టాల్స్టాయ్ 'వార్ అండ్ పీస్' నవలని చదవాలని అనుకునేవాళ్లు ఇంగ్లీషు రాక, రష్యన్ ఎలాగూ రాక, ఇక గత్యంతరం లేకపోతేనే తెలుగు అనువాదాన్ని చదవండి. అప్పుడు కూడా మీరు టాల్‌స్టాయ్‌ని పూర్తిగా చదవటం లేదన్నది దృష్టిలో పెట్టుకుని చదవండి. ఏ ఇంగ్లీషు అనువాదాలు మంచివో తర్వాత చెబుతాను. నా ఫ్రెండ్స్ తెలుగులోనే చదివారని నేనూ అదే చదవబోయి, మూడు అధ్యాయాల లోపలే ఎందుకు విరమించుకున్నానో అది ముందు చెబుతాను.
నేను చదివిన మొదటి మూడు చిన్న అధ్యాయాల్ని బట్టి బెల్లంకొండ రామదాసు, రెంటాల గోపాలకృష్ణల అనువాదం అస్సలు బాగాలేదు. ఇక ముందు బాగుంటుందనే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా ఇవ్వలేకపోతున్నాను. అనువాదకులు కొన్ని చోట్ల చాలా వదిలేశారు, కొన్ని చోట్ల ఒకే వాక్యంగా ఉన్నదాన్ని విడగొట్టి పాడు చేశారు, కొన్ని చోట్ల అసలు అర్థం చేసుకోవటమే తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ తెలుగు అనువాదాన్ని నేను Louise Maude అనువాదం తోనీ, Ann Dunnigan అనువాదం తోనీ పోల్చిచూసాను. తెలుగు అనువాదకులు పుస్తకానికి రాసిన ముందు మాటలో ఆంగ్లం నుంచి అనువదించామని చెప్పుకున్నారు. Louise and Aylmer Maudeల అనువాదం స్వయంగా టాల్‌స్టాయ్ ఆమోదించింది కాబట్టి ఈ అనువాదకులు దాన్నే వాడి ఉంటారని అనుకుంటున్నాను. గూగుల్ లేని కాలంనాటి కష్టాల్ని ఊహించుకోగలను. అయినా కొన్నిటిని ఒప్పుకోలేకపోయాను. అనువాద లోపాలకు కొన్ని ఉదాహరణలు కింద ఇస్తున్నాను:
అసలు తెలుగు అనువాదంలో మొదటి పేరాయే- "సరే రాకుమారా! ఇప్పుడు నే నేమిటి చెప్పాను? జెనోయా, బాకా బోనపార్టీ హస్తగమైనాయి. అందుచేత నిన్ను జాగ్రత్త పడవలసిందని హెచ్చరిస్తున్నాను" ఇలా మూడు వాక్యాల్లో తేల్చేశారు. కానీ ఇంగ్లీషులో ఏకంగా ఇంత ఉంది:
Maude translation: ‘Well, Prince, so Genoa and Lucca are now just family estates of the Buonapartes. But I warn you, if you don’t tell me that this means war, if you still try to defend the infamies and horrors perpetrated by that Antichrist—I really believe he is the Antichrist—I will have nothing more to do with you, and you are not my faithful slave, as you call yourself. Well, how do you do? How do you do? I see that I have frightened you.—sit down and tell me all the news.’అలాగే సన్నివేశ చిత్రణలో టాల్‌స్టాయ్ పాత్రల్లో వ్యక్తావ్యక్తంగా పొడచూపే కొన్ని స్వభావగతుల్ని వాటి అన్ని ఛాయల్లోనీ పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అలాంటి వాక్యాలు ఈ అనువాదంలో బండబారాయి, లేదంటే అర్థాన్ని పోగొట్టుకున్నాయి. అన్నా పావ్‌లోవ్‌నా మొదట్లో 'ఈ పార్టీలు అంటే విసుగు పుడుతుంది' అంటే దానికి బేసిల్ రాకుమారుడు స్పందన తెలుగులో ఇలా ఉంది:
బెల్లంకొండ - రెంటాల తెలుగు అనువాదం: "నీ విలా అంటావని తెలిసినట్టయితే నిజంగా ఆపుచేసి ఉండేవాళ్ళే" అని రాకుమారుడన్నాడు. ఏ మాత్రం తొణక్కుండా చెక్కుచెదరని గడియారం మాదిరి ఈ మాటలు రాకుమారుడు అనేశాడు.
Dunnigan translation: "Had they known that you wished it, the fete would have been postponed," said the prince, like a wound-up clock, saying by force of habit things he did not even expect to be believed.
Maude translation: ‘If they had known that you wished it, the entertainment would have been put off,’ said the prince, who, like a wound-up clock, by force of habit said things he did not even wish to be believed.--దీన్ని తెలుగులో సరిగా అనువదిస్తే ఇలా ఉండాలి- "నీవిలా అంటావని తెలిస్తే, వాళ్లు ఆ పార్టీ వాయిదా వేసుకుని ఉండేవాళ్ళే," అన్నాడు రాకుమారుడు, ఒక కీ ఇచ్చిన గడియారంలా, అలవాటు ప్రోద్బలంతో తనే నమ్మని విషయాల్ని మాట్లాడుతూ.
అసలు ఈ బేసిల్ రాకుమారుడు అన్నా పావ్‌లోవ్‌నా ఇంటికి వచ్చినప్పటి నుంచీ, కొంత ఆమె ధోరణికి అనుగుణంగా మాట్లాడుతూనే కొంత అంటీముట్టనట్టు వ్యంగ్య ధోరణిలో మాట్లాడుతూ ఉంటాడు. ఆ ధోరణిని చూపించే చాలా అంశాల్ని సరిగా అనువదించలేదు.
పోనీ ఇవన్నీభరించినా, కొన్ని చోట్ల అసలు అనువాదమే తప్పుగా ఉంది. అన్నాపావ్‌లోవ్‌నా ఇచ్చే విందులో ఇద్దరు ప్రముఖులు వస్తారు. వాళ్ళని అన్నా పావ్‌లోవ్‌నా తన ఇతర అతిథులకు ఎలా పరిచయం చేస్తోందో చెప్పటానికి టాల్‌స్టాయ్ ఒక మెటఫోర్ వాడతాడు. నూనె డాగులున్న వంటగదిలో చూస్తే ఎవరికీ తినాలనిపించని మాంసాన్ని తెలివైన హెడ్‌వైటర్ ఎలా ప్రత్యేకమైన వంట అని రుచిగా వడ్డిస్తాడో అలా అన్నా పావ్‌లోవ్‌నా వాళ్ళిద్దర్నీ పార్టీకి వచ్చిన మిగతా అతిథులకి రుచికరమైన మాంసం ముక్కల్లాగా వడ్డిస్తోంది అంటాడు. ఈ తెలుగు అనువాదంలో మాత్రం ఆమె ఏవో రుచికరమైన పదార్థాల్ని వారిద్దరికే వడ్డిస్తోంది అని అర్థం వచ్చేట్టు ఉంది:
Maude translation: Anna Pavlovna was obviously serving him up as a treat to her guests. As a clever maître d’hôtel serves up as a specially choice delicacy a piece of meat that no one who had seen it in the greasy kitchen would have cared to eat, so Anna Pavlovna served up to her guests, first the vicomte and then the abbé, as peculiarly choice morsels.
బెల్లంకొండ - రెంటాల తెలుగు అనువాదం: అన్నా పావ్‌లోవ్‌నా ఇది అవకాశంగా తీసుకుని ఒక హోటలు యజమానురాలిగా ప్రతి పదార్థాన్ని ఎంతో ఏరికోరి తాను స్వయంగా వడ్డించినట్టు చెపుతూ మొట్టమొదట విస్‌కౌంట్ మార్టీ మార్ట్‌కు, తరువాద అబీకి, రెండు చవులూరే ముద్దలు వడ్డించింది.--ఇక్కడ తెలుగు అనువాదంలో టాల్‌స్టాయ్ పొయెటిక్‌గా వాడిన మెటఫోర్ కాస్తా, ఒక వాస్తవ సన్నివేశంగా మారిపోయింది. అన్నా పావ్‌లోవ్‌నా కాస్తా ఒక హోటల్ యజమానురాలిగా మారిపోయింది. అలాగే ఇదే పేరాకి ముందు పేరాలోనూ ఒక తప్పు ఉంది:
బెల్లంకొండ - రెంటాల తెలుగు అనువాదం: "అన్నాపావ్‌లోవ్‌నా గృహంలో సాయంత్రపు సమావేశం ఒక స్థాయి అందుకున్నది. ఒక్క మెటాంటే మాత్రం ఒక మూల అశ్రు కలుషితమైన ముఖం గల వృద్ధ స్త్రీతో కలిసి వివిక్తంగా కూచుని ఉన్నాడు."--తెలుగులో చదివేవాళ్ళకి ఇంతకుముందు రాని ఈ మగ "మెటాంటే" పాత్ర ఎవడురా అని అనుమానం వస్తుంది. ఫ్రెంచ్ భాషలో "మె టాంటే" అంటే "నా ఆంటీ" అని అర్థం. అంతకుముందు అన్నాపావ్‌లోవ్‌నా తన ఇంట్లో పార్టీకి వచ్చిన ప్రతి వాళ్ళనీ ఒక ముసలావిడ దగ్గరికి తీసుకువెళ్ళి "నా ఆంటీ" (ఫ్రెంచ్‌లో "మె టాంటే") అని పరిచయం చేస్తుంది. టాల్‌స్టాయ్ తర్వాత కూడా ఆమెని ఉద్దేశించి ఈ 'మె టాంటే' అన్న పదమే వాడతాడు. ఆమె పక్కన ఒక దిగాలు ముఖంతో ఒక స్త్రీ కూర్చూంటాన్ని టాల్‌స్టాయ్ ఇలా చెప్తాడు:
Maude translation: Anna Pavlovna’s reception was in full swing. The spindles hummed steadily and ceaselessly on all sides. With the exception of 'ma tante', beside whom sat only one elderly lady, who with her thin tear-worn face was rather out of place in this brilliant society, the whole company had settled into three groups.--దీని తెలుగు అనువాదంలో ఇద్దరు ఆడ మనుషులు కలిసిపోయి ఒకేవొక్క మగ మనిషి మిగిలాడు. అంతే కాదు, పైన ఇంగ్లీషు అనువాదంలో ఉన్న "The spindles hummed steadily and ceaselessly on all sides" అన్న వాక్యం అసలు తెలుగులోకి అనువాదమే కాలేదు. అనువాదయ్యుంటే- "అన్ని వైపులా దారపు కండెలు నింపాదిగా నిరంతరాయంగా తిరుగుతూనే ఉన్నాయి" అని ఉండాలి. బహుశా ఇక్కడ దారపు కండెలు అన్నది టాల్‌స్టాయ్ దేన్ని ఉద్దేశించి వాడాడో అనువాదకులకి అర్థం కాలేదనుకుంటా. అంతకుముందు అధ్యాయంలో తెలుగు అనువాదకులు అనువదించకుండా వదిలేసిన ఒక పోలిక ఇలా సాగుతుంది (నా అనువాదం): "ఒక స్పిన్నింగ్ మిల్లు యజమాని యంత్రాల్ని ఆన్ చేసి తర్వాత కార్ఖానా అంతా కలియదిరుగుతూ ఎక్కడైనా ఒక దారపుకండె సరిగా తిరగకపోతే దాన్ని సరి చేస్తూ, లేదా ఎక్కడైనా యంత్రం అనవసర శబ్దాలు చేస్తూంటే దాన్ని చక్కదిద్దుతూ ఎలా సాగుతాడో అలాగే అన్నాపావ్‌లోవ్‌నా కూడా ఏదైనా గుంపులో సంభాషణ మందగిస్తే దాన్ని ముందుకు నెడుతూ, ఎక్కడైనా మాటలు మరీ పెచ్చుమీరి గొడవయ్యేట్టుంటే నెమ్మదింపచేస్తూ పార్టీ అంతా కలయదిరుగుతోంది". అనువాదకులు దీన్ని అనువదించలేదు కాబట్టి ఇక్కడ తర్వాతి అధ్యాయంలోని పై వాక్యమూ వదిలేశారు. నిజానికి దారపు కండెలు తిరుగుతూ దారం విప్పుకోవటం అనేది ఈ సందర్భంలో చాలామంచి పోలిక.
ఇదే పార్టీలో బోల్‍కోన్‌స్కీ రాకుమారి పెదవుల వర్ణన ఉంటుంది. అది చదివితే కచ్చితంగా ఆమె ప్రత్యేకమైన అందం పాఠకుడి మనసులో పటం కడుతుంది. ఆ వర్ణన ఇది (మొత్తం పేరా ఇస్తున్నాను):
Dunnigan translation: The young Princess Bolkonskaya had brought her needlework in a gold-embroidered velvet bag. Her pretty little upper lip, shadowed with a barely perceptible down, was too short for her teeth and, charming as it was when lifted, it was even more charming when drawn down to meet her lower lip. As always with extremely attractive women, her defect—the shortness of her upper lip and her half-open mouth—seemed to be her own distinctive kind of beauty. Everyone took delight in watching this pretty little woman, brimming with health and vitality, who, soon to become a mother, bore her burden so lightly. After being in her company and talking to her for a while, old men and somber apathetic young men felt themselves becoming, like her, more animated. Talking to her, and seeing at every word her bright smile and flashing white teeth, made a man feel that he was in particularly amiable humor that evening. And this was true of everyone.
బెల్లంకొండ - రెంటాల తెలుగు అనువాదం: బోల్‌కోన్‌స్కీ రాకుమారి బంగారు జలతారుతో కుట్టిన తన చేతి సంచిలో కొన్ని అల్లిక వస్తువులు తీసుకొని వచ్చింది. ఆమె పై పెదవి చిన్నది. ఎంతో ముచ్చటగా ఉంది. ఆ చిన్నారి పెదవి క్రిందికి దిగి క్రింది పెదవితో కల్పిన సూచన ఎంతమాత్రం కనిపించడం లేదు. కాని ఈ స్వల్ప దోషం ఒక దోషంగా లేదు. పైగా అందులో ఒక విచిత్రత ఒక వినూత్నత అగుపిస్తోంది. అరవిచ్చిన ఆమె నోరు ఆమెకు మరింత అందాన్నే చేకూరుస్తోంది. సౌందర్యవతియైన స్త్రీకి ఇది వరంలాంటిది. జీవంతోనూ, ఆరోగ్యంతోనూ నిండి పొంగారుతున్న ఆ గర్భవతిని చూచి అందరూ ఎంతో ముచ్చట పడ్డారు. యువకులు, వృద్ధులు -- అందరినీ ఆమె సౌందర్యం ఆకట్టుకొన్నది. ఆమె ముత్యాల పలువరస కనిపించేది.ఈ పేరాడు తెలుగు అనువాదంలో టాల్‌స్టాయ్‌కి చాలా అన్యాయం జరిగింది (ఆ రాకుమారి అందానికి జరిగిన అన్యాయం చెప్పనే అక్కర్లేదు). ఆమె పై పెదవి మీద సన్నని నూగు తెలుగులోకి రాలేదు. ఆమె పెదవులు రెండూ పళ్ళ మీద మూసుకోలేకపోవటం గురించి టాల్‌స్టాయ్ వర్ణన చదివితే నాకైతే Kalki Koechlin లాంటి ఒక ముఖం కొంత మోడిఫికేషన్లతో మనోఫలకం మీదకు వచ్చింది. తెలుగు అనువాదంలో వట్టి పదాలు చదివాను తప్పించి ఒక ముఖం ఊహల్లో రూపుకట్టలేదు. తెలుగు అనువాదంలో "సౌందర్యవతియైన స్త్రీకి ఇది వరం లాంటిది" అని ఒక వాక్యం ఉంది. అది ఎందుకు వరమో, ఏ రకంగా వరమో అన్నదాని గురించి టాల్‌స్టాయ్‌కే ప్రత్యేకమైన ఏదో ఒక పరిశీలన ఉంటే తప్ప ఆయన అలాంటి చెత్త మామూలు వాక్యం రాయడు. అలాగే గర్భంలో బరువుని చాలా తేలిగ్గా మోస్తుంది (bore her burden so lightly) అన్న అందమైన అబ్జర్వేషన్ కూడా తెలుగులో మాయం. అలాగే "యువకులు, వృద్ధులు -- అందరినీ ఆమె సౌందర్యం ఆకట్టుకొన్నది" అని అనువాదంలో ఒక్క ముక్కలో తేల్చిపడేసిన చోట మూలంలో చాలా ఉంది. ఏముందో అనువదించే నా ప్రయత్నం ఇది- "ఆమె సమక్షంలో కాసేపు ఉండి ఆమెతో కాసేపు మాట్లాడిన తర్వాత, ముసలివాళ్లూ, మందకొడిగా ఉన్న యువకులూ కూడా, ఆమె లాగ, ఎంతో చురుకుగా మారిపోయారు. ఆమెతో మాట్లాడుతుంటేనూ, ప్రతీ మాటకీ వెలిగిపోయే ఆమె నవ్వునీ, విచ్చుకునే తెల్లని పలువరసనీ చూస్తుంటేనూ, అక్కడున్న ప్రతి మగవాడికీ ఎందుకో ఈ సాయంత్రాన తన మనసు హాయిగా ఉన్నట్టు తోచింది. అందరి విషయంలోనూ ఇదే జరిగింది."
మూడు చిన్న అధ్యాయాలకే ఇన్ని నగుబాట్లయితే (పైన ఇచ్చిన ఉదాహరణలు నేనేమీ పట్టిపట్టి వెతికినవి కాదు, ఊరకే చూస్తూపోతే దొరికినవే) ఇక నేను తెలుగులో చదవటం కొనసాగించే ధైర్యం చేయలేకపోయాను. ఈ రుజువులతోనే చెబుతున్నాను, ఎవరైనా 'వార్ అండ్ పీస్'ని ఈ తెలుగు అనువాదంలో చదివితే వారు అసలు పుస్తకాన్ని యాభై శాతం మాత్రమే—అది కూడా టాల్‌స్టాయ్ శైలిలోని అందాలన్నీ వదిలేసి, మన పాత పాఠ్యపుస్తకాల్లో పాఠం తర్వాత ఇచ్చే సంక్షిప్త సారాంశం లాంటిది మాత్రమే—చదివినట్టు. నేను చెప్పిన రెండు ఇంగ్లీషు అనువాదాల్లో కనీసం ఆ నవలని ఇంగ్లీషులో ఒక మంచి రచయిత రాసినట్టు అనిపించింది. మనుషులు మాట్లాడుకునే భాషకి మరీ దూరంగా, far-fetched పదాలు లేకుండా ఉంది. కానీ ఈ తెలుగు అనువాదంలో కనిపిస్తున్న శైలి ఏ మంచి తెలుగు రచయితా రాయడు. ముఖ్యంగా సులువైన శైలిని నమ్మే, ఒక masculine, dry శైలిలో రాసే టాల్‍స్టాయ్ తెలుగులో రాసి ఉంటే "అభిరతి", "వివిక్తం" లాంటి భాషతో అస్సలు రాయడు.
* * *
ఇక ఇంగ్లీషులో చదవదల్చుకున్న వారికి కొన్ని సలహాలు: 'వార్ అండ్ పీస్' కి ఇంగ్లీషు అనువాదాల్లో పైన నేను చెప్పిన అనువాదాలు రెండూ మంచివని నేను వెతికి తేల్చుకున్నాను.
మొదటిది Louise Maude & Alymer Maude అనువాదం. వీరిద్దరూ భార్యా భర్తలు. ఈ అనువాదానికి ఉన్న ప్లస్సులు ఏమిటంటే, వీరిద్దరినీ తనకు మంచి అనువాదకులని స్వయంగా టాల్‌స్టాయ్ ఆమోదించాడు. వీరి అనువాదాలు చాలా వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. మంచి వెర్షన్ లింక్ ఈ కింద ఇస్తున్నాను:
http://www.amazon.in/dp/0679405739/ref=wl_it_dp_o_pC_nS_ttl?_encoding=UTF8&colid=2LRIGJ31V6XOE&coliid=IJNN1WR0ETMWI
ఈ Everyman's Library వాళ్ల ఎడిషన్ మూడు వాల్యూముల్లో, మంచి బైండింగ్ తో, బుక్ మార్క్ దారంతో వస్తాయి. ఈ పుస్తకం నేను కొనలేదు. కానీ Everyman వాళ్ళవి ఇవే సిరీస్‌లో నేను టాల్‌స్టాయ్ 'ద కంప్లీట్ షార్ట్ స్టోరీస్' రెండు వాల్యూములు కొన్నాను. దాన్ని బట్టి ఇదీ బాగుంటుందనే అనుకుంటున్నాను. పైగా పెద్ద నవల కనుక మూడు వాల్యూముల్లో తేలికపాటి పుస్తకాలుగా చదువుకోవటం బాగుంటుంది. కానీ ఖర్చు ఎక్కువ. అమెజాన్‌లో దాదాపు రూ.2,500 చూపిస్తోంది. అంత కష్టం అనుకుంటే, ఇదే Maudeల అనువాదాన్ని ఆక్స్‌ఫర్డ్ వాళ్ళు వేసారు.
https://www.amazon.in/dp/0199232768/ref=wl_it_dp_o_pC_nS_ttl?_encoding=UTF8&colid=2LRIGJ31V6XOE&coliid=IU9ACKBYPWEQ8
ఈ ఆక్స్‌ఫర్డ్ వాళ్ళది ఓ 800రూపాయల్లో వచ్చేస్తుంది. కానీ టాల్‌స్టాయ్ తన నవలలో చాలా వరకూ ఫ్రెంచ్ భాషని వాడాడు. ఇంత పెద్ద నవలలో 5శాతానికి పైగా ఫ్రెంచే ఉంటుంది. అసలు నవల మొదటి వాక్యమే ఫ్రెంచ్ లో ఉంటుంది. Maudeలు అనువదించేటప్పుడు ఫ్రెంచ్ అంతట్నీ ఇంగ్లీషులోకి తర్జుమా చేశారు. కానీ ఈ ఆక్స్‌ఫర్డ్ ఎడిషన్ వాడు ఆ ఫ్రెంచ్ ని అంతా తిరిగి చేర్చాడు. దానికి ఇంగ్లీషు అనువాదాన్ని ఫుట్‌నోట్స్ లో ఇచ్చాడు. మీకు ఫ్రెంచ్ వస్తే సరే. కానీ పేజీల కొద్దీ ఫ్రెంచ్ ఉండి, దానికి ఇంగ్లీషు అనువాదాన్ని ఫుట్ నోట్స్ లో చదవాలంటే చచ్చేచావు. ఆ బాధపడదల్చుకుంటే తప్ప ఇది కొనవద్దు. నోర్టన్ వాళ్ళు వేసింది కూడా Maude అనువాదమే, కొంత మెరుగుపెట్టారట, చివర్లో మంచి విమర్శనాత్మక వ్యాసాలు కూడా ఉంటాయి. కొనుక్కోగలిగితే ఇదీ మంచిదే:
https://www.amazon.in/War-Peace-Norton-Critical-Editions/dp/039396647X/ref=sr_1_5?s=books&ie=UTF8&qid=1500285018&sr=1-5&keywords=tolstoy+stories
ఇక రెండో మంచి అనువాదం Ann Dunnigan చేసింది. గారీ సాల్ మార్సన్ దీన్ని మంచి అనువాదం అని చెప్పాడు కాబట్టి, ఈమె అనువాదంలోనే ఇదివరకూ కొన్ని చెహోవ్ కథలు చదివి ఇష్టపడివున్నాను కాబట్టి నేను దీన్నే చదువుతున్నాను. దీన్ని Signet classics వాళ్ళు వేశారు. దీనితో ఇబ్బంది ఏమిటంటే, ఈ పుస్తకం ఎత్తు తక్కువ, లావు ఎక్కువ. దుబ్బలాగా ఉంటుంది. పేపర్ బాక్ కాబట్టి ఒకసారి చదివితే మళ్ళీ రెండోసారి చదవటానికి పనికి రాకుండా పోతుంది.
https://www.amazon.in/Peace-Signet-Classics-John-Hockenberry/dp/0451532112?_encoding=UTF8&psc=1&redirect=true&ref_=od_aui_detailpages00
ఇవన్నీ ఖర్చనుకుంటే, ఒక మంచి సొల్యూషన్ ఏమిటంటే- హైదరాబాదులో సెకండ్ హాండ్ బుక్ షాపుల్లో తిరిగితే దాదాపు ప్రతి షాపుకీ ఎలా లేదన్నా రెండు మూడు 'వార్ అండ్ పీసు' పుస్తకాలు ఉంటాయి. వీటిల్లో మీ అదృష్టం కొద్దీ పైన చెప్పిన అనువాదాలు రెండు మూడు వందల్లో దొరికేయవచ్చు. నాకు Maude అనువాదం అలానే దొరికింది. ఈ రెండూ గాకపోతే, మూడో ఆప్షన్‌గా Constance Garnett అనువాదం కూడా మంచిదే. అది కూడా సెకండ్ హాండ్ స్టోర్స్ లో దొరుకుతుంది.
అసలు ఎందుకు చదవాలీ అంటే మరో రష్యన్ రచయిత చెప్పిన ఈ మాటలు: "ప్రపంచం తన్ను తానే రాసుకోగలిగితే, అది టాల్‌స్టాయ్ లాగా రాస్తుంది".
Published in Pustakam.net:
http://pustakam.net/?p=19760