July 30, 2018

హొర్హె లూయీ బోర్హెస్‌ (1899-1986) పరిచయం: ‘‘స్వర్గం ఒక లైబ్రరీలా ఉంటుందేమో అనుకుంటాను’’

కథలు రాయటానికి బోర్హెస్‌ జీవితానుభవంపై కన్నా, పఠనానుభవాలపై ఎక్కువ ఆధార పడ్డాడు. తత్త్వశాస్త్ర పఠనంలో తనను బాగా ఆకర్షించిన సమస్యలూ మీమాంసల ఆధారంగా ఆడిన ఆటలే ఆ కథలు చాలావరకూ. అలాని అవేం గంభీరంగా సాగవు. ఉదాహరణకి కొన్ని కథల థీమ్స్‌ ఇలా ఉంటాయి: మన జీవితాన్ని ఎవరో కలకంటున్నారని తెలిస్తే? నిజంగా అమరత్వం లభిస్తే? ఈ విశ్వం అవధిలేని షడ్భుజాకార గ్రంథాలయమైతే? దేవుని అసలు ప్రతినిధి క్రీస్తు గాక జుడాస్‌ అయితే? నామవాచకాల్ని నిరాకరించే ప్రపంచం ఎలా ఉంటుంది? అసలు దేన్నీ మరచిపోలేని మనిషి ఎలా ఉంటాడు? ఇలాంటి ఇతివృత్తాల్ని బోర్హెస్‌ క్రైమ్‌ థ్రిల్లర్లలోకీ, డిటెక్టివ్‌ కథల్లోకీ, నకిలీ పుస్తక సమీక్షల్లోకీ ఇమిడ్చి చెబుతాడు.

హొర్హె లూయీ బోర్హెస్‌ ((Jorge Luis Borges) అర్జెంటీనా రాజధాని బ్యునోస్‌ ఐర్స్‌లో పుట్టాడు. తండ్రి లాయరు, సైకాలజీ బోధించేవాడు. ఆయనకు రచయిత కావాలని ఉండేది. కొంత రాసాడు కానీ పేరు తెచ్చుకోలేకపోయాడు. తండ్రి వల్ల కానిది కొడుకు చేస్తాడన్నది ఆ కుటుంబంలో పైకి ఎవరూ అనకపోయినా అందరూ అంగీకరించిన విషయం. బోర్హెస్‌ ఏడేళ్ళ వయసులోనే ఆస్కార్‌ వైల్డ్‌ కథను అనువదించాడు. అంతకన్నా ముందే సాహిత్య పఠనం ప్రారంభించాడు. తండ్రి లైబ్రరీలో అడుగు పెట్టడమే తన జీవితాన్ని మలుపుతిప్పిన గొప్ప సంఘటన అంటాడు బోర్హెస్‌. నానమ్మ ఇంగ్లాండు మనిషి కావటంతో, ఆమె నుంచి తండ్రికీ, తండ్రి నుంచీ బోర్హెస్‌కీ ఇంగ్లీషు సహజంగా వచ్చేసింది. మాతృభాష స్పానిష్‌ పుస్తకాల కన్నా ముందే ఇంగ్లీషు పుస్తకాలను చదివాడు. తర్వాతెపుడో ప్రసిద్ధ స్పానిష్‌ నవల ‘డాన్‌ కిహోటే’ని చదువుతుంటే, అంతకుముందే చదివిన ఇంగ్లీషు వెర్షన్‌కి ఈ మూలం నాసిరకం అనువాదంలాగ తోచిందట.

బోర్హెస్‌ తాతల తరంలో సైన్యంలో కల్నల్స్‌గా పనిచేసి యుద్ధాల్లో చనిపోయినవారున్నారు. తను మాత్రం ఇలా పుస్తకాల పురుగులాగ మారటం పట్ల బోర్హెస్‌కు కించపడేవాడు. ప్రాణాలకు విలువివ్వని వీరోచితమైన మనుషులంటే ఆకర్షణ ఆయనకు జీవితాంతం ఉంది. తనకు ఆ ధైర్యం లేదన్నది యవ్వనంలో ఆయన్ను వేధించేది. బోర్హెస్‌కు 15ఏళ్ళ వయస్సులో తండ్రికి కంటిచూపుకు వైద్యం చేయించ టానికని కుటుంబం జెనీవాకు వెళ్ళింది. ఇక్కడే ఆడవాళ్ళపై బెరుకుపోగొట్టడానికి తండ్రి స్వయంగా బోర్హెస్‌ను వేశ్య దగ్గరకు పంపించాడు. బోర్హెస్‌కు స్త్రీలతో ప్రేమ సంబంధాలు తక్కువే. 68ఏళ్ళ వయస్సులో చేసుకున్న పెళ్ళి మూడేళ్ళే నిలిచింది.

జెనీవాలో చదువుకుంటూ బోర్హెస్‌ లాటిన్‌, జర్మన్‌, ఫ్రెంచ్‌ భాషలను నేర్చుకున్నాడు. 22ఏళ్ళ వయస్సులో తిరిగి బ్యునోస్‌ ఐర్స్‌ చేరుకున్నాడు. బాల్యంలో వదిలి వెళ్ళిన నగరాన్ని యవ్వనంలో తిరిగివచ్చి కొత్త కళ్ళతో చూసాడు. నగరం మీద రాసిన కవితలతో 1923లో తొలి పుస్తకం పబ్లిష్‌ చేసాడు. అది మొదలు మరో పదేళ్ళలో ఏడు పుస్తకాలు పబ్లిష్‌ చేశాడు (నాలుగు వ్యాస సంపుటులు, మూడు కవితా సంపుటులు). మిత్రులతో కలిసి చాలా సాహిత్య పత్రికల్ని నడిపాడు. ఈ కాలంలో రాసిన పుస్తకాలన్నింటినీ బోర్హెస్‌ తర్వాతి కాలంలో తిరస్కరించాడు. ఒక ఫోజులాగా కారణంలేని దిగులును మీద వేసుకుని హామ్లెట్‌నూ రస్కోల్నికోవ్‌నూ ఒక మూసలో పోసినట్టు ఉండే వాడిననీ, అదే తన కవిత్వంలోనూ ప్రతిబింబించేదనీ తర్వాత చెప్పుకున్నాడు.

తనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన కథల్ని ఆయన 35ఏళ్ళు దాటాక గానీ రాయలేదు. కథలు రాయగలడని ఆయనపై ఆయనకే నమ్మకం ఉండేది కాదు. అందుకని తొలి కథల్ని ఎక్కడా లేని మనుషుల ఆత్మకథల్లాగా, లేని పుస్తకాలకు సమీక్షల్లాగా రాసాడు. తనే ఎడిటర్‌గా పనిచేసే ఒక సాహిత్య పత్రికలో ప్రచురించేవాడు. కథలు రాయగలనని నమ్మకం కుదరటానికి ఆయనకు జరిగిన ఒక ప్రమాదం కారణమైంది. బోర్హెస్‌కు తండ్రిలాగే కంటిచూపు మొదట్నించీ సరిగా ఉండేది కాదు.

ఒకసారి మెట్లు దిగివస్తూ జారిపడ్డాడు. ఆ పడటంలో ఏదో గట్టిగా తలకు తగిలి స్పృహ కోల్పోయాడు. రెండు వారాల పాటు బతుకుతాడో లేదో తెలియని అపస్మారక స్థితిలో గడిపాడు. కోలుకున్నాక, తానిక రచన చేసే శక్తిని కోల్పోయాడని అనిపించింది. ఒకసారి ప్రయత్నం చేయాలను కున్నాడు. కానీ అప్పటిదాకా కవిత్వమే ప్రాణంగా బతికి ఇప్పుడు అది రాయలేనని తెలిస్తే భరించ లేననీ, అలవాటులేని ప్రక్రియలో రాస్తే విఫలమైనా అంత బాధ ఉండదనీ ఒక కథ రాసాడు. ఆ కథ ‘పియర్రె మేనార్డ్‌: ఆథర్‌ ఆఫ్‌ కిహోటే’ ఆయనకు బాగా పేరుతెచ్చింది. తర్వాతిక అంతూపొంతూలేని గ్రంథాలయాల్నీ, మన ప్రపంచంలోకి చొరబడే వేరే ప్రపంచాల్నీ, మొత్తం ప్రపంచాన్ని అన్ని స్థలాల్లోనూ అన్ని కాలాల్లోను ఒకేసారి చూపెట్టగలిగే వస్తువుల్నీ, ఎడతెగక సాగే పుస్తకాల్నీ, అనేక విశ్వాల్నీ ఊహిస్తూ కథలు రాయటం ప్రారంభించాడు. ఫిక్కినోస్‌ (1949), ఎల్‌ అలెఫ్‌ (1952) పుస్తకాలు ఇంగ్లీషులోకి అనువాదమై ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

1955లో బోర్హెస్‌ అర్జెంటినా జాతీయ లైబ్రరీకి డైరెక్టర్‌గా ఎంపికయ్యాడు. ‘‘నేను ఎప్పుడూ స్వర్గం ఒక లైబ్రరీలా ఉంటుందేమో అనుకుంటాను’’ అని చెప్పుకున్న బోర్హెస్‌కు ఇది చాలా చక్కగా అమిరే ఉద్యోగం. కానీ అప్పటికే ఆయన్ను అంధత్వపు చీకట్లు పూర్తిగా చుట్టుముట్టాయి. ‘‘దేవుడు నాకు పుస్తకాల్నీ రాత్రినీ ఒకేసారి ఇచ్చాడు’’ అని ఒక కవితలో రాసుకున్నాడు. ఈ అంధత్వం ఫలితంగా బోర్హెస్‌ వచన కవితల్ని పక్కనపెట్టి, ఛందోబద్ధమైన నిర్మాణాన్ని తీసుకున్నాడు. మనసులోనే అల్లగలిగే వీలు, ఆ అల్లికను జ్ఞాపకంలో దాచుకోగలిగే వీలు వచనం కన్నా పద్యానికే ఎక్కువ కాబట్టి, పద్యాలు ఎక్కువగా రాయటం మొదలుపెట్టాడు. అయితే కవిత్వం కన్నా బోర్హెస్‌కు ఆయన కథలే ఎక్కువ పేరు తెచ్చిపెట్టాయి. మనం వాస్తవంగా భావించి నిబ్బరంగా నడిచే మానవానుభవతలంపై మనల్ని బోల్తాకొట్టించే గుంతల్ని తవ్వుతాయి ఆ కథలు.

(ఆంధ్ర జ్యోతి వివిధలో)


July 23, 2018

రాబర్ట్ వాల్సర్ (1878-1956): రోజువారీ కవిత్వం

 ‘‘రాబర్ట్‌ వాల్సర్‌కి ఒక లక్షమంది పాఠకులు గనక ఉన్నట్టయితే ఈ ప్రపంచం ఎంతో బాగుపడేది,’’ అంటాడు ‘సిద్ధార్థ’ నవలా రచయిత హెర్మెన్‌ హెస్సే. అలాగని రాబర్ట్‌ వాల్సర్‌ కలంపట్టి ప్రపంచం బాగు కోసం పూనుకున్నవాడేం కాదు. బహుశా ఆయన్ని చదివి ఆనందించగలిగే పాఠకులు ఆయనలాగే ప్రపంచాన్ని పెద్ద ఫిర్యాదులేం లేకుండా, దాని దయను పెద్ద ఋజువులేం లేకున్నా నమ్ముతూ, దాన్ని మరీ గంభీర దృష్టితో కాకుండా పిల్లల తుంటరితనంతోను కుతూహలం తోను చూడగలరని హెర్మెన్‌ హెస్సే భావం అయ్యుండొచ్చు.

రాబర్ట్‌ వాల్సర్‌ (Robert Walser) స్విట్జర్లాండ్‌లో బెర్న్‌ అనే ప్రాంతంలో 1878లో పుట్టాడు. ఎనిమిదిమంది పిల్లల్లో ఒకడు. నాన్నకి ఒక స్టేషనరీ షాపు ఉంది. పదిహేనేళ్ళకే స్కూలు మానేసి చిన్నాచితకా ఉద్యోగాలు చేసాడు. కవిత్వం రాయటం మొదలుపెట్టాడు. 27 ఏళ్ళ వయస్సులో బెర్లిన్‌లో చిత్రకారుడిగా పనిచేస్తున్న అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు. అక్కడ సేవకుల (బట్లర్‌) ఉద్యోగాలకోసం తర్ఫీదు ఇచ్చే స్కూల్లో చేరాడు. ఒక చోట బట్లర్‌గా పనిచేసాడు కూడా. కానీ రచనల ద్వారా వస్తున్న సంపాదనతో బతికేయవచ్చనిపించి ఆ పని మానేసాడు. విరివిగా చిన్నచిన్న వచన ఖండికలు రాసాడు. మూడు నవలలు రాసాడు. చాలా పేరూ వచ్చింది. అయితే నగర జీవితంలో కుదురుకోలేకపోయాడు. నిజానికి బెర్లిన్‌లో ఉండుంటే అక్కడి మేధావుల సర్కిల్‌లోకి సాదరంగానే వెళ్ళగలిగేవాడు, స్థాయికి తగ్గ పనేదో చేస్తూ బానే బతకగలిగేవాడు. కానీ- ఏమాత్రం సాహిత్య వాతావరణం లేని సొంత ఊళ్ళో తను జన్మతహ ఏ వర్గానికి చెందుతాడో వారి మధ్యనే ఉండటానికి ఇష్టపడ్డాడు. కొన్నాళ్ళు అక్కతోపాటు ఉన్నాడు. తర్వాత ఒంటరిగా చిన్న చిన్న అద్దె గదుల్లో బతకటం మొదలుపెట్టాడు.

మరోపక్క అతని రచనలకి డిమాండ్‌ తగ్గుతూ వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధకాలంలోనూ, ఆ తర్వాతా- ప్రపంచాన్ని కవితాత్మక ధోరణిలో పరికించే వాల్సర్‌ తరహా రచనలకు ఆదరణ తగ్గింది. అతను మాత్రం రాయటం మానలేదు. తరుగుతున్న సంపాదనకు తగ్గట్టు ఖర్చులూ తగ్గించుకున్నాడు. కానీ సరైన దుస్తులు కూడా వేసుకోలేని స్థితికి వచ్చాకా, చుట్టుప్రక్కలవాళ్ళ చూపులు, ఈసడింపులు భరించటం కష్టమైంది. ఒక నవలలో చుట్టూ ఉన్న సమాజంలో కుదురుకోలేకపోతున్న ఒక పాత్ర గురించి వాల్సర్‌ ఇలా రాస్తాడు: ‘‘అతను ఎప్పుడూ మంద తప్పిన మేకపిల్లలా ఉండేవాడు. జనం బతకటం ఎలాగో నేర్పిద్దామని అతన్ని బాధ పెట్టేవారు. దానికి తగ్గట్టే ఏ రక్షణా లేనట్టు ఉండేవాడు. చెట్టు మీద మిగతా ఆకులకన్నా వేరేగా కనిపిస్తుందన్న కారణంగా పిల్లాడు కర్రతో కొట్టి తెంపేసే చిన్న ఆకులా ఉండేవాడు. ఇంకోలా చెప్పాలంటే, రండి నన్ను బాధపెట్టండి పిలుస్తున్నట్టు.’’

గడవటం అంతకంతకూ కష్టం కావటంతో ఉద్యోగంలో చేరాడు కానీ ఎన్నాళ్ళో నిలుపుకోలేకపోయాడు. బాగా తాగేవాడు. రాత్రుళ్ళు నిద్రపట్టేది కాదు. చెవుల్లో ఎవరో మాట్లాడుతున్నట్టు, అరుస్తున్నట్టు వినిపించటం మొదలైంది. పిడుగులు పడుతున్నట్టు, ఎవరో పీక నులిమేస్తున్నట్టు భ్రమలు పెరిగాయి. ఆత్మహత్యకూ విఫలయత్నం చేశాడు (‘‘నాకు కనీసం ఉరితాడు పేనుకోవటం కూడా చేతకాదు’’). చివరకు తన్ను తాను సంభాళించుకునే స్థితిలో లేడనిపించింది. అక్క సలహాతో 1928లో యాభయ్యేళ్ళ వయసులో ఒక మానసిక చికిత్సాలయంలో చేరాడు.

అదిమొదలు, అలాంటి చికిత్సాలయాల్లోనే దాదాపు పాతికేళ్ళ పాటు, చనిపోయేవరకూ జీవితాన్ని గడిపేసాడు. నిజంగా అతని మతి చెడిందా లేదా అన్నది ఇప్పటికీ ఎవరికీ నికరంగా తెలీదు. ఆయన ఆ తర్వాత రాసిన రచనల్లో అందుకు సూచలేం కనపడవు. డాక్టర్లు కూడా ఒక సందర్భంలో కొన్నాళ్ళు బయట గడిపి చూడమని సలహా ఇచ్చారు. కానీ తన ఇష్టాయిష్టాల్తో నిమిత్తం లేకుండా ఒక పద్ధతి ప్రకారం సాగిపోయే ఈ జీవితమే వాల్సర్‌కి నచ్చింది. ‘‘ఆసుపత్రిలో నాకు కావాల్సిన నిశ్శబ్దం దొరుకుతోంది. ఉన్నా లేనట్టే ఎవరికీ కనిపించకుండా మాయమైపోగలుగుతున్నాను’’ అని చెప్పుకున్నాడు.

ఆసుపత్రికి వచ్చే వంటసరుకుల్ని సర్దటం, ఉత్తరాల్ని విడదీయటం, కాయితం సంచుల్ని తయారు చేయటంలాంటి పనులుచేస్తూ ఉండేవాడు. ఇవి లేనప్పుడు బయట నడవటానికి పోయేవాడు. నడవటం అంటే వాల్సర్‌కి ఎంత పిచ్చి ఇష్టమంటే, ఊళ్ళకు ఊళ్ళు దాటి అలా నడుస్తూనే ఉండేవాడు. 1956లో క్రిస్మస్‌ రోజున ఇలాగే బయల్దేరి నడుస్తూనే మంచులో కుప్పకూలిపోయాడు. అప్పుడు పోలీసులు తీసిన ఫోటోలు కొన్ని ఆయన ఆఖరి క్షణాల్ని చూపెడతాయి. మంచులో కొంతదూరం సాగిన ఒక జత పాదముద్రల చివర వాల్సర్‌ శవం ఉంటుంది.

వాల్సర్‌ రచనల్ని అభిమానించిన, ఆయన శైలి నుంచి ఎంతో కొంత అందిపుచ్చుకున్న మరో ప్రసిద్ధ జర్మన్‌ రచయిత ఫ్రాంజ్‌ కాఫ్కా చనిపోయాకా తన రచనల్ని కాల్చేయమని స్నేహితుడికి చెప్పాడు. అయినా స్నేహితుడు కాల్చడనీ, తన రచనలు బయటి ప్రపంచాన్ని ఎలాగో చేరతాయనీ ఆయనకు ఏమూలో నమ్మకం వుండేవుంటుంది. కానీ అసలు బయట ఎవరైనా చదువుతారన్న స్పృహలేకుండా అచ్చంగా తన కోసమే రాసుకున్న రచయితలు ఎవరన్నా ఉంటే వాల్సర్‌ ఆ అరుదైన సమూహంలో ఒకడని అనిపిస్తుంది. ఎందుకంటే పిచ్చాసుపత్రిలో చేరాకా కూడా వాల్సర్‌ రాస్తూనే ఉన్నాడు. పెన్ను వాడటం మానేసి త్వరగా చెరిగిపోయే పెన్సిల్‌తో రాయటం మొదలుపెట్టాడు. ఆలోచనతో పోటీపడి వేగంగా రాసేందుకు తనే ఒక సొంత షార్ట్‌హేండ్‌ శైలిని తయారు చేసుకున్నాడు. ఆయన చనిపోయాకా ఇలా క్లుప్తం చేసిన పదాలతో, చిన్ని చిన్ని అక్షరాల్లో ఇరికించి రాసిన వందల కాయితాలు బయటపడ్డాయి. ముప్ఫైపేజీల్లో ఒక నవల రాసేడంటే ఎంత ఇరికించి రాసేవాడో అర్థం చేసుకోవచ్చు. ఈ రాతనీ, ఆయన షార్ట్‌హాండ్‌ శైలినీ డీకోడ్‌ చేయటానికే పబ్లిషర్స్‌కు చాలా ఏళ్ళు పట్టింది. వీటిని ‘మైక్రోస్ర్కిప్ట్స్‌’ పేరిట ఈమధ్యనే ప్రచురించారు.

వాల్సర్‌ జీవితమంతా దిగులుతోవలోనే గడిచినా, ఆయనకి ప్రపంచంపై అక్కసేమీ ఉన్నట్టు రచనల్లో కనిపించదు. పైగా అదంటే ఎంత ఇష్టమంటే, రాన్రానూ అందులోంచి ఒక కథ పుట్టించాల్సి రావటం కూడా దాన్ని నేరుగా కావలించుకునేందుకు ఒక అడ్డమే అయింది. కథల మీద తన అయిష్టత గురించి ఇలా చెప్పుకొచ్చాడు: ‘‘కథని బాగా అల్లటంలో ఆరితేరినవాళ్ళన్నా, ప్రపంచంలో ఎవర్నైనా సరే పాత్రలుగా తీసేసుకోగలిగే రచయితలన్నా నేను చప్పున దూరం జరుగుతాను. రోజువారీ విషయాల్ని మచ్చిక చేసుకుంటే చాలు, బోలెడు కవిత్వాన్ని విరజిమ్మే అందమూ, ఐశ్వరమూ వాటికి ఉన్నాయి.’’ వాల్సర్‌ వచన ఖండికలు చాలావరకూ అటు కథా కాదు, ఇటు వ్యాసమూ కాదన్నట్టు సాగుతాయి. బయోగ్రాఫికల్‌ స్కెచెస్‌ అనవచ్చు. ఎవరో తీరుబడిగా నడుస్తూ కాలక్షేపం కోసం మనసులో కల్పించుకునే ఉబుసుపోని ఊహలన్నింటినీ అప్పటికప్పుడు వాక్యాల్లోకి తర్జుమా చేసినట్టు ఉంటాయవి. కుతూహలంతో మెరిసే రెండు కళ్ళు ప్రపంచాన్ని ఆత్మీయంగా దర్శిస్తున్నట్టు ప్రతి వాక్యంలోనూ తెలుస్తుంది.

(ఆంధ్ర జ్యోతి వివిధలో)


July 16, 2018

ఆంద్రె బెలీ (1880-1934) పరిచయం: ప్రపంచమనే సంకేతాల అడవిలో...

 రష్యాలో 1890ల్లో జార్‌ చక్రవర్తులకు వ్యతిరేకంగా తిరుగు బాట్లు చెలరేగిన కాలానికీ, 1917లో రష్యన్‌ విప్లవం సఫలమై సోవియట్‌ రాజ్యం ఏర్పడిన కాలానికీ మధ్య- ఆ దేశ సాహిత్యం దాదాపు ఒక ముప్ఫయ్యేళ్ళ పాటు మరో ప్రభావానికి గురైంది. అదే సింబాలిజం.

అటు ప్రపంచమంతా హేతువు ప్రకారం నడుస్తుందని నమ్మే విప్లవకారులకూ, ఇటు ప్రపంచానికి అర్థమంతా బైబిలు పేజీల్లో దొరికేస్తుందని నమ్మే సంప్రదాయవాదులకూ మధ్య ఒక సంశయాత్మక తరంగా ఈ సింబాలిస్టులు పుట్టారు. వీరు సృష్టి రచనకు ఏ సులభమైన తాత్పర్యాన్ని ఒప్పుకోలేదు. ప్రపంచాన్ని అర్థంకాని మర్మాలతో, నిగూఢ సంకేతాలతో (సింబల్స్‌తో) నిండినదిగా చూశారు. రష్యన్‌ విమర్శకుడు మిర్‌స్కీ- సింబాలిజానికి సాహిత్యపరమైన మూలాల్ని ఫ్రెంచ్‌ కవి బాదిలేర్‌ కవిత నొకదానిలో చూడవచ్చని అంటాడు. ‘కరెస్పాండెన్సెస్‌’ అనే ఈ కవితలో మొదటి పంక్తులు ఇలా సాగుతాయి: ‘‘ఈ ప్రకృతి గుడిలో సజీవమైన స్తంభాలు/ ఉండుండి ఏదో గొణుగుతాయి/ మనిషి సంకేతాల అడవిలోంచి నడుస్తాడు/ అవన్నీ అతని వైపు ఎరిగున్నట్టు చూస్తాయి’’. సింబాలిస్టుల దృష్టిలో ప్రపంచం ఇలా నిగూఢ సంకేతాలతో కిక్కిరిసిన ఒక అడవి.

ఆంద్రె బెలీ (Andrei Bely) ఈ సింబాలిస్టుల తరానికి చెందినవాడే. బెలీ మొదట్లో ఎక్కువ కవిత్వం రాసాడు. సింబాలిస్టులందరిలాగే బెలీ కూడా సాహిత్యాన్ని సంగీతానికి చేరువ చేయాలనుకున్నాడు. ఆయన దృష్టిలో పదాలు కేవలం అర్థాన్ని సూచించే సంకేతాలు మాత్రమే కాదు. అవి తమ రూపం ద్వారా, శబ్దం ద్వారా కూడా భావ ప్రసారాన్ని చేయగలవు. పదాలకున్న అర్థ, రూప, శబ్దాల ఈ త్రిముఖ స్వరూపాన్ని పూర్తిగా వాడుకొనేందుకు బెలీ ప్రయత్నించాడు. మిగతా సింబాలిస్టులు ఈ ధోరణిని తమ కవిత్వానికే పరిమితం చేసుకోగా, బెలీ తన నవలల్లో కూడా ఇదే ధోరణిని అనుసరించాడు.

బెలీ ప్రసిద్ధ నవలలు ‘ద సిల్వర్‌ డోవ్‌’, ‘కోతిక్‌ లెతేవ్‌’, ‘పీటర్స్‌బర్గ్‌’ ఈ మూడూ రష్యన్‌ వచన సాహిత్యాన్ని చాలా ప్రభావితం చేసాయి. వీటిలో ‘పీటర్స్‌బర్గ్‌’ను బెలీ మాస్టర్‌పీస్‌గా చెబుతారు. 1905లో జరిగే ఈ కథలో జార్‌ చక్రవర్తుల కోసం పనిచేసే ఒక అధికారిని చంపటానికి అతని కొడుకు చేతికే బాంబ్‌ ఇస్తారు విప్లవకారులు. కథ పైకి రాజకీయంగా కనిపించినా, తండ్రిని చంపటానికి కొడుకు పడే మీమాంసే ఎక్కువ పేజీలుంటుంది. పీటర్స్‌బర్గ్‌ నగరం కూడా కథ అంతటా ఒక పాత్రలా పరచుకొని ఉంటుంది.

బెలీ బోల్షెవిక్‌ విప్లవాన్ని మనస్ఫూర్తిగా సమర్థించాడు. విప్లవం తర్వాత రష్యాలో ఒక తాత్త్విక, పారమార్థిక పునరుజ్జీవనం జరుగుతుందని ఆశించాడు. ఆ దిశగా ఉత్సాహంతో కొంత కాలం పనిచేసాడు కూడా. అయితే సోవియట్‌ సాహిత్యానికి బెలీ లాంటి రచయితల అవసరం లేకపోయింది. 1932లో సోవియెట్‌ ప్రభుత్వం- రచయితలు సమాజం గురించి వాస్తవిక (రియలిస్ట్‌) శైలిలో మాత్రమే రాయాలనీ, ఆ రచనలనే ఆమోదిస్తామనీ అధికారి కంగా ప్రకటించింది. అంటే అందరూ గోర్కీ ‘అమ్మ’ లాంటి నవలలే రాయాలి. కమ్యూనిస్టు విలువల్ని ఎత్తిచూపాలి. ఫ్యాక్టరీ గొట్టాల్నీ, శ్రామికుల చెమటనీ గొప్పగా చూపించాలి. హేతువుతో సరిపోల్చు కోదగ్గ వాస్తవిక శైలికి ఏమాత్రం దూరం జరిగినా ఆ రచనను బూర్జువా బడాయిగా తీసిపారేసేవారు. ఆ రచయితలకు ఆదరణ లేదు, వారి రచనలు ఎవరూ ప్రచురించరు. ఈ స్థితిని వ్యతిరేకించి రాసినవారిని చంపే శారు. మరికొందరు రాయలేనితనం భరించలేక బతికుండీ నిర్జీవులయ్యారు. బెలీ అదృష్టవశాత్తూ 1934లోనే చనిపో యినా, అతని రచనలు మాత్రం అప్రకటిత నిషేధానికి గురయ్యాయి. అతని రచనలే కాదు; వాటి మీద విమర్శలు గానీ, అతని మీద జీవిత చరిత్రలు గానీ రాయటానికి వీల్లేకుండాపోయింది. మరణం తర్వాత దాదాపు ముప్ఫయ్యేళ్ళ పాటు ఆయన పేరు అటు మాతృభూమిలోనూ, ఇటు బయటి ప్రపంచంలోనూ మరుగునపడిపోయింది.

1965లో ప్రముఖ రష్యన్‌ అమెరికన్‌ రచయిత వ్లదిమిర్‌ నబొకొవ్‌ ఒక అమెరికన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘‘నా దృష్టిలో ఇరవయ్యొవ శతాబ్దపు వచనంలో అద్భుతమైన మాస్టర్‌పీసెస్‌ ఇవి- జేమ్స్‌ జాయ్స్‌ ‘యులిసెస్‌’, కాఫ్కా ‘మెటమార్ఫసిస్‌’, బెలీ ‘పీటర్స్‌బర్గ్‌’, ఇంకా ప్రూస్ట్‌ ఫెయిరీటేల్‌ ‘ఇన్‌ సెర్చ్‌ ఆఫ్‌ ఎ లాస్ట్‌ టైమ్‌’లో మొదటి సగం’’ అన్నాడు. అప్పటికే నబొకొవ్‌కు కేవలం ‘లొలిటా’ నవలకు రచయితగానే కాక, తన మాతృభూమి రష్యాకు చెందిన సాహిత్యంపై నిశితమైన పరిశీలన కలవాడిగా గుర్తింపు ఉంది. ఆయనిక్కడ పేర్కొన్న పేర్లలో జాయ్స్‌, కాఫ్కా, ప్రూస్ట్‌లకు అప్పటికే ఆధునిక సాహిత్యంలో విలువైన స్థానం ఉంది. దాంతో వీళ్ళందరి మధ్యనా కొత్తగా ఈ బెలీ ఎవరా అని చాలామందికి కుతూహలం కలిగింది. ఫలితంగా ఆయన రచనల అనువాదాలు మొదలయ్యాయి. అయితే బెలీ బాషను వాడిన పద్ధతి ఆయన రచనల్ని అనువాదానికి లొంగనివిగా చేసింది. జేమ్స్‌ జాయ్స్‌ ‘యులిసెస్‌’ నవలను వేరే భాషలోకి అనువదిస్తే ఎంత సారం పోతుందో, బెలీ ‘పీటర్స్‌బర్గ్‌’ను ఇంగ్లీషులోకి అనువ దించినా అంతే పోతుంది. ఈ రెండు నవలలకు మధ్య భాషపరంగాను, శైలిపరంగాను, పాత్రలపరంగానూ చాలా పోలికలు ఉండటాన్ని విమర్శకులు గమనించారు (బెలీ పుస్తకం ‘యులిసెస్‌’ కన్నా తొమ్మిదేళ్ళ ముందే ప్రచురి తమైంది). ‘యులిసెస్‌’ను ఇంగ్లీషులో రాయటం వల్ల జాయ్స్‌ ఆధునిక సాహిత్యానికి ఆద్యుడుగా గుర్తింపు పొందాడు. అంతే గొప్ప పుస్తకాన్ని రష్యన్‌ భాషలో రాసి బెలీ ఇప్పటికీ ఎవరో కొద్దిమందికి తప్ప తెలియనివాడుగా మిగిలాడు.

(ఆంధ్ర జ్యోతి 'వివిధ'లో)


కోర్ స్పీషీస్

నందు నాలుగో పెగ్గు కలుపుకుని ఆరామ్‌గా వెనక్కి వాలాడు. తన కథల్లోని “నేటివ్ ఎనర్జీ” గురించి టేబిల్ కవతల కూర్చున్న రామారావు సరైన మాటలు అందని ప్రయాసలో మలబద్ధకం మొహంపెట్టి ఏదో చెబుతుంటే వింటున్నాడు. మధ్య మధ్యలో రామారావు తల మీంచి వెనకాల గోడకి తగిలించి వున్న టీవీలో క్రికెట్ మేచ్ వైపూ ఓ లుక్కేస్తున్నాడు. ఎదుట ఓ మనిషి కూర్చుని తన కథల గురించి అంత లోతుగా విశ్లేషిస్తున్నా ఏం పట్టనంత అతీతుడేం కాదు నందు. కానీ అతనికి రామారావు మాట్లాడుతున్నది ఒక్కోసారి ఏం అర్థం కాక ధ్యాస నిలవటం లేదు.

“నీ ఊరూ, నీ జనం, వాళ్ల ఎసెన్సూ... వీటన్నింటినీ... పదేళ్లుగా నువ్వుంటున్న ఈ నగరం నీకిచ్చిన... నీకు చేసిన... పరాయీకరణ అనే గాయంలోంచి, ఆ బాధలోంచి కొత్తగా చూడగలుగుతున్నావ్. అక్కడే నీకు కనెక్టవుతున్నారు పాఠకులు. కానీ నీ కథల్లో ఉన్న ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే, నువ్వు చెబుతున్న కథల్నీ, ఆ కథల్లో పాత్రల్నీ అలా నడుచుకునేలా చేస్తున్న అంతఃసూత్రాన్ని నువ్వు పట్టుకోలేకపోతున్నావు. You are missing out on the bigger picture. For example, మొన్న ‘జ్యోతి’లో వచ్చిన కథేమిటది....?”

రామారావు గాల్లో వేళ్ళు రుద్దుకోవటం చూసి నందు కథ పేరు అందించాడు. ఈ సారి శ్రద్ధగా విందామని బల్ల మీదకు వాలాడు.

“ఆ... అదే. ఆ కథ, it’s good, it’s good... కథలో conflictని బాగా ప్రెజెంట్ చేశావు. కానీ నేరేటర్ అన్నయ్యకీ, అతని తండ్రికీ మధ్య ఉన్న ఘర్షణని సింపుల్‌గా అదేదో వొట్టి జెనరేషన్ గాప్ అన్నట్టు తేల్చేసుకుంటూ పోయావు. అలా ఎందుకు జరిగిందంటే- నీకు సరళీకృత ఆర్థిక విధానాల ప్రభావం, సమాజపు కుదుళ్ళలోకంటా మార్కెట్ చొరబాటు, ఫలితంగా మానవ సంబంధాల మధ్య పరాయీకరణ... వీటన్నింటి పట్లా అవగాహన లేకపోవటం వల్ల. అది ఉండుంటే ఆ తండ్రీ కొడుకుల మధ్య సంఘర్షణకి a whole new dimension తెచ్చి పెట్టగలిగి ఉండేవాడివి. మార్కెట్ అనేది ఎప్పుడూ ఊరకే దాని పని అది చేసుకుంటూ ఊరుకోదు. Mind You! అది సకల మానవ వ్యవస్థల్లోకీ... కుటుంబాల మధ్యకీ, వ్యక్తుల మధ్యకీ చొరబడుతుంది. దానిపై నీకు సరైన అవగాహన లేకపోవటం వల్ల... ఏవో చుట్టుతిరుగుళ్లు తిరుగుతూ ఏవేవో రాసుకుంటూ పోయావు. పెరట్లో వేపచెట్టు మీద ఏకంగా రెండు మూడు పేరాలటయ్యా! మీ ఊళ్లో మంగలాయన గొడవా, ఆయన షాపులో సినిమా పోస్టర్ల గొడవా... ఇవన్నీ కథకి ఏం ఏడ్ చేశాయి?”

“అట్లేం లేద్సార్. అయన్నేం బల్మీట్కి తెచ్చిపెట్టినయ్ గావు. రాశేటప్పుడు యాదికొస్తే మంచిగ అనిపించి రాషిన అంతే.”

“రాయొద్దని అనటం లేదు నందూ. Try to understand me. ఒక పర్పస్ ఉండాలి. ఒక bigger perspective ఉండాలి. ఉదాహరణకి, ఆ మంగలి షాపులో సినిమా పోస్టర్లని నీ కథ ఏ కాలంలో జరుగుతుందో సూచించటానికి వాడుకుని, అక్కడితో వదిలేయచ్చు. మీ స్కూలు దగ్గర చెప్పులు కుట్టే ఆయన గురించి ఒక స్కెచ్ లాగా రాసి వదిలేశావు. అలాకాకుండా తర్వాతి కాలంలో ఊళ్లల్లో కూడా పెద్ద పెద్ద చెప్పుల షోరూంస్ వచ్చేసాకా ఆయన ఏమయ్యాడో చెప్పుండాల్సింది. నిచ్చెన మెట్ల కుల...”

“గాయన ఇప్పుడు అట్లే ఉన్నడు సార్. మంగలాయ్న మాత్రం షాపును మస్తు మాడ్రన్‌గ జేషిండు...”

“నో.. నో... That’s no the point. I’m just saying these are the possibilities. నువ్వు చెప్తున్నది ఒకానొక ఐసొలేటెడ్ రియాలిటీ. మనక్కావాల్సింది రిప్రెజెంటిటివ్ రియాలిటీ. నీ కథలో ప్రతీ పాత్ర, ప్రతీ సంఘటనా ఏదీ రాండమ్‌గా ఉండకూడదు. ఒక విస్తృతమైన సామాజిక వాస్తవానికి ప్రాతినిధ్యం వహించాలి. అందుకోసం కొన్ని మినహాయింపుల్ని పక్కన పెట్టేయాలి.”

“గట్లంటే నా లైఫ్ మొత్తం ‘మినహాయింపు’లెక్కనే ఏడ్శింది సార్. మా బాపు బా నిదానము మనిషి ఉంటుండె...”

“Then you have to transcend your reality అబ్బా! నిన్ను మినహాయించే పరిస్థితుల్ని దాటుకుని ముందుకొచ్చేయాలి. నీ కాన్షస్‌నెస్‌ని... you have to plug it into social reality. సమాజానికి ఎవరూ ప్రత్యేకం కాదు నందూ. ఇప్పుడు మీ నాన్న మనస్తత్వమే తీసుకో... అది అట్లా ఎలా రూపొందింది. ఏ సామాజిక చలన సూత్రాలు, ఏ చారిత్రక శక్తులు ఆయన్నీ ఆయన జీవిత గతినీ ఆవిధంగా మలిచాయి...”

“ప్లానింగ్ సరిగ లేకుండె సార్ ఆయ్నెకు. కాపాయం జేసుడన్న కాన్సెప్టే లేదు. మాకు పానం బాగలేకున్నా, ఇంట్ల ఏదన్నా ఫంక్షన్ గిట్టయినా బైటి నుంచి పైసల్దెచ్చి అప్పటికి పని ఐపోయేటట్టు చూస్తుండె. ఆ రిటైర్మెంట్ డబ్బుల్తోటి అక్క పెళ్ళేమో జేసిండు ఇగంతే. పుర్సత్‌గ కాళ్లు చాపుకుని కూర్సుండు. మనిషి మంచోడు, గదేమంటలే గానీ... మాకు కట్టుకోండ్ర కొడకల్లారా అని మిత్తిలు తప్ప గాయన మిగిల్సిందైతే ఏం లేదు.”

రామారావు తాను ఇందాక చేసిన సైద్ధాంతిక విశ్లేషణనని ఇప్పుడు నందు చెప్పిన పరిస్థితికి అన్వయించాలని చూసాడు. కానీ, నందు కన్న ఒక పెగ్గు వెనకే ఉన్నా, అప్పుడే ఆలోచనలు అరాచకంగా ఒకటి అటంటే ఒకటి ఇటన్నట్టు పోతున్నాయి. సమన్వయించలేక, తోచిన వెంటనే తుర్రుమంటున్న ఆలోచనల కొసల్ని అందుకుని దగ్గరగా తెచ్చి ముడివేయలేక, ఊరికే మొహం నిండా సానుభూతిని ఒక కవళికగా మాత్రమే పులుముకుని “మానవ జన్మంబిది...” అన్నట్టు బుర్రాడిస్తున్నాడు.

“సార్, గిట్ల అడుగుతున్ననని ఏమన్కోవద్దు. మీరిప్పుడు జెప్పిన్రు గదా, గివన్నీ మెన్షన్ జేస్కుంట ఓ మంచి వ్యాసం రాస్తే ఎట్లుంటదంటరు?”

ఈ ఒక్క ముక్కతో రామారావు ఒంట్లోని రాజమండ్రి రక్తంలోకి పేరూ పరపతి లెక్కలన్నీ రెక్కలల్లార్చుకుంటూ వచ్చి వాలాయి. “రాద్దాం రాద్దాం” అన్నాడు గుంభనంగా, గ్లాసు వంక చూసుకుంటూ నవ్వుతూ.

“లే సార్... మీర్రాయాలె. నాకు నమస్తే తెలంగానం ఎడిటోరియల్ల ఒకాయన గీ మద్దెల్నే పరిచయమైండు. మన కతలు నచ్చినయాయినెకు. మీర్రాయుండి సాలు, నేనెట్లన్న పబ్లిష్ చేపిస్త. ఎవ్వల్ విశ్లేషించకుంట మనమిట్ల ఊకె ఎన్ని రాసిన వేస్టు సర్. ఆ వేణుగోపాల్ మొన్న కథ సంకలనం మీద సమీక్ష రాశిండు సూశిర్రా? నా కథ గురించి ఏమన్నడో ఎర్కెనా? శైలి వస్తువుకు మింగేషిందట. జనాకర్షణ ధోరణి కనిపిస్తుందట (జనాలకి చీదర దొబ్బాల్నో ఏందో మరి), హేతువాద మూలాల్ని విడిచి సాము జేశ్న కథనమట. ఇంకేం రాశిండనుకుర్రు? ‘తాము ఎటువైపు నిలబడ్డామన్న అంశంపై స్పష్టత లేని రచయితల్ని ప్రోత్సహించకుండుంటె గదే తెలుగు సాహిత్యానికి సంపాదకులు చేషే మేల’ట. ఓ ఇంక ఎట్లంటె అట్ల ఒర్రిండు. ఆని బాధంత ఎందుకో చెబుత ఇనుర్రి. మొన్న వెంకట కృష్ణ ఇంటికి పోతే ఆయనక్కడ్నే ఉన్నడు. గాయనే గుర్తుపట్టి ‘మిత్రమా మంచిగున్నవా’ అనుకుంటా భుజం మీద గిట్ల చేయేషి ‘నీ కథలూ’ అంటూ మంచిగనే ఏదో చెప్పబట్టిండు. ఆయనెవరో నేను గుర్తువట్టలే. ఐనా అంత సోపతి చూపిస్తున్నడు లెమ్మని ఆయనెవరో నాకు ఎరుకైనట్టే ఏక్ట్ జేస్తున్న. ఆయన్ను నాకు పరిచయం జేసిన బద్మాష్ గాడు గమ్మునుండక ‘సారెవరో తెలుసు కద’ అని అడిగిండు గాయన ముంగట్నే. ఇంకేమంటము. బర్రెలెక్క తల అడ్డంగ ఊపినం. గాయ్నె ఎంటనే ముఖం చిన్నగ వెట్టుకున్నడు. తర్వాతిక నా వైపు చూసి మాట్లాడుడు బంజేశిండు. పోయేటప్పుడు విష్ జేశిన ‘పోతున్నా సార్’ అనుకుంట. ‘ఆ మంచిది’ అని ఏందో ఆయనింట్ల పన్జేయనీకి వచ్చినోనికి చెప్పినట్టు చెప్పిండు. అరే ఏందిర బయ్ గిట్లయింది అని గప్పుడే అనుకున్న. ఇంగ చాన్సు రాంగనే ఏదంటె అది రాసి గబ్బుపట్టిచ్చిండు.”

“మీ తెలంగాణ మేధావే కదయ్యా,” అన్నాడు రామారావు నవ్వుతూ. తెలంగాణవాడూ తెలంగాణవాడూ కొట్టుకుని ఆంధ్రావాడి దగ్గరకు తగూకొస్తే నవ్వినవాడి నవ్వులా ఉందా నవ్వు.

“నా బొచ్చెల తెలంగాణ, యాడుంది సార్. గా అలాయ్ బలాయ్‌లన్నీ  ఉజ్జమంతోటే ఇడ్శిపెట్టినరు. ఇంగ ఇప్పుడంత ఎవ్వలన్న పైకెళ్తున్నరనిపిస్తే ఆని ఎంబటపడి కాళ్లు పట్కొని గుంజుడే మిగిలింది. కొట్కు సస్తుర్రు కొడుకులు.”

“అలా అనొద్దు నందూ. మా వాళ్లతో పోలిస్తే మీ వాళ్లు చాలా బెటర్. నేటివ్ హానెస్టీ ఉంటుంది మీ దగ్గర,” అన్నాడు రామారావు. ఇప్పుడంటే అలా అన్నాడు కానీ, ఎపుడన్నా ఏ ఆటోవాడన్నా, “ఏమన్న! గీడదాక గీడదాక అన్చెప్పి సీదా పటాన్‌చెరు తొల్కబోయేట్టున్నావ్, దిగు ఈడ,” అన్నప్పుడో, ఏ కూరగాయలవాడో “ఏంది పది రూపాయలూ? ఎందుకు సార్ ఉట్టిగనే ఇస్త తీస్కపోరాదు? జరుగు సార్.. సైడుకి జరుగు,” అన్నప్పుడో,  ఎన్నోసార్లు లోపల్లోపలే “ఏనిమల్స్!” అని గొణుక్కున్నాడు.

నందు “ఏమో సార్, ఏం హానెస్టీనో ఏం పాడో,” అనుకుంటూ మందు తెచ్చిన దిగులుతో మిగిలిన ద్రవంలోకి చూస్తూ గ్లాసు తిప్పుతున్నాడు.

రామారావు అతని వైపు మందు తెచ్చిన వాత్సల్యంతో చూస్తున్నాడు. “అన్‌కట్ డైమండ్” అన్న పదం మళ్లీ మెదిలింది అతని మనసులో. అతనీ మధ్య సాహిత్య విమర్శకుడి హోదాలో ఇలాంటి అన్‌కట్ డైమండ్స్ కోసం వెతుకుతున్నాడు. వెతకటం మొదలుపెట్టగానే నందు చప్పున తగిలాడు. ఈ ఏడాది వచ్చిన మంచి కథలతో ఒక సంకలనం తెస్తున్నవాళ్లు ముందుమాట రాయమంటే ఆ పని మీద సంకలనంలోని కథలు చదువుతూ నందూ కథ కూడా చదివాడు. ఏదో “నేటివ్ ఎనర్జీ” కనిపించింది. నందు రాసిన ఇంకొన్ని కథల్ని సంపాయించి చదివాడు. “అన్‌కట్ డైమండ్” అనుకున్నాడు. కానీ కథల్లో కొంత అయోమయం కనిపించింది. “ఇటీవలి సామాజిక ఆర్థిక పరిమాణాల ఫలితంగా తెలుగు సమాజంలో వర్గేతర మార్గాల్లో దారితప్పుతున్న తరంలో కథలు రాస్తున్నాడు కాబట్టి ఆ అయోమయం” అని తీర్మానించుకున్నాడు. దిశానిర్దేశం లేకపోవటం వల్ల కలిగిన దృక్పథ రాహిత్యాన్ని చప్పున పసిగట్టాడు. రామారావుకి యాభయ్యోపడిలోకి వచ్చాకా ఈ “దిశానిర్దేశం” అనే పదం కూడా ఎక్కువగా మనసులో మెదులుతోంది.

“కనీ సీరియస్‌గా ఆలోచించుర్రి సార్ వ్యాసం గురించి. నన్ను ఊ.. ఎత్తుకుంట రాయమని అంటలే. ఏమన్న అనేదుంటే అనుర్రి. కనీ.. మాటలు తిట్టేటియి రెండుంటే, మెచ్చుకునేటియి నాలుగుండాలె. అట్ల బాలెన్స్ జేసుకుంట మీరే రాయగల్రు సార్. సాహిత్యం లోకమంత ‘అరె.. ఎవడ్రబై ఈడు మెంటలెక్కిస్తుండు, అని ఎన్కకు దిరిగి సూడాలె....”

నందు ఈ మాటలు అంటుంటే ఒక వెస్ట్రన్ కంట్రీ బార్ లోకి స్ప్రింగ్ డోర్స్ తోసుకుంటూ కౌబాయ్ గెటప్పులో హేట్ అంచుల కింద నుంచీ చూస్తూ నడిచొస్తున్న నందు ఊహల్లోకి వచ్చాడు రామారావుకి. టేబిల్ మీద చరుస్తూ వెకిలిగా నవ్వాడు. “సాహిత్యంలో నీ గ్రాండ్ ఎంట్రీకి హార్మోనికా వాయించాలన్నమాట....”

“గట్లనే అనుకోర్రి. ఇందాక స్టేజి మీద మాట్లాడిర్రు సూడు. గట్లాంటి మాటలన్ని పడాల వ్యాసంలో. భలే మాట్లాడిర్రు సార్.”

రామారావుకి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కాసేపటి క్రితం జరిగిన బుక్ ఫంక్షన్లో తన ప్రసంగం గుర్తొచ్చింది. ముందు వరస కుర్చీల్లో కూర్చున్న శ్రోతల ముఖాలు ఇంకా కళ్ళముందే ఆడుతున్నట్టున్నాయి. వాళ్ళ చప్పట్లు చెవుల్లో వినిపించాయి. లాల్చీ జేబులో ఉపన్యాసం తాలూకు పాయింట్లు రాసి పెట్టుకున్న కాయితాన్ని ఇంకోసారి చూసుకోవాలనిపించింది. జేబులో చేయిపెట్టబోయాడు.

“సార్, గట్ల జేయొద్దు. ఫస్ట్ టైం నా కతల గురించి రెండు ముక్కలైన మంచిగ రాశిర్రు మీరు. ఈ ట్రీట్ నాది...” అన్నాడు నందు.

రామారావు, “సర్లే, ఈసారిక్కానీ,” అని జేబులోంచి చేయి తీసేసాడు.

ఈసారి రామారావు నందు మీద వ్యాసం గురించి ఆలోచించటానికి సిద్ధపడ్డాడు. నందు నిజంగానే తెలంగాణ సాహిత్యంలో ఒక కొత్త గొంతు. ఉద్యమం తర్వాత కథలు రాస్తున్న తరంవాడు. తనే ఒక ఆగమన ప్రకటన లాంటి సాధికారిక వ్యాసం రాస్తే? మందెక్కిన మెదడు కల్లోలంగా అన్నింటినీ గోరంతలు కొండంతలుగా చేసి చూపెడుతోంది. మామూలు స్ఫురణలు కూడా గొప్ప సాక్షాత్కారాల్లాగా తోచడం మొదలుపెట్టాయి. ఎందుకు తానీ ఉభయ తెలుగు రాష్ట్రాల పాలిట ఒక విస్సారియన్ బెలింస్కీనై ఒక దాస్తోయెవ్‌స్కీని పరిచయం చేయకూడదు. కానీ ఈ నందు కథల్లోనివి మరీ కులాసా, తీరుబడి లోకాలు. పోనీ గోర్కీ అందామా అంటే ఆ పేరుని నామినికి వాడేసారు. అయినా నామిని ఆంధ్రా కదా... పాపం తెలంగాణకీ ఓ గోర్కీ అక్కర్లేదా....

ఇంతలో కునుకుతూ ఊగిన మనిషికి పడిపోతున్న భ్రమతో మెలకువ వచ్చినట్టు మందు మత్తులో మునుగుతోన్న రామారావు మెదడు క్షణమాత్రం వాస్తవ తలంపైకి తేలింది. అసలు ఆ స్థాయి వ్యాసానికి నందు మున్ముందు తూగలేకపోతేనో.. అన్న అనుమానం వచ్చింది. కానీ కాబోయే తెలంగాణ మహాకథకుడికి తొలి బాకా ఊదేవాడు మళ్ళీ ఒక ఆంధ్రావాడే కావటమన్న ముచ్చటైన ఊహ నిలవనీయలేదు. నందు కూడా స్కీమ్ ఆఫ్ థింగ్స్ నుంచి జారిపోయాడు. నందూ కాకపోతే ఇంకో తెలంగాణ కథకుడు... అలాంటి వ్యాసం మాత్రం రాయాలనుకున్నాడు.

నందు “ఇగో తమ్మీ, బిల్ తీస్కరా,” అని పిలిచాడు. అక్కడ ఓ స్తంభానికి జారబడి చేతులు కట్టుకుని గోళ్ళు కొరుక్కుంటున్న ఒక కుర్రాడు అయిష్టంగా అన్నట్టు ముందుకు కదిలాడు.

ఏ టేబిల్ దగ్గర ఆ టేబిల్‌దే ప్రపంచమన్నట్టు ఉంది బార్. ఆ అబ్బాయి బిల్ తెచ్చి పెట్టాడు. ఎంగిలి ప్లేట్లూ, ఖాళీ గ్లాసుల మధ్య.

నందు పైసలు లెక్కపెడుతుంటే రామారావు ఆ అబ్బాయి వంక చూస్తున్నాడు. “ఏం చదువుతున్నావమ్మా,” అన్నాడు.

నీకెందుకన్నట్టు ముఖం పెట్టి, “డిగ్రీ జేషిన,” అన్నాడు ఆ అబ్బాయి.

“మరి ఇక్కడేం చేస్తున్నావయ్యా, ఇంకా చదువుకోకుండా?”

నందుకి ఈ సంభాషణ ఇబ్బందిగా అనిపించి పైసలు వెంటనే లెక్కపెట్టి ఆ అబ్బాయికి ఇచ్చేశాడు.

ఆ అబ్బాయి ఇలాంటి టేబిల్స్ ఎన్నో చూసి వున్నాడు కాబట్టి సమాధానం ఇవ్వకుండా డబ్బు లెక్కపెట్టుకున్నాడు.

నందు, “ఛేంజ్ ఉంచుకో,” అన్నాడు.

“మీ నాయన ఏం చేస్తాడు,” మళ్ళీ అడిగాడు రామారావు.

ఆ అబ్బాయి టిప్పు ఎంతో లెక్క చూసిన ప్రసన్నతతో, “ఎందుకడుగుతుర్రు సార్,” అన్నాడు నవ్వుతూ.

“తెలుసుకుందామనీ. మీరు ఒక తరం అయ్యా. ప్రపంచాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన తరం. ఇలా వెనక మిగిలిపోయినవాళ్ళకి మందు పోయాల్సిన తరం కాదు. ఎవ్రీ ఒన్ ఆఫ్ యూ హేవ్ ఎ పొటెన్షియల్,” అన్నాడు.

నందు ఆ అబ్బాయి వంక చూస్తున్నాడు. ఆ అబ్బాయి తన కన్నా బహుశా ఒక పదేళ్ళు చిన్నవాడు. పదేళ్ళ క్రితం నందు ఒక పెద్ద స్టీల్ సామాన్ల షాపులో పని చేశాడు. అపుడు రామారావు లాంటి కస్టమర్లని కౌంటర్కి అటువైపు నుంచి డీల్ చేసిన అనుభవం ఉంది. ఇపుడు రామారావు గురించి ఈ అబ్బాయి ఏమనుకుంటూ ఉంటాడో నందుకి తెలుసు.

“సార్ పదండి, టైమైతుంది,” అంటూ లేచి, “మంచిది తమ్మీ,” అన్నాడు ఆ అబ్బాయిని ఇక వెళ్ళమన్నట్టు.

టేబిల్స్ దాటి బయటకు వచ్చాకా రామారావు నందు భుజం మీద ఆసరాగా చేయి వేశాడు. ఇద్దరూ చీకటి గుయ్యారంలా ఉన్న మెట్లు దిగుతున్నారు.

“నాకు వీళ్ళని చూస్తే చాలా జాలిగా ఉంటుందయ్యా. వీళ్ళంటే ఇలా బార్లలో పని చేసేవాళ్ళని కాదు. ఈ దేశంలో అసంఘటితంగా ఉన్న ఈ పీడిత వర్గ సభ్యుల్ని ఎవర్ని చూసినా సరే, నాకు వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఉంటుంది. వాళ్ల జీవితాలేంటీ, చుట్టూ నెలకొన్న ఆర్థిక సామాజిక పరిస్థితులేంటీ, ఆ ప్రభావాల్ని వాళ్ళు ఏమేరకు గ్రహించగలుగుతున్నారూ... ఇవన్నీ మాట్లాడించి రాబట్టాలని ఉంటుంది. అణచివేత నుండి సహజంగా రగలాల్సిన వర్గస్పృహ వీళ్ళల్లో ఏ చీకటి మూలల్లో ఆక్సిజన్ అందకపోవటం వల్ల అలా రాజుకోకుండా నివురుగప్పి ఉండిపోయిందో, ఎందుకు వీళ్ళిలా అన్నీ ఒప్పుకుని ఒక resigned state లోకి వెళిపోతారో కనుక్కోవాలని  ఉంటుంది. I want to know the pulse of history. నిజానికి ఇదంతా ఒక కథారచయితగా నువ్వు, అంటే ఐ మీన్ నీలాంటివాళ్ళు చేయాల్సిన పని. You have to tap into their lives with your pen boss! వీళ్ళందర్నీ కలిపికుడుతున్న దారం, వీళ్లు గ్రహించని ఉమ్మడి వర్గ పునాది... దాన్ని నువ్వు పట్టుకోవాలయ్యా... మనం ఆ స్థానంలో ఉన్నాం, ఆ స్థాయిలో ఉన్నాం... సాహితీకారులుగా... మనం వీళ్ళని నడిపించాలి ముందుండి, ఆ బాధ్యత మన మీద ఉంది... Because we are the chosen ones, we are the core of this species...”

మెట్టు దిగుతున్నప్పుడల్లా భుజం మీద నొక్కినట్టు పడుతున్న రామారావు బరువుని ఫీలవుతూ, అతని మాటల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాడు నందు. తర్వాత రామారావుని గుమ్మం దగ్గర వదిలి బండి తేవటానికి పార్కింగ్ సెల్లార్లోకి వెళ్ళినప్పుడూ ఇవే ఆలోచనలు. తన జీవితం గురించీ, తన చుట్టూ “నెలకొన్న ఆర్థిక సామాజిక పరిస్థితుల” గురించీ, తన మీద “వాటి ప్రభావం” గురించీ ఆలోచించటానికి ప్రయత్నించాడు. ఎందుకో కొన్ని దృశ్యాలూ, మనుషులూ, సన్నివేశాలూ-- తన తక్షణ జీవితంతో సంబంధం ఉన్నాయని అనిపించేవి-- చప్పున గుర్తొచ్చాయి. తను ప్రస్తుతం సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్న కార్ల కంపెనీలో ఇవాళ మధ్యాహ్నం కొలీగ్స్‌తో చేసిన లంచ్ గుర్తొచ్చింది. అకౌంట్స్ అసిస్టెంట్ వెంకట్రావు వాళ్ళ బావ కోసం ఒక సెకండ్ హాండ్ కారు పక్కకు తీసి ఉంచమని రిక్వెస్ట్ చేసాడు. వాళ్ళ బావకి ఆంధ్రాలో ఏదో ఊళ్ళో రెండు సెల్ రిపేరు షాపులున్నాయి. నందూ, వెంకట్రావూ కలిసి ఆ తర్వాత లంచ్ చేస్తూ తెలంగాణ, ఆంధ్ర పల్లెటూళ్ళ గురించి మాట్లాడుకున్నారు. వెంకట్రావు వచ్చే వారం తన ఊళ్ళో అమ్మోరి సంబరం బాగా జరుగుతుందనీ, తనతో పాటు రమ్మనీ పిలిచాడు. ఎలాగూ బావకి కారు ఇవ్వటానికి వెళ్తాడు కాబట్టి అదే కార్లో తనతో వచ్చేయమన్నాడు. అలాగే మొన్న వారం చందనతో కలిసి సిద్దిపేట దగ్గర పెళ్ళికి వెళ్ళినప్పటి సంగతులు కొన్ని గుర్తుకువచ్చాయి. కృష్ణగాడితో చెట్టుకింద మాట్లాడుతుంటే గదిలోకి గబగబా నడిచివెళ్తున్న చందన ముఖం చూసి ఏదో అయిందని అర్థమై ఆమె వెనకే గదిలోకి నడిచి వెళ్ళాడు. పుస్తెల తాడు గురించి వదినె ఏదో అన్నదని చందన తనను పట్టుకుని ఏడ్చింది, ఓదార్చాక తన అసమర్థతనే ఎత్తి చూపి తిట్టింది. నందుకి తన అక్క కూడా గుర్తొచ్చింది. గల్ఫ్కి వెళ్ళిన బావ తిరిగిరాకుండా అక్కడ వేరే అమ్మాయిని తగులుకొని అక్కని విడాకులియ్యమని ఏడిపించటం, ఇక్కడ అక్కేమో పిల్లాడి ఫీజు కోసం స్కూలు వాళ్ళతో గొడవపడటం, ఒక్కసారి తనను వచ్చి ప్రిన్సిపాల్‌తో మాట్లాడమనటం... ఇవన్నీ గుర్తొచ్చాయి. అలాగే అస్తమానం ఎడం చెయ్యెత్తి చంకలో గోక్కునే ఇంటి ఓనరూ, కామన్ బాత్రూంని రోజిడిచి రోజు చందనే కడగాలని షరతు పెట్టిన బొల్లి ముఖం ఓనరమ్మ, “మీరు జిమ్ చేస్తారా” అనడిగి నరాల్ని జివ్వుమనిపించిన ఫ్రంటాఫీస్ మల్లికా మేడమ్, ఐదేళ్ళుగా పిల్లల్లేక సెమన్ అనాలసిస్ కోసం ఇంట్లో ఎవరికీ తెలీకుండా సిటీకొచ్చిన ఫ్రెండ్ మల్లేష్ గాడు, వాడు చెప్పాపెట్టకుండా ఊరొదిలి ఎందుకొచ్చాడని ఫోన్లో కంగారుపడిన వాళ్ళ నాయన, ఊళ్ళో కొత్తగా పెట్టిన జ్యూస్ సెంటరు అన్‌సీజన్లో కూడా బానే నడుస్తోందని ఆయన పడ్డ సంతోషం... ఇలా కాలంలో చేరువైన, మనసుకు దగ్గరైన కొన్ని దృశ్యాలు నందు మనసులో కలగాపులగంగా తిరిగాయి. వీటన్నింటినీ రామారావు చెబుతున్న మాటలతో అన్వయించటానికి ప్రయత్నించాడు. కథలుగా రాయదగ్గ మనుషులనిపించే వీరందరినీ, కథలుగా రాయదగ్గ విషయాలనిపించే వీటన్నింటినీ కలిపే అంతస్సూత్రం ఒకటి వుంటుందా, నిజంగా, రామారావు అంటున్నట్టు? ఈ మనుషుల్లోనూ, విషయాల్లోనూ తను చూసే వింత అందాన్నీ, కళ్ళుచెదరగొట్టే వైవిధ్యాన్నీ దేన్నీ మినహాయించకుండా కలుపుకునే అంతస్సూత్రం... అదేంటో తెలుసుకుంటే జీవితం మీదా సాహిత్యం మీదా అవగాహన పెరుగుతుందా, చీకటి గదిలో కరెంటు వచ్చినట్టు అయోమయాలన్నీ విశదమైపోతాయా? జీవితం ముందు ప్రశ్నార్థకం మొహం వేసుకుని నిలబడకుండా అన్ని విషయాల్నీ, లోతుపాతులతో సహా, వ్యాఖ్యానించగలడా?

కానీ ఇలా జీవితాన్ని సాక్ష్యంగా తెచ్చి నిలబెట్టేసరికి రామారావు వాడిన బరువైన మాటలన్నీ డొల్లగా, ఊరకే నోటితో చేసిన చప్పుళ్ళలాగా అనిపించాయి. అతను చరిత్ర అంటున్న దానితో సంబంధం లేని, ఒకవేళ ఏ కాస్తో సంబంధమున్నా దానికి అతీతంగా ఇదీ అని చెప్పలేని సొంత చైతన్యమేదో తొణికిసలాడే ప్రపంచమే నందుకి తన చుట్టూ పట్టించుకోదగిందిగా, రాయదగిందిగా అనిపించింది. రామారావు కూడా ఆ ప్రపంచంలో ఒకానొక లక్కపిడతలాంటి ముచ్చటైన భాగంలా అనిపించాడే తప్ప, ఆ ప్రపంచాన్ని వ్యాఖ్యానించగలిగే దేన్నో లోపల దాచుకున్న గంభీరమైన మనిషిలాగేం కనిపించలేదు. కానీ రచయితగా పేరు తెచ్చుకోవాలంటే మాత్రం రామారావు మాటల్లో వినిపించే విషయాల గురించి తెలుసుకోవటం ముఖ్యమని అనిపించింది.

నందు బండి పైకి తెచ్చేసరికి రామారావు ఫోనులో మాట్లాడుతున్నాడు. “అంతా డ్రా చేసేయకు తల్లీ! నెక్స్ట్ మంత్ మమ్మీ శాలరీ రాగానే నీకెందుకు నేను తీసికెళ్తాగా. రేయ్ నానా...” అంటున్నాడు. నందు ఆ మాటలు వింటూ-- ఖరీదైన బట్టల షాపులోనో, ఫాన్సీ హేండ్ బేగుల షాపులోనో ఫ్రెండ్స్ నుంచి కాస్త పక్కగా వచ్చి తండ్రితో ఫోన్ మాట్లాడుతున్న ఒక జీన్స్ ఫాంట్ అమ్మాయిని ఊహించుకున్నాడు. ఈ కనిపించే ముసలాడికి చేరువగా, అన్నీ పంచుకునే అలాంటి మార్దవమైన ఆడ ప్రపంచం ఒకటి ఉందంటే ఇతనిపై ఎందుకో ఒక గౌరవం కలిగింది. రామారావు ముఖాన్ని బట్టి ఆ అమ్మాయి రూపాన్ని ఊహించే ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయి ఎపుడైనా తనకు పరిచయం అవుతుందా అని ఊహించాడు. పెళ్ళవక ముందు మావయ్య కన్నుగప్పి తనతో కరీంనగర్‌కి సినిమాలకు వచ్చిన చందన గుర్తొచ్చింది.

రామారావు ఫోన్ ఆపి వచ్చి బండెక్కాడు. వాళ్ళ అమ్మాయి గురించి మురిపెంగా ఏదో చెబుతున్నాడు. నందూ అది వింటూ బైక్‌ని పార్కింగ్ సెల్లార్ లోంచి వేగంగా రోడ్డు మీదకు తెచ్చాడు. అప్పుడే వాళ్ళని దాటిన ఆటో ఉన్నట్టుండి ఆగితే నందు బ్రేక్ వేయటం వేశాడు, కానీ బైక్ వెళ్ళి ఆటో వెనక గట్టిగా గుద్దింది. ఆటో చక్రం కొద్దిగా పైకి లేచి కిందపడింది. వాలిపోతున్న బైక్ని నందు కాళ్ళతో కష్టం మీద ఆపాడు, రామారావు గెంతి పక్కన నిలబడ్డాడు.

ఆటోవాడు అట్నుంచి దిగి వచ్చి ఆటో వెనక భాగం చూసుకున్నాడు. లైట్ చితికిపోయి, అక్కడ కొంచెం సొట్టపడింది.

“అరె ఔలాగా కళ్ళు దొబ్బినయ్యా రా! తాగి నడుపుతున్నవా బండి?”

నందు సారీ చెప్పబోయినవాడే ఈ మాటలు విని మనసు మార్చుకున్నాడు. “నిన్నెవడు బే సడెన్‌గా ఆపమంది. వెనక బళ్ళొస్తే చూస్కోవా?” అన్నాడు.

బార్లో తాగుదామని వచ్చినవాళ్ళు కావచ్చు, ఇద్దరు ఆటో వెనక నుంచి దిగి గొడవ చూస్తున్నారు.

“అరె లంజొడ్కా... ఎన్కలంత సొట్టవడేటట్టు గుద్ది మళ్ళీ ఏందిర ఎగస్ట్రాలు మాట్లాడుతున్నవ్,” అంటూ ముందుకొచ్చాడు ఆటోవాడు. ముందుకొచ్చి అప్పుడే నందు బండి పైకి లేపి కిక్ కొట్టబోతుంటే దాని కీ ఆఫ్ చేసాడు.

నందు ఆటోవాడ్ని దెబ్బలాటలో గెలవగలనా లేదా అని చూస్తూ, సీరియస్గా “చెయ్ తియ్ రా,” అన్నాడు.

ఆటోవాడు తాళం కీహోల్ లోంచి బయటికి లాగనే లాగాడు.

నందు ధడేల్మని స్టాండ్ వేసి అతని మీదకు వెళ్ళబోతోంటే, రామారావు చప్పున మధ్యలోకి వచ్చి కలగచేసుకున్నాడు. ఆటోలో దిగిన ఇద్దరూ కూడా మధ్యలోకి వచ్చారు.

రామారావు “నువ్వాగు నందు!” అని గట్టిగా అరిచి, ఆటోవాడి వైపు వెళ్ళి భుజం మీద చనువుగా చేయి వేసి అటు తిప్పబోయాడు, “మిత్రమా,” అంటూ.

ఆటోవాడు అటు తిరగలేదు సరికదా, చేయి విదిలించుకుని రామారావు దవడ మీద ఠాప్ మని కొట్టాడు. అసలే తాగివుంటంవల్ల రామారావుకి బాలెన్స్ బాలేదు. పైగా ఆ దెబ్బకి కళ్ళ ముందు ఒక్కసారి అంతా ఆరిపోయి నట్టనిపించింది. రెండడుగులు వెనక్కి తడబాటుగా వేసి ఫుట్పాత్‌కి తగులుకుని దాని మీద కూలబడ్డాడు.

నందు ఆటోవాడి మీదకెళ్ళబోతుంటే, ఆటో దిగిన ఇద్దరిలో ఒకరు ఆటోవాడ్ని, ఒకడు నందుని పట్టుకుని ఆపారు.

ఆటోవాడు “మాన్ హాండ్లింగ్ చేస్తుండు సార్,” అంటున్నాడు.

నందు విదిలించుకోవటానికి నామమాత్రం ప్రయత్నం చేస్తూ కొన్ని బూతులు తిట్టాడు. అప్పటికే జనం ఆగి చూస్తున్నారు. కొంతమంది రోడ్డుకి అటుపక్క నుంచి పరిగెడుతూ రోడ్డు దాటుతున్నారు. నందు వెంటనే పట్టు విడిపించుకుని ముందుకెళ్ళి ఆటోవాడి చేతిలో బండి తాళం లాక్కున్నాడు.

“సార్ పాండి,” అని కిక్ కొట్టి చేయి అందించాడు. రామారావు కష్టం మీద లేచి వెనక కూర్చున్నాడు. ఆటోవాడు తనను పట్టుకున్నవాళ్ళని విడిపించుకుని వెనక పరిగెడుతుండగానే నందు బండిని స్పీడుగా పోనిచ్చాడు.

రామారావు కాస్త దూరం వరకూ వెనక పరిగెడుతున్న ఆటోవాడ్ని చూసాడు. తర్వాత తల తిప్పేసుకున్నాడు.

కాసేపటిదాకా ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు.

“గట్టిగ తాకిందా సార్?”

“లేదబ్బా”

“లంజొడుకు ఊకె మీదకొస్తుండు. ఆగి తన్నేదుండె కనీ, మనం తాగినం కద. జనం మనల్నే అంటరు. అందుకే పోనిచ్చిన.”

“ఫర్లేదులే నందు. వాడ్ని మాత్రం ఏమనగలం. It’s a form of alienation. ఈ సమాజం అలా చేస్తుంది వాడ్ని. మానవత్వం నుంచి దూరంగా తరిమేసి... అలా ఒక ఏనిమల్ లాగ,” అన్నాడు రామారావు సలుపుతున్న దవడ నిమురుకుంటూ. 

July 9, 2018

మార్సెల్ ప్రూస్ట్ (1871-1922) పరిచయం: పోగొట్టుకున్న కాలాన్ని వెతుక్కొంటూ...

 పశ్చిమ దేశాల సాహిత్యంలో ఏ విమర్శకుడైనా జ్ఞాపకం (మెమొరీ) గురించి ఏదైనా మాట్లాడదల్చుకుంటే ఒక్కసారైనా ప్రూస్ట్‌ని తలచుకోవాల్సిందే. అలాగే జ్ఞాపకాల ఆధారంగా రాయదలచ్చుకున్న ఏ రచయితైనా ప్రూస్ట్‌ని అప్పటికే చదివుంటే ఆ ప్రభావంతో పెనుగులాడాల్సిందే. ప్రూస్ట్‌ జ్ఞాపకాన్ని ఇతివృత్తంగా తీసుకుని మొత్తం జీవితాన్నే మరలా పేజీ మీద ఆడించినంత పని చేసాడు. ఆ ఆటను బూతద్దంలో చూసినంత దగ్గరగా చూపించాడు. అయితే ప్రూస్ట్‌ ఉద్దేశంలో, తలచుకుంటే స్ఫురించే జ్ఞాపకాలకు పెద్ద విలువ లేదు. అలాగాక, ఏదో బయటి ప్రభావం వల్ల అనుకోకుండా మనలో పునర్జీవితమై గతాన్ని పూర్ణసారంతో సాక్షాత్కరింపజేసేదే విలువైన జ్ఞాపకం. దీన్ని ‘ఇన్‌వాలంటరీ మెమొరీ’ అన్నాడాయన. అంటే అప్రయత్నంగా తట్టే జ్ఞాపకం. మొదటి రకం జ్ఞాపకం మహఅయితే గతంతో ముడిపడివున్న స్థల కాలాదుల్ని దృశ్య రూపంలో స్ఫురింపజేస్తుంది. కానీ రెండో రకం జ్ఞాపకం మాత్రం గతాన్ని అనుభవించినప్పటి తీవ్రతతోనే స్ఫురింపజేస్తుంది. ఈ తరహా జ్ఞాపకాలు అసలు మనలో ఉన్నాయని కూడా మనకు తెలీదు. మనం కూర్చుని గుర్తు చేసుకుందామని ప్రయత్నిస్తే అవి గుర్తు రావు. గతంతో సంబంధం ఉన్న ఏదో వాసన సోకినపుడో, ఎప్పుటిదో ఒక రుచి మరలా నాలికపై తాకినపుడో, ఒకప్పుడు బాగా ఎరిగుండి తర్వాత మరచిపోయిన వైనమేదో దృశ్యంగా కనులకు తారసిల్లినపుడో... అప్పుడు ఆ జ్ఞాపకం ఒక మెరుపులా మన అంతరంగ గగనంపై వెలుగుతుంది. వర్తమానం మాయమైపోతుంది. కాలాల అవతల్నించి ఎవరో పిలిచినట్టు ఒక్క క్షణం అయోమయంలో పడతాం. గతం తాలూకు అసలైన సారం ఈ ‘ఇన్‌వాలంటరీ మెమొరీ’లోనే ఉంటుందంటాడు ప్రూస్ట్‌. మనిషి మానసిక ప్రవృత్తిలో ఎంతో ముఖ్యమైన ఈ అంశాన్ని ఎత్తిచూపింది ఎవరో సైకాలజిస్టు గాక, ఒక రచయిత కావటం ఆశ్చర్యం.

‘ఇన్‌ సెర్చ్‌ ఆఫ్‌ ఎ లాస్ట్‌ టైమ్‌’ (పోగొట్టుకున్న కాలాన్ని వెతుక్కొంటూ..) అనే ప్రూస్ట్‌ ప్రసిద్ధ నవలలో నేరేటర్‌ ఒక మధ్యాహ్నం టీ తాగుతూ, ‘మేడెలేన్‌’ అని ఫ్రెంచ్‌వారు పిలిచే ఒక రకం కేకు ముక్కని టీలో నంజుకుంటాడు. ఆ కేక్‌ రుచి నాలిక మీద తగలగానే బాల్యంలో అదే కేకును తన బంధువు ఒకావిడ ఇంట్లో తినటం గుర్తొస్తుంది. దాంతో పాటే బాల్యపు జ్ఞాపకాలు, అది వరకూ తనకు గుర్తులేనివి, ఒక ఉధృతిలాగా నేరేటర్‌ని ముంచెత్తుతాయి. అలా మొదలవుతుంది ఏడు సంపుటాల ఈ బృహత్‌ నవల. ‘‘గతాన్ని గుర్తు తెచ్చుకోవటమనేది ఒక వృథా ప్రయాస. అందుకోసమై మన బుద్ధి చేసే ప్రయత్నాలన్నీ ఎప్పుడూ విఫలమే అవుతాయి. మన గతం అంతా మన బుద్ధికి అందకుండా ఏదో బయటి వస్తువులో, ఆ వస్తువు మన గ్రహణేంద్రియాలకు ఇవ్వగల స్ఫురణలో దాగి వుంటుంది. ఆ వస్తువు మనకు తారసిల్లుతుందా లేక ఈలోగానే మనం చనిపోతామా అన్నది మన చేతుల్లో లేదు’’ అని అంటాడు నేరేటర్‌, ఈ మేడెలేన్‌ కేకు గురించి. ఇలా కాలాన్ని దాని అంతస్సారంతో సహా పట్టుకోగలిగే శక్తి మరలా ఒక్క కళకు (ముఖ్యంగా సాహిత్యానికి) మాత్రమే ఉన్నదన్నది ప్రూస్ట్‌ అభిప్రాయం.

మార్సెల్ ప్రూస్ట్‌ (Marcel Proust) ఫ్రాన్సులో సంపన్న కుటుంబంలో పుట్టాడు. డాక్టరైన తండ్రితో పెద్దగా అనుబంధం లేదు. తల్లికి మాత్రం చాలా చేరువ. చిన్నతనం నుంచీ ఉబ్బసం వ్యాధి వల్ల అర్భకంగా పెరిగాడు. హోమో సెక్సువల్‌ అని చాలామందికి అనుమానం. యవ్వనాన్నంతా ఆ రోజుల్లో సంపన్న కుటుంబాలు తరచు ఇచ్చి పుచ్చుకునే విందు వినోదాల్లో పాల్గొంటూ ఖర్చు చేసేసాడు. ఇరవై నాలుగేళ్ళ వయస్సులో ఎంతో ఆర్భాటంగా చాలా ఖర్చుతో మొదటి పుస్తకాన్ని ప్రచురించాడు. అయితే అది అతనికి పేరు తేలేదు. తర్వాత తనదైన కళా దృక్పథం ఏర్పరుచుకొనే ప్రయత్నంలో పదేళ్ళ కాలాన్ని చదవటానికీ, చిత్రకళని ఆస్వాదించటానికీ ఖర్చు చేసాడు. జాన్‌ రస్కిన్‌ కళా సిద్ధాంతాలు అతన్ని బాగా ప్రభావితం చేసాయి. ఇంటిపట్టున తల్లిదండ్రుల నీడలో జీవితం సాఫీగా సాగిపోతున్న సందర్భంలో 1903లో తండ్రి, 1905లో తల్లి చనిపోయారు. తల్లి చనిపోయిన విషాదం అతన్ని చాలా ఏళ్ళ పాటు పీడించింది. 1909లో ముప్ఫై ఎనిమిదేళ్ళ వయస్సులో తన ప్రసిద్ధ నవల ‘ఇన్‌ సెర్చ్‌...’ను మొదలుపెట్టాడు. 51 ఏళ్ళ వయస్సులో చనిపోయే వరకూ ఈ నవల రాస్తూనే వున్నాడు. 1913లో మొదటి సంపుటం ప్రచురితమైంది. ఈలోగా అతని ఆరోగ్యం కూడా క్షీణించసాగింది. నవల రాయకుండానే చనిపోతానేమోనన్న భయంతో చివరి మూడేళ్ళూ తనను తాను ఒక గదిలో బంధించుకున్నాడు. బయటి నుంచి శబ్దాలు వినిపించకుండా బెండు అమర్చిన గోడలతో కట్టిన గది అది. అన్నపానాదులు సమకూర్చి పెట్టడానికి ఒక హౌస్‌కీపర్‌. పగలంతా పడుకుని రాత్రుళ్ళు మేల్కొని తన నవల రాశాడు. మామూలుగా రచయితలు చిత్తుప్రతిని సాఫుచేస్తున్నప్పుడు అనవసరమనిపించి కొంత తీసేస్తారు. కానీ ప్రూస్ట్‌ మాత్రం అంతకంతకూ పెంచి రాసే వాడు. అలా పెంచిన వాక్యాల్ని వేరే కాగితాలపై రాసి వాటిని జత చేయాల్సిన చోట అంటించేవాడు. ఇలాంటి అంటింపులతో ఈ నవల ముద్రణలో మూడు వేల పేజీలకు పైగా చేరింది. నవల చివరి కొన్ని సంపుటాలు ఇంకా సరిదిద్దుతూనే చనిపోయాడు. ఇంతకీ ఈ నవల్లో కథ ఏమిటి? ఈ నవల రాయగల స్థాయికి ప్రూస్ట్‌ (నేరేటర్‌) చేరుకోవటమే నవల్లోని కథ. ఒక్కోసారి పేజీ కూడా దాటేసేంత పొడవుండే ప్రూస్ట్‌ శైలికి పాఠకుడు అలవాటు పడటం కష్టం కాని, అలవాటైతే ఇదే సాహిత్యం చేరగల అవధి ఏమోననిపిస్తుంది.

చాన్నాళ్ళ క్రితం ఒక వెబ్‌సైట్‌ ప్రూస్ట్‌ జీవితాన్ని రెండు మూడు వాక్యాల్లో కుదించి చెప్పమని ఒక పోటీలాగా పెట్టింది. అందులో ఒకరు ఇలా రాశారు: ‘‘జీవితమంతా విందు వినోదాల్లో వృథా చేసుకున్నాడు. చివర్లో వృథా అయిన రోజుల గురించి ఒక పెద్ద నవల రాసి జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు’’.

(ఆంధ్రజ్యోతి 'వివిధ'లో...)