ఎవరో సాహితీ మిత్రుడు ఫోన్ చేసి చెబితే తెలిసింది రామారావుకి- పెద్దాయన చనిపోయాడని. తాను ఎప్పట్నుంచో కలుద్దామని ఎదురుచూస్తున్న మనిషి చనిపోయాడంటే రామారావుకి చాలా నిరాశగా అనిపించింది. వెంటనే ఇంకొంతమంది రచయితలకి ఫోన్ చేశాడు. ఓ నలుగురు కలిసి విశాఖపట్నం బయల్దేరదాం అనుకున్నారు. పొద్దున్న అక్కడికి టీవీ వాళ్ళు రావొచ్చు, కాబట్టి రామారావు తన పచ్చటి కాటన్ లాల్చీని బేగ్లో సర్దుకున్నాడు. ఆటో కట్టించుకుని, డిసెంబరు చలికి స్వెటర్లో కూడా వణుకుతూ, బస్టాండ్కి చేరాడు. మిత్రులందరూ అక్కడ కలిసి బస్సెక్కారు. మూడు గంటల తర్వాత సూర్యాపేటలో భోజనాలకని బస్సు ఆపు చేసినపుడు, నలుగురూ ఒక టేబిల్ దగ్గర కూర్చుని, టిఫిన్ చేస్తూ, పెద్దాయన గురించి మాట్లాడుకున్నారు. తక్కినవాళ్ళు ఆయనతో పరిచయాన్ని నెమరు వేసుకుంటుంటే, రామారావు ఆయన రచనల మీదకి మాటలు మళ్ళించాడు. ఇప్పటికైనా ఆయన రచనా సర్వస్వం ప్రచురిస్తే బాగుంటుందని అన్నాడు. మరో మిత్రుడు- అందులో కథలే కాదు; ఆయన డైరీలూ, ఉత్తరాలూ, ఇంకా ఏమున్నా అన్నీ పబ్లిష్ చేయాలన్నాడు. ఎవరి చేతన్నా మోనోగ్రాఫ్ లాంటిది రాయిస్తే ఎలా ఉంటుందీ అని మాట్లాడుకున్నారు. ఈ పుస్తకాలు వేయటానికి ఎవరి వంతు సాయం వాళ్ళు చేద్దాం అనుకున్నారు.
బస్ బయల్దేరాకా, రామారావు బేగ్ లోంచి శాలువా లాగి తల చుట్టూ కప్పుకున్నాడు. కిటికీ అద్దం దళసరిగా నీలంగా ఉండి బయట ఏమీ కనిపించటం లేదు. రామారావు పెద్దాయన గురించి ఆలోచించాడు. కలిసుంటే తనని ఏమని మెచ్చుకునేవాడో, ఏమని ఆశీర్వదించేవాడో ఊహించుకున్నాడు. రామారావుకి ఇది సాహిత్యంలో “సెకండ్ ఇన్నింగ్స్” అంటారు స్నేహితులు. అతను 80’ల చివర్లో పాతికేళ్ళ వయసులో ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాడు. చుట్టాల కంపెనీలో ఉద్యోగం చేస్తూ, స్టేట్ సెంట్రల్ లైబ్రరీకీ, చుట్టుపక్కల సాహిత్య సభలకీ వెళ్ళేవాడు. తెలుగు సాహిత్యంలో అప్పుడప్పుడే అస్తిత్వ వాదాలు మొదలయ్యాయి. రామారావు అంతకు పదేళ్ళ మునుపే గనక రాయటం మొదలుపెడితే విప్లవ కవిత్వం రాసేవాడేమో. తొంభైల్లో ధోరణి వేరు కనుక అస్తిత్వ వాదాల తరఫున కవిత్వం రాసాడు. ఐదేళ్లలో మూడు కవిత్వ పుస్తకాలు తీసుకొచ్చాడు. తర్వాత పెళ్లవటంతో జీవితం పెద్ద మలుపు తీసుకుంది. కొన్ని నెలలు పత్రికలో సబెడిటర్గా పనిచేశాడు. అక్కడ “సైద్ధాంతిక విబేధాల” వల్ల ఇన్ఛార్జితో గొడవపడి బయటికి వచ్చేసాడు. తర్వాత ఒక ప్రైవేటు కంపెనీలో సేల్స్ డిపార్టుమెంటులో చేరాడు. అక్కడ పని చేసిన నాలుగేళ్ళ కాలాన్ని రామారావు జీవితంలో అత్యంత గడ్డు కాలంగా ఇప్పటికీ గుర్తుంచుకుంటాడు. ఆ సేల్స్ టార్గెట్స్, ఆ ఎవాల్యుయేషన్ మీటింగ్స్…! కనాకష్టమైన జీతంతో, ఓవర్ టైం పని చేస్తేనే తప్ప రాలని కమీషన్లతో, పిల్లాడికి పాల డబ్బాలు కూడా కొనలేని దరిద్రంలో, ఎలాగో నెట్టుకొచ్చాడు. ఈ నాలుగేళ్ళలోనే రామారావుకి కవిత్వం అనేది లోకంలో ఎంత చిన్న విషయమో అర్థమైంది. ఇక దశాబ్దం ముగుస్తుందనగా, బీహెచ్ఇఎల్ లో పెద్ద ఉద్యోగం చేసే ఓ మావయ్య రామారావుని రియలెస్టేట్ వ్యాపారం వైపు మళ్ళించాడు. అప్పుడే సెల్ ఫోన్లు కొత్తగా వచ్చాయి. రామారావు నంబరు అతని సాహిత్య మిత్రుల ఫోన్లలో కన్నా, అతని వ్యాపార మిత్రుల ఫోన్లలోనే ఎక్కువసార్లు ఫీడయ్యింది. కొత్తల్లో తను వెళ్ళాల్సిన తోవ నుంచి పక్కకు వచ్చేసినట్టు అనిపించేది. ఉన్నచోట మనస్ఫూర్తిగా వేళ్ళూనుకోలేనితనం అతడ్ని రెండుగా విడదీసేది. లోపల్లోపల ఎప్పుడూ ఓ ఇద్దరికి పోట్లాట జరుగుతుండేది. పచ్చదనం చచ్చిన కొమ్మల మీంచి కవిత్వం ఎగిరిపోయింది. ఓ రకంగా ఊపిరి పీల్చుకున్నాడనే చెప్పాలి. వ్యాపారాన్ని వ్యాపారంలా చేయగలిగాడు. కాలం కూడా కలిసొచ్చింది. కుటుంబాన్ని ఓ స్థాయికి తీసుకువచ్చాడు, ఇల్లు కొన్నాడు. అప్పటికి జీవితంలో ఓ నిమ్మళం వచ్చింది. పదిహేనేళ్ళ తర్వాత రామారావు మళ్ళీ సాహితీ మిత్రుల నంబర్లు వెతుక్కున్నాడు. సాహిత్య పేజీల్లో ఈవెంట్స్ కాలమ్ ఫాలో అవుతూ తెలిసినవాళ్ళ పేర్లున్న సభలకి వెళ్ళటం మొదలుపెట్టాడు. మళ్ళీ రాయాలని కూడా ప్రయత్నించాడు. కానీ ఎగిరెళ్ళిన పిట్ట ఎక్కడో తప్పిపోయింది. అప్పుడే రామారావుకి ఒకటనిపించింది: భవిష్యత్తులో తెలుగులో కథని వేలుపట్టుకుని నడిపించే మనుషులకి తీవ్రమైన కొరత ఏర్పడబోతోందని; తెలుగులో ఇప్పుడు రాసేవాళ్ళకంటే, దారీతెన్నూ చూపించాల్సిన వాళ్ళ అవసరం ఎక్కువ ఉందని. అప్పట్నించి రామారావు సాహిత్య విమర్శ వైపు మళ్ళాడు.
అప్పటికి పెద్దాయన ఎనభయ్యేళ్ళ వయసులో కూడా చాలా పని చేస్తున్నాడు. పెద్దాయన్ని సాహిత్య లోకంలో ఎవరూ పేరు పెట్టి పిలవరు. పెద్దాయన అంటే అర్థమైపోతుంది. చిన్నప్పుడు ఇంట్లో పిలిచే పేరుతో ఆయన ‘పెద్దోడు చెప్పిన కథలు’ అని యాభయ్యేళ్ళ క్రితం రాసాడు. తర్వాత వయస్సూ, ప్రసిద్ధి పెరిగేకొద్దీ తెలుగు సాహిత్య ప్రపంచానికి కూడా పెద్దాయనైపోయాడు. కథా సంకలనాలకి సంపాదకత్వం వహించటం, పెట్టుబడులు పుట్టించి పుస్తకాలు వేయించటం, కథల మీద సెమినార్లనీ వర్క్షాపులనీ ముందుండి నడిపించటం… ఇలా ఒకటని కాదు, తెలుగులో కథా ప్రక్రియ కోసం ఎంత పాటుపడాలో అంతా పడుతున్నాడు. ఆయన పాతికేళ్ళ క్రితం కథలు రాయటం మానేసాకా, కథలు ఎలా రాయాలో చెబుతూ రాసిన ‘కథా దీపిక’ పుస్తకం కొత్త కథకులకన్నా, వాళ్ళని అంచనా కట్టడానికి కొత్త విమర్శకులకి బాగా పనికొచ్చింది. రామారావు కూడా రెండేళ్ళ క్రితం ఆ పుస్తకాన్ని బట్టీపట్టినంత పని చేశాడు. అప్పటికే పిల్లలు సెటిలయ్యారు. భార్య బేంకు ఉద్యోగంలో ప్రమోషన్ సంపాయించి ఇల్లుగడవటానికి సరిపడా సంపాయిస్తోంది. ఇక రామారావు రిటైర్మెంట్కు వచ్చేసినట్టు ఫీలయ్యాడు. చేతి నిండా బోలెడంత సమయం. ఇంట్లో ఒక కేలండర్లో మహా కథకుల జయంతులూ, వర్ధంతుల తారీకులన్నీ పెన్నుతో టిక్ చేసిపెట్టుకున్నాడు. ఎవరి జయంతి, వర్ధంతి దగ్గరపడినా ఒక వ్యాసం రాసి సాహిత్య పేజీలకి పంపేవాడు. కథా సంపుటులు, సంకలనాలు ఏం విడుదలైనా ప్రోత్సహిస్తూ సమీక్షలు రాసేవాడు. కొన్నాళ్ళకి ఎక్కడ చూసినా రామారావే కనపడటం మొదలుపెట్టాడు. అలాగే పెద్దాయన దృష్టిలో కూడా పడ్డాడు. తన గురించి ఏదో మంచి మాట అన్నాడని వేరేవాళ్ల ద్వారా తెలియగానే, ఆయన కథల మీద “కథలుగా ఘనీభవించిన సామాజిక చలనాలు” అని ఒక విశ్లేషణాత్మక వ్యాసం రాసేసాడు. ఖచ్చితంగా పెద్దాయన అలవాటు ప్రకారం ఆయన్నుంచి అభినందిస్తూ ఫోన్ వస్తుందని అనుకున్నాడు. కానీ రాలేదు. ఆ తర్వాత కొన్ని వారాలకే పెద్దాయన స్వయంగా తెలుగులో సాహిత్య విమర్శపై ఒక వ్యాసం రాసాడు. ఆ వ్యాసంలో తెలుగులో విమర్శ చనిపోయిందన్న మాట ఒక అపనింద మాత్రమేనని నిరూపించే ప్రయత్నం చేశాడు. రామారావుకి ఏ వ్యాసంలోనైనా అన్ని అక్షరాల గుంపుల మధ్యా తన పేరును చప్పున గుర్తుపట్టగలిగే ప్రతిభ ఎప్పట్నుంచో ఉంది. తన ప్రస్తావన వచ్చే అవకాశం ఉన్న వ్యాసాన్ని ఒకసారి పై నుంచి కిందకి చూస్తూ, అచ్చులో రెండు “రా” అక్షరాలు దగ్గర దగ్గరగా ఎక్కడ రిపీటైనా పసిగట్టేయగలడు. పెద్దాయన వ్యాసాన్ని కూడా అలాగే వెతుక్కున్నాడు. మొదటిసారి వెతికినపుడు పేరు కనపడలేదు. రెండు మూడు సార్లు వెతికినా దొరకలేదు. ఇక మొత్తం చదవక తప్పింది కాదు. వ్యాసంలో ఎక్కడా రామారావు పేరు లేదు. ఒక చోట మాత్రం, తెలుగులో కొందరు మంచి విమర్శకుల పేర్లు వరుసగా వచ్చిన తర్వాత, “వీరే కాదు, సాహిత్యంలో వైయక్తిక ధోరణుల్ని ఓ కంట కనిపెడుతూ, ప్రతి రచననూ దాని సామాజిక స్థలకాలిక నెలవులో నిలబెట్టే బాధ్యతని గురుతరంగా నిర్వరిస్తున్న కొత్త తరం విమర్శకులు ఇంకెందరో ఉన్నారు” అని ఒక వాక్యం ఉంది. రామారావు ఆ వాక్యాన్ని సంతృప్తిగా రెండు మూడుసార్లు చదువుకున్నాడు. పెద్దాయన ఎంతో ఆత్మీయంగా రహస్యంగా తన భుజం తట్టినట్టు అనిపించింది. ఇవాళ కాకపోతే ఏదో ఒక రోజు పెద్దాయన్నుంచి అచ్చులో ప్రశంస అందుకునే తీరతాననీ, “నా సాహితీ వారసుడు రామారావే” అని ఆయన చేతే చెప్పిస్తాననీ అప్పుడు గట్టిగా అనుకున్నాడు. ఇక ఆ అవకాశం లేదు. రామారావుకి దిగులుగా అనిపించింది. బస్సు అద్దం అవతల అలుక్కుపోయిన వీధి దీపాలతో ఏదో ఊరు వెనక్కి జారుతోంది. అయినా మించిపోయిందేం లేదు, అనుకున్నాడు రామారావు. ఇపుడు పెద్దాయన మీద తను ఎలాగూ ఒక నివాళి వ్యాసం రాస్తాడు. “కథ ఇక అనాథ” లాంటి శీర్షికతో, ఆ వ్యాసం ఒట్టి నివాళి వ్యాసంలా మాత్రమే మిగిలిపోదు. తెలుగు కథకు పెద్దాయన చేసిన దోహదాన్ని రామారావు ఆ వ్యాసంలో ఏ స్థాయిలో నిరూపిస్తాడంటే, అంత చేసిన పెద్దాయన లేకుండా పోయాకా ఆ లోటు భర్తీ చేసేదెవరూ అన్న ప్రశ్న చదివేవాళ్ళకు కచ్చితంగా వస్తుంది, వెంటనే వాళ్ళకి రామారావు పేరే తట్టి తీరాలి. రామారావుకి ఈ నివాళి వ్యాసం ఆలోచన ఇప్పుడు పెద్దాయన పోయాకా వచ్చింది కాదు; ఆయన బతికున్నప్పుడు కూడా రామారావు మనసు లోతుల్లో అతనికే తెలియకుండా ఈ ఆలోచన దాగున్నది. ఒక్కోసారి ఉన్నట్టుండి మనసులోకి వాక్యాలు కూడా తన్నుకొచ్చేవి. వాటిని ఎక్కడైనా రాసి పెట్టుకుంటే మంచిదని కూడా అనిపించేది. ఉండబట్టలేక ఆ వ్యాసానికి సన్నాహం లాంటి ఒక వ్యాసాన్ని పెద్దాయన ఎనభై రెండో పుట్టిన రోజున ఆయన అభిమానులు సహస్ర చంద్ర దర్శనం వేడుక జరిపినప్పుడు రాసాడు. పెద్దాయన పుస్తకం ‘కథా దీపిక’పై పునఃసమీక్షణం అనే నెపం మీద రాసిన ఆ వ్యాసం “పెద్దాయన పాఠాల్ని పాటిస్తున్నామా?” అన్న పేరు మీద ఒక సాహిత్య పేజీలో అచ్చయింది. అది అచ్చయిన నెలకే ఇపుడు పెద్దాయన చనిపోవటంతో ఆయన్ని ఆఖరుసారి అచ్చులో తలచుకున్నది రామారావే అయ్యాడు. ఇది స్ఫురించగానే రామారావుకి సంతోషం కలిగింది. బస్సు కుదుపుల జోలకి ఆగాగి పట్టిన కునుకుల మధ్య ఒక కల కూడా వచ్చింది– పెద్దాయన్నుంచి ఎప్పుడూ రాని ఫోన్ వచ్చినట్టు. ఆ సమయంలో రామారావు ట్రాఫిక్ మధ్యన బండి మీద వెళ్తున్నాడు. బండి రోడ్డు పక్కకు తీసి ఫోన్ ఎత్తి “సార్, సార్” అంటున్నాడు. పెద్దాయన ఏదో పొగడ్తగా మాట్లాడుతున్నాడు. ట్రాఫిక్ శబ్దాలకి కొన్ని మాటలు రామారావు చెవిని చేరటం లేదు. ఫోన్ను చెవికేసి బాగా నొక్కుకుంటున్నాడు. పైగా ఫుట్పాత్ మీద ఒక బొద్దింక రామారావు చెప్పుల్లో దూరాలని ప్రయత్నిస్తోంది. దాన్నించి తప్పించుకుంటూ కలయదిరుగుతున్నాడు. “సార్, సార్” అంటున్నాడు. ఆ పొగడ్తలకి కలలో వొళ్ళంతా తేలికైపోయింది. పెద్దాయన కాసేపు మాట్లాడటం ఆపి, తర్వాత స్పష్టంగా గట్టిగా ఒకటే మాటన్నాడు, “నిన్ను ఒకసారి చూడాలనుందయ్యా, ఈ వాక్యాలు రాసే మనిషిని” అని. రామారావు “సార్!” అని గట్టిగా అరిచాడు. బస్సు దేన్నో ఓవర్ టేక్ చేస్తూ మోగించిన హార్న్ చెవుల్లో చొరబడి మెలకువొచ్చింది. కాసేపు పల్లానికి వేగంగా జారుతున్న పడవలో ఉన్నట్టనిపించింది. హైదరాబాద్ ఫుట్పాత్ మీంచి ఈ చీకటి బస్సులోకి తేరుకోవటానికి కొన్ని క్షణాలు పట్టింది. జీవితంలో అత్యంత మధురమైన ఘట్టం కొన్ని క్షణాల మునుపే జరిగినట్టు అనిపించింది. దాని తాలూకు జాడలేవీ వాస్తవంలో మిగలకపోయినా మనసు మాత్రం తీయదనంతో నిండిపోయింది.
బస్సు ఎన్నడూ వినని పేర్లతో ఉన్న బస్టాండుల్లో ఆగుతోంది. ఎవరూ ఎక్కటం లేదు దిగటం లేదు. ఊళ్ళన్నీ ముణగదీసుకుని పడుకున్న ఈ చలివేళలో బస్టాండుల్లో మాత్రం టీ స్టాళ్ళల్లోంచీ, టిఫిన్ హోటళ్ళలోంచీ వేడి వేడి పొగలు వస్తున్నాయి. రామారావుకి పెద్దాయన్ను బతికుండగా కలవలేదన్న దిగులు నెమ్మదిగా పోయింది. తన జీవితంలో అసలైన అధ్యాయం ఇప్పుడే మొదలవబోతోందని అనిపించింది. తాను అనామకంగా చచ్చిపోడు. తొంభైల కవిత్వంపై వచ్చిన సిద్ధాంత గ్రంథాల్లోని ఫుట్ నోట్సుల్లో ఉండే కవుల పేర్ల జాబితాలో రెండు కామాల మధ్య మాత్రమే తన పేరు మిగిలిపోదు. తెలుగు కథ తనని గుర్తుంచుకుంటుంది, స్మరించుకుంటుంది, చనిపోయాకా తన పేరు మీద కథా పురస్కారాలు ఇస్తారు, తన జయంతికో వర్ధంతికో ఏదో ఒక మూల నుంచి అప్పుడే రెక్కలు విదుల్చుకుంటున్న విమర్శకుడెవరో తనని కృతజ్ఞతగా స్మరించుకుంటూ, తన విమర్శనా సంప్రదాయాన్ని ఉగ్గడిస్తూ నివాళి వ్యాసం రాస్తాడు. జయంత్యుత్సవాలు కూడా జరగచ్చేమో ఎవరు చెప్పొచ్చారు. కానీ అంతకుముందు చేయాల్సిన పని ఎంతో ఉంది. తన కార్యక్షేత్రాన్ని ఆలస్యంగానైనా ఇప్పుడే గుర్తించాడు. పాత కథలు చదవాలి. కొత్త కథలు కూడా చదవాలి. ప్రాచ్య పాశ్చాత్య విమర్శనా సిద్ధాంతాల్ని అధ్యయనం చేయాలి. వాటిని అన్వయించాలి. కొత్త కథకుల్ని వెలికి తీయాలి. ఫోన్ చేసి అభినందించాలి. ప్రోత్సహిస్తూ వ్యాసాలు రాయాలి. రామారావుకి వొళ్ళు జలదరించింది. తన జీవితపు మొదటి భాగంలాగా ఈ రెండో భాగాన్ని అయిపు తైపూ తెలీకుండా చేజారిపోనీయడు. ముందు వీలు చిక్కగానే పెద్దాయన నివాళి వ్యాసం మీద పని చేయాలి. రామారావు మనసులో వాక్యాల తర్వాత వాక్యాలు వచ్చి పడుతున్నాయి. ఇక మిగిలిన ప్రయాణమంతా మెలకువగానే గడిపాడు.
మరుసటి రోజు పొద్దున్న వైజాగ్ బస్టాండులో దిగినాక కూడా రామారావులో ఉత్సాహం అలాగే ఉంది. తెలిమంచు వెనకాల నుంచి లీలగా కనిపిస్తున్న వైజాగ్ కొండలూ, వాటి అవతల కనపడకపోయినా భావంగా తెలుస్తున్న సముద్రమూ రామారావు మనసుని ఆహ్లాదంగా పరిగెత్తిస్తున్నాయి. అందరూ బస్టాండు పక్కనే ఉన్న లాడ్జిలో దిగి, స్నానాలవీ కానిచ్చి, ఆటో కట్టించుకుని పెద్దాయన ఇంటికి వెళ్ళారు. ఇంటి ముందు ఫ్రీజర్ బాక్సులో ఉంచిన పెద్దాయన శరీరాన్నీ, టెంటు నీడలో మసలుతోన్న మనుషుల ముఖాల్లో గాంభీర్యాన్నీ చూసాకా గానీ రామారావు మనసు వర్తమాన కాలగతిలోకి నెమ్మదించలేదు. చాన్నాళ్ళ తర్వాత కలిసిన మిత్రులు కూడా జబ్బచరిచి కావలించుకోవటాలవీ లేకుండా పొడి నవ్వులతో పలకరించుకున్నారు. రామారావు టీవీ వాళ్ళ కోసం చుట్టూ చూసాడు. వచ్చి వెళిపోయారా, ఇంకా రాలేదా? ఈ ప్రశ్న ఎబ్బెట్టుగా అనిపించకుండా ఎవరినైనా ఎలా అడగాలో ఆలోచించాడు. ఫ్రీజర్ బాక్సును చుట్టి నడుస్తున్న వరుసలో చేరి నిల్చొన్నాడు. వరసకు ఒక పక్కన ఏడిచి ఏడిచి అలిసిపోయిన ముఖాలు కొన్ని కనిపించాయి. ఒకావిడ వారగా స్తంభానికి ఆనుకుని, నిద్రకాచిన కళ్ళతో, పెద్దాయన ముఖం కేసి చూస్తూ కూడా ఎటో చూస్తున్నట్టుంది– ఆవిడ పెద్దాయన భార్య అని ఊహించాడు. పెద్దాయన తొలి కథల్లో ‘మల్లెల అలక’ అన్న కథ గుర్తొచ్చింది. ఆ కథలో భర్త నెలవారీ పద్దు వేసుకుంటూ అందులో మల్లెపూల ఖర్చుని కూడా చేర్చటం చూసి భార్య అలుగుతుంది. అందులో భార్య పాత్ర వర్ణనని ఈ ముసలామె ముఖంలో వెతుక్కున్నాడు రామారావు. ఆమె పక్కన కూతుళ్ళూ, మనవలూ కూర్చున్నారు. పెద్దాయన ముఖం ఫొటోల్లో కనిపించిన దేన్నో పోగొట్టుకుని బోసిగా అనిపించింది. రామారావు ఆయనకు నమస్కరిస్తూ, ‘మీ పరంపర కొనసాగుతుంది’ అని మనసులో పట్టుదలగా మాటిస్తూ, ముందుకు కదిలాడు. హాలు గుమ్మం దగ్గర అతని వెంట వచ్చిన మిత్రులు ఎవరో ఒకతనితో మాట్లాడుతున్నారు. రామారావు ఆ గుంపు దగ్గరకు వెళ్ళాడు. మాటల్ని బట్టి అతను పెద్దాయన అల్లుడని తెలిసింది. బయట ఉన్నవాళ్ళలా ఏడ్చేంత బాధలేక అతిథి మర్యాదల బాధ్యతని తీసుకున్నాడు. లోపలికి రమ్మంటున్నాడు. రామారావు అందరితోనూ కలిసి లోపలికి నడిచాడు. హాల్లో నేలంతా పూల రేకలు రాలి ఉన్నాయి. ముగ్గురు నడివయసు మగాళ్ళు సోఫాలో పక్క పక్కన కూర్చుని కూడా ముందుకు వంగి ఎవరికీ వినపడకుండా మాట్లాడుతున్నారు. పిల్లలు ఆ వాతావరణాన్ని లెక్క చేయకుండా అల్లరిగా పరిగెడుతున్నారు. రామారావూ, అతని మిత్రులూ గడపదాటి గుమ్మం వారన నిలబడ్డారు. అల్లుడు పని మనిషిని వెంటబెట్టుకొని వచ్చి టీలు ఇప్పించాడు. ఎదుట గోడ మీద ఇద్దరు భార్యాభర్తల బస్ట్ సైజ్ బ్లాక్ అండ్ వైట్ ఫొటోని చూపిస్తూ ఒక మిత్రుడు, “పెద్దాయన వయసులో చూడు ఆ మీసకట్టూ అదీ…” అంటున్నాడు. అందరూ ఫొటో వైపు చూసారు. ఫొటోలో ఉన్నావిడ మీదకు దృష్టి మళ్ళింది. “అత్తయ్య చనిపోయాకనే ఆయనకి సగం ప్రాణం పోయిందండీ” అంటున్నాడు అల్లుడు. ఇక రామారావు “మరి బయటున్న ఆవిడెవరు” అని అడిగి అభాసుపాలయ్యే సాహసం చేయలేదు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈ అల్లుడికి సాహిత్యం గురించి ఏం తెలీదు. రిటైరయ్యాకా హాబీగా చేసిన పనికి ముసలాయనకి ఇంత పేరొచ్చిందా అని ఆశ్చర్యపడుతున్నట్టు ఉన్నాడు. రామారావు మిత్రుల్లో ఒకరు జర్నలిస్ట్ అని తెలిసి జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. రామారావు ఆ మాటల్లోకి వెళ్ళలేదు. ఓరగా తెరిచి ఉన్న ఒక గదిలోంచి పుస్తకాల అల్మరా కనిపిస్తోంది. మెల్లగా ఇల్లు చూస్తున్నట్టు అటు ఇటూ నడిచి, ఆ గది వైపు వెళ్ళాడు.
తలుపు తీసుకుని లోపలికి వెళ్తే పవిత్రమైన గర్భగుడిలోకి అడుగుపెట్టినట్టుంది రామారావుకి. గోడల నిండా అల్మరాల్లో పుస్తకాలు సర్ది ఉన్నాయి. కిటికీ వెలుగు పడే మూల పెద్ద టేకు టేబిల్ ఉంది. మాయలో పడినవాడిలా అటువైపు నడిచాడు. బల్ల మీద పుస్తకాలు ఒద్దికగా పేర్చి ఉన్నాయి. పెన్నుల స్టాండు చుట్టూ అట్టా, కాయితాలూ, ఇంకా ఏదో స్టేషనరీ చక్కగా సర్ది ఉంది. కుర్చీ వీపుకు వేలాడుతూ ఊతకర్ర, టేబిల్ మీద కళ్ళజోడు కనిపించాయి. ఇందాక పెద్దాయన ముఖం బోసిగా ఎందుకు అనిపించిందో ఇప్పుడర్థమైంది. పేర్చిన పుస్తకాల పైనున్న పుస్తకం డైరీలాగా అనిపించింది. రామారావుకి ఆత్రం ఆగలేదు. ఒకసారి తలుపు వైపు చూసాడు. బయట ఇంకా ఏవో మాటలు వినపడుతున్నాయి. చేయి చాపి డైరీ అందుకున్నాడు. తిప్పి చూస్తే అందులో ఏవో కొన్ని పద్దులున్నాయంతే. మధ్యలో ఒక తెల్లకాయితం మడతపెట్టి కనిపించింది. మడత విప్పి చూసాడు. అది ఇంకా పోస్టు చేయని ఉత్తరం. ఒక రచయిత్రి పేరుకు “తల్లీ” అని చేర్చి సంబోధిస్తూ ఉంది. “వసంతాన్ని కోయిలలు ఆహ్వానించినట్టు, శిశిరాన్ని మా ముసలాళ్ల కీళ్ళు ఆహ్వానిస్తాయి సలుపులతో” అన్న వాక్యంతో ఉత్తరం మొదలయ్యింది. రామారావు నవ్వుకుని, ఉత్తరం ఓ సారి పైనుంచి కిందకి చూస్తున్నాడు. చప్పున తన పేరు కనిపించింది. నమ్మకం కలగక మరోసారి చూసుకున్నాడు. ఇంటి పేరుతో సహా తన పేరేనని ఖాయం కాగానే వొళ్ళు జలదరించింది. మళ్ళీ ఒకసారి తలుపు వైపు చూసి, కాస్త జలదరింపు తగ్గేలా ఊపిరి గట్టిగా వదిలి, ఆ వాక్యం మొదట్నుంచీ చదివాడు: “…రామారావు రాసిన ఆ పనికిమాలిన వ్యాసం చదివి నేను సంతోషించానా అని అడుగుతున్నావా? సంతోషం మాట పక్కన పెట్టు. ఎందుకీ వెధవ నేను చనిపోకుండానే నాకు పిండాలు పెడుతున్నాడు అనిపించింది. పైగా పుట్టిన రోజు నాడు! మా తరం వాళ్ళందరం ఏదైనా అచ్చుకి ఇచ్చే ముందు పది విషయాలు పది రకాలుగా ఆలోచించేవాళ్ళం. ఇప్పటివాళ్ళకి అదేం లేకుండా పోయింది. వాడో దొంగ సరుకు. తెలుగు సాహిత్యానికి ఈ పరాన్నజీవుల బాధ ఎప్పుడు తప్పుతుందో. కానీ నాకున్న సమయం తక్కువరా, ఇలాంటి వాటి గురించి బాధపడేందుకు.”
రామారావుకి మోకాళ్ళలో బలం తరుక్కుపోయినట్టు అనిపించింది. మళ్ళీ చదవబోతే అక్షరాలను మసకబారుస్తూ కన్నీళ్ళు ఉబికాయి. ఇప్పటిదాకా లేని ప్రయాణ అలసట బరువుగా తల మీదకు దిగినట్టయింది. తలుపు దగ్గరికి నడిచి, అది గాలికి కదిలివుంటుందని బయటివాళ్ళు అనుకునేంత నెమ్మదిగా మూసి, బోల్టు వేశాడు. మళ్ళీ టేబిల్ దగ్గరకు వచ్చాడు. భవిష్యత్తు మీద కల్పించుకున్న ఆశ అంతా ఒక్కసారిగా మాయమైంది. జీవితం మీద కాసేపటి క్రితం వరకూ ఉన్న రుచి పోయింది. కుర్చీలో కూర్చుని టేబిల్ మీద ఆ ఉత్తరం పెట్టి మళ్ళీ చదివాడు. ఉత్తరంలో మిగిలిన భాగం అంతా వేరే విషయాలున్నాయి. మళ్ళీ మళ్ళీ తన మీద రాసిన వాక్యాలే చదువుకున్నాడు. “వాడో దొంగ సరుకు… వాడో దొంగ సరుకు…”! రామారావుకు పూర్తిగా ఓడిపోయి మట్టికొట్టుకుపోవటం ఎలా ఉంటుందో అలవాటు తప్పిపోయి చాలా ఏళ్ళయింది. ఆ భావం పగతీర్చుకున్నట్టు మళ్ళీ మీద పడింది. కిటికీ లోంచి బయటకు చూస్తూండిపోయాడు. కాసేపటికి కళ్ళు తుడుచుకుంటుంటే నిన్న రాత్రి మిత్రుడన్న మాటలు గుర్తొచ్చాయి: పెద్దాయన కథల్నే కాదు; ఆయన ఉత్తరాలనూ, డైరీలనూ కూడా పబ్లిష్ చేయాలన్న మాటలు. ఒకవేళ ఈ ఉత్తరం పబ్లిష్ చేసినా తన ప్రస్తావన ఎలాగూ తీసేస్తారు. ఐతేమాత్రం నోటి మాటగా ఎంతో కొంతమందికి తెలిసిపోదూ? మంచి తెలియటానికి టైం పడుతుంది కానీ, చెడు వరదలా పాకిపోతుంది. ఒకవేళ ఉత్తరం తనంటే గిట్టని వాళ్ళ చేతుల్లో పడి యథాతథంగా పబ్లిష్ అయిపోతే? “పెద్దాయన ముసలాడైపోయాడు కదా, చివరిదశలో విచక్షణ కోల్పోయి ఏదో రాసుంటాడులే” అనెవరైనా అనుకుంటారా? లేదు, ఎవరూ అలా అనుకోరు. ఇది తన జీవితం మీద, తను సాధించాలనుకుంటున్న భవిష్యత్తు మీద విషపు నీడలా పడుతుంది. పైగా తను ఎవరి మాటల్ని భగవాన్ ఉవాచల్లా ఉదహరిస్తూ ఎన్నో వ్యాసాలు రాసాడో, ఎవరిని ఆకాశానికెత్తుతూ కనీసం రెండు పూర్తి వ్యాసాలు రాసుంటాడో ఆయనే తనని “దొంగ సరుకు” అని తేల్చేసినపుడు ఇక తన ఏ మాటకైనా ఏం విలువ ఉంటుంది. ప్రతీ అణా కానీ డొక్కు సున్నాగాడూ ఆ మాటని పట్టుకుని తన మీదకు ఎక్కుపెడతాడు. “ముసలినాకొడుకు!” రామారావు తెలిసీ తెలియనట్టు ఉత్తరాన్ని కసిగా నలిపేస్తూ గొణుక్కున్నాడు. టేబిల్ మీద మడతపెట్టిన కళ్ళజోడు వైపు చూసాడు. ఆ కళ్ళద్దాల వెనక పెద్దాయన కళ్ళు కనిపించి మాయమైనట్టు అనిపించింది. రామారావులో నాగరిక సభ్యత కొంతసేపు ఎదురు తిరిగింది. ఇలా పరాయివాళ్ళ ఉత్తరాన్ని, అదీ ఒక చనిపోయిన మనిషి ఆఖరిసారి రాసుకున్న ఉత్తరాన్ని, పైగా చేరాల్సిన వాళ్ళకి చేరితే వాళ్ళు ఎంతో విలువగా దాచుకునే వాక్యాలున్న ఉత్తరాన్ని- చింపేయటం సభ్యతేనా అనుకున్నాడు. మళ్ళీ ఉండ విప్పి టేబిల్ మీద సాపు చేశాడు. మళ్ళీ చూపు తన మీద రాసిన వాక్యాలపైకే పోయింది. ఈ ఉత్తరం చింపితే లోపల్లోపల తప్పుచేసానని తొలిచే బాధ కన్నా, ఇది బయటపడితే తనకు బయటి నుంచి కలిగే బాధే ఎక్కువ అనిపించింది. ఉత్తరాన్ని వీలైనన్ని చిన్నచిన్న ముక్కలుగా చింపి జేబులో కుక్కుకున్నాడు.
కాసేపు అలాగే కూర్చున్నాడు. ఇదేగాక, ఇంకెవరికైనా ఉత్తరాల్లో తన గురించి చెడుగా రాసి ఉంటాడా? ఇంకెవరి ముందైనా తన గురించి చెడ్డగా మాట్లాడి వుంటాడా? అవి ఎప్పుడైనా బయటపడితే పెద్దాయనపై తాను ఇన్నాళ్ళు వెల్లడించుకున్న ప్రేమాభిమానాలు ఎంత ఎడ్డి యవ్వారంగా కనపడతాయి! “ఆయన పారించిన అక్షర ప్రవాహాలు తెలుగు కథా మాగాణాన్ని ఎల్లకాలమూ పచ్చగా ఉంచుతాయి” లాంటి వాక్యాలతో పెద్దాయన పుట్టిన రోజుకి తను రాసిన వ్యాసం గుర్తుకుతెచ్చుకుంటే రామారావుకి తన చెవి తనే మెలేసుకుని మొట్టికాయ వేసుకోవాలనిపించింది. ఎంత పిచ్చిగా, అమాయకంగా, భోళాగా ప్రేమనీ అభిమానాన్నీ వ్యక్తం చేసుకున్నాడు. మనుషులిలా ఉంటారని తనకేం తెలుసు. ప్రేమకి ద్వేషం బదులొస్తే ఏం చేయగలం. రేపు రాయబోయే నివాళి వ్యాసం ఇంత అమాయకంగా రాయకూడదు. నివాళి వ్యాసమైనంత మాత్రాన ఊరికే డప్పు కొడుతూ రాయాలని ఏముంది. పెద్దాయన పేరుకి తానో మార్క్సిస్టు రచయితనని చెప్పుకునేవాడే కానీ, ఆయనకి మార్క్సిజం పైన పెద్ద అవగాహన లేదు. కథల్లో కూడా అందరూ బాగుండాలనే, అణచివేతల్ని ఎదిరించాలనే ఉట్టి అభ్యుదయానికే ఆయన మార్క్సిస్టు పదజాలంతో ముసుగు తొడిగేవాడు. ఒక ఇంటర్వ్యూలో వాస్తు కలిసిరాక ఇల్లు మారానని నోరు జారి మార్క్సిస్టు మేధావుల చేత మెత్తగా చీవాట్లు తిన్నాడు. నివాళి వ్యాసమైనంత మాత్రాన ఈ వైరుధ్యాలను ప్రస్తావించకూడదని ఏముంది. ఇలాంటివి రాస్తే కొంతమందికి కోపం రావొచ్చు. కానీ ఇంకెన్నాళ్ళు నంగి నంగి మాటలు! నిజాలు దాయటాలు! రామారావుకి నివాళి వ్యాసంపై ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. మళ్ళీ ఇదివరకటి ఉత్తేజం మనసును ఆవహించింది. జేబులో కాగితం పీలికల స్పర్శను సుఖంగా అనుభవిస్తూ, గది బయటకు వచ్చి తలుపు వేసాడు.
Published in : vaakili.com, June 2017 issue.
Art work by Chary PS