September 10, 2018

యూరీ ఓలేషా (1899-1960) పరిచయం: పాత కొత్త ప్రపంచాల నడిమి నీడలో...

కమ్యూనిస్టు విధానంలో నడిచే సమాజంలోంచి సహజంగానే కొత్త గుణాలతో ఒక కొత్త మనిషి ఉద్భవిస్తాడని మార్క్సిజం ఊహించింది. కానీ కమ్యూనిస్టు రష్యాలో ఈ కొత్త మనిషికి బలవంతంగా మూస పోసే ప్రయత్నం జరిగింది. భౌతికవాద విలువలు మూర్తీభవించిన, మానవ సహజమైన బలహీనతలకు లొంగని, హేతుబద్ధ యంత్రం లాంటి ఈ మనిషి కమ్యూనిజం అమలుకు అత్యంత కీలకమని సోవియట్‌ పాలకులు భావించారు. వీడికి ‘కొత్త సోవియట్‌ మనిషి’ (న్యూ సోవియట్‌ మాన్‌) అని పేరు కూడా పెట్టారు.

పాలకుల బలవంతం మీద ఆ కాలపు సోవియెట్‌ రచయితలు కూడా తమ రచనల్లో ఈ కొత్త సోవియట్‌ మనిషిని ఆదర్శంగా చిత్రించే ప్రయత్నం చేశారు. అయితే యూరీ ఓలేషాకి మాత్రం ఈ మనిషిపై చాలా అనుమానాలున్నాయి. అలాగే కొత్త ప్రపంచం మైకంలో పడి అందరిలా విప్లవానికి ముందంతా చెడ్డదేనన్న తీర్మానానికి వచ్చేయలేదు. విప్లవానంతరం రష్యన్‌ మేధో సమాజం పాత ప్రపంచ విలువల్ని వెనకే వదిలేసి కొత్త విలువల్ని కాంక్షిస్తూ ముందుకు నడిచింది. ఓలేషా కూడా అందరితోపాటు నడిచాడు. అయితే పాత ప్రపంచంలో తనకు విలువైనవన్నీ కూడా వెంట తెచ్చుకోవాలనుకున్నాడు.

యూరీ ఓలేషా (Yury Olesha) పోలండ్‌లో ఒక బతికిచెడ్డ భూస్వామి కుటుంబంలో పుట్టాడు. అతనికి మూడేళ్ళ వయస్సుండగా కుటుంబం రష్యాలోని ఒడెస్సా పట్టణానికి వచ్చి స్థిరపడింది. ఓలేషా చదువంతా అక్కడే సాగింది. విప్లవం తర్వాత కుటుంబం పోలండుకు తిరిగి వెళ్ళిపోయింది. బోల్షెవిక్‌ ఆదర్శాలతో ప్రభావితుడైన ఓలేషా మాత్రం రష్యాలోనే ఉండిపోయాడు. 23 ఏళ్ళ వయస్సులో మాస్కో నగరానికి వచ్చి ఒక రైల్వే పత్రికలో జర్నలిస్ట్‌గా చేరాడు. ఆ పత్రికలో 'చిసెల్' (ఉలి) అన్న మారు పేరుతో వ్యంగ్య రచనలు చేసేవాడు. 28 ఏళ్ళప్పుడు తొలి నవల ‘ఎన్వీ’ రాశాడు. ఇందులో ఇతివృత్తం పాత కొత్త ప్రపంచాల మధ్య సంఘర్షణే. కథలో రెండు ప్రపంచాలకీ ప్రతినిధులనదగ్గ పాత్రలు ఉంటాయి. ఇవాన్‌ అనే పాత్ర ఇలా అంటాడు: ‘‘...కరుణ, సున్నితత్వం, గర్వం, ఈర్ష్య, ప్రేమ--ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పుడు ముగింపు కొస్తున్న శకంలో మానవాత్మను కమ్ముకొని ఉన్న భావావేశాలన్నింటినీ పూర్తిగా నిర్మూలించాలి. సోషలిస్టు శకం ఈ భావావేశాల్ని కొత్త మానసిక స్థితులతో భర్తీ చేస్తుంది’’. అక్కడితో ఆగడు,‘‘పాత ప్రపంచానికి పూర్తిగా తెరపడేలోగా, ఆ ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించే భావావేశాలన్నింటి తోనూ ఒక ఆఖరి ప్రదర్శన ఇప్పించాలనుకుంటున్నాను’’ అంటాడు.

ఓలేషా పాత, కొత్త ప్రపంచాల్లో ఒకటి గొప్పదనీ, ఒకటి తక్కువదనీ అలా ఏం అనుకోలేదు. రెంటినీ సమభావంతోనే చిత్రించాడు. అందుకే ‘ఎన్వీ’ నవల వచ్చినప్పుడు ఆయన దేన్ని సమర్థిస్తున్నాడో ఓ పట్టాన ఎవరికీ అర్థం కాలేదు. అది ఎవరు ఎలా చదివితే వారికి అలా అర్థమయ్యింది. విప్లవానికి ముందున్న ప్రపంచాన్ని వెక్కిరిస్తున్నాడనుకొని మొదట్లో కమ్యూనిస్టు విమర్శకులంతా నవలను ఆకాశానికెత్తేశారు. ఆ నవల కథానాయకుడు కవెల్రోవ్‌ ఒక తాగుబోతు. ఒక సమర్థుడైన సోవియెట్‌ అధికారి పట్ల ఈర్ష్యతో రగిలిపోతుంటాడు. ఈ ఈర్ష్యే నవల ప్రధాన ఇతివృత్తం. కథ చివర్లో కవెల్రోవ్‌ పూర్తిగా ఓడిపోయి మట్టిగొట్టుకు పోతాడు. దీంతో విమర్శకులంతా పాత ప్రపంచానికి ప్రతినిధి అయిన ఒక అసమర్థ పాత్రని నిరసించటమే ఓలేషా ఉద్దేశ్యమనుకొని పొగిడారు. అయితే కథ మొదటి భాగమంతా కవెల్రోవ్‌ చెప్పే కథనంలో అతని స్వాప్నికత, ప్రపంచాన్ని కవితాత్మకంగా స్వీకరించే తీరు వ్యక్త మవుతాయి. విమర్శకులు ఏమనుకున్నా, పాఠకులు మాత్రం ఈ తాగుబోతు పాత్రలోనే తమని తాము చూసుకోవటం మొదలుపెట్టారు. దీంతో విమర్శకులు నవలను మళ్ళీ తిరగదోడారు. ఈసారి విమర్శల పరంపర మొదలైంది. అయినా ఓలేషా తన పద్ధతిలోనే రాయాలని కొన్నాళ్ళు ప్రయత్నించాడు. ఆ ఉరవడిలోనే ‘ల్యోంపా’, ‘లవ్‌’, ‘ద చైన్‌’, ‘చెర్రీస్టోన్‌’ లాంటి మంచి కథలు వచ్చాయి. అయితే కమ్యూనిస్టు ఆదర్శాలకు సాగిలపడనందుకు అతని రచనల్ని ప్రచురించటం ఆపేశారు.

1934లో ‘సోవియట్‌ రచయితల సభలు’ జరిగాయి. సభల ఉద్దేశాన్ని పైకి ఏమని ప్రకటించినా, అసలు ఉద్దేశం మాత్రం రచయితలెలా రాయాలో వాళ్ళకి చెప్పటమే. రచయిత కథను వర్ణించేటప్పుడు తనలో ఇంకిన ప్రపంచాన్ని వ్యక్తం చేయాలనుకుంటాడు. కానీ సోవియట్‌ రాజ్యం తన రచయితల్నుంచి కోరిందల్లా ఇన్‌స్ట్రక్షన్‌ మాన్యువల్స్‌ని మాత్రమే. అందుకు తగ్గట్టు రాయనివాళ్ళని నిషేధించారు. హఠం వీడకపోతే హత్యలూ చేశారు. ఈ సభల్లో ఓలేషా కూడా సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చింది. తన ‘ఎన్వీ’ నవల వెనుక ఉద్దేశాన్ని వివరించాల్సి వచ్చింది. ఒక రకంగా తన మానాన తనని రాసుకోనివ్వమని బతిమాలుకున్నాడనే చెప్పాలి. ఉపన్యాసంలో ఒక చోట ఇలా అంటాడు: ‘‘ఆర్టిస్టుగా నాలోని స్వచ్ఛమైన చేవతో కవెల్రోవ్‌ పాత్రని సృష్టించాను. తొలి సృజన జోరులో, తొలి స్పందనల ప్రభావంతో ఈ నవల రాశాను. కానీ జనం కవెల్రోవ్‌ని వెకిలి, పనికిమాలిన పాత్ర అన్నారు. నాలోంచి ఎంతో తీసుకుని పుట్టిన కవెల్రోవ్‌ని ఇలా అనటంతో నన్నే నిందించినట్టు బాధ పడ్డాను. అమలినమైన కుతూహలం కలిగి, ప్రపంచాన్ని తనదైన తీరులో చూడగలిగిన మనిషి వెకిలివాడు, పనికిమాలినవాడు ఎలా అవుతాడు. నాలో నేనే ఇలా అనుకున్నాను: అంటే నీకు చెందినదంతా, నువ్వు నీ సామర్థ్యమని అనుకొనేదంతా వెకిలితనం, పనికిమాలినతనమూనా! నన్ను తిట్టిన నా కామ్రేడ్స్‌--కమ్యూనిస్టు సాహిత్య విమర్శకులు--నిజమే చెబుతున్నారని నమ్మాలనుకున్నాను. చివరకు నమ్మాను కూడా.’’

చూట్టూ చాలామంది రాస్తున్నట్టు రాయలేని తన నిస్సహాయతను కూడా వ్యక్తం చేసుకున్నాడు. ‘‘నేను ఒక కన్‌స్ట్రక్షన్‌ సైటుకు వెళ్ళి, అక్కడి శ్రామికుల మధ్య జీవిస్తూ వాళ్ళ గురించి ఒక వ్యాసమో, నవలో రాయగలనేమో--కానీ అది నా ఇతివృత్తం కాదు; నా రక్తంలో పారే ఇతివృత్తం కాదు, నా ఊపిరి కాదు. ఆ ఇతివృత్తాన్ని తీసుకుంటే నేను నిజమైన రచయితను కాను. అప్పుడిక ప్రేరణ నాపై పని చేయదు. ఒక కార్మికుణ్ణి, ఒక విప్లవ నాయకుడ్ని నేను పాత్రలుగా గ్రహించలేను’’ అన్నాడు. కానీ ఇకమీదట తాను రాయదల్చుకుంటే ఆ పని చేయక తప్పదని తెలుసు. అందరూ ఊదరగొడుతున్న ఈ కొత్త మానవుడ్ని ఇష్టం లేకున్నా వస్తువుగా తీసుకోక తప్పదని తెలుసు. కానీ రాయాలంటే వాడితో ఒక సయోధ్య కుదరాలిగా: ‘‘ఈ దేశంలో ఒక కొత్త తరం మనిషి, మొదటి సోవియట్‌ మనిషి, ఇప్పుడే ఆవిర్భవిస్తున్నాడు. నేను అతడివైపు ఆత్రంగా వెళ్ళి అడిగాను: ‘ఎవరు నువ్వు? ఏ రంగులు చూస్తావు? కలలు కంటావా? ఏమనుకుంటావు నీ గురించి? దేనికి ఆశపడతావు? ఎలా ప్రేమిస్తావు? దేన్ని ఒప్పుకుంటావు, దేన్ని కాదంటావు? నీలో హేతువు బలమైనదా, భావావేశమా? సున్నితత్వం నీకు తెలుసా? ఓ సోషలిస్టు సమాజ యువకుడా ఎలాంటి మనిషివి నువ్వు?’’’ అంటాడు.

ఈ సోవియట్‌ రచయితల సభల తర్వాతే రచయితగా ఓలేషా పతనం మొదలైంది. రాయాలనుకున్నది రాయలేడు. అలాగని రచయితై వుండీ రాయటం మానేస్తే ‘సామాజిక పరాన్నజీవి’గా ముద్రవేసి జైల్లో తోసే అవకాశముంది. దాంతో ఇక తప్పక సోవియెట్‌ ఆదర్శాల్ని బలవంతాన వొంట బట్టించుకొనే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో తనను తాను పోగొట్టు కున్నాడు. రచయితగా శక్తులన్నీ ఉచ్ఛ దశలో ఉన్నప్పుడు రాయాలనుకున్నది రాసే అవకాశం లేకపోయింది. ఈ నిరాశలో తాగుడికి లొంగిపోయాడు. నిస్సారమైన రాతలు రాశాడు. ఓలేషాకు యాభైఏళ్ళు దాటాక స్టాలిన్‌ చనిపోయాడు. అప్పుడు తాత్కాలికంగా రచయితలకు కొంత స్వేచ్ఛ దొరికింది. ఓలేషా పాత రచనల్ని పునర్ముద్రించారు. అప్పుడు కూడా ‘‘రచయిత ఈ రచనల్లో వ్యక్తం చేసిన అభిప్రాయాల్ని తర్వాత తప్పు అని ఒప్పుకున్నాడు’’ అన్న ముందుమాట చేర్చి మరీ ప్రచురించారు. ఓలేషా మరో ఆరేళ్ళు బతికి గుండెపోటుతో చనిపోయాడు. ఆఖరు రోజుల్లో రాసిన ‘నో డే వితవుట్‌ ఎ లైన్‌’ అనే ఒక పూర్తికాని స్మృతి రచనలో, ‘‘రచనా జీవితంలో నేను చేసింది ఒక రూపకాలంకారాల దుకాణాన్ని తెరవటం. కానీ ఆ ఖరీదైన, జటిలమైన రూపకాల్ని కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో ఆ దుకాణం మూసేసాను’’ అని రాసుకున్నాడు. ఎదిగేకొద్దీ మన చూపు ప్రపంచంపై కప్పే అలవాటనే పొరని తీసేయటం, దానిని తిరిగి బాల్య స్వచ్ఛతతో సర్ది చూపించటం ఓలేషా శైలిలో కనిపిస్తుంది.

రష్యన్‌ సాహిత్యంలో పుష్కిన్‌, గొగోల్‌లు ఇద్దరూ రెండు భిన్న సంప్రదాయాలకు ఆద్యులు. ఇంద్రియాలకు తోచే సమస్త ప్రకృతి మీద వాత్సల్యంతో దానిని కవితాత్మకంగా స్పృశించేది పుష్కిన్‌ పద్ధతి అయితే, తీవ్రంగా మెలిపడిన వ్యక్తిత్వంలోంచి ప్రకృతిని తనదైన వికృతిలోకి తర్జుమా చేసుకుని చూడటం గొగోల్‌ పద్ధతి. ఒకరి కలం వెలుపలికి చూస్తుంది, మరొకటి లోపలి లోతుల్ని తవ్వి తీస్తుంది. అటు పుష్కిన్‌ ఇటు గొగోల్‌, అటు టాల్‌స్టాయ్‌ ఇటు దాస్తోయెవ్‌స్కీ... ఇలా భిన్న ధృవాలను తమలో ఇముడ్చుకొని రాసిన అరుదైన రష్యన్‌ రచయితల్లో ఓలేషా ఒకడు. ఈ విషయంలో ఓలేషాకి సరిజోడు మరో రష్యన్‌ రచయిత వ్లాదిమిర్‌ నబొకొవ్‌. ఓలేషా, నబొకొవ్‌ ఇద్దరూ ఒక ఈడు వాళ్ళే. ఇద్దరిదీ ఒకటే చూపు, ఒకటే ప్రతిభ. నిజానికి, ఇద్దరూ ఒకే వయస్సులో రాసిన తొలి నవలల్ని చూస్తే, నబొకొవ్‌ కన్నా ఓలేషా ఎంతో పరిణతితో కనిపిస్తాడు. అయితే నబొకొవ్‌ కమ్యూనిస్టు రష్యా నుంచి బైటపడి బతికిపోయాడు. పూర్తి స్థాయిలో వికసించగలిగాడు. ఓలేషా అక్కడే ఉండి జీవచ్ఛవంగా మిగిలాడు. మొగ్గగానే తెగిపోయాడు. అతని తొలి నవల పరిమళం మాత్రమే అలా మిగిలి తారాడుతోంది.
(ఆంధ్ర జ్యోతి వివిధలో)


0 comments:

మీ మాట...