July 9, 2018

మార్సెల్ ప్రూస్ట్ (1871-1922) పరిచయం: పోగొట్టుకున్న కాలాన్ని వెతుక్కొంటూ...

 పశ్చిమ దేశాల సాహిత్యంలో ఏ విమర్శకుడైనా జ్ఞాపకం (మెమొరీ) గురించి ఏదైనా మాట్లాడదల్చుకుంటే ఒక్కసారైనా ప్రూస్ట్‌ని తలచుకోవాల్సిందే. అలాగే జ్ఞాపకాల ఆధారంగా రాయదలచ్చుకున్న ఏ రచయితైనా ప్రూస్ట్‌ని అప్పటికే చదివుంటే ఆ ప్రభావంతో పెనుగులాడాల్సిందే. ప్రూస్ట్‌ జ్ఞాపకాన్ని ఇతివృత్తంగా తీసుకుని మొత్తం జీవితాన్నే మరలా పేజీ మీద ఆడించినంత పని చేసాడు. ఆ ఆటను బూతద్దంలో చూసినంత దగ్గరగా చూపించాడు. అయితే ప్రూస్ట్‌ ఉద్దేశంలో, తలచుకుంటే స్ఫురించే జ్ఞాపకాలకు పెద్ద విలువ లేదు. అలాగాక, ఏదో బయటి ప్రభావం వల్ల అనుకోకుండా మనలో పునర్జీవితమై గతాన్ని పూర్ణసారంతో సాక్షాత్కరింపజేసేదే విలువైన జ్ఞాపకం. దీన్ని ‘ఇన్‌వాలంటరీ మెమొరీ’ అన్నాడాయన. అంటే అప్రయత్నంగా తట్టే జ్ఞాపకం. మొదటి రకం జ్ఞాపకం మహఅయితే గతంతో ముడిపడివున్న స్థల కాలాదుల్ని దృశ్య రూపంలో స్ఫురింపజేస్తుంది. కానీ రెండో రకం జ్ఞాపకం మాత్రం గతాన్ని అనుభవించినప్పటి తీవ్రతతోనే స్ఫురింపజేస్తుంది. ఈ తరహా జ్ఞాపకాలు అసలు మనలో ఉన్నాయని కూడా మనకు తెలీదు. మనం కూర్చుని గుర్తు చేసుకుందామని ప్రయత్నిస్తే అవి గుర్తు రావు. గతంతో సంబంధం ఉన్న ఏదో వాసన సోకినపుడో, ఎప్పుటిదో ఒక రుచి మరలా నాలికపై తాకినపుడో, ఒకప్పుడు బాగా ఎరిగుండి తర్వాత మరచిపోయిన వైనమేదో దృశ్యంగా కనులకు తారసిల్లినపుడో... అప్పుడు ఆ జ్ఞాపకం ఒక మెరుపులా మన అంతరంగ గగనంపై వెలుగుతుంది. వర్తమానం మాయమైపోతుంది. కాలాల అవతల్నించి ఎవరో పిలిచినట్టు ఒక్క క్షణం అయోమయంలో పడతాం. గతం తాలూకు అసలైన సారం ఈ ‘ఇన్‌వాలంటరీ మెమొరీ’లోనే ఉంటుందంటాడు ప్రూస్ట్‌. మనిషి మానసిక ప్రవృత్తిలో ఎంతో ముఖ్యమైన ఈ అంశాన్ని ఎత్తిచూపింది ఎవరో సైకాలజిస్టు గాక, ఒక రచయిత కావటం ఆశ్చర్యం.

‘ఇన్‌ సెర్చ్‌ ఆఫ్‌ ఎ లాస్ట్‌ టైమ్‌’ (పోగొట్టుకున్న కాలాన్ని వెతుక్కొంటూ..) అనే ప్రూస్ట్‌ ప్రసిద్ధ నవలలో నేరేటర్‌ ఒక మధ్యాహ్నం టీ తాగుతూ, ‘మేడెలేన్‌’ అని ఫ్రెంచ్‌వారు పిలిచే ఒక రకం కేకు ముక్కని టీలో నంజుకుంటాడు. ఆ కేక్‌ రుచి నాలిక మీద తగలగానే బాల్యంలో అదే కేకును తన బంధువు ఒకావిడ ఇంట్లో తినటం గుర్తొస్తుంది. దాంతో పాటే బాల్యపు జ్ఞాపకాలు, అది వరకూ తనకు గుర్తులేనివి, ఒక ఉధృతిలాగా నేరేటర్‌ని ముంచెత్తుతాయి. అలా మొదలవుతుంది ఏడు సంపుటాల ఈ బృహత్‌ నవల. ‘‘గతాన్ని గుర్తు తెచ్చుకోవటమనేది ఒక వృథా ప్రయాస. అందుకోసమై మన బుద్ధి చేసే ప్రయత్నాలన్నీ ఎప్పుడూ విఫలమే అవుతాయి. మన గతం అంతా మన బుద్ధికి అందకుండా ఏదో బయటి వస్తువులో, ఆ వస్తువు మన గ్రహణేంద్రియాలకు ఇవ్వగల స్ఫురణలో దాగి వుంటుంది. ఆ వస్తువు మనకు తారసిల్లుతుందా లేక ఈలోగానే మనం చనిపోతామా అన్నది మన చేతుల్లో లేదు’’ అని అంటాడు నేరేటర్‌, ఈ మేడెలేన్‌ కేకు గురించి. ఇలా కాలాన్ని దాని అంతస్సారంతో సహా పట్టుకోగలిగే శక్తి మరలా ఒక్క కళకు (ముఖ్యంగా సాహిత్యానికి) మాత్రమే ఉన్నదన్నది ప్రూస్ట్‌ అభిప్రాయం.

మార్సెల్ ప్రూస్ట్‌ (Marcel Proust) ఫ్రాన్సులో సంపన్న కుటుంబంలో పుట్టాడు. డాక్టరైన తండ్రితో పెద్దగా అనుబంధం లేదు. తల్లికి మాత్రం చాలా చేరువ. చిన్నతనం నుంచీ ఉబ్బసం వ్యాధి వల్ల అర్భకంగా పెరిగాడు. హోమో సెక్సువల్‌ అని చాలామందికి అనుమానం. యవ్వనాన్నంతా ఆ రోజుల్లో సంపన్న కుటుంబాలు తరచు ఇచ్చి పుచ్చుకునే విందు వినోదాల్లో పాల్గొంటూ ఖర్చు చేసేసాడు. ఇరవై నాలుగేళ్ళ వయస్సులో ఎంతో ఆర్భాటంగా చాలా ఖర్చుతో మొదటి పుస్తకాన్ని ప్రచురించాడు. అయితే అది అతనికి పేరు తేలేదు. తర్వాత తనదైన కళా దృక్పథం ఏర్పరుచుకొనే ప్రయత్నంలో పదేళ్ళ కాలాన్ని చదవటానికీ, చిత్రకళని ఆస్వాదించటానికీ ఖర్చు చేసాడు. జాన్‌ రస్కిన్‌ కళా సిద్ధాంతాలు అతన్ని బాగా ప్రభావితం చేసాయి. ఇంటిపట్టున తల్లిదండ్రుల నీడలో జీవితం సాఫీగా సాగిపోతున్న సందర్భంలో 1903లో తండ్రి, 1905లో తల్లి చనిపోయారు. తల్లి చనిపోయిన విషాదం అతన్ని చాలా ఏళ్ళ పాటు పీడించింది. 1909లో ముప్ఫై ఎనిమిదేళ్ళ వయస్సులో తన ప్రసిద్ధ నవల ‘ఇన్‌ సెర్చ్‌...’ను మొదలుపెట్టాడు. 51 ఏళ్ళ వయస్సులో చనిపోయే వరకూ ఈ నవల రాస్తూనే వున్నాడు. 1913లో మొదటి సంపుటం ప్రచురితమైంది. ఈలోగా అతని ఆరోగ్యం కూడా క్షీణించసాగింది. నవల రాయకుండానే చనిపోతానేమోనన్న భయంతో చివరి మూడేళ్ళూ తనను తాను ఒక గదిలో బంధించుకున్నాడు. బయటి నుంచి శబ్దాలు వినిపించకుండా బెండు అమర్చిన గోడలతో కట్టిన గది అది. అన్నపానాదులు సమకూర్చి పెట్టడానికి ఒక హౌస్‌కీపర్‌. పగలంతా పడుకుని రాత్రుళ్ళు మేల్కొని తన నవల రాశాడు. మామూలుగా రచయితలు చిత్తుప్రతిని సాఫుచేస్తున్నప్పుడు అనవసరమనిపించి కొంత తీసేస్తారు. కానీ ప్రూస్ట్‌ మాత్రం అంతకంతకూ పెంచి రాసే వాడు. అలా పెంచిన వాక్యాల్ని వేరే కాగితాలపై రాసి వాటిని జత చేయాల్సిన చోట అంటించేవాడు. ఇలాంటి అంటింపులతో ఈ నవల ముద్రణలో మూడు వేల పేజీలకు పైగా చేరింది. నవల చివరి కొన్ని సంపుటాలు ఇంకా సరిదిద్దుతూనే చనిపోయాడు. ఇంతకీ ఈ నవల్లో కథ ఏమిటి? ఈ నవల రాయగల స్థాయికి ప్రూస్ట్‌ (నేరేటర్‌) చేరుకోవటమే నవల్లోని కథ. ఒక్కోసారి పేజీ కూడా దాటేసేంత పొడవుండే ప్రూస్ట్‌ శైలికి పాఠకుడు అలవాటు పడటం కష్టం కాని, అలవాటైతే ఇదే సాహిత్యం చేరగల అవధి ఏమోననిపిస్తుంది.

చాన్నాళ్ళ క్రితం ఒక వెబ్‌సైట్‌ ప్రూస్ట్‌ జీవితాన్ని రెండు మూడు వాక్యాల్లో కుదించి చెప్పమని ఒక పోటీలాగా పెట్టింది. అందులో ఒకరు ఇలా రాశారు: ‘‘జీవితమంతా విందు వినోదాల్లో వృథా చేసుకున్నాడు. చివర్లో వృథా అయిన రోజుల గురించి ఒక పెద్ద నవల రాసి జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు’’.

(ఆంధ్రజ్యోతి 'వివిధ'లో...)



0 comments:

మీ మాట...