రష్యాలో 1890ల్లో జార్ చక్రవర్తులకు వ్యతిరేకంగా తిరుగు బాట్లు చెలరేగిన కాలానికీ, 1917లో రష్యన్ విప్లవం సఫలమై సోవియట్ రాజ్యం ఏర్పడిన కాలానికీ మధ్య- ఆ దేశ సాహిత్యం దాదాపు ఒక ముప్ఫయ్యేళ్ళ పాటు మరో ప్రభావానికి గురైంది. అదే సింబాలిజం.
అటు ప్రపంచమంతా హేతువు ప్రకారం నడుస్తుందని నమ్మే విప్లవకారులకూ, ఇటు ప్రపంచానికి అర్థమంతా బైబిలు పేజీల్లో దొరికేస్తుందని నమ్మే సంప్రదాయవాదులకూ మధ్య ఒక సంశయాత్మక తరంగా ఈ సింబాలిస్టులు పుట్టారు. వీరు సృష్టి రచనకు ఏ సులభమైన తాత్పర్యాన్ని ఒప్పుకోలేదు. ప్రపంచాన్ని అర్థంకాని మర్మాలతో, నిగూఢ సంకేతాలతో (సింబల్స్‌తో) నిండినదిగా చూశారు. రష్యన్ విమర్శకుడు మిర్‌స్కీ- సింబాలిజానికి సాహిత్యపరమైన మూలాల్ని ఫ్రెంచ్ కవి బాదిలేర్ కవిత నొకదానిలో చూడవచ్చని అంటాడు. ‘కరెస్పాండెన్సెస్’ అనే ఈ కవితలో మొదటి పంక్తులు ఇలా సాగుతాయి: ‘‘ఈ ప్రకృతి గుడిలో సజీవమైన స్తంభాలు/ ఉండుండి ఏదో గొణుగుతాయి/ మనిషి సంకేతాల అడవిలోంచి నడుస్తాడు/ అవన్నీ అతని వైపు ఎరిగున్నట్టు చూస్తాయి’’. సింబాలిస్టుల దృష్టిలో ప్రపంచం ఇలా నిగూఢ సంకేతాలతో కిక్కిరిసిన ఒక అడవి.
ఆంద్రె బెలీ (Andrei Bely) ఈ సింబాలిస్టుల తరానికి చెందినవాడే. బెలీ మొదట్లో ఎక్కువ కవిత్వం రాసాడు. సింబాలిస్టులందరిలాగే బెలీ కూడా సాహిత్యాన్ని సంగీతానికి చేరువ చేయాలనుకున్నాడు. ఆయన దృష్టిలో పదాలు కేవలం అర్థాన్ని సూచించే సంకేతాలు మాత్రమే కాదు. అవి తమ రూపం ద్వారా, శబ్దం ద్వారా కూడా భావ ప్రసారాన్ని చేయగలవు. పదాలకున్న అర్థ, రూప, శబ్దాల ఈ త్రిముఖ స్వరూపాన్ని పూర్తిగా వాడుకొనేందుకు బెలీ ప్రయత్నించాడు. మిగతా సింబాలిస్టులు ఈ ధోరణిని తమ కవిత్వానికే పరిమితం చేసుకోగా, బెలీ తన నవలల్లో కూడా ఇదే ధోరణిని అనుసరించాడు.
బెలీ ప్రసిద్ధ నవలలు ‘ద సిల్వర్ డోవ్’, ‘కోతిక్ లెతేవ్’, ‘పీటర్స్‌బర్గ్’ ఈ మూడూ రష్యన్ వచన సాహిత్యాన్ని చాలా ప్రభావితం చేసాయి. వీటిలో ‘పీటర్స్‌బర్గ్’ను బెలీ మాస్టర్‌పీస్‌గా చెబుతారు. 1905లో జరిగే ఈ కథలో జార్ చక్రవర్తుల కోసం పనిచేసే ఒక అధికారిని చంపటానికి అతని కొడుకు చేతికే బాంబ్ ఇస్తారు విప్లవకారులు. కథ పైకి రాజకీయంగా కనిపించినా, తండ్రిని చంపటానికి కొడుకు పడే మీమాంసే ఎక్కువ పేజీలుంటుంది. పీటర్స్‌బర్గ్ నగరం కూడా కథ అంతటా ఒక పాత్రలా పరచుకొని ఉంటుంది.
బెలీ బోల్షెవిక్ విప్లవాన్ని మనస్ఫూర్తిగా సమర్థించాడు. విప్లవం తర్వాత రష్యాలో ఒక తాత్త్విక, పారమార్థిక పునరుజ్జీవనం జరుగుతుందని ఆశించాడు. ఆ దిశగా ఉత్సాహంతో కొంత కాలం పనిచేసాడు కూడా. అయితే సోవియట్ సాహిత్యానికి బెలీ లాంటి రచయితల అవసరం లేకపోయింది. 1932లో సోవియెట్ ప్రభుత్వం- రచయితలు సమాజం గురించి వాస్తవిక (రియలిస్ట్) శైలిలో మాత్రమే రాయాలనీ, ఆ రచనలనే ఆమోదిస్తామనీ అధికారి కంగా ప్రకటించింది. అంటే అందరూ గోర్కీ ‘అమ్మ’ లాంటి నవలలే రాయాలి. కమ్యూనిస్టు విలువల్ని ఎత్తిచూపాలి. ఫ్యాక్టరీ గొట్టాల్నీ, శ్రామికుల చెమటనీ గొప్పగా చూపించాలి. హేతువుతో సరిపోల్చు కోదగ్గ వాస్తవిక శైలికి ఏమాత్రం దూరం జరిగినా ఆ రచనను బూర్జువా బడాయిగా తీసిపారేసేవారు. ఆ రచయితలకు ఆదరణ లేదు, వారి రచనలు ఎవరూ ప్రచురించరు. ఈ స్థితిని వ్యతిరేకించి రాసినవారిని చంపే శారు. మరికొందరు రాయలేనితనం భరించలేక బతికుండీ నిర్జీవులయ్యారు. బెలీ అదృష్టవశాత్తూ 1934లోనే చనిపో యినా, అతని రచనలు మాత్రం అప్రకటిత నిషేధానికి గురయ్యాయి. అతని రచనలే కాదు; వాటి మీద విమర్శలు గానీ, అతని మీద జీవిత చరిత్రలు గానీ రాయటానికి వీల్లేకుండాపోయింది. మరణం తర్వాత దాదాపు ముప్ఫయ్యేళ్ళ పాటు ఆయన పేరు అటు మాతృభూమిలోనూ, ఇటు బయటి ప్రపంచంలోనూ మరుగునపడిపోయింది.
1965లో ప్రముఖ రష్యన్ అమెరికన్ రచయిత వ్లదిమిర్ నబొకొవ్ ఒక అమెరికన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘‘నా దృష్టిలో ఇరవయ్యొవ శతాబ్దపు వచనంలో అద్భుతమైన మాస్టర్‌పీసెస్ ఇవి- జేమ్స్ జాయ్స్ ‘యులిసెస్’, కాఫ్కా ‘మెటమార్ఫసిస్’, బెలీ ‘పీటర్స్‌బర్గ్’, ఇంకా ప్రూస్ట్ ఫెయిరీటేల్ ‘ఇన్ సెర్చ్ ఆఫ్ ఎ లాస్ట్ టైమ్’లో మొదటి సగం’’ అన్నాడు. అప్పటికే నబొకొవ్‌కు కేవలం ‘లొలిటా’ నవలకు రచయితగానే కాక, తన మాతృభూమి రష్యాకు చెందిన సాహిత్యంపై నిశితమైన పరిశీలన కలవాడిగా గుర్తింపు ఉంది. ఆయనిక్కడ పేర్కొన్న పేర్లలో జాయ్స్, కాఫ్కా, ప్రూస్ట్‌లకు అప్పటికే ఆధునిక సాహిత్యంలో విలువైన స్థానం ఉంది. దాంతో వీళ్ళందరి మధ్యనా కొత్తగా ఈ బెలీ ఎవరా అని చాలామందికి కుతూహలం కలిగింది. ఫలితంగా ఆయన రచనల అనువాదాలు మొదలయ్యాయి. అయితే బెలీ బాషను వాడిన పద్ధతి ఆయన రచనల్ని అనువాదానికి లొంగనివిగా చేసింది. జేమ్స్ జాయ్స్ ‘యులిసెస్’ నవలను వేరే భాషలోకి అనువదిస్తే ఎంత సారం పోతుందో, బెలీ ‘పీటర్స్‌బర్గ్’ను ఇంగ్లీషులోకి అనువ దించినా అంతే పోతుంది. ఈ రెండు నవలలకు మధ్య భాషపరంగాను, శైలిపరంగాను, పాత్రలపరంగానూ చాలా పోలికలు ఉండటాన్ని విమర్శకులు గమనించారు (బెలీ పుస్తకం ‘యులిసెస్’ కన్నా తొమ్మిదేళ్ళ ముందే ప్రచురి తమైంది). ‘యులిసెస్’ను ఇంగ్లీషులో రాయటం వల్ల జాయ్స్ ఆధునిక సాహిత్యానికి ఆద్యుడుగా గుర్తింపు పొందాడు. అంతే గొప్ప పుస్తకాన్ని రష్యన్ భాషలో రాసి బెలీ ఇప్పటికీ ఎవరో కొద్దిమందికి తప్ప తెలియనివాడుగా మిగిలాడు.
(ఆంధ్ర జ్యోతి 'వివిధ'లో)

0 comments:
మీ మాట...