ఇంకా రాయని కథలు అనుకోగానే కొన్ని దృశ్యాలు గుర్తొస్తాయి. గౌతమీ ఎక్స్‌ప్రెస్ హైదరాబాదు నుంచి రాజమండ్రి వెళ్తూ తెల్లారగట్ల గోదావరి దాటుతున్నప్పుడు కిటికీల్లోంచి లోపలికి ఎండ పడుతుంది. కింద పడవల్లో పొద్దుటి నీడలు తెడ్లు తిప్పుతూ ఉంటాయి. గుడిసెలోంచి ఇంటామె బైటికి వచ్చి దాకతో నీళ్లు ఇసకలో కుమ్మరిస్తుంది. స్నాన ఘాట్లోంచి ఒక ముసలాయన మెట్లెక్కుతూ ఉంటాడు. రాజమండ్రి స్టేషనుకి ముందు పట్టాలు విడిపోతూ కలుస్తూ ఉంటాయి. సిటీలో కాలు నిలదొక్కుకోవటానికి తంటాలు పడుతూ, మధ్య మధ్యలో ఇలా ఊరెళ్లినప్పుడల్లా, లోపల్నించి ఊరే బెంగ ఆ పరిసరాలపై తాటి తాండ్ర కమ్మదనంలా పరుచుకునేది. ఆ జిల్లా మనుషుల మాటా కట్టూ వాసనల వెనకాల నేనెన్నటికీ చొరబడలేని కథలేవో తారాడి మాయమయ్యేవి. అరటి గెలలు వేలాడే బడ్డీ కొట్ల నీడల్లో ఒక ఆర్టోస్ తాగి ఆ బెంగని దిగమింగేయటం తప్ప చేసేదేం లేదు. నాకు ముఖాల్ని మాత్రం చూపించి భావాన్ని దాచి పెట్టుకునే కథలు. నేనింకో మనిషినైతే తప్ప చెప్పలేని కథలు. అనుభవాల కుండ కంచంలో బోర్లిస్తే ఏవో నాలుగైదు మెతుకులే రాలతాయి. మనుషుల్ని అక్షరాలతో ముసురుకోవాలనిపిస్తుంది. నేను ప్రేమించలేనివాళ్లెవ్వరూ కనపడరు. కానీ భాష మోసం చేస్తుంది. దగ్గర ఉన్నది ఎవరిచేతో ఎంగిలిపడినట్టు ఉంటుంది. కొత్తది తెచ్చుకోవటానికి శక్తి సరిపోదు. ఈ లోగా ఆ నేల కాలంలోనూ దూరమవుతుంది. నా ప్రేమంతా నాతోపాటు ఇక్కడ ముసలిదవుతుంది. ఆ తాటి చెట్ల వెనకాల పైకి లేచే సూర్య బింబం మాత్రం అంతే పసి వెచ్చదనంతో ఇవాళ కూడా అక్కడి గడ్డి మీద మంచు చుక్కల్ని కరిగిస్తుంది.