November 23, 2023

Truman Show-effect!

 చిన్నపిల్లలకి The Truman Show సినిమా చూపించటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. ఇందాక చిన్నోడు నాతో:

Meher Jr.: Dad... I am starting to feel like it's all a show...

Me: What is?

Meher Jr.: This life... It doesn't feel real. Just like in the movie. Maybe everybody's acting a role infront of me.

Me: Everybody?

Meher Jr: Yeah, maybe they are not the real teachers at the school, maybe you are not my real father.

Me: You think somebody put me here to act as a father to you?

Meher Jr: (కాసేపు ఆలోచించి) Maybe not you. It would be too much work for you right, to act these many years? And all those old photos of us? I think you are my real father.

Me: How can you be so sure? Maybe I've been on the show since the day you were born, just like in the movie?

Meher Jr.: But why would you guys spend so much money on me? 

Me: The showrunners give us the money.

Meher Jr.: Yeah... Come to think of it... you never once took me to your office. What's with that? I think there isn't any office out there at all. You and mom just go out and meet the showrunners and take notes or something.

Me: That's what we do.

Meher Jr: But you've just told me the truth?

Me: Yeah, but I have this device with me. Once I use it on you, you will forget that we ever had this conversation.

Meher Jr: Really? Show me!

(And I hold his head with one hand, and with the other I pull up my smartphone and use the torch to flash his eyes.)

Meher Jr.: (Opens his eyes, with all the drama in the world...) Where am I? How am I here? 

(After the act is over, he goes back to listening to Badass Maa from Leo)

Meanwhile Me to Myself: I think I should put off showing him The Matrix for a while.

October 25, 2023

చెఖోవ్ మీద గోర్కీ, కుప్రిన్, బునిన్ వ్యాసాలు

రచయిత చనిపోయాక రాసే నివాళి వ్యాసాలు రెండు రకాలు: ఒకటి- అతని రచనల విలువా, సాహిత్యంలో అతని స్థానం ఏమిటన్నది అంచనా వేసేవి. రెండు- ఈ రచనల గొడవంతా పక్కనపెట్టి రచయిత స్వభావాన్ని, అతనితో ఉన్న పరిచయాన్ని తల్చుకునేవి. నాకు ఈ రెండో రకంవి ఎక్కువ నచ్చుతాయి. ఇలాంటి వ్యాసాలతో వచ్చే పుస్తకాలు కూడా చదువుకోవటానికి బావుంటాయి. ఒకరకంగా ఫిక్షన్ తర్వాత ఇది నా ఫేవరెట్ జాన్రా (రచయితల డైరీలు, ఉత్తరాలతోపాటు). మామూలు మనుషులు ఎంత రసవత్తరంగా బతికినాసరే, దాని గురించి అక్షరాల్లో ఋజువు చెప్పగలిగే సాక్షులెవ్వరూ దరిదాపుల్లో ఉండరు గనుక, ఆ జీవితాలు ఎవ్వరికీ తెలియకుండా మట్టిలో కలిసిపోతాయి. రచయితల విషయంలో మటుకు వాళ్ళు ఎంత మామూలుగా బతికినాసరే, దాన్ని నమోదు చేయటానికి వాళ్ళ చుట్టుపక్కల కాస్త వాక్యం పట్టుబడినవాళ్లుంటారు. అదొక ప్రివిలేజి. ఈ నివాళి వ్యాసాల్ని కల్పితమేమీ లేకుండానే జీవితం కథలుగా మారే సందర్భాలుగా చూస్తాను. అలాగని ఈ నివాళి వ్యాసాల్లో కూడా ఫిక్షన్ కలిపి కమ్మగా వడ్డించేవాళ్ళు లేరనటం లేదు. కానీ అవి కూడా చదువుకోవటానికి, నవ్వుకోవటానికి బాగానే ఉంటాయి. ఒకాయన రాసిన రెండు మూడు నివాళి వ్యాసాల్లో ఒకేలాంటి సన్నివేశం తిప్పితిప్పి వస్తూంటుంది- చనిపోయిన రచయితని ఈయన మూడో మనిషెవరూ లేనిచోట కలుస్తాడు, ఆ చనిపోయిన రచయిత ఈయన గురించి తియతియ్యగా పొగుడుతాడు, ‘నా తర్వాత ఇంకెవ్వరూ రారనుకున్నాను నువ్వొచ్చావు’ అంటాడు. ఇంకొకాయన తన అభిప్రాయాలని ఆ చనిపోయిన మనుషులకి ఆపాదించి వాళ్ళ నోట్లోంచి ప్రసంగాలు ఇస్తుంటాడు. ఇంకొకడు బతికున్న  మనుషుల మీద పగ తీర్చుకోవటానికి చనిపోయిన మనుషుల నోళ్ళలో తన మాటలు కూరుతుంటాడు. మరొకడెవడో ‘ఎంత గొప్ప రైటర్ అయితేనేం పాపం చివర్లో పచ్చళ్ళు అమ్ముకున్నాడ’ని జాలి పడతాడు. ఒక కమ్యూనిస్టు విమర్శకుడి స్మరణ సంచికలో అందరూ అతని సైద్ధాంతిక నిబద్ధతని తల్చుకుంటూ రాస్తే, కొడుకు మాత్రం ‘మా నాన్న ఇల్లు గాలికి వదిలేసి జెండాలు పట్టుకుని తిరిగినా అమ్మ దగ్గరుండి చదివించబట్టి సాఫ్ట్వేర్ జాబు తెచ్చుకుని అమెరికాలో సెటిల్ అవ్వవగలిగాను‘ అన్న ధోరణిలో రాస్తాడు. ఇవన్నీ కూడా నాకు కథల్లాగే ఉంటాయి. ఆత్మీయంగా రాసేవాళ్ళు ఒకలాంటి కథలు చెప్తే, ఇలాంటివి రాసేవాళ్ళు ఇంకోలాంటి కథలు చెప్తారు. అవి వాళ్ళనే బైటపెట్టేట్టు ఉంటాయి. అందుకే ఈ పుస్తకాలు బావుంటాయి నాకు. ఒక మనిషి మిగిల్చిపోయిన ఖాళీ చుట్టూ వీళ్ళంతా చేరి తమ జ్ఞాపకాల్లోంచి ఏరిన ముక్కలతో మళ్ళీ అతని ఉనికిని పేర్చడానికి ప్రయత్నించడం... అవన్నీ పొసిగీ పొసగకా ఒక అసహజమైన మూర్తి ఏర్పడటం, దాంట్లోనే ఏ మూలో ప్రాణమున్న అసలు మనిషి మినుమినుకులాడటం... ఇది బావుంటుంది. ముఖ్యంగా ఆ మనిషి మనం ఎంతో ఇష్టపడి ఎప్పుడూ కలవని రచయిత అయినప్పుడు. నాకు ఎంతో నచ్చిన కొందరు రచయితల స్వభావాల్ని నేను ఇలా స్మృతి రచనల్లోంచే ఏరుకుని కట్టుకున్నాను. 

చెఖోవ్ ఉత్తరాలు చదువుతుండగా– మధ్యలో అతని మీద మాక్సిమ్ గోర్కీ, అలెగ్జాండర్ కుప్రిన్, ఇవాన్ బునిన్ రాసిన ఈ స్మృతి రచనల పుస్తకం మీదకు దృష్టిపోయింది. ఇది ఉందని ఎప్పడో తెలుసు, కానీ పూర్తిగా చదవటం ఇప్పుడే కుదిరింది. రాసినవాళ్ళల్లో గోర్కీ అందరికీ తెలిసినవాడే. కుప్రిన్ తెలుగువాళ్లకి రాళ్లవంకీ కథల పుస్తకంతో, యమకూపం నవలతో తెలుసు. ఇవాన్ బునిన్ బహుశా నోబెల్ బహుమతి పొందిన ఒకానొక రైటరుగా తెలిసుండాలి. వీళ్లు ముగ్గురూ చెఖోవ్ కంటే దాదాపు పదేళ్ళు చిన్నోళ్ళు. నలభై నాలుగేళ్ళ వయస్సులో చనిపోయిన చెఖోవ్ కి చివరి పది పదిహేనేళ్ళల్లో పరిచయమైనవాళ్ళు. వీళ్ళ ముగ్గురి వ్యాసాల్లోనూ దాదాపు ఒకే రకమైన చెఖోవ్ కనపడతాడు. కానీ నుదురు ముడి వేసుకుని గంభీరంగా కనిపించే ఈ చెఖోవే నిజమైన చెఖోవ్ అని నేను అనుకోను. ఎందుకంటే వీళ్ళకు తెలిసిన చెఖోవ్ క్షయ రోగం ముదిరి చావు పొంచి ఉందని తెలిసినవాడు, ఆ ఎరుక తెచ్చే గాంభీర్యమో నైరాశ్యమో ఉట్టిపడేవాడు. అంతకుముందులా చిలిపిగా, సరదాగా, ప్రాంక్‌లూ ప్రాక్టికల్ జోకులేసే చెఖోవ్ వీళ్ళకు పెద్దగా తెలియదు (ఆ చెఖోవ్ తొలి రోజుల్లో రాసిన ఉత్తరాల్లో కనపడతాడు). కాబట్టి ఆ సరదా చెఖోవ్ వీళ్ళు రాసిన ఈ వ్యాసాల్లో అరుదుగా మాత్రమే బైటకొస్తుంటాడు. అలా బైటకొచ్చిన సందర్భాల్ని ముగ్గురూ గుర్తుపట్టి అపురూపంగా తల్చుకుంటారు. ఈ కింద కోట్ చేసిన గోర్కీ మాటల్లో కనపడే చెఖోవే దాదాపు మిగతా ఇద్దరి వ్యాసాల్లోనూ కనపడతాడు—అంతరంగంలో పూర్తి స్వేచ్ఛ పొందిన మనిషి, రచయితలంటే ఇలా ఉండాలన్న అంచనాలకి అందని మనిషి, జీవితానికి సంబంధించిన గంభీరమైన సంభాషణలంటే దూరం జరిగే మనిషి, ఎవరైనా స్వభావాన్ని దాచి ముసుగేసుకుంటే అస్సలు భరించలేని మనిషి…:

“He was always himself, inwardly free, and he never troubled about what some people expected and others—coarser people—demanded of Anton Chekhov. He did not like conversations about deep questions, conversations with which our dear Russians so assiduously comfort themselves…’’

ఈ ‘‘inwardly free’’ అన్న అర్థంలో చెఖోవ్ గురించి ముగ్గురూ మాట్లాడతారు. చెఖోవ్ మతం నుంచి, సమాజంలో చర్విత చర్వణంగా దాపురించే సంప్రదాయాల నుంచి, దేశభక్తి లాంటి అందరూ గుడ్డిగా ఒప్పుకునే చట్రాల నుంచి, సామాజిక సిద్ధాంతాల ఒరవడి నుంచి పూర్తిగా విముక్తి చెందిన మనిషి. నేను ఆయన కథలు చదివి ‘‘ఆయన ఇలాంటివాడయ్యుంటాడు’’ అని చేసుకున్న ఊహలని నిర్ధారించి చెప్పేలాంటి మాటలు ఈ పుస్తకంలో చాలా ఉన్నాయి. అవ్వేగాక, రచన గురించి చెఖోవ్ చెప్పిన మాటల్ని కూడా కొన్ని చోట్ల కోట్ చేశారు. ముఖ్యంగా కుప్రిన్ వ్యాసంలో. అవి కొన్నే అయినా నాకు ఆసక్తిగా అనిపించింది. మామూలుగా ఈ 19వ శతాబ్దం రచయితల ఇంటర్వ్యూలెక్కడా దొరకవు. వీళ్ళెవ్వరూ 20వ శతాబ్దం రచయితల్లాగ  ‘పారిస్ రివ్యూ’ ఇంటర్వ్యూల లాంటి ఇంటర్వ్యూల్లో తమ రచనా పద్ధతుల గురించి చెప్పుకోలేదు. అందుకే ఈ రెమీనిసెన్సుల్లో చెఖోవ్ తన రచన గురించి మాట్లాడిన మాటలు నాకు ప్రత్యేకంగా అనిపించాయి.  

చెఖోవ్ ఎప్పుడూ నోట్సు రాసి పెట్టుకోవద్దు అన్నాడట కుప్రిన్ తో. అంటే రచయితలు జ్ఞాపకంలో ఉంచుకోవాలని కొన్ని సంఘటనలని రాసి పెట్టుకుంటారు కదా, అలాగ. ఉండాల్సిన పెద్ద విషయాలైతే ఎలాగూ జ్ఞాపకంలో ఉంటాయన్నది ఆయన థియరీ: ‘‘Chekhov had just strongly advised us not to have recourse to notebooks for help but to rely wholly on our memory and imagination. ‘The big things will remain’—he argued—‘and the details you can always invent or find’.”

కథలకి టైటిల్స్ పెట్టడానికి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదని నేను అనుకుంటాను. పది కథల్లో నీకథకి ఒక ఐడీ కార్డులాగ తప్పితే టైటిల్స్ లో నాకే పరమార్థం కనపడదు. అలా అనుకునే నాకే ‘మరీ ఇంత మామూలు టైటిలా’ అనిపించేలాంటి టైటిల్స్ పెట్టాడు చెఖోవ్. ‘My Life’, ‘The Student’, ‘The Letter’, ‘The Bet’, ‘The Kiss’, ‘The Party’, ‘Misery’, ‘Neibhours’... ఇంతకన్నా టైటిల్స్ దొరకలేదా అనిపిస్తుంది అంత మంచి కథలకి. కానీ ఈ విషయం మీద ఆయనకో స్పష్టత ఉందని అర్థమైంది ఈ మాటల్లో: ‘‘Put as plain a title as possible—any that occurs to your mind—and nothing else. And again, why those subtitles: a psychological study, genre, nouvelle? All these are mere pretense. Also use as few brackets, italics and hyphens as possible. They are mannerisms.”

ఇంకోటి చెఖోవ్ ని ఏమాత్రం చదివున్న వాళ్ళకైనా తెలిసిపోయేదే. ఆయన ఎప్పుడూ ఇతివృత్తాలు గొప్పగా, ప్రత్యేకంగా ఉండాలని అనుకోలేదు: ‘‘Why write about a man getting into a submarine and going to the North Pole to reconcile himself with the world, while his beloved at that moment throws herself with a hysterical shriek from the belfry? All this is untrue and does not happen in reality. One must write about simple things: how Peter Semionovitch married Marie Ivanovna. That is all.’’ (‘‘ప్రపంచంతో సంధి కుదుర్చుకోవటానికి సబ్ మెరైన్ ఎక్కి ఉత్తర ధ్రువం పోయే మనిషి గురించీ, ఈలోగా ఇక్కడ గంటస్తంభం మీంచి పెద్ద పొలికేక పెడుతూ దూకి ఆత్మహత్య చేసుకునే అతని ప్రేయసి గురించీ ఎందుకు రాయడం? అదంతా అవాస్తవం, నిజజీవితంలో జరిగేది కాదు. రాస్తే మామూలు విషయాల గురించి రాయి: మేరీ ఇవనోవ్నా ని పీటర్ సెమీయొనోవిచ్ ఎలా పెళ్ళి చేసుకున్నాడు. అది చాలు.’’)

కుప్రిన్ రాసిన వ్యాసంలోనే చెఖోవ్ చెప్పిన ఇదో మంచి మాట ఉంది. నువ్వు వర్ణించే దాని మీద నువ్వే మచ్చటపడిపోకూడదు అంటాడు. దూరంగా నిలబడి వర్ణించమంటాడు. మనసులో వర్ణించేదాని మీద కొంత చికాకుపెట్టుకుని మరీ వర్ణించమంటాడు:

‘‘He also taught that an author should be indifferent to the joys and sorrows of his characters. ‘In a good story’—he said—‘I have read a description of a restaurant by the sea in a large city. You saw at once that the author was all admiration for the music, the electric light, the flowers in the buttonholes; that he himself delighted in contemplating them. One has to stand outside these things, and, although knowing them in minute detail, one must look at them from top to bottom with contempt. And then it will be true’.”

ఈ ముగ్గురు రాసిన వ్యాసాల్లోనూ ఉమ్మడిగా కనపడేది ఇంకొటకటి ఉంది— పని చేయటం అంటే చెఖోవ్ కి ఎంత ఇష్టమన్నది. సోమరిపోతు పాత్రలెన్నో రాసిన ఈ మనిషి పని, పని, పని అని పలవరిస్తుంటాడు. డాక్టరుగా ప్రాక్టీసు చేస్తూ, ఊళ్లల్లో స్కూళ్లు కట్టిస్తూ, నలుగురైదుగురున్న ఉమ్మడి కుటుంబాన్ని పోషిస్తూ, క్షయ రోగంతో చివరి రోజుల్లో చాలా బాధ పడుతూ, నలభై నాలుగేళ్ళ జీవితంలోనే అన్నేసి కథలు రాసిన చెఖోవ్ యువ రచయితలకి ఈ మాటలు చెప్పాడంటే నమ్మాలి. ఎంత రాయగలిగితే అంత రాయమంటాడు. సరిగా రాకపోయినా ఫర్లేదంటాడు. తర్వాత అదే వస్తుంది. ముందు యవ్వనాన్నీ, చేవనీ వేస్టు చేసుకోకూడదు. అది పని చేయాల్సిన వయసు. కుప్రిన్ కి ఇలా చెబుతాడు, ‘‘నువ్వు బాగా రాస్తావు. కానీ నీ దగ్గరున్న పదాలు చాలా తక్కువ. పదాలని సంపాదించాలి, మాటతీరుని పట్టుకోవాలి, అది జరగాలంటే రోజూ రాయాలి.’’: “ ‘Write, write as much as possible’—he would say to young novelists. ‘It does not matter if it does not come off. Later on it will come off. The chief thing is, do not waste your youth and elasticity. It's now the time for working. See, you write superbly, but your vocabulary is small. You must acquire words and turns of speech, and for this you must write every day’.”

ఫలానావాడ్ని ‘‘ప్రతిభలేనివాడు’’ అనటమే చెఖోవ్ కి తెలిసిన పెద్ద తిట్టు అంటాడు బునిన్: ‘‘The word ‘talentless’ was, I think, the most damaging expression he could use. His own failures and successes he took as he alone knew how to take them.’’

గొప్ప రచయితలని చదివి ‘‘వీళ్ళలాగ రాయలేనప్పుడు ఎందుకూ ఇక రాయడం’’ అని నిరుత్సాహపడే కొంతమంది నాకు తెలుసు. నాకు అలాంటి నిరుత్సాహం ఎప్పుడూ అర్థం కాలేదు. చెఖోవ్ అదే చెప్తాడు— పెద్ద కుక్కలుంటాయి, బుజ్జి కుక్కలుంటాయి, పెద్ద కుక్కల్ని చూసి బుజ్జి కుక్కలు డీలా పడకూడదు. ఎవరి చేతనైనట్టు వాళ్ళు మొరగాలి, దేవుడు ఇచ్చిన గొంతుతో…: ‘‘There are big dogs and little dogs, but the little dogs should not be disheartened by the existence of the big dogs. All must bark—and bark with the voice God gave them.’’

చెఖోవ్ అన్నాడని గోర్కీ రాసిందాన్ని మాత్రం అనువదించి పెడతాను. ఇది రచనకు సంబంధించింది కాదు, సమాజం గురించి. ఇక్కడ ‘రష్యన్’ అన్న మాట తీసేసి, ‘ఇండియన్’ అనో ‘తెలుగువాడు’ అనో పెడితే ఇది మన గురించే అనిపిస్తుంది:

‘‘రష్యన్ మనిషి ఓ చిత్రమైన జీవి. వాడొక జల్లెడ లాంటివాడు. వాడిలో ఏదీ మిగలదు. యవ్వనంలో ఆబగా తనకు ఎదురైన ప్రతీదీ ఆకళింపు చేసుకుంటాడు, కానీ ముప్పయ్యేళ్ళ తర్వాత బుర్రలో బూడిద తప్ప ఏమీ మిగలదు…. చక్కగా, మానవీయంగా బతకాలంటే పని చేయాలి, నమ్మకంతో, ప్రేమతో పని చేయాలి. కానీ అది మనవల్ల కాదు. ఆర్కిటెక్టు ఒకటి రెండు మంచి బిల్డింగులు కడతాడు, ఇక్క అక్కడితోసరి, తక్కిన జీవితమంతా కూర్చుని పేకాడతాడు, లేదంటే ఏదో నాటకాల గుంపు వెంటపడుతూ కనపడతాడు. డాక్టరుకి ప్రాక్టీసు పెరిగాక ఇక సైన్సు మీద ఆసక్తి పోతుంది, మెడికల్ జర్నల్ తప్పితే ఇంకేదీ చదవడు, నలభయ్యేళ్ళు వచ్చేసరికి సకల రోగాలకి కఫమే మూలమని నిజంగా నమ్మటం మొదలుపెడతాడు. చేసే పనికి అర్థమేమిటో తెలిసిన సివిల్ సర్వెంటు ఒక్కడిని కూడా నేను కలవలేదు: మామూలుగా వాడు నగరంలోనో, జిల్లాకి ముఖ్య పట్టణంలోనో కూర్చుంటాడు, ఊళ్లకి నివేదికలు రాసి పంపుతుంటాడు. వాడు రాసే ఒక నివేదిక ఊరిలో ఎవరిదో స్వేచ్ఛని పూర్తిగా హరించి వేయవచ్చు–కానీ దాని గురించి మన సివిల్ సర్వెంటు ఎంత తక్కువ ఆలోచిస్తాడంటే, నరకం గురించి నాస్తికుడు ఆలోచించినంత. మంచి డిఫెన్స్ అని పేరు మోసాక ఇక ఆ లాయరు న్యాయం గురించి పట్టించుకోవటం మానేస్తాడు, ప్రాపర్టీ హక్కుల్నీ, జూదశాలల్నీ మాత్రమే డిఫెండ్ చేస్తాడు, ఆయెస్టర్లు తింటాడు, సకల కళలనీ సమాదరిస్తాడు. ఒక నటుడు రెండు మూడు మంచి పాత్రల్ని పోషించాక, ఇక తన డైలాగుల్ని చూసుకోవటం మానేస్తాడు, సిల్కు హాటు పెట్టుకుని తానో జీనియస్సునని నమ్మటం మొదలుపెడతాడు. రష్యా ఒక తృప్తి లేని సోమరిపోతుల నేల: హితవుకి మించి తింటారు, హద్దు మీరి తాగుతారు, పగలే నిద్రపోతారు, నిద్రలో గురకపెడతారు. ఇల్లు చూసుకోవటానికి మనిషి కావాలి కాబట్టి పెళ్ళి చేసుకుంటారు, సమాజంలో గొప్ప కోసం ఇద్దరు ముగ్గుర్ని ఉంచుకుంటారు. వాళ్ళ సైకాలజీ ఒక కుక్క సైకాలజీ: వాళ్లని కొడితే జాలిగా కూస్తూ ఓ మూలకి వెళ్లిపోతారు; ముద్దు చేస్తే వెల్లకిలా పడుకుని గాలిలో కాళ్ళు ఊపుతూ తోకాడిస్తారు.’’

https://www.gutenberg.org/files/37129/37129-h/37129-h.htm

October 18, 2023

పెర్ఫెక్ట్ పేజీలు

చదివేటప్పుడు 'ఇది పెర్ఫెక్షన్!' అనిపించటం ఎప్పుడో తప్ప జరగదు. ఒక్క పేరా విషయంలోనైనా సరే. అలాంటిది ఇవాళ మధ్యాహ్నం ఇవాన్ తుర్గెనెవ్ 'ఫస్ట్ లవ్' నవలలో (Andrew R. Macandrew అనువాదంలో) ఏకంగా ఒకటిన్నర పేజీల పెర్ఫెక్షన్ చూశాను (ఆ జోరులోనే ఇందాకటి పోస్టు). నవలను నెరేట్ చేసే పదహారేళ్ల కుర్రాడు తను ప్రేమించిన అమ్మాయి దగ్గర వీడ్కోలు తీసుకొని అర్ధరాత్రి ఇంటికొస్తాడు. అతనికి నిద్ర పట్టని ఆ రాత్రిని రచయిత ఒకటిన్నర పేజీల్లో చెప్తాడు. అక్కడ పెర్ఫెక్షన్ ఏంటీ అన్నది అది చదివితేనే తెలుస్తుంది, కానీ పెర్ఫెక్షన్ ఎలా ఉంటుందీ అన్నది మటుకు ఇక్కడ చెప్పగలను: పదం తర్వాత పదం అది తప్ప ఇంకోటి రావటానికి వీల్లేదన్నట్టే వస్తుంది. వాక్యం తర్వాత వాక్యమూ అలాగే వచ్చికూచుంటుంది. ఆ వాక్యాలతో నీ చుట్టూ విప్పారే ప్రపంచం అసలు ప్రపంచం కంటే రియల్‌గా ఉంటుంది. ఆ వాక్యాల్లో ఉన్నది అంతకుముందు ఏ రచయితా రాయనట్టు, అసలు అలాంటి అనుభవం భాషలోకి రావటం ఇదే తొలిసారి అన్నట్టు ఉంటుంది. అలాంటి స్పష్టతతో, inevitablityతో ఒకటిన్నర పేజీల వచనం చదివాక ఇక యథాలాపంగా ముందుకు చదువుకుంటూపోవటం వీలు కాదు. ఆ ధారాపాతం నుంచి తేరుకుని, 'ఇప్పుడు నాకేం జరిగిందీ' అని గిల్లి చూసుకుని, పేజీలు వెనక్కి తిప్పి, మళ్ళీ చదువుకుంటాం. నేనైతే 'ఫస్ట్ లవ్' నవలలోని ఆ ఒకటిన్నర పేజీలనూ మళ్ళీ చదవటమే కాదు, నా దగ్గరున్న ఇంకో రెండు అనువాదాలు కూడా తీసుకుని ఆ పేజీలు ఎక్కడున్నాయో వెతికి చదివాను. ఇలాంటి పేజీలు లైఫ్ లో ఓ పది దొరికితే గొప్పే మరి! ఇలా ఇంకెప్పుడైనా అనిపించిందా అని ఆలోచించగానే– చప్పున బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ 'అపరాజితుడు' నవల (కాత్యాయని అనువాదం) గుర్తొచ్చింది. ఆ నవలలో కొడుకు లేని సమయంలో సర్వజయ ఒంటరిగా చనిపోతుంది. ఆమె చనిపోయిన రాత్రిని ఒకట్రెండు పేజీలలో అనుకుంటాను చెప్తాడు రచయిత. ఆ పేజీలు చదివినప్పుడూ ఇలాగే, 'ఇది పెర్ఫెక్షన్' అనుకున్నానని గుర్తొచ్చింది. ఇంకా ఆలోచిస్తే ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం చదివిన దాస్తోయెవస్కీ 'క్రైమ్ అండ్ పనిష్మెంట్' నవలలో (Constance Garnett అనువాదంలో) మార్మెలాడోవ్ తాగి వాగే పేజీలు గుర్తొచ్చాయి. ప్రూస్ట్ పేజీలు కొన్ని ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఇవిగాక ఇంకా ఉండే ఉంటాయి. కానీ ఎన్నో ఉండవు. వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. టాలెంటెడ్ రచయితలు మహాయితే ఒక పేరా పెర్ఫెక్ట్ వచనాన్ని ఎప్పుడన్నా రాయగలరేమో. కానీ పేజీని దాటి అలా రాయాలంటే మాత్రం టాలెంట్ కి మించి ఏదో కావాలి. ఆ 'ఏదో' ఉన్నవాళ్లు కూడా ఈ విన్యాసాన్ని వాళ్ళ మొత్తం పుస్తకాల్లో రెండుమూడుసార్లు చేయగలరేమో, అని నా ఫీలింగ్.

October 15, 2023

శీత రాత్రులు


ఆ వీధిలో మంచు సుళ్ళు తిరుగుతోంది.

అది చూస్తూ ఇద్దరు.

‘‘గాలి గొలుసులు తెంచుకుని ఊరి మీద పడింది,’’ అన్నాడు ఇవాన్.

‘‘గాలేవన్నా జంతువా గొలుసులేసి కట్టేయడానికి?’’ అన్నాడు సిరిన్.

సరదాకి పేరడీ చేస్తున్నారు చెహోవ్ కథలో మాటల్ని.

ఇద్దరి వయస్సూ ఇరవైల చివర్లో ఉంటుంది. ఒత్తుగా చలికోట్లేసుకొని పేవ్మెంటు మీద నిలబడి ఉన్నారు. జేబుల్లో చేతులు దోపుకొని వీధికి అటువైపు ఉన్న బిల్డింగును చూస్తున్నారు. ముఖ్యంగా ఆ బిల్డింగు పైఅంతస్తులో వెలుగుతున్న కిటికీని. వీధిలో పరిస్థితి ఇలా ఎంతోసేపు నిలబడి ఎదురుచూసేలా లేదు. విసురుగా రాలుతున్న మంచు తరకలు కనురెప్పలపై పొరకడుతున్నాయి, చర్మంలోకి కరుగుతున్నాయి. టోపీల మీద, భుజాల మీద మంచు పేరుకుపోతోంది.

‘‘ఎప్పుడూ ఇంట్లోకి నేరుగా పోయేవాళ్ళం కదా… ఇవాళేంటి బైటే నిలబెట్టాడు?’’ అన్నాడు ఇవాన్.

‘‘మొగుడూపెళ్లాలు ఏదో గొడవ పడుతున్నట్టున్నారు,’’ సిరిన్ జవాబు.

‘‘మాయదారి పెళ్ళిళ్ళు,’’ నవ్వాడు ఇవాన్.

ఎవరో వీధి మలుపు తిరిగారు– భుజం మీద నిచ్చెనతో, ఇంకో చేతిలో కిరసనాయిలు డబ్బాతో, ఒక గడ్డం ముసలాడు. మంచులో బూట్లను ఎత్తివేస్తూ దీపస్తంభం వైపు నడుస్తున్నాడు.

‘‘దేవుడు ఇలాంటి చలిరాత్రుళ్ళలో మనుషుల మీద నిఘా పెట్టడానికి ఇలా దీపాలు వెలిగించే మనిషిలా వస్తాడని నా అనుమానం,’’ అన్నాడు ఇవాన్.

సిరిన్ ఇవాన్ ముఖంలోకి చూశాడు. ‘‘నీకు దేవుడంటే పడదు కదా?’’

“కవిత్వానికీ పనికి రాడంటావా?”

ముసలాడు దీపస్తంభానికి నిచ్చెన ఆనించి, మెల్లగా కష్టంగా పైకి ఎక్కాడు. దీపం బుడ్డికి ఉన్న గాజు తలుపు తెరిచాడు. నిచ్చెన మెట్ల మీద బొజ్జతో ఆనుకుని, జేబులోంచి అగ్గిపెట్టె తీసి, గాలికి కొడి ఆరిపోకుండా చేతుల మధ్య కాస్తూ, వొత్తి వెలిగించాడు.

దీపం మొదట ముసలాడి ముఖాన్ని వెలిగించింది. అది జీవితం నేలకేసి కాలరాసిన ముఖం. బహుశా ఇంట్లో ఆయాసంతో దగ్గే భార్య, ఆకలికి ఏడ్చే పిల్లలు, వీధుల్లో విటుల కోసం నిలబడే పెద్దకూతురు…. ఇవాన్ కి ఇప్పుడా ముఖంలో దేవుడు పోయి మనిషే మిగిలాడు.

ముసలాడు కిందకి దిగి నిచ్చెన భుజం మీద పెట్టుకున్నాడు. కొత్తగా తోడొచ్చిన తన నీడని వెంటేసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ వీళ్ళిద్దరే మిగిలారు, గాలి హోరు వింటూ. దీపం వెలుగులో మంచు తరకల విసురు ఇంకా బాగా తెలుస్తోంది.

‘‘ఏమన్నా రాస్తున్నావా?’’ అన్నాడు సిరిన్.

ఇవాన్‌ కి తన గదిలో చెత్తబుట్టలో నలిగిన కాయితం ఉండలు గుర్తొచ్చాయి. ‘‘ఏమీ రాయటం లేదు. నువ్వు?’’

సిరిన్ ఆ ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్నట్టు మొదలుపెట్టాడు. ‘‘ఒక కథ ఊహించాను. రాయగలనో లేదో తెలీదు. ఊహలో అయితే అంతా సిద్ధంగా ఉంది.’’

‘‘చెప్పూ…’’

‘‘రచయితల కథే. ఒక పేరున్న నవలా రచయిత, నడివయసు మనిషి, స్నేహశీలి. అతని ఇంటికి కవులూ రచయితలూ వచ్చిపోతుంటారు. ఇంట్లో మనుషుల్లాగ మెసిలి వెళ్తుంటారు. ముఖ్యంగా, ఒక కుర్రకవి ఈమధ్య ఎక్కువసార్లు వస్తుంటాడు. వంటగదిలోకి వెళ్ళిపోయి వడ్డించుకునేంత చనువు సంపాదిస్తాడు. వీడంటే ఆ రచయితకి అభిమానం. కానీ వీడు, ఈ కుర్రకవి మాత్రం, సినికల్…. మనుషులంటే చులకన. వాళ్ళని కఠినమైన లెక్కల్లో కొలుస్తాడు. నిజానికి వీడికి ఆ రచయితంటే కూడా పెద్ద గౌరవం ఏం ఉండదు. అతని కంటే గొప్పోడినని నమ్ముతుంటాడు. ఇప్పుడు, వీడి కన్ను ఆ రచయిత భార్య మీద పడుతుంది. ఆమెకి ఈ రచయితల, కవుల గోలేమిటో ఏం తెలీదు. వండిపెట్టడం అంటే ఇష్టమంతే. వీలు లేనప్పుడు వండాల్సొస్తే విసుగు కూడా. ఈ కుర్రకవి తెలివిగా ఏకాంతాలు కల్పించుకుని ఆమెకి దగ్గరవుదామని చూస్తాడు. ఆమె వీడి మాటలకి లొంగుతుంది. దగ్గరకు రానిస్తుంది. మొత్తం మీద ఒక రోజు, ఆమె భర్త హాల్లో తాగి తాగి పడిపోయాకా, ఆ ఇంట్లోనే, వాళ్ళ పడకగదిలోనే, ఆమెతో కలుస్తాడు. అలా మొదలైన వాళ్ళ వ్యవహారం కళ్లుగప్పి సాగుతూ ఉంటుంది. ఇదంతా నేపథ్యం అనుకో. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. కుర్రకవే నెరేట్ చేస్తూంటాడు. వాడు ఆ సాయంత్రం రచయిత ఇంటికి అతని భార్యతో ఇంకో రాత్రిని ఊహించుకుని వెళ్తాడు. ఎప్పటిలాగే రచయితతో మందు తాగటానికి కూర్చుంటాడు. మధ్యమధ్యలో నీళ్ళకనో, టాయిలెట్ కనో లోపలికి వెళ్లి, పిల్లాడిని నిద్రపుచ్చుతున్న ఆమెని కదిపి వస్తుంటాడు. మళ్ళీ రచయిత దగ్గరకు వచ్చి కూర్చుని సాహిత్య చర్చ చేస్తుంటాడు. వాళ్ళు ఆ చర్చలో ఉండగా, కాసేపటికి, లోపలి నుంచి ఆమె కేకలు వినపడతాయి. కంగారుగా లోపలికి వెళ్తారు. ఆమె పిల్లాడిని మోసుకుంటూ గుమ్మంలో ఎదురవుతుంది. వాడి నోట్లోంచి నురగలు. వెంటనే ముగ్గురూ ఆసుపత్రికి పరిగెడతారు. దారంతా ఆమె గగ్గోలుగా ఏడుస్తుంది. ఏదో తినకూడనిది తిన్నాడు కానీ ప్రమాదమేం లేదంటాడు డాక్టరు. పిల్లాడిని రాత్రికి ఆసుపత్రిలో ఉంచాలి. భార్యాభర్తలు కాస్త కుదుటపడతారు. కుర్రకవి సిగరెట్ తాగటానికి బైటికి వస్తాడు. కోరిక తీరక విసుగ్గా ఉంటుంది వాడికి. ఇక్కడికి ఎందుకొచ్చాడో, తనకేం సంబంధమో అర్థం కాదు. అలా సిగరెట్ తాగుతూ బైట పచార్లు చేస్తుండగా, ఒక దృశ్యం కనిపిస్తుంది. లోపల ఆసుపత్రి వరండాలో, గోడ వారన ఉన్న బెంచీ మీద, ఆ భార్యాభర్తలిద్దరూ కూర్చుని ఉంటారు. ఆమె అతని భుజం మీద తలవాల్చింది. అతను ఆమె తల నిమురుతున్నాడు. ఈ దృశ్యం చూసి కుర్రకవి కాసేపు కదలకుండా నిలబడిపోతాడు. నిశ్శబ్దంగా వెనక్కి నడుస్తాడు. ఒక్కడూ తన గదికి వెళ్ళిపోతాడు.’’ – సిరిన్ చెప్పటం ఆపి ఇవాన్ వైపు చూస్తున్నాడు.

‘‘అంతేనా?’’

‘‘అంతే.’’

ఇవాన్ గట్టిగా నవ్వాడు. ఆ నవ్వులోని వెక్కిరింత సిరిన్ కి తెలుస్తుందీ అనిపించేదాకా నవ్వాడు. అతని ముఖం జేవురించిపోయింది. ‘‘ఇంత ఎడ్డి కథ రాయగలవని ఎప్పుడూ అనుకోలేదు. చచ్చుపుచ్చు నవలల్లో అరిగిపోయిన ఆసుపత్రి క్లయిమాక్స్ తో సహా ఏ క్లీషేనీ వదల్లేదు. ఏం చెప్పాలనుకుంటున్నావ్ అసలు? ఎట్లాగో నీ అంతటి గొప్పోడికీ ఆరోగ్యవంతుడికీ పెళ్ళయిందని, ఇప్పుడు వివాహ వ్యవస్థకి స్తోత్ర వచనాలు రాసే పనిలో పడ్డావా, ఎంతటి రొచ్చులోనయినా ముంచి తీసి దాని ఔన్నత్యాన్ని నిరూపించాలని పూనుకున్నావా? ఒకవేళ ఆ భర్తే పనికిమాలినోడైతే? రేపు వాడి భార్యా ఆ కవీ లేచిపోయి పెళ్ళి చేసుకుని పిల్లాపాపలతో సుఖంగా పవిత్రంగా బతికి ముసలివాళ్లయిపోతే? అప్పుడేమవుతుంది నీ థియరీ? పాపాలూ పుణ్యాలూ, వాటికి తగ్గ ఫలితాలూ అని మరీ ఎడ్డి మాటలైతే మాట్లాడవనే అనుకుంటున్నాను. మనుషుల గురించి మాట్లాడు బాబూ, ఇంస్టిట్యూషన్ల గురించి కాదు.’’

‘‘నేను మనుషుల గురించే మాట్లాడుతున్నాను. ఈ కుర్రకవి లాంటోడికి… నువ్వు చెప్తున్నట్టు ఆమెతో కథ సుఖాంతం కాదు. నా ఉద్దేశం పెళ్ళి గురించి గొప్పగా రాయాలని కాదు. వాడే ఎంత జాలిపడాల్సిన కేరెక్టరో చూపించాలని. అలాంటి వాడికి ఏదీ నిలబెట్టుకోవడం రాదు. అసలు కూల్చటం తప్ప, కట్టుకోవటం చాతకాదు. బహుశా రాస్తే నీకు బాగా అర్థమయ్యేదేమో.’’

‘‘నీ అసంప్షన్లకి తగ్గట్టూ పాత్రలని కల్పించేసి వాళ్ళు నిజం మనుషులని నమ్మించలేవు. అలాంటి మనిషి గురించి నీకు ఏం తెలుసు? వాడి లోకం, దాని ఒంటరితనం, అందులోని దెయ్యాలూ… అవేం నీకు తెలియకుండా వాడి గొంతుతో కథ ఎలా చెప్తావు? నువ్వేం రాసినా వాడి మీద నీకు ఉన్న అభిప్రాయం బైటపడుతుందే తప్ప, వాడు నీ కథలోకి రాడు.’’

సిరిన్ జవాబు ఇచ్చే ప్రయత్నం చేయలేదు. నవ్వుతూ, ఒహో అలాగా అన్నట్టు తలాడించాడు. ఏదో గెలిచినట్టే ఉన్న ఆ నవ్వు చూస్తే– అసలు అతనికి ఈ కథ రాసే ఉద్దేశమే లేనట్టూ, తనకి చెప్పటానికే ఇదంతా అప్పటికప్పుడు కల్పించినట్టూ అనిపించింది ఇవాన్ కి.

వీధిలో అలికిడైంది.

గుర్రపు డెక్కల కింద మంచు నలుగుతున్న పొడిపొడి శబ్దం.

ప్రాణం వచ్చిన నీడల్లా వున్న రెండు గుర్రాలు స్లెడ్జి బండిని లాగుతూ వీధి మలుపు తిరిగాయి. ఆ బండి ఎదురుగా ఉన్న బిల్డింగు దగ్గర ఆగింది. ఇందాకటి నుంచీ వీళ్ళు చూస్తున్న పైఅంతస్తు కిటికీ తెరుచుకుంది. ఒక తల బైటికి తొంగి చూసి మళ్ళీ తలుపేసుకుంది.

కాసేపటికి కింద తలుపు తెరుచుకుంది. ఒకామె భుజానికి సంచితో, చేతిలో పెట్టెతో బైటికి నడిచి వచ్చింది. స్లెడ్జి బండివాడు ఆమె చేతుల్లోంచి బరువు అందుకొని సర్దుతున్నాడు. ఆమె వెనకే చలిదుస్తుల్లో ఊలుబంతిలా ఉన్న పిల్లాడు గెంతుతూ వచ్చాడు. వాడు గుర్రం కళ్ళేలని పట్టుకొని లాగుతున్నాడు. వీళ్ళ వెనకే ద్వారంలోంచి మరొక మనిషి వచ్చాడు. అతను గొర్రె తోలుతో చేసిన పొడవాటి కోటు వేసుకుని ఉన్నాడు. బైటికి రాగానే ఏం చేయాలో తెలియనట్టు కాసేపు నిలబడ్డాడు. తర్వాత కళ్ళేలు లాగుతున్న పిల్లాడిని ఎత్తుకున్నాడు. వాడి చెంపల మీద ముద్దులు పెట్టుకున్నాడు. వాడిని బండిలో కూర్చున్న ఆమెకి అందించాడు. బండివాడు వీడ్కోలు మాటలకి సావకాశం ఇవ్వడానికి అన్నట్టు బండి నిలిపి వెనక్కి చూశాడు. కానీ అవేం జరగలేదు. ఆమె కదలమన్నట్టు సైగ చేసింది. స్లెడ్జి బండి చుట్టుతిరిగి వెళ్ళిపోయింది. అతను ఒక్కడూ మిగిలాడు. ద్వారం వైపు కదలబోయి ఏదో గుర్తొచ్చినట్టు ఆగాడు. వీధంతా కలయజూశాడు. వీళ్ళిద్దరూ కనపడ్డారు. రమ్మని చేయి ఆడించి బిల్డింగులోకి వెళ్లాడు.

ఇవాన్, సిరిన్ ఇద్దరూ వీధి దాటి అటువైపు నడిచారు. అతని వెనకే మెట్లెక్కారు. ఓ మాట లేకుండా, ఓ పలకరింపు లేకుండా, వెనక్కి కూడా తిరిగి చూడకుండా, అతను బరువుగా మెట్లెక్కి తలుపు తీసి లోపలికి వెళ్లాడు.

ఇంటి లోపలి వెచ్చదనానికి ఇద్దరికీ ప్రాణం లేచొచ్చింది. ఓ మూల పొగలు కక్కుతున్న సమోవార్ ఎంతో అందమైన దృశ్యంలాగ కనపడింది. అది పెద్ద హాలే, కానీ ఫర్నిచర్ నిండుగా ఉండి, పుస్తకాలు గుట్టలుగా పేరుకుని ఇరుకుగా ఉంది. ఆ ఇరుకు కూడా వెచ్చగా బావుంది. టీపాయి ముందున్న రెండు వింగ్ చెయిర్లలో ఇద్దరూ కూర్చున్నారు.

‘‘మీరిద్దరూ తాగండి. నేను ఆల్రెడీ కొంచెం పుచ్చుకున్నాను. టీ తాగుతాను,’’ అంటూ ఒక చేత్తో వోడ్కా సీసాను, ఇంకో చేత్తో రెండు గ్లాసులను తెచ్చి టీపాయి మీద ఉంచాడు సోమొవ్.

తర్వాత సమోవార్ ను చేతుల్లో మోస్తూ, ఆ బరువుకు తంటాలు పడుతూ నడిచి, గదికి అటువైపు ఉన్న డైనింగ్ టేబుల్ మీద పెద్ద చప్పుడుతో దాన్ని ఉంచాడు. అక్కడే కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. ఆ టేబిల్ పైన వేలాడే గ్యాస్ లైటు వెలుగులో అతని తల మీద పల్చబడిన వెంట్రుకలు మెరుస్తున్నాయి. కుళాయి తిప్పి వెచ్చని ద్రవాన్ని కప్పులోకి పోసుకున్నాడు. కప్పులోంచి పైకి తేలే ఆవిర్లలో అరిచేతులు కాచుకుంటున్నాడు. ఈ కాసేపట్లోనే ఇంటికి అతిథులు వచ్చారన్న సంగతి మర్చిపోయినట్టు, ఇటువైపు అసలు చూడకుండా, టీ జుర్రుకుంటున్నాడు.

‘‘ఏమైంది మీకు? మామూలుగా లేరు?’’ అన్నాడు సిరిన్.

సోమొవ్ తేరుకుని ఇటు చూశాడు. అతని వెనక అల్మరాలో బహుమతి పతకాలేవో వరుసగా పేర్చి ఉన్నాయి. అతని ముఖం వాటిలో ఒకటి అన్నట్టు ఉంది. గట్టిగా నిట్టూర్చి కుర్చీలో వెనక్కి వాలాడు. ‘‘చాలా సేపు వెయిట్ చేయించినట్టున్నాను మిమ్మల్ని,’’ అన్నాడు.

‘‘అది సర్లెండి. మీరేంటో తేడాగా ఉన్నారు ఇవ్వాళ. సిస్టర్ ఎక్కడికో వెళ్తున్నట్టుంది?’’ అన్నాడు సిరిన్, బిరడా తీసి వోడ్కా పోసుకుంటూ. ఇవాన్ ఈ ప్రశ్నలకు ఏం జవాబు వస్తుందా అన్నట్టు సోమొవ్ ముఖంలోకి తదేకంగా చూస్తున్నాడు.

‘‘మనలాంటి వాళ్లకి ఈ పెళ్ళిళ్ళూ సంసారాలూ నప్పవయ్యా! కానీ యవ్వనంలో మనకన్ని తెలివితేటలు ఉండవు కదా. మనమూ అదే వయసులో ఉన్న అందర్లాంటి వాళ్ళమే కదా. లోపల రసాయనాలు ఊరుతుంటాయి. మనల్ని ఆడిస్తూంటాయి. ఆ జోరుకి ఎందులో ఒకందులో ఏముందిలెమ్మని దిగిపోతాం, ఇరుక్కుపోతాం. ముఖ్యంగా అవతలివాళ్ళతో అభిరుచులు కలవకపోయినా నెట్టుకువద్దామని చూస్తాం చూడు. అది ఎంతో కాలం సాగదు. ఆమెని నాకు తగినట్టు మలుచుకుందామని, నాతో పాటు నా ఇంటెలెక్చువల్ జర్నీలో భాగం చేద్దామని, మానవ ప్రయత్నం అంతా చేశాను, ఈ ఇరవై ఏళ్ళలో. కానీ వాళ్ళ స్థాయికి మనల్ని దిగలాగాలని చూస్తారు చూడు! ఏం చేయగలం అప్పుడు?’’

మాట్లాడుతూ నములుతున్న బిస్కెట్ పొడి సోమొవ్ మీసానికి అంటుకుంది. మనిషి ఒకే రోజులో ఎంతో వయసుమళ్ళినట్టు కనిపిస్తున్నాడు.

‘‘గొడవలు ఉంటాయి కదా. వెళ్తారు వస్తారు, వెళ్తారు వస్తారు. సీనియర్లు మీకు తెలీందేముంది,’’ అన్నాడు సిరిన్.

‘‘ఇది అలాంటిది కాదు. అలిగి ఊరెళ్ళిపోవటాలు… అలాంటివి ఎప్పుడూ లేవు. నేననుకోవటం ఇది ఇక్కడితో ఆఖరు. కట్ కట్ కటీఫ్! ఇవాన్, నీకు చెపుతున్నాను గుర్తుంచుకో, పెళ్ళి మాత్రం చేసుకోకు. వొంటి కోసమనో వంట కోసమనో లొంగిపోతావేమో. అస్సలొద్దు. సరేనా?’’

సిరిన్ ఓరగా కళ్ళు మాత్రం తిప్పి ఇవాన్ వైపు చూశాడు.

ఇవాన్ రాని నవ్వు పెదాల మీద పులుముకున్నాడు. సిరిన్ వైపు చూడకుండా ఉంటానికి ప్రయత్నించాడు. ‘‘ఇంతకీ ఏ ఊరు?’’ అన్నాడు.

‘‘ఏంటి?’’ అన్నాడు సోమొవ్ అర్థం కాక.

‘‘అహ… ఏ ఊరు వెళ్లారు అని అడుగుతున్నా.’’

ఊరి పేరు చెప్పి మళ్ళీ తన ధోరణిలో మాట్లాడుతూనే ఉన్నాడు సోమొవ్: ‘‘ప్రాకృతిక వచన శిల్పి అని మళ్ళీ గొప్ప పేరు నాకు. యూనివర్సిటీలోనేమో ఫిజిక్స్ ఈక్వేషన్లు చెప్తాను. కానీ ఆడదాని ప్రకృతి, అనుబంధాల ఈక్వేషన్లూ… అసలేం తెలియవు నాకు. నమ్మటం తెలుసు. మనుషుల్ని నమ్మటం… ప్చ్…!’’

ఇవాన్ పైకి లేచి నిలబడ్డాడు. ‘‘ఏమనుకోకండి. ఇప్పుడే గుర్తొచ్చింది. నేను ఒక చోటుకి వెళ్ళాలి,’’ అన్నాడు.

జవాబుగా సోమొవ్ ఏమంటున్నాడన్నది పట్టించుకోకుండా, సిరిన్ చూపుల్ని ఖాతరు చేయకుండా, క్షణాల్లో వాళ్లని వదిలించుకొని, పెద్ద పెద్ద అంగలేసుకుంటూ మెట్లు దిగి, మళ్ళీ మంచు పేరుకున్న వీధిలోకి వచ్చాడు. ఇందాక స్లెడ్జి బండి వెళ్ళిన జాడలు కూడా కప్పడిపోతున్నాయి. మంచు మీద ఎంత వేగంగా పరిగెత్తగలడో అంత వేగంగా పరిగెత్తాడు. వీధులు దాటాడు, వంతెన దాటాడు. ఆ మలుపులో గుర్రాలు లాగే ట్రామ్ ఒకటి కదులుతూ కనపడితే, అందులోకి దూకాడు.

మనసు వేగం ఒకలా ఉంటే, ట్రామ్ వేగం మరోలా ఉంది. ఇవాన్ తప్పించి ఇద్దరే ప్రయాణికులు ఉన్నారు. ఇద్దరూ నిద్రకు జోగుతున్నారు. డ్రైవరు, కండక్టరు ముందుభాగంలో నిలబడి మాట్లాడుకుంటున్నారు. కూర్చోబుద్ధివేయక ఇవాన్ మెట్ల దగ్గరే నిలబడ్డాడు. కొన్నాళ్ళ క్రితం ఇదే ట్రాములో ఆమెతో కలిసి వెళ్ళటం గుర్తొచ్చింది. ఆమె ఇంట్లో ఏదో సాకు చెప్పి బైటికి వచ్చింది. ఇద్దరూ ఇదే మెట్ల మీద నిలబడ్డారు. ఆమె పైమెట్టు మీద ఉందికదాని ఆ మెట్టు ఎక్కాడు. ఎక్కగానే ఆమె కింది మెట్టు మీదకి దిగి నవ్వింది. అవి తొలి రోజులు. చనువు ఇంకా రాలేదు. తాకాలని తపించేవాడు. దుస్తుల వెనక ఆమె పచ్చటి శరీరం వైనం దొరక్క ఊరించేది. ఆ రోజు ఇద్దరూ స్కేటింగ్ రింక్ కు వెళ్ళారు. వీళ్ళు చేరేసరికి ఆ ఆవరణ అంతా కేరింతలు కేరింతలుగా ఉంది. చుట్టూ బర్చ్ చెట్లు మంచు బరువుకి వొంగిన కొమ్మలతో పండగ బట్టలు వేసుకున్నట్టు ఉన్నాయి. మంచునేల మీద మనుషులు జారుతూ, అదుపుతప్పుతూ, నిలదొక్కుంటూ సంతోషంగా ఉన్నారు. ఇద్దరూ స్కేటింగ్ బూట్లు తొడుక్కొని ఆ సందడిలో ప్రవేశించారు. గిర్రుమని తిరగటాల్లో, గుద్దుకోవటాల్లో, తూలితే పట్టుకోవటాల్లో ఆమె భుజాలు, నడుము, పక్క రొమ్ములూ అన్నింటి మెత్తదనమూ ఆ రోజు తెలిసింది. వొంట్లో రక్తానికి బదులు పొగలు కక్కే వేడి మదం పారుతున్నట్టు కాలిపోయాడు.

ట్రామ్ మెట్ల మీద చలి భరించలేనట్టే ఉంది. లోపలికిపోయి కూర్చున్నాడు. ట్రామ్ బోర్డు మీద చిరిగిన టిక్కెట్లను, ఆ ఇనుము మీద అల్లికనూ చూస్తున్నాడు. ఇప్పుడు ఆమె కోసం ఎందుకు వెళ్తున్నాడో తెలీదు. వెళ్ళాలని మాత్రం తెలుసు. ‘‘అసలు ఏం జరిగుంటుంది? తెగదెంపుల దాకా ఎలా వెళ్ళింది? ముందుముందు ఏం చేద్దామని? మొన్న నా సంపాదన గురించి అడిగింది; అంటే వెనక్కి వస్తుందా, నాతో జీవితాన్ని ఊహించుకుంటుందా?… రెండు గదుల ఇంట్లో ఆమెతో, పిల్లాడితో సంసారం… నేను సిద్ధమేనా ఆ బాధ్యతకి. మరి నా ఆశయాలు, ఇంటెలెక్చువల్ ఏస్పిరేషన్లు? నాకు ఒక్కోసారి వాటిలోనే అర్థం కనపడదే, ఇక ఈ సిసిఫస్ బండని ఎలా భుజాన్నెత్తుకోగలను. ఉనికే బరువైనవాడ్ని ఇంకో జీవానికి ఎలా పూచీపడగలను. చిరుగుల ఓవర్ కోటు తొడుక్కొని గుమాస్తా ఉద్యోగం… జీవితం అంటే ‘ఇంతే, ఇదే’ అని అనుక్షణం తెలిసిపోవటం… భరించగలనా? కానీ మరి ఆమెతో ఉంటే ఆనందంగా గడిచే క్షణాలో…? కథల్లో కవిత్వంలో కనపడే దాంపత్య జీవితం… పియానో సంగీతాన్ని, కాంతులీనే నగరాన్ని, వంతెన కింద నదిని, పొప్లార్ చెట్ల మధ్య ఏకాంతాన్ని కలిసి పంచుకోవటం… గదిలోంచి గదిలోకి నడుస్తుంటే తగిలే భుజాలు, రాత్రుళ్ళు ఒత్తిగిలితే శ్వాసించే ఓ నిండైన సమక్షం, అద్దంలోంచి ఓరగా నిన్నే నిమిరే చూపులు, ఇద్దరూ కలిపి రాసుకునే రోజులు…. కానీ, కానీ… ఆ ఒకానొక్క మనిషీ ఆమేనా? ఎలా తెలుస్తుంది? ఏదన్నా తేడాకొట్టి ఇరుక్కుపోతే? ఏం తెలుసు ఆమె గురించి నాకు, ఏం మాటలుంటాయ్ ఆమెతో నాకు, అసలేముంది మా మధ్య– గుట్టుగా, అరుదుగా తీర్చుకోవాల్సి రావటం వల్ల విలువ పెంచుకున్న కోరిక తప్ప. ఆమె నేలబారు లోకం, కొసకొచ్చేసిన యవ్వనం, గరుకుబారిన మనసూ… ఏం చేసుకోవాలి నేను….’’. ఇవాన్ ఆలోచన ఆ మూల నుంచి ఈ మూలకి లోలకంలా ఊగుతోంది. తెరుచుకున్న మరుక్షణమే మూసుకుపోబోయే తలుపు ముందు నిలబడి, లోపలికి వెళ్ళాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోవాల్సిన పరిమిత క్షణంలో ఇరుక్కుపోయినట్టు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.

రైల్వేస్టేషను దాదాపు నిర్మానుష్యం. దీపాల కింద ఒకరిద్దరున్నారు, దుస్తులు గాలికి చెదురుతూ. ఇవాన్ ప్లాట్ఫాం మీదకు పరుగెడుతూ రైలు కిటికీల్లో వెతుకుతున్నాడు. ఇక చివరాఖరి బోగీ ఉందనగా, తలతిప్పితే, మసగ్గా వెలుగుతోన్న ఒక కిటికీలోంచి, ఆమె కనపడింది. ఆమెను చూడకముందే ఆమె తనను చూసిందని అర్థమైంది. కానీ పిలవాలన్న సన్నాహమేమీ ఆ ముఖంలో లేదు. అతను చూసుండకపోతే దాటివెళ్ళిపోనిచ్చేదేమో కూడా! కిటికీ దగ్గరకు వెళ్ళి అద్దం మీద మంచు తుడిచాడు. రైలుపెట్టె లోపల వెచ్చగా, తీరుబడిగా ఉన్న లోకం లోంచి ఆమె అతన్ని చూస్తోంది. కిందకి రమ్మని సైగ చేశాడు. వొడిలో నిదురపోతున్న పిల్లాడిని పక్కన సర్దింది. ఎదుటకూర్చున్న ప్రయాణీకులకి అప్పజెప్పి లేచింది.

అతను కోటులో చేతులుంచుకుని, అదిరే గుండెని పెద్ద ఊపిర్లతో స్థిమితం చేసుకునేందుకు ప్రయత్నించాడు. గాలి జోరుకి ఎక్కడో ఇనుపరేకు ఆగి ఆగి కొట్టుకుంటోంది. ఒక రైలు కార్మికుడు చేతిలో లాంతరుతో రైలు వారన పరిగెడుతున్నాడు. ఉన్నట్టుండి మర్లిన గాలికి పెట్టెమీద పేరుకున్న మంచు తుంపరగా రాలింది. ఆమె తలుపు దగ్గర నిలబడింది. నీలిరంగు గ్లోవ్ వెనక మెత్తదనాన్ని అందుకున్నాడు. ఎదురుబొదురు ముఖాలతో నిలబడ్డారు.

‘‘ఏంటి ఇంత హఠాత్తుగా… ఎక్కడికి వెళ్తున్నావ్?’’

‘‘మా ఊరికి’’

‘‘నాకెందుకు చెప్పలేదు?’’

‘‘మనిషికిచ్చి ఉత్తరం పంపించాను. నువ్వు ఇక్కడికి రాకపోతే ఈపాటికి నీకు అందే ఉండేది.’’

బహుశా ఇప్పుడు తన గది తలుపు కింద పడివుండే ఆ ఉత్తరం అతని మనసులో మెదిలింది. అది తెరిస్తే ఎప్పటిలాగే ఒక పట్టాన అర్థం కాని దస్తూరి, ఒత్తులూ కామాలూ ఫుల్‍స్టాపులూ లేకుండా, కుడివైపు పల్లంలోకి పారే వాక్యాలు… అవి అక్కడ ఏం చెపుతున్నాయో తెలియకుండా– తను ఇక్కడ ఏం మాట్లాడాలి….

‘‘ఏం రాశావు?’’

‘‘వెళ్ళాక చదువుకో.’’

‘‘… … …’’

‘‘… … …’’

‘‘అసలేమైంది… దేని గురించి గొడవ?’’

‘‘నువ్వే అని తెలీదు గానీ, నాకు ఎవరితోనో నడుస్తుందని అతనికి అర్థమైంది. ఎప్పుడు అడగాలనుకున్నాడో, అసలు అడగాలనుకున్నాడో లేదో మరి… ఈలోగానే అతనికి తెలిసిందని నాకూ అర్థమైంది. ఇక అడగక తప్పని పరిస్థితి నేనే కల్పించాను.’’

అతని మీదుగా వెనక్కి చూస్తున్న కళ్ళతో మాట్లాడుతోంది. ఆమె చెయ్యి ఇంకా రైలుపెట్టె తలుపు దగ్గరి కడ్డీని పట్టుకునే ఉంది. మెడ చుట్టూ ఉన్న వస్త్రం గాలి వాలుకి తగ్గట్టు కాసేపు వెనక్కి రెపరెపలాడుతోంది, కాసేపు చెంపలకేసి రాసుకుంటోంది.

‘‘అయితే వెళ్ళిపోవాలన్న నిర్ణయం నీదే అన్నమాట.’’

అవునన్నట్టు తల ఊపింది.

‘‘మరి… నేను?’’

అతని కళ్ళల్లోకి చూసింది…. ‘‘ఏంటి మరి నువ్వు?’’

‘‘మనం…!’’

నవ్వింది.

‘‘ఏంటి?’’ అన్నాడు.

‘‘మనం ఏంటో నీకు తెలుసు కదా,’’ అంది.

దెబ్బతగిలినట్టు ఆగాడు. మనసులోంచి ప్రేమభావం నిండిన మాటలు చెమ్మగా ఊరాయి. కానీ అప్పటిదాకా కవ్వింపులు, కొంటెతనాలుగా నడిచిన బంధంలోకి అలాంటి మాటలు రాలేమంటున్నాయి. ‘‘ఏం రాశావో చెప్పచ్చు కదా ఉత్తరంలో…?’’ అన్న మాట మాత్రం మెత్తగా, బుజ్జగింపుగా అనగలిగాడు.

‘‘పోయి చదువుకో తెలుస్తుంది.’’

ఆమె చేయి పట్టి గుంజి గట్టిగా అడగాలని ఉంది. చాటుమాటు సమయాల చనువంతా ఎక్కడ తప్పిపోయిందో అర్థం కావటం లేదు.

ఈలోగా ఆమే మాట్లాడింది. ‘‘ఏ బంధానికైనా మనం ఏ విలువ ఇస్తామో అదే కదా ఉండేది,’’ అంది.

‘‘ఆ వాక్యానికసలు ఏమైనా అర్థం ఉందా?’’ విసురుగా అన్నాడు. అనుకోకుండానే గొంతులోకి వెక్కిరింత తోసుకొచ్చింది.

కళ్ళు అతని వైపు తిప్పింది. ‘‘నాకు మీలా వాక్యాలు అల్లటం రాదు మరి.’’

ఆ ‘‘మీలా’’ అన్న మాట లోలోపలికి వచ్చి పొడిచింది.

‘‘అతనూ నేనూ ఒకటేనా?’’

ఆమె దానికి జవాబు ఇవ్వలేదు కానీ, ఆలోచించి, నింపాదిగా మాట్లాడింది. ‘‘నా జీవితంలో ఈ ఇరవై ఏళ్ళల్లో నేను సంపాదించుకున్నది ఏమైనా ఉంటే, అదిగో, ఆ లోపలున్న జీవం ఒకటే. ఇంకేదీ వెంట తీసుకెళ్ళేది కాదు.’’

ఇక్కడే వదిలేసే అన్నింటిలో తను కూడా ఒకడన్నమాట. అలా కాదని వాదించేందుకు, ఒప్పించేందుకు తమ బంధంలోంచి రుజువులేమైనా తెచ్చి చూపించగలడా… కాసేపటి క్రితం కూడా మనసులో అన్ని అనుమానాలున్నవాడు కదా! ఇప్పుడు ఆమెకూ ఈ బంధం మీద ఏ భ్రమలూ లేవన్న నిజం తెలిశాక కదూ– ఆమెలో అంతకుముందు చూడని లోతేదో తెరుచుకున్నట్టయి, ఆమె కావాలనిపించేది? కానీ ఆమె దక్కినా ఒరిగేది ఏముంది… మనిషంత పుండుని ఓ చామంతి రేకు ఏం నయం చేయగలదు….

వెనక నుంచి రైలు కూత వినపడింది.

ఆమె అటు చూసి మళ్ళీ అతని కళ్ళల్లోకి చూసింది. మొదటిసారి వాటిలో ఏదో అక్కర.

‘‘నీకు జీవితం నుంచి చాలా కావాలి. నన్నేం చేసుకుంటావ్ చెప్పు?’’ అంది.

జవాబేం అక్కర్లేదన్నట్టు మెట్లు ఎక్కి లోపలికి వెళ్లింది.

రైలు కదిలింది.

కదులుతోన్న ఆ ద్వారం అతని మనసుకి కొక్కెం వేసి వెంట గుంజుతోంది. అయినా నిలదొక్కుకొని అతని శరీరం రైలు పెట్టెలన్నీ వెళ్ళిపోయేదాకా అక్కడే నిలబడింది. ఆఖరు బోగీ మిగిల్చిన ఖాళీలోకి మంచు తరకలు గిర్రున ఎగిరాయి.

వెనక్కి తిరిగి నడిచాడు.

* * *

నిద్ర పాలించే దేశం నుంచి రోజూ వెలివేయబడే శాపగ్రస్త జనాభాలో ఎప్పటిలాగే అతనున్నాడు. మంచం మీద పడుకొని దూలాల వైపు చూస్తున్నాడు. తలవైపు మంచం కోడులో ఏదో పురుగు ఆగి ఆగి చెక్కని గీరుతున్న చప్పుడు… అది నేరుగా మెదడులోనే దేన్నో గీరుతున్నట్టు ఉంది. పక్కన గోడకున్న పగులులోంచి బొద్దింక పిల్ల తలబైటపెట్టి చూసి మీసాలు ఊపి లోపలికి వెళ్ళిపోయింది. నిద్ర రాదు. దృశ్యం నుంచి విముక్తి లేదు. లేచి దీపం ఆర్పి వచ్చి మళ్ళీ మంచం మీద కూర్చున్నాడు. అమలినమైన చీకటి… కానీ ఈ చీకటిలో అతని భయాలు రూపం తెచ్చుకుంటాయి, చీకట్లో కూడా కనిపిస్తాయి. ఇప్పుడు తలుపు మూల ఒక దయ్యం ఉంటుందని అతనికి తెలుసు. అది ముసలిది. అట్టలు కట్టిన జుట్టుతో, వొంకర్లు తిరిగిన గోళ్ళతో, ఎర్ర బారిన కళ్ళతో, వికృతమైన నవ్వు దానిది. ఇప్పుడు కొంటెతనంగా చేతిలోని కర్రతో నేల మీద టక్కుటక్కుమని కొడుతోంది.

‘‘ఏయ్..! ఆపు…!’’ గట్టిగా అరిచాడు.

కాసేపు ఆగింది.

మళ్ళీ మొదలైంది.

భయం  వేసింది.

లేచివెళ్ళి రాతబల్ల మీద ఉన్న గ్యాస్ లైటు వెలిగించాడు. ఇప్పటికి పద్దెనిమిది సార్లు చదివిన ఆమె ఉత్తరం ఆ బల్ల మీద ఇంకా తెరిచే ఉంది. దాన్ని నలిపి, ఉండలాగ చుట్టి, చెత్తబుట్టలో పారేశాడు. మళ్ళీ మంచం మీదకి వచ్చి కూర్చున్నాడు.

మళ్ళీ టక్కు టక్కుమని చప్పుడు.

‘‘ఏయ్ ముసలిదానా… దమ్ముంటే బైటకి రావే…’’ అని అరిచాడు.

చప్పుడు ఆగింది.

తలుపు దగ్గర ఏదో కదిలింది.

ఎప్పుడూ తలుపు మూల ఒక రూపంగా మాత్రమే స్ఫురించి భయపెట్టే ఆ ముసలిది, ఇప్పుడు మాత్రం, కళ్ళ ముందుకి వచ్చింది. అతనికి ఎదురుగా నిలబడింది. దాని నడుం వొంగిపోయి ఉంది. ముఖం మీద జుట్టులోంచి కళ్ళేమీ కనపడటం లేదు. కానీ తనవైపే చూస్తున్నదని ఎలాగో తెలుస్తోంది.

‘‘ఎందుకలా చప్పుడు చేస్తున్నావ్? బతకనివ్వవా?’’

జవాబుగా ఆ జుట్టు వెనక నుంచి ఇకిలింపు వినపడింది.

‘‘వెళ్ళిపో ఇక్కడి నుంచి. లేకపోతే దూలానికి ఉరేసుకుంటాను,’’ అన్నాడు.

ముసలిది మెల్లగా పక్కకి తిరిగింది. ఊతకర్ర తాటించి నడుస్తూ వెళ్ళి, కష్టంగా వొంగి, చెత్తబుట్ట లోంచి కాయితం ఉండ తీసింది. దాన్ని బల్ల మీద పెట్టి గోళ్ళతో సాపు చేసింది. అందులో అక్షరాల మీదకి వొంగి చదివింది. తర్వాత ఇవాన్ వైపు తిరిగి మాట్లాడింది.

‘‘అదృష్టవంతురాలు. లేకపోతే నీ ఏకాకితనాన్ని ఆమె మీద మసిలాగ పులిమేద్దువు. దేనికీ అర్థముండని నీ శూన్యంలోకి లాగి గొలుసులు వేసి కట్టేద్దువు. నీ ఏదీ నమ్మనితనాన్ని శూలంగా చేసి పొడిచేద్దువు. వద్దొద్దు… మంచికే జరిగింది. నీకు మనుషులొద్దు. అమాయకం మనుషులు అస్సలొద్దు. నేనే నీకు సరిజోడు….’’ అని దగ్గులాగా ఆగకుండా నవ్వుతోంది.

ఇవాన్ మెడ మీద వెంట్రుకలు లేచి నిలబడ్డాయి ఆ నవ్వుకి.

చప్పున లేచి, ‘‘ఛీ! నా బతుక్కి ఏదీ ఒరిజినల్ కాదు. నిన్ను కూడా చవకగా ఏ దయ్యాల కథలోంచి తెచ్చుకున్నానో. నువ్వే ఉండు ఈ గదిలో. నేను పోతున్నాను,’’ అంటూ, కోటు తగిలించుకొని, మెట్లన్నీ దూకుతున్నట్టు దాటి, వీధిలోకి వచ్చిపడ్డాడు.

మళ్ళీ అదే మంచు, అదే హోరు.

కానీ ఈ సాంత్వనామయ ఆకాశం కింద… ఏదీ వెంటాడని ఏకాంతం.

వంతెన వైపు నడిచాడు. ముళ్ళు మొలిచిన మంచాల మీంచి, రక్కసి కోరలు గీరుకునే గదుల నుంచి, ఎవరి దయ్యాల బాధ వాళ్ళు పడలేక తనలాగా బైటికొచ్చి తచ్చాడే మనుషులు వంతెన మీద ఒకరిద్దరైనా ఉంటారు. పన్నెత్తి పలకరించకుండా, ఒకరికొకరు కంటపడిందే ఊరటగా, ఒకరినొకరు దాటుకుపోయిందే ఓదార్పుగా, తెల్లారేదాకా పచార్లు చేయవచ్చు. లేదంటే వంతెన కింద నదిలోకి చూస్తూ, అది ప్రవహించే ఊహా ప్రాంతాల వైపు మనసుని పడవలా చేసి వదలచ్చు. అదీకాదంటే నది కడుపులోని చీకట్ల పిలుపు మన్నించి దూకేయనూ వచ్చు.

కానీ ఈ రాత్రి వంతెన మీద ఎవ్వరూ లేరు. దీపస్తంభాల వెలుగులో రాలుతున్న మంచు తరకలు తప్పించి. కొంత దూరం నడిచి, వంతెన గట్టుకి మోచేతులు ఆన్చి, కింద గడ్డకట్టిన అంచుల మధ్య పారుతున్న నదీ పాయకేసి చూస్తూ నిలబడ్డాడు. ఎవ్వరూ లేకపోవటం కూడా ఎందుకో బానే అనిపించింది. భయాల్ని బయట ఆపేందుకు కట్టుకునే గోడల్లోంచే దయ్యాలు పుడుతున్నప్పుడు, ఇక తనలాంటివాళ్ళకు ఈ బయళ్ళే ఊరట. గోడలు లేని అనంతమైన బయలులో, నిద్దరోయే ఊర్లెన్నింటినో ఒరుసుకొంటూ పోయే ఈ నదిపైన ఇలా నిలబడితే– ఒంటరితనం తనది కాదు ప్రపంచానిదే అనిపించింది.

ఆమె గుర్తొచ్చింది. ఆమెని ఇంకోలాంటి పరిస్థితుల్లో కలిసివుంటే, ఆమెతో మొదటి మాటలు ఇంకోలాగ కలిపివుంటే, ఆమె మనసులోకి ఇంకో ద్వారం లోంచి అడుగుపెట్టివుంటే ఎంత బావుండేదీ అనిపించింది. ఊపిర్లు పెనవేసుకొనేంత దగ్గరగా ఉన్నప్పుడూ ఆకళింపుకురాని ఆమె సమక్షం ఇప్పుడు దూరమయ్యే కొద్దీ ఎంత అపురూపమో రుజువు చేసుకుంటోంది. రైలు ఈ పాటికి స్టెప్పీల మీదుగా పరిగెడుతూ ఉంటుంది… రైలుకీ, నదికీ పోలిక తోచింది. బాగా ఊపిరి తీసుకుని నిట్టూర్చాడు. అది ఉపశమనం కాదు. కానీ యాతనలో చిన్న విరామం. అధ్యాయానికి అధ్యాయానికి మధ్య ఇలా అనిపించడం సహజం అనుకున్నాడు.

('సారంగ' వెబ్ మేగజైన్ లో ప్రచురితం)

September 6, 2023

పడి మునకలు కవర్ మీద చెహోవ్ బొమ్మ లేకపోవటమ్ గురించి

 ప్రపంచం మొత్తాన్నీ పొందికగా నడిపించగల ఒకేవొక్క మత గ్రంథాన్నో పౌర స్మృతినో నిర్మించాలంటే అందుకు సరైన ముడి సరుకు చెహోవ్ కథల్లో దొరుకుతుందీ అని నేననుకుంటాను. అలాగ నాది చెహోవ్ మతం, నేను చెహోవ్ దేశ పౌరుడ్ని. చెహోవ్ కథల వెనక (ముఖ్యంగా ఆయన జీవితంలో ఆఖరి పదిహేనేళ్ళలో రాసిన కథల వెనక) వ్యక్తావ్యక్తంగా తోచే నైతిక సారాన్నే నేను జీవితాన్ని నడుపుకోవటానికి ఆదర్శమని భావిస్తాను. కానీ అది ఏమిటో స్పష్టంగా మాటల్లో చెప్పమంటే నాకు కష్టం. అదే దాని అందం కూడా. ఇక్కడ సోషల్, పొలిటికల్ ఇష్యూస్ మీద రకరకాల వాదనలు జరుగుతుంటాయి. మనుషులు ఎటోఒకవైపు బలంగా నిలబడతారు. బల్లగుద్ది తీర్మానిస్తారు. నేను మటుకు ఎటూ గట్టిగా మాట్లాడలేను. పైగా నాలోని ఈ అశక్తతను ఒక అపురూపంగా కాపాడుకోవాల్సిన విషయంగా కూడా చూస్తాను. వ్యక్తి వ్యక్తికీ మారే ప్రపంచపు కంప్లెక్సిటీ, ఎవరో ఒకానొక వ్యక్తికి అన్వయించాక మాత్రమే అర్థంలోకి ఒదిగే ప్రపంచపు సింప్లిసిటీ... ఇవి నాకు చాలా ముఖ్యం. ఈ పట్టింపు చెహోవ్ కథల్లో కనపడుతుంది. అలాగైతే మరి ఈ పేరాను మొదలుపెడుతూ నేను చేసిన హైపాథెసిస్ ని కొట్టిపడేసేది కూడా, అంటే ప్రపంచాన్ని ఏకమొత్తంగా తీసుకొని ఏదైనా మాట్లాడటాన్ని అసాధ్యం చేసేది కూడా, చెహోవ్ కథలేనన్నమాట! ఈ వైరుధ్యంలోనే ఎక్కడో చెహోవ్ రిలవెన్స్ ఉంది. తన ethos ఏంటీ అన్నది చెహోవ్ కూడా ఎక్కడా స్పష్టంగా మాటల్లో పెట్టలేదు. ఒక ఉత్తరంలో బహుశా యథాలాపంగా ఇలా రాస్తాడు:

"My holy of holies is the human body, health, intelligence, talent, inspiration, love, and absolute freedom--freedom from violence and falsehood, no matter how the last two manifest themselves."

కానీ ఇదేనా, ఇంతేనా అంటే ఇంతకుమించి చాలా ఉంది కదా అనిపిస్తుంది. 'లేడీ విత్ ద లిటిల్ డాగ్' అన్న కథలో ఒక వివాహేతర సంబంధాన్ని గురించి చెహోవ్ రాసిన తీరు చూసి టాల్‌స్టాయ్, "ఇది ప్రపంచం పట్ల ఒక స్పష్టమైన దృక్పథం లేని, ఫలితంగా మంచీ చెడుల మధ్య విచక్షణ తెలీని మనిషి రాసిన కథ" అని విమర్శిస్తాడు (వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు తన నవల్లో అన్నా కరెనినాను రైలు కిందకి తోసి దండించిన టాల్‌స్టాయ్). మంచీ చెడుల మధ్య విచక్షణ తెలీనివాడు కాదు చెహోవ్. అలా మంచీ చెడులను విచక్షించగల ప్రమాణం కోసం మతంవైపో సంప్రదాయంవైపో సమాజంవైపో చట్టంవైపో చూడడు; ఆ కథలో ఉన్న "ఎవరో ఒకానొక వ్యక్తి"వైపూ, ఆ ఒకానొక సందర్భం వైపూ చూస్తాడు.

మొన్న రిలీజైన నా వ్యాసాల పుస్తకం బాక్ కవర్ పేజీ మీద నాకు బాగా నచ్చిన, నా రీడింగ్/ రైటింగ్ లైఫ్‌ని మలచిన కొంతమంది రచయితల ఫొటోలని ఉంచాను. కానీ ఆ ఫొటోల్లో చెహోవ్ మాత్రం లేడు. ఎందుకంటే ఆయన మీద రాసిన రాత ఒక్కటి కూడా ఆ పుస్తకంలో లేదు. రాసే సందర్భం ఎందుకో రాలేదంతే. ఆ వరసలో చెహోవ్ లేకపోవటం నావరకూ లోటే కానీ, ఏమీ రాయకుండా ఊరికే ఫొటో పెట్టబుద్ధేయలేదు. మిగతావాళ్ల ఫొటోలను మాత్రం ఇదే వరుసలో ఉంచమని చెప్పాను. దీన్ని నా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అని కూడా అనుకోవచ్చు. వీళ్ళలో ఒకరిద్దరిని కొంతమంది గుర్తుపట్టలేదు. అందుకే అక్కడ ఫొటోలు వుంచిన వరుసలోనే వాళ్ల పేర్లిస్తున్నాను.

Tripura

Kafka

Chalam

Dostoevsky

Nabokov

Borges

Tolstoy

Flaubert

Salinger

(బాక్ కవర్ మీద ఉన్న కొటేషన్ 'పుస్తకాల్ని ఎందుకు పద్ధతిగా సర్దుకోవాలంటే!' అన్న లోపలి వ్యాసం నుంచి తీసుకున్నది. 'పడి మునకలు' అంటే ఏంటని ఒకరిద్దరు అడిగారు. టైటిలుకి అంత లోతైన అర్థమేం లేదు. పుస్తకాల్లో పడి మునకలేయటం అని అంతే.)

June 12, 2023

Mnemonic Note: చిన్నోడి వేసవి సెలవులు 2023

నేను Seinfeld రెండోసారి చూద్దామని మొదలుపెట్టి మూడో సీజను దాకా వచ్చేసరికి చిన్నోడికి ఒంటిపూట బళ్లు మొదలయ్యాయి. ఇంక వాడూ నాతో చూట్టం మొదలుపెట్టాడు. అలా ఈ వేసవి సెలవుల్లో రోజుకి రెండు మూడు ఎపిసోడ్లు చొప్పున మిగతా ఏడు సీజన్లూ ఇద్దరం కలిసి చూసేశాం. పెద్దాళ్ల షో అయినా, అందులోని సిల్లీనెస్‌ ని వాడూ చాలా ఎంజాయ్ చేశాడు. వాడికి నాకూ కూడా Kramer కేరెక్టరు అంటేనే ఇష్టం. ఒకటి రెండు ఎపిసోడ్లు వాడి వయసుకి నప్పవనిపించినవి స్కిప్ చేశాను. ఇంకా ఎండలు ముదరని కొన్నాళ్లు మటుకు కొన్ని రోజులు పొద్దుటిపూట్ల ఊరకే వీధుల్లో తిరిగాం. ఎండలు ముదిరి ఇంట్లోకే confine అయ్యాకా ఇక అక్కడ కాలక్షేపానికి వేరేవి వెతుక్కోవాల్సి వచ్చింది. నేను చూద్దామనుకునే సినిమాలూ, చదవాలనుకునే పుస్తకాలూ పూర్తిగా పక్కన పెట్టేశాను. ఇద్దరం చూడగలిగేవీ చదవగలిగేవీ... వాటి జోలికే వెళ్దాం అని నిశ్చయించుకున్నాను. Seinfeld ఒక్క విషయంలో మాత్రమే నా స్థాయికి వాడ్ని లాక్కొచ్చాను. ఇక మిగతావన్నీ వాడి లెవెల్‍కి నేను వెళ్ళాల్సి వచ్చినవే. ఈ వేసవి సెలవుల్లో వాడికి Anime shows, Manga books పరిచయం చేద్దాం అనుకున్నాను. మామూలుగా నెట్‌ఫ్లిక్స్ ఎకౌంట్ వాడికోసమే మెయిన్‌టైన్ చేస్తుంటాను. కానీ అందులో అమెరికన్ షోస్ అన్నీ ఒకే పాటర్న్‌లో, మరీ పొలిటికల్లీ కరెక్టడ్‌గా, అన్నింటినీ తేలిగ్గా తీసిపారేసే టిపికల్ అమెరికన్ హ్యూమరుతో వెళ్తున్నాయనిపించింది. అందుకే Anime, Manga వాడికి పరిచయం చేద్దామనిపించింది. ఎప్పుడో 80'sలో మొదలై ఇప్పటికీ కొనసాగుతున్న Dragon Ball సిరీసులు మొత్తం డౌన్లోడ్ చేసి చూపించాను. నేను కలిసి అన్ని ఎపిసోడులూ చూడలేదు గానీ, నేను మిస్సయిన ఎపిసోడ్లలో కథ ఏమవుతుందో నెట్‌లో చదివి నన్నునేను అప్డేట్ చేసుకున్నాను, వాడితో మాట్లాడటానికి కామన్ టాపిక్స్ కోసం. ఆ విధంగా Goku అనే ఆధునిక పురుషోత్తముడు ఇద్దరికీ హాట్ టాపిక్ అయ్యాడు. గత ఏడాది నేను సాధించిన గొప్ప విజయాల్లో చిన్నోడికి ఇంగ్లీషు చదవటాన్ని వాళ్లు టీచర్లు నేర్పించలేనిది నేనే ఒంటిచేత్తో నేర్పగలగటం ఒకటి. Diary of a Wimpy Kid మొదటి రెండు వాల్యూములు నేను చదివి వినిపించినా, మూడో వాల్యూము నుంచి ఏడో వాల్యూము దాకా వాడే చదువుకున్నాడు. ఆ ఇన్‍స్పిరేషన్‌తో డైరీ కూడా రాయటం మొదలుపెట్టాడు. దానికి కొనసాగింపుగా ఈ వేసవి సెలవుల్లో One Piece మంగా బుక్స్ కొన్నాను. మూడు వాల్యూములు ఇలా అమెజాన్ నుంచి పుస్తకం రాగానే అలా గంటలో చదివేశాడు. తర్వాతి పుస్తకం కొనటం లేటయితే, ఉన్నదాన్నే మళ్ళీ మళ్ళీ చదువుకున్నాడు. గత వేసవి సెలవుల్లో ఇంగ్లీషు చదవటం నేర్పినట్టే ఈ సెలవుల్లో తెలుగు నేర్పుదాం అని కొన్ని క్లాసులు తీసుకున్నాను కానీ, కంటిన్యువ‌స్‌గా చెప్పటం కానీ నా వల్ల కాలేదు. కలిసి చూసిన సినిమాలు: Ratatoullie, Minnal Murali, The Emperor's New Groove. మిన్నల్ మురళి వాడికి బాగా నచ్చింది. అప్పుడప్పుడూ కలిసి బొమ్మలు కూడా వేశాం. వాడి బొమ్మలు చాలా మెరుగయ్యాయి. అలాగే ఈ నెలతో Chess.com అకౌంటుకి డబ్బులు కట్టాను. ఇద్దరం కలిసి ఆడటం, లేదా ఆ అకౌంటులోకి వెళ్లి అపరిచితులతోనో, చెస్ bots తోనో ఆడటం... అదో కాలక్షేపం. నన్ను తొందరలోనే మించిపోయాడు. అంటే పెద్ద పాయింట్లేమీ కాదు. నాలుగొందలు దాటాడంతే. ఇలా చెస్ ఆడటం, లేదా యూట్యూబులోకి వెళ్లి Magnus Carlsen, Hikaru, Gotham chess... వీళ్లవో, వీళ్ల గురించినవో చెస్ వీడియోలు చూడటం... అదో పెద్ద కాలక్షేపం. ఇంకోటి, వాడిలొ హ్యూమరు, నన్ను నవ్వించగలగటం నేను కొత్తగా గమనిస్తున్న విషయాలు. అలా మొత్తానికి ఎందుకో ఈ వేసవి సెలవులు పొద్దస్తమానం బాగా కలిసి గడిపి ఇవాళ మొదటి రోజు స్కూల్లో దింపుతుంటే చిన్న బెంగ. నా నైట్ డ్యూటీస్ వల్ల మళ్లీ ఏడాదికి గానీ ఇలా దొరకడు.





May 27, 2023

"meta" games are as old as Borges


టారంటీనో తను తీయబోతున్న తర్వాతి సినిమా 'ద మూవీ క్రిటిక్' గురించి మాట్లాడింది ఇందాక చదివాను. తన సినిమాలో కల్పిత పాత్ర అయిన ఆ మూవీ క్రిటిక్ నిజంగా బతికుంటే ఎలాంటివాడో, వాడు ఎప్పుడు పుట్టుంటాడో, రివ్యూలు ఎలాంటి శైలిలో రాస్తాడో, ఎలాంటి సినిమాలని ఇష్టపడుతూ రాస్తాడో, వాడు రివ్యూలు రాసే పత్రిక పేరేమిటో... ఇలా ఏదో చెప్పుకుంటూ పోతున్నాడు. తన ముందు సినిమా 'Once Upon a Time in Hollywood' లో కూడా కల్పిత పాత్రయిన ఏక్టర్ రిక్ డాల్టన్ విషయంలో కూడా ఇలాగే వాడేదో నిజంగా బతికిన నటుడన్నట్టు వాడెలాంటి సినిమాల్లో నటించుంటాడో, ఆ ఫేక్ సినిమా క్లిప్పింగులూ, ఫేక్ పోస్టర్లతో సహా చూపిస్తాడు. ఈమధ్య తన పాడ్‌కాస్టులో కూడా రిక్ డాల్టన్ ఏ నిజమైన సినిమాలకి ఆడిషన్ ఇచ్చాడో, వాడిది ఏ డైటో, ఏ బ్రాండ్ సిగరెట్టో అన్న లెవెల్లో డిస్కస్ చేశాడని విన్నాను. ఒక కల్పిత పాత్రని రియల్ లైఫ్ లో సిచ్యుయేట్ చేయటానికి చుట్టూ కొన్ని plausible facts పేర్చటం ఏదో గొప్ప ఆర్టన్నట్టు, అవి ఊహించటమే ఆ పాత్రని నిజం చేసేస్తుందన్నట్టు... ఈ హడావిడి అంతా నాకు కొంచెం ఓవర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి మెటా ఆటలన్నీ లిటరేచర్ లో ఇంతకంటే బాబులా ఆడినవాడిని ఆల్రెడీ చూసున్నాను కాబట్టి. 

అర్జెంటినా రచయిత బోర్హెస్ ఒక నవల రాయాలనుకున్నాడు. కానీ ఆయనకి కథలు తప్ప నవల రాసేంత ఓపిక లేదు. కాబట్టి ఒక కల్పిత రివ్యూయర్‌ని సృష్టించి వాడి చేత తను రాయాలనుకుని రాయలేకపోయిన నవల మీద తనే రివ్యూ రాసి ఆ రివ్యూనే కథలా ప్రెజెంట్ చేస్తాడు. అలాగే ఆయన 'గార్డెన్ ఆఫ్ ఫోర్కింగ్ పాత్స్' అన్న కథ రెండో ప్రపంచ యుద్ధంలో ఒక గూఢచారి ఇచ్చిన స్టేట్మెంటులో మొదటి రెండు పేజీలూ మిస్సయిన ఒక భాగం లాగ ప్రెజెంట్ చేస్తాడు. 'పీరే మెనార్డ్: ఆథర్ ఆఫ్ డాన్ కిహోటే' అన్న కథని ఒక కల్పిత రచయిత మీద క్రిటికల్ ఎస్సే లాగ రాస్తాడు. 'సర్క్యులర్ రూయిన్స్' అనే ఇంకో కథ ఒకడు అడవిలో పాడుబడ్డ దేవాలయానికి రావటంతో మొదలవుతుంది. వాడి ఉద్దేశం ఒక మనిషిని సృష్టించటం. ఆ పాడుబడిన గుడిలో నిద్రపోతాడు. ఆ నిద్రలో కనే కలల్లో ఒక మనిషిని రక్తమాంసాల్తో సహా, అవయవాల్తో సహా ఊహిస్తాడు. చివరికి ఆ మనిషిని వాస్తవ ప్రపంచంలోకి తెచ్చి వదులుతాడు. బైటి ప్రపంచంలోకి సాగనంపుతాడు. ఆ మనిషి వెళ్లిపోయాక, కథ చివర్లో వీడికి అర్థమయ్యేదేంటంటే- తను కూడా ఎవడి కలలోనో భాగమని. బోర్హెస్ ఇంకా ఇలాంటివి బొచ్చెడు రాశాడు. ఆయనే కాదు. జేమ్స్ జాయ్స్ కూడా ఒక కల్పిత రచయిత మీద వాడు ఉన్నాడన్నట్టు వాడి బిబిలియోగ్రఫీతో సహా కోట్ చేస్తూ ఎక్కడో ఉపన్యాసమిస్తే నిజంగానే అక్కడున్నవాళ్లందరూ సాహిత్య ప్రపంచానికి అంతవరకూ తెలియని కొత్త మహాద్భుతమైన రచయిత ఎవడో పుట్టుకొచ్చాడన్నట్టు నమ్మేశారట. నబొకొవ్ 'లొలీటా' నవల నిజంగా ఫలానా జైల్లో అరెస్టయి ఉన్నవాడు రాసుకున్న ఆత్మకథ లాగ, ఆ కథని వాడి లాయరే బైటి ప్రపంచానికి తెస్తున్నట్టు ఆ లాయరు రాసిన ముందుమాటతో సహా మొదలవుతుంది. నబొకొవ్ 'పేల్ ఫైర్' నవలేమో ఒక కల్పిత కవి రాసిన లాంగ్ పొయెంకి ఇంకో కల్పిత ప్రొఫెసర్ రాసిన క్రిటికల్ నోట్స్ లాగ ఉంటుంది. ఇలాంటి మెటా ఆటలన్నీ సాహిత్యంలో వందేళ్ల క్రితం నాటివి. అక్కడ పాతబడిపోయిన తర్వాత ఇప్పుడు ఈ "మెటా" అన్నది సినిమాల్లో పెద్ద విషయమయ్యింది.   

కానీ ఎందుకో ఈ మెటా గేమ్స్ అన్నీ సినిమాల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం తేలిపోయినట్టనిపిస్తున్నాయి. ఒక పాత్రని రియల్‌గా అనిపించేట్టు చేసే ప్రయత్నంలో బైటి ప్రపంచంలో ఉన్న facts అన్నీ తెచ్చి ఆ పాత్ర చుట్టూ పేర్చటం పెద్ద విషయమేం కాదు. కానీ ఆ కేరెక్టరుని emotinally plausible human being గా మార్చటంలో ఉంటుంది అసలు పనితనం. నువ్వు ఒక పాత్రని సృష్టించి వాడు రాజమండ్రిలో ఫలానా హాస్పిటల్లో పుట్టాడని, వాడు ఫలానా కంపెనీ డైపర్స్ వాడేవాడని, వాడి ఉగ్గుగిన్నె ఈ షాపులో కొన్నారని రాసినంత మాత్రాన వాడు వాస్తవం అయిపోడు. వాడి అంతరంగం plausible గా ఉండాలి. వాడి స్వభావం consistent గా ఉండాలి. అవి నప్పేట్టు నమ్మేట్టు లేనప్పుడు నువ్వు రియల్ వరల్డ్ నుంచి ఎన్ని ఫాక్ట్స్ తెచ్చి వాడికి అప్లయి చేసినా వాడు నిజం అయిపోడు. ఆ ప్రయాస అంతా ఒక జిమ్మిక్ లాగ మిగులుతుందంతే.

March 29, 2023

'mono no aware' as a mode of perception

నాలుగేళ్ల క్రితం సంగతి... చెహోవ్ కథలేవో చదువుతున్నాను. నవోయా షిగా ‘డార్క్ నైట్ పాసింగ్’ నవల మొదటిసారి చదువుతున్నాను. ఓజు, నూరీ బిల్గె చైలాన్ సినిమాలు చూస్తున్నాను. నా కథలు ‘ముక్కు’, ‘డిగ్రీ ఫ్రెండ్స్’ లాంటివి రాస్తున్నాను.... ఇవన్నీ నన్ను ఒకలాంటి ఈస్థటిక్ స్థితిలోకి తీసుకువెళ్లాయి. అప్పుడే జపనీస్ ఈస్థటిక్స్ గురించి కొన్ని పుస్తకాలు చదువుతున్నాను. ఆ వరుసలో ఉయెద మకొతో రాసిన ‘Literary and Art Theories in Japan’ అన్న పుస్తకమూ, అందులో ‘Norinaga - On the Art of Writing (Shintoism and the Theory of Literature)’ అన్న అధ్యాయమూ దొరికాయి. ఆ అధ్యాయంలో సాహిత్యం గురించి నోరినాగ చెపుతున్న ప్రతి మాటా నా లోపల రూపంలేకుండా తిరుగుతున్న ఆలోచనల్ని ఒక చోటకు తెచ్చి పేర్చినట్టు అనిపించింది. పీచుమిఠాయి మెషీన్లో గింగిరాలు తిరుగుతున్న గులాబీరంగు దారప్పోగుల్ని ఒక పుల్లకి చుట్టి మనకిస్తాడు కదా అమ్మేవాడు... అలా నాలో అస్పష్టంగా చక్కర్లు కొడుతున్న ఆలోచనల్ని ఒక పర్యవసానానికి గుదిగుచ్చి నాకే బహుమతిగా ఇచ్చాడు నోరినాగ (1730-1801). ముఖ్యంగా నోరినాగ చెబుతున్న ‘mono no aware’ అన్న భావన నాకు నచ్చే తరహా రచనలకు, సినిమాలకు మూలం అనిపించింది. 

‘‘Living in this world, a person sees, hears and meets all kinds of events. If he takes them into his heart and feels the hearts of the events within it, then one may say the person knows the hearts of the events, the cores of the facts–he knows 'mono no aware'." - Norinaga 

(‘‘ప్రపంచంలో తన జీవిత గమనంలో మనిషి ఎన్నో రకాల ఘటనలను చూస్తాడు, వింటాడు. అతను ఆ ఘటనలను మనసులోకి తీసుకొని, వాటి వెనుక సారానికి స్పందించగలిగితే, అతనికి ‘మోనో న అవారె’ తెలుసు అని చెప్పవచ్చు’’)

ఈ ‘మోనో న అవారె’ అన్న జపనీస్ పదబంధం చాలా vauge expression. వర్డ్ టు వర్డ్ అర్థం చెప్పినా భావం అర్థం కావటం కష్టమే నంటారు. లిటరల్ అర్థం చెప్పమంటే: ‘‘చుట్టూ ప్రాపంచిక విషయాల్లో నిన్ను ‘ఆహ్’ అని నిట్టూర్చేట్టు చేసే అంశ’’ అని చెప్పచ్చు. "The 'Ah'ness of things", "the pathos of things" అని అర్థాలు రాస్తున్నారు ఇంగ్లీషులో. కానీ ఇది దుఃఖం కాదు, విషాదం కాదు. తెచ్చిపెట్టుకున్న కవితాత్మక ఉద్వేగం కూడా కాదు. మామూలు మనుషులకు అందని ఎలివేటెడ్ భావమేదో కూడా కాదు. ప్రపంచపు నశ్వరత్వం స్ఫురణకు వచ్చినప్పుడు దాని సౌందర్యం మనలో కలిగించే తేలికపాటి నిట్టూర్పు అనొచ్చేమో. జీవితాన్ని ఆలాపనలా వెన్నాడే ఒక దిగులు అనొచ్చేమో. కొన్ని రోజులు మాత్రమే బతికుండే చెర్రీపూలు చెట్ల నుంచి రాలుతున్నప్పుడు కలిగే భావనను ‘మోనో న అవారె’ కు ఒక ఉదాహరణగా ఎక్కువసార్లు చెబుతారు. అలాగని ఈ నిట్టూర్పు, దిగులు బుద్ధిస్ట్ వైరాగ్యం నుంచి వచ్చింది కాదు. వైరాగ్యంతో కూడిన బుద్ధిస్ట్, నీతిబద్ధమైన కన్ఫ్యూషియస్ స్పందనలను సాహిత్యంలో వ్యతిరేకిస్తాడు నోరినాగ. ఆయన ఈ ‘మోనో న అవారె’ అన్న భావాన్ని మానవ స్వభావంలోని ఒక సహజసిద్ధ స్పందనగా అర్థం చెప్పి, దాన్ని సాహిత్యానికి అన్వయిస్తాడు. మానవ స్వభావాన్ని ఉన్నది ఉన్నట్టు చూపటం, in itself, సాహిత్యానికి చాలా ముఖ్యమంటాడు. ఎందుకంటే, ఆధునిక మానవుడు స్వాభావికమైన స్పందనల నుంచి దూరం జరిగాడు కాబట్టి. సాహిత్యం చేయాల్సిన పని మనిషి స్వాభావికత్వాన్ని అతనికి గుర్తుచేయటం అంటాడు నోరినాగ. ఇలాంటి సాహిత్యంలో నంగి నైతికతకి, దొంగ ఉదాత్తతకి చోటుండదు. అది మనుషుల్ని పెడస్టల్ మీద కూచోబెట్టదు. విలువల తీర్పులివ్వదు. అందులోని పాత్రల్లోను, సన్నివేశాల్లోను ప్రతి చదువరి మామూలు మనిషిగా తన సహజసిద్ధ స్పందనలను గుర్తుపట్టగలుగుతాడు. 

" 'Mono no aware' penetrates into the heart deeper than reason or will, than Confucian teachings of good and evil. This explains why a scrupulous man at times feels tempted to break a comandment, or infact does so. 'Mono no aware' is more deeply rooted in the human heart and more valid in its application than Confucian or Buddhist teachings. And this is why a literary work filled with ethically repugnant incidents may deeply move the readers' heart. 

If, then, 'mono no aware' is a mode of cognition more intuitive, far-reaching, and valid than others, what would ultimate human reality be like seen through it? Norinaga answers that it is foolish, effeminate, and weak. 'All human feelings,' he says, 'are quite foolish in their true, natural state. People try hard to trim, modify, and improve them so that they may appear wise, but as a result they gain only some decorated feelings, and not true natural ones.' The innermost human heart is as foolish and weak as a woman's or a child's. Any feeling that is manly, discreet, and righteous is not a true human feeling; it is artificial, it is made up by reading books, by conforming to social norms, by adheing to Buddhist or Confucian disciplines--in brief, by suppressing one's heart in one way or another. 'The original, natural heart of man,' Norinaga writes, 'is most straightforward, senseless, poor, and unsightly.' " 

(‘‘ ‘మోనో న అవారె’ తార్కికమైన ఉద్దేశాల కంటేను, మంచీ చెడుల గురించి కన్ఫ్యూషియస్ బోధనల కంటేను కూడా లోతుగా మనసులోకి చొచ్చుకుపోతుంది. అందుకే ఎంతో పట్టింపు ఉన్న మనిషి కూడా ఒక్కోసారి నీతిని తప్పి మసలుకుంటాడు. ‘మోనో న అవారె’ అన్నది కన్ఫ్యూషియస్ లేదా బుద్ధిస్టు బోధనల కంటే లోతుల్లో మానవ హృదయంలో పాతుకొని ఉండేది. అందుకే నీతి బాహ్యమైన సన్నివేశాలతో కూడిన ఒక సాహిత్య రచన కూడా చదువరుల మనసును కదిలించవచ్చు.

మరి ఈ ‘మోనో న అవారె’ ప్రకారం మానవ స్వభావం ఎలాంటిది? అది తెలివితక్కువది, సుకుమారమైనది, దుర్బలమైనది. మనుషుల భావావేశాలన్నీ లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే వెర్రిమొర్రివేనంటాడు నోరి నాగ. తెలివిగా కనపడటానికి మనుషులు వాటికి అందమైన కత్తిరింపులు చేసి, మెరుగుపెట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఫలితంగా వాళ్లు నిజమైన, సహజమైన భావోద్వేగాలను పోగొట్టుకుని అలంకరించిన భావాలతో మిగిలిపోతారు. ధీరోదాత్తమైన, ఆచితూచివ్యక్తమయ్యే, స్వాభిమానగర్వంతో ఉన్న ఏ భావోద్వేగమూ నిజమైన మానవ ఉద్వేగం కాదు; అది కృత్రిమంగా, పుస్తకాలు చదివో, సామాజిక నియమాలను అనుసరించో, బుద్ధిస్టు కన్ఫ్యూషియన్ నియమాల సాధన వల్లనో తయారైంది మాత్రమే.’’)

పునాదులు దొరకని బోలు ఆశావాదం ఉట్టిపడే కవితల్లోనో, వర్తమాన ప్రపంచం వల్లించే పాజిటివ్ నీతుల మధ్యే తన్నుకులాడే కథల్లోనో ఈ ‘మోనో న అవారె’ దొరకదు. తార్కిక జ్ఞానంతో పొరలు కట్టని మానవ స్వభావాన్ని స్వచ్ఛంగా వ్యక్తం చేసే రచనల్లోనే అది దొరుకుతుంది. అలాంటి రచన చదువరుల్ని కూడా తెచ్చిపెట్టుకున్న స్వభావాల నుంచి విడుదల చేస్తుంది. ఇలా “సహజ మానవ స్వభావ చిత్రణ” లాంటి మాటలు వినపడగానే అడవుల్లో గిరిజనుల గురించి రాసిన నవలలో, పల్లెటూళ్లల్లో పొలంగట్ల మీద జరిగే కథలో, చెరువగట్టున కూర్చుని చందమామ మీద రాసే కవితలో... ఇవే తడతాయి మనవాళ్లకి. ఈ milieu లో కథ నడిపితే చాలు అదేదో సహజత్వం వచ్చేసినట్టు అనుకుంటారు. రచయితకి సహజ మానవ స్పందనల పట్ల ఎరుక లేనప్పుడు వాడు కథ ఎక్కడ నడిపినా అది అసహజంగానే ఉంటుంది. చెహోవ్ కథలు, షిగా ‘డార్క్ నైట్ పాసింగ్’ నవల, ఓజు సినిమాలు ‘మోనో న అవారె’కి గొప్ప ఉదాహరణలు అనిపిస్తాయి నాకు. 

‘Norinaga - On the Art of Writing (Shintoism and the Theory of Literature)’ అన్న అధ్యాయం ఆర్కైవ్.ఆర్గ్ లో దొరుకుతుంది. కానీ అదొక్కటీ చదవటం కంటే, చెహెవ్ చివర్లో రాసిన కథలో, షిగా నవలో, ఓజు సినిమాలో చూసి అది చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. Otherwise you would just translate him into whatever false equivalencies you surround yourself with.

https://archive.org/.../literaryarttheo.../page/196/mode/2up

January 14, 2023

పెంచలదాస్ కథ

మనిషిగా మనం జ్ఞాపకాల కుప్పలం అంతే. ‘‘నేను ఇదీ’’ అని చెప్పుకోవటానికి ఎవరి దగ్గరా జ్ఞాపకం తప్ప వేరే ఋజువేం ఉండదు. ఒకడు తను మాత్రమే అథెంటిక్‌గా చెప్పుకోగల జ్ఞాపకానుభవాన్ని కథగా చెప్పుకున్నాడనుకుందాం ("అథెంటిక్" అన్నది ఇక్కడ చిన్న మాట కాదు, నువ్వు చదువుతున్నది ఒకడు బతికాడు). తెలుగులో దాన్ని నొస్టాల్జిక్ సాహిత్యం కేటగిరీలోకి చేరుస్తారు. అందులో ఏమాత్రం బాల్యం కనిపించినా ఇక నొస్టాల్జియా తప్ప ఇందులో ఏముంది అనేస్తారు. పత్రికలూ న్యూస్‌ఛానెళ్లూ సోషల్ మీడియా బ్రౌజింగులూ ఎన్జీవో పనుల ద్వారా తెలిసిన విషయాల్ని, అప్పటికి వాళ్లకున్న అవగాహనతోనో ఆనాటికి పాషనబుల్ అయిన ఐడియాలజీ ఆసరాతోనో అర్థం చేసుకుని, తెలిసీ తెలియని ప్రపంచాల్ని గిలికి పారేస్తే, అవి ఇక్కడ ముఖ్యమైన కథలు అవుతున్నాయి. ఏది అథెంటిక్, ఏది ఫాల్తూ అన్నది చప్పున పసిగట్టే (మామూలు) పాఠకులు అంతరించి మ్యూచువల్ అప్రిసియేషన్ క్లబ్బులు మాత్రమే మిగిలిన చోట మంచి కథలు రద్దీలో తప్పిపోవటం చాలా సులువు. నాకు తెలిసిన చాలా కథలు అలా తప్పిపోయాయి. చివరకి తెలుగులో మంచి కథలకి ఉండాల్సిన లక్షణాల్లో అలా ఎవరికంటా పడకుండా తప్పిపోవటం కూడా ఒకటేమో అనిపించటం... grim view, I know. ఎనీవేస్... ఇక్కడ చెప్పదల్చుకుంది: ఈ పెంచలదాస్ కథ గురించి. క్రాఫ్ట్ అంటే కాయితం మీద తెలివైన వాక్యాలు రాయటమనీ కొత్తగా కనపడటమనీ అనుకుంటారు చాలామంది. రాయాలనిపించిన థీమ్‌ ని imperceptible gradations తో, లోపలి కట్టుబడి ఏం తెలీకుండా చెప్పగలగటంలో ఉంది అసలైన క్రాఫ్ట్. అది ఈ కథలో ఉంది. ఉందని తెలీనివ్వని అల్లిక అలవోకగా కుదిరింది.

నామినితో నేను చేసిన ఇంటర్వ్యూలో మాండలికం గురించి ఒక ప్రశ్న అడిగితే ఆయన ఇచ్చిన జవాబు ఇది: ‘‘అసలు ‘మాండలికం’ అంటే రైతులకు తెలీదు. నాకైనా కతల్రాసినాకే ఆ పేరు తెలిసింది. అదెవరో తెలుగు పండితుడు సృష్టించిన పదం. పల్లెటూరోళ్ల మాట, నిజానికి చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా చిన్నచిన్న తేడాల్తో అవే మాటలు. వాడు విరుడ్డం మనిసి అంటారు. విడ్డూరం నోట్లో పడి విరుడ్డం అయ్యింది. ...నోట్లో నాని నాణ్యంగా వచ్చిన పదాల్ని మాండలికం అనేస్తున్నారు.’’ అన్నాడు. ప్రతి మనిషికీ తన ఆవరణ ఉంటుంది, తను సౌకర్యంగా మసలుకునే స్పేస్ ఉంటుంది. అది వాడి "మండలం" అనుకోండి. అందులోంచి వచ్చే మాటే మాండలికం. మాండలికం లేని మనిషంటూ ఎవడూ ఉండడు, యాసలేని మాట ఎవడి నోటి నుంచీ రాదు. రాయటానికి తెలుగులో గ్రాంథికం అన్న పేరుతో ఒకప్పుడు కృతకమైన భాష ఒకటి చెలామణీలో ఉండేది. దాన్ని కాదని వచ్చిన వ్యవహారికంలో కూడా ఆ కృతకత్వం పూర్తిగా పోలేదు. అయితే అది మెల్లగా పత్రికల ద్వారానూ పాఠ్యపుస్తకాల ద్వారానూ ఒక ఒరవడిలోకి సర్దుకుంది. అదే సాహిత్యంలోనూ స్థిరపడింది. దాన్నే ప్రామాణిక భాష అంటున్నారు. ఒక కథకుడు తన ఆవరణలో వినపడే భాషతో, ముఖ్యంగా పల్లెటూరి నేపథ్యం నుంచి ఏదైనా రాస్తే దాన్ని మాండలికం అనేస్తున్నారు. కానీ నిజానికి ఆ మాండలికమే ప్రకృతి, "ప్రామాణిక" భాష అని అందరూ రాసేదే వికృతి. ఈ "ప్రామాణిక" భాష అనేది పత్రికల్లోనూ, పాఠ్య పుస్తకాల్లోనూ, రొడ్డకొట్టుడు కథల్లోనూ తప్ప జీవితంలో ఎక్కడా కనపడదు, వినపడదు. ఈ ప్రామాణిక భాషలో రాసేవాళ్లు కథల్లో ఒక భాష మాట్లాడతారు, వాళ్లని కలిస్తే వేరే భాష మాట్లాడతారు. అందుకే దాన్ని ‘‘నేర్చిన’’ భాష అంటాడు నామిని. మీరు పెంచలదాస్ ని కలిస్తే మీకు ఈ కథలో కనపడే భాషే అతని దగ్గరా వినిపిస్తుంది. ఇది మాండలికం కాదు. ఆయన మసిలిన ఆవరణ నుంచి ఆయన అంతరంగంలోకి ఇంకిన భాష.

నేను నామిని కథలు కొన్నింటికి ప్రూఫ్ చూశాను. ఆయన భాష విషయంలో చాలా పట్టింపుగా ఉంటాడు. "మీద" బదులు "మింద" అనే ఉండాలి. "అసహ్యా"న్ని "అసింకం" అనే రాస్తాడు. ఈ పెంచలదాస్ కథకి కూడా ఫాంట్ కన్వర్షన్ చేసినప్పుడు తప్పులొస్తే ప్రూఫ్ చూశాను. ఒకచోట "లేకుండా" అని పడితే "లేకండా" అని సరిదిద్దాడు. భాషా వ్యాకరణం ఎలా ఉన్నా, ఆయన అంతరంగ వ్యాకరణం "లేకుండా" అన్న మాటని ఒప్పుకోదు. "ఇలా ఎవడి లెక్క వాడి కుంటే భాష భ్రష్టుపట్టిపోదూ" అంటాడు పండితుడు. "నీ భాషా మాన సంరక్షణని నువ్వు పాఠ్య పుస్తకాలకీ, పరిశోధనా వ్యాసాలకీ, పత్రికా సంపాదకీయాలకీ అప్లయి చేయి, కవిత్వం దగ్గరా కథల దగ్గరా ఇట్టాంటి రచ్చ పెట్టకు" అంటాడు కథకుడు. "అయినా మరీ ఇంత గాఢమైన మాండలికం రాస్తే ఎట్లా? కొంచెం సామాన్య పాఠకులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా" అంటాడు మిడిల్ క్లాసు పాఠకుడు. ఒకడు తన జీవితానుభవాన్ని దాన్ని ఆవరించుకున్న భాషలో కూర్చి నీ ముందుకు తెస్తుంటే, చదవటానికి నువ్వు ఇబ్బంది పడుతున్నావంటే, అది కథ రాసినవాడు పట్టించుకోవాల్సినంత ముఖ్యమైన ఇబ్బంది కాదు. చదివేవాడే ప్రయత్నం మీద సరిచేసుకోవాల్సిన ఇబ్బంది. ఈ కథలో నాకు అర్థం కాని పదాలు లేవని కాదు. టైటిలే నాకు అర్థం కాలేదన్నాను. ‘‘ఏటి వెంబడి పిల్లంగ్రోవి ఏడుస్తూ పోయింది’’ అని అర్థం చెప్పారు పెంచలదాస్. ఒక కథకి అంత అందమైన పేరు విని చాన్నాళ్లయింది.