగే ఎన్నాళ్లకీ ఓ స్ట్రగులింగ్‌ ఆర్టిస్టు పోజుతో కప్పిపుచ్చుకుంటావు. నేను మాత్రం నువ్వు బయటకు వెళ్లేటప్పుడల్లా నీ జుట్టు పాపిడి తీసి, నీ జేబుని బరువైన పర్సుతో నింపి పంపిస్తుంటాను. అదేనా నీ ఊహ? బహుశా అందుకేనా నన్ను కావాలనుకుంటున్నావు?'' మా వీడ్కోలు నాక్కూడా బాధాకరమైనదే అని అతను ఒప్పుకోవాలనుకున్నాను. కానీ ఈ బంధాన్ని హతంచేస్తున్న హంతక స్థానంలో నన్ను పెట్టి మాట్లాడుతుంటే, ఎందుకో ఇలా ఉప్పెనలా నాలో ఇన్‌సెక్యూరిటీస్‌ అన్నీ బద్దలై బయటకు వచ్చేశాయి. వాటితో ఎన్నో చీకటి మూలల్లో నేను ఒంటరిగా పోరాడాను. ఇప్పుడిక నాకు వాడూ అక్కర్లేదు, వాడితో పాటూ అవీ అక్కర్లేదు. అన్నీ బయటకు పారేశాను, వాడి మీదకు విసిరేశాను.

వాడు నిశ్శబ్దమైపోయాడు. కాసేపు ఏం మాట్లాడలేదు. చివరికి జేబులోంచి రెండొందలు తీసి బల్ల మీద కొట్టినట్టు పెట్టాడు. ''ఈ ఆఖరుసారైనా బిల్లు నేను పే చేస్తాన్లే.'' కుర్చీ వెనక్కు నెడుతూ లేచి నిలబడి, ''థాంక్యూ, ఇప్పుడంత బాధగా కూడా ఏం ఉండదు,'' అని నడుచుకుంటూ వెళిపోయాడు. ఆ క్షణంలో అది చివరి కలయిక అని వెంటనే గుర్తు రాలేదు. ఒక ఆడదాన్ని టేబిల్‌ ముందు ఒంటరిగా వదిలేశాడన్న చిరాకే ఉండింది. కాసేపు కాన్షస్‌గా ఎవరైనా చూస్తున్నారా అని అటూ ఇటూ చూశాను. బిల్‌ పే చేశాను. బయటకు వచ్చి కారు తలుపు తీస్తూ వాడు వెళ్లిన వైపు చూశాను.

జీవితంలో నేను ఎరిగిన ఏకైక ప్రేమానుభవం నన్ను విడిచి నడిచిపోతోంది, దూరంగా చుక్కలా.

అంతే, అంతా కలిపితే.

ఇంతా రాశాకా ఇందులో కథేముందీ అనిపిస్తోంది. నేను కొట్టిన దెబ్బకి తట్టుకోలేక వాడు తన ఒంటరి గదిలో ఉరేసుకున్నాడని చెప్తే కథకి సరైన ముంగిపు ఉండేదేమో. లేదా కనీసం నేనే ఉరేసుకున్నాననీ, ఈ కథ రాస్తోంది ఓ భూతమనీ చెప్తే అన్నా కథకి మంచి ట్విస్టుగా పనికొచ్చేదేమో. ఓ రకంగా ఈ రెండో మాట నిజమే. ఐయాం డెడ్‌, మోర్‌ ఆర్‌ లెస్‌!

(మరీ అంత పెద్ద ట్విస్టయితే ఏం లేదు కానీ, ఓ చిన్న ట్విస్టు మాత్రం ఉంది. ఎవణ్ణించైతే స్వప్నను రక్షించానని అనుకున్నానో, చివరికి వాణ్ణే స్వప్న రెణ్ణెల్ల క్రితం ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాకా, ఆ విషయం ఫోన్లో చెప్పింది. రాఘవ ''అది నా వరకూ చచ్చిపోయిందానితో సమానం.'' అన్నాడు. నేను మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్లాను. కుర్రాడు గౌరవంగానే మాట్లాడాడు గానీ, వాడి మాటల్లో గెలుపు స్పష్టంగా కనపడింది. స్వప్నని బాల్కనీలోకి తీసుకెళ్ళి ఏం కష్టమొచ్చినా అమ్మని నేనున్నానని మర్చిపోకని చెప్పాను. అది నవ్విందంతే!)

మాధవ్‌ ఇప్పటికీ అడపాదడపా ఏదో టీవీ ప్రోగ్రాంలలో పాడుతూ కనిపిస్తూంటాడు. వాడి గొంతులో ఇప్పటికీ అదే ప్రాణం పెట్టి పాడేతనం. కళ్లు మూసుకుని లీనమైపోయి రాగాన్ని తన నరాల మీదే పలికిస్తున్నట్టు పాడతాడు. ఏదో సీరియల్‌ అయిపోయాకా స్క్రోలింగ్‌ టైటిల్స్‌లో వాడి పేరు సంగీత దర్శకుడిగా కూడా కనపడింది. మొన్నా మధ్య  ఫేస్‌బుక్‌లో వెతికితే కనపడ్డాడు. వాడి రిలేషన్‌షిప్‌ స్టేటస్‌లో ''ఇన్‌ రిలేషన్‌షిప్‌'' అని

ఉంది. ఆత్రంగా ఫోటోలు వెతికాను. ఏదో ట్రిప్పుకి వెళ్లినప్పుడు తీసుకున్నవనుకుంటా. వెనకాల ఏదో పెద్ద రిజర్వాయరు కనిపిస్తుంది ఆకాశపు అంచు దాకా పాకి. వాడు ఎవరో ఒకమ్మాయి భుజం చుట్టూ చేతులేసి నవ్వుతున్నాడు. కెమెరా లెన్స్‌ వైపు చూస్తూ, నా వైపు చూస్తూ.

— * —

(ఇది కినిగె పత్రికలో వై. విశారద పేరు మీద పబ్లిష్ అయింది (2014). ఆడ పేరుతో రాయటానికి పెద్ద కారణాలేం లేవు. పాఠకులు నా పేరు చూసి ఒక మగవాడు ఆడగొంతుతో ఎలా రాసి వుంటాడనే అంచనాతో కథ చదవటం మొదలుపెట్టడం నాకు ఇష్టం లేక.)

February 11, 2014

లిఫ్ట్ ఇవ్వటం పుచ్చుకోవటం

ఇరవై రూపాయల పాల పాకెట్టుకి ఐదొందల కాయితం ఇచ్చినా కొట్టువాడు ఏమాత్రం సణగకుండా చిల్లర తిరిగిచ్చాడన్న కృతజ్ఞతతో, ఆ ఇచ్చిన చిల్లరలో ఓ పది నోటు అడ్డంగా చిరిగి ఉన్నా కిమ్మనకుండా పుచ్చుకునే రకం నేను. మాట్లాడుకునే విషయం మీద ఈ స్వభావం తాలూకు ప్రభావం ఉండొచ్చన్న ఉద్దేశంతో ఈ సంగతి చెప్పాల్సి వచ్చింది.

నేను హైదరాబాదులో ఆరేళ్ళ మట్టీ ఉంటున్నాను. నాకు బండి లేదు. ఒక్కోసారి చాలా నడవాలి. అలాగని అస్తమానం లిఫ్టు అడగను. ఒక్కోసారి నడకకి అనువైన మూడ్లో ఉంటాను. కానీ ఒక్కోసారి పని అర్జంటైనపుడు అడగక తప్పదు. అలా గత కొన్నేళ్లలో లిఫ్టులు అడిగీ అడిగీ నాకు కొంత తత్త్వం బోధపడింది:

1) లిఫ్టు అడిగేటప్పుడు మన దారిన మనం నడుస్తూ ఒకసారి అడిగిచూస్తే పోలా అనుకుని అడుగుతున్నట్టుగా కనపడకూడదు. ఏదో ఉబుసుపోక అడుగుతున్నామని బండి యజమాని అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒక చోట ఆగి నిలబడి అడగాలి.

2) బండి మరీ దగ్గరకు వచ్చేశాకా చేయి ఎత్తడం వల్ల ప్రయోజనం లేదు. బండి యజమానికి లిఫ్టు ఇవ్వాలా వద్దా అని నిర్ణయించుకునేందుకు తగినంత సమయం ఇవ్వాలి.

3) లిఫ్టు అడిగేటప్పుడు బండి యజమానీ అతని బండీ ఒకే పదార్థమన్నట్టు కలిపేసి వేగ్ గా అటు చూడకూడదు. సూటిగా లిఫ్టు ఇచ్చేవాడి కళ్లల్లోకి చూస్తూ అడగాలి. (హెల్మెట్ ఉంటే అద్దం వైపు).

4) మన బాడీలాంగ్వేజ్ లో అవిశ్వాసం కనపడకూడదు. అతను మనల్ని దాటిపోయేవరకూ అతను లిఫ్టు ఇస్తాడని మనం ఎంతో నమ్మకంగా ఉన్నట్టు కనపడాలి.

5) ఎన్ని బళ్లు దాటిపోయాకా ఇక ప్రయత్నం మానేయవచ్చు అన్న దానికి ఖచ్చితమైన లెక్క లేదు. మన ఓపిక. ఒకసారి పదిమంది దాటిపోయాకా పదకొండో బండి మీదే మనక్కావాల్సిన దయగల ప్రభువు వస్తూండి ఉండొచ్చు.

6) అసలు లిఫ్టు అడిగేముందు మన వాటం ఎలా ఉందో ఒకసారి గమనించుకోవటం కూడా మంచిది. ఒంటరి రోడ్డు మీద రౌడీవాటంతో కనిపించేవాడికి లిఫ్టు ఎవరూ ఇవ్వరు.

7) సాధారణంగా పెళ్లయిన మగవాళ్లు లిఫ్టులు ఇవ్వరు. బ్రహ్మచారులే ఇస్తారు. ఇలా ఎందుకో నాకూ తెలియదు. సంసార సాగరపు క్రూరమైన నియమాల్లో పడ్డాకా, దయ అనేది ఒక పాషనబుల్ ప్రివిలేజ్ గా కనిపించటం మొదలౌతుందనుకుంటా.

8) మనం పదిమంది నిలబడి ఉన్న చోట నిలబడి అడిగితే చాలామంది బండి యజమానులు లిఫ్టు ఇవ్వటానికి ఇష్టపడరు.

9) రాత్రుళ్లు లిఫ్టు అడగటం కష్టమైన పని. హెడ్ లైట్ల వెలుగులో బండి మీద వస్తోంది ఆడా మగా అన్నది తెలియదు. నేను ఒక్కోసారి ఆడవాళ్ళను అడిగిన సందర్భాలూ ఉన్నాయి. వాళ్లు మనది పొరబాటు అనుకుంటారో, మరి వెధవ్వేషాలు వేస్తున్నాం అనుకుంటారో తెలియదు గానీ, ఎప్పుడూ ఆపరు. అలా ఒక అమ్మాయి లిఫ్టు ఇవ్వటం కోసం బండి ఆపటమనేది నా పగటి కలల్లో మాత్రమే జరుగుతుంది. అలా లిఫ్టు ఇచ్చే అమ్మాయి ఈ భరత ఖండంలో తారసపడటం కష్టం. దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు కూడా. ఎందుకంటే ఎవడైనా అలా పొరబాట్న అడిగినా ఒకవేళ నిజంగా ఆ అమ్మాయి ఆపితే, అప్పుడు ఆపింది అమ్మాయి అని గ్రహించి కూడా ఎవడైనా లిఫ్టు తీసుకోవటానికి సిద్ధపడ్డాడంటే, వాడు ఏదో ప్రాణాంతకమైన ఎమర్జన్సీలో ఐనా ఉండి ఉండాలి, లేదా సింపుల్ గా వాడి ఇంటెన్షన్ వెధవ్వేషాలు వేయటమే ఐనా అయి ఉండాలి. ఏమో, మళ్లా ఆలోచిస్తే ఇలా తీర్మానించడం తప్పేమో అనిపిస్తుంది. ఒక అమ్మాయి లిఫ్టు ఇవ్వటానికి బండి ఆపినా, సారీ చెప్పి బండెక్కని వాడు మర్యాదస్తుడే అనుకోనక్కర్లేదు, వట్టి పప్పుసుద్ద అని కూడా అనుకోవచ్చు. ఏదేమైనా ఈ విషయమై ఇన్ని మాటలు అనవసరం, మగాడికి లిఫ్టు ఇద్దామని బండి ఆపే అమ్మాయిలు ఎలాగూ ఉండరు.

10) రాత్రుళ్లు లిఫ్టు అడగటంలో ఇంకో ఇబ్బంది కూడా వుంది. బండి మీద వస్తోంది ఒకరేనా, లేక ఇద్దరా అన్నది తెలియదు. ఇలా నేను చాలాసార్లు భంగపడ్డాను. ఇద్దరు వున్నారని గ్రహించి చేయి దించేసేలోగానే వాళ్లు వెళ్తూ వెళ్తూ ఏదోక సెటైరు వేయక మానరు. “ఇంకెక్కడ ఎక్కుతావు నాయనా, నెత్తి మీదా” లాంటివి. ఒకసారి మాత్రం చిత్రం జరిగింది. అప్పటికే మసక చీకట్లు అలుముకున్నాయి, వాన పడుతోంది. నేను సైబర్ టవర్స్ దగ్గర అనుకుంటా నిలబడి ఉన్నాను. హెడ్ లైట్ల వెలుగు వల్ల బండి మీద ఇద్దరున్నారన్న సంగతి తెలియకుండానే చేయి చాపాను. అయినా ఆపారు. ఇద్దరు స్నేహితులూ ఎదరకి సర్దుకు కూచుని నన్ను మూడోవాడిగా వెనక ఎక్కించుకుని తీసుకుపోయారు. ఇది నా లిఫ్టుల చరిత్రలో ఒక వింత అనుభవం.

అలాగే ఇంకోటి కూడా ఉంది. వింత అనుభవం అని కాదు గానీ, నాకు గుర్తుండిపోయింది. ఒకసారి ఎర్రగడ్డ నుంచి సనత్ నగర్ వైపు నడుస్తున్నాను రాత్రి. అది బతుకుతెరువుకి హైదరాబాదు వచ్చిన కొత్త. జేబులో చిల్లిగవ్వ లేదు. ఒక ఆటో వాడు పక్కన స్లో జేసి “వస్తావాన్నా” అని అడిగాడు. డబ్బులుంటే ఎక్కే వాణ్ణే. లేవు కాబట్టి రానన్నాను. అతను ఊరుకోలేదు, “ఎందుకు రావు అటేగా పోతుంది” అన్నాడు. విసుగొచ్చి “పైసల్లేవన్నా” అని చెప్పేశా. అతను ఫర్లేదు ఎక్కమని ఏం పుచ్చుకోకుండానే సనత్ నగర్ దాకా దింపాడు. ఆటోవాళ్లు లిఫ్టు ఇవ్వటం అరుదైన సంగతేగా మరి. అది కూడా కాదేమో, మన పట్ల దయ ఎవరు చూపించినా అది ఎంత చిన్నదైనా గుర్తుండిపోతుంది.

అన్నింటికన్నా బాగా గుర్తుండిపోయిన ఇంకో లిఫ్టు అనుభవం మొన్న 2011 లో ఇండియా వరల్డ్‌కప్పు గెలిచిన రోజు రాత్రి జరిగింది. ఆ రోజు ఆఫీసులోనే ఇండియా శ్రీలంక మధ్య ఫైనల్స్ చూసి, లేటుగా గదికి బయల్దేరా. బస్సు కోసం పెద్దమ్మగుడి దాకా నడిచాను. రోడ్లంతా గోల గోలగా ఉన్నాయి. వాతావరణం డిసెంబరు థర్టీఫస్ట్ నైటుకి బాబులా ఉంది. కుర్రాళ్లు కార్ల కిటికీ లోంచి తలలూ మొండేలూ బయటపెట్టి చేతుల్తో జెండాలు ఊపుతూ అరుస్తున్నారు, బైకు ఒకడు నడుపుతుంటే ఇంకొకడు వెనక కాళ్ల మీద నిలబడి విజిల్స్ వేస్తున్నారు. ఇలాంటప్పుడు జనం మధ్య సులభంగా ఒక సుహృద్భావం వచ్చేస్తుంది కదా, మర్నాడు పొద్దున్న లేవగానే మర్చిపోయే తరహాది. మరి ఆ కుర్రాడు మామూలుగా అడిగితే లిప్ట్ ఇచ్చేవాడో లేదో, ఇప్పుడు ప్రపంచ కప్ గెలుపు ప్రపంచపు మంచితనం మీద నమ్మకాన్ని కలిగించి, అది ప్రతిగా అతనిలోని మంచితనాన్నీ మేల్కొలిపిందనుకుంటా, నేను చేయి చాపి ఇలా బొటన వేలు ఎత్తానో లేదో వెంటనే బండి బ్రేకు వేసి ఆపాడు. నేను ఎక్కగానే బండి సర్రుమని దూసుకుపోయింది. అతను మధ్య మధ్యలో బండి చేతులొదిలేసి నోటి చుట్టూ చేతుల్తో గూడు కట్టి అరుస్తున్నాడు, తన బండిని అరుస్తూ క్రాస్ చేసి వెళ్లేవాళ్లతో పాటూ తానూ గొంతు నరాలు తెగేలా అరుస్తున్నాడు. దారిలో ఎవరు హై ఫైవ్ ఇచ్చినా బండి స్లో చేసి మరీ తిరిగి వాళ్ల చేతులు చరుస్తున్నాడు. నేను మరీ క్రికెట్ పిచ్చోణ్ణి కాదు గానీ, ఇండియా గెలవటం అనేది నాలో ఏదో మూల దేశభక్తి తాలూకు అవశేషాల్ని ఉత్తేజితం చేసిందనుకుంటా, నాకూ సంతోషంగానే ఉంది. కానీ నాది మరీ ఇలా ఆనందంతో గంగవెర్రులెత్తే స్వభావం కాదు. ఎప్పుడన్నా తాగితే తప్ప. ఐతే ఎంతైనా ఒకే బండి మీదున్నాం కదా ఇద్దరం. అతను అలా ఓపక్క ఆనందంతో బద్దలయిపోతూ ఉంటే నేను ఊరికే మౌనంగా ఉంటే ఏం బాగుంటుంది. అతని ఆనందం ఎబ్బెట్టుగా ఫీలవ్వచ్చు. అందుకే నేనూ గొంతు నొప్పి పుట్టేలా అరవటం మొదలుపెట్టాను. అక్కడ నేను నా స్వభావాన్ని విడిచిపెట్టి మరోలా నటిస్తున్నానన్న సంగతి గమనించటానికి కూడా ఎవరూ లేరు కదా. కానీ ఏ మాటకామాటే చెప్పుకోవాలి, అలా అరుస్తూ సమూహాన్ని కదిలించిన సంబరంలో నేనూ పాలుపంచుకోవటం బాగా అనిపించింది. అయినా మొహమాటానికి పోయినట్టే కదా.

ఇలా లిఫ్టు ఎక్కినప్పుడు చాలాసార్లు జరుగుతుంది. ఒక మనిషి మనకు లిఫ్టిచ్చాడంటే అతను ఏదీ ఆశించకుండా ఉచితంగా ఉత్తపుణ్యానికి మన పట్ల దయగా ఉండటమే. దాన్ని టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవచ్చని మొదట్లో తెలిసేది కాదు. దాంతో లిఫ్టు ఎక్కిన కాసేపటి దాకా కనీస స్థాయి హ్యూమన్ ఇంటరాక్షన్ అయినా మా ఇద్దరి మధ్యా ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి ప్రయత్నించేవాణ్ణి. వాళ్లు ఎక్కడి దాకా వెళ్తున్నారో అడిగేవాణ్ణి. వాతావరణం గురించో, ట్రాఫిక్ గురించో వ్యాఖ్యానించేవాణ్ణి. క్లుప్తంగా చెప్పాలంటే బండియజమానిని ఎంటర్టయిన్ చేయటానికి చేతనైనంత ప్రయత్నించేవాణ్ణి.

కానీ క్రమేణా అప్పుడప్పుడూ నా చేతుల్లోకీ బండి వచ్చి, నేనూ అప్పుడప్పుడూ లిఫ్టులివ్వటం మొదలుపెట్టినప్పటి నుంచీ (బండి యజమానిగా నాణేనికి రెండో వైపు నేను నిలబడటం కుదిరినప్పణ్ణించీ), అలాంటి అనుబంధమేదీ వాళ్లు కోరుకోరని అర్థమైంది. మనల్ని ఎక్కించుకోగానే వాళ్ల మనసుల్లో ఒక మంచి పని చేశామనే తృప్తి కలుగుతుంది. అదే మనం వాళ్లకి ఇవ్వగలిగేది, అదే వాళ్లు కోరుకునేది. అందుకే “థాంక్స్ అన్నా!” తో సరిపెడుతున్నాను. అందులోనే వీలైనంత కృతజ్ఞత దట్టించటానికి ప్రయత్నిస్తున్నాను.

సరే, ఇక నా చేతుల్లో బండి ఉన్నప్పుడు నేను లిఫ్టులు ఇచ్చే పద్ధతి గురించి చెప్తాను. నిజం చెప్పాలంటే, పైన అన్ని పాయింట్లు రాశాను కదా, ఆ పాయింట్లేవీ నేను లిఫ్టు ఇవ్వబోయే వ్యక్తి విషయంలో పూర్తవుతున్నాయా లేదా అన్నది ఎప్పుడూ ఆలోచించను. ఆ క్షణం ఏమనిపిస్తుందో అదే పాత్ర వహిస్తుందేమో అనిపిస్తుంది. నేను లిఫ్టు ఇచ్చే సందర్భాల్ని నెమరు వేసుకుంటే ఈ కామన్ పాయింట్లు తట్టాయి:

1) లిఫ్టు ఇవ్వాలా వద్దా అన్నది నేను వెళ్తున్న పని అర్జెన్సీని బట్టి ఉంటుది. తీరుబడిగా పోతున్నప్పుడు ఎవరు అడిగినా లిఫ్టు ఇవ్వటానికి సంసిద్ధంగానే ఉంటాను.

2) కొన్ని ముఖాలు ఊరికే ఎందుకో మనకు నచ్చవు. అలాంటి ముఖాలకు ఇవ్వను. వాళ్లు సాధారణంగా నా సమవయస్కులై ఉంటారు. (లిఫ్టు అడిగేటప్పుడు నా ముఖం అలాంటి ముఖాల జాబితాలోకి వస్తుందేమో ఎప్పుడూ ఆలోచించలేదు, వస్తుందేమో).

3) ఎవర్నన్నా లిఫ్టు ఎక్కించుకున్నాకా, నా బండి నిర్జన ప్రదేశాల్లో పోతున్నప్పుడు హఠాత్తుగా ఆ వెనకనున్నవాడు నా పీక మీద కత్తి పెట్టి, బండాపించి, “తియ్యరా పర్సు” అంటాడేమో అని ఒక్కసారైనా భయపడతాను.

4) ఎవరి కన్నా లిఫ్టు ఇచ్చినపుడు బండి మామూలు కన్నా స్పీడుగా పోనిస్తాను – అతను ఏదో అర్జంటు పని మీదే లిఫ్టు అడిగుంటాడు కదా, స్లోగా తీసుకెళ్తే ఎలాగా అని.

సరే ఇక నేను లిఫ్టు ఇచ్చిన సందర్భాల్లో బాగా గుర్తుండిపోయినవి చెప్పమంటే మొన్న వారమే ఇచ్చిన ఒక లిఫ్టు గుర్తొస్తుంది.

జూబ్లీహిల్స్ చెక్పోస్టు దగ్గర పెద్దమ్మ గుడికి వెళ్లే మలుపు తిప్పీ తిప్పగానే ఒక ముసలాయన (అంటే మరీ వంగిపోయిన ముసలాయన కాదు, అరవయ్యేళ్లుంటాయేమో) చేయి ఊపాడు. ఎక్కించుకున్నాను. ఆయన ఫింఛనాఫీసు నుంచి వస్తున్నాడు. అక్కడ ఏదో ప్రభుత్వ పథకం ప్రకారం ఈయనకు నెలకు రెండొందలు రావాలి. కానీ ప్రభుత్వ రికార్డుల్లో ఈయన ఆల్రెడీ చచ్చిపోయాడని రాశారట. అందుకని అక్కడ దెబ్బలాడి, ఏదో అల్టిమేటం ఇచ్చి వస్తున్నాడు. మొత్తం గవర్నమెంటు మీదా వ్యవస్థ మీదా పగతో ఉన్నాడు. బండెక్కగానే తనను ఎక్కించుకున్నందుకు కాసేపటి వరకూ నన్ను చాలా పొగిడాడు. ఆ తర్వాత తన బాధ చెప్పుకున్నాడు. ఆయనది నెల్లూరు, రిటైరయ్యాడు, ఇప్పుడు సిటీలో ఏదో అపార్టుమెంటు ముందు కాపలా పని చేస్తున్నాడు. ఫింఛనాఫీసు వాళ్లని దారంతా తిడుతూనే ఉన్నాడు. ఆయన ఉద్యోగం చేసింది తమిళనాడులో. అక్కడి ప్రభుత్వానికీ ఇక్కడి ప్రభుత్వానికీ మధ్య తేడా ఎత్తి చూపుతున్నాడు. కాంగ్రెస్ మళ్లీ రాదంటున్నాడు. మధ్య మధ్యలో నేను కాస్త స్పీడు పెంచినపుడల్లా, “నెమ్మదిగా పోదాం బాబూ కంగారే వుంది” అంటూ నన్ను నియంత్రిస్తున్నాడు, మళ్లీ “థాంక్స్ బాబూ మీరు వచ్చారు కాబట్టి ఇలా వెళిపోతున్నాను” అని తెగ ఎగదోస్తున్నాడు. ఇలా శిల్పారామం దాటే దాకా అతను ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన జీవిత పరిస్థితులన్నీ టూకీగా ఏకరువు పెట్టేశాడు. ఆయన కుంటి తమ్ముడూ, ఆ తమ్ముడీ మధ్య పెట్టుకున్న బజ్జీల బండీ వగైరా. నెల్లూరి యాసలో మాట్లాడుతున్నాడు, వయసైపోయినా ఇంకా కుర్రతనం వదలని మనసుతో అభాసుపాలయ్యే ముసలాడు. చిన్న లిఫ్టు ఇచ్చినందుకు అంత ఎందుకు హడావిడి చేస్తున్నాడని నాకు మధ్యలో పీకుతూనే ఉంది. ఊరికే వచ్చి కాసేపు దగ్గరగా మాట్లాడి ఒక చిన్న మొహమాటపు అనుబంధం ఎస్టాబ్లిష్ అయ్యేలా చేసి, వెంటనే ఫలానా ఊరు వెళ్లాలి, లేదా ఫలానా అవసరం ఉందీ అని డబ్బులడిగి కాదనలేని పరిస్థితిలోకి తెచ్చి ఇబ్బంది పెడ్తారు కదా కొంతమంది… ఈయన ఆ కోవకు చెందడు కదా అని అనిపించింది. కానీ లిఫ్టు ఎక్కాకా సైలెంటుగా దిగిపోయేవాళ్లనే చూశాను గానీ, ఇలా ఇంత మాట్లాడేవాళ్లు తారసపడలేదు. అదొక్కటీ సరదాగా అనిపించింది. ఇంతా అయ్యాకా అతను చివరికి డబ్బులడిగి ఈ అనుభవాన్ని కల్తీ చేస్తాడేమో అని చిన్న జంకు. కానీ అతని దృష్టిలో కల్తీ చేయటానికి ఇదో పెద్ద అనుబంధం కాదేమో. ఇలాంటి పాసింగ్ అనుభవాల్ని మళ్లీ గుర్తు చేసుకునేవిగా భావించే నాలాంటి ఏబ్రాసి స్థితిలో లేడేమో. శిల్పారామం తర్వాత ఏదో బిల్డింగ్ కాంప్లెక్సు దగ్గర ఆపమన్నాడు. దిగాకా నేను వీడ్కోలు సూచకంగా నవ్వాను. నేను ఎక్కడ గేరు మార్చేస్తానో అన్న తొందరలో ఆయన వెంటనే, “రెండు గంటలు ముందే వచ్చేశాను సార్, టీ తాగటానికి ఓ పది రూపాయలుంటే ఇస్తారా” అనేశాడు. ఇప్పటిదాకా ఏర్పడిన అనుబంధపు ప్రాతిపదికన నేను ఆయనకి పది రూపాయలు ఇవ్వటం పెద్ద విషయం కాదు. కానీ అతని వైపు నుంచి ఈ అనుబంధాన్ని ప్రతిపాదించటం వెనుక కారణమే చివర్లో ఈ పదిరూపాయలు అడగటం అయినపుడు, అంటే నా వైపు నుంచి ఇది ఒక చిన్న అనుబంధం అయి, అతని వైపు నుంచి ఒక పథకం మాత్రమే అయినపుడు, నేను ఆ పది రూపాయలు ఇస్తే అతని పథకాన్ని గెలిపించినట్టు, ఆ తర్వాత అతను ఆ పది రూపాయలు జేబులో పెట్టుకుంటూ “బుట్టలో పడ్డాడు వెధవ” అనుకుంటే…? అది నాకు నచ్చలేదు, కాబట్టి “ఇవ్వను” అని చెప్పి బండి స్టార్ట్ చేసేశాను. కానీ కాస్త దూరం పోగానే “ఇవ్వను” అన్నందుకు ఏమనుకునుంటాడో అన్న ఊహ వచ్చింది. ఏముంది, రెండు గంటలు తొందరగా వెళ్లినందుకు ఎక్కడో అక్కడ కూర్చుని వెయిట్ చేస్తాడు, బహుశా బస్సుల బాధ లేకుండా తొందరగా సునాయాసంగా రాగలిగినందుకు ఆనందిస్తాడు, కానీ ఆనందిస్తూ టీ తాగటానికి డబ్బులు మాత్రం ఉండవు. బహుశా అలా కూర్చుని టీ తాగుతున్నప్పుడు ఇది అతనికి కూడా ఒక చిన్న అనుబంధంగానే అనిపించేదేమో. అనిపించకపోతే ఏం చేసేది లేదు, కానీ అనిపించే అవకాశం కూడా లేకుండా చేశాన్నేను. పెద్ద రిగ్రెట్ అని కాదు, ఇప్పుడు ఇదంతా అందుకే రాస్తున్నా అని నాటకం ఆడను. నేను అంత సున్నితమైన వాణ్ణి కాదు. కానీ, నేను మాత్రం ఆ పది రూపాయలు ఇచ్చేస్తే బాగుండేది.

రచనలో గొప్ప విషయమేంటంటే, రాస్తూ పోతుంటే కొన్ని అనుకోనివి హఠాత్తుగా మనల్ని పలకరించి నిలవరిస్తాయి. ఇప్పుడు ఇదంతా రాస్తుంటే, హఠాత్తుగా, అస్సలు సంబంధమే లేకుండా ఒక జ్ఞాపకం నా ముందుకు వచ్చి నిల్చుంది.

అప్పుడు ఇంటరు చదువుతున్నాను. ఎవరో ప్రైవేటు కాలేజీలో పాఠాలు చెప్పే మాస్టారు సాయంత్రం మాకు వాళ్ల మేడ మీద ట్యూషన్లు చెప్పేవారు. ఆ ట్యూషన్ కి అన్ని తరగతుల వాళ్లూ వచ్చేవారు. ఒక్కో గంట ఒక్కో క్లాసుకి చెప్పుకుంటూ పోయేవారు. చీకటి పడే వరకూ అన్ని తరగతులూ ఆ విశాలమైన మేడ మీద చెల్లా చెదురుగా జట్లు జట్లుగా విడిపోయి ఉండేవి. చీకటి పడ్డాకా మాత్రం ఆ మేడ మధ్యన ఉన్న చిన్న షెడ్డులోనే లైటు ఉండేది కాబట్టి అందరూ అక్కడ గుమికూడేవారు. ఒక రోజు రాత్రి బాగా వర్షం పడుతోంది. ట్యూషన్ మాత్రం అయిపోయింది. పిల్లలెప్పుడూ తడవటానికి జడవరు కదా. చాలామంది వెళిపోతున్నారు. నేను నా గొడుగు తీసుకుని మేడ దిగి గేటు తెరుచుకుని బయట రోడ్డు మీద వడి వడిగా అడుగులేసుకుంటూ పోతున్నాను. ఉన్నట్టుండి హఠాత్తుగా ఒక ఆరో తరగతి పిల్ల అనుకుంటా, “అన్నయ్యా ఆడ దాకా రావద్దా” అంటూ చొరవగా నా గొడుగులోకి దూరేసింది. చిన్న గౌను వేసుకుంది, పుస్తకాలు ఒబ్బిడిగా హత్తుకుంది. తర్వాత మేం ఒక సందు అంతా కలిసే నడిచాం. ఆ సందు అంతా వర్షం నీరు చీలమండల దాకా పారుతోంది. ఒక గొడుగు కింద నడిచాకా పరిచయాలు తప్పవు కదా. ఆ ఆరిందా పిల్ల ఏం మాట్లాడిందో గుర్తు లేదు, నేను ఏం మాట్లాడేనో కూడా గుర్తు లేదు. మా ఇల్లే ముందొచ్చింది, ఆ పిల్ల తర్వాత వర్షంలో తడుస్తూ వెళిపోయింది. ఈ జ్ఞాపకం నేను ఈ లిఫ్టు పురాణం గురించి రాస్తుండగా గుర్తుకు రావటం చిత్రం కదా! మైండ్ వర్క్స్ ఇన్ మిస్టీరియస్ వేస్. ఒక్కోసారి దాన్ని నమ్మాలి. బహుశా నాకు గుర్తుండిపోయిన బెస్ట్ లిఫ్టు ఇదే అనుకుంటా.

*

February 8, 2014

'తీర్పు' - ఫ్రాంజ్ కాఫ్కా

(కాఫ్కా 'ది జడ్జిమెంట్' కు నా అనువాదం)


కాఫ్కా డైరీలోని ఒక స్కెచ్

వసంతకాలంలో ఒక ఆదివారం ఉదయం. జార్జి బెండెమన్ అనే యువ వ్యాపారి పైఅంతస్తులో ఉన్న తన గదిలో కూర్చుని ఉన్నాడు. ఆ ఇల్లు నది ఒడ్డున వరుసగా బారు తీరిన ఇళ్ళలో ఒకటి. అవన్నీ పొట్టిగా నాసిరకమైన కట్టుబడితో ఉన్నాయి. చూట్టానికి ఎత్తులోనూ రంగులోనూ ఒకేలా కనిపిస్తున్నాయి. అతను ఇప్పుడే విదేశాల్లో ఉంటున్న స్నేహితునికి ఉత్తరం రాయటం పూర్తి చేశాడు, పరధ్యాసగా దాన్ని మడిచి కవర్లో పెట్టాడు, మోచేతుల్ని రాతబల్ల మీద ఆనించి కిటికీ లోంచి బయట నది వైపూ, వంతెన వైపూ, దూరంగా ఆవలి ఒడ్డున నున్నని పచ్చదనంతో కనిపిస్తున్న కొండల వైపూ చూస్తూ కూచున్నాడు.

అతను స్నేహితుని గురించి ఆలోచిస్తున్నాడు. ఈ స్నేహితుడు స్వదేశంలో తనకు సరైన అవకాశాల్లేవన్న అసంతృప్తితో, కొన్నేళ్ళ క్రితం రష్యాకి వలసపోయి, అక్కడ సెయింట్ పీటర్సుబర్గులో వ్యాపారం మొదలుపెట్టాడు. ఆ వ్యాపారం మొదట్లో మంచి జోరుగానే సాగింది కానీ ఈమధ్య కొన్నాళ్ళుగా అంతకంతకూ నష్టాల్లో కూరుకుపోతోంది, ఈ మధ్య స్వదేశానికి వచ్చినపుడల్లా అతను ఈ విషయమై చాలా వాపోతున్నాడు (అసలు అతను రావటం కూడా రాన్రానూ అరుదైపోతోంది). పరాయి దేశంలో తన్ను తాను నిష్పలంగా అలవగొట్టుకుంటున్నాడు. గెడ్డం మాసిపోయింది, చర్మం ఎంత పసుపుగా పాలిపోయిందంటే అది నిద్రాణంగా ఉన్న ఏదో వ్యాధి లక్షణమేమో అనిపిస్తోంది. తనలాగే ఈ దేశం నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడిన తోటి ప్రవాసులతో అతనికి పెద్దగా పరిచయాల్లేవు, స్థానిక రష్యన్ కుటుంబాలతో సంబంధాలూ అంతంత మాత్రమే, ఇక బ్రహ్మచారిగా మిగిలిపోక తప్పని ఖర్మకు తల వంచుతున్నాడు.

అలాంటి మనిషికి ఉత్తరం ఏమని రాయాలి, అతను దారి తప్పాడని తెలుస్తూనే ఉంది, అతని గురించి బాధపడటం తప్ప చేయగలిగిన సాయమేదీ లేదు. సలహా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అతణ్ణి ఇంటికొచ్చేయమనీ, ఇక్కడే నిలదొక్కుకొమ్మనీ, పాత స్నేహితుల్ని కలేసుకొమ్మనీ, వాళ్ళ ఆసరా తీసుకొమ్మనీ చెప్పచ్చు. కానీ అతనికి వేరేలా అర్థం అవ్వొచ్చు. ఎంత మెత్తగా చెప్తే అంత లోతుగానూ గాయపడే అవకాశం ఉంది. ఇప్పటి దాకా అతని ప్రయత్నాలన్నీ వృథా అనీ, ఇక అతను ఓటమి ఒప్పుకుని ఇంటికి తిరిగి రావాలనీ, అందరి అంచనా కట్టే చూపులకూ గురిగా మిగలాలనీ, బతకనేర్చిన తోటి స్నేహితులందరితో పోలిస్తే అతనింకా ఏళ్ళొచ్చిన పసివాడేననీ, సొంత ఊళ్ళోనే నెగ్గుకురాగలిగిన స్నేహితుల్ని చూసి ఇకనైనా నేర్చుకోవాలనీ... ఇలాంటి అర్థాలేవో స్ఫురించే అవకాశం ఉంది. పోనీ అతణ్ణి ఇంత బాధపెట్టినందుకు జరిగే మంచేమన్నా ఉంటుందా అంటే అదీ ఖాయంగా చెప్పడానికి లేదు. అసలు అతణ్ణి ఇక్కడికి రప్పించటం సాధ్యమేనా అన్నది మొదటి అనుమానం – ఆ మధ్య ఎపుడో అతనే అన్నాడు, స్వదేశంలోని వ్యాపార లావాదేవీల్తో తనకు పూర్తిగా పరిచయం తప్పిపోయిందని – రప్పించలేకపోతే, అతను ఎప్పటిలాగే పరాయిదేశంలో ప్రవాసిగానే మిగిలిపోతాడు, అది చాలదన్నట్టు ఈ సలహాకి చిర్రెత్తి ఇక్కడి స్నేహితులకు కూడా దూరమైపోయే అవకాశం ఉంది. ఒకవేళ సలహా పాటించి వచ్చినా, తర్వాత ఇక్కడ కుదురుకోలేకపోతే, ఎవరితోనూ కలవలేక అలాగని ఒక్కడూ మనలేక, చివరికి తనదని చెప్పుకునే దేశం గానీ, తనవాళ్ళని చెప్పుకునే స్నేహితులు గానీ లేని వాడై పోతాడు, అంతకన్నా ఎలా ఉన్నవాడు అలా ఆ పరాయిదేశంలోనే ఉండిపోవటమే నయం. ఇదంతా లెక్కలోకి తీసుకుని ఆలోచిస్తే, ఒకవేళ అతను ఇక్కడకు వచ్చినా ఏ మాత్రం నెగ్గుకురాగలడూ అన్నదీ అనుమానమే.

ఇలాంటి కారణాల వల్ల, ఓమాదిరి పరిచయస్తుడితో కూడా అలవోకగా పంచుకోగలిగే ఇక్కడి ముఖ్యమైన విశేషాలన్నీ, అతనితో ఉత్తరాల్లో పంచుకోవటానికి మాత్రం కష్టమనిపించేది. అతను ఆఖరుసారి ఇక్కడకు వచ్చి మూడేళ్ళ పైనే అవుతోంది, రష్యాలోని రాజకీయ పరిస్థితి వల్ల రాలేకపోయానంటూ తలాతోకాలేని కారణమొకటి చెప్పాడు, ఓపక్క వేలాదిమంది రష్యన్లు పరాయి దేశాలు వలసపోవటానికి వీలు కల్పిస్తున్న అక్కడి రాజకీయపరిస్థితి, ఈ చిన్న వ్యాపారి కొన్నాళ్ళపాటు సొంతదేశం వెళ్ళిరావటానికి ఎందుకు అనుమతించదో అర్థం కాలేదు. ఈ మూడేళ్ళలో ఇటు జార్జి జీవితంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. రెండేళ్ళ క్రితం అతని తల్లి చనిపోయింది, అప్పట్నించీ ఇంట్లో అతనూ అతని తండ్రీ ఇద్దరే ఉంటున్నారు, ఈ విషయం స్నేహితునికి రాశాడు, బదులుగా అతని నుంచి వచ్చిన సానుభూతి ఉత్తరం ఎంత మొక్కుబడిగా ఉందంటే, ఇలాంటి సంఘటనల్లోని విషాదం దూర దేశాల్లో ఆకళింపుకు రాదేమో అనిపించింది. తల్లి మరణం తర్వాత జార్జి వ్యాపారం మీదా, మిగతా విషయాల మీదా, బాగా శ్రద్ధ పెట్టాడు.

బహుశా, తల్లి బతికున్నంతకాలం, తండ్రి వ్యాపారమంతా తన చెప్పుచేతల్లోనే నడవాలని పట్టుబట్టడం వల్లనో (దీని వల్ల జార్జి సొంతంగా ఏ నిర్ణయమూ తీసుకునే వీల్లేకపోయేది); లేక, తల్లి చనిపోయాకా, తండ్రి ఏదో నామమాత్రంగా తప్ప ఇదివరకట్లా కలగజేసుకోకపోవటం వల్లనో; లేదంటే మరి కేవలం అదృష్టం వల్లనో – ఈ చివరిదే అసలు కారణమై ఉంటుంది – ఏదేమైనా, ఈ రెండేళ్ళలోనూ వ్యాపారం అనుకోని రీతిలో వృద్ధి చెందింది, సిబ్బందిని రెట్టింపు చేయాల్సొచ్చింది, రాబడి ఐదు రెట్లు పైనే పెరిగింది; ఇంకా ముందుకు పోబోతోంది అనటంలో సందేహం లేదు.
స్నేహితునికి మాత్రం ఈ వృద్ధి గురించి ఏమీ తెలియదు. అందుకే అతను ఇదివరకూ చాలాసార్లు జార్జిని రష్యా వచ్చేయమని నచ్చచెప్పటానికి ప్రయత్నించాడు (బహుశా ఆ సానుభూతి ఉత్తరంలో చివరిసారి కాబోలు), జార్జి నడిపే వ్యాపారాల్లాంటి వాటికి సెయింట్ పీటర్సుబర్గులో మంచి గిరాకీ ఉందని చెప్పుకొచ్చాడు. అది ఋజువు చేయటానికి పంపిన రాబడి లెక్కలు జార్జి ప్రస్తుత వ్యాపార రాబడితో పోలిస్తే పూచికపుల్లతో సమానం. అయినా అతను తన వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుందని స్నేహితునికి ఎందుకో అపుడు చెప్పలేకపోయాడు, ఇన్నాళ్ళ తర్వాత ఇపుడు చెప్తే వింతగా ఉండచ్చు.

అందుకే జార్జి తన స్నేహితునికి రాసే ఉత్తరాల్లో అప్రధానమైన సంగతుల గురించే రాస్తాడు, ఇలా స్తబ్ధుగా సాగే ఆదివారాల్లో తీరుబాటుగా ఆలోచిస్తున్నపుడు ఓ వరసావాయీ లేకుండా మనసులోంచి పైకి తేలే సంగతులవి. అక్కడ స్నేహితుడు తన ఆత్మసంతృప్తి కోసం సొంత ఊరి గురించి ఎలాంటి ఊహలు నిర్మించుకున్నాడో వాటిని భంగపరచని రీతిలో ఉత్తరాలు రాయాలి. అదీ జార్జి ఉద్దేశం. ఒకసారి అలాగే, ఏదో ఒకటి రాయాలి గనక, ఊళ్ళో ఎవరో కోన్‌కిస్కా అబ్బాయికీ అమ్మాయికీ జరిగిన ఎంగేజ్మెంటు గురించి రాస్తే, స్నేహితుడు ఆ విషయం గురించి అనుకోని ఆసక్తి చూపించడం కూడా మొదలుపెట్టాడు.

అయినా గ్రెగర్ ఇలా అప్రధానమైన సంగతులే రాస్తూ వచ్చాడు గానీ, ఒక నెల క్రితం స్వయంగా తనకే ఫ్రీడా బ్రాండెన్‌ఫెల్డ్ అనే సంపన్న కుటుంబపు అమ్మాయితో ఎంగేజ్మెంటు అయిందన్న సంగతి మాత్రం రాయలేకపోయాడు. అతను అప్పుడప్పుడూ కాబోయే భార్యతో ఈ స్నేహితుని గురించీ, తామిద్దరి ఉత్తరప్రత్యుత్తరాల్లోనూ ఇటీవల నెలకొన్న చిత్రమైన పరిస్థితి గురించీ చెప్పేవాడు. “అయితే అతను మన పెళ్ళికి రాడన్నమాట, కానీ నాకు నీ స్నేహితులందర్నీ కలుసుకోవాలని ఉంది,” అందామె. “నాకు అతణ్ణి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అర్థం చేసుకో. అడిగే వస్తాడు. వస్తాడనే అనుకుంటున్నాను. కానీ మొహమాటం కొద్దీ రావచ్చు, ఇబ్బంది పడొచ్చు, ఇక్కడకు వచ్చాకా నన్ను చూసి ఈర్ష్య పడనూవచ్చు; ఏదేమైనా చివరకు అతనికి మిగిలేది అసంతృప్తే, ఆ బరువును మోసుకుంటూ, ఒక్కడూ ఒంటరిగా వెనక్కు వెళ్ళాలి. ఒంటరిగా – అదెంత బాధో నీకు తెలుసా,” అన్నాడు జార్జి. “కానీ నీకు పెళ్ళయిందని మరే రకంగానో అతనికి తెలియకుండా పోదు కదా?” “అలా తెలిస్తే నేనేం చేయలేననుకో. కానీ అతను ఉన్న స్థితిని బట్టి తెలియకపోయినా ఆశ్చర్యం లేదు.” “ఇలాంటి స్నేహితులున్న నువ్వు అసలు పెళ్ళే చేసుకోకూడదు జార్జ్.” “దానికి మనిద్దరమూ బాధ్యులమేగా, ఇప్పటికి ఇలా కానిచ్చేద్దాం.” కానీ ఆమె ఊరుకోక, అతని ముద్దుల జడి కింద వేగంగా ఊపిరి పీలుస్తూ, “నాకు మాత్రం ఇది నచ్చలేదు,” అంటూ గట్టిగా అనేసరికి, తన స్నేహితునికి ఎంగేజ్మెంటు సంగతి చెప్పేద్దామా అనుకున్నాడు జార్జి. “నా తత్త్వం ఇది, అతను నన్ను ఇలానే అంగీకరించక తప్పదు. అతనికి స్నేహితునిగా ఉండటం కోసం నన్ను నేను వేరే వ్యక్తిలా మార్చుకోలేను కదా,” అనుకున్నాడు.

ఈ ఆదివారం ఉదయం అతను పూర్తి చేసిన ఉత్తరంలో, అతను తన ఎంగేజ్మెంటు గురించి తన స్నేహితునికి ఇలా రాశాడు: “అన్నింటికన్నా మంచి వార్తను ఆఖర్న చెప్పాలని దాచి ఉంచాను. నా ఎంగేజ్మెంటు అయిపోయింది, అమ్మాయి పేరు ఫ్రీడా బ్రాండెన్‌ఫీల్డ్, బాగా సంపన్న కుటుంబం నుంచి వచ్చింది, వాళ్ళు నువ్వు దేశం వదిలి వెళ్ళిపోయిన చాన్నాళ్ళ తర్వాత ఇక్కడికొచ్చి స్థిరపడ్డారు, కాబట్టి బహుశా నీకు వాళ్ళ గురించి తెలిసుండకపోవచ్చు. నా కాబోయే భార్య గురించి మున్ముందు నీకు ఎలాగూ తెలుస్తుంది, ప్రస్తుతానికి నేను చాలా ఆనందంగా ఉన్నానని మాత్రం చెప్పి ఊరుకుంటాను, ఇక మన స్నేహానికి సంబంధించినంతవరకూ కొత్తగా వచ్చిన మార్పు ఒక్కటే, ఇదివరకూ నీకున్న మామూలు స్నేహితుని స్థానంలో ఇప్పుడు ఒక ఆనందకరమైన స్నేహితుడు వచ్చిచేరాడు. అంతేకాదు, నా భార్య రూపేణా (ఆమె నిన్నడిగానని చెప్పమంది, తొందర్లో స్వయంగా తనే నీకు ఉత్తరం రాస్తుంది), నీకు ఆడవాళ్ళలో కూడా ఒక మంచి స్నేహితురాలు దొరకబోతోంది, పెళ్ళి కావాల్సిన బ్రహ్మచారికి అది ఎంతో కొంత మంచిదే. ఇక్కడకు రావాలంటే నీకు చాలా అడ్డంకులు ఉన్నాయని తెలుసు, కానీ అలాంటి అడ్డంకులన్నింటినీ అధిగమించటానికి నా పెళ్ళి ఒక సముచితమైన సందర్భం కాదంటావా? చెప్పటం చెప్తున్నాను, ఇక నీకు ఎలా వీలు ఎలా కుదిరితే అలా చేయి, ఇబ్బంది మాత్రం పడకు.”

జార్జి ఈ ఉత్తరం చేతిలో ఉంచుకుని చాలాసేపు మేజాబల్ల దగ్గరే కూర్చుని కిటికీ వైపు చూస్తూండిపోయాడు, పరిచయస్తుడెవరో కింద రోడ్డు మీద వెళ్తూ పలకరిస్తే, పరాకుగా, డొల్లనవ్వుతో తలూపాడు.

చివరకు ఉత్తరాన్ని జేబులో దోపుకుని, గది బయటకు వచ్చి, ఇరుకైన నడవాని దాటి, అటు పక్కనున్న తండ్రి గదిలోకి వెళ్ళాడు, అతనీ గదిలో కాలు మోపి నెలలు గడిచిపోయింది. నిజానికి ఆ అవసరం లేదు, తండ్రి ఆఫీసులో కలుస్తూనే ఉంటాడు; మధ్యాహ్నాలు ఇద్దరూ ఒకే రెస్టారెంటులో కలిసి భోజనం చేస్తారు, సాయంత్రాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు గడిపినా, అప్పుడు కూడా – జార్జి ఎప్పటిలా తన స్నేహితుల్నో, లేక ఈ మధ్య తరచూ చేస్తున్నట్టు తన కాబోయే భార్యనో కలవడానికి వెళ్తే తప్ప – ఇద్దరూ కాసేపు తమ ఉమ్మడి లివింగ్ రూములో కూర్చుని ఎవరి న్యూస్ పేపరు వాళ్ళు తిరగేస్తారు.

పగటిపూట ఇంత ఎండ కాస్తున్నప్పుడు కూడా తండ్రి గది ఎంత చీకటిగా ఉందో చూసి జార్జి ఆశ్చర్యపోయాడు. ఇంటి వారనున్న సందుకి అటువైపున్న ఎత్తయిన గోడ వల్ల గదంతా నీడలో ఉంది. చనిపోయిన తల్లి తాలూకు జ్ఞాపికలతో అలంకరింపబడిన ఒకమూల, కిటికీ దగ్గర కూర్చున్నాడు తండ్రి, చూపు మందగించటంతో న్యూస్ పేపర్ని కళ్ళకు బాగా దగ్గరగా పట్టుకుని చదువుతున్నాడు. టేబిల్ మీద టిఫిన్ కాస్త పుణికి వదిలేసినట్టు తెలుస్తోంది.

“ఆహ్, జార్జ్!” అంటూ అతని తండ్రి వెంటనే పైకి లేచాడు. ముందుకు నడుస్తుంటే ఆయన బరువైన డ్రెస్సింగ్ గౌన్ విడిపోయి అంచులు ఆయన చుట్టూ రెపరెపలాడాయి. — “నా తండ్రి ఇంకా దిట్టమైన మనిషే,” అనుకున్నాడు జార్జి.

“ఇక్కడ మరీ చీకటిగా ఉంది,” అన్నాడతను.

“అవును, చీకటిగానే ఉంది,” తండ్రి ఒప్పుకున్నాడు.

“మరి కిటికీ కూడా మూసేసావేం?”

“నాకలాగే బాగుంది.”

“బయట ఎండగానే ఉంది,” అని తన ముందు మాటను కొనసాగిస్తూ, కూర్చున్నాడు జార్జి.

తండ్రి టిఫిన్ పాత్రలన్నీ పక్కకి తీసి సొరుగుల బల్ల మీద పెట్టాడు.

తండ్రి కదలికల్ని లీనమైపోయి గమనిస్తూ, జార్జి అన్నాడు, “ఏం లేదు నాన్నా, ఓ విషయం చెప్దామని వచ్చాను. నా ఎంగేజ్మెంటు అయిన సంగతి చెప్తూ సెయింట్ పీటర్సుబర్గుకు ఉత్తరం రాశాను.” అంటూ జేబులోంచి ఉత్తరాన్ని కొద్దిగా పైకి లాగి మళ్ళీ లోపలికి వదిలేశాడు.

“సెయింట్ పీటర్సుబర్గుకా?” అడిగాడు తండ్రి.

“అవును, అక్కడున్న నా స్నేహితునికి,” తండ్రి కళ్ళల్లోకి చూట్టానికి ప్రయత్నిస్తూ అన్నాడు జార్జి. — “ఆఫీసులో నాన్నకీ, ఇక్కడి నాన్నకీ పోలికే లేదు, ఇక్కడ ఛాతీ మీద చేతులు కట్టుకుని ఎంత దిట్టంగా కూర్చున్నాడో,” అనుకున్నాడు.

“ఓ, నీ స్నేహితునికా,” తండ్రి నొక్కి అన్నాడు.

“అవును నాన్నా. ఇప్పటిదాకా అతనికి నా ఎంగేజ్మెంటు గురించి చెప్పాలనుకోలేదు. పెద్ద కారణాలేం లేవు, అతని మంచి కోసమే. నీక్కూడా తెలుసుగా అతను కాస్త సున్నితమైన మనిషని. అతనికి నా పెళ్ళి గురించి వేరే ఎవరి ద్వారా అన్నా తెలియనీ, అదెలాగూ నేను ఆపలేను (అతని ఏకాకి జీవితాన్ని బట్టి ఆ అవకాశం తక్కువే), కానీ నా అంతట నేను మాత్రం చెప్పకూడదనుకున్నాను.”

“ఇప్పుడు నీ మనసు మార్చుకున్నానంటావ్?” అన్నాడు అతని తండ్రి, పెద్ద న్యూస్ పేపర్ని కిటికీ గట్టు మీద పెట్టాడు, దాని మీద తన కళ్ళ జోడు పెట్టి, వాటిని కప్పుతూ పైన చేయి వేశాడు.

“అవును, మార్చుకున్నాను. ఒకటే అనుకున్నాను, అతను నాకు నిజమైన స్నేహితుడే అయితే నా ఎంగేజ్మెంటు అతనికీ ఆనందమే కలిగించాలి. కాబట్టి ఇక తటపటాయించటం మానేశాను. కానీ ఉత్తరం పోస్టు చేసే ముందు నీకు ఒకసారి చెప్దామనిపించింది.”

“జార్జ్,” తండ్రి తన పళ్ళు లేని నోటిని బార్లా తెరుస్తూ అన్నాడు, “ఒకటి చెప్తున్నా విను! ఈ విషయం మీద నన్ను సంప్రదించటానికి వచ్చావు. మంచి పనే చేశావు, కాదనను. కానీ, నువ్వు పూర్తి నిజం చెప్పకపోతే దీని వల్ల ఏ లాభమూ లేదు. కొన్ని సంగతులు ఇక్కడ మాట్లాడటం సబబు కాదు కాబట్టి ఊరుకుంటాను. మీ అమ్మ చనిపోయిన దగ్గర్నుంచీ, కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి. వాటి గురించి మాట్లాడే సమయం వస్తుంది, అనుకున్న దానికన్నా త్వరగానే వస్తుందేమో కూడా. ఆఫీసులో చాలా విషయాలు నా దృష్టికి రావటం లేదు, బహుశా నా నుంచి కావాలనేం దాయకపోవచ్చు – అలా దాస్తున్నారని నేను అనను – నాలో ఇదివరకటి బలం లేదు: నా జ్ఞాపకశక్తి క్షీణించిపోతోంది, అన్నీ గుర్తుంచుకోలేకపోతున్నాను. వయసైపోవడం ఒక కారణమైతే, రెండోది, అమ్మ చనిపోవటమనే దెబ్బ నీకన్నా గట్టిగా నాకు తగిలింది. – సరే ప్రస్తుతానికి మాట్లాడుతున్నది ఈ ఉత్తరం గురించి మాత్రమే కాబట్టి, జార్జ్, నేనొకటే బతిమాలుతున్నాను, దయచేసి నాకు అబద్ధం చెపొద్దు. ఇది చాలా చిన్న విషయం, అసలు చెప్పకపోయినా పెద్ద తేడా పడని విషయం, కాబట్టి అబద్ధం చెప్పొద్దు. నీకు నిజంగా సెయింట్ పీటర్సుబర్గులో ఒక స్నేహితుడు ఉన్నాడా?”

గ్రెగర్ ఇబ్బందిగా లేచి నిలబడ్డాడు. “పోనిలే నాన్నా, నా స్నేహితుల సంగతి మర్చిపో. వందమంది స్నేహితులైనా నా నాన్న సాటి కాదు. నేను ఏమనుకుంటున్నానో చెప్పనా? నువ్వు నీ ఆరోగ్యంపై సరైన శ్రద్ధ పెట్టడం లేదు. నువ్వు లేకుండా ఒక్కణ్ణీ వ్యాపారం నడపలేనని నీకూ తెలుసు, కానీ ఆ వ్యాపారమే నీ ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుందంటే, రేపే వెళ్ళి దాన్ని మూసేస్తాను. కానీ అదొక్కటే సరిపోదు. నీ దినచర్యలో చాలా మార్పులు తీసుకురావాలి. అంతా సమూలంగా మార్చేయాలి. ఓ పక్క లివింగ్ రూము నిండా వెలుగుంటే, నువ్వేమో ఇక్కడ చీకటిలో కూర్చుంటావు. పొట్ట నిండకుండా టిఫిన్ ఏదో అంతంతమాత్రంగా కెలికి వదిలేస్తావు. నీ ఆరోగ్యానికి మంచి చేసే గాలిని రానివ్వకుండా కిటికీ మూసుకుని కూర్చుంటావు. ఇక లాభం లేదు నాన్నా! రేపే డాక్టర్ని తీసుకువస్తాను, అతని సూచనల్ని పాటిద్దాం. మన గదులు మార్చుకుందాం, నువ్వు ముందు గది తీసుకో, నేను ఈ గది తీసుకుంటాను. కొత్తగా ఏం ఉండదు, నీ సామానంతా అక్కడికి మార్చేస్తాను. ప్రస్తుతానికి నువ్వు పడుకుని విశ్రాంతి తీసుకో. రా, నీ బట్టలు తీసేస్తాను, ఇలాంటివన్నీ నేను చేయలేననుకుంటావేమో కదూ, నీకే తెలుస్తుంది. పోనీ ఇప్పుడే ముందు గదిలోకి వెళ్ళి నా మంచం మీద పడుకుంటావా? అదే మంచిది.”

జార్జి తండ్రి దగ్గరగా వెళ్ళి నుంచున్నాడు. ఆయన చెదిరిన తెల్ల వెంట్రుకల తల ఛాతీలోకి కూరుకుపోయి ఉంది.

“జార్జ్!” అతని తండ్రి సన్నని గొంతుతో కదలకుండా పిలిచాడు.

జార్జి వెంటనే తండ్రి పక్కన మోకరిల్లాడు, వడలిన ముసలాయన ముఖంలో కనుపాపలు పెద్దవై కంటి మూలల్లోంచి అతణ్ణి చూస్తున్నాయి.

“నీకు సెయింట్ పీటర్సుబర్గులో ఏ స్నేహితుడూ లేడు. నువ్వు ఎప్పుడూ తుంటరివే, ఇప్పుడు ఆ తుంటరితనం నా మీద చూపించటానికి కూడా వెనుకాడటం లేదు. నీకు అక్కడో స్నేహితుడు ఉండటం ఎలా సాధ్యం. నేను నమ్మను.”
“కాస్త గతం గుర్తు తెచ్చుకో నాన్నా,” అన్నాడు జార్జి, అంటూ తండ్రిని కుర్చీ లోంచి పైకి లేపి, ఆయన నీరసంగా నిలబడి ఉండగా, వంటి మీది డ్రెస్సింగ్ గౌనుని తొలగించటం మొదలుపెట్టాడు, “ఆ స్నేహితుడు మన దగ్గరకు చివరిసారి వచ్చి మూడేళ్ళవుతోంది. నువ్వు మొదట్లో అతణ్ణి అంతగా ఇష్టపడేవాడివి కాదు. అందుకే, ఓ రెండు సందర్భాల్లో, అతను నా గదిలోనే ఉన్నా, నీకా సంగతి తెలియనివ్వలేదు. నీ అయిష్టతను అర్థం చేసుకోగలిగాను, అతని ధోరణి కాస్త చిత్రమైనదే. కానీ రాన్రానూ నీకు అతనితో మంచి చనువు ఏర్పడింది. అతని మాటలు నువ్వు వింటూ, తలూపుతూ, ప్రశ్నలడుగుతూంటే నాకు గర్వంగా కూడా అనిపించేది. కాస్త ప్రయత్నించి చూడు, నీకే గుర్తొస్తుంది. అతను రష్యన్ విప్లవం గురించి వింత వింత కథలు చెప్తూండేవాడు. గుర్తుందా, ఒకసారి అతను కియెవ్ పట్టణానికి ఏదో వ్యాపారపు పని మీద వెళ్తే, అక్కడ ఒక ఆందోళనకారుల గుంపు ఎదురైందట, కింద దొమ్మీ జరుగుతోంటే, పైన బాల్కనీలో ఒక పూజారి తన అరచేతి మీద రక్తంతో పెద్ద శిలువ కోసుకుని, దాన్ని కింద గుంపుకేసి చూపిస్తూ ప్రాధేయపడుతూ కనిపించాడట. ఈ కథని తర్వాత నువ్వే ఒకట్రెండుసార్లు ఇంకెవరికో చెప్పావు కూడా.”

ఈలోగా జార్జి నెమ్మదిగా తండ్రిని మళ్ళీ కుర్చీలో కూర్చో పెట్టాడు, ఆయన మేజోళ్ళనీ, అండర్వేర్ పైన వేసుకున్న పొడవాటి ఊలు నిక్కర్నీ తొలగించాడు. మురికి పట్టిన లోదుస్తుల్ని చూసి, తండ్రిని అంతగా నిర్లక్ష్యం చేస్తున్నందుకు తన్ను తానే నిందించుకున్నాడు. ఆయన శుభ్రమైన బట్టలు తొడుక్కునేలా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత కొడుగ్గా తనదే. ఇప్పటిదాకా తండ్రి భవిష్యత్తేమిటన్నది తన కాబోయే భార్యతో చర్చించలేదు, ఆయన పాత ఇంట్లోనే ఉండిపోతాడని ఇద్దరూ అప్రకటితంగానే ఓ అంగీకారానికి వచ్చేశారు. కానీ ఇప్పుడు తండ్రిని కూడా తమతో పాటూ కొత్త ఇంట్లోకి తీసుకు వెళ్ళాలన్న గట్టి నిర్ణయానికి వచ్చాడు జార్జి.

తండ్రిని రెండు చేతుల మీదా ఎత్తుకుని మంచం వైపు నడిచాడు. ఇలా నడుస్తోంటే తండ్రి తన ఛాతీని గట్టిగా హత్తుకుని తన గడియారపు గొలుసుతో ఆడుకోవటం చూసి జార్జికి భయం కలిగింది. ఆయన ఆ గొలుసును ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే, దాన్ని విడిపించి, ఆయన్ని మంచం మీద పడుకోబెట్టడం కష్టమైంది.

కానీ మంచం మీద పడుకోగానే కుదురుగా మారిపోయాడు. దుప్పటి కప్పుకుని దాన్ని భుజాల పై దాకా లాక్కున్నాడు. జార్జి వైపు సామరస్యంగానే చూశాడు.

“నీకు అతనెవరో గుర్తొస్తోంది కదూ?” అన్నాడు జార్జి, ప్రోత్సాహకంగా తల పంకిస్తూ.

“దుప్పటి పూర్తిగా కప్పి ఉందా?” తన కాళ్ళ వైపు చూసుకోలేనట్టు అడిగాడు తండ్రి.

“అప్పుడే మంచం మీద కుదురుకుపోయావన్న మాట,” అంటూ జార్జి దుప్పటిని ఆయనకు మరింత దగ్గరగా సర్దాడు.

“దుప్పటి పూర్తిగా కప్పి ఉందా?” మళ్ళీ అడిగాడు తండ్రి, ఆ సమాధానం తనకు చాలా అవసరమన్నట్టు ఉంది ఆయన ధోరణి.

“పడుకో ప్రశాంతంగా, పూర్తిగా కప్పే ఉంది.”

అతని జవాబును మధ్యలోనే తుంచేస్తూ, “లేదు!” అని అరిచాడు తండ్రి, ఆయన విసిరిన జోరుకి దుప్పటి ఓ క్షణం పాటు గాల్లో పూర్తిగా తెరుచుకుని ఉండిపోయింది, దిగ్గున లేచి మంచం మీద నుంచున్నాడు. “నా మీద గుడ్డ కప్పేద్దామనుకున్నావు కదా, నాకు తెలుసురా, కుర్రకుంకా, కానీ నేనంత తొందరగా కప్పడిపోవటానికి సిద్ధంగా లేను. నాకు మిగిలిన సత్తువ ఇసుమంతే ఐనా, అదే చాలురా నీకు, అదే చాలా ఎక్కువ. అవును, నీ స్నేహితుడు నాకు తెలుసు. అసలు వాడే నాకు సరైన కొడుకై ఉండేవాడేమో. అందుకే కదా వాణ్ణి మోసపుచ్చుతూ వచ్చావ్ ఇన్నేళ్ళూ? వాడి కోసం నేను కంటతడి పెట్టని రోజుందనుకుంటున్నావా? అందుకే కదూ, ఆఫీసులో నీ గది తలుపులన్నీ బిడాయించేసుకునేది – అయ్యగారు పనిలో బిజీగా ఉన్నారు, ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు – అక్కడ కూర్చునే కదూ నువ్వు రష్యాకి నీ అబద్ధపు ఉత్తరాలు రాసేది. కానీ కొడుకు గుట్టు పసిగట్టడం తండ్రికెవరూ నేర్పనక్కర్లేదురోయ్. చివరికి పాపం వాణ్ణి కిందకు తొక్కేశాకా, అట్టడుక్కి కాలరాసేశాకా, వాణ్ణిక కదలనివ్వకుండా వాడి మీద నీ ముడ్డి పెట్టి కూర్చునేంతగా అణిచేశాకా, అదిగో అప్పుడు పెళ్ళికి తయారయ్యాడండీ నా సుపుత్రుడు.”

జార్జి భూతంలా నిల్చొన్న తండ్రి వైపు చూశాడు. ఉన్నట్టుండి తన తండ్రికి చాలా ఆత్మీయుడైపోయిన సెయింట్ పీటర్సుబర్గు స్నేహితుడు, ఇప్పుడు అతని ఊహలో ఇదివరకెన్నడూ లేనంత స్పష్టంగా కనపడుతున్నాడు. అంతూపొంతూ లేని రష్యాలో దారీతెన్నూ లేని అతణ్ణి చూడగలుగుతున్నాడు. కొల్లగొట్టబడి ఖాళీగా ఉన్న గోదాం తలుపు దగ్గర అతణ్ణి చూడగలుగుతున్నాడు. శిథిలమైన షోకేసుల మధ్యన, నాశనమైన సరుకు మధ్యన, కూలిపోతున్న చూరు పెచ్చుల మధ్యన, అతను అతి కష్టం మీద లేచి నిలబడుతున్నాడు.

“ముందు నే చెప్పేది వినరా!” అతని తండ్రి అరిచాడు, పరాకులో ఉన్న జార్జి వెంటనే తండ్రి చెప్పేదంతా వినటానికి మంచం వైపు పరిగెత్తాడు, కానీ మధ్యలోనే ఆగిపోయాడు.

“అదేమో స్కర్టు పైకెత్తింది,” తండ్రి వికటంగా నవ్వుతూ అన్నాడు, “ఇదిగో ఇలా స్కర్టు పైకెత్తింది, తప్పుడు ముండ,” అంటూ ఎలాగో చూపించటానికి తన చొక్కాను బాగా పైకెత్తాడు, ఆయన తొడల మీద యుద్ధం తాలూకు గాయం కూడా కనిపిస్తోంది, “కాసేపిలాగా, కాసేపలాగా స్కర్టు పైకెత్తి ఆడిందే ఆలస్యం, దాని కాళ్ళ మీద పడి దాసోహం అన్నావు, దాన్తో కులకటానికి ఏ అడ్డం రాకూడదని, నీ తల్లి జ్ఞాపకాన్ని అవమానించావు, నీ స్నేహితుణ్ణి మోసం చేశావు, నీ తండ్రిని కదలకుండా మంచం మీదకు తోసేద్దామనుకున్నావు. మరి వాడు కదలగలడో లేడో చూపించమంటావా?” అంటూ ఆయన ఏ దన్నూ లేకుండా నిటారుగా నిలబడ్డాడు, కాళ్ళు గాల్లో ఆడించాడు. ఈ ఎరుక ఆయన్ని వెలిగిపోయేలా చేసింది.

తండ్రి నుంచి వీలైనంత దూరంగా గది మూలకి వచ్చేశాడు జార్జి. చాలా కాలం క్రితమే అతనో నిర్ణయం తీసుకున్నాడు: ప్రతీ చిన్న కదలికనీ అప్రమత్తంగా గమనిస్తూ ఉండాలనీ, అదాటుగా పైనుంచో వెనుకనుంచో వచ్చి పడే ఏ పరోక్ష దాడినైనా సరే బిత్తరపోకుండా కాచుకోవాలనీ అనుకున్నాడు. కానీ ఎప్పుడో మర్చిపోయిన ఈ నిర్ణయాన్ని ఇప్పుడు గుర్తు తెచ్చుకున్న మరుక్షణమే – సూది బెజ్జంలోంచి పొట్టి దారాన్ని లాగుతున్నవాడిలా – మళ్ళీ మర్చిపోయాడు.

“కానీ నీ స్నేహితుడు మోసపోలేదురోయ్!” చూపుడు వేలిని ఆడిస్తూ బిగ్గరగా అన్నాడు అతని తండ్రి, “వాడికి ప్రతినిధిగా నేనొకణ్ణి ఇక్కడ పని చేస్తూనే ఉన్నాను.”

“పగటివేషగాడు నయం!” టపీమని అన్నాడు జార్జి, కానీ మరుక్షణం తన పొరబాటు గ్రహించాడు, జరగాల్సిన నష్టం జరిగిపోయాకా, ముఖంలోంచి జారిపోతాయనిపించేంతగా కళ్ళు పెద్దవి చేసి, నాలికని ఎంత గట్టిగా కరుచుకున్నాడంటే, ఆ బాధకి వళ్ళంతా వణికిపోయింది.

“అవున్రా నేను పగటివేషమే వేస్తున్నాను! పగటివేషం! ఎంత మంచి మాటన్నావురా! భార్యలేని ఈ ముసలివాడికి అంతకన్నా మిగిలిందేముంది? చెప్పరా – కానీ ఆ చెప్పే జవాబేదో, ఇప్పటికీ బతికున్నాడనే నేననుకుంటున్న నా కొడుగ్గా చెప్పు – ఏం మిగిలిందిరా నాకు, నా మూల గదిలో, నమ్మకద్రోహులైన సిబ్బందితో యాతనపడుతూ, ఎముకల్లోని మజ్జ దాకా ముసలితనం నిండిపోయిన వాడికి ఇంకేం మిగిలిందిరా? నేను అరటిపండు వలిచిపెట్టినట్టు బిజినెస్ డీల్సన్నీ సిద్ధంగా చేసి పెడితే, నా కొడుకేమో వాటిని పూర్తి చేస్తూ, లోకం ముందు కాలరెగరేసుకుని తిరుగుతుంటాడు, మర్యాదగల వ్యాపారస్తుడి మల్లే గంభీరమైన ముఖం పెట్టి తండ్రి నుంచి దూరంగా వెళిపోతుంటాడు! ఒరే, నేను నిన్ను, నా నుంచి ఊడిపడ్డవాణ్ణి, ఎప్పుడూ ప్రేమించలేదనుకుంటున్నావా?”

“ఇప్పుడీయన ముందుకి వంగుతాడు,” జార్జి అనుకున్నాడు, “తూలిపడి కాళ్ళూ చేతులూ విరగ్గొట్టుకుంటే ఎలా ఉంటుంది.” ఈ మాటలు అతని మనసు గూండా బుసలు కొడుతూ పాక్కుపోయాయి.

అతని తండ్రి ముందు వంగాడు, కానీ తూలిపడలేదు. ఆయన ఆశించినట్టు జార్జి దగ్గరకు రాకపోవటంతో, మళ్లా నిటారుగా నిలబడ్డాడు.

“సరే అక్కడే ఉండు, నాకు నీ అవసరం లేదు! నీకు ఇక్కడకు రాగల శక్తి ఉందనీ, అయినా కూడా నీ ఇష్ట ప్రకారం వెనక్కు ఆగుతున్నావనీ అనుకుంటున్నావు కదూ. అలాంటి భ్రమలేం పెట్టుకోకు! నేను ఇప్పటికీ నీ కన్నా శక్తివంతుణ్ణే. ఒంటరివాణ్ణయితే ఏమన్నా తల వంచేవాణ్ణేమో, కానీ నీ తల్లి నాకు బోలెడంత శక్తిని ఇచ్చి వెళిపోయింది, నీ స్నేహితునితో నాకు బలమైన అనుబంధం ఉంది, నీ కస్టమర్లందరూ నా జేబులో ఉన్నారు!”

“ఈయనగారి నైట్‌షర్టుకి కూడా జేబులున్నాయి కాబోలు!” జార్జి తనలో తాను అనుకున్నాడు, ఈ మాటతో ఆయన్ని ప్రపంచం దృష్టిలో పరిహాసాస్పదుణ్ణి చేయగలిగాననే నమ్మకం కలిగింది. కానీ ఈ ఆలోచన ఒక క్షణం మాత్రమే ఉంది, అతనూ ప్రతీదీ వెంటనే మర్చిపోతున్నాడు.

“అసలు నీ పెళ్ళాన్ని వెంటబెట్టుకుని నా దారికడ్డంగా వచ్చి చూడు! దాన్ని నీ పక్క నుంచి ఇట్టే ఎలా లాక్కుంటానో చూసి నువ్వే బిత్తరపోతావ్!”

జార్జి నమ్మలేనట్టు ముఖం పెట్టాడు. తండ్రి తన మాటల్లో నిజాన్ని ఖారారు చేస్తున్నట్టు జార్జి ఉన్న మూలకి తలాడించి ఊరుకున్నాడు.

“ఏం నవ్వు తెప్పించావురా ఇవాళ నాకు. నీ స్నేహితుడికి నీ ఎంగేజ్మెంటు గురించి చెప్పాలా వద్దా అని నన్నడగటానికి వచ్చావా. ఒరే వెర్రి బాగులోడా, ఆ సంగతి వాడికి ఎప్పుడో తెలుసు, అంతా తెలుసు! నువ్వు నా పెన్నూ పేపర్లు నా నుంచి లాక్కోవటం మర్చిపోయావు, నేను వాడికి ఉత్తరాలు రాస్తూనే ఉన్నాను. అందుకే ఏళ్ళు గడుస్తున్నా వాడిక్కడికి రావటం లేదు, వాడికి అన్నీ నీ కన్నా బాగా తెలుసు, వందరెట్లు బాగా తెలుసు; వాడు కుడి చేత్తో నా ఉత్తరం పట్టుకుని చదువుతూనే, పుర్ర చేత్తో నీ ఉత్తరాల్ని కనీసం చదవను కూడా చదవకుండా నలిపేస్తాడు!”

ఆయన ఉత్సాహంగా గాల్లో చేతులు ఆడిస్తూ, “వాడికి అన్నీ వెయ్యి రెట్లు బాగా తెలుసు!” అని అరిచాడు.

“పది వేల రెట్లు!” తండ్రిని వెక్కిరించటానికి అన్నాడు జార్జి, కానీ ఆ మాటలు అతని నోటి నుండి బయటకి రాగానే అనుకోని గంభీరత సంతరించుకున్నాయి.

“ఈ ప్రశ్నతో ఎప్పుడు నా దగ్గరకు వస్తావా అని నేను ఎన్నో ఏళ్ళ తరబడి ఎదురుచూస్తున్నాను! నాకు అది తప్ప వేరే ధ్యాస ఏదన్నా ఉందనుకున్నావా? నేను నిజంగానే రోజూ న్యూస్ పేపర్లు చదువుతాననుకున్నావా? చూడు!” అంటూ ఆయన ఎలాగో ఇక్కడి దాకా తీసుకొచ్చిన తన న్యూస్ పేపర్ని జార్జి మీదకు విసిరాడు. అది ఒక పాత న్యూస్ పేపరు, దాని పేరు కూడా జార్జికి తెలీదు.

“ఎంత కాలం పట్టిందిరా నాయనా నీకు ఎదగటానికి! చివరకు ఆ మంచి రోజు రాకుండానే నీ తల్లి చనిపోయింది. నీ స్నేహితుడు రష్యాలో శిథిలమవుతున్నాడు, మూడేళ్ళ క్రితమే అతని వళ్ళంతా పసుపుగా పాలిపోయి బయట తుక్కులో పారేయటానికి తగ్గట్టు ఉన్నాడు, ఇక నా విషయానికొస్తే, నా పరిస్థితి ఎలా ఉందో నువ్వే చూస్తున్నావు, ఆ మాత్రం చూట్టానికి దేవుడు నీకు కళ్ళిచ్చాడనే అనుకుంటున్నాను!”

“అంటే నువ్వు నా మీదకు ఎప్పుడు ఎగబడదామా అని కాచుక్కూర్చున్నావన్నమాట!” అరిచాడు జార్జి.

అతని తండ్రి సానుభూతిగా, యథాలాపంగా, “నువ్వు ఆ మాట ఇంకాస్త ముందు అంటే అర్థం ఉండేదేమో. ఇప్పుడిక లాభం లేదు!” అన్నాడు. తర్వాత ఉన్నట్టుండి బిగ్గరగా: “ప్రపంచంలో నువ్వే గాక ఇంకా ఏమేం ఉన్నాయో ఇప్పుడు నీకు తెలిసి ఉంటుంది, ఇదివరకూ నీకు నీ గురించి తప్ప ఇంకేం తెలియదు! అవును, నువ్వు అమాయకపు పిల్లాడివే, నిజమే, కానీ అంతకుమించిన నిజమేంటంటే, నువ్వో దుర్మార్గపు మనిషివి! – అందుకే, నువ్వు తక్షణం మునిగి చావాలని శిక్ష విధిస్తున్నాను!”

జార్జికి తననెవరో గదిలోంచి బలవంతంగా బయటకు నెడుతున్నట్టు అనిపించింది, వెనకాల తండ్రి మంచం మీద కూలబడిన చప్పుడు పరిగెడుతోన్న అతని చెవుల్లో ఇంకా మార్మోగుతూనే ఉంది, జారుడుబల్ల జారుతున్నట్టు మెట్ల మీంచి వేగంగా కిందికి వస్తూంటే, పొద్దున్నే ఇల్లు తుడవటానికి వస్తున్న పనమ్మాయి ఎదురైంది. ఆమె “బాబోయ్!” అని కేక పెట్టి ఏప్రానులో ముఖం దాచుకుంది, కానీ అప్పటికే ఆమెను దాటి వెళ్ళిపోయాడు. బయటి తలుపు లోంచి దూసుకుపోయి, రోడ్డు దాటి, నది వైపు పరిగెత్తాడు. అన్నార్తుడు ముద్ద వైపు చేయి చాచినట్టు రెయిలింగ్‌ని పట్టుకున్నాడు. తల్లిదండ్రులు ఎంతగానో మురిసిపోయిన తన యవ్వన దినాల జిమ్నాస్టిక్ కౌశలాన్ని ప్రదర్శిస్తూ ఒక్క ఉదుటున దాని మీంచి దూకాడు. చేతి పట్టు వదులవుతుండగానే, రెయిలింగ్స్ సందుల్లోంచి చూశాడు, అటుగా వస్తోన్న బస్సు తాను నీళ్ళలో పడిన శబ్దాన్ని కప్పేస్తుంది; మెల్లనైన గొంతుతో, “అమ్మా నాన్నా, అయినా సరే, మీరంటే నాకెప్పుడూ ప్రేమే,” అంటూ పట్టు వదిలేశాడు.

అదే క్షణంలో ఎడతెగని ట్రాఫిక్ ప్రవాహం వంతెన దాటుతోంది.

*