March 4, 2008

సార్థకత

బంగారు పిచ్చిక ఎగిరిపోయి చాలాసేపయింది. దాని ఈక మాత్రం ఇంకా కొమ్మ మీదే ఉండిపోయింది. ఆకుల్ని గల గల లాడిస్తూ అటువైపుగా సాగిపోయిన ఓ మంద పవనం దాన్ని స్థాన భ్రంశం చేసింది. అంచెలంచెలుగా, లోలకపు అంచులా గాల్లో ఊగుతూ, అది క్రిందకు పతనం చెందింది. గడ్డిపై పరచుకున్న ఎండుటాకుల మధ్య ఇక నిశ్చలత్వం పొందబోతోందనగా, ప్రక్కన రోడ్డుపై ఝమ్మని దాటిపోయిన కారు దాన్ని తటాలున తన వైపు లాక్కొంది. సాంగత్యం లభించినట్టే లభించి చేజారి పోతూండటంతో, కొన్ని ఎండుటాకులు ఈక వెంటే ఆపేక్షగా పైకి లేచాయి. కాని దాని వడి నందుకోలేక కాస్త దూరంలోనే, అసంతృప్తిగా, తిరిగి చతికిల బడ్డాయి. ఈక మాత్రం కారు వెంటే కొంత దూరం పయనించి, ఎదురుగాలికి రోడ్డు మధ్యగా ఉవ్వెత్తున పైకి ఎగసింది. గాల్లో సంచలనం సద్దుమణిపోగా, మళ్ళీ అదే లోలకపు ఊపుతో, రోడ్డు వైపుకు జారింది. ఈ కోలాహలమంతా భుజాన స్కూల్‌బాగ్ తో పరాకుగా రోడ్డు వారన నడుస్తున్న ఓ బుజ్జాయి కంటపడింది. పరుగులిడి తరలి వచ్చింది. ఈక ఇక రోడ్డుని తాకబోతోందనగా, తన చిట్టి అరచేతిని కాపు పెట్టి అందులో తేలికగా వాలనిచ్చింది. రెండో చేత్తో భుజాన బాగ్‌ని తొలగించి, రోడ్డు మీద పరచి, ఓ నోటు పుస్తకం బయటకు తీసింది. మధ్యకు మడత తీసి ఈకను ఒద్దికగా అందులో అమర్చింది. పుస్తకం లోపల సర్దేసి, బాగ్ భుజాన వేసుకుని ఎగురుగంటూ తనదారిన చక్కాపోయింది. ఆ బంగారు పిచ్చికకు అసలు తెలీనే తెలీదు — ఓ జ్ఞాపకంలో చిరు శకలమై తన ఈక అమరత్వాన్ని సంపాదించిందని.

0 comments:

మీ మాట...