“నిజమే, నేను అసూయపడతాను. కానీ మీరనుకుంటున్న విషయాల గురించి కాదు. నేను అతని పరిస్థితుల్ని చూసి అసూయపడతాను. ముఖ్యంగా ఇప్పుడు... ఇలా కంగారు కంగారుగా రాయాల్సి రావటం ఎంత బాధో నాకే తెలుసు... దేవుడా! జీవితమంతా నాది ఇదే పరిస్థితి. ఈ మధ్య నా ‘ఇడియట్’ నవలను చాన్నాళ్ళ తర్వాత చదివాను; దాన్ని పూర్తిగా మర్చిపోవటం వల్ల అదో కొత్త నవల అన్నట్టే చదివాను... ఎన్నో అధ్యాయాలు అద్భుతంగా, ఎంతో మంచి సన్నివేశాలతో ఉన్నాయి. కాని వాటితోపాటే సగంసగం పూర్తయినవీ, హడావిడిగా రాసేసినవీ కొన్ని కనిపించాయి. ఎప్పుడూ నాది ఇదే పరిస్థితి—ఇప్పుడు కూడా. పత్రికల వాళ్ళు తొందరపెడుతుంటారు... తీసుకున్న అడ్వాన్సుల కోసం రాయక తప్పదు... తర్వాత మళ్ళీ అడ్వాన్సులు అవసరమవుతాయి... ఇక దీనికి అంతు లేదు! టాల్‌స్టాయి అలాక్కాదు, అతనికి డబ్బుకి లోటు లేదు, మర్నాటి కోసం తడుముకోవాల్సిన అవసరం లేదు, కాబట్టి రాసినవాటికి ఎంతైనా మెరుగులు దిద్దుకోవచ్చు”.దాస్తోయెవ్‌స్కీ ఇలా బాధపడ్డాడే గానీ, కాలం మాత్రం కీర్తిని ఇద్దరికీ చెరిసమానంగానే పంచింది. అప్పులు ఎగ్గొట్టినందుకు రేపో మాపో జైలుకిపోయి, రాస్తున్నదాన్ని అర్ధాంతరంగా ఆపేయాల్సొస్తుందేమో అన్నంత ఒత్తిడిలోనే రాసినా- ‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’ లాంటి ఆయన నవలలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. టాల్‌స్టాయితో సమానంగా దాస్తోయెవ్‌స్కీకి కూడా తరాలుదాటి అభిమానులు వచ్చిచేరుతూనే వున్నారు. ఒకడు పాఠకుడిగా టాల్‌స్టాయిని ఇష్టపడుతున్నాడా, లేక దాస్తోయెవ్‌స్కీనా అన్నదాన్ని బట్టి వాడెలాంటి మనిషో చెప్పొచ్చునని రష్యాలో అనుకునేవారట.
‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’ రాస్తున్నప్పుడు, 1865లో, దాస్తోయెవ్‌స్కీ ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది. ఏడాది క్రితమే, ఏడేళ్ళు కలిసి బతికిన భార్య మరీయ అనారోగ్యంతో చనిపోయింది. అదే సంవత్సరం అన్నయ్య మిఖైల్ కూడా చనిపోయాడు. అన్నయ్య తీర్చాల్సిన అప్పుల భారం దాస్తోయెవ్‌స్కీ మీద పడింది. మరోపక్క అన్నయ్య కుటుంబాన్నీ, భార్య మరీయ మొదటి వివాహపు సంతానాన్నీ కూడా దాస్తోయెవ్‌స్కీనే సాకాల్సి వచ్చింది. అప్పటిదాకా సంపాదనా మార్గంగా ఉన్న, అన్నయ్య నడిపిన, ‘టైమ్’ పత్రికని జార్ చక్రవర్తి ప్రభుత్వం నిషేధించింది. దాని స్థానంలో తెచ్చిన ‘ఎపోక్’ పత్రిక సరిగా నడవటం లేదు. ఇక దాస్తోయెవ్‌స్కీ రాస్తే వచ్చే సంపాదనే అందరికీ ఆధారం. ఇలాంటి పరిస్థితిలో- ఉన్నపళాన ఆరొందల రూబుళ్ళు అప్పులవాళ్లకి చెల్లించకపోతే జైల్లో పెడతామని పోలీసు నోటీసు వచ్చింది. ఎవర్ని సాయమడగాలా అని వెతుకుతున్న దాస్తోయెవ్‌స్కీకి ఒక దుర్మార్గుడైన పబ్లిషర్ స్టెల్లోవ్‌స్కీ దొరికాడు. దాస్తోయెవ్‌స్కీ దీనస్థితిని స్టెల్లోవ్‌స్కీ తన లాభానికి వాడుకోవాలనుకున్నాడు. ఒక ఒప్పందానికి సరేనంటే మూడు వేల రూబుళ్ళు ఇస్తానన్నాడు. దాని ప్రకారం 1) దాస్తోయెవ్‌స్కీ అప్పటిదాకా రాసిన రచనలన్నీ రాయల్టీ ఏమీ ఇవ్వకుండా స్టెల్లోవ్‌స్కీ ఒక ఎడిషన్ అచ్చేసుకుంటాడు. (‘పూర్ ఫోక్’, ‘ఇన్సల్టెడ్ అండ్ ఇంజూర్డ్’, ‘ద డబుల్’, ‘హౌస్ ఆఫ్ ద డెడ్’, ‘నోట్స్ ఫ్రం అండర్‌గ్రౌండ్’... ఇవన్నీ). 2) ఆ మరుసటి సంవత్సరం నవంబరు 1వ తారీకులోగా ఒక కొత్త నవల రాసి ఇవ్వకపోతే, ఆ తర్వాత దాస్తోయెవ్‌స్కీ ఇక ఏం రాసినా తొమ్మిదేళ్ళ పాటు ఒక్క పైసా కూడా ఇవ్వనక్కర్లేకుండా స్టెల్లోవ్‌స్కీ అచ్చేసుకోవచ్చు. ఈ క్రూరమైన ఒప్పందానికి ఒప్పుకోక తప్పలేదు దాస్తోయెవ్‌స్కీకి. సరేనని మూడువేల రూబుళ్ళు తీసుకున్నాడు. పీటర్సుబెర్గులోనే ఉంటే అప్పులాళ్ళ గొడవతోనూ, కుటుంబ భారంతోనూ ఏమీ రాయలేనని అర్థమై, విదేశాలు వెళ్ళిపోవాలనుకున్నాడు. స్టెల్లోవ్‌స్కీ దగ్గర తీసుకున్న మూడువేల రూబుళ్ళలో- అప్పులాళ్ళని తాత్కాలికంగా సముదాయించటానికి కొంతా, చనిపోయిన అన్నయ్య కుటుంబానికి కొంతా, చనిపోయిన భార్య కొడుకుకి కొంతా ఇచ్చి, 75 రూబుళ్ళు మిగిలితే వాటితో జర్మనీ వచ్చాడు.
తీరా జర్మనీ వచ్చాక, తన జూద వ్యసనానికి లొంగిపోయి, ఐదురోజుల్లోనే Roulette అన్న జూదంలో ఉన్నదంతా, చేతి వాచీతో సహా, పోగొట్టుకున్నాడు. అప్పట్లో విదేశాల్లోనే వున్న తోటి రచయిత తుర్గెనెవ్‌ని సిగ్గువిడిచి అప్పు అడిగి తీసుకున్నాడు. పారిస్‌లో వున్న ప్రియురాలు పొలినా సుస్లోవాను కూడా సాయం చేయమని అడిగాడు. ఆమె తన దగ్గరే డబ్బుల్లేని స్థితిలో, స్నేహితుల్ని అడిగి, పారిస్ నుంచి స్వయంగా జర్మనీ వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళింది. ఈ సుస్లోవా నే దాస్తోయెవ్‌స్కీ నవలల్లో తరచు కనిపించే “Infernal Women” పాత్రలకి మూలమని అంటారు. అంటే చపలచిత్తంతో భర్తలకి/ప్రియులకి నరకం చూపించే స్త్రీలు. చేరువయినట్టే అయి, అంతలోనే దూరం జరిగి, వేరే మగాళ్ళతో ప్రేమలు కొనసాగిస్తూ, దాస్తోయెవ్‌స్కీకి నరకం చూపించేది సుస్లోవా. ఒకపక్క ఈమెతోనూ, ఇంకోపక్క జూదం వ్యసనంతోనూ యాతన పడుతూనే దాస్తోయెవ్‌స్కీ ‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’ నవలని రాయటం ప్రారంభించాడు. సుస్లోవా డబ్బులు ఇచ్చి తిరిగి పారిస్ వెళ్ళాక ఆమెకు దాస్తోయెవ్‌స్కీ రాసిన ఉత్తరం చూస్తే- ఈ నవల రాసే సమయానికి ఆయన జర్మన్ హోటళ్ళలో ఎలాంటి దుర్భర పరిస్థితుల మధ్య ఉన్నాడో అర్థమవుతుంది:
“ప్రియమైన పోల్య, అసలు నువ్వు పారిస్ దాకా ఎలా వెళ్ళగలిగావో నాకు అర్థం కావటం లేదు. ఈ అసహ్యమైన స్థితితో నేను పడుతున్న బాధకి నీ పట్ల బాధ కూడా తోడైంది. హోటల్ ఖర్చు, బగ్గీల ఖర్చు, ప్రయాణం ఖర్చు... ఒకవేళ నీ దగ్గర రైలు టికెట్టుకు సరిపడా డబ్బులున్నాయనుకున్నా- ఏం తినకుండా ఆకలితో వెళ్ళుంటావు. ఇదంతా నా తలలో తిరుగుతూ నా మనసుకి విశ్రాంతినివ్వటం లేదు. ఇంకోపక్క ఇక్కడ నా పరిస్థితి నమ్మలేనంత నీచానికి దిగజారింది. నువ్వు వెళ్ళిన మరుసటి రోజే ఈ హోటల్ వాళ్ళు నాకు భోజనం, టీ కాఫీలతో సహా ఆపేశారు. నేను అడగటానికి వెళ్తే అక్కడ ఒక లావాటి జర్మన్ ఓనరు- నేను భోజనానికి ‘అర్హుణ్ణి’ కాదనీ, టీ మాత్రం పంపగలననీ చెప్పాడు. కాబట్టి నిన్నటి నుంచి ఏమీ తినలేదు, టీ మాత్రం తాగుతున్నాను... అదికూడా వాళ్ళు ఏ సమోవర్ లేకుండా చేసే చెత్త టీ. వాళ్ళు నా బట్టలు, బూట్లూ శుభ్రం చేయటం మానేశారు, పిలిచినా పలకరు, ఇక్కడి స్టాఫ్ అంతా జర్మన్‌లకు మాత్రమే సాధ్యమయ్యే ద్వేషంతో నన్ను ట్రీట్ చేస్తున్నారు. డబ్బులేకపోవటం, చెప్పిన టైముకి డబ్బు ఇవ్వకపోవటం కంటే జర్మన్ల దృష్టిలో మరేదీ పెద్ద నేరం కాదనుకుంటాను. ఇదంతా నవ్వు తెప్పిస్తోంది, మరోపక్క చాలా చిరాకూ తెప్పిస్తోంది.”రెండు రోజుల తర్వాత మరో ఉత్తరంలో ఇలా రాశాడు:
“నా పరిస్థితి ఏం బాగుపడలేదు. ...ఇంకా భోజనం లేదు, పొద్దుటా సాయంత్రమూ టీలతో సరిపుచ్చుకుని ఇది మూడో రోజు—చిత్రం: అసలు తినాలన్న యావ కూడా చచ్చిపోయింది. అన్నింటికంటే ఘోరం—వీళ్ళు నన్ను చుట్టుముడుతున్నారు, ఒక్కోసారి సాయంత్రానికి కొవ్వొత్తి కూడా ఇవ్వటం లేదు, ముఖ్యంగా ముందు రోజు కొవ్వొత్తి ఏమన్నా మిగిలి వుంటే, అదెంత చిన్నది మిగిలినా సరే, కొత్త కొవ్వొత్తి ఇవ్వటం లేదు. నేను మాత్రం రోజూ మూడింటికి హోటల్ విడిచి వెళ్ళి మళ్ళీ ఆరింటికి తిరిగి వస్తున్నాను, ఎందుకంటావా, వీళ్ళు పెట్టకపోయినా నేను బయట భోజనం తింటున్నానన్న భ్రమ వీళ్ళకి కల్పించటానికి. నాకు క్లెస్తాకోవ్ గుర్తొస్తున్నాడు!” (క్లెస్తాకోవ్: ‘ఇనస్పెక్టర్ జనరల్’ నాటకంలో గొగోల్ పాత్ర).ఇలాంటి పరిస్థితుల్లో ఒక పత్రికా సంపాదకుడిని సాయం అడగటానికి సిద్ధపడ్డాడు. ఇదే పత్రికా సంపాదకుడికి వ్యతిరేకంగా అన్నయ్యా తనూ కలిసి నడిపిన ‘టైమ్’ పత్రికలో వ్యాసాలు రాసాడు, కొన్ని వ్యాసాల్లో వెక్కిరించాడు కూడా. అయినా ఇప్పుడు ఇంకెవర్ని అడగాలో తెలియక, అతనికే ఇలా ‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’ నవల తీసుకొమ్మనీ, అడ్వాన్సుగా మూడొందల రూబుళ్ళు అర్జెంటుగా ఇప్పించమనీ రష్యాకి ఉత్తరం రాశాడు. 1865 సెప్టెంబరులో రాసిన ఈ ఉత్తరంలోనే తొలిసారి ‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’ ప్రస్తావన కనిపిస్తుంది. ఆ ఉత్తరంలో తన నవల ఇతివృత్తాన్ని ఇలా చెబుతాడు:
“ఇది ఒక నేరం తాలూకు సైకలాజికల్ రిపోర్టు... ఒక కుర్రాడు, అతడ్ని యూనివర్సిటీ నుంచి వెళ్ళగొట్టేశారు... కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు... అలాంటివాడు ఒక విపరీతమైన, ‘అసంపూర్ణమైన’, గాలివాటు భావజాలంతో ప్రభావితుడై... ఒకేఒక్క దెబ్బతో పేదరికం నుంచి బయటపడాలనుకుంటాడు. ఒక ముసలామెని చంపాలనుకుంటాడు... వడ్డీలకి అప్పులిచ్చే ఆ ముసలామె తిక్కది, రోగిష్టిది, ఆశపోతు, ఒక యూదులాగా ఎక్కువ వడ్డీ గుంజుతుంది, మహచెడ్డది, జీవితాలు నాశనం చేసే మనిషి... ‘ఎందుకూ పనికిరాని ఈ మనిషి ఎందుకు బతకాలి?’... ఇలాంటి ప్రశ్నలు ఆ కుర్రాడి మనసులో దూరుతాయి. ఈ ముసలామెని చంపేయాలని నిర్ణయించుకుంటాడు, అలా చేసి దోచుకున్న డబ్బుతో ఊరిలో వున్న తల్లి కష్టం తీర్చొచ్చు, చెల్లెల్ని కాపాడొచ్చు,... తన చదువు పూర్తి చేసుకోవచ్చు, విదేశాలకు పోవచ్చు, ఇక తర్వాత తన జీవితమంతా ‘సమాజం పట్ల మానవ బాధ్యతను నెరవేరుస్తూ’ నిటారుగా, నిక్కచ్చిగా, నిజాయితీగా బతుకుతాడు, ఆ రకంగా చేసిన నేరానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు; నిజానికసలు ఓ చెవిటి, తిక్క, చెడ్డ, రోగిష్టి ముసలిదాన్ని అలా పైకి పంపటం నేరమే కాదు. కానీ, ఆ పని పూర్తిచేసిన ఒక నెల తర్వాత, అతను అనుకున్నదంతా తలకిందులవుతుంది... దైవిక సత్యం, లౌకిక చట్టం అతడ్ని యాతనపెడతాయి, చివరకు తనంతటతానే వెళ్ళి చట్టం ముందు లొంగిపోతాడు. ఎందుకంటే, జైల్లో అతను నాశనమైపోతే అయిపోనీ, కానీ కనీసం తిరిగి మిగతా జనంలో ఒకడు కాగలుగుతాడు; ఎందుకంటే, ఆ నేరం చేసిన మరుక్షణం నుంచీ మానవ సమూహం నుంచి వేరైపోయి, ఏకాకిగా మిగిలిపోయానన్న భావం అతడ్ని చాలా హింసపెట్టింది. ఆవిధంగా నేరస్థుడే నేర ఫలితాన్ని అనుభవించటానికీ, తద్వారా నేరానికి ప్రాయశ్చిత్తం చేసుకోవటానికీ సిద్ధమవుతాడు.”ఈ ఉత్తరం చదివి ఆ సంపాదకుడు ఏ కళనున్నాడో- మొత్తానికి దాస్తోయెవ్‌స్కీ అడిగినట్టే మూడొందల రూబుళ్ళ అడ్వాన్సు పంపాడు. దాస్తోయెవ్‌స్కీ ఇక విదేశాల్లో యీ కటిక దరిద్రం భరించలేక అక్టోబరులో తిరిగి రష్యా వచ్చాడు. కానీ మళ్ళీ ఆయన్ని అప్పులాళ్లు చుట్టుముట్టారు. చుట్టూ కుటుంబ బాధలు తిరిగి ప్రత్యక్షమయ్యాయి. పైగా ఆయన మూర్ఛరోగం (epilepsy) మళ్లా తిరగబెట్టింది. అప్పుడే స్నేహితునికి ఉత్తరం రాస్తూ, “నా మూర్ఛరోగం ఎంత ముదిరిపోయిందంటే, ఒక వారం ఆగకుండా పని చేస్తే చాలు, మూర్ఛ వచ్చేస్తోంది. అలా రెండుమూడుసార్లు వస్తే ఇక మరుసటి వారమంతా పని చేయలేను, అయినా పని చేయాలి, అదీ నా పరిస్థితి,” అని చెప్పుకున్నాడు. ఇలాంటి పరిస్థితిలో కూడా, ఇంత ఇరుకు మధ్య నలుగుతూ ఎలాగో రాసుకొచ్చి, ఇక దాదాపు పూర్తయిందన్న రచనని... దాస్తోయెవస్కీ ఉన్నట్టుండి కాల్చేశాడు. దానికి కారణమేమిటో ఒక స్నేహితునికి ఉత్తరంలో ఇలా చెప్పాడు: “నవంబరు చివరకు నవలంతా ఇంచుమించు పూర్తయిపోయి సిద్ధంగా ఉంది; కానీ, దాన్ని పూర్తిగా కాల్చిపడేసాను... అది నాకే నచ్చలేదు. ఒక కొత్త శిల్పం, కొత్త పథకం నన్ను ఉత్తేజ పరచింది. మొత్తం మళ్ళీ మొదలు పెట్టాను.”
అయితే నవల మొదటి డ్రాఫ్టు కాలిపోయినా, దాని తాలూకు చిత్తు డ్రాఫ్టులు, కొన్ని నోటు పుస్తకాలు మనకు మిగిలాయి. వాటి ఆధారంగా తెలిసేదేమిటంటే, దాస్తొయెవ్‌స్కీ ఈ నవలను మొదట ఉత్తమ పురుష కథనంలో (ఫస్ట్‌పెర్సన్ నేరేషన్‌లో) రాశాడు. ఈ నేరేటివ్ పద్ధతిలో ముఖ్య పాత్ర రెండు అంశలుగా విడిపోతుంది. ఒక అంశ- కథను మనకు చెప్తుంది, కథపై వ్యాఖ్యానిస్తుంది; రెండో అంశ- కథలో పాల్గొంటుంది, సంఘటనల్ని అనుభవిస్తుంది. అంటే కథలో ప్రత్యక్షంగా పాల్గొనే అంశ ఒకటైతే, అదే సమయంలో కథను మనకు చెప్తూ దానిపై వ్యాఖ్యానించే అంశ మరొకటి. ఈ రెండు విషయాలూ మమేకమైపోయి తేడా తెలీకుండా ఒకే సమయంలో జరిగిపోతూంటాయి. ఇలా ఉత్తమ పురుష కథనంలో రాసిన మొదటి డ్రాఫ్ట్‌ను దాస్తొయెవ్‌స్కీ కాల్చేయటానికి కారణం- ఈ కథకు ఆ నేరేషన్ నప్పకపోవటమే. ఎందుకంటే, నవలలో కథానాయకుడు రస్కోల్నికోవ్ ఆ ముసలామెని చంపిన తర్వాత దాదాపు పిచ్చితనపు అంచులకు చేరిపోతాడు. జ్వరప్రలాప స్థితిలో రోజులు గడుపుతాడు. మరి ఇలాంటి స్థితిలో- కథానాయకుడు ఒకపక్క పిచ్చితనంలోకి జారిపోతూ మరోపక్క స్పష్టంగా కథ ఎలా చెప్పగలడు? మరో మార్గాంతరాన్ని కూడా దాస్తొయెవ్‌స్కీ ఆలోచించాడు. ఫస్ట్‌పెర్సన్‌లోనే మరో పద్ధతి కూడా ఉంది: ‘ఫస్ట్‌పెర్సన్ కన్ఫెషనల్’ పద్ధతి, తెలుగులో ‘ఉత్తమ పురుష వృత్తాంత పద్ధతి’ అనవచ్చును. ఈ పద్ధతిలో ముఖ్య పాత్ర జరుగుతున్న కథను జరుగుతున్నట్టు మనకు వెంటనే బదిలీ చేయదు. ఎప్పుడో గతంలో జరిగిపోయిన దాన్ని ఇప్పుడు జ్ఞాపకంలోంచి నెమరువేసుకుని చెప్పుకుంటుంది. దాస్తొయెవ్‌స్కీ ఈ పద్ధతి గురించి కూడా ఆలోచించాడు. అంటే రస్కోల్నికోవ్ తన గతాన్ని తల్చుకుని, అప్పటి తన అస్తవ్యస్త మానసిక స్థితిని గుర్తు తెచ్చుకుని, కథను చెప్పాలన్నమాట. కానీ ఇందులోనూ ఒక ఇబ్బంది ఉంది. తను చేసిన దారుణ హత్య గురించి, అప్పటి తన బాధాకరమైన మానసిక స్థితి గురించి ఇప్పుడు రస్కోల్నికోవ్ అసలు ఎందుకు గుర్తు చేసుకోవాలనుకుంటాడు? ఎందుకు దాన్ని తల్చుకోవాలనుకుంటాడు? ఈ పద్ధతిలో ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదు. కాబట్టే, అసలు ఫస్ట్ పెర్సన్ నెరెషనే తన నవలకు పనికి రాదని దాస్తొయెవ్‌స్కీ మొదటి డ్రాఫ్టును కాల్చిపారేశాడు. ఒక కొత్త నిర్ణయానికొచ్చాడు: “కథని కథానాయకుడు కాదు, రచయితే చెప్పాలి”. కథను రచయిత చెప్పడమంటే అది ప్రథమ పురుష కథనం (థర్డ్‌పెర్సన్ నేరేషన్). అంటే కథను ఎవరో మూడో వ్యక్తిలా రచయితే చెప్పడం అన్నమాట. ఇలాంటి కథనం దాస్తొయెవ్‌స్కీ కాలానికి కొత్తదేం కాదు. మరి ఇందులో దాస్తొయెవ్‌స్కీని అంత ఉత్తేజపరచిన కొత్త శిల్పం ఏమిటి? దీని సమాధానం ఆయన నోటు పుస్తకంలో ఉంది: “Narration from the point of view of the author, a sort of invisible but omniscient being, who doesn’t leave his hero for a moment.” అంటే రచయిత ఒక అదృశ్యమైన, కానీ సర్వవ్యాప్తమైన అంశగా మారిపోయి అనుక్షణం తన కథానాయకుణ్ణి మాత్రమే అనుసరిస్తాడన్నమాట. దీన్ని మనం ''సర్వసాక్షి కథనం'' (Omnipresent narration) అంటున్నాం. సర్వసాక్షి కథనంలో పాఠకుడిని అదివరకూ ఎవరూ తీసుకెళ్ళనంత చేరువగా కథలోకి తీసుకెళ్ళిన తొలి రచయిత దాస్తొయెవ్‌స్కీనే అని ‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’ వర్డ్స్‌వర్త్ ఎడిషన్‌కి ఉపోద్ఘాతం రాసిన కీత్ కరబైన్ అంటాడు:
“అప్పటిదాకా సంప్రదాయంగా వస్తోన్న రచయిత స్వభావజనితమైన పాయింట్ ఆఫ్ వ్యూ ఈ నవలలో ఒక రూపంలేని, తటస్థమైన ‘సర్వసాక్షి సమక్షం’గా మారిపోయింది, ఈ సమక్షం మళ్ళీ ఎటూ పోకుండా కేవలం కథానాయకుడికే పలుపుతాడేసి కట్టినట్టు అంటిపెట్టుకుపోయింది, ఈ ఆశ్చర్యపరిచే కొత్త ప్రయోగం నవలా చరిత్రలోనే ఒక కొత్త రూపానికి నాంది పలికింది--నవలా ప్రక్రియ శక్తికీ, విస్తృతికీ, పాఠకుల మీద దాని పట్టుకీ ఇది కీలకంగా మారింది.”ఈ కొత్త శిల్పం గురించి కీత్ బైరన్ ఇంకా వివరణ ఇస్తాడు. సర్వసాక్షి కథనానికి దాస్తొయెవ్‌స్కీ దిద్దిన కొత్త మెరుగేంటో ఈ నవల తొలి వాక్యంలోనే కనిపిస్తుంది: “జూలై ప్రారంభంలో, బాగా ఉక్కపోతగా వున్న కాలంలో, సాయంత్రం పూట, ఒక యువకుడు ఎస్-ప్లేస్‌లో తన ఇరుకైన అద్దెగదిలోంచి వీధిలోకి వచ్చి, నెమ్మదిగా, ఏదో తటపటాయిస్తున్నట్టు, కె-బ్రిడ్జి వైపు నడవసాగాడు.” ఈ వాక్యంలో కథకుడు మనకు తెలిసిన సర్వసాక్షి కథకుడే. ఈ సర్వసాక్షి కథకుడు ఇక్కడ తన ముఖ్య పాత్రకు ఒక స్థలాన్ని (ఇరుకు గది, ఎస్-ప్లేస్), ఒక కాలాన్ని (జూలై ప్రారంభం, ఉక్కపోసే సాయంత్రం) ఇస్తున్నాడు. పాత్ర గురించి అంతా అథారిటేటివ్‌గా చెప్తున్నాడు. కాని, “ఏదో తటపటాయిస్తున్నట్టు” అన్న పదాల్లో మాత్రం తన అథారిటీని తగ్గించుకుని, అనిశ్చితిని, సందిగ్ధాన్నీ వ్యక్తం చేస్తున్నాడు. ఈ అనిశ్చితే దాస్తొయెవ్‌స్కీ సర్వసాక్షి కథనానికి అద్దిన కొత్త మెరుగు: “తను సృజించే పాత్రతో రచయితకుండే సంబంధంలో కొంత అనిశ్చితి కూడా ఉంటుందని ఒప్పుకుని, దాన్ని పూర్తిగా వాడుకున్న మొదటి నవలా రచయిత దాస్తోయెవ్‌స్కీ” అంటాడు కీత్ బైరన్.
అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో, ఎంతో ఒత్తిడి మధ్య రాస్తూ కూడా దాస్తోయెవ్‌స్కీ తన రచనల సౌష్ఠవం విషయంలో ఏమాత్రం రాజీ పడలేదనటానికి ఇది ఒక నిదర్శనం. ఎంత హడావిడిలో రాసినా- ప్రతి రచనా దబాయించి అడిగే డిమాండ్‌లన్నీ తీర్చిన తర్వాతనే, అది రచనగా సాధ్యమైనంత పరిపూర్ణమయ్యాకనే, దాస్తోయెవ్‌స్కీ దాన్ని బైటకు పంపాడు. నిజానికి రాయటంలో ఆ నిలుపులేని హడావిడి కొంత పరిస్థితులు కల్పించిందే అయినా, కొంత ఆయన స్వభావంలో కూడా ఉందనుకోవాలి. ఎప్పుడు ఏం రాసినా ఒక జ్వరతీవ్రతలాంటి స్థితిలో, చుట్టూ మరేదీ కన్పించని పిచ్చి ఏకాగ్రతతో రాసేవాడు.
మొత్తానికి, దాస్తోయెవ్‌స్కీ ఇంకా రాస్తుండగానే, 1866 జనవరిలో, ‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’ నవల సీరియలైజేషన్ ‘రష్యన్ మెసెంజర్’ అనే పత్రికలో ప్రారంభమైంది. మొదటి సంచిక నుంచే పాఠకుల్ని కట్టిపడేసింది. ఒక్కసారిగా ఆ పత్రికకి 500 మంది కొత్త చందాదారులు చేరారు. ఆ నవల ప్రచురణ మొదలైన మూడు నెలల తర్వాత, రస్కోల్నికోవ్ లాగే యూనివర్సిటీ నుంచి వెళ్లగొట్టబడిన ఒక యువకుడు అప్పటి జార్ చక్రవర్తి మీద హత్యాయత్నం చేయటంతో, పాఠకుల్లో ఈ నవల మీద మరింత ఆసక్తి పెరిగింది. కానీ దాస్తోయెవ్‌స్కీ మాత్రం— అప్పులవాళ్ళ గొడవల మధ్య, పోలీసు బెదిరింపుల మధ్య— ఏ క్షణాన్నయినా జైలుపాలయి నవల మధ్యలోనే ఆపేయాల్సొస్తుందేమోనన్న భయంతోనే నవలను రాస్తూ వచ్చాడు. సెప్టెంబర్ నెలాఖరుకి నవల పూర్తయిపోయింది. కానీ యమకింకరుడిలాంటి పబ్లిషర్ స్టెల్లోవ్‌స్కీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం, దాస్తోయెవ్‌స్కీ తన రచనల మీద హక్కులన్నీ కోల్పోకుండా ఉండాలంటే, నవంబర్ 1లోగా, అంటే కేవలం ఒక్క నెలలో, మరో నవల రాసి ఇవ్వాలి. ఈ ఒప్పందం గురించి అప్పుడే విన్న స్నేహితులు నివ్వెరపోయారు. కొంతమంది ఆసరాకొచ్చారు. అందరం కలిసి ఒక్కో అధ్యాయం రాసేద్దాం, నీ పేరు మీద అచ్చుకి పంపేద్దాం అని సలహా ఇచ్చారు. “ఎట్టి పరిస్థితుల్లోనూ వేరేవాళ్ళు రాసింది నా సంతకంతో బైటకు వెళ్ళటానికి వీల్లేదు,” అన్నాడు దాస్తోయెవ్‌స్కీ. ఒక స్నేహితుడు స్టెనోగ్రాఫర్‌ని పెట్టుకొమ్మని సలహా ఇచ్చాడు. దాస్తోయెవ్‌స్కీ ఎప్పుడూ తన రచనల్ని ఇంకొకరికి డిక్టేట్ చేయలేదు. కానీ గత్యంతరం లేని పరిస్థితిలో ఇప్పుడు ఒప్పుకున్నాడు. ఈ సలహా ఇచ్చిన స్నేహితుడికి ఒక స్టెనోగ్రఫీ ప్రొఫెసర్ తెలుసు. అతను స్త్రీలకి స్టెనోగ్రఫీ క్లాసులు చెప్తుంటాడు. అతను తన క్లాసులో పంతొమ్మిదేళ్ళ అన్నా గ్రిగొర్‌యెవ్నా అనే అమ్మాయిని దాస్తోయెవ్‌స్కీ దగ్గరకు పంపాడు.
రష్యాలో అప్పుడప్పుడే షార్ట్‌హాండ్ బోధన మొదలైంది. దాన్ని స్త్రీలు నేర్చుకోవటం మరీ అరుదు. తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబం గడవటానికి అన్నా గ్రిగొర్‌యెవ్నా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలా ఆమె స్టెనోగ్రఫీ కోర్సులో చేరింది. ఆమెకి దాస్తోయెవ్‌స్కీ ఒక రచయితగా ముందే తెలుసు. ఆయన ‘ఇన్సల్టెడ్ అండ్ ఇంజ్యూర్డ్’ నవలని కంటతడితో చదివింది. ఇప్పుడు పత్రికలో సీరియలైజ్ అవుతున్న ‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’ను కూడా చదువుతోంది. దాస్తోయెవ్‌స్కీ గదిలోకి అడుగుపెట్టగానే “నాకు చప్పున రస్కోల్నికోవ్ ఉండే గది గుర్తొచ్చింది” అని తర్వాత రాసుకుంది. దాస్తోయెవ్‌స్కీ ఆమెకు డిక్టేట్ చేయదల్చుకున్న నవల ‘ద గేంబ్లర్’, జూద వ్యసనం గురించి. మొదట్లో డిక్టేట్ చేయటంలో తడబడ్డా, క్రమంగా ఈ అమ్మాయి సమక్షం అలవాటయ్యాకా, సులభంగానే డిక్టేట్ చేయటం మొదలుపెట్టాడు. ఆయన చెప్తుంటే ఆమె షార్ట్‌హాండ్‌లో రాసుకోవటం, అలా రాసిందాన్ని ఆ రాత్రికి ఇంటికి తీసుకెళ్ళి విస్తరించి రాసి మళ్ళీ పొద్దున్న వచ్చేటప్పుడు తీసుకురావటం, ఇలాగ ఈ నవలా రచన సాగింది.
దాస్తోయెవ్‌స్కీ భార్య చనిపోయిన ఈ రెండేళ్ళల్లోనే ముగ్గురు అమ్మాయిలకి ప్రపోజ్ చేసి కాదనిపించుకున్నాడు. ఇలా తోడు కోసం తపించే ఒంటరి అవస్థలో ఉన్న నలభై ఐదేళ్ళ దాస్తోయెవ్‌స్కీకి—పంతొమ్మిదేళ్ళ వయసులోనే ఎంతో దిటవుగా కనపడే అన్నా మీద ఇష్టం కలగటం మొదలైంది. అన్నాకు కూడా ఈ మనిషి మీద—ఎవ్వరి ఆసరాలేని, లోపలి భావాలన్నీ ముఖంలోనే చూపించేస్తూ ఎంతో ఊగిపోయే, మాటల్లో వేరే ప్రపంచాల్ని కళ్ళ ముందు నిలపగలిగే మనిషి మీద—మొదట్లో కలిగిన జాలి క్రమంగా ఇష్టంగా మారింది. కానీ మరోపక్క వయసులో ఇంత వ్యత్యాసం వున్న, ఇన్ని అప్పులతో అవస్థపడుతోన్న, ఆరోగ్యం ఏమాత్రం సరిగాలేని ఈ మనిషి తనపై అస్పష్టంగా చూపిస్తున్న ఇష్టానికి ఎలా స్పందించాలా అన్న సందిగ్ధంలోనూ ఉంది. దాస్తోయెవ్‌స్కీ ఇంట్లోని వస్తువులు ఆమె చూస్తుండగానే మాయమై తాకట్టుకి వెళ్ళిపోయేవి, ఒకపక్క చనిపోయిన సోదరుడి కుటుంబం ఆయన్ని పీడించటమూ తెలుస్తుండేది. ఇలాంటి వాతావరణంలోకి ఏ అమ్మాయి మాత్రం పెళ్ళి చేసుకుని వెళ్ళాలనుకుంటుంది. మొత్తానికి ఈ దోబూచులాటల మధ్యనే, ఎంతో వేగంగా, అక్టోబర్ 31 నాటికల్లా నవలని పూర్తి చేయగలిగారు.
స్టెల్లోవ్‌స్కీ ఈ నవలని అనుకున్న సమయానికి అందుకోకుండా తప్పించుకుంటాడనీ, ఎలాగైనా ఒప్పందం నుంచి లాభం పొందటానికి ప్రయత్నిస్తాడనీ దాస్తోయెవ్‌స్కీకి ముందే అనుమానం వచ్చింది. దాంతో ఆయన తరఫున అన్నా వెళ్ళి లాయర్‌ని సంప్రదించింది. ఆ నవల రాతప్రతిని నోటరీ దగ్గరగానీ, పోలీస్ అధికారి దగ్గరకానీ రిజిస్టర్ చేయించుకొంటే మంచిదని లాయరు సలహా ఇచ్చాడు. దాస్తోయెవ్‌స్కీ అనుమానపడ్డట్టే ఆఖరి రోజున స్టెల్లోవ్‌స్కీ ఊళ్ళో లేకుండా తప్పించుకున్నాడు. అతని ప్రచురణ ఆఫీసుకి వెళ్తే అక్కడున్న మేనేజర్ ఆ రాతప్రతిని తీసుకునే అనుమతి తనకు లేదని బుకాయించాడు. అప్పటికే నోటరీ కట్టేశారు. దాంతో దాస్తోయెవ్‌స్కీ ఉరుకుపరుగుల మీద పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు. జిల్లా పోలీసు అధికారి ఆ రాత్రి పదింటికి కానీ రాడని తెలిసింది. మొత్తానికి ఇక డెడ్ లైన్ రెండు గంటలే ఉందనగా, దాస్తోయెవ్‌స్కీ తన నవల రాతప్రతిని పోలీసుల దగ్గర రిజిస్టర్ చేయించుకుని, రశీదు తీసుకుని, ఆ భయంకరమైన ఒప్పందం నుంచి బయటపడ్డాడు.
నాలుగు నెలల తర్వాత దాస్తోయెవ్‌స్కీ తనకంటే పాతికేళ్ళు చిన్నదైన అన్నాను చర్చిలో పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళి తర్వాత ఆయన చుట్టూ ఒక కంచెలా నిలబడింది అన్నా. జూదం వ్యసనం నుంచి ఆయన్ను అతికష్టం మీద గట్టెక్కించింది. డబ్బుకోసం ఆయనవైపు చేయిచాచేవాళ్ళకి అడ్డంపడి లేదని చెప్పగలిగింది. కూడబెట్టడం మొదలుపెట్టి అప్పుల్లోంచి బయటపడేసింది. పదిహేనేళ్ళ సహచర్యం తరువాత 1881లో ఆయన మరణించేదాకా, వెన్నంటి ఉంది.