July 30, 2018

హొర్హె లూయీ బోర్హెస్‌ (1899-1986) పరిచయం: ‘‘స్వర్గం ఒక లైబ్రరీలా ఉంటుందేమో అనుకుంటాను’’

కథలు రాయటానికి బోర్హెస్‌ జీవితానుభవంపై కన్నా, పఠనానుభవాలపై ఎక్కువ ఆధార పడ్డాడు. తత్త్వశాస్త్ర పఠనంలో తనను బాగా ఆకర్షించిన సమస్యలూ మీమాంసల ఆధారంగా ఆడిన ఆటలే ఆ కథలు చాలావరకూ. అలాని అవేం గంభీరంగా సాగవు. ఉదాహరణకి కొన్ని కథల థీమ్స్‌ ఇలా ఉంటాయి: మన జీవితాన్ని ఎవరో కలకంటున్నారని తెలిస్తే? నిజంగా అమరత్వం లభిస్తే? ఈ విశ్వం అవధిలేని షడ్భుజాకార గ్రంథాలయమైతే? దేవుని అసలు ప్రతినిధి క్రీస్తు గాక జుడాస్‌ అయితే? నామవాచకాల్ని నిరాకరించే ప్రపంచం ఎలా ఉంటుంది? అసలు దేన్నీ మరచిపోలేని మనిషి ఎలా ఉంటాడు? ఇలాంటి ఇతివృత్తాల్ని బోర్హెస్‌ క్రైమ్‌ థ్రిల్లర్లలోకీ, డిటెక్టివ్‌ కథల్లోకీ, నకిలీ పుస్తక సమీక్షల్లోకీ ఇమిడ్చి చెబుతాడు.

హొర్హె లూయీ బోర్హెస్‌ ((Jorge Luis Borges) అర్జెంటీనా రాజధాని బ్యునోస్‌ ఐర్స్‌లో పుట్టాడు. తండ్రి లాయరు, సైకాలజీ బోధించేవాడు. ఆయనకు రచయిత కావాలని ఉండేది. కొంత రాసాడు కానీ పేరు తెచ్చుకోలేకపోయాడు. తండ్రి వల్ల కానిది కొడుకు చేస్తాడన్నది ఆ కుటుంబంలో పైకి ఎవరూ అనకపోయినా అందరూ అంగీకరించిన విషయం. బోర్హెస్‌ ఏడేళ్ళ వయసులోనే ఆస్కార్‌ వైల్డ్‌ కథను అనువదించాడు. అంతకన్నా ముందే సాహిత్య పఠనం ప్రారంభించాడు. తండ్రి లైబ్రరీలో అడుగు పెట్టడమే తన జీవితాన్ని మలుపుతిప్పిన గొప్ప సంఘటన అంటాడు బోర్హెస్‌. నానమ్మ ఇంగ్లాండు మనిషి కావటంతో, ఆమె నుంచి తండ్రికీ, తండ్రి నుంచీ బోర్హెస్‌కీ ఇంగ్లీషు సహజంగా వచ్చేసింది. మాతృభాష స్పానిష్‌ పుస్తకాల కన్నా ముందే ఇంగ్లీషు పుస్తకాలను చదివాడు. తర్వాతెపుడో ప్రసిద్ధ స్పానిష్‌ నవల ‘డాన్‌ కిహోటే’ని చదువుతుంటే, అంతకుముందే చదివిన ఇంగ్లీషు వెర్షన్‌కి ఈ మూలం నాసిరకం అనువాదంలాగ తోచిందట.

బోర్హెస్‌ తాతల తరంలో సైన్యంలో కల్నల్స్‌గా పనిచేసి యుద్ధాల్లో చనిపోయినవారున్నారు. తను మాత్రం ఇలా పుస్తకాల పురుగులాగ మారటం పట్ల బోర్హెస్‌కు కించపడేవాడు. ప్రాణాలకు విలువివ్వని వీరోచితమైన మనుషులంటే ఆకర్షణ ఆయనకు జీవితాంతం ఉంది. తనకు ఆ ధైర్యం లేదన్నది యవ్వనంలో ఆయన్ను వేధించేది. బోర్హెస్‌కు 15ఏళ్ళ వయస్సులో తండ్రికి కంటిచూపుకు వైద్యం చేయించ టానికని కుటుంబం జెనీవాకు వెళ్ళింది. ఇక్కడే ఆడవాళ్ళపై బెరుకుపోగొట్టడానికి తండ్రి స్వయంగా బోర్హెస్‌ను వేశ్య దగ్గరకు పంపించాడు. బోర్హెస్‌కు స్త్రీలతో ప్రేమ సంబంధాలు తక్కువే. 68ఏళ్ళ వయస్సులో చేసుకున్న పెళ్ళి మూడేళ్ళే నిలిచింది.

జెనీవాలో చదువుకుంటూ బోర్హెస్‌ లాటిన్‌, జర్మన్‌, ఫ్రెంచ్‌ భాషలను నేర్చుకున్నాడు. 22ఏళ్ళ వయస్సులో తిరిగి బ్యునోస్‌ ఐర్స్‌ చేరుకున్నాడు. బాల్యంలో వదిలి వెళ్ళిన నగరాన్ని యవ్వనంలో తిరిగివచ్చి కొత్త కళ్ళతో చూసాడు. నగరం మీద రాసిన కవితలతో 1923లో తొలి పుస్తకం పబ్లిష్‌ చేసాడు. అది మొదలు మరో పదేళ్ళలో ఏడు పుస్తకాలు పబ్లిష్‌ చేశాడు (నాలుగు వ్యాస సంపుటులు, మూడు కవితా సంపుటులు). మిత్రులతో కలిసి చాలా సాహిత్య పత్రికల్ని నడిపాడు. ఈ కాలంలో రాసిన పుస్తకాలన్నింటినీ బోర్హెస్‌ తర్వాతి కాలంలో తిరస్కరించాడు. ఒక ఫోజులాగా కారణంలేని దిగులును మీద వేసుకుని హామ్లెట్‌నూ రస్కోల్నికోవ్‌నూ ఒక మూసలో పోసినట్టు ఉండే వాడిననీ, అదే తన కవిత్వంలోనూ ప్రతిబింబించేదనీ తర్వాత చెప్పుకున్నాడు.

తనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన కథల్ని ఆయన 35ఏళ్ళు దాటాక గానీ రాయలేదు. కథలు రాయగలడని ఆయనపై ఆయనకే నమ్మకం ఉండేది కాదు. అందుకని తొలి కథల్ని ఎక్కడా లేని మనుషుల ఆత్మకథల్లాగా, లేని పుస్తకాలకు సమీక్షల్లాగా రాసాడు. తనే ఎడిటర్‌గా పనిచేసే ఒక సాహిత్య పత్రికలో ప్రచురించేవాడు. కథలు రాయగలనని నమ్మకం కుదరటానికి ఆయనకు జరిగిన ఒక ప్రమాదం కారణమైంది. బోర్హెస్‌కు తండ్రిలాగే కంటిచూపు మొదట్నించీ సరిగా ఉండేది కాదు.

ఒకసారి మెట్లు దిగివస్తూ జారిపడ్డాడు. ఆ పడటంలో ఏదో గట్టిగా తలకు తగిలి స్పృహ కోల్పోయాడు. రెండు వారాల పాటు బతుకుతాడో లేదో తెలియని అపస్మారక స్థితిలో గడిపాడు. కోలుకున్నాక, తానిక రచన చేసే శక్తిని కోల్పోయాడని అనిపించింది. ఒకసారి ప్రయత్నం చేయాలను కున్నాడు. కానీ అప్పటిదాకా కవిత్వమే ప్రాణంగా బతికి ఇప్పుడు అది రాయలేనని తెలిస్తే భరించ లేననీ, అలవాటులేని ప్రక్రియలో రాస్తే విఫలమైనా అంత బాధ ఉండదనీ ఒక కథ రాసాడు. ఆ కథ ‘పియర్రె మేనార్డ్‌: ఆథర్‌ ఆఫ్‌ కిహోటే’ ఆయనకు బాగా పేరుతెచ్చింది. తర్వాతిక అంతూపొంతూలేని గ్రంథాలయాల్నీ, మన ప్రపంచంలోకి చొరబడే వేరే ప్రపంచాల్నీ, మొత్తం ప్రపంచాన్ని అన్ని స్థలాల్లోనూ అన్ని కాలాల్లోను ఒకేసారి చూపెట్టగలిగే వస్తువుల్నీ, ఎడతెగక సాగే పుస్తకాల్నీ, అనేక విశ్వాల్నీ ఊహిస్తూ కథలు రాయటం ప్రారంభించాడు. ఫిక్కినోస్‌ (1949), ఎల్‌ అలెఫ్‌ (1952) పుస్తకాలు ఇంగ్లీషులోకి అనువాదమై ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

1955లో బోర్హెస్‌ అర్జెంటినా జాతీయ లైబ్రరీకి డైరెక్టర్‌గా ఎంపికయ్యాడు. ‘‘నేను ఎప్పుడూ స్వర్గం ఒక లైబ్రరీలా ఉంటుందేమో అనుకుంటాను’’ అని చెప్పుకున్న బోర్హెస్‌కు ఇది చాలా చక్కగా అమిరే ఉద్యోగం. కానీ అప్పటికే ఆయన్ను అంధత్వపు చీకట్లు పూర్తిగా చుట్టుముట్టాయి. ‘‘దేవుడు నాకు పుస్తకాల్నీ రాత్రినీ ఒకేసారి ఇచ్చాడు’’ అని ఒక కవితలో రాసుకున్నాడు. ఈ అంధత్వం ఫలితంగా బోర్హెస్‌ వచన కవితల్ని పక్కనపెట్టి, ఛందోబద్ధమైన నిర్మాణాన్ని తీసుకున్నాడు. మనసులోనే అల్లగలిగే వీలు, ఆ అల్లికను జ్ఞాపకంలో దాచుకోగలిగే వీలు వచనం కన్నా పద్యానికే ఎక్కువ కాబట్టి, పద్యాలు ఎక్కువగా రాయటం మొదలుపెట్టాడు. అయితే కవిత్వం కన్నా బోర్హెస్‌కు ఆయన కథలే ఎక్కువ పేరు తెచ్చిపెట్టాయి. మనం వాస్తవంగా భావించి నిబ్బరంగా నడిచే మానవానుభవతలంపై మనల్ని బోల్తాకొట్టించే గుంతల్ని తవ్వుతాయి ఆ కథలు.

(ఆంధ్ర జ్యోతి వివిధలో)


0 comments:

మీ మాట...